రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, జులై 2019, శనివారం

852 : టిప్స్


            101. స్క్రీన్ ప్లేల్లో మిడిల్ వన్, మిడిల్ టూలు ఒకే ఉష్ణోగ్రతతో వుండవు. మిడిల్ వన్ వేసవి ఎండ అయితే మిడిల్ టూ రోహిణీ కార్తె ప్రచండం. ఈ ఫీల్ చూపించకపోతే మొత్తం మిడిల్ అంతా చప్పగా వుంటుంది. చిత్ర లహరిలో ఇదే మర్చిపోయారు. చలికాలం తర్వాత ఎండా కాలం వస్తుంది, ఆ తర్వాత వర్షాకాలం. స్క్రీన్ ప్లేల్లో చలికాలం బిగినింగ్ అనుకుంటే, ఎండాకాలం మిడిల్. ఈ మిడిల్ ఎండాకాలంలో  మళ్ళీ మిడిల్ వన్ ఎండ ఒక ఉష్ణోగ్రతతో వుంటే, మిడిల్ టూ ప్రజ్వరిల్లిన ఉష్ణోగ్రతతో వడగాల్పులు వీచే రోహిణీ కార్తెగా వుంటుంది. ఇక ఎండ్ ఈ వేడినంతా చల్లబర్చే వర్షాకాలం. సినిమా చూసే ప్రేక్షకులకి అదొక జర్నీఅనుకుంటే, ఈ రుతువులు ఫీలయ్యేట్టు ఆ జర్నీని లేదా టూర్ ని రూపకల్పన చేసినప్పుడు ఆ అనుభవం వేరే వుంటుంది. ఈ రుతువులే కథనంలో మార్పులు. వీటివల్లే టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ఏర్పడుతుంది. దీనికి మూలం క్యారెక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం). క్యారెక్టర్ లేకుండా ఏదీ ఏర్పడదు. క్యారెక్టరే బ్రహ్మ. ఇదే కథని పుట్టిస్తుంది, పాలిస్తుంది. దీనికో గోల్ వుంటుంది. ఆ గోల్ తో కథని పాలించే (కథనం నడిపే) క్రమంలో అది లోనయ్యే ఒడిడుకులే క్యారెక్టర్ ఆర్క్ ని ఏర్పరుస్తాయి. దాంతో కథనంలో  టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, దీంతో రుతువుల అనుభవం.  

         
102. బేబీ డ్రైవర్థీమాటిక్ స్టడీస్ కి అర్హమైనదని తేల్చారు విమర్శకులు. ఒక రొటీన్ ఫార్ములా యాక్షన్ కథని ఫార్ములాకి భిన్నంగా, ఎక్కడికక్కడ స్ట్రక్చర్ తో క్రియేటివిటీకి పాల్పడుతూ, ఎలా తీయవచ్చో ఈ స్క్రీన్ ప్లే నిరూపించింది. తెలుగు మేకర్స్ దీన్ని ఎంతవరకు అర్ధం జేసుకుని తమ పాత మూస పంథా మార్చుకుంటారో చూడాల్సి వుంది. మేకర్స్ మేకింగ్ చేయకుండా ప్యాకింగ్ కే అలవాటు పడి నంత కాలం ఇలాటి సినిమాలని ఎంత విశ్లేషించుకోవడమూ, ఇవెంత చదవడమూ వృధా.

       103. సినిమా కథ అనేది ప్రధాన పాత్రకి సంబంధించినదై వుండిఆ ప్రధాన పాత్ర దృష్టి కోణం (పాయింటాఫ్ వ్యూ) లో సాగడం ఆనవాయితీ. ఆ దృష్టికోణంలోనే  ప్రేక్షకులు కథని చూసి ఆ ప్రధాన పాత్రని పట్టుకుని ప్రయాణించగల్గుతారు. ప్రయాణించడానికి ప్రధాన పాత్ర ఆధారంగా లేనప్పుడుఎంత కథ చెప్పినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఆవకాశమే లేదు.

       104. ‘మాతం - గి మణిపూర్అని మొట్టమొదటి మణిపురీ సినిమా వుంది. ఇందులో ఉమ్మడి కుటుంబంలో పెద్ద కొడుకు వల్ల కోడలికి విషమ సమస్య వస్తే, ఇంటిల్లి పాదీ ఆ సమస్యని పరిష్కరించడానికి ఒకటవుతారు. ఎవర్నీ దూషించరు, కనీసం సమస్యకి కారణమైన పెద్ద కొడుకు ప్రియురాలిని కూడా. ఎవరి తోనూ ఘర్షనా పడరు. దీనికి జాతీయ అవార్డు లభించింది. తీర్థ్ జాతరఅనే నాటకం ఆధారంగా 1972 లో తీశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఇప్పటికీ నిలబెట్టుకుం
టున్న మణిపురి ప్రజలు, కలహం వస్తే కలహాలతో పరిష్కరించుకోవాలనుకోరు. చాలా కుటుంబ కమర్షియల్ సినిమాల్లో మాత్రం కలహం వస్తే తలా వొకరుగా విడిపోయి కలహించుకోవడం ఒక ఫార్ములాగా – టెంప్లెట్ గా మారిపోయింది.   
    
       105. కాలం మారిందనే మాట సినిమాల్లో ఇప్పటికీ వాడుతూ వుంటారు. కానీ అరవై ఏళ్ల  క్రితమే కాలం మారిందని గమనించి సినిమాల్లో డైలాగులు వాడేశారు. ఏ కాలంలో వాళ్ళు ఆ కాలం మాత్రమే మారిందని అనుకుంటారు. వెనకటి కాలపు వాళ్ళు వొట్టి ఫూల్స్ అనుకుంటారు. వెనకటి కాలం ఫూలిష్ అనీ, ఇప్పటి తమ కాలమే షైన్ అవుతోందనీ గొప్పలు పోతారు. ఇప్పటి ఈ కాలం ఇంత మారడానికి వెనకటి కాలాలే మారుతూ మెట్లు వేశాయని గుర్తించరు. వెనకటి కాలాలు మారకపోతే ఈ కాలంలో మనం బ్లడీ ఫూల్స్ గా చెలామణి అయ్యేవాళ్లం.  కాబట్టి కాలం ఇప్పుడేం మారలేదు, మార్పుకి బాట వేసిన గత కాలాల శ్రమ ఫలాలే ఇప్పుడనుభవిస్తున్నాం. కనుక ఎవరూ కాలం చెల్లిన వ్యక్తులు కాదు, మూలాలు మోస్తున్న నిఘంటువులు. మూలాలు లేకుండా మురిపాలు లేవు. ఇవ్వాళ్టి ఆనందాలకి నిన్నటి మూలాలే క్లాప్ కొట్టాయి.

          106
. ఏ ఫిలిం ఇనిస్టిట్యూట్ లోనైనా బోధించే స్క్రీన్ ప్లే కోర్సు అమెరికన్ స్క్రీన్ ప్లే స్ట్రక్చరే. ఇండియన్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కాదు. ఎందుకంటే ఒక ఇండియన్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అంటూ దేశంలో ఏ భాషా చలనచిత్రాలకి సంబంధించీ లేదు. ఇండియన్ సినిమాలకి స్క్రీన్ ప్లే రాయబోతే కల్చర్ డామినేట్ చేస్తుంది. ఆ కల్చర్ భరతముని నాట్యశాస్త్రంలో నవరసాల రూపంలోవుంది. నాట్యం, నటన, నాటకం భరతముని నాట్యశాస్త్రంలోంచే వచ్చాయి. మొదటి తరం సినిమాలు ఆ పౌరాణిక నాటకాల్లోంచే నవరస భరితంగా వచ్చాయి. ఈ నవరసాలు, నవరసాలతో కూడిన అభినయాలు, సంగీత నాట్యాలూ సినిమాల్లో భాగమైపోయాయి. వీటివల్ల సినిమా కథకి ఓ స్ట్రక్చర్ ని కూర్చడం సాధ్యం కాదు. అందుకని ఇండియన్ స్క్రీన్ ప్లే అనేది ఎక్కడాలేదు. వరల్డ్ మూవీస్ తీసే యూరోపియన్ దేశాల్లో కూడా, లాటిన్ అమెరికాలో కూడా మనలాగే వాళ్ళ కల్చర్ వల్ల ఓ ఇదమిత్థమైన స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లేదు. ప్రపంచం మొత్తంలో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వున్నది ఒక్క అమెరికాకే. అందుకే ఒక్క అమెరికా నుంచి తప్ప మరే దేశం నుంచీ స్క్రీన్ ప్లే బుక్స్, ఆర్టికల్స్, వెబ్ సైట్స్ వెలువడవు. ప్రపంచమంతా స్క్రీన్ ప్లే కోర్సులు బోధించేది అమెరికన్ (హాలీవుడ్) స్క్రీన్ ప్లేతోనే.

సికిందర్