రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, November 23, 2020

1001 : సందేహాలు -సమాధానాలు

 

Q : ఈ మధ్య చాలా సినిమాలలో ఓ పది నిమిషాలు వర్తమాన కధ చూపించి, వెంటనే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయి, అసలు కధ చూపించి, క్లయిమాక్సులో మళ్లీ వర్తమానం లోకి వస్తున్నారు. అప్పటికి మొదటి పది నిమిషాల పరిచయం ఎవరికీ గుర్తు ఉండదు. నా ఉద్దేశంలో ఈ ప్రక్రియ వలన ప్రేక్షకుల సమయం అంటే మొదటి పది నిమిషాలు వృధా కావడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. మీ అభిప్రాయం తెలుపండి.
బోనగిరి

A : ఫ్లాష్ బ్యాకులు ఆర్భాటాల కోసమే వుంటున్నాయి తప్ప గుణాత్మకంగా కథ చెప్పడానికి వుండడం లేదు. రాంగోపాల్ వర్మ ఫ్లాష్ బ్యాకులు లేకుండానే సినిమాలు తీస్తారు. కథలో దమ్మున్నా లేకపోయినా దాని ఖర్మకి వదిలేస్తారు. ఆయనకి లేని ఆరాటం ఇతరుల కెందుకు. ఫ్లాష్ బ్యాకులతో తీసి 90% సూపర్ హిట్లు ఇవ్వడం లేదుగా. ఒక సరళ రేఖలో కొనసాగుతున్న కథకి ఎక్కడైనా మలుపు తిప్పే సమాచారముంటే, ఆ ముక్కని అక్కడ సర్ప్రైజ్ ఎలిమెంటుతో కూడిన ఫ్లాష్ బ్యాకుగా వాడుకున్నప్పుడు, కథకి క్రియాత్మకంగా వాడుకున్నట్టవుతుంది. కథని ఉన్నతీకరించి నట్టవుతుంది. ఈ మధ్య ఒక సరళ రేఖగా వున్న కథకి ప్లాట్ పాయింట్ టూ లో, ఓ ఫ్లాష్ బ్యాక్ ముక్క పట్టుకొచ్చి వేస్తే, పాత్ర ఎదుర్కొంటున్న సమస్యకి అదే పరిష్కార మార్గమై పోయింది! పైగా ప్లాట్ పాయింట్ టూ మలుపుగా కూడా పనికొచ్చింది. సర్ప్రైజ్ గా కూడా వుంది. నిజానికీ ఫ్లాష్ బ్యాకు దర్శకుడి విజన్ లో రొటీన్ గా వుంది. కథ ముగింపు ఆయనకి తెలీదు, ఏం చేయాలో మనకీ తెలీదు. మొదట సినాప్సిస్ లో కూడా ముగింపు పెండింగులోనే వున్న దయనీయ పరిస్థితి. అడ్డుపడుతున్న ఫ్లాష్ బ్యాకుని పక్కన పెట్టి, కథ చేసుకుంటూ పోతూంటే, ప్లాట్ పాయింట్ టూలో ఆ ఫ్లాష్ బ్యాక్ రివ్వున వచ్చి పడిపోయింది. దాంతో కథకి ముగింపు కూడా వచ్చేసింది. ఆ ఫ్లాష్ బ్యాకుని చిన్న ముక్కగా కుదించి వాడేం. సర్ప్రైజింగ్ గా వుండాలంటే ఒక మెరుపులా చిన్న ముక్కగానే వుండాలి  తప్ప చాట భారతం కాదు. ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్ హీరో హీరోయిన్ల కనువిప్పుకి కూడా ఉపయోగపడింది. ఇంకా చాలా తాత్పర్యాలు వచ్చాయి. కథకి నిండుదనం వచ్చింది. ఇన్ని ప్రయోజనాలు సాధించింది ఫ్లాష్ బ్యాక్. దీంతో ఫ్లాష్ బ్యాకు అనేది కథకి క్రియాత్మకంగా ఉపయోగపడాలని మన బుద్ధికీ చాచి కొట్టినట్టు ఒక కనువిప్పు లాంటిది అవ్వాల్సింది అయ్యింది.

 Q :  మీ బ్లాగ్ చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. నాదొక ప్రశ్న.మీరు సినిమా స్క్రిప్ట్ కోసం కచ్చితంగా స్ట్రక్చర్ ఫాలో అవమంటారు కానీ నేను రాసుకున్న కొన్ని కథలకు అది కుదరడం లేదు. నా క్రియేటివిటీ మిగతా రూల్స్ ను డామినేట్ చేస్తుంది. అయితే మీరు ఒకసారి చెప్పినట్టు ఒకవేళ స్ట్రక్చర్ ఫాలో అవలేకపోతే స్క్రిప్ట్ లో ప్రతి పది నిమిషాలకు ఒకసారి బ్యాంగ్ ఇస్తూ పోవడం లాంటివి చేసుకోమన్నారు. దానికి ఉదాహరణగా భలే భలే మగాడివోయ్ సినిమా చెప్పారు. మరి అలా క్రియేటివ్ గా కథలు రాసుకోవాలి అనుకునేవాళ్లు ఈ పది నిమిషాలలో బ్యాంగ్ పద్దతి ఫాలో అవడం మంచిదేనా? అలా పది నిమిషాలలో బ్యాంగ్ అంటే కథను ఎలా రాసుకోవాలి వివరించగలరు.
ప్రణవ్, అసిస్టెంట్

A :    ఈ బ్లాగుని ఫాలో అవుతూ సొంతబడి (క్రియేటివ్ స్కూల్) ప్రశ్న అడిగితే ఎలా. మీ సొంతబడి క్రియేటివిటీకి ఇలా చెయ్యాలీ అని చెప్పడానికి పాఠాలేముంటాయి. మీ ఇష్టం వచ్చినట్టు మిడిల్ మాటాష్ చేసుకోవచ్చు, ఎండ్ సస్పెన్స్ చేసుకోవచ్చు, సెకండాఫ్ సిండ్రోమ్ చేసుకోవచ్చు, పాసివ్ పాత్రలు చేసుకోవచ్చు, కథ గాకుండా గాథలూ చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. ఆకాశమే మీ హద్దు. రెండో సినిమా అవకాశం ప్రశ్నార్ధకం చేసుకుంటూ 90% అట్టర్ ఫ్లాపుల క్లబ్బులో చేరిపోనూ వచ్చు.   

        స్ట్రక్చర్ స్కూల్లో కథ చేసుకోవడానికి బేస్ గా మనుషుల మానసిక లోకపు నిర్మాణ మంటూ ఒకటుంది. ఏమిటి మనుషుల మానసిక లోకపు నిర్మాణం? కాస్త అప్పర్ మైండ్, ఇంకాస్త ఇన్నర్ మైండ్, ఓ దిక్కుమాలిన ఇగో. అప్పర్ మైండ్ అంటే కాన్షస్ మైండ్. ఇన్నర్ మైండ్ అంటే సబ్ కాన్షస్ మైండ్. సబ్ కాన్షస్ మైండ్ అంటే అంతరాత్మ. ఇగో అనేది అప్పర్ మైండ్ లో ఎంజాయ్ చేయడాని కిష్టపడుతూ, అప్పర్ మైండ్ కీ, అంతరాత్మకీ మధ్యన వుంటూ, పెత్తనాలు చేస్తూంటుంది. దాని మెడబట్టి అంతరాత్మలోకి తోసేస్తే, కుయ్యోమొర్రో  మంటూ అక్కడుండే నగ్నసత్యాల్ని, శాశ్వత సత్యాల్ని, సవాలక్ష సవాళ్ళనీ ఎదుర్కొని, క్లాసులు పీకించుకుని, పునీతమై ఒడ్డునపడి, దిక్కుమాలిన వేషాలేసే ఇగోగా వుంటున్న తను, మెచ్యూర్డ్ ఇగోగా మోక్షం పొందుతుంది. ప్రపంచ పురాణాలు తీసుకున్నా, ఇంకే కథలు తీసుకున్నా వాటి అంతరార్ధమిదే. మనుషుల మానసిక లోకంలో నిత్యం జరిగే కురుక్షేత్రమిదే. ఈ మానసిక లోకమే స్ట్రక్చర్ రూపంలో వెండితెర మీద కన్పిస్తుంది. అప్పర్ మైండ్ అంటే ఫస్ట్ యాక్ట్ లేదా బిగినింగ్, అంతరాత్మ అంటే సెకండ్ యాక్ట్ లేదా మిడిల్, మోక్షం పొందడమంటే థర్డ్ యాక్ట్ లేదా ఎండ్. ఇక ఇగో వచ్చేసి ప్రధాన పాత్ర. ఈ స్ట్రక్చర్ లో వుండే కథని చూస్తున్నప్పుడు, తమ మానసిక లోకాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు ప్రేక్షకులు. ఇదీ సినిమా చేసే పని. 

        ఇలా బేసిక్స్ గురించే మీకు తెలియక పోతే, పదే పదే బేసిక్స్ గురించే చెప్తూ వుంటే, మీరూ ముందు కెళ్లరు, ఈ బ్లాగూ ముందు కెళ్లదు. మీ క్రియేటివిటీకి బేస్ లేదు. మీరు మీ మానసిక లోకాన్ని వదిలించుకుని బయటికి ఎక్కడి కెళ్తారు. ఈ విశ్వమే దేవుడి మైండ్. త్రీయాక్ట్ స్ట్రక్చర్ మైండ్. ఎక్కడి కెళ్తారు? మళ్ళీ ఆ సుభాషితాన్ని ఇక్కడ పడేద్దామా. ఈ పక్కన చూడండి-  

     మీ కథలు స్ట్రక్చర్లో కుదరడం లేదంటే అక్కడి దాకా ఎందుకు పోతారు. మొదట ఐడియా అనుకున్నప్పుడే దానికి స్ట్రక్చర్ వుందో లేదో చూసుకోవాలి. మీ క్రియేటివిటీ స్ట్రక్చర్ ని డామినేట్ చేస్తోందంటే ఆ కథని వదిలెయ్యాలి. భలేభలే మగాడివోయ్ వుంది కదాని అనుకుంటే, అందులో స్ట్రక్చర్ లేదని ఎవరన్నారు. యాక్ట్స్ ఆలస్యమయ్యాయి, అంతే. ఫస్టాఫ్ గంటా పదిహేను నిమిషాలూ కథే ప్రారంభం కాని పరిస్థితిని మరిపించేలా పది నిమిషాలకో బ్యాంగ్ పడింది. ఇది తెలిసి చేసి వుండరు. ఒక సినిమా కంపెనీలో సిడ్ ఫీల్డ్ పని చేస్తున్నప్పుడు, ఆ నిర్మాత-  మీరేం చేస్తారో నాకు తెలీదు, నా సినిమాల్లో పది నిమిషాలకో బ్యాంగ్ మాత్రం పడాలంతే - అన్నాడు. ఇదెక్కడి పైత్యంరా అనుకున్నాడు సిడ్ ఫీల్డ్. అలా ఎడ్డీ మర్ఫీ తో స్టార్ యాక్షన్ సినిమాలు తీశారు. అంటే సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ ని వదిలేశాడనా? భలేభలే మగాడివోయ్ ఫస్టాఫ్ లో ఈ బ్యాంగులు కన్పించి, సిడ్ ఫీల్డ్ పేర్కొన్నది గుర్తొచ్చి, రివ్యూలో ప్రస్తావించాం.

        భలేభలే మగాడివోయ్ లో స్ట్రక్చర్ వుంది. యాక్ట్స్ ఆలస్యమయ్యాయి. సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ ప్రారంభమవుతుంది. కేవలం కథలేని సుదీర్ఘమైన ఫస్టాఫ్ ని బ్యాంగులు నిలబెట్టాయి.

        నిన్నటి రివ్యూ  ది ప్రిన్సెస్ స్విచ్డ్ ఎగైన్ లో గంటన్నర సినిమాకి ప్లాట్ పాయింట్ వన్ చివరి అరగంటలో వస్తుంది. అంటే మిడిల్ మాటాషా? కాదు. ఇదే కదా స్ట్రక్చర్ తో క్రియేటివిటీ. స్ట్రక్చర్ లేకూండా క్రియేటివిటీ ఏమిటి, నాలుగు గోడల ఇల్లే లేకుండా నగిషీ చెక్కినట్టు. 21 వ నిమిషంలో హీరోయిన్ మూడో పాత్రగా లేడీ ఫియోనా రావడంతో కథ మలుపు తిరిగే సన్నాహం మొదలవుతుంది. 32 వ నిమిషంలో ఆమె హీరోయిన్ రెండో పాత్ర మార్గరెట్ ని కిడ్నాప్ చేయాలని పథకం వేయడంతో ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. అయితే దీని ఆపరేటింగ్ పార్టు డిలే అవుతుంది. ఈ డిలే వల్ల ఎప్పుడు కిడ్నాప్ చేస్తుందాని ఉత్కంఠ ఏర్పడుతుంది. ఈ ప్లాట్ పాయింట్ వన్ ఇంకో పార్శ్వంలో మార్గరెట్ తో బాటు హీరోయిన్ మొదటి పాత్ర స్టేసీ కలిసి స్థానాలు మార్చుకోవాలన్న వాళ్ళ ప్లానింగ్ వేరే  వుంటుంది. ఈ కథని నడవనిచ్చి, చివరి అరగంటలో డిలే చేసిన ప్లాట్ పాయింట్ వన్ ఆపరేటింగ్ పార్టుని మొదలెట్టేశారు. అంటే ప్లాట్ పాయింట్ వన్ ని పరోక్షంగా చూపించి, దాని ప్రత్యక్ష రూపాన్ని తర్వాత చూపించడ మన్నమాట. దీని వల్ల ఫస్టాఫ్ లో కథ ప్రారంభం కాలేదన్న అసంతృప్తి కలగలేదు.

        ఇలా కథని బట్టి స్ట్రక్చర్ తో క్ర్రియేటివిటీకి పాల్పడొచ్చు. స్ట్రక్చరే లేకుండా క్రియేటివిటీ ఎలా చేసుకోవాలో చెప్పమంటే, ముందు మానసిక లోకమనే సృష్టి సెటప్ ని రంపం తీసుకుని పరపర కోసి పడెయ్యాలి. ఇది మన వల్ల అయ్యేలా కన్పించడం లేదు. కాబట్టి సొంతబడి క్రియేటివ్ స్కూల్లో జిత్తులమారి అప్పర్ మైండ్ లో, ఇగో చెప్పినట్టూ చేసుకుంటూ పోవడమే. ఎప్పుడో పా...త పాండురంగ మహాత్మ్యం నుంచీ, విప్రనారాయణ నుంచీ, అన్నీ సినిమాలూ త్రీయాక్ట్ స్ట్రక్చర్లోనే వుంటూ వచ్చాయి. ఈ శతాబ్దంలో స్ట్రక్చర్ విద్వేషకులు ఎక్కడ్నించి వచ్చారో మరి. 

Q :  మీరు మార్కెట్ యాస్పెక్ట్ అని చెపుతుంటారు కదా, అసలు డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్న యువ దర్శకుల దగ్గర అటు మార్కెట్ యాస్పెక్ట్, ఇటు క్రియేటివ్ యాస్పెక్ట్ రెండూ కవర్ అయ్యేలా ఎలాంటి స్క్రిప్ట్ లు పట్టుకుని వాళ్ళు దర్శకత్వం కోసం ప్రయత్నాలు చేయాలి అంటారు అన్నది వివరించండి.
కిరణ్, అసోసియేట్

A : దీని మీద బ్లాగులో సందర్భం వచ్చినప్పుడల్లా చాలా సార్లు చెప్పుకున్నాం. బ్లాగు సెర్చి బాక్సులో మార్కెట్ యాస్పెక్ట్ అని, క్రియేటివ్ యాస్పెక్ట్ అని విడివిడిగా తెలుగులో టైపు చేయండి. పేజీలు డిస్ ప్లే అవుతాయి. మార్కెట్ యాస్పెక్ట్ అంటే, ఇప్పుడు ప్రేక్షకులున్న ప్రపంచం. ప్రపంచంలో వాళ్ళ అభిరుచులేమిటో అది పట్టుకుని కథ చేయడం. కథే కాదు, సీన్లలో కూడా మార్కెట్ యాస్పెక్ట్ కనిపించాలి. సీన్లే కాదు, డైలాగుల్లో కూడా మార్కెట్ యాస్పెక్ట్ కనిపించాలి. ఇప్పుడు రోమాంటిక్స్, లేదా ఏకనమిక్స్ తో కూడిన కథలే మార్కెట్ యాస్పెక్ట్. లేదా రెండూ కలిసినవి. మూస ఫార్ములా కల్పిత ఉబుసుపోక కథలు కాకుండా, ప్రేక్షకులు తాముంటున్న ప్రపంచ పరిస్థితులతో, జీవితాలతో ఐడెంటిఫై చేసుకోగల రియలిస్టిక్ కథలు, పరిష్కారాలు. మార్కెట్ యాస్పెక్ట్ ని నిర్ణయించుకున్నాక, దానికి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ తో రాసుకోవాలి, తీసుకోవాలి. అది నిర్మాతకి డబ్బులు కన్పించేట్టు ఆకర్షించాలి. జనరల్ నాలెడ్జి కోసం ఈ లింకు క్లిక్ చేయండి. 

సికిందర్

Sunday, November 22, 2020

1000 : హాలీవుడ్ రివ్యూ

 


దర్శకత్వం : మైక్ రాల్ 
తారాగణం :  వెనెస్సా హజెన్స్, సామ్ పలాడియో, నిక్ సగర్, మియా లాయిడ్
రచన : రాబర్ట్ బర్గర్, మెజాన్ మెట్జర్; సంగీతం : అలన్ లజర్, ఛాయాగ్రహణం : ఎఫ్ ఏ ఫెర్నాండెజ్
నిర్మాణం : బ్రాడ్ క్రెవాయ్ టెలివిజన్ 
నిర్మాతలు : స్టీవెన్ మెక్ గ్లోథెన్, వెనెస్సా హజెస్ 
విడుదల : నెట్ ఫ్లిక్స్ (19.11.20)

***

    వెనెస్సా హజెన్స్ ఇంకో పాత్ర జోడించుకుని త్రిపాత్రాభినయంతో విచ్చేసింది...క్రిస్మస్ కి ప్లస్ టూ వినోదం. వినోదంలో ప్రణయం, ప్రణయంలో ప్రమాదం. కాల్పనిక రాజవంశంలో హాస్యాభ్యుదయం, పట్టాభిషేకంలో అపహరణల పర్వం. పండగ మూడ్ సినిమాకి పక్కా నిర్వచనం. పండగ సినిమాల పేరుతో వాటీజ్ ఫ్యామిలీ సినిమా? నరికి వేతల రక్తపాతమా, కన్నీళ్ళ ధారా పాతమా? సెంటిమెంట్ల శరా ఘాతమా? వెనెస్సా వినోదం, వినోదంలో హాస్య విలనీ, రాజవంశ మర్యాదల మన్నన ఒక కొత్త డ్రీమ్ వరల్డ్. డ్రీమ్ వరల్డ్ లో డ్రీమీ డియరెస్ట్ పాత్రలు. ది ప్రిన్సెస్ స్విచ్ కి  ది ప్రిన్సెస్ స్విఛ్డ్ ఎగైన్ సీక్వెల్. క్రిస్మస్ సంరంభంలో మరో సీక్రెట్ గేమ్, గేమ్ మీద గేమ్. గేట్లు తెరచుకున్న హ్యూమర్.

    సారి మాంటేనరో డచెస్ మార్గరెట్ డెలాకోర్ట్ (వెనెస్సా హజెన్స్ -2) కి ఉన్నట్టుండి క్రిస్మస్ కి మాంటేనరో రాకుమారిగా పట్టాభిషికత్వం వరిస్తే, బెల్గ్రేవియా రాకుమారి స్టేసీ (వెనెస్సా హజెన్స్ -1) తో నేను నువ్వుగా, నువ్వు నేనుగా మారి, ప్రేమ సంగతులు చూసుకుందామని అనుకుంటే, ఎక్కడ్నుంచో లేడీ ఫియోనా (వెనెస్సా హజెన్స్ -3) నంటూ కిలాడీ దూరి, రాజవంశ ఖజానా ఖాళీ చేద్దామనుకునే ఎత్తుకి పైఎత్తు చివరికి చిత్తు కథ. నేటి బాక్సాఫీసు స్లోగన్  రోమాంటిక్స్ ప్లస్ ఎకనమిక్స్ మార్కెట్ యాస్పెక్ట్ కి రోమాంచిత న్యాయం.

      వెనెస్సా నవ్వు ముఖం మరోసారి కట్టి పడేస్తుంది. ఆమె నవ్వు ముఖం లేకపోతే ఈ సీక్వెల్ కూడా లేదు. బెల్గ్రేవియా రాకుమారి స్టేసీ, మార్గరెట్ పట్టాభిషేకానికి మాంటేనరో బయల్దేరుతూ, మధ్యలో షికాగోలో కెవిన్ (నిక్ సగర్) పరిస్థితేమిటో చూడాలనుకుంటుంది. కెవిన్ తో మార్గరెట్ కి బ్రేకప్ అయి షికాగోలో అతను అదే బేకరీ నడుపుకుంటూ వుంటాడు. పదేళ్ళ కూతురు ఒలీవియా వుంటుంది. భర్త ప్రిన్స్ ఎడ్వర్డ్ (సామ్ పలాడియో) తో కలిసి స్టేసీ వచ్చి, కెవిన్ ని మార్గరెట్ పట్టాభిషేకానికి కి రావాలని ఒప్పిస్తుంది.  

    వాళ్ళతో కూతుర్ని తీసుకుని మాంటేనరో ప్యాలెస్ కొస్తాడు గడ్డం పెంచుకుని వున్న కెవిన్. పండక్కి ప్యాలెస్ అలంకరణకి తోడ్పడతాడు. రాజ్య బాధ్యతలు మీద పడడంతో అతణ్ణి నిర్లక్ష్యం చేశానని బాధ పడుతుంది మార్గరెట్. మరో వైపు స్టేసీకి కూడా ఇదే సమస్య. రాకుమారిగా పరిపాలనా బాధ్యతల వల్ల భర్త ప్రిన్స్ ఎడ్వర్డ్ ని నిర్లక్ష్యం చేస్తున్నానని బాధ. ఇక ఆ సాయంకాలం విందు వినోదాల కార్యక్రమంలో వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది కిలాడీ లేడీ ఫియోనా.

    మార్గరెట్, స్టేసీల పోలికలతో వున్న లేడీ ఫియోనా తను మార్గరెట్ కజిన్ నని చెప్పుకుంటుంది. ఈమె ఘన చరిత్రేమిటంటే, వారసత్వంగా సంక్రమించిన సంపదని అవజేసి, కిలాడీలైన ఇద్దరు సేవకులు రెగ్గీ, మిండీలని వెంటేసుకు తిరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ ట్రిపుల్  ధమాకా లాంటి అవకాశాన్ని చూస్తుంది. ఒకటి మార్గరెట్ లా తను సెటిల్ అవచ్చు, రెండు పట్టాభిషేకం జరుపుకోవచ్చు, మూడు ఖజానా దోచుకోవచ్చు. రెగ్గీ, మిండీలతో ఆమె ఈ విందు కార్యక్రమానికి వచ్చిందే అతిధుల జేబులు సవరించడానికి.

    ఈ విషయం తెలీక స్టేసీ, మార్గరెట్ లు వేరే ప్లానుతో వుంటారు. మార్గరెట్ సమస్యేమిటంటే, ప్యాలెస్ ముఖ్య నిర్వాహకుడు టోనీ తనని ప్రేమిస్తున్నాడు. పట్టాభిషేకంలోగా ఇప్పుడు తను కెవిన్ తో ప్రేమని చక్కదిద్దుకోవాలంటే, టోనీని వదిలించుకోవాలి. అందుకని తను స్టేసీలా స్టేసీ స్థానంలో కెళ్తే, స్టేసీ మార్గరెట్ లా తన స్థానంలో కొస్తే బావుంటుంది. సరేనంటుంది స్టేసీ. ఇలా స్థానాలు మార్చుకున్న విషయం తెలీక, మార్గరెట్ అనుకుని స్టేసీని కిడ్నాప్ చేసి పడేస్తుంది లేడీ ఫియోనా...

ఎలావుంది కథ

      2018 లో క్రిస్మస్ కి విడుదలైన ది ప్రిన్సెస్ స్విచ్ మొదటి భాగానికి మార్క్ ట్వైన్ నవల ది ప్రిన్స్ అండ్ ది పాపర్ ఆధారం. ఈ నవల ఆధారంగా ప్రపంచ భాషల్లో చాలా సినిమాలొచ్చాయి, తెలుగు సహా. మొదటి భాగంలో షికాగోలో ఫ్రెండ్ కెవిన్ (నిక్ సగర్) తో కలిసి బేకరీ నడుపుతున్న స్టేసీ (వెనెస్సా హజెన్స్-1), బేకరీ క్రిస్మస్ పోటీలకి కెవిన్ తో బెల్గ్రేవియా వెళ్తుంది. అక్కడ తనలాగే వున్న మాంటేనరో డచెస్ మార్గరెట్ (వెనెస్సా హజెన్స్-2) ని చూస్తుంది. తమకి పూర్వపు బంధుత్వ ముందని తెలుసుకుంటుంది. మార్గరెట్ కి బెల్గ్రేవియా ప్రిన్స్ ఎడ్వర్డ్ (సామ్ పలాడియో) తో వివాహం నిశ్చయమై వుంటుంది. రెండు రోజుల్లో వివాహం. మార్గరెట్ తనకి సామాన్యురాలిలా జీవితం చూడాలనుందనీ, ఈ రెండు రోజులు స్థానాలు మార్చుకుందామనీ స్టేసీతో అంటుంది. స్టేసీ ఒప్పుకుంటుంది. ఇద్దరూ స్థానాలు మార్చుకుంటారు. సామాన్య జీవితంలో కెళ్లిన  మార్గరెట్ కెవిన్ తో ప్రేమలో పడుతుంది. ఇటు స్టేసీ ఎడ్వర్డ్ తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం అందరికీ స్పష్టం చేసి, మార్గరెట్ కెవిన్ తో ప్రేమలో వుంటుంది, స్టేసీ ఎడ్వర్డ్ ని పెళ్లి చేసుకుని బల్గ్రేవియా రాకుమారి అవుతుంది.

    ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ కథ. రెండూ ప్యాలెస్ రోమాంటిక్ హ్యూమర్లే. సీక్వెల్లో మూడో వెనెస్సా తొడయ్యింది. దీంతో క్రైమ్ ఎలిమెంట్ కలిసింది. మొదటి భాగం కంటే సీక్వెల్లో వేగముంది, హాస్యం ఎక్కువుంది. రాజవంశ బంధుమిత్ర పరివారం, వైభవం, రాచ మర్యాదలు వగైరా ఒకటే. అదే మనోహరమైన క్రిస్మస్ పండగ వాతావరణం చివరంటా. 

      ఈ రెండు భాగాల్లోనూ కాన్ఫ్లిక్ట్ ప్రధానం కాదు. దాన్ని పట్టుకుని మలుపులు తిప్పడం ముఖ్యం కాదు. క్రిస్మస్ సినిమా ఇంతే. మొదటి భాగంలో స్థానాలు మార్చుకున్న ఇద్దరూ బయట సృష్టించే కాన్ఫ్లిక్ట్ ఏమీ వుండదు. మార్గరెట్ గా వుంటున్న స్టేసీ దొరికిపోతుందేమో నన్న రెండు మూడు దృశ్యాలు పైపైన వుంటాయి. సీఐడీ బట్లర్ కూడా ఫోటోలు తీయబోతూ పైనుంచి కింద పడినడుం విరగ్గొట్టుకుని చాలించుటాడు. ప్రత్యర్థి పాత్రలతో ఔటర్ కాన్ఫ్లిక్ట్ సృష్టిస్తే, స్థానాలు మార్చుకుని వాళ్ళిద్దరూ జీవితాల్లో సృష్టించుకున్న ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ హైలైట్ అవదు. ఈ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ తో వాళ్ళిద్దరూ ఏం కనుగొన్నారన్నదే ప్రధానంగా చెప్పదల్చుకున్న కథ. మార్గరెట్ సామాన్య జీవితంలోని ఆనందాన్ని కనుగొంది, స్టేసీ ప్రేమని కనుకొంది. దీనికి ఏడ్పులూ, తెచ్చిపెట్టున్న సెంటిమెంట్లూ, ఫ్యామిలీ చాదస్తాలూ వంటి రోత టెంప్లెట్లు అవసరం లేదు. హాస్యంతో కూడా వాస్తవాలు తెలుస్తాయి.  

    ఈ సీక్వెల్లో మధ్యలో వెనెస్సా హజెన్స్-3 వచ్చి, కిడ్నాప్ తో ఔటర్ కాన్ఫిక్ట్ ని సృష్టిస్తుంది. ఇది కూడా లైటర్ వీన్ గానే వుంటుంది. ఈ ఔటర్ కాన్ఫ్లిక్ట్ తో, ఈసారి స్థానాలు మార్చున్న మార్గరెట్, స్టేసీ ల ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ప్రభావిత మవుతుంది. మార్గరెట్ నిర్లక్ష్యం చేసిన కెవిన్ తో పెళ్లి ప్రాముఖ్యాన్ని గుర్తిస్తుంది, స్టేసీ పెళ్లి చేసుకున్నఎడ్వర్డ్ ని నిర్లక్ష్యం చేయకూడదని తెలుసుకుంటుంది. సరిపోతుందా ఫ్యామిలీ సినిమాకి? ఇంకేమైనా నరికి వేతలూ కాల్చివేతల నాన్ వెజ్ కావాలా పండక్కి? క్రిస్మస్ సినిమాలో ఆ వర్ణ శోభిత కేకులూ పేస్ట్రీలూ చూస్తూంటే కూడా బ్లడ్డే కావాలా? చేతిలో పట్టుకుని వంకీలు తిరిగిన ఇంకో వింత ఆయుధమే కావాలా?

***

      సంభాషణలు మృదు మధురంగా వుంటాయి. దృశ్యాల కదలిక సడి లేకుండా వుంటుంది. సంగీతం సరస గీతాలతో వుంటుంది. ఛాయాగ్రహణం పీచు మిఠాయిలా వుంటుంది. కాస్ట్యూమ్స్ సింపుల్ గా వుంటాయి. ఏ విషయంలోనూ క్రిస్మస్ సినిమా స్వరాన్ని తప్పనీయలేదు. బయటికొస్తే మంచు కురుస్తూ వుంటుంది...మంచులో తడిసిన మంచి సినిమా. 

సికిందర్

 

 

Wednesday, November 18, 2020

999 : స్క్రీన్ ప్లే సంగతులు

 


  యోపిక్స్ ట్రెండ్ తగ్గు ముఖం పడుతున్న వేళ ఒక ఆటో బయోగ్రఫీ రివ్యూ కొచ్చింది. దీని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కావాలని అడిగిన ఒక పదుగురి కోరిక మేరకు సవివరంగా రాయాల్సి వచ్చింది. అప్పుడప్పుడు సమయం తీసి రాయడం వల్ల ఆలస్యమైంది. 3,542  పదాలతో పూర్తి చేసే సరికి ఎన్ని రోజులు గడిచిపోయాయో తెలియలేదు. ఇది 16 పేజీలు వస్తుంది. కనుక చదవబోయే ముందు నిడివి గురించి ముందే ఈ హెచ్చరిక. తెలుగులో మంచి ఫాలోయింగున్నతమిళ స్టార్ సూర్య ఈ ఆటో బయోగ్రఫీకి కథానాయకుడు. దేశంలో సామాన్యులకి చౌకలో ఏర్ డెక్కన్ విమాన యానాన్ని ఆవిష్కరించిన కెప్టెన్ జీఆర్ అయ్యంగార్ గోపీనాథ్ రాసుకున్న ఆత్మ కథతో  సూరరై పొట్రు (ధీరుడికి వందనం) గా, వెంకటేష్ తో గురు ఫేమ్ దర్శకురాలు సుధా కొంగర రూపకల్పన చేసింది. ఇదింకా మలయాళ కన్నడలతో బాటు, తెలుగులో ఆకాశమే నీ హద్దురా అని సెల్ఫిష్ టైటిల్ తో విడుదలైంది. మీడియా ప్రశంసలు విశేషంగా అందుకుంది. సెల్ఫిష్ టైటిల్ అనడమెందుకంటే, సామాన్యులకి చౌకలో విమాన సౌకర్యం కల్పించే కల తన స్వార్ధం కాదని, ప్రజా ప్రయోజనం కోసమేననీ సినిమాలో సూర్య అంటాడు. అలాంటప్పుడు టైటిల్ ఆకాశమే మీ హద్దురా అని కస్టమర్ ఓరియెంటెడ్ గా వుండాలేమో.

        సూర్య కాబట్టి ఇది మరో తమిళ మాస్ మసాలాగా తయారై నట్టుంది. తన మాస్ ఫ్యాన్స్ ని సంతోష పెట్టే వూర మాస్ సినిమా. లేదా ద్రవిడ క్యాస్ట్ పొలిటిక్సు కావొచ్చు. బ్రాహ్మణ కెప్టెన్ గోపీనాథ్ ని అణగారిన వర్గాల మాస్ క్యారక్టర్ గా మార్చి, భార్య పాత్రని కూడా మాసమ్మాయిగా మార్చి, విలన్ గా బ్రాహ్మణ గోస్వామి పాత్రని సృష్టించారు. బ్రాహ్మణుల మీద విజయంగా ముగించారు. ఆటో బయోగ్రఫీని తిరగేసి రాసి, క్యాస్ట్ ఫీలింగ్ ని ఆకాశమే నీ హద్దురా చేశారు. ఈ సినిమాకి కులం రంగులు పులమడం అవసరమా అన్పించేట్టు చేశారు. 

        దర్శకురాలు సుధ గురు తోనే తన స్కూల్ ని స్పష్టం చేసింది. అదే స్కూల్లో ఇప్పుడు సూర్యతో వూర మాస్ గా తీసింది- కార్పొరేట్ కథనాన్ని పక్కన పెట్టేసి. ఐతే స్పోర్ట్స్ కథ గురు ని  స్పోర్ట్స్ జానర్లోనే తీసినట్టు, ఇప్పుడు ఎంటర్ ప్రెన్యూర్ కథని కూడా అదే స్పోర్ట్స్ జానర్లో ఈజీగా తీసేయడంతో సమస్య వచ్చింది. ఎంటర్ ప్రెన్యూర్ లేదా బిజినెస్ జానర్ మూవీస్ వున్నాయిగా - ముఖ్యంగా ఏవియేషన్ బిజినెస్ తో రియల్ స్టోరీ ది ఏవియేటర్’, మెక్ డొనాల్డ్స్ ఫుడ్ బిజినెస్ తో ఇంకో రియల్ స్టోరీ ది ఫౌండర్ వంటివి ఎన్నో పకడ్బందీగా, భావి ఎంటర్ ప్రెన్యూర్స్ కి కూడా పనికొచ్చేలా వున్నాయిగా. కెప్టెన్ గోపీనాథ్ ఒక వినూత్న బిజినెస్ మోడల్ తో విజయం సాధిస్తే, దాంతో బాక్సాఫీసు మోడల్ ని సక్రమంగా ప్రెజెంట్ చేయాలిగా. అసలు బయో పిక్కులకైనా, ఆటో బయోగ్రఫీల కైనా కథకి ఏది పాయింటుగా వుంటుంది, ఏది మార్కెట్ యాస్పెక్ట్ తో చెప్పాల్సిన కథవుతుంది? ఇలాకాక మొన్న అమెరికాలో ఇండియన్ టీ అంటూ వచ్చిన మరో మిస్ ఇండియా లా మిక్చర్ పొట్లంలా తీసేయడమేనా? ఇలా జరిగిన అనేక తప్పిదాల్నితర్వాత విశ్లేషించు కుందాం. 

ముందుగా కథ

         తమిళనాడు మధురై దగ్గర్లో సోలవందన్ లో వుంటాడు నెడుమారన్ రాజంగం అలియాస్ మారా (సూర్య). అతను ఒకప్పుడు ఏర్ ఫోర్స్ లో కెప్టెన్. సామాన్యులకి విమానం కల నిజం చేయాలన్న ఆశయంతో ఇప్పుడు దాని మీద వుంటాడు. టీచరైన తండ్రితో పడదు. మధ్యలో తల్లి (ఊర్వశి) కి హైరానా. ఒక బేకరీ నడిపే అమ్మాయి సుందరి (అపర్ణా బాలమురళి) ని ప్రేమిస్తాడు. ఆమె ఆకాశంలో కలలుగనే అతణ్ణి దూరం పెడుతుంది. మారా కలకి జాజ్ ఏర్ లైన్స్ అధినేత పరేష్ గోస్వామి (పరేష్ రావల్) స్ఫూర్తి. మధ్యతరగతి వాడైన గోస్వామి ఏర్ వేస్ లో టాప్ కి ఎదగడం ప్రేరణ. దాంతో ఆయన్ని కలిసి తన చీప్ ఏర్ వేస్ ప్లాను గురించి చెప్పి భాగస్వామ్యం కోరతాడు. గోస్వామి హేళన చేసి పంపిస్తాడు. దాంతో మారా పట్టుదలకి పోతాడు. అప్పులు చేసి, క్రౌడ్ ఫండింగ్ చేసుకుని అతను విమానాన్ని ఎగరేసినప్పుడల్లా గోస్వామి భూ మార్గం పట్టిస్తూంటాడు. ఒకటి రెండు సార్లు కాదు, చాలా సార్లు. ఇలా ఈ పోరాటంలో మారా చివరికి తన కలని నిజం చేసుకుంటూ, సామాన్య ప్రయాణీకులతో విజయవంతంగా విమానాన్ని ఎలా ఎగరేశాడన్నది మిగతా కథ.  

సూర్య మాస్ అవతారం 

         వూళ్ళో ఇరుకు బస్తీలో మాస్ యువకుడి పాత్రలో సూర్య తమిళ అభిమానుల హృదయాలకి మునుపెన్నడూ లేనంతగా దగ్గరైనట్టు కనిపిస్తాడు. శవ యాత్రలో విరగబడి మసాలా డాన్స్ చేస్తాడు. నవ్వించడు, పైగా ఏడ్పిస్తాడు. భావోద్రేకాల్ని రెచ్చగొడతాడు. క్యాస్టిజం గురించి మాట్లాడతాడు. నేను సోషలిస్టుని, నువ్వు సోషలైట్ వి అంటాడు. ఏం జరిగినా అగ్రవర్ణ అణిచివేతగా ఫీలవుతాడు. మొత్తంగా సామాజిక వర్గ కోణంలో లక్ష్యిత ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు. లక్ష్యం కోసం తన పోరాటంలో ఈ వర్గ ప్రజలే తన బలమని సమీకరిస్తాడు. ఇదేమన్నా విప్లవ సినిమానా? బిజినెస్ మెయిన్ స్ట్రీమ్ లో వుంటుంది. రెబలిజమంటే సమాంతర వ్యవస్థని ఆహ్వానించడమే. సమాంతర వ్యవస్థలో స్మగ్లింగ్ వుంటుంది. స్మగ్లింగ్ చేసుకు బ్రతకాలి, ఆ వినియోగ దార్లు వేరు. దేశంలో మెయిన్ స్ట్రీమ్ లో దళిత కార్పొరేట్ అధిపతులు లేరనా?

        నేరుగా కార్పొరేట్ క్లబ్ కి చేర వేసే ఒక వినూత్న విమాన యాన బిజినెస్ మోడల్ ని ఆలోచించగల్గిన అడ్వాన్సుడు ఎంటర్ ప్రెన్యూర్ అయిన తను, ఈ మూస పోరాటాలూ కులం కార్డులూ, తన క్యాస్ట్ ని ఫీలయ్యే ఇన్ఫీ రియారిటీ కాంప్లెక్సులూ, రోషాలూ పక్కన పెట్టి, రెబెల్ పంథా నుంచి కాస్త మెయిన్ స్ట్రీమ్ లో కొచ్చి-  బిజినెస్ మైండ్ తో  హేమా హేమీలతో నెగెటివ్ గా రియాక్టవని మాస్టర్ నెగోషియేటర్ గా వ్యవహరించాలని ఆలోచించని, ఆవేశమే తప్ప ఆలోచన లేని, సగటు టెంప్లెట్ మాస్ పాత్రగా మిగిలి పోతాడు. బిజినెస్ జానర్ మూవీలో వింత పాత్రలా వుంటాడు. అసలొక తాజా మాజీ కెప్టెన్ లా అన్పించడు. డిఫెన్స్ దళాలకి కుల మతాలుండవని మర్చిపోయారేమో.

        గోస్వామిని అప్రోచ్ అయ్యే విధానం, మిస్ ఇండియా లో ఎంబీఏ చదివిన కీర్తీ సురేష్ పాత్ర, జగపతి బాబుని అప్రోచ్ అయి రొచ్చు చేసుకునే విధానంతో వంద మార్కుల సరి సమానం. ఎవరైనా ఎదుటి వ్యక్తికి పోటీ నిచ్చే ప్రతిపాదనతో అప్రోచ్ అవుతారా? ది ఫౌండర్ లో ఒకే రెస్టారెంట్ నడుపుతున్న మెక్ డొనాల్డ్ సోదరుల్ని, రే క్రాక్ ఎలా అప్రోచ్ అయ్యాడు? ఫ్రాంఛైజీలు ప్రారంభించి, మెక్ డొనాల్డ్స్ పురోభివృద్ధికి తోడ్పడతానన్నాడు. ఇవ్వాళ మన సమీపంలో కూడా మెక్ డొనాల్డ్స్ వుందంటే అది మెక్ డోనాల్డ్స్ సోదరులతో రే క్రాక్ నెరపిన డిప్లమసీ ఫలితమే. 

        మారా తనకి గోస్వామి స్ఫూర్తి అంటాడు. నువ్వు స్ఫూర్తి నిచ్చావు, నాకు అన్నం పెట్టు అన్న టైపులో తగువుకి దిగుతాడు. బ్రతుకు తెరువుకి స్ఫూర్తి నిచ్చిన వ్యక్తితో పోట్లాటకి దిగితే కాలం క్షమిస్తుందా? ఇదే తర్వాత జరిగింది. ఇలా ఇన్ని లోపాలతో వున్న మారా పాత్రతో ఫీలవాల్సింది హీరోయిజంగా ఏమీ అన్పించదు, దాని ప్రవర్తనలోంచి ఇలా మనం చేయకూడదని నేర్చుకోవాల్సిన మోరల్ లెసన్ కన్పిస్తుంది. ఎలా పడితే అలా తీయడానికి ఇది చిన్నా చితకా సినిమా కాదు, స్టార్ సినిమా. దీని రాత, తీత పై స్థాయిలో వుండక పోతే ఎలా? అందులోనూ ఆటో బయోగ్రఫీతో. అసలు కెప్టెన్ గోపీనాథ్ కి స్ఫూర్తి అమెరికాలో, యూరప్ లో రెండు ఏవియేషన్ కంపెనీలు. ఆ ఐడియాని ఇండియాలో స్వతంత్రంగా అమలు చేశాడు.    

***

        రోమాంటిక్ సైడ్ సూర్యకి అపర్ణాతో రోమాన్స్ ప్రాక్టికల్ గా, ఇన్స్పైరింగ్ గా ఏమీ వుండదు. ఆకాశంలో అతడి కల అసాధ్యమని అతణ్ణి దూరం పెట్టి, ఆమె తన బేకరీ షాపు  చూసుకుంటుంది. అతనప్పటికే వైమానిక దళ కెప్టెన్ గా విమానం నడిపాడని ఆలోచించదు. అతడికి కూడా తన కలతో ఒక విజన్ అంటూ లేదు. ముందు తన కుటుంబాన్నికలుపుకుని తన కలల్ని వూహించుకోని వాడు ఇతరుల కలల్ని ఏం నిజం చేస్తాడు. ఇరుకు జీవితాలు గడుపుతున్న తన పేరెంట్స్ తోబాటు, ప్రేమిస్తున్న అమ్మాయినీ బేకరీ వృత్తి వదిలించి - తన కలలతో ఉన్నత జీవితం అందించాలన్న తపన అతడికుండదు. వుంటే వాళ్ళని కాక్పిట్ లో కూర్చో బెట్టుకుని తను విమానం నడుపుతున్నట్టు కరువుదీరా డ్రీమ్ సాంగ్ వేసుకునే వాడు. దర్శకుడు శంకర్ అయితే ఇలాగే చేసి ప్రేక్షకుల కోరిక నంతా తీర్చేస్తాడు. విజువలైజేషన్ లేని కలలుంటాయా. అలాటి డ్రై కలలు నిజమవుతాయా, వాటిని నమ్మొచ్చా. ఏదో సాధించాలని కలలుంటే ఆటో మేటిగ్గా మైండ్ విజువలైజేషన్ కెళ్లిపోతుంది. ఈ ప్రకృతి ధర్మాన్ని పాత్ర కెలా నిరాకరిస్తారు. కొన్ని కలలు రోమాంటిక్ ఇంట్రెస్ట్ వల్ల కూడా నిజమవుతాయి. సినిమాకి రోమాంటిక్ ఇంట్రెస్ట్ తోడవని హీరో గోల్ ఏం బావుంటుంది. ఆమె కోసం నేను సాధిస్తాను- అనుకోక పోతే ఇంకెందుకు పాత్ర. ప్రణయ రసం లేని పాత్ర ప్రయాణం ఎడారిలో గుడారంతో సమానం. ఇసుక పిసుక్కోవడమే.

        ఇలా ఈ సినిమాలో క్లట్టర్ ఎక్కువుంది. ఫిల్టర్ చేస్తే అందులోంచే సరైన కథనం చేసుకోవడానికి ఆణిముత్యాలు దొరుకుతాయి. పెళ్లయాక విమానంలో కేటరింగ్ గురించి చర్చ వస్తుంది. వివిధ వూళ్ళలో  తన బంధువులు స్వగృహ టైపులో స్నాక్స్ వ్యాపారాలు చేస్తున్నారనీ, వాళ్ళు సప్లయి చేస్తారనీ అంటుంది. బాగానే వుంది విమానంతో కుటీర పరిశ్రమ. గల్లీ మాస్ ఆలోచన. అసలు గోపీనాథ్ ఎకానమీ బిజినెస్ మోడల్ లో విమానంలో ఫుడ్ సర్వింగ్ అనే అంశం లేనే లేదని మర్చిపోయారు. మారా అనే తను, మాస్ నుంచి క్లాస్ కి ఎదిగి, కంపెనీలో సుందరిని కూడా కార్పొరేట్  పోస్టుకి సిద్ధం చేయాలన్న ఎంటర్ ప్రెన్యూర్ ఆలోచనలుండవు. డైనమిక్స్ తో కథనం ఎక్కడికక్కడ రీఫ్రెష్ అవుతూ నెక్స్ట్ లెవెల్ కెళ్ళకుండా, ఎక్కడేసిన గొంగళిలా వుంటుంది.
***

       ప్రేమతో మొదలయ్యే వీళ్ళ ఇగోలతో సమస్య సంసారంలో కూడా కొనసాగుతుంది. ఈ ఇగోలతో కూడా బలమైన సన్నివేశాలు వుండవు గానీ, తండ్రి చావు బతుకుల్లో వున్నపుడు విమాన టికెట్ కొనలేక పడే యాతనతో కదిలించే బలమైన నటన ప్రదర్శిస్తాడు సూర్య. సందేహం లేదు, సూర్య ఈజ్ ది బెస్ట్. ఈ సీను టాప్. అయితే ఈ విషాదం కంటే, ఖర్మ కాలి అతను పై వర్గాల వాళ్ళనే తిరిగి దీనంగా టికెట్ డబ్బులు అడుక్కుంటూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది కదాని గుణపాఠంలా అన్పిస్తుంది. ఎవ్వరూ కనికరించి డబ్బులివ్వరు. ఇలా ఏం డ్రామా క్రియేట్ చేస్తున్నారో గ్రహించకుండా, హీరోకే డ్యామేజింగ్ గా వుండే దృశ్యాల చిత్రీకరణ చేసేశారు. 

        ఇంటర్వెల్ సీను కూడా ఇలాటిదే. భారీ సీను క్రియేట్ చేస్తూ, స్ఫూర్తి ప్రదాత గోస్వామి మీద సిలిండర్ విసిరేస్తాడు. చివరికి ఇంత పోరాడుతూ యాక్షన్ తో కన్పిస్తున్న సూర్య పాత్ర యాక్టివ్ పాత్రనా? కాదు. రియాక్షనే చూపిస్తున్న పాసివ్ - రియాక్టివ్ పాత్ర. అందుకే కథ ఇలాటి దృశ్యాలే రిపీటవుతూ ముగిసింది. 

        మలయాళ నటి అపర్ణా బాల మురళి సరైన దృక్పథం లేని బేకరీ నడిపే మాస్ హీరోయిన్ గా, మాస్ విలువలకి తగ్గ న్యాయం చేసుకుంది. గోస్వామిగా పరేష్ రావల్ మాత్రం ఉండీ లేనట్టుండే ప్రతినాయక పాత్ర. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సూర్య విమానం ఎగరేసినప్పుడల్లా భూమార్గం పట్టించడానికి వచ్చి రెడీగా కన్పిస్తూంటాడు. క్లయిమాక్సులో కన్పించడం శుద్ధ అనవసరమనుకుంటాడు. 

        గోస్వామికి కూడా తెలివి వుండదు. మారా చెప్తున్న అయిడియా పనికొచ్చేదే. తను కాకపోతే ఇంకో అంతర్జాతీయ కంపెనీకి పోయి ఇండియాలో దింప వచ్చు మారా. అప్పుడేం చేస్తాడు. ఇదేదో తను క్యాష్ చేసుకుని తన ఏక ఛత్రాధిపత్యానికి విఘాతం కలక్కుండా చూసుకోకుండా? కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో లేని మారా - గోస్వామిల ఈ పోరాటాన్ని సినిమాలో కల్పించారు. 

        మారాని చూడగానే గోస్వామి శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుంటాడు. ఇలా అంటరాని తనాన్ని కూడా ఈ కథలోకి తీసుకు రావడం! దీనికి మారా రియాక్షన్ ఏమీ వుండదు. గోస్వామి తనని చూసి అలా చేతులు తుడుచుకున్నాడంటే, మారా ఇక ఆ మీటింగ్ కి నీళ్లొదుకుని వెళ్లిపోవాలి. ఇలా కథని మార్చేసే అర్ధం లేని చిత్రణ లున్నాయి. 

        ఒక ఏర్ ఫోర్స్ కెప్టెన్ తో గోస్వామికి అంత లేకి తనమేమిటో అర్ధం గాదు. దేశంలో అందరూ కలిసి జీవించాల్సిందే. దేశం తప్ప ఇంకోటి లేదు జీవించడానికి. అసలు సినిమా ప్రారంభంలోనే బ్రాహ్మణ వ్యక్తి రైలులో బడుగు జనాల్ని చూసి అసహ్యించుకోవడం వుంది. ఇక్కడ్నించే సినిమాలో బ్రాహ్మణ - బడుగు బాహాబాహీకి అలవాటు పడేందుకు ప్రేక్షకులని సిద్ధం చేశారు. ఈ బ్రాహ్మణులకి శాస్తి చేయాల్సిందే అన్నట్టు మిగతా కథ నడిపారు. ఏమిటో ఇదంతా. 

        ఇక కింగ్ ఫిషర్ ఏర్ లైన్స్ నడిపిన విజయ్ మాల్యా రూపంలో వుండే విమల్ బాలయ్య పాత్రలో డాన్ ధనోవా వుంటాడు. ఏర్ డెక్కన్ చరిత్రలో ఈ కీలక పాత్రని ఆటో బయోగ్రఫీలోని క్రోనాలజీ పట్టించుకోకుండా మధ్యలో అసందర్భంగా ప్రవేశ పెట్టి ముగించారు. ఏర్ ఫోర్స్ అధికారిగా మోహన్ బాబు అతిధి పాత్ర కూడా కల్పితమే. 

        సాంకేతికాల కొచ్చేటప్పటికి ఏ స్టార్ సినిమా అయినా బాగానే వుంటుంది. ఇది కూడా అంతే. ఎగరేసినప్పుడల్లా ఒక్కో విమానం ప్రమాదానికి లోనయ్యే దృశ్యాలన్నీ ప్రొఫెషనల్ గా వున్నాయి. సంగీతమూ ప్రొఫెషనల్ గా వుంది. అన్నీ ప్రొఫెషనల్ గానే  వుంటాయి. సాంకేతికులు ఎప్పటి కప్పుడు అప్డేట్ అవుతూ ప్రొఫెషనల్స్ గా వుంటారు, లేకపోతే ప్రొఫెషన్ వుండదు. కథా కథనాల వాళ్ళే, పాత్ర చిత్రణల వాళ్ళే ప్రొఫెషనల్స్ గా వుండరు, అప్డేట్ అవరు. అవకపోయినా ప్రొఫెషన్ పదిలం.

ఎలావుంది కథ
       భారీగా కల్పితాలు చేసిన సినిమా అన్నాడు కర్ణాటకకి చెందిన కెప్టెన్ గోపీనాథ్. చాలా చోట్ల నవ్వానన్నాడు. ఈ సినిమాలో కామెడీ లేకపోతే ఎందుకు నవ్వాడో. పెద్ద మనసు చేసుకుని అభినందించాడు. రాష్ట్రీయ, జాతీయ మీడియాలు పోటీలు పడి మూడేసి నాల్గేసి స్టార్స్ ఇచ్చి కొనియాడేక, ఈ సినిమా ఖచ్చితంగా సూపర్బ్ ఆటో బయోగ్రఫీయే, ఇంకో మాట లేదు. 

        అయితే  సింప్లీ ఫ్లై- ఏ డెక్కన్ ఒడెస్సీ పేర ఆటో బయోగ్రఫీ కూడా సమగ్రంగా వుండదు. ఇందులో ఏర్ డెక్కన్ ప్రారంభానికి ముందు బాల్యం నుంచీ గోపీనాథ్ జీవిత కథ వుంటుంది. గ్రామీణుడిగా, సైనికుడుగా, రైతుగా, వ్యాపారిగా, ఎంటర్ ప్రెన్యూర్ గా సగ భాగం వుంటుంది. రెండో సగం దేశంలో తొలి ఛార్టర్ హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభకుడుగా, తర్వాత ఏర్ డెక్కన్ తో తొలి లో -కాస్ట్ క్యారియర్ (ఎల్సీసీ) కంపెనీ వ్యవస్థాపకుడుగా వుంటుంది. 

        అయితే ఏర్ డెక్కన్ ఆపరేషన్స్ ఎలా వుండేవి, సామాన్య ప్రయాణీకుల స్పందన లేమిటి, విమానం కల తీరిన వాళ్ళ అనుభవాలేమిటి, దాచుకోదగ్గ అనుభూతులేమిటి, ఆనంద పారవశ్యాలేమిటి, కంపెనీ ప్రాభవమేమిటి, సిబ్బంది నియామకా లేమిటి, ఉపాధి పొందిన వాళ్ళ సంఖ్యేమిటి, కొనుగోలు చేసిన మరిన్ని విమానాల వివరాలేమిటి, చివరికి విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ తో విలీనానికి దారి తీసిన పరిస్థితులేమిటీ సమాచారం లేదు. సినిమాకి కావాల్సింది ఈ కథే. ఈ కథే లేక పోవడంతో సినిమాలో చూపించిందంతా కథకి పూర్వం వుండే కేవలం ఉపోద్ఘాతమని గుర్తించాల్సిన అవసరముంది.

        కెప్టెన్ గోపీనాథ్ ఏర్ డెక్కన్ ప్రారంభించుకోవడానికి చంద్రబాబు నాయుడు, ఎస్ ఎం కృష్ణ, వెంకయ్య నాయుడు వంటి అన్ని పార్టీల నాయకులూ, ప్రభుత్వాలూ సహాయపడ్డారు. ఇతర కంపెనీలతో గోపీనాథ్ ఎదుర్కొన్నది పోటీయే తప్ప, సినిమాలో చూపించినట్టు కుట్రల్ని కాదు. ఏం చేసినా ఆటో బయోగ్రఫీని మార్చి చేశామనుకుంటున్నది కథ కాదు. సినిమాలో కథే ప్రారంభం కాలేదు. కథకే రెక్కలు మొలవలేదు. 

స్క్రీన్ ప్లే సంగతులు

        ఏ బయోపిక్కైనా, ఆటో బయోగ్రఫీయైనా సినిమాకి ఒకే కాన్ఫ్లిక్ట్ తో వుంటుంది. ఒక నిజ వ్యక్తి జీవితాన్ని తెరకెక్కించడానికి ఆ వ్యక్తి జీవితంలో ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యనే (కాన్ఫ్లిక్ట్) ప్రధానంగా చేసుకుని, సమస్య-సంఘర్షణ- పరిష్కారమనే త్రీయాక్ట్ స్ట్రక్చర్ కిందికి తెస్తారు. అదే జానర్ బయోపిక్ అయినా సరే. 

        ఇక్కడ సౌలభ్యం కోసం బయోపిక్ అనే వాడదాం. బయోపిక్ స్క్రీన్ ప్లేకి ఎప్పుడో 1982 లో  గాంధీతీసిన సర్ రిచర్డ్ అటెన్ బరో ఒక మార్గం వేశాడు. ఇటీవల 2012 లో స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన లింకన్వుండనే వుంది. ఇంకా చాలామంది తీసిన చాలా బయోపిక్ లు అర్ధవంతంగా వున్నాయి. బయోపిక్ అంటే మామూలు సినిమా కథలాగే ఆ వ్యక్తి పాత్ర, అది ఎదుర్కొనే సమస్య, కనుగొనే పరిష్కారం, చివర విజయమో అపజయమో, ఇంతే. ఇలా ఒక లైనులో చూసినప్పుడు సమస్య- సంఘర్షణ- పరిష్కారం అనే మజిలీల క్రమం వెండితెర మీద స్పష్టంగా తొణికిస లాడాలి.

        బయోపిక్ అంటే పుట్టిందగ్గర్నుంచీ గిట్టిందాకా ఆ వ్యక్తి జీవితాన్ని పూసగుచ్చినట్టు చూపించడం కాదు. ఆ వ్యక్తి జీవితాన్ని మార్చిన ఒకే ఒక్క మలుపు, లేదా ఒక లక్ష్యం కోసం ఆ వ్యక్తి ఎదుర్కొన్న సమస్య మాత్రమే సినిమాకి బయోపిక్ కథ అవుతుంది. మహాత్మా గాంధీ లక్ష్యం స్వాతంత్ర్య సముపార్జన. దీనికి ప్రేరణ 1) దక్షిణాఫ్రికా రైల్లో తనకి జరిగిన అవమానం, అప్పుడు 2) సహాయ నిరాకరణోద్యమం, 3) క్విట్ ఇండియా ఉద్యమం - స్వాతంత్ర్య సిద్ధి, 4) మతకల్లోలాలు -మరణం. ఇంతే, శాఖోపశాఖలుగా విస్తరించిన మహాత్ముడి జీవితంలో ఈ నాల్గే ఘట్టాల్ని స్క్రీన్ ప్లే కి ఫౌండేషన్ గా తీసుకుని, అజరామరమైన చలన చిత్రరాజాన్ని ప్రపంచాని కందించాడు అటెన్ బరో. 

        అంతేగానీ మహాత్ముడు ఎలా సత్యనిష్టుడో చిన్నప్పటి సీన్లేద్దాం, కుటుంబం సీన్లేద్దాం, ఆ బిట్లు వేద్దాం, ఈ బిట్లు తెచ్చి వేద్దామని కలగాపులగం చేయలేదు. మహాత్ముడి వ్యక్తిగత జీవితమే చూపించాలంటేఆ పాయింటుతో అది వేరే బయోపిక్ అవుతుంది. గాంధీ మై ఫాదర్అనీ గాంధీ మీద కోపం వచ్చేలా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ గాంధీ కొడుకుతో తీయనే తీశాడు. 

            ఇలాగే స్టీవెన్ స్పీల్ బెర్గ్ లింకన్తీసినప్పుడు సినిమా కథగానే తీశాడు. వెండితెర వున్నది స్పష్టమైన కథల కోసం తప్ప; గాథలతో, ఉపోద్ఘాతాలతో, డాక్యుమెంటరీలతో, న్యూస్ బులెటిన్ లతో, కచరా చేయడానికి కాదు. లింకన్తీసినప్పుడు స్పీల్ బెర్గ్ అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ జీవితాన్నంతా కామెంటరీ చేస్తూ తీయలేదు. ఆయన జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం - అగ్నిపరీక్ష లాంటిది -13 వ రాజ్యాంగ సవరణ గురించిన రాజకీయ డ్రామాని మాత్రమే స్క్రిప్టు చేశాడు. ఈ డ్రామాలో లింకన్ పాత్ర, 13 వ రాజ్యాంగ సవరణ అనే సమస్య, దీనికోసం సంఘర్షణ, విజయం, ఇంతే వున్నాయి. 

        ఎందరో రచయితలు లింకన్ జీవితాన్ని పుట్టిన దగ్గర్నుంచీ ఎపిసోడ్లు రాసుకొస్తే స్పీల్ బెర్గ్ పక్కన పడేశాడు. ఈ బయోపిక్ కి డొరిస్ కీర్న్స్ గుడ్విన్ రాసిన పుస్తకం ఆధారం. 500 పేజీల ఈ లింకన్ జీవిత చరిత్రలో స్పీల్ బెర్గ్ కేవలం నాలుగే నాలుగు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు! అయినా దీని మీద కసరత్తు చేస్తే కుదరదన్పించింది. నాలుగు నెలలు కాక రెండు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు!! ఈ రెండు నెలల కాలంలో చోటు చేసుకున్న 13 వ రాజ్యాంగ సవరణ పరిణామాలతో బయోపిక్ తీసి పెద్ద విజయం సాధించాడు.

         1970 లలో ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ని నిండా ముంచిన వాటర్ గేట్ కుంభకోణాన్ని కూపీలాగి పుస్తకం రాశారు ఇద్దరు జర్నలిస్టులు. ఆల్ ది ప్రెసిడెంట్స్ మెన్అన్న పుస్తకం టైటిల్ తోనే గొప్ప సినిమా తీశారు. పుస్తకాన్ని స్క్రీన్ ప్లేగా మార్చే బాధ్యత హాలీవుడ్ లో ఆచార్యుడు లాంటి రైటర్ విలియం గోల్డ్ మాన్ తీసుకున్నాడు. అప్పటికే ఒక ఆస్కార్ అవార్డు తన ఖాతాలో వుంది. పుస్తకంలోని రెండో భాగాన్నితీసి అవతల పడేసి, మొదటి భాగంతోనే స్క్రీన్ ప్లే అంతా రాశాడు. పుస్తకం రాసిన జర్నలిస్టులిద్దరు ఇదేమిటని గోలగోల చేశారు. ఒక జర్నలిస్టు గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఇంకో స్క్రీన్ ప్లే కూడా రాశాడు. స్క్రీన్ రైటింగ్ అంటే జర్నలిజం కాదురా అన్నాడు గోల్డ్ మాన్. స్క్రీన్ మీద ప్రేక్షకులు జర్నలిజాన్ని చూడరన్నాడు. దీంతో బిగ్ స్టార్ రాబర్ట్ రెడ్ ఫోర్డ్, దర్శకుడు అలన్ పకూలా కంగారు పడి గోల్డ్ మాన్ రాసిన స్క్రీన్ ప్లేని తీసుకుని నెలరోజులు అజ్ఞాతంలో కెళ్ళి పోయారు. దాంతో కుస్తీ పట్టారు. ఇలా కాదు, అలా వుండాలి...అలా కాదు, ఇలా చేద్దాం...రెండో భాగాన్ని ఇలా కలుపుదాం, కాదు అలా కలుపుదామని జుట్లు పీక్కుని పీక్కునీ ఏమీ చేయలేక పెద్దాయనే కరెక్ట్ అని, పెద్దాయన రాసిన శిలాశాసనాన్నే సినిమాగా తీశారు. అదెక్కడికో వెళ్ళిపోయి చరిత్ర కెక్కింది. ఎన్నో ఆస్కార్ అవార్డు లొచ్చి పడ్డాయి. ఆ స్టార్ కీ, దర్శకుడికీ కాక, పెద్దాయనకీ ఇంకోటి పడింది. అలా ఆల్ ది గోల్డ్ మాన్స్ మెన్ అన్పించుకున్నారన్న మాట.

***

            బిజినెస్ జానర్ బయోకిక్ కైనా ఇంతే. ది ఏవియేటర్, ది ఫౌండర్, జాయ్, వాల్ స్ట్రీట్, ది బ్యాంకర్ ఇలా ఎన్నో. ఓ సామాన్య వ్యక్తి బిజినెస్ కలల్ని నిజం చేసుకునే ఈ కథల్లో త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో కథే వుంటుంది. అంటే ఆ బిజినెస్ ప్రారంభించాక ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య, దాని పరిష్కారం మొదలైనవి. ది ఫౌండర్ (2016) లో మెక్ డోనాల్డ్స్ సోదరుల్ని ఒప్పించి ఫ్రాంఛైజీలు ప్రారంభించిన రే క్రాక్, క్రమంగా టేకోవర్ కే పథకమేసి సంక్షోభం సృష్టిస్తాడు. దీన్ని మెక్డొనాల్డ్స్ సోదరులెలా ఎదుర్కొన్నారన్నది కథ. 

        ది ఏవియేటర్ (2004) చూద్దాం :  ప్రసిద్ధ దర్శకుడు మార్టిన్ స్కార్సెసీ దర్శకత్వంలో లియోనార్డో డీ కాప్రియో నటించిన ఈ బయోపిక్ లో, కథ క్లియర్ కట్ గా వుంటుంది. బిగినింగ్ విభాగంలో కాప్రియో వేగంతో  రికార్డుల్ని బ్రేక్ చేసే మోనో ప్లేన్ ని నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ప్లాట్ పాయింట్ వన్ లో నిర్మాణం పూర్తి చేస్తాడు. మిడిల్ లో ఓసిడి వ్యాధికి లోనవుతాడు. దాంతో బాధపడుతూనే విమాన వేగంలో ప్రపంచ రికార్డుల్ని బ్రేక్ చేస్తూ పోతాడు. ఒక ఏర్ ఫోర్స్ కాంట్రాక్టు లభిస్తుంది. ఇంకోసారి విమానం కూలిపోతుంది. ఈ ప్లాట్ పాయింట్ టూ లో, ఏర్ ఫోర్స్ తో అవినీతి ఆరోపణల కేసులో ఇరుక్కుంటాడు. ఎండ్ విభాగంలో ఇందులోంచి బయటపడి, విమానం ఎగరేసుకుంటూ హేపీగా పోతాడు. చాలా సింపుల్ - ఒక్క లైనులో కథేమిటో స్పష్టంగా కనపడుతూంటుంది తెరమీద. కథలా వుండే కథ. 

        బిగినింగ్ లో ఇది బాల్య జీవితంతోనే ప్రారంభమవుతుంది. బాల్యంలో సినిమా కలలతో వుంటాడు. సినిమాలు తీస్తున్నాక విమానాల మీద దృష్టి మళ్లించి ఆ దిశగా వెళ్ళిపోతాడు. ఈ ఉపోద్ఘాతమంతా స్ట్రక్చర్ అనుమతించే బిగినింగ్ విభాగం లోపే సర్దేసి వుంటుంది. ఇది సినిమా దర్శకుడు, ఏవియేషన్ మాగ్నెట్ అయిన - హోవర్డ్ హ్యూజెస్ జీవిత కథ. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే ఆస్కార్ అవార్డు లందుకున్న మెస్మరైజింగ్ బయోపిక్. బయోపిక్స్ కి గైడ్ బుక్.

***

         ఇప్పుడు ఏర్ డెక్కన్ బయోపిక్ స్ట్రక్చర్ చూద్దాం. ప్రారంభంలో ఏర్ డెక్కన్ క్రాష్ లాండింగ్ దృశ్యం తర్వాత ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. ఏర్ ఫోర్స్ లో మారా జీవితం, వూళ్ళో సుందరితో ప్రేమ, పేరెంట్స్ తో పరిస్థితి, చౌక విమాన యానం కల, అందులో భాగంగా గోస్వామిని కలవడం. ఇక్కడ గోస్వామిని కలిసి ప్రపోజల్ పెట్టడం, తిరస్కారం పొందడం అన్నది ప్లాట్ పాయింట్ వన్ దృశ్యం. ఇది సముచితంగా 30 నిమిషాల కొస్తుంది. 

        ఇక మిడిల్ లో గోస్వామితో తిరస్కారం పొందిన మారా పట్ల, వెంచర్ క్యాపిటలిస్ట్ ప్రకాష్ బాబు అనే అతను ఆసక్తి చూపిస్తాడు. అతను చెప్పినట్టు మలేషియా నుంచి విమానం హైర్ చేసుకోవడానికి మారా నలభై లక్షలు అప్పు చేస్తాడు. దీనికి డీజీసీఏ అధికారి బ్రేక్ వస్తాడు. దీని వెనుక గోస్వామి వుంటాడు. ప్రకాష్ బాబు గోస్వామి మనిషే. ఇలా మోసపోయానని గ్రహించిన మారా నీరుగారి పోతాడు. ఇంతలో తండ్రి చావు బతుకుల్లో వుంటే పరిగెడతాడు. తండ్రి చనిపోతాడు. మలేషియా  విమానం క్యాన్సిల్ అవుతుంది. మారా గోస్వామి మీద తిరగబడతాడు. ఇక్కడ ఇంటర్వెల్ వస్తుంది గంటం పావుకి. 

        సెకండాఫ్ లో అంటే మిడిల్ టూ లో- చేసిన అప్పుల గురించి ఇంటా బయటా  సమస్యలు వస్తాయి. సుందరితో కూడా సమస్యలు వస్తాయి. ఎలాగో పెళ్ళవుతుంది. మారా ఇంకో ప్రయత్నం చేస్తాడు. క్రౌడ్ ఫండింగ్ తో ప్రజల దగ్గర డబ్బు సేకరించి కార్గో ఫ్లయిట్ కొంటాడు. దాన్ని పాసింజర్ టర్బో క్రాప్ గా మార్చి ప్రారంభిస్తే, గోస్వామి లాండింగ్ డిలే చేయిస్తాడు. విమానం ఏర్ ఫోర్స్ బేస్ లో క్రాష్ లాండింగ్ అవుతుంది. ఇదే ప్రారంభంలో చూపించిన దృశ్యం. దీంతో ఫ్లాష్ బ్యాక్ ఇక్కడి కొచ్చి పూర్తయినట్టు. 

        ఇప్పుడు దీని మీద ఏర్ ఫోర్స్ అధికారి కోర్ట్ మార్షల్ చేసి ఫైన్ వేస్తాడు. తిరిగి మారా రూపాయి టికెట్ పెట్టి ఇంకో ఏర్ ట్రావెల్ ప్రయత్నం చేస్తాడు. దీన్నీ గోస్వామి ఫెయిల్ చేస్తాడు. కొడుకు పుడతాడు. ఇప్పుడు విమల్ బాలయ్య వచ్చి, విలీనం చేయమని ఆఫర్ ఇస్తాడు. మారా తిరస్కరిస్తాడు. దీంతో మిడిల్ టూ కూడా  ముగిసి ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఇక ఎండ్ విభాగంలో మారా సామాన్యుల్ని ఎక్కించుకుని విజయవంతంగా విమానాన్ని ఎగరేస్తాడు. ఇదీ స్ట్రక్చర్.

***

       ఇందులో మొదటి 30 నిమిషాల్లో గోస్వామితో మీటింగ్ తో ప్లాట్ పాయింట్ వన్ వచ్చిందనుకుని, సహజంగానే ఇంటర్వెల్ కి విజయవంతంగా ఏర్ డెక్కన్ ప్రారంభించి, ఆ వ్యవస్థని మారా సుందరితో కలిసి ఎలా నడిపాడో దాని తాలూకు వైభవాన్ని చూస్తామను కుంటాం. సామాన్య ప్రయాణీకులతో సీన్లేమిటో, ఎంటర్టయిన్ మెంట్ ఏమిటో, బర్నింగ్ ట్రైన్ లో ఎలాగైతే రకరకాల కుటుంబాలు ట్రైనెక్కి చేసే వినోద కార్యక్రమాల్లాగా, ప్రయాణంలో పదనిసల్లాగా, ఆ సరదాలు చూస్తామనుకుంటాం. బాంబే టూ గోవా బస్సు ప్రయాణంలో కమెడియన్లు, మూర్ఖులు, హౌలే గాళ్ళు, ఆకూపోకా తెలీని అమాయకులూ చేసే కామెడీల్లాంటివి చూస్తామనుకుంటాం. స్వర్గమన్నాక స్వర్గాన్ని చూపించాలిగా. ఎంతసేపూ స్వర్గం చేరుకునే పాట్లే చూపించి ముగిస్తారా. అది కథవుతుందా. స్వర్గమో రామచంద్రా  అని అల్లాడాలా సినిమా చూస్తున్న వాడు -త్రిశంకు స్వర్గంలో పడేస్తే?


        ప్రేక్షకుల్లో విమానాన్ని ఎక్కని వాళ్లెందరో వుంటారు. అసలు ఏర్ డెక్కన్ చీప్ ట్రావెల్ ఎలా వుంటుందో చూడాలనుకునే వాళ్ళుంటారు. సామాన్యుల విమానం కల అని చెప్పి ఆ కల చూపించక పోతే ఎట్లా. శంకర్ అయితే ఇలాగే చూపించి వాళ్ళ కోరిక నంతా తీర్చేస్తాడు. ఇదే చెప్పాల్సిన కథ కాబట్టి. ఇది మిడిల్ విభాగమూ, మిడిల్ విభాగమంటే కథా ప్రారంభమూ కాబట్టి. కథంటే ఇదే కాబట్టి. ఇంకా గోపీనాథ్ లా మారా 40 విమానాలతో ఎదిగిన విధం, పొందిన మీడియా కవరేజి, వైభవం ఇదంతా చూడాలనుకుంటాం. 

        ది ఏవియేటర్ లో ప్లాట్ పాయింట్ వన్ లో విమాన నిర్మాణం పూర్తి చేశాక, దీంతో మిడిల్ ప్రారంభంతో విమానాన్నేసుకుని స్పీడ్ లో రికార్డ్ బ్రేకింగ్ మొదలెట్టేశాడని ఇందాకా తెలుసుకున్నాం. ఇదే కదా చెప్పాల్సిన కథ. ది ఫౌండర్ లో  మెక్డొనాల్డ్స్ ఫ్రాంఛైజీలు ప్రారంభించాలన్న ప్లాట్ పాయింట్ వన్ గోల్ తో ప్రారంభమయిన రే క్రాక్, మిడిల్ లో ఫ్రాంఛైజీలని విస్తరిస్తూ, ఎలా కంపెనీని అభివృద్ధి చేశాడని కదా చూస్తాం. 

        అలాగే ఏర్ డెక్కన్ కథలో ఏర్ డెక్కన్ బిజినెస్ వ్యవహారం చూపించాల్సి వుంటుంది. ఒకసారి మరాఠీలో తీసిన ప్రసిద్ధ చలన చిత్రం, దాదాసాహేబ్ ఫాల్కే బయోపిక్ తో హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ చూడండి. ప్రింటింగ్ ప్రెస్ లో నష్టాలొచ్చి నిరుద్యోగిగా తిరుగుతున్న ఫాల్కే, ఒక గుడారంలో ఇంగ్లీష్ సైలెంట్ మూవీ చూస్తాడు ప్లాట్ పాయింట్ వన్ లో. దాంతో తన గోల్ సినిమా తీయడమేనని డిసైడ్ అయిపోతాడు. ఇంటిల్లిపాదీ జట్టు కడతారు. ఇలా మిడిల్ ప్రారంభమైపోతుంది. అంటే కథ ప్రారంభమైపోతుంది. అలా దేశంలో మొట్ట మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర నిర్మాణం ప్రారంభించేస్తాడు. ఈ నిర్మాణం చాలా ఫన్ గా వుంటుంది కుటుంబ సభ్యులతో. ఎన్ని కష్టాలొచ్చినా వాటిని హాస్యం పట్టిస్తూ ఫన్నీగా వుంటారు. చాలా వినోద భరితంగా వుంటుంది కథా ప్రారంభంతో ఈ మిడిల్ జర్నీ. 

        సరే, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎలా వస్తుంది? ది ఏవియేటర్ లో హోవర్డ్ హ్యూజెస్ డిఫెన్స్ కాంట్రాక్టు పొందడంతో వస్తుంది. ది ఫౌండర్ లో రే క్రాక్ మెక్డొనాల్డ్స్ ని టేకోవర్ చేసే ప్రయత్నంతో వస్తుంది. ఏర్ డెక్కన్ లో ఏం రావాలి? బిగ్ ఫిష్ విజయ్ మాల్యా ఏర్ డెక్కన్ ని విలీనం చేసుకుని మింగేసే ప్రయత్నంతో రావాలి. 

        అప్పుడు గోపీనాథ్ పడ్డ క్షోభ, చివరికి విలీనం చేసేసి తప్పు కోవడం మొదలైనవి రావాలి. ఇది కాసేపు పరాజయంగా అనిపించినా అంతిమంగా ఆయన మార్గదర్శి అయ్యాడు. ఆయన తర్వాత ఇదే ఎల్సీసీ సెగ్మెంట్లో గో-ఎయిర్, స్పైస్ జెట్, ఇండిగో, జెట్ నెట్ మొదలైన సామాన్యుల విమానాలు ప్రారంభమయ్యాయంటే ఆయనే స్ఫూర్తి. మాల్యా నుంచి వచ్చిన డబ్బుతో డెక్కన్ 360 అని కార్గో ఏర్ లైన్స్ ప్రారంభించి, కోర్టు ఉత్తర్వులతో మూసేశాడు. ఇలా ఉపసంహారంలో చెప్పి ముగించాలి. 

        అంటే ఆటో బయోగ్రఫీకి అదనంగా రీసెర్చి చేసుకోవాలి. ఆటో బయోగ్రఫీలో సినిమా కథ లేదు. అది బిగింగ్ ఉపద్ఘాతమే. మిడిల్, ఎండ్ లు లేవు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోగ్రఫీగా సంజయ బారు రాసిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ లో కూడా ఇలాగే కథలేదు. సినిమాకి అది బిగినింగ్ విభాగమే. దాంతో బయోపిక్ తీస్తే ఎలా వచ్చిందో తెలిసిందే. ఈ లింకు క్లిక్ చేయండి. చాలా మందితో సమస్యేమిటంటే ఏది బిగినింగో, ఏది మిడిలో గుర్తు పట్టలేరు. ఏ సినిమాలోనూ ప్లాట్ పాయింట్ ని గుర్తించ లేరు, దాని ఉపయోగం చెప్పలేరు. స్క్రీన్ ప్లే పౌర ధర్మాలు తెలియకుండా స్క్రీన్ ప్లేల్లో తిరుగాడుతూంటారు. నగర పౌర ధర్మాలు తెలియకుండా నగరంలో తిరుగాడినట్టు. 

        కెప్టెన్ గోపీనాథ్ జీవితాన్ని అదనంగా రీసెర్చి చేసుకుంటే ఆయన సంస్థని ఎలా నడిపి వదిలేశాడో బోలెడు సమాచారముంది. సినిమా రచయిత అన్నాక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు తనం చాలా అవసరం.

***

        ఇలా ఈ సినిమా అంతా చూపించింది ఎంతకీ ముగియని బిగినింగే. శివ నే తీసుకుంటే, అరగంటలో బిగినింగ్ ముగిస్తూ నాగార్జున, ప్లాట్ పాయింట్ వన్ లో జేడీని కొట్టాక, మాఫియా భవానీతో అమీతుమీకి -కథలోకి- వెళ్లకుండా, సినిమా అంతా జేడీనే కొడుతూ వుండడం లాంటిదన్న మాట. ఇంతకన్నా అర్ధమయ్యేలా చెప్పడం సాధ్యం కాదు.      

              మారా కూడా అరగంటలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోస్వామీతో తలబడ్డాక, కంపెనీని ప్రారంభించి అభివృద్ది చేయకుండా -కథ ప్రారంభించకుండా- సినిమా అంతా గోస్వామితో సిగపట్లకే దిగాడు. చిట్ట చివర సినిమా ముగింపులో ఎలాగో విజయవంతంగా విమానాన్ని ఎగరేశాడు. అంటే ఇప్పుడు బిగినింగ్ ముగించి ప్లాట్ పాయింట్ వన్ కొచ్చాడన్న మాట. ఇంకో గంటన్నర సినిమా తీస్తేగానీ చెప్పాల్సిన కథతో మిగిలిన మిడిల్, ఎండ్ లు ముగించడన్న మాట. ఇంత వింత ఎక్కడా చూడం.

        మరి సినిమా ముగింపులో వచ్చింది ప్లాట్ పాయింట్ వన్ అయితే, వెనుక గోస్వామితో చూపించిన ప్లాట్ పాయింట్ వన్? అది ప్లాట్ పాయింట్ వన్ కాదని ఇప్పుడు తేలుతోంది. అది ప్లాట్ పాయింట్ వన్ అన్న భ్రమలో సినిమా చూస్తూంటాం. ఎంతకీ మిడిల్లోకి వెళ్ళక పోతే ఏం చేస్తాం. భ్రమల్లోంచి బయట పడతాం. మిడిల్ మటాష్ సినిమాలతో కూడా ఇలాగే జరుగుతుంది. సెకండాఫ్ ప్రారంభమైతే గానీ మిడిల్ మాటాష్ అని బయటపడదు. 

        ఇప్పుడు మారాకి గోస్వామితో ఏర్పడిన ప్లాట్ పాయింట్ వన్ కాని ప్లాట్ పాయింట్ వన్ సీను, నిజానికి ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అన్నమాట. అంటే బిగినింగ్ విభాగంలో ప్లాట్ వన్ కి దారి తీసే పరిస్థితుల కల్పనలో భాగంగా వచ్చే ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అనే మలుపు అన్నమాట. శివలో నాగార్జున జేడీని కొట్టే ముందు, జేడీ అమలని టచ్ చేసే సీను అన్నమాట.

***

          మొదట దర్శకురాలు స్పోర్ట్స్ జానర్లో తీసిన గురు ఫార్మాట్ బాగానే వుందిగాఅనుకుని, ఆ ఫార్మాట్లో పెట్టి ఈ బిజినెస్ జానర్ సినిమా తీసే
సినట్టుంది. స్పోర్ట్స్ జానర్ ఫార్మాట్  బిజినెస్ జానర్ కి రెడ్ కార్పెట్ అవుతుందా. స్పోర్ట్స్ జానర్లో క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి అపజయాలెదు
ర్కొనీ ఎదుర్కొనీ చివర్లో గోల్ కొట్టి విజయం సాధించడం వుంటుంది. ఇలా బిజినెస్ జానర్ కథ వుంటుందా. మారా గోస్వామితో సిగపట్లు పట్టీ పట్టీ ఆఖరికి విమానం ఎగరేస్తే బిజినెస్ జానరై పోతుందా?

        ఈ కథనం కూడా ఎపిసోడిక్ గా వుంది. స్టార్ట్ అండ్ స్టాప్ అని డాక్యుమెంటరీల కూపయోగపడే ఎపిసోడిక్ కథనం. ఒక సమస్యతో ఒక ఎపిసోడ్ ఎత్తుకుని, దాన్ని ముగించి, ఇంకో సమస్యతో ఇంకో ఎపిసోడ్ మొదలు పెట్టి ముగించడం. ఇలాగే చేస్తూ పోవడం. టైగర్ హరిశంద్ర ప్రసాద్ గుర్తుందా. విమానాన్ని ఎగరేసే వివిధ ప్రయత్నాలతో రిపీటయ్యేది అలాటిదే కథనం. ప్రతీ ప్రయత్నం ప్రారంభ ముగింపుల్లో బిగినింగ్ మిడిల్ ఎండ్ లుంటాయి. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఒకటే కాదు,  సైజ్ జీరో’, ‘సిటిజన్’, ‘ఆటోనగర్ సూర్య ఆఖరికి సర్దార్ గబ్బార్ సింగ్ కూడా డాక్యుమెంటరీ కథనాలే. ఇవెందుకు ఫ్లాపయ్యాయో తెలుసుకోలేదు. 

        ఇక జానర్ చూస్తే ఇది బిజినెస్ జానరా, ఫ్యామిలీ డ్రామా జానరా. సినిమా నిడివిలో సగం ఫ్యామిలీ బాధలే వున్నాయి. బాధల్ని రిజర్వ్ చేయాల్సింది బిజినెస్ జానర్ అంటూ వున్న విమానం కథనం కోసం ప్రత్యేకంగా. రెండు వైపులా బాధలతో ఎడాపెడా వాయిస్తే ప్రధానమైన బిజినెస్ జానర్ కథనం హైలైట్ అవడం మానుకుంటుంది. మిస్ ఇండియా లో కూడా ఇలాగే కుటుంబ కష్టాలు భారీగా చూపించి, బిజినెస్ కష్టాల మీంచి దృష్టి తప్పేలా చేశారు. ఏది మెయిన్ స్టోరీ, ఏది సబ్ ప్లాట్ తేడా లేకుండా, సబ్ ప్లాట్ ని కూడా మెయిన్ స్టోరీ చేసేయడమేనా. లేక రెండూ మెయిన్ స్టోరీలే చెప్పాలనుకున్నారా. ఒక సినిమాలో రెండు మెయిన్ స్టోరీ లుంటాయా. 

        ఇలా ఆటో బయోఫ్రఫీతో సంబంధం లేని విషయాలతో పూర్తి సినిమా తీసి, సృజనాత్మక స్వేచ్ఛ తీసుకున్నామని ప్రారంభంలో వేశారు. ఒక వ్యక్తి జీవిత కథతో ఇదా సృజనాత్మక స్వేచ్ఛ! 

        ఇదీ సూరరై పొట్రు స్క్రీన్ ప్లే సంగతుల సంపూర్ణ రామాయణం. స్టార్ సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు అవసరమాని ఎప్పుడో మానుకున్నాం. అవి మారవు. స్ట్రక్చర్ తెలుసుకుని చేసేదేముంది. ఏమీ వుండదు. స్టార్ సినిమాలెలా వున్నా ఎంజాయ్ చేయడమే. అంతకి మించిన సుఖం లేదు. సుఖ్ హై ఏక్ ఛావ్ ఢల్తీ ఆతీ హై జాతీ హై -అని పాడుకుంటూ దుఖాన్ని ఎంజాయ్ చేయడమే.

సికిందర్