రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, మార్చి 2016, సోమవారం

నాటి సినిమా!






        ‘అంకుశం’ నిరంకుశంగా ఫార్ములా మీద ఖడ్గ మెత్తితే ఏమవుతుంది? ‘భారత్ బంద్’ అవుతుంది!
          ‘ఈ సృష్టిలో ఏదైనా మనం సృష్టించామా? ఆకు మనది కాదు, పోక మనది కాదు, సున్నం మనది కాదు... ఈ మూడూ కలిపికట్టి నోరు పండించడమే మన పని!’ అని  కాస్టూమ్స్ కృష్ణ విసిరే  డైలాగుని  –
          ‘పాట మనది కాదు, ఫైటు మనది కాదు, ఆట మనది కాదు...ఈ మూడూ కలిపికొట్టి తెలుగు సినిమాని బాగా మట్టి కరిపించవచ్చు!’  గా మార్చుకుంటే  డైనమిక్ కొటేషన్ అవుతుంది.

        
        స్టామినా అనేది టాలీవుడ్ ప్రింట్ మీడియాకి చాలా ఇష్టమైన పదం. తెలుగు సినిమా దాని వైఖరి మార్చుకుంటే నిజమైన ‘స్టామినా’ ఏమిటో  బయటపడుతుందేమో. వాపు ‘స్టామినా’ అన్పించుకోదు. విటమిన్ బిళ్ళలు పౌష్టికాహారం లోపం తలెత్తాక అవసరపడే సప్లిమెంట్స్. బిళ్ళలతో బలుపు రాదు. తెలుగు సినిమాల సాంప్రదాయ కథా కథనాల పౌష్టికాహారాన్ని వదిలేసుకుని, బిల్డప్పుడు, డాన్సులు, మాస్ ఫైట్లు, టెక్నికల్ హంగులూ, తాటాకు బ్యాంగులూ వగైరా ఫార్ములా విటమిన్లు వాడినంత కాలం, తెలుగు సినిమా  బాక్సాఫీసు బలిమికి బలుసాకు లేదు.

        మొదట కోడి రామకృష్ణ అనే హైడ్రామా హాలికుడు తీసిన అంకుశమే అన్ని ఫార్ములా నమ్మకాల్నీ బద్దలు కొట్టింది. పచ్చి కథే తప్ప ఇంకే కృత్రిమ హంగుల్నీ ఖాతరు చేయని ఒక బలమైన, ఆరోగ్యవంతమైన అచ్చ తెలుగు సినిమాగా బాక్సాఫీసుని బద్దలు కొట్టాక, తిరిగి దాని కొనసాగింపుగా అన్నట్టు, ‘భారత్ బంద్’ మరో అడుగు ముందు కేసిన  డేరింగ్ కమర్షియల్ ప్రయోగాత్మకం అయింది. 

           
డైలాగ్ నంబర్ టూ- పార్టీని బట్టి సున్నం రాస్తే, అదే సర్దుకుంటుంది’  అంటూ, మూస ఫార్ములా ప్రేమికులైన  ప్రేక్షకులకి ‘భారత్ బంద్’ ఓ మాంచి విరుగుడు డోసే ఇచ్చింది. ఈ సినిమా తీసి కోడి రామకృష్ణ  ‘ఆకులో సున్నం ఎక్కువ రాశానంటా డేమిటీ...మన చేతిలో తేడా రాదే?’  అన్న డైలాగ్ నంబర్ త్రీ ప్రకారం, ఈ ప్రయోగాత్మక సృష్టితో తనే డైలమాలో పడిన పరిస్థితీ లేదు.

        ఆకు లాంటి సినిమాలో సున్నం లాంటి కథ ..ఎంతో కథ.. రాసి రాసి, కథలోంచి కథానికలు, సన్నివేశాల్లోంచి సన్నివేశాలు, డైలాగుల్లోంచి సన్నివేశాలు, చర్యల్లోంచి ప్రతి చర్యలూ... ఒకే  టెంపో, స్పీడ్, థ్రిల్... ఎన్నెన్నో పాత్రలు, వాటన్నిటి మీదా అతిసూక్ష్మ దృష్టితో వాటి వాటి ప్రణాళికా బద్ధమైన ఆశయ సిద్ధికి ప్రయాణాలూ, అవి పడిపోకుండా, డీలా పడిపోకుండా, అనుక్షణం వేడిని పుట్టించడం, సినిమా ‘స్టామినా’ సంగతి ని మరువకూడదని , దాని అతి ముఖ్యమైన కథాంగమైన టైం అండ్ టెన్షన్ థియరీని  పక్కాగా అమలుపర్చడం!

        నేటి ఒక సినీ – టీవీ రచయిత అంటాడు : ప్రకృతిలో వుండే ఎలిమెంట్సే, వాటి నిష్పత్తుల్లో కథల్లోనూ  వుంటాయని. మరైతే  ప్రకృతిలో ఆ పంచభూతాలనే ఎలిమెంట్స్  కల్లోలం కూడా సృష్టిస్తాయి కదా అంటే, ఆ కల్లోలం సర్దుబాటు కోసమే నంటాడు. దట్సిట్! కాబట్టి ఇక్కడ కల్లోలం గురించే! భూమ్మీద డెబ్బై  శాతంగా చలనశీలంగా వున్న జలమే, సినిమాల్లో కన్పించే కథనమైతే, దీంతో ఏం చేస్తున్నామన్నదే బర్నింగ్ టాపిక్ అవ్వాలి! దీంతో కోడి రామకృష్ణ సృష్టించే కల్లోలం, తదనంతరం చేసే సర్దుబాటూ, చిట్ట చివరికి చేకూర్చే యథా పూర్వ స్థితీ, అతడి అందెవేసిన సృజనాత్మక కళావ్యక్తికి  నిదర్శనాలవుతాయి! ఎక్కడా ఈ ప్రకృతి విలయంలో ఆటవిడుపుగానైనా ఓ ఈల పాట సత్కాలక్షేపమే వుండదు. ఈ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ ఏదీ అన్న వాడు నవ్వులపాలవుతాడు. పంచదారలో కూడా తీపిని వెతకడమేనా! ఈ కోడి క్రియేషన్ లో ఎలాటి ప్రేమాయణాలు, డ్యూయెట్లు, స్టెప్పులూ, విలన్లతో వ్యాంప్ డాన్సులూ, ఇంకే కామెడీ ట్రాకులూ, ప్రేక్షకజనం చీప్ టేస్టుని సంతృప్తపర్చే  ద్వంద్వార్ధాల డైలాగులూ కనపడవు. ఇలా వున్నాక ఇదొక  ‘ప్రయోగాత్మక కమర్షియల్’ కాకపోతే ఇంకేమిటి? దీని ఫలితాలు బ్రహ్మరధం పట్టి అందించారు ప్రేక్షకులే!

        తెర వెనుక పనిచేసుకునే ప్రొడక్షన్ సిబ్బంది విలక్షణ నటనలతో ఆర్టిస్టులుగా తెర మీద మెరవడం 1990 లో ఒకసారి, 1991 లో మరింకో సారీ సంచలనాత్మకంగా జరిగాయి. ఆ ఇద్దరు పుణ్యజీవులు నిర్మాత ఎ. పుండరీ కాక్షయ్య, కాస్ట్యూమ్స్ కృష్ణ.  నీ జీవితం మీద నా కసహ్యమేస్తోంది!’ అంటూ మర్డర్లు చేసి పారేసే పచ్చి రాజకీయ విలన్ గా ‘కర్తవ్యం’ లో పుండరీ కాక్షయ్య టెర్రిబుల్ గా వూపేస్తే, ‘ఆకు- పోక- సున్నం’ ఛలోక్తులతో కాస్ట్యూమ్స్ కృష్ణ  ‘భారత్ బంద్’ లో కరుడు గట్టిన క్రిమినల్ గా ఇంకా టెర్రిఫిక్ గా వూపేశాడు. అప్పటికింకా తెలుగు ఫీల్డులో విలన్స్ కి కరువు లేని కాలం. ‘భారత్ బంద్’ కి కాస్ట్యూమ్స్  కృష్ణ వన్నె తరగని ఎస్సెట్ అయ్యాడు. 

     ఈ మెగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో కోడి రామకృష్ణ సమకాలీన రాజకీయ వ్యవస్థని బరిబత్తెలుగా చూపించేశాడు!
     రాజకీయ సినిమా అన్నాక, అది సమకాలీన పరిస్థితుల్ని ఎత్తి చూపాలంటాడీయన. అంతే గాకుండా, ‘భవిష్యవాణి’  విన్పించాలనీ ( ఈ ‘భవిష్యవాణి’ ఏంటో అర్ధంజేసుకోలేక, కథల్ని మరింత  పై స్థాయికి తీసికెళ్ళగల బంగారు అవకాశాల్ని చేజార్చుకునే  వాళ్ళే ఎక్కువ మంది వున్నారు ఫీల్డులో),  మరికొన్నేళ్ళ తర్వాత చూసిన ప్రేక్షకులకి అప్పటి పరిస్థితులకి అద్దం పట్టి అబ్బురపర్చేదిగా వుండాలనీ విశ్లేషిస్తాడు కోడి. ఈ లక్షణాలన్నీ ‘భారత్ బంద్’ లో  పుష్కలంగా ఉన్నాయి. అసమ్మతి- వెన్నుపోటు రాజకీయాలు 1983-84 ల కాలం నుంచీ  బాగా పాపులర్ అయ్యాకే, సినిమాల్లో కథల్లో అవి చొరబడ్డం మొదలెట్టాయి. వీటిలో ఒకటి 1989లో కోడిరామకృష్ణే తీసిన ‘అంకుశం’ లో  ఓ నీతిగల సీఎం తో ఈ సమస్యని చర్చకి పెడితే, 1991 కి వచ్చేసరికి,  ‘భారత్ బంద్’ లో ఒక నీతిలేని సీఎంతో రచ్చ చేశాడు రామకృష్ణ! నిత్య చలనశీలమైన కథ ఎప్పుడూ అవుట్ డేటెడ్ గా వుండ కూడదు, పాత్రలూ మారిపోతాయి కాలంతో బాటు. కోడి రామకృష్ణలా ఇది గ్రహించకపోతే  అన్ టచబుల్ బాస్టర్డ్స్అన్పించు కుంటాయి సినిమాలు...


           సామాజిక న్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే, సమాజంలో బడుగు వర్గాలకి చెందిన వ్యక్తులు రాజకీయ పార్టీలకి లంపెన్ శక్తులుగా ఉన్నంత కాలం, ఎలాటి సామాజిక న్యాయమూ సాధ్యం కాదనేది గమనించాలి. వాళ్ళొక వేళ పాలకుల స్థానాన్ని అధిష్టించినా, తిరిగి ఆ ఎలీట్ వర్గాలకే  జీ హుజూర్ తొత్తులుగా ఉండిపోతారు. ఈ పరిస్థితి కళ్ళకి కట్టినట్టు ‘భారత్ బంద్’  లో పోరంబోకు మంత్రి వర్గం దృశ్యాల్లో గమనించవచ్చు.  ఈ కుప్పతొట్టి మంత్రి వర్గానికి నాయకుడు సీఎం పదవిని ఎంజాయ్ చేస్తున్న – తన పూర్వపు వృత్తి ద్వారా సంక్రమింప
జేసుకున్న, కొబ్బరిబోండాలు నరికే కత్తిని వెంట బెట్టుకు తిరిగే – కిరాయి కిల్లర్ కాస్ట్యూమ్స్ కృష్ణ! 

        ఇతను తనని పెంచి పోషించిన పెద్దాయన్నే పడదోసి సీఎం  అయిపోయాడు. నిత్యం తన బాగోగుల గురించే ఆలోచిస్తూ వాటి సాధన కోసం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటాడు.  ఆ నిర్ణయాల్ని తక్షణం అమలు చేసేస్తాడు. చాలాటక్కరి. గుంటనక్క. ఎవరికీ చిక్కడు, ఇంకెవరికీ దొరకడు. తన సీఎం గిరీకి ఎసరు రాకూడదని, ఏకంగా ఒక  ‘పావురాయి పేట’ సంఘటన (వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న  హెలికాప్టర్ కూలింది ‘పావురాయి గుట్ట’ లో కదూ) సృష్టించడమే కాదు, ఇంకాఇంకా ఎదిగిపోయి దేశ ప్రధాని కూడా అయిపోవాలన్న దుగ్ధతో  దేశంలో మరో జలియావాలా బాగ్ ఉదంతాన్నీ రీ - క్రియేట్ చేయగలడు. నోర్మూసుకుని యావద్భారత్ ‘బంద్’ పాటించేలా చేయగల  శక్తి సంపన్నుడూ కాగలడు. ఎంత నిజాయితీ అంటే ఇతడికి, చచ్చినా దొంగ నిరాహార దీక్ష మాత్రం చెయ్యడు. ఆకలితో చచ్చే అచ్చమైన నిరాహార దీక్షే చేస్తాడు తన సొంత లాభం కోసం కాబట్టి, ప్రజల కోసం కానే  కాదు కాబట్టి. తన సొంత లాభం కోసమే బజారుకుక్కలా వీధిన పడి పచ్చి కోడిగుడ్లు విసిరేయించి, పార్టీ కూడా పెట్టించేస్తాడు నార్త్ ఇండియన్ సేటు  బాబూ మోహన్ చేత. ఇక మిగతా చిల్లర పనులు చూసుకోవడానికి బామ్మర్ది ( అశోక్ కుమార్ ) ఎలాగూ వుండనే వున్నాడు.

   ఈ అరచాకాల్ని ఎదుర్కోవడానికి ఎస్సై గా హీరో వినోద్ కుమార్ తీవ్ర పోరాటం చేస్తూంటే, అతడి భార్య పాత్రలో అర్చన లెక్చరర్ గా విద్యార్ధి బృందంతో ఇంకో వైపు నుంచి నరుక్కొస్తూంటుంది.  ఈ బృందానికి నాయకుడుగా మరో హీరో రఘు ( రెహ్మాన్ అని అసలు పేరు) వుంటాడు. ఇలా బలాబలాల సమీకరణ.

        ఇక ఆట మొదలు. ఊపిరి సలపనివ్వని ఈ ఏకబిగిన సాగే రాజకీయపు ఆటలో అడుగడుగునా పవర్ఫుల్ సన్నివేశాలతో మాటల తూటాలు పేల్చుతూ. పైన చెప్పుకున్న మూడు సంఘటనలే గాక, ఇంకా ప్రారంభంలో గిరిజనుడితో బూటకపు రాజకీయం, న్యాయ విచారణ జరిపే జడ్జి సఫా, రేషన్ కార్డుల బాగోతం, కొనవూపిరితో వున్న రఘుకి బతికుండగానే పోస్ట్ మార్టం చేసేసే  కుతంత్రం, అతణ్ణి కాపాడుకునేందుకు తను అరెస్టై పోయే అర్చన, ఆమె గర్భావతని తెలిసినప్పటి మెలోడ్రామా, సీఎం మీద  విద్యార్థి బృందపు అడ్డంగా విఫలమయ్యే ‘డే ఆఫ్ ది  జాకాల్’ టైపు హత్యా యత్న ఘట్టం, సీఎం కుప్పతొట్టి మంత్రివర్గం మెక్కిందరక్క   బట్టలు చింపేసుకుంటూ కొట్టుకునే ‘ముత్యాల ముగ్గు’ ఫేం ది గ్రేట్ క్లయిమాక్స్ సీను టైపు సన్నివేశం,  దేశమంతటా ఉద్విగ్న భరిత – హింసాత్మక ‘భారత్ బంద్’ దృశ్యాలు, చిట్ట చివరికి...ఆ నీచ సీఎం మీద... గంగి గోవుకి కూడా...ఏవగింపు కలిగి....

     చెప్పుకుంటే పోతే క్షణక్షణం రగిలించే సంభ్రమాశ్చర్యకర దృశ్యాలే... ఇదంతా చూస్తూంటే ఒకటి అర్ధమవుతుంది...టైమింగ్ అనేది కేవలం కామెడీ ఒక్కదానికే వాడే మాట కాదనీ, కథనానికి కూడా వాడాల్సిన మాటేననీ...టైమింగ్ స్పృహ తో చేసిన కథనం ఆకాశాన్నంటుతుందనీ...

        మంచి స్క్రిప్టు రాస్తున్నప్పుడే సినిమా జయాపజయాల సంగతి  తెలిసిపోతుందని, కోడి రామకృష్ణ ఇంకో కొటేషన్. అలాంటప్పుడు ఇది కన్నడ, తమిళ, హిందీ భాషల్లో తీస్తే అక్కడా హిట్టే.

        ఈ సక్సెస్ ఫుల్ ప్రయోగాత్మకానికి నిర్మాతగా అల్లూరి సుభాష్ వుంటే, కోడి రామకృష్ణ సోదరుడు కోడి లక్ష్మణ్ ఛాయాగ్రాహకుడిగా, విజయ్ శేఖర్ కొత్త సంగీత దర్శకుడిగా, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాటలూ- పాటల రచయితగా వున్నారు. చాలా పవర్ఫుల్ గా మాటలు పేలిన ఈ హైడ్రామా ప్రధానమైన రాజకీయ సినిమాకి, దర్శకుడే గాక కోడి రామకృష్ణ స్క్రీన్ ప్లే రచయిత కూడా.

         నేటి ఆసక్తి వున్న రచయితలూ దర్శకులూ బలమైన కథా, పాత్రల సృష్టీ, వాటి నిర్వహణా  ఎలాఎలా జరుగుతాయో బేసిక్స్ తెలుసుకోవాలంటే ‘భారత్ బంద్’  ని ఒక గైడ్ గా లైబ్రరీలో దాచుకోవాల్సిందే.

డైలాగ్ డిస్క్ 
కాస్ట్యూమ్స్ కృష్ణ :
*‘రాజకీయ నాయకుల మచ్చను తుడిచి వెయ్యడానికి, తప్పుడు నినాదాలుగా మార్చడానికీ, రాజకీయ సముద్రాన్ని నాలాంటి వాడు చిలికితే పుట్టిన కల్పవృక్షమేరా ఈ భరత్ బంద్!’
*ఈ గుడ్డు మీద నీ పేరు రాసి ఆడి మొహాన కొట్టి నేను సీఎం నయ్యా!’
*‘ఉత్తరాలిస్తూ వూరంతటికీ తెలుసుకదాని పోస్ట్ మాన్ ఎలక్షన్లో నిలబడితే గెలుస్తాడా ఏమిటి?’
*ఎవరికీ తృప్తి కల్గించని వాడు ముఖ్యమంత్రేమిటి...ముష్టి మనిషిగా కూడా పనికిరాడు’
వినోద్ కుమార్ :
*హిట్లర్ లా హీనం గా చావకుండా కనీసం ఒక ఖైదీగా బతుకుతావ్’
రఘు :
*ఒక రాజకీయ నాయకుడి కనుసైగతో రంగు మారిపోయే చట్టం మాకెందుకు?’
బాబూ మోహన్ :  
 *ఏమిటండీ ఈ రాజీనామా బాగోతం? మీరు నిజంగా రాజీనామా చేయదల్చుకుంటే గవర్నర్ కివ్వాల. మీ పార్టీ ప్రెసిడెంటు కివ్వడం గొడవలు రెచ్చ గొట్టడానికేగా? అవతల ఛస్తున్నారండీ జనం!’


-సికిందర్
(సాక్షి –ఫిబ్రవరి 2010)