రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, March 1, 2016

సాంకేతికం


     సినిమా నిర్మాణంలో కళాకారులు వాళ్ళ వాళ్ళ శాఖలకే పరిమితం కావడం జరగడం లేదు. రచయితలూ, ఛాయాగ్రాహకులు, ఫైట్ మాస్టర్లు, నృత్య –కళా దర్శకులూ  మొదలైన వాళ్ళంతా సమన్వయం  కోసం దర్శకులకి సలహా సూచనలు ఇచ్చి పుచ్చుకోవచ్చు. దీన్నెవరూ తప్పు బట్టరు. అయితే ఈ సమన్వయం కాస్తా ఓ రోజుకి స్వాహాగా మారిపోయి తామే దర్శకులై పోతూంటారు. ఎందుకని కళాకారులు తాము కొనసాగుతున్న శాఖని కాదనుకుని ఇతరుల శాఖల్లోకి చొరబడాలనుకుంటారు? ? ఇది నిలకడ లేనితనం కాదా?

     సీనియర్ కళా దర్శకుడు, నిర్మాతా అయిన  చంటి అడ్డాల తను దర్శకుడగా మారేందుకు చేసిన ప్రయత్నాల్ని చెప్పుకొచ్చినప్పుడు ఈ ప్రశ్న ఎదురయ్యింది. తను మంచి కళా దర్శకుడుగా ఉంటూ నిర్మాత అయ్యారు, ఇంకా మళ్ళీ దర్శకుడుగా కూడా ఎందుకు మారాలి? ఇలాగైతే దేనికి న్యాయం చేయగలరు – అన్నప్రశ్నకి,  ఫ్రెండ్లీగా చెప్పుకొచ్చారు : ‘గురువు గారు దాసరి గారు నువ్వొక శాఖని నమ్మి అందులో  రాణించాక, ఇతర ఆసక్తులుంటే వాటిలోకి వెళ్ళడం కరెక్టు అన్నారు. అలా నేను కళా దర్శకత్వాన్ని ఎంచుకుని, అందులో రాణించాకే నిర్మాతనయ్యా, నిర్మాతగా సక్సెస్ అయ్యాకే  దర్శకత్వం అనుకున్నా..’ అన్నారు. 

          ఈ కంపార్ట్ మెంటలైజ్డ్ కమిట్ మెంట్ ని చూస్తే  మనకి పైకి ఆకట్టుకునేలానే  ఉండొచ్చు. కానీ ఐడెంటిటీ అనేదొకటి వుంటుందిగా? ఆరోప్రాణం, పవిత్రప్రేమ, కృష్ణ బాబు, బాచి, అడవి రాముడు, అల్లరి రాముడు, ఒక ఊరిలో, యముడికి మొగుడు...వంటి అనేక సినిమాలకి నిర్మాతగా పోస్టర్ల మీద చంటి అడ్డాల పేరు ప్రేక్షకుల్లో బాగా పాపులరైంది. కానీ 170 సినిమాలకి తను కళా దర్శకత్వం వహించారు. తానొక సీనియర్ కళా దర్శకుడనే పేరే మరుగున పడిపోయింది. నిర్మాత హోదా ఇంత పనీ చేసింది. ‘ధర్మచక్రం’, ‘ప్రేమ’ అనే రెండు సినిమాలకి ఉత్తమ కళాదర్శకుడిగా రెండుసార్లు నంది అవార్డులందుకున్న చంటిని ఇక కళాదర్శకుడిగా చూడలేమా? శాఖల సంక్రమణం వల్ల వచ్చిన సమస్యే ఇది.

          ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు తత్సంబంధమైన డిగ్రీలతో నేరుగా కళాదర్శకులై పోతున్నారు. వెంట వెంటనే భారీ సినిమాల అవకాశాలందుకుని గ్రాఫిక్స్ సమ్మిళిత కళా దర్శకత్వం వహించేస్తున్నారు.  వీళ్ళకీ, మామూలు కళాదర్శకుల దగ్గర ఏళ్ల కేళ్ళు  సహాయకులుగా  పనిచేసీ చేసీ కళాదర్శకులయ్యే  చంటి లాంటి సాంప్రదాయ కళాదర్శకులకీ తేడా ఏమిటని ఆయన్ని అడిగితే -
          ‘ఆ రోజుల్లో కథ విన్పించడం దగ్గర్నుంచీ, మేకప్, కాస్ట్యూమ్స్ తో బాటు, పాటల విషయంలోనూ కళాదర్శకుల పాత్ర వుండేది. ఒక పాటకి సెట్ వేయాలంటే కళాదర్శకుడికి ముందుగా ఆ పాటని పంపేవారు. ఆ పాట ప్రకారం అతను సెట్ వేసే వాడు. ఇప్పుడు పాటలకీ సెట్స్ కీ పొంతన వుండడం లేదు. పాట  ఇవ్వకుండానే సెట్ వేసేయమంటారు. ఇయర్ ఫోన్స్ లో పాట వింటూ నృత్య దర్శకుడు ఫ్లైట్ దిగుతాడు. సెట్ ని పట్టించుకోడు. పాటకి తగ్గ మూవ్ మెంట్స్  ఇవ్వడు. సెట్ లో అంత మంది గ్రూప్ డాన్సర్లని గుంపుగా పెట్టేస్తే, అంత ఖర్చుతో మేం వేసే సెట్ కన్పించకుండా పోతుంది. ఇక దర్శకుడు ఇది తన తంతే కాదన్నట్టు బయట నించుని సిగరెట్ పీలుస్తూంటాడు. అంతా కలిసి టపటపా పాట లాగించేసి వెళ్ళిపోతారు..’ అంటూ చెప్పుకొచ్చారు చంటి. 

          అప్పట్లో కె.  రాఘవేంద్ర రావు సెట్లో వుండి, కళా దర్శకుడి సహాయంతో కెమెరాకి సరైన బ్లాకులు ఎంపిక చేసుకుని, పాటలు చిత్రీకరించే వారన్నారు చంటి.

          పాలకొల్లుకి చెందిన చంటి, 1982 లో మద్రాసు వెళ్లి ప్రసిద్ధ కళాదర్శకుడు వి. భాస్కరరాజు దగ్గర సహాయకుడిగా చేరారు. చిన్ననాటి నుంచీ ఫ్రీ హేండ్ డ్రాయింగ్ లో ఆరితేరి ఉండడంతో, పబ్లిసిటీ ఈశ్వర్ సోదరుడు పైడ్యాచార్య దగ్గర శిష్యుడిగా చేరారు. పౌరాణిక, జానపద  చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం పొందారు. కానీ అలాంటి సినిమాలకి పనిచేసింది లేదు. 1989 లో వెంకటేష్ నటించిన ‘ప్రేమ’ సినిమాకు కళాదర్శకుడయ్యారు. అలా మొదటి సినిమాతోనే మొదటి నంది అవార్డుని అందుకున్నారు. ఇక అప్పటినుంచీ జైత్ర యాత్రే. అగ్ర హీరోల, అగ్ర దర్శకుల సినిమాలకి కళా దర్శకుడిగా పనిచేసి ఇంకా మంచి గుర్తింపు పొందారు. చిరంజీవి నటించిన ‘రాజా విక్రమార్క’ లో ‘భళా చాంగు భళా’ పాటకి అత్యంత సింపుల్ గా సెట్ వేశారు. అది అప్పట్లో చర్చనీయాంశమైంది. అలాగే ‘గ్యాంగ్ లీడర్’ లో వానపాటకి వేసిన వెదురు బొంగులతో కూడిన  సెట్ కూడా పేరు తెచ్చింది. తను భాస్కరరాజు దగ్గర పనిచేస్తున్నప్పుడే రిచ్ అసిస్టెంట్ అవడం వేరు, ఇలా సింపుల్ సెట్లు వేయడం పూర్తిగా వేరు.

          సెట్స్ లో ప్రమాదాల విషయానికొస్తే, ఓసారి వెంకటేష్ నటించిన ‘సుందరకాండ’ కోసం అరకులో వేసిన సెట్ పెద్ద గాలి దుమారం రావడంతో పై కప్పు లేచిపోయింది. వెంటనే  టార్పాలిన్ కప్పి లోపల షూటింగ్ మొదలు పెడితే, అక్కడక్కడా వర్షపు నీళ్ళు కారుతున్నాయి. అప్పుడు మీనా విసుక్కుంటూ ఆ నీళ్ళకి గిన్నెలు పడుతున్నట్టుగా కల్పించి షూట్ చేశారు. ఆ సినిమా చూసిన వాళ్లకి అది స్క్రిప్టులో ముందే రాసుకున్న సీన్ అనుకోవచ్చు, కానీ వర్షం పడుతోంటే అప్పటికప్పుడు అనుకుని చిత్రీకరించిన సీను అది. 

          పోతే  ‘ధర్మచక్రం’ కి  తనకి ఉత్తమ కళాదర్శకుడిగా అవార్డు ఎందుకిచ్చారో అర్ధం కాలేదన్నారు. ఈ విషయమే అవార్డుల కమిటీని అడిగితే, అందులో కోర్టు సీనుకి మూడు సింహాల పిల్లర్ మీదుగా వేసిన పైకప్పు ప్రతీకాత్మకంగా ఉండడంతో అవార్డు ఇచ్చామన్నారట!  ఎంత కళాహృదయమో, కళాదర్శకుడే  సంకల్పించని సంగతికి! 

          సినిమా షూటింగులు స్టూడియోల్ని దాటుకుని రియల్ లోకేషన్ల లోకి వచ్చాక, సెట్ కార్మికులకి పని తగ్గిపోయిందన్నారు. మౌల్డర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, ఫ్లవర్ డెకొరేటర్లు, సెట్ ప్రాపర్టీ సిబ్బందీ, బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టులూ కనుమరుగయ్యారన్నారు. కాలక్రమంలో మెగా సెట్స్ కి  క్రేజ్ పెరగడంతో మళ్ళీ పనులు దొరుకుతున్నాయన్నారు.

          ఇటీవలే కళాదర్శకుల సంఘం అధ్యక్షుడిగా చంటి అడ్డాల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రంగంలో కొత్త వారికీ మంచి అవకాశాలు, భవిష్యత్తూ వుంటాయనీ, కాకపోతే ఇప్పుడు ఆర్ట్ సంబంధ కోర్సులు చేసి నేరుగా కళా దర్శకులయ్యే వారికి  చెక్ పెట్టామన్నారు. ముందుగా అసిస్టెంట్ గా పనిచేసి కనీసానుభవం సంపాదించుకుంటే తప్ప యూనియన్ గుర్తిపు కార్డు ఇవ్వబోమన్నారు చంటి అడ్డాల.

-సికిందర్
 (2011- ‘ఆంధ్రజ్యోతి’)