రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, June 6, 2024

1437 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : ఉదయ్ శెట్టి
తారాగణం :  ఆనంద్ దేవరకొండ, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ఇమ్మాన్యుయేల్  తదితరులు.
సంగీతం : చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : ఆదిత్య జె.
బ్యానర్ : హై-లైఫ్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
***
          2023 లో బేబీ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీతో ప్రేక్షకుల్ని అలరించడానికి సమ్మర్ సినిమాతో వచ్చాడు. ఇటీవల వచ్చిన క్రైమ్ కామెడీ లేవీ నిలబడ లేదు. సస్పెన్స్ థ్రిల్లర్లు, క్రైమ్ కామెడీలు నిలబడేందుకు మొరాయించి మొండి చెయ్యి చూపిస్తున్నాయి. అలాటిది మరో కొత్త దర్శకుడు క్రైమ్ కామెడీతో తన వంతు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. మరి దీంతో ఎంత నవ్వించాడు, ఎంత నిలబెట్టాడు అన్నవి ప్రశ్నలు. వీటికి సమాధానాలు వెతుకుతూ ముందుగా కథ లోకి వెళ్దాం...

కథ

గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ), శంకర్(ఇమ్మాన్యుయేల్‌) దొంగతనాలు చేసి జీవిస్తూంటారు. గణేష్‌కి శృతి (నయన్ సారిక) తో ప్రేమ వ్యవహారముంటుంది. ఆమె తాను పనిచేసే షాప్ ఓనర్ తో పెళ్ళికి సిద్ధమవడంతో, గణేష్ హర్ట్ అవుతాడు. ఆమె డబ్బుకోసం పెళ్ళికి సిద్ధపడితే ఈలోగా తానూ డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అవుతానని సవాలు విసురుతాడు. ఓ నగల షాపులో 7 కోట్ల విలువైన వజ్రాన్ని కొట్టేసే ఆఫర్ రావడంతో ఆ వజ్రాన్ని కొట్టేసి అమ్ముకుందామని దాంతో పారిపోతాడు.
        
చెన్నై వెళ్తూండగా పోలీసులు చెకింగ్ చేస్తూండడంతో భయపడి వజ్రాన్ని అటుగా తీసికెళ్తున్న వినాయకుడి విగ్రహం తొండంలో పడేస్తాడు. నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్న కిషోర్ రెడ్డి ఆ విగ్రహాన్ని ముంబాయిలో తయారు చేయించి తీసుకొస్తూంటాడు. అయితే కిషోర్ రెడ్డి వూరికి వెళ్ళాల్సిన విగ్రహం ప్రత్యర్ధి వూరికి వెళ్తుంది. దీంతో ఆ విగ్రహం కోసం ప్రయత్నాలు మొదలవుతాయి.
       
విగ్రహం కిషోర్ రెడ్డికి ఎందుకు విలువైనది
? అందులో ఏం దాచి పెట్టి ముంబాయి నుంచి రప్పిస్తున్నాడు? విగ్రహం తొండంలో వజ్రాన్ని పడేసిన గణేష్ కది దక్కిందా లేదా? దాంతో కోటీశ్వరుడై శృతిని పెళ్ళి చేసుకున్నాడా లేదా?  ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇదే వారం విడుదలైన భజే వాయు వేగం లో తండ్రి ఆపరేషన్ కోసం హీరో కారు కొట్టేసి పారిపోతాడు. ప్రస్తుత సినిమాలో కోటీశ్వరుడవడం కోసం హీరో వజ్రాన్ని కొట్టేసి పారిపోతాడు. రెండూ ఒకే లాంటి కథలు. అయితే మొదటిది బరువైన సెంటిమెంటల్ డ్రామా, రెండోది క్రైమ్ కామెడీ. ఏదో విలువైనది ఎక్కడో మిస్ అవడం, దాని కోసం వివిధ గ్యాంగులు వేటలో పడ్డం కూడా కొత్త కథేమీ కాదు. అనగనగా ఒక రోజు’, స్వామి రారా వంటి హిట్స్ గతంలో వచ్చాయి. ప్రస్తుత సినిమాని కూడా అలాటి హిట్ చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సిల్లీ కథ వల్ల పాక్షికంగానే సఫలమయ్యారు.
          
ఫస్టాఫ్ పాయింటుకి రావడానికి లవ్ ట్రాకుతో చాలా సేపు సాగదీశారు. హీరోయిన్ తో సుదీర్ఘ లవ్ ట్రాకు పెట్టి, హీరో ఆమెకి సవాలు  చేసిన తర్వాత వజ్రాన్నిదొంగిలించి పారిపోవడం, దాన్ని వినాయకుడి విగ్రహంలో వేయడం, అది విలన్ ప్రత్యర్ధి వూరికి చేరడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇప్పుడా విగ్రహం ఇటు విలన్ కి, అటు హీరోకీ ఇద్దరికీ అవసరం.
        
ఇప్పుడు సెకండాఫ్ లో ఆ విగ్రహంకోసం ప్రయత్నాల్ని కామెడీగా మార్చి నడిపించారు. ఈ ప్రయత్నాలు సిల్లీగా వున్నా కామెడీ కాబట్టి సీరియస్ గా తీసుకోవద్దన్నట్టు నడిపించారు. కానీ హీరో విలన్ల మధ్య బలమైన ఎత్తుగడలు వుండుంటే ఆ కామెడీ లాజికల్ గా వర్కవుటై క్రియేటివిటీతో ఇంకా బావుండేది. ఈ కామెడీకి సారధి డాక్టర్ ఆర్గానిక్ డేవిడ్ గా నటించిన వెన్నెల కిషోర్. సెకండాఫ్ పూర్తిగా వెన్నెల కిషోర్ చేసే సిల్లీ కామెడీ మీద ఆధారపడింది. తన స్కిల్స్ తో అంతలా నవ్వించకపోతే సెకండాఫ్ ప్రమాదంలో పడేది.
       
కథలో క్లయిమాక్స్ ట్విస్టు ఒక్కటే ఉత్కంఠ రేపుతుంది. ఇక ముగింపుగా తుపాకులతో కాల్చుకోవడమన్నది
స్వామిరారా లాంటిదే. అయితే మధ్యలో హీరోకి సెకెండ్ హీరోయిన్ ప్రగతీ శ్రీవాస్తవతో ఇంకో లవ్ ట్రాక్ పెట్టడం వర్కౌట్ కాలేదు. అది కథని పక్కదోవ పట్టించింది. మొత్తానికి సిల్లీ కామెడీతో ఈ సాధారణ కథని గట్టెక్కించే ప్రయత్నం చేశారు.

నటనలు – సాంకేతికాలు

ఆనంద్ దేవరకొండ ఈసారి కామెడీ నటించడంలో కృషి చేశాడు. పరిమిత భావాలు పలికే మొహంలో కామెడీకి కావాల్సిన ఎక్స్ ప్రెషన్స్ శూన్యమైనా ప్రేక్షకుల్ని గతంలోలా ఇబ్బంది పెట్టకుండా కామెడీ నటించడం కోసం ఫర్వాలేదన్పించే స్థాయిలో కష్టపడ్డాడు. ఇక మిగతా రోమాన్స్, యాక్షన్ మామూలే. అయితే హీరోయిన్లిద్దరికీ పెద్దగా పాత్రల్లేవు. విలన్లుగా  రాజన్, కృష్ణ చైతన్య క్రూరత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. వెన్నెల కిషోర్, ఇమ్మాన్యుయేల్ కామెడీలు మాత్రమే ఈ సినిమాకి హైలైట్.
        
చేతన్ భరద్వాజ్ సంగీతం, ఆదిత్య ఛాయాగ్రహణం, ఇతర సాంకేతిక హంగులు ఫర్వాలేదనిపించేలా వున్నాయి. కొత్త దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి కొత్తదనం కోసం ప్రయత్నించకుండా, రొటీన్ ఫార్ములా సేఫ్ జోన్ లోనే వుండిపోయాడు.

—సికిందర్


1436 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : ప్రశాంత్ రెడ్డి
తారాగణం : కార్తికేయ, ఐశ్వర్యా మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ళ భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు. 
సంగీతం : రథన్ (పాటలు), కపిల్ కుమార్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్), ఛాయాగ్రహణం : ఆర్.డి రాజశేఖర్
నిర్మాణం : యూవీ కాన్సెప్ట్స్
విడుదల : మే 31, 2024
***

        రెక్స్ 100 తర్వాత సరైన విజయాలు లేని కార్తికేయ ఇప్పుడు మరో యాక్షన్ మూవీతో సక్సెస్ కోసం ప్రయత్నం చేశాడు. రెండు సినిమాల్లో విలన్ గా నటించి పేరు తెచ్చుకున్నా మళ్ళీ విలన్ గా నటించకుండా హీరోగానే నటిస్తూ ఇటీవల బెదుర్లంక తో మెప్పించే ప్రయత్నం చేశాడు. దీనితర్వాత ఇప్పుడు భజే వాయువేగం అనే యాక్షన్ మూవీని ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో నటించాడు. ఇంతకీ ఈ మూవీ అయినా కార్తికేయని గట్టెక్కిస్తుందా? తెలుసుకుందాం...

కథ

వెంకట్‌(కార్తికేయ), రాజు ( రాహుల్ టైసన్) అన్నదమ్ములు. వీళ్ళ తండ్రి లక్ష్మయ్య (తనికెళ్ళ) వీళ్ళ ఆసక్తులు గమనించి కొంత పొలం అమ్మేసి హైదరాబాద్ పంపిస్తాడు. వెంకట్ క్రికెట్ లో, రాజు సాఫ్ట్ వేర్ లో చేరడానికి వస్తారు. కానీ వెంకట్‌ క్రికెట్‌లో సెలక్ట్ వాలంటే పది లక్షలు కట్టాలి. మరోవైపు రాజు జాబ్ లో చేరాలంటే అయిదు లక్షలు కట్టాలి. దీంతో రాజు స్టార్ హోటల్‌లో సర్వెంట్‌గా చేరతాడు. ఇంతలో వూళ్ళో తండ్రి ఆరోగ్యం చెడి పది లక్షలు అవసరపడతాయి. ఈ డబ్బు కోసం వెంకట్ క్రికెట్ బెట్టింగ్స్ కి పాల్పడతాడు. అందులో 40 లక్షలు గెలిచినా బెట్టింగ్ మాఫియా మోసం చేసి 40 లక్షలు ఎదురు కట్టాలంటాడు. ఆ డబ్బు కోసం రాజు డేవిడ్ ని కలుస్తాడు. హోటల్ ఓనర్ డేవిడ్ (రవిశంకర్‌) మేయర్‌ తమ్ముడు.  డేవిడ్  బెట్టింగ్ మాఫియానే సపోర్టు చేయడంతో వెంకట్, రాజు అతడి కారు తీసుకుని పారిపోతారు అమ్ముకుందామని.
        ఆ కారులో శవముంటుంది, డబ్బు వుంటుంది, వేరే వేల కోట్ల హవాలా డబ్బుకి సంబంధించి పాస్ కోడ్ గా 500 రూపాయల నోటు వుంటుంది.  ఇప్పుడేం జరిగింది? ఇంత క్రైమ్ లో ఇరుక్కున్న అన్నదమ్ములు హాస్పిటల్లో వున్న తండ్రిని కాపాడుకోవడం కోసం ఏం చేశారు? కారుకొసం వెంటబడ్డ ముఠాలు కారుని దక్కించుకున్నాయా? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ

సాధారణ ఫార్ములా కథే. 2022 లో హాలీవుడ్ మూవీ అంబులెన్స్ ఇలాటిదే కథ. భార్య సర్జరీకి డబ్బు కావాల్సి వచ్చి, తమ్ముడితో కలిసి బ్యాంకుని దోచుకుని అంబులెన్స్ లో పారిపోయే కథ.  ఇది పూర్తి స్థాయి యాక్షన్ జానర్లో కొచ్చే కథ.  భార్య సర్జరీ కోసం డబ్బులు అనే నిస్సహాయులైన అన్నదమ్ముల భావోద్వేగాల్ని కేంద్రంగా చేసుకుని అల్లిన యాక్షన్ కథ. కానీ తెలుగులో యాక్షన్ తక్కువ, సెంటిమెంటల్ డ్రామాలు ఎక్కువ. తండ్రితో అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్టాఫ్ అంతా ఒకటే సీన్లు, డైలాగులు, కన్నీళ్లు, కష్టాలు. హైదరాబాద్ లో అన్నదమ్ముల బాధలు, వూళ్ళో తండ్రి శోకాలు. ఇలా ఫస్టాఫ్ కథ ముందుకు కదలక, ఎంతో ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప ఎమోషనల్ డ్రైవ్ సాధ్యం కాదన్నట్టు నడిపాడు దర్శకుడు. దీని వల్ల యాక్షన్ సినిమా ఫీల్ చెడింది.  యాక్షన్ తో వుండే యూత్ అప్పీల్, మార్కెట్ యాస్పెక్ట్ ఆ మేరకు సన్నగిల్లాయి.
       
తండ్రికి ఆపరేషన్ డబ్బుల కోసం మాఫియా కారులో పారిపోయే సెకండాఫ్ కథతో యాక్షన్లో కొస్తుంది మూవీ. వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఫాదర్ సెంటిమెంట్లోకే తిరగబెడుతుంది. ఇది చాలదన్నట్టు తమ్ముడి పాత్ర ఎప్పుడు చూసినా ఏడుస్తూనే వుండడం. ముందుకెళ్ళే అన్నకి బ్రేకులు వేసే ఏడ్పులు. ఇలా అన్నదమ్ముల అనుబంధం
, తండ్రితో అన్నదమ్ముల అను బంధం ఇవే ప్రధానమై సెకండాఫ్ లో కూడా యాక్షన్ తగ్గింది. టైటిల్ ప్రకారం వుండాల్సిన వాయువేగం దొరక్కుండా పారిపోయే కారు ఛేజింగ్స్ తో వుండాల్సిన కథ, కథకుడి అభద్రతా భావం వల్ల భారీ సెంటిమెంటల్ డ్రామాగా మారింది. దీనివల్ల హీరో హీఓయిన్ల మధ్య యూత్ అప్పీల్ తో వుండాల్సిన లవ్ ట్రాక్ కూడా బలైంది.
       
కారులో శవం
, నగదు, హవాలా నోటు- దీంతో విలనీ కూడా పాత స్టయిల్లోనే వుంది ముగింపు సహా. 1993 లో మహా దర్శకుడు రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ థెల్మా అండ్ లూయిస్ లో ఇద్దరు యువతులు రేప్ చేయబోయిన వాణ్ని చంపి కారులో పారిపోయే కథ -వెంటాడే పోలీసులతో యాక్షన్ కథే. ఈ యాక్షన్ కథలో బాధని ఎక్కడా చూపించకుండా సేవ్ చేసి, ముగింపులో ఆ ఇద్దరు యువతులు తీసుకునే నిర్ణయంతో  ఒకేసారి గుండె పగిలేలా చేస్తాడు దర్శకుడు. ఇదీ స్టోరీ డైనమిక్స్ అంటే. ఇందుకే ఈ సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. ఇలాటి సినిమాలు చూసి తెలుగు సినిమాల గ్రాఫు పెంచాలి, కథంటే ఏమిటో తెలుసుకుని.

నటనలు –సాంకేతికాలు

కథని బట్టి కార్తికేయ హీరోయిజం తక్కువ, పాసివ్ నెస్ ఎక్కువ. ఇక హీరోయిన్ తో రోమాన్సే లేదు. తండ్రి రుణం తీర్చుకునే సెంటిమెంట్ల భారం ఎక్కువై పోయి- యాక్షన్ తగ్గి యూత్ ని నిరాశపర్చే ప్రమాదం తెచ్చుకున్నాడు.  తమ్ముడుగా రాహుల్ టైసన్ అయితే వీపింగ్ డాల్ లా ఆద్యంతం ఏడ్పిస్తాడు ఏడ్పు ఇష్టపడే ప్రేక్షకులకి. డిటో తనికెళ్ళ భరణి. హీరోయిన్ ఐశ్వర్యాది ఫార్ములా టర్నింగ్ ఇచ్చే రోటీన్ పాత్ర. ఇక విలన్ వేషధారులు వాళ్ళ డైలాగులతో వాళ్ళు మహానుభావులు.

కెమెరా, సంగీతం, లొకేషన్లు, యాక్షన్ సీన్లు ప్రత్యేకంగా ఏమీ వుండవు. ఓపికగా కూర్చుని పాత్రల బాధలు, గాథలు బాధపడకుండా చూడాల్సిన సినిమా.

—సికిందర్


1435 :స్పెషల్ ఆర్టికల్


కవైపు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు ఈ వేసవిలో శూన్య ప్రదర్శన చేస్తూండగా, మరో వైపు మలయాళ సినిమాలు స్లంప్ లేకుండా సమ్మర్ లో బాక్సాఫీసు విజయాలు సాధిస్తున్న వైనం కళ్ళముందుంది. ముఖ్యంగా ఏప్రిల్ మే నెలల్లో తెలుగు తమిళ కన్నడ భాషల్లో పెద్ద సినిమాలు విడుదల కాలేదు. ఎండలు, క్రికెట్, ఎన్నికలు కారణంగా చూపి నిర్మాతలు పెద్ద సినిమాల విడుదలల్ని వాయిదా వేశారు. దీంతో ధియేటర్లు నడపలేక మూసివేసే పరిస్థితి ఎదురైంది ఎగ్జిబిటర్లకి. థియేటర్ చైన్ 'జికె  సినిమాస్' యజమాని రూబన్ మతివానన్ 2024 సవత్సరం తమిళ, తెలుగు సినిమాలకు ఆందోళనకర సంవత్సరమని కామెంట్ చేశారు. ఈ దశాబ్దంలోనే  2024 ని అత్యంత చెత్త సంవత్సరంగా పేర్కొన్నారు.

        చాలా మంది లోక్‌సభ ఎన్నికలు, పరీక్షలు, ఎండలు, ఐపీఎల్ వంటివి పెద్ద సినిమాలు లేకపోవడానికి కారణాలుగా చెబుతూ వచ్చారు. కానీ, ఇవి కుంటి సాకులు మాత్రమే. వేసవి అనేది సాధారణంగా పెద్ద సినిమాలకు ఉత్తమ సీజన్ గా వుంటూ వస్తోంది. 2023 వేసవిలోనే తెలుగులో రావణాసుర’, ఏజెంట్’, విరూపాక్ష’, శాకుంతలం’, ఉగ్రం’, కస్టడీ వంటి పెద్ద సినిమాలు 6 విడుదలయ్యాయి. 2024 వేసవిలో మాత్రం ఫ్యామిలీ స్టార్’, ఆ ఒక్కటీ అడక్కు’, ‘’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూడే పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ఈ మూడూ ఫ్లాపయ్యాయి. చిన్న చిన్న సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. ఇవి ఎండలు, ఎన్నికలు, ఐపీఎల్, పరీక్షలు వల్ల ఫ్లాపయ్యాయా?
        
లోక్ సభ ఎన్నికలు వేసవిలోనే జరుగుతున్నాయి, ఐపీఎల్ వేసవిలోనే వస్తోంది, ఎండలు వేసవిలోనే మండి పోతున్నాయి, పరీక్షలూ వేసవిలోనే వస్తున్నాయి, జనం వేసవిలోనే టూర్లు వేస్తున్నారు, కూల్ డ్రింకులు, కూలర్లు వేసవిలోనే అమ్ముడుబోతున్నాయిఅలాగే చల్లటి ఏసీ పట్టున కమ్మగా కూర్చుని వేసవిలో సినిమాలు కూడా చూస్తూ వచ్చారు జనాలు. మరి ఇప్పుడెందుకు చూడడం లేదు? చూసేందుకు లోక్‌సభ ఎన్నికలు, పరీక్షలు, ఎండలు, ఐపీఎల్ వగైరా ఇప్పుడెందుకు అడ్డొస్తున్నాయి?
       
అడ్డు రావడం లేదు.
కేరళలో యధావిధిగా సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. చూసి హిట్ కూడా చేస్తున్నారు. 2024 ఏప్రిల్లో విడుదలైన పెద్ద సినిమా ఆవేశం కి రూ. 155 కోట్ల బాక్సాఫీసు నిచ్చారు. ఏప్రిల్లోనే విడుదలైన చిన్న సినిమా వర్షం గక్కుశేషం కి రూ. 80 కోట్లు ఇచ్చారు. ఏప్రిల్లోనే విడుదలైన చిన్న సినిమా జై గణేష్ కి రూ. 83 కోట్లు ఇచ్చారు. మే లో విడుదలైన చిన్న సినిమా మలయాళీ ఫ్రమ్ ఇండియాకి రూ. 18 కోట్లు ఇచ్చారు. మరో చిన్న సినిమా గురువాయూర్ అంబలనాదయిల్ కి రూ. 85 కోట్లు ఇచ్చారు. పెద్ద సినిమా  టర్బో కి రూ. 70 కోట్లు ఇచ్చారు. ఇంకో చిన్న సినిమా తలవన్ కి 10 వ రోజు కల్లా రూ. 15 కోట్లూ కలెక్షన్లిచ్చారు.
       
అంతే కాదు
, తమిళంలో కూడా స్లంప్ అంటున్న మే నెలలోనే విడుదలైన  
అరణ్మనై 4’ అనే హార్రర్ రూ.100 కోట్ల మార్కుని దాటేసింది. తమన్నా భాటియా, రాశీ ఖన్నా, దర్శకుడు సుందర్ సి నటించిన ఇదే మూవీ తెలుగులో బాక్ గా విడుదలై ఫ్లాపయ్యింది. ఈ వేసవిలో తమిళంలో పెద్ద సినిమాల కొరతని భర్తీ చేసేందుకు ఒక మార్గం కనిపెట్టారు. పాత హిట్స్ ని రీ రిలీజ్ చేయడం మొదలెట్టారు. దళపతి విజయ్ 'గిల్లి', ధనుష్ '3', సూర్య 'వారణం ఆయిరం'  పాత సినిమాల్ని రీ రిలీజ్ చేస్తే మళ్ళీ హిట్టయ్యాయి. ఎందుకు హిట్టయ్యాయి? ఎండలు, ఎన్నికలు, పరీక్షలు, ఐపీఎల్ వుంటే ఎలా వచ్చారు ప్రేక్షకులు?
       
కాబట్టి నాణ్యత ప్రధాన పాత్ర వహిస్తోంది ఎలాటి పరిస్థితుల్లోనైనా హిట్టవడానికి. ఈ నాణ్యత మలయాళంలో ఇస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు (చెన్నై)  లో వున్నప్పుడు అక్కడ అన్ని భాషల దర్శకులతో
, టెక్నీషియన్లతో పనిచేసిన తెలుగు అసిస్టెంట్లకి మంచి నైపుణ్యం అబ్బేది. పరిశ్రమ హైదరాబాద్ వచ్చేశాక అసిస్టెంట్లకి ఆ ఇంటరాక్షన్ లేక ఒంటరి వాళ్ళై పోయి నేర్చుకోవడం వదిలేసి దర్శకులై పోతున్నారు. అందుకే సినిమాలిలా తయారవుతున్నాయి. ఇది పాత దర్శకులు చెప్పే మాటే. కాబట్టి ఇప్పుడు అసిస్టెంట్లు  ఇక్కడే అసిస్టెంట్లుగా చేరడం మాని, కొన్నాళ్ళు మాలీవుడ్ వెళ్ళి  ఎన్నికల్లో, ఎండల్లో, ఐపీఎల్లో, పరీక్షల్లో కూడా సినిమాలు తీసి హిట్ చేస్తున్న మలయాళ దర్శకుల మంత్రమేమిటో వాళ్ళ దగ్గర పనిలో చేరి నేర్చుకుంటే మంచిది. అప్పుడు ఎండలు, ఎన్నికలు, ఐపీఎల్, పరీక్షలూ అంటూ కుంటి సాకులు చెప్పే అవసరం రాదు.

***

 

Friday, May 31, 2024

1434 : రెవ్యూ!

 

రచన : దర్శకత్వం : కృష్ణ చైతన్య
తారాగణం: విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి, నాజర్, గోపరాజు రమణ, హైపర్ ఆది తదితరులు  
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : అనిత్ మాదాడి
బ్యానర్స్: సితార ఎంటర్టయిన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
విడుదల : మే 31, 2024
***

        టీవల గామి సక్సెస్ తర్వాత విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సమ్మర్ లో ఎండలకి, క్రికెట్ కి, ఎన్నికలకీ భయపడి పెద్ద సినిమాలని వాయిదా వేశాక, మే చివర్లో సమ్మర్ కి సెలవు చెబుతూ ఈ మూవీ విడుదలైంది. దీనికి కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ సినిమా ప్రకటించినప్పట్నుంచీ ఆసక్తి రేపుతూ వచ్చింది.  హిందీలో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లాగా టైటిల్ తో వచ్చిన ఈ మూవీ ట్రైలర్ చూస్తే బలహీనంగా వుంది. ఈ సినిమాలో చాలా గ్యాంగ్‌లు వున్నాయి, కానీ ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదని, దీన్ని గ్యాంగ్‌స్టర్ మూవీగా పరిగణించవద్దనీ ప్రేక్షకుల్ని అభ్యర్థిస్తున్నానని ప్రకటించాడు దర్శకుడు. అంటే ఏమిటి? ఏమో! సినిమా చూస్తేగానీ తెలీదు. సినిమా చూసి తెలుసుకుందాం...

కథ

ఈ కథ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని ఓ లంక గ్రామంలో పాతికేళ్ళ క్రితం జరుగుతుంది.  అక్కడ పేకాట, తాగుడు, వేశ్యతో సంబంధం, డబ్బులు కొట్టేయడం వంటి పనులతో గడుపుతున్న రత్న(విశ్వక్ సేన్) కి గొదావరిలో ఇసుక అక్రమ రవాణా కంటబడుతుంది. దాని వెనుక ఎమ్మెల్యే దొరస్వామిరాజు (గోపరాజు రమణ) వుంటాడు. ఇతడి రాజకీయ ప్రత్యర్ధిగా నానాజీ (నాజర్)వుంటాడు. రత్న తెలివిగా దొరస్వామి రాజు దగ్గర చేరిపోయి ఇసుక వ్యాపారం చూస్తూంటాడు. నానాజీకో కూతురు బుజ్జి (నేహాశెట్టి) వుంటుంది. ఈమెని ప్రేమించి నానాజీకి శత్రువు అవుతాడు. అయితే ఎన్నికల్లో దొరస్వామి రాజుని ఓడిస్తానని నానాజీ ని ఒప్పిస్తాడు. ఎన్నికల్లో దొరస్వామి రాజుమీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. దీంతో తలెత్తిన పరిణామాల్లో ఇద్దరికీ శత్రువు అవుతాడు.
       
ఇప్పుడేం చేశాడు రత్న
? ఇద్దరు విరోధుల్ని ఎలా ఎదుర్కొన్నాడు? బుజ్జిని పెళ్ళి చేసుకున్నాడా? ప్రేమించిన వేశ్య రత్నమాల (అంజలి) ఏమైంది? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ

గోదావరిలొ కొట్టుకు పోయిన నాటు పడవలా వుంది. పడవలో దర్శకుడు, హీరో, నిర్మాతలూ అందరూ వున్నారు. రెస్క్యూ ఆపరేషన్ తో కూడా ఈ కథతో  సినిమాని నిలబెట్టలేరు. రాయలసీమ, తెలంగాణాల్లో మాదిరిగానే ఆంధ్రా ప్రాంతంలోనూ హత్యలు, ఘర్షణలు జరుగుతున్నాయని, ప్రతిసారీ గోదావరి జిల్లాల్ని సుందరంగా చూపించడం చాలా అసహజంగా అన్పించిందనీ, గోదావరి జిల్లాల్లో కనువిందు చేయాల్సిన దానికంటే ఎక్కువే వుందనీ, ఆ విధంగా ఈ సినిమా ద్వారా చక్కని ఎమోషన్స్ తో కూడిన మంచి కథని చెప్పే అవకాశం లభించిందనీ చెప్పాడు దర్శకుడు.
       
చాలా గొప్పగా చెప్పాడు. కానీ కథ అనేది ప్రధానంగా  
పాత్ర-సమస్య-పరిష్కారం అనే చట్రంలో వుంటే కథవుతుందని మరిచాడు. దీంతో కథంతా గందరగోళంగా తయారైంది. ఈ కథలో హీరోకి సినిమాని నిలబెట్టే ప్రధాన సమస్యా (పాయింటు), ఆ సమస్యని సాధించాలన్న భావోద్వేగాలతో కూడిన లక్ష్యమూ లేకపోవడంతో, ఇది సినిమా కథే కాకుండా పోయింది.
       
సినిమా సాంతం ఒక సమస్య వస్తే
, దాన్నెదుర్కొన్నాక ఇంకో సమస్య వస్తే, దీన్నెదు ర్కొన్నాక ఇంకో సమస్య వస్తే ... ఎలా ఎన్నో సమస్యలు, వాటిని ఎన్నోసార్లు ఎదుర్కోవడాలే తప్ప, ఒకచోట ఆగి ప్రధాన సమస్యతో పాయిటుకి రాదు. ఇది ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్ గా సాగే డాక్యుమెంటరీల కోసం వాడే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ కింది కొస్తుంది. ఇలా వచ్చిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఆటోనగర్ సూర్య వంటి వెన్నో అట్టర్ ఫ్లాపయ్యాయి. డాక్యుమెంటరీ కథనాలతో కమర్షియల్ సినిమాలు తీయలేరు.
       
కాబట్టి ఇంటర్వెల్లో కూడా కథేమిటో అర్ధం గాదు. ఇంటర్వెల్ తర్వాత అస్సలు అర్ధంగాదు. విలన్లతో ఏవేవో సమస్యలు
, హీరో పోరాటాలూ వచ్చిపోతూంటాయి. ఇన్ని సమస్యలు, పోరాటాలు అర్ధంగాకుండానే, మరిన్ని సమస్యలూ పోరాటాలూ వచ్చేస్తూంటాయి. హీరోతో కుదురుగా కథే లేకపోయాక, మరోవైపు ఎన్నో పాత్రల ఉపకథలు కూడా వచ్చేస్తూ ఇంకా గందరగోళమై పోతుంది. ఇలా హీరో సహా ఏ పాత్రా నిలబడక- తన్నుకుని చావడమే వుంటుంది.
       
గోదావరి జిల్లాలో యాక్షన్ కథ చెప్పడానికి పూర్వమున్న
కత్తి కట్టడం అనే సాంప్రదాయాన్ని కేంద్ర బిందువుగా తీసుకున్నాడు. అక్కడ పగదీర్చుకునే కార్యక్రమాన్ని కత్తి కట్టడం అంటారు. దీన్ని రూపుమాపడం హీరో లక్ష్యం. దీని మీదే నిలబడి కథ చెయ్యక, ఈ పాయింటుని మరుగున పడేసి ఏమేమో చేశాడు. టైటిల్ కూడా ఈ కథకి కుదర్లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే క్రిమినల్, మాఫియా కథల్ని సూచించే టైటిల్ లాగా వుంది. కానీ చూస్తే ఇది రెండు రాజకీయ గ్రూపుల రొటీన్ కథ. రాజకీయ నాయకులు పోషించుకునే కార్యకర్తల్ని గ్యాంగ్స్ అనరు. పూర్వం 1970, 80 లలో గోదావరి జిల్లాల్లో గ్రామ కక్షలతో కూడిన సినిమాలెన్నో వచ్చేవి. వాటిలో జమీందారో, సర్పంచో విలన్ గా వుండేవాడు. ఆ బాపతు కథే ఇదీనూ.     
       
దర్శకుడన్నట్టు
,
ప్రతిసారీ గోదావరి జిల్లాల్ని కనువిందుగా చూపించలేదు. అప్పుడు కూడా గ్రామ కక్షలతో కొట్టుకోవడం చూపించారు. కాబట్టి తానేదో మొదటి సారిగా చూపించడం లేదు. 2023 లో శ్రీకాంత్ అడ్డాల తీసిన పెదకాపు కూడా ఇలాటి గోదావరి జిల్లా యాక్షన్ కథనే గజిబిజి గందరగోళంగా తీసి అట్టర్ ఫ్లాప్ చేశాడు.  

నటనలు –సాంకేతికాలు

విశ్వక్ సేన్ వూర మాస్ పాత్ర వేశాడు. మధ్యలో ఎమ్మెల్యేగా మారినా తేడా లేకుండా అదే వూర మాస్ గా నటించుకుపోయాడు. క్యారక్టర్ ఆర్క్ అనేది లేకుండా పదిహేనేళ్ళ పాత్ర జర్నీని ఎత్తు పల్లాల్లేకుండా, భావోద్వేగాల్లేకుండా ఫ్లాట్ గా, రొడ్డ కొట్టుడుగా చేసుకుపోయాడు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఆ పదవిలోనే కొనసాగక, మధ్యలో పదవి పోగొట్టుకుని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం, కొట్లాడుకుని ఓ పది సార్లు జైలు కెళ్ళడం, అయిదారుసార్లు ఆస్పత్రికెళ్ళడం, ఒకర్ని కన్నాక మళ్ళీ ఇంకోసారి ఇంకో పిల్లని కనడం, ఇలా చేసిందే చేస్తూ అక్కడక్కడే తిరుగుతూంటాడు తప్ప ముందు కెళ్ళే  కథా నాయకత్వమే లేదు. ఓ సమస్య, దాని పరిష్కారం కోసం ఓ లక్ష్యం వుంటేగా?  పాటలు, ఫైట్లు బాగా చేశాడు, ఫస్టాఫ్ లో లారీ మీద యాక్షన్ సీను ఎక్సైటింగ్ గా వుంది.
       
హీరోయిన్లు నేహాశెట్టి
, అంజలి ఇద్దరికీ పాత్రలు అంతంత మాత్రం. ప్రభావం చూపరు. విలన్లుగా నాజర్, గోపరాజు రమణలవి ఫార్ములా పాత్రలు, నటనలు. హీరో వెంట వుండే హైపర్ ఆది రెండు మూడు చోట్ల కామెడీ డైలాగులు విసురుతాడు.
       
సాంకేతికంగా ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతంలో మూడు పాటల్లో మొదటి రోమాంటిక్ పాట
, దాని చిత్రీకరణా బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ అనొచ్చు. అలాగే అనిల్ మాదాడి ఛాయాగ్రహణం టాప్ రేంజిలో వుంది. ఇందులో పచ్చటి పంట పొలాలు కనపడవు, ఎర్రటి రక్తాలు కనపడతాయి. యాక్షన్ సీన్స్, కళాదర్శకత్వం చెప్పుకోదగ్గవి. కానీ దర్శకుడి చేతిలో విషయపరంగా సినిమా చెప్పుకో దగ్గది కాదు.

—సికిందర్


1432 : స్పెషల్ ఆర్టికల్

 

  హాలీవుడ్ బాక్సాఫీసు స్థితిని చూస్తే 2024 ప్రత్యేక సంవత్సరం. జనవరి ఒకటి నుంచి ఈ రోజు మే 22 వరకు మొత్తం 176 హాలీవుడ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో 10 బ్లాక్ బస్టర్లున్నాయి. ఇది హాలీవుడ్ మనుగడకి సరిపోతుందా? 2020-21 కోవిడ్ మహమ్మారి- లాక్ డౌన్ ల తర్వాత మొదటిసారిగా అమెరికాలో సినిమా టిక్కెట్ల అమ్మకాలు 9 బిలియన్ డాలర్లకి చేరుకున్న స్థితి 2023 లో కన్పించింది. కోవిడ్ పూర్వ స్థితిని బట్టి చూస్తే ఇది తక్కువే. కాబట్టి హాలీవుడ్‌ బాక్సాఫీసుని కోవిడ్ పూర్వ స్థితికి చేర్చాలంటే ఏం చేయాలి? హాలీవుడ్ జర్నలిస్టు రేయాన్ స్కాట్ దీనికి సమాధానం చెప్పాడు. బాధ్యత పూర్తిగా ప్రేక్షకుల మీద వుంచాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రేక్షకులు సినిమాలు ఎక్కువగా చూడాలని చెప్పడమే!

        మెరికా బాక్సాఫీసుని కోవిడ్ పూర్వ స్థాయికి తిరిగి రావడానికి సగటు వ్యక్తి సంవత్సరానికి ఇన్ని సినిమాలు థియేట్రికల్‌గా చూడాలని రికమెండ్ చేసే గణితానికి సంబంధించిన ఆసక్తికర విశ్లేషణ ఇది. ప్రస్తుతం మన దేశంలో వున్న పరిస్థితికి కూడా దీన్ని వర్తింపజేసుకోవచ్చు. టాలీవుడ్ నిలబడాలంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు యేటా ఎన్ని సినిమాలు థియేటర్లకి వెళ్ళి విధిగా చూడాలన్నది. హాలీవుడ్ కి సంబంధించి, 2009 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం అధిగమిస్తూ వచ్చిన 10 బిలియన్ డాలర్ల బాక్సాఫీసుని లక్ష్యంగా పెట్టుకుని 2024 ని చూడాలి.
       
ప్రస్తుత అమెరికా జనాభా లెక్కల ప్రకారం
, అక్కడ 336.4 మిలియన్ల (33 కోట్ల 64 లక్షలు) మంది ప్రజలు నివసిస్తున్నారు. స్టాటిస్టా ప్రకారం 2022 నాటికి అమెరికాలో  82% మంది వ్యక్తులు కనీసం కొన్నిసార్లు సినిమాలకి వెళ్తున్నారు. జర్మనీకి చెందిన
స్టాటిస్టా అనేది 170 వివిధ రణగాల్లోని  80, 000 కంటే ఎక్కువ అంశాలపై గణాంకాలు, నివేదికలు, అంతర్దృష్టులతో కూడిన సమాచారాన్ని అందించే గ్లోబల్ డేటా - బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్. ఇది మన దేశపు బాక్సాఫీసు గణాంకాల్ని కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూంటుంది.
       
స్టాటిస్టా చెప్పిన 2022 నాటికి అమెరికాలో కనీసం కొన్నిసార్లు సినిమాలకి వెళ్తున్న వ్యక్తుల శాతాన్ని సౌలభ్యం కోసం 80% అనుకుంటే
, ఇది  దాదాపు 269 మిలియన్ల (26 కోట్ల తొమ్మిది లక్షలు) మంది ప్రేక్షకుల సంఖ్యని సూచిస్తుంది. అమెరికాలో సినిమా టిక్కెట్ ప్రస్తుత సగటు ధర 10.78 డాలర్లుగా వుంది.  కాబట్టి, సగటు వ్యక్తి సంవత్సరానికి ఎన్ని సినిమాలు చూడాలి?
       
సగటు టిక్కెట్ ధర 10.78 డాలర్లని
, 10 బిలియన్ డాలర్ల బాక్సాఫీసు టార్గెట్ తో భాగిస్తే 927,643,785 టిక్కెట్లని విక్రయించాల్సి వుంటుంది. దీన్ని జనాభాలో 80% ప్రేక్షకుల సంఖ్యతో భాగిస్తే, ఒక్కొక్కరికి సంవత్సరానికి 3.44 టిక్కెట్‌లకి చేరుకుంటుంది. దీన్ని 4 టికెట్లుగా రౌండప్ చేస్తే, హాలీవుడ్ ని సేఫ్ జోన్ లో వుంచడానికి సగటు వ్యక్తి సంవత్సరానికి మూడు లేదా నాలుగు సినిమాలు విధిగా థియేటర్లలో చూడవలసి వుంటుంది. సంవత్సరానికి మూడు నాల్గు సినిమాలు చూడ్డం సమస్యే కాకూడదు. అవుతోందంటే ఈ మాత్రం కూడా ప్రతీ సగటు వ్యక్తి సినిమాలు చూడడం లేదన్న మాట.
       
సినిమా చూడడం అనేది సగటు వ్యక్తికి సాధారణ అభిరుచి
, అలవాటు. దురదృష్టవశాత్తూ, ఓటీటీ స్ట్రీమింగులు రావడంతో కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చిన కొద్ది వారాలకే ఓటీటీల్లో ఇంటింటి పండుగగా మారడాన్ని నిర్మాతలు అనుమతించడం, కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు బాక్సాఫీసుని దెబ్బ దీసుకోవడమే.
       
నిజం చెప్పాలంటే
, సంవత్సరానికి 10 బిలియన్ డాలర్ల హాలీవుడ్ బాక్సాఫీసు టార్గెట్ అనేది అత్యాశేమీ కాదు. 11.3 బిలియన్ డాలర్లకి చేరుకున్న 2019 సంవత్సరం వుండనే వుంది. మరిన్ని సినిమాలు చూడమని ప్రేక్షకుల్ని అభ్యర్ధించడం కూడా అన్యాయం కాదు. సంవత్సరానికి మూడు నాల్గు సినిమాలే థియేటర్లకి వెళ్ళి చూడమనడం. అంటే నెలకు 0.25 నుంచి 0.33 సినిమా మాత్రమే. ఇంతకంటే హీనంగా అడుక్కోవడమేముంటుంది?
       
అయినా దీన్ని ఖాతరు చేస్తారా ప్రేక్షకులు
? హాలీవుడ్ తో బాటు థియేటర్ చైన్‌లు ఈ సమస్యని పరిష్కరించాలి. నీర్మాతలు తమ సినిమాలతో ప్రేక్షకుల సమయాన్ని వృధా చేయబోమని భరోసా ఇస్తూ నాణ్యమైన సినిమాలందించాలి. ఐమాక్స్, 4 డీఎక్స్, డ్రైవ్ ఇన్ వంటి ప్రీమియం థియేటర్ల సంఖ్యని పెంచుకుంటూ పోవడం కాదు, వాటిలో ప్రదర్శించే సినిమాలు కూడా ప్రీమియం సినిమాలుగా వుండాలి. రాబోయే సంవత్సరాల్లో థియేట్రికల్ సినిమా వ్యాపారం మారు మూల ప్రాంతాల్లో కూడా ఆరోగ్యంగా వుండాలంటే ఇది తప్పక దృష్టి పెట్టాల్సిన ముఖ్యాంశం.

***


Thursday, May 30, 2024

1432 : హాలీవుడ్ రివ్యూ

 

దర్శకత్వం : మైకేల్ షో వాల్టర్
తారాగణం : ఏన్ హాత్వే, నికోలస్ గాలిట్జీన్, ఎల్లా రుబీన్, రీడ్ స్కాట్ తదితరులు
రచన : మైకేల్ షో వాల్టర్, జెన్నిఫర్ వెస్ట్ ఫెల్ట్
సంగీతం : సిద్ధార్థ ఖోస్లా, ఛాయాగ్రహణం : జిమ్ ఫ్రొహ్నా 
బ్యానర్స్ : అమెజాన్ - ఎంజీఎం స్టూడియోస్
విడుదల : మే 2, 2024 (అమెజాన్ ప్రైమ్)
***

        మెరికన్ రోమాంటిక్ డ్రామా ది ఐడియా ఆఫ్ యూ మార్చిలో విడుదలైంది. అక్కడ్నుంచి మే 2 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2001 నుంచీ 10 రోమాంటిక్ సినిమాలు తీసిన మైకేల్ షో వాల్టర్ దీని దర్శకుడు. 2014 నుంచి 14 సినిమాలు  నటించిన బ్రిటిష్ నటుడు నికోలస్ గాలిట్జీన్ ఇందులో హీరో. 2001 నుంచి 45 సినిమాలు నటించిన అమెరికన్ నటి ఏన్ హాత్వే హీరోయిన్. న్యూయార్క్ లో గోల్డ్ స్పాట్ బ్యాండ్ తో ప్రసిద్ధి చెందిన సిద్ధార్థ ఖోస్లా సంగీత దర్శకుడు. రచయిత్రి రాబిన్ లీ ఇదే పేరుతో రాసిన హిట్ నవల ఈ సినిమా కాధారం. అయితే ఈ సినిమా చూసి తీవ్ర అసంతృప్తి చెందిన రాబిన్ లీ చేసిన వ్యాఖ్యలేమిటి? తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రోమాంటిక్ డ్రామా కథేమిటి? కొత్తగా చెప్తున్నదేమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ

లాస్ ఏంజిలిస్ లో సోలెన్ మర్చండ్ (ఏన్ హాత్వే) విజయవంతంగా ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్న నడివయస్కురాలు. 40 ఏళ్ళ ఆమెకి 16 ఏళ్ళ కూతురు ఇజ్జీ (ఎల్లా రుబీన్) వుంటుంది. సోలెన్ భర్త డానియేల్ (రీడ్ స్కాట్) నుంచి విడాకులు తీసుకుంది అతను వేరే వ్యవహారం నడపడంతో. అయితే అతను వచ్చి పలకరించి పోతూనే వుంటాడు. ఒక రోజు అతను కూతురు ఇజ్జీనీ, ఆమె ఫ్రెండ్స్ నీ మ్యూజిక్ ఫెస్టివల్ కి తీసుకుపోతూంటే, మధ్యలో ఆఫీసు నుంచి అర్జెంట్ కాల్ రావడంతో, వీళ్ళని తీసికెళ్ళమని సోలెన్ ని కోరతాడు. సోలెన్ వాళ్ళని తీసుకుని మ్యూజిక్ ఫెస్టివల్ కి వెళ్తుంది. అక్కడ బాత్రూమ్ కోసం వెతికి ఆగి వున్న వ్యాను బాత్రూమ్ అనుకుని ఎక్కేస్తుంది. అది బాత్రూమ్ కాదు, పాపులర్ సింగర్ హేస్ క్యాంప్ బెల్ పర్సనల్ వ్యాన్. ఆగస్ట్ మూన్ అనే బ్యాండ్ అతను నడుపుతున్నాడు.
       
వ్యానులో ఈ అనుకోని పరిచయం ఇద్దరి మధ్యా రిలేషన్ షిప్ కి దారితీస్తుంది. మొదట తన కన్నా 16 ఏళ్ళు చిన్నవాడైన హేస్ తో ప్రేమాయణం మనస్కరించక పోయినా క్రమంగా అతడ్ని అంగీకరిస్తుంది. ఇద్దరి
మధ్య ప్రేమ మెల్లగా పెరగడం మొదలైన తర్వాత ఒకటొకటే అర్ధమవుతాయామెకి. కలిసి వుండాల్సిన అవసరం, ఒకరినొకరు మిస్సవడం, బలంగానూ పచ్చిగానూ అనుభవమవుతున్న ప్రేమ -ఇదంతా ఎంతో కాలం నిలబడవని అర్ధమై పోతుంది. ఈ ఏజ్ గ్యాప్ రోమాన్సుకి ఈ డిజిటల్ యుగంలో వున్న భద్రత ఎంతో, సెలబ్రిటీతో జీవితం, అందులోనూ నిత్యం ప్రపంచ కళ్ళల్లో పడుతూ ఇబ్బంది పెట్టే తన నడి వయసుతో పడే బాధ ఏమిటో - ఇవన్నీ కలిసి సంఘర్షణకి గురి చేస్తాయి. అంతేగాక కూతురి ప్రశ్నలు, మాజీభర్త హెచ్చరికలు- ఇవి కూడా తోడై ఇక్కడ్నుంచి అతడితో తెగతెంపులు, మళ్ళీ అతికింపులు, మళ్ళీ తెగతెంపులు... ఇలా తయారవుతుంది జీవితం. చివరికి ఈ ప్రేమ ఏ తీరానికి చేరుకుంది? ఇద్దరూ ఒకటయ్యారా, విడిపోయారా? ముగింపేమిటి? ఇవీ మిగతా కథలో...

హాలీవుడ్ ముగింపే!
ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలని  బాధపెడుతున్న వొత్తిళ్ళు-  నిరంతరం యవ్వనంగా, పరిపూర్ణంగా కనిపించాలని సమాజం, మీడియా కలిసి పెంచుతున్న వొత్తిడి... స్త్రీలు ఎలా ప్రవర్తించాలి, ఎవరితో డేటింగ్ చేయాలి, ఎలాంటి దుస్తులు ధరించాలీ వంటి విషయాలపై నిరంతర తీర్పులు, రన్నింగ్ కామెంటరీలు- ఇవి హేస్ -సోలెన్ ప్రేమ కథలో చూస్తాం.
       
ఈ కథలో తన కంటే బాగా చిన్న వాడితో డేటింగ్
చేయడాన్ని ప్రశ్నించే సమాజం ఇంకా వుండడం చోద్యంగానే వుంటుంది. వయసులో తేడా ప్రపంచానికి కనిపిస్తోంది గానీ వాళ్ళిద్దరికీ కాదు. అయితే అతను సెలబ్రిటీ. ఇక్కడొచ్చింది చిక్కు. కూతురు, భర్త, విడాకులు, వయస్సూ ... ఇలా ఇన్ని అధైర్యాలు తన కుండగా, అతను సెలబ్రిటీ కూడా కావడంతో మీడియా ఫోకస్ ని తట్టుకోలేక, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని జయించలేక, అతడితో లవ్ -హేట్ రిలేషన్ షిప్  అనే చట్రంలో ఇరుక్కుని ఏం చేసిందనేది ఇక్కడ ముఖ్యమైన పాయింటు.
       
అయితే ఇదే పేరుతో నవల రాసిన రచయిత్రి రాబిన్ లీ ఈ కథని తను ట్రాజడీగా ముగిస్తే
, సినిమా తీసి సుఖాంతం చేయడాన్ని తప్పుబట్టింది. ఈ సినిమా వాళ్ళు ఇంతే- కథలు సుఖాంతమైతేనే కమర్షియల్ గా సక్సెస్ అవుతాయని నమ్ముతారని ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. హాలీవుడ్ వాళ్ళు ఇలా చేయగా లేనిది తెలుగు సినిమాల్లో చేస్తే తప్పేమిటి? దీన్నే తెలుగులో తీస్తే పెళ్ళి చేసి, శోభనం పెట్టి, బ్యాక్ గ్రౌండ్ లో కెవ్వుమని పుట్టిన పిల్లాడి కేక విన్పిస్తేనే పరిపూర్ణమైన ముగింపు అవుతుందన్నట్టు. సోలెన్ లాంటి హీరోయిన్ పాత్ర ఎలా కిల్ అయినా ఫర్వాలేదు- సమాజం ఆడదాన్ని ఒంటరిగా వదలదు కాబట్టి- పెళ్ళి చేసి మెడకో డోలు కడుతుంది కాబట్టీ!!
        
ఈ నవల మీద వచ్చిన పాఠకుల అభిప్రాయాలూ చూస్తే- కొన్ని రోజుల వరకూ దీని ప్రభావం నుంచి తేరుకోలేక పోయామని రివ్యూలు రాశారు పాఠకులు!
—సికిందర్