ప్రపంచవ్యాప్తంగా నేను నిర్వహిస్తున్న
స్క్రీన్ ప్లే కోర్సుల్లో, వర్క్ షాపుల్లో భాగంగా వేలకొద్దీ స్క్రీప్లే లని చదివి వుంటాను. కచ్చితంగా ఎన్ని
వేలు అన్నది చెప్పలేను, లెక్క వేయడం ఏనాడో మానేశాను. కానీ నేనే దేశంలో, ఏ నగరంలో
పర్యటించినా అంతటా నాకొకే ప్రశ్న ఎదురవుతూంటుంది. పదేపదే ఈ ప్రశ్నే వేస్తూంటారు :
సర్వసాధారణంగా స్క్రిప్టు రచయితల్లో మీరు
గమనించిన కామన్ లోపం ఏమిటనేది ఆ ప్రశ్న. కామన్ గా వుండే లోపాలు అనేకం వున్నాయి. హీరో
పాత్రకి లక్ష్యం లేకపోవడం దగ్గర్నుంచీ, సెకండ్ యాక్ట్ లో స్ట్రక్చర్ పరమైన
బలహీనతలు, బలమైన ముగింపులూ లేకపోవడం వరకూ అనేకం ఉంటున్నాయి. అయితే ఒక్క లోపం
మాత్రం ప్రాంతాల కతీతంగా కొట్టొచ్చినట్టూ ఉంటోంది. అదేమిటంటే ఏ దేశంలోనైనా చాలా మంది
రచయితలు కథని డైలాగుల ద్వారా నడిపించేస్తున్నారు. పాత్రల ఆలోచనల్ని, ఫీలింగ్స్ ని,
ఎమోషన్స్ నీ డైలాగులతోనే వివరించేస్తున్నారు.
నిజమే, కొన్ని కథల్ని బట్టి ఈ విధానం తప్పక పోవచ్చు. ‘500 డేస్ ఆఫ్ సమ్మర్’ లాంటి రోమాంటిక్ కామెడీల్లో ఎంత నాన్ లీనియర్ గా కథ ఉన్నప్పటికీ యాక్షన్ ని చూపించడం, దృశ్యాలు ముందుకు కదలడం- డైలాగుల ద్వారానే జరగవచ్చు. ఈ సినిమాలో ప్రేమికుల మధ్య వున్న రిలేషన్ షిప్ కిచ్చిన డెప్త్ ప్రేక్షకుల్ని కట్టి పడేసే ఎమోషనల్ త్రెడ్ లా వుంటుంది.
నేడు స్టయిల్ పరంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నవలా రచయితలు ఉపయోగించే క్రియేటివ్ టూల్స్ ని సినిమాల్లో వాడుకోవడం పెరిగిపోతోంది. పాయింటాఫ్ వ్యూ, మెమరీ, వాయిసోవర్ నేరేషన్, ఫ్లాష్ బ్యాక్స్ వగైరా క్రియేటివ్ టూల్స్ నవలా రంగం నుంచి దిగుమతి అయిపోతున్నాయి. దీంతో సమకాలీన స్క్రీన్ ప్లేల రూపు రేఖలే మారిపోతున్నాయి.
ఇదే అంశం ఈ మధ్య నేనొక మిత్రుణ్ణి అనుకోకుండా ఓ కేఫెలో కలుసుకున్నప్పుడు చర్చ కొచ్చింది. చాలా కాలం తర్వాత కలుసుకోవడం వల్ల యోగ క్షేమాలు మాటాడుకున్నాం. తను టీవీ షోస్ కి రాస్తున్నట్టు చెప్పాడు. నేను నా వృత్తిలో భాగంగా గత రెండేళ్లుగా నాన్ స్టాప్ గా దేశాలు పట్టుకు తిరుగుతున్నా నన్నాను. ఐతే దేశ దేశాల్లో స్క్రీన్ ప్లే రైటింగ్ లో తేడాలేమైనా గమనించావా అని అడిగాడతను. ఇవ్వాళ్ళ అంతర్జాతీయంగా స్క్రీన్ ప్లే సాంప్రదాయ రచన నుంచి చాలాదూరం ప్రయాణించి వికాసం పొందు తోందని చెప్పాను. నేను సందర్శించిన ఏ దేశ నగరంలో నైనా – బ్రెజిల్, కైరో, మాడ్రిడ్, మనీలా, మెక్సికో సిటీ, ముంబాయి, సింగపూర్, వియన్నా.. ఎక్కడైనా, భాష ఏదైనా - స్క్రీన్ ప్లేలని బొమ్మల ద్వారానే చెప్తున్నారని వివరించాను. విజువల్ గా స్క్రీన్ ప్లేలు చాలా పరిణామం చెందుతున్నాయనీ, వాటి రూపం, నిర్వహణ, ఖండికలుగా వేర్పడి వుంటున్నాయనీ చెబుతూ, ఈ క్రమంలో ముంబాయిలో ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ అనే హిందీ సినిమాకి స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పని చేసిన అనుభవం గురించి కూడా చెప్పాను. ఈ ఇండియన్ ఫిలిం స్క్రిప్ట్ ని నా శిష్యుడే రాశాడు. ఈ కథ మన హృదయాల్లో మానవతని తడుముతుంది. దీంతో ఇది భాషలకి, దేశీయతలకీ, సంస్కృతులకీ అతీతంగా సార్వజనీనంగా ఉండిపోయింది. ఈ కథ ఫ్లాష్ బ్యాక్స్ తో, మెమరీస్ తో జీవితంలోకి హీరో ప్రయాణం లాగా వుంటుంది. అయితే ఇందులో హీరో పాత్ర ఇంకా బాగా వ్యక్త మవడానికి వాయిసోవర్ నేరేషన్ ని ప్రవేశ పెట్టమని సలహా నిచ్చాను. ఇందువల్ల ఎక్కువ వివరణలు ఇచ్చే అవస్థ తప్పుతుంది. కాకపోతే వాయిసోవర్ నేరేషన్ ప్రవేశ పెట్టడం వల్ల, చాలా వరకూ స్టోరీ లైన్ ని రీ స్ట్రక్చర్ చేయాల్సి వచ్చింది - ముఖ్యంగా బిగినింగ్ లో. ఐతే దీని ఇంపాక్ట్ మొత్తం సినిమా మీద ఛా బాగా పనిచేసింది!
నేను వాయిసోవర్ నేరేషన్ ని ఎందుకు సిఫార్సు చేశానంటే, స్క్రీన్ రైటింగ్ లో ఒక సింపుల్ రూలుంది : యాక్షన్ ని క్యారక్టర్ డ్రైవ్ చేయాలి, లేదా క్యారక్టర్ ని యాక్షన్ డ్రైవ్ చెయ్యాలని. ‘500సమ్మర్ డేస్’, ‘షాషాంక్ రెడెంప్షన్’, ‘జూనో’ వంటి సినిమాల్లో యాక్షన్ ని క్యారక్టర్ డ్రైవ్ చేస్తుంది. ‘లిటిల్ మిస్ సన్ షైన్’ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘ది లుక్ అవుట్’ లలో క్యారక్టర్ ని యాక్షన్ డ్రైవ్ చేయడాన్ని గమనించ వచ్చు.
నా దృష్టి కొచ్చినంత వరకూ స్క్రీన్ ప్లే రచన ఇప్పుడు చాలా వికాసం పొందింది. ఇది ఒకరకంగా విప్లవం కూడా! ఒకసారి ‘ఎటోన్మెంట్’ లో చూడండి, ‘వాంటేజ్ పాయింట్’, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్’ లలో చూడండి..ఈ విప్లవకర ధోరణిని మీరు బాగా గమనిస్తారు. ఇప్పుడు రిలీజవుతున్న దాదాపు ప్రతీ సినిమాలో వాయిసోవర్లు, సబ్ టైటిల్సు, ఫ్లాష్ ప్రెజెంట్ లు, ఇంటర్వ్యూలు, ఇంకా ఇతర మల్టీ మీడియా ప్రెజెంటేషన్ ఎలిమెంట్లూ అనేకం ఉంటున్నాయి...
(ఇంకా వుంది)