రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, December 18, 2022

1268 : సండే స్పెషల్ రివ్యూ!


క్రిస్మస్ వచ్చిందంటే హాలీవుడ్ నుంచి క్రిస్మస్ సినిమాలొస్తాయి. క్రిస్మస్ వచ్చిందంటే అమెరికాలో నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపనీ (ఎన్ బి సి) ఛానెల్ 1946 నాటి క్లాసిక్ ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్ క్రమం తప్పకుండా ప్రసారం చేస్తూ వుండాల్సిందే. మన దగ్గర కొంతకాలం క్రితం వరకూ నవమికి లవకుశ టీవీ ఛానెల్స్ లో ప్రసారం చేసినట్టు. ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్ డిసెంబర్ 24 రాత్రి ఎనిమిది గంటలకి ఎన్ బి సి లో ప్రసారం కాబోతోంది. మరో ఛానెల్ లో 24 గంటల పాటూ ప్రసారమవుతూనే వుంటుందట. వరుసగా మూడేళ్ళు క్రిస్మస్ కి విడుదలవుతూ వచ్చిన ది ప్రిన్సెస్ స్విచ్ సీక్వెల్స్ లో నాల్గోది ఈ క్రిస్మస్ కి రాలేదు. ఇప్పుడు లిండ్సే లోహన్ నటించిన ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ క్రిస్మస్ మూడ్ ని పెంచుతూ వచ్చేసింది. సాధారణంగా క్రిస్మస్ సినిమాలు ఫ్యామిలీ- రోమాంటిక్ ఎంటర్ టైనర్లుగా వస్తాయి. ఈసారి ఇంకో క్రిస్మస్ సినిమా కాస్త తేడాగా  హూ కిల్డ్ శాంటా అంటూ మర్డర్ మిస్టరీ కామెడీగా వచ్చింది. వచ్చేవారం దీని రివ్యూ చూద్దాం.

        ప్రస్తుతం ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ నెట్ ఫ్లిక్స్ టాప్ స్ట్రీమింగ్ గావుంది. కారణం హాలీవుడ్ స్టార్ లిండ్సే లోహన్ నటించడం. ఈమె పదేళ్ళ క్రితం సినిమాలు ఫ్లాపై కనుమరుగైంది. ఇప్పుడు చాలా తేలికపాటి క్రిస్మస్ రోమాన్స్ తో క్రిస్మస్ కి గ్లామర్ తెస్తూ తెరపై కొచ్చింది. దీనికి జనీన్ డమైన్ దర్శకత్వం వహించింది. ఈమె కొత్త దర్శకురాలు. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ దేశ భాషల్లో కేవలం హిందీలోనే అందుబాటులో వుంది. ఇదెలా వుందో చూద్దాం...

గొప్పింటి కూతురు గల్లంతు

మంచు కొండల్లో మిస్టర్ బెల్మౌంట్ కి ఒక లగ్జరీ హోటల్ వుంటుంది. ఈ హోటల్ కి కూతురు సియారాని అట్మాస్ఫియర్ వైస్ ప్రెసిండెంట్ గా నియమించి బిజినెస్ టూర్ వెళ్ళి పోతాడు. బిజినెస్ మీద ఏమాత్రం ఆసక్తి లేని సియారా, బాయ్ ఫ్రెండ్ టాడ్ తో మంచు కొండల్లో స్కయింగ్ కి వెళ్తుంది. టాడ్ ఇక ఆగలేక ఆమెకి ప్రపోజ్ చేసి వెడ్డింగ్ రింగ్ తొడుగుతాడు. ఇంతలో అట్మాస్ఫియర్ లో మార్పులొచ్చి పెద్ద గాలి వీచడంతో సియారా బ్యాలెన్సు తప్పుతుంది. టాడ్ ఆమెని పట్టుకోబోతే ఉంగరం వూడి చేతి కొస్తుంది. ఆ అట్మాస్ఫియర్ లో అట్మాస్ఫియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన సియారా కొండ మీంచి జారి గల్లంతై ఎక్కడో వెళ్ళి పడుతుంది. టాడ్ ఇంకెక్కడో వెళ్ళి పడతాడు.   

అట్నుంచి జేక్ వస్తూంటాడు. ఇతను అటు చాలా దూరంలో నార్త్ స్టార్ లాడ్జి ఓనర్ గా తీవ్ర నష్టాల్లో వుంటాడు. స్పృహ తప్పి పడున్న సియారాని చూసి తీసికెళ్ళి లాడ్జిలో పడుకోబెడతాడు. అతడికో కూతురు ఎవీ, అత్తగారు వుంటారు. కళ్ళు తెరిచిన సియారా తనెవరో జ్ఞాపక శక్తిని కోల్పోతుంది. అటు మంచు కొండల్లో ఎటో తప్పిపోయి సహాయం కోసం చూస్తూంటాడు టాడ్. ఇలా క్రిస్మస్ రోజుల్లో దూరమైన ప్రేమ జంట, మధ్యలో జేక్,  అటు సియారా కోసం వెతుకుంటున్న మిస్టర్ బెల్మౌంట్, హోటల్ సిబ్బంది, పోలీసులూ... ఈ మూడు పరిస్థితులూ ఏ ముగింపుకి చేరాయన్నది మిగతా కథ.

జ్ఞాపక శక్తిని కోల్పోయిన సియారాకి జేక్ కి ఎలా దగ్గరైంది, భార్య చనిపోయిన జేక్ కూతురు ఎవీ ప్రోత్సాహంతో సియారా కెలా దగ్గరయ్యాడు, ఈ ప్రేమ కథ ఇక్కడ పురులు విప్పుకుంటున్న వేళ చచ్చీ చెడీ ఎలాగో చేరుకున్న టాడ్ పరిస్థితేమిటి, కూతురి జాడ కనుక్కుని వచ్చిన బెల్మౌంట్ తీసుకున్న నిర్ణయమేంటీ...ఇవి కూడా మిగతా లైటర్ వీన్ ఫన్నీ స్టోరీలో తెలుస్తాయి.

లిండ్సే మెయిన్ ఎట్రాక్షన్

లిండ్సే లోహన్ అద్భుత గ్లామర్ తో, కాస్ట్యూమ్స్ తో, సరదా నటనతో పండగ సినిమాని మనోహరంగా మార్చేస్తుంది. క్రిస్మస్ సినిమాలు ఎలా తీయాలో కొన్ని నియమాలు పెట్టుకున్నారు. సినిమా అంతా  నేపథ్యంలో క్రిస్మస్ వాతావరణం, విందులు, వినోదాలు, సంగీతం వుంటాయి. కథలో కుటుంబాలుంటాయి. కుటుంబాల్లో హీరోహీరోయిన్ల ప్రేమ కథలుంటాయి. ఎవరు చూసినా నవ్వుతూ వుంటారు. బరువైన సెంటిమెంట్లు, బాధలు, ఏడ్పులు అస్సలుండవు. నవ్వు పుట్టించే గమ్మత్తయిన సీన్లు వుంటాయి. ప్రేమ కథ తియ్యటి మిఠాయిలా పైపైన లైటర్ వీన్ గా వెళ్ళి పోతూంటుంది. ప్రేమ కథలో ప్రేమిస్తున్న మూడో పాత్ర వుంటే, ఓకే నో ప్రాబ్లం అని, న్యూసెన్స్ చేయకుండా లైట్ తీసుకుని తప్పుకుంటుంది. మొత్తం మీద ఫార్ములా కథలే తప్ప కొత్తగా ఏం వుండదు. తీసిన విధానం క్రిస్మస్ స్పెషల్ లాగా వుంటుంది.

ఇవన్నీ ఈ క్రిస్మస్ మూవీలో ఎంజాయ్ చేయవచ్చు. తెలుగులో సంక్రాంతి సినిమాలని, దీపావళి సినిమాలనీ వస్తూంటాయి. వీటిలో భారీ ఖడ్గాలు పట్టుకుని తిరగడం, నరకడం, రక్తాలు పారించడం వుంటాయి. శుభమాని పండగ పూట ఈ బీభత్సాలకి అలవాటు పడ్డారు ప్రేక్షకులు. మన ప్రేక్షకుల తట్టుకునే శక్తి అపారం.

ఎవీ మీదే ఫోకస్

ఎవీ పాత్ర వేసిన బాలనటి ఒలీవియా పెరేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది దర్శకురాలు జనీన్. సమూహంలో ఎందరున్నా, వాళ్ళ సంభాషణలు నడుస్తూంటే, ఒలీవియా మీదే ఫోకస్ చేసి ఆమె రియాక్షన్ షాట్సే వేస్తూంటుంది. కారణం ఈ బాలనటి స్మైల్ ప్రేక్షకుల మూడ్ ని వెలిగించేసేలా వుంటుంది. ఈ బాక్సాఫీసు కిటుకు పట్టుకుంది కొత్త దర్శకురాలు.

ఇక జేక్ గా నటించిన కార్డ్ ఓవర్ స్ట్రీట్, టాడ్ గా నటించిన జార్జి యంగ్ టీవీ నటులే. మిస్టర్ బెల్మౌంట్ గా నటించిన జాక్ వాగ్నర్ రిచర్డ్ గేర్ పోలికలతో వుంటాడు. ఈ గంటన్నర ఎంటర్ టైనర్ లో మొత్తం 30 పాటలున్నాయి. ఇవి రవంత బిట్లుగా వచ్చిపోతూంటాయి. పూర్తిగా క్రిస్మస్ వేడుకల వాతావరణంతో, రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో, మంచు ప్రాంతంలో, అద్భుత సెట్ డిజైన్లతో, మేకింగ్ ఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ మాయాజాలానికీ తీసిపోనట్టుగా కనువిందు చేస్తుంది ఫాలింగ్ ఫర్ క్రిస్మస్’.
—సికిందర్

1267 : రివ్యూ!

కథ - దర్శకత్వం : సునీల్ పుప్పాల
తారాగణం : తేజ ఐనంపూడి, ధన్యా బాలకృష్ణన్, చైతన్య రావు, పృథ్వీరాజ్ తదితరులు
స్క్రీన్ ప్లే : అజయ్ శరణ్,  సంగీతం : అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం :  రాహుల్ మాచినేని
నిర్మాతలు : ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే
విడుదల : డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీ
***

        రో క్రైమ్ సినిమా ఓటీటీలో విడుదలైంది. 1973 లో ఇదే టైటిల్ తో మురళీ మోహన్- గిరిబాబులతో జగమే మాయ అనే సూపర్ హిట్ క్రైమ్- హార్రర్ థ్రిల్లర్ విడుదలైంది. ఇది హార్రర్ స్పెషలిస్టులు రామ్సే బ్రదర్స్ తీసిన హిందీ దో గజ్ జమీన్ కే నీచే కి రీమేక్. ఇది కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ప్రస్తుత తెలుగు జగమే మాయ థ్రిల్లర్ గాకుండా, క్రైమ్-సస్పెన్స్ మూవీగా ముందుకొచ్చింది. రెండు గంటల లోపు నిడివిగల ఇది ఎంత బలంగా కట్టిపడేస్తుందో చూద్దాం...

కథ  

విజయవాడలో ఆనంద్ (తేజ ఐనంపూడి) బెట్టింగ్స్ తో డబ్బులు సంపాదించాలనుకుని అప్పుల పాలవుతాడు. అప్పులు తీర్చడానికి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తూంటాడు. అలా ఓ వివాహిత దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లో డబ్బూ బంగారం కనిపించేసరికి దోచుకుని హైదరాబాద్ పారిపోతాడు. ఇక్కడ డబ్బున్న చిత్ర (ధన్యా బాలకృష్ణన్) ని చూసి పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోవాలనుకుంటాడు. చిత్ర మొదటి భర్త అజయ్ (చైతన్య రావు) యాక్సిడెంట్ లో పోయాడు. ఇన్సూరెన్స్ డబ్బులు రావాల్సి వుంది. ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాక ఆనంద్ పేర కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటుంది.

ఇంతలో భర్త అజయ్ ని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చిత్రే చంపిందని తెలుసుకుని భయపడతాడు ఆనంద్. తనని కూడా  ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేస్తుందా? ఇప్పుడేం చేయాలి? ఇందులోంచి ఎలా బయటపడాలి? పెళ్ళి చేసుకున్న చిత్రని ఎలా వదిలించుకోవాలి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

డబ్బుల కోసం జరిగే నేరాలతో ఈ కథ. కథ ముగిస్తూ ఇన్ స్టెంట్ కర్మ అన్నారు. ఇందులో ఇన్ స్టెంట్ కర్మ ఏముందో అర్ధం గాదు. ముగింపు కూడా ఆకస్మికంగా అసంపూర్ణంగా వుండడం గాక, సీక్వెల్ కూడా వుంటుందని ప్రకటన వేశారు. సీక్వెల్ తీయాలంటే తీసిన సినిమా ఎంతో కొంత పాపులర్ అవ్వాలి. తీసిన సినిమా సగం పనికి రానప్పుడు, ఇంటర్వెల్ తర్వాత నుంచి చూసుకుంటే సరిపోయినప్పుడు, సీక్వెల్ దేనికి?

క్రైమ్ సినిమా అన్నప్పుడు అది ప్రారంభం నుంచే నేపథ్యంలో ఆ ఫీల్ ప్రతిఫలిస్తూ, క్రైమ్ జానర్ లక్షణాలు, జానర్ మర్యాదలతో కూడిన పాత్రలూ కథా కథనాలు వుండాలి. ఆ రకమైన షాట్స్, టేకింగ్ వుండాలి. టెక్నకల్ గా కూడా మేకింగ్ ని విస్మరించి- రెగ్యులర్ మాస్ మసాలా సినిమాల్లో లాగా విజయవాడలో ఆనంద్  క్యారక్టరైజేషన్ సీన్లు వేసేసి, రొటీన్ కారణాలతో  హైదరాబాద్ పంపేసి, రొటీన్ గా చిత్ర తో కలిపేసి, పెళ్ళి జరిపించేసే సరికి- ఇదంతా చూసి చూసి వున్న మసాలా టెంప్లెట్ లాగా, రెండు గంటల్లోపు వున్న సినిమాలో ముప్పావు గంట గడిచినా కథే ప్రారంభం కాదు. 

ఒక చోట ఆనంద్  అంటాడు- ఈ ల్యాగ్ ఏమిటో, ఎన్నాళ్ళు సాగదీస్తుందో... అసలే ఆర్ట్ సినిమా హీరోలా యాక్ట్ చేయలేక చస్తుంటే అని. ఇది అక్షరాలా రాసుకున్న స్క్రిప్టుకే వర్తిస్తుంది. మొత్తంగా చూస్తే ఫస్టాఫ్ లో ఏమీ లేదు- మొదటి భర్తని చిత్రే చంపిందన్న ఇంటర్వెల్ మలుపు రావడం తప్ప.

ఇక సెకండాఫ్ లో కథ ప్రారంభించి వున్న గంట సమయంలో ఎన్నో మలుపులతో ఎంతో కథ నింపేశారు. దీంతో స్పేసింగ్ ప్రాబ్లం ఏర్పడి ఏదీ సరీగ్గా ఎస్టాబ్లిష్ కాదు. ఇంపాక్ట్ నివ్వదు. ఒకరిపై ఒకరి ఎత్తుగడలు, మలుపులూ; మళ్ళీ కొత్త ఎత్తుగడలు, మలుపులూ అన్నీ హడావిడిగా జరిగిపోతూ ఆటని ఎంజాయ్ చేయనివ్వకుండా చేస్తాయి.

చిత్ర పాత్ర కేంద్ర బిందువుగా, ఆమె పనిచేసే సాఫ్ట్ వేర్ కంపెనీలో ఫ్రాడ్ కి తెరతీసే పాయింటు అనేది ఈ క్రైమ్ కి చాలా బావుంది. సందేహం లేదు. ఈ ఫ్రాడ్ లో బ్లాక్ మెయిల్ చేసి పార్టనర్స్ పెరగడం, పార్టనర్సే శత్రువులవడం, ఇందులోంచి బయటపడేందుకు చిత్ర ప్రయత్నించడం, ఆమెకి ఆనంద్ సహకరించడం... అంతా బాగానే వుంది. టైటిల్ కి న్యాయం కేస్తోంది. అయితే ఈ కథని ఫస్టాఫ్ లో వెంటనే ప్రారంభించి వుంటే, ఇలా కురచ బస్తాలో బలవంతంగా కుక్కినట్టు వుండేది కాదు కథ. ఒకటొకటీ పాత్రలు ఒకేచోట క్రిక్కిరిసిపోయేవి కావు.

మూడు గంటల పైనే నిడివి వున్న అంత అవతార్ 2 సినిమాలో మొదటి పది నిమిషాల్లోనే కథ ప్రారంభించేశాడు. తర్వాత ఆ  కథ ఎలా వుందన్నది తర్వాతి సంగతి. కథ ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇక ప్రస్తుత సినిమాలో ముగింపు కూడా అంత గందరగోళంగానూ వుంది. ఇన్ స్టెంట్ కర్మ ప్రేక్షకులదే అన్పించేలా.

నటనలు- సాంకేతికాలు

ఇది ప్రధానం గా ఇంటర్వెల్లో రివీలయ్యే ధన్యా బాలకృష్ణన్ కథ. ఈ ప్రధాన పాత్రలో చూడడానికి బావుంది గానీ, క్యారక్టర్ బలాబలాలు, క్యారక్టర్ ప్రయాణంలో ఎత్తుపల్లాలు వంటి క్యారక్టర్ ఆర్క్ ని సృష్టించే కథ మీద కథకుడు దృష్టి పెట్టక పోవడం వల్ల వున్న పాత్రని సీదా సాదాగా నటించేసింది. భావోద్వేగాలనేవే లేవు కథలో కూడా. పైగా సెకండాఫ్ అంతా హడావిడి.

హీరోగా నటించిన తేజ క్రైమ్ సినిమా యాంటీ హీరోగా వుండాల్సింది లేడు. పాత్ర, నటన కథని బట్టి లేవు. పైగా తనలో తాను మాట్లాడుకునే కామెడీ. ఆర్ట్ సినిమా క్యారక్టర్ అని తానే చెప్పుకున్నాడు. హీరోయిన్ మొదటి భర్తగా చైతన్య రావు నటనతో దృష్టినాకర్షించే ఆర్టిస్టు. ముఖచిత్రం లో కూడా ఇది రుజువు చేశాడు. తప్పకుండా పైకొచ్చే ఆర్టిస్టు అతను. ఇక పాత హీరో పృథ్వీరాజ్ సాఫ్ట్ వేర్ బాస్ గా నటించాడు. నత్తితో ఓవరాక్షనే. భయపెట్టే పని మనిషిగా నటించినావిడ అర్ధాంతరంగా అంతర్ధానమై పోతుంది. స్పేస్ ప్రాబ్లమేమో.

పాటలు లేవు. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం మేకింగ్ లో లేని క్రైమ్ జానర్ ఫీల్ ని సృష్టించేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు. రాహుల్ మాచినేని కెమెరా వర్క్ నీటుగా వుంది. అయితే క్రైమ్ సినిమా వాతావరణాన్ని క్రియేట్ చేయలేదు. కథా పరంగా  చూస్తే ఇది ఫిలిమ్ నోయర్ మేకింగ్ కి నోచుకోవాల్సిన సినిమా. ఫిలిమ్ నోయర్ ఎలిమెంట్స్ తో సాగాల్సిన చిత్రీకరణ. కొత్త దర్శకుడు దీనికి గనుక సీక్వెల్ తీస్తే కనీస స్థాయి క్రైమ్ సినిమా మేకింగ్ చేస్తాడని ఆశిద్దాం.

—సికిందర్


 

ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ -సండే స్పెషల్ రివ్యూ!
ఈ రోజు సాయంత్రం

Friday, December 16, 2022

1266 : రివ్యూ!

 

దర్శకత్వం : జేమ్స్ కామెరూన్
స్క్రీన్ ప్లే : జేమ్స్ కామెరూన్, రిక్ జాఫా, అమండా సిల్వర్
తారాగణం : సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్
సంగీతం : సైమన్ ఫ్రాంగ్లెన్, ఛాయాగ్రహణం : రస్సెల్ కార్పెంటర్
బ్యానర్స్ : లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్, టీఎస్జీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు : జేమ్స్ కామెరూన్, జోన్ లాండౌ
విడుదల : డిసెంబర్ 16, 2022 
బడ్జెట్ : 350-400 మిలియన్ డాలర్లు

***

    వతార్: ది వే ఆఫ్ వాటర్ (2022) అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చలనచిత్రం 2009 లో సంచలన అవతార్ కి సీక్వెల్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తారాగణం సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, జోయెల్ డేవిడ్ మూర్, గియోవన్నీ రిబిసి, దిలీప్ రావ్ లు అవతార్ లోని తమ పాత్రల్ని రిపీట్ చేస్తూ నటించారు. కొత్త తారాగణంలో జేమ్స్ కామెరూన్ టైటానిక్ హీరోయిన్ కేట్ విన్ స్లెట్ ఓ కీలక పాత్ర పోషించింది.  అప్పట్లో అవతార్హిట్టయితే సీక్వెల్  నిర్మించాలనుకుంటున్నట్టు ప్రకటించిన కామెరూన్, అక్షరాలా పదమూడేళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత, వాగ్దానం చేసిన సీక్వెల్ కోసం కళ్ళు కాయలు చేసుకున్న ప్రపంచ ప్రేక్షకుల్ని కనికరించాడు. మరో మూడు సీక్వెల్స్ జోడింపు కూడా వుంటుందని చెప్పాడు. ఇవి వచ్చేనాటికి ప్రేక్షకులు ముసలి వాళ్ళయి పోతారేమో. అండర్ వాటర్ కెమెరా వర్క్ కోసం కొత్త సాంకేతికాల్ని అభివృద్ధి చేయవలసిన అవసరం వల్ల ఈ జాప్యం తప్పలేదన్నాడు. సినిమా చరిత్రలోనే లేనంత 350400 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సీక్వెల్ ఇంతకీ ఎలా వుంది? నిరీక్షణకి తగ్గ ఫలం అందించిందా? ఇది తెలుసుకుందాం...
 
కథ
    అవతార్ లో చూపించిన సంఘటనలు జరిగి దశాబ్ద కాలానికి పైగా గడిచిపోయాక ఇప్పుడు - జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్ ), నేత్రి(జో సల్దానాతోటి నావీలతో కలిసి సంతోషంగా నివసిస్తూంటారు. వీరికి పెద్ద కుమారుడు నెటేయం, చిన్న కుమారుడు లోయాక్, కుమార్తె టుక్దత్తపుత్రిక కిరీ, స్పైడర్ అనే మానవ బాలుడూ కుటుంబంగా వుంటారు. ఇలా కుటుంబమంతా అనుబంధాలూ ఆత్మీయతలతో ఆనందంగా గడుపుతున్న వేళ, ఒక రోజు ముప్పు ముంచుకొస్తుంది. ఈ పండోరా గ్రహాన్ని మరోసారి వలసరాజ్యం చేసుకోవడానికి భూమ్మీద నుంచి అవతార్ లో ఓడిపోయిన మానవ బృందం తాలూకు స్కై పీపుల్ మళ్ళీ దిగుతుంది భీకర యంత్ర, ఆయుధ సంపత్తితో.

బృంద నాయకుడు క్వారిచ్  ప్రధాన ఆపరేటింగ్ స్థావరాన్ని  నిర్మించేస్తాడు. ఇది తెలుసుకుని జేక్ గెరిల్లా ఆపరేషన్ కి పూనుకుని స్థావరాన్ని ధ్వంసం చేసేస్తాడు. రైల్వే మార్గాన్ని పేల్చేస్తాడు. పైప్ లైన్లు బద్దలు చేస్తాడు. దీంతో జేక్ ని చంపేయమని దళాన్ని ఎగదోస్తాడు క్వారిచ్. జేక్ పిల్లలు దళానికి చిక్కుతారు. దీంతో జేక్, అతడి భార్య నేత్రీ వచ్చి దాడి జరిపి పిల్లల్ని విడిపించుకుని వెళ్లిపోతారు- స్పైడర్ ని తప్ప. మానవ బాలుడు స్పైడర్‌ తన కుమారుడే అని గుర్తించిన క్వారిచ్, అతనితో ఎక్కువ సమయం గడిపి జేక్ కుటుంబ సమాచారం లాగాలనుకుంటాడు. స్పైడర్ క్వారిచ్‌కి నావీ సంస్కృతి గురించి నేర్పుతూంటాడు.

అటు స్పైడర్‌ వల్ల తమ ఆచూకీ తెలిసిపోతుందని అనుమానించిన జేక్, కుటుంబాన్ని తీసుకుని పండోరా తూర్పు సముద్రంలో వేరే తెగకి చెందిన ద్వీపానికి చేరుకుంటాడు. ఈ తెగ సముద్రాన్ని పూజిస్తారు. వీరి శరీరాలు జలచరాల్లాగా నీటి అడుగున జీవించడానికి అనుకూలంగా వుంటాయి. ఇప్పుడు మనుగడ కోసం ఈ అననుకూల జీవన విధానానికి జేక్ కుటుంబం ఎలా తమని మల్చుకుని, దండెత్తిన శత్రువుల్ని ఎదుర్కొన్నారన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

22 వ శతాబ్దంలో అంటే- 2154 లో భూమి మీద సహజ వనరులు అంతరించి పోవడంతో, వనరుల అభివృద్ది విభాగం (ఆర్డీయే), ఆల్ఫా సెంటారీ నక్షత్ర మండలానికి చంద్రుడైన పండోరా గ్రహంపై విలువైన ఖనిజం యునోబ్టానియంని మైనింగ్ చేస్తుంది. పండోరా విష వాయువులతో కూడిన గ్రహం. ఇక్కడ నావి అనే మానవరూప జాతి నివసిస్తూంటుంది. ఈ పండోరా గ్రహం మీదికి మైనింగ్ బృందాల్నినావితో సంకరం చేసిన హ్యూమన్ హైబ్రిడ్‌లుగా పంపుతారు శాస్త్రవేత్తలు. వీటికి అవతార్ లని పేరు పెడతారు. అలాటి ఒక అవతార్ జేక్ సల్లీ ఇక్కడికి వచ్చి, నావీలలో కలిసిపోయి పండోరా ఆక్రమణని ఎదుర్కొంటాడు. ఈ పోరాటంలో ప్రత్యర్ధి క్వారిచ్ చనిపోతాడు. ఇదీ మొదటి అవతార్ కథ. అప్పట్లో 237 మిలియన్ డాలర్ల బడ్జెట్ కి, 2,923 బిలియన్ డాలర్ల బాక్సాఫీసు వచ్చింది!

పై మొదటి
అవతార్ కథకి కొనసాగింపుగా రెండో అవతార్. ఇందులో మొదటి అవతార్ లో చచ్చిపోయిన విలనే మెమరీని ఇంప్లాంట్ చేసుకుని అవతార్ గా తిరిగి వస్తాడు. ఈ కథని కేవలం దండెత్తి వచ్చిన మానవ జాతి నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడే సాధారణ హీరో కథగానే చూపించారు. మిగతా సహజ వనరుల  ధ్వంసం, ప్రకృతీ, పర్యావరణాల నాశనం వంటి అంశాల జోలికి ఉద్దేశపూర్వకంగానే పోలేదని సినిమా చూస్తే తెలుస్తోంది.

అందుకని పెట్టుబడి దారీ వ్యవస్థకి వ్యతిరేకమైన ఎలాటి చిత్రణా చేయలేదు. గ్రహాల్ని కూడా వలస రాజ్యాలుగా చేసుకుని దోచుకుంటాం, అక్కడున్న వారు ప్రాణాలు కాపాడుకుంటూ పారిపోవలసిందే అన్న అంతరార్ధం ఈ సినిమాలో గోచరిస్తోంది. జేమ్స్ కామెరూన్ గత మూవీ అలీటా లో కూడా ఇదే భావజాలం కన్పిస్తుంది. ఆస్కార్ అవార్డు వచ్చేది కూడా ఇలా వుంటేనే. 2019లో కొరియన్ మూవీ పారసైట్ ని కూడా శ్రామిక వర్గ వ్యతిరేక కథగా వుంటేనే ఆస్కార్ తో సత్కరించారు.

దీంతో అవతార్ హీరో కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగత కారణాలకి పరిమితమై
,  మొత్తం పండోరా గ్రహం శ్రేయస్సు కోసం పోరాడాలన్న విశాల దృక్పథాన్ని పక్కన బెట్టేశాడు. ఫలితంగా కథ డొల్లగా మారింది. కథ లేనందువల్లే కథ జోలికి పోలేదు. ఉద్దేశించిన భావజాలం నుంచి దృష్టిని మళ్ళించేందుకే కాబోలు- ఫాదర్ అనే వాడు కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తాడన్న డైలాగు ప్రారంభంలో వేశారు, మళ్ళీ ముగింపులో వేశారు. ఇలా కథకి సంబంధించి ఫాదర్ మీదికే దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేశారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఫాదర్ తిరుగుతూంటే డైలాగుతో ఈ మెసేజ్ బాగానే వుంటుంది. మొదటి నుంచీ ఫాదర్ (హీరో) ని కుటుంబంతో అన్యోన్యంగా చూపిస్తూనే ఈ డైలాగు ఏమిటి? మనం ఎక్కడున్నా మన కుటుంబం కోటలాంటిది అని భార్యతో అంటాడు. పండోరా గ్రహమే లేకపోతే పండంటి కోట ఎక్కడుంటుంది. ఇలా పర్యావరణం గురించి కాక కుటుంబం గురించి డైలాగు వచ్చిన ప్రతి సారీ భావజాలాన్ని దాచే కామెరూన్ తాపత్రయం బయటపడు
తూంటుంది. కుటుంబం గురించి కాదు- తీయాల్సిన సినిమా వనరుల దోపిడీ గురించి! సముద్ర జీవుల్ని, తిమింగలాల్నీ కూడా విచ్చలవిడిగా చంపేస్తూ చూపించారు.

ఇక కథనం విషయానికొస్తే, హీరో విలన్ మీద ఎదురుదాడి చేసి కుటుంబంతో వేరే ద్వీపానికి చేరుకునే సరికి గంట సినిమా గడుస్తుంది. అక్కడ కొత్తగా సముద్రగర్భంలో విహారం, జీవనం, ఓ తిమింగలంతో స్నేహం- ఈ మూడు అంశాలే సుమారు గంటన్నర సేపు కథ లేకుండా సాగుతాయి. చివరి 45 నిమిషాల్లో విలన్ బృందం దిగడంతో క్లయిమాక్స్ యాక్షన్ మొదలవుతుంది. ఇలా ప్రారంభంలో కథ ప్రారంభించి వదిలేశాక, క్లయిమాక్స్ లోనే ప్రారంభించిన కథ వచ్చి కలుస్తుంది. మధ్యలో గంటన్నర పాటు కథలేని సముద్ర విహారాలే వుంటాయి.

ఇంకోటేమిటంటే, హీరో విలన్ కి ఏదో నష్టం చేసి కుటుంబాన్ని కాపాడుకోవడానికి పారిపోయాడు. మళ్ళీ విలన్నీ ఎదుర్కొనే ఆలోచనే లేదు. అస్త్రసన్యాసం చేసి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు విలన్ పగబట్టి చంపాలని ఎందుకు వెతకాలి. ఇలా హీరో పాత్ర చిత్రణ, విలన్ పాత్ర చిత్రణ రెండూ కన్విన్సింగ్ గా లేవు. హీరో గ్రహాన్ని కాపాడుకోవడం కోసం నిలబడితే కథనంలో, పాత్ర చిత్రణల్లో తప్పులు తొలగిపోతాయి.

కాబట్టి కథ పట్టించుకోకుండా, కథ లేకపోయినా విసుక్కోకుండా కనువిందు చేసే విజువల్ వండర్ గా దీన్ని ఆనందించవచ్చు. ఎమోషన్స్ లేని విజువల్ వండర్ గా గుర్తుంచుకోవచ్చు. కామెరూన్ కంటెంట్ విషయంలో అలిటా తో పట్టు కోల్పోవడంతోనే అవతార్ 2 పై అనుమానం కలిగింది. ఇది నిజమైంది.

సాంకేతిక ప్రతిభ

కామెరూన్ తన శ్రమనంతా మునుపెన్నడూ లేని అద్భుత సాంకేతిక మాయాజాల సృష్టి మీద పెట్టాడు. ప్రామాణిక 24fpsకి, హై-ఫ్రేమ్-రేట్ 48fps కూడా జతచేసిన కెమెరా వర్క్ తో మరిచిపోలేని విజువల్స్ సృష్టించాడు. ఛాయాగ్రాహకుడు రస్సెల్ కార్పెంటర్ దీని వెనుక హస్తం. ఒక అందమైన దృశ్యకావ్య ఫీల్ ఈ సైన్స్ ఫిక్షన్ తో అందించాడు కామెరూన్. అతనెప్పుడూ విజువల్స్ కి మాస్టరే. ఏది సీజీ, ఏది నిజం తెలియనంతగా పాత్రలు, ప్రదేశాలు కలిసిపోయాయి. అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ సహా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో దివ్యంగా దృశ్యమానమయ్యాయి. జస్ట్ ఇది మాటలకందని విజువల్ మ్యాజిక్ అంతే, సంగీతాన్ని కలుపుకుని.

—సికిందర్


Thursday, December 15, 2022

1265 : న్యూస్


  లండన్లో వరల్డ్ ప్రీమియర్ సందడి. గుంపుగా తరలి వచ్చిన విమర్శకులు. ముక్త కంఠంతో ప్రశంసల వర్షం. చరిత్ర సృష్టించిన 2009 నాటి అవతార్ సీక్వెల్  అవతార్: ది వే ఆఫ్ వాటర్ చాలా సంతృప్తికరంగానూ, సంతోషకరం గానూ వుందని ఫస్ట్ రియాక్షన్ తో విమర్శకులు ఉప్పొంగిపోయారు. 3 గంటల కంటే ఎక్కువ నిడివితో, ఎడతెరిపి లేని విజువల్ ఫీస్ట్ తో, ఫ్రేమ్ రేట్‌తో అతి సృజనాత్మకంగా వున్నట్టు బైట్స్ ఇచ్చారు. బలమైన భావోద్వేగంతో కూడిన అవతార్ మొదటి కథ కంటే మెరుగైన, సంక్లిష్టమైన కథ అనీ, కానీ పాత్రలు కొంచెం ఎక్కువగా వున్నాయనీ, అయినా త్రీడీలో అత్యుత్తమ, అద్భుత విజువల్స్ తో, టెక్నిక్స్ తో దృశ్యవైభవంగా మంత్రముగ్ధుల్ని చేసి తీరుతుందనీ  ఉద్ఘాటించారు.

        యితే ఇది 1990 నాటి సూపర్ హిట్ డ్యాన్సెస్ విత్ వోల్వ్స్ కి కార్బన్ కాపీ అని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టారు విమర్శకులు. ఇది 2009 నాటి  అవతార్ విషయంలో జరిగింది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా అప్పట్లో కాపీ చేశానని అంగీకరించాడు. అయితే ఆస్కార్-విజేత డ్యాన్సెస్ విత్ వోల్వ్స్ కథ భూమి మీద జరిగితే, అవతార్ కథ అంతరిక్షంలో జరుగుతుందని వివరించాడు.

'అవతార్: ది వే ఆఫ్ వాటర్ అత్యంత అందమైన అనుభవం. పెద్ద స్క్రీన్‌పై త్రీడీ లో చూడాల్సిన అనుభవం. నేను దీన్ని పూర్తిగా ఇష్టపడ్డాను. మళ్ళీ చూడాలనుకుంటున్నాను. సాంకేతిక మాయాజాలం పరంగా ఇది ఒక అద్భుతమైన, మనసుని కదిలించే చలన చిత్ర రాజం అంటూ పెర్రీ నెమిరోఫ్ (కొలైడర్ పత్రిక) పేర్కొన్నాడు.

అవతార్: ది వే ఆఫ్ వాటర్ చాలా ఇన్క్రెడిబుల్. జేమ్స్ కామెరూన్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక మెట్టు పైనే వుంటాడన్న నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. విజువల్స్ మనసుకు హత్తుకునేలా వున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన ఫ్రేములే! కథ విషయానికొస్తే, కొన్ని వివరాల కోసం మళ్ళీ చూడాలనుకుంటున్నాను. ఇది ఒడిదుడుకుల సామూహిక జీవనం, కుటుంబం ఈ రెండిటి శక్తివంతమైన ప్రయాణం. అవతార్ తారాగణం తిరిగి తెరపై కనిపించడం బావుంది. అయితే కొందరు కొత్త నటులు కూడా బాగా చేశారు  అని వివరించాడు.

ఇలాంటి మధురానుభూతి ఎప్పుడూ పొందలేదు. మొదటి అవతార్ కంటే మెరుగ్గా వుంది అని నిక్కీ నోవాక్ (ఫాండాంగో) వ్యాఖ్యానించింది. విజువల్ మాస్టర్‌పీస్. మొదటి దానికంటే ఈ రెండోది చాలా ఉన్నతం. త్రీడీలో వాటర్ వరల్డ్, అక్కడి జీవులు చాలా అధివాస్తవికతతో కూడి  కనిపిస్తాయి. ఇది కామెరూనే తీసిన మాస్టర్ పీస్ టైటానిక్ కి నివాళి అన్నట్టుగా  వుంది అంటూ ఇయాన్ శాండ్‌వెల్ (డిజిటల్‌ స్పై మూవీస్ ఎడిటర్) అభిప్రాయం వెలిబుచ్చాడు.

అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఉత్కంఠభరి విహంగ వీక్షణంతో కూడిన మాస్టర్‌పీస్. చాలా పలుచని కథ అయినప్పటికీ, పాత్రల అస్తిత్వ పోరాట కథని జేమ్స్ కామెరూన్ భావోద్వేగంతో నిండిన అసాధారణ ప్రతిభతో థ్రిల్లింగ్ యాక్షన్ గా కళ్ళ ముందుంచాడు. చివరి గంట వూపిరి సలపనీయదు! అని సీన్ ఓ కానెల్ (సినిమాబ్లెండ్) ప్రస్తుతించాడు.

జేమ్స్ కామెరూన్‌ కి వ్యతిరేకంగా ఎప్పుడూ పందెం కాయకండి. అవతార్: ది వే ఆఫ్ వాటర్ ప్రతి క్షణం పందెం ఓడించేస్తుంది. అద్భుతమైన విజువల్స్, పాత్రలు, కథ పరస్పర భావోద్వేగ సంబంధాన్ని కలిగి వుంటాయి. చివరి గంటలో కామెరూన్ విజృంభించాడు. బ్లాక్‌బస్టర్ మూవీ మేకర్స్ కిది పాఠ్యగ్రంథం అని ప్రశంసించాడు ఓ కానెల్.  

అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఎపిక్ బ్లాక్‌బస్టర్ - అని జోష్ హోరోవిట్జ్ (ఎంటీవీ న్యూస్) రియాక్ట్ అయ్యాడు. సినిమా మాస్టర్ పీస్! అనేది అమండా సలాస్ (ఫాక్స్ న్యూస్) కామెంట్ - ఇది సినిమాటిక్ మాస్టర్ పీస్! అవతార్ కంటే దీన్ని ఎక్కువగా ఆనందించాను. జీవితంలో ఏవి ముఖ్యమో గుర్తించేలా చేస్తుంది. కుటుంబం, ఇల్లు, ప్రకృతి, మనుగడ - నా టాప్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్! అని మెచ్చుకుంది.

చూస్తే రేపు విడుదలవుతున్న ఈ మెగా వండర్ రివ్యూలు చూడక్కర్లేదన్పిస్తోంది. పైన రివ్యూ లిచ్చేశారు క్రిటిక్స్. ఇక ఆలోచించకుండా థియేటర్ల వైపు ప్రయాణమే. తెలుగు, హిందీ, ఇంగ్లీషు- ఏది కావాలంటే అది. టూడీ, త్రీడీ, ఫోర్ డీ ఎక్స్ ఇలా మూడు ఫార్మాట్స్ లో కావలసిన దాన్ని ఎంచుకోవచ్చు. ఫోర్ డీ ఎక్స్ సౌకర్యం అతి తక్కువ థియేటర్లలో వుంది. బుకింగ్స్ కూడా గత నెలలోనే పూర్తయ్యాయి. వారం తర్వాత కొత్త బ్యాచికి ఓపెన్ అవుతాయి. అవతార్2 సైలెంట్ సునామీ అంటున్నారు. దీని ముందు రేపు శుక్రవారం మూడు చిన్న చిన్న తెలుగు సినిమాలు విడుదల కావడం తొందరపాటు అని ట్రేడ్ వర్గాల మాట.
—సికిందర్