"నాదొక మాఫియా క్వశ్చన్ బాసూ - సినిమా కథంటే సరుకులేని స్మగ్లింగేనా!"
ఈ మధ్య విడుదలవుతున్న తెలుగు సినిమాలు వాటి అనుకున్న కాన్సెప్ట్సుకి, ఆ కాన్సెప్ట్సు కిస్తున్న ట్రీట్ మెంట్సు (స్క్రీన్ ప్లే)
తో ఎలాంటి సంబంధమూ లేకుండా
ఎందుకొస్తున్నట్టు? సినిమా
కథలకి రాసే రచయితలతో బాటు, రాయని ఇంకెందరో ‘రచయితలు’ ఉండడం వల్ల, ఈ సమస్య తప్పడం లేదు. కనుక కాన్సెప్ట్సు కిచ్చే ట్రీట్ మెంట్స్ మీద ఎందరి హస్తాలు
పడ్డా, వాటి ఏకత్వ సూత్రాలకి ఏమాత్రం భంగం కలక్కుండా, మొత్తం కథ నాణ్యత కూడా పూర్తిగా దిగజారిపోకుండా
కాపాడుకునే మార్గ మేదైనా వుందా?
తప్పకుండా వుంది. నిత్యం ఫీల్డుని బెంబేలెత్తించే ఫ్లాపుల సంఖ్యని
తగ్గించుకోవాలనుకున్నా, ఓ పరిష్కారమార్గం
ఆవశ్యకత ఎంతైనా వుంది. ఒక టాక్ షోలో దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నట్టు- “తెలుగు సినిమాపుట్టి 75 సంవత్సరాలు గడుస్తున్నా, ఇంకా అనుభవాల మీద ఆధారపడి సినిమాలు
నిర్మిస్తున్నారు తప్పితే, ఎలాటి సినిమా సైన్సు
పట్లా అవగాహన ఇప్పటికీ లేదు..” నిజమే, సినిమా సైన్సు అంతా విదేశాల్లోనే
దినదినాభివృద్ధి చెందుతూ, ఇంగ్లీషు పుస్తకాల్లో
నిక్షిప్తమై వుంది. వీటిని చదివే ఓపిక లేదు.
తెలుగులోకి తెచ్చే ప్రయత్నమూ లేదు. కనుక మన దగ్గర ఇలా భూస్థాపితమై పోయిన
సినిమా సైన్సు అనే భోషాణం లోంచి కథా శాస్త్రాన్ని పైకి తీసి చూసుకుంటే, ఓ బ్రహ్మాండమైన పరిష్కార మార్గమే కన్పిస్తుంది!
ఏమిటా పరిష్కారం? చాలా సింపుల్. శ్రమనుకోకుండా కాస్త మూలాల్లో
కెళ్ళి, గొప్ప కథలకి ఏ ఏ
అంశాలైతే పునాది రాళ్ళుగా ఉంటున్నాయో వాటిని స్థాపించుకుంటూ పోవడమే. అప్పుడా బలమైన
నిర్మాణం మీద ఎందరు ఎలా చేయిచేసుకున్నా, నోరెలా పారేసుకున్నా, స్క్రిప్టు పూర్తిగా అధఃపాతాళానికి జారిపోకుండా, కనీసం మధ్యస్థ నాణ్యతా ప్రమాణాలతోనైనా
ఉంటూ, ఓ మంచే కథ అన్పించుకుని
బయట పడే అవకాశముంది. ఏ పునాదీ లేకుండా కేవలం సొంత నమ్మకాలాధారంగా గాలిలో అల్లుకునే
కథల్ని కథా చర్చల పేరుతో నల్గురూ కలిసి కూర్చుకుని, జీరో చేసి వదిలేకన్నా ఇది నయమే కదా? మధ్యస్థంగా ఓ మంచి కథ!
ఈ రోజుల్లో ఓ మంచికథ
తయారైతే చాలు. గొప్ప గొప్ప కళాఖండాలు ఇప్పుడెవరూ తీయడంలేదు. కనుక గొప్ప కథలంటూ
తలలు బద్దలు చేసుకోనవసరంలేదు. కాలక్షేపానికి ఒద్దికగా ఓ మంచి కథ అందించ గల్గితే
చాలు. గొప్ప కథలంటే హాలీవుడ్ స్థాయిలో వచ్చే ‘స్టార్ వార్స్’, ‘జురాసిక్ పార్క్’, ‘టైటానిక్’, ‘జాస్’, ‘సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’ లాంటివన్నమాట. ఇవి అంత గొప్ప కథలెలా కాగలిగాయో
తెలుసుకుంటే, కథకుడు ఆ రహస్యాన్ని తన
కాన్సెప్టు లో ఇమిడ్చి గొప్ప స్క్రిప్టు నే ఊహించగలడు. అప్పుడు తెలుగు సినిమా
ఎక్కడికో వెళ్ళిపోతుంది!
కానీ అంత సీను లేదు.
కళాఖండాలకి కాలం కాదుకున్నాం గనుక అంతేసి గొప్ప కథలకి గిరాకీ తగలడం అసాధ్యం. నో
ప్రాబ్లం. ఐతే మొట్ట మొదట ఆ స్థాయిలో కథని ఊహించ గల్గితేనే కథకుడనే వాడు అవసరమైతే దాని ఇంకో వెర్షన్ ని కూడా ఆత్మవిశ్వాసంతో
విన్పించగలడు. గొప్ప పునాదితో తనకొచ్చిన ఆ గొప్ప ఊహని అప్పుడో మెట్టు కిందికి
దించి, ఫ్రేము వదులు చేసి, అలవాటు పడ్డ తెలుగు సినిమాల రన్నింగ్ ని అప్లై
చేస్తే, అప్పుడింక ఎవరెన్ని
మార్పు చేర్పులు కోరినా, గొప్ప కథ పునాది మొదటే
పడింది గనుక, కాన్సెప్ట్ నుంచి ట్రీట్
మెంట్ పతనమూ కాదు, సినిమా భ్రష్టు కూడా
పట్టిపోదు.
నాణ్యత ఓ మెట్టు దిగినా, మంచి కథ అనే కితాబు ఎక్కడికీ పోదు. అప్పటికీ
నిద్రపట్టక ఇంకా నీచానికి దిగలాగే చేతులు వుంటే, వాళ్ళని అట్టర్ ‘ఫ్లాప్తి’ రస్తు –అని దీవించేసి వాళ్ళ ఖర్మానికి వదిలెయ్యడమే!
గొప్పకథకి అలాటి బలమైన
పునాది వేయడమెలా? చాలా సింపుల్. ముందుగా
తెరమీద కదలాడే చలన చిత్రమంటే అది మనిషి మనసు లోపలి ప్రపంచాన్ని (
మానసిక ప్రపంచాన్ని) ఆవిష్కరించే శాస్త్రమని గుర్తిస్తేచాలు. వెండి తెర మీద మనం చూసే పాత్రలు నిజానికి
నిజ జీవితంలో నిత్యం మనం చవిచూసే వివిధ ఎమోషన్స్ కి ప్రతిరూపాలే. ‘ఇగో’ అనే ఎమోషన్ కి హీరో పాత్ర, ప్రేమాశృంగార భావాలకి హీరోయిన్ పాత్ర, మానసికోల్లాసానికి హాస్యగాడు, శాంతి సౌఖ్యాలకి తల్లి, భద్రతా భావానికి తండ్రి, మార్గదర్శకత్వానికి గురువు లేదా గాడ్ ఫాదర్, మనం అణిచిపెట్టుకునే సవాలక్ష జంతు లక్షణాలకి
విలన్ పాత్రలూ సింబల్స్ అన్నమాట. ఈ ఎమోషన్స్ అన్నిటినీ కలబోసి మైమరిపించేదే గొప్ప
కథ. ఇప్పుడిన్నేసి ఎమోషన్స్ వెండితెరమీద ఆవిష్కారం కావడంలేదు. పాత్రల సంఖ్య
తగ్గిపోవడమే ఇందుక్కారణం. మన మనో ప్రపంచాన్ని తెర మీద సంపూర్ణంగా ప్రతిఫలింప జేయడం
ఏనాడో తగ్గిపోయింది. అయినా కూడా నో ప్రాబ్లం. మనలో వుండే తొమ్మిది రకాల
ఎమోషన్స్ లో చాలా వాటికి వెండి తెర మీద ప్రాతినిధ్యం తగ్గిపోయినా, ప్రధాన ఎమోషన్ అయిన ‘ఇగో’ ( అంటే హీరో పాత్ర)
నైనా సవ్యంగా పోషించుకో
గల్గితే చాలు, అప్పుడు ఆటోమేటిగ్గా అదే ఓ మంచి సినిమాగా
ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం వుంది.
ఇగో ఎవరి మాటా వినని మొండి ఘటం. అందుకని దాన్ని
యుక్తిగా దారిలో పెట్టి, మెచ్యూర్డ్ ఇగో దిశగా నడిపించేదే గొప్ప కథ
కుండే ప్రధానలక్షణం. ఆ నడకలో ఎడబాటు- ప్రయత్నం-అవగాహన- జ్ఞానోదయం అనే నాలుగు
మజిలీలుంటాయి. జ్ఞానోదయంవల్ల ఇగో చివరికి ‘మేచ్యూర్డ్ ఇగో’ గా మార్పు చెంది కథ ముగిస్తుంది.
మన మైండ్ రెండు గా
విభజించి ఉంటుందనేది తెలిసిందే. ఆ రెండూ కాన్షస్ మైండ్- సబ్ కాన్షస్ మైండ్ లు.
కాన్షస్ మైండ్ కి ఇగో కేంద్రంగా ఉంటూ, లాజికల్ గా
ఆలోచిస్తుంది. పరిస్థితిని బేరీజు వేస్తుంది. నిర్ణయాలు తీసుకుంటుంది. సినిమా కథలో
ఇగో చేసే పాత్ర ప్రయాణం లో దానికి సంబంధించిన కార్యకలాపాల్ని హీరో పాత్ర ద్వారా
అడ్డదిడ్డంగా డిస్టర్బ్ చేయకుండా,
జాగ్రత్తగా నిర్దేశిత గమ్యం వైపు నడిపించాల్సి వుంటుంది.
ఇంకాస్త లోతు కెళ్దాం.
పైన వివరించిన హాలీవుడ్ సినిమాలు అంత గొప్ప ఆస్కార్ అవార్డు కథ లెందు
కయ్యాయంటే, అవి మనిషి
మానసికావసరాల్ని అంత కరువుదీరా తీర్చేశాయి గనుక! మనిషి మానసిక ప్రపంచాన్ని పైన
చెప్పిన కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ లు ప్రభావితం చేస్తాయి. వెండితెర మీద ఈ రెండు
మైండ్స్ కీ చెలగాటం పెట్టి రఫ్ఫాడించి హిట్లు కొడతారు సరయిన సృష్టికర్తలైతే.
ఈ రెండు మైండ్సూ ఎలాటి ఏర్పాటుతో ఉంటాయంటే, మధ్యలో లంకలా కాన్షస్
మైండ్ వుంటే, ఆ లంక చుట్టూ మహా సముద్రంలా పర్చుకుని సబ్ కాన్షస్ మైండ్
వుంటుంది. లంకని పాలించుకునే ఇగోకి,
ఆ సముద్రంలోకి వెళ్ళాలంటే మహా భయం. ఎందుకంటే, ఆ సముద్ర గర్భంలో తాను తట్టుకోలేని నిజాలుంటాయి, ఎదుర్కోలేని ప్రశ్నలు దాగి వుంటాయి. సాధ్యమైనంత
వరకూ ఆ సబ్ కాన్షస్ మైండ్ కి మొహం చాటేసి తిరగడమే అది నేర్చు కుంది.
అంతరాత్మకి (సబ్ కాన్షస్) కి సమాధానం చెప్పుకోవడం దానికి సుతరామూ ఇష్టముండదు.
పలాయనవాదంతో దాన్ని తొక్కిపెట్టి బలాదూరు తిరగడమే దానికిష్టం!
ఇదే సమయంలో సబ్ కాన్షస్
మైండ్- లేదా మన అంతరాత్మ అపార విజ్ఞాన ఖని కూడా. దానికి తెలీని సమాచారమంటూ వుండదు.
అది సర్వాంతర్యామి. అందుకే తన వైపు రావడానికి జంకే ఇగోకి అది తియ్యటి షుగర్
కోటింగ్ కలలతో అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ఆపత్కాలంలో ఆదుకుంటూ వుంటుంది.
ఇక పాయింటు
కొచ్చేద్దామా? సరీగ్గా మనలో లంకలాంటి
కాన్షస్ మైండ్ కీ- ఆ లంక చుట్టూ మహా సముద్రంలాఆవరించుకుని వుండే సబ్
కాన్షస్ మైండ్ కీ లడాయి పెట్టి స్టీవెన్ స్పీల్ బెర్గ్ ‘జాస్’అనే గొప్ప కథా చిత్రాన్ని నిర్మించేశాదు!
సినిమాలో చూపించే సముద్రం- ఆ మధ్యలో వుండే దీవి మన మానసిక ప్రపంచానికి నకళ్ళే.
సముద్రంలోంచి సొర చేప రివ్వుమని వచ్చేసి దాడి చేస్తూంటుంది. ఈ సొర చేప మన సబ్
కాన్షస్ లో దాగి మనల్ని భయపెడుతూ వుండే నగ్నసత్యాలకి ప్రతీక. ఈ సొర చేపతో తలపడే
హీరో మన ఇగోనే!
స్పీల్ బెర్గేతీసిన ‘ఈటీ’ లోనూ భూమ్మీదికి
గ్రహాంతర జీవి ఒకటి వస్తుంది. మనకి మనం నివశించే భూమి మనకి తెలిసిన ప్రపంచమే-కాన్ష
మైండ్ కి సింబల్ గా దీన్నితీసుకుంటే, అప్పుడా గ్రహాంతర జీవి
అదేమిటో మనకి తెలీని నిగూఢ లోకం- సబ్ కాన్షస్ మైండ్ కి గుర్తుగా తీసుకుంటే- (పని
గట్టుకుని తీసుకోనవసరంలేదు- యాదృచ్చికంగా మన మెదడే అలా కనెక్ట్
అయిపోతుంది-మెదళ్ళకి కనెక్ట్ అవుతూ మనకి తెలీకుండా మాయ చేసేదే గొప్ప కథ! )..
అప్పుడు ఈ రెండిటి దోబూచులాట ఎలా వుంటుంది మన మనస్సుకి?
అంతరిక్ష యుద్ధాన్ని
చిత్రించే ‘స్టార్ వార్స్’ మాత్రం? అంతరిక్షం మన సబ్
కాన్షెస్సే! ఇక సముద్రంలో మునిగిపోయే నౌక ‘టైటానిక్’ మాత్రం? సముద్రం భయంకరమైన సబ్
కాన్షస్- నౌక బిక్కుబిక్కు మనే కాన్షస్! ‘జురాసిక్ పార్క్’ లోకూడా ఆ కాంపౌండు మన కాన్షస్ అయితే, దాని చుట్టూ పార్కు సబ్ కాన్షస్. ఇక చూస్కోండి
ఆట!
మన మానసికలోకంలో
ద్వైదీభావపు ఈ రెండు మైండ్స్ కీ నిత్యం జరిగే సంఘర్షణకి సజీవ చిత్రణలే
ఇవన్నీ. ఇందుకే ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల ప్రేక్షక బాహుళ్యం నాడిని ఇవి
అంతబాగా పట్టుకోగాలిగాయి. తెలుగు ఫీల్డులో ప్రేక్షకుల నాడిని పట్టుకోవడం కష్టమని
అలవాటుగా అనేస్తూంటారు. అది అవగాహన లోపించిన మాట. పైన పేర్కొన్నట్టు తమ్మారెడ్డి భరద్వాజ విశ్లేషణ లోంచి పుట్టిన
జీవులు అలాగే మాట్లాడతాయి. ఇంకో గమ్మత్తేమిటంటే, జీవితంలో తాము చేయలేనివి తెర మీద హీరో
చేస్తూంటే ప్రేక్షకులు ఆనందిస్తారని మోటుగా అనేస్తూంటారు. ఈ మెకానిజమేంటో
తెలుసుకోరు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వచ్చిందే ఆ మెకానిజం. మన సబ్ కాన్షస్ ని
మనం ధైర్యంగా ఎదుర్కోలేకపోవడమనే బలహీనతని, తెర మీద మన ఇగో రూపంలో హీరో చేసేస్తూంటే అది మనకి ఆత్మసంతృప్తి
కలిగిస్తుందన్నమాట!
సినిమాల్లో కథల్లో
లేవనెత్తే సమస్యలకీ, వాటిని పరిష్కార దిశగా
నడిపించడానికి రాసుకునే ట్రీట్ మెంట్లకీ పొంతన లేకుండా ఎందుకు ఉంటోందో గ్రహిస్తే
కదా నాడిని పట్టుకోవడానికి! స్థాపించే సమస్య సబ్ కాన్షస్ అయితే, దాని పరిష్కార మార్గం, లేదా దానికై పోరాటం కాన్షస్ మైండ్ అన్న
ప్రాథమిక జ్ఞానం లేకుంటే ఎలా!
కనీసం తెలుగులోనే
వచ్చిన కొన్ని గొప్ప/ మంచి సినిమాలని కాపీ కొట్టి వాటిలాగే హిట్ చేయలన్నా అసలంటూ
సైన్సు తెలియాలి. రాం గోపాల్ వర్మ ‘శివ’ లో నాగార్జున పాత్ర కాన్షస్ ఇగో అవుతుందనీ, అతను తలపడే చీకటిమాఫియా ప్రపంచం సబ్ కాన్షస్
అవుతుందనీ, అందులో రఘువరన్ విలన్ పాత్ర
ఎదుర్కోక తప్పని ఒక కఠిన ప్రశ్నవుతుందనీ ఎందరికి తెలుసు? నీలకంఠ ’మిస్సమ్మ’ లో శివాజీ-భూమికలు కాన్ష ఇగో- సబ్ కాన్షస్ లకి గుర్తులు. ‘ఒక్కడు’లో భూమికని దాచిపెట్టిన గది సబ్ కాన్షస్ అయితే, భూమిక ఆ సబ కాన్షస్ లో పరిష్కరించాల్సిన ఒక
సమస్య! మిగతా ఇల్లూ- చార్మినార్ అంతస్తూ కాన్షస్. మహేష్ బాబు పాత్ర కాన్షస్ ఇగో.
కురుక్షేత్రం లో నూరుమంది కౌరవులు మన మనసుల్ని పీడించే ప్రతికూల భావాలకి
ప్రతీకలైతే, అర్జునుడు వాటితో పోరాడే మన కాన్షస్
ఇగో అని చిన్మయానంద స్వామి తన ‘ఆర్ట్ ఆఫ్ మాన్ మేకింగ్’ అనే గ్రంధంలో ఏనాడో చెప్పేశాడు.
కాబట్టి ఇలా గొప్ప
సినిమా కథల అంతర్నిర్మాణ పోస్ట్ మార్టం ని విస్పష్టంగా చూడగల్గినప్పుడు...ఆ బలమైన
పునాది కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే తోనే ఏర్పడుతుందనే అవగాహన
పెంచుకున్నప్పుడు, కథలకిచ్చే ట్రీట్
మెంట్స్, లేదా స్క్రీన్ ప్లేలు
కనీసం గొప్ప కథల స్కేలు పైనుంచి మరీ కిందికి జారిపోకుండా చూసుకోవడమెలాగో
తెలిసిపోతుంది.
కథని ఇలాటి ఇంటర్ ప్లే
తో బలంగా లాక్ చేశాక, నలుగురి నోళ్ళూ చేతులూ
పడ్డా అది కథనం వరకే పరిమితమౌతూ కొంత మేర వాళ్ళవాళ్ళ ‘క్రియేటివిటీ’ తో దిగజారుస్తారేమో గానీ, ఏం చేసీ మొత్తంగా చెడగొట్ట లేరు! కథకుడు
చేయాల్సింది ఇంటర్ ప్లేకి బలమైన లాక్ వేసి ఆకట్టుకోవడమే. బలహీన లాక్ తో కథా
చర్చల్లో కూర్చుంటే ఆ లాక్ కూడా వుండదు- ఇంకేవో కథనాల్ని ఎవరిష్టం వచ్చినట్టు
వాళ్ళు పారించుకునే ఏలూరు లాకుల్లాంటివి వచ్చి పడతాయి!
―సికిందర్
(జూన్ 2007 ‘ఆంధ్రభూమి’)
(ఈ మధ్య
కొందరు రాసుకున్న కథలు మార్పు చేర్పులకి
లోనై బలహీనంగా మారిపోతున్న పరిస్థితిని దృష్టిలో
పెట్టుకుని పై వ్యాసాన్ని పునర్ముద్రించాం -
కథలు బలహీనపడకుండా కాపాడుకునేందుకు
ఈ ఎత్తుగడ పనికొస్తుందన్నఉద్దేశంతో)