రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, October 17, 2019

884 : సందేహాలు -సమాధానాలు


Q : యాక్షన్, థ్రిల్, రోమాన్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ పెద్దగా లేని జోకర్’ అనే హాలీవుడ్ డ్రామా ఇక్కడ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి సర్? వీలైతే సినిమా స్క్రీన్ ప్లే సంగతులు రాస్తారా? అలాంటి సీరియస్ డ్రామాలు మన దగ్గర వర్కవుట్ అవుతాయా?
పి ఏ, AD 

A :   ‘జోకర్’ సైకలాజికల్ సబ్జెక్టు, పైగా యాంటీ హీరోతో డార్క్ మూవీ. తెలుగులో వర్కౌట్ కాదు. చూస్తున్నప్పుడు సాంతం దీన్నెంత ఏ స్టార్ ని వూహిస్తూ చూసినా ఇలాటి సబ్జెక్టు తెలుగులో బెడిసి కొడుతుందన్పించింది. ఇండియన్ ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాల్ని చూసే దృష్టి వేరు. అందుకని ‘జోకర్’ ఇండియాలో కూడా హిట్టయ్యింది. దీని స్క్రీన్ ప్లే సంగతులు పనికిరావు. ప్లాట్ పాయింట్స్ నుంచి మాత్రం నేర్చుకోవచ్చు. ప్లాట్ పాయింట్ వన్, దీనికి పరిష్కారంగా ప్లాట్ పాయింట్ టూ రూల్స్ ని పాటిస్తాయి. సంఘటనల ఆధారంగా విజువల్ గా, కథని సుడిగాలిలా మలుపు తిప్పేవిగా - బలంగా, చిరస్మరణీయంగా రిజిస్టరవుతాయి (సిడ్ ఫీల్డ్  సూచించినట్టుగా). ప్లాట్ పాయింట్ వన్ మెట్రోలో రిచ్ యూత్ ని జోకర్ కాల్చి చంపే సీను, ప్లాట్ పాయింట్ టూ లో లైవ్ షోలో ఈ హత్యల్ని ఒప్పుకుంటూ యాంకర్ ని కాల్చి చంపే సీను. రెండూ షాకింగే, రెండూ అద్భుతాలే. నోట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి.
   

Q : ‘సైరా’ గురించి  స్క్రీన్ ప్లే సంగతులు చదువుతున్నాను. మీరన్నట్టు ఫీల్ లోపించడమే ప్రధాన సమస్య అని నాకూ అన్పించింది. కనీసం ఉరి తీసేటప్పుడైనా ఝాన్సీ లక్ష్మీబాయి చేత వ్యాఖ్యానం చేయించి వుంటే, చివర్లోనైనా ఫీల్ తో ముగిసేదని నా అభిప్రాయం. మామూలు రివెంజి యాక్షన్ సినిమా లాగానే ముగిసింది.
కె. త్రినాధ్, దర్శకుడు 

A : కంగనా రణౌత్ ఝాన్సీ లక్ష్మీ బాయిగా నటించిన ‘మణికర్ణిక’ లో అంతవరకూ లేని భావోద్వేగాల్ని, ఆమె పోరాట తంత్రాన్నీ ఉన్నట్టుండి చివర్లో తెచ్చి కలిపినా, పక్క పాత్రల చేత ఆమెని ఎంత కీర్తించినా కలిసిరాలేదు. కథలో అంతర్వాహినిగా వుండాల్సిన కథాంగాల్ని చివర్లో కలిపినంత మాత్రాన తప్పులు ఒప్పులై పోవు. బూతంతా చూపించి చివర్లో నీతి చెప్పే సినిమాల్లా వుంటుంది. ‘మణికర్ణిక’ లో కునారిల్లిన ఝాన్సీ లక్ష్మీ బాయి ‘సైరా’ తో  ఫీలయ్యేంత కోలుకోలేదు. లేక ఫీలయ్యేట్టు ‘సైరా’ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి ప్రాంతీయేతురాలైన ఆమెకి ఇక్కడి ఫీలింగ్స్ తెలియకపోయి వుండాలి. ‘సైరా’ లో ఫీల్ మిస్సవడానికి కథ చెప్పిన ఝాన్సీ లక్ష్మీ బాయే కారణం  తప్ప, మేకర్స్ కే సంబంధంలేదు.

 
Q : చాలామంది యంగ్ దర్శకులు ఏం సినిమా తీయాలో తెలియక కంగారు పడుతున్నారు. అయోమయంలో వున్నారు. రోమాంటిక్ థ్రిల్లర్, రోమాంటిక్ థ్రిల్లర్ అంటూ కొందరు హడావిడి చేస్తున్నారు. ఒకలాంటి స్తబ్దత ఏర్పడింది. ఏం సినిమా తీయాలో తెలియనంత అమాయకంగా తయారయ్యారు.
దర్శకుడు

A : చేసుకున్న వారికి చేసుకున్నంత అనుకోవచ్చు. గత ఇరవై ఏళ్లుగా ఇంకో టాలెంట్ లేకుండా రోమాంటిక్ కామెడీలే  తీయడానికి వస్తూ రోమాంటిక్ కామెడీల చేపల మార్కెట్ తయారు చేశారు. ఇప్పుడు మార్కెట్ విసిగి సస్పెన్స్ థ్రిల్లర్స్ వైపు, లేదా ఇంకేదైనా ఔటాఫ్ బాక్స్ రియలిస్టిక్ వైపు చూస్తూంటే చేష్టలుడిగి చూస్తున్నారు. ఉన్నవాళ్లకి వీటిని తీసే టాలెంట్ లేదు, కొత్తగా వచ్చేవాళ్ళు ఇంకా రోమాంటిక్ కామెడీలే అనుకుంటూ వచ్చి చూసి ఆగిపోతున్నారు. లేదా మీరన్నట్టు రోమాంటిక్ థ్రిల్లర్స్ అంటున్నారు. మళ్ళీ వీటితో కూడా తమకి తెలిసిన రోమాంటిక్ కామెడీల్ని రుద్దడానికే. రోమాంటిక్ థ్రిల్లర్ వేరు, సస్పెన్స్ థ్రిల్లర్ వేరని తెలుసుకోలేరు. ఏమైనా ఈ పరిణామం చెత్తని ఊడ్చేయడానికే జరుగుతోంది. ఈ చెత్త తొలగిపోతే చైతన్య వంతులకి అవకాశాలు మెరుగవుతాయి. రోమాంటిక్ కామెడీల గుంపు వల్ల అవకాశాల్లేక ఇంతకాలం నష్టపోయారు. నిన్న ఇంకో దర్శకుడు కూడా ఇదే మాటన్నారు ఒక సీనియర్ నిర్మాత చెప్పినట్టుగా -  డిఫరెంట్ గా ఆలోచించే తనకి ద్వారాలు తేర్చుకునే కాలం వచ్చేసిందని.

సికిందర్   


Tuesday, October 15, 2019

883 : స్క్రీన్ ప్లే సంగతులు -2


          సైరా కాల్పనిక డిజైనర్ చారిత్రక పాత్ర ప్రయాణం ఈ క్రమంలో వుంటుంది : పుట్టుక, పెరుగుదల, రేనాడు బాధ్యత, ప్రేమ, పూర్వపు పెళ్లి, బ్రిటిష్ దౌర్జన్యాలు, బ్రిటిషర్లపై తిరుగుబాటు, నేరస్థుడుగా ముద్ర, పోరాటం, లొంగు బాటు, ఉరితీత. ఈ 11 దశల్లోని మొదటి 5 ఐదు దశల్లో బిగినింగ్ విభాగం వుంటుంది. ఎప్పుడైతే కరువు కాటకాల్లో శిస్తు వసూళ్ళకి బ్రిటిష్ దొరలు దౌర్జన్యాలు చేస్తూంటారో, సైరా తిరగబడతాడు. ఈ సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో భాగంగా, ఎప్పుడైతే ఒక పేద రైతు భూమిని ఆక్రమించుకోవడానికి బ్రిటిష్ దొర ఎత్తుగడ వేస్తాడో, అప్పుడు సైరా ముఖా ముఖీ అయి అతణ్ణి తరిమికొట్టి గట్టి వార్నింగ్ ఇస్తాడో, అప్పుడు ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. సైరాకి బ్రిటిషర్లతో అమీతుమీకి గోల్ ఏర్పడుతుంది. దీంతో బిగినింగ్ విభాగం ముగుస్తుంది. ఇది ఝాన్సీ లక్ష్మీ బాయి పాత్ర ఫ్లాష్ బ్యాకుగా చెప్పడం ప్రారంభించిన బిగినింగ్ విభాగపు కథ.

         
స్క్రీన్ ప్లే సంగతుల్ని రిపీట్ ఆడియన్స్ ని రాబట్టడానికి వలసిన డైనమిక్స్ దృష్ట్యా మాత్రమే చెప్పుకుందాం. ఇది సుప్రసిద్ధ పరుచూరి బ్రదర్స్ కి, ప్రసిద్ధ సురేందర్ రెడ్డికీ తెలియదని కాదు. ఇంకేదో తెలియజెప్పాలనీ కాదు. అంత సీన్ మనకి లేదు. అయితే సైరా తో కొట్టొచ్చినట్టు కన్పిస్తున్న దృశ్యం ఏమిటంటే రిపీట్ ఆడియెన్స్ సమస్యే. ఒకసారి చూసిన ప్రేక్షకులు ఇంకోసారి చూసేందుకు రాకపోవడం. సైరాకి రిపీట్ ఆడియెన్స్ అవసరమెందుకుందో రెండు కారణాలు కిందటి వ్యాసంలో చెప్పుకున్నాం. ఇప్పుడా రిపీట్ ఆడియెన్స్ మైనస్ అవడానికి కారణమైన మేరకు స్క్రీన్ ప్లే సంగతులు చూద్దాం. దీనికి కొంతమందిని ఓరల్ సర్వే చేస్తే, రెండో సారి ఎందుకు చూడలేమో చెప్పలేక పోతున్నారు. ఫీలైతేగా చెప్పగల్గడానికి. ఫీల్ కల్గిస్తే మళ్ళీ చూడాలనే అంటారు.

        ఈ చరిత్రలో చాలా కల్పితాలు చేశామన్నారు, పైగా ఈ తరానికి కనెక్ట్ అయ్యేలా దీన్ని తీర్చిదిద్దామన్నారు. కల్పితాల దృష్టితోనే, ఆడియెన్స్ కనెక్ట్ దృష్ట్యానే దీన్ని పరిశీలించినప్పుడు, దీనికుండాల్సిన హిస్టారికల్ అడ్వెంచర్ జానర్ మర్యాదల లోపం  కన్పిస్తుంది. రొటీన్ తెలుగు యాక్షన్ - ఎమోషన్లో చూపించారు. రౌద్రావేశాల్ని ప్రధానం చేస్తూ.   దీంతో ఈ చరిత్ర రెగ్యులర్ రొటీన్ యాక్షన్ సినిమాగా ముందుకొచ్చింది. ఈ యాక్షన్ - ఎమోషన్ హంగామా వచ్చేసి సున్నితత్వాన్ని, ఫీల్ నీ మిస్ చేశాక సినిమాటిక్ అనుభవాన్నివ్వలేదు. రిపీట్ ఆడియెన్స్ కోసం. చరిత్ర ఫీలయ్యే వస్తువు. కథ పండాలంటే కావాల్సింది యాక్షన్ - ఎమోషన్ కాదు; ఆ యాక్షన్ అడ్వెంచరై, ఆ ఎమోషన్ లో ఎమోషనల్ ట్రూత్ వున్నప్పుడు కథ పండుతుంది. ఎమోషనల్ ట్రూత్ అంటే ఒక సన్నివేశంలో మనమేం ఫీలవుతామో అది. ఎంతసేపూ కథ భగభగ మండే అగ్నిగోళమే అయితే, ఫీల్ తో కూడిన సన్నివేశాలకి, ఆగి కాస్తాలోచింపజేసే స్పేస్ కి చోటెక్కడుంటుంది. యాక్షన్ జానర్ నుంచి హిస్టారికల్ అడ్వెంచర్ జానర్ కి మారినప్పుడు, ఫీల్ తో పాత్ర కలర్ఫుల్ గా వుంటుంది, కథనంలో సస్పెన్స్ వుంటుంది, ప్రతినాయక పాత్రనుంచి వ్యంగ్యం వుంటుంది, మానవ నైజంతో పాత్రలు సజీవమైనవిగా అన్పిస్తూ, ఏం జరుగుతుందా అన్న థ్రిల్ తో పరుగులు తీస్తుంది ఆ అద్భుత రసపు (అడ్వెంచరస్) కథ. అప్పుడు ఒకసారి చూసిన ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వస్తారు. చరిత్ర అంటేనే మానవ నైజపు వ్యక్తీకరణ. ఇదే ఆ కాలపు పాత్రల్ని నేటి ప్రేక్షకులకి కనెక్ట్ చేస్తుంది.  

***

    బిగినింగ్ విభాగమనేది మిగతా కథకి ముఖచిత్రం లాంటిది. దీన్ని సెట్ చేస్తేనే మిగతా కథ దీని సరళిలో సాగిపోతుంది. దీని ఎత్తుగడే భారంగా వుంటే, మిగతా కథా బోలెడు బ్యాగేజీతో భారంగా సాగుతుంది. సైరా పాత్రకి చాలా బ్యాగేజీ వుంది. పుట్టుకకి సంబంధించిన వృత్తాంతం సహా. చుట్టూ బోలెడు పాత్రలు సహా. సోలోగా కాకుండా ఎప్పుడూ క్రౌడ్ లో ఇరుక్కుని వుండడం సహా. ఎవేగా సింగిల్ ఫేస్ టు ఫేస్ యాక్షన్ కాకుండా, గుంపు పోరాటాలు సహా. ప్రారంభ దృశ్యాలతో ఎత్తుగడ ఏదో పౌరాణిక సినిమా చూస్తున్న జానరేతర ఫీలింగ్ నిస్తుంది. ‘ముత్యాల ముగ్గు’ కూడా ఉత్తర రామాయణం కథే. దాన్ని అద్భుత రసం (అడ్వెంచర్) తో ఎంత ఎవర్ గ్రీన్ గా తీశారు. సైరా చరిత్రని ఈ తరానికి చెబుతున్న కథగా చెబుతున్నప్పుడు యూత్ అప్పీల్ అందులో భాగమవుతుంది. యూత్ అప్పీల్ ని భాగం చేసుకున్నప్పుడు ఎత్తుగడ డైనమిక్స్ ని కోరుకుంటుంది, నస లేకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోవడాన్ని డిమాండ్ చేస్తుంది.

          ఉదాహరణకి లక్ష్మీబాయి తన వ్యాఖ్యానంతో సైరా ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించినప్పుడు, డైనమిక్స్ కి రెండు పార్శ్వాలుంటాయి. ఒక పార్శ్వంలో బ్రిటిష్ అధికారి, ఇంకో పార్శ్వంలో ఎదుగుతున్న సైరా. ఎక్కడో వున్న బ్రిటిష్ అధికారి డేగ కన్నుతో క్రూరంగా విహంగ వీక్షణం చేస్తూంటే, ఇంకెక్కడో ఎదుగుతున్న నునులేత సైరా, గురువు గోసాయి వెంకన్నతో కత్తి తిప్పుతూ శిక్షణ పొందే దృశ్యాలు. ఎందుకిలా? ఎందుకంటే జానర్ మర్యాద. డల్ గా ప్రారంభించకుండా, చైతన్యాన్ని నింపే డైనమిక్స్ తో హిస్టారికల్ కథకి ఓపెనింగ్ ఇమేజి. ఈ ఒక్క ఓపెనింగ్ ఇమేజిలోకి మొత్తం కథ ఇంకిపోతుంది. ఈ బిందువులో ఇంకిన కథ ఎక్కడ బిగ్ బ్యాంగ్ తో ఎలా బ్లాస్ట్ అయి బహుముఖాలుగా విస్తరిస్తుందన్న సస్పెన్స్ ని సృష్టిస్తుంది. ఇది యూత్ అప్పీల్, నేటి తరానికి చెప్పేకథ, మార్కెట్ యాస్పెక్ట్ తో క్రియేటివ్ యాస్పెక్ట్. 

          ఓపెనింగ్ ఇమేజి ఇలాగే ఎందుకుండాలి? ఎందుకంటే బ్రిటిష్ అధికారి సైరాని వెంటాడి వేటాడి ఉరి తీయించాడు. అందుకని అతను పులి, సైరా మేక. అందుకే అతడి విహంగ వీక్షణం - మేకపిల్లలా సైరా శిక్షణ. ఎంత ఐరనీ. ఎంత డేంజర్ ఫీలవుతారు ఈ ఓపెనింగ్ ఇమేజితో.

           ఏకంగా యాక్షన్ సీన్ తో హిస్టారికల్ కథని ఎత్తుకోవడం. వివిధ పోరాట కళల్లో గురువుతో శిక్షణ పొందుతున్న సైరా, మాంటేజెస్ తో క్రమంగా ఎదుగుతూ, చిరంజీవి రూపం ధరించగానే -అటున్న అమితాబ్ బచ్చన్ తో కత్తిపోరాటం చేస్తూంటే - ఎత్తుగడే ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కి ఎటాచ్ మెంట్ ఇచ్చేస్తూ ఓపెనింగ్ ఇమేజిని పరాకాష్టకి తీసికెళ్ళి అచ్చు గుద్దితే, ఇక ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలావుంటుందో వూహించుకోవచ్చు. దిసీజ్ డైనమిక్స్. అంటే బ్రిటిష్ అధికారి వర్సెస్ సైరాగా, హిస్టారికల్ పోరాట కథగా, కాన్సెప్ట్ విజువలైజ్ అయిపోయే ఈ  ఓపెనింగ్ షాట్స్ తో, వెంటనే ప్రేక్షకుల్ని లాక్ చేసేసే మ్యాథమేటిక్స్. ఇది నేటి కాలపు సినిమాకి స్క్రీన్ ప్లే రచన. ‘శంకరాభరణం’ లో ఎంత విజువల్ స్టోరీ టెల్లింగ్ వుంటుంది వెర్బల్ స్టోరీ టెల్లింగ్ గాకుండా?  

          క్లుప్తతే చారిత్రిక కథకి ఆభరణం. దీనివల్ల కొన్ని పాత్రలకి, సంఘటనలకి చోటు దక్కకపోవచ్చు. ఫర్వాలేదు. కథలో తలెత్తబోయే సంక్షోభంతో సంబంధంలేని పాత్రలు, సంఘటనలు వాటికవే ఎడిట్ అయిపోతాయి. ఏ వ్యక్తికీ పుట్టిందగ్గర్నుంచీ జీవితం చరిత్ర కాదు. జీవితాన్ని మార్చేసే సంఘటన దగ్గర్నుంచే చరిత్ర. మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో రైల్లోంచి తోసేసినప్పట్నుంచే చరిత్ర. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, అమ్మ ఏం చెప్పింది, నాన్న ఏం చెప్పాడూ చరిత్ర కాదు. అది వేరే ఫ్యామిలీ డ్రామా. హిస్టారికల్ జానర్ కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకోకపోవడం వల్ల తెరమీదికి చిరంజీవి రావడం బాగా అలస్యమైపోయింది, ఆలస్యమయ్యాక  వచ్చినప్పుడు కూడా ఎంట్రీ ఫ్యాన్స్ కి హుషారివ్వ లేకపోయింది. ధ్యానం చేసుకుంటున్న శివభక్తుడిగా సాత్విక దర్శనం.  ఈ భక్తి ఇంకెక్కడా పాత్రవహించలేదు. ఉరితీసేప్పుడు కూడా శివనామ స్మరణ లేదు. అక్కడ కూడా శాంతంలేదు. అదే రౌద్రం, అదే యాక్షన్. సింగిల్ ఎమోషన్. ‘లయన్ ఆఫ్ ది డెజర్ట్’ లో గిరిజన యోధుడు ఒమర్ ముఖ్తార్ ని ఉరి తీసేప్పుడు దైవాన్నిస్మరించుకుంటాడు. ఇది సహజ ప్రక్రియ. ఫీల్. కళ్ళు చెమర్చడానికి వీలిచ్చే, కదిలించే అంతిమ విషాదం.
***

        ఇలా రెండొందల యాభై కోట్ల సినిమా ఎలా తీయాలో కంప్యూటర్ ముందు కూర్చుని ఒకటే రాసేస్తున్నాడన్పించవచ్చు. ఇలా రాయడానికైనా బోలెడు చూడాలి, చదవాలి. ఆ చూసింది, చదివింది అప్లయి చేసి రాయాలి. రాయడమంటే సొంత అభిప్రాయాలని రుద్దడం కాక, నిదర్శనాల్ని ఏకరువు పెట్టడం. 

          సైరాకి ఇద్దరు అతివలతో మొదటి డైనమిక్స్ బావున్నాయి. ఒక అతివకి తాళి కట్టాక, ఇంకో అతివతో ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళయిందని తెలియడం. తెలిశాక ఆమే వుంటుంది, నువ్వూ వుంటావని ఇద్దరికీ బలంగా చెప్పలేకపోవడం మాత్రం డైనమిక్స్ ని బలహీనపర్చింది. ఫీల్ ని పోగొట్టింది. ఇక ఇరుగు పొరుగు పాలెగాళ్ళ డైనమిక్స్ సరిగ్గా కుదరకపోవడానికి వాళ్ళ పాత్రల్ని కలుపు మొక్కల్లా భావించడం కారణం. పెరగనిస్తే సైరాని మింగేస్తాయని.

          ఇక ఈ బిగినింగ్ విభాగంలో తర్వాతి కథకోసం అనేక లీడ్స్ ఇచ్చారు. సైరా జలాసనం సీను ఒకటి. ఇది ఎందుకంటే, క్లయిమాక్స్ లో బ్రిటిష్ దళాల్నుంచి తప్పించుకునే సీనుకి లాజిక్ కోసం. అలాగే కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించే ఆచారంతో ఇంకో సీను. ఇదెందుకంటే, క్లయిమాక్స్ లో మళ్ళీ దీపం వెల్గించ డానికి వెళ్ళినప్పుడు పట్టుబడే సీన్ని కన్విన్స్ చేయడానికి. ఒక దర్శకుడున్నారు. ఏదైనా చెప్తే వెంటనే ఆయన ముందు కథతో పోల్చి చూసుకుంటారు - అక్కడ మ్యాచ్ అవుతుందా లేదా అని. ఆయన ముందు కథ దృష్ట్యానే కథ ఆలోచిస్తారు. అక్కడ మ్యాచ్ కాకపోతే, స్పూన్ ఫీడింగ్ లా వుంటే, వ్యతిరేకంగా వుంటే, తీసేస్తారు. ఇదొక విధమైన ఎడ్యుకేషన్.

          ఇలాటి స్పూన్ ఫీడింగ్ సీన్లలో కొన్ని ఈ బిగినింగ్ విభాగం లోని పైన చెప్పుకున్న రెండు సీన్లు. వీటిని తీసేసి నేరుగా క్లయిమాక్స్ లోనే  పెట్టుకోవచ్చు. అక్కడ అప్పుడవి కొత్తగా అన్పిస్తాయి. మూవీ రన్ మొనాటనీ అన్పించకుండా రీఫ్రెష్ అవుతుంది కూడా. ఇలాటి చాలా సీన్లు లీడ్ గా ఇవ్వడం వల్ల ఏమయిందంటే, సైరా పాత్రని పరిచయం చేయడానికి, లేదా నిర్వచించడానికి, ఒక స్పష్టత లేకుండా క్యారక్టరైజేషన్ కి చాలా చాలా విషయాలు చెప్పడం, సమాచారమివ్వడం, చాలా చాలా బ్యాగేజీ తగిలించడమయింది.

          సుమారు గంటపాటు సాగే ఈ బిగినింగ్ విభాగంలో, హిస్టారికల్ జానర్ లక్షణమైన సస్పెన్స్ ని క్రియేట్ చేసే ఒక్క సీనూ లేదు. ఒక్క సీను ప్రిమానిషన్ గా లేదా ఫోర్ షాడోయింగ్ గా వేసి వుంటే, అది అప్పటికపుడు ఆ క్షణాన సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ బోల్డు ఫీల్ తో, ఆందోళనతో  ప్రేక్షకుల్ని కూర్చోబెట్టేసేది. కథనమంటే ప్రశ్న రేకెత్తించడం, జవాబు నాపడమే. ఈ బిగినింగ్ విభాగంలో వృధా అయిన కార్తీక పౌర్ణమి నాడు సైరా దీపం వేల్గించే సీనుతో దీన్ని సాధించవచ్చు. సైరా దీపం వెల్గించాక అది టప్పున ఆరిపోవడంతో.

          వెల్గించిన దీపం ఆరిపోవడం సైరాకి అపశకునం (ప్రిమానిషన్), కథనానికి పరిణామాల హెచ్చరిక (ఫోర్ షాడోయింగ్). ఇది సృష్టించే సస్పెన్స్, ఫీల్ మామూలైనవి కావు. మళ్ళీ క్లయిమాక్స్ లో ఇదే దీపం వెల్గిస్తున్నప్పుడు ఆ సస్పెన్స్ టెర్రర్ గా మారి ఉత్కంపఠ రేపే ఫీల్ కి దారితీస్తుంది. ఒక సీను వేస్తే అది కథకుపయోగాపడాలి, లీడ్ కోసం స్టేల్ గా వేసుకోవడం కాదు, వృధా చేసుకోవడం కాదు. ఆలోచించి కథనం చేసినప్పుడు, ఆలోచిస్తూ అనుభవిస్తూ కథనం చూడ్డం సాధ్యమవుతుంది. ఆలోచనకి తావివ్వని, అనుభవానికి వీలివ్వని కథనం జవజీవాల్లేని యాంత్రికమే.     
***

     ప్రతినాయకులైన బ్రిటిష్ పాత్రలలో కూడా ఫీల్ కన్పించదు. కమర్షియల్ సినిమా విలన్ అరుపులే, వీరంగాలే. సైలెంట్ గా సైరా చాపకిందికి నీళ్ళు తెచ్చే కుయుక్తులు కన్పించవు. దొంగదెబ్బ తీసే సస్పెన్స్ వుండదు. ఓపెన్ గా - వెళ్ళండి వాళ్ళని తన్నండి -  లాంటి డైలాగులతో నిస్సారంగా అరవడంగానే వుంది ఎంతసేపూ. వాళ్ళు తెలుగు సినిమా విలన్స్ కాదు, బ్రిటిషర్స్. బ్రిటిష్ మిలిటరీ పెద్దల ప్రవర్తన ఎలా వుంటుందో తెలుసుకోవడానికి ఆ బ్రిటిష్, హాలీవుడ్ సినిమాలున్నాయి.   

          ప్లాట్ పాయింట్ వన్ సీనుగా సైరా ముఖాముఖీ సవాలు విసిరి జూనియర్ బ్రిటిష్ అధికారిని తోకముడిచి పారిపోయేలా చేసే ఘట్టంగా వచ్చింది. కానీ చరిత్రలో ఉయ్యాలవాడని ముందుగా పిల్చి మాట్లాడినట్టుగా వుంది. ఇది సహజ ప్రక్రియ. చర్చలు విఫలమైతేనే పోరాటాలు మొదలవుతాయి. అలా బ్రిటిష్ సీనియర్, జూనియర్ అధికారులకీ సైరాకీ ముందుగా ఒక చర్చల ఘట్టం వుండాల్సింది. అప్పుడు ఎలాగూ విఫలమయ్యే చర్చల ఘట్టంలో సైరా పాత్రకి గోల్ ఎలిమెంట్స్ సమకూరి కథ బలీయమయ్యేది. కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అనే గోల్ ఎలిమెంట్స్. బ్రిటిషర్లతో ముఖాముఖీ చర్చల ఘట్టం వల్ల సైరాలోని దౌత్య, నేతృత్వ, రాజనీతి లక్షణాలు వ్యక్తమయ్యేవి. రాజకీయంగా పాత్రేమితో అర్ధమయ్యేది. కరువు కాటకాల్లో కూడా పన్నులు ఎందుకు కట్టాలో, కట్టకూడదో, ఈ సమావేశపు ఎజెండా. ఆ నాటి నుంచీ రాయలసీమ కరువు సీమేనన్నబ్రతుకు చిత్రం ప్రేక్షకులకి ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఫీలవ్వాలి.
(..the hardest part is making a story set in the past resonate with today’s audiences …Ironically, however, what makes a period picture commercially viable in today’s market, whether it’s a TV mini-series or feature movie, is not covering the same old story but finding something new ― Jon James Miller). ఈ సమావేశంలో కూడా రౌద్రంగా మాస్ అరుపులు అరవకుండా,హూందాతనంతో ఆనాటి రేనాడు రాచమర్యాదలెలా వుండేవో చిత్రించి, చర్చల్ని విఫలం చేస్తే, దీని ఫలితంగా బ్రిటిషర్లతో పరిణామాలెలా వుంటాయో, సైరా తీసుకుంటున్న రిస్క్ ఎంత అపాయకరమో ప్రేక్షకులు ఫీలయ్యేట్టు చేస్తే, సైరా గోల్ ఎలిమెంట్స్ సమకూరి బలమైన కథ పుట్టేది. ఈ నేపధ్యంలో యాక్షన్, జూనియర్ అధికారిని తరిమికొట్టడం వగైరా సైరా తెగింపుతో రియల్ అడ్వెంచర్ కి అద్భుతంగా తెరతీసేది.
(సశేషం)
సికిందర్   

Sunday, October 13, 2019

882 :


      హాలీవుడ్ మెగా దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అక్టోబర్ 2 న విడుదలైన ‘జోకర్’ చూసేందుకు వెళ్ళిన ప్రేక్షకులకి తన రాబోయే ‘టెనెట్’ టీజర్ తో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆన్ లైన్లో విడుదల చేయకుండా, లీక్ కానివ్వకుండా, థియేటర్లకే పరిమితం చేసిన ఈ టీజర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. “Time has come for a new protagonist”,  “Time has come for a new kind of mission.” అని రెండు క్యాప్షన్ లిస్తూ కంటెంట్ పరంగా మూవీ పట్ల చాలా కుతూహలం రేకెత్తించాడు. కొత్త కథానాయకుడు రావాల్సిన సమయం వచ్చిందంటూ, కొత్త లక్ష్యాన్ని చేపట్టే సమయం కూడా వచ్చిందంటూ జాన్ వాషింగ్టన్ నడిచి వస్తూండగా చూపించాడు. గన్ షాట్ రంధ్రమున్న అద్దం వెనకాల వాషింగ్టన్... ఈ టీజర్ ని ఇంతకంటే రివీల్ చేస్తే స్పాయిలర్ అవుతుంది. థియేటర్ కెళ్ళి చూసి తెలుసుకోవాల్సిందే. నోలన్ విసిరిన పై రెండు సవాళ్లు మాత్రం వెంటాడేవే. కొత్త కథానాయకుడా? అతనెలా ఎలా వుంటాడు? కొత్త లక్ష్యమా? అదెలా వుంటుంది? మూస కథా నాయకుల్నీ, మూస కథల్నీ తెగ చూసి వున్న మనకి రిలీఫ్ గా సంభవామి యుగే యుగే అన్నట్టు సమ్ థింగ్ ఏదో గట్టిగా జరగాలనే ఎదురుచూస్తున్నాం...నోలన్ జరిపిస్తాడని ఆశిద్దాం.

        నోలన్ చర్యతో ప్రపంచవ్యాప్తంగా జవాబు దొరకని ఇంకో ప్రశ్నేమిటంటే, ఎప్పుడో ఒక జీవిత కాలం తర్వాత జులై 17, 2020 న విడుదల పెట్టుకుని, ‘టెనెట్’ కి ఇప్పట్నించే టీజర్ ఏమిటాని!  పోతే, గత నెలే ముంబాయిలో కొంత షూటింగ్ ముగించుకున్నాడు. ఆ షూటింగులో భాగంగా రాత్రి పూట ఎత్తయిన భవనం మీంచి దూకే దృశ్యాన్ని ఒక ముంబయికార్ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టేశాడు. టీజర్ లీక్ కాలేదు, మూవీ లీకైంది? అన్నట్టు ఈ ‘టెనెట్ ‘ టీజర్ తో ‘జోకర్’ కి ప్లస్ అయిందా, లేక ‘జోకర్’ తో  ‘టెనెట్’ కి పబ్లిసిటీ వచ్చిందా? ఈ వ్యూహ మేమిటో టాలీవుడ్ కూడా అమలు చేయొచ్చేమో...ప్రెస్ మీట్ పెట్టి టీజర్స్ ని మీట నొక్కి యూట్యూబ్ లో వూరూ వాడా చేసేయకుండా? ఆన్ లైన్ కోలాహలంలో ఏ టీజర్ అడ్రసు ఎక్కడ గల్లంతో ఎవరికీ తెలియడం లేదు. ఫలానా ‘సైరా’ తో  ‘వెంకీమామ’ స్వీట్ టీజర్ థియేటర్లో మాత్రమే చూడండి...అంటే ఎలా వుంటుందో నోలన్ ఫార్ములాతో  ఒక ట్రయల్ లాంటిది వేసి చూడొచ్చేమో...

         
‘జోకర్’ కథాకాలం 1981 అయినా నేటి వ్యవస్థకి కూడా అద్దం పడుతుంది దేశాల కతీతంగా. ఇతను నవ్వించే జోకర్ కాదు, నవ్వకూడని సమయాల్లో నవ్వొచ్చి నవ్వుకునే, తన్నులు తినే జోకర్. ఒక మెడికల్ కండిషన్ వల్ల. ఆ నవ్వు వెనకాల వ్యవస్థ మీద కసి వుంది. 1980 ల నాటి మన సినిమాల్లో యాంగ్రీ యంగ్ మాన్ లాంటి వాడే ఇతను. కాకపోతే ఇతడి నవ్వు వెనకాల యాంగ్రీ వుంది. మన యాంగ్రీ యంగ్ మాన్ సినిమాల్లో లాగే ఇతను అక్రమ సంతానం. చిన్నప్పుడు ఇతడి తండ్రి తల్లిని మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆ తల్లి గురించి కూడా ఒక రహస్యం తెలిసింది. వీళ్ళిద్దర్నీ ఎలా డీల్ చేశాడన్నది ఒక పక్క. ఇంకోపక్క కామెడీ షోలలో తనని అవమానపరుస్తున్న యాంకర్ అంతు ఎలా చూశాడన్నది. “అరె బాబూ యాంకర్, బయట లోకమెలా వుందో చూశావా? నువ్వెప్పుడైనా స్టూడియో వదిలి బయటికొచ్చావా? స్టూడియోలో నల్గుర్ని కూర్చోబెట్టుకుని లడాయిపెట్టి ఒకటే అరిపిస్తావా? డీసెన్సీ అనేదే చచ్చి పోయింది...అందరూ నీలాగే ఆలోచించాలా? నా లాగా నువ్వు ఆలోచించవా?”  అని గన్ తీసి ఢామ్మని షూట్ చేసి పారేస్తాడు యాంకర్ని.  అదే అతడి చివరి లైవ్ షో!

         
చివరికి సైకియాట్రిస్టు ఎందుకు నవ్వుతున్నావని అడిగినప్పుడు, జోకు గుర్తొచ్చి అంటాడు.  చెప్పమంటుంది. నీ కర్ధంగాదంటూ ఫినిషింగ్ టచ్ ఇస్తాడు. అంటే ప్రజల మనసులో ఏముందని కాదు, తాము అనుకుంటున్నది ప్రజల మీద రుద్దాలనే పాలకులు. నగర పరిస్థితి సామాజికంగా, ఆర్ధికంగా బాగాలేదు. ఉపాధిలేక ఆ కోపాన్ని యువకులు ఇతరుల మీద మూక దాడులు జరుపుతూ తీర్చుకుంటున్నారు. అలాటి బాధితుల్లో ఒకడు జోకర్ కూడా. సామాజిక, ఆర్ధిక న్యాయాలు లేని నగరమెంత కుళ్ళి కంపు కొడుతోందో సింబాలిక్ గా స్తంభించిపోయిన పారిశుద్ధ్య పనులు. నగరమే ఒక చెత్తకుండీ. భరించలేక ఇక పౌరులు ప్రభుత్వాన్ని వెక్కిరిస్తూ జోకర్ మాస్కులు తగిలించుకుని హేళనగా ప్రదర్శనలు. ఇది ప్రభుత్వం మీద కాదు, సంపన్నుల మీద జరుగుతున్న దాడులని యాంకర్ మసిపూసే ప్రయత్నం. ఒక సంపన్నుడు నగర మేయర్ గా పోటీకి దిగుతాడు. జోకర్ ఒక సోషల్ కామెంట్. నాటి కథాకాలాన్నిచూపిస్తూ సింబాలిక్ చేశారు. ‘జోకర్’ గా  నటించిన జోక్విన్ ఫీనిక్స్ ఆస్కార్ మెటీరియల్.  యాంకర్ గా నటించిన రాబర్ట్ డీ నీరో సీనియర్ స్టార్. దర్శకుడు టాడ్ ఫిలిప్స్. ఎబిపి ఛానెల్ మాజీ యాంకర్ పుణ్య ప్రసూన్ బాజ్ బాయ్, ‘జోకర్’ పై హిందీలో చేసిన లోతైన విశ్లేషణ కోసం ఇక్కడ యూట్యూబ్ క్లిక్  చేయండి. ‘జోకర్’ ఇప్పుడు గ్లోబల్ టాపిక్.

         
తవారం కొత్త హీరో హీరోయిన్లతో ‘ఎవరికీ చెప్పొద్దు’ అనే ఇంకో  పాత ప్రేమ డ్రామా విడుదలైంది. ఇందులో కొత్త దర్శకుడికి కులాలతో పాత కథ గుర్తొచ్చింది. యువత కోసం ఎలాటి సినిమా తీస్తున్నాడో గుర్తుకు రాలేదు. దిల్ రాజు విడుదల చేస్తూంటే దిల్దార్ గా యువత చూసేస్తారనుకున్నట్టున్నాడు. యువతకి కొత్త వాళ్ళతో  ఏ చిన్నసినిమా అందం చందం ఏమిటో చూడకుండానే మోకాలొడ్డే యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామై వుంది. దాంతో వాళ్ళు ‘ఎప్పటికీ  రానే రాము ఫో’ అని భీష్మించేసుకున్నారు. ఇలాటి చిన్న సినిమాల రిపోర్టు కార్డెలా వుందంటే, నూటికి  99 శాతం రివ్యూలకే నోచుకోవు. అన్నీలాలీ పాప్ సినిమాలే రివ్యూలతో ప్రమోట్ చేద్దామంటే. ఈ కులాల కథ చెప్పడానికి యూత్ అప్పీల్ ని మంటగలిపి, లాలిస్తూ హీరోయిన్ పుట్టిందగ్గర్నుంచీ ఎత్తుకున్నాడు. కథని ఇలా లాలిస్తూనే, పాలు పట్టిస్తూనే, అన్నప్రాసనాలు చేయిస్తూనే, అక్షరాలు దిద్దిస్తూనే, ఉ ళు ళు ళూ హాయీ అంటూ ఉయ్యాల్లో జోకొడుతూనే, అరగంట లాగాడు. దీనికి కొత్త హీరోనే నిర్మాత. హీరోయిన్ తండ్రికి బాగా మందమైన కులం కండువా. అక్కడ హీరో గారికి మండువా లోగిలి లేదు. ఎలా? ఏమో మనకి తెలీదు. మనం దర్శకుడంత సామాజిక ఇంటలెక్చువల్స్ ఏమీ కాము. ఇంటర్వెల్లో ఇంటి కొచ్చేస్తాం. ముందు రివ్యూలకైనా నోచుకునేట్టు తీయండ్రా నాయనా చిన్న సినిమాలు! వీటిలో కొత్త హీరో హీరోయిన్లతో, కొత్త నిర్మాతలతో, కొత్త దర్శకులకి ఎలాటి క్రియేటివ్ ఆటంకాలుండవు. సృజనాత్మకంగా ఇంత స్వేచ్ఛ ననుభవించే చోట్ల నుంచి కూడా ఈ మార్కెట్ వ్యతిరేక  పాత రోతేమిట్రా బాబూ...

సికిందర్

Saturday, October 12, 2019

881 : స్క్రీన్ ప్లే సంగతులు - 1



        స్క్రీన్ ప్లే సంగతుల జాప్యానికి కారణం ‘సైరా’ పానిండియా స్పందనల వరకూ  వేచి చూడాల్సి రావడం. ‘సైరా’ స్క్రీన్ ప్లే సంగతుల్లో సినిమా కలెక్షన్స్ ని కూడా భాగం చేసి చెప్పుకోక తప్పడం లేదు. సినిమా కలెక్షన్స్  ట్రేడ్ పండితులు విశ్లేషించే సెక్షనే. కానీ స్క్రీన్ ప్లేలకి క్రియేటివ్ యాస్పెక్ట్ తోబాటు మార్కెట్ యాస్పెక్ట్ ని కూడా ముందు చూడాలని చాలా స్క్రీన్ ప్లే సంగతుల్లో చెప్పుకుంటూనే వున్నాం. అయితే ఇప్పుడు పానిండియా మూవీ అనే కొత్త ‘జానర్’ తెలుగులో మొదలవడంతో ఇప్పుడు స్క్రీన్ ప్లేలకి మార్కెట్ యాస్పెక్ట్ ని కేవలం తెలుగు మార్కెట్ కే పరిమితం చేసేయకుండా, ఇతర భాషల మార్కెట్లకి సైతం విస్తరించి చూడాల్సి వచ్చేలా వుంది. 2015 లో  ‘బాహుబలి’ 4 భాషల్లో విడుదలైనప్పుడు పానిండియా మూవీ పదం వాడకంలోకి రాలేదు. 2017 లో ‘బాహుబలి -2’ కి కూడా పానిండియా మూవీ పదం వాడలేదు. 2015 లో ‘కంచె’ నైతే దాని పానిండియా మార్కెట్ ని కూడా గుర్తించకుండా కేవలం తెలుగులోనే విడుదల చేశారు. ఇటీవల ‘సాహో’ తోనే పానిండియా మూవీ అన్నపదం పాపులరైంది. దీని తర్వాత ఇప్పుడు తెలుగు పానిండియాగా ‘సైరా’ ఐదు భాషల్లో విడుదలైంది. ‘సాహో’ వేరు, అది యాక్షన్ మూవీ. దాని పానిండియా మార్కెట్ కి నేటివిటీ సమస్య వుండదు. అది హిందీలో  సేఫ్ అయింది. ‘సైరా’ లాంటి చారిత్రాత్మకం విషయం వేరు, దీనికి నేటివిటీ సమస్య వస్తుంది. దక్షిణాది చరిత్రలు పానిండియా మూవీస్ గా ఉత్తరాది ప్రేక్షకులకి కనెక్ట్ కాలేవని ‘సైరా’ చెబుతోంది. దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యాన్ని నార్తిండియా ఎప్పుడు గుర్తించింది గనుక. ఆ మాట కొస్తే ‘సైరా’ కి దక్షిణాదిలో కూడా  తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కనెక్ట్ కాలేదని కలెక్షన్లు చెబుతున్నాయి. అంటే దక్షిణాదిలో కూడా చారిత్రక సినిమాలకి ఏ రాష్ట్రానికా రాష్ట్రం వరకే పరిమితమయ్యే నేటివిటీ సంకెళ్ళు వుంటాయన్న మాట. ఒకప్పుడు శివాజీ గణేశన్ తో ‘వీర పాండ్య కట్ట బ్రహ్మన’ తెలుగులో డబ్ చేస్తే ఆడలేదు. శివాజీ గణేశన్ ఎంత గొంతు చించుకుని వీరత్వం ప్రదర్శించినా ఆడలేదు. దక్షిణాదిలో  కూడా ఏ రాష్ట్రం వీరుడు ఆ రాష్ట్రంలోనే అరచుకోవాలన్న మాట. అయ్యప్ప, భక్త కన్నప్ప, భక్త సిరియాళ లాంటి దేవుళ్ళ  సినిమాలతో దక్షిణాది రాష్ట్రాలలో నేటివిటీ సమస్య రాలేదు, రాబోదు కూడా. దైవ భక్తికి ప్రాంతాలతో పనిలేదు. స్థానిక వీరులకి ప్రాంతాలే పరిమితులు. పానిండియా కాలేరు. ‘సైరా’ కాలేదు. దీంతో ‘ఆర్ ఆర్ ఆర్’  అనే పానిండియా తీస్తున్న ఎస్ ఎస్ రాజమౌళి  వెంటనే స్క్రిప్టుని కొంత ‘నార్తీ కరిస్తున్నట్టు’ వార్తలు వచ్చాయి. అందులో అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం పాత్రలు ఢిల్లీలో కలుసుకున్నట్టు నార్తీ కరణ!

         
సౌతీకరణకే స్థానిక చరిత్రల మార్కెట్ లొంగడం లేదు. కొంత కథని నార్తిండియాకి బదలాయించినంత మాత్రాన ఇతర భాషల్లో నేటివిటీ వచ్చేస్తుందా? ఒక్కో భాష నుంచి ఒక్కో పాపులర్ నటుడ్ని పెట్టుకున్నా స్థానిక వీరుడితో ‘సైరా’ పానిండియా నేటివిటీ కష్టమైనట్టు కన్పిస్తూనే వుంది. సైరా పానిండియా కనెక్ట్ అవడానికి ఒక ప్రయత్నం చేశారు : ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి  చరిత్రని ఝాన్సీ లక్ష్మీ బాయి చెబుతున్నట్టు కల్పన చేసి, ఫ్లాష్ బ్యాకుగా చూపించారు. ఆమె రికమెండ్ చేస్తోంది కాబట్టి మనం చూడాలన్నట్టుగా పానిండియా ఆడియెన్స్ ని బుజ్జగించాలని చూశారు. ఇది వర్కౌట్ కాలేదు. మూలంలో సార్వజనీనత లేనప్పుడు ఉపరితలంలో ముస్తాబులు ఊపిరి పోయలేవు. ఈ సమస్యకి పరిష్కారం ఇక లోకల్ చరిత్రలకి కొత్తగా పానిండియా జానర్ మర్యాదలేముంటాయో వాటిని కనుగొని, టేకప్ ఇండియా అంటూ దేశం మీదికి వదలడం.  తెలుగు జానర్ మర్యాదలతో తీస్తే ఆలిండియా జానర్ మర్యాద అయిపోదు. కానీ ‘సైరా’ చరిత్రకి హిస్టారికల్ మూవీస్ జానర్ మర్యాదలతో చూసినా లోపాలున్నాయి. పానిండియాగా విఫలమైతే, తెలుగు మార్కెట్ కైనా సేఫ్ అవడానికి దీనికి పెట్టిన భారీ బడ్జెట్ భారమంతా ఒక్క తెలుగు మార్కెట్ పైనే ఇప్పుడు పడుతోంది. ఇంత మెగా బడ్జెట్ ని తెలుగు మార్కెట్ ఒక్కటే లాగ గలదా? లాగలేదు. అయినా ప్రయత్నించాలంటే రిపీట్ ఆడియెన్స్ వుండాలి. ఇంత ప్రతిష్టాత్మక చలన చిత్ర రాజం తీసినప్పుడు ప్రేక్షకులకి మళ్ళీ మళ్ళీ చూడాలన్పించేలా రసాత్మకంగా వుండాలిగా?

          
తెలుగు మార్కెట్ కైనా మళ్ళీ మళ్ళీ చూడాలన్పించేలా రసాత్మకంగా లేకపోవడమే ప్రధాన సమస్య. యాక్షన్, ఎమోషన్ తప్ప, ఫీల్ అనే అమృతపానీయం జాలువారలేదు. దీన్నెలా అధిగమించ వచ్చు? పైన చెప్పుకున్నట్టు ఇంకా ఇప్పుడే చెప్పలేని పానిండియా జానర్ మర్యాదలు కాకపోయినా (టేకప్ ఇండియా), కనీసం హిస్టారికల్ జానర్ మర్యాదల్ని పాటించి అధిగమించవచ్చు. ‘సాహో’ లాంటి యాక్షన్ సినిమాలకి పానిండియా జానర్ మర్యాదలు చెప్పుకోవచ్చు. కానీ స్థానిక వీరుల చరిత్రల్ని పానిండియా చేయడానికి ఆ వీరులే అడ్డు. కనుక కొత్తగా వీటి పానిండియా జానర్ మర్యాదలు నిర్ణయించడం అంత సులభం కాదు. హిస్టారికల్ మూవీస్ జానర్ మర్యాదల్ని ఆపాదించినా నేటివిటీ సమస్య తొలగదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎవరికీ తెలీని, కాలగర్భంలో కలిసిన, పంజాబ్ కి చెందిన, హవల్దార్ ఇషార్ సింగ్ చరిత్రతో ‘కేసరి’ లాంటివి తీసినా చూస్తారు. తెలుగు నుంచి ఎంత ప్రముఖ చరిత్ర తీసినా ఉత్తరాదికే కాదు, ఇతర దక్షిణాది  రాష్ట్రాలకీ పట్టదని ‘సైరా’ పానిండియా బాక్సాఫీసు రిపోర్టులు తేల్చి చెప్తున్నాయి. ఇప్పుడు రాబోయే ‘ఆర్ ఆర్ ఆర్’ తప్ప, స్థానిక చరిత్రతో ఇంకే పానిండియా మూవీస్ రాకపోవచ్చు కూడా. కనుక, వీటి జానర్ మర్యాదల (టేకప్ ఇండియా) చర్చ ఇప్పుడవసరం లేదు.

          
తెలుగు మార్కెట్ కే హిస్టారికల్ జానర్ మర్యాదల ప్రకారం ‘సైరా’ చూసినప్పుడు పెద్ద పెద్ద కందకాలు కన్పిస్తున్నాయి. రివ్యూ రాయడానికి ఈ సినిమా చూస్తున్నప్పుడే ఒక ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’, ఇంకో ‘లయన్ ఆఫ్ ది డెజర్ట్’ రేంజికి ఫీల్ తో తీసికెళ్ళాలి కదా అన్పించక మానలేదు. ఎందుకు రోటీన్ తెలుగు మూస యాక్షన్ - ఎమోషన్ చట్రంలో పెట్టి తీసేశారు? పరుచూరి బ్రదర్స్ ఇచ్చిన స్క్రిప్టుని, ఈ తరం వారికి  చెబుతున్న కథలా మార్చుకుని తీశానని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పినప్పుడు, యాక్షన్ జానరేనా ఈ చరిత్రకి ఈ తరం కనెక్టయ్యే మార్గం? వీరుల చరిత్రలు తీయాలనుకున్నప్పుడు వాళ్ళ మీద ఏళ్లకేళ్ళు  పరిశోధనలు మాత్రమే చేస్తే చాలదు, ఆ చరిత్రల్ని దృశ్యాత్మకంగా ఏవిజన్లో పెట్టి తీయాలన్న దానిపై కూడా బోలెడు చారిత్రక సినిమాల రీసెర్చి జరగాలి. మనకి తోచిన, మనకి తెలిసిన చట్రంలో పెట్టి తీసేస్తే కాదు. ఓపెనింగ్స్ వుంటాయి, రిపీట్ ఆడియెన్స్ వుండరు.

(స్క్రీన్ ప్లే సంగతులు సోమవారం)
సికిందర్

Monday, October 7, 2019

880: రివ్యూ


దర్శకత్వం : సిద్ధార్థ్ ఆనంద్
తారాగణం : హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్, అనుప్రియా గోయెంకా, దీపాన్నితా శర్మ, సోనీ రాజ్దాన్, ఆశుతోష్ రాణా తదితరులు
కథ : ఆదిత్యా చోప్రా, సిద్ధార్థ్ ఆనంద్; స్క్రీన్ ప్లే : సిద్ధార్థ్ ఆనంద్, శ్రీధర్ రాఘవన్; మాటలు : అబ్బాస్ టైర్ వాలా, సంగీతం : విశాల్ - శేఖర్, ఛాయాగ్రహణం : బెన్ జాస్పర్
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్
నిర్మాత : ఆదిత్యా చోప్రా

***

        యాక్షన్ సినిమాలు తగ్గి స్పై థ్రిల్లర్స్ పెరుగుతున్నాయి.  రోమియో అక్బర్ వాల్టర్, నామ్ షబానా, రాజీ, టైగర్ జిందా హై... ఇప్పుడు ‘వార్’. ఈసారి ఇద్దరు సీనియర్, జూనియర్ యాక్షన్ స్టార్స్  హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లతో  డిఫరెంట్ స్పై థ్రిల్లర్ ని ప్రయత్నించారు. ప్రయత్నించిన దర్శకుడు ‘సలాం నమస్తే’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్. నిర్మించిన బ్యానర్ ప్రసిద్ధ యశ్ రాజ్ ఫిలిమ్స్. ఇది డిఫరెంట్ ఎందుకంటే దీనికి యాక్షనే తప్ప కంటెంట్ పట్టలేదు. అయినా బాక్సాఫీసుని వూపుతోంది. ఇదే కొత్త సక్సెస్ మంత్రమైతే  ఇక హాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ల మీద ఆధారపడాల్సిందేనా? వాళ్ళు లేని యాక్షన్ సినిమాలు ఇక సాధ్యం కావా? వాళ్ళుంటే ఇక కంటెంట్ అవసరం లేదా?  కంటెంట్ లేక హాలీవుడ్ యాక్షన్ తో ‘సాహో’, ‘బందోబస్త్’ లు ఫ్లాపయ్యాయి. కంటెంట్ లేని యాక్షన్ తో ఎప్పుడో అదృష్టవశాత్తూ ‘వార్’ లాంటి అద్భుతాలు జరుగుతాయా? పరిశీలిద్దాం...
కథ
       ‘రా’ – రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (భారత రహస్య గూఢచార సంస్థ) ఏజెంట్ ఖాలిద్ రెహ్మానీ (టైగర్ ష్రాఫ్) కి, ‘రా’ కి విరోధిగా మారిన ఏజెంట్ కబీర్ లూథ్రా (హృతిక్ రోషన్) ని చంపమని  ఆపరేషన్ని అప్పజెప్తాడు ‘రా’ చీఫ్ కల్నల్ లూథ్రా (ఆశుతోష్ రాణా). ఖాలిద్ కబీర్ కింద పని చేసిన జూనియర్. గతంలో  ‘రా’ మాజీ ఏజెంట్ అయిన ఖాలిద్ తండ్రి శత్రువులతో చేతులు కలిపి దేశ ద్రోహం చేశాడు. కబీర్ అతణ్ణి వెతికి పట్టుకుని చంపేశాడు. భర్త వల్ల కుటుంబం మీద పడ్డ దేశద్రోహం మచ్చకి ఖాలిద్ తల్లి (సోనీ రాజ్దాన్) వేదనతో వుంది. ఈ మచ్చని రూపుమాపాలని పట్టుదలతో ఖాలిద్ ‘రా’ లో ఏజెంట్ గా చేరాడు. దీంతో అడుగడుగుబా అతడి నిజాయితీ, దేశ భక్తీ పరీక్ష నెదుర్కొంటున్నాయి. నిరంతరం వీటిని నిరూపించుకునే పనిలో వున్నాడు. ఇప్పుడు తన సీనియర్ని వెతికిపట్టుకుని చంపే బాధ్యత మీద పడింది. ఈ బాధ్యత నెరవేర్చగలిగాడా? తన దేశభక్తిని ఎలా నిరూపించుకుని కుటుంబం మీద పడ్డ మచ్చని తొలగించుకోగలిగాడు? అసలు కబీర్ తను పనిచేసే ‘రా’ కి ఎందుకు విరోధిగా మారాడు? అలా మారి అతనేం చేస్తున్నాడు? విదేశంలో వుంటున్న క్రిమినల్ బిజినెస్ మాన్ రిజ్వాన్ ఇలియాసీ (సంజీవ్ వాస్త) తో కబీర్ కేం సంబంధం? ఫేషియల్ సర్జరీలు చేసే డాక్టర్ మల్లికా సింఘాల్ (దీపాన్నితా శర్మ) ఎలా ఇలియాసీతో ఇన్వాల్వ్ అయింది? ఇంకో ‘రా’ ఏజెంట్  సౌరభ్ ఎందుకు రిజ్వాన్ పక్షాన చేరాడు? వీటన్నిటి నేపథ్యంలో బద్ధ శత్రువులైన కబీర్ - ఖాలిద్ ల మధ్య వార్ ఎలాముగిసింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
      ఈ స్పై జానర్ కథ చివర్లో కబీర్ పాత్ర చెప్పినట్టు ఖాలిద్ పాత్రది, ఈ వార్ కి హీరో అతనే. ఇలా ఈ సారి స్పై జానర్ కథని ఈ వర్గం పాత్ర దేశభక్తిని నిరూపించేందుకు వినియోగించారు. అరడజను హిందీ  సినిమాల్లో ఈ వర్గం పాత్ర దేశ భక్తిని నిరూపించి నిరూపించి వున్నారు. ఇంకా పరీక్షించి నిరూపించాలి. బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ దేశభక్తిని ఒక మోడీ భక్తురాలైన యాంకర్ ప్రశ్నించినప్పుడు, ఎవరేం  అనుకున్నా దేశంతో తనకున్న ప్రేమ అంగుళం కూడా  చెక్కు చెదరదనేసి చప్పట్లు మోగించుకున్నాడు పబ్లిక్ సభలో. జనాభాకి రెచ్చగొడితే ఎన్నికల్లో తప్ప, సినిమాల్లో దేశభక్తి సమస్యే కాదు. అయినా నార్త్ మీడియాలో, బాలీవుడ్ లో ఈ వర్గం దేశభక్తి అమ్ముడయ్యే ఫార్ములాగానే  భావిస్తున్నారు. గతంలో ఈ పాత్రలు హీరో పాత్ర కోసం ప్రాణాలర్పించే పాత్రలుగా వుండేవి. ఇప్పుడు దేశం కోసం ప్రాణాలర్పిస్తేనే దేశ భక్తి  అన్నట్టుగా చూపిస్తున్నారు. జనాభాలో కొద్ది శాతం మంది కోసం ఎవ్వరూ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ కి అవసరం లేని ఈ మూస భావజాలం అనవసరంగా ప్రేక్షకుల మీద రుద్దడమే. ఈ విధంగా ఈ కథకి  కథా ప్రయోజనమంటూ ఏమీ లేదు. చివరికి ఖాలిద్ కి మరణానంతర మెడల్ ని అతడి తల్లికి ‘ప్రధాని నరేంద్ర మోడీ’ అందిస్తున్నట్టు ముచ్చటైన ఓదార్పు ముగింపు! దేశంలో ఒక వర్గాన్ని ఏ మినహాయింపులూ లేకుండా నెగెటివ్ గా చూపడంలో ఉత్సాహం పెరుగుతూంటే, వాస్తవ దూరంగా ఈ కథని అందించారు.

          ఈ కథతో మౌలిక సమస్య ఒకటుంది. ఇంతా చేసి దేశభక్తి నిరూపించుకోవాల్సిన పాత్ర అనుమానాస్పదంగా వుంది.
 కబీర్ ని చంపమని బాస్ అప్పగించిన పనిని దేశం కోసం డ్యూటీగానే  ఖాలిద్ చేస్తున్నాడా,  లేక కబీర్ తన తండ్రిని చంపాడన్న పగతో చేస్తున్నాడా అన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమస్య తలెత్తింది. తండ్రి వల్ల పడ్డ దేశద్రోహం మచ్చ తొలగించుకోవడానికే  ‘రా’ లో చేరినప్పుడు, ఆ దేశ ద్రోహి తండ్రిని చంపిన వాణ్ణి చంపాల్సి వస్తే, అది దేశభక్తి నిరూపణ కోసమే  చేస్తున్నట్టు ఎలా నమ్మాలి? ఇంకో హఫీజ్ సయీద్ నో, దావూద్ ఇబ్రహీంనో చంపడానికి బయల్దేరితే అది దేశభక్తి అని నమ్మొచ్చు గాని?

         ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వ్యక్తిగత పగ - దేశ భక్తిలతోనే కాదు, ఇంకా కలగాపులగం చేస్తూ గురుశిష్య సంబంధంతోనూ వుంది. ఖాలిద్ జూనియర్, కబీర్ శిక్షణ నిచ్చిన సీనియర్. గురువుగార్ని చంపడానికి మనసెలా ఒప్పుతుంది. ఒకవేళ చంపినా దేశం కోసమా, పగకోసమా? 

        గత వారం ‘అర్బన్ నక్సల్’ ఆరోపణలు ఎదుర్కొంటున్న హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లఖా కేసు విచారించడానికి ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు సుప్రీం కోర్టు జడ్జీలు నిరాకరించారు. కారణాలు చెప్పలేదు. వాళ్ళలో ఒక జడ్జికి కాన్ఫ్లిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమస్య ఎదురైనట్టుందని అనుకున్నారు. ఆయన గతంలో నవ్లఖా తరపున లాయర్ గా ఒక కేసు వాదించాడు. కనుక ఇప్పుడు జడ్జిగా కేసు విచారిస్తే అధికారాన్నుపయోగించుకుని వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకున్నట్టుగా  అవుతుందని (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్), అందువల్ల  కేసు తిరస్కరించి వుంటారని భావించారు.

         
 ఖాలిద్ పాత్ర కూడా ఈ సిట్యుయేషన్లోనే వుంది. ఇతడికి ‘రా’ చీఫ్, కబీర్ ని చంపే డ్యూటీ వేయనేకూడదు. వేస్తే ఖాలిద్ పగతో, దేశంతో, శిష్యరికంతో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కారణం చెప్పి తిరస్కరించాలి. అలా చేస్తే ఈ కథే వుండదు. కనుక ఈ కామన్ సెన్సుని చంపి, అంటీ ముట్టని పాత్రలతో అంటీ ముట్టని కథ నడిపేశారు. బుద్ధి జీవులకైతే ఖాలిద్  ‘రా’ ఏజెంటుగా అవకాశం దొరికిందని, వ్యక్తిగత పగతోనే గురువు కబీర్ ని చంపడానికి వెంట పడివుంటాడేమో అన్పిస్తుంది, దేశభక్తితో కాక. ఇలా ఇది క్వశ్చన్ మార్కు  కన్ఫ్యూజుడు స్పై భక్తి కథగా తయారయ్యింది.
ఎవరెలా చేశారు
      హృతిక్ రోషన్ -  టైగర్ ష్రాఫ్ ఇద్దరూ బద్ధశత్రువులుగా నువ్వా నేనా అన్నట్టు, హాట్ హాట్ హైటెక్ యాక్షన్ సీన్స్ తో  రోమాంచితంగా హైలైట్ అయ్యారు. ఇద్దరు పాపులర్ యాక్షన్ స్టార్లు ఒకే తెరమీదికొచ్చి విలన్స్ లా పదేపదే కొట్టుకుంటూ వుంటే, ఎగురుతున్న విమానం రెక్కమీదికి దూకి రజనీకాంత్ కి కూడా రాని అయిడియాలు ప్రదర్శిస్తూ, ఇంకో ఎగురుతున్న విమానం మీదికి దూకి, లోపలికి  జొరబడి లడాయి మొదలుపెట్టుకుంటే. ప్రమాదకరమైన ఫారిన్ ఘాట్ రోడ్స్ మీద  హై ఎండ్ పవర్ బైక్స్ మీద ఛేజింగులు చేసి పడేసి కొట్టుకుంటే - వుండే మజా ఇంకెందులోనూ లేదు. ఇలా బాగాలేని కథ రాసిన కాగితాలు ఎటెటో ఎగిరిపోయి పీడా విరగడైంది. కాగితాలు పనికిరాకపోతే కుమ్ములాటలైనా పనికిరావాలి బాక్సాఫీసుకి.

          ఇద్దరు సీనియర్, జూనియర్ సిక్స్ ప్యాక్ యాక్షన్ స్టార్స్ ని ఒకరికొకర్ని యాంటీగా సెట్ చేసి, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఆడిన పేకాట, ఇంటర్ ప్లే, పైరో డైనమిక్స్, జంబో ఎనర్జిటిక్స్, హైపవర్ ఎర్గోనమిక్స్ వగైరా వగైరాలతో కూడిన  యాక్షన్ డైనమిక్స్ -  ఇవే ఈ 200 కోట్ల మెగా బడ్జెట్ ప్రొడక్షన్ ని  బంపర్ బాక్సాఫీసు బొనాంజాగా ప్రేక్షకులకి అమ్మేశాయి పండగ రోజుల్లో పానిండియా మూవీగా, పాన్ మసాలాగా. ఇద్దరు స్టార్స్ మీద ‘జైజై శివ శంకర్’ మాస్ సాంగ్ మత్తులో వూగించే ఇంకో జోడా బైల్ టుబాకో మసాలా.

          హాలీవుడ్, కొరియన్, ఇండియన్ స్టంట్ డైరెక్టర్స్ (పాల్ జెన్నింగ్స్, ఫ్రాంజ్ సిల్ఫస్, సీ యంగ్, పర్వేజ్ షేక్) యాక్షన్ ని వినూత్నంగా ఫాంటసీగా మార్చేసి జనరంజకం చేశారు. ఈ యాక్షన్ హంగామాలో ఇద్దరు  హీరోయిన్లు వాణీ కపూర్, అనుప్రియా గోయెంకాలకి ఆనవాయితీగానే, సహజాతి సహజంగానే అరగంట మేర పాత్రలు దక్కలేదు. విలన్స్ కి ప్రాధాన్యంలేదు. హీరోలే ఒకరికొకరు విలన్స్ కాబట్టి.

          కెమెరా మాన్ బెన్ జాస్పర్ కలర్ఫుల్ విజువల్స్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు.  ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ మాత్రం సెకండాఫ్ లో చాలా సేపు మందగించిన నడకతో సమస్య నెదుర్కొంది. విశాల్ - శేఖర్ సంగీతంలో పాటలు హిందీకే గానీ, తెలుగు డబ్బింగ్ కి మెప్పించేవిగా లేవు. ఇక రాసిన కాగితాలు ఇంకెంతగా పనికిరాలేదంటే, అబ్బాస్ టైర్ వాలా డైలాగులు యాక్షన్ మూవీ జానర్ కి తగ్గట్టుగా చిల్లీ పెప్పర్ గా లేవు. డైలాగ్ పార్టుని ఫిలాసఫీ ఆక్రమించింది. 120 సినిమాలు రాసిన ఈ దర్శకుడి తాత ది ఫేమస్ ఇందర్ రాజ్ ఆనంద్, అమితాబ్ బచ్చన్ మాస్ సినిమాలకి రాసిన డైలాగులు ఇప్పటికీ ఫేమసే.

చివరికేమిటి
     అర్ధం లేని రైటింగ్ కి అర్ధమయ్యే షూటింగ్ చేసి ఒక విచిత్రమైన పరిస్థితి సృష్టించారు. సక్సెస్ కి రైటింగ్ కాదు, షూటింగ్ అని రిస్కీ గేమ్ ఆడారు. ఇద్దరు వైబ్రెంట్ స్టార్స్ ని యాంటీగా పెట్టడమే సెల్లింగ్ పాయింట్ అవుతుందనీ, వాళ్ళ మధ్య గ్రేట్ యాక్షన్ కి కథతో పనిలేదనీ అన్నట్టుగా బాక్సాఫీసుకి సవాలు విసిరారు. దీనికి తగ్గట్టుగానే 300 నుంచి 350 కోట్లు ముట్టజెప్పేందుకు బాక్సాఫీసు సిద్ధంగా వుంది. మొదటి రోజు కలెక్షన్స్ తోనే అన్ని హిందీ సినిమాల రికార్డుల్ని బ్రేక్ చేసింది. కేవలం నాల్గురోజుల్లో ఓవర్సీస్ కలుపుకుని 216 కోట్లతో అపూర్వ రికార్డు సృష్టించింది.  

     ఇక రైటింగ్ గురించి రివ్యూలేం రాస్తారు. రైటింగ్ లో పైన చెప్పుకున్న కాన్సెప్ట్ పరమమైన లోపాలతో బాటు, ఇంకా గతంలో ఖాలిద్ తండ్రిని చంపిన కబీర్, దేశంకోసం పనిచేస్తున్నశిష్యుడైన ఖాలిద్ ని శత్రువుగా చూసి, తన్నడంలో కబీర్ పాత్రకి కూడా జస్టిఫికేషన్ లేకపోవడం, అసలు కబీర్ ఎందుకు ‘రా’ కి వ్యతిరేకంగా మారాడో చెప్పకపోవడం, బేసిగ్గా కబీర్ - ఖాలిద్ లని యాంటీగా సెట్ చేయడంలో ఎలాటి లాజిక్ లేకపోవడం, సెకండాఫ్ లో సస్పెన్స్ కోసం ఖాలిద్ కి పెట్టిన ట్విస్టు ఒక లక్ష్యంతో కొనసాగుతున్న అతడి పాత్ర ప్రయాణాన్ని ఆపేసేలా వుండడం, ఉన్నట్టుండి కేరళలో పెళ్లి సీను పెళ్లి సినిమా చూస్తున్నట్టు జానర్ మర్యాద తప్పడం ... ఇంకా ప్రారంభంలో ఖాలిద్ కి డ్యూటీ వేశాక, ఆ థ్రిల్ తో వెంటనే కథలోకి వెళ్ళక,  వెనక్కెళ్ళి ఖాలిద్ – కబీర్ ల సుదీర్ఘ ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ వరకూ నడపడం, సెకండాఫ్ ప్రారంభమయ్యాక కథ లేక రోమాంటిక్  సీన్లతో ఇరవై నిమిషాలు కుంగదీయడం...ఇలా ఎక్కడికక్కడ పాత్రల్నీ, కథనీ కిల్ చేస్తున్న కంటెంట్ కి రివ్యూ రాయడంలో అర్ధమే లేదు. సిద్ధార్థ్ ఆనంద్ - శ్రీధర్ రాఘవన్ ల స్క్రీన్ ప్లే ఒక బ్లండర్ బాజీ. అదృష్టవశాత్తూ కేవలం షూటింగ్ తో సక్సెస్ ప్రూవయింది. రైటింగ్ కి సెండాఫ్ ఇద్దాం. 


సికిందర్
telugurajyam.com



Sunday, October 6, 2019

879 :


        వారం బాక్సాఫీసుకి ఇంకో స్టార్ మూవీ బలైంది. బాక్సాఫీసు లౌక్యం  లేక 'చాణక్య' బాక్సాఫీస్ రేసు మొదటి పావు గంకే ఓటమి గంట మోగించింది. కొన్ని సినిమాల జాతకం మొదటి పావు గంట సీన్లలోనే తెలిసిపోతుంది. అంటే స్క్రిప్టులో మొదటి పదిహేను పేజీల్లోనే దాని వెండితెర మర్యాద తెలిసి పోతుందన్నమాట. అలాటిది గంటో గంటన్నరో వింటున్నా కూడా గోపీచంద్ కి ఇంకేవో అద్భుతాలు కన్పించాయంటే అది యాక్షన్ సీన్లతో వలపు వల. హైటెక్ యాక్షన్ సీన్లు మెప్పిస్తే ఇంకే ‘విషయ’ మయినా ఓకే అన్పించడమే. కానీ ‘విషయం’ బాక్సాఫీసు ఫ్రెండ్లీగా, మార్కెట్ ఓరియెంటెడ్ గా లేక, కేవలం యాక్షన్ సీన్లే పెట్టుబడి అనుకుంటే, స్టార్ ఇమేజి పూర్ గా మారుతుంది, మార్కెటింగ్ రేటింగ్ పడిపోతుంది.

         
తెలుగు మార్కు కంటెంట్ ని నాలుగు భాషల్లో తీసి పాన్ ఇండియా మూవీ అనేకన్నా, పాన్ ఇండియా కంటెంట్ ని రెండు భాషల్లో తీసినప్పుడే తెలుగు మీసం తిప్పాలి. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లతో యాక్షన్ సీన్లు తీసి ఇంటర్నేషనల్ రేంజి ఇచ్చామని చెప్పుకునే కన్నా, ఇండియన్ స్టంట్ మాస్టర్లతో ఆ ప్రయత్నం చేసి హాలీవుడ్ రేంజి ఇచ్చామని చెప్పుకోవాలి. బయటివాడే వచ్చి చేసిపోతే అది మన అంతర్జాతీయ స్థాయి ఎలా అవుతుంది.

          పాత రోజులెలా వుండేవో ఈ ఆదివారం సాయంత్రం హోరున దంచుతున్నవర్షానికి వెచ్చ వెచ్చగా తల్చుకుందాం...ఆయన హీరో కృష్ణ, ఇంకో ఆయన కవి / రచయిత ఆరుద్ర, మరింకో ఆయన యాక్షన్ సినిమాల దర్శకుడు కెఎస్ఆర్ దాస్. ఈ ముగ్గురూ కలిస్తే 1971 లో  పంచ రంగుల కౌబాయ్ ‘'మోసగాళ్ళకు మోసగాడు’ ట్రెండ్ సెట్టర్ అయింది - టెక్నికల్ గా, కంటెంట్ పరంగా. టెక్నికల్ గా కెమరామాన్ వీఎస్సార్ స్వామి లెజెండ్. ఆఫ్ కోర్స్, కంటెంట్ హాలీవుడ్ స్ఫూర్తే.  ‘ద గుడ్ ద బ్యాడ్ ద అగ్లీ’, ‘మెకన్నాస్ గోల్డ్’ ల వంటి హాలీవుడ్స్ స్ఫూర్తేగానీ, ఒక్క కాపీ సీను లేదు. ఒక్క కాపీ యాక్షన్ సీను - షాటు లేవు. బయటి నటీనటులు లేరు, సాంకేతిక నిపుణులూ లేరు. అంతా తిప్పరా మీసం తెలుగుదనమంటూ అప్పుడే గ్లోబల్ మూవీ ఇచ్చేశారు కృష్ణ -  ఆరుద్ర - దాస్ త్రయం. ఇక తెలుగులో సూపర్ డూపర్ టాపర్ హిట్టయి, పాన్ ఇండియా కాదు- ఏకంగా ఇండియా దాటి 125 దేశాల్లో ఇంగ్లీష్ డబ్బింగ్ మోత మోగించింది. ఎవ్వడూ ఇది మా నుంచి కాపీ అనలేదు. తెలుగు మీసానికి వందనం చేశారు. ఇప్పుడు తెలుగో కాదో అర్ధంగాని వేషం తప్ప మీసం లేదు.    

         
రాయడం మానేయడం కూడా రైటింగ్ ప్రణాళికలో భాగమవుతుందా? అంటే కొంత కాలం రాయడానికి ప్రయత్నించి, ఇక రాయలేమని అన్పిస్తే మానెయ్యాలని ముందే అనుకుని రాసే పనిలోకి దిగాలా? రాయడానికి ఆత్మ స్థైర్యం అత్యవసరం. ఇంకొకరిలా రాయాలని ప్రయత్నిస్తే ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. కాబట్టి ‘ఇంకొకరిలా’ అనే ఆలోచన వుండకూడదు. అందుకని ‘రాయడం మానేయడం’ అనే క్లాజు ఈ సందర్భంలో రైటింగ్ ప్రణాళికలో వుండకూడదు. కాలం మారితే, మారిన  కాలానికి తగ్గట్టుగా రాయలేకపోతే అప్పుడు కొంత తగ్గ వచ్చు. ఈ క్లాజు మాత్రం రైటింగ్ ప్రణాళికలో పెట్టుకోవచ్చు. ఐతే ఈ క్లాజుని కూడా వర్కౌట్ చేస్తూండాలి. ఒకసారి రాయడం వచ్చేశాక, ఇక మనకి ఫర్వాలేదని అనుకోకుండా అప్డేట్ అవుతూంటేనే ఉనికిలో వుంటారు. అయినా ముఖం పాతబడి కొత్త ముఖాల్ని కోరుకునే తర్వాతి తరం ప్రేక్షకులతోనో / పాఠకులతోనో గ్యాప్ వస్తుంది. అయినా రాయడానికి మాధ్యమాలు విస్తరించాయి. విస్తరిస్తున్నకొద్దీ రాసే వాళ్ళ కొరత పెరుగుతోంది. కాబట్టి రాయడం నుంచి రిటైర్మెంటు లేదు. రైటర్ అన్నాక ఏ సమయంలోనూ బ్రేక్ వుండదు. విహార యాత్ర కెళ్ళినా రాసే ఆలోచనలే సుళ్ళు తిరుగుతూంటాయి.
సికిందర్

Thursday, October 3, 2019

878 : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ సంగతులు -3


        శతాబ్దాల మాట! కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూలాలు 18 వ శతాబ్దపు జర్మన్ సాహిత్యంలో వున్నాయి. అప్పట్లో ఈ జానర్ కి ‘బిల్డూక్స్ రోమాన్' (bildungs  roman) అని నామకరణం చేశాడు ఇంపీరియల్ యూనివర్సిటీ లైబ్రేరియన్ కార్ల్ సైమన్ అనే అతను.  బిల్డూక్స్’ అంటే జర్మన్ భాషలో విద్య లేదా జ్ఞానం. ‘రోమాన్’ అంటే నవల. ఈ విద్య లేదా జ్ఞానం మానసికంగానూ నైతికంగానూ టీనేజర్ల ఎదుగుదల గురించి. దీన్ని ‘నావెల్ ఆఫ్ ఫార్మేషన్’ అని కూడా అన్నారు.1796 లో ప్రసిద్ధ జర్మన్ రచయిత జే డబ్ల్యూవ్ గోథె రాసిన ‘విల్ హమ్ మిస్టర్స్ అప్రెంటీస్ షిప్’ అన్న నవల ఈ జానర్ ఎలిమెంట్స్ ని స్థిరీకరించింది. ఈ నవలని అనుసరించి జర్మన్ భాషలో మరెన్నో ‘కమింగ్ ఆఫ్ ఏజ్’ నవలలు వచ్చాయి. ఆ తర్వాత 19, 20, 21 వ శతాబ్దాల్లో ఆంగ్ల భాషలో చార్లెస్ డికెన్స్ రాసిన ‘డేవిడ్ కాపర్ ఫీల్డ్’, ‘గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్’; మార్క్ ట్వైన్ రాసిన ‘అడ్వెంచర్స్ ఆఫ్ హకల్బరీ ఫిన్’, జేమ్స్ జాయిస్ రాసిన ‘ఎ పోట్రెయిట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఏజ్  ఏ యంగ్ మాన్’, జేడీ శాలింగర్ రాసిన ‘ది క్యాచర్ ఇన్ ది రై’, డరోతీ అలిసన్ రాసిన ‘బాస్టర్డ్ ఔటాఫ్ కరోలినా’, జేకే రౌలింగ్ ‘హేరీ పోటర్’ సీరీస్ నవలలూ ఉదాహరణకి కొన్ని. చేతన్ భగత్ ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్’ కూడా ఒకటి. మొదటి కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమా ‘బాంబీ’ అనే యానిమేషన్ గా 1942 లో హాలీవుడ్ లో నిర్మించారు. 

          కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్ట్రక్చర్ రెగ్యులర్ సినిమాలకుండే స్ట్రక్చరే. కాకపోతే మనో వికాసం కేంద్ర బిందువుగా వుంటుంది. అదే రెగ్యులర్ బిగినింగ్, అదే మిడిల్, అదే ఎండ్ విభాగాల కార్యకలాపాలుంటాయి. ఉదాహరణకి ఒక సంపన్నవ్యాపార కుటుంబానికి చెందిన నితిన్ అనే టీనేజర్ వున్నాడనుకుందాం. ఇతను విసుగ్గా, సోమరిగా జీవితం గడుపుతున్నాడనుకుందాం. కుటుంబం అనుభవిస్తున్న సిరిసంపదల మీద ఆసక్తి లేక
స్వతంత్రంగా, 
స్వేచ్ఛగా తనమానాన తానొక కళాకారుడిగా ఎదగాలన్న కోరిక బలంగా అతడికుందనుకుందాం. ఈ కోరిక తన హక్కు అనే కొత్త రెబెల్ ఆలోచనలు రెక్కలు తొడిగాయ  నుకుందాం. అప్పుడు వ్యాపార శాస్త్రం చదువుకుని కుటుంబ వ్యాపారంలోకి రమ్మంటున్నతండ్రి సలహాని తిరస్కరించాడు. రచయితగా, నటుడిగా నిరూపించుకోవాలన్న గట్టి నిర్ణయానికొచ్చేశాడు. కానీ ఇదికూడా జరిగేట్టు లేదు. తను సత్యవతి అనే పాతిక దాటిన నటిని ప్రేమిస్తున్నాడు. సత్యవతి అసిస్టెంట్ మాయలక్ష్మి ఇటు తనని మేనేజి చేస్తూ, ఇంకో పక్క సత్యవతి కోసం తన కంటే సీనియర్ అయిన, రిచ్ అయిన బాయ్ ఫ్రెండ్ ని కూడా మెయింటెయిన్ చేస్తూ తనని మాయ చేయడం బాధాకరంగా వుంది. ఒక సాయంత్రం సత్యవతి గది లోంచి ఆ బాయ్ ఫ్రెండ్ రావడం చూశాక గుండె పగిలి గట్టిగా ఏడ్వాలన్పించింది.


          ఇలా దెబ్బతిన్నాక ఇక తండ్రి చెప్పినట్టే వ్యాపారంలోకి వచ్చేస్తానని, బిజినెస్ టూర్ కి వెళ్తానని తండ్రికి చెప్పేసి బయల్దేరాడు. వెళ్ళే ముందు క్లోజ్ ఫ్రెండ్ షారుఖ్ ఖాన్ ముందు మరోసారి ఏడ్చి, తనలో రచయితయ్యే, నటుడయ్యే టాలెంట్  లేదనేసి, చేసిన రచనల్ని వైరాగ్యంతో మంటల్లో విసిరేశాడు - (ప్లాట్ పాయింట్ -1)
         

 ఇప్పుడు వర్క్ షీట్ చూద్దాం : ఇది బిగినింగ్ విభాగపు కథనం. ఇందులో బిగినింగ్ విభాగపు ప్రత్యేక బిజినెస్ అంతా వుంది నాల్గు టూల్స్ తో. 1. కథానేపథ్యపు ఏర్పాటు : టీనేజర్ నితిన్ తానున్న సంపన్న వ్యాపార కుటుంబంలో ఇమడలేక స్వేచ్ఛ కోరుకుంటున్న వాతావరణం, 2. పాత్రల పరిచయం : సంపన్నుడైన నితిన్ తండ్రి, నటి సత్యవతి, ఆమె అసిస్టంట్ మాయలక్ష్మి, ఫ్రెండ్ షారుఖ్ ఖాన్ ల బిగినింగ్ విభాగాన్ని నడిపేందుకు అ వసరమైన పాత్రల పరిచయం, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన : చదువుకుని కుటుంబ వ్యాపారంలోకి రమ్మని తండ్రి అనడం, కాదని కళల పట్ల మక్కువ పెంచుకున్న నితిన్ నటి సత్యవతిని ప్రేమించడం, ఆమె ఇంకో బాయ్ ఫ్రెండ్ తో గడపడాన్ని చూసి మనసు విరగడం, 4. సమస్య ఏర్పాటు (ప్లాట్ పాయింట్ -1) : ప్రేమలో దెబ్బతిని ఇక కళారంగం  వద్దనుకుని, వ్యాపారంలోకి వెళ్ళాలనుకోవడం, బిజినెస్ టూర్ కి బయల్దేరడం. 

          ఇందులో నితిన్ పాత్ర పరిచయ ప్రక్రియలో, జీవితం పట్ల అతడి అస్థిర టీనేజీ మనస్తత్వ చిత్రణ ముందు జరగాలి. మానసికంగా అస్తిరత్వం లోంచి స్టిరత్వం లోకి టీనేజీ కథా ప్రయాణానికి బీజాలు ఈ బిగినింగ్ విభాగంలోనే పడతాయి. ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? ఉన్నదాన్లోంచి స్వేచ్ఛ కోరుకోవడంతో వస్తుంది. అస్థిరత్వానికి మూలం స్వేచ్ఛా కాంక్ష. స్వేచ్ఛా కాంక్ష ఎందుకు రగుల్కొంటుంది? వయసొచ్చింది కాబట్టి ఉన్నట్టుండి హక్కులు గుర్తుకు రావడం వల్ల. ఇదంతా నితిన్ పాత్ర పరిచయంలో జరిగాయి.

          ఇప్పుడు సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన మొదలు పెడుతున్నప్పుడు, పైన స్థాపించిన మానసిక స్థితితో ముందుకెళ్లాలి. ముందు కెళ్ళి నప్పుడు మానసిక ప్రపంచానికి భౌతిక ప్రపంచం చెక్ పెడుతూండాలి. ఎందుకు చెక్ పెట్టాలి? అజ్ఞానాన్ని, అపరిపక్వతని భౌతిక ప్రపంచం తిరస్కరిస్తుంది కాబట్టి. మానసిక ప్రపంచం స్పిరిచ్యువల్, భౌతిక ప్రపంచం మెటీరియల్. మెటీరియల్ ఉనికిలోకి రావాలంటే ఆలోచన నిర్దుష్టంగా వుండాలి. కట్టే పనిలో అవినీతి జరిగిందంటే కట్టిన డామ్ కూలిపోతుంది. యథా మానసికం, తథా భౌతికం. మొత్తం ప్రపంచం బావున్నా చెడినా కారణం మనసు.

          కనుక నితిన్ తో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన ఈ చట్రంలో జరగాలి. జరిగింది కూడా. అతను లోపల అనుకుంటున్న దానికీ బయట జరుగుతున్న దానికీ పొంతన లేదు. అతను నటనలోనూ, రచనల్లోనూ రాణించాలనుకుంటున్నాడు, కానీ నటితో ప్రేమ వ్యవహారం పెట్టుకున్నాడు. ఇందుకే భౌతిక ప్రపంచం తిరస్కరించడం మొదలెట్టింది మాయలక్ష్మి రూపంలో. అస్థిర మనస్తత్వం. ఉత్తుత్తి జీవిత లక్ష్యం. అసలు నిజంగా తనలో కళాకారుడి అంశే వుంటే, దానికి బద్ధుడై వుంటే ఇలా చెయ్యడు. తనలో వున్నదేమిటో తనకే తెలీని తనంతో శూన్యాన్ని సృష్టించుకున్నాడు. ఇక ప్రేమా లేదు, కళాపోషణా లేదు. ఇలా సత్యవతితో ప్రేమంటూ దెబ్బతిన్నాక, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కొలిక్కి వచ్చింది.

           ఇక  టూర్ వెళ్ళే ముందు తనలో రచయితయ్యే, నటుడయ్యే టాలెంట్ లేదనేసి, చేసిన రచనల్ని మంటల్లో విసిరేయడం ప్రేమలో విఫలమయ్యాడన్న ఆక్కసుతోనే తప్ప, నిజంగా ఆ టాలెంట్ తనకి లేదని గుర్తించి కాదు. కళాకారుడిగా ఎటువంటి ప్రయత్నాలు చేయనే లేదు, కంపాటిబిలిటీ లేని ప్రేమ కోసం తప్ప.

          ఇలా సమస్య కూడా ఏర్పాటయ్యాక వచ్చే టూల్ గోల్ ఏర్పాటు. ఇప్పుడు నితిన్ గోల్ ఏమిటి? తండ్రి వ్యాపారమే చూసుకోవడం. ఇది మారిన గోల్. వొరిజినల్ గోల్ కళాకారుడు కావడం. దీనికంత సీను లేదని, విధిలేక తండ్రి మాట ప్రకారం వ్యాపారాన్ని గోల్ గా చేసుకున్నాడు. మనస్ఫూర్తిగా స్వీకరించని ఈ గోల్ ని మనం నమ్మనవసరం లేదు. కనుక ఇది బలహీన గోల్.

          మరి ఈ బలహీన గోల్ కాని గోల్ ఎలిమెంట్స్ ఏమిటి? 1. కోరిక : ఇంకా కోరికలేముంటాయి గోల్ కాని గోల్ తో? కానీ వెనుక పోగొట్టుకున్నవాటితో (అందని ప్రేమ, మంటల్లో కళ) తీరని  కోరికలు వెన్నాడుతూనే వుంటాయి తప్పక, 2. పణం : తీరని కోరికలు వెన్నాడుతూంటే తండ్రి నమ్మకాన్నే పణంగా పెట్టినట్టు. ఇప్పుడు వ్యాపారం కాక తనేం చేసినా తండ్రి క్షమించక పోవచ్చు, సహకరించకపోవచ్చు, 3. పరిణామాల హెచ్చరిక : ఒక్కగా నొక్క కొడుకుగా వ్యాపార విషయంలో తండ్రిని నిరాశ పరిస్తే బెంగతో తండ్రి కేమైనా అవచ్చు, 4. ఎమోషన్ : ఒకవైపు తీరని కోరికలతో, మరోవైపు తండ్రి పెట్టుకున్న నమ్మకంతో మిశ్రమ ఎమోషన్స్. ఎలా హేండిల్ చేస్తాడో తెలీదు.
          
         ఇలా బిగినింగ్ బిజినెస్ లో నాల్గు టూల్స్ ని, నాల్గు గోల్ ఎలిమెంట్స్ ని సరిచూసుకున్నాక ముందు కథలో కెళ్దాం...

ఇప్పుడు నితిన్ తండ్రి కంపెనీ బకాయిలు వసూలు చేస్తూ బిజినెస్ టూరు తిరుగుతున్నాడన్న మాటే గానీ మనసు వ్యాపారం మీద లేదు. అశాంతిగా, అలజడిగా, పిచ్చిగా గడుపుతున్నాడు. టూరులో ఇంకో వూరు దాటుతున్నప్పుడు ఒకచోట ఒకతను ఓ చిన్నపిల్లని పట్టుకు కొట్టడం చూసి అడ్డుకున్నాడు. ఈ పిల్లకి డాన్స్ చేయడం రావడం లేదని కొడుతున్నాడా దర్శకుడు. ఆ దర్శకుడు పని చేస్తున్న ఔత్సాహిక నాటక సంస్థలోంచి అతణ్ణి తీసేయించి, దర్శకుడుగా తను బాధ్యతలు చేపట్టాడు నితిన్. ఆ పిల్ల చింకీకి తర్ఫీదు నివ్వసాగాడు. సంస్థలో ఇద్దరు నటులు దగ్గరయ్యారు. నాటకాలేయసాగారు. అడిగినప్పుడల్లా దర్పంగా డబ్బిచ్చేయసాగాడు నితిన్.

          ఒకరోజు చింకీని తీసుకుని నటులతో పిక్నిక్ కి వెళ్తే అక్కడ దొంగలు దాడి చేశారు. ఆ దాడిలో నితిన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్నలాగే వదిలేసి నటులు వెళ్ళిపోతే చింకీ కాపాడింది. వొత్తైన తన పొడవాటి జుట్టుతో వొత్తి అతడి రక్త స్రావాన్నాపింది. అలా చేసి విశ్వేశ్వర్రావు అనే పెద్ద మనిషి ఇంటికి తీసికెళ్ళింది. అక్కడ కోలుకున్నాడు. అక్కడే పెద్దవాళ్ళయిన విశ్వేశ్వర్రావు స్నేహితులతో కళల మీద, కవిత్వం మీద, ముఖ్యంగా షేక్స్ పియర్ మీదా అర్ధమయీ కాని చర్చలు జరుపుతూ, సాహిత్య జ్ఞానం బాగా పెంచుకున్నా ననుకున్నాడు. అప్పుడు విశ్వేశ్వర్రావు ఒక మాటన్నాడు - నీ కూడా వున్న నటులు నటులు కాదని, నీ డబ్బుకోసం వున్నారే తప్ప కళ కోసం లేరని, నిన్ను చావు బతుకుల్లో వదిలేసి వెళ్లి పోయారనీ చెప్పి కళ్ళు తెరిపించాడు... నితిన్ ఆలోచనలో పడ్డాడు. ఛీ, కుళ్ళు కళారంగమని విరక్తి పుట్టేసి, ఇక వ్యాపారమే బెస్ట్ అని మనసు మార్చేసుకున్నాడు.           

          ఇంతలో చింకీ గుండెపోటుతో చనిపోయింది. అంతేకాదు, అటు తన వూళ్ళో నటి సత్యవతి కూడా చనిపోయిందని కబురొచ్చింది. చనిపోతూ తన మీద ప్రేమని వ్యక్తం చేసిందని కూడా తెలిసింది. నితిన్ ఉండబట్టలేక ఏడ్చాడు. ఇక తన వూరుకి బయల్దేరాడు. (ప్లాట్  పాయింట్ – 2)

ఈ మిడిల్ వర్క్ షీట్ చూద్దాం :
 పై కథనం బిగినింగ్ తర్వాత వచ్చే మిడిల్ విభాగంలోది. మిడిల్ విభాగమంటే గోల్ ని సాధించడంకోసం విలన్ తో హీరో చేసే పోరాటం. దీనికుండే టూల్స్,1. గోల్ కోసం విలన్ తో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే, 2. క్యారక్టర్ ఆర్క్, 3. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, 4. సొల్యూషన్ (ప్లాట్ పాయింట్ -2). వీటన్నిటితో పైన చెప్పుకున్న గోల్ ఎలిమెంట్స్ నాల్గింటినీ కలుపుకు వెళ్ళాలి : కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్స్. రాయడానికి లోడ్ పెరుగుతోందా? పకడ్బందీ కథని డెలివరీ చేయడానికి ఈ లోడింగ్ తప్పదు. కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ కే కాదు, దేనికైనా ఇంతే. స్క్రీన్ ప్లే అంటేనే ఒక పెద్ద మాల్గాడీ. పోతూ వుంటే సరుకులు లోడ్ అవుతూ వుంటాయి. సికింద్రాబాద్ - వరంగల్ - ఖమ్మం - బెజవాడ, ది ఎండ్! ఈ ప్రయాణం ఎలాంటిదంటే, లోడింగ్ సరిగా లేకపోతే పట్టాలు సరిగా వుండవు. మాల్గాడీతో ఇదో విచిత్ర సమస్య. 


          ఐతే కొన్ని కథల్లో విజిబుల్ విలన్ వుండడు. ప్రస్తుత కథలో నితిన్ కిలా కనిపించని విలనే  వున్నాడు. అది తను. మనసు వల్ల తనకి తానే విలన్. ఏకకణ జీవి అమీబా లాగా. ఇక తనతో తానే సంపర్కించుకుని ప్రత్యుత్పత్తి చేయాలి. తనకి మెచ్యూరిటీ నిచ్చేలాగా ఒక మానస పుత్రికకి జన్మనివ్వాలి.



        ముందుగా యాక్షన్ రియాక్షన్ ఇంటర్ ప్లే : తన మనసే తన శత్రువుగా వున్న హీరో పాత్రతో ఈ ప్లే ఎలా వుంటుందంటే, హీరోకి ఒక గోల్ వుంటే, మనసు ఆ గోల్ ని డిస్టర్బ్ చేస్తూంటుంది. దీన్ని మిడిల్ విభాగపు బిజినెస్ లో ముందుగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది నితిన్ విషయంలో ఎస్టాబ్లిష్ అయింది. ఈ మిడిల్ విభాగంలో వ్యాపారం చేసుకుందామనే గోల్ తో  మొదట ఎంట్రీ ఇస్తే, మనసు చితికిన కోరికల్ని గోల్ కి ఎదురు విసురుతోంది. సత్యవతితో, కళాభిలాషతో, చితికిపోయిన కోరికలు. దీంతో వ్యాపార పనుల్లో సుఖంలేక అశాంతిగా, అలజడిగా, పిచ్చిగా గడుపుతున్నట్టు గమనించాం. అంటే అతడి గోల్ అనే యాక్షన్ కి, రియాక్షనిచ్చే విలన్ మనసులో రూపు దిద్దుకుంటున్నాడన్న మాట.

          ఇలా మనసులో విలన్ తయారీ పూర్తి చేశాక, దాంతో ఫిజికల్ ప్లే ప్రదర్శించాలి. ఈ ఫిజికల్ ప్లే నితిన్ పోతూ వుంటే, ఒక చిన్నపిల్లని దర్శకుడు కొడుతూ వుండడంతో ఎదురయ్యింది. మనసులో విలన్ ఎలా ప్లే చేస్తున్నాడంటే, నితిన్ వచ్చి ఈ ట్రాప్ లో పడిపోవాలి. ఆ చిన్న పిల్లెవరో, కొడుతున్నది ఎవరో నితిన్ కి ఇప్పుడే తెలీదు. ఆ చిన్నపిల్ల స్థానంలో ఓ యువతి వుండి వుంటే, అతడామెని కొడుతూ వుంటే, నితిన్ ఈ ట్రాప్ లో పడడు. అదేదో లవర్స్ గొడవనుకుని వెళ్లిపోవచ్చు. పైగా ఆ యువతిలో సత్యవతి కన్పించి – బాగైంది, బాగైంది - అని కచ్చతో అనుకోవచ్చు.

          మనసులో విలన్ ఆచితూచి చిన్నపిల్లనే ప్రయోగించాడు. చిన్నపిల్లని కొడుతూంటే నితిన్ తప్పక ఆగుతాడు. కొడుతున్నది తండ్రే అయినా, ఏమయ్యా బుద్ధుందా? అన్నం తింటున్నావా, అమ్మాయిని తింటున్నావా?- అనవచ్చు. టీనేజర్లు ఎలా వుంటారంటే తాము చిన్నపిల్లలకి నెంబర్ వన్ గార్డియన్ లమనుకుంటారు. ఫ్రెష్ గా ఈ గార్డియన్ గిరీ పేరెంట్స్ తమ మీద చెలాయించే పెత్తనం వల్ల వస్తుంది. ఇలా మనసులో విలన్ ఇలా బాగానే ప్లే చేశాడు సైకాలజీ మీద.

          ఇప్పుడా కొడుతున్నది దర్శకుడూ, ఆ చిన్నపిల్ల అప్పుడే డాన్సరూ అని తెలిసి కనెక్ట్ అయిపోయాడు నితిన్. కళా రంగం రెండు చేతులూ చాచి ఆహ్వానిస్తోంది. మంటల్లో పారేసిన తనలోని నటుడూ, రచయితా ఫీనిక్స్ పక్షిలా పైకి లేస్తున్నారు. చితికిన రెండు కోరికల్లోంచి ఒకటి బతికి బట్ట కట్టింది. వ్యాపార గోల్ అటకెక్కింది.

          ఇక్కడ అర్ధం లేకుండా చిన్నపిల్ల పాత్ర సృష్టి జరగలేదు. చాదస్తంగా చైల్డ్ సెంటిమెంటు వుంటుందనో, ఇంకోటనో కథని, పాత్రని విడిచి ఆటవికంగా, వికటంగా  ఆలోచించలేదు. అదే సమయంలో హీరో మానసెలా వుందో పట్టించుకోకుండా, అక్కడ చిన్నపిల్ల స్థానంలో హీరోయిన్ ని పెట్టేసి, చితికిన ప్రేమని కొత్త లవ్ ట్రాకుతో బతికించే చాపల్యానికి కూడా పోలేదు. ఇవన్నీ అర్ధంపర్ధం లేని మర్కట రచనలు.  

          యాక్షన్ - రియక్షన్ల ఇంటర్ ప్లే ఫిజికల్ గా ఇంకా కొనసాగాలి. ఇదే జరిగింది. మనసులోని విలన్ చిన్న పిల్లతో అలా రియాక్షన్ ఇచ్చాక, ఇక నితిన్ ఇంకో యాక్షన్ మొదలై పోయింది. ఆ నాటక సంస్థలోంచి దర్శకుణ్ణి తీసేయించి, తను దర్శకుడై పోయాడు. చిన్నపిల్ల చింకీకి ట్రైనింగు. తను రైటింగు, నాటకాలేయింగు. ఇదంతా ఎలా సాధ్యమైంది? డబ్బు వల్ల. తనదగ్గర డబ్బుంది. కంపెనీ బాకీలు వసూలు చేసిన డబ్బు. ఆ డబ్బుతో కళని కొనేసు కుంటున్నాడు. ఈ కళ ప్రస్తుతానికి చితికిన రెండో కోరికని గుర్తుచేయడం లేదిక.

          ఇప్పుడు రియాక్షన్ కి టైమైంది. మనసులో విలన్ లేచాడు. ఇంకో విజువల్ ప్లేతో జోష్ మీదున్న నితిన్ మీదికి ఇద్దరు నటుల్నిజలగల్లా తోలాడు. దీనికి రియాక్షన్ గా దర్పంగా నితిన్ వాళ్లని జలగల్లా డబ్బు పీల్చెయ్యనియ్య సాగాడు. ఒకప్పుడు డబ్బుని వెతుక్కున్న కళే వహ్వా అంటే డబ్బు వెదజల్లుతుంది. దీవాలా తీసేదాకా దర్బారు నిర్వహిస్తుంది.

          చేసుకున్న కర్మల్ని బట్టే బ్లాక్ బస్టర్ సీన్లుంటాయి. మనసులోని విలన్ ఇంకో రియాక్షన్ గా ఈ సీను చూపించాడు- బిగ్ పిక్చర్ - విజువల్ ట్రీట్. నితిన్ పిక్నిక్ కి వెళ్తే అక్కడ దొంగలు దాడి చేసి దోచుకున్నారు. ఈ దెబ్బకి  డబ్బు దర్పం కూడా తొలగిపోయింది. పైగా తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఇతడి దగ్గర డబ్బేమీ వుండదని నటులు ఉడాయించారు. అప్పుడు చింకీయే నితిన్ ని కాపాడింది. ఆమె టెంప్లెట్ సీనుగా హీరోయిన్ పర్రుమని జాకెట్టు చింపో, చున్నీ చింపో కట్టు కట్టినట్టు గాక, తన పొడవాటి వొత్తయిన ముఖమల్ లాంటి జుట్టుతో, మెత్తగా వొత్తి, అతడి రక్త స్రావాన్ని ఆపింది.

          ఇలా మొత్తం ఈ మిడిల్ కొలిక్కి వచ్చేదాకా ఈ విభాగంలో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే కొనసాగుతూనే వుండాలి. ప్లాట్ పాయింట్ -2 దగ్గర మిడిల్ అంత మవుతుంది. ఈ క్రమంలో మనసులో విలన్ ఇచ్చిన తాజా దొంగల దాడి రియాక్షన్ కి, నితిన్ యాక్షన్ విశ్వేశ్వర్రావు ఇంట్లో సెటిలై  కోలుకోవడంగా, అక్కడ పాసివ్ గా సాహిత్య ఇష్టాగోష్టులు జరపడంగా వుంది. నాటకాలేసే యాక్టివ్ కలాపం నుంచి ఈ పాసివ్ విలాపానికి మారడం. డబ్బుపోయాక నాటక సంస్థ వైపు వెళ్ళే పరిస్థితి లేదు. ఇష్టాగోష్టుల్లో సాహిత్య జ్ఞాన సముపార్జన చేశాడు - పద్దెనిమిది కూడా నిండకుండానే. 

          మళ్ళీ మనసులో విలన్  ఇంకో రియాక్షన్ ఇచ్చాడు. నితిన్ కళా పిపాసని మొత్తంగా పెకిలించి వేసే విజువల్ ప్లే. నీ కూడా వున్న నటులు నటులు కాదని, నీ డబ్బుకోసం వున్నారే తప్ప కళ కోసం లేరని, నిన్ను చావు బతుకుల్లో వదిలేసి వెళ్లి పోయారనీ విశ్వేశ్వర్రావు అనడం మాస్టర్ స్ట్రోక్ లా పనిచేసింది.

          దీంతో మళ్ళీ కళా రంగాన్ని వదిలేసి వ్యాపారంలోకే  వెళ్ళిపోయాడు నితిన్. ఇది ప్లాట్ పాయింట్ - 2 ఘట్టం. అంటే ప్లాట్ పాయింట్ -1 దగ్గర పుట్టిన సమస్యకి ఇది పరిష్కారం. ఇందులో సత్యవతి, చింకీల మరణాలతో అనుబంధ సంఘటనలున్నాయి. సమస్యని పుట్టించే ప్లాట్ పాయింట్ -1, సమస్యకి పరిష్కారాన్నిచ్చే ప్లాట్ పాయింట్ - 2 ఎప్పుడూ కాంట్రాస్ట్ గా వుంటాయి. అది నెగెటివ్ గా వుంటే, ఇది పాజిటివ్ గా; అది పాజిటివ్ గా వుంటే, ఇది నెగెటివ్ గా. అక్కడ నితిన్ కళని వదులుకుని వ్యాపారం చేపట్టాడు, ఇక్కడ మళ్ళీ కళనే వదులుకుని వ్యాపారం చేపట్టాడు. కాంట్రాస్ట్ ఏమిటంటే అక్కడ విధిలేక అయిష్టంగా వ్యాపారం చేపడితే, ఇక్కడ మనస్ఫూర్తిగా వ్యాపారం చేపట్టాడు. మధ్యలో జరిగిందంతా అంతరంగ మథనమే. మిడిల్ అంటేనే  అంతరంగ మథనం. అందులోంచి నేర్చుకోవడం, మారడం, తనని తాను తెలుసుకోవడం, ఎదగడం. ఇవన్నీ జరిగాయి నితిన్ విషయంలో. అయితే ఇది నీతీ నిజాయితీలు ఆలంబనగా జరిగాయా అంటే అలాటిదేమీ లేదు. ఇదే టీనేజీ స్పెషాలిటీ. కళారంగం పట్ల అతడి నిజాయితీ ఎంత?  మొదట్లో ఈ ప్రయత్నాలేవో చెయ్యక ఈ వంకతో సత్యవతిని ప్రేమించి, దెబ్బతిని, కళ లేదు కాకరకాయ లేదని మంటలకి ఆహుతి చేశాడు. తనకి టాలెంటే లేదని ఒప్పుకున్నాడు.

          మళ్ళీ ఇప్పుడు విశ్వేశ్వర్రావొక మాటన గానే, మళ్ళీ  కళలేదు కాకరపువ్వొత్తి లేదని లాంగ్ కిక్ ఇచ్చాడు. అక్కడంటే భగ్న ప్రేమతో అలా చేశాడనుకోవచ్చు, ఇక్కడ?  ఇద్దరు నటులు స్వార్ధపరులనగానే, మొత్తం కళారంగానికే దీన్నాపాదించుకుని ఛీథూ అనుకుని వదిలేశాడు. అతడికి ఇందులోంచి బయట పడే ఏదో వంక కావాలి. ఎందుకు బయట పడాలంటే తన దగ్గర ఇప్పుడు డబ్బులేదు. నాటక సంస్థలో పరపతి వుండదు. అందుకని  విశ్వేశ్వర్రావా మాటనగానే వంక దొరికింది, బయటపడ్డాడు. అప్పుడప్పుడే లక్ష్యాలతో టీనేజర్ల నిజాయితీ ఎలా వుంటుందో తెలపడానికే ఈ చిత్రణలు

         పోతే, రెండు చోట్లా సత్యవతి ప్రభావితం చేసింది : అక్కడ ఆమె ప్రేమని పొందలేక భంగ పడ్డాడు, ఇక్కడ మరణిస్తూ ఆమె వ్యక్తం చేసిన ప్రేమకి వూరట పొందాడు. ఇక ప్రేమ బాధ కూడా తీరిపోయింది. కానీ చింకీ ఎందుకు చనిపోవడం? ఆమె ఎవరో, ఎక్కడ్నించి వచ్చిందో, ఆరోగ్య సమస్య లున్నాయేమో ఎవరికీ తెలీదు. బయటపడకుండా మౌనంగా వెళ్ళిపోయింది. దటీజ్ క్యారక్టర్.
           యాక్షన్ - రియక్షన్ల టూల్ ఇలా పనిచేశాకా, ఇక క్యారక్టర్ ఆర్క్ చూద్దాం. కథ నడిపే క్యారక్టర్ ఆర్క్ అన్నాక పడుతూ లేస్తూ వుండాలి. ప్లాట్ పాయింట్ -2  దగ్గర మిడిల్ కొలిక్కి వచ్చినప్పుడు, కథని బట్టి పూర్తిగా పరాజయంతో పతనమవడమో, విజయంతో పూర్తిగా పైకి లేవడమో జరగాలి. నితిన్ పాత్ర ఈ ఫ్రేమ్ వర్క్ లోనే వుంది : ఈ కథని బట్టి ప్లాట్ పాయింట్ -2 లో విజయంతో ఊర్ధ్వ ముఖంగా వుంది క్యారక్టర్ ఆర్క్. కళ కాదు వ్యాపారమని మనస్సుని గెలవడమిది. దీనికి ముందు ఆర్క్ పడుతూ లేస్తూనే వుంది మనసులో విలన్తో పోరాటంలో. దర్శకుడు చింకీని కొడుతున్నప్పుడు నితిన్ తన గోల్ తప్పి పడిపోయాడు. తనే దర్శకుడై పైకి లేచాడు. నాటకాలేస్తూ మరింత పైకి లేచాడు. డబ్బులు పంచేస్తూ ఇంకింత పైకి లేచాడు. దొంగలు దాడి చేసినప్పుడు మళ్ళీ పడి పోయాడు. విశ్వేశ్వర్రావు దగ్గర కొద్దిగా పైకి లేచాడు. విశ్వేశ్వర్రావు చెప్పిన మాటకి పూర్తిగా కింద పడ్డాడు. అందులోనే తన సమస్యకి పరిష్కారం కన్పించి పైకి లేచాడు. చింకీ మరణంతో పడిపోయి, సత్యవతి మరణంతో ఆమె చెప్పిన మాటలకి పూర్తిగా పైకి లేచాడు.




              టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ : అంటే కాలం గడిచే కొద్దీ కథనంలో టెన్షన్ పెరుగుతూ పోవడం. పాత్ర ఉత్థాన పతనాలతో కూడిన స్ట్రగులే ఈ టెన్షన్ ని పుట్టిస్తుంది. ఈ టెన్షన్ ఆయా  చర్యల ద్వారా ఉత్పన్నమయ్యే ప్రశ్నల వల్ల ఏర్పాటవుతుంది. ఏం ప్రశ్నలు? ఎక్కడ్నించీ ప్రశ్నలు? గోల్ ఎలిమెంట్స్ లోంచి వచ్చే ప్రశ్నలు. ప్లాట్ పాయింట్ -1 లో ఏర్పాటయినట్టుగా మనం చూసిన గోల్ ఎలిమెంట్స్ - కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక , ఎమోషన్స్ -  ఈ టీటీ గ్రాఫ్ లో పాలు పంచుకుంటాయి ప్రశ్నల్ని రేకెత్తిస్తూ. అలా ఈ గ్రాఫ్ ప్రేక్షకులతో ఇంటరాక్టింగ్ వ్యూయింగ్ కి వీలు కల్పిస్తుంది. పాసివ్ గా చూడకుండా, కథలో లీనమై ఆయా భావోద్వేగాల్ని అనుభవిస్తూ, యాక్టివ్ గా చూసేట్టు చేస్తుంది.

          ఈ మేరకు నితిన్ పడడం, మళ్ళీ లేవడం అన్న స్ట్రగులే ప్రశ్నల్ని సంధిస్తూ టీటీ గ్రాఫ్ ని గీస్తోంది. గోల్ మార్చుకుని వ్యాపార టూర్ కి బయల్దేరిన నితిన్ మళ్ళీ అన్యమనస్కంగా, అశాంతిగా ఎందుకు గడుపుతున్నాడు? సత్యవతితో విఫల ప్రేమా, మంటల్లో పరిత్యాగమైన కళా మర్చిపోలేదా ఇంకా?  అంటే ‘కోరిక’ మారిందా? ఈ చావని కోరికలతో తండ్రి నమ్మకాన్నే పణం’ గా పెడుతున్నాడే... ఇప్పుడా తండ్రికేమైనా అయితే (పరిణామాల హెచ్చరిక)... పెట్టుకున్నగోల్ కి మర్చిపోని కోరికలతో మిశ్రమ ‘ఎమోషన్స్’ ఇస్తున్నాడే...ఇలా ప్రతీ ఉత్థాన పతనంలో గోల్ ఎలిమెంట్స్ ఆధారంగా ప్రశ్నల్తో టెన్షన్ నీ, కథనానికి సస్పెన్స్ నీ సృష్టిస్తూ సాగుతోంది పాత్ర.

          ఇక మిడిల్ టూల్స్ లో చివరిది సొల్యూషన్. ఇది ప్లాట్ పాయింట్ -2 లో వస్తుంది మిడిల్ ని ముగిస్తూ. సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తూ. విశ్వేశ్వర్రావ్ చెప్పిన మాటతో ఇదే సందు అనుకుని చేతకాని  తన ‘కలాబిలాసగోస’ కి ఓ లాంగ్ కిక్కిచ్చి వూరెళ్ళిపోయాడు - వ్యాపారమే మన బృందావనమని. దటీజ్ హిజ్  సొల్యూషన్. ఇలా మిడిల్ వర్క్ షీట్ పూర్తయింది.

దీంతో అయిపోయిందా కథ? అయిపోలేదు. ఈ కథకి ప్లాట్ క్లయిమాక్స్, స్టోరీ క్లయిమాక్స్ అని రెండూ వున్నట్టున్నాయి. ప్లాట్ (కథనం) క్లయిమాక్స్ పైన మిడిల్లో చూపిన విధంగా, ఇంకేం మిగల్చకుండా వచ్చింది. ఇది కాన్సెప్ట్ పరంగా లేదు. కాన్సెప్ట్ వచ్చేసి, బిగినింగ్ విభాగంలో కథా నేపథ్యం ఏర్పాటులో చూపిన ‘సిరిసంపదలు వర్సెస్ నితిన్ పాత్ర’ అన్నట్టుగా వుంది. భోగ భాగ్యాల్ని తిరస్కరించిన నితిన్, ఇలా ప్లాట్ క్లయిమాక్స్ లో ఆ భోగాభాగ్యాలకి దాసుడవడమేమిటి? ఇలా ఇదిప్పుడు డెవలప్ అయిన వ్యక్తిత్వానికి ఓటమి కాదా?

          కనుక ఇది ముగింపు కాదు. నితిన్ ఇంకా జ్ఞానం పొందలేదు, మెచ్యూర్ అవలేదు. సిరిసంపదలు తనకి తృప్తి నివ్వవనుకుని ఈ కథా ప్రయాణం మొదలెట్టాడు. ఇప్పుడు వాటినే ఎందుకు ఆశ్రయిస్తున్నాడు?  మధ్యలో వ్యాపారం కాదు, కళే అనుకున్నప్పుడు- నాటకాల్లో తన పరపతికోసం తండ్రి శ్రమించి నిలబెట్టిన వ్యాపారంలోంచి డబ్బు ఎలా వాడుకున్నాడు? నీతి కూడా తప్పాడు. మళ్ళీ ఆ డబ్బు లేకపోయేసరికి కళే వదులుకున్నాడు. తండ్రి నిర్మించిన సర్వసౌఖ్యాల పొదరిల్లోకే వెళ్ళిపోతున్నాడు. కాన్సెప్ట్ కి న్యాయం జరగడం లేదు.

ముగింపు చూద్దాం : నితిన్ తన వూరెళ్ళి పోయాక షారుఖ్ ఖాన్ బాగా రిచ్ గా, స్టయిలిష్ గా  తారసపడ్డాడు. అయితే ఇదివరకంత అందంగా లేడు, పైగా అనారోగ్యంగా వున్నాడు. తను డబ్బు లేనప్పటికీ ఆరోగ్యంగా, అందంగా వున్నాడు. అక్కడింకో ఇద్దరు పాత మిత్రులు ఎదురయ్యారు - మాయాంక్, శశాంక్. మళ్ళీ తన వూరుకొచ్చి ఇలా పాత మిత్రుల్ని చూస్తూంటే ఏదో ఆత్మశాంతి, దేంట్లోంచో తెలీని విముక్తి. ఇంకేం వెతుక్కుంటున్నాడో తెలీదు, కానీ అదేదో ఇక్కడే వుందన్నకొత్త ఎరుక ఏదో కలుగుతోంది...

          మాయాంక్, శశాంక్ లు నితిన్ లో ఏదో మార్పుని గమనించి సౌందర్య లహరిని పరిచయం చేశారు. ఆమెతో ప్రేమలో పడ్డాడు నితిన్. ఇక నటన లేదు, నాటక రచనా లేదనీ, తనలో లేని వాటిగురించి గాలిమేడలు కట్టుకోవద్దనీ నిర్ణయం తీసుకుని, అలాగని తండ్రితోనూ  ఐశ్వర్యవంతమైన జీవితంలోకి  పోకూడదనీ, దేనికీ ఫిక్స్ కావద్దనీ, జీవితమంటే తెలుసుకోవడమేననీ, తర్ఫీదు పొందడమేననీ గ్రహింపు కొచ్చి, సౌందర్య లహరితో సామాన్య జీవితాన్ని స్వీకరిస్తూ డైరీలో ఇలా రాసుకున్నాడు : జ్ఞానానికి రెండు ఊట బావులున్నాయి -  అంతరంగంలో ఒకటి, బాహ్య ప్రపంచంలో ఇంకొకటి.  

          ఇంట్లో చింకీ చిత్రపటం పెడుతూంటే అనుమానంగా చూసింది సౌందర్య లహరి. దత్తపుత్రిక అన్నాడు.

           ఈ సాంప్రదాయ కథ పైన పేర్కొన్న గోథె రాసిన విల్ హమ్ మిస్టర్స్ అప్రెంటీస్ షిప్’ నవల లోనిది.



next : ఆధునిక దృశ్యం

 సికిందర్