రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, మార్చి 2022, శుక్రవారం

1146 : రివ్యూ!



రచన -దర్శకత్వం : కె. రాధాకృష్ణ కుమార్
తారాగణం : ప్రభాస్, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, కృష్ణం రాజు, జగపతిబాబు, మురళీ శర్మ, సత్యరాజ్, సచిన్ ఖెడేకర్, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, రిద్దికుమార్ తదితరులు
పాటలు : కృష్ణకాంత్
, సంగీతం : జస్టిన్ ప్రభాకరన్, నేపథ్య సంగీతం : తమన్, ఛాయా
గ్రహణం : మనోజ్
పరమహంస, కళ : రవీందర్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు, శబ్ద గ్రహణం : రసూల్ పోకుట్టి
బ్యానర్స్ : యూవీ
క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్, టీ-సిరీస్,
నిర్మాతలు : భూషణ్ కుమార్, వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, ప్రసీదా ఉప్పలపాటి
నిడివి : 2 గంటల 16 నిమిషాలు
విడుదల
: మార్చి 11, 2022
***
          మాస్ యాక్షన్ ఇమేజితో ప్రస్తుతం డిమాండ్ లో వున్న పానిండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ అనే రోమాంటిక్ డ్రామాతో క్లాస్ టచ్ ఇవ్వడానికి విచ్చేశాడు. 2015 లో యూవీ క్రియెషన్స్ బ్యానర్ లో గోపీచంద్ తో జిల్ తీసి దర్శకుడిగా పరిచయమైన రాధా కృష్ణకుమార్ తో ప్రభాస్ ఈ ప్రయత్నం చేశాడు. అంతర్జాతీయ స్థాయి గల మేకింగ్ తో  అసక్తి రేపుతూ వచ్చిన ఈ భారీ బడ్జెట్ మెగా మూవీ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. తెలుగు సినిమా స్థాయిని తన గ్లోబల్ ఇమేజితో ప్రపంచం ముందుకు తీసికెళ్తున్న ప్రభాస్, రాధేశ్యామ్ ని ఆ ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాడా? ఇంకా రానున్న తన పానిండియా మూవీస్ పట్ల ప్రేక్షకుల క్రేజ్ మరింత పెరిగేలా చేయగలిగాడా? తెలుసుకుందాం...  

కథ

అల్ట్రా స్టయిలిష్ గా విక్రమాదిత్య (ప్రభాస్), పరమహంస (కృష్ణంరాజు) అనే గురువు దగ్గర హస్త సాముద్రికం నేర్చుకుంటూ వుంటాడు. అక్కడ్నుంచి ఉన్నట్టుండి ఇటలీ వెళ్ళిపోతాడు. అక్కడ సాముద్రికం ప్రాక్టీసు చేస్తూ పేరు తెచ్చుకుంటాడు. తనకి పెళ్ళి రేఖ లేదన్న విషయం తెలుసు. అలాటిది ఓ రోజు డాక్టర్ ప్రేరణ (పూజాహెగ్డేయ) అనే స్టన్నింగ్ బ్యూటీని చూసి ప్రేమలో పడిపోతాడు. అక్కడ్నుంచి రైల్లో, బస్సులో ప్రేమాయణం సాగిస్తూంటాడు. ఇంతలో ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరతాడు. అక్కడ డాక్టర్ ప్రేరణని ఇంకా గాఢంగా ప్రేమిస్తాడు. అతడి ప్రయత్నాలు ఫలించి ఇప్పుడామె ప్రేమించడం మొదడుతుంది. అయితే ఆమె ఆరోగ్యం బావుండదు. రెండు నెలలకి మించి బ్రతకదని డాక్టర్లు చెప్తారు. ఆమె చేయి చూసిన విక్రమాదిత్య నూరేళ్ళూ బ్రతుకుతుందని చెప్తాడు. ఎవరు నిజం? డాక్టర్లా, విక్రమాదిత్యా? సైన్సా, సాముద్రికమా? పెళ్ళి రేఖ లేని విక్రమాదిత్య విధితో ఎలా పొరాడి ప్రేమని నిజం చేసుకున్నాడు? ఇవి తెలుసుకోవడం గురించి మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ
ఐర్లాండ్ కి చెందిన ప్రసిద్ధ జ్యోతిష్కుడు కైరో (Cheiro) - (విలియం జాన్ వార్నర్, 1866-1936) ప్రేరణతో ఈ కథ చేసుకున్నానన్నాడు దర్శకుడు రాధా కృష్ణ కుమార్. ప్రముఖ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ దగ్గర కథ తీసుకుని, దాని మీద 18 ఏళ్ళూ వర్క్ చేసి నాల్గేళ్ళూ సినిమా నిర్మాణం చేశానన్నాడు. అంటే ఒక కాసాబ్లాంకా’, సన్ ఫ్లవర్’, టైటానిక్’, ఇంకా నికోలస్ స్పార్క్స్ నవలల ఆధారంగా తెరకెక్కే అద్భుత హైకాన్సెప్ట్ ప్రేమకథల స్థాయిలో మనోజ్ఞ ప్రేమ కావ్యంగా ఈ కథ తెరకెక్కి వుండాలన్న మాట. పబ్లిసిటీ విజువల్స్, ట్రైలర్స్ చూస్తే కూడా ఇదే సదభిప్రాయాని కొస్తాం. 

        హస్తసాముద్రికం- విధి- జీవితం అనే త్రికోణీయ చట్రంలో ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే మిథికల్ ఫాంటసీగా సమ్మోహనకర కాల్పనిక జగత్తు సృష్టించి వుండాలి. క్లాసిక్ టైటిల్, పానిండియా మార్కెట్, భారీగా 350 కోట్ల బడ్జెట్, ప్రభాస్ గ్లోబల్ ఇమేజి ఇవి కూడా కథని 3 కి పైగా రేటింగ్ తో వూహించుకునేలా చేస్తాయి. 2.25 రేటింగ్ తో సరిపుచ్చుకునే పరిపూర్ణ వైఫల్యాన్ని ఎవరూహిస్తారు గనుక. అసలు ఈ కథ చేయి చూస్తే అందులో జీవన రేఖే లేదని తెలుసుకోకుండా 18+ నాల్గేళ్ళూ ఇంత కఠోరంగా పరిశ్రమిస్తారని ఎవరనుకుంటారు గనుక.

        ఈ రోమాంటిక్ డ్రామా జానర్ కథలో అతడికి పెళ్ళి రేఖ లేదు, ఆమె ప్రాణాలతో వుండదు. ఇది బాక్సాఫీసుకి పనికొచ్చే ఫార్ములా అయిన విధి అనుకుంటే, ఈ విధితో కాన్ఫ్లిక్ట్ ని నిర్వహించడంలో హీరోహీరోయిన్లకంటే ప్రేక్షకుల్ని ఎక్కువ బాధపెట్టారు. విధి రాతని మన చేతల ద్వారా జయించవచ్చని చెప్పాలనుకున్నప్పుడు చేతలకంటే బాధలెక్కువ వున్నాయి. భారంగా పరిణమించిన కథతో బోరు ఎక్కువైంది. కథకి జీవన రేఖే లేనప్పుడు ఆత్మ కూడా లేదు. ఆత్మలేని ప్రేమని దృశ్య వైభవాలతో అలంకరించాలనుకున్నారు. మృత కళేబరానికి అలంకరణలు చేస్తే అమృత పానీయం తాగినట్టు నవ్వుతుందా కళేబరం? ఇలా కటువుగా చెప్పక తప్పడం లేదు బాధాకరమే అయినా.
 
నటనలు -సాంకేతికాలు


ప్రభాస్ తన వైరల్ ఇమేజిని పణంగా పెట్టి హస్తసాముద్రికుడి, ప్రేమికుడి సాఫ్ట్ రోల్ లో క్లాస్ గా కనిపించేందుకు చేసిన ప్రయత్నం నూటికి నూరుపాళ్ళూ విజయవంతమైంది. ఏ మాత్రం మాస్ షేడ్స్ లేని పాత్రతో చేసిన సాహసం బాగానే ఫలించింది. కానీ ఎంత సాఫ్ట్ గా, క్లాస్ గా వున్నా, పాత్ర పరంగా నటిస్తున్న కథలో సమస్యని ఎదురోకోవాల్సి వచ్చినప్పుడు, హీరోయిజాన్నే ఆశిస్తారు ప్రేక్షకులు. క్లాస్ కదాని పాసివ్ గా వుంటే ఒప్పుకోరు. ఇదే జరిగింది క్యారక్టరైజేషన్ తో.  
   
        మరొకటేమిటంటే, లవర్ బాయ్ క్యారక్టర్ లో ఫీల్ లేకపోవడం. హీరోయిన్ పూజా హెగ్డేతో నటించిన దృశ్యాల్లో రోమాంటిక్ రసాయనం అదృశ్యమవడం. పాటల్లో సైతం ఇద్దరి మధ్య ప్రణయ రసాలూరక పోవడం. కనీసం మామిడి పళ్ళయినా ప్రభాస్- పూజా చీకుతూంటే, అహనా పెళ్ళంట లో కోడిని వేలాడదీసి అది చూస్తూ, చికెన్ తింటున్న ఫీలింగు అనుభవించిన కోట శ్రీనివాసరావు లాగా - ఆ మామిడి పళ్ళని లొట్టలేసుకుని మనమే చీకుతున్నట్టుగా రసానందం పొందే వాళ్ళం. 300 రూపాయల టికెట్ కి కనీసం ఇది కూడా ఆశించడం తప్పు కాదేమో.

        పూజా హెగ్డే దేవకన్యలా ఫాంటసీ ప్రపంచాన్ని పరివ్యాప్తం చేసింది. కంటికే విందు. క్యారక్టర్ లో విషయం లేదు. ఇక భాగ్యశ్రీ, కృష్ణం రాజు, జగపతిబాబు, మురళీ శర్మ, సత్యరాజ్, సచిన్ ఖెడేకర్, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, రిద్దికుమార్ ఇలా చాలామంది అద్భుత తారాగణం కొలువు దీరారు కానీ, ఈ సినిమాలో వాళ్ళకి కొలువు లేవీ లేవు. సీన్లోకి రావడం, మన కేమైనా పనుందా అని చూడడం, వెళ్ళి పోవడం. ఆనాటి మైనే ప్యార్ కియా హీరోయిన్ భాగ్యశ్రీ అయితే, ప్రభాస్ తల్లిగా మేకప్ కూడా సరిగ్గా వేసుకోలేని అర్ధం పర్ధం లేని పాత్ర.

        ఏమాట కామాటే చెప్పుకోవాలి. జస్టిన్ ప్రభాకరన్ స్వరపర్చిన పాటల్లో ఆత్మ వుండి  వినాలన్పించేలా వున్నాయి. సోల్ ఫుల్ మ్యూజిక్. అలాగే తమన్ నేపథ్య సంగీతం కూడా సోల్ ఫుల్ గా దృశ్యాలకి బలం చేకూర్చే ప్రయత్నం చేసింది. కానీ దృశ్యాల్లో విషయం లేకపోతే ఎంత మంచి పాటలైనా, నేపథ్య సంగీతమైనా సినిమానెలా నిలబెడతాయి.

        అలాగే మనోజ్ పరమ హంస (ఛాయాగ్రహణం), రవీందర్ (కళ), కోటగిరి వెంకటేశ్వర రావు (కూర్పు), రసూల్ పోకుట్టి (శబ్ద గ్రహణం) మొదలైన సాంకేతికులందరూ అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం కనబర్చారు. దర్శకుడి స్క్రిప్టే వీళ్ళ శ్రమని వృధా చేసింది. 

చివరికేమిటి

హీరోయిన్ క్యాన్సర్ కథ చూపించడం కోసం 1970 ల నాటి నేపథ్యం ఏర్పాటు చేశారు. క్యాన్సర్ క్యాన్సరే, ఆ నేపథ్యంలో చూపించినా క్యాన్సర్ నయమయ్యే ఈ రోజుల్లో ఎవరు కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ వరకూ కథ ప్రారంభం కాక వివిధ పాత్రల పరిచయాలకే సరిపోయింది. ప్రభాస్, పూజాలు తప్పితే ఇంకే పాత్రకీ అర్ధం వుండదు. ఇంటర్వెల్ కి పూజా క్యాన్సర్ తో, ప్రభాస్ జోస్యంతో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు చేయడం వరకూ బాగానే వుంది. అయితే ప్రతీ తెలుగు సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు చేశాక, సెకండాఫ్ ఏం కథ చేసుకోవాలో తెలీక, సినిమా మొత్తాన్నీ నేలకేసి కొట్టి వెళ్ళి పోతున్నట్టు- ఇదే వైఖరిని ఇక్కడా విజయవంతంగా ప్రదర్శించారు.

        ఎప్పుడెప్పుడు క్లయిమాక్స్ కెళ్ళిపోయి ఆ నౌకాయానం, దాంతో సునామీ భీభత్సం చూపాలన్నట్టు ఇక కథని పట్టించుకోలేదు. విషయం లేక, తగిన సీన్లూ లేక, స్లో అయిపోయింది సెకండాఫ్ సినిమా నడక. ఆ తర్వాత ఎమోషనల్ గా కనెక్ట్ కాని, ఎమోషన్లే లేని ప్రేమ కథని నౌక ఎక్కించి, ఎంత సునామీ సృష్టించినా ఒడ్డున పడలేదు సినిమా.   చివరికి టైటానిక్ అమర ప్రేమ చూపిద్దామనుకున్న ప్రయత్నం కూడా పారక, మనల్ని ప్రకృతి వైపరీత్య బాధితుల్ని చేసి వదిలారు. ప్రభాస్ కి ఒకటే మెసేజ్- ఇలా కంటెంట్ లేని లోకల్ సినిమాలే తను కూడా నటిస్తూ, పానిండియా పేరుతో ప్రేక్షకుల్ని తేలికగా తీసుకోకుండా, ఇప్పుడే జాగ్రత్త పడాలని ఈ మల్టీ బిలియన్ బడ్జెట్ మెగా హంగామా చెబుతోంది.

—సికిందర్   
(స్క్రీన్ ప్లే సంగతులు ఆదివారం)