కనీసం సక్సెస్ గురించి చెప్పే సినిమా కథనైనా సక్సెస్ ఫుల్ గా చెప్పాలని వంద రూపాయల టికెట్ మేరా చిన్నఆశలాంటిది చట్ట ప్రకారం పెట్టుకుంటారు ప్రేక్షకులు. లేకపోతే బోర్లా పడుకుని చదువుకోవడానికి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఇంట్లోనే చాలా పడి వుంటాయి. హీనపక్షం హీరో పాత్రకి ఒక బిగినింగ్, దానికో సక్సెస్ అవ్వాలన్న చిన్నఆశయం, ఇంకో మిడిల్, మిడిల్లో ఆశయం కోసం సంఘర్షణ, మరింకో ఎండ్, ఇక్కడ ఆశయంతో గెలుపో ఓటమో చెప్పేస్తే చాలునని వంద రూపాయలని కాపాడుకుంటూ మొక్కుకుంటారు. పాత్ర ఆశయానికైనా, స్క్రీన్ ప్లే నడకకైనా కాన్ఫ్లిక్ట్ ఇంతే సింపుల్. ఇంతకంటే మరేమీ లేదు ఎంత భారీ సినిమా కథకైనా. కానీ నటిస్తున్నది మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కాబట్టి కథలో ఇంకేవేవో వుండాలని, ఇంకేదేదో ఘోరాలు జరిగిపోవాలని చేస్తూపోతే ఇవ్వాలనుకున్న మెసేజి ఇవ్వలేనిదిగా తయారవుతుంది. అసలు మెసేజి ఎందుకివ్వాలనేది వేరే టాపిక్ వదిలేద్దాం.
ముందు ‘మహర్షి’ కథకి
మార్కెట్ యాస్పెక్ట్ గా దేన్ని ఉద్దేశించారో తెలుసుకోవాలి. 1. జీవితంలో సక్సెస్
కోసం దూకుడుగా హీరో జర్నీ, 2. హీరో, అతడి ఫ్రెండ్ మధ్య పరోప - ప్రత్యుపకారాలు, 3. రైతుల
భూములు లాక్కోవడం, 4. వ్యవసాయం కలిసిరాక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం. ఈ నాల్గూ
వున్నాయి. ఏప్రెల్ 5, మే 1 మధ్య జీవితంలో సక్సెస్ అనే పాయింటుతో వరుసగా మజిలీ,
చిత్రలహరి, జెర్సీ, నువ్వు తోపురా అనే 4 వచ్చేశాయి. ఇది కాకతాళీయంగానే జరిగిందనుకోవచ్చు. ఇదే పాయింటుతో ఇప్పుడు ‘మహర్షి’
కూడా ఈ జాబితాలో కాకతాళీయంగానే చేరింది. ఐతే
పాయింటు ఫస్టాఫ్ కే దిగ్విజయంగా పూర్తయిపోయి, అక్కడ్నించీ ఫ్రెండ్ కి ప్రత్యుపకారమనే
పాయింటు ఎత్తుకోవడాన్ని గమనించాలి.
సరే, ‘సక్సెస్ కోసం సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్)’ అనే ఒకటే పాయింటు ఈ నెలరోజుల్లో వరుసగా 4 సినిమాలు వచ్చేసినా, ఇవి పూర్తి నిడివి ఆ పాయింటు మీదే నడిచే సినిమాలు. ‘మహర్షి’ వచ్చేసి ఫస్టాఫ్ లోనే ఈ పాయింటుని విజయవంతంగా ముగించుకుని, ఇక్కడ్నించీ ప్రత్యుపకార కథగా వుంటుంది. కాబట్టి మొదటి నాల్గు సినిమాలూ, మహర్షీ పూర్తిగా ఒకటేనని చెప్పలేం. అయితే ఇందులో ఎంత సక్సెస్ గురించి పాయింటు చెప్పినా, ఇది బిగినింగ్ విభాగం కథనం వరకే పరిమితమైంది. కాబట్టి టెక్నికల్ గా ఇది మొత్తం కథకి పాయింటు కాదు. మొత్తం కథకి పాయింటు ప్రత్యుపకార కథతో వుంది. ఎప్పుడైతే బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ వన్ లో ప్రత్యుపకారం పాయింటుతో మలుపు తీసుకుందో, అప్పుడిదే కథవుతుంది సినిమాకి. కాబట్టి ఈ ప్రత్యుపకారం పాయింటుకి మాత్రమే మార్కెట్ యాస్పెక్ట్ వుందా అని చూసి, లేకపోతే సరి దిద్దుకుని, అప్పుడు మాత్రమే మిగతా రాత కోతల క్రియేటివ్ యాస్పెక్ట్ చేపట్టాలి.
మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటి?
ఒక
సినిమా కథ మార్కెట్ యాస్పెక్ట్ ని అనుకున్న ఐడియాని పట్టుకుని చూస్తారు. ఐడియా
ఏమిటి? “హీరో తను సక్సెస్ అవడానికి ఫ్రెండ్ చేసిన త్యాగం తెలుసుకుని
ప్రత్యుపకారం చేయబూనడం”. సింపుల్ గా ఇదీ ఒక లైనులో చెప్పుకుంటే ఐడియా లేదా
పాయింటు. ఇదిప్పుడు మార్కెట్ లో అమ్ముడుబోతుందా? నేరము - శిక్ష పాయింటుకి దగ్గరగా
వుండే ఈ ఐడియా పాతదే. పాతదే అయినా ఇది ఫ్రెండ్ షిప్ గురించి వుంది. ఫ్రెండ్ షిప్ మార్కెట్
అప్పీలుండే శాశ్వత యూనివర్సల్ ఎమోషన్. దీన్ని ఇప్పటి కోసం ట్రెండీగా అప్డేట్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్ షిప్ కథ ఫ్రెండ్స్ మధ్యే వుంటుంది. అంటే ఫ్రెండ్ అయిన హీరో, వర్సెస్ అతడి
ఫ్రెండ్ కథ. ఫ్రెండ్ ని పక్కనబెట్టి హీరో వర్సెస్ విలన్ కథగా ఐడియా మారిపోదు. మరీ
ముఖ్యంగా ప్రత్యుపకార పాయింటుతో. ఫ్రెండ్ అయిన హీరో సక్సెస్ కి, తన జీవితాన్నే
త్యాగం చేసిన ఫ్రెండ్ రుణం హీరో తీర్చుకునే ఐడియాలో, కథ వీళ్ళిద్దరి కుమ్ములాటతోనే
వుంటుంది.
అంటే మహేష్ బాబు సక్సెస్ అవడానికి అతడికి తెలియకుండా అల్లరి నరేష్ పెద్ద త్యాగం చేస్తే, ఇది తెలుసుకున్న మహేష్ అతడి రుణం తీర్చుకునే ప్రయత్నం చేయడమన్న మాట. ఐడియాలో ఇది సగం కథే. దీన్ని పూర్తిచేయడానికి మహేష్ నరేష్ ని మొహమాట పెట్టేసి తన పవర్ తో ధాటీగా రుణం తీర్చుకుంటున్నట్టు చూపెట్టారు. దీనికి అడ్డుపడే పాత్రగా జగపతి బాబుని విలన్ గా దింపారు. అప్పుడీ ఐడియా ఫ్రెండ్స్ మధ్య కథగా కాక, హీరోకీ విలన్ కీ మధ్య కథగా మారింది. ఇది కరెక్టేనా? దీనికి మార్కెట్ యాస్పెక్ట్ వుంటుందా? హీరో వర్సెస్ విలన్ కృత్రిమ సినిమాలు వచ్చి వచ్చి చచ్చినంత పనై చాల్రోజులైంది. ఇంకా ఈ మృతకళేబరానికి ఆలంకరణే ఎందుకు? చూసి చూసి తెలిసిపోయే కథగా వుండే, ఏ ఆసక్తీ కల్గించని ఈ పాత రొటీనే ఇంకా మార్కెట్ లో అమ్ముడుబోయే సరుకవుతుందా?
అవచ్చు. కానీ ఇంకా బాగా అమ్ముడుబోయే సరుకు, అరుదైపోయిన ఫ్రెండ్ వర్సెస్ ఫ్రెండ్ ఐడియా అవుతుందేమో ఒకసారాలోచించాలి. సరే, ఫ్రెండ్ వర్సెస్ ఫ్రెండ్, అంటే మహేష్ వర్సెస్ నరేష్ ప్రత్యుపకార ఐడియాతో కథెలా వుండొచ్చు?
ప్రత్యుపకారం ఒక మానవీయ విలువే, కాదనలేం. అయితే పొందిన ఉపకారాన్ని మించింది కాదు. ఉపకారం విలువని ప్రత్యుపకారంతో తగ్గించలేరు. “సరేలే నువ్వు నాకీ ఉపకారం చేశావ్ లేగానీ, ఇప్పుడు బదులుగా నేను నీకీ ప్రత్యుపకారం చేస్తున్నా తీస్కోవోయ్” - అని బలవంతంగా రుద్దలేరు. అవతలి వ్యక్తి తిప్పి కొడతాడు. అతను లాభం ఆశించి ఆ మేలు చేసి వుండడు. ఇది సున్నిత పరిస్థితి. సున్నితంగానే డీల్ చేయాలి.
నేరము - శిక్ష టైపు కథలో హీరో ఒక ప్రమాదం చేసి ఒకణ్ణి చంపేశాడనుకుందాం. ఈ విషయం తనొక్కడికే తెలుసు. తన వల్ల ఆ మృతుడి కుటుంబం అనాధ అయిందని తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటాడు. వాళ్ళింట్లో పనివాడుగానో, ఇంకెలాగో చేరి ఆదుకుంటూ వుంటాడు. తను అసలేం చేసింది మాత్రం చెప్పడు. చెబితే తను చేసిన నేరానికి వేసుకున్నఈ శిక్ష అభాసు పాలవుతుంది. చివరికెప్పుడో అతడి నేరం కుటుంబ సభ్యులకి తెలిసిపోతుంది. కానీ అప్పటికి అతను చేసిన నష్టం కంటే కుటుంబం కోసం చేసిన మంచిపనులే మించి పోయివుంటాయి...
ఐడియాతో పనిలేదు
ఇదే
ఫ్రెండ్స్ తో ప్రత్యుపకార ఐడియాకీ వర్తిస్తుంది. ప్రత్యుపకారం చేయాలనుకుంటే
తెలియకుండా చేయాలి. ఆఫ్ కోర్స్, సక్సెస్ కోసం పరుగులో సెంటిమెంట్లు వదిలేసిన మహేష్
బాబు పాత్రలాంటిది ఫ్రెండ్ నరేష్ తో వచ్చి
ఓపెన్ గానే డిక్లేర్ చేస్తుంది- రుణం తీర్చుకుంటానని. మొహమాట పెట్టేసి, గిలిగింతలు
పెట్టేసి ఒప్పించుకుంటుంది. పైగా తను మల్టీ నేషనల్ కంపెనీకి గ్లోబల్ సీఈవో.
ఎవరాపుతారు?
డ్రామా ఆపుతుంది. డ్రామాకి ప్రతినిధి అయిన నరేష్ ఆపుతాడు. ఆపకపోతే కథెలా పుడుతుంది? తనేదో ఆశించి మహేష్ కి చేయలేదన్న ఒకే ఒక్క ఆత్మాభిమానమనే తనకి మిగిలిన ఆస్తితో నరేష్ ఆపేస్తాడు. తను పేదోడే గానీ, ఫ్రెండ్ షిప్ కి పేదకాదు. తను తీసుకోవడం కోసం ఇవ్వడు. ఇద్దరి మధ్యా ఈ విలువల వైరుధ్యమే కథకి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. భావోద్వేగాలతో హృదయాల్ని పిండేస్తుంది. ఫ్రెండ్ షిప్ ఒరిజినాలిటీని రుచి చూపించే ఈ కాన్ఫ్లిక్ట్ కి, ఎఫెక్ట్ అవని యూత్ వుంటాడా? సక్సెస్ కోసం మహేష్ బాబు పాత్రలాగా సెంటిమెంట్లు వదిలేసి పరుగులు తీస్తున్న యూత్ వుంటే, వాళ్ళు ఆగి ఒక్క క్షణమాలోచించే కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఇంత యూత్ అప్పీలుతో ఈ ఐడియాకి ఇంతకంటే మార్కెట్ యాస్పెక్ట్ ఏముంటుంది?
కానీ ఏం చేశారంటే, నరేష్ పాత్రని పూర్తిగా పాసివ్ చేసి, కిల్ చేసేసి టెంట్ కింద కూర్చోబెట్టేశారు. ఫ్రెండ్ షిప్ కి రెండు దృక్కోణాల్లోంచి ఒకదాన్ని తీసేస్తే, ఇక ఏకపక్ష దుందుడుకుతనమే మిగిలింది మహేష్ పాత్రతో. ఇందుకే ముగింపులో అతను ఇంతవరకూ జరిగిన కథలో ఏమీ నేర్చుకోలేనట్టే మిగిలిపోయాడు. ఎదుటి పాత్ర వుంటే కదా ఆ ఆర్గ్యుమెంట్ లోంచి నేర్చుకునేది. ఇక విలన్ జగపతి బాబు పాత్రతో మహేష్ కి ఎదురే లేదు. అతనింకో పనిలేని పాసివ్ విలన్ పాత్ర.
మహేష్ తప్ప మిగిలినవి ఎందుకు పాసివ్ పాత్రలయ్యాయంటే, ఇది కథ కాక మహేష్ పాత్ర జర్నీ అన్నారు గనుక. ఇంటర్వెల్లో ఇప్పుడు జర్నీ ప్రారంభమవుతుందని కూడా అక్షరా లేశారు. కాబట్టి ఆటోమేటిగ్గా ఈ జర్నీ కథా లక్షణాలని కోల్పోయింది. ఇందుకే మెయిన్ పాయింటు లేదు, ఆ మెయిన్ పాయింటు చుట్టూ ఆర్గ్యుమెంట్ లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు; తప్పు వైపు ఒకళ్ళుగా, ఒప్పు వైపు ఒకళ్ళుగా బలాబలాల సమీకరణ లేదు. చివరికి జడ్జిమెంటు కూడా లేదు. మరేం వుంది? స్టేట్ మెంట్ వుంది. కథకి ఇరు పక్షాలతో ఆర్గ్యుమెంట్ వుంటుంది, జర్నీకి ఏకపక్ష స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది తను చేసిన వాటి గురించి. అందుకే జర్నీ కథవదు, గాథ అవుతుంది. గాథ ఒక విషయం చుట్టూ కథలా వుండదు, పోతూంటే దారిలో తగిలే రకరకాల విషయాలతో ఎపిసోడ్లుగా వుంటుంది. ఆ పాత్ర జర్నీ అంతా ఈ రకరకాల ఎపిసోడ్లతోనే నిండి వుంటుంది. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం కూడా ఇలాటి గాథ వల్లే, జర్నీవల్లే ఫ్లాపయ్యింది.
ఐడియా అనుకున్నాక మొట్ట మొదట అందులో చూసేది మార్కెట్ యాస్పెక్ట్ తో కూడిన కథ వుందా అనే. ఒక పాయింటుతో ఆర్గ్యుమెంట్ వుందా అనే. ఐడియాకి స్ట్రక్చర్ వుందా అనే. ఇది ఖరారు చేసుకున్నాకే కథ రాసుకునే క్రియేటివ్ యాస్పెక్ట్ లోకి వెళ్తారు. మహేష్ బాబు పొందిన ఉపకారానికి తెగ రిచ్ గా ఎదిగి, పేదోడుగా ఆర్గ్యుమెంట్ ని లేవనెత్తే నరేష్ తో కథ వుంటుంది, స్ట్రక్చర్ వుంటుంది, కమర్షియల్ సినిమాకి అవసరమయ్యే అన్నీ వుంటాయి.
కానీ కథ కాకుండా జర్నీగా చేసి ఈ కమర్షియల్ తో ఒక ప్రయోగం చేద్దామనుకున్నారు. ప్రపంచంలో ఇలాటి ప్రయోగం వరల్డ్ మూవీస్ తోనే చేస్తారు. స్ట్రక్చర్ వుండని వరల్డ్ మూవీస్ ని పాసివ్ పాత్రలతో, జర్నీలతో, గాథలతో, స్టేట్ మెంట్లతో ఇలాగే తీస్తారు. ఇలా ‘మహర్షి’ ఐడియా ఒక మంచి ప్రయోగం. ఈ ప్రయోగంలో మార్కెట్ యాస్పెక్ట్ ని చూడకూడదు. దీన్ని వరల్డ్ మూవీస్ పంథాలో ప్రేక్షకులు వేరేగా చూసి అర్ధం జేసుకోవాల్సి వుంటుంది యూరోపియన్ ప్రేక్షకుల్లాగా. తెలుగు ప్రేక్షకులు యూరోపియన్ ప్రేక్షకులవడం కన్నా శుభ పరిణామం ఏముంది?
(క్రియేటివ్ యాస్పెక్ట్ గురించి
రేపు)
―సికిందర్
―సికిందర్