రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, February 6, 2016

వీకెండ్ కామెంట్




       ప్పుడూ దక్షిణ సినిమాల్ని రీమేక్ చేయాలన్నా, ఒకప్పుడు దక్షిణ హీరోయిన్లకి పెద్ద పీట వేయాలన్నా బాలీవుడ్ చూపే/ చూపిన  ఉత్సాహం దక్షిణ హీరోల్ని ప్రోత్సహించడం పట్ల ఏనాడూ చూపలేదు. అయినా అడపాదడపా తెలుగు, తమిళ, మళయాళ స్టార్లు హిందీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తూంటారు. ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, కమల్ హాసన్, రజనీకాంత్, మాధవన్, మమ్ముట్టీ, మోహన్ లాల్ మొదలైన స్టార్లు హిందీ సినిమాల్లో నటించారు. కమల్ హాసన్ తప్పితే మిగిలిన వాళ్ళు ఒకటి నుంచి మూడు సినిమాల మధ్యే హిందీ సినిమాల్లో నటించి మళ్ళీ అటువైపు చూడలేదు. 

          స్పష్టంగా ద్రవిడ- ఆర్యన్ తేడాల వల్ల  అక్కడి  నిర్మాతలు కాకపోయినా హిందీ ప్రేక్షకులు  సౌత్ స్టార్స్ కి  అలవాటు పడలేకపోయారు అప్పట్లో. కానీ ఉత్తరాది హీరోలు  కేవలం హిందీ రాష్ట్రాలకే పరిమిత మైలేరు. సిక్కిం వంటి ఈశాన్య రాష్రాల నుంచి వచ్చికూడా  పాపులర్ అయ్యారు. పాకిస్తాన్ నుంచి కూడా వచ్చి హీరోలుగా, హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాలీవుడ్ లో, హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్షకుల్లో ఎలాటి తరతమబేధాల్లేవు. రంగు తేడాల్లేవు.  రంగు లేకపోయినా అక్కడ గొప్ప స్టార్స్ అయిన నటులున్నారు. ఆస్కార్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఆసియా దేశాలనుంచి వచ్చి కూడా అక్కడ స్టార్లయ్యారు.


        దక్షిణ హీరోల్ని హిందీ ప్రేక్షకులు ఇంకా మద్రాసీలు అనే తేలిక భావంతో చూడడం, అందుకు తగ్గట్టు మన స్టార్స్  హిందీ మాట్లాడలేకపోవడం, డబ్బింగ్ వాయిసులతో నటించడం వంటి లోపాలవల్ల కూడా  హిందీ ప్రేక్షకులకి  అప్పట్లో దగ్గర కాలేకపోయారు. తెలుగు,  తమిళ హీరోయిన్లకి ఈ బాధ ఎప్పుడూ లేదు. 1960 ల  నుంచీ పద్మిని, వైజయంతీ మాలా, హేమమాలిని, రేఖ, శ్రీదేవి, జయప్రద వంటి తారామణులు కొన్నేళ్ళపాటు బాలీవుడ్ ని ఏలుకున్నారు. హిందీ ప్రేక్షకుల కలల రాణులయ్యారు.
     వీళ్ళలో కొందరికి భాష రాకపోయినా పట్టించుకోలేదు హిందీ ప్రేక్షకులు. ఆనాడు పక్కా ఆంధ్ర ప్రదేశ్ కి, తమిళనాడుకీ చెందిన తెలుగమ్మాయిలు, తమిళ అమ్మాయిలే పైన చెప్పుకున్న తారల రూపంలో బాలీవుడ్ లో వెలిగి పోయారు. ఇప్పుడలాటి తెలుగు తమిళ అమ్మాయిలూ తెలుగు తమిళ రంగాల్లో టాప్ హీరోయిన్లుగా ఎక్కువ లేరు. అనూష్కా, నయనతార, త్రిష, లాంటి కొందరు తప్ప. వీళ్ళల్లో త్రిష, అసిన్ లు బాలీవుడ్ వెళ్లి శ్రీదేవి లాగానో, జయప్రద లాగానో నిలదోక్కుకోలేకపోవడం విచిత్రం.  అంటే శ్రీదేవులు, జయప్రదలు ఇక అక్కరలేదన్నట్టు హిందీ ప్రేక్షకుల అభిరుచి మారిపోయిందా? అలాగేం  అన్పించదు. ఇక్కడి తెలుగమ్మాయిలే కాదు,  ఇక్కడి కొచ్చి స్టార్లయిన  పక్కా హిందీ  అమ్మాయిలు  తమన్నా, కాజల్, హన్సిక, ఇలియానా, శ్రియ, జెనీలియా వంటి ఎందరో  హిందీ అమ్మాయిలూ హిందీలోకి వెళ్లి వెనక్కొచ్చారు. మొత్తంగా దక్షిణం నుంచి ఏ హీరోయిన్ వెళ్ళినా హిందీలో స్థానం లేకుండా పోయింది.

దీనికంతటికీ ఒకటే కారణం కన్పిస్తుంది... గత కొన్నేళ్లుగా హిందీ ఛానెళ్ళలో  తెలుగు తమిళ సినిమాల హిందీ డబ్బింగులు విపరీతంగా ప్రసారమవుతున్నాయి. మహేష్ బాబు, సూర్య వంటి టాప్ స్టార్స్ సినిమాలకి కూడా ఈ హిందీ డబ్బింగుల నుంచి మినహాయింపు లేదు. కేవలం ఆయా  ఛానెల్స్  తమ స్లాట్స్ ని భర్తీ చేసుకోవడం కోసం తెలుగు తమిళ సినిమాలు కొనుక్కుని హిందీలోకి విపరీతంగా డబ్బింగ్ చేసుకుంటున్నారు. ఈ డబ్బింగుల్లో పైన చెప్పుకున్న హీరోయిన్లు త్రిషనయనతార, తమన్నా, కాజల్, హన్సిక, ఇలియానా, శ్రియ, జెనీలియా లాంటి అందరూ కన్పిస్తారు. 


ఇలా టీవీల్లో డబ్బింగుల్లో దర్శనమిచ్చేసరికి  వీళ్ళు విలువ కోల్పోతున్నారు. ఇక ఫ్రెష్ గా హిందీ సినిమాల్లోకి వెళ్లి  నటిస్తే హిందీ ప్రేక్షకులు డబ్బింగుల్లో చూసేసిన తేలిక భావంతో తీసుకుంటున్నారు. ఇదే పరిస్థతి హిందీ డబ్బింగుల్లో కన్పించే  నేటి తెలుగు తమిళ స్టార్స్ ది కూడా. ఒక విధంగా ఇక్కడ టాప్ రేంజిలో ఉంటున్న హీరో హీరోయిన్లే హిందీ డబ్బింగుల్లో కనిపించేసరికి హిందీ ప్రేక్షకుల దృష్టిలో బిగ్రేడ్ కి పడిపోతున్నారు. ఒకప్పుడు మద్రాసీ లని దూరం పెట్టేవాళ్ళు, ఇప్పుడు  బిగ్రేడ్ అనీ, డబ్బింగ్ హీరో హీరోయిన్లనీ  తప్పుకుంటున్నారు.

ఇలాంటప్పుడు రాం చరణ్ వెళ్ళినా, దగ్గుబాటి  రానా వెళ్ళినా, ఇంకా తమిళం నుంచి కొత్తగా సిద్ధార్థ్ వెళ్ళాలనుకుంటున్నా, ఇప్పుడు హిందీలో ఒరిగేదేం వుండదు. ఎన్ని ఘజనీ దండ యాత్రలు చేసినా బిగ్రేడ్, ‘డబ్బింగ్ హీరోలుఅనే ముద్ర ఇప్పట్లో చెరిగిపోయేది కాదు. ఇదంతా తెలిసే కాబోలు, ఇటీవల మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,  మళ్ళీ హిందీలోకి వెళ్లి నేను కొత్తగా నిరూపించుకునేది ఏముంటుందన్నారు.

ముందుగా దక్షిణ స్టార్లు హిందీ టీవీ డబ్బింగుల్ని నిషేధింప జేసుకుని, కనీసం ఒక తరం ప్రేక్షకులు గడిచిపోయాక, అప్పుడు హిందీ కెళ్ళి ప్రయత్నిస్తే, కొత్తతరం ప్రేక్షకుల ముందు ఫ్రెష్ గా కన్పించవచ్చు.


-సికిందర్








Friday, February 5, 2016

షార్ట్ రివ్యూ







స్టోరీ డెవలప్ మెంట్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : భేమనేని శ్రీనివాసరావు

తారాగణం : బెల్లంకొండ సురేష్, సొనారికా భడోరియా, ప్రకాష్ రాజ్, రావురమేష్, ఝాన్సీ, పృథ్వీ, పోసానీ, అలీ, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సత్య, మధు తదితరులు
కథ : ఎస్ ఆర్ ప్రభాకరన్, సంగీతం : శ్రీ వసంత్, ఛాయాగ్రహణం : విజయ్ ఉలగనాథ్
బ్యానర్ : గుడ్ విల్ సినిమా, నిర్మాతలు : భీమనేని సునీత, రోషితా సాయి.
విడుదల : 5 ఫిబ్రవరి, 2016
***
      ర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మళ్ళీ ఓ రీమేకుతో ఎప్పుడొస్తారా అని ఎదురుచూసే ప్రేక్షకులకి, నాల్గేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత  తమిళ రీమేకుతో వచ్చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ తో  తమిళ హిట్ ‘సుందరపాండియన్’ పాత్ర చేయిస్తూ అతడి సక్సెస్ గ్రాఫ్  ని పెంచే బాధ్యత తీసుకున్నారు. టైటిల్  కూడా  స్పీడున్న కమర్షియల్ - మాస్ టైటిల్ పెట్టి  వీలైనంత మసాలా సినిమా తీద్దామనుకున్నారు. కానీ తీశారా? శ్రీనివాస్ కి న్యాయంచేశారా? ఎంతో గ్యాప్ ని ఎదుర్కొన్న శ్రీనివాస్ నిజంగానే ఇప్పుడు స్పీడున్నోడు అన్పించుకుని  ముందుకు దూసుకుపోతాడా? ఈ సందేహాలు తీర్చుకోవడానికి అసలు సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ
        రాయలసీమ గ్రామం. అక్కడ నాయడు ( ప్రకాష్ రాజ్ ) అనే పెద్దమనిషి. ఆ పెద్దమనిషికి శోభన్ ( బెల్లంకొండ శ్రీనివాస్) అనే కొడుకు. వెంకటా పురం అనే ఇంకో గ్రామం. ఇక్కడ రామచంద్రప్ప ( రావురమేష్) అనే ఇంకో పెద్దమనిషికి కాలేజీలో చదివే వాసంతి ( సొనారికా భడోరియా) అనే కూతురు. రెండూళ్ళ మధ్య ఒక బస్సు. దాని పేరు ‘ప్రేమపావురం’. ఈ బస్సులో కాలేజీ కెళ్ళే అమ్మాయిలూ అబ్బాయిల ప్రేమాయణాలు. వెంకటాపురం గ్రామ  నీతి  ప్రకారం తమ అమ్మాయిల వెంట ఎవడైనా పడితే వాణ్ణి క్వారీలో ఖతం చేస్తారు. అలా ఖతమవబోతున్న వాణ్ణి శోభన్ కాపాడుతాడు. వాడు శోభన్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా  శోభన్ కి ప్రాణం. వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. ఇంకో ఫ్రెండ్ ఉంటాడు మధు అని. ఇతను సాక్షాత్తూ వాసంతినే  ఏకపక్షంగా ప్రేమిస్తూంటాడు. ఇందులో హెల్ప్ చేయమని శోభన్ ని కోరతాడు. ప్రేమపావురాలే వాహనం గా వాసంతి మధుతో ప్రేమలో పడేట్టు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు శోభన్. కానీ తనతోనే  వాసంతి ప్రేమలో పడుతుంది. ఎందుకంటే గతంలో శోభన్ ఈమె వెంట పడితే ఇష్టంలేక ఒప్పుకోలేదు. ఆమెని వదిలేశాడు. ఇప్పుడు ఇష్టపడుతోంది. కాబట్టి ఫ్రెండ్ మధుని తప్పించేసి, వాసంతితో తన లవ్ ని సెట్ చేసుకుంటాడు శోభన్. ఈ ప్రేమికులిద్దర్నీ వాసంతి తండ్రి విడదీసి, జగన్ అనే వాడితో ఆమె పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.

        ఇలావుండగా, పాత  రోమియో ఒకడు (సత్య) మళ్ళీ వాసంతి వెంట పడితే, ఆ ఘర్షణలో ప్రమాదవశాత్తూ శోభన్ చేతిలో వాడు చనిపోతాడు. శోభన్ జైలుకెళ్ళి బెయిల్ మీద వస్తాడు. తండ్రి జోక్యంచేసుకుని వాసంతి తండ్రిని  రాజీ చేయించడంతో, జగన్ తో పెళ్లి రద్దయి శోభన్ తో కుదుర్తుంది. జగన్ శోభన్ మీద పగబడ్తాడు. ఇదీ విషయం. ఇప్పుడేమైందో తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ
       
విషయపరంగా, చిత్రీకరణ పరంగా యూత్ అప్పీల్ తో మాత్రం లేదు. ఈ కథ చాలా పాతదైన కాలం చెల్లిన కథైనా, తమిళ ఒరిజినల్లో, దాని కన్నడ రీమేక్ లో కూడా కొత్త దర్శకుల రియలిస్టిక్  అప్రోచ్ వల్ల నూతనత్వం వచ్చింది. తెలుగులో ఇదే కొరవడి పాత మూసఫార్ములా కిందికి మారిపోయిది. పైగా ఫ్రెండ్ షిప్ గురించి కథ అన్నప్పుడు, ముందుగా ఆ ఫ్రెండ్ షిప్ ని మందుకొట్టి, సిగరెట్లు తాగే ఆవారాతనంతో గాక, విశ్వాసం- విధేయతా అనే సెంటిమెంట్లతో బలంగా చిత్రించాల్సి వుంటుంది. ఏదైతే చివర్లో నెగెటివ్ అవుతుందో దాన్ని ముందుగా పాజిటివ్ గా బలంగా చూపిస్తే ఎమోషనల్ కనెక్ట్ వుంటుంది. దీన్ని వదిలేసి పైపైన కథనీ, పాత్రల్నీ చూపించుకుంటూ పోయారు. ఒరిజినల్ సక్సెస్ కి ఏదైతే ప్రాణ ధారగా వుందో,  దాన్నే నిర్లక్ష్యం చేసి స్టోరీ డెవలప్ మెంట్ అని దర్శకుడు భావిస్తే అంతకంటే  పప్పులో కాలేయడం వుండదు.

ఎవరెలా చేశారు
       
తొలి సినిమా ‘అల్లుడు శ్రీను’ లోనే ఓకే అనుకున్నాం బెల్లంకొండ శ్రీనివాస్ ని. కాబట్టి ఇక్కడా ఆ స్థాయిలోనే  డాన్సులూ ఫైట్లూ మాత్రం చేశాడు. కామెడీ,  కాస్త బలమైన  ఎమోషన్స్ అనేటప్పటికి మాత్రం ఈసారి విఫలమయ్యాడు. ప్రేమ సన్నివేశాలూ డిటో. పాత్రని ఉండాల్సినంత బలంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు వెనుకబడిపోయిన పర్యవసానమిది. పాత్ర ఎంత వుంటే నటన అంతే ఉంటుందికదా. పైగా అప్ కమింగ్ హీరో అన్నాక, పాత్రచిత్రణే ఏకైక లక్ష్యంగా దర్శకుడుండాలి. కనీసం టైటిల్ కైనా న్యాయం చేయాలికదా? ఈ పాత్రలో ఏం స్పీడుంది? సెకండాఫ్ లో నైతే  పాసివ్ సుడిగుండంలో పడి చాదస్తంగా పరమ స్లోగా మారిపోయింది. హీరోలు తాము పోషిస్తున్నది పాసివ్ పాత్రలని అర్ధంజేసుకోలేక ఘోరంగా దెబ్బ తినిపోతున్నారు. 

        డిటో హీరోయిన్ సోనారికా. ఒక సినిమాతో వెళ్ళిపోయే హీరోయిన్ల పాత్రలూ వాటిలో హీరోలకంటే సోసోగానే వుంటాయి. దీన్నే ఇక్కడా వర్తింప జేశారు. ఇక ఈ సినిమాలో ఒక విలన్ అంటూ లేకపోవడం,  స్నేహితులే విలన్స్ గా తేలడం అనే కథ కాబట్టి, విద్రోహ ఫ్రెండ్స్ గా నటించిన వాళ్ళు మాత్రం పాత్రలకి సరైన న్యాయం చేసినట్టుగా కన్పిస్తారు. ఎందుకంటే ఈ కథలో తాము హీరోకి చేసిన ద్రోహం కంటే,  హీరో తమతో పాల్పడిన  అనైతికతే ఘోరమైనది. ఇది దర్శకుడు కూడా గుర్తించినట్టు లేదు.

        అసలు ఒరిజినల్లోనే అర్ధవంతమైన కాన్సెప్ట్ కాదు. హీరోకి లేనిపోని గొప్ప ఆపాదించారు. ఫ్రెండ్షిప్ కి అంత విలువిచ్చే విలువలుగల హీరో, ఇప్పుడు హీరోయిన్  తనని ప్రేమిస్తోందని చెప్పి,  ఆమెని ప్రేమిస్తున్న ఫ్రెండ్ ని ఎలా తప్పించేసి ఆ ప్రేమని తను హైజాక్ చేస్తాడు. ఇది ఒకటో సారి. రెండోసారి, ఆమెకి జగన్ అనే వాడితో పెళ్లి  రద్దు చేసి హీరోతో జరిపిస్తున్నప్పుడు...ఆ జగన్ తన ప్రాణమిత్రుడే అని తెలిసినప్పుడు హీరో ఏం చేయాలి? తను తప్పుకుని అతనితోనే ఆ పెళ్లి జరిపించేందుకు ప్రయత్నించాలి కదా? ఇలా రెండు సార్లూ ఫ్రెండ్స్ కి తనే ద్రోహం చేసిన స్వార్ధపరుడిగా తెలిసిపోతూంటే.. ఆ ఫ్రెండ్స్ ని  ద్రోహులుగా చిత్రించడం ఏమిటి? వాళ్ళ  వైపు నుంచి వాళ్ళు  హీరోని చంపాలనుకోవడం న్యాయమే. తను చావబోయే పరిస్థితుల్ని తనే కల్పించుకున్నాడు హీరో.

ఇక ప్జ్ప్రకాష్ రాజ్,  రావు రమేష్ పెద్దగా సంఘర్షణకి  తావులేని పాత్రలు. ఉండడానికి ఇంకా పృథ్వీ, పోసానీ, అలీ, ఝాన్సీ న్సీ లాంటి నటీనటులున్నా ఆ పాత్రలూ యాంత్రికంగానే వున్నాయి. 

        పాటలు, ఇతర ప్రొడక్షన్ విలువలూ మాత్రం బావున్నాయి. కానీ పాటల్ని భరించాలంటే ముందు ఈ సినిమా కథని భరించగాల్గాలి.

చివరికేమిటి?
        సీనియర్ దర్శకుడు కూడా కాన్సెప్ట్ తో తప్పులో కాలేశారు. రెండోది ట్రెండ్ లో ఉండేలా, యూత్ అప్పీల్ కి న్యాయం చేస్తూ, ఒరిజినల్ లోని రియలిస్టిక్ అప్రోచ్ ని అర్ధం జేసుకుని ఆమేరకు చిత్రీకరణ కూడా చూసుకోలేదు. దీంతో  మరో పాత లుక్ మూస ఫార్ములాలాగా రిజల్టు వచ్చింది. పెద్దగా కథా కథనాలూ పాత్రలూ పట్టించుకోకుండా కళ్ళప్పగించి సినిమాలు చూసే ప్రేక్షకులకే తప్ప, బుర్రపెట్టి చూసేవాళ్ళకి- ఇందులో స్పీడూ కన్పించదు, సెన్సూ వుండదు.


-సికిందర్


Thursday, February 4, 2016

స్ట్రక్చర్ - 9





  ఈ మధ్య విడుదలవుతున్న తెలుగు సినిమాలు వాటి అనుకున్న కాన్సెప్ట్సుకి,  ఆ కాన్సెప్ట్సు కిస్తున్న ట్రీట్ మెంట్సు (స్క్రీన్ ప్లే) తో ఎలాంటి సంబంధమూ  లేకుండా ఎందుకొస్తున్నట్టు? సినిమా కథలకి రాసే రచయితలతో బాటు, రాయని ఇంకెందరో ‘రచయితలు’ ఉండడం వల్ల, ఈ సమస్య తప్పడం లేదు.  కనుక కాన్సెప్ట్సు కిచ్చే ట్రీట్ మెంట్స్ మీద ఎందరి హస్తాలు పడ్డా, వాటి ఏకత్వ సూత్రాలకి ఏమాత్రం భంగం కలక్కుండా,  మొత్తం కథ నాణ్యత కూడా పూర్తిగా  దిగజారిపోకుండా కాపాడుకునే మార్గ మేదైనా వుందా?

        తప్పకుండా వుంది. నిత్యం ఫీల్డుని బెంబేలెత్తించే ఫ్లాపుల సంఖ్యని తగ్గించుకోవాలనుకున్నా, ఓ పరిష్కారమార్గం ఆవశ్యకత ఎంతైనా వుంది. ఒక టాక్ షోలో దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నట్టు- “తెలుగు సినిమాపుట్టి 75 సంవత్సరాలు గడుస్తున్నా,  ఇంకా అనుభవాల మీద ఆధారపడి సినిమాలు నిర్మిస్తున్నారు తప్పితే, ఎలాటి సినిమా సైన్సు పట్లా అవగాహన ఇప్పటికీ లేదు..” నిజమే,  సినిమా సైన్సు అంతా విదేశాల్లోనే దినదినాభివృద్ధి చెందుతూ, ఇంగ్లీషు పుస్తకాల్లో నిక్షిప్తమై వుంది. వీటిని చదివే ఓపిక లేదు.  తెలుగులోకి తెచ్చే ప్రయత్నమూ లేదు. కనుక మన దగ్గర ఇలా భూస్థాపితమై పోయిన సినిమా సైన్సు అనే భోషాణం లోంచి కథా శాస్త్రాన్ని పైకి తీసి చూసుకుంటే, ఓ బ్రహ్మాండమైన పరిష్కార మార్గమే కన్పిస్తుంది!

        ఏమిటా పరిష్కారం? చాలా సింపుల్. శ్రమనుకోకుండా కాస్త మూలాల్లో కెళ్ళి, గొప్ప కథలకి ఏ ఏ అంశాలైతే పునాది రాళ్ళుగా ఉంటున్నాయో వాటిని స్థాపించుకుంటూ పోవడమే. అప్పుడా బలమైన నిర్మాణం మీద ఎందరు ఎలా చేయిచేసుకున్నా, నోరెలా పారేసుకున్నా, స్క్రిప్టు పూర్తిగా అధఃపాతాళానికి జారిపోకుండా, కనీసం మధ్యస్థ నాణ్యతా ప్రమాణాలతోనైనా  ఉంటూ, ఓ మంచే కథ అన్పించుకుని బయట పడే అవకాశముంది. ఏ పునాదీ లేకుండా కేవలం సొంత నమ్మకాలాధారంగా గాలిలో అల్లుకునే కథల్ని కథా చర్చల పేరుతో నల్గురూ కలిసి కూర్చుకుని, జీరో చేసి వదిలేకన్నా ఇది నయమే కదా? మధ్యస్థంగా ఓ మంచి కథ!

        ఈ రోజుల్లో ఓ మంచికథ తయారైతే చాలు. గొప్ప గొప్ప కళాఖండాలు ఇప్పుడెవరూ తీయడంలేదు. కనుక గొప్ప కథలంటూ తలలు బద్దలు చేసుకోనవసరంలేదు. కాలక్షేపానికి ఒద్దికగా ఓ మంచి కథ అందించ గల్గితే చాలు. గొప్ప కథలంటే హాలీవుడ్ స్థాయిలో వచ్చే ‘స్టార్ వార్స్’, ‘జురాసిక్ పార్క్’, ‘టైటానిక్’, ‘జాస్’, ‘సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’ లాంటివన్నమాట. ఇవి అంత గొప్ప కథలెలా కాగలిగాయో తెలుసుకుంటే, కథకుడు ఆ రహస్యాన్ని తన కాన్సెప్టు లో ఇమిడ్చి గొప్ప స్క్రిప్టు నే ఊహించగలడు. అప్పుడు తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది!

        కానీ అంత సీను లేదు. కళాఖండాలకి కాలం కాదుకున్నాం గనుక అంతేసి గొప్ప కథలకి గిరాకీ తగలడం అసాధ్యం. నో ప్రాబ్లం. ఐతే మొట్ట మొదట ఆ స్థాయిలో కథని ఊహించ గల్గితేనే కథకుడనే వాడు  అవసరమైతే దాని ఇంకో వెర్షన్ ని కూడా ఆత్మవిశ్వాసంతో విన్పించగలడు. గొప్ప పునాదితో తనకొచ్చిన ఆ గొప్ప ఊహని అప్పుడో మెట్టు కిందికి దించి, ఫ్రేము వదులు చేసి, అలవాటు పడ్డ తెలుగు సినిమాల రన్నింగ్ ని అప్లై చేస్తే, అప్పుడింక ఎవరెన్ని మార్పు చేర్పులు కోరినా, గొప్ప కథ పునాది మొదటే పడింది గనుక, కాన్సెప్ట్ నుంచి ట్రీట్ మెంట్ పతనమూ కాదు, సినిమా భ్రష్టు కూడా పట్టిపోదు. నాణ్యత ఓ మెట్టు దిగినా, మంచి కథ అనే కితాబు ఎక్కడికీ పోదు. అప్పటికీ నిద్రపట్టక ఇంకా నీచానికి దిగలాగే చేతులు వుంటే, వాళ్ళని అట్టర్ ‘ఫ్లాప్తి’ రస్తు  –అని దీవించేసి వదిలెయ్యడమే!

       ఇంతకీ గొప్పకథకి అలాటి బలమైన పునాది వేయడమెలా? చాలా సింపుల్. ముందుగా తెరమీద కదలాడే చలన చిత్రమంటే అది మనిషి మనసు లోపలి ప్రపంచాన్ని ( మానసిక ప్రపంచాన్ని) ఆవిష్కరించే శాస్త్రమని గుర్తిస్తే చాలు. వెండి తెర మీద మనం చూసే పాత్రలు నిజానికి నిజ జీవితంలో నిత్యం మనం చవిచూసే  వివిధ ఎమోషన్స్ కి ప్రతిరూపాలే. ‘ఇగో’  అనే ఎమోషన్ కి హీరో పాత్ర, ప్రేమాశృంగార భావాలకి హీరోయిన్ పాత్ర, మానసికోల్లాసానికి హాస్యగాడు, శాంతి సౌఖ్యాలకి తల్లి, భద్రతా భావానికి తండ్రి, మార్గదర్శకత్వానికి గురువు లేదా గాడ్ ఫాదర్, మనం అణిచిపెట్టుకునే సవాలక్ష జంతు లక్షణాలకి విలన్ పాత్రలూ సింబల్స్ అన్నమాట. ఈ ఎమోషన్స్ అన్నిటినీ కలబోసి మైమరిపించేదే గొప్ప కథ. 

        ఇప్పుడిన్నేసి ఎమోషన్స్ వెండితెరమీద ఆవిష్కారం కావడంలేదు. పాత్రల సంఖ్య తగ్గిపోవడమే ఇందుక్కారణం. మన మనో ప్రపంచాన్ని తెర మీద సంపూర్ణంగా ప్రతిఫలింప జేయడం ఏనాడో తగ్గిపోయింది. అయినా కూడా నో ప్రాబ్లం. మనలో వుండే ఆ  తొమ్మిది రకాల ఎమోషన్స్ లో చాలా వాటికి వెండి తెర మీద ప్రాతినిధ్యం తగ్గిపోయినా, ప్రధాన ఎమోషన్ అయిన ‘ఇగో’ ( అంటే హీరో పాత్ర)  నైనా సవ్యంగా పోషించుకో గల్గితే చాలు, అప్పుడు ఆటోమేటిగ్గా అదే ఓ మంచి సినిమాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం వుంది.

        ఇగో ఎవరి మాటా వినని మొండి ఘటం. అందుకని దాన్ని యుక్తిగా దారిలో పెట్టి, మెచ్యూర్డ్ ఇగోగా పరిణతి చెందే  దిశగా నడిపించేదే గొప్ప కథ కుండే ప్రధానలక్షణం. ఆ నడకలో ఎడబాటు- ప్రయత్నం-అవగాహన- జ్ఞానోదయం అనే నాలుగు మజిలీలుంటాయి. జ్ఞానోదయంవల్ల ఇగో చివరికి ‘మెచ్యూర్డ్ ఇగో’ గా మార్పు చెంది కథ ముగుస్తుంది.మన మైండ్ రెండు గా విభజించి ఉంటుందనేది తెలిసిందే. ఆ రెండూ కాన్షస్ మైండ్- సబ్ కాన్షస్ మైండ్ లు. కాన్షస్ మైండ్ కి ఇగో కేంద్రంగా ఉంటూ, లాజికల్ గా ఆలోచిస్తుంది. పరిస్థితిని బేరీజు వేస్తుంది. నిర్ణయాలు తీసుకుంటుంది. సినిమా కథలో ఇగో చేసే పాత్ర ప్రయాణం లో దానికి సంబంధించిన కార్యకలాపాల్ని హీరో పాత్ర ద్వారా అడ్డదిడ్డంగా డిస్టర్బ్ చేయకుండా,  జాగ్రత్తగా నిర్దేశిత గమ్యం వైపు నడిపించాల్సి వుంటుంది.

        ఇంకాస్త లోతు కెళ్దాం. పైన వివరించిన హాలీవుడ్ సినిమాలు అంత గొప్ప ఆస్కార్  అవార్డు కథ లెందు కయ్యాయంటే, అవి మనిషి మానసికావసరాల్ని అంత కరువుదీరా తీర్చేశాయి గనుక! మనిషి మానసిక ప్రపంచాన్ని పైన చెప్పిన కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ లు ప్రభావితం చేస్తాయి. వెండితెర మీద ఈ రెండు మైండ్స్  కీ చెలగాటం పెట్టి రఫ్ఫాడించి హిట్లు కొడతారు సరయిన సృష్టికర్తలైతే. ఈ రెండు మైండ్సూ ఎలాటి ఏర్పాటుతో ఉంటాయంటే, మధ్యలో లంకలా కాన్షస్ మైండ్ వుంటే, ఆ లంక చుట్టూ  మహా సముద్రంలా పర్చుకుని సబ్ కాన్షస్ మైండ్ వుంటుంది. లంకని  మాత్రమే ఇష్టారాజ్యంగా పాలించుకుంటూ ఎంజాయ్ చేసే  ఇగోకి,  ఆ సబ్ కాన్షష్ అనే మహా సముద్రంలోకి వెళ్ళాలంటే మహా భయం. ఎందుకంటే, ఆ సముద్ర గర్భంలో తాను తట్టుకోలేని నిజాలుంటాయి, ఎదుర్కోలేని ప్రశ్నలు దాగి వుంటాయి. సాధ్యమైనంత వరకూ ఆ  సబ్ కాన్షస్ మైండ్ కి మొహం చాటేసి తిరగడమే అది నేర్చు కుంది. అంతరాత్మకి (సబ్ కాన్షస్) కి సమాధానం చెప్పుకోవడం దానికి సుతరామూ ఇష్టముండదు. పలాయనవాదంతో దాన్ని తొక్కిపెట్టి  బలాదూరు తిరగడమే దానికిష్టం!

        ఇదే సమయంలో సబ్ కాన్షస్ మైండ్- లేదా మన అంతరాత్మ అపార విజ్ఞాన ఖని కూడా. దానికి తెలీని సమాచారమంటూ వుండదు. అది సర్వాంతర్యామి. అందుకే తన వైపు రావడానికి జంకే ఇగోకి అది తియ్యటి షుగర్ కోటింగ్ కలలతో అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ఆపత్కాలంలో ఆదుకుంటూ వుంటుంది.

      ఇక పాయింటు కొచ్చేద్దామా? సరీగ్గా మనలో లంకలాంటి  కాన్షస్ మైండ్ కీ- ఆ లంక చుట్టూ మహా సముద్రంలా ఆవరించుకుని వుండే  సబ్ కాన్షస్ మైండ్ కీ లడాయి పెట్టి స్టీవెన్ స్పీల్ బెర్గ్  ‘జాస్’అనే గొప్ప కథా చిత్రాన్ని నిర్మించేశాడు! సినిమాలో చూపించే సముద్రం- ఆ మధ్యలో వుండే దీవి మన మానసిక ప్రపంచానికి నకళ్ళే. సముద్రంలోంచి సొర చేప రివ్వుమని వచ్చేసి దాడి చేస్తూంటుంది. ఈ సొర చేప మన సబ్ కాన్షస్ లో దాగి మనల్ని భయపెడుతూ వుండే నగ్నసత్యాలకి ప్రతీక. ఈ సొర చేపతో తలపడే హీరో మన ఇగోనే!

        స్పీల్ బెర్గేతీసిన ‘ఈటీ’ లోనూ భూమ్మీదికి గ్రహాంతర జీవి ఒకటి వస్తుంది. మనకి మనం నివశించే భూమి మనకి తెలిసిన ప్రపంచమే-కాన్ష మైండ్ కి సింబల్ గా దీన్నితీసుకుంటే, అప్పుడా గ్రహాంతర జీవి అదేమిటో మనకి తెలీని నిగూఢ లోకం- సబ్ కాన్షస్ మైండ్ కి గుర్తుగా తీసుకుంటే- (పని గట్టుకుని తీసుకోనవసరంలేదు- యాదృచ్చికంగా మన మెదడే అలా కనెక్ట్ అయిపోతుంది-మెదళ్ళకి కనెక్ట్ అవుతూ  మనకి తెలీకుండా మాయ చేసేదే గొప్ప కథ! ).. అప్పుడు ఈ రెండిటి దోబూచులాట ఎలా వుంటుంది మన మనస్సుకి?

        అంతరిక్ష యుద్ధాన్ని చిత్రించే  ‘స్టార్ వార్స్’ మాత్రం? అంతరిక్షం మన సబ్ కాన్షెస్సే! ఇక సముద్రంలో మునిగిపోయే నౌక ‘టైటానిక్’ మాత్రం? సముద్రం భయంకరమైన సబ్ కాన్షస్- నౌక బిక్కుబిక్కు మనే కాన్షస్! ‘జురాసిక్ పార్క్’ లోకూడా ఆ కాంపౌండు మన కాన్షస్ అయితే, దాని చుట్టూ పార్కు సబ్ కాన్షస్. ఇక చూస్కోండి ఆట!

        మన మానసికలోకంలో ద్వైదీభావపు ఈ రెండు మైండ్స్ కీ  నిత్యం జరిగే సంఘర్షణకి సజీవ చిత్రణలే ఇవన్నీ. ఇందుకే ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల ప్రేక్షక బాహుళ్యం నాడిని ఇవి అంతబాగా పట్టుకోగాలిగాయి. తెలుగు ఫీల్డులో ప్రేక్షకుల నాడిని పట్టుకోవడం కష్టమని అలవాటుగా అనేస్తూంటారు. అది అవగాహన లోపించిన మాట. పైన పేర్కొన్నట్టు  తమ్మారెడ్డి భరద్వాజ విశ్లేషణ లోంచి పుట్టిన జీవులు అలాగే మాట్లాడతాయి. ఇంకో గమ్మత్తేమిటంటే, జీవితంలో తాము చేయలేనివి తెర మీద హీరో చేస్తూంటే ప్రేక్షకులు ఆనందిస్తారని మోటుగా అనేస్తూంటారు. ఈ మెకానిజమేంటో తెలుసుకోరు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వచ్చిందే ఆ మెకానిజం. మన సబ్ కాన్షస్ ని మనం ధైర్యంగా ఎదుర్కోలేకపోవడమనే బలహీనతని, తెర మీద మన ఇగో రూపంలో హీరో చేసేస్తూంటే అది మనకి ఆత్మసంతృప్తి కలిగిస్తుందన్నమాట! ఇదే సైంటిఫిక్ వివరణ.

        సినిమాల్లో కథల్లో లేవనెత్తే సమస్యలకీ, వాటిని పరిష్కార దిశగా నడిపించడానికి రాసుకునే ట్రీట్ మెంట్లకీ పొంతన లేకుండా ఎందుకు ఉంటోందో గ్రహిస్తే కదా నాడిని పట్టుకోవడానికి! స్థాపించే సమస్య సబ్ కాన్షస్ అయితే, దాని పరిష్కార మార్గం, లేదా దానికై పోరాటం కాన్షస్ మైండ్ అన్న ప్రాథమిక జ్ఞానం లేకుంటే ఎలా!

        కనీసం తెలుగులోనే వచ్చిన కొన్ని గొప్ప/ మంచి సినిమాలని కాపీ కొట్టి వాటిలాగే హిట్ చేయలన్నా అసలంటూ సైన్సు తెలియాలి. రాం గోపాల్ వర్మ  ‘శివ’ లో నాగార్జున పాత్ర కాన్షస్ ఇగో అవుతుందనీ, అతను తలపడే చీకటి మాఫియా ప్రపంచం సబ్ కాన్షస్ అవుతుందనీ, అందులో రఘువరన్ విలన్ పాత్ర ఎదుర్కోక తప్పని ఒక కఠిన ప్రశ్నవుతుందనీ ఎందరికి తెలుసు? నీలకంఠ ’మిస్సమ్మ’ లో శివాజీ-భూమికలు కాన్ష ఇగో- సబ్ కాన్షస్ లకి గుర్తులు. ‘ఒక్కడు’లో భూమికని దాచిపెట్టిన గది సబ్ కాన్షస్ అయితే, భూమిక ఆ సబ్  కాన్షస్ లో పరిష్కరించాల్సిన ఒక సమస్య! మిగతా ఇల్లూ- చార్మినార్ అంతస్తూ కాన్షస్. మహేష్ బాబు పాత్ర కాన్షస్ ఇగో. కురుక్షేత్రం లో నూరుమంది కౌరవులు మన మనసుల్ని పీడించే ప్రతికూల భావాలకి ప్రతీకలైతే, అర్జునుడు వాటితో పోరాడే మన కాన్షస్ ఇగో అని చిన్మయానంద స్వామి తన ‘ఆర్ట్ ఆఫ్ మాన్ మేకింగ్’ అనే గ్రంధంలో ఏనాడో చెప్పేశాడు.

        కాబట్టి ఇలా గొప్ప సినిమా కథల అంతర్నిర్మాణ పోస్ట్ మార్టం ని విస్పష్టంగా చూడగల్గినప్పుడు...ఆ బలమైన పునాది కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే తోనే ఏర్పడుతుందనే  అవగాహన పెంచుకున్నప్పుడు, కథలకిచ్చే ట్రీట్ మెంట్స్, లేదా స్క్రీన్ ప్లేలు కనీసం గొప్ప కథల స్కేలు పైనుంచి మరీ కిందికి జారిపోకుండా చూసుకోవడమెలాగో తెలిసిపోతుంది.

        కథని ఇలాటి ఇంటర్ ప్లే తో బలంగా లాక్ చేశాక, నలుగురి నోళ్ళూ చేతులూ పడ్డా అది కథనం వరకే పరిమితమౌతూ కొంత మేర వాళ్ళవాళ్ళ ‘క్రియేటివిటీ’ తో దిగజారుస్తారేమో గానీ,  ఏం చేసీ మొత్తంగా చెడగొట్ట లేరు! కథకుడు చేయాల్సింది ఇంటర్ ప్లేకి బలమైన లాక్ వేసి ఆకట్టుకోవడమే. బలహీన లాక్ తో కథా చర్చల్లో కూర్చుంటే ఆ లాక్ కూడా వుండదు- ఇంకేవో కథనాల్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అల్లేసి అతికించేస్తారు.

 (ఇంకా వుంది)








 -సికిందర్














Wednesday, February 3, 2016

రైటర్స్ కార్నర్

రచయిత్రి షగుఫ్తా రఫీఖ్
బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్  స్క్రీన్ రైటర్ గా పేరుతెచ్చుకున్న షగుఫ్తా రఫీఖ్ గురించి చెప్పుకోవాలంటే, ముంబాయి డాన్స్  బార్ ల కెళ్ళాలి, దుబాయి వ్యభిచార గృహల కెళ్ళాలి. ఇంకా చాలా చోట్ల కెళ్ళాలి. చాలా చిన్న వయసులో- పదకొండేళ్ళప్పుడు  చున్నీ నడుంకి బిగించి, ముంబాయి డాన్స్ బార్లలో బాలీవుడ్ పాటలకి డాన్సులేసి తాగుబోతుల్ని రంజింప జేసింది. తన్మయత్వంతో వాళ్ళ  వహ్వాలు విన్నాక, తనపైకి డబ్బులు విసరడం చూశాక, ఆడదాని జీవితం ఆమెకి బాగా అర్ధమయింది. ఏది గౌరవప్రదం, ఏది కాదు అనేది డబ్బెలా నిర్ణయిస్తుందో అర్ధంజేసుకుంది. షగుఫ్తా అంటే ఉర్దూలో వికసించినది అని అర్ధం. తను ఇలా వికసిస్తుందనుకోలేదు. ఇంట్లో పేదరికపు బాధలు, బయట లైంగిక వేధింపులు..అలా అలా దుబాయికి ప్రమోట్ అయి వెళ్ళాకా అక్కడా  పూర్తి  వ్యభిచారం...అక్కడ ఇంకా పెద్ద ప్రపంచాన్నే చూసింది. చైనీస్, రష్యన్ అమ్మాయిలతో కలిసి ఖరీదైన ఫ్లాట్స్ కి వేశ్యలా వెళ్ళేది. అక్కడ ఖరీదైన విటుల కుళ్ళు అంతా చూసింది. ఒక్కో అనుభం ఒక్కో పేజీలో తనమనసులో రికర్దావుతోంది. ఓ నాటికి ఇదంతా చూశాకా- ఇలా వుండకూడదు తన జీవితమని నిర్ణయానికి వచ్చేసింది. నిర్ణయానికి వచ్చిందే ఆలస్యం ఆ జీవితాన్ని వదిలించుకుని బయట పడింది. జీవితాన్ని తిరగరాసుకుని, తనని వెంటాడుతున్న అనుభవాలే అర్హతగా  బాలీవుడ్ లో పేరున్న రచయిత్రిగా ఎదిగింది. ఎక్కువగా మహేష్ భట్ సినిమాలకే పనిచేసింది.


         2006 లో ‘వోహ్ లమ్హే’ (ఆ క్షణాలు) తో ప్రారంభించి, 2015 లో  ‘హమారీ అధూరీ కహానీ’  (మా అసంపూర్ణ గాథ) వరకూ 17 సినిమాలకి స్క్రీన్ ప్లే, డైలాగుల రచయిత్రి తనే. రాజ్-2 , మర్డర్ -2, జన్నత్ -2, జిస్మ్ -2, ఆషిఖీ -2, మిస్టర్ ఎక్స్ వంటి విలక్షణ సినిమాలు కూడా తను రాసినవే.

        రచయిత్రిగా తను  సాధిస్తున్న విజయాలకి జీవితంలో తను  ఎదుర్కొన్న దుర్భర అనుభవాలే స్పూర్తి అని మహేష్ భట్ అంటారు. ఆమె సహజ రచయిత్రి అని కూడా అంటారు.  ఆమె రచనలు ఆమె జీవితానికీ, వ్యక్తిత్వానికీ ప్రతిబింబాలనీ,  అందువల్లే ఆమె స్క్రిప్టులు అంత  ఇంటరెస్టింగ్ గా ఉంటాయనీ భట్ నమ్మకం. సినిమా రచయిత  కావాలంటే ఎలాటి శిక్షణా అవసరం లేదని, రచయిత నవ్వాలన్న కాంక్ష బలంగా వుంటే అదే అన్ని ద్వారాలూ తెరుస్తుందని, ఇందుకు ఈవిడే నిదర్శనమనీ భట్ వ్యాఖ్య.

        అన్నట్టు షగుఫ్తా రఫీఖ్  సినిమాలతో సంబంధమున్న కుటుంబంలోనే పుట్టింది. కానీ సినిమాల్లో ఆ కుటుంబ సభ్యులకే ఠికానా లేకుండాపోయింది. తను కాలు పెట్టే పరిస్థితులు అప్పట్లో లేవు. అక్కడ్నించీ చూసుకుంటే ఆమె జీవితం బాలీవుడ్ సినిమాలాగే వుంటుంది. ఆమె అక్కని తాగుబోతయిన బావ కాల్చి చంపాడు, తర్వాత తనూ కాల్చుకుని చచ్చిపోయాడు. ఆమె తల్లి ఒక కొలకత్తా వ్యాపార వేత్తకి భార్య కాని భార్యగా వెళ్ళింది. ఆ వ్యాపారి ఈమె కోసం తన కుటుంబాన్ని బికారుల్ని చేశాడు. ఇక షగుఫ్తా కూడా ఆ తల్లికి పుట్టిన కూతురు  కాదు. దత్త పుత్రిక. తల్లి కూడా వీధిన పడ్డాక, ఆ తల్లిని పోషించుకోవడానికి పదకొండేళ్ళ వయసులో బార్ డాన్సర్ అయింది తను. తను డాన్సర్ నయి ఉండకపోతే దొంగనై వుండే దాన్నని అంటుందామె.  తన తల్లి కుటుంబ పోషణకు గాజులమ్ము కోవడం, వంట సామగ్రి అమ్ముకోవడం చూడలేకే బార్ డాన్సర్ అయ్యింది.

       తల్లికోసం అలా కమిట్ అయ్యాక, ఆమె ప్రోద్బలంతో శాస్త్రీయ నృత్యం – కథక్ నేర్చుకుంది భవిష్యత్తులో సినిమా హీరోయిన్ అవచ్చని. బార్ లో డాన్స్ చేస్తే ఒక్క రాత్రికి 700 రూపాయలు వచ్చేవి. ఆ మొత్తం చాలా ఎక్కువ అన్పించేది. ఎందుకంటే, నెల మొత్తం అయిదువందల రూపాయలతో గడిపిన జీవితాలు తమవి. అప్పట్లో బోన్ సూప్ మాత్రమే పుచ్చుకునే తను, తన తల్లి ఇప్పుడు చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తినే అదృష్టాన్ని సంపాదించుకున్నారు. తను సినిమా హీరోయిన్ అయ్యే కల  నిజం కాలేదు గానీ, 17 వ ఏట  ఒక ధనికుడికి ఉంపుడు గత్తెగా వెళ్ళాల్సి వచ్చింది.

        అక్కడ బందికానాలా వుండేది. స్వేచ్చకి సంకెళ్ళు పడ్డాయి. అక్కడ్నించి విముక్తి  పొందడానికి ఫుల్ టైం వేశ్యగా మారడానికి సిద్ధపడింది. ఒక చక్రబంధంలో ఇరుక్కుపోయింది. వేశ్యగా ఖరీదైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళేది. వాళ్ళలో పారిశ్రామిక వేత్తలు, రాజకీయవేత్తలు, ఉన్నత ప్రభుత్వాధికారులూ వుండే వాళ్ళు. ఇక్కడి కంటే ఇంకా దుబాయిలో బాగా డబ్బుందనే సరికి  దుబాయ్ చేరుకుంది...

        దుబాయిలోనే  జ్ఞానోదయమయింది. ఈ చక్రబంధం లోంచి బయట పడాలంటే తన అనుభవసారంతో తానో  రచయిత్రిగా మారాలని నిశ్చయించుకుంది.  అది కూడా కొద్దో గొప్పో తెలిసిన బాలీవుడ్ లోనే. కానీ ఆ సినిమా ఆఫీసుల కెళ్ళి రైటర్ గా పనిమ్మంటే ఎవరూ ఇచ్చే వాళ్ళు కాదు. టీవీ సీరియల్స్ తీసే ఆఫీసుల్లో కూడా ఇదే పరిస్థితి. రాయడంలో ఏ అనుభవమూ లేకపోవడంతో ఎవరూ ఆసక్తి కనబర్చే వాళ్ళు కాదు. పరిస్థితి ఇలా వుంటే తనకు తానూ రాసుకోవడం మొదలెట్టింది. తన జీవితానుభావాల్లోంచి వచ్చే కథలు. ఒకవైపు జీవించడానికి డాన్స్ బార్లలో మళ్ళీ డాన్సులు చేస్తూనే.  

        చివరికి 2000 లో అనేక ప్రయత్నాలు చేసి ప్రసిద్ధ నిర్మాత, దర్శకుడు మహేష్ భట్ ని కలుసుకోగల్గింది. ఆయన్ని కొన్నేళ్ళపాటు కలుస్తూ ఒక చిన్న పని సంపాదించుకో గల్గింది. అప్పుడు మోహిత్ సూరి దర్శకత్వంలో తీస్తున్న ‘కలియుగ్’ కి కొన్ని సీన్లు రాసే పని. ఆ  సీన్లు భట్ కి విపరీతంగా నచ్చి, వెంటనే ‘వోహ్ లమ్హే’ రాసే పనిని పూర్తిగా ఆమెకే అప్పజెప్పారు. అప్పుడు 2006 వ సంవత్సరం. మహేష్ భట్ కి తన మీద  నమ్మకం కలగడానికి ఆరేళ్ళు పట్టింది. అప్పటికి ఆమె వయసు  37 ఏళ్ళు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటినుంచీ వరసగా 16 సినిమాల వరకూ రాస్తూనేవుంది, బాలీవుడ్ లో టాప్ టాలెంట్స్  తో కలిసి పనిచేస్తూ. రచయిత్రిగా కథల్లో తన సొంత జీవితానుభావాల్లోంచీ, ఇతరుల జీవితాల్లోంచీ విషయాల్ని  తీసి మిళితం చేయడం అనే కళ ఆమెకి బాగా అబ్బింది. విచిత్ర మేమిటంటే,  ఇంతా చేసి తను రాసే  సినిమాలన్నీ హీరో ఓరియెంటెడ్  కథలే. అయితే తను స్వయంగా దర్శకత్వం వహించాలని రాసుకున్న  కథ మాత్రం హీరోయిన్ ఓరియెంటెడే.

        అయితే విజయవంతమైన రచయిత్రిగా బాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా, ఆమెని పాత  జీవితం వెంటాడ్డం  మానడం లేదు. కొన్ని సార్లు ఓ నిర్మాతో దర్శకుడో పిలుస్తారు. అది కేవలం తనెలా వుంటుందో చూడ్డానికే. తమ ఊహల్లో ఉవ్వీళ్ళూరిన బార్ డాన్సర్ తరహాలో కన్పించక పోయేసరికి మొహం మాడ్చుకుని తిప్పి పంపించేస్తారు.

తన జీవితంగురించి బాహాటంగానే  ఆమె ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇదంతా పబ్లిసిటీ కోసమని అనుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. కానీ ఏ పబ్లిసిటీ లేకుండానే అన్ని విజయవంతమైన సినిమాలు రాసింది. ఆ సినిమాలే రచయిత్రిగా తనకి పబ్లిసిటీ. అవే తనకి మరిన్ని అవకాశాల్ని తీసుకొస్తాయి. అవకాశాల కోసం తన జీవితాన్నపబ్లిసిటీ చేసుకోవాల్సిన ఖర్మ పట్టలేదని అంటోంది. తను ఇంటర్వ్యూలు ఇవ్వడంలో అర్ధం ఏమిటంటే, తన గురించి నల్గురూ చెవులు కొరుక్కుని తన కెరీర్ ని  పాడు చేయాలనీ చూడకుండా, అదేదో తనే బయటపెట్టేస్తే వాళ్ళ ఉత్సాహం చల్లబడి పోతుందని... తన కెరీర్ ణి పడు చేసే అవకాశ ఎవ్వరికీ ఇచ్చేది లేదన్న కృతనిశ్చయంతో వుంది...చాలా ప్రపంచాన్ని చూసివున్న తను. రచయిత్రి అయ్యే కంటే ముందు తను డేరింగ్ ఆడది. ఈ సంగతి మరువకూడదు!



-సికిందర్

Tuesday, February 2, 2016

స్పెషల్ ఆర్టికల్




హైదరాబాద్ నగర ప్రధాన కూడళ్ళ లో మల్టీప్లెక్సులు ఉన్నత వర్గాలనే టార్గెట్ చేస్తూ వెలుస్తున్నాయి. ఇక్కడ టికెట్ రేట్లని బట్టే ఇది తెలుసుకోవచ్చు. పంజాగుట్ట, అమీర్ పేట, బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్ లవంటి సంపన్న వర్గాలుండే  ఏరియాల్లో మల్టీప్లెక్స్ టికెట్ ధరలు రూ. 150 నుంచి 250 వరకూ వుంటాయి. సామాన్యులు ఇంతంత పెట్టి ఇక్కడ సినిమాలు చూడలేరు. అయితే వంద రూపాయల టికెట్ ధర సామాన్యులకి పెద్ద భారం కాదు.  నగర శివార్లలో మియాపూర్, కొంపల్లి, ఉప్పల్, ఎల్బీ  నగర్ ల వంటి ఏరియాల్లో వెలుస్తున్న మల్టీప్లెక్సుల్లో ఇందుకే టికెట్ ధర 100 రూపాయలకి మించి వుండడం లేదు. ఇక్కడ మధ్యతరగతి, ఇంకా కింది తరగతి ప్రజానీకాన్ని టార్గెట్ చేసి మల్టీప్లెక్సులు నిర్మిస్తున్నారు. 
థియేటర్లు విజయవంతంగా నడుసున్నాయి. ఇంతేకాక ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ కల్చర్ ఇతర పట్టణాలకి కూడా వ్యాపిస్తోంది. వరంగల్, విజయవాడ, వైజాగ్, కాకినాడ వంటి ప్రాంతాల్లో ఈ రంగంలోకి కార్పొరేట్ సంస్థలైన  ఐనాక్స్, సినీ పొలిస్, క్యాపిటల్ సినిమాస్, బిగ్ సినిమాస్, పీవీఆర్ వంటివి మల్టీప్లెక్సుల్ని ప్రారంభించాయి.  విజయవాడ గాంధీ నగర్లో ఒకప్పుడు వున్న రంభ- ఊర్వశి- మేనక థియేటర్ల సముదాయం  ఐనాక్స్ మల్టీప్లెక్స్ గా అవతరించింది.

పోతే  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐమాక్స్  థియేటర్ల ని  కూడా రాష్ట్రానికి తీసుకు వస్తున్నట్టు ప్రకటించారు. గుంటూరు- విజయవాడ మార్గం లో ఒకటి, తిరుపతి లో ఒకటి, వైజాగ్ లో మరొకటి ఐమాక్స్  థియేటర్ల కి స్థలాలు కేటాయించే పనిలో వున్నారు. ఇదేగాక రాష్ట్రంలోని  13 జిల్లాల్లో జోరుగా మల్టీ ప్లెక్సులు నిర్మించేందుకు ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా అందాయి.

ఈ ట్రెండ్ ఇలా ఉధృతం అవడాన్ని చూస్తే, ఇక జిల్లాల్లో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగై పోయే ప్రమాదం కన్పిస్తోంది. సింగిల్ స్క్రీన్  థియేటర్లతో నేటి యువతకి సెంటిమెంట్లు అంతగా ఉండకపోవచ్చు. వాళ్ళు మల్టీ ప్లెక్స్ తరంగా ఎదిగి వస్తూంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ కీ, ఇంకా వెనుకటి తరానికీ సింగిల్ స్క్రీన్ థియేటర్లతో జ్ఞాపకాలుంటాయి. అవి లాండ్ మార్క్ ప్రదేశాలు, పాపులర్ సెంటర్లు. చిన్నప్పట్నించీ వాటిలో సినిమాలు చూసిన అనుభవాల్నీ ఏనాటికీ  మర్చిపోలేరు. జీవితాల్లో ఒక భాగమైపోయి వుంటాయవి. 

ఇలాటి ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ని పదేళ్ళ క్రితం అన్యాయంగా కూలగొట్టేశారు. సికిందరాబాద్ కింగ్స్ వేలో ఒక లాండ్ మార్క్ ప్రదేశంగా వున్న సంగీత్ థియేటర్ని కూలగొట్టేస్తూంటే విలవిలలాడాయి ప్రాణాలు. వందలాది ఆ థియేటర్ అభిమానులు తాళలేక పత్రికలకి ఉత్తరాలు రాసి బాధని వ్యక్తం చేసుకున్నారు. ప్రతీ హిందీ సినిమాకీ, ప్రతీ ఇంగ్లీష్  సినిమాకీ ఆ థియేటర్ కి బుక్కయి పోయే అభిమానులు దాంతో జీవితకాల బాంధవ్యాన్ని పెంచుకున్నారు. అందులో సినిమా చూడకపోతే పిచ్చెక్కిపోవడమే. అలాటి థియేటర్ని కూలగొట్టి అన్యాయం చేశారు. చేయడమేగాక తామూ అన్యాయమైపోయారు యజమానులు. థియేటర్ని కూలగొట్టి పదేళ్ళ  క్రితం సింగపూర్ కంపెనీ భాగస్వామ్యంతో ప్రారంభించిన  మల్టీప్లెక్స్  - కం - మాల్ వెంచర్ నిర్మాణం ఆగిపోయి మొండి గోడలతో ఇప్పటికీ వెక్కరిస్తోంది! ఈ వెంచర్  జోలికి వెళ్ళకుండా ఉండుంటే  ‘సంగీత్’ ఇంకా తియ్యటి స్వరాలు మీటుతూ వుండేదికదా అభిమానుల హృదయాల్లో?

మల్టీప్లెక్సుల హవాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆధునీకీకరణ చెందడం అత్యవసరమే. తక్షణం యాజమాన్యాలు మేల్కోకపోతే మల్టీప్లెక్సుల పోటీలో శాశ్వతంగా మూతబడిపోవడమే. ఒక్కో  సింగిల్ స్క్రీన్ థియేటర్ మూతబడి పోవడమంటే బాధాకరంగా అపురూపమైన ఒక్కో 70 ఎంఎం స్క్రీన్ కనుమరుగవడమే. హైదరాబాద్ ఆబిడ్స్ సెంటర్లో లాండ్ మార్క్  రామకృష్ణ జంట థియేటర్లలోని 35 ఎం ఎం థియేటర్ని బాలీవుడ్ నిర్మాత సుభాష్ ఘాయ్ ప్రారంభించిన ముక్తా సినిమాస్ సంస్థ  లీజుకి తీసుకుని, వెండితెర సైజుని అలాగే వుంచి మల్టీప్లెక్స్ లెవెల్ లో ఆధునీకీకరించింది. సీటింగ్, సౌండ్, ప్రొజెక్షన్ ఇప్పుడు మల్టీప్లెక్స్ లని తలదన్నేలా వున్నాయి. స్క్రీన్బు మల్టీప్లెక్స్కిం కంటే పెద్దది. బుకింగ్  కౌంటర్స్ దగర్నుంచీ ప్రతీదీ మల్టీప్లెక్స్ ని గుర్తుకు తెచ్చేలా వున్నాయి. కానీ టికెట్ ధరలు మాత్రం పాత ధరలపై  స్వల్ప పెంపుదలతో రూ 80, 70, 30 లు మాత్రంగానే  వుంచారు!  ఇక మళ్ళీ ఒకప్పటి ధనిక, పేద వర్గాలు ఎగబడుతున్నారు ఈ థియేటర్లో సినిమాలు చూసేందుకు!

సినిమాలు ఎలావున్నా అవి ఆడాలంటే థియేటర్ల స్థితి గతులు కూడా బావుండాలి. ఇందుకే ఒకప్పుడు సినిమాలకి దూరమైన ప్రేక్షకులని అత్యాధునిక మల్టీప్లెక్సు లొచ్చేసి  పెద్ద స్థాయిలో మళ్ళీ సినిమాలవైపు ఆకర్షించగలుగుతున్నాయి ప్రేక్షకుల్ని.

సినిమా చూసే అనుభవానికి సింగిల్ స్క్రీన్ థియేటర్ని మించింది లేదు. సింగిల్ స్క్రీన్  థియేటర్లో సినిమా చూస్తే వచ్చే మజా మల్టీ ప్లెక్స్ లో ఎప్పుడూ రాదు. మల్టీ ప్లెక్స్ ఒక అపార్ట్ మెంట్ బిల్డింగ్ లో ఒక ఫ్లాట్ లాంటిది. ఫ్లాట్స్ లో ఎవరిలోకంలో వాళ్ళు డిటాచ్డ్ గా జీవిస్తూంటారు మనుషులు. ఇలాటిదే మల్టీప్లెక్స్ లో సినిమా చూసే  వ్యవహారం. ఆధునిక జీవనశైలికి అలవాటుపడ్డ ప్రేక్షకులు ఇక్కడ రిజర్వుడుగా కన్పిస్తారు. సినిమాల్ని విరగబడి ఎంజాయ్ చేయరు. కనీసం గట్టిగా నవ్వలేరు. తమలో తాము ముసిముసిగా నవ్వుకుంటారు. బిగుసుకుపోయి మొక్కుబడిగా చూసినట్టు సినిమా చూసి వెళ్ళిపోతారు ఎవరికివాళ్ళు.  

సింగిల్ స్క్రీన్ థియేటర్ ఒకపెద్ద కాలనీ లాంటిది. అందరూ పలకరించుకుంటూ   తిరిగే సోషల్ గేథరింగ్ లాంటిది. ఇక్కడ నానాజాతి ప్రేక్షకులు వుంటారు. తాహతుని బట్టి పది రూపాయల టికెట్ కూలీ వాళ్ళ నుంచీ, 30 రూపాయల టికెట్ ఇంకాస్త మెరుగ్గా బతుకుతున్న వాళ్ళ దగ్గర్నుంచీ, 50 రూపాయల టికెట్ మధ్యతరగతి మందహాసుల దగ్గర్నుంచీ, 70 రూపాయల టికెట్ బాగా బతికే వాళ్ళ వరకూ నానాజాతి సమితితో మొత్తం ఇండియా అంతా ఇక్కడ హాజరవుతుంది. క్లాస్ - మిడిల్ క్లాస్ - మాస్! ఈ వెరైటీ థియేటర్ లకి ఇంకెక్కడ దొరుకుతుంది?

వీళ్ళందరూ ఏ భేషజాలూ లేకుండా, ఏ బింకాలకీ పోకుండా, తమ ఎమోషన్స్ ని పబ్లిక్ గా ప్రకటిస్తూ సినిమాల్ని ఎంజాయ్ చేస్తారు. చప్పట్లు కొడతారు, ఈలలు వేస్తారు, పగలబడి గట్టిగా నవ్వేస్తారు -  విజయవాడ లాంటి చోట్లయితే సీన్లు ఏడ్చి నట్టుంటే నవ్వొచ్చే రన్నింగ్ కామెంటరీలు  కూడా ఇస్తూంటారు – రెచ్చిపోయే సీన్లకి పైకి కాగితం ముక్కల్ని విసురుతారు, డాన్సులు కూడా వేస్తారు. నానా హంగామా చేసి, థియేటర్ని పూర్తి స్థాయిలో వాడుకుని వదిలిపెడతారు.

విడుదలైన ఓ సినిమా వివిధ వర్గాల ప్రేక్షకుల్లోకి ఎలా వెళ్తోందో తెలుసుకోవాలంటే సింగిల్ స్క్రీన్  థియేటర్లని  మించింది లేదు. ఇక్కడంతా కలెక్టివ్ కాన్షస్ నెస్ వ్యాపించి వుంటుంది. సినిమాల్ని విశ్లేషించే వాళ్ళు ఇక్కడ కూర్చోకుండా,  హైటెక్ గా ఒక వర్గం రిజర్వుడు ప్రేక్షకుల మధ్య మల్టీప్లెక్సుల్లో కూర్చుని,  డిటాచ్డ్ గా సినిమాలు చూస్తూ, లాప్ టాప్ లో వెబ్సైట్ ఆఫీసుకి క్షణక్షణం అప్ డేట్స్ పంపించడం నిజమైన జర్నలిజం కానేకాదు. 

యువత మల్టీప్లెక్సు లవైపు మొగ్గడం సహజం. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వుండే పెద్ద సైజు వెండి తెరల మీద సినిమాల్ని చూసే అనుభవాన్ని వీళ్ళు పూర్తిగా కోల్పోతున్నారు. పెద్దసైజులో 70 ఎంఎం స్క్రీన్ లు  సింగిల్ స్క్రీన్ థియేటర్ లలోనే వుంటాయి. మల్టీ ప్లెక్సుల్లో 35 ఎంఎం కంటే ఇంకా చిన్న సైజు స్క్రీన్లే వుంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు వెయ్యి సీట్లతో వుంటే, మల్టీ ప్లెక్సులు 250 – 400 సీట్లతో మాత్రమే వుంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్ల టికెట్ల ధరలు పెద్దనగరాల్లో సైతం రూ. 20 - 50 - 70 రేంజిలోనే ఎవరికైనా అందుబాటులో వుంటాయి. అసలు సినిమా అనే వినోదాన్ని వీలైనంత పెద్ద తెరల మీద చూడాలన్న కాన్సెప్టే సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్మాణాలకి మూలం. అలాటిది తక్కువ స్థలంలో ఎక్కువ మినీ థియేటర్ లనే కాన్సెప్ట్ తో,  తెరల సైజుని తగ్గించేసి సినిమాల్ని ఆనందించమనడంలో అర్ధమే లేదు.

కానీ తాజా నివేదికల ప్రకారం  దేశంలో మల్టీప్లెక్సులు పట్టణాల్లో కూడా కలుపుకుంటే ఏటా పది శాతం చొప్పున పెరుగుతున్నాయి. 2004- 2014 మద్య ఈ పెరుగుదల స్థిరంగా వుంది. 2008-09 లో ఆర్ధిక మాంద్యం వెంటాడినప్పటికీ. పీవీఆర్ సంస్థ భారీ ఎత్తున ఇంకా నగర- పట్టణ ప్రాంతాల్లోకి మల్టీప్లెక్సులతో చొచ్చుకు పోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  

కాబట్టి ఈ వేగంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగైపోతే సినిమా నిర్మాణాల్లో జరుగుతున్న వినూత్న ఆవిష్కరణలకి తగిన విశాల ప్రదర్శన శాలలే లేకుండా పోతాయి. వాటిని కూడా మల్టీ ప్లెక్స్ చిన్న తెరలపైనే చూసి సరిపెట్టుకోవాలి. వర్చువల్ రియాలిటీ సినిమా అనేది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. కానీ  70 ఎం ఎం తెరలే లేకపోతే ఇలాటి కాన్సెప్టు లకి అన్యాయమే జరుగుతుంది. ప్రేక్షకులు కూడా వాళ్లకి అందాల్సిన పూర్తి ఆనందాన్ని పొందలేకపోతారు.


మల్టీ ప్లెక్సులకి దీటుగా పైన చెప్పుకున్న రామకృష్ణ 35 ఎంఎం థియేటర్ శైలిలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల ని  రెండు రాష్ట్రాల్లో ఆధునీకీకరించుకోవడానికి ప్రభుత్వాలే యాజమాన్యాల వెన్నుతట్టి తగిన ఆర్ధిక వనరులు సమకూర్చాలి. సింగిల్ స్క్రీన్ థియేటర్లని చచ్చిపోనివ్వకూడదు. ఉత్తరాది కార్పొరేట్  సంస్థలు ఇక్కడి సింగిల్ స్క్రీన్  థియేటర్లని  దెబ్బ తీసి, మల్టీ ప్లెక్సులు కట్టుకుని వ్యాపారాలు చేసుకుంటూ  లాభాలు తరలించుకు పోతూంటే పోనివ్వొచ్చు, దీన్నాపలేరు గనుక. అయితే ఇదే సమయంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ లకి పునర్జన్మని ప్రసాదించడానికి ఏం చెయ్యాలో ప్రభుత్వాలు అది చెయ్యకపోతే- ఇవి కనుమరుగైపోవడానికి ప్రభుత్వాలే కారణమౌతాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్ లని కనుమరుగు చేసుకోవడమంటే, సినిమా కళని కుదించి, 'బాహుబలి', 'బాజీరావ్ మస్తానీ' లాంటి మెగా సినిమాల వైభవాల్ని కూడా బెత్తెడు స్క్రీన్ల మీద చూసుకోండి పోండని తరిమికొట్టడమే. 

-      -సికిందర్ 
http://www.filmyfreak.com