రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, డిసెంబర్ 2022, ఆదివారం

1267 : రివ్యూ!

కథ - దర్శకత్వం : సునీల్ పుప్పాల
తారాగణం : తేజ ఐనంపూడి, ధన్యా బాలకృష్ణన్, చైతన్య రావు, పృథ్వీరాజ్ తదితరులు
స్క్రీన్ ప్లే : అజయ్ శరణ్,  సంగీతం : అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం :  రాహుల్ మాచినేని
నిర్మాతలు : ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే
విడుదల : డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీ
***

        రో క్రైమ్ సినిమా ఓటీటీలో విడుదలైంది. 1973 లో ఇదే టైటిల్ తో మురళీ మోహన్- గిరిబాబులతో జగమే మాయ అనే సూపర్ హిట్ క్రైమ్- హార్రర్ థ్రిల్లర్ విడుదలైంది. ఇది హార్రర్ స్పెషలిస్టులు రామ్సే బ్రదర్స్ తీసిన హిందీ దో గజ్ జమీన్ కే నీచే కి రీమేక్. ఇది కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ప్రస్తుత తెలుగు జగమే మాయ థ్రిల్లర్ గాకుండా, క్రైమ్-సస్పెన్స్ మూవీగా ముందుకొచ్చింది. రెండు గంటల లోపు నిడివిగల ఇది ఎంత బలంగా కట్టిపడేస్తుందో చూద్దాం...

కథ  

విజయవాడలో ఆనంద్ (తేజ ఐనంపూడి) బెట్టింగ్స్ తో డబ్బులు సంపాదించాలనుకుని అప్పుల పాలవుతాడు. అప్పులు తీర్చడానికి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తూంటాడు. అలా ఓ వివాహిత దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లో డబ్బూ బంగారం కనిపించేసరికి దోచుకుని హైదరాబాద్ పారిపోతాడు. ఇక్కడ డబ్బున్న చిత్ర (ధన్యా బాలకృష్ణన్) ని చూసి పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోవాలనుకుంటాడు. చిత్ర మొదటి భర్త అజయ్ (చైతన్య రావు) యాక్సిడెంట్ లో పోయాడు. ఇన్సూరెన్స్ డబ్బులు రావాల్సి వుంది. ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాక ఆనంద్ పేర కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటుంది.

ఇంతలో భర్త అజయ్ ని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చిత్రే చంపిందని తెలుసుకుని భయపడతాడు ఆనంద్. తనని కూడా  ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేస్తుందా? ఇప్పుడేం చేయాలి? ఇందులోంచి ఎలా బయటపడాలి? పెళ్ళి చేసుకున్న చిత్రని ఎలా వదిలించుకోవాలి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

డబ్బుల కోసం జరిగే నేరాలతో ఈ కథ. కథ ముగిస్తూ ఇన్ స్టెంట్ కర్మ అన్నారు. ఇందులో ఇన్ స్టెంట్ కర్మ ఏముందో అర్ధం గాదు. ముగింపు కూడా ఆకస్మికంగా అసంపూర్ణంగా వుండడం గాక, సీక్వెల్ కూడా వుంటుందని ప్రకటన వేశారు. సీక్వెల్ తీయాలంటే తీసిన సినిమా ఎంతో కొంత పాపులర్ అవ్వాలి. తీసిన సినిమా సగం పనికి రానప్పుడు, ఇంటర్వెల్ తర్వాత నుంచి చూసుకుంటే సరిపోయినప్పుడు, సీక్వెల్ దేనికి?

క్రైమ్ సినిమా అన్నప్పుడు అది ప్రారంభం నుంచే నేపథ్యంలో ఆ ఫీల్ ప్రతిఫలిస్తూ, క్రైమ్ జానర్ లక్షణాలు, జానర్ మర్యాదలతో కూడిన పాత్రలూ కథా కథనాలు వుండాలి. ఆ రకమైన షాట్స్, టేకింగ్ వుండాలి. టెక్నకల్ గా కూడా మేకింగ్ ని విస్మరించి- రెగ్యులర్ మాస్ మసాలా సినిమాల్లో లాగా విజయవాడలో ఆనంద్  క్యారక్టరైజేషన్ సీన్లు వేసేసి, రొటీన్ కారణాలతో  హైదరాబాద్ పంపేసి, రొటీన్ గా చిత్ర తో కలిపేసి, పెళ్ళి జరిపించేసే సరికి- ఇదంతా చూసి చూసి వున్న మసాలా టెంప్లెట్ లాగా, రెండు గంటల్లోపు వున్న సినిమాలో ముప్పావు గంట గడిచినా కథే ప్రారంభం కాదు. 

ఒక చోట ఆనంద్  అంటాడు- ఈ ల్యాగ్ ఏమిటో, ఎన్నాళ్ళు సాగదీస్తుందో... అసలే ఆర్ట్ సినిమా హీరోలా యాక్ట్ చేయలేక చస్తుంటే అని. ఇది అక్షరాలా రాసుకున్న స్క్రిప్టుకే వర్తిస్తుంది. మొత్తంగా చూస్తే ఫస్టాఫ్ లో ఏమీ లేదు- మొదటి భర్తని చిత్రే చంపిందన్న ఇంటర్వెల్ మలుపు రావడం తప్ప.

ఇక సెకండాఫ్ లో కథ ప్రారంభించి వున్న గంట సమయంలో ఎన్నో మలుపులతో ఎంతో కథ నింపేశారు. దీంతో స్పేసింగ్ ప్రాబ్లం ఏర్పడి ఏదీ సరీగ్గా ఎస్టాబ్లిష్ కాదు. ఇంపాక్ట్ నివ్వదు. ఒకరిపై ఒకరి ఎత్తుగడలు, మలుపులూ; మళ్ళీ కొత్త ఎత్తుగడలు, మలుపులూ అన్నీ హడావిడిగా జరిగిపోతూ ఆటని ఎంజాయ్ చేయనివ్వకుండా చేస్తాయి.

చిత్ర పాత్ర కేంద్ర బిందువుగా, ఆమె పనిచేసే సాఫ్ట్ వేర్ కంపెనీలో ఫ్రాడ్ కి తెరతీసే పాయింటు అనేది ఈ క్రైమ్ కి చాలా బావుంది. సందేహం లేదు. ఈ ఫ్రాడ్ లో బ్లాక్ మెయిల్ చేసి పార్టనర్స్ పెరగడం, పార్టనర్సే శత్రువులవడం, ఇందులోంచి బయటపడేందుకు చిత్ర ప్రయత్నించడం, ఆమెకి ఆనంద్ సహకరించడం... అంతా బాగానే వుంది. టైటిల్ కి న్యాయం కేస్తోంది. అయితే ఈ కథని ఫస్టాఫ్ లో వెంటనే ప్రారంభించి వుంటే, ఇలా కురచ బస్తాలో బలవంతంగా కుక్కినట్టు వుండేది కాదు కథ. ఒకటొకటీ పాత్రలు ఒకేచోట క్రిక్కిరిసిపోయేవి కావు.

మూడు గంటల పైనే నిడివి వున్న అంత అవతార్ 2 సినిమాలో మొదటి పది నిమిషాల్లోనే కథ ప్రారంభించేశాడు. తర్వాత ఆ  కథ ఎలా వుందన్నది తర్వాతి సంగతి. కథ ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇక ప్రస్తుత సినిమాలో ముగింపు కూడా అంత గందరగోళంగానూ వుంది. ఇన్ స్టెంట్ కర్మ ప్రేక్షకులదే అన్పించేలా.

నటనలు- సాంకేతికాలు

ఇది ప్రధానం గా ఇంటర్వెల్లో రివీలయ్యే ధన్యా బాలకృష్ణన్ కథ. ఈ ప్రధాన పాత్రలో చూడడానికి బావుంది గానీ, క్యారక్టర్ బలాబలాలు, క్యారక్టర్ ప్రయాణంలో ఎత్తుపల్లాలు వంటి క్యారక్టర్ ఆర్క్ ని సృష్టించే కథ మీద కథకుడు దృష్టి పెట్టక పోవడం వల్ల వున్న పాత్రని సీదా సాదాగా నటించేసింది. భావోద్వేగాలనేవే లేవు కథలో కూడా. పైగా సెకండాఫ్ అంతా హడావిడి.

హీరోగా నటించిన తేజ క్రైమ్ సినిమా యాంటీ హీరోగా వుండాల్సింది లేడు. పాత్ర, నటన కథని బట్టి లేవు. పైగా తనలో తాను మాట్లాడుకునే కామెడీ. ఆర్ట్ సినిమా క్యారక్టర్ అని తానే చెప్పుకున్నాడు. హీరోయిన్ మొదటి భర్తగా చైతన్య రావు నటనతో దృష్టినాకర్షించే ఆర్టిస్టు. ముఖచిత్రం లో కూడా ఇది రుజువు చేశాడు. తప్పకుండా పైకొచ్చే ఆర్టిస్టు అతను. ఇక పాత హీరో పృథ్వీరాజ్ సాఫ్ట్ వేర్ బాస్ గా నటించాడు. నత్తితో ఓవరాక్షనే. భయపెట్టే పని మనిషిగా నటించినావిడ అర్ధాంతరంగా అంతర్ధానమై పోతుంది. స్పేస్ ప్రాబ్లమేమో.

పాటలు లేవు. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం మేకింగ్ లో లేని క్రైమ్ జానర్ ఫీల్ ని సృష్టించేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు. రాహుల్ మాచినేని కెమెరా వర్క్ నీటుగా వుంది. అయితే క్రైమ్ సినిమా వాతావరణాన్ని క్రియేట్ చేయలేదు. కథా పరంగా  చూస్తే ఇది ఫిలిమ్ నోయర్ మేకింగ్ కి నోచుకోవాల్సిన సినిమా. ఫిలిమ్ నోయర్ ఎలిమెంట్స్ తో సాగాల్సిన చిత్రీకరణ. కొత్త దర్శకుడు దీనికి గనుక సీక్వెల్ తీస్తే కనీస స్థాయి క్రైమ్ సినిమా మేకింగ్ చేస్తాడని ఆశిద్దాం.

—సికిందర్


 

ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ -సండే స్పెషల్ రివ్యూ!
ఈ రోజు సాయంత్రం