రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, September 15, 2022

1210 : రివ్యూ!

దర్శకత్వం: అయాన్ ముఖర్జీ
తారాగణం : రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, నాగార్జున, మౌనీ రాయ్ తదితరులు
రచన ; అయాన్ ముఖర్జీ, హుస్సేన్ దలాల్; సంగీతం : ప్రీతమ్, ఛాయాగ్రహణం : మణికందన్, పంకజ్ కుమార్, సుదీప్ ఛటర్జీ, వికాష్ నౌలాఖా, ప్యాట్రిక్ డ్యూరక్స్
బ్యానర్స్ : స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్
నిర్మాతలు: కరణ్ జోహార్, అపూర్వా మెహతా, నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, మరిజ్కే డిసౌజా, అయాన్ ముఖర్జీ
విడుదల : సెప్టెంబర్ 9, 2022
***

        సుదీర్ఘ కాలం నిర్మాణంలో వుండి, బహిష్కరణల పిలుపులతో అయోమయంలో పడి, ఆఖరికి బుకింగ్స్ తో ఆశల్ని రేకెత్తిస్తూ విడుదలైన బ్రహ్మాస్త్రం ప్రేక్షకుల తీర్పుకి నిలబడింది. 410 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అని చెబుతున్న ఈ బాలీవుడ్ మెగా మూవీ, ఇంకో సందిగ్ధాన్ని కూడా తొలగించేందుకు ముందుకొచ్చింది. వరుసగా బాలీవుడ్ సినిమాలు విఫలమవుతున్న నేపథ్యంలో, ప్రేక్షకులు హిందీ సినిమాలని ఇక మర్చిపోదల్చారా అన్న ప్రశ్నకి సమాధానంగా కూడా బ్రాహ్మాస్త్రం విడుదలైంది. అలాటిదేమీ లేదు, హిందీ సినిమాల్ని కూడా చూస్తారు - కాకపోతే ఎంత స్టార్ సినిమా అయినా నాసిరకం సినిమాల్ని చూడరని ఇక తేలిపోతోంది.

        ర్శకుడు అయాన్ ముఖర్జీకిది డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో ఈ స్థాయి బడ్జెట్ కి, హాలీవుడ్ ని తలదన్నే విజువల్ హంగామాకీ భారీ తారాగణం కొలువు దీరాలి నిజానికి. కానీ అరడజనుకి మించి తారలు లేరు. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, నాగార్జున, మౌనీ రాయ్, ఇంతే. భారీ సంఖ్యలో తారాగణముంటేనే కథంతా గందర గోళమై, ఎవరు ఎవరో గుర్తు పెట్టుకుని చూడ్డం కూడా అదనపు భారమై పోతుంది. మరి ఇంత సింపుల్ తారాగణంతో బ్రహ్మాస్త్రం కథ ఎంత బలంగా వుంది? అరుగురూ స్టార్సే. ఏ క్షణం చూసినా ఒకరు కాకపోతే ఒకరు స్టార్సే కనపడే ఈ బృహత్ ప్రయత్నంలో, ఏ మాత్రం మెప్పించి కడుపు నిండిన ఫీలింగ్ తో ప్రేక్షకుల్ని ఇళ్ళకి పంపించారు? ఇవి తెలుసుకుందాం...

కథ

పురాతన కాలంలో గాలి నీరు నేల నిప్పు అనే పంచభూతాల్లోని నాలుగు మూలకాలకి, జంతు సంబంధమైన, వృక్ష సంబంధమైన ధాతువుల్ని కలిపి, అతీత శక్తుల్ని సాధించడానికి ఋషులు హిమాలయాలలో కఠోర తపస్సు చేసి బ్రహ్మాస్త్రాన్ని సృష్టించారు. దుష్ట శక్తుల నుంచి ప్రపంచానికి ముప్పు వాటిల్లినప్పుడు ఈ అస్త్రం ఆ ముప్పుని తుత్తునియలు చేసే విశ్వశక్తితో వుంటుంది. ఈ బ్రహ్మాస్త్రాన్ని మూడు భాగాలుగా  చేసి, బ్రహ్మాంశ్ అనే గుప్త సమాజానికి అందించారు. తరతరాలుగా గుప్త సమాజం చేతులు మారుతూ వస్తూ, ఇప్పుడు ముగ్గురి దగ్గర అస్త్ర భాగాలు భద్రంగా వున్నాయి.        

ప్రస్తుతానికొస్తే, ముంబైలో డీజే శివ (రణబీర్ కపూర్) పండగలకి ప్రోగ్రాములు ఇస్తూ వుంటాడు. అనాధగా అతడిది సామాన్య జీవితం. దసరా ఉత్సవాలప్పుడు అతను ఈషా (ఆలియా భట్) అనే అద్భుత సౌందర్యరాశిని చూసి వెంటనే ప్రేమలో పడిపోతాడు. అయితే అతడి ప్రేమాయణానికి ఏవో కలలు అడ్డుపడుతూంటాయి. ఆ కలల్లో అగ్నిగోళాలు పేలుతూ, ఏవో దృశ్యాలు కనపడుతూ వుంటాయి. దీన్ని అర్ధం జేసుకోలేక పోతాడు.

        ఇలావుండగా, జునూన్ (మౌనీ రాయ్) అనే దుష్ట శక్తి తన అనుచరులిద్దరు రఫ్తార్, జోర్ లని వెంటేసుకుని బ్రహ్మాస్త్రం వేటలో వుంటుంది. మోహన్ భార్గవ్ (షారుక్ ఖాన్) అనే శాస్త్రవేత్త గుప్త సమాజం సభ్యుడిగా వుంటూ, బ్రహ్మాస్త్రంలోని ఒక భాగం వానరాస్త్రాన్ని కలిగి వుంటాడు. ఇతడ్ని చంపేసి వానరాస్త్రాన్ని హస్తగతం చేసుకుంటుంది జూనూన్. మిగిలిన రెండు అస్త్రాల్ని కూడా చేజిక్కించుకుని ప్రపంచాన్ని శాసించాలన్న దుష్ట ప్రణాళికతో వుంటుంది.

        శివకి కలలో కనపడుతున్న దృశ్యాలివే. మరోసారి వారణాసిలో చిత్రకారుడు అనీష్ శెట్టి (నాగార్జున) బలి కాబోతున్నాడని గ్రహించి, ఈషాతో అక్కడికి వెళ్ళేసరికి జునూన్ దాడి చేస్తూంటుంది. గుప్త సమాజం రెండో సభ్యుడు అనీష్ శెట్టి దగ్గరున్న నంది అస్త్రాన్ని కైవసం చేసుకుని చంపేస్తుంది. ఈ సమయంలోనే శివకి అగ్నితో తనకేదో సంబంధ ముందని తెలుస్తుంది. తను నిప్పుని  పుట్టించలేడు, కనీసం దీపం ముట్టించలేడు. అయితే  మంటలు కూడా అతడ్నేమీ చేయలేవు.

        ఈ నేపథ్యంలో గురూ (అమితాబ్ బచ్చన్) అనే గుప్త సమాజం మూడో సభ్యుడు హిమాలయాల్లో ఆశ్రమంలో వున్నాడని తెలుసుకుని వెళ్ళిన శివ అక్కడేం చేశాడు? మూడో అస్త్ర భాగం జునూన్ చేతికి చిక్కకుండా ఆమెనెలా ఎదుర్కొన్నాడు? చివరికేమయ్యాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ట్రెజర్ హంట్- మిథికల్ ఫాంటసీ జానర్ కథ ఇది. అయితే ఇటీవల కార్తికేయ 2 లో  పురాణాలు చరిత్రలనీ, కృష్ణుడు చారిత్రక పురుషుడనీ చెప్తూ, కృష్ణుడిచ్చిన అస్త్రంతో వాస్తవిక కథ చేయకుండా కల్పిత కథే చేశారు. ప్రపంచాన్ని కాపాడే ఒక అస్త్రాన్ని కృష్ణుడు గుప్త సమాజానికిస్తాడు. ఆ గుప్త సమాజం వారసుల దగ్గరున్న అస్త్ర భాగాల కోసమే ఈ కథ. బ్రహ్మాస్త్రం లో కూడా ఇలాటిదే కథ. ఈ కథలు అశ్విన్ సంఘీ  రాసిన ది కృష్ణ కీ అనే పాపులర్ మిథికల్ థ్రిల్లర్ నవల్లోని కథ లాగే వుంటాయి. కాకపోతే కార్తికేయ 2 లో అస్త్రం కోసం వేట కథ కాస్తా, కృష్ణుడి ప్రవచనాలతో భక్తి సినిమాలాగా మారిపోయింది. అందుకే ఇప్పుడున్న మతోత్సాహ వాతావరణంలో నార్త్ లో అంత హిట్టయ్యింది.

        బ్రహ్మాస్త్రం లో దేవుళ్ళూ  ప్రవచనాలూ లేవు. అస్త్రం కోసం వేటతోనే సూటి కథ. అయితే ఈ కథలు ఈ కాలంలో కూడా మూసలోనే తీస్తున్నారు. అటు హాలీవుడ్ లో చూస్తే ప్రపంచాన్ని కాపాడేది అమెరికానే అన్నట్టు సినిమాలు తీసి పడేస్తున్నారు. మన వాళ్ళు ప్రపంచానికివ్వగల శాస్త్ర పరిజ్ఞానమంతా మన దగ్గరే వుందని  చెప్తూ కూడా - అస్త్ర శస్త్రాల కథల్ని దేశం దాటించడం లేదు. ఇదే బ్రహ్మాస్త్రం దుష్ట శక్తుల చేతిలో పడితే మొదటి దెబ్బ అమెరికాకే అన్నట్టు చెప్పి, విదేశీ పాత్రలతో కూడా కథ చేసి వుంటే - సెకండాఫ్ ఈ కథ మరో లోకల్ మూస కథగా కుదేలవకుండా, గ్లోబల్ కథగా వ్యాకోచించేది.

నటనలు- సాంకేతికాలు
ఉన్న ఆరు పాత్రలూ బావున్నాయి- ముఖ్యంగా హీరో రణబీర్ కపూర్ మాస్ ఓరియెంటెడ్ పాత్ర. పాత్ర చిత్రణ. స్టార్ కివ్వాల్సిన ఎలివేషన్. యూత్ అప్పీల్ కోసం రోమాన్స్ సహా. తల్లిదండ్రు లెవరో తెలియని అతడి కదిలించే ఫ్లాష్ బ్యాక్. దివ్య శక్తులతో హీరోయిజం. ఇలా ప్రతీ కోణంలో గుర్తుండి పోతాడు. అగ్ని పుంజాలతో అతను పాడుకునే పాట క్రియేటివిటీ పరంగా కొత్తాలోచన. దసరా ఉత్సవాల్లో మొదటి మాస్ పాట దగ్గర్నుంచి, మూడు నాల్గు రోమాంటిక్ సాంగ్స్ మ్యూజికల్ గా, విజువల్ గా హైలైట్సే. ఇక అతడి యాక్షన్ సీన్స్ చెప్పనవసరం లేదు.

        ఆలియాభట్ ప్రేమలప్పుడు, పాటలప్పుడూ వచ్చిపోయే ఫార్ములా గ్లామర్ బొమ్మలా కాకుండా, ఆద్యంతం కథలో, యాక్షన్ దృశ్యాల్లో పాల్గొనే పాత్రచిత్రణతో, తగిన నటనతో వుంది. షారూఖ్, నాగార్జున లవి అతిధి పాత్రలే అయినా, కీలకమైనవి. సినిమా ప్రారంభం షారూఖ్ తో వుంటుంది. అతడి పాత్ర మరణం, తర్వాత నాగార్జున పాత్ర మరణమూ కదిలిస్తాయి. సెకండాఫ్ లో గురూగా అమితాబ్ మూలస్తంభంగా వుంటాడు. ఇక విలన్ పాత్రలో యంగ్ మౌనీ రాయ్ ఒక సర్ప్రైజ్. ఇంత భారీ సినిమాని విలన్ గా తన భుజాన మోయడం!

        ఇక సాంకేతికంగా చెప్పడానికి మాటల్లేవు. సంజయ్ లీలా భన్సాలీ కూడా ఈ దృశ్య వైభవం చూసి అప్డేట్ అవ్వాల్సిందే. హాలీవుడ్ ఆల్రెడీ మోకరిల్లిందని రివ్యూలొస్తున్నాయి. తిరుగులేని గ్రాఫిక్స్ వర్క్ కి కళ్ళు చెదురుతాయి. ఇంతకంటే ప్రేక్షకులకేం కావాలి? కావాలి ఇంకాస్త మంచి సెకండాఫ్...

చివరికేమిటి

ఆరే ఆరు పాత్రలతో భారీ కథ కాకుండా, కథ సింపుల్ గా, సూటిగా వుండడంతో ఫస్టాఫ్ క్షణం కూడా కళ్ళు తిప్పుకోకుండా ఫాలో అవుతాం. నిజానికి హాలీవుడ్ బిగ్ యాక్షన్ మూవీస్ సింపుల్ గా సూటిగా వుండే కథలతోనే వుంటాయి. ఇక్కడ ఒక బ్రహ్మాస్త్రం మూడు చోట్ల వుంది, దాన్ని కాజేయడం కోసం విలన్, విలన్ని అడ్డుకునే హీరో, ఇంతే కథ. ఆ విలన్ కి ఇద్దరే అనుచరులు. దీనికి బ్యాక్ డ్రాప్, యాక్షన్ ఇవన్నీ బిగ్ కాన్వాస్స్ తో వుంటాయి. ఇలా ఈమధ్య కాలంలో ఫస్టాఫ్ కళ్ళు తిప్పుకోకుండా కూర్చోబెట్టే సినిమా ఇదే.

        సెకండాఫే సమస్య. సెకండాఫ్ లో వేట కథ నాపి, బ్రహ్మాస్త్రం పుట్టు పూర్వోత్తరాలు (ఇది ఆల్రెడీ సినిమా ప్రారంభంలో చిరంజీవి వాయిసోవర్ చెప్పేశారు), హీరో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ వంటి సెకండాఫ్ ని కుంగదీసే విషయాలతో నిడివిని భర్తీ చేయడంతో, ముప్పావుగంట సహనాన్ని పరీక్షిస్తుంది. మళ్ళీ వేట కథ మొదలయ్యాక ఎంతకీ ముగియని క్లయిమాక్స్ తో సహన పరీక్ష రెట్టింపవుతుంది. మరి ముగింపు? ముగింపు పేలవంగా వుంది. ఈ ముగింపుతో రెండో భాగం తీస్తారా, దీంతో ఆపేస్తారా అనేది త్వరలో న్యూస్ ఇవ్వొచ్చు దర్శకుడు.

సికిందర్
 

Wednesday, September 14, 2022

1209 : రివ్యూ!

రచన- దర్శకత్వం: శ్రీకార్తీక్
తారాగణం : శర్వానంద్, రీతూ వర్మ, అమలా అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు
సంగీతం : : జేక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం : సుజిత్ సరంగ్
నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాశ్ ప్రభు, ఎస్ఆర్ ప్రభు
విడుదల : సెప్టెంబర్ 9, 2022
***

రు వరస పరాజయాల తర్వాత శర్వానంద్ మార్పు కోసం సైన్స్ ఫిక్షన్ ప్రయత్నిస్తూ అదృష్టాన్ని పరీక్షించుకో దల్చాడు. తమిళంలో రెండు సినిమాలు తీసిన దర్శకుడు శ్రీ కార్తీక్ కి అవకాశ మిచ్చాడు. ఈ కొత్త ప్రయత్నంలో కూడా తిరిగి ఫ్యామిలీ స్టోరీ మీదే ఆధారపడుతూ అక్కినేని అమల కేంద్ర బిందువుగా ఫ్యామిలీ డ్రామాలో నటించాడు. శర్వానంద్ అంటే ఫ్యామిలీ డ్రామాని దాటి యూత్ జోన్లోకి రాలేడన్న అభిప్రాయాన్ని మరోమారు బలపర్చాడు. ఐతే చవితికి రంగరంగ వైభవం అనే ఫ్యామిలీ డ్రామాకి దూరంగా వున్న కుటుంబ ప్రేక్షకులు, ఇప్పుడు నిమజ్జనానికి అమలతో అమ్మ సినిమా కోసమైనా ఒకేఒక జీవితం కి తరలి వస్తున్నారా? ఇది తెలుసుకుందాం...

కథ

ఆది (శర్వానంద్) గిటారిస్టుగా సంగీతంలో రాణించాలని కృషి చేస్తూంటాడు. అతడికి ఇద్దరు స్నేహితులు శీను (వెన్నెల కిషోర్), చైతూ (ప్రియదర్శి) వుంటారు. ఆది మదర్ ఫిక్సేషన్ తో బాధపడుతూంటాడు. స్టేజి ఎక్కి పాడాలంటే భయం. తల్లి వుంటే ఈ భయముండేది కాదు కదాని బాధ. తల్లి ఇరవై ఏళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో  మరణించింది. ఆదిని ఎంకరేజి చేస్తూ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తుంది అతడ్ని ప్రేమిస్తున్న వైష్ణవి (రీతూ వర్మ). శీనూ చైతూలకి కూడా వాళ్ళ సమస్యలుంటాయి. శీను ఇళ్ళు అద్దెకిప్పించే బ్రోకర్ గా పనిచేస్తూ అసంతృప్తిగా వుంటాడు. చదువుకుని వుంటే మంచి ఉద్యోగంలో స్థిరపడే వాణ్ణి కదాని బాధ. చైతూకి ఎన్ని సంబంధాలు చూసినా నచ్చడం లేదని బాధ. చిన్నప్పుడు సీత అనే అమ్మాయిని దూరం పెట్టాడు. ఇప్పుడామెని చూసి ఎందుకు ఆనాడు ప్రేమించలేదాని బాధ.

ఇలావుండగా, ముగ్గురికీ రంగి కుట్ట పాల్ (నాజర్) అనే క్వాంటమ్ ఫిజిసిస్టు పరిచయమవుతాడు. ఇతను ఇరవై ఏళ్ళు కష్టపడి టైమ్ మెషీన్ని తయారు చేశాడు. టైమ్ మెషీన్లో ఈ ముగ్గుర్నీ వాళ్ళ గతంలోకి తీసికెళ్ళి అక్కడ చేసిన తప్పుల్ని సవరించుకుని, భవిష్యత్తుని బాగు చేసుకునే అవకాశం కల్పిస్తానంటాడు. ముగ్గురూ సరేనని బయల్దేరతారు.

అలా టైమ్ మెషీన్లో 1998 లో తమ బాల్యంలోకి ప్రవేశించాక అక్కడేం జరిగింది? ఎవరెవర్ని కలిశారు? ఆది తల్లిని కలుసుకున్నాడా? ఆమెకు రోడ్డు ప్రమాదం జరగకుండా ఆపగలిగాడా? తన మదర్ ఫిక్సేషన్ సమస్య ఎలా పరిష్కరించుకున్నాడు? చిన్నప్పుడు చదువుని నిర్లక్ష్యం చేసిన శీను ఆ తప్పుని ఎలా సవరించుకున్నాడు? సీతని ప్రేమించలేక పోయిన చైతూ ఇప్పుడు సీతని ప్రేమించి పెళ్ళి సమస్య తీర్చుకున్నాడా?

ఇదంతా ఇలావుండగా, 1998 లో తమ చిన్నప్పటి ఆది, శీను, చైతూలు ఆ కాలంలో మాయమైపోయి ఈ కాలంలోకి (2019) ఎలా వచ్చారు? 1998 లోకి వాళ్ళతో పనిబడి వెళ్ళిన ఇప్పటి ఆది, శీను, చైతూలు ఈ వింత పరిస్థితికి ఎలా రియాక్ట్ అయ్యారు? అప్పుడేం చేశారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

సైన్స్ ఫిక్షన్ జానర్ కథ. సైన్స్ ఫిక్షన్ తో హాలీవుడ్ నుంచి రెగ్యులర్ గా వచ్చే టైమ్ ట్రావెల్ సినిమాల్లో ఎబౌట్ టైమ్ (2013) కూడా ఒకటి. ఇందులో తండ్రీ కొడుకుల కథ. మరణం, పశ్చాత్తాపం గురించి. నిజంగా కంట తడిపెట్టించే కథ. గర్ల్ ఫ్రెండ్ తో ప్రేమ గురించి కూడా. ఒకే ఒక జీవితం తల్లీకొడుకుల కంట తడిపెట్టించే కథ అనుకుని చేసిన కథ. ఈ కంట తడి పెట్టించే విషయం నడుస్తున్న కథ కావల వుంటూ, సందర్భోచితంగా వుండకపోవడం ప్రత్యేకత.

ఈ కథ కూడా మరణం, పశ్చాత్తాపం గురించే. అయితే ఈ కథలో తేడా ఏమిటంటే ట్విస్ట్.2019 లో వుంటున్న శర్వానంద్ తన ఫ్రెండ్స్ తో 1998 లోకి వెళ్తే, అక్కడ 1998 లో వుంటున్న వాళ్ళ చిన్ననాటి క్యారక్టర్స్ 2019 లోకి వచ్చేసి కథని తలకిందులు చేయడం ట్విస్ట్. ఇంటర్వెల్లో ఇన్నోవేటివ్ ట్విస్ట్, మంచి క్రియేటివ్ ఆలోచన. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టు చూపించడం కథ అన్పించుకోదు, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని చెప్పడం ఆసక్తి రేపే కథవుతుంది. ఇలా జరిగితే? -అన్న what if ? factor తో వుండే కథలు ఏదో కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తాయి.

ఇప్పుడు కావాల్సింది ఓ టెంప్లెట్ గా వుంటున్న టైమ్ మెషీన్ కథల్ని ఇలా ఇన్నోవేట్ చేసే కొత్తాలోచనలే.  బింబిసార లో కూడా ఇన్నోవేషన్ వుంది. గతం లోంచి కళ్యాణ్ రామ్ పాత్ర ప్రస్తుతంలోకి రావడం. ప్రస్తుతం లోంచి గతంలో కెళ్ళే టెంప్లెట్ కిది రివర్సల్. ఇందుకే వున్న కథల్ని, పాతబడి పోయిన అవే కథల్ని, రివర్స్ చేసి ఆలోచించాలనేది.

ప్రస్తుత కథ చాలా కొత్తాలోచనతో వున్న కథ. సినిమా సాంతం ఈ కొత్తాలోచనతో సాగి వుంటే యావరేజ్ ని దాటి కొన్ని రెట్లు సక్సెస్ అయ్యేది. సంచలన హిట్ అయ్యేది. దీని తమిళ వెర్షన్ ఫ్లాపయ్యింది. ఐడియా దశలోనే ఆ రేంజి పొటెన్షియల్ ఈ కొత్తాలోచనకి కనబడుతోంది. ముందు ఐడియాని వ్యూహాత్మకంగా నిర్మించుకునే ఆలోచన చేయకుండా, ఎలా పడితే అలా ఇష్టారాజ్యంగా కథ చేసుకుపోవడం వల్ల- ఓ మాదిరి సక్సెస్ దగ్గరాగి పోయింది.

ఇందులో ప్రేక్షకులకి సంతృప్తి పరుస్తున్నవి శర్వానంద్ కి సైన్స్ ఫిక్షన్ అనే కొత్త ఫ్రేము, ఆ ఫ్రేము లోపల తల్లీ కొడుకుల సెంటిమెంటల్ దృశ్యాలు కావొచ్చు. సినిమాల సక్సెస్ కి  ఈమాత్రం ఫార్ములా చాలనుకుంటే ఇక కథలతో ఎక్కువ కష్టపడాల్సిన అవసరమేముంది. ఇలాగే తీసుకుంటూ పోవచ్చు.

న్యూట్రల్లో కొత్తాలోచన
ఇలా ఇంటెర్వెల్లో కొత్తాలోచనగా మారిన ఈ కథ, ముందు కెళ్తూ ధడాలున న్యూట్రల్ వేసుకుని కూర్చుంది. ఫస్టాఫ్ వెన్నెల కిషోర్, ప్రియదర్శిల క్యారక్టర్స్ తో ఫన్నీగా సాగుతూ ఇంటర్వెల్లో ఇంత ఇన్నోవేటివ్ ట్విస్టుతో రివర్స్ అయిన కథ, సెకండాఫ్ వచ్చేసరికి పాత మూస ఫార్ములాయే శరణ్యమంటూ ఇన్నోవేషన్ ని అర్ధాకలితో వదిలేసింది.

రాహుల్ గాంధీ 41 వేల రూపాయల టీ షర్టులాగా ఓ మెరుపు మెరిపించిన ట్విస్టు కాస్తా, సెకండాఫ్ కి 14 రూపాయల కాలం తీరిన పచ్చడి ప్యాక్ కింద మారిపోయింది. ఎంతైనా శర్వానంద్ శర్వానందే. వరస పరాజయాల అవే ఫ్యామిలీలు, మదర్ సెంటిమెంట్లు, ప్రేమలు, బాధలూ, కన్నీళ్ళూ తనతో వుండాల్సిందే. సైన్స్ ఫిక్షన్ అనే కొత్త ఫ్రేములో అదే పాత విషయం జానర్ మర్యాదకి విరుద్ధంగా. ఫస్టాఫ్ అమ్మ గురించే బాధ, సెకండాఫ్ అదే అమ్మతో విషాద కథ. డైనమిక్స్ లేవు, ఫస్టాఫ్- సెకండాఫ్ రెండూ ఒకే శాడ్ మూడ్.

1975 లో బాపు - రమణ గార్ల ముత్యాల ముగ్గు కూడా మూలంలో విషాద కథే. మూలంలో ఆ విషాదం దగా పడిన భార్యగా సంగీత పాత్రదే. మూలంలో ఆ విషాదాన్ని ఆ పాత్ర సర్కిల్ ఆఫ్ బీయింగ్ గా అక్కడే వుంచి, శోక రసాన్ని కేంద్ర బిందువుగా అక్కడే పరిమితం చేసి, దాని వెలుపల ఆమె జీవితాన్ని చక్కదిద్దే ఆమె పిల్లలిద్దరితో అద్భుత రసంతో హాస్యభరిత కథనం చేసి ఎంటర్ టైన్ చేశారు. సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు చూసినా పాత సినిమాలా అన్పించని, సినిమాకి కావాల్సిన డైనమిక్స్ తో, నవ్యతతో  వుంటుంది.

సైన్స్ ఫిక్షన్ జానర్ మర్యాద
ఇలాగే శర్వానంద్ మదర్ తో స్టోరీ కూడా ఇది సైన్స్ ఫిక్షన్ అయినందుకు ఎంటర్ టైన్ చేయాల్సింది- ఏడ్పించాలని ప్రయత్నించడం కాదు. శోకం మదర్ క్యారక్టర్ కే పరిమితం చేస్తూ, ఆ శోకాన్ని తీర్చేందుకు శర్వానంద్ వివిధ కామిక్- యాక్షన్ ఎపిసోడ్స్ సృష్టిస్తూ పోవాల్సింది. సైన్స్ ఫిక్షన్ జానర్ మర్యాద ప్రధానంగా అద్భుత రసమే (అడ్వెంచర్) తప్ప, శోక రసం కాదనేది తెలిసిన పాత విషయమే.

శర్వానంద్ గతంలోకి వెళ్ళింది ప్రమాదానికి గురై చనిపోయిన మదర్ ని, ఆ  ప్రమాదానికి గురి కాకుండా కాపాడుకునే లక్ష్యంతోనే. ఆ ప్రమాదం జరగడానికి రెండు రోజులే వుంది. ఇంతలో చిన్నప్పటి తను, తన ఫ్రెండ్స్ ముగ్గురూ, తాము వచ్చిన టైమ్ మెషీన్ లోనే 2019 లోకి తప్పించుకున్నారు. దీంతో శర్వానంద్ లక్ష్యం ప్రమాదంలో పడింది.

ఇంటర్వెల్లో ఈ ట్విస్టు కథని ఎలివేట్ చేయడానికే కాదు, కథ నడవడానికి అవసరమున్న ప్రత్యర్ధి పాత్రల్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తోంది. అటు 2019 లోకి పారిపోయిన మాస్టర్ ఆది, మాస్టర్ శీను, మాస్టర్ చైతూలు - ఇటు 1998 లోకెళ్ళి అక్కడే ఫూల్స్ గా మిగిలిన మిస్టర్ ఆది, మిస్టర్ శీను, మిస్టర్ చైతూల గోల్స్ కి ప్రత్యర్ధులుగా సవాలుగా తయారయ్యారు. దర్శకుడు తన కథనంలో దాగి వున్న ఈ మర్మాన్ని గుర్తించి, దీన్ని ఎస్టాబ్లిష్ చేసి వుంటే కథ స్ట్రక్చర్లో వుండేది. స్ట్రక్చర్లో వుండడమంటే శర్వానంద్ ది యాక్టివ్ పాత్ర అవడమే. ఇలా మిస్టర్స్ ఒకవైపు- మాస్టర్స్ ఒక వైపూ అన్న ఈ బలాబలాల సమీకరణతో సంఘర్షణ ప్రారంభమై, సెకండాఫ్ సైన్స్ ఫిక్షన్ జానర్ మర్యాదలకి లోబడి అద్భుత రసంతో అద్భుతాలు చేసేది.

ఇలా చేయక పోవడంతో  మిస్టర్లూ మాస్టర్లూ అందరూ కథలో దారీ తెన్నూ కానరాక, గోల్స్ లేక, దేవుడే దిక్కు అన్నట్టు చెల్లా చెదురుగా తిరుగుతూ వుండిపోయారు. అప్పుడప్పుడు శర్వానంద్ మదర్ సెంటిమెంట్ల కోసం మదర్ అమలతో సీన్లు. కానీ ఇక్కడ ఏర్పడ్డ అర్జెన్సీ ఏమిటంటే, కథలో అవతల కౌంట్ డౌన్ సెట్ అయ్యింది- మదర్ కి యాక్సిడెంట్ జరగడానికి రెండే రోజులుంది.

విధి వర్సెస్ సైన్స్?
ఈ కౌంట్ డౌన్ ఎలిమెంట్ అనేది అద్భుత రసంతో కూడిన చాలా ఇంట్రెస్టింగ్ పాయింటు. ఎలాగంటే గతంలో యాక్సిడెంట్ జరిగి చనిపోయిన మదర్ ని, ఇప్పుడు విధి నెదిరించి ఎలా కాపాడుకుందామని వచ్చాడు? ఈ విధి వర్సెస్ సైన్సు పోరులో ఏది గెలుస్తుంది? ఇది ఈ కథని డ్రైవ్ చేసే డ్రమెటిక్ క్వశ్చన్. ముగింపులో విధియే గెలిచినట్టు చెప్పారు. కానీ నడిపిన కథ మాత్రం డ్రమెటిక్ క్వశ్చన్ ప్రకారం కాదు. ఏదీ దాని ప్రకారం కథనంతో వుండదు. ఇంటర్వల్ ట్విస్టు ప్రకారం కథనం వుండదు, డ్రమెటిక్ క్వశ్చన్ ప్రకారమూ కథనం వుండదు.

కానీ ఇంటర్వెల్ ట్విస్టు శర్వానంద్ పాత్ర అనుభవించిన విషమ పరిస్థితి, డ్రమెటిక్ క్వశ్చన్ వచ్చేసి శర్వానంద్ పాత్ర అనుభవిస్తున్న సమస్య- కానీ అనుభవాలు అవుతూనే వుంటాయి, నేను మాత్రం అదే ఫస్టాఫ్ పాసివ్ పాత్రగా ఏమీ చేయకుండా బాధపడుతూ, ప్రేక్షకుల్ని కన్నీటి సముద్రంలో ముంచేస్తాను- అంతేగానీ యాక్టివ్ పాత్రగా మారి, కర్తవ్య పాలన చెయ్యను- కర్తవ్య పథ్ తో నాకు సంబంధంలేదు, కథని జోడో యాత్ర తో కూడా నాకు సంబంధం లేదని ప్రకటించేస్తే ఇలాగే వుంటుంది.

అలా కథని పరిపుష్టం చేసే డ్రమెటిక్ క్వశ్చన్ కూడా ఏర్పడ్డాక, దీంతో ఇప్పుడు మదర్ ని కాపాడుకోవడంతో బాటు, 2019 లోకి పారిపోయిన మాస్టర్ ఆదిని పట్టుకొచ్చి మదర్ తో కలిపే ద్విముఖ ఎజెండాగా కథ ఎలివేట్ అవ్వాలి. ఈ ఎలివేషన్ ని కూడా వదిలేసి, కనిపించకుండా పోయిన కొడుకు (మాస్టర్ ఆది) కోసం మదర్ పడే బాధే ప్రధానంగా సెకండాఫ్ కథ చేసుకు పోవడంతో - సెకండాఫ్ ప్రతిపాదిత కథతో సంబంధం లేని అనవసర, అసందర్భ ఎమోషన్లూ ఏడ్పులతో విషాద భరిత కథగా మారిపోయింది. ఇలాచేసి విధియే గెలిచిందని చెప్పడం, విధితో పోరాడకుండానే?

ఇంకోటేమిటంటే, ఇంటర్వెల్ ట్విస్టుని పరిష్కరించడానికి ఇంకిన్ని ట్విస్టులు వేస్తూ కన్ఫ్యూజ్ చేయడం. మాస్టర్లు 1998 లోంచి 2019 లోకి వెళ్ళిపోతే, 1998 లో వుండిపోయిన మిస్టర్లు 2019 లోకి కూడా వచ్చి యాక్షన్స్ సీన్స్ చేయడం, మళ్ళీ 1998 లో కన్పించడం-  ఇలా ఇదొక కన్ఫ్యూజుడు వ్యవహారంగా వుంది.

నటనలు- సాంకేతికాలు

శర్వానంద్ గతాన్ని తల్చుకుంటూ వర్తమానంలో బాధపడే సంఘర్షణాత్మక పాత్రలో బాగానే నటించాడు గానీ, అస్తమానం బాధపడ్డమే తప్ప, హీరోయిజంతో హుషారుగా చేసేదేమీ లేకపోవడంతో మరో పాసివ్ పాత్రగా మారి యూత్ అప్పీల్ అనే బాక్సాఫీసు విలువకి దూరమయ్యాడు. శర్వానంద్ వరస పరాజయాలకి పాసివ్ పాత్రలే పోషించడం కూడా ఒక కారణం. పైగా ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ ఫన్ తోనే ఎక్కువ సీన్లున్నాయి. శర్వానంద్ ఎక్కడున్నాడా అని చూసుకునేంత గ్యాప్ వస్తూంటుంది.

శర్వానంద్ ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం చనిపోయిన మదర్ గురించే ఇంకా బాధపడుతూ గడపడం, కథ కోసమన్నట్టు అతిగా, అసహజంగా వుంది తప్ప, కన్విన్సింగ్ గా అన్పించదు. బాధకి లాజిక్ వుంటే నటనకి సానుభూతిని రాబట్టుకునే గుణముంటుంది. పెళ్ళి చేసుకుని నాన్నా అన్పించుకోవాల్సిన వయస్సులో ఇంకా అమ్మా ఏమిటి? అతను సైంటిస్టు మాటల్ని నమ్మి అమ్మ కోసం టైమ్ ట్రావెల్ చేయాలా, లేక సైకియాట్రిస్టుతో హిప్నటిజం చేయించుకుని తనని ఇబ్బంది పెడుతున్న మానసిక నిషేధాల్ని తొలగించుకోవాలా?

టైమ్ ట్రావెల్ కథలు మానసిక నిషేధాల్ని తొలగించుకోవడం గురించే. సైకో థెరఫీ గురించే. హిప్నటిజం గురించే. హిప్నటిజంలో జరిగేది టైమ్ ట్రావెలే. మానసిక సమస్యలు పుట్టడానికి గతంలో ఏదైతే కారణమయ్యిందో, హిప్నటిజంతో ఆ గతంలోకి టైమ్ ట్రావెల్ చేయించి, ఆ మానసిక సమస్యని అక్కడ రిపేరు చేయించి తీసుకు వస్తాడు సైకియాట్రిస్టు.

గతంలో కెళ్ళి యాక్సిడెంట్ జరగకుండా మీ అమ్మని కాపాడుకోవచ్చని సైంటిస్టు చెప్పడం అశాస్త్రీయమే. జరిగిన యాక్సిడెంట్ యాక్సిడెంటే. గతంలో ఆ భౌతిక స్థితిని మార్చలేం, మానసిక స్థితినే మార్చుకోగలం. సైంటిస్టు చెప్పాల్సింది, నువ్వు టైమ్ ట్రావెల్ చేసి, అక్కడ మీ అమ్మ మరణమనే వాస్తవంతో రాజీపడడం నేర్చుకుని, తిరిగి రావడమే నని మాత్రమే. అప్పుడే శాస్త్రీయం.

ముగ్గురూ ఒకే గాటన!
ఇక్కడ వెన్నెల కిషోర్, ప్రియదర్శి పాత్రల సమస్యలు, శర్వానంద్ పాత్ర సమస్యకి భిన్నం. శర్వానంద్ మదర్ ని తిరిగి బ్రతికించుకోవాలని. ఇది సాధ్యం కాదు. వెన్నెల, ప్రియదర్శిల సమస్యల పరిష్కారం సాధ్యమే. వెన్నెలది చిన్నప్పుడు చదువుకోక పోవడంతో ఇప్పుడు మంచి ఉద్యోగంలేక బ్రోకర్ గా హీనంగా బ్రతుకుతున్నానని సమస్య. దీంతో టైమ్ ట్రావెల్ చేసి, అక్కడ శర్వానంద్ తో బాటే వీధి చేతిలో ఓడిపోయానని తిరిగి వచ్చి- బ్రోకర్ గానే బ్రతక్క తప్పదని రాజీ పడిపోతాడు.

కానీ తనకి విధితో సంబంధంలేదు, తనది మానసిక సమస్యే. ఆ సమస్యతో టైమ్ ట్రావెల్ చేసినప్పుడు, చదువుని నిర్లక్ష్యం చేసిన వాస్తవం వాస్తవమే, అయితేనేం, బ్రోకర్ గా రియల్ ఎస్టేట్ లో మిలియనీర్ గా ఎదగ వచ్చన్న సైకో థెరఫీతో, పరిపక్వతతో అతను తిరిగి రావాలి, రాలేదు. వ్యక్తిత్వ వికాసం లేని నెగెటివ్ జడ్జ్ మెంట్ ముగింపు.

ప్రియదర్శీ డిటో. స్కూలు రోజుల్లో తనని ప్రేమిస్తున్న సీతని ప్రేమించకుండా పోగొట్టుకున్నానని సమస్య. ఈ సమస్యతో టైమ్ ట్రావెల్ చేసినప్పుడు, శర్వానంద్ తో బాటే విధి చేతిలో ఓడిపోయానని తిరిగి వచ్చి, విధియే కరెక్ట్ అని రాజీపడిపోతాడు. తనది కూడా మానసిక సమస్యే. ఈ సమస్యతో టైమ్ ట్రావెల్ చేసినప్పుడు, సీతని నిర్లక్ష్యం చేసిన వాస్తవం వాస్తవమే, అయితేనేం, ఒక సీత దగ్గరే జీవితం ఆగిపోదన్న సైకో థెరఫీతో, పరిపక్వతతో ఇంకో సీత కోసం రావాలి, రాలేదు. ఇది కూడా వ్యక్తిత్వ వికాసం లేని నెగెటివ్ జడ్జ్ మెంట్ ముగింపే. 

అంటే ఎవరైనా  గతంలో చేసిన తప్పులకి నిష్కృతి లేదనీ, ఇలాగే కుమిలిపోవాలనీ మేసేజీ ఇవ్వడం. సైంటిస్టుని, శర్వానంద్ నీ నమ్మి వీళ్ళిద్దరూ కూడా చెడిపోయారు. శర్వానంద్ సమస్యనీ, వీళ్ళిద్దరి సమస్యల్నీ ఒకే గాటన కట్టి ఒకే కథ చేసేశారు. శర్వానంద్ ది ప్రధాన కథగా వుంచి దానికో పరిష్కారం, వీళ్ళిద్దరిదీ ఉపకథలుగా చేసి వీళ్ళిద్దరికీ వేరే పరిష్కారం చూపాల్సిన అవసరాన్ని గుర్తించలేదు. అందరి రోగాలకీ విధి అనే ఒకే మందు వాడేశారు.

మరోసారి చంపిన తంతు
శర్వానంద్ చిన్నప్పుడు మదర్ అంత గొప్పగా  గిటార్ మీటడం నేర్పించి, కాంపిటేషన్ కి స్వయంగా తీసుకొచ్చి దిగబెట్టి పోతే, కాంపిటీషన్ ఎగ్గొట్టి నేస్తాలతో షికార్ల కెళ్ళడం మొత్తం కథనీ, పాత్రచిత్రణనీ దెబ్బతీసింది. ఏ మదరైనా కాంపిటీషన్లో కొడుకు పెర్ఫార్మెన్స్ ని చూసి మురిసి పోవాలనుకుంటుంది. ఆమె కూడా వుంటే కొడుకు నేస్తాలతో 2019 లోకి వెళ్ళిపోవడం కుదరదని కథ కోసం చేశాడు కథకుడు ఇద్దరి పాత్రచిత్రణల్ని దెబ్బ తీస్తూ. ఇలా చిన్నప్పుడు కాంపిటీషన్ ఎగ్గొట్టి షికారు కెళ్ళిన శర్వానంద్ కి వుండాల్సింది తను తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్. మదర్ ని ఏమారుస్తూ కాంపిటీషన్ కి డుమ్మా కొట్టినందుకు- మదర్ లేకపోతే బ్రతకలేనని ఇరవయ్యేళ్ళూ బాధపడడం గాకుండా- గిటారుతో ప్రోగ్రాములిస్తూ మదర్ ఆత్మని సంతోష పెట్టొచ్చు.

ఇక టైమ్ ట్రావెల్ చేసి మదర్ ని బ్రతికించుకునే ప్రయత్నం కూడా ఆమెని మరోసారి చంపిన తంతుగానే తేలింది. ఇది చాలా ఘోరం. కథకుడు తానేం చేస్తున్నాడో గ్రహించడం లేదు. కౌంట్ డౌన్ పూర్తి కావస్తోంది. ఉదయం తొమ్మిది గంటలకి యాక్సిడెంట్ టైమ్. ఆ టైమ్ లో ఇల్లు కదలకుండా చూడలేదు. ఆమె కొడుకు కనిపించడం లేదన్న దుఖంతో తిరుగుతోంది. కొడుకు మాస్టర్ ఆది 2019 లోకి వెళ్ళి పోయాడని ఆమెకి తెలీదు.

అలా తిరుగుతున్న ఆమె కారాగిపోయి వుంటే శర్వానంద్ వచ్చేసి వెంటనే అక్కడ్నించి తప్పించి ఆటో ఎక్కిస్తాడు. ఈ లోపు తానే కొడుకని చెప్తాడు. ఇక్కడ ఎమోషనల్ డ్రామా. ఆటోలో డ్రైవర్ వుండడు (యాక్సిడెంట్ జరగడానికి ఒకటొకటే ఏర్పాట్లు చేస్తున్నాడు కథకుడు).  మదర్ ని ఆటోలో కూర్చోబెట్టి తను ఎక్కకుండా ఎమోషనల్ గా ఆమెనే చూస్తూంటాడు. శర్వానంద్. కౌంట్ డౌన్ క్షణాల్లో పూర్తికావొస్తున్నా ఆ ధ్యాససే వుండదు. ఇంతలో లారీ వచ్చి ఆటోని ని గుద్దేస్తుంది. మదర్ చచ్చి పోతుంది రెండో సారి వేరేగా.   
 
అసలు మొదటిసారి ఎలా యాక్సిడెంట్ జరిగి చనిపోయిందో మనకెక్కడా చెప్పలేదు. అప్పుడు కొడుకు 2019 లోకి వెళ్ళి పోలేదు. కాబట్టి కొడుకు కనిపించడం లేదన్న దుఖంతో తిరిగి వుండదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు కొడుకు కూడా వున్నాడా? ఎలా జరిగింది యాక్సిడెంట్? రిఫరెన్స్ గా ఈ దృశ్యాలు మనకి చూపించక పోవడం లోపం. ఆ రిఫరెన్స్ వుంటే ఇప్పుడు జరగబోయే యాక్సిడెంట్ ని ఆపే ప్రయత్నాల్లో థ్రిల్, సస్పెన్స్ పుట్టుకొస్తాయి. అప్పట్లో యాక్సిడెంట్ జరగడానికి ఏదైతే కారణమైందో, దాన్ని తొలగించే ప్రయత్నం శర్వానంద్ చేస్తూ థ్రిల్ నీ, సస్పెన్సునీ పుట్టించ గల్గుతాడు ఒక హీరోగా. ఏమిటా కారణం? అది తొలగించడం అసాధ్యమైతే, తన ప్రాణాలే అడ్డమేస్తాడా? వేయక తప్పదు కొడుకుగా. అప్పుడేం జరుగుతుంది? ఈ లాజికల్ ఎండ్ కి- పీక్ కి- కదా తీసికెళ్ళాల్సింది కీలక సన్నివేశాన్ని, ప్రేక్షకుల గుండెల్లో దడ పుట్టిస్తూ? మదర్ సెంటిమెంట్ అంటే ఇది కదా?

సమస్య ఎక్కడొచ్చిందంటే, ఈ కథ కథా రచనా ప్రక్రియకి విరుద్ధంగా మొదట్నుంచీ కథకుడే నడిపిస్తున్నాడు. పాత్రని దాని కథని అది నడుపుకో నివ్వడం లేదు. ఇలా చేస్తే పాసివ్ పాత్రలే పుడతాయి. కథకుడికేం తెలుసు పాత్ర ఏం చెయ్యాలో? పాత్రకి తెలుస్తుంది అదేం చేయాలో. కథకుడు పాత్రగా మారితే తెలుస్తుంది అదెందుకు చేస్తుందో. శర్వానంద్ పాత్ర కథకుడి చేతిలో కీలుబొమ్మ కాకపోతే, ఆ క్షణంలో మదర్ ని రోడ్డు మీదే వుంచకుండా తీసుకుని దూరంగా పరిగెట్టే వాడు. అతడి భావ సంచలనాలు అలాటివి.

ఏది రియల్ డ్రామా?
ఇక మదర్ సెంటిమెంట్ల సీన్ల గురించి. శర్వానంద్ తను కొడుకే అని మదర్ అమలకి చివరి క్షణాల వరకూ తెలియక పోతే సెంటి మెంటల్ డ్రామా ఎక్కడిది? ఆమెతో శర్వానంద్ చిన్నప్పటి క్యారక్టర్ - అంటే మాస్టర్ శర్వానంద్ తప్పిపోయాడనే బాధ, దుఖం, డ్రామా వగైరా. డ్రామా వుండాల్సింది ప్రధాన కథతోనా, ఫ్లాష్ బ్యాక్ తోనా? టైమ్ ట్రావెల్ చేసి కాలంలో వెనక్కి వెళ్ళి అక్కడి కథని తడిమే వన్నీ ఫ్లాష్ బ్యాకే అన్పించుకుంటాయి టెక్నికల్ గా. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన కథవదు. అది నడుస్తున్న ప్రధాన కథకి అవసరమైన గత సమాచారాన్ని అందించే వనరు మాత్రమే.

ఇక్కడ పెద్దవాడైన మిస్టర్ శర్వానంద్ తో వున్నది ప్రధాన కథ, బుడ్డోడు మాస్టర్ శర్వానంద్ తో ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ క్యారక్టర్ తో ప్రధాన కథ ఎలా నడుపుతారు? మాస్టర్ శర్వానంద్ తప్పిపోయాడన్న దుఖ పూరిత కథ, డ్రామా మదర్ తో ఎలా నడుపుతారు? ప్రేక్షకులు బాల నటుల్ని చూడాలని వస్తారా, తాము చూడాలని వచ్చిన స్టార్ తో కథ చూస్తారా?

అసలు మిస్టర్ శర్వానంద్ ఏ సమస్యతో 1998 లోకి వచ్చాడు? మదర్ ని కలుసుకోవాలనేగా? కలుసుకుని స్థిమిత పడాలనేగా? మరి చల్లకొచ్చి ముంత దాయడమెండుకు. పరిష్కారాని కొచ్చి కథ దాచడమెందుకు. ఆ కథేదో విప్పాలి. ఇదింకా  ఫస్ట్ యాక్ట్ కాదు, సెకండ్ యాక్ట్. సెకెండ్ యాక్ట్ అంటే పరిష్కారం కోసం పాట్లు. పాయింటు కొచ్చేయాలి. తను కొడుకే అని ఆలస్యం చేయకుండా చెప్పేయాలి. సాక్ష్యంగా చిన్నప్పటి విషయాలు గుర్తు చేయాలి. గుర్తు చేసి, 2019 లో నువ్వు లేకపోతే నేనుండ లేకపోతున్నానని తనతో వచ్చేయ మనాలి. విచిత్ర సిట్యుయేషన్ కి తెరతీయాలి. బుడ్డోడు ఆల్రెడీ 2019 లోకెళ్ళి పోయాడని చెప్పాలి. ఆమెకి యాక్సిడెంట్ ని తప్పించాలంటే, విధిని గెలవాలంటే, కాలాన్నే మార్చేసే ప్లాను భారీయెత్తున వేయాలి.

ఇదీ రియల్ డ్రామా. ఇంతేగానీ, కంట తడి పెట్టించే డ్రామా అంటే, అది నడుస్తున్న కథ కావల ఫ్లాష్ బ్యాక్ తో వుంటూ, అసందర్భంగా, కథకే మాత్రం ఉపయోగపడకుండా వుండడం కాదు. శర్వానంద్ ఈ డ్రామాతో వున్నప్పుడే పాత్రని నమ్మించగలడు. పాత్రని నమ్మిస్తే రియల్ ఎమోషన్స్ తో నటించి మెప్పించగలడు. కానీ ఈ మధ్య ఏమవుతోందంటే ఫేక్ ఎమోషన్స్ తో ఓ మోస్తరు ప్రేక్షకాదరణతో బయటపడుతున్నారు.

నటనలు ఇంకా...
తమిళ బాలనటులు బాగా నటించారు. ముఖ్యంగా యంగ్ వెన్నెల కిషోర్ గా నటించిన నిత్యరాజ్. వీడు వెన్నెల కిషోర్ అంత సూపర్ టాలెంట్. హీరోయిన్ రీతూ వర్మ ఫస్టాఫ్ లో కాసేపు, సెకండాఫ్ లో కాసేపూ  పాత్ర. ఎప్పుడూ అమ్మదాసులా వుండే శర్వానంద్ తో రోమాన్సేముంటుంది, కామెడీ ఏముంటుంది. 2019 లోకి వచ్చేసిన చిన్నప్పటి శర్వానంద్ ని చూసి ఆమె షాకు తినే సీను, ఆమె ఎవరో తెలీక చిన్నప్పటి శర్వానంద్ అక్కా అని పిలిచే సీనూ గమ్మత్తుగా వున్నాయి.

వెన్నెల కిషోర్ తిరుగులేని మహారాజు. 1998 లో చిన్నప్పటి తనని చూసుకుని వాణ్ణి చదివించడం కోసం పడే తంటాలతో అతడిది సూపర్ కామెడీ. ప్రియదర్శి కూడా చిన్నప్పటి తనని చూసుకుని, వాడు స్కూలు పిల్ల సీతని ఫ్రేమించేలా చేయడం కోసం పడే తంటాలతో నీటు కామెడీ. ఇక మదర్ పాత్రలో అమల సరే. ఆమెని భువి నుంచి దిగి వచ్చిన దేవతలా అతి సాత్వికంగా చూపిస్తూ శోక మూర్తిలా మార్చాడు దర్శకుడు. ఆ శోకం రాంగ్ ఛానెల్లో వుంది. విధితో ఆటలాడి చేతులు కాల్చుకునే సైంటిస్టుగా నాజర్ బ్రిలియెంట్ గా కన్పిస్తాడు. 

సిరివెన్నెల రాసిన మదర్ సాంగ్ వుంది. ఇది బిట్లు బిట్లు గా వస్తుంది. సిద్ శ్రీరామ్ పీల గొంతుతో పాడడమొకటి. ఇంకో రెండు సందర్భానుసారం వచ్చే బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ వున్నాయి. పెళ్ళి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ రాసిన మాటలు కామెడీ సీన్లకి బావున్నాయి. కెమెరా వర్క్, కళా దర్శకత్వం, 1998 నాటి దృశ్యాల లొకేషన్స్, సెట్స్  ఉన్నతంగా వున్నాయి. టైమ్ మెషీన్ బయల్దేరే సీన్లు సీజీతో పకడ్బందీగా వున్నాయి.

—సికిందర్