రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, March 13, 2022

1147 : స్క్రీన్ ప్లే సంగతులు

స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే 36 ఏళ్ళు పడుతుందేమోనని, వచ్చే తరాలు చదువుకునే ప్రాచీన గ్రంథ కోశం అవుతుందేమోననీ భయపడాల్సి వచ్చింది. కథ రాయడానికి దర్శకుడికే 18 ఏళ్ళు పట్టినప్పుడు దాన్ని పరామర్శించడానికి 36 ఏళ్ళు పట్టడంలో ఆశ్చర్యం లేదు. కారణం,   స్క్రీన్ ప్లే సంగతులు ఎలా రాయాలో అంతు చిక్కకపోవడం. జాతీయ మీడియాలో వెలువడిన కొన్ని రివ్యూల్లో   సినిమా కథ అర్ధమవడం కష్టమై పోయిందన్నారు. అసలు  రాధేశ్యామ్ టైటిల్ తో కథకేం సంబంధమో తెలియలేదన్నారు. ఇంత ప్రతిష్టాత్మక పానిండియా మూవీకి ప్రముఖ జాతీయ డిజిటల్ మీడియా, పెద్ద పత్రికలూ కలిసి నిర్మొహమాటంగా 1, 1.5 రేటింగ్స్ మాత్రమే ఇచ్చాయంటే షాకింగ్ గానే వుంటుంది. దీనికి దర్శకుణ్ణి ఒక్కణ్ణే బాధ్యుణ్ణి చేయనవసరం లేదు. కథ అంతిమ రూపం తీసుకునే వరకూ ఎందరి జోక్యాలు, జోస్యాలు వుంటాయో తెలియనిది కాదు. ఈ కథతో ప్రధాన సమస్య ఏమిటంటే, ఇది కథ కాకుండా గాథ కావడం! తయారు చేసుకునే కథలన్నీ కథలే అనుకోవడంతో, వాటిలో మాటువేసి వుండే గాథల్ని కథల్లాగే ట్రీట్ చేయడం వల్ల ఇలా మొదటికే మోసం వస్తోంది.  

        దీంతో రాధేశ్యామ్ స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే విషయాన్ని సమూలంగా గాథలా మార్చి రాస్తూ వివరించాల్సిందే. ఇలా చేస్తే చదవడానికి భారమైపోతుంది. కనక సంక్షిప్తంగా ఆపేరేటింగ్ టూల్స్ మాత్రమే చూద్దాం : 1. రోమాన్స్ లో ఇది రోమాంటిక్ కామెడీ కాదు, రోమాంటిక్ డ్రామా జానర్. 2. రోమాంటిక్ డ్రామాల్లో హీరో హీరోయిన్లవి పాసివ్ పాత్రలై వుంటాయి, 3. రోమాంటిక్ డ్రామాలు గాథల తరగతికి చెందుతాయి, 4. గాథ ఐడియా లేదా కాన్సెప్ట్ విషయ గాంభీర్యంతో వుంటుంది, 5. గాథ కూడా త్రీయాక్ట్స్ స్ట్రక్చర్లో వుంటుంది, 6. గాథ ముగింపు విషాదాంత మవచ్చు, లేదా సుఖాంత మవచ్చు.

ముందుగా కాన్సెప్ట్ సంగతి
మన రాత మన చేతుల్లో వుండదని, చేతల్లోనే వుంటుందనీ చెప్పడం కాన్సెప్ట్. ప్రభాస్ ప్రేమించిన పూజా ప్రాణాపాయంలో వుంటుంది. ఇది విధి రాత అనుకుని సరెండర్ అవకుండా, పొరాడి విధిని జయించాలని కాన్సెప్ట్ అనుకుని కథనం చేశారు. ఈ కాన్సెప్ట్ తప్పయితే, దీనికేం చేశారంటే- ఈ కాన్సెప్ట్ కి జ్యోతిషం వర్సెస్ సైన్సు పోరాటమని ఇంకో కాన్సెప్ట్ జోడించారు. ఈ కాన్సెప్ట్ కూడా తప్పే. అసలు రెండు వేర్వేరు కాన్సెప్ట్స్ తో ఒక గాథ ఎలా వుంటుంది. కథ కూడా వుండదు. అలాటిది రెండూ తప్పుడు కాన్సెప్టులే జత కలిస్తే గాథ పరిస్థితేంటి?

        ఈ జ్యోతిషానికీ సైన్సుకీ పోరాటమనే రెండో కాన్సెప్ట్ తో, జ్యోతిష గురువుగా కృష్ణం రాజు వచ్చేసి, ఒరిజినల్ కాన్సెప్ట్ లో జోక్యం చేసుకుంటూ వుండడంతో, అసలేం గాథ చెప్తున్నారో అర్ధంగాని గందరగోళం నెలకొంది.

        ఈ జ్యోతిషం వర్సెస్ సైన్స్ రెండో కాన్సెప్టులో సైన్స్ కంటే జ్యోతిషం గొప్పదని నిరూపించడం ఉద్దేశం. ఇదే పాయింటు కృష్ణం రాజు శిష్యుడైన ప్రభాస్ కూడా లేవదీస్తూ డాక్టర్ తో ఘర్షణకి దిగుతాడు. ఆ డాక్టర్ కూడా అర్ధం లేకుండా వాదిస్తాడు. ఒక పక్క పూజా నయం కాని క్యాన్సర్ తో వుంది, ఇంకో రెండు మూడు నెలల్లో చనిపోతుందని డాక్టర్ అంటాడు. ఇంతకి ముందు ఆమె హస్త రేఖల్లో ప్రభాస్ దీర్ఘాయుష్షు చూశాడు కాబట్టి ఆమె చనిపోదని, బ్రతుకుంటుందనీ వాదిస్తాడు.      

        ప్రభాస్ జోస్యం సంగతెలా వున్నా, వైద్యపరంగా ఆలోచిస్తే ఆమె బ్రతుకుతుందని ప్రభాస్ అనడం పాజిటివ్ విజనేగా? రోగికి నువ్వు బ్రతుకుతావని ఆత్మవిశ్వాసం కల్పించడం నెగెటివ్ విజన్ ఎలా అవుతుంది. కౌన్సెలింగ్ గాక మూఢత్వ మెలా అవుతుంది. ఇక్కడ జ్యోతిషం వచ్చేసి సైన్స్ కెక్కడ అడ్డు పడింది. నీ జ్యోతిషంతో రోగికి మోసం చేస్తున్నావని డాక్టర్ అనడమేమిటి? ప్రభాస్ బ్రతుకుతుందని జోస్యం మాత్రమే చెప్పాడు- చెప్పి, ఈ రోగానికి మందులు అక్కర్లేదనీ, ఉంగరాలూ తాయెత్తులూ కడతాననీ అనలేదే? డాక్టర్ ఎందుకలా రెచ్చిపోవడం.

కాన్ఫ్లిక్ట్ సంగతి

కాబట్టి ఇలా ఈ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సెకండాఫ్ గాథని ఇలాగైనా నడిపించగల కాన్ఫ్లిక్ట్ లో కామన్ సెన్స్ లోపించడంతో - జ్యోతిషం వర్సెస్ సైన్స్ రెండో కాన్సెప్ట్ పూర్తిగా విఫలమైంది. మళ్ళీ ప్రభాస్ ఈ కాన్సెప్ట్ మీంచి ఒరిజినల్ కాన్సెప్ట్ కొచ్చి - ఇది విధికీ ప్రేమకూ మధ్య యుద్ధమని ఫైనల్ గా తేలుస్తాడు ఇంటర్వెల్లో! విధికీ ప్రేమకూ యుద్ధం కూడా ఎలా అయింది? పూజా హస్త రేఖలు బాగానే వున్నాయే దీర్ఘాయుష్షుని  సూచిస్తూ? ఆమె జీవిత రేఖ సరిగా లేకుండా, దీనికి అనుగుణంగానే  క్యాన్సర్ వచ్చుంటే, డాక్టర్ చెప్పినట్టు రెండు మూడు నెలలే బ్రతుకుతుందనుకుంటే- అప్పుడు ఈ విధిని ఎదిరించడానికి ప్రేమకూ విధికీ యుద్ధమని అంటే అర్ధముంటుంది గాని!

        అంటే ఆమెకి దీర్ఘాయుష్షు వుందని ప్రభాస్ చెప్పిన జోస్యం తప్పని తేలిందన్న మాట. వెనుక సీన్లో ఆమె చేయిచూసి అద్భుత భవిష్యత్తు వుందని చెప్తున్నప్పుడు, ఆమె ముక్కులోంచి రక్తపు చుక్క  అదే అరచేతిలో రాలి అప్పుడే పడుతుంది క్యాన్సర్ అన్నట్టుగా. ఇలా ఆ క్షణంలోనే అతడి జోస్యం తప్పని తేలిపోలేదా? ఆమె జీవితరేఖని ఆటంకపర్చే ఈ ప్రాణాంతక అనారోగ్యాన్ని చూడకుండా సంపూర్ణ ఆయుష్షని ఎలా అంటాడు?

        దీనికంటే వెనుక సీన్లో- రైల్లో ప్రయాణికులు చేతులు చాపి జాతకాలు చెప్పమన్నప్పుడు, ఆ చేతుల్లోకి చూస్తూ అంత మందికి చెప్పలేక, రైలు దిగి వెళ్ళిపోతాడు. రైలు వెళ్ళిపోతుంది. వెంటనే ప్రమాదం పసిగడతాడు. తను చూసిన హస్త రేఖల్లో వాళ్ళకి మృత్యువే పొంచి వుందని ఇక రైలాపడానికి పరుగు దీస్తాడు. రైలు యాక్సిడెంట్ అయి వాళ్ళంతా చనిపోతారు. ఇలా తన జోస్యం నిజమైంది. మరి ఇదే జ్యోతిష పాండిత్యంతో పూజా చేతి గీతల్లో క్యాన్సర్ ని - మృత్యువుని ఎందుకు చూడలేకపోయాడు.

     కాబట్టి పూజా జాతకరీత్యా విధికీ ప్రేమకూ యుద్ధం కాన్సెప్ట్ కూడా కాలేదిది. అసలు సంగతేమిటంటే, తన చేతిలోనే పెళ్ళి రేఖ లేదని ప్రభాస్ కి తెలుసు. దీంతో ఈ విధినెదిరించాలని ఎప్పుడూ అనుకోలేదు. విధి దాకా ఎందుకు, ఒక ప్రసిద్ధ పామిస్టుగా తన సమస్యని తానే పరిష్కరించుకో లేనప్పుడు ఇతరుల సమస్యల్నేం పరిష్కరిస్తాడు. భవిష్యత్తుని మార్చుకునే అవకాశం వుందని జ్యోతిష శాస్త్రం చెప్పడం లేదా? ఇది తెలియనట్టు కామన్ మాన్ లాగా బిహేవ్ చేయడమేమిటి.

ప్రభాస్ సంగతి

    ఇలా తనకి పెళ్ళి యోగం లేదనుకుంటున్నాడు గనుక, అమ్మాయిల్ని భ్రమల్లో పెట్టి కోరికలు తీర్చుకుని వదిలేస్తూ వుంటాడు. ఇది చాలా బ్యాడ్ క్యారక్టర్ ప్రభాస్ కి. ఇంతకంటే డ్యామేజ్ ఏం కావాలి గాథకి. పూజాని చూశాక ప్రేమలో పడతాడు. ఇప్పుడామెని పెళ్ళి చేసుకోవాలంటే తన పెళ్ళి రేఖే అడ్డు. అటువంటప్పుడు ఇప్పుడైనా ఒక గొప్ప హస్త సాముద్రికుడుగా తన సమస్యని పరిష్కరించుకోక, ఏదో విధి అంటూ పూజాకి ముడిపెట్టి ప్రేమ పోరాటమనడ మేమిటి?

        పూజా అనారోగ్యం విషయమే చూస్తే, స్పిరిచ్యువల్ గురువులే (బ్రహ్మకుమారి శివానీ, జగ్గీ వాసుదేవ్) ఏమంటారు. చాలా అనారోగ్యాలు ఆలోచనా తీరు మార్చుకుంటే నయమవుతా యంటారు. కానీ ప్రాణాంతక రోగాలు ఆలోచనా తీరు మార్చుకుంటేనో, దైవ ప్రార్ధనలు చేస్తేనో నయం కావంటారు. కాబట్టి ఈ ప్రయోగాలు మాని వైద్యం చేయించుకో మంటారు. అందుకని ప్రభాస్ ఆమె క్యాన్సర్ సంగతి డాక్టర్ కి వదిలేయాలి. ఆమెకి విధియే చుట్టుముట్టిందని అనుకుంటే, వైద్య సాయంతోనే ఆ విధితో పోరాడాలి తప్ప మాయలు మంత్రాలతో కాదు. కనుక ఆమెని డాక్టర్ కి వదిలేసి, తన చేతి రాతేంటో దాని సంగతి చూసుకోవాలి.     

            విధి అనే భావజాలం ముసుగేసిన దేవుడి బాక్సాఫీసు ఫార్ములాగా సినిమాలకి బాగానే సక్సెస్ నిస్తోంది. అయితే అసలు విధి అంటే ఏమిటి? మన పాత కర్మలే తిరిగి మన ముందుకొచ్చి సైల్యూట్ కొట్టడం. చేసింది మంచి కర్మలైతే మంచి రోజుల్ని విధి గిఫ్ట్ గా ఇచ్చేస్తుంది. చేసినవి చెడు కర్మలైతే చెప్పుల దండ మెళ్ళో వేసి వెళ్ళి పోతుంది. ఈ పని చేసేది పైన కూర్చుని ఎవరో కాదు. విధి, విధాత మనమే. ఉద్ధరించుకునేదీ, వాటం చూసి  వధించుకునేదీ మనమే. చెడు రోజులొస్తే, చేసిన చెడు కర్మల్ని మించేలా మంచి కర్మలు చేసినప్పుడు-  మంచి రోజులొచ్చేస్తాయి. ఇంతే, ఇంతకంటే రాకెట్ సైన్స్ లేదు. కర్మల బ్యాలెన్సింగే జీవితం.

        మన రాత మన చేతుల్లో వుండదని, చేతల్లోనే వుంటుందనీ చెప్పడమే రాధేశ్యామ్ కాన్సెప్ట్ అయితే, ప్రభాస్ ఎక్కడా తన విషయంలో గానీ, పూజా విషయంలో గానీ చేతల్లోకి దిగడు! ఈ లోగా డాక్టరే ప్రకటిస్తాడు క్యాన్సర్ కి మందు వచ్చిందని! అంటే సైన్సే  గెలిచిందా? ఇంత గందరగోళంగా వుంటే ఎలా!

        ఇలా రెండు లోపభూయిష్ఠ కాన్సెప్టుల్ని కాక్ టైల్ చేస్తూ ఒక ఒరలో ఇమిడ్చినప్పుడు, ఆ ఐడియా దశలోనే ఫ్లాప్ ని పసిగట్టి వుండాలి, ఐడియాని విస్తరించి గాథ చేసుకునే దాకా ఎందుకు. బ్రహ్మోత్సవం చూడలేదా? ఇలాటిదే. ఈ నిర్మాణం లేని ఐడియాతో గాథ చేసిన విధానానిక్కూడా అదృష్ట రేఖల్లేవు. ఇందులోకి వెళ్ళడం ఆపుదాం. ఇప్పటికే హెవీ అయివుంటుంది. ఇక్కడితో ఆపి, రేపు కథా (గాథా) కథనాల స్క్రీన్ ప్లే సంగతులు చూద్దాం. అది తేలికగా, సరదాగా వుంటుంది.

—సికిందర్ 

 

Saturday, March 12, 2022

స్క్రీన్ ప్లే అప్డేట్స్


స్టోరీ అయిడియాలు అనేక ప్రాప్తి స్థానాల నుంచి లభిస్తూంటాయి. చదివిన వార్తో, చూసిన సంఘటనో, విన్న సంభాషణో... ఏదైనా కావొచ్చు. ఆర్ట్ గ్యాలరీలలో పెయింటింగ్స్ ని తదేకంగా చూస్తూ దీని అర్ధమేమిటాని దీర్ఘంగా ఆలోచిస్తూంటాం. ఏదో అర్ధమవచ్చు, ఏదో అర్ధమవక పోవచ్చు. అంతటితో వదిలేస్తాం. కానీ వీటిని కూడా స్టోరీ ఐడియాల కోసం పరికిస్తే? వీటి ఆధారంగా కథ చెప్పాలన్పిస్తే? అప్పుడు వొరిజినల్ ఐడియాలు తట్ట వచ్చు. ప్రతీ పెయింటింగ్ ఒక కథ చెప్తుంది. ఆ పెయింటింగ్ లో వుండే డిటెయిల్స్ ని కలుపుకుని కథ అల్లుకోవచ్చు. ఏ పెయింటింగైనా కొన్ని జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంది. ఆ జ్ఞాపకాల్లో డామినేటింగ్ ఫీలింగ్ ఏదైతే వుంటుందో దాంతో కనెక్ట్ అయి పెయింటింగ్ ని ఆస్వాదిస్తాం. జ్ఞాపకాల్లో బాధాకరమో, సంతోషకరమో, స్ఫూర్తి దాయకమో, ఏదో ఒక ఫీలింగ్ నిచ్చిన సన్నివేశముండొచ్చు. వీటిలో ఏది డామినేటింగ్ గా వుంటే  ఆ ఫీలింగ్ తో పెయింటింగ్ తో కనెక్ట్ అవుతాం. పక్క పెయింటింగ్ చూస్తే, మనం గడిపిన ఎన్నో రైల్వే స్టేషన్లు జ్ఞాపకాల పొరల్ని దొల్చుకుని రావొచ్చు. ఎన్నో అనుభవాలు మెదలొచ్చు. వీటిలో ఒక స్టేషన్లో అయిన బాధాకర అనుభవమే మిగతా స్టేషన్లలో అయిన అనుభవాల్ని మరిపించే డామినేటింగ్ ఫీలింగ్ గా వుంటే, ఈ బాధాకరమైన ఫీలింగ్ తో పెయింటింగ్ ని చూస్తాం. సంతోషకరమైన  ఫీలింగ్ డామినేటింగ్ గా  వుంటే దాంతో చూస్తాం. ఈ డామినేటింగ్ ఫీలింగ్సే పెయింటింగ్స్ లో స్టోరీ ఐడియాలని నిర్ణయిస్తాయి.

        పై పెయింటింగ్ చూడగానే ఆహ్లాదకర ఫీలింగ్ తో కనెక్ట్ అయ్యామనుకుందాం, అప్పుడీ పెయింటింగ్ చెబుతున్న కథేమిటా ఆలోచిస్తాం. ఇది ఎప్పుడో అప్పటి ‘బొంబాయి’ స్టేషన్ దృశ్యం. పొగలు గ్రక్కుతూ ఆగిన రైలు. అది ప్లాట్ ఫాంలా లేదు. జనం తిరిగే రోడ్డులా వుంది. డిటెయిల్స్ లోకెళ్తే, ముందుగా మెయిన్ ఫిగర్. ఇదొచ్చేసి సైకిలు పట్టుకుని ఆగిన వ్యక్తి.  ఇతను ఆఫీసులకి లంచ్ బాక్సులు మోసే డబ్బావాలా. బొమ్మలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నది నీడలు. ఇవే ఆ డబ్బా వాలా కథ చెప్తున్నాయి. నీడలు ఇటు ఫోర్ గ్రౌండ్ లో పడుతున్నాయి. అంటే సూర్యుడు అటు వెనకాల వున్నాడు నీడల్ని బట్టి. ఆ వెనుక భవనం కన్పిస్తోంది. ఆ భవనం వెనకాల సూర్యుడు కన్పించకపోయినా, సూర్యుడు అటువైపే వున్నాడు. అది ఉదయించే సూర్యుడా, అస్తమించే సూర్యుడా? ఎందుకంటే నీడలు పొడవుగా పడుతున్నాయి, మధ్యాహ్నపు సూర్యుడై వుండడు. ఇక ఉదయం వేళ కూడా అయి వుండదు. ఎందుకంటే డబ్బావాలాలు లంచ్ అవర్ కల్లా బాక్సులు ఆఫీసులకి చేరేస్తారు. అందుకు ఇంత ఎర్లీగా బయలేదేరరు. కనుక ఇది సాయం వేళ. అయితే సాయం వేళ తిరిగి ఖాళీ బాక్సులు ఇళ్ళకి చేరేయరు డబ్బావాలాలు. ఉద్యోగులే తీసికెళ్ళిపోతారు. అంటే ఈ డబ్బావాలా  లంచ్ బాక్సులతో ఎప్పుడో బయల్దేరినా, సాయంత్రమవుతున్నా ఇంకా ఆఫీసులకి చేరుకోలేదన్నమాట!

Ejoumale Djearamine
       ఇదీ బొమ్మ చెప్పే కథ. ఇంకా డిటెయిల్స్ లో కెళ్దాం. చిత్ర కారుడు వ్యూహాత్మకంగా బొమ్మ వేశాడు. ఎక్కడా డబుల్ డిటెయిల్స్ ఇవ్వలేదు. ఆపరేటింగ్ డిటెయిల్స్ మీంచి దృష్టి చెదిరే ఎలాటి సెకండరీ డిటెయిల్స్ ఇవ్వలేదు. వాటిని ఎడిట్ చేశాడు. చెప్పాలనుకున్న థీమ్ వచ్చేసి, సాయంత్ర మవుతున్నా డబ్బావాలా ఆఫీసులకి చేరుకోలేదని. దీనికి సమయాన్ని సూచించే ఎండ తీవ్రతని, నీడల దిశనీ మాత్రం చూపిస్తే చాలు. ఇంకా భవనం వెనకాల సూర్యుడి జాడ కూడా చూపించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ నీడల్ని డిస్టర్బ్ చేస్తూ వెళ్తున్న వాహనాల్ని చూపించలేదు. ఇటు ఒకవైపే వస్తున్న వాహనాలని చూపించాడు. ఇంకా అటూ ఇటూ తిరిగే మనుషులతో కూడా నీడల్ని డిస్టర్బ్ చేయలేదు. మనుషుల్ని రైలు కటు వైపున్న ఫ్లాట్ ఫాం మీద చిత్రించాడు. ఇద్దరు మనుషుల్ని ఇటు చూపించినా నీడల్ని డిస్టర్బ్ చేయలేదు.  

       వాహనాల మీద మనుషులందరూ డబ్బా వాలాకి ఎదురొస్తున్న వాళ్ళే. వాళ్లకి ఎదురె ళ్తూ డబ్బావాలా ఒక్కడే హైలైట్ అవుతున్నాడు. ఇంకెవరితోనూ థీమ్ ని డిస్టర్బ్ చేయలేదు. అయితే అతను వెళ్తున్న దిశకే రైలింజను పొగ కూడా చూపిస్తూ సెకండరీ డిటెయిల్ ఇచ్చినా ఇది డిస్టర్బ్ చేయడం లేదు. ఇదింకో అర్ధాన్నిస్తోంది. ఇది తర్వాత చెప్పుకుందాం.  

          డబ్బావాలాకి ఎదురొస్తున్న వాళ్ళు బైక్స్ మీద వున్న వాళ్ళే. ఎవరూ సైకిల్ మీద లేరు. సైకిలుతో డబ్బావాలా ఒక్కణ్ణి చూపించినప్పుడే మన మైండ్ కథని పట్టుకుంటుంది. ఆ కథ పరుగులు దీస్తున్న కాలంతో ఇంకా సైకిలు మీద పోటీ పడుతున్నాడని. ఇప్పుడతను సైకిలు తొక్కుతూ ఎదురు వెళ్ళడం లేదు. ఆగిపోయి ఆలోచనలో పడ్డాడు. వీళ్ళందరూ బుర్రుమని మోటారు బళ్ల మీద ఆఫీసుల నుంచి వచ్చేస్తూంటే, ఇప్పుడు తను సైకిలు తొక్కుతూ వెళ్ళి పీకేదేంటని. 


S Elayaraja 
ఆ వెనుక ఎత్తైన భవనం ఇంకో సింబాలిజం. సమయానికి ఆఫీసుకి చేరుకోలేకపోయాక అది భూతంలా కన్పించడం సహజమే. రైలు పొగో, పొగ మంచో కూడా ఆ భవనాన్ని ఆవరించి మిస్టీరియస్ లుక్ నిస్తోంది. ఈ డిటెయిల్ చెదరకుండా వుండేందుకు కూడా భవనం వెనకాల సూర్యుడి ఉనికి ఏమీ ఇవ్వలేదు. నీరెండని భవనం మీద వేయకుండా, ఆపరేటింగ్ డిటెయిలుగా రైలు మీద వేసి రైలుని హైలైట్ చేశాడు.
         
 ఈ రైలేం చెప్తోంది? రైలంటే వేగం, మహా వేగం. అటుపక్క మోటారు వాహనాల వేగం. మధ్యలో వేగం లేని సైకిలుతో డబ్బా వాలా. రైలుని అవిరింజనుతో ఎందుకు చూపించడం? అంటే ఆ కాలంలోనే జీవన వేగం పెరిగిపోయిందని సైకిలుకి సాపేక్షంగా చూపించడానికి. ఇక రోడ్డేమిటి నీళ్ళు పడకపోయినా అద్దంలా తళతళ లాడుతూ స్పష్టమైన నీడల్నిస్తోంది? ఇక్కడ రోడ్డుని కూడా హైలైట్ చేయడం. రైలు పక్కన ప్లాట్ ఫాం వుంటుంది. రోడ్డు వుండదు. అంటే రైలంత వేగంగా ఇప్పుడు రోడ్ల మీద పరుగులు దీస్తున్నారు....మహా యంత్రపు రైలు మార్గాలూ, మోటారు వాహనాల రోడ్లూ ఒక్కటే, మధ్యలో నువ్వేంటి ఇంకా సైకిలు మీదా...అన్న సెన్స్. ఇదీ సంధికాలంలో డబ్బావాలా స్ట్రగుల్.

          ఈ పెయింటింగ్ ఫ్రేం అవతల కూడా కథ వుంటుంది. అటు లంచ్ బాక్సులందక ఇళ్ళకి ఫోన్లు చేసే ఉద్యోగుల ఆకలి కేకలుంటాయి. అక్కడింకెన్ని కథలు నడుస్తున్నాయో తెలీదు. 

          పెయింటింగ్ చెప్పే కథ, దాని ఫ్రేం అవతల వుండే కథలు కలిపి ఆలోచిస్తే స్టోరీ ఐడియాలు రావచ్చు. మనకి డబ్బా వాలాలుండరు. పాల వాడు కావచ్చు, ట్రాఫిక్ సమస్యని అధిగమించడానికి బైసికిల్ రైడ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ అతను కావచ్చు. ఇంకెవరైనా కావచ్చు. ఒక క్యారెక్టర్ పుట్టడానికి కూడలి. 

Raghunath Saaho 
         ఈ పోస్టులో మరికొన్ని పెయింటింగ్స్ ఇచ్చాం ఎక్సర్ సైజుకి. ఈ ఎక్సైర్ సైజులో ఈ ప్రశ్నలు వేసుకుంటే చాలు : పెయింటింగ్ కల్గిస్తున్న ఫీలింగ్ ఏమిటి? ఏ జ్ఞాపకాల్ని తట్టి లేపుతోంది? పెయింటింగ్ ఏదైనా రహస్యం చెబుతోందా? ఫ్రేం అవతల కథలో  ఏం జరుగుతూండొచ్చు? పెయింటింగ్ లో వున్న దృశ్యం కంటే ముందు ఏం జరిగి వుండొచ్చు? ఈ దృశ్యం తర్వాత ఇంకేం జరగొచ్చు? 

          దృశ్యంలో మెయిన్ ఫిగర్ స్థానే క్యారక్టర్నే వూహించుకుంటే?  క్యారక్టర్ కి ఇంతకి ముందే ఏదో జరిగి వుంటే దానికేం ఆలోచిస్తున్నాడు? ఎలా రియాక్ట్ అవబోతున్నాడు? క్యారక్టర్ కి ఈ సన్నివేశం తర్వాత ఏదో జరిగి జీవితం తలకిందులవబోతోందా? క్యారక్టర్ ఇప్పుడేదైనా రహస్యం బట్ట బయలు చేయబోతోందా? లేదా ఈ పెయింటింగ్ లో కన్పిస్తున్న దృశ్యమే క్యారక్టర్ కి ప్రతీ రాత్రి కలలోకి వస్తూ వెన్నాడుతోందా? దీనికేం కథ వుంది?...ఇలా ఎన్ని ప్రశ్నలైనా వేసుకోవచ్చు. ఈ ప్రశ్నల్లోంచి ఒరిజినల్ ఐడియాతో సినిమా కథకి పునాది పడొచ్చు. కావాలంటే ఇంటర్నెట్ లో ఇంకా చాలా పెయింటింగ్స్ వుంటాయి, ప్రాక్టికల్స్ కి  వాడుకోవచ్చు.

సికిందర్

 

ఫోటోలు చెప్పే పోలికలు 

 

Friday, March 11, 2022

1146 : రివ్యూ!



రచన -దర్శకత్వం : కె. రాధాకృష్ణ కుమార్
తారాగణం : ప్రభాస్, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, కృష్ణం రాజు, జగపతిబాబు, మురళీ శర్మ, సత్యరాజ్, సచిన్ ఖెడేకర్, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, రిద్దికుమార్ తదితరులు
పాటలు : కృష్ణకాంత్
, సంగీతం : జస్టిన్ ప్రభాకరన్, నేపథ్య సంగీతం : తమన్, ఛాయా
గ్రహణం : మనోజ్
పరమహంస, కళ : రవీందర్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు, శబ్ద గ్రహణం : రసూల్ పోకుట్టి
బ్యానర్స్ : యూవీ
క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్, టీ-సిరీస్,
నిర్మాతలు : భూషణ్ కుమార్, వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, ప్రసీదా ఉప్పలపాటి
నిడివి : 2 గంటల 16 నిమిషాలు
విడుదల
: మార్చి 11, 2022
***
          మాస్ యాక్షన్ ఇమేజితో ప్రస్తుతం డిమాండ్ లో వున్న పానిండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ అనే రోమాంటిక్ డ్రామాతో క్లాస్ టచ్ ఇవ్వడానికి విచ్చేశాడు. 2015 లో యూవీ క్రియెషన్స్ బ్యానర్ లో గోపీచంద్ తో జిల్ తీసి దర్శకుడిగా పరిచయమైన రాధా కృష్ణకుమార్ తో ప్రభాస్ ఈ ప్రయత్నం చేశాడు. అంతర్జాతీయ స్థాయి గల మేకింగ్ తో  అసక్తి రేపుతూ వచ్చిన ఈ భారీ బడ్జెట్ మెగా మూవీ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. తెలుగు సినిమా స్థాయిని తన గ్లోబల్ ఇమేజితో ప్రపంచం ముందుకు తీసికెళ్తున్న ప్రభాస్, రాధేశ్యామ్ ని ఆ ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాడా? ఇంకా రానున్న తన పానిండియా మూవీస్ పట్ల ప్రేక్షకుల క్రేజ్ మరింత పెరిగేలా చేయగలిగాడా? తెలుసుకుందాం...  

కథ

అల్ట్రా స్టయిలిష్ గా విక్రమాదిత్య (ప్రభాస్), పరమహంస (కృష్ణంరాజు) అనే గురువు దగ్గర హస్త సాముద్రికం నేర్చుకుంటూ వుంటాడు. అక్కడ్నుంచి ఉన్నట్టుండి ఇటలీ వెళ్ళిపోతాడు. అక్కడ సాముద్రికం ప్రాక్టీసు చేస్తూ పేరు తెచ్చుకుంటాడు. తనకి పెళ్ళి రేఖ లేదన్న విషయం తెలుసు. అలాటిది ఓ రోజు డాక్టర్ ప్రేరణ (పూజాహెగ్డేయ) అనే స్టన్నింగ్ బ్యూటీని చూసి ప్రేమలో పడిపోతాడు. అక్కడ్నుంచి రైల్లో, బస్సులో ప్రేమాయణం సాగిస్తూంటాడు. ఇంతలో ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరతాడు. అక్కడ డాక్టర్ ప్రేరణని ఇంకా గాఢంగా ప్రేమిస్తాడు. అతడి ప్రయత్నాలు ఫలించి ఇప్పుడామె ప్రేమించడం మొదడుతుంది. అయితే ఆమె ఆరోగ్యం బావుండదు. రెండు నెలలకి మించి బ్రతకదని డాక్టర్లు చెప్తారు. ఆమె చేయి చూసిన విక్రమాదిత్య నూరేళ్ళూ బ్రతుకుతుందని చెప్తాడు. ఎవరు నిజం? డాక్టర్లా, విక్రమాదిత్యా? సైన్సా, సాముద్రికమా? పెళ్ళి రేఖ లేని విక్రమాదిత్య విధితో ఎలా పొరాడి ప్రేమని నిజం చేసుకున్నాడు? ఇవి తెలుసుకోవడం గురించి మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ
ఐర్లాండ్ కి చెందిన ప్రసిద్ధ జ్యోతిష్కుడు కైరో (Cheiro) - (విలియం జాన్ వార్నర్, 1866-1936) ప్రేరణతో ఈ కథ చేసుకున్నానన్నాడు దర్శకుడు రాధా కృష్ణ కుమార్. ప్రముఖ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ దగ్గర కథ తీసుకుని, దాని మీద 18 ఏళ్ళూ వర్క్ చేసి నాల్గేళ్ళూ సినిమా నిర్మాణం చేశానన్నాడు. అంటే ఒక కాసాబ్లాంకా’, సన్ ఫ్లవర్’, టైటానిక్’, ఇంకా నికోలస్ స్పార్క్స్ నవలల ఆధారంగా తెరకెక్కే అద్భుత హైకాన్సెప్ట్ ప్రేమకథల స్థాయిలో మనోజ్ఞ ప్రేమ కావ్యంగా ఈ కథ తెరకెక్కి వుండాలన్న మాట. పబ్లిసిటీ విజువల్స్, ట్రైలర్స్ చూస్తే కూడా ఇదే సదభిప్రాయాని కొస్తాం. 

        హస్తసాముద్రికం- విధి- జీవితం అనే త్రికోణీయ చట్రంలో ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే మిథికల్ ఫాంటసీగా సమ్మోహనకర కాల్పనిక జగత్తు సృష్టించి వుండాలి. క్లాసిక్ టైటిల్, పానిండియా మార్కెట్, భారీగా 350 కోట్ల బడ్జెట్, ప్రభాస్ గ్లోబల్ ఇమేజి ఇవి కూడా కథని 3 కి పైగా రేటింగ్ తో వూహించుకునేలా చేస్తాయి. 2.25 రేటింగ్ తో సరిపుచ్చుకునే పరిపూర్ణ వైఫల్యాన్ని ఎవరూహిస్తారు గనుక. అసలు ఈ కథ చేయి చూస్తే అందులో జీవన రేఖే లేదని తెలుసుకోకుండా 18+ నాల్గేళ్ళూ ఇంత కఠోరంగా పరిశ్రమిస్తారని ఎవరనుకుంటారు గనుక.

        ఈ రోమాంటిక్ డ్రామా జానర్ కథలో అతడికి పెళ్ళి రేఖ లేదు, ఆమె ప్రాణాలతో వుండదు. ఇది బాక్సాఫీసుకి పనికొచ్చే ఫార్ములా అయిన విధి అనుకుంటే, ఈ విధితో కాన్ఫ్లిక్ట్ ని నిర్వహించడంలో హీరోహీరోయిన్లకంటే ప్రేక్షకుల్ని ఎక్కువ బాధపెట్టారు. విధి రాతని మన చేతల ద్వారా జయించవచ్చని చెప్పాలనుకున్నప్పుడు చేతలకంటే బాధలెక్కువ వున్నాయి. భారంగా పరిణమించిన కథతో బోరు ఎక్కువైంది. కథకి జీవన రేఖే లేనప్పుడు ఆత్మ కూడా లేదు. ఆత్మలేని ప్రేమని దృశ్య వైభవాలతో అలంకరించాలనుకున్నారు. మృత కళేబరానికి అలంకరణలు చేస్తే అమృత పానీయం తాగినట్టు నవ్వుతుందా కళేబరం? ఇలా కటువుగా చెప్పక తప్పడం లేదు బాధాకరమే అయినా.
 
నటనలు -సాంకేతికాలు


ప్రభాస్ తన వైరల్ ఇమేజిని పణంగా పెట్టి హస్తసాముద్రికుడి, ప్రేమికుడి సాఫ్ట్ రోల్ లో క్లాస్ గా కనిపించేందుకు చేసిన ప్రయత్నం నూటికి నూరుపాళ్ళూ విజయవంతమైంది. ఏ మాత్రం మాస్ షేడ్స్ లేని పాత్రతో చేసిన సాహసం బాగానే ఫలించింది. కానీ ఎంత సాఫ్ట్ గా, క్లాస్ గా వున్నా, పాత్ర పరంగా నటిస్తున్న కథలో సమస్యని ఎదురోకోవాల్సి వచ్చినప్పుడు, హీరోయిజాన్నే ఆశిస్తారు ప్రేక్షకులు. క్లాస్ కదాని పాసివ్ గా వుంటే ఒప్పుకోరు. ఇదే జరిగింది క్యారక్టరైజేషన్ తో.  
   
        మరొకటేమిటంటే, లవర్ బాయ్ క్యారక్టర్ లో ఫీల్ లేకపోవడం. హీరోయిన్ పూజా హెగ్డేతో నటించిన దృశ్యాల్లో రోమాంటిక్ రసాయనం అదృశ్యమవడం. పాటల్లో సైతం ఇద్దరి మధ్య ప్రణయ రసాలూరక పోవడం. కనీసం మామిడి పళ్ళయినా ప్రభాస్- పూజా చీకుతూంటే, అహనా పెళ్ళంట లో కోడిని వేలాడదీసి అది చూస్తూ, చికెన్ తింటున్న ఫీలింగు అనుభవించిన కోట శ్రీనివాసరావు లాగా - ఆ మామిడి పళ్ళని లొట్టలేసుకుని మనమే చీకుతున్నట్టుగా రసానందం పొందే వాళ్ళం. 300 రూపాయల టికెట్ కి కనీసం ఇది కూడా ఆశించడం తప్పు కాదేమో.

        పూజా హెగ్డే దేవకన్యలా ఫాంటసీ ప్రపంచాన్ని పరివ్యాప్తం చేసింది. కంటికే విందు. క్యారక్టర్ లో విషయం లేదు. ఇక భాగ్యశ్రీ, కృష్ణం రాజు, జగపతిబాబు, మురళీ శర్మ, సత్యరాజ్, సచిన్ ఖెడేకర్, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, రిద్దికుమార్ ఇలా చాలామంది అద్భుత తారాగణం కొలువు దీరారు కానీ, ఈ సినిమాలో వాళ్ళకి కొలువు లేవీ లేవు. సీన్లోకి రావడం, మన కేమైనా పనుందా అని చూడడం, వెళ్ళి పోవడం. ఆనాటి మైనే ప్యార్ కియా హీరోయిన్ భాగ్యశ్రీ అయితే, ప్రభాస్ తల్లిగా మేకప్ కూడా సరిగ్గా వేసుకోలేని అర్ధం పర్ధం లేని పాత్ర.

        ఏమాట కామాటే చెప్పుకోవాలి. జస్టిన్ ప్రభాకరన్ స్వరపర్చిన పాటల్లో ఆత్మ వుండి  వినాలన్పించేలా వున్నాయి. సోల్ ఫుల్ మ్యూజిక్. అలాగే తమన్ నేపథ్య సంగీతం కూడా సోల్ ఫుల్ గా దృశ్యాలకి బలం చేకూర్చే ప్రయత్నం చేసింది. కానీ దృశ్యాల్లో విషయం లేకపోతే ఎంత మంచి పాటలైనా, నేపథ్య సంగీతమైనా సినిమానెలా నిలబెడతాయి.

        అలాగే మనోజ్ పరమ హంస (ఛాయాగ్రహణం), రవీందర్ (కళ), కోటగిరి వెంకటేశ్వర రావు (కూర్పు), రసూల్ పోకుట్టి (శబ్ద గ్రహణం) మొదలైన సాంకేతికులందరూ అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం కనబర్చారు. దర్శకుడి స్క్రిప్టే వీళ్ళ శ్రమని వృధా చేసింది. 

చివరికేమిటి

హీరోయిన్ క్యాన్సర్ కథ చూపించడం కోసం 1970 ల నాటి నేపథ్యం ఏర్పాటు చేశారు. క్యాన్సర్ క్యాన్సరే, ఆ నేపథ్యంలో చూపించినా క్యాన్సర్ నయమయ్యే ఈ రోజుల్లో ఎవరు కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ వరకూ కథ ప్రారంభం కాక వివిధ పాత్రల పరిచయాలకే సరిపోయింది. ప్రభాస్, పూజాలు తప్పితే ఇంకే పాత్రకీ అర్ధం వుండదు. ఇంటర్వెల్ కి పూజా క్యాన్సర్ తో, ప్రభాస్ జోస్యంతో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు చేయడం వరకూ బాగానే వుంది. అయితే ప్రతీ తెలుగు సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు చేశాక, సెకండాఫ్ ఏం కథ చేసుకోవాలో తెలీక, సినిమా మొత్తాన్నీ నేలకేసి కొట్టి వెళ్ళి పోతున్నట్టు- ఇదే వైఖరిని ఇక్కడా విజయవంతంగా ప్రదర్శించారు.

        ఎప్పుడెప్పుడు క్లయిమాక్స్ కెళ్ళిపోయి ఆ నౌకాయానం, దాంతో సునామీ భీభత్సం చూపాలన్నట్టు ఇక కథని పట్టించుకోలేదు. విషయం లేక, తగిన సీన్లూ లేక, స్లో అయిపోయింది సెకండాఫ్ సినిమా నడక. ఆ తర్వాత ఎమోషనల్ గా కనెక్ట్ కాని, ఎమోషన్లే లేని ప్రేమ కథని నౌక ఎక్కించి, ఎంత సునామీ సృష్టించినా ఒడ్డున పడలేదు సినిమా.   చివరికి టైటానిక్ అమర ప్రేమ చూపిద్దామనుకున్న ప్రయత్నం కూడా పారక, మనల్ని ప్రకృతి వైపరీత్య బాధితుల్ని చేసి వదిలారు. ప్రభాస్ కి ఒకటే మెసేజ్- ఇలా కంటెంట్ లేని లోకల్ సినిమాలే తను కూడా నటిస్తూ, పానిండియా పేరుతో ప్రేక్షకుల్ని తేలికగా తీసుకోకుండా, ఇప్పుడే జాగ్రత్త పడాలని ఈ మల్టీ బిలియన్ బడ్జెట్ మెగా హంగామా చెబుతోంది.

—సికిందర్   
(స్క్రీన్ ప్లే సంగతులు ఆదివారం)