రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, January 16, 2023

1285 : రివ్యూ!


 

రచన -దర్శకత్వం : ఆస్మాన్ భరద్వాజ్
తారాగణం : టబు, అర్జున్ కపూర్, కొంకణా సేన్ శర్మ, నసీరుద్దీన్ షా, రాధికా మదన్, కుముద్ మిశ్రా, శార్దూల్ భరద్వాజ్ తదితరులు
పాటలు : గుల్జార్, ఫైజ్ అహ్మద్ ఫైజ్; సంగీతం : విశాల్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : ఫర్హాద్ అహ్మద్ డెహ్ల్వి
బ్యానర్స్ : లవ్ ఫిల్మ్స్, టీ- సిరీస్ ఫిల్మ్స్, విశాల్ భరద్వాజ్ ఫిల్మ్స్
నిర్మాతలు : విశాల్ భరద్వాజ్, లవ్ రంజన్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్
విడుదల : జనవరి 13, 2023

        విశాల్ భరద్వాజ్ కుమారుడు ఆస్మాన్ భరద్వాజ్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ తన తరహా థ్రిల్లర్ తీయించాడు. విదేశాల్లో శిక్షణ పొంది వచ్చిన ఆస్మాన్ భరద్వాజ్ క్వెంటిన్ టరాంటినో, కోయెన్ బ్రదర్స్, గై రిచీలని ఫాలో అవుతూ కుత్తే (కుక్కలు) మేకింగ్ చేశాడు. ఈ కుక్కలకి ఒకే బొక్క (ఎముక) కావాలి. దానికోసం కాల్చి చంపుకుంటారు. చివరికి ఏ కుక్కకి బొక్క దొరికిందన్నది కథ. ఆ కుక్కలు గడ్డితినే పోలీసులు, డ్రగ్ స్మగ్లర్లు, నక్సల్స్.  ఆ బొక్క ఏటీఎం వ్యానులో నోట్ల కట్టలు. ముంబాయి శివారులో రాత్రి పూట వేట.

         మగ కుక్కల మధ్య ఓ ఖతర్నాక్ ఆడ కుక్క వుంటుంది టబు రూపంలో. ఇది ప్రధానంగా టబు సినిమా. క్వెంటిన్ టరాంటినో రిజర్వాయర్ డాగ్స్ తరహా పాత్రలు, కోయెన్ బ్రదర్స్ శైలి నోయర్ మేకింగ్, గై రిచీ టైపు డార్క్ కామెడీ కలగలిపి ఓ దేశీ హాలీవుడ్ ని సింగారించాడు కొత్త దర్శకుడు.
        
ఈ కథ మూడు చాప్టర్లుగా వుంటుంది. ఫస్టాఫ్ లో రెండు, సెకండాఫ్ లో ఒకటి. ఈ మూడు చాప్టర్లకి ప్రారంభంలో నాంది వుంటుంది. చాప్టర్ల తర్వాత ఉపసంహారం వుంటుంది. అసలు కథ సెకండాఫ్ లో మొదలవుతుంది. కుక్కల మీద మార్క్సిస్టు కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన యే గలియోమే ఆవారా బేకార్ కుత్తే గీతంతో బాటు, గుల్జార్ రాసిన ఆజాదీ సాంగ్ తో ఈ సినిమా ఏ నేపథ్యంలో ఐడియాలజీ చెప్తోందో అర్ధం జేసుకోవచ్చు. ఇదంతా ఎలా మొదలవుతుందంటే...

నాంది – లక్ష్మీ బాంబు

2003 లో నక్సలైట్ నాయకురాలు లక్ష్మీశర్మ (కొంకణా సేన్ శర్మ) మహారాష్ట్ర లోని  గడ్చిరోలీలో ఒక ఠాణాలో బందీ అయి వుంటుంది. పోలీసు హింసని భరిస్తుంది. తెల్లారే నక్సల్ దళం ఠాణామీద దాడి చేసి ఆమెని విడిపించుకు పోతారు. పోతూ లక్ష్మీశర్మ ఒక అధికారి చేతిలో బాంబు పెట్టి, అతడికి తర్వాత పనికొచ్చే ముక్క చెప్పి పోతుంది.

మొదటి చాప్టర్ – సబ్ కా మాలిక్ ఏక్ హై
        పదమూడేళ్ళ తర్వాత 2016 లో-  ముంబాయిలో భయంకర డాన్ నారాయణ్ ఖోబ్రే (నసీరుద్దీన్ షా) ఎదుట ఇద్దరు పోలీసు అధికారులు గోపాల్ (అర్జున్ కపూర్), పాజీ (కుముద్ మిశ్రా) వుంటారు. వీల్ చైర్ లో వున్న భయంకర డాన్ నారాయణ్ ఖోబ్రే, అసలు డ్రగ్ డీలర్ సూర్తితో మీరెందుకు రిలేషన్ పెట్టుకున్నారురా?’ అని అడుగుతాడు. వాడిని ఖతం చేయమని ఆర్డరేస్తాడు. గోపాల్, పాజీలు సూర్తిని చంపి అతడి దగ్గరున్న కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకుని పారిపోవాలని ప్లానేస్తారు.
       
అలా సూర్తిని చంపామనుకుని డ్రగ్స్ తీసుకుని పారిపోతూ సూర్తి అందించిన సమాచారంతో పోలీసులకి దొరికిపోతారు. తమ సీనియర్ రాజీవ్ మిశ్రా (దర్శకుడు ఆస్మాన్ భరద్వాజ్) కి తాము కోవర్ట్ ఆపరేషన్ చేశామని బొంకుతారు. అబద్ధాలు చెల్లవని రాజీవ్ ఇద్దర్నీ సస్పెండ్ చేస్తాడు. విధిలేక ఇద్దరూ ఇన్‌స్పెక్టర్ పమ్మీ(టబు) దగ్గరి కెళ్ళి సాయం కోరుతారు.

రెండో చాప్టర్ - ఆతా క్యా కెనడా

సాయం అడిగిన ఇద్దరికీ కోటి రూపాయలిస్తే సస్పెన్షన్లు ఎత్తివేయిస్తానని చెప్తుంది ఇన్స్ పెక్టర్ పమ్మీ. ఇంతలో పమ్మీ పాత కొలీగ్ హేరీ (ఆశీష్ విద్యార్థి) వస్తాడు. ఇతనిప్పుడు ముంబాయి, నవీ ముంబాయిలలో ఏటీఎంలకి డబ్బు సరఫరా చేసే వ్యానుకి సెక్యూరిటీగా వుంటున్నాడు. ప్రతి రాత్రి వ్యాన్‌లో  4 కోట్ల డబ్బు సరఫరా అవుతుందని చెప్తాడు. దీంతో గోపాల్ టెంప్ట్ అవుతాడు. ఇక వ్యాను పని బట్టాలని ప్లానేస్తాడు షాజీతో కలిసి.
        
పోలీసుల్లో తనలాంటి డర్టీ డాగ్స్ ని పోగేసి ఒక నకిలీ చెక్ పోస్టు ఏర్పాటు చేస్తాడు. డర్టీ డాగ్స్ ని కనిపెట్టిన హేరీ, నకిలీ చెక్ పోస్టుదగ్గర పిచ్చి కుక్కల్ని చంపినట్టు కాల్చి చంపుతాడు. తెలివైన కుక్క గోపాల్ అంత త్వరగా చావక ఏటీఎం వ్యానుతో ఉడాయిస్తాడు. ఈ వ్యాను కోసమే వేర్వేరు ప్లానులు వేసుకున్న భయంకర డాన్ నారాయణ్ ఖోబ్రే కూతురు లవ్లీ ఖోబ్రే (రాధికా మదన్), ఆమె బాయ్ ఫ్రెండ్;  నక్సల్ లక్ష్మీ శర్మా వచ్చి పడతారు.
        
పై రెండు చాప్టర్ల పేర్లు సబ్ కా మాలిక్ ఏక్ హై, ఆతా క్యా కెనడాల తర్వాత ఇక మూడో చాప్టర్ మూంగ్ కీ దాల్ (పెసర పప్పు) లో మిగతా కథ చూడొచ్చు. ఈ కథలో డబ్బు వేటలో డబ్బు చివరికి ఎవరికి చేజిక్కిందనేది క్రూరమైన ఆటగా వుంటుంది. ఈ ఆటలో ఇన్స్ పెక్టర్ పమ్మీ డామినేటింగ్ పాత్ర ఏంటో తెలుస్తుంది.

అనైతిక పాత్రలు -అద్భుత నటనలు

తండ్రి విశాల్ భరద్వాజ్ తో కలిసి ఆస్మాన్ భరద్వాజ్ తయారు చేసిన స్క్రిప్టు డార్క్ కామెడీకి ఎక్స్- రేట్ పంచ్ లతో వుంది. పైవాడు ఆడంగి వెధవల్ని తయారు చేయడం మానేశాడు. ఇప్పుడు చిన్నవెర్రి పువ్వు (బూతు), పెద్ద వెర్రి పువ్వు (బూతు), మహా వెర్రి పువ్వుల్ని (బూతు) తయారు చేసి పంపుతున్నాడు' - టబు డైలాగు. న్యాయానికి రోజులు కావు. నీ...(బూతు) అందరికందరూ కుక్క నా కొడుకులే -అర్జున్ కపూర్  డైలాగు. మార్కెట్లో నా వేల్యూ కంటే వాడి వేల్యూ ఎందుకు తక్కువ (బూతు) రా?'- నసీరుద్దీన్ షా డైలాగు. విశాల్ భరద్వాజ్ రాసిన డైలాగులు గత సినిమాలకంటే మితిమీరిన డైరెక్టు తిట్లతో వున్నాయి.  
        
అయితే నటనలు ఖతర్నాక్ గా వున్నాయి. ఓవరాక్షన్ లేని ఖతర్నాక్. ఇందులో టబుది ప్రథమ స్థానం. ఈ హార్డ్ కోర్ సీరియస్ క్రైంలో ఆమె ఒక్కటే నవ్వించే పాత్ర. ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వంలో సాంకేతిక - సృజనాత్మక విశేషాలున్నాయి. రెండు కీలక సన్నివేశాల్లో రెడ్ సిల్హౌట్ తో దృశ్యపరమైన మూడ్ ని క్రియేట్ చేశాడు. రాత్రి పూట దృశ్యాలన్నీ ఎల్లో టింట్ తో వున్నాయి. ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ సైకలాజికల్ గా ఒకలాంటి మత్తులోకి తీసికెళ్తాయి.
        
అయితే డబ్బుకోసం మూడు ముఠాల విచ్చలవిడి కాల్పులు, చావులూ కథ మీద పట్టు తప్పేలా చేశాయి. యాక్షన్ వుంటుంది గానీ కథా పరమైన సస్పెన్స్, థ్రిల్, ఇప్పుడేం జరుగుతుందన్న మలుపులూ లేవు. చిత్రీకరణలో వున్న సృజనాత్మకత సెకండాఫ్ కథ చెప్పడంలో లేదు. అయితే సాగదీయకుండా గంటా 45 నిమిషాల్లో ముగించడం రిలీఫ్. ముగింపులో ఉపసంహారం ఫన్నీగా వున్నా, దానికి డార్క్ కామెడీతో ఇచ్చిన ఫినిషింగ్ టచ్  లాజికల్ గా వుండదు - లాజిక్ క్యాహై అని ప్రశ్న వేసి తప్పించుకుంటాడు. 
        
మొత్తానికి తండ్రి అడుగు జాడల్లో తండ్రిలాగా తీసిన ఆస్మాన్ భరద్వాజ్, ఇకపైన తనలాగా తీసి నిరూపించుకోవాలి. పైన చెప్పుకున్న హాలీవుడ్ దర్శకుల్ని అనుసరించడం కూడా ఈ రోజుల్లో వర్కౌట్ కాదు. అందులో గై రిచీ  తప్ప క్వెంటిన్ టరాంటినో, కోయెన్ బ్రదర్స్ తమ బ్రాండ్ నుంచి దూరం జరిగి శైలిని మార్చుకున్నారు.
—సికిందర్

Sunday, January 15, 2023

1284 : రివ్యూ!


 రచన -దర్శకత్వం : అనిల్ కుమార్ ఏ.
తారాగణం : సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్, దేవీ ప్రసాద్, కేదార్ శంకర్, పవిత్రా లోకేష్, సత్యం రాజేష్, సద్దాం హుస్సేన్ తదితరులు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని
బ్యానర్: యువి కాన్సెప్ట్స్
నిర్మాతలు: వంశీకృష్ణా  రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి

విడుదల : జనవరి 14, 2023
***

        యూవీ క్రియెషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ నుంచి కళ్యాణం కమనీయం అనే కొత్త దర్శకుడి చిన్న సినిమా సంక్రాంతి భారీ సినిమాల మధ్య విడుదలైంది. ఆన్ లైన్ బుకింగ్స్ లేని రోజుల్లో పెద్ద సినిమాల పక్క థియేటర్ లో చిన్న సినిమా విడుదల చేసేవాళ్ళు. క్యూల్లో కుమ్ములాడుకుని పెద్ద సినిమాల టికెట్లు దొరకని ప్రేక్షకులు పక్కన చిన్న సినిమాలో దూరేవాళ్ళు. అలా చిన్న సినిమా కూడా హిట్టయ్యేది.       

న్ లైన్ బుకింగ్స్ వచ్చాక ఈ పరిస్థితి లేదు. పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాకి మనుగడ లేదు. అయితే యూవీ క్రియెషన్స్ విడుదలకి ముందే ఓటీటీ, శాటిలైట్ హక్కులు అమ్మేయడంతో థియేటర్స్ లో ఎంత ఆడినా అది లాభమే. ఈ బిజినెస్ మోడల్ కింద విడుదలైన క.క. అసలు థియేటర్ సినిమాయేనా, సిల్వర్ స్క్రీన్ మీద ఆనే విషయంతో వుందా, లేక బుల్లితెరకి సరిపోయే షార్ట్ ఫిలిమా ఈ కింద చూద్దాం... 
   
కథ

బీటెక్ చేసిన నిరుద్యోగి శివ (సంతోష్ శోభన్) కి, ఐటీ జాబ్ చేస్తున్న శృతి (ప్రియా భవానీ శంకర్) కీ పెద్దలు పెళ్ళి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో వున్న శివకి ఆర్ధికంగా అండగా వుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా శివకి జాబ్ రాకపోవడంతో అతడి స్కిల్స్ ని అనుమానిస్తుంది శృతి. ఎడమొహం పెడమొహంగా వుండడం మొదలెడుతుంది. ఒక కన్సల్టెంట్ కంపెనీలో 10 లక్షలు చెల్లిస్తే జాబ్ వచ్చే అవకాశముంటుంది.

ఆ డబ్బు లోన్ తీసుకుని సర్దుతుంది. శివ ఆ డబ్బు డ్రాచేసుకుని వస్తూంటే దొంగ కొట్టేయడంతో ఇరుకున పడతాడు. క్యాబ్ డ్రైవర్ గా చేరి జాబ్ వచ్చిందని శృతికి అబద్ధం చెప్తాడు. అతను క్యాబ్ డ్రైవర్ గా దొరికిపోయే సరికి తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య చెడిన సంబంధం ఎలా బాగుపడిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

సిల్వర్ స్క్రీన్ కి కాక, డైరెక్టు ఓటీటీకి వెళ్ళాల్సిన షార్ట్ ఫిలిం కథ. నిడివి రెండుగంటల లోపే వున్నా వెండి తెరకి తగ్గ కథా బలమే లేకపోవడంతో చూపుకి ఆనదు. సకాలంలో బలమైన సంఘర్షణ సృష్టిస్తే కథ నిలబడేది. ఉన్న చిన్నపాటి సంఘర్షణ ( అతను క్యాబ్ డ్రైవర్ గా దొరికిపోవడంతో తెగతెంపులు చేసుకోవడం) కనీసం ఇంటర్వెల్లో అయినా స్థాపించకుండా సెకండాఫ్ చివర్లో ఏర్పాటు చేయడంతో, అప్పుడు గానీ కథ ప్రారంభం కాలేదు. ఆ చిన్నపాటి సంఘర్షణ కాని సంఘర్షణతో ప్రారంభమయిన కథ చివరి పది నిమిషాల్లో పరిష్కారమై ముగిసిపోతుంది. ఇలా షార్ట్ ఫిలింకి తప్ప సినిమాకి పనికి రాని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే కూడా అయింది.  
       
ఇది కేవలం డబ్బే అర్హత అన్నట్టుగా ఆమె ప్రవర్తిస్తే దానికి సమాధానం చెప్పే కథానాయకత్వం ఆలోచించకపోవడంతో అతను పాసివ్ క్యారక్టర్ అయ్యాడు. ఆమెకూడా చివరికి తండ్రి హితబోధ చేయడంతో మారిపోవడాన్ని బట్టి పాసివ్ క్యారక్టరే అయింది. కాబట్టి ఇద్దర్లో ఎవరూ ప్ర్రధాన పాత్ర కాక
, ఇద్దరూ పాసివ్ క్యారక్టర్లవడంతో ఇది కథ కాలేదు, సినిమాకి పనికిరాని గాథ కూడా అయింది. ప్రేమికుల సమస్య పెద్దలు పరిష్కరించే గాథలు ఒకప్పుడు వర్కౌట్ అయ్యాయి. ప్రేమికులు వాళ్ళు సృష్టించుకున్న సమస్యని స్వావలంబనతో వాళ్ళే పరిష్కరించుకునే పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సులు నేటి యూత్ సినిమాలు.
       
పైగా ఇది కాలానికి వెనుక బడిన కథ. అతను క్యాబ్ డ్రైవర్ అయితే ఏంటి
? ఎంతమంది బీటెక్ చేసిన వాళ్ళు ఉద్యోగాలు దొరక్క క్యాబ్ డ్రైవర్లుగా, ఆఖరికి పనికి ఆహార పథకం కింద కూలీకి వెళ్తున్న దృశ్యాలు లేవు? ఇది వ్యక్తి పరిస్థితి కాదు కించ పర్చడానికి, దేశ పరిస్థితి. ఎలాన్ మస్క్ నుంచీ జెఫ్ బెజోస్ వరకూ ఐటీ జాబులు పీకేస్తున్నారు. మంచి జాబ్ వచ్చిందని మైక్రోసాఫ్ట్ లో రిజైన్ చేసి అప్పాయింట్ లెటర్ పట్టుకుని కెనడా పోతే, అమెజాన్ వాడు పీకేశామన్నాడు. ఇప్పుడతని పరిస్థితేంటి. సినిమా కథలు కాస్త కాలంతో పాటు సాగితే యూత్ కి కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది.

నటనలు- సాంకేతికాలు

టాలెంట్ వున్న సంతోష్ శోభన్ కి తగ్గ సినిమాలు చేతికందడం లేదు. గత సినిమా లైక్ సబ్ స్క్రైబ్ అండ్ షేర్ తో కూడా నిరాశే మిగిలింది. కేవలం నాలుగు పాటలతో తన గంటా 45 నిమిషాల సినిమా కూడా నిలబడదు. సంఘర్షణ లేకపోవడంతో నటనలో బలం కూడా లేదు. 10 లక్షలు దొంగ దోచుకుంటే ఆ విషయం మర్చిపోవడమేనా? అసలు డబ్బు డ్రా చేయాల్సిన అవసరమేమిటి, భార్య ఇచ్చిన చెక్కు కన్సల్టెన్సీ అతనికి ఇచ్చేస్తే పోయేదానికి. తన టాలెంట్ కి ఇలాటి పాత్రలు నటిస్తే ఎప్పటికీ తను మిడిల్ హీరోల రేంజికి రాలేడు.
        
హీరోయిన్ ప్రియా భవానీకిది తొలి తెలుగు సినిమా. కథ, పాత్ర ఎలా వున్నా కనబడినంత సేపూ ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించ గల్గుతుంది. సంతోష్ శోభన్ ఫ్రెండ్ గా కమెడియన్ సద్దాం హుస్సేన్ తో కామెడీ సీన్స్ ఫ్రెష్ గా వున్నాయి. సత్యం రాజేష్ హీరోయిన్ ని వేధించే మేనేజర్ గా వేశాడు. హీరోయిన్ తల్లిదండ్రులుగా దేవీ ప్రసాద్, పవిత్రా లోకేష్ నటించారు.
        
శ్రవణ్ భరద్వాజ్ సంగీతంలో పాటలు యూత్ అభిరుచులకి తగ్గట్టు వున్నాయి, కానీ సినిమా కథ, పాత్రలు  యూత్ ఫుల్ గా లేవు. ఈ చిన్న సినిమాకి పెద్ద సినిమాలు చేసే కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం చాలా ఎక్కువ. కొత్త దర్శకుడు అనిల్ కుమార్ కి మాత్రం యూవీ కాన్సెప్ట్స్ వారు బడ్జెట్ కేటాయించి ప్రాక్టికల్స్ చేసుకో నిచ్చినట్టుంది.
—సికిందర్

Saturday, January 14, 2023

1283 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : వంశీ పైడిపల్లి
తారాగణం : విజయ్, రశ్మికా మందన్న, జయసుధ, సంగీత, సంయుక్త, నందిని, సంయుక్త, సంజన, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య, సుమన్, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు తదితరులు
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : కార్తీక్ పళని
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియెషన్స్
నిర్మాత : దిల్ రాజు
విడుదల : జనవరి 14, 2023
***
        ళయ దళపతి విజయ్ (జోసెఫ్ విజయ్ చంద్ర శేఖర్) తెలుగు ప్రేక్షకులకి సు పరిచితుడైన తమిళ స్టార్. గత బీస్ట్ ఫ్లాప్ తర్వాత ఫ్యామిలీ సినిమా చేపట్టి సంక్రాంతి సినిమాల పోటీలో తనూ ఒకడుగా  ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 2019 లో మహేష్ బాబుతో మహర్షి తీసి జాతీయ అవార్డు అందుకున్న వంశీ పైడిపల్లి, వారసుడు కోసం మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లని ప్రయత్నించి, చివరికి తమిళంలో విజయ్ కి సెటిలయ్యాడు నిర్మాత దిల్ రాజుతో.
        టైటిల్ చూస్తేనే సినిమా ఏమిటో, ఎలా వుంటుందో తెలిసిపోయే ఈ సినిమా గురించి ఇంకా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాలి...

కథ

        ప్రముఖ వ్యాపారవేత్త రాజేంద్ర (శరత్ కుమార్) చిన్న కుమారుడు విజయ్ (విజయ్) ఫుడ్ డెలివరీ స్టార్టప్‌ని ప్రారంభించాలని నిర్ణయించుకుని, కుటుంబ వ్యాపారంలో చేరడానికి ఒప్పుకోక పోవడంతో తండ్రి బహిష్కరిస్తాడు. ఏడేళ్ళ తర్వాత తనకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వున్నట్టు తెలుసుకున్న తండ్రి, తన పుట్టిన రోజుకి కంపెనీ వారసత్వాన్ని ప్రకటించాలని నిర్ణయించుకుంటాడు. తల్లి సుధ (జయసుధ) ప్రోద్బలంతో తండ్రి పుట్టిన రోజు వేడుకకి ఇంటికి తిరిగి వచ్చిన విజయ్ కి కుటుంబం అస్తవ్యస్తంగా వుందని తెలుస్తుంది. పెద్దన్న జై (శ్రీకాంత్) వేరే అమ్మాయి (నందిని) తో సంబంధం పెట్టుకుని భార్య ఆర్తి (సంగీత) ని ఇబ్బంది పెడుతూంటాడు. చిన్నన్న అజయ్ (శ్యామ్) తండ్రి వ్యాపార ప్రత్యర్ధి జేపీ (ప్రకాష్ రాజ్ ) బ్లాక్ మెయిల్ కి లొంగి కంపెనీ రహస్యాల్ని లీక్ చేస్తూంటాడు. అన్నలిద్దరూ కంపెనీ ఛైర్మన్ పోస్టు కోసం ఒకరికొకరు శత్రువులవుతారు.
        
ఈ పరిస్థితుల్లో విజయ్ వదిన చెల్లెలు దివ్య (రశ్మికా మందన్న) తో ప్రేమలో పడతాడు. తండ్రి పుట్టిన రోజు వేడుకలో విజయ్ అన్నలిద్దరి బండారం బయటపెట్టేసరికి కలవరపడ్డ తండ్రి విజయ్ నే కంపెనీ బాధ్యతలు చేపట్టమని కోరుతాడు. మొదట అంగీకరించని విజయ్ తర్వాత ఒప్పుకుని కంపెనీ ఛైర్మన్ అవడంతో అన్నలిద్దరూ భగ్గు మంటారు.
        
ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన విజయ్ అన్నల్నీ, ప్రత్యర్ధినీ దారికి తెచ్చి, కుటుంబాన్నీ, కంపెనీనీ ఎలా కాపాడాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ
 

    ఇప్పుడు అస్తవ్యస్తంగా వున్న కుటుంబాన్నీ వ్యాపారాన్నీ ఛీత్కారాలకి గురయ్యే చిన్నకొడుకు చక్కదిద్దే కథలు టైమ్ ట్రావెల్ చేయించి 1980 ల పూర్వం సినిమాల్ని చూపిస్తాయి. ఆ సినిమాల్లో బంధుత్వాలు, బాధలు, మానసిక సంఘర్షణలు ఇప్పుడూ కుటుంబాలు ఎదుర్కొంటున్నవే అయివుంటాయి. వివాహబంధం (1964) లోని సూర్యకాంతంలు ఇప్పుడూ వున్నారు. ఎన్టీఆర్ లు, భానుమతులు ఇప్పటికీ వున్నారు. ఈ సినిమాలు చూసి ఇవి కదా కథలూ అంటున్నారు ఇప్పటి తరం. యూట్యూబ్ లో ఏ పాత సినిమా చూసినా లక్షల్లో వ్యూస్ వుంటాయి. యువతరం కామెంట్స్ వుంటాయి.  ఇప్పటి సినిమాలకి తాము దూరమవుతున్నట్టు వాటి అర్ధాలుంటాయి.
       
ఫ్యామిలీ డ్రామా అనేది ఎప్పటికైనా యూనివర్సల్ అప్పీలున్న జానర్. కానీ ఆ విలువల్ని పోషించలేక కేవలం హీరోయిజాలతో సినిమాలు చుట్టేస్తున్నారు. అంతా ఫిజిక్సే వుంటుంది
, అనుబంధాల కెమిస్ట్రీ వుండదు. చాలా అలసత్వంతో కనీసం నేపథ్యాలనైనా మార్చకుండా పాత సినిమాల అదే సెటప్ లో నేటి కొత్త ఫ్యామిలీ సినిమాలు చూపించేస్తున్నారు. దేశంలో ఇప్పటి కార్పొరేట్ అధిపతుల్ని చూస్తే క్రమబద్ధంగా కుటుంబం కొనసాగడానికి లండన్ వంటి చోట్ల కుటుంబ రాజ్యాంగాన్ని రాయించుకుంటున్నారు. ఆ రాజ్యాంగం ప్రకారం కుటుంబ సభ్యుల బాధ్యతలు, హక్కులు వుంటాయి.
       
కానీ
వారసుడు లాంటి సినిమాలు ఇంకా పాత సినిమాల్లో కుటుంబ, వ్యాపార కథల పాత మనుషుల్నే శ్రమలేకుండా  టెంప్లెట్ గా చేసుకుని నేటి కాలానికి కాపీ పేస్ట్ వడ్డనలు చేస్తున్నారు. ఇవైనా సరైన కుటుంబ బంధాల సెంటిమెంట్లతో, ఎమోషన్లతో, పాత్ర చిత్రణలతో వుండవు. వీటిలో ఇప్పుడు సమాజంలో వున్న మనుషులు కనపడరు. మిగతా పాత్రల్ని డమ్మీలుగా చేసి కేవలం హీరో స్టామినా, స్వాగ్, ఎనర్జీ అంటూ హాస్యాస్పదమైన సుప్రమసీ చూపించి ఫ్యామిలీ సినిమా అంటున్నారు. ఈ సినిమాలో విజయ్ పాత్ర ఇలాటిదే. మిగతా పాత్రలు డమ్మీలే. యాక్షన్ సినిమా టైపులో విజయ్ కి మూడు ఎలివేషన్స్ అంటూ కృత్రిమత్వం ఒకటి. ఇవన్నీ చేసి, సినిమాకి అవసరమైన సెంటిమెంటల్ డ్రామా, చివరంటా కొనసాగాల్సిన ఎమోషనల్ త్రెడ్ లేకుండా చేశారు.

       
సినిమా కూడా ఇదివరకు చూసిన సీన్లతోనే వుంది. ఈ సీన్లు వేగంలేక కుంటుతూ వుంటాయి. కళ్ళు మూసుకుని డైలాగులు వింటూంటే సినిమా మొత్తం అర్ధమైపోతుంది. అంటే రేడియో నాటకం. విజువల్ మీడియాని రేడియో నాటకంలా తీస్తున్నామని కూడా తెలుసుకోలేదు.
పండంటి కాపురంలో ఎంతమంది తారాగణం వుంటారో అంత మంది తారాతోరణంతో వందేభారత్ స్పీడుతో లాగాలని చూశారు. విజయ్ కేవలం తన స్టయిల్ తో, స్వాగ్ తో, ఫ్యాన్ మూమెంట్స్ తో లాగలేక పోయాడు.
       
సుదీర్ఘంగా ఫస్టాఫ్ లో పైన చెప్పుకున్నట్టు విజయ్ కంపెనీ బాధ్యతలు చేపట్టాక
, సెకండాఫ్ విజయ్ మీద కోపంతో అన్నలు బయటికి వెళ్ళిపోవడం, బయటనుంచి విజయ్ ని దింపాలని కుట్ర చేయడం, ఆ కుట్రల్లో తామే ఇరుక్కుంటే విజయ్ కాపాడ్డం, వేరే అమ్మాయితో అన్నవ్యవహారం చూసి వదిన విడాకులకి ప్రయత్నించడం, ఆమె కూతురిని వ్యభిచార ముఠా కిడ్నాప్ చేస్తే విజయ్ విడిపించడం, షేర్లు కొనేసి కంపెనీని హాస్టైల్ టేకోవర్ (ఎన్డీ టీవీని గౌతమ్ అదానీ కొనేసినట్టుగా) చేస్తున్న ప్రత్యర్ధిని చిత్తు చేయడం వంటి ఫార్ములా దృశ్యాలతో వెళ్ళి వెళ్ళి విజయ్ సౌజన్యంతో సుఖాంత మవుతుంది. ఈ కథంతా ముందు తెలిసిపోతూ వుంటుంది. ఏ డైలాగు వస్తుందో కూడా ప్రేక్షకులు చెప్పేస్తూంటారు. బొత్తిగా మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ లోపించిన కథ.

నటనలు –సాంకేతికాలు

    ఒక విషయం ఒప్పుకోవాలి. విజయ్ తన కామిక్ టైమింగ్ తో చేసిన కొన్ని ఫన్నీ సీన్స్ వున్నాయి- బోర్డ్ రూమ్ మీటింగులో సీను లాంటివి. ఇవి అక్కడక్కడా ఎంటర్ టైన్ చేస్తాయి. అదే సమయంలో కథలో (కుటుంబంలో) వున్న బాధని- విషాదాన్ని కూడా అతను అడ్రెస్ చేయాల్సింది చేయలేదు. కేవలం ఫన్నీ రైడ్ గా, కొన్ని ఫైట్స్ తో ఫ్యాన్స్ కోసం మాస్ యాక్షన్ గా చేసుకు పోవడంతో - కుటుంబ కథ వెనుక ఎక్కడో తప్పిపోయింది. కేవలం ఫీల్ లేని ముగింపు మిగిలింది.
       
సాంగ్స్ బాగా చేశాడు. కథ కూడా బాగా చేస్తే బావుండేది. హీరోయిన్ రశ్మికా మందన్న గ్లామర్ మెరుపులతో పాటలకి పరిమితమయింది. పెద్దన్నగా శ్రీకాంత్
, చిన్నన్నగా శ్యామ్, తల్లిగా జయసుధ, తండ్రిగా శరత్ కుమార్, ఇతర నటీనటులూ కేవలం డమ్మీలుగా మిగిలారు. డమ్మీల మీద ప్రకాష్ రాజ్ విలనీ బలవంతంగా రుద్దినట్టుంది. విజయ్ కాంబినేషన్ లో యోగిబాబు కామెడీ మాత్రం నవ్విస్తుంది.
       
తమన్ తో పాటల విషయంలో
, కార్తీక్ పళని ఛాయాగ్రహణం విషయంలో వంశీ పైడిపల్లి, దిల్ రాజు మంచి శ్రద్ధ తీసుకున్నారు. విజయ్ స్టార్ డమ్ కి తగ్గట్టు ప్రొడక్షన్ విలువలున్నాయి. కానీ ఇలాటి కాలం చెల్లిన కుటుంబ సినిమాలు దిల్ రాజు ఇంకెన్నాళ్ళు తీస్తారో అన్నదే బాధ.
—సికిందర్

 

Friday, January 13, 2023

 దేశ విదేశ పాఠకులందరికీ...


1282 : రివ్యూ!

రచన -దర్శకత్వం : కె. బాబీ 
తారాగణం : చిరంజీవి, రవితేజ, శృతీ హాసన్, కేథరిన్ ట్రెసా, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ బాబీ సింహా, నార్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్,ప్రదీప్ రావత్ తదితరులు
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : ఆర్థర్ ఎ. విల్సన్
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
విడుదల : జనవరి 13, 2023
***

        సంక్రాంతికి నేటితో ముగ్గురు హీరోలు మూడు సినిమాలతో వచ్చినా నిజానికి నల్గురు హీరోల సినిమాలుగా లెక్కించాలి. వాల్తేరు వీరయ్య తో చిరంజీవితో బాటు రవితేజ రావడం వల్ల. రేపు వారసుడు తో ఇంకో హీరో విజయ్ కూడా వస్తే, మొత్తం కలిపి నాల్గు టికెట్లతో ఐదుగురు హీరోలని చూసే అవకాశం పండగ ప్రేక్షకులకి కలుగుతోంది. ఆనందం ఎంత అనుభవించారనేది వేరే విషయం. హీరోయిన్ విషయంలో ఎక్స్ ట్రా బెనిఫిట్ లేదు. వీరసింహారెడ్డి’, వాల్తేరు వీరయ్య రెండూ ఒకే బ్యానర్ సినిమాలు కావడంతో కాంట్రాక్టు మాట్లాడుకుని నటించినట్టు, రెండిట్లో శృతీ హాసనే కనిపించడంతో ఏ సినిమా చూస్తున్నామనే కన్ఫ్యూజన్ కూడా ఏర్పడొచ్చు.

        చిరంజీవి, రవితేజల కాంబోలో వాల్తేరు వీరయ్య పూనకాలు లోడింగ్ అంటూ, వింటేజ్ చిరంజీవి అంటూ చాలా మాస్ మేనియా క్రియేట్ అయింది. చిరంజీవి ఆచార్య’, గాడ్ ఫాదర్ అనుభవాలతో రూటుమార్చి పాత చిరంజీవిని రీబూట్ చేసి చూపించే ప్రయత్నం చేశారు. దీని మీద ఆసక్తితో వున్న ప్రేక్షకులకి ఇదెలా వుంటుందో చూద్దాం...

కథ
వైజాగ్ పోర్టులో ఐస్ ఫ్యాక్టరీ నడిపే వీరయ్య (చిరంజీవి) సముద్రం మీద పట్టు వున్నవాడు. నేవీ సిబ్బంది ఇబ్బందిలో పడ్డా కాపాడగల ధైర్యసాహసాలు వున్నవాడు. ఒకసారి రా విభాగం అధికారులు కరుడుగట్టిన డ్రగ్ మాఫియా సాల్మన్ సీజర్ (బాబీ సింహా) ని తీసుకొస్తున్న విమానం కూలిపోతే అతడ్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో వుంచుతారు. ఆ పోలీస్ స్టేషన్ మీద సాల్మన్ గ్యాంగ్ దాడి చేసి విడిపించుకు పోవడంతో, సీఐ సీతాపతి (రాజేంద్రప్రసాద్) సస్పెండ్ అవుతాడు. ఇతను వీరయ్యని బేరమాడుకుని మలేషియా పారిపోయిన సాల్మన్ ని పట్టుకు వచ్చేందుకు వీరయ్యతో బయల్దేరతాడు.     
        
మలేషియాలో సాల్మన్ ని పట్టుకునే ప్రయత్నంలో వీరయ్యకి అతిధి (శృతీ హాసన్) పరిచయమవుతుంది. ఈమె రా కమాండోగా వుంటుంది. వీరయ్య సాల్మన్ ని పట్టుకుని చంపేయడంతో అజ్ఞాతంలో వున్న అతడి అన్న కాలా (ప్రకాష్ రాజ్) బయటికొస్తాడు. వీరయ్యకి కావాల్సింది ఇతనే. ఇతడి మీద పగదీర్చుకోవడం మొదలెడతాడు.
        
ఏమిటా పగ? గతంలో వీరయ్యకీ, ఏసీపీ విక్రమ్ (రవితేజ) కీ వున్న సంబంధమేమిటి? డాక్టర్ శాలిని (కేథరిన్ ట్రెసా) ఎవరు? విక్రమ్ ఏమయ్యాడు? గతంలో వీరయ్యతో కలిసి వ్యాపారం చేసిన కాలా చేసిన ద్రోహమేమిటి? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

నిజానికి ఇద్దరు స్టార్ల బాండింగ్ గురించి వున్న ఇలాటి కథ సింపుల్ గా చెప్తేనే బలంగా, హత్తుకునేలా చెప్పడానికి అవకాశముంటుంది. ఆస్కార్ విన్నర్ దేర్ విల్ బి బ్లడ్ (2007)  లో డానియేల్ డే లేవీస్ దగ్గరికి, అతడి సవతి తమ్ముడ్నని చెప్పుకుని వచ్చే కెవిన్ ఓ కానర్ ల మధ్య బ్రదర్ హుడ్ బాండింగ్ ఎంత అందంగా వుంటుంది. ఆ దృశ్యాల్ని మర్చిపోలేం. ఇది ఇద్దరు బిగ్ స్టార్స్ చిరంజీవి - రవితేజల మధ్య మిస్సయ్యింది.         

ఎంతసేపూ చుట్టూ బోలెడు క్రౌడ్ మధ్య రిలీఫ్ లేని అవే వూర మాస్ కామెడీలు, విలన్లతో పోరాటాలు, సవాళ్ళు ఎదురు సవాళ్లూ, కాల్పులూ నరికివేతలూ ఇవే సరిపోయాయి. ఓ అరగంట వాళ్ళిద్దరిని ప్రైవేటుగా, వొంటరిగా వదిలేసి- వాళ్ళ బాండింగ్ ని ఎస్టాబ్లిష్ చేసే సరదాలు, సముద్రం మీద షికార్లు, హాబీలు, హత్తుకునే, కళ్ళు చెమర్చే సన్నివేశాలూ  వంటి సెంటిమెంటల్ బ్యాక్ డ్రాప్ లేకపోవడంతో - ఈ ఫ్లాష్ బ్యాక్ మీదే ఆధారపడ్డ మొత్తం కథ ఎలాటి ఫీల్, ఎమోషన్స్, పాతోస్ లేని ఉత్త హోరులా మారింది.
        
మాస్ పాత్రలతో చిరంజీవి స్కిల్స్ గురించి ఆల్రెడీ తెలుసు. కనీసం ఫ్లాష్ బ్యాక్ లోనైనా ఛేంజోవరిస్తూ కాస్త సింపుల్ గా, హూందాగా, సున్నిత హాస్యంతో మార్పు చూపించాలని ప్రయత్నం చేయలేదు. మూడు గంటలసేపూ ఒకే క్యారక్టరైజేషన్ తో, ఒకే టైపు వూర మాస్ యాక్టింగ్ తో చాలా ఓవరాక్షన్ చేశారు. అంత అవసరం లేదు. దీనికి అల్లు అర్జున్ చాలు.
        
కథ, స్క్రీన్ ప్లే నాటుగా లౌడ్ గా వున్నాయి. రొటీన్ మూస ఫార్ములా కథని చాలా హడావిడి చేస్తూ వయొలెన్స్ తో నింపేశారు. చిరంజీవి మలేషియా వెళ్ళడంలో వున్న అసలు ఉద్దేశం ప్రకాష్ రాజ్ ని పట్టుకోవడమైతే, ఇంటర్వెల్లో దీని ఇంపాక్ట్ లేకుండా మలేషియా ఎపిసోడ్ అంతా మాస్ కామెడీ, పట్టుకునేందుకు అదేపనిగా చేసే ప్రయత్నాలతో మొనాటానీని నింపేశారు. ఈ పట్టుకునే ప్రయత్నాల్ని కుదించి ప్రధానంగా హీరోయిన్ తో, అక్కడున్న ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ కేథరిన్ తో, కథలో సస్పెన్స్ ని పెంచే ప్రయత్నం చేయలేదు. కథ కంటే వింటేజ్ చిరంజీవిని చూపించే ఏకధాటి సీన్లతో నింపేశారు. ఇంత చేసినా పూనకాలు లోడింగ్ కాలేదు. ఫ్యాన్స్ కి మాత్రమే ఈ సినిమా పూనకాలు.
        
సెకండాఫ్ లో రవితేజతో ఫ్లాష్ బ్యాక్ పైన చెప్పుకున్న కారణాలతో కృతకంగా మిగిలింది. చిన్నా చితకా సినిమాలెలాగూ అలాగే వుంటాయి- 140 కోట్లతో తీసే పెద్ద సిని మా అయినా విషయ పరంగా క్వాలిటీతో లేకపోతే ఎలా? ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక వూహించేదే జరుగుతుంది - ప్రకాష్ రాజ్ మీద చిరంజీవి పగదీర్చుకునే క్లయిమాక్స్. ఈ క్లయిమాక్స్  యాక్షన్ బీభత్సంగా కొనసాగుతూనే వుంటుంది- ముగింపు అనేది లేనట్టు.
        
మొత్తం మీద ఎలాగైనా హిట్ కొట్టాలని చిరంజీవిని రీబూట్ చేయడం కాదు, ఓవర్ లోడింగ్ చేశారు. పండగ రోజుల్లో ఓవర్ లోడింగ్ ఈజీగా క్యారీ అయిపోతుంది. 

నటనలు- సాంకేతికాలు

యంగ్ చిరంజీవి మళ్ళీ తెరపైకొస్తూ మాస్ యాక్టింగే ఎలివేటయ్యేలా చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. ఎన్ని కోణాల్లో ఎన్ని విధాలుగా చిరంజీవిని హైలైట్ చేయాలన్న దానిమీదే దృష్టి పెట్టి దర్శకుడు బాబీ కూడా కృషి చేశాడు. ప్రారంభంలో రాత్రిపూట సముద్రంలో పడవల మీద యాక్షన్ సీను నుంచీ, ఇంటర్వెల్లో యాక్షన్ సీను వరకూ పడ్డ కష్టం ఫలించింది. అయితే యాంగ్రీ యంగ్ మాన్ ఎమోషన్స్ మాత్రం కథని  మరుగున పడేయడం వల్ల ఉత్పన్నం కాలేదు. అలాటి క్లోజప్స్ కూడా లేవు. ఇది పెద్ద లోపం.      
        
రోమాంటిక్ యాంగిల్ కూడా బలి అయ్యింది బోలెడు వయోలెంట్ యాక్షన్, వూర కామెడీలతో.  బాస్ పార్టీ పాట, రవితేజతో పూనకాలు లోడింగ్ పాట చిరంజీవిలోని డాన్సర్ ని మరోసారి బయటపెట్టాయి. అయితే చిరంజీవి నటనతో గుర్తుండిపోయే ఒక్క సీను కనీసం వుండాల్సింది. సీను లేకపోయినా ఒక్క క్లోజప్ వుండాల్సింది. సెన్సిబిలిటీస్ ని ఆయన పట్టించుకోలేదు.
        
ఇక రవితేజ పోలీసు పాత్ర, నటన, పాత్ర ముగింపు ఆయన స్టైల్లో వున్నాయి. చిరంజీవితో బాండింగ్ లేకపోవడం వల్ల పాత్ర ఉపరితలంలోనే వుండిపోయింది. యాక్షన్ సీన్లో మేక పిల్లని కాపాడే మానవీయ హృదయం రవితేజ పాత్ర పట్ల కూడా వుండాల్సింది దర్శకుడికి. కనీసం ఆ మేకపిల్ల పాత్ర ముగింపు దగ్గరైనా రోదించాల్సింది. ఎందుకంటే రవితేజ పాత్ర గురించి దానికే తెలుసు. ఈ బాండింగ్ కూడా లేకపోతే ఎలా?
        
శృతీ హాసన్ కమాండోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయింది. డాక్టర్ గా కేథరిన్ ట్రెసాకి మూడు నాల్గు సీన్ల కంటే లేవు. ప్రకాష్ రాజ్ విలనీకి సరైన బేస్ లేదు. బాబీ సింహాది అతడి మార్కు విలనీ. అసలు చెప్పుకోవాల్సిన పాత విలన్ ప్రదీప్ రావత్ వున్నాడు. ఈయన చిరంజీవి కమెడియన్ నేస్తాలు శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ లతో ఒకడిగా వుంటూ ప్రతీ సీనులో బ్యాక్ గ్రౌండ్ లో ఇబ్బంది ఫీలవుతూ, డైలాగుల్లేకుండా బలహీనంగా నవ్వడం, చిరంజీవి వైపు చూడడం చేస్తూంటాడు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో తెలీదు.     
        
దేవీశ్రీ ప్రసాద్ పైన చెప్పుకున్న రెండు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఫర్వాలేదు. విల్సన్ ఛాయాగ్రహణం బావుంది. ఎడిటర్ ఆ క్లయిమాక్స్ ని బాగా ఎడిట్ చేసి వుండాల్సింది. పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్ లు యాక్షన్ కొరియోగ్రఫీతో కొత్తగా ఏమీ చూపించలేదు. ప్రారంభంలో సముద్రం మీద యాక్షన్ సీను గ్రాఫిక్స్ ఇంకా ఉన్నతంగా వుండాలి.

        
చివరిగా, దర్శకుడు బాబీ చిరంజీవిని ఎలా చూపించాలో అలా చూపించి అభిమానుల్ని అలరించాడు. అభిమానులకి ఇంతకంటే అవసరం లేదు. చిరంజీవిని ఇలా చూడడమే భాగ్యం.
——సికిందర్