రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, జనవరి 2016, బుధవారం

క్లాసిక్!






బరాన్ ( వర్షం- ఇరాన్)
రచన, దర్శకత్వం : మజీద్ మజీదీ
తారాగణం : హుస్సేన్ అబిదిని, జహ్రా బహ్రామీ, మహమ్మద్ అమీర్ నాజీ,
అబ్బాస్ రహీమీ, గులాం అలీ బక్షీ
సంగీతం : అహ్మద్ పేజ్మాన్, ఛాయగ్రహణం : మహమ్మద్ దావూదీ
నిర్మాతలు : మజీద్ మజేదీ, ఫువాద్ నాస్
విడుదల : జనవరి 31, 2001
***
          ఇరాన్ దర్శకుడు మజీద్ మజీదీ తన సినిమాల్ని దేశ సరిహద్దులు దాటించి  సార్వజనీనం చేయడంలో తనకే తెలిసిన రహస్యాన్ని మంత్రం దండంలా ప్రయోగిస్తున్నారు. సినిమా తర్వాత సినిమాగా ఆయన కళాఖండాలు అంతర్జాతీయ ప్రేక్షకుల్ని  మైమరపిస్తున్నాయి, ఆలోచింప జేస్తున్నాయి. పదుల సంఖ్యలో అవార్డుల్ని సాధిస్తున్నాయి. చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్, కలర్ ఆఫ్ పారడైజ్, ది సాంగ్  ఆఫ్ స్పారోవ్స్, ఫాదర్, గాడ్ విల్ కమ్ ...ఇలా చెప్పుంటూ పోతే ఎన్నో ఆణిముత్యాలు. తాజాగా ఇరాన్ చిత్ర పరిశ్రమలోనే అతి భారీ బడ్జెట్ ( 40 మిలియన్ డాలర్లు) తో నిర్మించిన ‘మహమ్మద్’ గత సంవత్సరమే విడుదలయింది.

        ‘బరాన్’ అనేది మజీదీ చేసిన ఒక కొత్త కళాత్మక ప్రయోగం. కళ ఎప్పుడూ ఉన్న సమస్యల్ని నేరుగా చెప్పదు, సృజనాత్మకతతో అది పరోక్షంగా చెప్తుంది. ఇక్కడ ఒక దేశ సమస్యని రాజకీయ కోణంలో చెప్పకుండా  ప్రేమని ఆలంబనగా చేసుకుని చెప్పారు. ఇరాన్ లో ఆఫ్ఘనిస్తాన్ వలసదార్లు వేల సంఖ్యలో  వుంటారు. వాళ్ళ దుర్భర జీవితాల్ని మానవ ప్రపంచానికి ఎత్తి  చూపడానికి ‘బరాన్’ నిర్మించానని ఆయనే  చెప్పుకున్నారు.

        ఆఫ్ఘాన్ పౌరులు మొదట తమ దేశాన్ని రష్యన్లు ఆక్రమించినప్పుడు సరిహద్దు దేశం ఇరాన్ కి  పారిపోయారు. తర్వాత ఆఫ్ఘాన్ లో అధికారాన్ని తాలిబాన్లు చేజిక్కించుకున్నప్పుడు కూడా ఇరాన్ పారిపోయారు. వీళ్ళంతా ఇరాన్ లో శరణార్ధులుగా బ్రతుకుతున్నారు. భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధం. అందుకని కాంట్రాక్టర్లు అతి తక్కువ జీతాలకి వీళ్ళని నియమించుకుని దొంగ చాటుగా పనులు చేయించుకుంటుంటారు.

       ఆఫ్గన్ వలసరదార్ల మీద నిఘా వేసివుంచే  ప్రభుత్వ అధికారులు దాడులు చేసినప్పుడు ఈ కార్మికుల్ని కాంట్రాక్టర్లు దాచేస్తారు. ఈ వలసదార్లని  ఇరాన్ ప్రభుత్వం ప్రత్యేక శిబిరాల్లో ఉంచేది. శిబిరాల్లోంచి  నగరాలకి వెళ్లి స్థిరపడాలన్నా, అక్కడ పనులు చేయలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రభుత్వం అంత సులభంగా అనుమతి నిచ్చేది కాదు. తన సొంత దేశస్తుల్ని  దోపిడీల బారి నుంచి, మాదక ద్రవ్యాల అలవాటునుంచీ కాపాడుకునేందుకు, ఆఫ్ఘన్ వలసదారుల్ని శిబిరాలు దాటి వెళ్ళ నిచ్చేది కాదు. .

        దీంతో దొంగచాటుగా వెళ్లి భవన నిర్మాణ కూలీలుగా చేరిపోయేవాళ్ళు. వీళ్ళ పరిస్థితిని  అవకాశంగా తీసుకుని కాంట్రాక్టర్లు తక్కువ జీతాలతో పనులు చేయించుకునే వాళ్ళు. ఇది మళ్ళీ స్థానిక కార్మికులతో గొడవలకి దారి తీసేది. తమ ఉపాధిని ఆఫ్ఘన్ లు వచ్చి లాగేసుకుంటున్నారని ఘర్షణలకి దిగేవాళ్ళు.  ఇలా శరణార్ధుల సమస్యకి ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని ఇవ్వలేకపోయింది.

        ఇదీ ఈ కథకి నేపధ్యం. నిజానికి ఇదొక సామాజిక సమస్య తో బాటు రాజకీయ సమస్య కూడా. అయితే దర్శకుడు మజీదీ ఈ రెండు అంశాల జోలికీ వెళ్ళలేదు. వివాద రహితంగా ఈ  సమస్యని ప్రపంచ దృష్టికి తీసుకు వెళ్ళాలనుకున్నారు. రాజకీయం కంటే ప్రేమని జోడించినప్పుడు ప్రేక్షకులకి ఎక్కువ ఆకట్టుకోగలదన్న ఉద్దేశంతో, ప్రేమకథగానే  దీన్ని చెప్పుకొచ్చారు. దీని నేపధ్యంలో ఆఫ్ఘన్ల సమస్యని ప్రేక్షకులు గుర్తించేలా చూశారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రేమ అందరికీ అర్ధమయ్యే భాషే కాబట్టి ఆ భాషలోనే సమస్య చెప్పుకొచ్చారు.

మూగతనాల మురిపాలు  

       ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఒక భవన నిర్మాణ కార్మికుడుగా ఉంటాడు పదిహేడేళ్ళ లతీఫ్ (హుస్సేన్ అబిదిని). ఈ భవనాన్ని నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు వేరే వుంటారు. వాళ్ళ కింద ఇక్కడి పనులు చూసుకునే ఫోర్మన్ గా మెమర్ (మహమ్మద్ అమీర్ నాజీ) 
అనే అతనుంటాడు. లతీఫ్ చేయాల్సిన పని కార్మికులందరికీ టీలు కాచి అందించడం, భోజన ఏర్పాట్లు  చేయడం వంటి తేలిక పనులే. లతీఫ్ చాలా మొండిగా ఉంటాడు. ఆవారా కుర్రాడు. మనసు నిలకడగా వుండదు. ఇతని  ధోరణి కనిపెట్టి మెమర్ కూడా పూర్తి  జీతం ఇవ్వకుండా కొంత తన దగ్గరే పొదుపు చేస్తూంటాడు. లతీఫ్ కార్మికులతో ఎప్పుడూ కయ్యాలు పెట్టుకుంటూ  ఉంటాడు. ఈ కార్మికుల్లో కొందరు ఆఫ్ఘన్ వలసదార్లు వుంటారు. వీళ్ళు ఐడీ కార్డులు లేని, చట్ట విరుద్ధంగా పనిలోకి చేరిన చీప్ లేబర్. ఇన్స్ పెక్షన్ కి ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు దొరక్కుండా భవనం గదుల్లో దాక్కుంటారు.

        ఇలా వుండగా, ఒకరోజు ఆ ఆఫ్ఘన్ కార్మికుల్లో ఒకడైన నజాఫ్ ( గులాం ఆలీ బక్షీ)  అనే అతడికి ప్రమాదంలో కాలు విరుగుతుంది. పన్లోకి వెళ్ళే పరిస్థితి వుండదు. మర్నాడు కార్మికుల్ని సమకూర్చే సుల్తాన్ (అబ్బాస్ రహీమీ )  అనే అతను రహమత్ అనే పద్నాల్గేళ్ళ కుర్రాణ్ణి వెంటబెట్టు కొస్తాడు. గాయపడ్డ వీడి తండ్రి స్థానంలో వీణ్ణి  పనిలోకి తీసుకోవాల్సిందిగా కోరతాడు. బలహీనంగా వున్న వీడేం పనికొస్తాడంటే, కుటుంబానికి ఇప్పుడు వీడే  ఆధారమంటాడు. నజాఫ్ మీద సానుభూతితో వాణ్ణి పనిలోకి తీసుకుంటాడు మెమర్. ఆ కుర్రాడు రహమత్ నోట్లోంచి ఒక్క మాట రాకుండా తలూపుతూంటే మూగోడని చెప్తాడు సుల్తాన్.

        మెమర్ వాడికి లతీఫ్ చేస్తున్న తేలిక పని అప్పజెప్పి, లతీఫ్ కి సిమెంట్  బస్తాలు మోసే పని అప్పజేప్తాడు. దీంతో చిర్రెత్తిపోతాడు లతీఫ్. తనకి శత్రువులా వచ్చి తన పని లాక్కున్న రహమత్  మీద పగబడతాడు. కిచెన్ ని  ధ్వంసం చేస్తాడు. వాణ్ణి బెదిరిస్తాడు. వాడి పనులకి అడ్డు పడతాడు. వాడి మీద నిఘా పెట్టి తప్పు దొరికించు కోవాలని ప్రయత్నిస్తాడు. ఓ రోజు వాడు  పనిలోకి వస్తోంటే, పై నుంచి సున్నం గుమ్మరించి పా రిపోతాడు.

      వొళ్ళంతా సున్నం పడి దులుపుకోవడానికి వెళ్ళిన వాణ్ణి రహస్యంగా గమనిస్తాడు.  అప్పుడు...అప్పుడు.. ఆ గదిలో వాడు...
    లతీఫ్ కి మతిపోతుంది ఆ దృశ్యం చూసి!
    ఎంత నాటకం! వీడు..వీడు.. మోసం చేస్తున్నాడు!
    వీడు  మగపిల్లోడు కాదు,  ఆడపిల్ల వీడు!
    రహమత్ ఆడపిల్ల!
    అది బయట పడకూడదని మూగోడిలా నటిస్తూ, తల దగ్గర్నుంచీ కాళ్ళ దాకా బట్టలు కప్పుకుని ఇందుకే తిరుగుతోంది...
    ఇప్పుడు బట్టలు తీసేసి ఇంత పొడవు జుట్టు దులుపుకుంటున్నాడు  – కాదు – దులుపుకుంటోంది దొంగపిల్ల!!

    ఇలా ఆవేశపడిపోతాడు లతీఫ్. గందరగోళంలో పడతాడు. నెమ్మదిగా తేరుకుంటాడు. ‘రహమత్’ మీద ఎక్కడాలేని సానుభూతి పుట్టుకొస్తుంది. ఆడపిల్లల్ని  పనుల్లోకి తీసుకోరు గనుక ఇలా మగ వేషంలో తప్పని సరై వచ్చిందన్నమాట కుటుంబ పోషణకు.

    ‘రహమత్’  రహస్యం బయటపెట్టేందుకు మనసొప్పక పోగా ఇప్పుడు ప్రేమ పుట్టుకొస్తుంది. ఇంతకి ముందువరకూ వున్న  కోపమూ పగా కాస్తా మాయమై పోతాయి. రహమత్ తో  తన ప్రవర్తన మార్చుకుంటాడు. ఇతను పసిగట్టిన విషయం తెలీక ఆమె అలాగే నటిస్తూంటుంది. ఓ పొగరుబోతు కార్మికుడు సిగరెట్లు తేలేదేమని ‘రహమత్’ ని  నిలదీస్తే,  కోపం పట్టలేక  ఆ కార్మికుణ్ణి కొట్టేస్తాడు రహమత్. ఎవరికీ అర్ధం గాదు, ‘రహమత్’ కి కూడా అర్ధంగాదు- వీడెందుకు రియాక్ట్ అయ్యాడో.

        ‘రహమత్’ ని మూగగా ప్రేమించడం మొదలెడతాడు. మెత్తగా ప్రవర్తించడం మొదలెడతాడు. అతడిలో వచ్చిన మార్పుని అర్ధం జేసుకోలేకపోతుంది. ఇద్దరి మధ్యా ఒక్క మాటా వుండదు. ఇలా ఉండగా, తనిఖీకి అధికారులు వచ్చేస్తూంటారు. ‘రహమత్’ పారిపోతూంటే ఓ అధికారి వెంటపడతాడు. అధికారిని అడ్డుకుంటూ లతీఫ్ పరిగెడతాడు. ‘రహమత్’ దొరక్కుండా  అధికారితో కలబడి కింద పడేస్తాడు. ‘రహమత్’  పారిపోతుంది. లతీఫ్ పోలీస్ స్టేషన్లో ఉంటాడు. మెమర్ వచ్చి తిట్టి విడిపించు కుంటాడు. విషయం ఇలా రట్టయ్యాక ఇక వలస కూలీల్ని పనిలోంచి తప్పించక తప్పదతడికి.  లతీఫ్ డీలా పడిపోతాడు.

వర్షంలో అడుగుజాడ
       అవసరం కొద్దీ ఆమె మూగదానిలా నటించింది సరే, తనూ మూగగా ప్రేమించడమే  అసలు సమస్య. తను మాటల్లో ప్రేమని వ్యక్తం చేయదల్చుకోలేదు. ఆమెని వెతుక్కుంటూ వెళ్లి ఇంకో చోట ఓ నదిలో బండరాళ్ళు తొలగించే పనికి కుదరడం చూసి చలించి పోతాడు. అక్కడామె ఆడపిల్ల దుస్తుల్లో ఆడపిల్లలా వుంటుంది. లతీఫ్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆమెకి ఏ కష్టమూ పడే పరిస్థితి ఉండకూడదని, మెమర్ దగ్గర పోగై వున్న తన డబ్బంతా తెచ్చి సుల్తాన్ కిస్తాడు- ‘రహమత్’  తండ్రి కిమ్మని. తీరా చూస్తే ఆ డబ్బుతో సుల్తానే  స్వదేశం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతాడు. అతడికేదో సమస్య వచ్చి వెళ్ళాల్సి వస్తే ఆ డబ్బు అతడికే ఇచ్చి పంపానని రహమత్ తండ్రి అంటాడు.

        లతీఫ్ తెగించి తన ఐడీ కార్డుని అమ్మేసి ఆ డబ్బు ‘రహమత్’ తండ్రికి ఇవ్వబోతాడు. అతను తీసుకోడు. తీసుకోక పోగా, ఆఫ్ఘనిస్తాన్లో తన  తమ్ముడు మరణించడంతో తను వెంటనే అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కూతురితో. దేని కోసం లతీఫ్  తాప్రతయ పడుతున్నాడో అదే శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఈలోగా లతీఫ్ పాట్లు చూసి రహమత్ కీ అతడి మీద ప్రేమ పుట్టినా, ఏమీ చేయలేని స్థితి.

        తండ్రితో పాటు వ్యానెక్కి ఆమె వెళ్లిపోతూంటే, మౌనం గా చూస్తూంటాడు. వర్షం మొదలవుతుంది... ఆ వర్షంలో ఆమె అడుగుజాడ చూస్తూంటాడు. వర్షం రావడం...ఆమె వెళ్ళిపోవడం...  ఆమె కూడా వర్షమే! మగపేరు తీసేస్తే ఆమె  పేరు బరాన్!  అంటే వర్షం..

దర్శకుడు మజీద్ మజీదీ 
       ఒకటి మాత్రం జరిగింది. తన ప్రేమ దేశం దాటి వెళ్ళిపోయింది, కానీ ప్రేమ  వల్ల తను మారాడు. ఎప్పుడూ పెంకెగా, పెచీకోరుగా, ఆవారాగా ఉండేవాడు కాస్తా  ఆలోచించగల యువకుడిగా మారాడు. ఇక అర్ధవంతమైన జీవితంకోసమే  ప్రయత్నిస్తాడు ఆమె జ్ఞాపకాల జడివానలో...


ప్రత్యక్షానుభం! 
      ఏకకాలంలో మజీదీ  ప్రేమకథని చూపిస్తూనే  వలస దారుల కష్టాల్నిచెప్పాడు. రెండూ మనకి గుర్తుండి పోతాయి. సగభాగం నిర్మాణంలో వున్న భవనంలోనే కథ జరిగినా, ‘రహమత్’ పారిపోయాక మిగతా సగభాగం అవుట్ డోర్లో సాగుతుంది. వర్షం అంటే నీళ్ళు. నీరు వివిధ రూపాల్లో వుంటుంది. సింబాలిక్ గా ఈ వివిధ రూపాల్ని కథనానికి, భావోద్వేగాలకీ  అనుగుణంగా చూపించుకుంటూ పోయాడు  దర్శకుడు  మజీదీ. మొదట్లో ‘రహమత్’ పనిలోకి చేరుతున్నప్పుడు మంచు కురుస్తుంది. చేరాక చాయ్ కాస్తున్న పొయ్యి దగ్గర్నుంచి ఆవిరి తెరల్లోంచి ‘రహమత్’ ని  చూస్తూంటాడు లతీఫ్. ఆవిరి కూడా నీటి రూపమే. ఇలా పరోక్షంగా వున్న నీటిని  ఇక ప్రత్యక్షం చేస్తాడు దర్శకుడు. ‘రహమత్’ నదిలో కష్ట పడుతూండగా  ఆ నీటి ప్రవాహం, హోరూ... వేరే సందర్భంలో ఏం చేయాలా అని లతీఫ్ కూర్చున్నప్పుడు,  పక్కనే సందు చూసుకుని పారే సెలయేటి నీళ్ళూ... ఇక చివరగా...వర్షం! ఎమోషన్స్ ని ఇలా వివిధ నీటి రూపాలతో మనం పసిగడితే గానీ తెలీనంతగా కథనంలో మిళితం చేశాడు.

       ఒకోసారి మనం ఆడే అబద్ధాలు నిజమై మనకే ఎదురు తిరుగుతాయి. దీన్ని దర్శకుడు మనకి హెచ్చరికలా చిత్రించాడు. ‘రహమత్’ తండ్రికి డబ్బిద్దామని ఆలోచించిన లతీఫ్, మెమర్ దగ్గర ఏడ్చేస్తూ  తను వూరెళ్ళాలనీ, తన చెల్లెలికి బాగా లేదనీ, దాచుకున్న డబ్బులన్నీ ఇమ్మని ఓవరాక్షన్ చేసి ఆ డబ్బులు తీసుకుని సుల్తాన్ కి అప్పజెప్తాడు,  ‘రహమత్’ తండ్రికిమ్మని. లతీఫ్ చెల్లెలు నిక్షేపంలా వుందిగానీ, సుల్తాన్ తమ్ముడే చనిపోతాడు. దాంతో ఆ డబ్బు తీసికెళ్ళమని సుల్తాన్ కే ఇచ్చేస్తాడు ‘రహమత్’ తండ్రి!  ఏదీ అబద్ధం కాదు, మనం కావాలని అబద్ధమాడేది ఎక్కడో నిజమవుతూనే వుంటుంది...అబద్ధమాడి మనం పొందేది అటెళ్ళి పోతుంది... ఆశించిన ప్రయోజనం నెరవేరే ఛాన్సే లేదు.

      లతీఫ్ పాత్రలో కుర్ర హుస్సేన్ అబిదిని ఒక ఎసెట్ అనొచ్చు ఈ సినిమాకి. 1996 నుంచీ అరడజను సినిమాల్లో నటించిన అనుభవమున్న ఇతను- మాటలు తక్కువ, హావభావాలు ఎక్కువుండే ఈ పాత్రలో ప్రేక్షకుల్ని ఆలోచింప జేసేలా నటించాడు. రహమత్ అలియాస్ బరాన్ గా నటించిన జహ్రా బహ్రామీ కౌమార దశలో వున్న ఆడపిల్ల పాత్రకి,  ఒక్క మాటా కూడా లేని హావభావ ప్రదర్శతోనే దృశ్యాల్ని నిలబెట్టింది. ఈ రెండు పాత్రలే కీలకమైనవి, నిడివి గలవి.

         సంగీతం విషయానికొస్తే, నేపధ్య సంగీతం కేవలం పదిశాతమే వుంటుంది. మిగిలిన దంతా శబ్ద ఫలితాలతో నిండిన సన్నివేశాల చిత్రణే. ఛాయగ్రహణం ముఖ్యంగా అవుట్ డోర్లో జలదృశ్యాల్లో అక్కడ మనం ప్రత్యక్షంగా ఉన్నట్టే ఫీల్  ని కలిగిస్తుంది...ఇప్పుడు టెక్నాలజీ అప్ డేట్ అయి డిజిటల్ గా ఇలాటి ప్రత్యక్షానుభవాన్నే ఇస్తున్న  ‘వర్చువల్ రియాలిటీ’ సినిమాలు దక్షిణ కొరియాలో ఆకట్టుకుంటున్నట్టు. ఇది లేని కాలంలోనే ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం కేవలం కెమెరా, లైటింగ్, కలర్స్ తో ఇలాటి అనుభవాన్నే  ఇచ్చారంటే అది కెమెరామాన్ మహ్మద్ దావూదీ ఘనతే! 

        మజీద్ మజీదీ జీవితాన్ని చూసే కన్ను చాలా భిన్నం. ఒక జీవితాన్ని చిత్రిస్తే అది పదుల సంఖ్యలో అంతర్జాతీయ అవార్డుల్ని వెంట బెట్టుకు రావడం నిత్యకృత్యం. ఇలాటి జీవితాలే మనకున్నా, అలాటి కన్ను లేక మిన్నకుండడం మనకున్న మన్నుతిన్న పాము మనస్తత్వం.


-సికిందర్
http://www.filmyfreak.com/