రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, January 4, 2014

ఐదు బడా రెండు చిన్న హిట్లతో బేజారే !


టాలీవుడ్ @ 2013 
\
                           
2013 తెలుగు సినిమాల చిత్రమాలని  చూస్తే ఎన్నో ఆకర్షణీయమైన పుష్ప గుచ్ఛాలు కన్పిస్తాయి. ఏంతో ఊరడించే తారాతోరణాలు కనువిందు చేస్తాయి. మరెంతో గర్వించే కనకవర్షాలు గోచరిస్తాయి. భారీ సంఖ్యలో విడుదలలూ మురిపిస్తాయి. జోరుగా నిర్మాణాలూ అలరిస్తాయి. వేలంవెర్రిగా ప్రేక్షక దర్శనాలూ దృశ్యంకడతాయి...

బాద్షా, అత్తారింటికి దారేది, బలుపు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిర్చీ, రామయ్యా వస్తావయ్యా, నాయక్, గుండె జారి గల్లంతయ్యిందే, మసాలా, భాయ్, దూసుకె ళ్తా, స్వామిరారా, పోటుగాడు, ఇద్దరమ్మాయిలతో, గ్రీకువీరుడు, ప్రేమకథా చిత్రం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్...ఇలా ఎన్నో ఆసక్తికరమైన విడుదలలు...వాటిలో మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, రాం చరణ్, రామ్, మంచు విష్ణు, నిఖిల్, మంచు మనోజ్, సుధీర్ బాబు, సందీప్ కిషన్ లాంటి సూపర్ స్టార్లు, సాధారణ హీరోలూ కాక ...నయనతార, సమంతా, కాజల్, శృతీ హాసన్, అమలా పాల్, అంజలి, అనుష్కా, కలర్స్ స్వాతి, నిత్యా మీనన్, నందిత లాంటి క్రీజీ స్టారిణులు, హీరోయిన్లూ మరోసారి రంగప్రవేశం చేసి ఉత్కంఠ రేపారు...

శ్రీను వైట్ల, హరీష్ శంకర్, శ్రీకాంత్ అడ్డాల, త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్, పూరీ జగన్నాథ్, గోపీచంద్ మలినేని, వీరు పోట్ల, విజయ భాస్కర్ , దశరథ్ మొదలైన రంగంలో వున్న దర్శకులేకాక, కొరటాల శివ, విజయకుమార్ కొండా, సుదీర్ వర్మ, మేర్ల పాక గాంధీ, ఆర్ రవికుమార్ లాంటి కొత్త దర్శకులూ అరంగేట్రం చేశారు.
దిల్ రాజు, బండ్ల గణేష్, జెమిని కిరణ్, భోగవల్లి ప్రసాద్, శివప్రసాద రెడ్డి, దానయ్య డివివి, మారుతి, శ్రీధర్ లగడపాటి, నిఖితా రెడ్డి, చక్రి చిగురుపాటి, వంశీ కృష్ణా రెడ్డి, ప్రసాద్ ఉప్పలపాటి లాంటి నిర్మాతలూ ఈ సంవత్సరం తమ తమ అదృష్టాల్ని పరీక్షించు కున్నారు!

సక్సెస్ తో సిగపట్లు!
పైకి ఇంత వైభవోపేతంగా, అద్భుతంగా  కన్పిస్తున్న ఈ 2013 వెండి తెర శోభ వెనుక తొంగి చూస్తే, ఎందరెందరో మహానుభావులు...అందరూ దాగుడు మూతలాడే సక్సెస్ తో  సిగపట్లకి సిద్ధపడ్డారు. కొందరే లొంగ దీసుకో గలిగారు. మరికొందరు సక్సెస్ అన్పించుకునీ కుదేలయ్యారు. ఎన్టీఆర్ వజ్రాల జాకెట్ కే  (బాద్షా) ఏకంగా పదిలక్షలు ధార బోసి బడ్జెట్ కి గేట్లు బార్లా తెరిచేస్తే  ఏమౌతుంది మరి? టాక్ చూస్తే హిట్టే, కాసులు లెక్కేస్తే లోటే. బలుపు కూడా హిట్ టాక్  వచ్చినా బడ్జెట్ ఎక్కువై ఎనిమిది కోట్లు నష్టపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా సుదీర్ఘ కాలం నిర్మాణంలో వుండి పోయి, బడ్జెట్ దాటేసింది. బొటాబొటీ లాభాలతో బయటపడింది. అత్తారింటికి దారేది ఒక్కటే ధాటిగా ఎనభై  ఐదు కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 2012 లో గబ్బర్ సింగ్ తో ఇలాటి రికార్డే సృష్టించి, ఆ వెంటనే కెమరామాన్ గంగ తో రాం బాబు తో అట్టర్ ఫ్లాప్ నమోదు చేసుకున్న పవన్ కళ్యాణ్,  తిరిగి అత్తారింటికి దారేది తో దారిలో పడ్డారు.

మొత్తం వంద సినిమాలు ఈ సంవత్సరం  విడుదలైతే, వీటిలో పెద్దసినిమాలు పదిహేను. ఈ పదిహేనులోనూ  ఐదు  మాత్రమే ఆర్ధికంగా హిట్టన్పించు కున్నాయి. అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్,  మిర్చి, గుండె జారి గల్లంతయ్యిందే...ఈ ఐదూ తప్ప, మిగతా పది బడా చిత్రాలూ దారుణ పరాజయం పాలయ్యాయి. ఎన్టీఆర్ నటించి హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘రామయ్యా వస్తావయ్యా’ 35 కోట్ల బడ్జెట్లో 19 కోట్లు, అల్లు అర్జున్ నటించి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇద్దరమ్మాయిలతో’ 33 కోట్లలో 22 కోట్లు, దశరథ్ దర్శకత్వం వహించి నాగార్జున నటించిన ‘గ్రీకు వీరుడు’ 22 లో 10, వీర భద్రం చౌదరి దర్శకత్వంలో నాగార్జున నటించిన’ భాయ్’ కూడా 25 లో 10,  మెహర్ రమేష్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ‘షాడో’ 30 లో 10, విజయభాస్కర్ దర్శకత్వంలోవచ్చిన వెంకటేష్- రాం ల మల్టీ స్టారర్ ‘మసాలా’ 24 లో 10, ఏలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో గోపీచంద్ నటించిన ‘సాహసం’ పదకొండు కోట్ల పెట్టుబడిలో 5  కోట్లూ నష్టపోయాయి. బడ్జెట్ మించిపోయిన మంచు మనోజ్ ‘పోటుగాడు’ కూడా ఆరేడు కోట్లు నష్ట పోయింది.

హిట్టయిన అత్తారింటికి దారేది 85 కోట్లు రాబట్టగా,  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్ , మిర్చీ తలా 40 కోట్లు దాటి వసూలు చేశాయి. నితిన్ నటించిన గుండె జారి గల్లంతయ్యిందే 22 కోట్లు వసూలు చేసి అతడికి  మరో సక్సెస్ నిచ్చింది.  ఇక చిన్న సినిమాలు 85 విడుదలైతే రెండు మాత్రమే హిట్టయ్యాయి. స్వామిరారా 7 కోట్లు వసూలు చేస్తే, ప్రేమకథా చిత్రం 15 కోట్లు వసూలు చేసింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎంత బావుందని టాక్ వచ్చినా వసూళ్లు లేవు. పబ్లిసిటీకి సరిగ్గా ఖర్చు పెట్టడంలేదని పుకారు.

ఈ వంద తెలుగు సినిమాలతో బాటు మరో డెబ్బై డబ్బింగ్ సినిమాలూ  రిలీజయ్యాయి. ఇవన్నీ కూడా భారీ నష్టాలనే మూటగట్టుకున్నాయి. మొత్తంగా 170 సినిమాల్లో ఏడు మాత్రమే డబ్బు కళ్ళ జూసి, మిగిలిన నూట అరవై ఏడూ పరిశ్రమకి దారుణంగా 300 కోట్ల రూపాయలు నష్టం తెచ్చి పెట్టాయని అంచనా. ఓ డెబ్బై మంది నిర్మాతలు పూర్తిగా దివాలా తీశారని సమాచారం. ఇలా ప్రతి ఏటా క్రమం తప్పకుండా  భారీ నష్టాలు మూట గట్టుకునే రంగం  ఏదైనా వుందంటే అది సినిమా రంగమే అని చెప్పాలి. ఎందరో నటులకి, టెక్నీషియన్ లకీ, ఇతర మౌలిక సదుపాయాలకీ బాగా లాభాలు చేసిపెట్టి నిండా మునిగిపోయేది ఎవరంటే నిర్మాతలే ! ఈ నిర్మాతల మీద పిడుగుపాటులా మరో ఆర్ధిక భారం- టెక్నీషియన్లు తమ జీత భత్యాలు మరోసారి పెంచాలని తాజా డిమాండ్!
ఇప్పుడు ఫిలిం ఛాంబర్ పరిసరాల్లో ఏ నిర్మతనడిగినా చెప్పేదొక్కటే – సినిమాలు తీసే పరిస్థితులు ఇంకే మాత్రం లేవని. ఎవరైనా ఇదే మాటంటారు. మరో పక్క చూస్తే రోజూ ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉం టాయి. రోజుకి ఇద్దరేసి కొత్త నిర్మాతలు డాబుగా రంగ ప్రవేశం చేస్తూనే వుంటారు. మరుసటి సంవత్సరం చూస్తే వీళ్ళు కనపడరు. చాలా జ్ఞానవంతులై  సినిమాలు తీసే పరిస్థితులు ఇంకెంత మాత్రం లేవని చెప్పుకునే జాబితాలో చేరిపోతుంటారు. ఇంతకీ విజయవంతమైన సినిమాలు తీయలేక పోవడానికి కారణం కూడా వీళ్ళే...వీళ్ళ వ్యర్ధ వ్యూహాల కారణంగానే టోకున సినిమాలు ఫ్లాపవుతున్నాయి. అదెలాగో  ఈ క్రింద  చూద్దాం.

ఉద్యమాల సెగ- శాటిలైట్ల దగా!
ఈ సంవత్సరం కోస్తా, సీడెడ్ ఏరియాల్లో సమైక్య రాష్ట్ర ఉద్యమాలు ఎగసి పెద్ద సినిమాల విడుదలలకి బ్రేకు పడింది. బాద్షా, తూఫాన్, కెమెరా మాన్ గంగతో రాం బాబు మొదలైన పెద్ద సినిమాల విడుదలలు వాయిదా పడ్డంతో చిన్న సినిమాలకి పండగయ్యింది. థియేటర్లు విరివిగా దొరికే పరిస్థితులేర్పడి వారానికి నాలుగైదు చొప్పున జోరుగా విడుదలయ్యాయి. కానీ ఏం లాభం? వాటిలో నాణ్యత ఉంటేగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొమ్ము చేసుకోవడానికి? అవన్నీ చిరునామా లేకుండా పోయాయి. దీంతో చిన్న సినిమాలని తొక్కేస్తున్నారని ఘోష పెట్టే నిర్మాతల ఆరోపణల్లో పసలేదని రుజువయ్యింది. పెద్ద సినిమాల్ని పక్కనపెట్టి, పెద్ద థియేటర్లు సైతం అద్దెలకిస్తూ రూటు క్లియర్ చేసినా,  చిన్న సినిమాలు నాలుగు రాళ్ళు వెనకేసుకోలేని నాసిరకంగా తేలిపోవడంతో- అరిచే నోళ్ళకి తాళాలు పడ్డాయి. ఆ నోళ్ళే తీరా సినిమాలు తీసే పరిస్థితు ల్లేవని వాపోతున్నాయి. ఆ మధ్య కొందరు నిర్మాతలు వచ్చే జనవరిలో ప్రభుత్వం ఒక జీవో తేబోతోందనీ, దాని ప్రకారం తిరిగి రోజుకి ఐదాటల పధ్ధతి మొదలెట్టి, మార్నింగ్ షో కి అన్ని చిన్నా పెద్దా సెంటర్లలో చిన్న సినిమాలకే  కేటాయిస్తారనీ, అంతే గాకుండా, రెంటల్ గాకుండా పర్సంటేజీ పద్ధతిన అనుమతిస్తారనీ,  వినోదపు పన్ను కూడా మినహాయిస్తారనీ, నిర్మాతలమండలి లో పెద్దల నుటంకిస్తూ చెప్పుకోవడం మొదలెట్టారు. కానీ ఇన్నిచేసినా చిన్న సినిమాలు అదే చెత్త పద్ధతిలో తీస్తూ పోతే ఏమిటి ప్రయోజనం? మండలిలో ఒక కొత్త నిర్మాతకి రిజిస్ట్రేషన్ ఇవ్వాలంటే చాలా ప్రశ్నలు వేస్తారు. ఇలాటి ప్రశ్నలు వేసి యోగ్యులకే సభ్యత్వమిచ్చే సాంప్రదాయం ఇంకా దర్శకుల సంఘం లో గానీ, రచయితల సంఘం లో గానీ లేదు. ఉంటే చాలావరకూ చెత్త సినిమాలు తగ్గిపోతాయి. కొందరు నిర్మాతలు చెప్పుకుంటున్నట్టు ప్రభుత్వం ఒక వేళ నిజంగానే అలాటి జీవోతో దయాదాక్షిణ్యాలు చూపినా, చిన్నసినిమాలకి మరో గండం వచ్చిపడింది. గత కొన్ని నెలలుగా చిన్న సినిమాలకి శాటిలైట్ హక్కులు కొనడం లేదు. టీవీ చానెళ్ళు చేవలేని చిన్న సినిమాలన్నిటినీ పక్కకు తోసేశాయి. ఇక మేం కొనం పొమ్మంటున్నాయి.

నిజం చెప్పాలంటే, ఓ డజను భారీ సినిమాలు తీసే నిర్మాతలు తప్పించి మిగతా పదుల సంఖ్యలో చిన్నాచితకా సినిమాలు తీసే నిర్మాతలందరి దృష్టి థియేటర్ల పైన కాదు, ప్రేక్షకుల పైన అసలే కాదు, శాటిలైట్ హక్కులపైనే గురి! దీంతో ఏమాత్రం భయభక్తులు లేకుండా సినిమాలు చుట్టిపారేస్తున్నారు. ప్రేక్షకులు తిప్పికొట్టినా ఫర్వాలేదు, ఒక్కరోజే ఆడినా పోయేదేమీ లేదు- శాటిలైట్ సొమ్ములొస్తాయిగా! ఇదొక ఇన్సూరెన్స్ లా ఆదుకునే అండలా వుంది.  పంట నష్టపోయిన రైతుకీ ఇన్సూరెన్స్ వస్తుంది. అయితే అతను ఇన్సూరెన్స్ డబ్బులకోసం పంటవేయడు ! నిర్మాతలు మాత్రం ఇన్సూరెన్స్ ( శాటిలైట్) హక్కులకోసమే సినిమాలు తీయడం మరిగారు. ఇందుకే ఇన్నేసి ఫ్లాపులు కన్పిస్తూం టాయి- వీటిని చూసి అయ్యో అనుకోనక్కరలేదు. ఇవి వ్యర్ధ వ్యూహాత్మకంగా కోరుకున్న ఫ్లాపులే. ఈ లోగుట్టు ఇక చానెల్స్ కూడా పసిగట్టేసి నట్టున్నాయి –చెత్త సినిమాలు తమకి అంటగట్టి కోట్లు సొమ్ము చేసుకుంటున్నట్టు ఆలస్యంగా నైనా గుర్తించారు- చిన్న సినిమాలన్నిటి మీదా నిషేధం విధించేశారు! ఇందుకే ఇలాటి నిర్మాతలకి ఇప్పుడు  ‘సినిమాలు తీసే పరిస్థితులు ఏమాత్రం లేవు’ . డాబుగా వచ్చి మీడియాలో కనపడే చాన్సు కొట్టేసి, మాది మంచి సినిమా, కథాబలం దండిగా వున్న సినిమా, కామెడీ యాక్షన్ సెంటిమెంట్లతో మహిళల్ని కూడా ఆకట్టుకునే సినిమా, మూడేళ్ళు కష్టపడి స్క్రిప్ట్ వర్క్ చేసిన అద్భుత  సినిమా – అని పబ్లిసిటీ ఇచ్చుకుంటూ, అలాటి కళాఖండం తీస్తున్నట్టు నటిస్తూ,  హనీమూన్ ఎంజాయ్ చేసే పరిస్థితులకి శాటిలైట్ల వ్యవహారం ఇలా గండి కొట్టేసిందన్న మాట పాపం! భక్తి ప్రేక్షకుల మీద లేకపోతే,  ఇంకే వ్యూహాలూ స్కాం కింద వ్యర్ధంగానే పోగుపడి  చాలా మూల్యమే  చెల్లించు కునేలా చేస్తాయి మరి!

ఎందరో దర్శకులు- ఇంతే సంగతులు!
కేవలం అగ్రస్థానానికి చేరి సూపర్ స్టార్లతో సినిమాలు చేసే దర్శకులే ప్రతియేటా, లేదా రెండేళ్లకోసారి మరో సినిమాతో వచ్చే అవకాశాలు కన్పిస్తూం టాయి. మిగతా తొంభై శాతం చిన్నా చితకా సినిమాలకి ఇలా రిపీటయ్యే దర్శకులు ఒకరో ఇద్దరో వుంటారు. మిగిలిన వాళ్ళంతా ఆ ఏటికి ఒక సినిమా చేశామనిపించుకుని వెళ్ళిపోయే వాళ్ళే. ఈ సంవత్సరం విడుదలైన 85 చిన్న సినిమాల వైపు చూస్తే ఈ సంగతే బయట పడుతుంది. నందినీ రెడ్డి , నీలకంఠ, మోహన కృష్ణ ఇంద్రగంటి లాంటి ముగ్గురు నల్గురు తప్పితే మిగిలిన వాళ్ళంతా యధావిధిగా ఈ సంవత్సరం కూడా ఎంట్రీ ఇచ్చిన కొత్త దర్శకులే. కొత్త నిర్మాతలు వచ్చి వెళ్లి నట్టే, ప్రతీ ఏటా అంతమంది కొత్త కొత్త దర్శకులు ముఖం చూపించి వెళ్లి పోతూంటారు. అయితే ఈ సంవత్సరం కాస్త తేడా చూపించి పెద్దహీరోల దృష్టిలో పడ్డ కొత్త దర్శకులు ముగ్గురున్నారు. ‘స్వామిరారా’ తో సుధీర్ వర్మ, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తో విజయకుమార్ కొండా, ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ తో మేర్లపాక గాంధీ...ఈ ముగ్గురూ టాప్ రేంజిలోకి వెళ్ళిపోయారు.

అదే ‘జబర్దస్త్’ తో మళ్ళీ వచ్చిన హిట్ దర్శకురాలు నందినీ రెడ్డి గానీ, ‘చెమ్మక్ చల్లో’ తో వచ్చిన సీనియర్ దర్శకుడు నీలకంఠ గానీ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయారు. ‘అంతకుముందు ఆ తర్వాత’ తీసిన మోహనకృష్ణ ఇంద్రగంటి మాత్రం యావరేజి టాక్ తో బయటపడ్డారు. సుప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా ‘వెల్కం ఒబామా’ తోవచ్చి ఫ్లాపయ్యారు. ఇక ‘ప్రేమకథా చిత్రం’ అనే హిట్ తీసిన ఛా యాగ్రాహకుడు  జే.ప్రభాకర రెడ్డికి హిట్ దర్శకుడిగా చెప్పుకునే అవకాశమే లేకపోయింది. దాని ఘోస్ట్ డైరెక్షన్ అంతా ‘ఈ రోజుల్లో’ ఫేం మారుతి చేశారని చెప్పుకుంటారు. అలాగే మరో ప్రముఖ దర్శకుడు తేజ మరో యూత్ సినిమా ‘వెయ్యి అబద్ధాలు’ తో వచ్చి అట్టర్ ఫ్లాపయ్యారు. ఏడాది చివర్లో ( డిసెంబర్లో) విడుదలైన ‘సెకండ్ హేండ్’ దర్శకుడు ప్రతిభాగలవాడే అన్పించుకున్నా, ఎన్నుకున్న ప్రేమ కథ ఆఫ్ బీట్ కావడంతో మిశ్రమ స్పందనతో త్రిశంకుస్వర్గంలో వుండి పోవాల్సివచ్చింది.
అతితక్కువగా విజయాలు సాధిస్తున్న చిన్న సినిమాలు ఒకటే చెబుతున్నాయి- తారాగణ బలం వుండ ని ఈ సినిమాలకి కథాబలంతో బాటు, పక్కా ప్లానింగే ప్రాణమని. అప్పుడు వాటి అఖండ విజయాలతో శాటిలైట్ హక్కులు ఊహించ లేనంత బోనస్ గా వచ్చి పడతాయని!

త్రీడీ- లేడీ జాంతానై!
ఈ సంవత్సరం రెండు త్రీడీ, నాలుగు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి. ఎంత పాపులర్ హీరోలతో, హీరోయిన్లతో ఇలాటి ప్రయోగాలుచేసినా, బేసిగ్గా కథలేకపోతే గంగపాలే నని ఇవి నిరూపించాయి. అల్లరినరేష్ తో ‘యాక్షన్’ అనే త్రీడీ, కళ్యాన్ రాం తో ‘ఓం’ అనే మరో త్రీడీ కథ నాస్తి టెక్నికల్ హంగామా జాస్తి అన్నచందంగా తయారై నవ్వులపాలయ్యాయి. ‘ఓం’ త్రీడీ కి వ్యయం చేసిన పాతికకోట్లూ చేతికిరాలేదు. అదే విధంగా అనుష్కా, ఛార్మీ, ప్రియమణి, ఉదయభాను లతో వచ్చిన నాల్గు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బోల్తా కొట్టాయి. ఎంత క్రేజీ హీరోయిన్లయినా అర్ధంపర్ధం లేని కథలతో తీస్తే ఎవరుమాత్రం తట్టుకోగలరని? కావట్టి అనుష్కా ‘వర్ణ’, ఛార్మీ ‘ప్రేమ ఒక మైకం’, ప్రియమణి ‘చండీ’, ఉదయభాను ‘మధుమతి’ మతులుపోగొట్టి మట్టిలో కలిసిపోయాయి.
తాజాగా వచ్చే సంవత్సరం నయనతారతో శేఖర్ కమ్ముల తీస్తున్న ‘అనామిక’ ఏమాత్రం అలరిస్తుందో చూడాలి.

టాప్ స్టార్లు సగం సగం
ఈ ఏడు పదమూడుమంది టాప్ స్టార్లు తెరపైకి వచ్చారు. మహేష్ బాబు సోలోగా కాకుండా వెంకటేష్ తో కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్టయ్యింది. కానీ ఆతర్వాత వెంకటేష్ సోలోగా నటించిన షాడో, రాం తో కలిసి నటించిన మసాలా రెండూ ఫ్లాపయ్యాయి. రాం కూడా సోలోగా నటించిన ఒంగోలు గిత్త పరాజయం పాలయ్యింది. నాగార్జున నటించిన గ్రీకువీరుడు, భాయ్ రెండూ ఫ్లాపయ్యి ఆయన్ని డోలాయమానంలో పడేశాయి వెంకటేష్ కి లాగే. మరో సీనియర్ స్టార్ బాలకృష్ణ సినిమా ఈ ఏడు రిలీజ్ కాలేదు. మహేష్ బాబు తర్వాత ఎన్టీఆర్ ఏంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాద్షా, రామయ్యా వస్తావయ్యా రెండూ తీవ్ర నిరాశ పర్చాయి. దీంతో కింకర్తవ్యం తోచడం లేదు. అరడజను వరస ఫ్లాపుల తర్వాత బలుపు తో బయట పడ్డా నన్పించుకున్న రవితేజ సైతం నిర్మాత దొరక్క, దొరికిన వాళ్ళు మారుతూ వచ్చి ఎలాగో తాజా సినిమా ప్రారంభించుకున్నారు. అల్లుఅర్జున్ ఇద్దరమ్మాయిలతో ఫ్లాపయ్యాడు. రాం చరణ్ తూఫాన్ తో ఘోరంగా తెలుగు, హిందీల్లో దెబ్బతిని, నాయక తో ఫర్వాలేదన్పించుకున్నాడు. నితిన్ మరోసారి హిట్టయ్యాడు. మంచు విష్ణు దూసుకె ళ్తా ఓకే అన్పించుకున్నా, సోదరుడు మనోజ్ పోటు గాడు తో బోల్తా పడ్డాడు. మిర్చీ అనే ఓకే  సినిమాతో వచ్చిన ప్రభాస్ హిట్టయ్యాడు. అందరికంటే పెద్దహిట్టిచ్చి (అత్తారింటికి దారేది)టాప్ చెయిర్ ని అలంకరిచిన స్టార్ గా పవన్ కళ్యాణ్ నిలిచిపోయారు!

వచ్చే సంవత్సరమైనా ఈ తప్పొప్పుల మూల్యాంకన చేసుకుని విజయాల్ని మరింతగా సొంతం చేసుకుంటారా? ఏమో!                                                                     

   -సికిందర్
-