సాధారణంగాబిగినింగ్ విభాగం చప్పున ( ఓ పది నిమిషాల్లో ) ముగిసిపోయి
ప్లాట్ పాయింట్ - 1 ఏర్పడే మన సినిమాలు చూడ్డానికి
హాయిగా వుంటాయనుకుంటాం. ఎందుకంటే బిగినింగ్ విభాగం ఎంత చప్పున ముగిసిపోతే అంత త్వరగా ఉపోద్ఘాతం తప్పి కథ ప్రారంభమవుతుంది కాబట్టి. ఐతే ఇలాటి
సినిమాలు ఎప్పుడో గానీ రావు. వచ్చాయంటే తిరుగులేకుండా ఫ్లాప్ అవడమే జరుగుతోంది. పది
నిమిషాల్లో కథ ప్రారంభించేస్తే ఫ్లాపవడమేమిటని అన్పించవచ్చు. గత సంవత్సరం ఇలాటి
సినిమాలు రెండు వచ్చాయి. సుమంత్ అశ్విన్- రెహానాలు నటించిన వేమారెడ్డి అనే
కొత్తదర్శకుడి ‘చక్కిలిగింత’ ఒకటైతే, మంచు
లక్ష్మి- అడివి శేష్ లు నటించిన వంశీ కృష్ణ అనే మరో కొత్త దర్శకుడి
‘దొంగాట’ అని రెండోది. వీటిలో ‘దొంగాట’ ఆ కాస్తయినా ఆడిందంటే సెకండాఫ్
లో నేర్పు చూపెట్టడం వల్లే. మొదటిదైతే ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికే కథ
అయిపోయింది! అంటే తెలుగు దర్శకుడు త్వరగా కథ ప్రారంభిస్తే త్వరగా సరుకు
అయిపోతుందన్నమాట. ఇందుకని ప్లాపులు.
ఈ ఇద్దరు దర్శకులూ 2002 లో అడ్రేయిన్ లైన్ తీసిన ‘అన్ ఫెయిత్ ఫుల్’ స్ట్రక్చర్ ని పరిశీలించి ఆ ప్రకారం చేసుకుని వుంటే చాలా బావుండేది. ఈ ఇద్దరు దర్శకులూ చేసిన ఘోరమైన పొరపాట్లని ఎలా
దిద్దుకుని ఉండొచ్చో ‘అన్ ఫెయిత్ ఫుల్’ ని చూపెడుతూ, గతంలో వీళ్ళిద్దరి
సినిమాల స్క్రీన్ ప్లే సంగతుల్లో చెప్పుకున్న నేపధ్యంలో, సరీగ్గా ఆలాటి పొరపాట్లే మళ్ళీ చేయకుండా రవికాంత్ అనే కొత్త దర్శకుడు ‘క్షణం’ తీసి
సూపర్ సక్సెస్ అయ్యాడు.
‘క్షణం’
లో ఈ పొరపాట్ల సవరణతో బాటు, ఇలాటి కథ– అంటే పది నిమిషాల్లో సెటప్ చేసేసే కథని - అక్కడ్నించీ ఆ ఒకే పాయింటు ఆధారంగా చివరంటా రెండు గంటలపాటు సాగదీయాల్సి
వస్తున్నప్పుడు, మధ్యలో అది చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయవచ్చో కూడా ‘క్షణం’
హింట్ ఇస్తోంది.
ఉదాహరణకి
హైదరాబాద్ నుంచి బయల్దేరి వైజాగ్ వెళ్ళే బస్సుకి మధ్యలో డ్రైవర్ మారతాడు. మారకపోతే
ఆ 700 కిలోమీటర్ల సుదీర్ఘ డ్రైవింగ్ ఒకే డ్రైవర్ వల్ల కాదు. యాక్సిడెంట్ జరగవచ్చు. ఆ
డ్రైవర్ రెస్టు తీసుకుని, రెస్టు లో వున్న ఇంకో డ్రైవర్ స్టీరింగ్ తీసుకుంటే
క్షేమంగా బస్సు గమ్యం చేరుతుంది.
అలాగే
సినిమా ప్రారంభమే ఒక పాయింటు అనుకుని దాంతో కథ ప్రారంభించాక, దాంతోనే ముగింపు దాకా రెండు
గంటల పాటు సుదీర్ఘ కథనం ( డ్రైవింగ్ ) చేయాలంటే మధ్యలో ఎక్కడో బోరుకొట్టి బోల్తా
పడొచ్చు. అక్కడే కథ సమాప్తమై కూర్చోవచ్చు (‘చక్కిలిగింత’). అందువల్ల
ఎత్తుకున్న ఆ డ్రైవింగ్ పాయింటుని మధ్యలో విశ్రాంతి కి పంపుతూ, అందులోంచే ఇంకో పాయింటుని లాగి స్టీరింగ్ ని అందిస్తే, ఆ అనుబంధ
పాయింటుతో చివరిదాకా కథనం ( డ్రైవింగ్) సాఫీగా జరిగిపోతుందని ‘క్షణం’ తెలియజెప్తోంది.
ఇక
‘దొంగాట’ లో జరిగిన పొరపాటేమిటంటే, ఓ పది నిమిషాల్లో బిగినింగ్ విభాగాన్ని ముగించి
ప్లాట్ పాయింట్ -1 ని ఏర్పాటు చేశాక, వెళ్ళాల్సిన మిడిల్ విభాగంలోకి వెళ్ళకుండా, తిరిగి
బిగినింగ్ విభాగం లోకే వచ్చి అక్కడే గిరికీలు కొట్టడం. ఇందుకే మొదట్లోనే కథ
ప్రారంభించినా ఇంటర్వెల్ దాకా విషయం లేదనే రివ్యూ లొచ్చాయి. మనం ఒక ఆఫీసు కెళ్ళి
పనిచూసుకుని ‘వస్తా సార్’ అని బయటికి
వచ్చి, మళ్ళీ ఆ ఆఫీసులోకే వెళ్లి ఆ ఆఫీసరు
మొహం చూస్తూ కూర్చోము కదా? ఇంత సంస్కారం లేకుండా ఉంటున్నాయి సినిమా కథలు. ఆ
మాటకొస్తే కమర్షియల్ సినిమా కథలకి సిగ్గులజ్జ లుండవు.
ఇలా
‘దొంగాట’ లో బిగినింగ్ ప్రాబ్లం, ‘చక్కిలిగింత’ లో డ్రైవింగ్ పాయింటు ప్రాబ్లం
రెండూ ‘క్షణం’లో ఎలా సాల్వ్ అయ్యాయో ఇక చూద్దాం.
ఈ
రెండిటి తో బాటు- ఈ సస్పెన్స్ జాతి కథ చెప్పడానికి- ఎండ్ సస్పెన్స్ అనేసుడిగుండం
లో కూడా పడకుండా పనికొచ్చిన టెక్నిక్ ఏమిటో చూద్దాం.
ముందుగా
మొత్తం కథ..
ఈ కథలో మధ్యలో డ్రైవింగ్
పాయింటు మారడం వల్ల ఇంటర్వెల్ ని కూడా రివీల్ చేయలేని లాక్ పడిపోయింది. సాధారణంగా
మనం చూసిన ఓ సినిమా కథ ఒకరికి చెప్తున్నప్పుడు ఇంటర్వెల్ విషయాన్ని దాచిపెట్టకుండా
చెప్పేస్తాం. సినిమా ముగింపుని మాత్రమే చెప్పకుండా అపుతాం. దీని వల్ల ఆ సినిమా
చూడాలనుకునే వ్యక్తికి ఎలాటి ఇబ్బందీ వుండదు. కానీ ‘క్షణం’ లో ముగింపుతో బాటు, ఇంటర్వెల్ ని కూడా
రివీల్ చేయలేని పరిస్థితితో కథనముంది. ఈ ఇంటర్వెల్ ని రివీల్ చేసినా ఈ కథ సస్పెన్స్ వేల్యూ మొత్తం పోతుంది.
కానీ
స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవాలంటే ఎలాటి సస్పెన్సుల్నీ, ముగింపుల్నీ
గుప్పెట్లో పెట్టుకోలేం. ఓపెన్ చేస్తేనే విశ్లేషణ అర్ధమవుతుంది. కాబట్టి ఇక్కడ స్పాయిలర్
ఎలర్ట్ ని తీసి పక్కన పెడదాం.
ఈ
కథలో అమెరికాలో ఇన్వెస్ట్
మెంట్ బ్యాంకర్ గా ఉంటున్న రిషి ( హీరో) కి ఇండియానుంచి మాజీ గర్ల్ ఫ్రెండ్ శ్వేత
( హీరోయిన్) కాల్ చేసి అర్జెంటుగా రమ్మంటుంది. నాల్గేళ్ళ క్రితం వేరే పెళ్లి
చేసుకుని వెళ్ళిపోయిన శ్వేత ఇలా పిలవడంతో బయల్దేరి వస్తాడు రిషి. హైదరాబాద్ లో వుంటున్న
శ్వేత తన నాల్గేళ్ళ కూతురు రెండు నెలల
నుంచీ కన్పించకుండా పోయిందనీ, ఎవరూ-
ఆఖరికి పోలీసులు కూడా కనుక్కోలేక పోతున్నారనీ వాపోతుంది. కారులో పోతూండగా దుండగులు
తన మీద దాడి చేసి కూతుర్ని ఎత్తుకు పోయారని వివరాలు చెబుతుంది.
రిషి
రంగం లోకి దిగుతాడు. అంతటా తికమక పెట్టే సమాచారమే వస్తూంటుంది అతడికి. ఎవర్నడిగినా,
పోలీసులు సహా, లేని కూతుర్ని ఎలా వెతికి పెట్టమంటారని ప్రశ్నిస్తారు. పోలీసులు
కేసు క్లోజ్ చేశామంటారు. రిషి కి శ్వేత
మానసిక స్థితి మీద అనుమానం వేస్తుంది. అయినా పేపర్లలో అమ్మాయి ఫోటోతో ప్రకటన
వేయిస్తాడు. ఆ ప్రకటన చూసి ఎవరో వ్యక్తి ఆ అమ్మాయి ఫోటోలూ సర్టిఫికెట్లతో వచ్చి ఆ
అమ్మాయి తప్పిపోయిన తనమ్మాయేనని క్లెయిమ్ చేస్తాడు. రిషి ఇంకింత గందరగోళంలో పడతాడు.
రిషి
శ్వేత భర్తని కలుస్తానంటే ఆమె కలవనీయదు. వాళ్ళిద్దరి కాపురం సజావుగా లేదని
అర్ధమవుతుంది. రిషి కి డ్రగ్స్
బానిసైన శ్వేత మరిది బాబీ మీద అనుమానం వస్తుంది. ఆఫ్రికన్లతో కుమ్మక్కయి వున్న అతడి డ్రగ్ రాకెట్
ని చూసి శ్వేత కూతుర్ని ఇతనే కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానిస్తాడు.
పిక్చర్లోకి ఈ డ్రగ్ రింగ్ తో సంబంధమున్న బాబూఖాన్ వస్తాడు. రిషి రహస్యాన్ని
ఛేదిస్తున్న క్రమంలోనే కళ్ళ ముందే శ్వేత అపార్ట్ మెంట్ మీంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.
దీంతో
రిషి చిక్కుల్లో పడతాడు. ఈ కొత్త కేసులో అనుమానితుడిగా పోలీసుల వేధింపులకి
గురవుతాడు. ఇది ఆత్మహత్య అంటే నమ్మని పోలీసులు దర్యాప్తుని విస్తరిస్తారు. శ్వేత
భర్త, బాబీ తెరపైకొస్తారు. ఒక ఇంటరాగేషన్
సమయంలో బాబీని ఆత్మరక్షణ కోసం కాల్చేస్తుంది ఎసిపి జయ. ఈ జయతో రిషి కొనసాగుతాడు. మెడికల్
గా శ్వేత భర్త బయట పెట్టని నిజమొకటుంది. అది శ్వేతకి పుట్టిన కూతురు తనది కాదని. ఇది
మనసులోనే వుంచుకుని శ్వేతని వేధించాడు.
రిషికి
బాబూఖాన్ ద్వారా మరికొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ విషయాలు, దీంతో జరిగే సంఘటనలు,
డ్రగ్ స్మగ్లర్లతో ఘర్షణలూ వీటితో- అమ్మాయి కిడ్నాప్ రహస్యం వెల్లడవుతుంది. ఆనాడు
శ్వేత మీద దాడి చేసి అమ్మాయిని ఎత్తుకెళ్ళింది ఈ ఆఫ్రికన్లే. ఇంకో ఇద్దరు కిరాయి
కిల్లర్స్ ఈ ఆఫ్రికన్లని చంపాలని చూస్తూంటారు. వీళ్ళ చేతిలోనే బాబూఖాన్
మరణిస్తాడు. ఈ కిరాయి కిల్లర్స్, ఆఫ్రికన్లు, బాబీ మొత్తం కలిపి ఎసిపి జయ
నెట్వర్క్ అని తెలుస్తుంది. ఫాం హౌస్ లో ఆమెని పట్టుకుంటే అక్కడే వుంటుంది
అమ్మాయి.
ఎసిపి
జయ ఒక సైకోపాత్. తనకో కూతురుండాలని ఈ అమ్మాయిని
కిడ్నాప్ చేయించింది - ఈ అమ్మాయి తన కూతురు - ఇకంతే. ఈ కూతుర్ని సొంతం
చేసుకోవడానికి ఏమైనా చేస్తుంది, ఎంతకైనా
తెగిస్తుంది. శ్వేతకి కూతురే లేదని డబ్బులు గుమ్మరించి సాక్ష్యాలు సృష్టించింది. ఫోటోలతో వచ్చిన వాడూ తన మనిషే.
అపార్ట్ మంట్ లో, స్కూల్లో. పోలీస్ స్టేషన్లో అన్ని చోట్లా అందర్నీ కొనేసింది.
అందుకే రిషి ఎక్కి కెళ్ళినా అలాటి సమాధానాలే వచ్చాయి. బాబీని చంపింది కూడా ఆత్మరక్షణ కోసం
కాదు. వాడు నిజం కక్కకుండా వుండేందుకే అలా
కాల్చేసింది. ఇంకా చాలా చేసింది, చేయబోతుంది కూడా..
జయ
విశ్వరూపం చూసి షాకులో వున్న రిషికి
అప్పుడు ఆ అమ్మాయి తన కూతురేనన్న పచ్చి నిజం తెలుస్తుంది. శ్వేతతో ప్రేమలో జరిగిన
తొందరపాటు ఫలితమిది... ఇక జయ రిషిని షూట్ చేసేస్తుంది. ఇన్స్ పెక్టర్ సైకోపాత్
జయని కాల్చేస్తాడు. రిషి బతికి తన
కూతుర్ని చూసుకుంటాడు...
పెద్ద బ్లాకు- చిన్న పాయింటు
అంశాల వారీగా ఈ కథని పేర్చుకు రావడానికి
సీన్ల వరస అయిదు రకాలుగా వుంది. కథ ఎలా
ప్రారంభించి ఎలా చెప్పుకొచ్చినా, అసలంటూ
మూలంలో కథ మొదలయ్యింది రిషి- శ్వేతల ప్రేమ
దగ్గరే కాబట్టి, ఈ ప్రేమ లేకపోతే కథే లేదు
కాబట్టి- ఇక్కడ్నించి మొదలెడదాం. 1) ప్రేమ
ప్రారంభం - దీని వైఫల్యం తాలూకు సీన్ల
వరస, 2) శ్వేత మీద దుండగులు దాడిచేసి,
కూతుర్నిఎత్తుకెళ్ళే సీన్లతో బాటు, ఆ కూతురు ఎలా ఎలా ఎక్కడికి చేరిందో ఆ సీన్ల
వరస, 3) యూఎస్ లో వున్న రిషి జీవితం, శ్వేత అతణ్ణి అర్జెంటుగా రమ్మని అమ్మాయి అన్వేషణ
బాధ్యత అప్పగించడం దగ్గర్నుంచీ, ఆ అన్వేషణ
తాలూకు సుదీర్ఘమైన సీన్ల వరస, 4) క్లయిమాక్స్ లో ఎసిపి జయ క్యారక్టర్ రివీల్ అయి ఆమె
పాల్పడ్డ ఈ కుట్ర తాలూకు మొత్తం అన్ని సీన్ల
వరస, 5) ముక్తాయింపు.
ఇలా
అయిదు బ్లాకులుగా సీన్ల వరసలున్నాయి. వీటి సర్దుబాటు ఎలా అర్ధవంతంగా జరిగిందో
చూద్దాం. వీటిలో 2 వ బ్లాకులో కారులో అమ్మాయిని చూపించకుండా శ్వేత మీద జరిగిన
దాడిని చూపిస్తూ కథనాన్ని ప్రారంభించారు. ఈ దాడి వరకే చూపించి 3వ బ్లాకు సీన్ల వరస
ఎత్తుకున్నారు. రిషి ఇండియా బయల్దేరి వస్తున్నప్పుడు 1వ బ్లాక్ ఓపెన్ చేశారు.
నాల్గేళ్ళ క్రితం రిషీ శ్వేతల ప్రేమ ఎలా ప్రారంభమయ్యిందీ చూపించి కట్ చేసి, 3వ
బ్లాకుని కొనసాగించారు.
ఈ
మూడవ బ్లాకే చాలా రిస్కీ బ్లాకు. ఎందుకంటే సినిమా ప్రారంభంలో ఓ పది నిమిషాల్లోనే
ఇది ప్రారంభమై, సుదీర్ఘంగా క్లయిమాక్స్
దాకా సాగుతుంది కాబట్టి. అమ్మాయి తప్పిపోయిందన్న చిన్న పాయింటు పట్టుకుని అంత సేపు
కథనం చేయాలి కాబట్టి. ఈ బారెడు బ్లాకులో సందర్భాన్ని బట్టి అక్కడక్కడా మొదటి
బ్లాకులో వున్న ప్రేమ కథని మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులుగా వేసుకుంటూ పోయారు. ఇది
ఎంత అర్ధవంతంగా వున్నా ప్రధాన కథ ఇదికాదు, అమ్మాయి కథే కాబట్టి ఎంత సేపని ఆమెని
వెతుక్కుంటూ ఉంటాడు హీరో? విషయం లేక కథనం కొల్లాప్స్ అయ్యే ప్రమాదముంది. కాబట్టి
ఇంటర్వెల్లో ఒక ట్విస్టు ఇచ్చి దృష్టి మరల్చేశారు. ఇంటర్వెల్లో ఆ ట్విస్టు
హీరోయిన్ ఆత్మహత్య.
మధ్యలో
హీరోయిన్ ఆత్మహత్య చేసుకునే కథనం ఎవరైనా చేస్తారా? హీరోయినే లేకపోయాక ఇంకా సినిమా
ఏమిటి...అనేది ఒట్టి మూఢ నమ్మకమని ప్రేక్షకులు అర్ధం జేసుకునే స్థితికి
చేరుకోకపోతే ఎప్పటికీ బాగుపడరు. సినిమా ముగింపుని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆమె
రిషి కూతురికి తల్లి, పైగా పెళ్ళయిపోయింది. ఇంకామెకి కథలో పనిలేదు. ముగింపులో కూడా
ఆమె వుండిపోతే కంగాళీ అయిపోతుంది ఆమె
పాత్ర.
పుట్టింది
భర్త కూతురు కాదని తెలిసి కూడా భర్తకి
చెప్పకుండా కాపురం చేయడంలోని అనైతికత ఎప్పుడూ హీరోయిన్ పాత్రకి తగనిదే. దీన్ని
ప్రశ్నించవచ్చు ప్రేక్షకులు, ఇంతవరకే.
ఇంటర్వెల్
లో ఈ ట్విస్టు వల్ల కథనం సహజంగానే ఈ ఆత్మహత్యా కేసు మీదికి మళ్ళిపోయింది. ఇక్కడ కొత్తగా
ఇంకో కథ తెచ్చి అతికించ లేదు. ఇది సెకండాఫ్ సిండ్రోమ్ కాదు, స్క్రీన్ ప్లే కూడా
నిట్టనిలువునా ఫ్రాక్చర్ ఆవలేదు. ఉన్న కథలోంచే, పాత్రలోంచే ఆత్మహత్య అనే
అత్యవసరమైన, అన్ని విధాలా సమంసమైన, కథ సమగ్రతకి సంతుష్టకరమైన పాయింటుని లాగి ఈ సుదీర్ఘ బ్లాకులో ప్రయాణానికి ప్రమాదం లేకుండా
చూసుకున్నారు.
అమ్మాయి
అదృశ్యమైన కథ బోరు కొట్టే ప్రమాదం తప్పి కాస్సేపు బ్రేకు పడింది. ప్రారంభం హైదరాబాద్
అనుకుంటే, ఇంటర్వెల్లో బస్సు డ్రైవర్ మరాడన్నమాట - శ్వేత ఆత్మహత్య కేసు రూపంలో. అమ్మాయి
అదృశం కేసు రూపంలో వున్న మొదటి డ్రైవర్ రెస్టు తీసుకుంటున్న డన్నమాట. ఈ రెండో డ్రైవ్
క్లయిమాక్స్ దాకా సాగుతుంది, అక్కడ మళ్ళీ రెస్టులో వున్న మొదటి డ్రైవ్- డ్రైవర్ అందుకోవడంతో, ఈ బస్సు అనే మొత్తం కథా వైజాగ్ అనే ముగింపుకి
సల్లక్షణంగా చేరుకుందన్న మాట.
‘చక్కిలిగింత’
లో లాంటి డ్రైవింగ్ పాయింటు ప్రాబ్లం ఇలా సాల్వ్ అయిందన్నమాట.
బిగినింగ్ కి బ్రేకే!
అయిదు బ్లాకుల కథని స్ట్రక్చర్ పరంగా చూస్తే,
1) ప్రేమ ప్రారంభం - దీని వైఫల్యం తాలూకు
సీన్ల వరస, 2) శ్వేత మీద దుండగులు
దాడిచేసి, కూతుర్నిఎత్తుకెళ్ళే సీన్లతో బాటు, ఆ కూతురు ఎలా ఎలా ఎక్కడికి
చేరిందో ఆ సీన్ల వరస, 3) యూఎస్ లో వున్న రిషి జీవితం, శ్వేత అతణ్ణి అర్జెంటుగా
రమ్మని అమ్మాయి అన్వేషణ బాధ్యత అప్పగించడం దగ్గర్నుంచీ, ఆ అన్వేషణ తాలూకు సుదీర్ఘమైన సీన్ల వరస, 4)
క్లయిమాక్స్ లో ఎసిపి జయ క్యారక్టర్ రివీల్ అయి ఆమె పాల్పడ్డ ఈ కుట్ర తాలూకు మొత్తం అన్ని సీన్ల
వరస, 5) ముక్తాయింపు.
ఇందులో 1, 2 బ్లాకులు పూర్తిగానూ, 3 వ బ్లాకులో రిషి అన్వేషనని చేబట్టడం వరకూ సీన్లు
బిగినింగ్ విభాగంలో కొస్తాయి.
3వ
బ్లాకులో అన్వేషణ చేపట్టిన దగ్గర్నుంచీ క్లయిమాక్స్ లో జయని అనుమానించి ఫాం హౌస్
కి బయల్దేరే వరకూ మిడిల్ విభాగం లోకి వస్తాయి.
4,
5 బ్లాకులు ఎండ్ విభాగంలోకి వస్తాయి.
ఇలా
త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో వున్న కథని కథనం
చేసేప్పుడు ఆసక్తికరంగా ఉండేందుకు బిగినింగ్ విభాగాన్ని మాత్రమే నాన్ లీనియర్
చేశారు. బిగినింగ్ విభాగంలోని 1, 2 బ్లాకులుతో పాటు, 3 వ బ్లాకులో రిషి అన్వేషనని
చేబట్టడం వరకూ వున్న సీన్లని నాన్ లీనియర్ చేశారు. మిగిలిన మిడిల్, ఎండ్ విభాగాల్ని లీనియర్ గానే ఉంచారు. అంటే ‘ఖైదీ’ లోలాగా ఇది ఫ్లాష్ బ్యాక్ లో
వచ్చే మిడిల్- బిగినింగ్- ఎండ్ ( 2 – 1 3) నేపధ్యంలో లేదని గుర్తించడం
అవసరం.
బిగినింగ్
లో వున్న సీన్ల వరసలో ఒక్క ప్రేమ కథని
మాత్రమే ఫ్లాష్ బ్యాక్ చేశారు. ఇలా చూసినప్పుడు ఇది బిగినింగ్ విభాగానికి మాత్రమె
వర్తించే 2-1-3 ( ఖైదీ) నేపధ్యంగా వుంది. ప్రధాన కథ ఫ్లాష్ బ్యాక్ లో
లేదు, ప్రేమకథ మాత్రమే మల్టీ పుల్ ఫ్లాష్
బ్యాకులుగా బిగినింగ్- మిడిల్ -ఎండ్ విభాగాలవరకూ విస్తరించి వుంది.
దీనివల్ల
సాధించిన ప్రయోజన మేమిటి? మరో దొంగాట’ గాడిలో పడకుండా తప్పించుకోగలిగారు.
బిగినింగ్
విభాగం ముగింపులో రిషి అన్వేషణ చేపట్టే ప్లాట్ పాయింట్ -1 ఘట్టం దాకా వున్న
సీన్లలో ప్రేమకి సంబంధించినవి ఆ ప్రేమెలా ప్రారంభమయ్యిందో అంతవరకూ మాత్రమే చూపించి
ఆపేశారు. ప్లాట్ పాయింట్ -1 నుంచీ కథ మిడిల్లో పడింది. ఇక్కడ్నించీ మిడిల్
బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని రిషి కిచ్చిన గోల్ తో 3 వ బ్లాకు పూర్వార్ధం
దగ్గర్నుంచీ, ఆ మిడిల్ ముగిసే ప్లాట్ పాయింట్ – 2 దాకా క్లయిమాక్స్ వరకూ, ఆ మిడిల్
బిజినెస్ నే తుచ తప్పకుండా కొనసాగించారు.
అంతే
గానీ, ప్లాట్ పాయింట్ -1 దగ్గర బిగినింగ్ ముగిసిపోయాక మళ్ళీ బిగినింగ్ బిజినెస్ నే
ఎత్తుకుంటూ బాకీ వున్న ప్రేమ కథని చెప్పుకురాలేదు!
ఆ మిగిలిన్ ప్రేమకథని మిడిల్- ఎండ్ విభాగాల్లో మల్తీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వేస్తూ
అడ్డం రాకుండా చూసుకున్నారు. ఈ తేడా బాగా గమనించాలి.
‘దొంగాట’
లో పదినిమిషాల్లో కిడ్నాప్ తో ప్లాట్ పాయింట్ - 1 ఏర్పడ్డాక దాని పరిణామాలతో కూడిన
మిడిల్ బిజినెస్ ని ప్రారంభించకుండా, మళ్ళీ బిగినింగ్ బిజినెస్ తో కూడిన టైం పాస్
సీన్లు వేస్తూపోయారు ఇంటర్వెల్ వరకూ!
ఇలా
‘క్షణం’లో ‘అన్ఫెయిత్ ఫుల్’ కి సరిపోలింది. ‘దొంగాట’ లో లాంటి బిగినింగ్ ప్రాబ్లం
సాల్వ్ అయిపోయింది.
యాంటీ ప్లాట్ కథనం
ఒక
నేరం జరిగితే హీరో ఆ నేరస్థుణ్ణి (
విలన్ ని) పట్టుకునేందుకు అన్వేషణ సాగించడం ఒక రకం కథ- సస్పెన్స్ థ్రిల్లర్
జాతి. ఒక నేరం హీరోయే చేశాడని నేరస్థుడు ( విలన్) రుజువులతో సహా హీరోకి
సాలెగూడు కడితే అందులోంచి హీరో బయట పడ్డం ఇంకో రకం కథ- మిస్టరీ జాతి. 2014 లో బెన్ అఫ్లెక్, రోసమండ్ పైక్ హీరో
హీరోయిన్లుగా డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో వచ్చిన ‘గాన్ గర్ల్’ (Gone Girl) లో ఇదే వుంది. గిట్టని భర్త ( హీరో) ని
తన మర్డర్ కేసులోనే ఇరికిస్తూ ఆధారాలు సృష్టించి దాక్కుంటుంది హీరోయిన్. ఆ భర్త
అమాయకంగా భార్య కన్పించడంలేదని పోలీసుల్ని ఆశ్రయిస్తాడు. మిస్సింగ్ కేసుగా
ప్రారంభమయ్యే ఈ కథ భర్తే భార్యని చంపి నటిస్తున్నాడన్న
ఆధారాలు లభించి మలుపు తిరుగుతుంది...
ఒక నేరం చేసిన నేరస్థుణ్ణి పట్టుకోవడానికి వలపన్ని ప్రేక్షకులకి కూడా
అనుమానం రాని విధంగా వివిధ పాత్రల్ని సీఐడీ లుగా దింపి హీరో ఆడే గేమ్ ఇంకో రకం కథ-
కోవర్ట్ జాతి. 1955 నాటి ‘టు ఛేజ్ ఎ క్రూకెడ్ షాడో’ , దీని అనుసరణగా 1982 లో
హిందీలో వచ్చిన ‘ధువా’ ఈ జాతికింద వస్తాయి.
నేరం
చేసిన నేరస్థుడు (విలన్) ఆ నేరాన్ని కప్పి పుచ్చుతూ రివర్స్ లో తనే
తప్పుదోవ పట్టించే అనేక పాత్రల్నీ, ఆధారాల్నీ దింపడం మరింకో రకం కథ- ఇంట్రీగ్ (intrigue – కుట్ర) జాతి. దీన్ని రివర్స్ సస్పెన్స్ అనికూడా అంటారు. ‘క్షణం’
ఈ జాతి కిందికొస్తుంది.
విలన్
తన గుట్టు కాపాడుకోవడానికి అబద్ధాలు, అబద్ధపు రుజువులు, అసలా నేరం జరగనే
లేదనడానికి అబద్ధపు కథలూ సృష్టించడం ఇంట్రీగ్ జాతి కథా లక్షణాలు. అసలు తనొక విలన్
గానే కన్పించడు. ఒక కుట్ర చుట్టూ నడిచే
ఇలాటి కథల్లో అసలా కుట్ర ఏ మిటి? ఆ కుట్ర బయట పడకుండా ఎవరు కాపాడుతున్నారు? ఇందులో
ఎవరెవరు చేరి వున్నారు? ఎందుకు ఆ కుట్రని కాపాడాల్సి వస్తోంది? కుట్ర బయట పడితే ఏం
జరుగుతుంది? ఎవరెవరు నష్టపోతారు? ఆ కుట్రని బయటికి తీయాలని ఎవరు తవ్వుతున్నారు? ఎందుకు
తవ్వుతున్నారు? కుట్ర తెలిస్తే దాన్ని కాపాడే ఉద్దేశం ఉందా? కుట్ర దారుణ్ణి బ్లాక్
మెయిల్ చేయడానికా? ఇందులో వున్న రిస్కేమిటి? లాభాలేమిటి? అబద్ధాలెలా వున్నాయి?
ఎవరు చెబుతున్నారు?...ఇలాటి సందేహాలెన్నో రేకెత్తిస్తూ కథనం నడపగల్గినప్పుడు అది ఈ
జాతి కథ వుతుంది. జాతి మర్యాదని కాపాడుతుంది.
‘క్షణం’
ఇలాటి జాతి మర్యాదని కాపాడిన క్వాలిటీ
రైటింగ్ మాత్రమే కాదు, ఇంటలిజెంట్ రైటింగ్
కూడా! ఎవరంటారు క్వాలిటీ రైటింగ్,
ఇంటలిజెంట్ రైటింగ్ తెలుగుకి పనికిరావని ఈ సినిమా ఘనవిజయాన్ని చూశాక కూడా?
-సికిందర్