రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, ఏప్రిల్ 2015, మంగళవారం

సాంకేతికం



సి. జగన్మోహన్, సిఈఓ, త్రికోణా టెక్నాలజీస్ ప్రై. లి. 

          పాత కళాఖండాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రపంచమార్గం తెలుసుకుని అవికూడా గ్లోబల్ భాగస్వాములవుతున్నాయి. మళ్ళీ ఓసారి శతదినోత్సవాలతో కొత్త చరిత్ర రాసుకుంటున్నాయి. మా తెలుపు నలుపు స్వరూపాల వెనకాల నాటి కెమెరాల ముందు మా మౌలిక రంగులివీ అని ప్రకటించు కుంటున్నాయి. డీఐ లో ఇమేజి ప్రాసెసింగ్ అనే టెక్నాలజీ తో బ్లాక్ అండ్ వైట్ కి వర్ణ యోగం పట్టిందిప్పుడు. తెలుగులో మహోజ్వల ‘మాయాబజార్’ అయితే ఇంకో అడుగు ముందుకేసి, రంగులకి తోడూ సినిమా స్కోప్ బొమ్మా, డీటీఎస్ శబ్ద ఫలితాలూ కలుపుకుని,  ఈ తరం జెనెక్స్ మూవీగా  ముస్తాబై హర్షధ్వానాలనుకుంది.
 

            ‘మాయాబజార్’ – దానికదే ఓ ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్ అయినప్పుడు ఇంకా రంగులవసర మేమిటి’ అన్న ప్రశ్నకి-  ‘ఎందుకవసరమంటే, అది నా చిన్ననాటి కల  కాబట్టి’ - అని జగన్మోహన్ సమాధానం- ‘నేనెలాగూ దృశ్య శబ్ద మాధ్యమాల్లో ఇదివరకే కళా కారుణ్ణి కాబట్టి, నా కల ఇలా లోకామోద్య యోగ్యంగా సాకారమైంది’ అని వివరణ.
          ఈ స్వప్న సాకారానికి తన పనిలేని తనమే పురిగొల్పిందట. ఒకప్పుడు తను పనిలోకి చేరిన సంస్థలో మొదటి మూడు నెలలూ ఏ పనీ లేకపోవడంతో ఉద్యోగం మానేసి వెళ్లి పోతానన్నారట జగన్మోహన్. యాజమాన్యం వెళ్ళిపోకుండా ఆపి, ఏదో ఒక పని కల్పించుకోండని ఆయనకే వదిలేస్తే, ‘మాయాబజార్’ కి రంగు లేస్తానన్నారట! అలా ఉబుసుపోక మొదలెట్టిన పనే మహా యజ్ఞమై కూర్చుందిట!

      సిబ్బంది 185 మంది, ఫిలిం ఫ్రేములు రెండు లక్షల 80 వేలు, కలర్ షేడ్స్ 16.7 మిలియన్లు, కాలం ఏడాదిన్నర, ఖర్చు మూడున్నర కోట్లూ...ఇదీ రంగులేయడానికి కూల్ గా ‘మాయాబజార్’ డిమాండ్ చేసిన సాధన సంపత్తి. ‘గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్’ సంస్థ దీని కంతటికీ సిద్ధంగానే వుంది. పని మొదలైంది...చూస్తే నెగెటివ్ అంతా శిథిలా వస్థలో వుంది. ఇక లారీ వేసుకు తిరిగి, రాష్ట్రంలో ఎక్కెడెక్కడి ప్రింట్లూ 70 సేకరించి తీసుకొచ్చారు. ప్రసాద్ లాబ్స్ లో మొదటి నెగెటివ్ ని కఠినమైన అల్ట్రా క్లీనింగ్ ప్రాసెస్ కి గురి చేసి దుమ్మూ ధూ ళినీ, యాసిడ్ మరకల్నీ వదిలించారు. స్కాన్ చేసి మొత్తాన్నీ డిజిటల్ ఫైల్స్ గా మార్చుకున్నారు. శిథిల భాగాల్ని తీసేసి, ప్రింట్ల నుంచి తీసిన పాజిటివ్ భాగాల్ని జోడించారు. కంప్యూటర్లలో ప్రతీ ఫ్రేమునీ  తనిఖీ చేసి గీతలూ అవీ తొలగించారు. వీటన్నిటితో తిరిగి ఈ సినిమా 1957 లో విడుదలైన నాటి తాజా రూపాన్ని సంతరించుకుంది.

        ఇక చరిత్ర శోధన మొదలైంది. ‘మాయాబజార్’ పౌరాణికానికి కాల్పనిక రూపమే అయినా, ఇష్టారాజ్యంగా కలరింగ్ చేస్తే కుదరదు. బ్లాక్ అండ్ వైట్లో కన్పిస్తున్న తెలుపు వస్త్రాల్ని పట్టు వస్త్రాలనుకుని ఆవేశపడి, ఆ మేరకు కలరింగ్ ఇచ్చేస్తే పప్పులో కాలేసినట్టే. అవి నార బట్టలై ఉంటాయని గుర్తించకపోతే ఇంతే సంగతులు. శ్రీ కృష్ణుడు నీల మేఘశ్యాముడన్న విషయం దృష్టిలో పెట్టుకుని, ఎన్టీఆర్ వొంటికి ఆ కలరే ఇవ్వాలి. పాత్రలు ధరించే కిరీటాల్లో, ఆభరణాలూ వగైరాల్లో పొదిగిన రాళ్ళ రంగులు వరస మారకుండా సినిమా యావత్తూ జాగ్రత్త వహించాల్సి వుంటుంది. కట్టడాలకీ  ఇతర వస్తు సామగ్రికీ ఏయే రంగు లుండచ్చో పరిశోధించి ఆ రంగుల సమ్మేళనమే కల్పించాలి. ఇలా 200 పేజీల రీసెర్చి పేపర్ ని తయారు చేసింది టీము.

      ఇక ఇదివరకే డిజిటల్ గా రీమాస్టరైన ఫైల్స్ తో ఫిలిం బ్రేకింగ్ అనే ప్రక్రియకి పూనుకుని, స్టోరీ బోర్డు తయారు చేస్తూ, కీ ఫ్రేము (ఒక షాట్ లోని తొలి ఫ్రేము) కి నిర్ణయించిన కలర్స్ ఆధారంగా దృశ్యా లన్నిటికీ రంగులు సృష్టిస్తూ పోయారు. ఎవరైనా టీములోని టెక్నీషియన్ ఈ రంగులతో సొంత సృజనాత్మకతకి పాల్పడితే, జగన్మోహన్ తన దగ్గరున్న అప్రూవ్డ్ కలర్స్ ని సిస్టంలో రన్ చేసుకునే సదుపాయం ఎలాగూ వుంది. ప్రాజెక్ట్ క్రియేటివ్ హెడ్ గా ఇంకో సమస్య ఎదురైందాయనకి - ఇదివరకు చెప్పినట్టు పూర్తిగా లేని నెగెటివ్ లెన్త్ కి అక్కడక్కడా ప్రింటు భాగాల్ని కలపడం వల్ల  డెప్త్ కి సంబంధించి తలెత్తిన  సమస్య అది. తెరమీద ప్రొజెక్షన్ వేస్తే  కుడుపులూ జంప్ లూ వచ్చే అవకాశముంది. దీనికి  హై ఎండ్ లస్టర్ వర్క్ స్టేషన్ మీద ఎగుడు దిగుడుల్ని తీసేసి, ఏకత్వాన్ని సాధించారు. 3 : 4 నిష్పత్తిలో వున్న35 ఎం.ఎం.  సినిమా రీళ్ళని 70 ఎం.ఎం. కి బ్లో అప్ చేయడం అదో ప్రత్యెక కళ. అంతే  క్లిష్ట తరమైన కళ డీటీఎస్ మిక్సింగ్. దీనికి రామోజీ ఫిలిం సిటీలో వాద్య కారులతో అచ్చం అలాటి నేపధ్య సంగీతమే మళ్ళీ సృష్టించి, వివిధ ట్రాకుల్లో కొత్తగా ముద్రించి, 5.1 డీటీఎస్ టెక్నాలజీకి మార్చేశారు. కొన్ని ఒరిజినల్ లో లేని ఎఫెక్టుల్ని కూడా సృష్టించారు. ఘటోత్కచుడి కిర్రుచెప్పుల చప్పుళ్ళు, గాలి ఒరిపిదిగి గద చేసే ధ్వనీ వగైరా.
          రెండు పాటలకి , మరికొన్ని సన్నివేశాలకీ మరమ్మత్తు ఏవిధంగానూ కుదరక తీసేసినా, మొత్తం మీద 50 ప్రింట్లతో రంగుల ‘మాయాబజార్’ గా విడుదల చేస్తే, రాష్ట్రవ్యాప్తంగా అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

రష్యన్ చిత్రాల కలరీకరణ
      ‘ఆపరేషన్ కన్వర్షన్ మాయాబజార్’  ఇలా సక్సెస్! దీని తర్వాత జగన్మోహన్ జీవితమే మారిపోయింది. మెదక్ లో జన్ప్మించిన జగన్మోహన్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రేడియో జర్నలిస్టుగా కెరీర్ రారంభించారు. అక్కడ మూడుసార్లు రాష్ట్రపతి పురస్కారాలందుకున్నారు. అక్కడ్నించీ వైదొలగి ‘ప్రతిన వీడియో’ అనే రాష్ట్రంలోనే  మొదటిదైన  హైబ్యాండ్ స్టూడియో  ప్రారంభించారు. 

   'ఈటీవీ’ వివిధ కార్యక్రమాలకి లోగోలు రూపొందించిందీయనే. ‘గోల్డ్ స్టోన్’ లో ‘మాయాబజార్’ కలరీ కరణ తర్వాత ‘త్రికోణా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సొంత సంస్థ  స్థాపించుకుని, ప్రస్తుతం 50 రష్యన్ సినిమాల్ని రంగుల్లోకి మారుస్తున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న ఆర్డర్స్ లో భాగంగా మరికొన్ని ఫ్రెంచి సినిమాల కన్వర్షన్ ని కూడా చేపట్టనున్నారు చిందు జగన్మోహన్.


సికిందర్
(అక్టోబర్ 2010 ఆంధ్రజ్యితి సినిమా టెక్ శీర్షిక)