రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, ఫిబ్రవరి 2016, మంగళవారం

స్పెషల్ ఆర్టికల్




హైదరాబాద్ నగర ప్రధాన కూడళ్ళ లో మల్టీప్లెక్సులు ఉన్నత వర్గాలనే టార్గెట్ చేస్తూ వెలుస్తున్నాయి. ఇక్కడ టికెట్ రేట్లని బట్టే ఇది తెలుసుకోవచ్చు. పంజాగుట్ట, అమీర్ పేట, బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్ లవంటి సంపన్న వర్గాలుండే  ఏరియాల్లో మల్టీప్లెక్స్ టికెట్ ధరలు రూ. 150 నుంచి 250 వరకూ వుంటాయి. సామాన్యులు ఇంతంత పెట్టి ఇక్కడ సినిమాలు చూడలేరు. అయితే వంద రూపాయల టికెట్ ధర సామాన్యులకి పెద్ద భారం కాదు.  నగర శివార్లలో మియాపూర్, కొంపల్లి, ఉప్పల్, ఎల్బీ  నగర్ ల వంటి ఏరియాల్లో వెలుస్తున్న మల్టీప్లెక్సుల్లో ఇందుకే టికెట్ ధర 100 రూపాయలకి మించి వుండడం లేదు. ఇక్కడ మధ్యతరగతి, ఇంకా కింది తరగతి ప్రజానీకాన్ని టార్గెట్ చేసి మల్టీప్లెక్సులు నిర్మిస్తున్నారు. 
థియేటర్లు విజయవంతంగా నడుసున్నాయి. ఇంతేకాక ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ కల్చర్ ఇతర పట్టణాలకి కూడా వ్యాపిస్తోంది. వరంగల్, విజయవాడ, వైజాగ్, కాకినాడ వంటి ప్రాంతాల్లో ఈ రంగంలోకి కార్పొరేట్ సంస్థలైన  ఐనాక్స్, సినీ పొలిస్, క్యాపిటల్ సినిమాస్, బిగ్ సినిమాస్, పీవీఆర్ వంటివి మల్టీప్లెక్సుల్ని ప్రారంభించాయి.  విజయవాడ గాంధీ నగర్లో ఒకప్పుడు వున్న రంభ- ఊర్వశి- మేనక థియేటర్ల సముదాయం  ఐనాక్స్ మల్టీప్లెక్స్ గా అవతరించింది.

పోతే  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐమాక్స్  థియేటర్ల ని  కూడా రాష్ట్రానికి తీసుకు వస్తున్నట్టు ప్రకటించారు. గుంటూరు- విజయవాడ మార్గం లో ఒకటి, తిరుపతి లో ఒకటి, వైజాగ్ లో మరొకటి ఐమాక్స్  థియేటర్ల కి స్థలాలు కేటాయించే పనిలో వున్నారు. ఇదేగాక రాష్ట్రంలోని  13 జిల్లాల్లో జోరుగా మల్టీ ప్లెక్సులు నిర్మించేందుకు ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా అందాయి.

ఈ ట్రెండ్ ఇలా ఉధృతం అవడాన్ని చూస్తే, ఇక జిల్లాల్లో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగై పోయే ప్రమాదం కన్పిస్తోంది. సింగిల్ స్క్రీన్  థియేటర్లతో నేటి యువతకి సెంటిమెంట్లు అంతగా ఉండకపోవచ్చు. వాళ్ళు మల్టీ ప్లెక్స్ తరంగా ఎదిగి వస్తూంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ కీ, ఇంకా వెనుకటి తరానికీ సింగిల్ స్క్రీన్ థియేటర్లతో జ్ఞాపకాలుంటాయి. అవి లాండ్ మార్క్ ప్రదేశాలు, పాపులర్ సెంటర్లు. చిన్నప్పట్నించీ వాటిలో సినిమాలు చూసిన అనుభవాల్నీ ఏనాటికీ  మర్చిపోలేరు. జీవితాల్లో ఒక భాగమైపోయి వుంటాయవి. 

ఇలాటి ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ని పదేళ్ళ క్రితం అన్యాయంగా కూలగొట్టేశారు. సికిందరాబాద్ కింగ్స్ వేలో ఒక లాండ్ మార్క్ ప్రదేశంగా వున్న సంగీత్ థియేటర్ని కూలగొట్టేస్తూంటే విలవిలలాడాయి ప్రాణాలు. వందలాది ఆ థియేటర్ అభిమానులు తాళలేక పత్రికలకి ఉత్తరాలు రాసి బాధని వ్యక్తం చేసుకున్నారు. ప్రతీ హిందీ సినిమాకీ, ప్రతీ ఇంగ్లీష్  సినిమాకీ ఆ థియేటర్ కి బుక్కయి పోయే అభిమానులు దాంతో జీవితకాల బాంధవ్యాన్ని పెంచుకున్నారు. అందులో సినిమా చూడకపోతే పిచ్చెక్కిపోవడమే. అలాటి థియేటర్ని కూలగొట్టి అన్యాయం చేశారు. చేయడమేగాక తామూ అన్యాయమైపోయారు యజమానులు. థియేటర్ని కూలగొట్టి పదేళ్ళ  క్రితం సింగపూర్ కంపెనీ భాగస్వామ్యంతో ప్రారంభించిన  మల్టీప్లెక్స్  - కం - మాల్ వెంచర్ నిర్మాణం ఆగిపోయి మొండి గోడలతో ఇప్పటికీ వెక్కరిస్తోంది! ఈ వెంచర్  జోలికి వెళ్ళకుండా ఉండుంటే  ‘సంగీత్’ ఇంకా తియ్యటి స్వరాలు మీటుతూ వుండేదికదా అభిమానుల హృదయాల్లో?

మల్టీప్లెక్సుల హవాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆధునీకీకరణ చెందడం అత్యవసరమే. తక్షణం యాజమాన్యాలు మేల్కోకపోతే మల్టీప్లెక్సుల పోటీలో శాశ్వతంగా మూతబడిపోవడమే. ఒక్కో  సింగిల్ స్క్రీన్ థియేటర్ మూతబడి పోవడమంటే బాధాకరంగా అపురూపమైన ఒక్కో 70 ఎంఎం స్క్రీన్ కనుమరుగవడమే. హైదరాబాద్ ఆబిడ్స్ సెంటర్లో లాండ్ మార్క్  రామకృష్ణ జంట థియేటర్లలోని 35 ఎం ఎం థియేటర్ని బాలీవుడ్ నిర్మాత సుభాష్ ఘాయ్ ప్రారంభించిన ముక్తా సినిమాస్ సంస్థ  లీజుకి తీసుకుని, వెండితెర సైజుని అలాగే వుంచి మల్టీప్లెక్స్ లెవెల్ లో ఆధునీకీకరించింది. సీటింగ్, సౌండ్, ప్రొజెక్షన్ ఇప్పుడు మల్టీప్లెక్స్ లని తలదన్నేలా వున్నాయి. స్క్రీన్బు మల్టీప్లెక్స్కిం కంటే పెద్దది. బుకింగ్  కౌంటర్స్ దగర్నుంచీ ప్రతీదీ మల్టీప్లెక్స్ ని గుర్తుకు తెచ్చేలా వున్నాయి. కానీ టికెట్ ధరలు మాత్రం పాత ధరలపై  స్వల్ప పెంపుదలతో రూ 80, 70, 30 లు మాత్రంగానే  వుంచారు!  ఇక మళ్ళీ ఒకప్పటి ధనిక, పేద వర్గాలు ఎగబడుతున్నారు ఈ థియేటర్లో సినిమాలు చూసేందుకు!

సినిమాలు ఎలావున్నా అవి ఆడాలంటే థియేటర్ల స్థితి గతులు కూడా బావుండాలి. ఇందుకే ఒకప్పుడు సినిమాలకి దూరమైన ప్రేక్షకులని అత్యాధునిక మల్టీప్లెక్సు లొచ్చేసి  పెద్ద స్థాయిలో మళ్ళీ సినిమాలవైపు ఆకర్షించగలుగుతున్నాయి ప్రేక్షకుల్ని.

సినిమా చూసే అనుభవానికి సింగిల్ స్క్రీన్ థియేటర్ని మించింది లేదు. సింగిల్ స్క్రీన్  థియేటర్లో సినిమా చూస్తే వచ్చే మజా మల్టీ ప్లెక్స్ లో ఎప్పుడూ రాదు. మల్టీ ప్లెక్స్ ఒక అపార్ట్ మెంట్ బిల్డింగ్ లో ఒక ఫ్లాట్ లాంటిది. ఫ్లాట్స్ లో ఎవరిలోకంలో వాళ్ళు డిటాచ్డ్ గా జీవిస్తూంటారు మనుషులు. ఇలాటిదే మల్టీప్లెక్స్ లో సినిమా చూసే  వ్యవహారం. ఆధునిక జీవనశైలికి అలవాటుపడ్డ ప్రేక్షకులు ఇక్కడ రిజర్వుడుగా కన్పిస్తారు. సినిమాల్ని విరగబడి ఎంజాయ్ చేయరు. కనీసం గట్టిగా నవ్వలేరు. తమలో తాము ముసిముసిగా నవ్వుకుంటారు. బిగుసుకుపోయి మొక్కుబడిగా చూసినట్టు సినిమా చూసి వెళ్ళిపోతారు ఎవరికివాళ్ళు.  

సింగిల్ స్క్రీన్ థియేటర్ ఒకపెద్ద కాలనీ లాంటిది. అందరూ పలకరించుకుంటూ   తిరిగే సోషల్ గేథరింగ్ లాంటిది. ఇక్కడ నానాజాతి ప్రేక్షకులు వుంటారు. తాహతుని బట్టి పది రూపాయల టికెట్ కూలీ వాళ్ళ నుంచీ, 30 రూపాయల టికెట్ ఇంకాస్త మెరుగ్గా బతుకుతున్న వాళ్ళ దగ్గర్నుంచీ, 50 రూపాయల టికెట్ మధ్యతరగతి మందహాసుల దగ్గర్నుంచీ, 70 రూపాయల టికెట్ బాగా బతికే వాళ్ళ వరకూ నానాజాతి సమితితో మొత్తం ఇండియా అంతా ఇక్కడ హాజరవుతుంది. క్లాస్ - మిడిల్ క్లాస్ - మాస్! ఈ వెరైటీ థియేటర్ లకి ఇంకెక్కడ దొరుకుతుంది?

వీళ్ళందరూ ఏ భేషజాలూ లేకుండా, ఏ బింకాలకీ పోకుండా, తమ ఎమోషన్స్ ని పబ్లిక్ గా ప్రకటిస్తూ సినిమాల్ని ఎంజాయ్ చేస్తారు. చప్పట్లు కొడతారు, ఈలలు వేస్తారు, పగలబడి గట్టిగా నవ్వేస్తారు -  విజయవాడ లాంటి చోట్లయితే సీన్లు ఏడ్చి నట్టుంటే నవ్వొచ్చే రన్నింగ్ కామెంటరీలు  కూడా ఇస్తూంటారు – రెచ్చిపోయే సీన్లకి పైకి కాగితం ముక్కల్ని విసురుతారు, డాన్సులు కూడా వేస్తారు. నానా హంగామా చేసి, థియేటర్ని పూర్తి స్థాయిలో వాడుకుని వదిలిపెడతారు.

విడుదలైన ఓ సినిమా వివిధ వర్గాల ప్రేక్షకుల్లోకి ఎలా వెళ్తోందో తెలుసుకోవాలంటే సింగిల్ స్క్రీన్  థియేటర్లని  మించింది లేదు. ఇక్కడంతా కలెక్టివ్ కాన్షస్ నెస్ వ్యాపించి వుంటుంది. సినిమాల్ని విశ్లేషించే వాళ్ళు ఇక్కడ కూర్చోకుండా,  హైటెక్ గా ఒక వర్గం రిజర్వుడు ప్రేక్షకుల మధ్య మల్టీప్లెక్సుల్లో కూర్చుని,  డిటాచ్డ్ గా సినిమాలు చూస్తూ, లాప్ టాప్ లో వెబ్సైట్ ఆఫీసుకి క్షణక్షణం అప్ డేట్స్ పంపించడం నిజమైన జర్నలిజం కానేకాదు. 

యువత మల్టీప్లెక్సు లవైపు మొగ్గడం సహజం. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వుండే పెద్ద సైజు వెండి తెరల మీద సినిమాల్ని చూసే అనుభవాన్ని వీళ్ళు పూర్తిగా కోల్పోతున్నారు. పెద్దసైజులో 70 ఎంఎం స్క్రీన్ లు  సింగిల్ స్క్రీన్ థియేటర్ లలోనే వుంటాయి. మల్టీ ప్లెక్సుల్లో 35 ఎంఎం కంటే ఇంకా చిన్న సైజు స్క్రీన్లే వుంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు వెయ్యి సీట్లతో వుంటే, మల్టీ ప్లెక్సులు 250 – 400 సీట్లతో మాత్రమే వుంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్ల టికెట్ల ధరలు పెద్దనగరాల్లో సైతం రూ. 20 - 50 - 70 రేంజిలోనే ఎవరికైనా అందుబాటులో వుంటాయి. అసలు సినిమా అనే వినోదాన్ని వీలైనంత పెద్ద తెరల మీద చూడాలన్న కాన్సెప్టే సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్మాణాలకి మూలం. అలాటిది తక్కువ స్థలంలో ఎక్కువ మినీ థియేటర్ లనే కాన్సెప్ట్ తో,  తెరల సైజుని తగ్గించేసి సినిమాల్ని ఆనందించమనడంలో అర్ధమే లేదు.

కానీ తాజా నివేదికల ప్రకారం  దేశంలో మల్టీప్లెక్సులు పట్టణాల్లో కూడా కలుపుకుంటే ఏటా పది శాతం చొప్పున పెరుగుతున్నాయి. 2004- 2014 మద్య ఈ పెరుగుదల స్థిరంగా వుంది. 2008-09 లో ఆర్ధిక మాంద్యం వెంటాడినప్పటికీ. పీవీఆర్ సంస్థ భారీ ఎత్తున ఇంకా నగర- పట్టణ ప్రాంతాల్లోకి మల్టీప్లెక్సులతో చొచ్చుకు పోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  

కాబట్టి ఈ వేగంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగైపోతే సినిమా నిర్మాణాల్లో జరుగుతున్న వినూత్న ఆవిష్కరణలకి తగిన విశాల ప్రదర్శన శాలలే లేకుండా పోతాయి. వాటిని కూడా మల్టీ ప్లెక్స్ చిన్న తెరలపైనే చూసి సరిపెట్టుకోవాలి. వర్చువల్ రియాలిటీ సినిమా అనేది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. కానీ  70 ఎం ఎం తెరలే లేకపోతే ఇలాటి కాన్సెప్టు లకి అన్యాయమే జరుగుతుంది. ప్రేక్షకులు కూడా వాళ్లకి అందాల్సిన పూర్తి ఆనందాన్ని పొందలేకపోతారు.


మల్టీ ప్లెక్సులకి దీటుగా పైన చెప్పుకున్న రామకృష్ణ 35 ఎంఎం థియేటర్ శైలిలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల ని  రెండు రాష్ట్రాల్లో ఆధునీకీకరించుకోవడానికి ప్రభుత్వాలే యాజమాన్యాల వెన్నుతట్టి తగిన ఆర్ధిక వనరులు సమకూర్చాలి. సింగిల్ స్క్రీన్ థియేటర్లని చచ్చిపోనివ్వకూడదు. ఉత్తరాది కార్పొరేట్  సంస్థలు ఇక్కడి సింగిల్ స్క్రీన్  థియేటర్లని  దెబ్బ తీసి, మల్టీ ప్లెక్సులు కట్టుకుని వ్యాపారాలు చేసుకుంటూ  లాభాలు తరలించుకు పోతూంటే పోనివ్వొచ్చు, దీన్నాపలేరు గనుక. అయితే ఇదే సమయంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ లకి పునర్జన్మని ప్రసాదించడానికి ఏం చెయ్యాలో ప్రభుత్వాలు అది చెయ్యకపోతే- ఇవి కనుమరుగైపోవడానికి ప్రభుత్వాలే కారణమౌతాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్ లని కనుమరుగు చేసుకోవడమంటే, సినిమా కళని కుదించి, 'బాహుబలి', 'బాజీరావ్ మస్తానీ' లాంటి మెగా సినిమాల వైభవాల్ని కూడా బెత్తెడు స్క్రీన్ల మీద చూసుకోండి పోండని తరిమికొట్టడమే. 

-      -సికిందర్ 
http://www.filmyfreak.com