ఎప్పుడూ దక్షిణ సినిమాల్ని రీమేక్ చేయాలన్నా, ఒకప్పుడు దక్షిణ హీరోయిన్లకి పెద్ద పీట వేయాలన్నా
బాలీవుడ్ చూపే/ చూపిన ఉత్సాహం దక్షిణ హీరోల్ని ప్రోత్సహించడం పట్ల ఏనాడూ
చూపలేదు. అయినా అడపాదడపా తెలుగు, తమిళ, మళయాళ స్టార్లు హిందీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తూంటారు. ఒకప్పుడు
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్,
కమల్ హాసన్, రజనీకాంత్, మాధవన్,
మమ్ముట్టీ, మోహన్ లాల్ మొదలైన స్టార్లు హిందీ
సినిమాల్లో నటించారు. కమల్ హాసన్ తప్పితే మిగిలిన వాళ్ళు ఒకటి నుంచి మూడు సినిమాల
మధ్యే హిందీ సినిమాల్లో నటించి మళ్ళీ అటువైపు చూడలేదు.
స్పష్టంగా ద్రవిడ- ఆర్యన్ తేడాల వల్ల అక్కడి నిర్మాతలు కాకపోయినా హిందీ ప్రేక్షకులు సౌత్ స్టార్స్ కి అలవాటు పడలేకపోయారు అప్పట్లో. కానీ ఉత్తరాది హీరోలు కేవలం హిందీ రాష్ట్రాలకే పరిమిత మైలేరు. సిక్కిం వంటి ఈశాన్య రాష్రాల నుంచి వచ్చికూడా పాపులర్ అయ్యారు. పాకిస్తాన్ నుంచి కూడా వచ్చి హీరోలుగా, హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాలీవుడ్ లో, హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్షకుల్లో ఎలాటి తరతమబేధాల్లేవు. రంగు తేడాల్లేవు. రంగు లేకపోయినా అక్కడ గొప్ప స్టార్స్ అయిన నటులున్నారు. ఆస్కార్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఆసియా దేశాలనుంచి వచ్చి కూడా అక్కడ స్టార్లయ్యారు.
దక్షిణ హీరోల్ని హిందీ ప్రేక్షకులు ఇంకా మద్రాసీలు అనే తేలిక భావంతో
చూడడం, అందుకు తగ్గట్టు మన స్టార్స్ హిందీ
మాట్లాడలేకపోవడం, డబ్బింగ్ వాయిసులతో నటించడం వంటి లోపాలవల్ల
కూడా హిందీ ప్రేక్షకులకి అప్పట్లో దగ్గర
కాలేకపోయారు. తెలుగు, తమిళ హీరోయిన్లకి ఈ బాధ ఎప్పుడూ
లేదు. 1960 ల నుంచీ పద్మిని, వైజయంతీ
మాలా, హేమమాలిని, రేఖ, శ్రీదేవి, జయప్రద వంటి తారామణులు కొన్నేళ్ళపాటు
బాలీవుడ్ ని ఏలుకున్నారు. హిందీ ప్రేక్షకుల కలల రాణులయ్యారు.
వీళ్ళలో కొందరికి భాష రాకపోయినా పట్టించుకోలేదు హిందీ ప్రేక్షకులు. ఆనాడు
పక్కా ఆంధ్ర ప్రదేశ్ కి, తమిళనాడుకీ చెందిన తెలుగమ్మాయిలు,
తమిళ అమ్మాయిలే పైన చెప్పుకున్న తారల రూపంలో బాలీవుడ్ లో వెలిగి
పోయారు. ఇప్పుడలాటి తెలుగు తమిళ అమ్మాయిలూ తెలుగు తమిళ రంగాల్లో టాప్ హీరోయిన్లుగా
ఎక్కువ లేరు. అనూష్కా, నయనతార, త్రిష,
లాంటి కొందరు తప్ప. వీళ్ళల్లో త్రిష, అసిన్ లు
బాలీవుడ్ వెళ్లి శ్రీదేవి లాగానో, జయప్రద లాగానో
నిలదోక్కుకోలేకపోవడం విచిత్రం. అంటే శ్రీదేవులు, జయప్రదలు
ఇక అక్కరలేదన్నట్టు హిందీ ప్రేక్షకుల అభిరుచి మారిపోయిందా? అలాగేం
అన్పించదు. ఇక్కడి తెలుగమ్మాయిలే కాదు, ఇక్కడి
కొచ్చి స్టార్లయిన పక్కా హిందీ అమ్మాయిలు
తమన్నా, కాజల్, హన్సిక, ఇలియానా, శ్రియ, జెనీలియా వంటి
ఎందరో హిందీ అమ్మాయిలూ హిందీలోకి వెళ్లి వెనక్కొచ్చారు. మొత్తంగా దక్షిణం
నుంచి ఏ హీరోయిన్ వెళ్ళినా హిందీలో స్థానం లేకుండా పోయింది.
దీనికంతటికీ ఒకటే కారణం కన్పిస్తుంది... గత కొన్నేళ్లుగా హిందీ
ఛానెళ్ళలో తెలుగు తమిళ సినిమాల హిందీ డబ్బింగులు విపరీతంగా
ప్రసారమవుతున్నాయి. మహేష్ బాబు, సూర్య వంటి టాప్ స్టార్స్ సినిమాలకి కూడా ఈ హిందీ
డబ్బింగుల నుంచి మినహాయింపు లేదు. కేవలం ఆయా ఛానెల్స్ తమ స్లాట్స్ ని
భర్తీ చేసుకోవడం కోసం తెలుగు తమిళ సినిమాలు కొనుక్కుని హిందీలోకి విపరీతంగా
డబ్బింగ్ చేసుకుంటున్నారు. ఈ డబ్బింగుల్లో పైన చెప్పుకున్న హీరోయిన్లు త్రిష, నయనతార, తమన్నా, కాజల్, హన్సిక,
ఇలియానా, శ్రియ, జెనీలియా
లాంటి అందరూ కన్పిస్తారు.
ఇలా టీవీల్లో డబ్బింగుల్లో దర్శనమిచ్చేసరికి వీళ్ళు విలువ
కోల్పోతున్నారు. ఇక ఫ్రెష్ గా హిందీ సినిమాల్లోకి వెళ్లి నటిస్తే హిందీ
ప్రేక్షకులు డబ్బింగుల్లో చూసేసిన తేలిక భావంతో తీసుకుంటున్నారు. ఇదే పరిస్థతి
హిందీ డబ్బింగుల్లో కన్పించే నేటి తెలుగు తమిళ స్టార్స్ ది కూడా. ఒక విధంగా
ఇక్కడ టాప్ రేంజిలో ఉంటున్న హీరో హీరోయిన్లే హిందీ డబ్బింగుల్లో కనిపించేసరికి
హిందీ ప్రేక్షకుల దృష్టిలో ‘బి’ గ్రేడ్ కి పడిపోతున్నారు.
ఒకప్పుడు మద్రాసీ లని దూరం పెట్టేవాళ్ళు, ఇప్పుడు ‘బి’ గ్రేడ్ అనీ, డబ్బింగ్ హీరో
హీరోయిన్లనీ తప్పుకుంటున్నారు.
ఇలాంటప్పుడు రాం చరణ్ వెళ్ళినా, దగ్గుబాటి రానా వెళ్ళినా, ఇంకా తమిళం నుంచి కొత్తగా సిద్ధార్థ్ వెళ్ళాలనుకుంటున్నా, ఇప్పుడు హిందీలో ఒరిగేదేం వుండదు. ఎన్ని ఘజనీ దండ యాత్రలు చేసినా ‘బి’ గ్రేడ్, ‘డబ్బింగ్ హీరోలు’
అనే ముద్ర ఇప్పట్లో చెరిగిపోయేది కాదు. ఇదంతా తెలిసే కాబోలు,
ఇటీవల మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మళ్ళీ
హిందీలోకి వెళ్లి నేను కొత్తగా నిరూపించుకునేది ఏముంటుందన్నారు.
ముందుగా దక్షిణ స్టార్లు హిందీ టీవీ డబ్బింగుల్ని నిషేధింప జేసుకుని, కనీసం ఒక తరం ప్రేక్షకులు
గడిచిపోయాక, అప్పుడు హిందీ కెళ్ళి ప్రయత్నిస్తే, కొత్తతరం ప్రేక్షకుల ముందు ఫ్రెష్ గా కన్పించవచ్చు.
-సికిందర్