రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, May 15, 2019

824 ; స్క్రీన్ ప్లే సంగతులు -4


(క్రియేటివ్ యాస్పెక్ట్ కంటిన్యూ)
         
‘నువ్వే సమస్తం’ పరిచయ పాట మధ్యలో సీఈవో రిషిని రిపోర్టర్ (ఝాన్సీ) చేసే ఇంటర్వ్యూ వస్తుంది. 950 కోట్ల రూపాయలు ప్లస్ కంపెనీ షేర్స్ ప్యాకేజీతో ఘనంగా అప్పాయింటయిన రిషిని అడుగుతుంది - ఇంత డబ్బు సంపాదిస్తున్నారు కదా, మీకెలా అన్పిస్తోందని. అప్పుడొక ఫ్లాష్ కట్ పడుతుంది. రిషి చిన్నప్పటి దృశ్యం. ఇందులో చిన్నప్పుడు అతడి పాయింటాఫ్ వ్యూలో అతడి తల్లి దండ్రులు (జయసుధ, ప్రకాష్ రాజ్), అప్పుల వాడూ కన్పించి, కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఎస్టాబ్లిష్ అవుతుంది. తన చదువు కోసం చేసిన పదివేల అప్పు తండ్రి కట్టలేని పరిస్థితి. ఈ ఫ్లాష్ కట్ మూడు కథావసరాలు తీర్చే ఉద్దేశంతో  వుంది. చిన్నప్పుడు అతడి పాయింటాఫ్ వ్యూలో అతడి తల్లిదండ్రుల పాత్రల్ని పరిచయం చేసెయ్యడం, చిన్నప్పటి రిషి - ఇప్పటి రిషిల మధ్య అభివృద్ధిని విజువల్ కాంట్రాస్ట్ గా  చూపడం, ఇక రాబోయే ఫ్లాష్ బ్యాక్ కి ప్రేక్షకుల్ని సిద్ధం చేస్తూ ఇలా టీజర్ ని వదలడం. 

         
సాధారణంగా ఫ్లాష్ బ్యాకులు ఉన్నట్టుండీ ఒకేసారి మొదలైపోతాయి. అప్పుడు, హమ్మో మొదలెట్టాడ్రా సుత్తీ అని ప్రేక్షకులు తలలు పట్టుకునే పరిస్థితి. ఫ్లాష్ బ్యాకులిలా చులకనై పోయాయి. ఇలా కాక, ఫ్లాష్ బ్యాక్ వుండబోతోందని హీరో జ్ఞాపకంగా, నాందీ ప్రస్తావనగా ఒక షాటు వేసి, ముందస్తుగా టీజర్ లా వదిల్తే, సర్దుకుని చూడ్డానికి సంసిద్ధమవుతారు. పైగా టీజర్ ఒకవైపు వూరిస్తూంటే, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే అవకాశం కూడా వుండొచ్చు. నిజానికి ఈ మిడిల్ -1 లో వచ్చిన ఈ ఫ్లాష్ కట్ బిగినింగ్ విభాగంలోనిది. బిగినింగ్ లోనే కదా పాత్రల పరిచయాలుంటాయి. రిపోర్టర్ అడిగిన ప్రశ్న తగు సమాచారాన్ని డిమాండ్ చేయడంతో, ఈ బిగినింగ్ బిట్ ని తెచ్చుకుని మిడిల్ -1 లో ఇలా వాడుకున్నారు.

          అయితే రిషి ఈ గతాన్ని తల్చుకున్న ఈ సమయంలో తండ్రి జీవించి లేడు. ఈ విషయం పూర్తి ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పట్ల ద్వేషం తోనే వుంటాడు. ఇప్పుడు తండ్రి మీద అదే ద్వేషంతో మాట్లాడడు, ఆర్ధిక దుస్థితి గురించే మాట్లాడతాడు. ‘నువ్వే సమస్తం’ పాట ఫ్రెండ్ త్యాగం రిఫరెన్స్ పాయింటుగా లేనట్టు, ఈ ఫ్లాష్ బ్యాక్ బిట్ కి రిషి వ్యాఖ్యానం విషయంలో అలాటి పొరపాటు చేయలేదు. అతను తండ్రి చనిపోయిన రిఫరెన్స్ పాయింటు నుంచే మాట్లాడతాడు. 

           రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఈ గతాన్ని తల్చుకుని అంటాడు, ‘ఈ రోజు నేను సంపాదించే వేలకోట్ల కన్నా, ఆ రోజు పదివేలు లేవే అన్న బాధే ఎక్కువ గుర్తుంటుంది’ అని. 

          ఇక్కడొచ్చింది సమస్య. పాత్రచిత్రణతో చిక్కు. ముందు ముందు కథలో రిషి ఈ స్థాయికి ఎదగడానికి  రహస్యంగా అతడి ఫ్రెండ్ రవిశంకర్ చేసిన మేలు మాత్రమే కారణమని మనకి తెలుస్తుంది కాబట్టి, దీన్ని రిఫరెన్స్ పాయింటుగా తీసుకుని ఇప్పుడు మనమిక్కడ రిషి మాటల్ని చూడాలి. పరిచయ పాట ‘నువ్వే సమస్తం’ ని ఈ రిఫరెన్సు పాయింటు ప్రకారమే దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో చూసి ఆ పాట సరికాదని గమనించాం. ఇప్పుడు ఈ ఫ్రెండ్ త్యాగమనే రిఫరెన్సు పాయింటుతో బాటు, ఇకముందు ఫ్లాష్ బ్యాకులో వచ్చే రిషి క్యారెక్టరైజేషన్ ని బట్టి కూడా ఇక్కడ రిషి మాటల్ని చూడాలి. ఫ్లాష్ బ్యాకులో, అంటే బిగినింగ్ విభాగంలో, రిషి స్థూలంగా ఇగోతో బిహేవ్ చేసే క్యారెక్టర్. సక్సెస్ కోసం అన్నీ పక్కన పెట్టేసే ఇగో సెంట్రిక్ క్యారెక్టర్. ఇది మంచిదే. ఇగో ని మెచ్యూర్డ్ ఇగో స్థాయికి తీసికెళ్ళి చూపించడమేగా గొప్ప సినిమాల లక్షణం. ఈ సినిమా  కూడా రిషి (ఇగో), మహర్షి (మెచ్యూర్డ్ ఇగో) స్థాయికి ఎదిగే ఉదాత్త ప్రయాణపు కథేగా? 

          మరి ఇగో రిషి నేపధ్యంలోంచి ఇగో రిషి వచ్చి, ప్రపంచాన్నేలేద్దా మనుకున్నసక్సెస్ ని ఇప్పుడిప్పుడే సాధించి,  ఇప్పుడే మెచ్యూర్డ్ ఇగో మహర్షిలా మాట్లాడితే,  ఇక మహర్షి అయ్యే సినిమా ఏముంటుంది?

ఇంటర్వ్యూ ప్రశ్న జవాబులు 
        ‘ఈ రోజు నేను సంపాదించే వేలకోట్ల కన్నా, ఆ రోజు పదివేలు లేవే అన్న బాధే ఎక్కువ గుర్తుంటుంది’ అనడంలో ఇగో ఎక్కడుంది, రియలైజేషన్ తప్ప? ముందుకు దూసుకెళ్ళే వాడికి గతం గురించెందుకు? ఇప్పుడే రియలై జేషన్ తో మెచ్యూర్డ్ గా మాట్లాడితే ఇక పాత్రోచిత చాపం (క్యారెక్టర్ ఆర్క్) ఎక్కడుంటుంది?  ఈ సక్సెస్ సాధించిన అతడి ఇగో, పొగరు, విగరు అన్నీ వీగిపోయే ఘట్టం ముందు ముందు ఫ్రెండ్ చేసిన మేలు తెలిసినప్పుడు కదా? పాత్ర ఉత్థాన పతనాలతో కూడిన ఈ క్యారెక్టర్ ఆర్క్ ఏర్పాటు కాకపోతే, పాత్ర చిత్రణ కర్ధమేముంటుంది? 

          ఇంకో మాట కూడా ఫిలాసఫికల్ గా అంటాడు - మనం సక్సెస్ అయ్యామో లేదో గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడెక్కడున్నాం, దీన్ని బట్టే తెలుస్తుందని. ఇంత సాత్వికంగా మాట్లాడడం ఇగోతో దూకుడుగా సాగిపోవాలన్న అతడి ఏకోన్ముఖ మనస్తత్వాన్ని ప్రతిబింబించదు. ఫ్లాష్ బ్యాక్ లో స్టూడెంట్ గా వున్నప్పుడు ఒక పాత కొటేషన్ అంటాడు - సక్సెస్ కి ఫుల్ స్టాప్ లేదని, కామాలే వుంటాయనీ. అలాంటప్పుడు – ‘సక్సెస్ ఒక నిరంతర ప్రయాణం. ఇక్కడితో ఆగుతాననుకుంటున్నారా? అది మీ అజ్ఞానం. ఇంకేమేం చేస్తానో నాకే తెలీదు’ - అని వుంటే అతడి ఇగో సంతృప్తి పడే సమాధానమయ్యేది. ఇతను ఈ స్థాయి నుంచి అప్పుడే ఇంకే స్థాయికీ వెళ్తాడోనని ప్రేక్షకులకి ఒక ఆసక్తినీ, ఆదుర్దానీ పుట్టించినట్టు కూడా అయ్యేది. ఒక సీను వుందంటే అది ఎందుకుంటుంది - పాత్రగురించి ఓ కొత్త విషయం చెప్పడానికో, లేదా కథ ముందుకెళ్ళే ఓ పాయింటు కల్పించడానికో కదా? మున్ముందు ఢమాల్ మని కింద పడే పాత్రని వీలైనంత పైకి తీసి కెళ్ళి చూపించడం కథనాన్ని చైతన్యవంతం చేసే డైనమిక్స్ కదా? 

          టెక్నికల్ గా చెప్పుకోవాలంటే, రిషి ఇప్పుడింకా అదే ఫ్లాష్ బ్యాక్ లోని నెగెటివ్ షేడ్ తోనే వుండాలి. ఫ్రెండ్ వల్ల తను సక్సెస్ అయ్యాడని తెలిశాకే, పాజిటివ్ షేడ్ లోకి రావాలి. అంతవరకూ ఎక్కడా ఫిలాసఫికల్ గా మహర్షిలా వుండకూడదు. ఇది కామన్ సెన్సు. రిపోర్టర్ ఇంకో ప్రశ్న అడుగుతుంది- సక్సెస్ కి డెఫినేషన్ ఏమిటని. అప్పుడంటాడు - మనం సక్సెస్ అయితే మనమే డెఫినేషన్ గా మారిపోతామని. ఇప్పుడు నిజమైన రిషిలా ఇగోతో మాట్లాడుతున్నాడు. ఇలా రిషిలా కాసేపు, మహర్షిలా మరి కాసేపూ మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇలా ఎందుకు జరిగిదంటే,  ఫ్రెండ్ త్యాగమనే రిఫరెన్స్ పాయింటుని, ఫ్లాష్ బ్యాకులో కొనసాగిన రిషి క్యారెక్టరైజేషన్ నీ,  దృష్టిలో పెట్టుకోకుండా,  ఈ ప్రారంభ దృశ్యాలు రాసుకుపోవడంవల్ల ఈ రసభంగం కలిగినట్టు అన్పిస్తోంది. 

          ఇంతాచేసి రిపోర్టర్ ‘మీ సక్సెస్ వెనుక ఎవరున్నారంటారు?’ అని అడగాల్సిన సహజ ప్రశ్న ఒక్కటి అడగదు. అడిగి వుంటే రిషి క్యారెక్టర్ కి ఐరనీ పార్టు ఇంకా పెరిగి కథనం మజా వచ్చేది. తన విజయం వెనుక ఫ్రెండ్ వున్నాడని ఇంకా తెలీదు -  ఈ ప్రశ్నకి ఏమని చెప్తాడు? నోటెడ్ ఇగోయిష్టుగా ఏం చెప్పినా నిజం బయటపడ్డప్పుడు ఢమాల్ మనే సమాధానమే అవుతుంది. ఇలా ఈ ఒక్క సీన్లో క్యారెక్టర్ కి సెటప్ చేసి తర్వాత, ఐరనికల్ గా పే ఆఫ్ చేయాల్సిన అంశాలున్నాయి. ఇదంతా ముఖ్యం కాదనుకున్నారేమో. స్క్రీన్ ప్లే లో ఈ ప్రారంభ దృశ్యాలు బిగినింగ్ విభాగపు దృశ్యాలు కావు, ఫ్లాష్ బ్యాకులో వున్న బిగినింగ్ ని పూర్తి చేసుకుని వచ్చిన మిడిల్ -1 దృశ్యాలు. కాబట్టి ఫ్లాష్ బ్యాకుగా వున్న బిగినింగ్ లో పరిచయంచేసిన రిషినే అదే క్యారెక్టరైజేషన్ తో మిడిల్ - 1 లోనూ  కంటిన్యూ చేయాలే తప్ప, అతడికి ఫ్రెండ్ గురించిన నిజం తెలిసేదాకా మార్చడానికి వీలుండదు. 

          ఇక క్లాస్ మేట్స్ తో బాటు ప్రొఫెసర్ సెలెబ్రేషన్స్ కి రావడంతో, రిషి పూర్తి స్థాయి గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయి, ఈ మిడిల్ -1 కి బ్రేక్ ఇచ్చి - ఫ్లాష్ బ్యాక్ లోకి, అంటే బిగినింగ్ విభాగంలోకి వెళ్తుంది కథనం. 

బిగినింగ్ సంగతులు 
        బిగినింగ్ బిజినెస్ లో ముఖ్య పాత్రల్ని పరిచయం చేసి, కథ దేనిగురించో నేపథ్య వాతరణ సృష్టి చేసి, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన చేసుకొస్తూ, ప్లాట్ పాయింట్ దగ్గర ప్రధాన పాత్ర పరిష్కరించడానికి సమస్యని స్థాపించాలి.

          ఇక్కడ క్యారెక్టర్ ఏమిటో పరిచయమవుతాడు రిషి. చదువు, తండ్రితో విభేదం, పూజతో ప్రేమ, రవిశంకర్ తో స్నేహం అన్న చతుర్ముఖాలుగా బిగినింగ్ బిజినెస్ లో రిషి ఇంటరాక్షన్స్ వుంటాయి.  వీటిలో పాత్ర తత్త్వం ఎస్టాబ్లిష్ అయ్యే చదువు కోణం ప్రధానమైనది. రిషి స్వార్ధంతో, ఇగోతో వుంటాడు.  పదేపదే తన సక్సెస్ గురించే మాట్లాడతాడు. మాటలే తప్ప విజువల్ సపోర్టు వుండదు. జీవితంలో ఇన్నత స్థానాలకి  చేరుకోవాలన్న తన సంకల్పాన్ని విజువలైజ్ చేసి ప్రేక్షకులకి  చూపించాలనుకోడు. ప్రేక్షకులకి ఇదో వెలితి. 


          ప్రొఫెసర్ తో సక్సెస్ గురించి ఒక సీనుంటుంది. ఇందులో ఇద్దరుఅథ్లెట్స్ ఉసైన్ బోల్ట్,  మో ఫరాలనిప్రస్తావిస్తాడు. వీళ్ళల్లో తన సక్సెస్ గోల్ కి ఎవరు ఎందుకు ఆదర్శమో చెప్తాడు. ఇప్పుడు కూడా ఈ ఇద్దరు అథ్లెట్స్ విజువల్స్వేసి, తన ఆశయాన్ని దృశ్యాత్మకంగా  ప్రేక్షకులకి డెమో ఇవ్వాలనుకోడు - వంద సార్లు మాటల్లో చెప్పేకన్నా ఒక్క విజువల్ వేస్తే సరిపోయేదానికి! ఈ అథ్లెట్స్ ఎవరో ఎంతమంది ప్రేక్షకులకి తెలుసు.  మిడిల్ - 1 దగ్గర్నుంచీ వెనక్కొస్తే ఈ బిగినింగ్ లో కూడా సక్సెస్ గురించి అతడి కొటేషన్స్ రకరకాలుగా రిపీటవుతూ వుంటాయి. వరుసగా వారానికొకటిగా మజిలీ, జెర్సీ, చిత్రలహరిల్లో కూడా ఇవే వినీవినీ వున్నాం. తనేం అవ్వాలనుకుంటున్నాడో దృశ్యదృశ్యాలుగా వూహించుకోవడం మనిషి స్వభావం. ఇలా రిషి మానసిక లోకాన్ని దృశ్యాత్మకంగా ఆవిష్కరిస్తే, ప్రేక్షకులు మానసికంగా ఆ పాత్రలో సంలీనమయ్యే పరిస్థితే వేరు. రిషి మహర్షి అయ్యే ముక్తి మార్గాన్ని అంతరంగ విజువల్ ట్రీట్ గా చూపించక పోతే ఎలా. ఏకంగా డ్రీం సాంగులే వేసుకుంటున్నప్పుడు, తన జీవితాశయం గురించిన ఒక్క డ్రీం సీక్వెన్స్ వేసుకుంటే  పోయేదేమిటి



          ఏం చేద్దామనుకుంటున్నావని ప్రొఫెసర్ అడిగినప్పుడు, ప్రపంచాన్నేలేద్దామనుకుంటున్నానని అంటాడు. మహేష్ బాబు స్టార్ డమ్ ని ఎలివేట్ చేసే కమర్షియల్ డైలాగు ఇది. అయితే ఈ డైలాగు డీప్ నాలెడ్జితో అంటాడు. ప్రపంచాన్నేలాలంటే అలెగ్జాండర్ లా దండయాత్రలు చేయడం కాదని - గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి ఒక్క డిజిటల్ అప్లికేషన్ కనిపెడితే ప్రపంచం చేతిలో వుంటుందనీ అంటాడు. నిజమే, ఆటమిక్ వార్ ని దేశాలు కోరుకోవడం లేదు. ఓట్ల కోసం బూచిగా చూపిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఎకనమిక్ వార్. ఎకనమిక్ వార్ తో ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నారు. ఇక పైన జరిగేవన్నీ అభివృద్ధి కోసం ఆర్ధిక యుద్దాలే.



 గోల్ కి మూలమేమిటి? 
         ఇక రిషి చదువుకుని యూఎస్ కెళ్ళి పోతానని తండ్రితో అనడంతో గోల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ గోల్ కి మూలం ఎంత సముచితంగా వుందో చూస్తే, చిరుద్యోగి అయిన తండ్రి అంటే రిషికి చిన్నచూపు, చాలా ద్వేషం కూడా. ఇదే తండ్రిని బయట జనం ఇష్టపడతారు. తల్లి వుంటుంది గానీ ఆమె తండ్రీ కొడుకుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ని తీర్చాలనుకోదు. ఎప్పుడో తండ్రి చనిపోయాక ఆయనలా రాజీపడి బ్రతకడానికి కారణమేమిటో అప్పుడు  చెప్తుంది. రిషికి చదువు సహా అన్నిఅవసరాలూ తండ్రి సంపాదనతోనే తీరుతున్నప్పుడు తండ్రి మీద ద్వేషమెందుకో అర్ధంగాదు. తండ్రి తనని పట్టించుకోక పోతేకదా?  ఈ ‘మహర్షి’ కి ముందు వారమే విడుదలైన ‘నువ్వు తోపురా’ లో తల్లితో హీరోది కూడా ఇదే అర్థంలేని ప్రవర్తన. ఆ చిన్న సినిమాకీ, ఇప్పుడీ పెద్ద స్టార్ సినిమాకీ, డ్రామాని సృష్టించే సామర్ధ్యంలో తేడా కన్పించడం లేదు.


          అసలు తన చదువుకి తండ్రి మీద ఆధారపడకుండా,  పై పెచ్చు కుటుంబానికి బాసటగా వుంటూ, కంప్యూటర్ ముందు కూర్చుంటే ఆన్ లైన్లో సంపాదించుకునే అవకాశాలు బోలెడు. ఈ నాలెడ్జి లేనివాడు సక్సెస్ గురించి ఎలా మాట్లాడతాడు.  ఈ రోజుల్లో ఇలాటి యూత్ ఎవరూ ఖాళీగా లేరు. ఆఖరికి స్మార్ట్ ఫోనుల్లో గేములు ఆడి  సంపాదించుకుంటున్నారు. తనని జయించలేని రిషి ప్రపంచాన్ని జయిస్తానంటాడు. ఇది ఈ కాలపు పాత్రలా  కాక, గ్లోబలైజేషన్ పూర్వపు మూస ఫార్ములాగా వుండడం శోచనీయం. 

           ఇంకా శోచనీయమేమిటంటే, తన గోల్ కి తను చెప్పుకునే కారణం. ‘ఆయన్ని చూసే ఓడిపోవడమంటే నాకు భయం పుట్టింది’ అని తండ్రి నుద్దేశించి తల్లితో అంటాడు. తండ్రితో అవసరాలు తీర్చుకుంటూ తండ్రినే ఓడిపోయిన వాడు అంటాడు. ఇంతే కాదు, తండ్రి తోనే నేరుగా అనేస్తాడు - నిన్ను చూసే నీలాగా కాకూడదన్న గోల్ ఏర్పడిందని. ఇది మరీ దారుణం. అన్నిటికీ తండ్రి మీద ఆధారపడి జీవిస్తూ ఈ మాటనడం. ‘నాన్నా నాకు నువ్వు చాలా చేశావు. మన కష్టాలు తీరతాయి, నన్ను నమ్ము’ అనొచ్చుగా?  అకారణంగా తండ్రిని ద్వేషించి, ఈ ద్వేషంలోంచే అన్యాయంగా గోల్ ని పుట్టించుకోవాలా? తండ్రిని అర్ధం జేసుకున్న కొడుకుగా తన బాధ్యత లోంచి పాజిటివ్ గా గోల్ ని పుట్టించుకోలేడా? అసలు గోల్ ఇలా పుట్టడమేమిటి - ఎవరికైనా చేస్తున్న పనే కోరిక (గోల్) ని పుట్టిస్తుంది. చదువుకుంటూంటే చదువే కోరిక (గోల్) ని పుట్టిస్తుంది. ఈ రెండూ కాక ఇంకోటేదో తనకి గోల్ ని పుట్టించాలని కూర్చుంటే - ఇలాగే  ఇతరుల్ని టార్గెట్ చేసే శాడిస్టు బుద్ధులు పుడతాయి. ‘నీ జీవితాన్ని చూస్తూంటే నాకు విరక్తి పుడుతోంది!’ అని అగ్గిపుల్ల గీసి అంటించేస్తూంటాడు విలన్ గా నటించిన పుండరీకాక్షయ్య ‘కర్తవ్యం’ లో. ఇలాగే రిషి కూడా ‘నీ జీవితాన్ని చూస్తూంటే నాకు గెలవాలన్పిస్తోంది’ అంటాడు తండ్రిని చంపినంత పనిచేస్తూ. పిల్లలతో తండ్రి పాల్పడే ప్రవర్తనలని, చర్యల్ని జడ్జి చేయలేమంటాడు స్వామి సుఖభోదానంద. కనీసం తండ్రి ఇలా ఎందుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నాడు రిషి. నిజంగానే తండ్రి తనని నిర్లక్ష్యంగా వదిలేస్తే సినిమాలో చూపించిన ఈ రిషి వైఖరి చెల్లుతుందేమో గానీ, తండ్రి అలా లేనప్పుడు ఈ వైఖరికి అర్ధం లేదు.  మొత్తానికి ఇలా ఏదోలా అమెరికా వెళ్ళాలన్న గోల్ ఒకటి ఏర్పాటయ్యాక - ఇక క్లాస్ మేట్స్  పూజా, రవిశంకర్ పాత్రలుంటాయి. 

ప్రేమలేదనీ, ప్రేమించరాదనీ 
      పూజాది కింగ్ ఫిషర్ క్యాలెండర్ పాత్ర అని మనకి తెలిసిపోతూనే వుంటుంది. ఒకవైపు ఇది రిషి మహర్షిగా మారే జర్నీ అంటూనే, ఈ ఉదాత్త కథ జానర్ మర్యాదలైనా పాటించకుండా,  రొటీన్ ఫార్ములా బ్రెయిన్ లెస్ హీరోయిన్ పాత్రేమిటి? ఈమెకీ రిషికీ మధ్య లవ్ ట్రాక్ పదేపదే కాఫీ తాగే టీజింగ్ తో, టీనేజి పిల్లల స్థాయిలో వుంటుంది. ఈమెతో తిరిగీ, పాటలు పాడీ, చివరికి రిషి కటీఫ్ అంటాడు. ఇది అమెరికాకి బయల్దేరే సందర్భం. తనకి ప్రేమలు కుదరవని, అనుకున్న సక్సెస్ సాధించడమే తన టార్గెట్ అనీ బై చెప్పేస్తాడు. ఇలాంటప్పుడు ఆమెతో తిరిగి ఆశలెందుకు కల్పించాడు. ప్రేమలు కుదరవని ముందే చెప్పేస్తే ఆమె ఫ్రెండ్ గా వుండేదేమో. రిషి క్యారెక్టర్ యూజ్ అండ్ థ్రో టైపు కానప్పుడు ఇలా చూపించనవసరం లేదు. హీరోపాత్ర జీవిత ప్రయాణమనే ‘మహోజ్వల’ కథలో హీరోయిన్ పాత్ర ఇలా వుండనవసరంలేదు.     
     
          ఇక రిషి ఫ్రెండ్ గా రవిశంకర్ పాత్రతో కాలేజీ సీన్స్ ‘త్రీ ఈడియెట్స్’ ఛాయలతో ఒరిజినాలిటీ ఫ్యాక్టర్ కి తీసికట్టే, వదిలేద్దాం. సగటు విద్యార్ధి రవిశంకర్ కి రిషి లిఫ్ట్ ఇస్తాడు, కానీ తనతో పూజ ప్రేమ విషయంలో జోక్యం చేసుకోవడాన్ని సహించలేక లెంప కాయకొట్టి దూరమవుతాడు. రవిశంకర్ కి ఒక చిన్న రైతుగా తనని కష్టపడి చదివిస్తున్న  తండ్రి కలలు నిజం చేయాలన్నగట్టి సంకల్పమే వుంటుంది. ఇలా రిషికి వుండదు. రిషి ఇగోయిస్టిక్ నెగెటివ్ పాత్ర అని మనకి తెలిసిందే.  కాంట్రాస్ట్ కోసం ఫ్రెండ్స్ మధ్య వాళ్ళ తండ్రుల పట్ల ఈ వైరుధ్యాల్ని  ఏర్పాటు చేశారు. 

          ఈ పై మొత్తం నేపధ్యంలో ఇది రిషి సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నకథగా మనకి తెలుస్తుంది. ఈ బిగినింగ్ కథనం ఎటు వైపు సాగుతోందో తెలియడానికి, అమెరికా  వెళ్ళే గోల్ గురించి చెప్పారు. మరి ఈ గోల్ కి (సమస్యకి) తగ్గ పరిస్థితుల కల్పన చేయాలి. ఇందుకు ఒక పాజిటివ్ సన్నివేశం, దీనికి వ్యతిరేకమైన నెగెటివ్ సన్నివేశం సృష్టించారు. పాజిటివ్ సన్నివేశం వచ్చేసి, రిషి ఒక సాఫ్ట్ వేర్ ని డెవలప్ చేసినట్టు, దీంతో అతడి స్కిల్స్ చూసి  అమెరిన్ కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చినట్టూ చూపారు. ఇక నెగెటివ్ సన్నివేశం వచ్చేసి, రాయబోయే ఎగ్జామ్ పేపర్ దొంగతనం రిషి మీద మోపి అమెరికా వెళ్లేందుకు అడ్డంకిగా చూపించారు. దీని వెనుక కుట్ర రిషికి తెలుసు. ప్రతీ సెమెస్టర్ లో తను టాప్ రావడాన్ని సహించని స్టూడెంట్ కుట్ర ఇది. హీరో టాప్ వస్తున్నాడని కుట్రలు చేయడం చాలా పాతకాలపు డిగ్రీ కాలేజీ టెంప్లెట్ సీన్లు. ఇప్పుడు సిల్లీగా వుంటాయి. ఐఐటీల్లో ఎలాటి రాజకీయాలు జరుగుతున్నాయో ఇప్పుడు హిందీ సినిమాల్లో ఆధునికంగా, వాస్తవికంగా  చూపిస్తున్నారు. మహర్షి మహోజ్వల కథని ఏ రీసెర్చీ లేకుండా లాగించేసినట్టు కనపడుతోంది. 

          ఇంతే కాదు, కుట్ర చేస్తున్న స్టూడెంట్ తండ్రి ఒక ఎంపీ కావడం మూసే. అతను వచ్చి, తన కొడుకు ఫస్ట్ రావాలంటే నువ్వు తగ్గాలని రిషికి ఆఫర్ ఇవ్వడం కూడా సిల్లీ బీగ్రేడ్ సన్నివేశమే. ‘విశ్వాసం’ లో అజిత్- జగపతి బాబుల మధ్య కథ ఇలాటిదే. నా కూతురు గెలవాలంటే నీ కూతురు తగ్గాలన్న కొట్లాటే. కాకపోతే ఇది స్పోర్ట్స్ కి సంబంధించి. 

          సరే, ఈ ఎగ్జామ్ పేపర్ కేసులోంచి రిషి బయట పడిపోతాడు. ఏం జరిగిందో పోలీసులు చెప్పరు. ఇక ఎగ్జామ్  రాసేసి యూఎస్ వెళ్ళిపోతాడు రిషి. ఇదే ప్లాట్ పాయింట్ వన్.

 కథానికల జర్నీ 
       ఈ ప్లాట్ పాయింట్ - 1 దగ్గర సమస్య ఏర్పాటు కాకుండా రిషి సాఫీగా అమెరికా ప్రయాణమై పోవడంగా వుంది. అంటే బిగినింగ్ విభాగంలో అతడికి కల్పించిన గోల్ ని పూర్తి చేయడంగా వుంది. గోల్ పూర్తయాక ఇక కథేముంది. స్ట్రక్చర్ లేకుండా జర్నీ కథ చేస్తే ఇలాగే  వుంటుంది. ఇప్పుడు తీస్తున్న బయోపిక్స్ జర్నీ లాంటివే. వాటిని స్ట్రక్చర్ లోనే తీస్తున్నట్టు గమనించాలి. ఇక్కడ మహర్షి జర్నీకి స్ట్రక్చర్ చేయదల్చుకోలేదు.  ఈ పాత్ర జీవిత ప్రయాణాన్ని  ఎపిసోడ్లుగా విడివిడి కథానికలుగా సాగించారు. ఒకే పెద్ద కథగా చేస్తే, కథంతటికీ ఒకే ప్రధాన సమస్యా, దాంతో సంఘర్షణా వుంటాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఈ స్ట్రక్చర్ లోనే వుంటాయి. 

          రిషి కథని కథగా చేయకుండా, రిషి మహర్షిగా మారే ఒక జర్నీగా చేశారు. ఎపిసోడ్ల మయమైన జర్నీకి కథాలక్షణాలుండవు. అది డాక్యుమెంటరీ లక్షణాలని పుణికిపుచ్చుకుని వుంటుంది. రిషి జీవిత ప్రయాణంలో వివిధ ఘట్టాల్ని డాక్యుమెంటేషన్ - గ్రంథస్థం – చేయడంగానే వుంటుంది. కాబట్టి ఈ జర్నీలో ఒకే ప్రధాన సమస్య, దాంతో సంఘర్షణా అనే స్ట్రక్చర్ ఫ్రేమ్ వర్క్ వుండదు. ఒక సమస్య ఎదురై అది పరిష్కారమై, ఇంకో సమస్య ఎదురై అదీ పరిష్కారమై ...ఇలా రకరకాల ఎపిసోడ్లుగా సాగేదే జర్నీ జానర్ సినిమా.  ఇది సరీగ్గా కుదరాలంటే రీసెర్చి చేయాలి. చేసినప్పుడు స్ట్రక్చర్ లేకుండా ‘ఫారెస్ట్ గంప్’ అంత గొప్ప సినిమా ఎలా అయిందో, మనం కూడా దాన్ని ముందు పెట్టుకుని ఎలా అలవాటైన చేతి వాటం చూపించవచ్చో తెలుస్తుంది... ‘త్రీ ఈడియెట్స్’ ని ముందు పెట్టుకుని దాన్నెలా మార్చేయవచ్చో తపన పడే కన్నా,  మొత్తం సినిమా స్వస్థతకి ఇది చాలా బెటర్. 

(రేపు ముగింపు)
సికిందర్  



Saturday, May 11, 2019

823 : స్క్రీన్ ప్లే సంగతులు -2

     స్ట్రక్చర్ లేకుండా కూడా సినిమాలు తీయవచ్చు. కాకపోతే ఆ స్ట్రక్చర్ రూల్స్ కూడా తెలిసి వుండాలి. రూల్స్ తెలియకుండా రూల్స్ ని బ్రేక్ చేయలేం. కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పాలంటే పాత సాంప్రదాయం గురించి తెలిసి వుండాలి. తెలిసివుంటే అప్పుడు స్ట్రక్చర్ కి బైపాస్ సర్జరీ ఎలా చేయవచ్చో, బైపాస్ రోడ్డు ఎలా వేసుకోవచ్చో, రాజమండ్రి రోడ్ -కం -రైలు బ్రిడ్జి కూడా ఎలా కట్టుకోవచ్చో చక్కగా తెలుస్తుంది. ఐతే దీనికి సాహసించే వాళ్ళు తక్కువ. తెలిసితెలిసి ఎవరు కామధేనువుతో పెట్టుకుంటారు. కనకవర్షం కురిపించే స్ట్రక్చర్ తో మంకీ బిజినెస్ ఎవరు చేయాలనుకుంటారు. దీన్నియూరప్ దేశాల్లో వరల్డ్ మూవీస్ తో చూసుకుంటున్నారు. వరల్డ్ మూవీస్ లిటరరీ మూవీస్. నవలల్లాగా వుంటాయి. తెలుగులో మన ‘ప్రేమనగర్’ నవలని నవల్లాగే కథానిర్మాణంతో తీసి వుంటే ఒక్కరోజు కూడా ఆడేది కాదు. ‘నేను పుట్టాను, అప్పుడే గిట్టాను’ గా పాట మారిపోయేది. ‘కష్టాలెత్తుకొచ్చిందీ కొన్న నవలా’ గా ఇంకో పాట మారిపోయేది. స్ట్రక్చర్ తో కమర్షియల్ సినిమా ఆసాములెవరూ కోరోకోరి పెట్టుకోరు. కాకపోతే తరాలుగా శిలాసదృశంగా వుండిపోతున్న స్ట్రక్చర్ తో క్రియేటివిటీకి పాల్పడవచ్చు. ఇంతవరకే లాభసాటిగా  చేసుకోగల్గింది. దీని గురించి బ్లాగులో ఆల్రెడీ కొన్ని పోస్టులున్నాయి. 

         
రి అరుదుగానైనా స్ట్రక్చర్ ని తీసి పక్కన పెట్టేసిన కమర్షియల్ హిట్సే లేవా అంటే వున్నాయి. ఉదాహరణకి రెండు కన్పిస్తున్నాయి : ఫారెస్ట్ గంప్, భలేభలే మగాడివోయ్. ఫ్లాప్స్ లేవా? ఎందుకు లేవు - స్ట్రక్చర్ ని ఎగేసిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఆటోనగర్ సూర్య, మను, ఆ!...లాంటివి ఫ్లాపయ్యాయి. మరి మహర్షి? ఇది స్ట్రక్చర్ వద్దనుకుంటూనే స్ట్రక్చర్ లో వుండాలని ప్రయత్నించింది. మరి ఫారెస్ట్ గంప్, భలేభలే మగాడివోయ్ ఎలా పెద్ద హిట్స్ అయ్యాయి? స్ట్రక్చర్ ని ఎగేయాలనుకుంటే క్యారెక్టర్ తో దున్నేయాలన్నాయి. మరి మహేష్ బాబు క్యారెక్టర్ తో దున్నేయలేదా? ఆయన కాసేపే పొలం దున్నేడు. అయినా హిట్టయిందంటున్నారుగా?
***
           ‘ఫారెస్ట్ గంప్’ ప్రసిద్ధ నవలే. టాం హాంక్స్ తో దీన్ని సినిమాగా తీసిన రాబర్ట్ జిమెకిస్ దీంతో ఆస్కార్ అవార్డు నందుకున్న ప్రసిద్ధ దర్శకుడే. ఉత్తమ నటుడుగా టాంహాంక్స్ కీ, ఉత్తమ  రచయితగా ఎరిక్ రోత్ కీ కూడా ఆస్కార్ అవార్డులు లభించాయి. అయితే ఎరిక్ రోత్ స్ట్రక్చర్ ని వ్యతిరేకిస్తాడు. వ్యతిరేకించి నవలలోని టాంహాంక్స్ పాత్ర చిత్రణతో చాలా మ్యాజిక్ చేశాడు. మహేష్ బాబు మహర్షి పాత్రకి గోలైనా వుంది, ఫారెస్ట్ గంప్ కి గోల్ కూడా వుండదు. గోల్ బదులు గోల్ లేని లోటుని తీర్చే ‘డ్రమెటిక్ క్వశ్చన్’ ని ప్రయోగించాడు. ఇలా రూల్స్ తెలిస్తే రూల్స్ నెలా బ్రేక్ చేసి హిట్ చేసుకోవాలో తెలుస్తుంది. స్ట్రక్చర్ లేని ఫారెస్ట్ గంప్  పూర్తి వివరాల కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి. 

          ఇక దర్శకుడు మారుతి తీసిన ‘భలేభలే మగాడివోయ్’ స్ట్రక్చర్ లేకపోయినా అంత హిట్టయ్యిందంటే మారుతికి స్ట్రక్చర్ తెలిసి బైపాస్ సర్జరీ చేశారని కాదు. నాని పాత్రని పట్టుకుని కథనంలో ఒక జోష్ తో, ఒక వూపుతో బ్యాంగు తర్వాత బ్యాంగు, పది నిమిషాలకో బ్యాంగ్  చొప్పున ఇచ్చుకుంటూ పోవడం వల్లే - నాని క్యారెక్టర్ బస్తీమే సవాల్ గా స్ట్రక్చర్ ని ఎగేసుకుంటూ వెళ్ళిపోయింది.

          ‘మిగతా ఏం రాసుకుంటారో రాసుకోండి, యూఆర్ ఫ్రీ. నాకు మాత్రం పది నిమిషాలకో సారి గట్టి వామ్మో (
Whammo =  immense energy; vigor) చొప్పున పడాలని గుర్తెట్టుకోండి, యూఆర్ నాట్ ఫ్రీ!’  అనేవాడు పూర్వమెప్పుడో ఎడ్డీ మర్ఫీతో ‘బేవర్లీ హిల్స్ కాప్’ సిరీస్ హిట్స్ తీసిన ఈజిప్షియన్ నిర్మాత. ‘వామ్మో’ని మన తెలుగులో ‘బ్యాంగ్’ అనుకోవచ్చు. ఆ రచయితలు  అలాగే పది నిమిషాలకోసారి  గట్టి ‘బ్యాంగ్’ పడేలా సంఘటనల్ని సృష్టించే వాళ్ళు హీరో ఎడ్డీ మర్ఫీ కోసం. ఆ సినిమాలు హిట్టయ్యేవి. ఇదెక్కడి మంత్రమో అర్ధంగాదు. ఇది మారుతి అక్కడ దాక్కుని వినేసి, తన సినిమాకి తెచ్చి పెట్టేసుకున్నారనుకుంటామా? అనుకోలేం, ఏదో అలా జరిగిపోయింది. ఇలా నాని నటించిన మతిమరుపు పాత్ర, ప్రతి పది నిమిషాలకో బ్యాంగ్ చొప్పున ఇచ్చుకుంటూ పైలా పచ్చీసుగా సాగిపోతూ వుండడంతో, స్ట్రక్చర్ తో పనే లేకుండా పోయింది. 

మహర్షి కథ - ఫస్టాఫ్ -  మిడిల్ -1
       యూఎస్ లో రిషి కుమార్ (మహేష్ బాబు) ఓ మల్టీనేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీలో తన అమోఘ మేధస్సుతో త్వరత్వరగా ఎదిగి సీఈవో స్థాయికి చేరుకుంటాడు. ఈ సందర్భంగా స్టాఫ్ అతణ్ణి సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది. వైజాగ్ లో రిషీ పూర్వ సహ విద్యార్ధుల్ని, ప్రొఫెసర్నీ (రావురమేష్) రప్పించి సర్ప్రైజ్ పార్టీ ఇస్తుంది. ఈ సందర్భంగా రిషి గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. 

బిగినింగ్
          వైజాగ్ లో రిషిది  మధ్యతరగతి కుటుంబం. ఎంటెక్ చదువుతూంటాడు. తల్లిదండ్రలు (జయసుధ, ప్రకాష్ రాజ్) వుంటారు. తండ్రి ఎదుగూ బొదుగూ లేని క్లర్క్ ఉద్యోగం చేస్తూంటే రిషి చిన్నచూపు చూస్తాడు. తను తండ్రి లాంటి సగటు జీవితం కోరుకోడు. జీవితంలో ఉన్నత స్థానాలకి చేరుకుని తండ్రికి చూపించాలన్న కసితో వుంటాడు. దీంతో మానవ సంబంధాల్ని పట్టించుకోడు. తన అభివృద్ధే మతంగా విజయాలు అందుకోవాలని దురుసుగా ప్రవర్తిస్తూంటాడు. 

          కాలేజీలో పూజా (పూజాహెగ్డే), రవిశంకర్ (అల్లరి నరేష్) రిషికి క్లోజ్ అవుతారు. పూజా రిషిని ప్రేమిస్తుంది. రవిశంకర్ రామవరం అనే వూళ్ళో ఓ పేద రైతు (తనికెళ్ళ భరణి) కొడుకు. బాగా చదువుకుని తండ్రి కష్టాలు తీర్చాలన్న పట్టుదలతో వుంటాడు. వూళ్ళో ఒక మోతుబరి (సాయికుమార్) కూతురితో ప్రేమలో వుంటాడు. ఇది మోతుబరికి నచ్చదు. సగటు విద్యార్ధిగా వున్న రవిశంకర్ ని రిషి తెలివైన వాడుగా తీర్చి దిద్దుతాడు. ఇదిలా వుంటే, రిషి రూపొందించిన ఒక సాఫ్ట్ వేర్ ని చూసి మంచి జాబ్ ఆఫర్ ఇస్తుంది ఓ అమెరికన్ కంపెనీ. పూజా అభినందించి ప్రేమని వ్యక్తం చేస్తుంది. తనకి ప్రేమలు కుదరవని, సక్సెస్ సాధించడమొక్కటే తన ధ్యేయమని చెప్పేసి ఆమెతో తెగదెంపులు చేసుకుంటాడు రిషి. రవిశంకర్ నచ్చజెప్ప బోతే లెంపకాయ కొట్టి వెళ్ళిపోతాడు.  

      ఇంతలో రిషి ప్రతీ సెమెస్టర్ లో టాప్ రావడాన్ని సహించని ఓ ఎంపీ (ముఖేష్ రిషి) కొడుకు రిషిని ఎగ్జామ్ పేపర్ దొంగతనం కేసులో ఇరికిస్తాడు. దీంతో రిషి డీబార్ అవుతాడు. అంతలో ఇది తప్పుడు కేసని విడుదల చేసేస్తారు. రిషి ఇక ఎగ్జామ్స్ రాసేసి కంపెనీలో జాయిన్ అవడానికి యూఎస్ కి ప్రయాణం కడతాడు  (ప్లాట్ పాయింట్ -1)
మిడిల్ -1 కంటిన్యూ 
       తండ్రి మరణవార్త విని తిరిగి వస్తాడు. అప్పుడు తండ్రి గురించి అతడికి తెలియని విషయం చెప్తుంది తల్లి. తల్లిని తీసుకుని యూఎస్ కొచ్చేస్తాడు రిషి.ఇవీ గత జ్ఞాపకాలు. ఇప్పుడు తేరుకుని చూస్తే,  వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళల్లో రవిశంకర్ , పూజా వుండరు. రిషి నిలదీస్తాడు. పూజా అక్కడే గేమింగ్ కంపెనీలో జాబ్ చేసుకుంటోందని చెప్తాడు ప్రొఫెసర్. రవిశంకర్  ఆ రోజు ఎగ్జామ్ పేపర్ దొంగతనం తన మీదేసుకుని రిషిని కాపాడేడనీ, దాంతో చదువూ చెడి, ఇది తట్టుకోలేక తండ్రీ మరణించి, రవిశంకర్ వూళ్ళోనే  వుంటున్నాడనీ చెప్పుకొస్తాడు ప్రొఫెసర్. ఇక వెంటనే రవిశంకర్  దగ్గరికి బయల్దేరి పోతాడు రిషి (ఇంటర్వెల్)

సెకండాఫ్ - మిడిల్ -2
       రామవరం చేరుకుంటాడు రిషి. అక్కడ రవిశంకర్ టెంటు కింద ఒక్కడే కూర్చుని వుంటాడు. ఇద్దరూ పరస్పరం ఉద్వేగానికి లోనై ఆలింగనం చేసుకుంటారు. తనతో యూఎస్ వచ్చేయమంటాడు రిషి. రానంటాడు రవిశంకర్. వూళ్ళో పరిస్థితి చెబుతాడు. పక్కనే సముద్రంలో గ్యాస్ పడి ఆ పైపు లైను కోసం వూళ్ళు ఖాళీ చేయిస్తున్నారనీ వలసపోతున్న వాళ్ళని చూపిస్తాడు. తను మాత్రం ఇది జరగనివ్వనంటాడు. రామవరం వూరుని కాపాడు కుని తీరతానంటాడు. 

          రిషి వెళ్లి కలెక్టర్ ని కలుస్తాడు. అవి బీడు భూములనీ, ఇప్పుడెవరూ వ్యవసాయం చేయడం లేదనీ, నేషనల్ ప్రాజెక్టు కింద భూసేకరణ జరుగుతోందనీ చెప్తాడు కలెక్టర్. రిషి మంత్రిని కలుస్తాడు. ఆ మంత్రి ప్రభుత్వాలు పాలన చేయడం లేదనీ, కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నాయనీ, వెళ్లి వివేక్ మిట్టల్ ని కలవమనీ అంటాడు. ముంబాయిలో కార్పొరేట్ బాస్ వివేక్ మిట్టల్ (జగపతిబాబు) ని కలుసుకుంటాడు రిషి. ఆ ఒక్క వూరుని వదిలేయమంటాడు. వదిలేది లేదంటాడు మిట్టల్. అయితే చూస్కుంటానంటాడు రిషి. 

          రిషి తన కంపెనీ ఆఫీసుని రామవరానికి మార్చేస్తాడు. ఇక్కడ్నించే కార్యకలాపాలు కొనసాగుతాయని స్టాఫ్ ని పిలిపించుకుంటాడు. ఇది తెలుసుకున్న గేమింగ్ కంపెనీ బాస్ టీం లీడర్ పూజని, రిషి అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిందిగా కోరతాడు. పూజా అయిష్టంగా వెళ్లి కలుస్తుంది గేమింగ్ యాప్ డీల్ కోసం. ఇది చూసి రవిశంకర్, పూజకీ ఆమె కొలీగ్ కీ తన ఇంట్లో బస ఏర్పాటు చేస్తాడు. పూజాకి రిషి మీద నమ్మకం కలగదు. ఏదో స్వార్ధం వుంటే తప్ప ఇక్కడ మకాం పెట్టడని రవిశంకర్ తో అంటుంది.

          రిషిని మీడియా వాళ్ళు చుట్టేస్తారు. ఇక్కడికెందుకు ఆఫీసు మార్చారని అడుగుతారు. మీ ఫ్రెండ్ ని మీతో రమ్మంటే రావడం లేదని ఇక్కడే ఆఫీసు తెరిచారట, మీతో ఎందుకు రావడం లేదని అడుగుతారు. అతన్నే అడగమంటాడు రిషి. టెంటు కింద కూర్చున్న రవిశంకర్,  తను అమెరికా వెళ్లి వచ్చే వరకూ ఈ వూరు వుంటుందన్న నమ్మకం లేదంటాడు.  అందుకని ఇక్కడే వుండి వూరుని కాపాడుకుంటానంటాడు.

        రవిశంకర్ మాటలతో వూళ్ళో కదలిక వచ్చి అందరూ అతడికి మద్దతుగా టెంటు కింద కూర్చుని ఉద్యమం ప్రారంభిస్తాడు. ఇది చూసి రిషి ఆనందిస్తాడు. రవిశంకర్ ప్రేమిస్తున్న అమ్మాయి తండ్రితో మాట్లాడి ఇద్దర్నీ ఒకటి చేస్తాడు. రిషి మమ్మల్ని కలిపాడు, నువ్వుకూడా రిషీని నమ్మి చూడమంటాడు రవిశంకర్ పూజాతో. ఆమె ఆనందంతో ఫోక్ సాంగేసుకుంటుంది రిషితో.      
   
          ఒక వ్యక్తి (రాజీవ్ కనకాల) వచ్చి రవిశంకర్ ఉద్యమానికి చుటుపక్కల గ్రామాల్లో మద్దతు కూడగడతాడు. దీంతో 40 గ్రామాల ప్రజలు రవిశంకర్ కి మద్దతుగా వస్తారు. ఇది తెలుసుకుని మిట్టల్ వచ్చేస్తాడు. అప్పుడొక్క గ్రామమే అడిగాను, ఇప్పుడు 41 గ్రామాలు వదులుకోమంటాడు  రిషి. మిట్టల్ రవిశంకర్ కి బేరం పెడతాడు నష్టపరిహారం పెంచుతూ. ప్రజలు అటు మొగ్గుతారు. రవిశంకర్ ఒంటరి అవుతాడు. ముంబాయి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి రిషి మీద ఆరోపణలు చేస్తాడు మిట్టల్. నిజానికి రిషి తన ప్రాజెక్టులో వాటా అడిగాడనీ, ఇవ్వనందు వల్లే ఇలా చేస్తున్నాడనీ అంటాడు. దీంతో గ్రామాల ప్రజలందరూ రిషి ద్రోహి అనీ,  వెళ్లిపోవాలనీ తిరగబడతారు (ప్లాట్ పాయింట్ -2)

ఎండ్ 
      రిషి తిరిగి వెళ్ళిపోదామంటే తల్లి వద్దంటుంది. గెలుపోటముల గురించి అతడి నమ్మకాల్ని గుర్తు చేస్తుంది. దీంతో టెంటు కింది కెళ్ళిపోయి ఒక్కడే కూర్చుంటాడు రిషి. మిట్టల్ మనుషులు దాడి చేస్తారు. ఆ దాడిని తిప్పి కొట్టి రైతుల మీద దృష్టి సారిస్తాడు. ఓ ముసలి రైతుని అడిగి సాధకబాధకాల్నితెలుసుకుంటాడు. అతడితో దుక్కి దున్నుతాడు, నారు వేస్తాడు, పంట పండిస్తాడు. ఈ క్రమంలో మిట్టల్ ఇక రవిశంకర్  మీద హత్యాప్రయతం జరిపిస్తాడు. రవిశంకర్ని కాపాడి హాస్పిటల్లో చేర్పిస్తాడు రిషి.
          గూగుల్ సెర్చి చేస్తాడు. రైతుల ఆత్మహత్యల గురించి తెలుసుకుంటాడు. మీడియా మీట్ పెడతాడు. రైతుల గురించీ, వ్యవసాయం గురించీ ఉపన్యాసమిస్తాడు. వ్యవసాయం తగ్గిపోతే కల్తీ ఆహారమే దక్కుతుందనీ హెచ్చరిస్తాడు. అతడి ఉపన్యాసంతో పెద్ద కదలిక వస్తుంది. తిరిగి వ్యవసాయాలు మొదలవుతాయి. ప్రభుత్వం దిగి వచ్చి ఎవరి  భూములు వాళ్ళకి అప్పజెప్పేస్తుంది. మిట్టల్ కి వ్యతిరేకంగా అతడి కొడుకు ఇచ్చిన స్టేట్ మెంట్ తో,  మిట్టల్ ని అరెస్టు చేస్తుంది ప్రభుత్వం. రిషి రైతుల సహాయార్ధం ఏడువేల కోట్లు ప్రకటించడంతో ముగింపు. 

క్రియేటివ్ యాస్పెక్ట్
      పై కథని తెరకెక్కించినప్పుడు కొన్ని మంచి ప్రయత్నాలు జరిగాయి. ప్రారంభంలో హీరో పరిచయ పాట రొటీన్ గా గ్రూప్ డాన్సర్స్ లేకుండా హీరో తత్వాన్ని తెలియబర్చే విషయంతో వుండడం, ఇంటర్వెల్లో రొటీన్ గా విలన్ని ప్రవేశపెట్టి. ఛాలెంజి విసరడం లాంటి అరిగిపోయిన మూస కథనాన్ని దూరంగా వుంచడం, ఇంటర్వెల్లో రొటీన్ బ్యాంగు లేకుండా, హీరో ఇండియా ప్రయాణంతో ఫస్టాఫ్ నుంచి సెకెండాఫ్ లోకి స్మూత్ ట్రాన్సిషన్ గా కథనం వుండేలా చూడడం లాంటివి. ఈ మంచి ప్రయత్నాలు సెకెండాఫ్ లో కన్పించవు. ఫస్టాఫ్ లో కూడా కథనానికి డైనమిక్స్ విషయం పట్టించుకోని కొన్ని సీన్లున్నాయి. ఒక సీన్లో రెండు విషయాలు చెప్పే అవకాశాన్ని జారవిడుచుకోవడం వల్ల అనవసరంగా సీన్లు పెరిగాయి. 

          ఫస్టాఫ్ మిడిల్ -1 తో ప్రారంభమవుతుంది. గ్లోబల్ కంపెనీ సీఈవోగా  రిషి అప్పాయింట్ కావడంతో. ఈ సందర్భంగా అతణ్ణి కీర్తించే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వస్తుంది- ‘నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం’ అని. ఈ పాట  దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో వుంది, రిషి పాయింటాఫ్ వ్యూలో కాదు. రిషి ఈ స్థాయిని అందుకోవడమే మిత్రుడు రవిశంకర్ గుప్త త్యాగం వల్లనైతే, దర్శకుడు ఈ విజయం క్రెడిట్ రిషిదే అన్నట్టు ఎలా  ‘నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం’ అని ప్రేక్షకులకి ఎస్టాబ్లిష్ చేస్తాడు?  ఇలా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు రవిశంకర్ చేసే త్యాగమనేదే వుండ కూడదు. రిషి సొంత టాలెంట్ తోనే  ఈ సక్సెస్ సాధించి వుండాలి. కాబట్టి సాటి మనుషులతో ఎలాటి సెంటిమెంట్లు లేని, సక్సెస్ కోసం ఇగో సెంట్రిక్ గా ప్రవర్తించే రిషి- ఇలా గ్లోబల్ సీఈవోగా సక్సెస్ అయినప్పుడు- ‘నేనే సమస్తం, నేనే సిద్ధాంతం’ అని ప్రథమ పురుషలో పాడుకుంటే పాత్రోచితంగా వుంటుంది. ‘నేనేనేనే’ అనుకుంటూ అతను తన మీద తనే పాడుకునే పాట డైరెక్ట్ గానూ, పవర్ఫుల్ గానూ వుంటుంది. తర్వాత ఈ సక్సెస్ రవిశంకర్ పెట్టిన భిక్ష అని తెలిశాక, పాడుకున్న ఈ పాటే తనని వెక్కిరిస్తుంది. ఇది పాత్రకి అవసరమైన ఐరనీని సృష్టిస్తుంది.  ఇలాటి డైనమిక్సే పాత్రలతో, కథనంతో చాలా చోట్ల కొరవడ్డాయి. కథనమంటే ఏమిటి? ఒకటి జరిగితే దానికి వ్యతిరేకంగా ఇంకోటి జరగడమేగా.  


           ఇది దర్శకుడు హీరోకి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్న తప్పుదోవ పట్టించే పాట. దీని చరణాలు కూడా దర్శకుడు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నట్టు  - ‘నీదొక మార్గం అనితర సాధ్యం,  నీదొక పర్వం శిఖరపు గర్వం’ - అంటూ వున్నాయి. ‘నాదొక మార్గం నాదొక పర్వం’ అంటూ రిషియే పొటమరించిన అతిశయంతో పాడుకోవాలి. తనని తను అతనే బల్లగుద్ది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దీంతో ప్రేక్షకుల మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది, వెంటనే క్యారెక్టర్ తో ఎటాచ్ అయిపోతారు. ఈ లోకం ద్వంద్వాలతో నిండి వుంది. ఏదీ ఎవడబ్బ సొత్తూ కాదు. చీకటి వెలుగులు, ఎండా వానలు, సుఖదుఃఖాలు, బొమ్మాబొరుసూ... ఇలా ద్వంద్వాలతోనే నడుస్తోంది సమస్తం. రిషి ప్రస్తుతం బొమ్మేసుకుని ఈ బొమ్మ తనదేనని ఎంజాయ్ చేస్తున్నాడు. బొరుసు కూడా పడుద్ది, పడబోతోంది. ఈ ద్వంద్వాల విన్యాసాలే డైనమిక్సు, కథనం. దీనికి రిషి తనమీద పాట తనే పాడుకోవడం తోడవాలి. 


          ఆత్రేయగారు ‘నేను పుట్టాను, లోకం మెచ్చిందీ - నేను ఏడ్చాను, లోకం నవ్విందీ’ అని అక్కినేని పాయింటాఫ్  వ్యూలో రాశారేగానీ, దర్శకుడు కేఎస్ ప్రకాశరావు జోక్యం చేసుకుని - ‘నువ్వు పుట్టావు, లోకం మెచ్చిందీ – నువ్వు  ఏడ్చావు, లోకం నవ్విందీ’ అని తన పాయింటాఫ్  వ్యూలో  కీర్తిస్తూ పాట రాయించుకోలేదు.
(ఇంకా వుంది)

సికిందర్  
       


Thursday, May 9, 2019

822 ; స్క్రీన్ ప్లే సంగతులు



         
నీసం సక్సెస్ గురించి చెప్పే సినిమా కథనైనా సక్సెస్ ఫుల్ గా చెప్పాలని వంద రూపాయల టికెట్ మేరా చిన్నఆశలాంటిది చట్ట ప్రకారం పెట్టుకుంటారు ప్రేక్షకులు. లేకపోతే బోర్లా పడుకుని చదువుకోవడానికి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఇంట్లోనే  చాలా పడి వుంటాయి. హీనపక్షం హీరో పాత్రకి ఒక బిగినింగ్,  దానికో సక్సెస్ అవ్వాలన్న చిన్నఆశయం, ఇంకో మిడిల్, మిడిల్లో ఆశయం కోసం సంఘర్షణ, మరింకో ఎండ్, ఇక్కడ ఆశయంతో గెలుపో ఓటమో చెప్పేస్తే చాలునని వంద రూపాయలని కాపాడుకుంటూ మొక్కుకుంటారు. పాత్ర ఆశయానికైనా, స్క్రీన్ ప్లే నడకకైనా కాన్ఫ్లిక్ట్ ఇంతే  సింపుల్. ఇంతకంటే మరేమీ లేదు ఎంత భారీ సినిమా కథకైనా. కానీ నటిస్తున్నది మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కాబట్టి కథలో ఇంకేవేవో వుండాలని, ఇంకేదేదో  ఘోరాలు జరిగిపోవాలని చేస్తూపోతే ఇవ్వాలనుకున్న మెసేజి ఇవ్వలేనిదిగా తయారవుతుంది. అసలు మెసేజి ఎందుకివ్వాలనేది వేరే టాపిక్ వదిలేద్దాం.

          ముందు ‘మహర్షి’ కథకి మార్కెట్ యాస్పెక్ట్ గా దేన్ని ఉద్దేశించారో తెలుసుకోవాలి. 1. జీవితంలో సక్సెస్ కోసం దూకుడుగా హీరో జర్నీ, 2. హీరో, అతడి ఫ్రెండ్ మధ్య పరోప - ప్రత్యుపకారాలు, 3. రైతుల భూములు లాక్కోవడం, 4. వ్యవసాయం కలిసిరాక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం. ఈ నాల్గూ వున్నాయి. ఏప్రెల్ 5, మే 1 మధ్య జీవితంలో సక్సెస్ అనే పాయింటుతో వరుసగా మజిలీ, చిత్రలహరి, జెర్సీ, నువ్వు తోపురా అనే 4 వచ్చేశాయి. ఇది కాకతాళీయంగానే  జరిగిందనుకోవచ్చు. ఇదే పాయింటుతో ఇప్పుడు ‘మహర్షి’ కూడా ఈ జాబితాలో కాకతాళీయంగానే  చేరింది. ఐతే పాయింటు ఫస్టాఫ్ కే దిగ్విజయంగా పూర్తయిపోయి, అక్కడ్నించీ ఫ్రెండ్ కి ప్రత్యుపకారమనే పాయింటు ఎత్తుకోవడాన్ని గమనించాలి.

          సరే, ‘సక్సెస్ కోసం సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్)’ అనే ఒకటే పాయింటు ఈ నెలరోజుల్లో వరుసగా 4 సినిమాలు వచ్చేసినా, ఇవి పూర్తి నిడివి ఆ పాయింటు మీదే నడిచే సినిమాలు. ‘మహర్షి’ వచ్చేసి ఫస్టాఫ్ లోనే ఈ పాయింటుని విజయవంతంగా ముగించుకుని, ఇక్కడ్నించీ ప్రత్యుపకార కథగా వుంటుంది.  కాబట్టి మొదటి నాల్గు సినిమాలూ, మహర్షీ పూర్తిగా ఒకటేనని చెప్పలేం. అయితే ఇందులో ఎంత సక్సెస్ గురించి  పాయింటు చెప్పినా, ఇది బిగినింగ్ విభాగం కథనం వరకే పరిమితమైంది. కాబట్టి టెక్నికల్ గా ఇది మొత్తం కథకి పాయింటు కాదు. మొత్తం కథకి పాయింటు ప్రత్యుపకార కథతో వుంది. ఎప్పుడైతే బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ వన్ లో ప్రత్యుపకారం పాయింటుతో మలుపు తీసుకుందో, అప్పుడిదే  కథవుతుంది సినిమాకి. కాబట్టి ఈ ప్రత్యుపకారం పాయింటుకి మాత్రమే మార్కెట్ యాస్పెక్ట్ వుందా అని చూసి, లేకపోతే సరి దిద్దుకుని, అప్పుడు మాత్రమే మిగతా రాత కోతల క్రియేటివ్ యాస్పెక్ట్ చేపట్టాలి. 

మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటి? 
       ఒక సినిమా కథ మార్కెట్ యాస్పెక్ట్ ని అనుకున్న ఐడియాని పట్టుకుని చూస్తారు. ఐడియా ఏమిటి? “హీరో తను సక్సెస్ అవడానికి ఫ్రెండ్ చేసిన త్యాగం తెలుసుకుని ప్రత్యుపకారం చేయబూనడం”. సింపుల్ గా ఇదీ ఒక లైనులో చెప్పుకుంటే ఐడియా లేదా పాయింటు. ఇదిప్పుడు మార్కెట్ లో అమ్ముడుబోతుందా? నేరము - శిక్ష పాయింటుకి దగ్గరగా వుండే ఈ ఐడియా పాతదే. పాతదే అయినా ఇది ఫ్రెండ్ షిప్ గురించి వుంది. ఫ్రెండ్ షిప్ మార్కెట్ అప్పీలుండే శాశ్వత యూనివర్సల్ ఎమోషన్. దీన్ని ఇప్పటి కోసం ట్రెండీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్ షిప్ కథ ఫ్రెండ్స్ మధ్యే వుంటుంది. అంటే ఫ్రెండ్ అయిన హీరో, వర్సెస్ అతడి ఫ్రెండ్ కథ. ఫ్రెండ్ ని పక్కనబెట్టి హీరో వర్సెస్ విలన్ కథగా ఐడియా మారిపోదు. మరీ ముఖ్యంగా ప్రత్యుపకార పాయింటుతో. ఫ్రెండ్ అయిన హీరో సక్సెస్ కి, తన జీవితాన్నే త్యాగం చేసిన ఫ్రెండ్ రుణం హీరో తీర్చుకునే ఐడియాలో, కథ వీళ్ళిద్దరి కుమ్ములాటతోనే వుంటుంది. 

          అంటే మహేష్ బాబు సక్సెస్ అవడానికి అతడికి తెలియకుండా అల్లరి నరేష్ పెద్ద త్యాగం చేస్తే, ఇది తెలుసుకున్న మహేష్ అతడి రుణం తీర్చుకునే ప్రయత్నం చేయడమన్న మాట. ఐడియాలో ఇది సగం కథే. దీన్ని పూర్తిచేయడానికి మహేష్ నరేష్ ని మొహమాట పెట్టేసి తన పవర్ తో ధాటీగా రుణం తీర్చుకుంటున్నట్టు చూపెట్టారు. దీనికి అడ్డుపడే పాత్రగా జగపతి బాబుని విలన్ గా దింపారు. అప్పుడీ ఐడియా ఫ్రెండ్స్ మధ్య కథగా కాక, హీరోకీ విలన్ కీ మధ్య కథగా మారింది. ఇది కరెక్టేనా? దీనికి మార్కెట్ యాస్పెక్ట్ వుంటుందా? హీరో వర్సెస్ విలన్ కృత్రిమ సినిమాలు వచ్చి వచ్చి చచ్చినంత పనై చాల్రోజులైంది. ఇంకా ఈ మృతకళేబరానికి ఆలంకరణే ఎందుకు?  చూసి చూసి తెలిసిపోయే కథగా వుండే, ఏ ఆసక్తీ  కల్గించని ఈ పాత రొటీనే ఇంకా మార్కెట్ లో అమ్ముడుబోయే సరుకవుతుందా? 

          అవచ్చు. కానీ ఇంకా బాగా అమ్ముడుబోయే సరుకు,  అరుదైపోయిన ఫ్రెండ్ వర్సెస్ ఫ్రెండ్ ఐడియా అవుతుందేమో ఒకసారాలోచించాలి. సరే, ఫ్రెండ్ వర్సెస్ ఫ్రెండ్, అంటే మహేష్ వర్సెస్ నరేష్ ప్రత్యుపకార ఐడియాతో కథెలా వుండొచ్చు? 

          ప్రత్యుపకారం ఒక మానవీయ విలువే, కాదనలేం. అయితే పొందిన ఉపకారాన్ని మించింది కాదు. ఉపకారం విలువని ప్రత్యుపకారంతో తగ్గించలేరు. “సరేలే నువ్వు నాకీ ఉపకారం చేశావ్ లేగానీ, ఇప్పుడు బదులుగా నేను నీకీ ప్రత్యుపకారం చేస్తున్నా తీస్కోవోయ్” - అని బలవంతంగా రుద్దలేరు. అవతలి వ్యక్తి తిప్పి కొడతాడు. అతను లాభం ఆశించి ఆ మేలు చేసి వుండడు. ఇది సున్నిత పరిస్థితి. సున్నితంగానే డీల్ చేయాలి.

          నేరము - శిక్ష టైపు కథలో హీరో ఒక ప్రమాదం చేసి ఒకణ్ణి చంపేశాడనుకుందాం. ఈ విషయం తనొక్కడికే తెలుసు. తన వల్ల ఆ మృతుడి కుటుంబం అనాధ అయిందని తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటాడు. వాళ్ళింట్లో పనివాడుగానో, ఇంకెలాగో చేరి ఆదుకుంటూ వుంటాడు. తను అసలేం చేసింది మాత్రం చెప్పడు. చెబితే తను చేసిన నేరానికి వేసుకున్నఈ శిక్ష అభాసు పాలవుతుంది. చివరికెప్పుడో అతడి నేరం కుటుంబ సభ్యులకి తెలిసిపోతుంది. కానీ అప్పటికి అతను చేసిన నష్టం కంటే కుటుంబం కోసం చేసిన మంచిపనులే మించి పోయివుంటాయి...

 ఐడియాతో పనిలేదు 
         ఇదే ఫ్రెండ్స్ తో ప్రత్యుపకార ఐడియాకీ వర్తిస్తుంది. ప్రత్యుపకారం చేయాలనుకుంటే తెలియకుండా చేయాలి. ఆఫ్ కోర్స్, సక్సెస్ కోసం పరుగులో సెంటిమెంట్లు వదిలేసిన మహేష్ బాబు పాత్రలాంటిది ఫ్రెండ్  నరేష్ తో వచ్చి ఓపెన్ గానే డిక్లేర్ చేస్తుంది- రుణం తీర్చుకుంటానని. మొహమాట పెట్టేసి, గిలిగింతలు పెట్టేసి ఒప్పించుకుంటుంది. పైగా తను మల్టీ నేషనల్ కంపెనీకి గ్లోబల్ సీఈవో. ఎవరాపుతారు?

          డ్రామా ఆపుతుంది. డ్రామాకి ప్రతినిధి అయిన నరేష్ ఆపుతాడు. ఆపకపోతే కథెలా  పుడుతుంది? తనేదో ఆశించి మహేష్ కి చేయలేదన్న ఒకే ఒక్క ఆత్మాభిమానమనే తనకి మిగిలిన ఆస్తితో నరేష్ ఆపేస్తాడు. తను పేదోడే గానీ, ఫ్రెండ్ షిప్ కి పేదకాదు. తను తీసుకోవడం కోసం ఇవ్వడు. ఇద్దరి మధ్యా ఈ విలువల వైరుధ్యమే కథకి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. భావోద్వేగాలతో హృదయాల్ని పిండేస్తుంది. ఫ్రెండ్ షిప్ ఒరిజినాలిటీని రుచి చూపించే ఈ కాన్ఫ్లిక్ట్ కి, ఎఫెక్ట్ అవని యూత్ వుంటాడా? సక్సెస్ కోసం మహేష్ బాబు పాత్రలాగా సెంటిమెంట్లు వదిలేసి పరుగులు తీస్తున్న యూత్ వుంటే, వాళ్ళు ఆగి ఒక్క క్షణమాలోచించే కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఇంత యూత్ అప్పీలుతో ఈ ఐడియాకి ఇంతకంటే మార్కెట్ యాస్పెక్ట్ ఏముంటుంది? 

          కానీ ఏం చేశారంటే, నరేష్ పాత్రని పూర్తిగా పాసివ్ చేసి, కిల్ చేసేసి టెంట్ కింద కూర్చోబెట్టేశారు. ఫ్రెండ్ షిప్ కి రెండు దృక్కోణాల్లోంచి ఒకదాన్ని తీసేస్తే, ఇక ఏకపక్ష దుందుడుకుతనమే మిగిలింది మహేష్ పాత్రతో. ఇందుకే ముగింపులో అతను ఇంతవరకూ జరిగిన కథలో ఏమీ నేర్చుకోలేనట్టే మిగిలిపోయాడు. ఎదుటి పాత్ర వుంటే కదా ఆ ఆర్గ్యుమెంట్ లోంచి నేర్చుకునేది. ఇక విలన్ జగపతి బాబు పాత్రతో మహేష్ కి ఎదురే లేదు. అతనింకో పనిలేని పాసివ్ విలన్ పాత్ర.

          మహేష్ తప్ప మిగిలినవి ఎందుకు పాసివ్ పాత్రలయ్యాయంటే, ఇది కథ కాక మహేష్ పాత్ర జర్నీ అన్నారు గనుక. ఇంటర్వెల్లో ఇప్పుడు జర్నీ ప్రారంభమవుతుందని కూడా అక్షరా లేశారు. కాబట్టి ఆటోమేటిగ్గా ఈ జర్నీ కథా లక్షణాలని కోల్పోయింది. ఇందుకే మెయిన్ పాయింటు లేదు, ఆ మెయిన్ పాయింటు చుట్టూ ఆర్గ్యుమెంట్ లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు;  తప్పు వైపు ఒకళ్ళుగా, ఒప్పు వైపు ఒకళ్ళుగా బలాబలాల సమీకరణ లేదు. చివరికి జడ్జిమెంటు కూడా లేదు. మరేం వుంది? స్టేట్ మెంట్ వుంది. కథకి ఇరు పక్షాలతో ఆర్గ్యుమెంట్ వుంటుంది, జర్నీకి ఏకపక్ష స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది తను చేసిన వాటి గురించి. అందుకే జర్నీ కథవదు, గాథ అవుతుంది. గాథ ఒక విషయం చుట్టూ కథలా వుండదు, పోతూంటే దారిలో తగిలే రకరకాల విషయాలతో ఎపిసోడ్లుగా వుంటుంది. ఆ పాత్ర జర్నీ అంతా ఈ రకరకాల ఎపిసోడ్లతోనే నిండి వుంటుంది. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం కూడా ఇలాటి గాథ వల్లే, జర్నీవల్లే ఫ్లాపయ్యింది. 

          ఐడియా అనుకున్నాక మొట్ట మొదట అందులో చూసేది మార్కెట్ యాస్పెక్ట్ తో కూడిన కథ వుందా అనే. ఒక పాయింటుతో ఆర్గ్యుమెంట్ వుందా అనే. ఐడియాకి స్ట్రక్చర్ వుందా అనే. ఇది ఖరారు చేసుకున్నాకే కథ రాసుకునే క్రియేటివ్ యాస్పెక్ట్ లోకి వెళ్తారు. మహేష్ బాబు పొందిన ఉపకారానికి తెగ రిచ్ గా ఎదిగి, పేదోడుగా ఆర్గ్యుమెంట్ ని లేవనెత్తే నరేష్ తో కథ వుంటుంది, స్ట్రక్చర్ వుంటుంది, కమర్షియల్ సినిమాకి అవసరమయ్యే అన్నీ వుంటాయి.

          కానీ కథ కాకుండా జర్నీగా చేసి ఈ కమర్షియల్ తో ఒక ప్రయోగం చేద్దామనుకున్నారు. ప్రపంచంలో ఇలాటి ప్రయోగం వరల్డ్ మూవీస్ తోనే చేస్తారు. స్ట్రక్చర్ వుండని వరల్డ్ మూవీస్ ని పాసివ్ పాత్రలతో, జర్నీలతో, గాథలతో, స్టేట్ మెంట్లతో ఇలాగే  తీస్తారు. ఇలా  ‘మహర్షి’ ఐడియా ఒక మంచి ప్రయోగం. ఈ ప్రయోగంలో మార్కెట్ యాస్పెక్ట్ ని చూడకూడదు. దీన్ని వరల్డ్ మూవీస్ పంథాలో ప్రేక్షకులు వేరేగా చూసి అర్ధం జేసుకోవాల్సి వుంటుంది యూరోపియన్ ప్రేక్షకుల్లాగా. తెలుగు ప్రేక్షకులు యూరోపియన్ ప్రేక్షకులవడం కన్నా శుభ పరిణామం ఏముంది?

(క్రియేటివ్ యాస్పెక్ట్ గురించి రేపు)
సికిందర్

   

821 ;రివ్యూ & స్క్రీన్ ప్లే సంగతులు!


Please do not search this blog for Telugu reviews on Friday. Visit directly Telugurajyam.com

Wednesday, May 8, 2019

820 : బాలీవుడ్ సీన్

    బాలీవుడ్ సినిమా బజార్ లో ప్రేక్షకులు ఎటు చూసినా చరిత్రలే చరిత్రలు! చరిత్రలు, జీవిత చరిత్రలు! బాలీవుడ్ బజార్ చరిత్ర పాఠాలకి ఒక లైబ్రరీగా మారిపోయింది. ఎటు చూసినా  హిస్టారికల్స్ తో చరిత్రలు, బయోపిక్స్ తో జీవిత చరిత్రలు! ఈ బజార్ లో జీవిత చరిత్రలతో చరిత్రలు పోటీ పడుతున్నాయి. సినిమాలంటే ఇక ఇవే అన్నట్టు ప్రేక్షకులు చూసి చూసి అలవాటైపోతున్నారు. మసాలా కమర్షియల్స్ ని మర్చిపోయేట్టున్నారు. బయోపిక్స్, హిస్టారికల్స్ ఇవే గాకుండా కల్పిత కథల పీరియడ్ మూవీస్ అంటూ కూడా మధ్యలో సందడి చేస్తున్నాయి. ఇటీవలే ఇలాటి కల్పిత కథతో  పీరియడ్ మూవీగా ‘కళంక్’ విడుదలయ్యింది. 

       
యురీ, కేసరి, మణికర్ణిక, బెటాలియన్ 609, తాష్కెంట్ పేపర్స్ అనే హిస్టారికల్స్ ఇప్పటికే రాగా, ఇక పానిపట్, తఖ్త్, బాట్లాహౌస్, తానాజీ, సర్దార్ ఉద్ధం సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, 83 అనే ఎనిమిది హిస్టారికల్స్  ఇంకా రాబోతున్నాయి. 

          ‘పానిపట్’ ని 1761 లో జరిగిన మూడవ పానిపట్టు యుద్ధం ఆధారంగా నిర్మిస్తున్నారు. మరాఠాలకూ, కాబూల్ రాజు అహ్మద్ షాకూ మధ్య జరిగిన హోరాహోరీ యుద్ధాన్ని ఇక మన కళ్ళముందు వెండితెర మీద చక్కగా చూడొచ్చు. ఇందులో సంజయ్ దత్ అహ్మద్ షాగా నటిస్తూంటే, బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ సదాశివ్ రావ్ బాహుగా నటిస్తున్నాడు. కృతీ సానన్ పార్వతీ బాయిగా నటిస్తోంది. ‘లగాన్’  ఫేమ్ దర్శకుడు ఆశుతోష్ గోవరీకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 6న ఇది విడుదల కాబోతోంది. దీని టీజర్, పోస్టర్ గత సంవత్సరం మార్చిలోనే విడుదలయ్యాయి.

        ఇక ‘తఖ్త్’ (పీఠం) మొఘల్ సామ్రాజ్య చరిత్ర. నిర్మాత కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మిస్తున్నాడు. షాజహాన్ చక్రవర్తి పెద్ద కుమారుడు, ఉపనిషత్తుల్ని పర్షియన్ లోకి అనువాదం చేసిన దారా షిఖోకి, అతడి తమ్ముడు ఔరంగ జేబుకీ మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన పోరుని ఈ చారిత్రికం చిత్రిస్తుంది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ దారా షిఖో గా నటిస్తున్నాడు. ఔరంగ జేబుగా విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. వీళ్ళిద్దరి అక్క జహానారా బేగంగా కరీనా కపూర్ నటిస్తోంది. దారా షిఖో భార్య నాదిరా బాను బేగంగా అలియాభట్ నటిస్తోంది. ఇక షాజహాన్ పాత్ర అనిల్ కపూర్ పోషిస్తున్నాడు. అనిల్ కపూర్ కుమార్తె జాహ్నవీ కపూర్ ఔరంగజేబు  రెండో భార్య ఔరంగబాదీ మహల్ గా నటిస్తోంది. భూమీ పడ్నేకర్ వచ్చేసి ఔరంగ జేబు మొదటి భార్య నవాబ్ బాయీగా నటిస్తోంది. ఇలా వైభవోపేతంగా  బాలీవుడ్ తరాతోరణమంతా కొలువుదీరారు. ఇంతకీ దర్శకుడెవరు? ఇంకెవరు కరణ్ జోహారే! ఈ  భారీ హిస్టారికల్ ని చూడాలంటే 2020 వరకూ ఆగాలి. 

          ఇక ‘బాట్లాహౌస్’ నిన్న మొన్నటి చరిత్రే. 2008లో ఢిల్ల్లీలో, బాట్లా హౌస్ లో జరిగిన ఇండియన్ ముజాహిదీన్  ఉగ్రవాదుల ఎన్కౌంటర్ కేసు ఆధారంగా నిర్మిస్తున్నారు. ఇందులో డిసిపి సంజీవ్ కుమార్ యాదవ్ గా జాన్ అబ్రహాం  నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, రవి కిషన్, నోరా ఫతేహీలు నటిస్తున్నారు. నిఖిల్ అద్వానీ దర్శకుడు. ఆగస్టు 15న విడుదలకి సిద్ధమవుతోంది.

          ‘తానాజీ -  ది అన్ సంగ్ వారియర్’ అజయ్ దేవగణ్ కి ప్రతిష్టాత్మకం. తానాజీ 17వ శతాబ్దపు మరాఠా సామ్రాజ్య సైనికాధికారి. కోహ్లీ సామాజిక వర్గానికి (కోహ్లీలు తెలుగు ముదిరాజులకి సమానం) చెందిన వాడు. పూర్తి పేరు తానాజీ మలుసారే. ఛత్రపతి శివాజీతో కలిసి ఎన్నో యుద్ధాలు చేశాడు. 1670 ఫిబ్రవరి 4 న సింహగఢ్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మొఘల్ సైనికాధికారి ఉదయ్ భాను రాథోడ్ తో తలపడి మట్టి కరిపించాడు తానాజీ. ఈ చారిత్రక ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉదయ్ భాను రాథోడ్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. దర్శకుడు ఓం రౌత్. ఇతను మారాఠీ దర్శకుడు. జనవరి 2020 లో విడుదలవుతుంది.  

          సూజిత్
సర్కార్ దర్శకత్వంలో ఉద్ధమ్ సింగ్ చరిత్ర ‘సర్దార్ ఉద్ధమ్ సింగ్’ గా వస్తోంది. బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా గదర్ పార్టీ స్థాపించి పోరాడిన విప్లవకారుడు సర్దార్ ఉద్ధమ్ సింగ్. 1919లో అమృత్సర్ లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్ పాల్పడిన జలియావాలా బాగ్ ఊచకోత దురంతానికి ప్రతీకారంగా,1940 లో లండన్ లో ఉద్ధమ్ సింగ్ అతణ్ణి హతమార్చడమే ఈ చారిత్రికం కథ. విక్కీ కౌశల్ ఉద్ధమ్ సింగ్ గా నటిస్తున్నాడు. ఇది కూడా 2020 లోనే విడుదలవుతుంది. అయితే 1999 లోనే ఈ చరిత్ర రాజ్ బబ్బర్ తో వచ్చింది. 

     ఇక ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ గా రీతేష్ దేశ్ ముఖ్ వస్తున్నాడు. రవి జాదవ్ దీని దర్శకుడు. హైదరాబాద్ కి చెందిన ‘భజరంగీ భాయిజాన్’ ఫేమ్ దర్శకుడు కబీర్ ఖాన్ ‘83’ అనే హిస్టారికల్ తీస్తున్నాడు. 1983లో ఇండియా గెలుచుకున్నవరల్డ్ కప్ క్రికెట్ విజయగాథని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ నటిస్తూంటే, సునీల్ గవాస్కర్ గా తాహిర్ రాజ్ భాషిన్ నటిస్తున్నాడు. మోహిందర్ అమర్నాథ్ గా సాఖీబ్ సలీం, కృష్ణమాచారి శ్రీకాంత్ గా జీవా, సయ్యద్ కిర్మానీగా సాహిల్ ఖట్టర్, దిలీప్ వెంగ్ సర్కార్ గా ఆదినాథ్ ఖొఠారే, రోజర్ బిన్నీగా నిశాంత్ దహియా నటిస్తున్నారు. ఏప్రెల్ 2020 లో విడుదలవుతుంది. 

          ఇవీ రాబోతున్న8 హిస్టారికల్స్. కొసమెరుపేమిటంటే ‘మొఘల్ -ది గుల్షన్ కుమార్ స్టోరీ’ అని కన్ఫ్యూజింగ్ టైటిల్ తో ఒకటి వస్తోంది. మొఘలుల కాలంలో ఈ గుల్షన్ కుమార్ ఎవర్రా బాబూ అని జుట్లు పీక్కోవాల్సిందే. అది మొఘలుల కాలం కాదట. గుల్షన్ కుమార్ ఒక మొఘల్ అట. బాలీవుడ్ లో టీ సిరీస్ సంగీత సామ్రాజ్యానికి మొఘల్. అదీ విషయం. చరిత్రలు, జీవిత చరిత్రల సందట్లో దివంగత టీ సిరీస్ బాస్ గుల్షన్ కుమార్ బయోపిక్ కూడా వచ్చేస్తోంది.

Tuesday, May 7, 2019

819 : టిప్స్

(53 – 60)
          53. కథలో హీరో విలన్ మీద ఎవరికీ తెలియకుండా గుప్తంగా వున్న రివెంజిని  ఎప్పుడు వెల్లడించ వచ్చు? ముందుగా - కథ వచ్చేసి రివెంజి గురించే అయితే, అదే హీరో గోల్ అనుకుంటే, ఇది వెల్లడించేందుకు టైము, టార్గెట్ అని రెండుంటాయనుకోవచ్చు. ముందుగా ప్రేక్షకులకే  వెల్లడించాలని టార్గెట్ వుంటే, విలన్ కి వెల్లడించడానికి ఇంకా టైముంటుంది. ఇక్కడ టార్గెట్ అయిన ప్రేక్షకులతో టైము ఎడంగా వుంటుంది. ఈ టైంలో విలన్ కి ఎప్పుడు తెలుస్తుందా అన్న సస్పెన్స్ ని ప్రేక్షకులు అనుభవించేలా కథనం చేసుకోవచ్చు ఆసక్తి వుంటే. ఇక ముందుగా విలన్ కే హీరో రివెంజిని వెల్లడించాలన్న టార్గెట్ వుంటే, అప్పుడు ఆటోమేటిగ్గా ప్రేక్షకులకి సైతం అప్పుడే వెల్లడై, టైం శూన్యమవుతుంది. ఇదంతా హీరోకి కథంతా రివెంజి అన్న ఒకే ఒక్క గోల్ వున్నప్పుడు.

          ఇలాకాక
, ఆ కథ ఇలా వుందనుకుందాం : వూళ్ళో ప్రజల కోరిక మీద ఓ ప్రజాసమస్య తీర్చడానికి హీరో పూనుకున్నాడనుకుందాం. అప్పుడా సమస్య స్వయంగా హీరో అనుభవించింది కాదు కాబట్టి అతడి గోల్ కన్విన్సింగ్ గా ఆన్పించక పోవచ్చు. కన్విన్సింగ్ గా అన్పించాలంటే, ఆ ప్రజల సమస్యకి కారకుడైన విలన్ తో హీరో గతంలో వ్యక్తిగతంగా బాధ ననుభవించి వుండాలి. ఇలా ఇప్పుడు ఊరుని కాపాడడం హీరో ఫిజికల్ గోల్ గా వుంటే, గతంలో విలన్ తో పడ్డ బాధ సైకలాజికల్ గోల్ గా వుంటుంది. మరి ఇలా ఊరుని కాపాడే ఫిజికల్ గోల్ గా నడుస్తున్న ప్రధాన కథలో, గుప్తంగా  వున్న సైకలాజికల్  గోల్ ని ఎప్పుడు వెల్లడించాలి

          సాధారణంగా ఏం జరుగుతుందంటే
, ఫిజికల్ గోల్ కి పూనుకున్న హీరోకి విలన్ ఎదురు పడగానే గజిబిజిగా ఏవో షాట్లు పడతాయి. అప్పుడు గతంలో విలన్ తో హీరోకి ఏదో జరగరాని ఘోరం జరిగిందని మనకర్ధ మవుతుంది. అప్పుడు దీని ప్రభావం కథ మీద, మన మైండ్స్ మీద ఎలా వుంటుంది? కథ ఫోకస్ చెదురుతుంది, ఇక ముందు ముందు హీరోకి చాదస్తంగా ఏదో ఫ్లాష్ బ్యాక్ వేస్తారని మనకి ముందే తెలిసిపోతుంది. ఇలా నాసిరకం కథనం పాలబడకుండా వుండాలంటే ఏం చేయాలి

          అప్పుడు 2016 లో విడుదలైన 
మాగ్నిఫిషెంట్ సెవెన్’  చూడాలి. ఈ కౌబాయ్ మూవీలో ప్రజాకంటకుడుగా వున్న విలన్ని,  ప్రజల తరపున హీరో ఎదుర్కొని, చిట్ట చివరి సీనులో వాణ్ణి  చంపుతున్నపుడు మాత్రమే - అసలు తానెవరో అప్పుడు చెప్పి, తన తల్లినీ, చెల్లెళ్ళనీ విలన్ చంపిన సంగతీ అప్పుడు గుర్తుచేసి, చెడామడా చంపి పగ తీర్చుకుంటాడు!

         
 ఇలా ఫిజికల్ గోల్ పూర్తి చేస్తూ  చిట్ట చివర మాత్రమే హీరో తన సైకలాజికల్ గోల్ ని వెల్లడించడం వలన - మనకి ఒక రహస్యం బయటపడి షాక్, ఒక ట్విస్ట్, ఒక ఫినిషింగ్ టచ్ ఇవన్నీ అనుభవమై- 1) హీరోకి ఇంత కథ వుందా అని అప్పుడు తెలిసి, 2) ఇందుకోసం ఊరుని కాపాడేందుకు పూనుకున్నాడా అన్న భావోద్వేగం పుట్టి, 2) అప్పుడా హీరో చాలా మెచ్యూర్డ్ గా, హుందాగా కనపడి అభిమానం ఇంకింత పెరిగి, 4 ) అతడి  సైకలాజికల్ గోల్ ని  ఫ్లాష్ బ్యాక్ విజువల్స్ వేయకుండా కేవలం నాల్గు డైలాగుల్లో  ఎమోషనల్ గా వెల్లడించే సరికి, ఆ జరిగిన గతం తాలూకు సంఘటనా దృశ్యాల్ని మనకి నచ్చిన రీతిలో మనం వూహించుకునే వీలు ఏర్పడి, 5) హీరో ఫిజికల్ గోల్ ని కన్విన్సింగ్ గా  ఫీలవుతాం

         
1954 లో అకిరా కురసావా సెవెన్ సమురాయ్తీస్తే, 1960 హాలీవుడ్ లో  దాన్ని మాగ్నిఫిషెంట్ సెవెన్గా రీమేక్ చేశారు. తిరిగి 2016 లో డెంజిల్ వాషింగ్టన్ తో డైనమిక్స్ ని ఏ మాత్రం మార్చకుండా ఇలా ఇంకో రీమేక్ చేశారు

          54. ముందుగా
హీరో ఎంట్రీ సీను ఆలోచించి అక్కడ్నించీ కథ ఆలోచిస్తే? దాంతో కథ ఎంతకీ రాకపోవచ్చు. ఓ ఇద్దరు ఇదే అనుభవంతో జుట్లు పీక్కున్నారు. హీరో ఎంట్రీ సీను ఆలోచించింతర్వాత, తర్వాతి సీన్లేమిటా అని ఆలోచిస్తే కథే రావడం లేదు. ఇదేం కొత్త సమస్య కాదు, చాలా పాత సమస్యే. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఎక్కడో చదివిందో చూసిందో ఒక సీను బాగా నచ్చేసి, ఆ సీనుని అద్భుతంగా చూపిస్తూ లేదా హైలైట్ చేస్తూ దాంతో కథ అల్లేద్దామనుకున్నపుడు ఇలాటి సమస్య ఎదురవుతుంది. 

          సినిమా కథ ఆలోచించడమంటే ఎక్కడో నచ్చేసిన దృశ్యాన్ని ఇరికించి తీరాలన్న దురుద్దేశం పెట్టుకుని దాంతో ఆలోచిస్తారా? (తాజాగా రెండు నెలల క్రితం కూడా ఒక నిర్మాతతో ఇదే సమస్య. వూళ్ళో జరిగిన ఒక సంఘటనలో ఒక దృశ్యం ఆయనకి బాగా నచ్చింది. దాన్ని ప్రేమించి, అది పెట్టుకుని కథ కూడా ఆలోచించేసి ఫిక్స్ అయిపోతే, ఇక ఆ కథ లేడికి తోడేలు తల అతికించినట్టు వుంది. ఏం చేయాలి? లేడినైనా చంపాలి, తోడేలు తలైనా నరకాలి. దేనికీ ఆయన ఇష్టపడక లేడి తోడేలుని అలాగే భద్రపర్చుకున్నారు). సినిమా కథని హీరో ఎదుర్కొనే సమస్య (పాయింటు) ఆధారంగా ఆలోచించక పోతే కథ వస్తుందా?


          కథంటే ఎంట్రీ సీను కాదు. కథంటే పాయింట్, లేదా హీరో ఎదుర్కొనే సమస్యే! ముందుగా ఈ పాయింట్ లేదా సమస్య  ఫిక్స్ చేసుకోకుండా ఎంత  ఆలోచించినా వున్నచోటే వుండిపోతారు. ఉదాహరణకి, హీరో హీరోయిన్లు ప్రేమించుకున్నారు. హీరోయిన్ ప్రేమని హీరో పొందాలంటే, ఆమె చెప్పినట్టు వాళ్ళ నాన్న ఎక్కడో దాచిన ఒక వస్తువు కొట్టేసుకుని రావాలి. ఇదే కథ. ఆ వస్తువు కొట్టేసుకుని రావడమే పాయింటు, లేదా హీరో సమస్య.  హీరో, లేదా ఆ కథ హీరోయిన్ ఓరియెంటెడ్ అయితే హీరోయిన్, ఓ సమస్యలో ఎలా ఇరుక్కుని, అందులోంచి ఎలా బయట పడ్డారన్నదే  ప్రపంచంలో ఏ కమర్షియల్ సినిమా కథయినా. 


          కాబట్టి కథ ఆలోచించడం మొదలెట్టాల్సింది హీరో ఎంట్రీ సీను పెట్టుకుని  కాదు, హీరో ఎదుర్కొనే సమస్యతో. ముందు సమస్యేమిటో నిర్ణయించింత్తర్వాతే ఎంట్రీలూ బ్యాంగులూ ఇంకేవైనా.  హీరో ఎవరు (బిగినింగ్) - అతను ఇరుక్కున్న సమస్యేమిటి (మిడిల్)-  ఆ సమస్య లోంచి ఎలా బయట పడ్డాడు (ఎండ్)- ఇలా ఆలోచించడం మొదలిపెడితే తప్ప ఎంత తపస్సు చేసినా, ఊటీ వెళ్లి ఎన్ని సిట్టింగులేసినా జన్మకి కథ రాదు. తపస్సు తుస్సు మనడం, ఊటీ తడిసి మోపెడవడం ఖాయం.


          55. కామెడీ రైటింగ్ కూడా ఇంటలిజెంట్ రైటింగ్ గా మారినప్పుడే  అప్డేటెడ్ మూవీస్ ప్రేక్షకుల మధ్యకి వస్తాయిఅవే సినిమాటిక్ డైలాగులతో, సీన్లతోక్రియేటివిటీ లేని మాసిపోయిన కార్బన్ కాపీ కామెడీలు తీయడం కంటే  - జీవితాల్లో ఉట్టి పడే సహజ హాస్యంతో  ఆరోగ్యకర సినిమాలు తీసే స్థాయికి ఎదగడం ఇప్పటి మార్కెట్ కి అర్జెంటు అవసరం. సమాజంలో చాలా హస్యముంది, పాత్రలున్నాయి- వీటితో ప్రేక్షకులు తమని ఐడెంటిఫై చేసుకున్నంతగా, మూసఫార్ములా కామెడీ- పేరడీలకి కనెక్టయ్యే  పరిస్థితి ఇక లేదని వారం వారం విడుదలయ్యే సినిమాల్ని చూస్తూంటే తెలిసిపోతూనే వుంది. ఇక హార్రర్ కామెడీ, థ్రిల్లర్ కామెడీ, యాక్షన్ కామెడీ, క్రైం కామెడీ, అడల్ట్ కామెడీ...ఇంకేవేవో  కామేడీలంటూ ఇతర జానర్లని కలిపి కృత్రిమంగా తీసేస్తూ, అసలు ప్యూర్ కామెడీనే మర్చిపోయారు. ప్యూర్ కామెడీలకి  ఇటు జంధ్యాల, ఈవీవీ లాంటి వాళ్ళు; అటు హృషికేష్ ముఖర్జీ, ప్రియదర్శన్ లాంటి వాళ్ళూ  ఇప్పుడు లేనే లేరు. అలాగే  సింగీతం శ్రీనివాసరావు టైపు హింస లేని ఫక్తు హాస్యభరిత క్లయిమాక్సులు ఇప్పుడు వర్కౌట్ కావేమో అనుకుంటే, ‘ఈడు గోల్డ్ ఎహెఅనే తాజా  కామెడీలో జానర్ కి విరుద్ధమైన, హింసాత్మక క్లయిమాక్స్ ఏమైనా వర్కౌట్  అయ్యిందా ఆలోచించాలి.

          56. చాలామంది అర్ధం చేసుకోలేని ఒక ప్రాథమిక సూత్రముంది : ఒక సినిమాని ప్రేక్షక సమూహానికి చూపించడమంటే, యుగాలుగా డీఫాల్టుగా వాళ్ళ అంతరంగాల్లో నిబిడీకృతమై వున్న కథని రిసీవ్ చేసుకునే స్పందనలతో అనుసంధాన మవగల్గడమే! కథని పత్రిక కోసం రాసినా, సినిమా కోసం రాసినా ఆయా పాఠకులతో, ప్రేక్షకులతో అదొక సైకలాజికల్ ఎక్సర్ సైజే అవుతుంది మరి. కథలు వాటి మూడంకాల నిర్మాణంలో- అంటే- బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలతో- లేదా త్రీయాక్ట్ స్ట్రక్చర్ తో వున్నప్పుడే అదీ ఆ అంకాల్లో లేదా విభాగాల్లో లేదా యాక్స్ట్ లో వేటికవిగా జరిగే బిజినెస్సుల్ని కలిగి వున్నప్పుడే, మనుషుల అంతరంగ స్పందనలతో  మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ ఆవనప్పుడు ఆ కథలు ఫెయిలవుతాయి. ఇట్స్ దట్ సింపుల్! 

          57. విభాగాల బిజినెస్ అంటే గుండుగుత్త ట్రీట్ మెంట్ కాదు. స్క్రీన్ ప్లేలో ఆయా అంక విభాగాల్లో జరగాల్సిన కార్యకలాపాల తీరుని బిజినెస్ అంటారు. స్క్రీన్ ప్లే లో మనం చెప్పుకునే బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు మూడూ ఒక్కోటీ ఒక్కో తరహా బిజినెస్ ని కలిగి వుంటాయి. రిలయెన్స్ వాళ్ళ బిజినెస్ రిలయెన్స్ వాళ్ళ బిజినెస్సే, టాటా వాళ్ళ బిజినెస్ టాటా వాళ్ళ బిజినెస్సే. అలాగే బిర్లాల కార్యకలాపాలు బిర్లాలవే. ఒక్కరూ ఇంకో తమ సాటి పోటీదారుల్లాగా తమ వ్యవస్థల్ని నడుపుకోవడానికి ఇష్టపడరు. అలాగే స్క్రీన్ ప్లేలో కూడా బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు మూడింట్లో ఏ ఒక్కటీ ఇంకోదానితో పోలిన బిజినెస్ ని కలిగి వుండదు. స్క్రీన్ ప్లే విభాగాల రచనలో ఈ విలక్షణీయతల్ని గుర్తించకపోతే, ఆ మొత్తం కథ ప్రసారం చేసే తరంగాలని ప్రేక్షకుల అంతరంగ రాడార్ వికర్షించడం మొదలెడుతుంది.

         
58. ఏళ్ల తరబడీ సినిమాల్ని చూస్తూ వస్తూంటే ఒక తత్త్వం బోధపడుతోంది : తీసుకున్న స్టోరీ ఐడియాని లైన్ ఆర్డర్ ఒక మెట్టు పైకి తీసికెళ్ళాలి, ఆ లైన్ ఆర్డర్ ని స్క్రీన్ ప్లే ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళాలి, ఆ స్క్రీన్ ప్లేని డైలాగ్ వెర్షన్ మరింకో మెట్టు పైకి లాగాలి, ఆ డైలాగ్ వెర్షన్ ని నటనలు కొండెక్కిస్తే, ఆ నటనల్ని దర్శకత్వం అందలా లెక్కించాలని!

         
ఇదెలా పెరుగుతుందంటే, ఉదాహరణకి ఓ చిన్న పిల్లాడు ఓ చిన్న పిల్ల దగ్గర్నుంచి తియ్యటి చాక్లెట్ లాక్కున్నాడనుకుందాం. అప్పుడు దీనికి ప్రతీకారంగా ఆ పిల్ల ఆ పిల్లాడి డబ్బులన్నీ బరబరా లాగేసుకుంటుంది. దీంతో ఆ పిల్లాడు ఆ పిల్లకి ఎంతో ప్రాణప్రదమైన ఆట బొమ్మని కసబిసా లాగేసుకుంటే, ఆ పిల్ల పిల్లాడి టోపీ ఊడబీక్కుని పారిపోతుంది. వాడు బోడి గుండుతో బ్యారు మంటాడు. మళ్ళీ పిల్ల దగ్గర్నుంచీ ఉంగరం వూడ లాక్కుంటే, ఆ పిల్ల కన్నింగ్ గా, పిల్లాడు పేరెంట్స్ కి చూపించకుండా దాచేసిన సున్నా మార్కుల ప్రోగ్రెస్ రిపోర్టు కొట్టేసుకుని పోతుంది!

          ఇలాగన్న మాట. ఇరువైపులా ఇలా నష్ట తీవ్రత పెరుగుతూ పోవడమే టైం అండ్ టెన్షన్ థియరీ. అసలైన యాక్షన్ - రియాక్షన్ ల ఇంటర్ ప్లే.
   


          59. వేల సంవత్సరాలుగా ఆకట్టుకుంటూ ఇంకా మున్ముందు కూడా ఆకట్టుకోగల సాంప్రదాయ నిర్మాణాన్ని కలిగివుండే కథల నిర్మాణపరమైన నియమ నిబంధనల్ని ఉల్లంఘించి, అవాంట్ గార్డ్ పద్ధతిలో అంటే- కమర్షియలేతర యూరోపియన్ సినిమాల తరహాలో- ఇంకా చెప్పాలంటే మన ఆర్ట్ సినిమాల  టైపులోనే - కథ చెప్పాలనుకుంటే మిమ్మల్ని కాపాడే వారెవరూ వుండరని అంటున్నాడు ఇంటర్నెట్ స్క్రీన్ రైటింగ్ కోర్సు ఎడిటర్ లారెన్స్ కానర్. కనుక సాంప్రదాయబద్ధంగానే ( అంటే బిగినింగ్-మిడిల్-ఎండ్ నియమ నిబంధనల్ని పాటిస్తూ) కథ చెప్పాలనీ, చెబుతూ అందులోనే కొత్తగా, ఆశర్యపర్చే విధంగా కథనం చేసుకోవాలనీ చెబుతున్నాడు. ఇలా చెప్పే వాళ్ళు తెలుగు ఫీల్డులో లేరు, ఇదే సమస్య.

          60. చిత్ర నిర్మాతలు ఘరానా మనుషులు, వాళ్ళది సభ్యప్రపంచం. అయితే నా కళ్ళ ఎదుటనే కళ కోసం పాకులాడిన నిర్మాతలు పోయి, మాది వ్యాపారం, లాభాలు తియ్యటం తప్ప వేరే ఆశయం లేదు అని ఎలుగెత్తి చాటే నిర్మాతలు వచ్చారు. సినిమా రంగంలో చేరి  నాలుగు డబ్బులు చేర్చుకునే సదవకాశం వచ్చిన నాడు కళకు అశ్రుతర్పణం విడిచి, కళాదృష్టీ,  కళా ప్రమేయమూకళా వైఖరిని  విసర్జించటమాలేక ముష్టెత్తుతూ, అప్రయోజకుల జాబితాలోనూ, పిచ్చివాళ్ళ జాబితాలోనూ చేరటమా? సులువుగా తేలే  సమస్య ఎంత మాత్రమూ కాదు - కొడవటిగంటి కుటుంబరావు (1961).

(మరికొన్ని మరోసారి)
సికిందర్