రచన -దర్శకత్వం : అభినవ్
సుందర్ నాయక్
తారాగణం : వినీత్ శ్రీనివాసన్, ఆర్ష చాందినీ బైజు, తన్వీ రామ్, సూరజ్ వెంజర మూడు తదితరులు
సంగీతం : శిబి మాథ్యూ అలెక్స్, ఛాయాగ్రహణం : విశ్వజిత్ ఒడుక్కతిల్
బ్యానర్ : జాయ్ మూవీ ప్రొడక్షన్స్
నిర్మాత : అజిత్ జాయ్
***
డిస్నీ + హాట్
స్టార్ లో జనవరి 13 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ‘ముకుందన్ ఉన్ని
అసోసియేట్స్’ మలయాళంలో థియేట్రికల్ గానూ హిట్టయ్యింది. దేశవ్యాప్తంగా
మంచి పేరు తెచ్చుకుంది. కన్నడలో సైతం భారీ యాక్షన్ పానిండియా సినిమాలు తీస్తూంటే, మలయాళం నుంచి వాటి పంథాలో అవి
నేటివిటీకి దగ్గరలో సహజత్వంతో కూడిన సినిమాలు వస్తున్నాయి. ఇదే పంథాలో కొనసాగుతూ ‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’ ఎందుకని అంత పేరు
తెచ్చుకుంటోందో ఒకసారి పరిశీలిద్దాం...
కథ
వాయనాడ్ లో ముకుందన్ ఉన్ని (వినీత్ శ్రీనివాసన్) లాయర్ గా స్ట్రగుల్ చేస్తూంటాడు. కేసుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. బాగా సంపన్నుడిగా స్థిరపడాలన్న కోరిక నెరవేరడం లేదు. అందుకు సంవత్సరాలుగా చాలా క్రమశిక్షణతో కూడిన నిర్మాణాత్మక జీవితం గడిపాడు. ఒక రోజు తల్లి నిచ్చెన మీంచి పడిపోవడంతో కాలు విరుగుతుంది. శస్త్రచికిత్సకి డబ్బుండదు. యాక్సిడెంట్ కేసులు చూసే అడ్వొకేట్ వేణు (సూరజ్ వెంజర మూడు) ముకుందన్ కేసుని రోడ్డు ప్రమాదం కేసుగా మార్చి ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పిస్తాడు. దీంతో ముకుందన్ తల్లికి శస్త్ర చికిత్స చేయిస్తాడు. హాస్పిటల్ రిసెప్షనిస్టు మీనాక్షి (ఆర్ష చాందినీ బైజు) ని ప్రేమిస్తాడు. ఇదే సమయంలో వైద్య బీమా క్లెయిమ్‌ల ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చో తెలుసుకుంటాడు.
ఇక వేణు చేసే పని తను కూడా చేయడం మొదలుపెడతాడు. దీంతో ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ఇలా కాదని వేణు
ముకుందన్‌కి హాస్పిటల్‌లో సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఆఫర్ ఇస్తాడు. ముకుందన్ తిరస్కరిస్తాడు. ఆ
కాంట్రాక్టు వేణు చేపడతాడు. చేపట్టి హాస్పిటల్లో తనకి కాబోయే క్లయంట్స్ దగ్గరికి
రాకుండా ముకుందన్ ని అడ్డుకుంటాడు. దీంతో ముకుందన్ వేణు కారులో నాగుపాము పెట్టడంతో వేణు చచ్చిపోతాడు.
ఇప్పుడు ముకుందన్ అనుకున్న స్థాయికి ఎలా
ఎదిగాడు? ఫేక్
యాక్సిడెంట్ కేసులతో ఇంకెన్ని అక్రమాలు చేశాడు? అతడికి
అడ్డొచ్చిన జడ్జి సైతం ఏమైపోయాడు? బ్లాక్ మెయిల్ చేసిన
అసోసియేట్ కేం గతి పట్టింది? ‘ముకుందన్
ఉన్ని అసోసియేట్స్’ అని లా ఆఫీసు తెరిచిన ముకుందన్, యాక్సిడెంట్ కేసులు వచ్చే హాస్పిటల్ కి కూడా ఓనరై పోయి మొత్తం దందా ఎలా గుప్పెట్లోకి
తెచ్చుకున్నాడన్నది మిగతా కథ.
నకిలీ ఇన్సూరెన్స్ క్లెయిములు దందాగా
చేసుకుని కోట్లు ఆర్జించే లాయర్ కథ ఇది. ఇలాటి లాయర్లకి కొదవలేదు. గత అక్టోబర్
లోనే సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్
క్రింద నకిలీ క్లెయిముల
స్కాములు చేసిన 30 మంది న్యాయవాదుల లైసెన్సుల్ని రద్దు చేసింది. ఈ లాయర్లు నకిలీ మోటారు యాక్సిడెంట్ క్లెయిములతో బీమా కంపెనీలకి కోట్లాది రూపాయల నష్టం కల్గించారు. మీరట్, బరేలీ, షాజహాన్‌పూర్‌ల నుంచి ఎక్కువ కేసులు నమోదు చేశారు.
అలాగే ఈ సినిమాలో కేరళలో ఎక్కువ రోడ్డు
ప్రమాదాలు జరిగే వాయనాడ్ ని కేంద్రంగా చేసుకుని కథ నడుస్తుంది. ఇందులో లాయర్ ముకుందన్
ఉన్ని దారుణంగా, ఏ
మాత్రం పశ్చాత్తాపం లేకుండా, చదరంగపు పావులు కదిపినట్టు షాకింగ్ గా
ఆపరేట్ చేస్తాడు తన ఉన్నతి కోసం. మంచితనం, మానవత్వం అనేవి
లేని జీరో ఫీలింగ్స్ తో పరిస్థితుల్ని సొమ్ము చేసుకుంటాడు. మనుషులు తాము ఎదగకుండా
తన ఎదుగుదలకి మాత్రమే ఉపయోగపడాలన్న- టాప్ పొజిషన్ లో తనొక్కడే వుండాలన్న, ఉపయోగ పడ్డాక నాశనమై పోవాలన్న క్రూర మనస్తత్వంతో వుండే పాత్ర కథ.
ఇందులో నీతి గురించీ, పరివర్తన గురించీ వుండదు. అలా ముగియదు. శిక్షకూడా వుండదు. పైకి మెత్తగా
వుంటూ లోపల కుత్తుకలు కోసే ఆలోచనలతో వుండే సీరియల్ కిల్లర్ మనస్తత్వ అధ్యయనంగా ఈ
కథ వుంటుంది. సీరియల్ కిల్లర్ మానసిక కారణాలతో హత్యలు చేస్తాడు. ఈ కథలో హీరో
సంపన్నుడవడానికి దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. కథొక్కటే గాకుండా కథతో బాటే పాత్రా
ఆందోళన పరుస్తాయి. ఈ ఒక్క పాత్రే కాదు, కథలో ఏ పాత్రా నీతితో
వుండదు. స్వార్ధం కోసం పనిచేసే పాత్రలే. కథానాయకుడి పాత్ర మనసులో చీకటి కోణాల
ఆవిష్కరణ ఈ కథ.
ముకుందన్ ఉన్ని క్యారక్టర్ స్టడీ ఈ కథయితే, ఈ క్యారక్టర్ నటించిన వినీత్ శ్రీనివాసన్ అతికినట్టు సరిపోయాడు. ముఖం మీద
ఏ భావాలూ పలికించడు. ఒకరు చస్తూంటే మాత్రం చిరునవ్వుతో చూస్తాడు. లోపలి భావాల్ని
స్వగతంతో వెల్లడిస్తాడు. చేసే క్రూరమైన పనులకి డార్క్ హ్యూమర్ తో, క్రూడ్ జోకులతో ఆ భావాలుంటాయి.
అతడ్ని చూస్తే నవ్వూ కోపం రెండూ వస్తాయి. తను క్రిమినల్ అనీ,
కిల్లర్ అనీ ఎవరికీ అనుమానం రాకుండా కూల్ గా బిహేవ్ చేసే నటన అతడి ప్రతిభకి
తార్కాణంగా చెప్పుకోవచ్చు.
ఒక ఫోర్జరీ కేసులో కోర్టు విచారణ
పరిస్థితి ఎదురైనప్పుడు ఆత్మహత్యకి ప్రయత్నిస్తాడు. ప్రతిష్టకి భంగం కలుగుతుందని
కాదు, జైలుకి పోతే సంపన్నుడయ్యే మార్గముండదని మనం అర్ధం
జేసుకోవాలి. అతడికి ప్రతి దాంట్లో సంపన్నుడయ్యే కోరికే వుంటుంది. వినీత్
శ్రీనివాసన్ జంటిల్ మాన్ లా కన్పించే ఈ నెగెటివ్- యాంటీ హీరో పాత్రని చాలా నీటుగా
పోషించాడు.
అతడి భార్య పాత్రలో ఆర్ష చాందినీ, అడ్వొకేట్ వేణుగా సూరజ్ వెంజరమూడు, అసోషియేట్ గా
సుధీ కొప్పా, ఇంకా ఇతర పాత్రల్లో ప్రతి వొక్కరూ ఈ
రియలిస్టిక్ జానర్ కి సహజ నటనతో మూడ్ ని క్రియేట్ చేశారు.
విశ్వజిత్ ఛాయాగ్రహణం ఒక హైలైట్. తక్కువ లైటింగ్ తో,
కూల్ కలర్స్ తో రియలిస్టిక్ దృశ్యాల సృష్టి చేశాడు. నిజానికి మలయాళం సినిమాలిలాగే
వుంటాయి. కేరళ నేటివిటీకి ఈ కలర్- లైటింగ్ స్కీమ్ ని సెట్ చేసుకున్నారు. సిబి మాథ్యూ సంగీతం న్యూవేవ్
ధోరణులతో వుంది. కొత్త దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్ విషయపరంగా, మేకింగ్ పరంగా ఉన్నత
ప్రమాణాలతో కూడిన ప్రయత్నం చేశాడు.
చివరికేమిటి
దీన్ని
తెలుగులో రీమేక్ చేస్తారేమో, చేతులు కాలుతాయి. ‘బుట్టబొమ్మ’ తో కాల్చుకున్నారు. మలయాళం సినిమాల జోలికి
పోకుండా తెలుగులో అవే రొటీన్ మూస తీసుకోవడం మంచిది. ఈ మధ్య ఒక స్క్రిప్టు పరిశీలన కొచ్చింది.
వొరిజినల్ కథతో చాలా సింపుల్ గా బలంగా కొత్తగా వుంది. మన దగ్గర టాలెంటున్న మేకర్లు
లేరని కాదు- టాలెంటున్న నిర్మాతలే లేరు. చేతులు కాల్చుకునే పాత మూస నిర్మాతలే ఇంకా
రాజ్యమేలుతున్నారు. ఆ మూసలో మలయాళం సినిమాల్ని తెలుగులోకి తెచ్చుకుని భస్మీ పటలం చేయాల్సిన
అవసరం లేదు. తెలుగు మూసలకే పటం కట్టుకుని వేలాడదీసుకుంటే సరిపోతుంది.
—సికిందర్