రచన - దర్శకత్వం : సతీష్ త్రిపుర
తారాగణం : సింహా కోడూరి, ప్రీతీ అస్రానీ, సముద్రఖని,
సంగీతం: కాల భైరవ ఛాయాగ్రహణం : యశ్వంత్ సి
నిర్మాతలు: డి సురేష్ బాబు, సునీత తాటి
విడుదల సెప్టెంబర్ 23, 2022
*** తెలుగు
సినిమాల్లో ఇదివరకు సాహసించని ప్రయోగాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రధాన స్రవంతి
సినిమాలకి సమాంతరంగా ప్రయోగాత్మక సినిమాల పరంపర కొనసాగుతోంది. చర్చల్లోకే
రానివ్వని జానర్స్ ని ఇప్పుడు స్వాగతిస్తున్నారు. ఇదివరకు ప్రయోగాత్మక సినిమాలకి మార్కెట్
లేదనే వెనుకడుగు కాస్తా ఇప్పుడు ఓటీటీలతో ముందడుగుగా మారుతోంది. థియేటర్లో
ఆడకపోయినా ఓటీటీల్లో ఆదాయముంటుందన్న నమ్మకం ఈ ముందడుగుకి వూతమిస్తోంది. సంగీత
దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి ఈ సమాంతర సినిమాల్ని ముందుకు
తీసికెళ్తున్నాడు. మత్తువదలరా, తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త వంటి
సినిమాలతో ఈ సెగ్మెంట్ కి హీరోగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు.
తాజాగా ఈవారం ‘దొంగలున్నారు జాగ్రత్త’ ని
డి సురేష్ బాబు, తాటి సునీత వంటి ప్రముఖుల నిర్మాణ సారధ్యంలో, కొత్త దర్శకుడు సతీష్ త్రిపురతో కలిసి మరో విభిన్న సినిమాగా అందించాడు.
ముట్టుకోవడానికే వెనుకాడే జానర్ ని తొలిసారిగా ప్రేక్షకులకి అందించాడు. ఇదేమిటో, దీని కథా కమామిషేమిటో ఓసారి చూద్దాం...
రాజు (సింహా) మెకానిక్ గా పనిచేసుకుంటూ భార్య నీరజ (ప్రీతీ అస్రానీ) ని
పోషించుకుంటూ వుంటాడు. రాత్రి పూట ఆమెకి తెలియకుండా దొంగతనాలకి పాల్పడుతూంటాడు. త్వరలో
తండ్రి కూడా కాబోతున్నాడు. ఆగి వున్న కార్లలో స్టీరియోలు, ఇతర విలువైన పరికరాలు తస్కరించి అమ్ముకోవడం
అతడి నేరప్రవృత్తి. ఇలా ఓ రాత్రి ఖరీదైన కారు మీద కన్నేస్తాడు. కారులోకి జొరబడి
పని ముగించుకుని బయటపడబోతూంటే, కారు డోర్స్ లాక్ అయిపోతాయి.
ఆ కారు చక్రవర్తి (సముద్రకని) అనే డాక్టరుది. దాన్ని అతను దొంగల్ని
ట్రాప్ చేయడానికి అనువుగా కస్టమైజ్ చేయించుకున్నాడు. రిమోట్ లో ఎక్కడో వుండి
కారుని కనిపెట్ట గలడు. ఆపరేట్ చేయగలడు. ఇప్పుడు బోనులో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్న
రాజు ని చూసి, ఓ ఆట ఆడుకునేందుకు స్కెచ్
వేస్తాడు. అతను రిమోట్ లో మాట్లాడితే కారులో వాయిస్ విన్పిస్తుంది. రాజుకి కాల్
చేస్తాడు డాక్టర్ చక్రవర్తి. ఆ కాల్ తో షాక్ తింటాడు రాజు. ఏమిటా కాల్? తను ఇలా బందీ అవడం వెనుక డాక్టర్ తో బాటు పోలీస్ కమీషనర్ (శ్రీకాంత్
అయ్యంగార్), ఇంకా తన భార్య సైతం ఎందుకున్నారు? ఏమిటిదంతా? ఈ ట్రాప్ దేనికి? ఇందులోంచి ఎలా బయటపడ్డాడు? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
ఇది సర్వైవల్ డ్రామా జానర్ కథ. హాలీవుడ్ లో విరివిగా
వస్తూంటాయి. దీవిలో చిక్కుకున్న వొంటరి హీరోతో ‘కాస్ట్ ఎవే’, శవపేటికలో బందీ అయిన హీరోతో ‘127 అవర్స్’, అడవిలో ఆటవికులతో ప్రమాదంలో పడ్డ
హీరోతో ‘అపొకలిప్టో’...ఇలా వందల్లో
వుంటాయి. ప్రాణ గండంలో పడ్డ పాత్ర చేసే బ్రతుకు పోరాటాలే ఈ జానర్ కథలు. ప్రస్తుత
కథని 4x4 అనే అర్జెంటీనా-
స్పానిష్ మూవీ లోంచి తీసుకుని ఫ్రీమేక్ చేశారు. అంటే కాపీకొట్టారు. ఇదింకా
హాలీవుడ్ లో రీమేక్ అవుతోంది.
ఐతే ఈ ఒరిజినల్లో వున్న విషయం గానీ, బలంగానీ ఫ్రీమేక్ లో లేకపోవడం విచారకరం. గంటన్నర సినిమాని కూడా
కూర్చోబెట్టేలా తీయకపోతే ఎలా? ఒరిజినల్ దర్శకుడు టీవీలో
చూసిన ఒక వార్త ఆధారంగా సినిమా తీశాడు. తీసినప్పుడు చాలా బలమైన ఫ్యామిలీ డ్రామా
సృష్టించాడు. దివంగత ప్రఖ్యాత సినీ విమర్శకుడు రోజర్ ఎబర్ట్ అన్నట్టు, అర్జెంటీనా, స్పానిష్ దేశాలు భారీ బడ్జెట్ సినిమాలు
తీయలేవు. అందుకని తమ మార్కెట్ ని ముంచెత్తుతున్న హాలీవుడ్ సినిమాలని ఎదుర్కోవాలంటే, తీస్తున్న చిన్న బడ్జెట్ సినిమాలని కథా బలంతోనే తీయాలి. అలా మంచి కథా
బలమున్న థ్రిల్లర్స్ తీస్తూ ప్రపంచ దృష్టి నాకర్షిస్తున్నారు.
'దొంగలున్నారు
జాగ్రత్త’ అంటూ దొంగిలించిన కథతో సినిమా తీసినప్పుడు, సగం వరకే అద్భుత చోర కళ కన్పిస్తోంది. మిగిలిన సగం చిల్లర విషయంగా
మారిపోయింది. సింహా పాత్రని, జీవితాన్నీ పరిచయం చేస్తూ
మందకొడిగా సినిమా సాగినా, కారులో చిక్కున్నాక ఒక్కసారిగా
టెన్షన్ పెరిగిపోతుంది కథలో. డాక్టర్ కాల్ తో బ్యాగ్ గ్రౌండ్ మిస్టరీ జత
కలుస్తుంది. కానీ ఇంటర్వెల్ కొచ్చేసరికి
సంబంధం లేని విషయంతో విశ్రాంతి పడుతుంది.
ఇక సెకండాఫ్ కొచ్చేసరికి ఫస్టాఫ్
లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మిస్టరీ గోప్యత లేకుండా
తెలిసిపోతూంటాయి. ఎప్పుడైతే తెరవెనుక పాత్రలతో వున్న మిస్టరీ తెలిసిపోయిందో ఇక
సినిమా బోరు కొట్టడం మొదలెడుతుంది. ఎలా వుంటుందంటే, ఈ
మిస్టరీ ఇంటర్వెల్ దగ్గరే తేల్చేసి సినిమా ముగించేయొచ్చు కదా అన్నట్టు వుంటుంది.
సింహా నిజాయితీగా కష్టపడి పాత్రకీ, సినిమాకీ ప్రాణం పోయాలనుకున్నాడు. పాత్రకైతే
ప్రాణం పోశాడుగానీ సినిమాకి కుదర్లేదు. పాత్రే కథని పుట్టిస్తుంది. ఒరిజినల్లోని
పాత్రని అర్ధం జేసుకుంటే, అలాటి దొంగోడు తనకి తగ్గ శిక్ష
కూడా అనుభవించాలన్న నేరము - శిక్ష కాన్సెప్టుతో వుంటుంది. కారులో చిక్కుకుని ఎంత
హైన్యం అనుభవిస్తాడంటే, ఆకలికి కాగితాలు తినేస్తాడు, దప్పికకి తన మూత్రమే తాగేస్తాడు. తెలుగులో శిక్ష విషయం మర్చిపోయి, ఎలా బయటపడాలా అనేదే పాత్రగా చేసినప్పుడు, సమగ్ర పాత్ర
చిత్రణ కొరవడి కథా బలం కనుమరుగైంది.
సముద్రకని,
శ్రీకాంత్ అయ్యంగార్, ప్రీతీ అస్రానీలు ఎంత బాగా నటించినా
అవసరం లేని సెకండాఫ్ కథని ఎలా నిలబెట్టగలరు. కాలభైరవ నేపథ్య సంగీతం మాత్రం ఒక
ఆకర్షణ. కారులో బందీ అయిన హీరో అనే సింగిల్ లొకేషన్ కథతో కెమెరా వర్క్ కష్టమైనదే.
కారులో ఆ స్పేస్ లోపలే స్ట్రగుల్ చూపడం. దీనికి గైడ్ బుక్ లా ఒరిజినల్ మూవీ వున్నా, అలాటి టెక్నికల్ షాట్స్ ని క్రియేట్ చేయలేకపోయారు. ఇక డైలాగులు చూస్తే
అవి పైపైన వున్నాయి. ఒరిజినల్ మూవీ స్క్రిప్టు చూసి వుంటే,
డైలాగులు ఏ లోతుపాతుల్లోంచి రాశారో అర్ధమయ్యేది. ఇలాటి పరిమిత బడ్జెట్ సినిమాలకి
స్క్రిప్టే ప్రాణం. ఇదే అర్జెంటీనా, స్పానిష్ సినిమాల
విజయరహస్యం.
దర్శకుడు సతీష్ త్రిపుర సాహసించి ఈ
ప్రయోగం చేయడం మంచిదే. అయితే దర్శకత్వం మీద ఎక్కువ కృషి చేయాల్సివుంటుంది.
ఒరిజినల్ మూవీ దర్శకుడి ఇంటర్వ్యూలు కూడా చదివి వుంటే దీనికి దర్శకత్వం
వహించేందుకు తగిన విషయ పరిజ్ఞానం సమకూరేది.
చివరికేమిటి
సహ నిర్మాత సునీత తాటి ప్రయోగాత్మక
సినిమాలు తీస్తున్నారు. ఓహ్ బేబీ, శాకినీ
ఢాకినీ, దొంగలున్నారు జాగ్రత్త. మూడూ ఫారిన్ రీ/ఫ్రీ మేకులే.
గత వారమే ‘శాకినీ ఢాకినీ’ విడులైంది.
వెంటనే ఈ వారం ‘దొంగలున్నారు జాగ్రత్త’.
రెండూ బోల్తా కొట్టాయి. సి గ్రేడ్ సినిమాలు ఎవరైనా తీయగలరు. తను చేయాల్సింది ఇలాటి
చిన్న సినిమాల డీఎన్ఏ ని పసిగట్టి వాటిని పకడ్బందీగా తీయడమే. చిన్న సినిమాల
స్క్రిప్టు అంటే ఏమిటో తెలుసుకోవడమే. లేని పక్షంలో స్క్రిప్టు అవసరం లేని పెద్ద
హీరోలతో తీసుకోవచ్చు. విలక్షణ ఫారిన్ కాన్సెప్ట్స్ ని ఇలా అన్ పాపులర్ చేయకుండా.
—సికిందర్