(సినిమాని చదవడం గురించి కింద
‘భూమిక’ లింక్
క్లిక్ చేయండి)
రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Wednesday, February 23, 2022
1134 : బుక్ రివ్యూ!
ఓ ఇరవై ఏళ్ళ క్రితం దర్శకుడు కె దశరథ్ ‘హౌ టు రీడ్ ఏ ఫిల్మ్’ అన్న గ్రంథం పీడీఎఫ్ ఇచ్చినప్పుడు, సినిమా అవగాహన పట్ల అది కొత్త లోకాల్ని చూపించింది.
సినిమాల్ని చూడడం కాదు, చదవాలని తెలిసిన విషయాన్నే ఎలా చదవాలో
తెలియ చెప్పింది. సినిమా కళ పట్ల ప్రత్యేక ఆసక్తి గల వాళ్ళెవరూ సినిమాల్ని చూడరు, చదువుతారు (ఒక కొటేషన్ ప్రకారం సినిమాల్ని చదవాలట,
నవలల్ని చూడాలట), చదివి చర్చిస్తారు. కొందరు వ్యాసాలు రాస్తారు.
మరికొందరు అలా సినిమాలు తీస్తారు. సినిమా రివ్యూ రాయాలంటే,
సాంకేతిక విషయాలు తెలియకపోయినా, కనీసార్హత స్క్రీన్ ప్లే
శాస్త్రం తెలిసి వుండడమెలాగో, అలా సినిమా తీయాలంటే
సినిమాల్ని చదవగల నేర్పూ అంతే అవసరం. రెగ్యులర్ కమర్షియల్లో చదవడానికేమీ వుండదు, వాటిని చూడడమే.
కానీ శ్యామ్
బెనెగల్ తీసిన ‘భూమిక’ లాంటివి చదవాలి. ఇంకెన్నో ప్రాంతీయ
సినిమాల్ని చదవాల్సి వుంటుంది. కమర్షియల్ సినిమాలు తీసే వాళ్ళకి ఈ చదవడాలెందు కనుకుంటే
అది వేరు. కానీ చదవడాలనే అస్త్రం అమ్ముల పొదిలో గనుక వుంటే కమర్షియల్ సినిమాల్ని
కమర్షియల్లాగా ఇంకా బాగా తీయొచ్చనుకుంటే ఇంకా వేరు. తీస్తున్న చాలా కమర్షియల్
సినిమాలు కమర్షియల్ సినిమాలా? విజువల్ సెన్స్
విస్తారమైనప్పుడు కమర్షియల్ సినిమాలకెంత తీసుకోవాలో, ఎందుకు
తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో ప్రామాణికంగా తెలుసుకుని, కమర్షియల్ సినిమాల క్వాలిటీని పెంచ వచ్చు.
సరే, 1977లో వెలువడిన ఈ ప్రసిద్ధ పుస్తకం
‘హౌ టు రీడ్ ఏ ఫిల్మ్’ తాజా
ఎడిషన్లో మీడియా, మల్టీ మీడియాలపైనా కూడా అధ్యాయాల్ని
చేర్చాడు రచయిత జేమ్స్ మొనాకో. ఇతను అమెరికన్ సినిమా విమర్శకుడు, రచయిత, ప్రచురణకర్త, విద్యా బోధకుడు.
చలన చిత్రమనే డైనమిక్ మాధ్యమపు ప్రతి ప్రధాన అంశాన్నీ కలుపుతూ
సవరించి, తిరగ వ్రాసి, ఈ మూడవ ఎడిషన్ ని అందించాడు. ‘హౌ టు రీడ్ ఏ ఫిల్మ్ : మూవీస్, మీడియా, మల్టీ మీడియా అండ్ బియాండ్’ అన్నది కొత్త టైటిల్. కళ, శిల్పం,
సున్నితత్వం, శాస్త్రం, సాంప్రదాయం, సాంకేతిక విజ్ఞానం మొదలైన
వాటిని తేలిక భాషలో వివరించాడు. నవల, చిత్రకళ, ఛాయాగ్రహణం, టీవీ, సంగీతం వంటి ఇతర కథన మాధ్యమాలతో సినిమాలకున్న దగ్గరి సంబంధాల పరిశీలన
చేశాడు.
తర్వాత, చలనచిత్రాలు ఎలా అర్థాన్ని తెలియజేస్తున్నాయో అర్థం చేసుకోవడానికి అవసరమైన సహాయక అంశాలని
చర్చించాడు.
ముఖ్యంగా, అసలు సినిమా దృశ్యం మనకేం చెబుతోందో,
దాన్నెలా గుర్తించి అర్ధం జేసుకోవాలో వివరించాడు. నిరంతర అభివృద్ధి పథంలో
పయనిస్తున్న డిజిటల్ టెక్నాలజీ ని
జోడించి ఇప్పుడు సినిమాల్ని ఎలా చదవాలన్న దానిపై కూడా అర్ధమయ్యేలా
చెప్పాడు. మల్టీమీడియాపై అధ్యాయంలో ఇరవై ఒకటో శతాబ్దంలో వర్చువల్
రియాలిటీ, సైబర్‌స్పేస్ లతో
సినిమాలకున్న
సామీప్యత వంటి అంశాల గురించి సమగ్ర చర్చతో ఈ
పుస్తకాన్ని నింపాడు. ‘ఫిల్మ్ అండ్ మీడియా: ఏ క్రోనాలజీ’ అని చేర్చిన
అనుబంధం పుస్తకం పరిధిని కూడా రెట్టింపు చేసింది. ఈ పుస్తకంలో కొత్త పీఠిక, విస్తరించిన గ్రంథ పట్టిక, వందలాది తెలుపు-నలుపు సినిమా ఛాయాచిత్రాలతో సోదాహరణ వివరణ,
రేఖాచిత్రాలూ పొందు పర్చాడు. ‘ఎసెన్షియల్ లైబ్రరీ’ అన్న ప్రకరణంలో ‘సినిమాలు,
మీడియా -ఈ రెండిటి గురించి మీరు చదవాల్సిన వంద పుస్తకాలు’
అని జాబితా కూడా ఇచ్చి మనపైన భారం కూడా వేశాడు. ‘మీరు చూసి
తీరాల్సిన వంద సినిమాలు’ అని ఇంకో జాబితా కూడా ఇచ్చి మరింత
భారాన్ని మోపాడు.
పుస్తకం ధరకూడా పెను భారమే. అమెజాన్లో
రెండు వేల రూపాయలు. రెండు వేలు పెట్టి పుస్తకం కొనాలా? అసిస్టెంట్
కి రెండు వేలు ఎక్కడ్నించి వస్తాయి? తెలివైన అసిస్టెంట్ ఉచిత
పీడీఎఫ్ లింకులు చాలా వున్నాయి- డౌన్ లోడ్ చేసుకుని చదువుకుంటాడు. చదువుకుంటే
ఆలోచనలో పడతాడు. ఇంత వుందా- ఐతే మనమేం పని కొస్తాం- అని కళ్ళు తెరిస్తే ఇంటికెళ్ళి
పోతాడు. మనకి పనికొచ్చేదే ఇచ్చాడు- అనుకుంటే ఇక్కడే వుంటాడు. అప్పుడు అయోమయపు కమర్షియల్
సినిమాలు రావడం చాలా తగ్గి జీవితం బావుంటుంది. చక్కటి వడబోత.
—సికిందర్
Saturday, February 19, 2022
1133 : రివ్యూ!
రచన - దర్శకత్వం : ప్రదీప్ బి అట్లూరి
తారాగణం : విక్రమ్ సహిదేవ్, సౌమికా పాండియన్, రిషికా ఖన్నా, వినీత్ బవిశెట్టి, స్నేహల్, తాగుబోతు రమేష్, జీవా తదితరులు
సంగీతం : అచ్చు రాజమణి, ఛాయాగ్రహణం : అనీష్ తరుణ్ కుమార్
బ్యానర్ : రామలక్ష్మి సినీ
క్రియేషన్స్
నిర్మాతలు : శిరీషా లగడపాటి, శ్రీధర్ లగడపాటి
విడుదల : ఫిబ్రవరి 18, 2022
***
లగడపాటి
శ్రీధర్ 2005 లో ‘ఎవడి గోల వాడిదే’ నుంచి 2018 లో ‘నా పేరు సూర్య’ వరకూ 7 సినిమాల నిర్మాత. కుమారుడు
విక్రమ్ ని నటుడుగా ప్రవేశపెట్టి రెండు సినిమాల్లో (వకీల్ సాబ్, రౌడీ బాయ్స్) నటింపజేశాక, హీరోగా ప్రమోట్ చేస్తూ
ఇప్పుడు ‘వర్జిన్ స్టోరీ’ నిర్మించారు.
అట్లూరి ప్రదీప్ ని దర్శకుడుగా
పరిచయం చేశారు. ప్రదీప్ హిందీలో ఒక టీవీ సిరీస్ కీ,
రెండు హిందీ సినిమాలకీ రచయితగా పనిచేసి, ‘క్వికీ’ అనే ఓ హిందీ సినిమాకి దర్శకత్వం చేశాడు. ‘వర్జిన్ స్టోరీ’ తో దర్శకుడుగా తెలుగు ప్రేక్షకుల
ముందు కొచ్చాడు.
ఇదివరకు మల్టీ
ప్లెక్స్ సినిమాలనేవి వచ్చేవి. ఇవి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆడేవి కావు.
ఇప్పుడు ఓటీటీ వచ్చాక మల్టీ ప్లెక్సుల్లో కూడా ఆడని సినిమాలు వస్తున్నాయి. రేపు ఓటీటీలో
కూడా ఆడని సెల్ ఫోన్ సినిమా లొస్తాయేమో. ఆ తర్వాత మైక్రో స్కోపులో చూడగల్గే
సినిమాలు. ఇంకా తర్వాత ఎక్కడా ఆచూకీ దొరకని సినిమాలు - చరిత్ర పరి సమాప్తం.
ఇకప్పుడు తిరిగి నాటకాలూ వీధి నాటకాలూ బుర్ర కథలూ షురూ.
మన వారసులకి దీనికి సిద్ధంచేస్తూ
ఇప్పుడే ఓ బుర్ర కథ తీశారు. సినిమాగా ఇది 1 - 1.5 రేటింగ్ సంపాదిస్తే,
బుర్ర కథగా ప్రదర్శిస్తే 10/10 రికార్డ్ రేటింగ్
గ్యారంటీగా సాధిస్తుందని చెప్పొచ్చు. చిన్న సినిమాలు ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే
అని థియేటర్లకి పోవడం లేదు కొమ్ములు తిరిగిన ప్రేక్షకులు. ఇక పైన బుర్ర కథగా వస్తే
చూడొచ్చులే అనుకోవచ్చేమో. అయితే ‘వర్జిన్ స్టోరీ’ బుర్ర కథనా, బుర్ర లేని కథనా తెలుసుకోవాల్సిన అవసరమెంతో
వుంది...
ప్రియాంశీ (సౌమికా పాండియన్) తానెంతగానో ప్రేమిస్తున్న బాయ్ ఫ్రెండ్ మోసం
చేస్తున్నాడని తెలుసుకుంటుంది. అతడికి బ్రేకప్ చెప్పేసి బాధలో వుంటుంది. ఆమెకో
ఫ్రెండ్ మీనాక్షీ (రిషికా ఖన్నా) వుంటుంది. ఈ బాధలోంచి బయటపడాలంటే, బాయ్
ఫ్రెండ్ మీద పగదీర్చుకోవాలంటే, ఒన్ నైట్ స్టాండ్ గా తెలియని
వాడితో ఒక రాత్రి గడిపెయ్య మంటుంది. ప్రియాంశీ ఒప్పుకుంటుంది.
ఇద్దరూ పబ్ కెళ్తారు. పబ్ లో విక్రమ్ (విక్రమ్
సహిదేవ్) ని చూసి
ట్రై చేద్దామనుకుంటుంది. విక్రమ్ ఇంకా వర్జిన్. వర్జీనిటీ కోల్పోవాలని ఉవ్వీళ్ళూరుతూంటాడు. ప్రియాంశీ అడగడంతో ఒప్పేసుకుంటాడు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు
తెలుసుకోకుండా ఈ రాత్రి గడిపేసి వెళ్ళి పోవాలనుకుంటారు. గడపడానికి ఒక చోటు కావాలి.
ఆ చోటు ఎక్కడా దొరకదు. ప్రతీ చోటా ఏదో ఆటంకం ఎదురవుతూంటుంది. చివరికేమైంది?
అనువైన చోటు దొరికిందా? అనుకున్నట్టు గడిపారా? ఇదీ మిగతా కథ.
ఇవ్వాళ సినిమా కథనేది ఒన్ నైట్
స్టాండే. ఒన్ షోతో మర్చిపోయేంత. రాశామా, తీశామా, డబ్బులు పంచుకుని ఓ షోతో ఇంటికెళ్ళి పోయామా, ఇంతే. ఫటా
ఫట్ యూజ్ అండ్ థ్రో ఎసైన్ మెంట్, బస్టాండ్.
ఈ కథతో - హేపీగా వుండాలంటే ఒన్ నైట్
స్టాండ్ కాదు, ఒన్ లైఫ్ స్టాండ్ కావాలని చెప్పదల్చారు. అసలు
చెప్పాల్సింది- లైఫ్ అంటే ఎవడి మీదో పగతో ఇంకెవడితోనో పడుకుని వర్జీనిటీ కోల్పోవడం
కాదని - దారి తప్పిన హీరోయిన్ పాత్రకి చెప్పాలి. ఏం చెప్పాలో తెలియక పోతే ఇలాటి కథ
ఎందుకు రాయడం, తీయడం.
అందుకని మొదట్నుంచీ ఈ కథ కథలా
సాగదు. కాన్సెప్ట్ తెలియనప్పుడు కథెలా
సాగుతుంది. దీనికి మల్లాది నవలతో పోలిక తెస్తున్నారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి
నవల ‘పెద్దలకు మాత్రమే´ఆధారంగా 1985 లో జంధ్యాల ‘శ్రీవారి
శోభనం’ తీశారు. నరేష్, అనితారెడ్డి, మనోచిత్ర నటీనటులు. ఇందులో పెళ్ళయిన హీరోకి శోభనం అంటే భయం. ఇందుకు
మార్గరెట్ అనే అమ్మాయి హెల్ప్ తీసుకుంటాడు శోభనం నేర్చుకునేందుకు. ఈ
నేర్చుకోవడానికి అనేక ఆటంకా లెదురవు తూంటాయి కామెడీగా. చివరికి ఇలా భార్యని మోసం
చేయకూడదని తెలుసుకుని, తన మానసిక భయాల్ని మార్గరెట్ చేత కౌన్సెలింగ్
తో తొలగించుకుని, భార్య దగ్గరి కెళ్ళిపోతాడు.
1985 కాలంలో ఇది ఒన్ నైట్ స్టాండ్
కథ కాదు. పైగా పెళ్ళయిన వాడు హీరో. కేవలం సెక్స్ కి ఆటంకా లెదురవడమనే కామెడీ
ట్రాక్ తప్పితే, ‘వర్జిన్ స్టోరీ’ కి పోలిక లేదు. ఈ స్టోరీ వేరు- ఈ కాలపు స్టోరీని స్టోరీ కాని స్టోరీగా
తీశారు.
2016 లో సన్నీ లియోన్, తనూజ్ విర్వాణీ, నైరా బెనర్జీ లతో ‘ఒన్ నైట్ స్టాండ్’ తీశారు హిందీలో. భవానీ అయ్యర్
రచనకి జాస్మిన్ మోజెస్ డిసౌజా దర్శకత్వం. ఇందులో కావాలని ఒన్ నైట్ స్టాండ్ కి పాల్పడరు
హీరో హీరోయిన్లు (తనూజ్- లియోన్). అనుకోకుండా జరిగి పోతుంది. ఆ తర్వాత హీరో ఆమె
వెంట పడతాడు భార్యని పట్టించుకో కుండా. పెళ్ళయిన హీరోయిన్ తిప్పి కొడుతుంది. హీరో అబ్సెషన్
వల్ల ఇరు వైపులా కాపురాలు కూలే పరిస్థితి ఏర్పడుతుంది.
ఒన్ నైట్ స్టాండ్ లాంటి సింగిల్
సెక్సువల్ ఎన్ కౌంటర్ మానసిక సమస్యల్ని తెచ్చి పెడుతుందని నిపుణులు
హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైనదని కూడా అంటున్నారు. అసలు ‘వర్జిన్
స్టోరీ’ కథతో ఏ నీతీ చెప్పనవసరం లేదు. కథని కథలా చెప్పి
రక్షిస్తే చాలు. కథకి బేసిక్స్ కూడా చూసుకోకుంటే తెల్ల కాగితాల మీదే కదా పెట్టుబడి
పెడతారు.
‘రౌడీబాయ్స్’ లో నెగెటివ్ పాత్ర వేసిన విక్రమ్ నటించగలడని నిరూపించుకున్నాడు.
గ్లామరుంది, షేపుంది, ఎక్స్ ప్రెషన్స్
వున్నాయి. నిలదొక్కుకోవడానికి కంటెంట్ కావాలి. ఇది లోపించిందిప్పుడు. ఎక్కడా మొహంలో
పలికించడానికి సీన్లలో ఎమోషన్లే లేవు. ఎమోషన్స్ అంటే సీరియస్ నెస్ అనే కాదు, కామెడీ కూడా ఎమోషనే. ఇది కూడా పలికించడానికి కామెడీ సైతం తీయలేక పోయాడు
దర్శకుడు ఈ కామెడీ అనుకుని తీసిన కథలో.
ఇక ప్రతీ సీనులో హీరోయిన్ తోనే
వున్నా, ఆమెతో సెక్సువల్- రోమాంటిక్ టెన్షనే లేదు. ఫీలింగ్సే
లేవు. హీరోయిన్ తో గడపడానికి ఏ చోటు చూసుకోవాలన్న గణితమే తప్ప, రసాయనమే లేదు ఆమెతో. తను వర్జిన్, ఇంకా
వర్జినేమిటని ఫ్రెండ్స్ ఆటలు పట్టిస్తూ లూజర్ అనడం. అలాంటిది తను హీరోయిన్ తో
విన్నర్ అవడానికింత అవకాశమొచ్చాక, ఆ వర్జీనిటీ కోల్పోయే తొలి
అనుభవపు ఎక్సైట్ మెంటేమీ కన్పించక పోతే, కథనమేం నడుస్తుంది. లగడపాటి విక్రమ్ సాహిదేవ్ పాత్రగా ఈ కథ నడపలేకపోయాడు. తెలిసో తెలీకో ఓ పాసివ్
పాత్ర ఒప్పుకుని నొప్పించాడు ప్రేక్షకుల్ని.
‘వయ్యారి ఓ
వయ్యారీ నీ వూహాల్లోనే సవారీ’ అన్న హీరో క్యారక్టర్ ని
తెలిపే టైటిల్ సాంగ్ లో, సాహిత్యం ప్రకారం హీరో క్యారక్టరే
వుండదు. ‘నా ఫ్యూజు లెగిరి పోయే నీ అందం చూడగానే’ (బూజు కూడా తొలగలేదు క్యారక్టర్ కి)… ‘రివ్వు మన్నది ప్రాణం తూనీగ లాగా’ (మన్ను తిన్న
పాముతోనా?)…’నువ్వు నేను కలుపుకున్న చూపులు-నచ్చి నచ్చి
పంచుకున్న మాటలు’ (చూపుల్లేవు,
మాటల్లేవు)... ‘కొత్తగా కొత్తగా
రెక్కలొచ్చెనా’ (రెక్కలొచ్చి వుంటే కథ హిట్టయ్యేది)... ‘ఓ వయ్యారీ వయ్యారీ మనసంతా నీదే కచేరీ’ (మనసంతా, బుర్రంతా ఖాళీ- ఏమీ లేదు). కవి
రాసిన ఏ లైను లాగా క్యారక్టర్ లేదు.
ఇక హీరోయిన్ సౌమికా పాండియన్ డిటో. నో
క్యారక్టర్, నో యాక్టింగ్. మాజీ లవర్ మీద పగదీర్చుకోవడానికి
ఒన్ నైట్ స్టాండ్ గా దిగాక, ఆ రివెంజీ ఫీలింగుని, ఆ
ఆత్మ వినాశక కసినీ చూపించదు. ప్రేమ సినిమాల్లో లవ్ లో పడ్డ హీరోయిన్ లాగే
వుంటుంది. అసలు మాజీ లవర్ మీద పగ దీర్చుకోవడం ఇలా ఎలా జరుగుతుంది. ప్రేమ సినిమాల్లో లవర్ ని
బాధించడానికి అతడి కళ్ళ ముందే ఇంకో లవర్ తో తిరగడం వుంటుంది. అలా మాజీ లవర్ చూసేలా
ఇంకొకడితో సెక్స్ చేస్తే మాజీ లవర్ మీద పగ
దీర్చుకోవడంగా వుండొచ్చు. అతడికి దూరంగా ఏం చేస్తే అతడికేంటి? ఈ పగ సాధించి కూడా ఏం సాధిద్దామని? ఎవడితోనో
వర్జీనిటీని డ్రైనేజిలో పారేసుకుని ఆనక ఏడ్వడమా? పైగా ఆ మాజీ
లవర్ చివరి దాకా కనపడడు కూడా. ఏమిటో ఈ సినిమా!
ఒన్ నైట్ స్టాండ్ గా పగ దీర్చుకోమనే
మీనాక్షీ అనే పిచ్చిదీ (రిషికా ఖన్నా) ఇంకో వైపు. వాళ్ళ కెక్కడా చోటు దొరక్క పోతే
తన రూమ్ కే తీసుకెళ్ళి శుభకార్యం
జరిపించొచ్చుగా? ఇక ఒక సబ్ ప్లాట్ గా కామెడీ ట్రాక్ వుంది. మీకీ
నాకీ భాషతో ఆటో డ్రైవర్- అరవ తెలుగు భాషతో అమ్మమ్మ క్యారక్టర్లతో. వీళ్ళ లౌడ్ కామెడీకి
నవ్వే రాక పోగా టార్చర్ పెట్టేస్తుంది. తాగుబోతు రమేష్ కానిస్టేబుల్ గా వచ్చే
కామెడీ, రఘు కారుమంచి కామెడీ కూడా టార్చరే. ఇక అడపాడపా గే, లెస్బియన్, అన్ సెక్స్ క్యారక్టర్లతో కామెడీ చెప్పాల్సిన
పనిలేదు.
సంగీతం,
సాహిత్యం పైన చెప్పుకున్న విధంగా అన్యాయమై పోయినా,
ప్రొడక్షన్ విలువలు రిచ్ గానే వున్నాయి లగడపాటి రేంజిలో. కాస్ట్యూమ్స్, మేకప్, కళా దర్శకత్వపు విభాగాలూ బాగా పని చేశాయి.
స్టయిలిష్ లుక్ కోసం పాటుబడిన దర్శకత్వం ఫర్వాలేదు గానీ, చేతిలో
కథా కథనాల దస్తావేజే బాగా లేదు.
అవార్డుల కమిటీయో, రివ్యూలు రాసేవాళ్ళో దీన్ని చివరిదాకా చూడక తప్పదేమోగానీ, ఈ పనీ పాటలు లేనివాళ్ళు చివరి దాకా కొన వూపిరితో
వుండలేరు. చాలా ప్రాణయామం చేసి వుండాలి. కోవిడ్ నుంచి కోలుకున్న వాళ్ళు అసలే పనికి
రారు.
ఇది ఒక రాత్రంతా జరిగే కథ. పదేపదే
పబ్ సీన్లు, అక్కడి హంగామా 7 సార్లు, ఓ
6 సార్లు వచ్చే సెక్స్ కోసం ప్రయత్నించే లొకేషన్లు, ఇతర రోడ్
సీన్లూ వగైరా. హీరోయిన్ ఇలా చోటు కోసం వూరు మీద పడి తిరగడ మెందుకో అర్ధం గాదు.
రాత్రికి రాత్రే పేరెంట్స్ ఫ్లయిట్ ఎక్కి ఎక్కడికో వెళ్ళి పోయారుగా? ఈ వెళ్ళి పోవడం హీరోయిన్ రాత్రంతా బయట తిరగడాని కన్నట్టుగా సృష్టించాడేమో
కథకుడు- కానీ పేరెంట్స్ ని అలా పంపేశాక ఆమె బయట ఎక్కడికీ తిరగనవసరం లేకుండా, ఏంచక్కా ఇంట్లో కూర్చుని - టిండర్ లోనో, గ్రిండర్
లోనో యాప్ లో హుకప్ అయి- అతడ్ని ఇంటికే రమ్మంటే సరిపోతుందిగా?
ఓ పాతిక నిమిషాల రన్ టైంలో, పబ్ లో హీరోతో హీరోయిన్ ఒన్ నైట్ స్టాండ్ గా కనెక్ట్ అయ్యాక, మిడిల్ ప్రారంభమవుతుంది. ఈ కథకి బిగినింగ్, మిడిల్, ఎండ్ మూడూ వున్నాయి. లేనిది వీటితో ఏం చేయాలన్నదే.
హీరోయిన్ వేరొకడి మీద ప్రతీకారంగా
హీరోతో ఓ రాత్రి పడుకోవాలనుకుంది. దీనికి పణంగా ఏం పెడుతోందో తెలీదు. ‘శ్రీవారి శోభనం’ లో వైవాహిక జీవితాన్ని పణంగా పెట్టి
వేరే అమ్మాయితో తిరుగుతాడు హీరో. ‘ఒన్ నైట్ స్టాండ్’ హిందీలో ఇద్దరూ తమ వైవాహిక జీవితాల్ని పణంగా పెట్టేస్తారు. ప్రస్తుత
సినిమాలో హీరోయిన్ కనీసం కన్యాత్వాన్నైనా పణంగా పెడుతున్న సబ్ టెక్స్ట్ ని
ప్రేక్షకుల అవసరార్ధం, ఆదుర్దా కోసం సృష్టించలేదు కథకుడు.
ఏదీ పణంగా లేక పోవడతో కాన్ఫ్లిక్ట్ లేకుండా పోయింది. కాన్ఫ్లిక్ట్ లేని కథగా సోదిలా
మారింది.
ఇటు లూజర్ స్టేటస్ తో వున్న హీరోకీ, ఈ రాత్రి వర్జీనిటీ వదులుకుని తొలి అనుభవమనే విన్నింగ్ సిట్యూయేషన్ని
ఎంజాయ్ చేయాలన్న సోయి లేకుండా పోయింది. అంత క్లోజ్ గా మూవ్ అవుతున్న హీరోయిన్ తో
ఎరోటిక్ ఫీలింగ్ గానీ, రోమాంటిక్ సస్పెన్స్ గానీ, ఎక్సైట్ మెంట్ గానీ, ఎక్కడా చోటు దొరక్కపోతే రోడ్డు
మీదే కానిచ్చేయాలన్న తెగింపూ తొందరపాటు
గానీ లేకుండా పోయింది. ఇద్దరివీ రక్త మాంసాల్లేని పాత్ర చిత్రణలయ్యాయి.
ఫలితంగా ఒక్కో చోటుకి వెళ్ళడం, అక్కడేదో సిల్లీగా కుదరక పోవడమనే కామెడీ సీన్లే రిపీటవుతూ వుంటాయి
ఫస్టాఫ్ సెకండాఫ్ రెండిట్లో. కథ డెవలప్ కాదు, ఇంకో
స్థాయికీ వెళ్ళదు. జరగాల్సింది పదేపదే ఆ
చోట్లలో పడుకోడానికి వీల్లేని కామెడీలు
కాదు- జరగాల్సింది పడుకుని ఫోర్ ప్లే దాకా
వెళ్ళే - ఇక ఇంటర్ కోర్సు ప్రారంభమయ్యే పీక్ లో డిస్టర్బెన్స్. ఇంటర్ కోర్సు డిస్టర్బ్
అయ్యే ఎరోటిక్ సస్పెన్స్, టెన్షన్ కావాలి వేడి పుట్టిస్తూ.
లేకపోతే చేతకాని పాత మూస సీన్లు - ఆ
పేరుతో అర్ధం లేని, విషయం లేని కామెడీలూ కాదు ఈ మోడరన్ కథకి కావాల్సింది.
దీన్ని బుర్ర కథ చెపుతున్నట్టు తీయడమూ కాదు. బుర్రకథల్ని తక్కువ చేయడం లేదు. బుర్ర
కథ దానికది ఒక సారస్వత వారసత్వ సంపద. బుర్ర కథని సినిమాలాగా చెప్పరు, సినిమాని బుర్ర కథలా తీయడమేమిటి?
—సికిందర్
Friday, February 18, 2022
1132 : రివ్యూ!
రచన-
దర్శకత్వం : డైమండ్ రత్నబాబు
తారాగణం
: మోహన్
బాబు, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజారవీంద్ర తదితరులు
సంగీతం
ఇళయరాజా, ఛాయాగ్రహణం : సర్వేష్ మురారి
బ్యానర్
: 24 ఫ్రేం ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
నిర్మాత
: మంచు విష్ణు
విడుదల; ఫిబ్రవరి
18, 2022
***
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ బుకింగ్స్, ట్రోలింగ్స్ అంటూ ప్రధానాకర్షణగా నిలిచాక ఈ రోజు విడుదలైంది. మెగా స్టార్
చిరంజీవి
వాయిసోవర్ తో విడుదలైన టీజర్
తో సినిమా పట్ల ఆసక్తి రేగింది. సినిమాకి డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకడుగా పరిచయమయ్యాడు. మోహన్ బాబు సొంత బ్యానర్ మీద మంచు విష్ణు నిర్మించాడు.
దీన్ని ప్రయోగాత్మకంగా నిర్మించామన్నారు. మోహన్ బాబు లాంటి మాస్ హీరోతో ఏం ప్రయోగం
చేశారు? ఎలా చేశారు? ఇది తెలుసుకుందాం...
కథ
కడియం బాబ్జీ (మోహన్ బాబు) ఓ డ్రైవర్. ఎన్ఐఏ అధికారిణి ఐరా (ప్రగ్యా
జైస్వాల్) దగ్గర డ్రైవర్ గా వుంటాడు. ఏకాకి జీవితం గడుపుతూంటాడు. ఇలా వుండగా, కేంద్రమంత్రి మహేంద్ర భూపతి
(శ్రీకాంత్) తిరుపతికి వెళ్లాల్సి వుండగా తలకోనలో కిడ్నాపవుతాడు. తర్వాత ఓ డాక్టర్, దేవాదాయ శాఖ ఛైర్మన్ ఇద్దరూ కిడ్నాప్ అవుతారు. కిడ్నాపర్స్ ని పట్టుకోవడానికి
ఐరా రంగంలోకి దిగుతుంది. దర్యాప్తులో కిడ్నాప్స్ కి కారకుడు బాబ్జీయే అని
తేలుతుంది. బాబ్జీ ఎందుకు కిడ్నాపులు చేశాడు? అతడి అసలు పేరు బాబ్జీ కూడా కాదు,
విరూపాక్ష. ఈ విరూపాక్ష గతమేమిటి, ఏమిటతడి సమస్యనేది మిగతా
కథ.
ఎలావుంది కథ
ఓ అన్యాయానికి గురైన వ్యక్తి
ప్రతీకార కథ ఇది. దేశంలో ప్రైవేట్ పాఠశాలలు, బస్సులు, ఆస్పత్రులు
వుండగా ప్రైవేట్ జైళ్ళు వుంటే తప్పేంటని
ప్రశ్నించే బాధిత వ్యక్తి కథ. ‘భామాకలాపం’ లో లాగే చివరి వరకూ ఈ కాన్సెప్ట్ రివీల్
కాదు. ఆయా దృశ్యాలతో యాక్షన్- రివెంజీ కథంతా చూపించి,
చివర్లో కథని సమప్ చేస్తూ ఈ ప్రైవేట్ జైళ్ళ పాయింటు చెప్తారు. కానీ జైళ్ళు న్యాయ వ్యవస్థ
పరిధిలోనివి. ఇప్పుడు వివిధ పబ్లిక్ సెక్టార్స్ ని ప్రైవేటుకి
అప్పజెప్పేస్తున్నట్టు, ఇక జైళ్ళూ పోలీస్ స్టేషన్లూ
ప్రయివేటీకరణ చెందుతాయని భవిష్యవాణి చెప్తున్నారేమో. వర్కౌట్ కాలేదు.
నటనలు - సాంకేతికాలు మోహన్ బాబు తాను ఏకపాత్రాభినయం చేశానని చెప్పినట్టు సినిమా అంతా
ఆయనొక్కడే కన్పిస్తారు. ఇది ప్రయోగమే. అయితే ఈ ప్రయోగం తప్పనిసరై చేసినట్టున్నారు
లాక్ డౌన్ సమయంలో షూటింగు వల్ల. ఇతర నటీనటుల్ని సమీకరించలేక, ఏకపాత్రాభినయం చేసేశారు.
సినిమా నిదిని గంటా 40 నిమిషాలు ఇంకో ప్రయోగమే. అయితే ఈ నిడివికీ ఏకపాత్రాభినయం కూడా వర్కౌట్ కాలేదు
సినిమాకి. నాటకానికి వర్కౌటయ్యే వ్యవహారం. ఈ ఏకపాత్రాభినయాన్ని నిలబెట్టాలంటే దీనికి
తగ్గట్టు బలమైన కథా కథనాలూ, బలమైన పాత్ర, బలమైన సంభాషణలూ అవసరం. ఈ విషయంలో పూర్తిగా
విఫలమయ్యాడు డైలాగ్ రైటరైన దర్శకుడు డైమండ్ రత్నబాబు. అనుభవజ్ఞుడైన
మోహన్ బాబు అభినయబలం ముందు రచనా బలం చాల్లేదు.
దృశ్యాల్లో ఈత పాత్రలు కాన్పించవు. కేవలం
మాటలు వింపోయిస్తాయి. కొన్ని చోట్ల దూప్స్ పెట్టడం వల్ల వాళ్ళ మొహాలు బ్లర్ చేసి వుంటాయి.
ఇయాత్ర తారాగనమంతా చివరి దృశ్యంలోనే మనకి కాంపిస్తారు. లాక్ డౌన్ సమయంలో సింగిల్ కాల్షీట్
తో లాగించేసిన ఫలితమిది.
ఇళయరాజా సంగీతంలో ఓ భక్తి పాత వుంది.
ఇలాత్యరాజా సంగీతం లేదు. నేపథ్య సంగీతం సహా. భక్తి పాత గ్రాఫిక్స్ కి కోటీ 8 లక్షలు
ఖర్చు పెట్టామన్నారు. క్వాలిటీ తీసికట్టుగా వుంది. కెమెరా వర్క్ కూడా బలహీనంగా వుంది.
సాంకేతిక ప్రమాణాల్లేవు.
చివరికేమిటి
మోహన్ బాబు ఏక పాత్రాభినయంలో రెండు రకాల
పాత్రలు. మొదట కారు డ్రైవర్ బాబ్జీగా, తర్వాత ప్రింటింగ్ ప్రెస్ విరూపాక్షగా. బాబ్జీ అసలెవరు అన్నప్పుడు, సెకండాఫ్ లో ఫ్యాక్షన్ సినిమాల టెంప్లెట్ లో విరూపాక్ష ఫ్లాష్ బ్యాక్ వస్తుంది.
ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటున్న ఇతను ఓ చిన్న పొరపాటు వల్ల జైలు పాలవుతాడు. కుటుంబం
నాశనమవుతుంది - భార్య (మీనా), కూతురూ సహా. ఇదంతా ఓ నాయకుడు (పోసాని కృష్ణమురళి)
వల్ల జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక, జైల్లోంచి వచ్చి
వ్యవస్థ మీద పగదీర్చుకోవడం మొదలెడతాడు.
ఎప్పటిదో పాత టైపు కథ. దీనికి పొంతన
లేని కథనం. వీటికి తగ్గట్టు పురాతన శైలి దర్శకత్వం. దీన్ని థియేటర్లో ప్రయోగం కోసం
తీయలేదని తెలిసి పోతూంటుంది. ఓటీటీ కోసమే తీశారు. ఓటీటీలు ముందుకు రాకపోవడంతో తప్పనిసరై
థియేటర్ రిలీజ్ చేశారు. చాలా సాహస ప్రయోగం. దేనికోసం? ఎవరి కోసం? ఏమో!
—సికిందర్
Thursday, February 17, 2022
Wednesday, February 16, 2022
Monday, February 14, 2022
1131 : రివ్యూ!
దర్శకత్వం: విమల్
కృష్ణ
తారాగణం : : సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, ఫిష్
వెంకట్ తదితరులు
రచన:
విమల్ కృష్ణ, సిద్ధూ జొన్నలగడ్డ, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం : సాయిప్రకాష్
బ్యానర్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
విడుదల
: 12 ఫిబ్రవరి
2022
***
సిద్ధు జొన్నలగడ్డ 2009 నుంచీ సినిమాల్లో నటిస్తున్నా, 2016 లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గుంటూరు టాకీస్’ తో వెలుగులో కొచ్చాడు. 2020 లో ‘కృష్ణ అండ్ హిజ్
లీలా’ తో మరోసారి ప్రేక్షకుల ముందు కొచ్చాడు. ఇప్పుడు ‘డీజే టిల్లు’ తో యూత్ కి బాగా దగ్గరయ్యాడు. 2018 లో ‘మహెబూబా’ లో హీరోయిన్ గా పరిచయమైన నేహాశెట్టి, తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లో నటించి ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ పక్కన ‘డీజే టిల్లు’ లో కన్పిస్తోంది. దీంతో విమల్ కృష్ణ కొత్త దర్శకుడుగా పరిచయమయ్యాడు. పెద్ద
బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం చేపట్టింది. సితార వారి ఈ ప్రతిష్టాత్మక సినిమా ఎలావుందో
ఇక చూద్దాం...
బాలగంగాధర తిలక్ అలియాస్ టిల్లు (జొన్నలగడ్డ)
హైదరాబాద్ లో డీజే (డిస్క్ జాకీ) గా వుంటాడు. తల్లిదండ్రులతో
వుంటాడు. డీజే గెటప్ లో అతిగానే కాస్ట్యూమ్స్ వేసుకుని తిరుగుతాడు. హైదరాబాదీ
తెలుగు మాట్లాడతాడు. కేర్లెస్ గా బిహీవ్ చేస్తాడు. టార్గెట్ ఆడియెన్స్ కి అతను
మిక్స్ చేసే సాంగ్స్ కలెక్షన్స్ కి పెళ్ళిళ్ళలో బాగా గిరాకీ వుంటుంది. అతడికో కల
వుంటుంది. ఎలాగైనా షార్ట్ కట్స్ లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవాలని.
ఇలావుండగా
రాధిక (నేహాశెట్టి) అనే ఓ
సింగర్ ని చూసి వెంటపడతాడు. ఆమెకో బాయ్ ఫ్రెండ్ వుంటాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఇంకో
గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతూంటాడు. ఇది చూసి ఆమె టిల్లు తో తిరగడం మొదలెడుతుంది టిట్
ఫర్ టాట్ గా. ఒకరోజు బాయ్ ఫ్రెండ్ ఆమెతో గొడవ పడి, ప్రమాదవశాత్తూ ఆమె చేతిలో చచ్చి
పోతాడు. ఈ హత్యలో టిల్లు కూడా ఇరుక్కునే పరిస్థితి వుండడంతో ఆమెకి సాయపడి శవాన్ని
మాయం చేస్తాడు. ఇది కనిపెట్టి ఓ బ్లాక్ మెయిలర్ (నర్రా శ్రీనివాస్), పోలీసులూ (బ్రహ్మాజీ, ఫిష్ వెంకట్) టిల్లూ రాధికల
వెంటపడతారు. ఇక వీళ్ళని తప్పించుకోవడానికి టిల్లు ఏం చేశాడన్నది మిగతా కథ.
హాలీవుడ్ లో చిక్ ఫ్లిక్
లేదా చిక్ లిట్ అనే కొత్త జానర్ సినిమాలొస్తూంటాయి. జెన్ జెడ్ (జెడ్ జనరేషన్) లైటర్
వీన్ ఫన్ రోమాన్సులు, రోమాంటిక్ థిల్లర్స్ వీటిలో వుంటాయి. ఇవి వాలంటైన్స్ డే కి విడుదలవుతూంటాయి. ఇవి ఆదునిక జెన్
జెడ్ హీరోయిన్ పాత్రలతో అమ్మాయిల్ని ఎక్కువ ఆకర్షించే జానర్ మర్యాదలతో వుంటాయి. యూత్
సినిమాల పేరుతో మనం తీస్తున్న సినిమాలకి యువ ఫ్రేక్షకుల్లో యువకులే తప్ప యువతులుండరు.
పేరుకే యూత్ సినిమాలు, చూసేదీ మగ యువజాతే.
స్టయిలిష్ గా తీసిన ‘డీజే టిల్లు’ (హీరోకి పెట్టిన బాలగంగాధర తిలక్ పేరులో, తిలక్ కి ‘టిల్లు’ అని నిక్
నేమ్ పెట్టారు. హిందీలో టిల్లు అంటే పొట్టోడు అని అర్ధం) లో హీరోయిన్ క్యారక్టర్ కూడా
ప్రధానమైనదే. సినిమా ఆట్మాస్ఫియర్ పరంగా చిక్ లిట్ కి సరిపోయే మేకింగ్ తో వుంది. ఇందులో
హీరోకే క్యారక్టర్ తప్ప, హీరోయిన్ క్యారక్టర్ తో బాటు కథ లేకుండా
పోయింది. ఫలితంగా ఇంటర్వెల్ కి చాలించుకున్న పొట్టి సినిమా అయింది. కేవలం హీరో క్యారక్టర్
ప్రదర్శించే మేల్ ఇగోయిజపు టక్కుటమారాలే, అది పుట్టించే నవ్వులే
సినిమా అన్నట్టుగా తయారయ్యింది. ఈ టక్కుటమారాలూ నవ్వులతో కూడిన మేల్ ఇగోయిజం కూడా ఫస్టాఫ్
వరకే. ఇంత ఏకఛత్రాధిపత్య మేల్ ఇగోయిజమూ సెకండాఫ్
ని కాపాడలేకపోయింది. సెకండాఫ్ కథ ఎటు పోయిందో, హీరో క్యారక్టర్
ఏం చేస్తోందో అర్ధం పర్ధం లేకుండా పోయింది. ప్రేక్షకులు అల్పసంతోషులు. ఇదే చాలన్నట్టు
బ్రహ్మరధం పడుతున్నట్టు వార్తలు. ఆల్ ది బెస్ట్.
జొన్నలగడ్డ కోసం తీసిన సినిమా ఇది. కాబట్టి
తన ఫంకీ క్యారక్టర్ వరకూ తీసుకుని- చూసుకుని- నటించాడు. స్వాంకీ గెటప్, హైదరాబాదీ తెలుగు, హౌలే గాడి ప్రవర్తన, లింగో, తెలివి తేటలు, డైలాగ్ కామెడీ...
వీటిని సాధనాలుగా పెట్టుకుని ప్రేక్షకుల్ని తెగ నవ్వించాడు. అటు ‘ఇస్మార్ట్ శంకర్’ క్యారక్టర్ని తీసుకుని, ఇటు ‘జాతి రత్నాలు’ కామెడీ చేసినట్టు.
సినిమాలో ఏదెలా వున్నా కొత్తగా నవ్విస్తే చాలన్న ప్రేక్షకుల నాడీ పట్టుకుని దాంతో ఆడుకున్నాడు.
అయితే ‘జాతిరత్నాలు’ కామెడీకి నేటివిటీ
వుంది.
హీరోయిన్ నేహాశెట్టి క్యారక్టర్ జొన్నలగడ్డకి
పోటీ రాకుండా చూసుకున్నారు. లేకపోతే చిక్ లిట్ కాకపోయినా కనీసం రోమాంటిక్ కామెడీ జానర్
కైనా న్యాయం చేస్తూ, నువ్వెంతంటే నువ్వెంతనే కౌంటరిచ్చే, పోటీనిచ్చే సరైన క్యారక్టరైజేషన్
తో యాక్టివ్ పాత్రగా వుండేది. రోమాంటిక్ డ్రామా జానర్లో లాగా శాడ్ గా పాసివ్ గా వుండిపోయింది.
ఇంతకంటే నేహా గురించి చెప్పుకోవడానికి లేదు.
ఇక మిగిలిన క్యారక్టర్స్ లో ప్రిన్స్
తప్ప, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, జడ్జిగా ప్రగతి కామెడీ పాత్రలేశారు. తమన్ నేపథ్య సంగీతం స్టయిలిష్ మూవీకి
తగ్గట్టు లేదు, రొటీన్ కామెడీ సినిమాల్లో వినిపించే ఇన్ స్టృమెంట్సే
వాడేశారు చిడతలు వాయిస్తున్నట్టు. మళ్ళీ పాటలకి వేరు. ఇక కెమెరా వర్క్, డీఐ అతి రంగులతో లౌడ్ గా వున్నాయి. కొత్త దర్శకుడి దర్శకత్వం లేని కథకి ఎలా
వుంటుందో అలావుంది. జొన్నలగడ్డ స్వయంగా రాసుకున్న డైలాగులు హైలైట్ అని టాక్.
చివరికేమిటి
డీజేగా వున్న టిల్లు సింగర్ రాధికని
చూసి ప్రేమలో పడ్డం, ఆమెతో హత్యలో ఇరుక్కోవడం, బ్లాక్
మెయిలర్ ని, పోలీసుల్నీ ఎదుర్కోవడం ఫస్టాఫ్. ఇంతవరకూ సిట్యుయేషన్స్, సిట్ కామ్, జొన్నలగడ్డ వన్ మాన్ షోగా బాగానే వున్నాయి.
లాజిక్, అర్ధం పర్ధం ఏమీ చూడకూడదు. జొన్నలగడ్డ గిమ్మిక్స్ కి
నవ్వుతూ వుండాలి. హీరోయిన్ అచేతనంగా వుండిపోతుంది- ఓకే- కానీ సెకండాఫ్ ఓపెన్ చేయగానే
హీరోయిన్ తడాఖాతో కథ నడుపుకుని వుంటే కథ వుండేది. చిక్ లిట్ లో, రోమాంటిక్ కామెడీల్లో, హీరో హీరోయిన్లే ఒకరికొకరు ప్రత్యర్ధులుగా వుంటారు.
ఇక్కడ ప్రత్యర్ధి అయిన రాధిక క్యారక్టర్ని ఆమెకో హిడెన్ ఎజెండా కల్పించి యాక్టివేట్
చేసి వుంటే- హీరోకి కష్టాలూ తిప్పలూ పెరిగిపోయి క్యారక్టర్ నిలబడేది, కథ వుండేది. యువప్రేక్షకుల్లో భాగమైన యువతులు కూడా తరలివచ్చి హారతులు పట్టేవాళ్లు.
కానీ సెకండాఫ్ ఓపెన్ చేస్తే కథేమీ లేదు
సినిమాలో. అంటే సెకండాఫ్ సిండ్రోమ్ లో పడింది స్ట్రక్చర్, స్క్రీన్
ప్లే, సినిమా, ఏదనుకుంటే అది. సెకండాఫ్
కథ ఎలా నడపాలో తెలియక- జొన్నలగడ్డ జ్ఞాపక శక్తిని కోల్పోయే డ్రామా, కామెడీ, కోర్టు విచారణ డ్రామా, కామెడీ అనే రెండు అర్ధంపర్ధం
లేని బ్లాకులు పెట్టుకుని సెకండాఫ్ ని నింపేశారు. జొన్నలగడ్డ క్యారక్టర్ నడవడానికి బలవంతంగా కల్పించిన
సిల్లీ సీన్లు ఇవి. ఆ మధ్య సినిమాల్లో సెకండాఫ్ లో బ్రహ్మానందం బకరా కామెడీ తప్పనిసరి
టెంప్లెట్ అయినట్టు- ఆ టెంప్లెట్లు, పాత ఫార్ములా ట్రోప్స్ పెట్టుకుని-
ఒక సోకాల్డ్ స్టయిలిష్ యూత్ మూవీ తీసేశారు. ఇక ముగింపయితే చెప్పకర్లేదు. చిక్ లిట్ సినిమాలు ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వాలంటైన్స్ డే కి విడుదలవుతూంటాయి. 'డీజే టిల్లు' కాకతాళీయంగానే వాలంటైన్స్ డే కి రెండ్రోజుల ముందు విడుదలైంది- బాయ్స్ కి తప్ప గర్ల్స్ కి చెందని యూత్ సినిమాగా.
కానీ మూవీ హిట్, అంతే. దటీజ్ ది పాయింట్.
-సికిందర్
(అనివార్య
కారణాల వల్ల రివ్యూలు
ఆలస్యమవుతున్నాయి. వాట్సాపులు,
కాల్స్ చేయకుండా సహకరించగలరు)
Subscribe to:
Posts (Atom)