రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, May 7, 2020

938 : స్క్రీన్ ప్లే సంగతులు



     విషయం 4. డాక్యుమెంట్ ఎగ్జామినర్ చిత్రపటం, లెటర్ దగ్గరి పోలికలతో వున్నాయని వీడియో ప్రొజెక్షన్ లో చూపిస్తాడు. అయినా ఖచ్చితంగా చెప్పలేమని షిండే అంటాడు. విక్రం షీలా ఇంట్లో సోదాలు నిర్వహిస్తాడు. ఏమీ దొరకదు. విక్రం బయటికొస్తూంటే షీలా వాడుతున్న రెండో కారు కనబడుతుంది. అది బ్లూ సెడాన్ కారు. లోపల చెక్ చేస్తే దొరికిన లెటర్ లాంటివే శాంపిల్స్ దొరుకుతాయి. షీలాని అరెస్ట్ చేస్తాడు. ఇంటరాగేషన్లో ఆమె తనకేమీ తెలియదని చెప్తుంది. పాలీగ్రాఫ్ టెస్టుకి ఆదేశిస్తాడు విక్రం. గెస్ట్ హౌస్ మడ్ శాంపిల్స్ తో అనుమానితుల శాంపిల్స్ కలవలేదని రోహిత్ అంటాడు. ఫోరెన్సిక్స్ వాళ్ళని పిలిపించి షీలా షూస్, కారు చెక్ చేయించమంటాడు విక్రం. ఇబ్రహీం షీలా కారుని గుర్తుపడతాడేమో చూడమంటాడు. 
    
        వివరణ : ఉత్తుత్తి లెటర్ తో ఇంకా సీన్లు నడుస్తున్నాయి. ఇంటర్వెల్ ఉత్తదే అని తేలిపోయినట్టు, ఈ లెటర్ తో నడుస్తున్న ఈ సీన్లు కూడా ఉత్తవే అని తేలే మరో నిరాశని కూడా చవి చూడబోతున్నారు ప్రేక్షకులు. మెయిన్ ప్లాట్ వదిలేసి, సబ్ ప్లాట్ క్యారక్టర్ తో ఇన్ని సీన్లు వృధా చేస్తున్నాడు కథకుడు. చిత్రపటం, లెటర్ ఒకరి చేతి వ్రాతేనని మామూలు కంటికి తెలిసిపోతూండగా, ఇంకేంటి పరిశోధన? రెండిటి స్ట్రోక్స్ ని ప్రొజెక్షన్ వేసి మాన్యువల్ కంపారిజన్ చేసి చెప్పడం. స్ట్రోక్స్ ఎక్కడ కలుస్తున్నాయి, ఎక్కడ కలవడం లేదని మార్కింగ్స్ లేకుండానే అనుకోవడం. చివరికి చిత్రపటం, లెటర్ ఒకటేనని చెప్పలేమని షిండే తీర్పు. సింపుల్ గా సాఫ్ట్ వేర్ రన్ చేస్తే ఒక్క నిమిషంలో రెండూ ఒకటేనని చెప్పేస్తుంది నూరు శాతం పాజిటివ్ మార్కింగ్స్ సహా! కానీ షిండే అలా చెప్తేనే ఈ వంకతో విక్రం షీలా ఇంటికెళ్ళే సీను రాసుకో గల్గుతాడు కథకుడు. ఆ సీను పెట్టుకోవడం కోసం ఈ సీను ఇలా చెడగొట్టడం. 

          ఇక షీలా ఇంట్లో దేనికోసం సోదాలు చేశాడో తెలీదు. షీలా అడిగితే, ప్రీతి నీతో ఎక్కువ సమయం గడుపుతుంది కదా అందుకని - అన్నాడు. కానీ ప్రీతి గురించి ఆధారాలేమైనా దొరికితే వాటిని ఆమె అదృశ్యమైన సమయంతోనే ఎలా కనెక్ట్ చేస్తాడు. ప్రీతి కనబడకుండా పోయిన సమయంలో నేను నా కూతుర్ని కలవడానికి వెళ్ళానని కథకుడు రాసిన వెనుకటి సీన్లో చెప్పాను కదయ్యా, ఇంతకీ నా ఎలిబీ చెక్ చేసుకున్నావా? చెక్ చేసుకుని ఈ సీను పెట్టుకోవడం నీకు అవసరమా కాదా ఆలోచించు - అని షీలా కూడా అనదు పాపం. భర్త లేకపోవడం చూసి అందరిలాగే విక్రం కూడా టార్చర్ పెడుతున్నట్టున్నాడు పద్ధతైన ఇన్వెస్టిగేషన్ మానేసి. ‘చూడమ్మా, నీ పట్ల మీ గేటెడ్ కమ్యూనిటీ గుంపు ఫీలింగ్స్ తో నాకు పనిలేదు. నేను వాట్సాప్ యూనివర్సిటీ నుంచో, ఫేస్బుక్ నుంచో ప్రభావితుడ్నై రాలేదు. లేడీస్ ని ప్రొటెక్ట్ చేసే ‘హిట్’ నుంచి నేనొచ్చాను. మా ‘హిట్’ లో మా మెంటల్ కొట్లాటలేవో మాకుంటాయి. ఆ టెన్షన్ కూడా నీ మీద రుద్దను. నాకో ఫ్లాష్ బ్యాకుంది. నాకో చెల్లెలుండేది. దుర్మార్గుడు బలిగొన్నాడు. అలాటి దుర్మార్గుడిగా నీతో నేను ప్రవర్తించ లేను. మనం విన్- విన్ పొజిషన్లో మ్యాటర్ మాట్లాడుకుందామా’ - అని వుంటే, ఆమె భళ్ళున ఏడ్చేసి నిజం చేప్పేసేది. రసవిహీన ఇన్ఫర్మేషనే తప్ప మానవత్వమున్న డ్రామా లేకపోతే కష్టం. 

        ఇంత టార్గెట్ చేస్తున్న షీలా సెల్ ఫోన్ కూడా చెక్ చేయడు ప్రీతితో కాల్స్ గురించి, మెసేజెస్ గురించీ. షీలా గూగుల్ మ్యాప్ టైం లైన్ చెక్ చేస్తే ఆ రోజు ఏ సమయంలో ఎక్కడుందో కూడా తెలిసిపోతుంది. ఇంకోటేమిటంటే, తనూ ప్రీతీ కలిసి ఆన్ లైన్లో ఏదో నిర్వహిస్తున్నట్టు వెనకటి సీన్లో చెప్పింది షీలా. ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ కూడా చెక్ చేయడు. అసలు షీలా ప్రీతిని కిడ్నాప్ చేయడానికీ, చంపడానికీ మోటివ్ ఏమైవుంటుందో కూడా ప్రాథమిక కోణంలో దర్యాప్తు చెయ్యడు. మోటివ్ రుజువు కాకపోతే కేసు నిలబడదని తెలుసుకోడు. 

       ఇక షీలా ఇంట్లోనే బ్లూ సెడాన్ కారుని పట్టుకున్నాడు. షీలాకి బ్లూ సెడాన్ కారుందా? ఈ విషయం గేటెడ్ కమ్యూనిటీలో ఎవరికీ తెలీదా? పక్కనే ప్రీతి పేరెంట్స్ కి కూడా తెలీదా? ఆ రోజు ప్రీతి అదృశ్యమైన రోజున, ఆ స్పాట్ కి ప్రీతి ఫాదర్ మోహన్ వచ్చినప్పుడు, ప్రీతి బ్లూ సెడాన్ కారులో తొంగి మాట్లాడడం చూశానని ఎస్సై ఇబ్రహీం చెప్పాడే? అప్పుడు అది షీలా కారు కావచ్చని మోహన్ కి అన్పించ లేదా?

        సరే, ఈ కారు మొన్న ఇంట్లో కన్పించలేదే- అని ఇప్పుడు విక్రం అడిగితే, సర్వీసింగ్ కి ఇచ్చానని అంది షీలా. కారులోపల చెక్ చేసి అలాటివే లెటర్స్ పట్టుకుని, ఆమెని అరెస్ట్ చేసేశాడు విక్రం. లెటర్ తో లాబ్ లోనే కావాలని తేల్చకుండా వదిలేసిన విషయం, ఇప్పుడిలా తేల్చాడు. ప్రశ్నేమిటంటే, రెండు మూడు రోజులుగా తనింతగా పోలీసుల దృష్టిలో వుంటే, ఆ లెటర్స్ కారులోనే ఎందుకు వదిలేసింది? కారు సర్వీసింగ్ కి ఇచ్చి ఇవ్వాళే తెచ్చుకున్నప్పుడు, ఇవ్వాళే కార్లో తాజాగా లెటర్స్ పెట్టినట్టా?

        అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ మొదలెట్టాడు. ఎవరి శవం గురించీ తనకేమీ తెలీదని మొత్తుకుంది. వెంటనే విక్రం పాలీగ్రాఫ్ టెస్టుకి ఆదేశించేశాడు. ఏమేం ఇన్వెస్టిగేషన్ అప్లికేషన్స్ వుంటాయో, వాటికోసం సీన్లు కల్పించి, అవన్నీ కథలో జొప్పించేయాలనుకుంటున్నాడు. షీలా అంగీకారం లేకుండా పాలీగ్రాఫ్ టెస్టు కుదరదని రోహిత్ అంటే, తను మేనేజ్ చేస్తానన్నాడు. రేపు కోర్టులో మానిప్యులేట్ చేసిన ఎవిడెన్స్ పెడతాడన్న మాట. దీనికి చీఫ్ కూడా ఒప్పుకున్నాడు. ఇక గెస్ట్ హౌస్ మడ్ శాంపిల్స్ తో అనుమానితుల శాంపిల్స్ కలవలేదని రోహిత్ అన్నాడు. అక్కడ శవమే లేకపోతే అనుమానితుల మడ్ శాంపిల్స్ దేనికి  ? ఫోరెన్సిక్స్ వాళ్ళని పిలిపించి షీలా షూస్, కారు చెక్ చేయించమన్నాడు విక్రం. ఆమె కారు సర్వీసింగ్ కిచ్చి వాష్ చేసి పారేశాక ఇంకేం చెక్ చేస్తారు? ప్రీతి వేలిముద్రలు, నేహా వేలిముద్రలు వున్నట్టయితే అవి కూడా దొరకవు. అక్కడ శవమే లేకపోతే ఇంకా షీలా షూస్ లో ఏం చూస్తారు? చెప్పిన చోట శవమే లేదంటే అది హోక్స్ లెటరని తేలిపోవడం లేదా? ఇక ఇబ్రహీం షీలా కారుని గుర్తుపడతాడేమో చూడమన్నాడు విక్రం. మీ ఇంటి పక్కనే కారుంటే నువ్వెందుకు చెప్పలేదని ప్రీతి ఫాదర్ ని నిలదీయాలి కదా విక్రం?

(ఇంకా వుంది)

సికిందర్

Wednesday, May 6, 2020

937 : స్క్రీన్ ప్లే సంగతులు


        ఇంటర్వెల్ తర్వాత-
        విషయం 1. హాస్పిటల్ బెడ్ మీదున్న విక్రం ఫ్లాష్ బ్యాక్ చూస్తాడు. అందులో చెల్లెలు సుష్మి ఎవరో ఇద్దరు ఇంట్లోకి తొంగి చూశారంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ బిట్ తర్వాత, అభిలాష్ వచ్చి నేహా మిస్సింగ్ కేసులో విక్రం ని ప్రశ్నించాలంటాడు. విక్రం ఎదురుతిరుగుతాడు. ఇద్దరూ కొట్టుకోబోతూంటే చీఫ్ వచ్చి తిడతాడు. విక్రం ని ప్రశ్నించే పధ్ధతి ఇది కాదంటాడు. విక్రం ని వెళ్లి పొమ్మంటాడు. వెళ్తూంటే ఆపి, రోహిత్ రాజూ గెస్ట్ హౌస్ ముందు శవం కోసం సెర్చ్ పార్టీతో వున్నాడు వెళ్ళమని రహస్యంగా చెప్తాడు. విక్రం వెళ్ళిపోతాడు. చీఫ్ నేహా కేసుని అభిలాష్ నుంచి పీకి విక్రం కిస్తున్నట్టు చెప్తాడు. 

        వివరణ:  చాలా ఆశ్చర్యమేస్తుంది ఈ సీను చూస్తూంటే. ఇన్వెస్టిగేషన్ కథతో ప్రేక్షకులకి పెద్దగా ఇంటలిజెన్స్ వుండదనుకున్నట్టుంది కథకుడు. పరస్పర విరుద్ధ విషయాలు చెప్పాడు. శవం ప్రీతిదా, నేహాదా తెలుసుకోవడానికి పరుగెత్తడం మానేసి, మధ్యలో చెల్లెలి ఫ్లాష్ బ్యాకు షాకుతో హాస్పిటల్లో జాయినయ్యాడు విక్రం. హాస్పిటల్లో జాయినయిన వాడి మీద వచ్చి అభిలాష్ దౌర్జన్యం. నేహా కేసులో ప్రశ్నించాలంటూ దెబ్బలాట. ఇంకా నేహా మిస్సింగ్ కేసేమిటి లెటర్ అందితే? ఇదిప్పుడు మర్డర్ కేసు. ఇప్పుడిప్పుడే ఒక లెటర్ దొరికిందనీ, ఆ లెటర్ లో డెడ్ బాడీ గురించి వుందనీ తెలియదా అభిలాష్ కి? రెండోది, చీఫ్ వచ్చి, విక్రంకి రహస్యంగా చెప్పడమేమిటి? డెడ్ బాడీ గురించి అభిలాష్ కి తెలియకూడదనా? ఇవేం నాటకాలు. లెటర్ లో గెస్ట్ హౌస్ ముందు  డెడ్ బాడీ వుందని వుంటే, గెస్ట్ హౌస్ వెనుక రోహిత్ సెర్చ్ చేస్తున్నాడని చీఫ్ చెప్పడమేమిటి? ఇక నువ్వు కేసు మీద కంటే విక్రం మీద ఫోకస్ చేస్తున్నావని కేసు నుంచి అభిలాష్ ని తప్పించడం. కేసులివ్వడం, లాక్కోవడం ఆషామాషీగా  వుంది. కేసు మీద కంటే తన మీద ఫోకస్ చేస్తాడని విక్రం ముందే చెప్పాడు చీఫ్ కి. ఆ మాట నిజం చేస్తూ ఇప్పుడు చీఫ్ నిర్ణయం. మరి విక్రం ఎమోషనల్ గా పనికి రాడని తనే అన్నాడు. ఇప్పుడు నేహా కేసు విక్రంకే ఎందుకిస్తున్నాడు. ఈ కేసులిచ్చే, పీకే డ్రామా అవసరమా ఈ కథకి? 

       విషయం 2. రాజూ గెస్ట్ హౌస్ ముందు సెర్చ్ పార్టీ తో రోహిత్ వుంటే విక్రం వచ్చేస్తాడు. శవం ఇంకా దొరకలేదనీ, ట్రై చేస్తున్నాననీ అంటాడు రోహిత్. ‘ట్రై చేస్తున్నావా? ఇక్కడ దొరికే బాడీ ప్రీతిదో నేహాదో కూడా తెలీదు. ట్రై చేస్తే సరిపోదు,వెళ్లి ప్రెజర్ పెట్టు. నేను ఫోరెన్సిక్స్ కి వెళ్తున్నా’ అని వెళ్లి పోతూంటాడు. మళ్ళీ ఆగి, ‘మన సస్పెక్ట్ లిస్టులో వున్న వాళ్ళ షూస్, కారు టైర్స్, బైక్ టైర్స్ లో వున్న మడ్ శాంపిల్స్ తీసుకుని కంపేర్ చేయించు. మ్యాచ్ అయితే నాకు చెప్పు. వాళ్ళ ఫోన్లో లైవ్ ట్రాకింగ్ వుంటే ఇక్కడికి వచ్చారేమో చెక్ చేసి చెప్పు’ అని వెళ్ళిపోతాడు.

        వివరణ:  షీలా రాసిన శవంలేని ఉత్తుత్తి లెటర్ మీద ఫేక్ ఇంటర్వెల్ తో బాటు ఇంత కథ. ఆ లెటర్ ఆడుకోవడానికి అదృశ్య విలన్ రాసి వుంటే అదొక అందం, అదొక కథ. పైగా ఇక్కడికొచ్చిన విక్రం క్షణం కూడా వుండడు. రోహిత్ కి చెప్పేసి వెళ్ళిపోతాడు. శవం నేహాదా, ప్రీతిదా ఇక్కడే వుండి తెలుసుకోవాలన్న అర్జెన్సీ ఫీలవడం లేదు. ప్రీతితో ఏ ఫీలింగూ లేకపోతే లేకపోయింది, గర్ల్ ఫ్రెండ్ నేహాని కూడా పట్టించుకోవడం లేదు. ఫోరెన్సిక్స్ కి వెళ్ళిపోతానని జంప్ అవుతున్నాడు. చీటికీ మాటికీ ఈ ఫోరెన్సిక్స్ గోలేంటో అర్ధం గాదు. విక్రం ని ఫోరెన్సిక్స్ కి ట్రాన్స్ ఫర్ చేసేస్తే సరి, అక్కడే పడుంటాడు. ఇంకోటేమిటంటే, శవమే దొరక్కుండా, అనుమానితుల శాంపిల్స్ తీసుకోమంటున్నాడు. శవం దొరక్కపోయినా వాళ్ళని కేసులో ఇరికించేస్తాడా? అనుమానితులు ప్రీతి కేసులో వున్న వ్యక్తులు. ఒకవేళ నేహా శవం దొరికినా వాళ్ళని ఇరికించేస్తాడా? ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగమన్నట్టు శవం లేకపోయినా హంతకుణ్ణి పట్టేసుకోవాలనుకుంటున్నాడు... 

     విషయం 3. ఫోరెన్సిక్స్ లాబ్ లో విక్రం ఆ లెటర్ ని  చూపిస్తూ వుంటాడు. డాక్యుమెంట్ ఎగ్జామినర్ దాని మీద చేతి వ్రాతని పరిశీలనకి తీసుకుంటాడు. విక్రం షీలా ఇంటికి వెళ్తాడు అక్కడ రోహిత్ విక్రం కి నేహా కాల్ లిస్టు ఇస్తాడు. కాల్ లిస్టులో విక్రం కి క్లూ ఏమీ దొరకదు. ఇక బ్లూ కారుని ఓఆర్ ఆర్ మీద ఎవరూ చూడలేదని అంటాడు రోహిత్. లారీ యార్డులో టైరు గుర్తులు వాటర్ ట్యాంకర్స్ వి కావచ్చంటాడు. ఇదంతా చూసి క్లూస్ ఏమీ దొరడం లేదని విసుక్కుంటాడు విక్రం. షీలాని మరొకసారి లెటర్ ఎలా దొరికిందో చెప్పమంటాడు విక్రం. ఆమె చెప్తూంటే అతడి దృష్టి గోడకున్న చిత్రపటం మీద పడుతుంది. ఆ చిత్రపటం తనే వేశానని అంటుంది షీలా. విక్రం దాంతో లాబ్ కి వెళ్తాడు. ఈ చిత్రపటంలో వున్న స్ట్రోక్స్, లెటర్ లో వున్న స్ట్రోక్స్ ఒకటేనా పరిశీలించి చెప్పమంటాడు. 

        వివరణ: ప్రతీ వివరణా ఒక హార్రర్ ఫీలింగుతో భయపెడుతోంది. ఎన్నని తప్పులు ఎత్తి చూపడం. మొత్తానికి నేహా కాల్ లిస్టు వచ్చింది. ఈ కాల్ లిస్టు తెచ్చిన వాడు తర్వాత ప్రీతి హత్య కేసులో భార్యతో బాటు కిల్లర్ గా రివీలయ్యే విక్రం అసిస్టెంట్ రోహితే. ఈ కాల్ లిస్టు తెస్తే తనే దొరికిపోతాడని అతడికి తెలీనట్టుంది. ఎందుకంటే, నేహా అదృశ్యంలో కూడా తనే విలన్. ఫాహద్ తో కలిసి ఆమెని కిడ్నాప్ చేసేప్పుడు ఆమెతో పాటు ఆమె ఇంట్లోనే వున్నాడు. కేసు ఫైలు కోసం వెళ్లి ఆ ఫైలు చూస్తూ కూర్చున్నాడు. చూస్తూ చూస్తూ, పళ్ళ రసంలో ఆమెకి మత్తు మందు కలిపిచ్చి, ఫాహద్ తో కిడ్నాప్ చేయించేశాడు. ఇది చివర్లో కిడ్నాప్ సీను రివీలయినప్పుడు చూస్తాం. అంటే ఆ ఫైలు కోసం ఫోన్ చేసే వెళ్లుంటాడు. అప్పుడా కాల్ లిస్టులో చివరి నంబర్ తనదే అయ్యుంటుంది. వేరే నంబర్ నుంచి కాల్ చేసినా ఆ నంబర్ వుంటుంది. ఈ కాల్ లిస్టు ఇప్పుడు చెక్ చేస్తున్న విక్రం, చివరి నంబర్ వ్యక్తిని పట్టుకోకుండా, క్లూస్ ఏమీ దొరకడం లేదని విసుక్కుంటాడు. ఏంటిది విక్రం? ఒక్క చోటైనా- ఒక్కటంటే ఒక్క చోటైనా శ్రద్ధ పెట్టి ఆలోచించవా? ఈ కేసంటే నీకిష్టం లేదా?  


      అసలు ఫైలు కోసం రోహిత్ నేహా ఇంటికి వెళ్ళడమేమిటి? ఆమె ఆఫీసు ఫైలు ఇంటికెందుదుకు తెచ్చి చూపిస్తుంది? రేపు ఆఫీసుకే రమ్మంటుంది. అసలు రోహిత్ ఎవరు ప్రీతి కేసులో ఫైలు అడగడానికి? రోహిత్ విక్రం అసిస్టెంట్. ప్రీతి కేసు చూస్తున్నది శ్రీనివాస్. ఇక ఆ పళ్ళ రసం గ్లాసేమైందో, అదెందుకు లాబ్ కెళ్లలేదో విక్రం కే తెలియాలి. మరొకటేమిటంటే, రోహిత్ గానీ, ఫాహద్ గానీ గ్లవ్స్ తొడుక్కోలేదు. వాళ్ళ వేలిముద్రలు చాలా ఏర్పడి వుండాలి. ఈ కేసు చూసిన ఘనమైన అభిలాష్ ఏం చేశాడో? ‘హిట్’ పేరు నిలబెట్టాలని ఎవడికీ లేదు. ‘హొమిసైడ్ ఇల్లాజికల్ టీం’ అని బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటున్నారు. 

        ఇక లారీ యార్డులో టైర్ల గుర్తులు. నిజానికి చివర్లో రివీలయ్యే దాన్ని బట్టి, ఫాహద్ ప్రీతిని బ్లూ కారులో అపహరించాక, ఇక్కడికి తెచ్చి ఆ కారుని కార్గో ట్రక్ ఎక్కించాడు. అప్పు డా బ్లూ కారు టైర్ల గుర్తులు కూడా పడాలిగా? ట్రక్కు గుర్తులు మాత్రమే ఎందుకు చూపిస్తున్నాడు కథకుడు? 

     ఇక చిత్రపటం. లెటర్ తీసుకుని లాబ్ కి పరుగెత్తడమే దండగ. షీలా ఇంట్లో దొరికిన ఈ రెండూ ఒకటేనని కొట్టొచ్చినట్టూ కన్పించిపోతోంది మన కళ్ళకి. విక్రం లాబ్ లో కూడా కాదు, ఇంట్లో కూర్చుని కామన్ సెన్స్ అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన వాడు. లాబ్ కి ఒరిజినల్ చిత్రపటం కూడా తీసికెళ్లలేదు. రహస్యంగా ఫోటో తీసి కాపీ అందించాడు. ఒరిజినల్ కావాలని టెక్నీషియన్ అంటే, ఒరిజినల్ తీసుకు రాలేనని విసుక్కున్నాడు. ఎందుకు తీసుకురాలేడు? పోలీస్ పవర్ లేదా? ఆ చిత్రపతమే తీసుకు వెళ్తూంటే షీలా లబలబలాడి అప్పుడే నిజం చెప్పేసేదిగా ఆ లెటర్ తనే రాశానని! పాత్రలతో లైవ్ డ్రామా- కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయకుండా, చెత్తా చెదారం క్లూస్ తో ఫేక్ సస్పన్స్ సృష్టించడమేమిటి? ఎండ్ సస్పెన్స్ తో వచ్చే సమస్య ఇదే. ఇన్ఫర్మేషన్ పోగేసుకు వెళ్ళడమే తప్ప నో కాన్ఫ్లిక్ట్, నో డ్రామా, నో కథ.
         
(వార పత్రికల్లో సీరియల్ లాగా... ఇంకా వుంది.
సీరియల్ రాసే అదృష్టం కల్పించిన
కథకుడికి కృతజ్ఞతలు!)

సికిందర్

Tuesday, May 5, 2020

936 : జానర్ ఎగ్జాంపుల్స్


        జానర్లు ఎన్నో. తెలుగులో కొన్నే. ఆ కొన్నిట్లో ప్రధానంగా రోమాన్స్. ఈ రోమాన్స్ తో తెలుగులో రోమాంటిక్ కామెడీలు. ఈ రోమాంటిక్ కామెడీలు రోమాంటిక్ డ్రామాలే. ప్యూర్ రోమాంటిక్ డ్రామాలు గానీ, ప్యూర్ రోమాంటిక్ కామెడీలు గానీ తీయలేక. ఫస్టాఫ్ కామెడీలతో కడుపుబ్బ నవ్వించాలనుకుని రోమాంటిక్ కామెడీ, సెకండాఫ్ లో గుండెలుబ్బ ఏడ్పించాలనుకుని రోమాంటిక్ డ్రామా. ఫస్టాఫ్ నవ్వులతో గిటార్ సినిమా, సెకండాఫ్ ఏడ్పులతో వీణ సినిమా. వెరసి జానర్ అమర్యాదల జమిలిగా గిటార్వీణ వాయింపులు. ఈ టెంప్లెట్ పట్టుకుని ప్రతీ వొక్కరూ ఇవే వాయింపుల మీద వాయింపులు. తెలుగు బాక్సాఫీసు నేల ఇసుక వేస్తే పారిపోయే ప్రేక్షకులు. ప్రతీ యంగ్ హీరో, సినిమాకో కొత్త హీరోయినూ ఇవే నటించి వెళ్ళిపోవడం. దీనికే రోమాంటిక్ కామెడీలని పేరు. టీనేజర్లుగా ఇలాటి సినిమాలే చూసి పెరిగిన దర్శకులు ఇలాగే తీయాలి కాబోలనుకుని అలాగే తీయడం. అవే రాత తీతలు. అవే తల రాతలు. ఈ రాత తీతల్లో రెండు వాటమైన లీలలు. ఒక లీల ఏవో అపార్ధాలతో అవే విడిపోవడాలు, రెండో లీల ఆ ప్రేమేదో చెప్పుకోలేక అవే  మూగ బాధలు. ఈ రెండే పాయింట్లు పట్టుకుని రెండు దశాబ్దాలుగా వేలకొద్దీ అవే గిటార్వీణ యూత్ సినిమాలు. ఒక రోమాంటిక్ డ్రామా, విడిగా ఒక రోమాంటిక్ కామెడీ అంటూ చూడలేని దుస్థితికి ప్రేక్షకుల్ని నెట్టేశారు. మొత్తంగా ఇప్పుడు ఈ సోకాల్డ్ రోమాంటిక్ కామెడీల వ్యాపారం కాని వ్యాపారం బంద్ అయింది. 

       
క మూలాల్లోకి వెళ్లి కొత్తగా ప్రారంభమవచ్చా? అసలు రోమాంటిక్ డ్రామాలంటే ఏమిటో, రోమాంటిక్ కామెడీ లంటే ఏమిటో తెలుసుకునే ఓపికుండచ్చా? గిటార్ సపరేట్ గా, వీణ సపరేట్ గా వాయించాలన్నఆసక్తి వుండొచ్చా? వుంటే ముందు రోమాంటిక్ డ్రామాలతో మొదలెడదాం. దీని జానర్ మర్యాదలేమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. రోమాంటిక్ డ్రామాలు మూడు ఏజి గ్రూపులుగా వుంటాయి. టీనేజి గ్రూపు, టీనేజి దాటిన గ్రూపు, మిడిలేజి గ్రూపు. ఏజి గ్రూపుని బట్టి పాత్రలుంటాయి. టీనేజీ గ్రూపు అమాయకంగా, టీనేజీ దాటిన గ్రూపు మెచ్యూర్డ్ గా, మిడిలేజి గ్రూపు ఫిలాసఫికల్ గా వుంటాయి. మొదటిది కొరియన్ ‘ది క్లాసిక్’ లో, రెండోది ‘బాజీరావ్ మస్తానీ’ లో, మూడోది ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ లో చూడొచ్చు. లొకేషన్ గ్రామం, పట్టణం, నగరం ఏదైనా కావచ్చు. కథ మాత్రం ఒకే జానర్ మర్యాదలతో వుంటుంది. హీరో హీరోయిన్లు పరస్పరం పరిచయమవుతారు. పరిచయాన్ని ప్రేమగా మార్చుకుంటారు. ప్రేమలో ఆటంకాన్ని ఎదుర్కొంటారు. వియోగ బాధ అనుభవిస్తారు. మూడో పాత్ర వాళ్ళ ఆటంకాన్ని తొలగిస్తుంది. వాళ్ళు ఏకమవుతారు. ఈ ఆరు దశలుగా వుంటుంది కథ. డ్రామా జానర్ లో రోమాంటిక్ డ్రామా సబ్ జానర్. కాబట్టి డ్రామా ప్రధానంగా సాగే ఈ కథల్లో పాత్రలు పాసివ్ గా వుంటాయి. డ్రామాయే కథ నడిపిస్తుంది. చంటి, గీత్ గాతా చల్, జీవిత చక్రం లలో చూడొచ్చు. కథాబలం, బలమైన భావోద్వేగాలు ఈ డ్రామాని నిలబెడతాయి. 

        ప్రేమలో ఆటంకం ఈ కాలంలో అపార్ధాలతోనే వుండదు, మూగ ప్రేమలతోనే వుండదు. పెద్దల అభ్యంతరాలు, అంతస్తుల తారతమ్యాలు, జాతి కుల మత భాషా ప్రాంతీయ విభేదాలు, హీరో లేదా హీరోయిన్ కి మానసిక నిషేధాలు (‘గీత్ గాతా చల్’ లో గాయకుడూ డాన్సర్ అయిన సచిన్, పెళ్లి చేసుకుంటే పంజరంలో ఇరుక్కుంటానని - పాట కోసం, నృత్యం కోసం - సారికని వదిలి పారిపోతాడు), ప్రమాదం, వ్యాధి, రెండో హీరో లేదా రెండో హీరోయిన్ పాత్ర అసూయ, ఇలా విడదీయడానికి ఎన్నైనా వుంటాయి. రోమాంటిక్ డ్రామా అంటేనే విడిపోయి కలుకోవడం. రోమాంటిక్ కామెడీలంటే విడిపోకుండా అవతలి వాళ్ళ పనిబట్టడం. ఇంకా ఈ అంతస్తుల తారతమ్యాలు, జాతి కుల మత భాషా ప్రాంతీయ విభేదాలేంటి - అనుకోవచ్చు. మనుషులున్నంత కాలం ఈ అనువంశిక జాడ్యం వుంటుంది. కాలాన్ని బట్టి ఇన్నోవేట్ చేసి తీయాలి. ‘టూ స్టేట్స్’ లో (హిందీ) బాగా తీశాడు. 

        ఇతర పాత్రల్లో ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, ఒక ప్రతినాయక పాత్రా వుంటాయి. ప్రతినాయక పాత్ర అంటే మాఫియా విలన్ కాదు. పాత సినిమాల్లో నాగేశ్వర రావు ప్రేమకి జగ్గయ్య అనే టెంప్లెట్ వున్నట్టు. తెలుగులో స్టార్స్ తో హృదయాల్ని మీటే ప్యూర్ రోమాంటిక్ డ్రామాలు తీయడం ఎందుకు సాధ్యం కాదంటే, వాళ్ళకో మాఫియా విలన్ వుండాలి, లేదా ఫ్యాక్షన్ విలనుండాలి. అవయవాలు తెగిపడి, రక్తాలు పారాలి. స్టార్స్ తో ఏ జానర్ సినిమా అయినా ఒకేలా వుంటుంది. ‘డియర్ జాన్’, ‘నోట్ బుక్’ లాంటి కల్తీలేని అద్భుత రోమాంటిక్ డ్రామాలకి వాళ్ళు నోచుకోలేరు. చిన్న హీరోలతోనే సృజనాత్మకంగా తీయడానికి స్వేచ్ఛ వుంటుంది. ఈ అవకాశాన్ని ఇకనైనా వదులుకోకూడదు. 

        రోమాంటిక్ డ్రామాల చిత్రీకరణ క్లాస్ గా వుంటుంది. యశ్ చోప్రా తీసేలాంటి కలర్ఫుల్ గా, పీచు మిఠాయిలా తియ్యగా వుంటాయి. అందమైన లొకేషన్స్ లో, భవనాల్లో ఆర్గానిక్ చిత్రీకరణ వుంటుంది. సూరజ్ బర్జాత్యా ‘మై ప్రేంకీ దీవానీ హూ’ తీశాడు. అదంతా గ్రాఫిక్స్ తో డిజైనర్ ప్రేమలా కృత్రిమంగా అన్పించేట్టు తీశాడు. నితిన్ నటించిన ‘అ ఆ’ లో పంటపొలాల దృశ్యాల్ని అతిగా డీఐ చేసి కళ్ళు చేదిరేట్టు చేశారు గానీ, ఆ వరిపొలాల సహజ సౌందర్యాన్ని అనుభవించనీయలేదు. 

        ప్యూరిటీ ముఖ్యం. హీరో హీరోయిన్లని ఎంత ప్యూరిటీతో చూపిస్తారో నిర్మాణ విలువలు అంత ప్యూరిటీతో వుండాలి. లొకేషన్స్ గానీ, సెట్ ప్రాపర్టీస్ గానీ, కథా కథానాలుగానీ, అన్ని పాత్రల తీరుతెన్నులు గానీ, మాటలు గానీ, ఆహార్యంగానీ ప్రతీదీ...  అలాగని ప్యూరిటీ పేరుతో సుత్తిలా, చాదస్తంలా తీయకూడదు. 

        హాలీవుడ్ రోమాంటిక్ డ్రామాల్లో సంగీతానికి పియానో ఎక్కువ వాడతారు. తెలుగు రోమాంటిక్ డ్రామాలకి ‘ఆనంద్’ లోలాంటి సెమీ క్లాసికల్ సాంగ్స్ వుంటే ఎలా వుంటుందో ఆలోచించవచ్చు. సెమీ క్లాసికల్ మాస్ ని కూడా కట్టి పడేస్తుంది. 

        హీరోహేరోయిన్లకి క్లోజప్స్ ఎక్కువ వేస్తారు. ఇక్కడ క్లోజప్స్ కి అర్ధం ప్రేమ. ఇతర పాత్రలకి క్లోజప్స్ వేయరు. వాళ్ళది ప్రేమ కాదు, వాళ్ళు ప్రేమికులూ కాదు. ప్రతినాయక పాత్ర ఎంత కళ్లురిమినా వాడికి మిడ్ షాటే గతి. ప్రేమని హైలైట్ చేసే క్లోజప్స్ హీరోహీరోయిన్లకే సొంతం. హీరో హీరోయిన్ల మధ్య అందమైన బొకేలు, గిఫ్టులు చేతులు మారే దృశ్యాలుంటాయి. స్మూత్ ఎడిటింగ్ తో మాంటేజెస్, ఫేడిన్ ఫేడవుట్స్ వుంటాయి. ఫ్లాష్ బ్యాక్స్ కూడా వుండొచ్చు.

         ప్రేమ కథలకి ఎప్పుడూ మార్కెట్ వుంటుంది. లొట్టపీసు ప్రేమలకి వుండదు. ఈ వివిధ జానర్ మర్యాదల్ని పట్టుకోవడం కోసం హాలీవుడ్ రోమాంటిక్ డ్రామాలెన్నో వున్నాయి. నెట్ లో కొడితే లిస్టులకి లిస్టులు వస్తాయి, సెలెక్టు చేసుకుని చూడొచ్చు. వీలయితే వీటి స్క్రీన్ ప్లేల్ని డౌన్ లోడ్ చేసుకుని చదవచ్చు, అన్ని జానర్లకి మూలం డ్రామా జానర్. కనుక ముందుగా రో    మాంటిక్ డ్రామా గురించి. దీని
తర్వాత రోమాంటిక్ కామెడీల గురించి...

        సినిమాలు చూసేప్పుడు జానర్ కన్వెన్షన్స్ కూడా చూడాలి. హాలీవుడ్ గుండుగుత్తగా సినిమాలు తీయదు. ఏ జానర్ సినిమాకా జానర్ మర్యాదని పాటిస్తుంది. జానర్ మర్యాదల మీద యూనివర్సిటీ అధ్యయనాలున్నాయి. కాబట్టి రోమాంటిక్ డ్రామాలు చూస్తున్నప్పుడు ఏఏ జానర్ మర్యాదల పాటింపు వాటిలో కామన్ గా వున్నాయో పసిగట్టి దృష్టితో చూస్తేనే సినిమాలు చూడాలి, సరదాగా చూస్తే కాదు.

సికిందర్                  



Monday, May 4, 2020

935 : సందేహాలు - సమాధానాలు


Q: ప్రశ్న ఏడాది ఎలాగైనా దర్శకుడు/రచయిత అవ్వాలని కలలు కంటూ కథలు రాసుకుంటున్న వారందరి తరఫున..  ప్రస్తుత కరోన పరిస్థితుల్ని బట్టి చూస్తే సినిమా రంగం పూర్వ స్థితికి రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది.  ఇక పరిస్థితుల్లో కొత్త వాళ్లకు అవకాశాలంటే దాదాపు అసాధ్యమనే అనిపిస్తుంది. అదే సమయం లో OTT ప్లాట్ ఫామ్స్ కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. వెబ్ సిరీస్ / వెబ్ ఫిల్మ్స్ కి స్క్రిప్ట్స్ ని ఆహ్వానిస్తున్నాయి. అయితే వెబ్ రైటింగ్ కి సంబంధించిన గ్రామర్ తెలుగులో పెద్దగా అందుబాటులో లేదు. వెబ్ కంటెంట్ ఎలా ఉండాలో బ్లాగ్ ద్వారా వివరిస్తారా సర్. లాక్ డౌన్ చాలా మందికి అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లోని కంటెంట్ ని పరిచయం చేసింది. స్థాయికి తగ్గకుండా రాయాలంటే ఎలాంటి ఎక్సర్ సైజ్ చేయాలో, ఐడియా ఎలా ఉండాలో చెప్పండి. వెబ్ అంటే క్రైమ్, అడల్ట్ కంటెంట్ మాత్రమేనా? ఎందుకంటే మెజారిటీ కంటెంట్ వీటి చుట్టూనే తిరుగుతుంది.  వెబ్ సిరీస్ బాంగ్ గురించి, తొంభై నిమిషాల వెబ్ మూవీ గురించి వీలైనంతగా వివరించగలరు. దీనిమీద సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాస్తే మరింత సంతోషం.
ఏపీ, ఏడీ 

A: వెబ్ సిరీస్ ని సినిమా స్క్రీన్ ప్లే లాగా త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో రాయలేరు. దీనికి పిసిఆర్ మెథడ్ అని అమెరికాలో అనుసరిస్తున్నారు. గత సంవత్సరం ఒకరికి ఈ మెథడ్ ని సూచించి రాసుకోమన్నాం. అతణ్ణి దర్శకత్వంలో కాక వేరే పనిలో పెట్టేశారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఒక సినిమాకి దర్శకత్వం వహించిన వాళ్లకి ప్రవేశమంటున్నారు. కాబట్టి ఇటువైపు వెళ్ళాలనుకునే ఇతరులు ఆలోచించుకోవాలి. అసిస్టెంట్లు కంటెంట్ గురించి ఆలోచించడం గాక, అసిస్టెంట్ గా చేరేందుకు ప్రయత్నించుకుంటే మంచిదేమో ఆలోచించుకోవాలి. ఇక వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించే దర్శకులు వెబ్ సిరీస్ తీసుకుంటూనే  పోతున్నారు. వాళ్ళకి మెథడ్ అవసరం లేదు. కనుక వెబ్ సిరీస్ రాయడం గురించి ఆర్టికల్స్ అవసరమని భావించడం లేదు. ప్రాక్టికల్ అనుభవం లేకుండా రాయలేం కూడా. నెట్ లో బోలెడు కంటెంట్ వుంది. ఎత్తి రాయలేం. మీరే చదివి తెలుసుకోండి. వెబ్ సిరీస్ రైటింగ్ అని టైపు చేస్తే సైట్స్ వచ్చేస్తాయి. ఇక కరోనా వల్ల సినిమారంగం ఏమవుతుందోనన్న ఆందోళన పెట్టుకోవడం అనవసరం. ఆందోళన అనేది స్క్రీన్ ప్లేలో మిడిల్లో వచ్చే స్ట్రగుల్. ముందు బిగినింగే చూడకుండా మిడిల్ గురించి ఎందుకు ఆందోళన? లాక్ డౌన్ ఎత్తేశాక ముందు బిగినింగ్ ఎలా వుంటుందో చూడండి. ఆ బిగినింగ్ ని బట్టి మిడిల్, ఎండ్ వుంటాయి. వాటిని అప్పుడు చూసుకోవచ్చు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లెక్కల్లో ఆలోచిస్తే జీవితం హాయిగా వుంటుంది.       
         
Q: ఒక పెద్ద రిక్వెస్ట్..  సీన్స్ ట్రీట్మెంట్ కి సంబంధించి ఒక్కొక్క దర్శకుడి ట్రీట్మెంట్ ఒక్కోలా ఉంటుంది. దీనికి సంబంధించి మీయొక్క పూర్తి విశ్లేషణ, ఉదాహారణలతో వరల్డ్ వైడ్ గా  పేరున్న దర్శకులు సీన్స్ ను ఎలా ట్రీట్ చేస్తారు, తరవాత ఆ సీన్స్ ఆడియన్స్ మీద ఎంతవరకు ప్రభావం చూపాయీ, మరియు మీ దృష్టిలో బెస్ట్ ట్రీటెడ్ సీన్ అనిపించిన సీన్స్ ను, మీ యొక్క వీలు చూసుకుని తెలపగలరు.
జేకే విప్లవ్, దర్శకత్వ శాఖ 

A: ట్రీట్మెంట్ అంటే పేపరు మీద వుండేది. అది స్క్రీన్ ప్లే. వెండితెర మీద కన్పించేది ఆ ట్రీట్మెంట్ కి చిత్రీకరణ. ట్రీట్మెంట్ కి కెమెరా షాట్స్ కలిస్తే చిత్రీకరణ. కాబట్టి ఒక సీనుని షాట్స్ తో దర్శకుడు ఎలా ప్రెజెంట్ చేశాడన్నదే పాయింటు అవుతుంది. ట్రీట్మెంట్ ఎలా రాశాడ న్నది కాదు. ట్రీట్మెంట్ ఎలా రాశాడన్నది స్క్రీన్ ప్లే విశ్లేషణ మాత్రమే అవుతుంది. మేకింగ్ విశేషాలు కాదు. మీరడుగుతున్నది మేకింగ్ విశేషాలు కావచ్చు. ఉదాహరణకి 924 వ ఆర్టికల్లో ఇచ్చిన శ్యాం బెనెగళ్ తీసిన ‘భూమిక’ లో ఒక సీను షాట్ డివిజన్ లాగా. గొప్ప దర్శకుల షాట్ డివిజన్లు రాయాలంటే ఆ షాట్ ని పది సార్లు చూసి, ఈ షాట్ ని ఇలా ఎందుకు పెట్టాడబ్బా అని అర్ధాలు వెతుక్కోవడంతోనే సరిపోతుంది. కోయెన్ బ్రదర్స్ తీసిన నియోనోయర్ జానర్ ‘బ్లడ్ సింపుల్’ లో ప్రతీ షాటూ ఒక చిత్రీకరణ పాఠమే. ఈ పాఠాలు ఆల్రెడీ బ్లాగులో రాశాం. బ్లాగు సెర్చి బటన్ లో ‘బ్లడ్ సింపుల్’ అని తెలుగులో టైపు చేయండి, ఆ ఆర్టికల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇందులో ఒక సీనులో హీరో ఎదుట నిలబడ్డ హీరోయిన్ని టాప్ యాంగిల్లో చూపించినప్పుడు, ఆ సీనులో హీరోయిను లోనైన బానిస మనస్తత్వమంతా పట్టుబడిపోతుంది. షాట్ అంటే పాత్ర మానసిక స్థితి తప్ప మరేం కాదు. పదిహేనేళ్ళ క్రితం దర్శకుడు దశరథ్ ‘హౌ టు రీడ్ ఏ ఫిలిం’ అనే జేమ్స్ మొనాకో రాసిన పుస్తకమిచ్చారు. అది చదివితే కదిలే బొమ్మల అంతరార్ధం తెలుస్తుంది. ఈ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది. లేదంటే దర్శకుల సంఘం లైబ్రరీలో వుండొచ్చు. తీసుకుని చదవండి. కానీ తీసే సినిమాల చిత్రీకరణ ఇలా వొక సైన్సు ప్రకారం లేనప్పుడు చదివి ఏం లాభం. మనం రాసి ఏం భోగం. అయినా మీరన్నట్టు వీలు చూసుకుని రాసే ప్రయత్నం చేద్దాం. 

Q: హిట్’ సినిమా పోస్టుమార్టంలో మీ విశ్వరూపం చూపించారు, మీరు అనలైజ్ చేసిన ప్రతి పాయింట్ లాజికల్ గా ఉంది. మీ విశ్లేషణలు సినిమా తీయబోయేవారికి పాఠాలు, తీసిన వారికి ఖచ్చితంగా గుణపాఠాలు.
పేరు రాయలేదు 
A: విశ్వరూపం కాదు, విశ్వ ప్రయత్నం. పోతే, పాఠాలూ గుణపాఠాలూ అంత సీనేం లేదు. బ్లాగులో రాయాలి కాబట్టి రాయడం తప్ప వేరే యేం లేదు. 

Q: నైస్ బ్లాగ్ అండి. కీప్ వర్కింగ్ ఔట్. ఎలా వస్తాయండీ ఈ ఆలోచనలు, హ్యాట్సాఫ్.
సహస్ర 
A: మీ అభిమానానికి కృతజ్ఞతలు. అలవాటు చొప్పున వస్తాయేమో ఆలోచనలు. 

Q: మీ బ్లాగు రెగ్యులర్ గా చదువుతున్నాను. మామూలు కథానికలు రాయాలనుకునే నాకూ ఉపయోగపడుతున్నాయి మీ ఆర్టికల్స్. 
వైతరణి 
A: థాంక్స్. సినిమా కథల్లా రాయకండి.

సికిందర్
    

Sunday, May 3, 2020

934 : స్క్రీన్ ప్లే సంగతులు




        విషయం 12. విక్రం ప్రీతి పేరెంట్స్ ని కలుస్తాడు. ప్రీతి ఒక అనాధ అనీ; మోహన్, లక్ష్మీ లు ఆమె పెంపుడు తల్లిదండ్రులనీ తెలుసుకుంటాడు. సరస్వతి అనే ఆవిడ నడిపే అనాధాశ్రయం నుంచీ మోహన్ తమ్ముడు శివ, మరదలు ప్రియ, ప్రీతిని చిన్నప్పుడు దత్తత తీసుకుని యూఎస్ వెళ్ళారనీ, అక్కడ వాళ్ళిద్దరూ ప్రమాదంలో చనిపోవడంతో, ప్రీతిని తెచ్చుకుని మోహన్ లక్ష్మీలు పెంచుకున్నారనీ తెలుసుకుంటాడు. ఆ అనాధాశ్రయాన్ని  ప్రీతి మేనేజ్ చేస్తోందని కూడా తెలుసుకుంటాడు. అనాధాశ్రయం నిర్వాహకురాలు సరస్వతి, ప్రీతి ఇచ్చే నిధులు దుర్వినియోగం కావడం లేదని చెప్తుంది.

        వివరణ: కిడ్నాపర్ ని పట్టించే దూదీ సూదీ వుండగా ప్రీతి పేరెంట్స్ దగ్గర ఆరాలు తీస్తున్నాడు విక్రం. ఎక్కడ మా కూతురు? దూదీ సూదీ దొరికాక కిడ్నాపర్ ని పట్టుకోక ఇక్కడి కెందు కొచ్చావ్? - అనాల్సింది అనడు మోహన్. పైగా కూతురు పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకొచ్చాడు. ఇంకా ప్రీతి మొన్న రాత్రి ఎక్కడి కెళ్ళిందీ, నిన్న సాయంత్రం ఎక్కడి కెళ్ళిందీ అంటూ ప్రేక్షకులకి తెలిసిన విషయాలే అడిగాడు విక్రం. అంటే కాలేజీలో చదివే మీ కూతురు - ఎక్కడో సిటీ లో పబ్బుల్లో క్లబ్బుల్లో పడి తాగి - అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డుమీద రూల్స్ ని అతిక్రమిస్తూ - డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ తిరిగొస్తూంటే మీకేం పట్టదా? కన్న కూతురు కాదనా? మీ వల్లే ఈ కిడ్నాప్ అనే నేరం జరిగి నాకు తలనొప్పి వచ్చిందని తెల్సా? ...అని నిలదీయడు, అసలే తనకున్న ఫ్లాష్ బ్యాక్ తో సతమతమవుతున్న విక్రం. 

       శ్రీదేవి నటించిన ‘మామ్’ అనే థ్రిల్లర్లో, కూతురు ఆ నైట్ ఎక్కడో ఫాం హౌస్ కి పార్టీకి వెళ్తోంటే, ‘సెల్ చార్జింగ్ వుందా?  అనడుగుతుంది శ్రీదేవి. ఆమె చేయాల్సింది పోలీస్ యాప్ డౌన్ లోడ్ చేసివ్వడం, బ్యాగులో ఒక  చిల్లీ స్ప్రే వుంచడం- ఒక తల్లిగా, అందులోనూ టీచర్ గానూ. ఇవేం చెయ్యక, ముందు తను బాధ్యతగా వుండక, కూతురు గ్యాంగ్ రేప్ అయిపోతే కత్తి పట్టుకుని రివెంజికి బయల్దేరుతుంది. ఇప్పుడేం లాభం నేరం జరిగే అవకాశమిచ్చేశాక?

       
సరైన నేర కథలు కేవలం నేరస్థుణ్ణి పట్టుకునే దర్యాప్తు కథలుగా వుండవు. నేరము -నీతి చుట్టూ వుండే ప్రశ్నల్ని ఎక్కుపెట్టే క్రియేటివ్ ప్రక్రియలు. నైతిక విలువలకి పట్టంగట్టే, నైతిక బాధ్యతల్ని గుర్తుచేసే కళా రూపాలు. ఫిలిం నోయర్ జానర్ అప్పట్లో ఇదే చేసింది. తెలుగులో ‘నేనూ మనిషినే’  (1974) అనే క్రైం థ్రిల్లర్లో జడ్జి అయిన గుమ్మడి హత్య చేస్తాడు. తమ్ముడైన ఉన్నత పోలీసు అధికారి కృష్ణ, అన్నకి అనుకూలంగా కేసులో వాస్తవాల వక్రీకరణలకి పాల్పడతాడు (ఇందులో బుల్లెట్స్ తో వుండే బాలస్టిక్స్ సైన్స్ గురించి అప్పట్లోనే చూపించారు). రక్తసంబంధానికే లొంగి పోతాడు. హోదావల్ల అవకాశం దక్కితే స్వార్ధాలు
, నైతికపతనాలు, అధికార దుర్వినియోగాలూ, సమస్త రుగ్మతలూ ఎలా వెల్లువెత్తుతాయో ఇక్కడ చూస్తాం మనం. చివరికి గుమ్మడియే దిగివచ్చి నైతిక ధర్మాన్ని స్థాపిస్తాడు. నేర కథలు నైతిక విలువల బ్యాక్ డ్రాప్ లో నైతిక విలువల్ని, బాధ్యతల్ని గుర్తు చేస్తూ వుంటాయి. 

        ‘ప్రిజనర్స్’ (2013) లో ఇదెక్కువైపోయి, ఇన్వెస్టిగేషన్ తగ్గిపోయింది. ‘హిట్’ లో ఇన్వెస్టిగేషన్ అడ్డదిడ్డంగా పెరిగిపోయి, మోరల్ ప్రెమీస్ గల్లంతయ్యింది. ‘ప్రిజనర్స్’ లో ఇద్దరు బాలికలు అదృశ్యమవుతారు. పోలీస్ డిటెక్టివ్ లోకీ అనేవాడు కేసు చేపడతాడు. కానీ బాలికల్లో ఒకరి తండ్రి కిడ్నాపర్ మీద రివెంజితో చెలరేగిపోతాడు. ఇలా ఫాదర్స్ రివెంజి డ్రామా అయింది. ఇందులో పోలీస్ డిటెక్టివ్ లోకీ, మన విక్రం లాగే పర్సనల్ ఫ్లాష్ బ్యాక్ తో కిందా మీదా అవుతూంటాడు. బాగానే కాపీ కొట్టాడు మన విక్రం ని ‘ప్రిజనర్స్’ దర్శకుడు. 
 
        ఇక ప్రీతి మేనేజ్ చేస్తున్న అనాధాశ్రయంలో  నిధులు దుర్వినియోగం కావడం లేదని చెప్పించి, అనుమానాల్నిమాత్రం అలాగే వదిలేశాడు కథకుడు. ఆమె అదృశ్యంలో అనాధాశ్రయం కోణాన్ని కొత్తగా కలిపాడు. అనుమానితుల సంఖ్య పెంచడానికి. 

        విషయం: 13. ఇరుగుపొరుగుతో ప్రీతి ఎలా వుంటుందని పేరెంట్స్ ని అడుగుతాడు విక్రం. షీలాతో క్లోజ్ గా వుంటుందని చెప్తాడు ప్రీతి తండ్రి మోహన్. మోహన్ లక్ష్మిల లాలాజలం, వేలిముద్రల శాంపిల్స్ తీసుకుంటారు. యూఎస్ లో తన తమ్ముడి ఆస్తి ప్రీతికి బదిలీ అయిందని చెప్తాడు మోహన్. అనుమానితుల లిస్టులో ప్రీతి పేరెంట్స్ ని కూడా చేరుస్తాడు రోహిత్. 

        వివరణ: అనుమానితుల సంఖ్య ఇంకా పెంచుతున్నాడు. ఇక్కడ ప్రీతి ఆస్తి కోణాన్ని ముందుకు తెస్తూ ఆమె పెంపుడు పేరెంట్స్ మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాడు. ఆమెని కిడ్నాప్ చేయించి ఆస్తినెలా కొట్టేస్తారు. ఆమెని చంపేసివుంటారా? విక్రంకి ఈ అనుమానం వచ్చిందా? రాలేదు, అతడి స్కిల్స్ కి అంత సీను లేదు. ఒక దిశాదిక్కూ, వ్యూహం విధానం లేని ఇన్వెస్టిగేషన్. ఆ పేరెంట్స్ ని కూర్చోబెట్టి లాలాజలం, వేలిముద్రల శాంపిల్స్ లాగేశాడు. మేమెందుకివ్వాలి శాంపిల్స్ అని వాళ్ళు తిరగబడలేదు. చీఫ్ కి కంప్లెయింట్ చేయలేదు, ఇబ్రహీం విషయంలో చేసినట్టుగా. ఈ శాంపిల్స్ వ్యవహారం తర్వాత చివర్లో కథకుడు కథలో వాడుకోవడానికి- వీళ్ళని ఇరికించడానికి- అవసరం. కథలో ఈ అపహాస్యం ఎలా జరిగిందో గత వ్యాసంలో చెప్పుకున్నాం.   
 
        విక్రం వీళ్ళకైనా దూది చూపించి ప్రశ్నించడు - ప్రీతి ఫ్రెండ్స్ ఎవరైనా అత్తరు వాడతారా? పోనీ ప్రీతి డ్రగ్స్ తీసుకుంటోందా? ఆమె కారు దగ్గర విరిగిన సిరంజీ దొరికింది. ఆమె సెల్ ఫోన్ ఏదీ? ఆమె కాల్స్, సోషల్ మీడీయా యాక్టివిటీ చెక్ చేయాలి...అంటూ అడగాల్సిన ముఖ్య ప్రశ్నలేవీ అడగడు. ఇక పొరుగున షీలాతో ప్రీతి క్లోజ్ గా వుంటోందని ఇంకో క్లూ. ఇంకో అనుమానితురాలు. 

        విషయం 14. పొరుగున వుండే షీలాని కలిస్తే,  ప్రీతి ఒక్కతే  తనతో మాట్లాడుతుందనీ, తను డైవర్సీ కావడంతో ఎవరూ తనతో మాట్లాడరనీ అంటుంది షీలా. ప్రీతి మిస్సయిన సమయంలో తను తన కూతుర్ని కలవడానికి వెళ్లినట్టు చెప్తుంది.    

         వివరణ: షీలాతో ఇలా ఒక సబ్ ప్లాట్ ని ప్రారంభించాడు. తర్వాత దీంతో ఇంటర్వెల్ సీను క్రియేట్ చేశాడు. సబ్ ప్లాట్ తో ఇంటర్వెల్ క్రియేట్ చేస్తారా, మెయిన్ ప్లాట్ తో చేస్తారా? ఇది ఇంటర్వెల్ సీన్లో చూద్దాం. షీలా బాధేమిటంటే తనను డైవర్సీ అవడం వల్ల ఇక్కడందరూ తనని దూరం పెట్టారని. ప్రీతి ఒక్కతే తనతో ఫ్రెండ్లీగా వుంటోందని. ఇంకా నయం, డైవర్సీతో నీకు సావాసాలేమిటని ఆ జనం, ఆమె పేరెంట్స్ ఆమెని ఇంట్లో కూర్చోబెట్టలేదు. ఈ డైవర్సీని  అన్యాయంగా కథకుడిలా కథకోసం కావాలని ఒంటరి చేశాడు. ఇది ఇంటర్వెల్ సీన్లో తెలుస్తుంది. కథ కోసం పాత్రనా, పాత్ర కోసం కథనా? పాత్ర కోసం కథనుకుంటే ఒక డైవర్సీ తో ఇలా చెయ్యడు. పాత్రకి అన్యాయం చేయకుండా కథనే మార్చుకుంటాడు. మార్చుకునేలా చేస్తుంది పాత్ర. డైవర్సీ అంటే నెగెటివ్ క్యారక్టర్ కాదని తిరగబడుతూ. ఈ సినిమాలో లేడీస్ ని నెగెటివ్ గానే చిత్రించాడు కథకుడు. విక్రం పాయింటాఫ్ వ్యూలో నేహా బెడ్ మీద ఇంకొకడితో వుండగా, ప్రీతి అనే స్టూడెంట్ ని పబ్బుల్లో తాగే అమ్మాయిగా (కనీసం బాధితురాలైన పాత్రని నెగెటివ్ మరకలతో చూపించకూడదన్న కథా మర్యాద పాటించకుండా), షీలా డైవోర్సీ కాబట్టి అనుమానించదగ్గ క్యారక్టర్ అన్నట్టుగా, ఆఖరికి ‘హిట్’ ఉద్యోగి రోహిత్ భార్య స్వప్నని హంతకురాలిగా... ఇక నేహా తల్లిని, ప్రీతి తల్లినీ ఒట్టి దిష్టి బొమ్మలుగా. తన కథలో లేడీసంతా ఇలా వున్నారని గమనించాడో లేదో కథకుడు. 

      ఇక షీలాకి కూడా దూది చూపించి- అడగడు విక్రం. కథలో దూదిని సృష్టించి కథకుడు దానికదే ఒక ప్లాట్ డివైస్ అయ్యేలా చేసుకున్నాడు. చేసుకున్నాక ప్లాట్ డివైస్ ని  ప్లే చేస్తూ వుండాల్సిందే. దాంతో మిస్టరీ అంతు చూడాల్సిందే. ఈ కథా పథకం ఓకే అనుకుంటే, అప్పుడు వెనక్కెళ్ళి ఇబ్రహీం తో సీను దగ్గర, అతడికి దూది చూపిస్తే అతను కూడా తెలియదని చెప్పేలా చేసి కేసుని జటిలం చెయొచ్చు. కేసు దర్యాప్తులో ఒక ప్రధాన క్లూని పట్టుకు సాగకపోతే, కథనం ఏకత్రాటిపై వుండదు. విక్రం చేస్తున్నట్టుగా దారి పొడవునా ఏవేవో క్లూలు ఏరుకోవడమే. కథనం ఎటెటో వెళ్ళిపోవడమే.

        ఇంకోటేమిటంటే విక్రం అసలు క్రిమినల్ మైండ్ ని తెలుసుకునే ప్రయత్నమే చేయడం లేదు. కథకి ఓ పాయింటుని ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనే చేయడం లేదు. ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో ట్రైనింగ్ వుంటుంది. ఈ ట్రైనింగ్ చేసొచ్చాడో లేదో తెలీదు. కిడ్నాపర్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? వాడు పరిచితుడా, అపరిచితుడా? పరిచితుడైతే మోటివ్ ఏమిటి. కాకపోతే మోటివ్ ఏమిటి? డబ్బుకోసమా? అయితే పేరెంట్స్ కి కాల్స్ ఎందుకు చేయడం లేదు? ఒకవేళ కాల్స్ ని పేరెంట్స్ దాస్తున్నారా? వాళ్ళ ఫోన్స్ ని సీజ్ చేసి ఎందుకు చెక్ చేయ కూడదు? కిడ్నాపర్ ఒకడేనా, వాడి వెనుక ఇంకెవరైనా వున్నారా? బ్లూ సెడాన్ కారుందంటే ఆ కారెవరిది? నగరంలో ఎన్ని బ్లూ సెడాన్ కార్లున్నాయి, వాటి రిజిస్ట్రేషన్ వివరాలేమిటి? అసలు ఈ కిడ్నాపర్ ప్రీతి బాయ్ ఫ్రెండా? వాడితో కలిసి ప్రీతి ప్లాన్ చేసిందా? తన ప్లాన్ ఎవిడెన్స్ సహా నేహాకి తెలిసిపోయిందని ఆమెని తనే కిడ్నాప్ చేయించిందా? కిడ్నాపర్ ఒకే రకం అత్తరు వాడుతున్నాడంటే, ఈ అత్తరు ఎక్కడ కొంటున్నాడు?... వగైరా వగైరా ప్రశ్నావళితో అర్జెంటుగా అదృశ్య విలన్ ని ప్రేక్షకుల సౌకర్యార్ధం క్రియేట్ చేయాల్సిన అవసరముంది ఈ కథకి. ప్రేక్షకులు విలన్ని ఫీల్ కాకపోతే, విలన్ చుట్టూ మిస్టరీని అనుభవించక పోతే, ఇంకేదీ పట్టించుకోరు. ఎండ్ సస్పెన్స్ కథలో చివరి వరకూ విలన్ కన్పించని అసంతృప్తిని ఇలా తీర్చాలి. నేరం -అదృశ్య విలన్- హీరో అనే  త్రికోణం మీద ఫోకస్ చేసి నడిపినప్పుడు, పాయింటు కొచ్చి కథ ఒక కథలా వుండే అవకాశముంది
          ఇప్పుడు విక్రం క్యారక్టరైజేషన్ ఎలా వుండొచ్చంటే, ఎక్కడికెళ్ళినా అత్తరు వాసన కోసం ముక్కుపుటాలెగరేయ వచ్చు. ఎవర్ని కలిసినా అత్తరు వాసన కోసం పట్టి పట్టి వాసన చూడొచ్చు. ఈ అత్తరు - దూది అన్నవి ఈ కథలో ప్లాట్ డివైస్ ప్రాముఖ్యాన్ని సంతరించుకుని ఇలా తప్పనిసరి చేస్తున్నాయి కథనాన్ని మరి. ఇంకా విలన్ని ట్రాప్ చేయడానికి అదే అత్తరు తనే పూసుకు తిరగొచ్చు. హాలీవుడ్ క్లాసిక్ ‘డెత్ విష్’ (1974) లో ఇలాగే చేస్తాడు ఛార్లెస్ బ్రాన్సన్. తన పెళ్ళయిన కూతుర్ని రేప్ చేసిన దోపిడీ దొంగల్ని పోలీసులు పట్టుకోలేకపోతూంటే, తానే రంగంలోకి దిగుతాడు. ఆ దోపిడీ దొంగలెవరో తెలీదు. నగరంలో వున్న దోపిడీ దొంగలందర్నీ ఒక పథకం ప్రకారం నిర్మూలిస్తాడు. బంగారం, లేదా డబ్బు ప్రదర్శిస్తూ రాత్రి పూట నగరంలో సంచరిస్తూంటాడు. అవి చూసి దొంగలు దోచుకోవడానికి మీది కొచ్చినప్పుడు కాల్చి చంపుతూంటాడు...ఈ మూవీకి ఎంత పేరొచ్చిందో, అంత వివాదాస్పదమైంది. సోసైటీతో కనెక్ట్ చేయకుండా క్రైం కథల్ని చెప్పలేరు. సొసైటీ అవకాశమిస్తేనే క్రైములు జరిగేది. 

        ‘హిట్’ సినిమా ఆ మధ్య  ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన దిశా కేసు స్పూర్తితో తీశారని కొందరనుకుంటున్నారు. అలాంటప్పుడు, అలాటి నేరాల అనాటమీని విప్పి ప్రేక్షకుల ముందు పెట్టాలి. లేదా దిశా కేసు ఎలా ముగిసిందో తెలిసిందే - అలా విక్రం మోటార్ సైకిలు మీద సంచరిస్తూ,  కిడ్నాపర్స్ ని ట్రాప్ చేసి కాల్చి చంపడం మొదలెట్టాలి మోటార్ సైకిల్ డైరీస్ రాసుకుంటూ.

        కథకుడి కథలో విక్రం ఒకరితర్వాత ఒకరు అనుమానితుల్ని పోగేసుకుంటూ, ఒకదానితర్వాతొకటి ఏవేవో క్లూస్ ఏరుకుంటూ పాసివ్ కథనం చేసేకన్నా, ఇలా పాయింటు పట్టుకుని అదృశ్య విలన్ కోసం యాక్షన్లోకి దిగితే, మోక్షం లభించేదేమో ఈ కథకి. అంటే ఇలా చేసి ఎండ్ సస్పెన్స్ కథల్ని నిలబెట్టుకోవాలని చెప్పడం కాదు. ఎండ్ సస్పెన్స్ కథలు వద్దేవద్దు!! 

      విషయం 15. విక్రం, రోహిత్ లు పబ్ కెళ్తారు. అక్కడ బార్ అటెండర్ ని ప్రశ్నించబోతే అతను భయపడి పారిపోతాడు. వెంటాడి పట్టుకుంటే అతడి దగ్గర డ్రగ్స్ బయటపడతాయి. అతణ్ణి పోలీసులకి అప్పజెప్తాడు విక్రం. ప్రీతి పేరెంట్స్ ని కలిసి పూజకి ఏర్పాట్లు చేయమంటాడు. ప్రీతి క్షేమం కోసం ఏర్పాటు చేసే పూజకి ఎవరెవరు వస్తారో, ఎవరెవరు రారో కనిపెట్టేందుకు.

        వివరణ: ‘ప్రిజనర్స్’ లో అదృశ్యమైన బాలికల గురించి కొవ్వొత్తుల ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు పోలీస్ డిటెక్టివ్ లోకీ. ప్రదర్శనకి ఆ బాలికల కుటుంబాలకి తెలిసిన వాళ్ళలో ఎవరెవరొస్తారు, ఎవరెవరు రారు చూసి విలన్ ని పట్టుకోవాలని. ఒకవేళ వచ్చినవాళ్ళలో విలన్ కూడా వుంటే కనిపెట్టి పట్టుకోవచ్చని. ఆ వచ్చినవాళ్ళలో ఒకడు దొంగ చూపులు చూస్తూంటాడు. వాణ్ణి పట్టుకోబోతే పారిపోతాడు. వెంటాడితే వాడు జంతు కళేబరాల దగ్గరికి దారి తీస్తాడు. ఫాల్స్ లీడ్ అని వదిలేస్తాడు లోకీ. 

        విక్రం పబ్ కెళ్ళి బార్ అటెండర్ ని ప్రశ్నించబోతే వాడు భయపడి పారిపోతాడు. వెంటాడి పట్టుకుంటే డ్రగ్స్ సప్లయర్ గా బయటపడతాడు.       ఫాల్స్ లీడ్ అనుకుని వాణ్ణి పోలీసులకి అప్పజెప్పి చేతులు దులుపుకుంటాడు విక్రం. ఇలా ఎలా చేస్తాడు? ‘ప్రిజనర్స్’ లో వాడికి బాలికలతో సంబంధం లేదు. ఇక్కడ బార్ అటెండర్ డ్రగ్స్ సరఫరా చేస్తూంటే, పబ్ కొచ్చే ప్రీతితో సంబంధం వుండొచ్చుగా? ఫ్రెండ్ తో కలిసి ఆమె డ్రగ్స్ కి అలవాటు పడిందేమో? లేకపోతే ఈ ప్రీతి వచ్చే పబ్ లో డ్రగ్స్ యాంగిల్స్ ని సృష్టించడమెందుకు సీనులో? ఇంకో సినిమాలోంచి కాపీచేస్తే, కథెలా రాసుకున్నామో చూసుకుని కాపీ చేయాలి. ప్రీతి ఈ పబ్ కొస్తున్నట్టు కథ రాసుకుని, ‘ప్రిజనర్స్’ లో సీను తెచ్చి మార్చి పెట్టుకుంటే, ఇలాగే అర్ధమొస్తుంది ప్రీతితో. ఇందుకే ఏ సీను రాయాలన్నా సెటప్స్ అండ్ పే ఆఫ్స్ సరి చూసుకోవాలనేది. 

        అలా పబ్ ఎపిసోడ్ ఫెయిలయ్యాక విక్రం ఇలా ప్లానేశాడు పూజా కార్యక్రమమంటూ. ‘ప్రిజనర్స్’ లో కొవ్వొత్తుల ప్రదర్శన అనే డిటెక్టివ్ లోకీ ప్లానుని, విక్రం పూజా కార్యక్రమంగా మార్చుకున్నాడు. ‘ప్రిజనర్స్’ లో కొవ్వొత్తుల ప్రదర్శన లోంచే అనుమానితుడి పలాయనమనే సీనుంది. విక్రం దీన్ని విడదీసి వేర్వేరు సీన్లుగా పెట్టుకున్నాడు. పూజకి తెలిసిన వాళ్ళు ఎవరెవరొస్తారు, ఎవరెవరు రారు చూసి, రాని వాళ్ళని అనుమానించాలని. పూజ కేర్పాట్లు చేసుకోమంటాడు ప్రీతి పేరెంట్స్ తో. ప్రీతి పేరెంట్స్ ని ఆల్రెడీ అనుమానితుల లిస్టులో పెట్టాడు. వాళ్ళనే పూజ పెట్టుకోమనడమేమిటి? విక్రంని అర్ధం జేసుకోవడం షెర్లాక్ హోమ్స్ వల్ల కూడా కాదు. అసలు పూజ కేర్పాట్లు చేయించి తనకే ఇబ్బంది తెచ్చుకుంటున్నాడని తెలుసుకోవడం లేదు. మనకి తెలుస్తోంది... ఎందుకంటే అతడి మైండ్ మనకి తెలుసు. 

       విషయం 16. పూజకి అందరూ వస్తారు. ఎవరి మీదా అనుమానం రాదు. ఇంతలో పొరుగున వుండే షీలా పరుగెత్తుకొచ్చి, తలుపు దగ్గర లెటర్ దొరికిందని చెప్తుంది. ఆ లెటర్లో - డేడ్ బాడీ వికారాబాద్ రాజూ గెస్ట్ హౌస్ ముందు వుందని రాసి వుంటుంది. విక్రం షాకవుతాడు. నేహా మెదుల్తుంది. డిస్టర్బ్ అవుతాడు. ప్రీతి కోసం పూజ దగ్గర హోమంలో మంట చూసి తలతిరిగి పడిపోతాడు (విశ్రాంతి).

        వివరణ :  మాయమైన ప్రీతి క్షేమాన్ని కాంక్షిస్తూ చేస్తున్న పూజకి మనకి చూపించిన అనుమానితులందరూ హాజరయ్యారు షీలా తప్ప. డైవర్సీగా ఆమెని బాయ్ కాట్ చేశారు కాబట్టి ఆమె రాదు. పోనీ అంత క్లోజ్ గా వుండే ప్రీతి కోసం ఇంట్లోనైనా ప్రార్ధించదు. ఇంట్లో ప్రార్ధిస్తున్నట్టు ఒక ఇంటర్ కట్ షాట్ వేయాలని ఆలోచించలేదు. ఉన్న ఒక్క ఫ్రెండ్ పట్ల ఆమె వైఖరిని కూడా దిగజార్చారు. ఇల్లు కాలి ఒకరేడుస్తూంటే చలి కాచుకున్నట్టు ఆమె పాత్ర చిత్రణ చేశారు. ఇది తర్వాత చూద్దాం. 

        పూజకి పోలీసు పటాలమంతా వచ్చింది చీఫ్ సహా. వీళ్ళు దేనికి, విక్రం ఒక్కడే వచ్చి కనిపెట్టక? ‘ప్రిజనర్స్’ లో పోలీసులు ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ప్రదర్శనగా బాలికల పేరెంట్స్ కి తప్ప ఇతరులకి తెలీనివ్వకుండా, పోలీస్ డిటెక్టివ్ లోకీ ఏర్పాట్లు చేసి, రహస్యంగా వుండి గమనిస్తూంటాడు ఆహుతుల్ని. విక్రం ఇంకెప్పుడాలోచిస్తాడు సక్రమంగా? ‘హిట్’ టీములో కూడా అనుమానితులున్నారా వాళ్ళంతా రావడానికి? వీళ్ళంతా ఇలా వచ్చి వుంటే, నిజంగానే ఏమీ ఎరగనట్టు విలన్ కూడా వస్తే, పోలీసుల్ని చూసి దొరికిపోకుండా తన చర్యలతో జాగ్రత్త పడడా? 

        ఇంతలో షీలా కేకలు పెడుతూ వచ్చేసింది. విక్రం ని తీసికెళ్ళి ఇంటి మెట్టు మీద ఒక లెటర్ని చూపించింది...
ఆ లెటర్లో - డెడ్ బాడీ వికారాబాద్ రాజూ గెస్ట్ హౌస్ ముందు వుందని విషయం. 

        ఇది ఇంటర్వెల్ సీను. ఇక్కడ్నించీ ఈ ఇంటర్వెల్ సీనంతా చెడిపోవడం చూస్తాం. ప్రీతి కోసం పూజ జరుగుతూంటే, డెడ్ బాడీ గురించి లెటర్ రావడం మంచి బ్యాంగే. కానీ సెకండాఫ్ లో వెల్లడయ్యే అసలు విషయాన్ని బట్టి చూస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ చీటింగ్. ప్రేక్షకుల మెదళ్ళకి మేత పెడుతూ, వాళ్ళ  ఐక్యూని పరీక్షిస్తూ నడుపుతున్న కథతో  చీటింగ్. 

      సెకండాఫ్ లో వెల్లడయ్యే దాన్ని బట్టి ఈ లెటర్ కావాలని అబద్ధంగా షీలా సృష్టించిందే. డెడ్ బాడీ లేదు, ఏమీ లేదు. తనని అందరూ దూరం పెడుతున్నారు కాబట్టి పబ్లిసిటీ చేసుకుని వార్తల కెక్కడానికే  ఈ లెటర్ సృష్టి అంటూ తనే ఒప్పుకుంటుంది. తనకి వున్న ఒకే ఒక్క ఫ్రెండ్ ట్రాజడీ లోంచి లాభం పొందాలన్న దురాలోచన అన్నమాట. ఇలావుంది పాత్ర చిత్రణ ఇంటర్వెల్ సీను కోసం. 

        రెండో విఘాతమేమిటంటే, షీలా ఆమె పాట్లతో చేసింది పూర్తిగా ఆమెకి సంబంధించిన సబ్ ప్లాట్. ఒక సబ్ ప్లాట్ ని తీసుకొచ్చి మెయిన్ ప్లాట్ కి ముడిపెడుతూ ఇంటర్వెల్ ఎలా ఇస్తారు? మెయిన్ ప్లాట్ లో వున్న విక్రం, ప్రీతి, నేహా, అదృశ్య విలన్ పాత్రల్లో ఒకదాంతో ముడి పెట్టాలి గాని. ఈ కథకైతే  అదృశ్య విలన్ తో ఇంటర్వెల్ ఇవ్వాలి. ఇక అదృశ్య విలన్ రంగంలోకి దిగాడన్నస్టోరీ డెవలప్ మెంట్ - ఛేంజ్ ఓవర్ - చూపించాలి. మెయిన్ ప్లాట్ గేరు మార్చాలి ఇంటర్వెల్ తో. 

        మూడో విఘాతమేమిటంటే. మంట చూసి విక్రం కుప్ప కూలడం. అసలా లెటర్ చూడగానే ప్రీతి మెదలదు. అది ప్రీతి డెడ్ బాడీ కావచ్చనుకోడు (మన మెంటల్ రిఫ్లెక్షన్లో ప్రీతియే ఫ్లాషవుతుంది. అవ్వాలి కూడా. ఎందుకంటే మనం ప్రీతి కథనే ఫాలో అవుతున్నాం, నేహా కథని కాదు. నేహా కథే లేదు). విక్రం విపరీతంగా షేక్ అయిపోతూ నేహాతోనే  ప్రేమ దృశ్య మాలిక దర్శించుకుంటాడు. వాటీజ్ దిస్ విక్రం భాయ్? కాస్త మమ్మల్ని కనికరించు. నువ్వు తేల్చుకోవాల్సింది ఈ కేసుతో కాదు, నిన్నింతలా అన్ పాపులర్ చేస్తున్న స్టోరీ రైటర్ తో!

      విక్రం ఎప్పుడు మంట చూసినా తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చి విచలితుడైపోతాడు. అలాంటిది ఎందుకు ప్లాన్ చేయాలి ఈ పూజ? పూజ అంటే మంట వుంటుందని తెలీదా? మంట చూసి ఇంటర్వెల్ ని మసి చేస్తాడని తెలీదా? విక్రం! ఏంటబ్బా ఇది? నువ్వు ఫస్ట్ లాక్ డౌన్ లోకెళ్ళిపో!

        చివరికి ప్రీతీ డెడ్ బాడీ కాదు, నేహా డెడ్ బాడీ కాదు, విక్రం ఫ్లాష్ బ్యాక్ గురించి  ఇంటర్వెల్. ఫ్లాష్ బ్యాకులో ఏం జరిగిందో మనకి తెలియని ఫ్లాష్ బ్యాకు గురించి ఇంటర్వెల్!
***
        ఎండ్ సస్పెన్స్ కథల్లో ఇంటర్వెల్ అంటే  అనుమానితుల్లో ఒకరి మీద కీలక  సమాచారం లభించడం లేదా, అదృశ్యంగా వున్న విలన్ తను దొరక్కుండా ట్విస్టు ఇవ్వడం.

(రేపు మిడిల్ టూ సంగతులు)
సికిందర్