రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, April 12, 2015

ఆనాటి సినిమా


          మేఘం తమిళనాడు నుంచి అలా అలా తేలుతూ వచ్చి వాలింది. వాన మేఘాలు కేరళ నుంచొస్తాయి. ఇది వాస్తు మేఘం. అందులో తెల్లగా మెరుస్తూ ఏవో అక్షరాలూ. ఏమిటా అని పరీక్షగా చూస్తే  అది దర్శకుడి పేరు! ఇదేదో డిఫరెంట్ గా వుందే  న్యూ వేవ్ గా.. అని ఫ్రీజై, వాస్తు మారిపోయిన ఆ వాల్ పోస్టర్ డిజైన్ పై భాగం కేసే తెలుగు ప్రేక్షకుల క్రేజీ లుక్స్.. ‘మన్మధలీల’ ఆ సినిమా...కె. బాలహందర్ ఆ దర్శకుడు!
న్యూవ్ వేవ్ ప్రయోగాలతో నిత్య పథికుడతను!


          దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారే గానీ, ఆ పేరుని కాస్త క్యాప్షన్ లో పెట్టి గౌరవించు కోవాలని అప్పటిదాకా ఎవరికీ తట్టలేదు, బాల చందర్ కి తప్ప!
          పోస్టర్ల అడుగున ఇతర సాంకేతికుల పేర్ల వరసలో ఇరుక్కున్న దర్శకుడి పేరుని అమాంతం పైకి లాక్కొచ్చి , నింగిలో ప్రతిష్టించిన వాడు కైలాసం బాలచందర్. ఇంటి పేరులోనే ఊర్ధ్వ ముఖ యానం ఉన్నాక, అది పోస్టర్లో నూ ఉండాలన్న ఆలోచన రాకపోతుందా? ఇది తర్వాత తెలుగులోనూ ప్రముఖ దర్శకులకి మాస్ కాపీయింగ్ వనరు అయిపోయిన సంగతి తెలిసిందే.
          బాల చందర్ బ్రెయిన్ చైల్డ్ ప్రభావం అలాంటిది...
          కొత్తాలోచన, కొత్త పంథా అతడి కళలు. ఫ్రేముల్ని ప్రేమించడానికి మనకి బాపు ఎలాగో  తమిళులకి బాల చందర్ అలాగ. కళ్ళజోడు ఫ్రేముల్లోంచి కెమెరా కూడా పట్టుకోలేని ప్రతీకల ప్రహేళికలు, పాత్రల ప్రస్థానాలు, మనస్తత్వాల మదింపులు.. నాటక రచయితగా ప్రారంభమయ్యాడు. సినిమాల్లోకి వచ్చాడు. ఎమ్జీఆర్, ముక్తా శ్రీనివాసన్ ల వంటి పాపులర్ హీరోలకి అప్పట్లో మాస్ డైలుగులు రాశాడు. తను డైరెక్టర్ అయ్యేటప్పటికి దీనికి భిన్నమైన పంథా పట్టుకు పోయాడు. అదే మాస్ మసాలా కి దూరంగా న్యూవేవ్ పంథా!  కమర్షియల్ సినిమాలతో హీరోల ఏలుబడిలో హీరోయిన్లకి విలువ లేకుండా పోవడం చూశాడు. అప్పుడు మధ్యతరగతి జీవితాల్ని సున్నితంగా తడిమి, ఒకటొకటిగా విధి వంచితల వృత్తాంతాలతో ప్రేక్షక హృదయాల్ని గెల్చుకోవడం ప్రారంభించాడు. న్యూ వేవ్ అతడి ఒరవడి అయ్యింది. సైకాలజీ దాని ముడి సరికయ్యింది. మనసు చుట్టే రీళ్ళు చుడతాడు. మనసుకవి ఆత్రేయ లాగా మనసు దర్శకుడతను.
          అతడి న్యూవేవ్ ప్రయోగాల్లోనూ ఒక తేడా వుంది. న్యూవేవ్ సినిమాలంటే హిందీ లో సైతం అప్పటిదాకా కమర్షియల్ విలువల్లేని సీరియస్ కళారూపాలుగా  ఉంటున్న తీరుని కాస్తా, దాని మేధోపరమైన బడాయిని కాస్తా, బ్రేక్ చేసేస్తూ తనదైన న్యూవేవ్ సినిమాని ప్రవేశపెట్టుకున్నాడు.. నాణేనికి రెండు ముఖాలుంటాయి. బాల చందర్ చేతుల్లో రెండు పళ్ళేలుంటాయి. ఒక పళ్ళెం లో వేడివేడి అన్నం వడ్డిస్తాడు, మరో పళ్ళెంలో ఫాస్ట్ ఫుడ్ పెట్టేస్తాడు! ఇదీ బాలచందర్ బ్రాండ్ న్యూవేవ్!  ఆఫ్ బీట్ లో కమర్షియాలిటీని కలిపికొట్టి వడ్డించే విందు భోజనం!
          ‘బొమ్మాబొరుసా పందెం వెయ్యీ..నీదో నాదో  పై చెయ్యీ..’ అన్నపాట చాలామంది వినే వుంటారు. అప్పట్నించీ –అంటే 1971 నాటి నుంచీ తెలుగులో వున్నాడు బాలచందర్. అప్పటి ‘బొమ్మాబొరుసా’ అతను తెలుగులో తీసిన తొలి సినిమా అయింది. తర్వాత ‘అంతులేని కథ’, ‘మరో చరిత్ర’, ‘ఆకలి రాజ్యం’, ‘47 రోజులు’, ‘ఇది కథ కాదు’, ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’, ‘కోటి విద్యలు కూటి కొరకే’, ‘కోకిలమ్మ’, ‘రుద్రవీణ’, ‘గుప్పెడు మనసు’...ఇవన్నీ ప్రత్యేకించి తెలుగు వాళ్ళకోసం తన హృదయాన్ని ఒలిచి మల్చిన  సజీవ చిత్రాలు. మరో తొంభై దాకా తమిళ, హిందీ కన్నడలూ అతడి కెరీర్ గ్రాఫ్ లో కొలువు దీరాయి. ఏడు  జాతీయ అవార్డులూ జై కొడుతూ ముంగిట వచ్చి చేరాయి.
          1930 లో జన్మించాడు బాలచందర్. ‘మన్మధలీల’  తీసేనాటికి 46వ ఏట వున్నాడు! సాధారణంగా ఈ వయసు కొచ్చేటప్పటికి దర్శకులు, తరం మారి మళ్ళీ తాజాగా పుట్టుకొచ్చే  నవతరం  ప్రేక్షకుల హృదయాల్ని అర్ధం జేసుకోలేక, అవే పాతవాసనల చాదస్తాల్ని ప్రదర్శించుకుని ఔటై పోవడం చూస్తూంటాం. బాలచందర్ ఈ కోవకి చెందడు. 46 ఏళ్ల వయసులో  ఇరవైలలోని కుర్రకారులకి పిచ్చెత్తించే ‘మన్మధలీల’ తీసి వదిలాడు! మళ్ళీ 48 ఏట ‘మరోచరిత్ర’ అనే మరో కుర్ర సినిమాని యూత్ కి ఎక్కుపెట్టి కిర్రెక్కించాడు! మనసు దర్శకుడికి మానసిక వృద్ధాప్యం అప్పుడే వుండదేమో!
          మరో చరిత్ర! ఇందులో మనసు- వయసుల లడాయి ఎలావుంటుందో చూపిస్తాడు. మనసుకు ప్రతీక కమల్ హాసన్ పాత్ర అయితే - వయసుకి సింబల్ సరిత పాత్ర. మనసూ వయసుల సయ్యాటలో పడి మిగతా ప్రపంచాన్ని ఆదమరిస్తే దాని పర్యవసానాలెంత  తీవ్రంగా ఉంటాయన్నదే ఇక్కడ హెచ్చరిక. ఈ పర్యవసానాలకి ‘విధి’ అని పేరు పెడతాడు. ‘విధి చేయు వింతలన్నీ మతిలేని చేష్ఠ లేననీ’ -అంటూ ఆత్రేయ చేత పాట రాయించి!
       విధి అనే ఎలిమెంటు ఆరోజుల్లో బాక్సాఫీసు ఫార్ములాగా ఏలుకుంటోంది. సినిమాలు సబ్జెక్టివ్ గా ఉండేవి- ప్రేక్షకులూ ఆలాగే సబ్జెక్టివ్ గానే బుద్ధిగా వుండే వాళ్ళు. వీర హీరోయిజాలతో ఆబ్జెక్టివ్ గా సినిమాలు తీయడం- ప్రేక్షకులు మళ్ళీ దీనికి బుద్ధిగా మారిపోవడం తర్వాత్తర్వాత  జరిగింది. సినిమాలెలా ఉండాలో ప్రేక్షకులు నిర్ణయించరు, సినిమాలే నిర్ణయించుకుని తమ వెంట ప్రేక్షకుల్ని తీసుకుపోతాయి. అలా ఆనాటి విధి అనే సబ్జెక్టివ్ ఎలిమెంటు – అది సృష్టించే విషాద ముగింపులూ  అప్పటి ట్రెండ్ లో ఒక ఆమోదనీయమైన భాగమై పోయాయి. ‘మరోచరిత్ర’ విషాదాంతం ఓ పునర్జన్మకి ప్రారంభమే. కాకపోతే పుట్టుకల్లేవు. ఎప్పుడు పుడతారో తెలీదు. బాలూ – స్వప్న ( కమల్- సరిత) ల ఆత్మలు వచ్చి తమ కథ చెప్పుకుంటున్నాయి. సముద్ర హోరులో ఆ శిథిల సౌధంలో వాళ్ళ స్వీట్ నథింగ్సే ప్రతిధ్వనిస్తున్నాయి. ఇహలోకంలో ఒక్కటి కాలేకపోయిన ఆర్తి వాళ్ళ సంభాషణల్లో వ్యక్త మౌతోంది. ఆ సముద్రపు టొడ్డున ఇంకా ఆ రోజుల్లో విశాఖకి ఉక్కు కర్మాగారం రాలేదు. దాని తాలూకు పైలాన్ మాత్రమే  వెలసింది పర్యాటక కేంద్రంలా. అది సినిమాలో కన్పిస్తూంటుంది.. ఇంకా ఆరోజుల్లో అబ్బాయిలు చక్కగా బెల్ బాట మ్సే వేసుకుని వీర స్టయిల్ కొడుతున్నారు. అమ్మాయిలూ ఇంకా నిండుగా చీర కట్టుకుంటూనే, తామూ మోడరన్  అన్పించుకోవడానికి కాస్త ధైర్యం చేసి, స్లీవ్ లెస్ జాకెట్లు మాత్రమే  వేసుకుని పబ్లిక్ రియాక్షన్స్ ని టెస్ట్ చేస్తున్నారు. అబ్బాయిలకి ఇంకా సెల్ ఫోన్లు అనే జీవనాధారం లేక మౌతర్గాన్ లు వాయించుకుంటూ కూర్చున్నారు. ఉద్యోగాలకి ఈసురోమనే గవర్నమెంటాఫీసులే గతి. అలాటి ఓ నిద్రపుచ్చే ఆఫీసులో దిక్కుమాలిన ఉద్యోగానికి ఛీ కొట్టేసి ఇంటికొచ్చేస్తాడు బాలూ.

      పక్కింట్లో వుంటుంది స్వప్న. ఎదురుగా పర్చుకుని అంతా సముద్రం. పక్కపక్కనే ఈ తెలుగు-తమిళ కుటుంబాలు రెండిటికీ ఎప్పుడూ కీచులాటలే. సంస్కృతుల సమరం. అలాటిది బాలూ స్వప్నలకి ప్రేమకుదిరి ఇళ్ళల్లో దుమారం రేగుతుంది. వీళ్ళ ప్రేమ మత్తుని వదిలించడానికి కుటుంబాలు రెండూ ఉపాయంతో ఓ షరతు పెడతాయి. ఏడాది పాటు ఇద్దరూ దూరం దూరంగా గడపాలి. ఏడాది ఎడబాటు తర్వాతకూడా ఇంకా ఇంతే  బలంగా ప్రేమలుంటే ఆప్పుడు పెళ్లి చేస్తామంటారు  ఎలాగూ ఆ నాటికి ప్రేమలే ముంటాయిలే పిచ్చోళ్ళకి అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళది!

         దీనికి సరేనని స్వప్నని వదిలి హైదరాబాద్ కొచ్చేస్తాడు బాలూ. ఇక్కడ సంధ్య పాత్రలో మాధవి పరిచయమౌతుంది. ఈమె దగ్గర నాట్యం నేర్చుకునే పనిలో పడతాడు. అటు బాలూనే స్మరించుకుంటూ బరువుగా గడుపుతున్న స్వప్నకి  పెళ్లి సంబంధం తెస్తారు. ఈ పెళ్ళికి ఒప్పుకుందని అటు అపార్ధం జేసుకున్న బాలూ, మనసు విరిచేసుకుని సంధ్యకి పెళ్లి ప్రతిపాదన చేసిపారేస్తాడు. భర్త లేని సంధ్యకి బాలూ ప్రతిపాదనతో ప్రాణం లేచొస్తుంది. తీరా స్వప్నతో అతడి అసలు కథ తెలిసి, పెద్ద మనసు చేసుకుని, ఆ అపార్ధాలూ తొలగించి తను తప్పుకుంటుంది వాళ్ళ జీవితాల్లోంచి. ఇక ఏడాది గడువు ముగిసిపోయి, ఏమాత్రం మాసిపోని ప్రేమతో స్వప్నని  చేపట్టేందుకు హ్యాపీగా వెళ్తున్న  బాలూ మీద దుండగుల దాడి జరుగుతుంది. అదే  సమయంలో స్వప్న మీద వేరొకడు అత్యాచారం చేస్తాడు. కొనూపిరిరులతో మిగిలిన ప్రేమికులిద్దరూ విధిలేక ఇక ఆత్మార్పణం చేసుకుని కథ ముగిస్తారు!

   శాడ్ టర్నింగ్..ఎందుకీ విషాదం? రాని  భాషలతో ఇద్దరి మధ్యా  రోమాన్సూ అంతగా పండించి, అరడజను సూపర్ హిట్ పాటలతో అలరించి, కామిక్ రిలీఫ్ కోసం మిశ్రోతో నవ్వించి, కాలం-దూరం- సమాచార లేమి అనేవి నిజమైన ప్రేమల్ని నిర్వీర్యం చేయలేవనీ నిరూపిస్తూ ఈ ఆకస్మిక ట్రాజడీ దేనికి?

     సినిమాలకి రెండు రూపాల్లో క్లయిమాక్సులు వుంటాయి. స్టోరీ ( కథా ) క్లయిమాక్సు ఒకటైతే, ప్లాట్ ( కథనపు) క్లయిమాక్స్ రెందోది. మొదటిది ఉద్దేశించిన స్టోరీ పాయింటుకి  న్యాయం చేస్తుంది. అంటే ఏడాది పాటూ ఎడబాటుని భరించిన బాలూ స్వప్నలు ఎలా ఏకమయ్యారనేది స్టోరీ క్లైమాక్సు చూపిస్తుంది. ప్రేక్షకులు కూడా ఈ కోవలోనే ముగింపునే ఊహిస్తారు. కానీ ప్లాట్ క్లయిమాక్స్ వచ్చేసరికి అది స్టోరీ క్లయిమాక్సుని  అప్రస్తుతం చేసేస్తుంది. ఏ సినిమా చూసినా బాలచందర్ ముగింపుతో ఒక షాక్ ఇస్తాడు. షాక్ ట్రీట్ మెంట్, యాంటీ క్లయిమాక్సులు అతడి రెండు కళ్ళు కదా? ఈ సినిమాలో ఏం చక్కా స్టోరీ క్లయిమాక్స్ కి ప్లాట్ క్లయిమాక్స్ తో చెక్ పెట్టేసి తమాషా చూశాడు. ఇదే సరైనదన్పించి ప్రేక్షకులకి వడ్డించాడు.

          ప్లాట్ క్లయిమాక్స్ కథనం లోంచి పుడుతుంది. ఎలాగంటే, కథనం లో సంధ్య అన్న బాలూ మీద కక్ష గట్టే  బీట్ ఒకటి వుంది. తన చెల్లెలు సంధ్యతో పెళ్లిని ఎగ్గొడుతున్నాడన్న కక్ష అది. అలాగే అటు స్వప్న తో ఒకడెవడో అదివరకు మిస్ బిహేవ్ చేసి లెంపకాయ తిన్నవాడు పగబట్టిన బీట్ కూడా వుంది. ఈ రెండు బీట్లూ ఉన్నాక మొదట ఉద్దేశించిన- ప్రేక్షకులాశిస్తున్న స్టోరీ క్లయిమాక్స్ అనేది ఆటోమేటిగ్గా అప్రస్తుత మైపోతుంది.


          గొప్ప సినిమాల్లో నిగూఢంగా వుండే సత్యాల కోసం వెతకాలంటాడు  జేమ్స్ బానెట్. ఇక్కడ ప్లాట్ క్లయిమాక్స్ ద్వారా ఓ నిగూఢ సత్యాన్నే స్థాపించాడు బాలచందర్. ఇదే ప్రేక్షకుల సబ్ కాన్షస్ తో వాళ్లకి తెలీకుండా కనెక్ట్ అయిపోయింది. ఫలితంగా సినిమా దిగ్విజయం సాధించింది.

          ఆఫ్ట్రాల్ విధి అంటే ఏమిటి! కేవలం మన ఇగోలని బట్టి పని చేసుకు పోయే యాంత్రిక శక్తేగా? మన ఇగోలతో మనం పోగేసుకున్న మంచీ చెడ్డ కర్మల తూకాన్ని బట్టి జీవితంలో ఆయా ఘట్టా లె దురవుతూంటాయి కదా? దీన్నే విధి విలాసమన్నారు కదా? అప్పుడు దీంతో దేవుడి కెలాటి  సంబంధమూ లేదు. దేవుడు ఉపయోగించుకోమని మనకి ఓ చక్కటి విచక్షణా జ్ఞానం గల మెదడు ని మాత్రమే ఇచ్చి ఊరుకున్నాడు. ఎలా ఉపయోగించుకుంటే అలా తయారవుతాం! స్వప్న తన వయసు ప్రభావం చేత విచక్షణా జ్ఞానం తో తీసుకోవాల్సిన ఛాయిస్ ని మరచి, తనతో మిస్ బిహేవ్ చేసిన వాడి ఇగోని దారుణంగా దెబ్బ తీసింది అలా లెంపకాయ కొట్టేసి! ఆ తర్వాత కాలంలో తప్పించుకోలేని ఆ చర్య తాలూకు ఫలితం అనుభవించింది. అటు బాలూ కూడా ఆ క్షణంలో విచక్షణా జ్ఞానం లేక మనసు మీద అదుపు కోల్పోయాడు. ప్రేమించిన స్వప్ననే అనుమానించాడు. దరిమిలా దారితీసిన పరిణామాల రిత్యా కక్ష గట్టిన సరిత అన్నతోనే ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు! ఎవరైనా తొందరపడి ఛాన్స్ తో గాక- ఛాయిస్ తో నిర్ణయాలు తీసుకోవాలన్నదే ఈ ప్లాట్ క్లయిమాక్స్ ప్రవచిస్తున్న నిగూఢ సత్యమన్న మాట!

          ఇంత విషయమున్నాక- ఇంకా సిల్లీగా ప్రేమికులిద్దర్నీ కలిపేసి సుఖాంతం చేయాలని కేవలం విషయపరిజ్ఞానం లేని దర్శకులే చేస్తారు- బాలచందర్ కాదు!

          ప్లాట్ క్లయిమాక్స్ తో శాస్త్రీయంగా ప్రేక్షకులకి కనెక్ట్ అయి మెగా హిట్టయిన ఈ ‘మరో చరిత్ర’ ని స్వర్గీయ  ఎల్వీ ప్రసాద్ హిందీలో ‘ఏక్ దూజే కే  లియే’ గా రీమేక్ చేయాలని నిర్ణయించినప్పుడు కూడా - ముగింపుని సుఖాంతం చేయాల్సిందిగా వొత్తిళ్లు వచ్చాయి బాల చందర్ మీద. ఆయన ఒరిజిజనల్ ముగింపు నుంచి అంగుళం కూడా కదిలేది లేదని స్పష్టంగా చెప్పేశాడు. మళ్ళీ దుఖాంతమే హిందీలో సూపర్ హిట్టయ్యింది. దుఖాంతంలో జీవితసత్యాలతో సబ్ కాన్షష్ గా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ వున్నాయి! దీనికి ముందు తెలుగు ఒరిజి నల్ తమిళంలో డబ్బింగ్ అయి కూడా ఏడాది పాటూ ఆడింది. హిందీ రిమేక్ కూడా హైదరాబాద్ లో ఏడాది పాటూ ఆడింది. కథలో వున్న  వినూత్న ‘ఏడాది ఎడబాటు’ పాయింటే గమ్మత్తుగా  ప్లాట్ క్లయి మాక్సుగా మ్యాజిక్ చేసి ఏడాది పాటూ ప్రదర్శనలకి దారి తీసిందన్న మాట!

          ‘మరో చరిత్ర’ - ఒక అపూర్వ చరిత్ర. మనకోసం బ్లాక్ అండ్ వైట్ లో ఇంత అద్భుతంగా సృష్టించిన ఈ వెచ్చటి అనుభవానికి రివాజుగా బాల చందర్ ఆస్థాన  విద్వాంసులందరూ పనిచేశారు. గణేష్ పాత్రో, ఆచార్య ఆత్రేయ, ఎం ఎస్ విశ్వనాథన్, లోకనాథ్ ప్రభృతులు...ఇక కమల్ హాసన్- సరితల జంట  తమ అసమాన నటనలతో ఈ సినిమా చూసే ఏ తరం ప్రేక్షకుల హృదయాలలో నైనా చిరస్థాయిగా నిలిచి పోతారు.


సికిందర్ 

(సెప్టెంబర్ 2009 ‘సాక్షి’ కోసం) 

Saturday, April 11, 2015

రివ్యూ..



రచన –దర్శకత్వం :  త్రివిక్రమ్ 
అల్లు అర్జున్, సమంతా, నిత్యా మీనన్, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, ఉపేంద్ర, స్నేహ, బ్రహ్మానందం, ఎమ్మెస్, అలీ తదితరులు.
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్    కెమెరా :  ప్రసాద్ మూరెళ్ళ
బ్యానర్ :  హారికా అండ్ హాసిని
క్రియేషన్స్
నిర్మాత : ఎస్. రాధాకృష్ణ
విడుదల :   ఏప్రెల్ 9, 2015   సెన్సార్ :  U/A

***
        కుటుంబ కథా చిత్రాలు కూడా పరిణామం చెందాయి. తిరగమోత కథలకి ప్రతిగా ‘మనం’, ‘దృశ్యం’ లాంటి అగ్రతారాగణ కుటుంబ కథా చిత్రాల ఘన విజయాల్ని చూశాం. కథో పాత్రో కొత్తదనంతో కూడుకుని ఉన్నప్పుడే ఇలాటి ఘన విజయాలు ఈ కాలంలో సాధ్యమయ్యాయి. రెండూ పాత తిరగమోతే అయినప్పుడు క్రేజీ కాంబినేషన్లు కూడా కాపాడే పరిస్థితి కన్పించడం లేదు. ఇలాటి భారీ సినిమాల్ని గట్టెక్కించాలంటే తప్పనిసరిగా అది కిల్లర్ స్టోరీ అయివుండాలి. బాక్సాఫీసు వసూళ్ళని ఎక్కడికక్కడ కిల్ చేసి తినేసే కథని  కిల్లర్ స్టోరీ అంటారు. కానీ ఆ కిల్లర్ స్టోరీ కూడా బకాసురుడిలా కలెక్షన్లని ఆరగించాలంటే  దాని సీక్వెన్సుల్ని స్క్రీన్ ప్లే దిగ మింగి కూర్చోకూడదు- ఇది కామన్ సెన్సే. ఒక్కొక్కప్పుడు గత సినిమా సక్సెస్ హేంగోవర్ లోంచి బయటికి రాలేనప్పుడు ఇలాటి అలసత్వం వచ్చేస్తుంది. దీని మూల్యం భారీగానే  చెల్లించుకోవాల్సి వుంటుంది. ‘అత్తారింటికి దారేది’  మీది మమకారాన్ని చంపుకోలేక ‘అబ్బాయి విలువలకి వేల్యూ ఏది’  గా తీయాలనుకున్నప్పుడు ‘షోలే- షాన్’ ల సంగతే పునరావృతమవక తప్పదేమో  అనివార్యంగా..

          అల్లు అర్జున్- త్రివిక్రమ్ ఒక క్రేజీ కాంబినేషన్ అనుకున్నారు అభిమానులు. ఆ హుషారుతో థియేటర్లకి వెళ్తే ఇలాటి సినిమాలో ఉండాల్సిన కిక్ – పెప్ – పంచ్ – యూత్ అప్పీల్ మొదలైనవాటిని అయోమయంగా వెతుక్కోవాల్సిన పరిస్థితి. అన్ని అపార వనరులు కలిగివుండే  బిగ్ షాట్సే కమర్షియల్ సినిమాని కమర్షియల్ సినిమాలాగా తీయలేక పోతే ఇంకెవరు తీయాలన్న ప్రశ్న వస్తుంది.

         బిగ్ కమర్షియల్స్ లో కథని ఆశించకూడదనే వరకైతే ఎలాగో సర్దుకుపోవచ్చు.  కానీ కమర్షియల్ విలువల్ని కూడా ఆశించకూడదు అన్నట్టుగా సినిమా తీయడం మాత్రం దారుణమే.

        హీరో అన్నాక డీ ఫాల్ట్ గా అన్ని సద్గుణాలూ, విలువలే వుంటాయి- ఇంకా తండ్రి నుంచి నేర్చుకున్న విలువలంటూ గొడవేమిటి? అసలు ఈ సినిమాకి ఏంతో అత్యవసరమున్న కమర్షియల్ విలువలకి ఓ నమస్కారం పెట్టి, తన తండ్రి విలువలంటూ పట్టుకు పాకులాడే ఈ కొడుకు కథ అసలెలా తెరకెక్కిందో ఓసారి చూద్దాం!

‘వి’ ఫర్ విలువల గురించి పాఠాలు!
          విరాజ్ ఆనంద్ ( అల్లు అర్జున్ ) ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులోని ఒక గ్రామంలో ప్రత్యర్ధి దేవరాజ్ నాయుడు ( ఉపేంద్ర ) ముఠాతో నువ్వా- నేనా అన్నట్టున్న తీవ్ర పోరాట ఘట్టంలో వున్నప్పుడు, క్షణమాగి తనగురించి ఆలోచించుకోవడం మొదలెడతాడు ( ఆ సమయంలో అదెలా కుదురుతుందని అడగవద్దు) ఆ ఆలోచనలే  అతడి మొత్తం కథ. అతడి స్వగతంలో ఫ్లాష్ బ్యాక్.  దాని ప్రకారం తను సత్యమూర్తి ( ప్రకాష్ రాజ్ ) అనే సత్యవంతుడైన వ్యాపార వేత్త కొడుకు. తనకి తల్లి ( పవిత్రా కిషోర్ ), అన్న (వెన్నెల కిషోర్ ), వదిన ( సింధు తులానీ ) వాళ్ళ కూతురూ కుటుంబ సభ్యులుగా వుంటున్నారు. మూడొందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన తండ్రి సత్యమూర్తి అడిగిన వాళ్లకి లేదనకుండా సాయం చేస్తూంటాడు. డబ్బు కంటే మానవ సంబంధాలు విలువైనవి అన్న అతడి నమ్మకాన్ని విరాజ్ పుణికి పుచ్చుకుంటాడు. తండ్రికున్న వ్యాపారం పట్టకుండా జాల్సాగా తిరిగే ఇరవై యేడేళ్ళ తనకి పల్లవి ( అదా శర్మ ) తో నిశ్చితార్ధం కూడా జరుగుతుంది. దీన్ని పురస్కరించుకుని బ్యాచిలర్ పార్టీకి బార్సిలోనా వెళ్లి బార్లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు, రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణవార్త షాకింగ్ గా తగుల్తుంది. తిరిగి వస్తే అన్నకి ఆ తండ్రి మరణంతో మతి చలించి, వ్యాపారం కుప్పకూలి ఆస్తులు అప్పులోళ్ళ పరం చేయాల్సిన పరిస్థితి. చేయకుండా ఐపీ పెట్టి ఎగ్గొట్ట వచ్చు. కానీ తండ్రి విలువలు అవికావు. దీంతో ఆస్తిపాస్తులు వదులుకుని కుటుంబ సభ్యులతో రోడ్డు మీదికొస్తాడు. ఈ పరిస్థితితో పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుంది.

          ఒక ఫ్రెండ్ నడుపుతున్న ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో ఆ ఫ్రెండ్ ప్రోద్బలంతో చేరతాడు. అలా ఓ పెళ్లి పనుల నిర్వహణకి ఒక చోటికి వెళ్లేసరికి  ఆ పెళ్లి కూతురు పల్లవే అని తెలుస్తుంది. ఇది కూడా ఓర్చుకుంటాడు. అక్కడ ఇదే పెళ్ళికి వచ్చిన పల్లవి ఫ్రెండ్ షుగర్ వ్యాధి సమీరా ( సామంత) తో ప్రేమలో పడతాడు. ఈమె ఎవరో కాదు- తండ్రికి బద్ధ శత్రువైన సాంబశివరావు ( రాజేంద్రప్రసాద్) కూతురే. మొదట ఈ ప్రేమకి ససేమిరా అన్న ఇతను ఒక ఐడియా తట్టి షరతు పెడతాడు. దాని ప్రకారం  సత్యమూర్తి తనకో లిటిగేషన్ ల్యాండ్ అంట గట్టాడు. సగం ల్యాండ్ కబ్జా చేసిన దేవరాజ్ నాయుడు దగ్గర ఆ సగం ల్యాండ్ తాలూకు పత్రాలున్నాయి. అవి తీసుకొస్తే సమీరా నిచ్చి పెళ్లి చేస్తానంటాడు సాంబశివరావు. దేవరాజ్ నాయుడు ఫ్యాక్షనిస్టు. అతి క్రూరుడు. అయినా సరే ఇతడి దగ్గర్నుంచి ఆ కాగితాల్ని ఫలానా ఈ గడువులోగా తీసుకొస్తానని సవాలు విసిరి వెళ్ళిపోతాడు విరాజ్.

           ఇదీ విషయం. ఇక్కడ్నించీ ఇతను నేస్తం పరంధామయ్య ( అలీ) తో కలిసి ఆ దేవరాజ్ నాయుడింట్లో ఎలా పాగావేశాడు, అక్కడ ఒక దాడిలో దేవరాజ్ ని కాపాడి ఎలా ఆ పత్రాలకి మార్గం సుగమం చేసుకున్నాడు, దీనికి దేవరాజ్ తన చెల్లెలు వల్లి ( నిత్యా మీనన్) ని పెళ్లి చేసుకోవాలని పెట్టిన షరతుతో ఎలా ఇరుకున పడ్డాడు- ఇవన్నీ ఎలా తన విలువల ఆధారిత వ్యూహ ప్రతివ్యూహాలతో పరిష్కరించుకున్నాడూ, తండ్రి పరువు ప్రతిష్టల్ని ఎలా నిలబెట్టాడూ  అన్నది ఈ సెకండాఫ్ కథ.

‘ఈ’ ఫర్ ఎకనమికల్ అర్జున్!
          సినిమా ప్రారంభించింది మొదలు  పెను విషాదాన్ని మోస్తున్న హీరో పాత్ర అవడం చేత అల్లు అర్జున్ మార్కు విలక్షణ నటనకి ఆస్కారమే లేకుండా పోయింది. ఏమంటే బుద్ధిపూర్వకంగా పాత్ర స్థాయికి దిగి వచ్చి పోషించినట్టు స్టేట్ మెంట్లు. ఇలాటి నేలకి దిగిన పాత్రలు పోషించాలంటే ఇంత భారీ బడ్జెట్ సినిమా తీయనవసరం లేదు- భారీ సినిమా భారీ విన్యాసాల్నే  కోరుకుంటుంది. అమీర్ ఖాన్ ఒకప్పుడు నటించిన ‘రాఖ్’ ( బూడిద) లాంటి ఆఫ్ బీట్ సినిమా తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్ లో. వెంకటేష్ డౌన్ ప్లే చేసిన పాత్రతో ‘దృశ్యం’ కూడా ఇలాటి కోవకి చెందినదే బడ్జెట్ పరంగానూ. ఇది ప్రయోగాలు చేసినప్పటి సంగతి. కానప్పుడు బయ్యర్లందరూ ఎన్నో ఆశలు పెట్టుకుని రిస్క్ తీసుకునే ఇలాటి బిగ్ కమర్షియల్స్ లో ఇమేజి మేకోవర్లు అంటూ ప్రయోగాలు చెయ్యనే కూడదు.

          పాత్రని బట్టే నటన కాబట్టి, ఈ పాత్రకి కుటుంబ విషాదం, బరువు బాధ్యతలే గాకుండా, అదనంగా అస్తమానం ఆ చనిపోయిన తండ్రి నామస్మరణతో, ఆయనగారి విలువల జపమే అవడంతో, కుదేలైపోయింది పాత్ర. కాబట్టి దీనికి తగ్గట్టే పొదుపుగానే  తన మార్కు విన్యాసాల్ని వాడుకోవాల్సి వచ్చింది. కామెడీకి, అల్లరికి, చిలిపి తనాలకీ అన్నిటికీ ఎకానమీ పాటించాల్సి వచ్చింది. ప్రేక్షకులు తననుంచి ఏదైతే ఆశిస్తారో అది ఇవ్వలేని గాంభీర్యాన్ని పాత్రపరంగా పులుముకోవాల్సి వచ్చింది.

          అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు తండ్రులు చనిపోతూనే వుంటారు. అంతమాత్రాన తండ్రుల  అబ్సెషన్ తో బతికేయడమేనా? ఇంకో ధ్యాస ఉండదా? హీరో అన్నకి ఆ తండ్రితో వున్న అంత బలీయమైన బంధమేమిటో చూపలేదు గానీ, తండ్రి మరణంతో అతణ్ణి మతిస్థిమితం కోల్పోయిన వాడిలా చూపించు కొచ్చారు. హీరో కూడా ఇతడికేమీ తీసిపోనట్టు నిత్యం తండ్రి నామస్మరణ తో,  విలువల జపంతో మానసికంగా అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ కి లోనైనట్టే ప్రవర్తిస్తున్నాడు. తండ్రి చనిపోయాక, ఆయన విలువలెంటో చెప్పేసి అక్కడితో ఆ ఫిలాసఫీని హీరో ఇన్నర్ వరల్డ్ కి పరిమితం చేసివుంటే, హీరో ఔటర్ వరల్డ్ లో స్వేచ్ఛాజీవి అయిపోయేవాడు. ఈ character arc చైతన్యవంతమైన కమర్షియల్ సినిమా కథనాని కెంతో అవసరం. పాత్ర చిత్రణ దెబ్బ తినే సమస్యే లేదు. తత్ఫలితంగా రకరకాల విన్యాసాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే వాడు.

          ఒక సూఫీ కథలో ఒకడు తనకి ఈ సంచీలో చిరిగిన బట్టలు తప్ప జీవితంలో ఏమీ మిగల్లేదని, ఆనందమే లేకుండా పోయిందనీ  ఏడుస్తూ వుంటే, ఇది గమనించిన ఇంకొకడు  ఆ సంచీ లాక్కుని పారిపోతాడు. వీడు ఇంకింత ఘోరంగా ఏడుస్తూ వెంటపడితే దూరంగా పొదల్లో ఆ సంచీ కన్పిస్తుంది. దాన్ని ప్రాణంలో ప్రాణంలా పొదివి పట్టుకుని- నా సంచీ నాకు దొరికింది, నా సంచి నాకు దొరికిందోచ్ - అని ఆనందభరితుడై అరుస్తాడు. ఇది గమనిస్తున్న సంచీ లాక్కున్న వాడు- వెధవకి ఇప్పుడు తెలిసివచ్చింది ఆనందమంటే ఏంటో!- అనుకుంటాడు. ఎంత చిన్న చర్యతో ఎంత పెద్ద జీవిత సత్యం? అల్లుఅర్జున్ పాత్ర కూడా తన ఇన్నర్ ఫిలాసఫీని ఔటర్ వరల్డ్ లో, ఇంత పంచ్ వున్న హాస్య ధోరణిలో వినోదాన్ని పండిస్తూ అక్కడక్కడా చెప్పి ఉండొచ్చు.

          లోన విషాదాన్ని దాచుకుని పైకి హుషారుగా తిరిగినప్పుడే అది డైమెన్షన్స్ తో కూడిన ఇంటరెస్టింగ్ క్యారక్టర్ అవుతుంది. లేకపోతే  సింగిల్ షెడ్ లో ఫ్లాట్ క్యారక్టర్ లా ఉండిపోతుంది. ఇక్కడేం జరిగి వుండాల్సిందంటే, చివరా ఖర్లో మాత్రమే క్లయిమాక్స్ లో- తనతో ఆటలాడుకున్న వాళ్ళకీ , తండ్రిని పరిహసించిన వాళ్ళకీ, క్లాసు పీకుతూ ఒకేసారి తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న తన ఫిలాసఫీని తేటతెల్లం జేసివుంటే సరిపోయేది. ఒక యాక్టివ్ పాత్రగా తను పాల్పడిన రకరకాల చర్యలకి చివర్లో మాత్రమే  వివరణ నిస్తూ, తన ఇన్నర్ ఫిలాసఫీని వెల్లడించి కథని sum-up చేసి వుంటే..

                   1. ప్రతిదానికీ రామాయణ మహాభారతాల ఉటంకింపులు తప్పేవి. ఈ దర్శకుడి అభిమాన దర్శకుడు, రచయితలైన బాపు- రమణలు కూడా ఎంత రామ భక్తులై       రామాయణాన్నే మార్చి మార్చి సినిమాలు తీసినా ఎక్కడా రామాయణం లోంచి కొటేషన్లే    చెప్పలేదు. అది ప్రేక్షకులు ఫీలయ్యేట్టు సన్నివేశ కల్పన చేశారు. ప్రేక్షకులు తెలివితక్కువ           వాళ్ళనుకుని రాముడే మన్నాడో, సీత ఏమన్నదో ఇంకా పాఠాలు చెప్పలేదు. అది       ప్రేక్షకులు ఫీలయ్యే సబ్ టెక్స్ట్ అనే సృజనాత్మక అంగం వున్న క్లాస్ క్రియేషన్, ఇది సబ్ టెక్స్ట్ మిగల్చని, ప్రేక్షకుల్ని విసిగించే నీతిసూత్రాలతో మెట్టు దిగిన ‘బి’ గ్రేడ్ మూవీ చేష్ట మాత్రమే.

                   2. అల్లు అర్జున్ పాత్ర తన కుటుంబ సభ్యులతో అలా విషాదభరిత వాతావరణంతో        కాకుండా సరదా సరదా సీన్లు లాక్కోచ్చేది. విషాదం తనలోనూ వుంది. అయితే వాళ్ల విషాదాన్ని మరిపించడానికి నవ్వులు పండిస్తే పాత్రేమీ దెబ్బ తినిపోదుగా? హృషికేశ్   ముఖర్జీ  ‘మిలి’ లో జయబాధురీ,  హృషికేశ్ ముఖర్జీదే ‘ఆనంద్’ లో రాజేష్ ఖన్నా, కె. రాఘవేంద్రరావు  ‘జ్యోతి’ లో జయసుధ, దాసరి నారాయణరావు ‘తిరుపతి’ లో రాజబాబు  పాత్రలు ఇలాటివేగా?

                   3. ఊతపదం ‘చాలా బాగోదు’ బాగున్నప్పటికీ, అలా పాత్ర పరివ్యాప్తం చేస్తున్న ప్రధాన రసం విషాదరసం పాలబడి పేలని బాంబు అయ్యేది కాదు. అగ్రహీరోల కమర్షియల్ సినిమాలు తప్పనిసరిగా అద్భుత రస ప్రధానంగా ఉంటాయన్నదే నిజమైతే, అదిక్కడ తారుమారైంది. ‘ముత్యాలముగ్గు’ విషాద కథే అయినప్పటికీ ఆ విషాదాన్ని అంతర్లీనంగా ఉంచుతూ, అద్భుత రసాన్ని ప్రధాన రసంగా చేసుకుని, వినోదాత్మక విలువలు పండించి  నందుకే కదా అంత పెద్ద విజయాన్ని సాధించింది? 

          ఇకపోతే, ఈ సినిమాకి ఒక పెద్ద డ్యామేజింగ్ అంశం ఇందాకట్నించీ వెయిటింగ్ లో వుంది- అల్లు అర్జున్ పాత్రకి కథలో దాగి వున్న ఒక అతి ముఖ్య రహస్యం తెలియక పోవడం గురించి! తెలియక, తెలుసుకోవాలనీ ప్రయిత్నించకా, క్లయిమాక్స్ లో మాత్రమే, అదీ వేరే పాత్రలు ఆ రహస్యం వెల్లడించినప్పుడు తెల్లమొహం వేయాల్సిన పరిస్థితి! తన తండ్రి అసలెలా మరణించాడో హీరో పాత్రకి తెలియక పోవడం కంటే విచారకరమైన కథనం ఉంటుందా?

          వివరాల్లోకి వెళ్లి తెలుసుకుంటే, ఈ సినిమా తీసే అవసరమే కనపడని భయానక సత్యం బయట పడుతుంది! తండ్రి సత్యమూర్తి రోడ్డు ప్రమాదంలో ఎలా ఎప్పుడు ఎక్కడ మరణించాడో హీరోకి తెలీదు. తెలుసుకోవాలనీ ప్రయత్నించడు. ( తెలుసుకోకుండా ఏ కొడుకూ బతకలేడు అవునా?). బార్సిలోనాలో హీరో బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ తండ్రి సత్య మూర్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు ( ఆ స్పాట్ ఆంధ్రా - తమిళనాడు సరిహద్దులో, అంటే విలన్ దేవరాజ్ నాయుడు ఇలాకాలో) .. ఆ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా ఒక లారీ వచ్చి గుద్దడం వల్ల జరిగింది( అసలుకి అది దేవరాజ్ నాయుణ్ణి చంపే అతడి ప్రత్యర్ధి కుట్ర) .. ముందుగా సత్యమూర్తి కారుకి ఇంకో కారు ఎదురొచ్చింది, ఆ ప్రమాదాన్ని నివారించి సత్యమూర్తి ఎదుటి కారు దగ్గరికి వెళ్లి విచారిస్తున్నప్పుడు లారీ వచ్చి గుద్దింది. ( ఎదుటి కారులోంచి దిగిన వాళ్ళు సాక్షాత్తూ దేవరాజ్ నాయుడు, అతడి కుమార్తె  వల్లి [నిత్యామీనన్] ) ..వీళ్ళని కాపాడే ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోయాడన్నమాట  సత్యమూర్తి- ఇదీ విషయం! ఇంత విషయం హీరోకి తెలీదు!

          తండ్రి అక్కడి కెందుకు వెళ్ళాడు, ప్రమాదం గురించి మీడియా ఏమని రాసింది, పోలీసులేమన్నారు, ఆ వేరే కారు, ఆ లారీ ఎవరివి...అన్న ప్రశ్నలు హీరోకి పట్టక పోతే, మృత దేహం తెచ్చుకోవడానికైనా హీరో ఆ ఇలాకా ఆస్పత్రికి వెళ్ళాలి కదా? వెళ్ళ లేదా? మరేం చేశాడు అన్ని విలువలున్న నాన్న కొడుకు? తండ్రి దుర్మరణం కారకుల్ని పట్టుకుని శిక్షించకుండా, ఆయన నీతులు చెప్పుకుని బతికితే ఆయన ఆత్మకి శాంతా?

          ఈ ప్రశ్నలు వేసుకుంటే అసలు కథే లేదు, కథే లేకపోయాక ఈ సినిమా తీయాల్సిన అగత్యం కూడా కనపడదు!

          తండ్రి మరణ ఘట్టాన్ని ఏకబిగిన ఒకేసారిగా పూర్తిగా చూపకపోవడం, విడతల వారీగా చూపిస్తూ, ముడులు విప్పడం గొప్ప కథనమే కదా అనుకుంటే పొరపాటే.  హీరో నుంచి విషయం దాచిపెట్టాక ఏదీ గొప్ప కథనం అవజాలదు. మొత్తం కథా ప్రపంచంలో ఎక్కడ ఏమేం జరుగుతున్నాయో, ఒకప్పుడు కాకపోయినా ఇంకోప్పుడయినా హీరో కి తెలుస్తూ వుండడమే మంచి కథనం. అందుకే అతణ్ణి కథానాయకుడన్నారు.

          ఇలా ఆలోచిస్తే సినిమాలు తీయలేమని, ప్రేక్షకులు ఇలాగే చూస్తున్నారనీ  అంటే చెప్పేదేమీ లేదు. మొత్తం కథనే  null and void చేసే లాజిక్ ని కూడా ప్రశ్నించడం నాన్సెన్స్ అనుకుంటే ఇంకేమీ చెప్పలేం. అన్ని వనరులూ మౌలిక సదుపాయాలూ వున్న వాళ్ళే యాభయ్యేసి కోట్లు ఖర్చు పెట్టి ఇలా సినిమాలు తీస్తే, క్వాలిటీ సినిమాలు ఇంకెవరు తీయాలన్న ప్రశ్న మరోసారి వస్తుంది. ఖచ్చితంగా బయ్యర్ల కోసం క్వాలిటీ సినిమాలు తీయాల్సిన బాధ్యత టాప్ ఫిగర్స్ దే!

‘ఎస్’ ఫర్ సీక్వెన్సులు లేని స్క్రీన్ ప్లే!
          ఏ సినిమా కథకైనా- అదెంత ‘సి’ గ్రేడ్ సినిమా అయినా సరే, దాని బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాల రచన ఎలా వున్నాకూడా - స్క్రీన్ ప్లేలో అప్రయత్నంగా ఎనిమిది సీక్వెన్సు లూ వచ్చి పడిపోతాయి!

          కానీ ప్రస్తుత సినిమా మొత్తానికి రెండే రెండు సీక్వెన్సు లున్నాయి! ఫస్టాఫ్ లో ఒకటి- సెకండాఫ్ లో ఒకటి మాత్రమే! సాధారణంగా స్క్రీన్ ప్లేలలో బిగినింగ్-మిడిల్- ఎండ్ అనే మూడు విభాగాలూ, వాటిలో ఎనిమిది సీక్వెన్సులూ వుంటాయి. కథనానికుపయోగ పడేవి ఈ ఎనిమిది సీక్వెన్సులే. ఇవి బిగినింగ్ లో రెండు, మిడిల్ లో నాల్గు, ఎండ్ లో రెండు చొప్పున 1 : 2 : 1 నిష్పత్తిలో వుంటాయి ( కింది పటం చూడండి)



          కాలపరీక్షకు తట్టుకు నిలబడింది ఈ ఎనిమిది సీక్వెన్సుల కథనమే. ఈ సీక్వెన్సుల పధ్ధతి రీళ్ల నుంచి వచ్చింది. పూర్వకాలంలో హాలీవుడ్ లో కొన్ని సాంకేతిక పరమైన సమస్యల కారణంగా సినిమా రచయితలు  కథనాన్ని  రీళ్ళుగా విడగొట్టి రాయాల్సి వచ్చేది. ఒక రీలు నిడివి పది నిమిషాలు. ఆ పది నిమిషాల్లో కథనంలో ఒక ఎపిసోడ్ ముగిసేట్టు చూసుకునే వాళ్ళు. సినిమా ఎన్ని రీళ్ళుంటే అన్ని ఎపిసోడ్లు. ఈ రీళ్లే, ఎపిసోడ్లే తర్వాత సీక్వెన్సులుగా మారాయి. రీళ్ల నిడివితో నిమిత్తం లేకుండా ఒక్కో సీక్వెన్స్ పది నుంచి పదిహేను నిమిషాలు చొప్పున ఎనిమిది సీక్వెన్సుల కథనాన్ని అమల్లోకి తెచ్చారు. ఇదీ కాలపరీక్షకు తట్టుకుంది. మన సినిమాల్ని విశ్లేషించి చూసినా ఇదే క్రమం కనపడుతుంది- ఎనిమిది సీక్వె న్సులతో కథ! ఒక్కో సీక్వెన్సు ఒక్కో మినీ మూవీ లా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్సులోనూ మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు తప్పని సరిగా వుంటాయి, అది సరయిన స్క్రీన్ ప్లే అయితే! మహేష్ మంజ్రేకర్ సంజయ్ దత్ తో తీసిన సినిమా ‘వాస్తవ్’ లో నైతే, సీక్వెన్సులే కాదు- ప్రతీ సీను కూడా ఓ మినీ మూవీయే! ప్రతీ సీనులో కూడా బిగినింగ్- మిడిల్- ఎండ్ ఉంటాయి.

          స్క్రీన్ ప్లేలో వుండే ఎనిమిది సీక్వెన్సుల్లో ప్రతీ సీక్వెన్స్ ముగింపూ తర్వాతి సీక్వెన్స్ ప్రారంభానికి నాందిగా వుంటుంది. ఇలా సీక్వెన్సులన్నీ కలిసి ఒక గొలుసు కట్టులా తయారవుతాయి. బిగినింగ్ లో రెండు సీక్వెన్సుల్లో పాత్రల పరిచయాలు, కథా నేపధ్యం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, సమస్య స్థాపనా జరిగిపోతే చప్పున అరగంట- ముప్పావు గంట లోపల కథ పాయింటు కొచ్చే అవకాశం వుంటుంది. అక్కడ్నుంచీ ఆ సమస్యతో పోరాటంగా  మిడిల్ ప్రారంభమై, అది నాల్గు సీక్వెన్సుల్ని కలుపుకుని సంఘర్షనాత్మకంగా ముందుకు దౌడు తీస్తే, వెళ్లి ఎండ్ విభాగపు చివరి రెండు సీక్వెన్సుల్లో పడి  క్లయిమాక్స్ కొస్తుంది కథ! ఇదీ మామూలుగా జరగాల్సిన తంతు!

          ప్రస్తుత సినిమాలో  ఇది పట్టించుకోలేదు. అంటే స్ట్రక్చర్ అవసరం లేదనుకున్నారు. దీంతో పూర్వ కథ చెబుతూ ఎత్తుగడ నుంచీ ఇంటర్వెల్ వరకూ ఒకే  సీక్వెన్సుగా- పల్లవి పాత్ర పెళ్లి తంతు పెట్టి నడిపించారు. హీరో ఆ తంతులోంచి బయట పడేటప్పటికి ఇంటర్వెల్ వచ్చేసింది. అలాగే సెకండాఫ్ ప్రారంభం కాగానే దేవరాజ్ నాయుడు ఇల్లు చేరే సీక్వెన్స్ ప్రారంభమై, ఆ ఇంట్లో చేరాకా అక్కడే సెకండాఫ్ ముగించేంత సుదీర్ఘమైన సీక్వెన్స్! ‘షోలే’ లోకూడా తోడుదొంగలు అమితాబ్-ధర్మేంద్రలు సంజీవ్ కుమార్ పనిమీద అతడి వూళ్ళో అతడి ఇంటికే వెళతారు. కానీ ఇంట్లోనే కథ లాగించేయ్యకుండా బయట రకరకాల సీక్వెన్సులు నడిపిస్తూ బిజీగా వుంటారు.

          సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే చెక్ లిస్టులో స్క్రిప్టు దోషాల్లో ఒకటి- కథ సాంతం బయటి కెళ్ళకుండా, ఇంటీరియర్-టు- ఇంటీరియర్-టు- ఇంటీరియర్ గానే  సాగడం! ప్రస్తుత సినిమా ఫస్టాపంతా పెళ్లి తంతుతో ఇంటీరియర్-టు- ఇంటీరియర్-టు- ఇంటీరియర్ గానే సాగుతుంది. మళ్ళీ సెకండాఫ్ లో దేవరాజ్ నాయుడు ఇంట్లోనూ ఇంటీరియర్-టు- ఇంటీరియర్-టు- ఇంటీరియర్ గానే మరో పెళ్లి తంతుని కలుపుకుని సాగుతుంది! కంటికీ మెదడుకీ రిలీఫ్ లేని ఒకటే మొనాటనీ! డ్రీం సాంగ్స్ అప్పుడు మాత్రం ఫారిన్ లోకేషన్స్ లో కాస్సేపు అవుట్ డోర్లోకి! ఫస్టాఫ్ లో ఆ పెళ్లి తంతు లోంచి, సెకండాఫ్ లో ఈ దేవరాజ్ ఇంట్లోంచి ఎప్పుడు బయటపడతామా అన్నంత  బోరు కొట్టేయ్యడానికే పనికొచ్చాయీ సీక్వెన్సులు! రెండే సీక్వెన్సుల వల్ల  కథ ఎక్కడేసిన గొంగళి లా ఉండిపోవడం ఒకటీ. చరిత్రలో రెండు సీక్వెన్సులు పెట్టి సినిమా ఎవ్వరూ తీయలేదు- వాళ్లకి తెలుసు తీస్తే ఏ  మౌతుందో!

          ఇక ఇంటర్వెల్ పాయింటు బలం గా లేకుండా, పాత సినిమాల్లోలా  పస లేని పాత ఛాలెంజితో ముగియడానికీ, క్లయిమాక్స్ కూడా తేలిపోవడానికీ,  హీరోకి తన నాన్న ఎలా మరణించాడో సమాచారం లేకపోవడమే ప్రధాన కారణం.  ఇదలా ఉంచితే, అన్ని నైతిక విలువల గురించి చెప్పే వాడు ఇంటర్వెల్లో అంత అనైతికంగా ఆ ఛాలెంజి ఎలా చేస్తాడు! ఇది ఇంటర్వెల్ ఘట్టాన్ని బలహీన పర్చలేదా?

          ఇండియన్ స్క్రీన్ ప్లే మీద పుస్తకం రాసిన జిల్ నోమ్స్ ప్రసిద్ధ హిందీ రచయిత సాగర్ సర్హదీ ని అడిగాడు- మీరు స్క్రీన్ ప్లేలని త్రీ యాక్ట్స్ లో రాస్తారా అని. లేదన్నాడు సర్హదీ. ఇంటర్వెల్, క్లయిమాక్సు ఈ రెండూ బలంగా వచ్చేట్టు పాత్రని  డ్రైవ్ చేస్తానన్నాడు!

          ప్రస్తుత సినిమాలో దర్శకుడు కథని హీరో డ్రైవ్ చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే హీరో డ్రైవ్ చేస్తే అతను తండ్రి మరణ రహస్యాన్ని ఎక్కడ ఏకి పీకుతాడో నని! పైగా తన నీతితో ఇంటర్వెల్ సీన్ని ఎక్కడ తారుమారు చేస్తాడో నని! అందుకని దర్శకుడు రూల్స్ కి విరుద్ధంగా, కథే హీరోని నడిపించుకు పోయేలా చిత్రణ చేశాడు. అంటే దర్శకుడు తన కథా సౌలభ్యం కోసం కథని హీరో పాత్ర నడపనియ్యకుండా, కథే హీరో పాత్రని నడిపించేలా రివర్స్ లో రావడంతో, ఆ పాత్ర కాస్తా పాసివ్ సుడిగుండం లో పడి మరీ ఆర్ట్ సినిమా పాత్రలా నిస్తేజంగా  తయారయ్యింది!

          ఇక పోతే కురుక్షేత్రం లో అర్జునుడున్నట్టు ఫ్యాక్షన్ పోరులో ఇరుక్కున్న హీరో స్వగతం ( వాయిసోవర్) తో ప్రారంభమయ్యే సినిమా,  దాదాపు ఇరవై నిమిషాలూ ఎడతెగని ఆ స్వగతమూ, దాని తాలూకు మాంటేజెస్ తో ఉపోద్ఘాతంగా సాగడం కూడా చరిత్రలో ఎరుగని దుర్విన్యాసమే. సినిమా క్రాఫ్ట్ న్యూస్ రీల్ క్రాఫ్ట్ లా ఉంటుందా?         

          ఈ ఉపోద్ఘాతపు మాంటేజెస్ లో కూడా ఒకే సీను ను తర్వాత తండ్రి పాత్ర ప్రకాష్ రాజ్ ని చంపేసి, ఆ పాత్ర ఉన్నత విలువలగురించి డైలాగుల్లో చెప్పుకు రావడం, ప్రేక్షకులకి ప్రత్యక్షానుభవాన్నివ్వని అసమగ్ర చిత్రణ కింద తేలిపోయింది. మనిషిని సరిగ్గా చూపించకుండా అతడి గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా అది స్వోత్కర్షగానే మిగిలిపోతుంది తప్ప ఫీల్ వుండదు.

          ఒక అసంబద్ధ కామెడీని నడపాలంటే ఆ కామెడీ పుట్టడానికి కారణమైన పాయింటు అర్ధవంతంగా వుండాలని అరిస్టాటిల్ చెప్తాడు. అంటే పాయింటు అర్ధవంతంగా వున్నప్పుడు దాన్నాధారం చేసుకుని ఎంత అసంబద్ధ (అబ్సర్డ్) హాస్యా న్నైనా సృష్టించ వచ్చన్నమాట. పాయింటే అర్ధవంతంగా లేనప్పుడు ఏ హాస్యాన్నీ సృష్టించ లేమన్నమాట. అలాగే సినిమా కథకి అయిడియా- లేదా కాన్సెప్ట్ అన్ని విధాలా ఫూల్ ప్రూఫ్ గా, బులెట్ ప్రూఫ్ గా ఉంటేనే తర్వాత కథనంలో కొన్ని లోపాలైనా క్షమార్హ మౌతాయి. తండ్రి చనిపోతే బజార్న పడ్డ కుటుంబం ఈ కాన్సెప్టు అంత పకడ్బందీగా ఉందా?

          ఏ అప్పులోళ్ళూ ఆస్తులు లాక్కోరు. కంపెనీల్ని మూత పెట్టరు. ఆ అధిపతి కుటుంబాన్నే కాదు, కంపెనీల్లో వందలాది ఉద్యోగుల్నీ వీధిన పడెయ్య లేరు. చట్టాలు అలాలేవు. ఆ కొడుకు తండ్రి పాటించిన విలువల్నేకాదు, తండ్రి చేసిన వ్యాపారాన్నీ నిలబెట్టడం కూడా తన బాధ్యతగా గుర్తించాల్సి వుంటుంది. ఈ తన హక్కుని ఎవ్వరూ కాదనలేరు. వ్యాపారాలని తన అదుపులోకి తెచ్చుకుని నెమ్మదిగా అప్పులు తీర్చవచ్చు. ఏవో విలువలంటూ గొప్పకి పోయి తన మీద ఆధారపడ్డ అమాయక కుటుంబ సభ్యుల్ని తనతో బాటు వీధి పాల్జేసే హక్కుమాత్రం ఎప్పటికీ లేదు గాక లేదు, అది నైతిక విలువ కాదు!

          అలాటి విలువల సంరక్షకుడైతే, నకిలీ పత్రాలు తీసుకుని దేవరాజ్ ఇంట్లోంచి అసలీ పత్రాలు కొట్టుకు వచ్చే నీతి మాలిన పని చేయడానికే బయల్దేరి వెళ్ళడు సెకండాఫ్ లో. ఆ వివాదమేంటో చట్ట ప్రకారమే తేల్చుకుంటాడు.

          ఈ సినిమాలో ఇప్పుడెవరికీ పట్టని ఆ విలువల ఘోషేమిటో గానీ, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మాత్రం వాస్తవ దృష్టితో ఒక్కటే చెప్తాడు- -  నీ సంస్కృతీ, నీ సాంప్రదాయం, కట్టుబాట్లు, సెంటిమెంట్లు, నీతీనిజాయితీలూ, తొక్కా తోలూ అన్నీ తీసి నీ ఇంట్లో పెట్టుకో! బయటి కెళ్తే మాత్రం సమాజం ఇలా వుంటుంది ఎలా? యాంబిషన్, సెల్ఫిష్ నెస్, జెలసీ, పవర్ నాల్గు! నాల్గు చక్రాలు సమాజాన్ని నడిపిస్తూంటాయ్! వీటిని ఎదుర్కోవడానికి నీ ఆట నువ్వాడుకో..

సికిందర్
          

Tuesday, March 24, 2015

ఆనాటి సినిమా!

హాస్యభూషణం హాజర్ హై!!

విలన్ :  హీరోని ఏడ్పించేవాడు
కామిక్ విలన్ : ప్రేక్షకుల్ని నవ్వించేవాడు
హీరోయిక్ విలన్ : సాంతం పబ్లిక్ ని ప్రేమించేవాడు
ఒకసారి పబ్లిక్ తో ప్రేమలో పడ్డాక, ఇక వాంటెడ్ డెడ్ ఆర్ ఆలైవ్ పోస్టర్ని పరపరా చింపేసుకుని, పబ్లిక్ కి సరెండరై పోయినట్టే విలన్ అనేవాడు!!


    త్రికా రచనకి నిజాలు ముఖ్యం. సినిమాకి నిజాలుగా భ్రమింపజేయడం అతి ముఖ్యం. భ్రమింపజేయడమే నటుల మెయిన్ బిజినెస్. భ్రమా బేరం లేక భుక్తి లేదు.
కడారు నాగభూషణం (1921 – 1995) అనే  భ్రమల బేహారి వాస్తవికతని రక్తికట్టించే విలనిజం నుంచీ సహజ కథానాయకుడిగా కూడా సమాజానికి దొరికిపోయేముందు, నాటక సమాజానికి గొప్ప సెటైరిస్టుగా, అధిక్షేపణ  లాక్షిణికుడుగా చిక్కాడు. చిక్కాక సినిమా నిర్మాతలకి చిక్కడు-దొరకడు  అయిపోయాడు – ‘నెలలో మొదటి వారం నో షూటింగ్స్ ప్లీజ్...నేనెక్కడికో వెళ్ళిపోయి నా ‘రక్తకన్నీరు’ నాటకం వేసుకుంటా...పది లక్షలి సిస్తామన్నా కెమెరా ముందుకు రానంటే రానంతే, దట్సాల్!’ 



               న్నెన్ని ‘రక్త కన్నీళ్లు’ అని! ఆలిండియా లెవెల్లో అక్షరాలా ఐదు వేల నాలుగు వందల ముప్ఫై రెండు ప్రదర్శనలు! మన హైదరాబాదీ ‘అద్రక్ కె పంజే’ ( అల్లం కొమ్ములు) ఫేమ్ బాబ్బన్ ఖాన్ పదివేల ప్రదర్శనలతో గిన్నీస్ బుక్ రికార్డు కెక్కిన తర్వాత, తనే ఆ స్థాయిలో కాకపోయినా తెలుగులో ప్రదర్శనల రికార్డు నెలకొల్పిన రంగ స్థల కళాకారుడు. పాతికేళ్ళ పాటూ వందలాది రంగస్థల కళాకారులకి ఉపాధీ, రెండు దశాబ్దాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి అధ్యక్ష బాధ్యతలూ, ఇంకా ఇండియన్ పీపుల్స్ థియేటర్ ఉపాధ్యక్ష పదవిలో కొన్నాళ్ళూ, రాష్ట్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడెమీ సలహాదారుగా సేవలూ, వామపక్ష భావజాలం కారణంగా ఎప్పటికప్పుడు మారిపోతున్న రాజకీయాలపై,  సామాజిక పరిణామాలపై, కొత్త కొత్తగా వ్యంగ్య బాణాల సంధింపూలూ! అసలు  ‘రక్తకన్నీరు’ నాటకమేంటో  మనం నిక్కర్లేసుకున్న ఆ రోజుల్లో బుద్ధికి పట్టు బడలేదు గానీ, ఓ సన్నివేశం జన్మకి గుర్తుండి పోతుంది- కుష్టు రోగంతో బాధపడుతున్న ప్రధాన పాత్రధారి నాగభూషణం చుట్టూ ముసిరే ఈగల ‘స్పెషల్ ఎఫెక్ట్స్’ మాయాజం అప్పుడే ఎంత థ్రిల్!

    ‘నాటకాల రాయుడు’ విషయాని కొస్తే,  ఐది నాగభూషణం కామెడీతనానికి పరాకాష్ఠ! రవి ఆర్ట్ థియేటర్స్ అని సినిమా నిర్మాణ సంస్థ స్థాపించి ‘ఒకే కుటుంబం’, ‘ప్రజానాయకుడు’ అనే రెండు సినిమాల్ని నిర్మించినా, దిడ్డి శ్రీనివాసరావు అనే మరో నిర్మాతకి చెందిన హరిహరా ఫిలిమ్స్ బ్యానర్లో ‘నాటకాల రాయుడు’తో సోలో హీరోగా వచ్చాడు. ఏ. సంజీవి దీని దర్శకుడు. నాటకాల మీద చచ్చే మోజు పెంచుకుని ఇంట్లోంచి ఉడాయించే ఓ ఔత్సాహిక నటోత్తముడి అనుభవాలే ఈ సినిమా ఇతివృత్తం.

  ‘నాటకాల రాయుడు’ విషయాని కొస్తే,  ఐది నాగభూషణం కామెడీతనానికి పరాకాష్ఠ! రవి ఆర్ట్ థియేటర్స్ అని సినిమా నిర్మాణ సంస్థ స్థాపించి ‘ఒకే కుటుంబం’, ‘ప్రజానాయకుడు’ అనే రెండు సినిమాల్ని నిర్మించినా, దిడ్డి శ్రీనివాసరావు అనే మరో నిర్మాతకి చెందిన హరిహరా ఫిలిమ్స్ బ్యానర్లో ‘నాటకాల రాయుడు’తో సోలో హీరోగా వచ్చాడు. ఏ. సంజీవి దీని దర్శకుడు. నాటకాల మీద చచ్చే మోజు పెంచుకుని ఇంట్లోంచి ఉడాయించే ఓ ఔత్సాహిక నటోత్తముడి అనుభవాలే ఈ సినిమా ఇతివృత్తం.



          బుచ్చి బాబు ( నాగభూషణం) కి నాగయ్య- హేమలత లాంటి తల్లి దండ్రులు, అనిత లాంటి చెల్లెలు, సత్యనారాయణ, సీత లాంటి అన్న వదినెలతో అన్యోన్య కుటుంబం. ఎక్కడో చిన్నపాటి గుమాస్తా ఉద్యోగం చేస్తాడు కానీ నాటకాలే ఊపిరి. మహానటుడు అయిపోవాలన్నదే ఏకైక లక్ష్యం. దీంతో తండ్రితో  చివాట్లు. నాటకాలంటూ ఎక్కడెక్కడో తిరిగి అర్ధరాత్రిళ్లు గోడ దూకి వచ్చి, చెల్లెలు అన్నం పెడితే తినేసి, ఆమె పాడితే హాయిగా కళ్ళు మూసుకుని గుర్రు పెట్టడం హాబీ. 

        చెల్లెలి పెళ్ళికి కట్నం తెస్తానంటాడు పెద్ద హీరోలా. తీరా ఆఫీసులో తన నాటకాల దురద ఆపుకోలేక, ‘మయసభ’ సీను విరగదీసి నటించి పారేసి, ఆ న్యూసెన్సు కి ఉన్న ఆ పాటి ఉద్యోగమూ ఊడబీకించుకుని -ఉత్త చేతుల్తో జీరోలా ఇంటికి రావడం! 

          తండ్రితో వాగ్యుద్ధం జరిగి, నాటకాలే తనకు నాగరికమని నగరం బాట పట్టేస్తాడు. అక్కడ ఓ నాటకాల కంపెనీ పద్మనాభం సైధవుడిలా అడ్డు తగిలేసరికీ, అసలిక్కడ ఎంట్రీ సంపాదించాలంటే ఇంకెక్కడో ప్రముఖ రంగస్థల నటీమణి గీతాదేవి ( కాంచన) ని మచ్చిక చేసుకోవాలని, వెళ్ళేసి ఆమె ఇంట్లో పని వాడుగా చేరిపోతాడు. తనని బాగా ఎంటర్ టెయిన్ చేస్తున్న ఈ గమ్మత్తయిన శాల్తీలో  ఏకంగా ఆమె ఒక అజ్ఞాత కళాకారుణ్ణే చూసి, బాగా ఎంకరేజి చేస్తుంది. అయితే అప్పటికే ఆ కంపెనీలో పాపులర్ స్టేజి నటుడు ప్రేమ్ కుమార్ ( ప్రభాకర రెడ్డి) అనే అతను హీరోగా  ప్రొసీడ్ అవుతున్నాడు. గీతాదేవికి లైనేస్తూ కూడా ప్రోసీడవుతున్నాడు. ఇప్పుడు వీడెవడో బుచ్చి బాబు గాడు తనకి పొటెన్షియల్ డేంజర్ గా అన్పించేసరికి ఏకడం మొదలెడతాడు.

          దీంతో చాలా తిప్ప లొచ్చేస్తాయి బుచ్చిబాబుకి. ప్రేమ్ కుమార్ చేతిలో సఫా అయ్యే దుస్థితి కూడా దాపురిస్తుంది. ఇంకో వైపు గీతాదేవి తనకి క్లోజ్ గా మూవ్ అవడమేమిటో , ఆ కవ్వింపు లేమిటో ఎటూ అర్ధం కాని స్థితి. ఒకమ్మాయి వుందంటే, ఆమెతో ప్రేమ కలాపాలకి ట్రయల్ వేసుకోవచ్చని కూడా తెలీని అమాయక ప్రాణి అతను. ఇలా ఈ ప్రమాద ప్రమోదాల సయ్యాటలో చిక్కుకుని గిలగిల్లాడు తూంటాడు. పెట్టుకున్నలక్ష్యం కాస్తా గల్లంతై పోతుంది.

                   ఆద్యంతం నాగభూషణం చాలా యాక్టివ్ గా, చలాకీగా రక్తి కట్టించే ఈ నవ్వుల ప్రపంచంలో తీరని విషాదం కూడా వుంది. నాగభూషణం – అతడి కుటుంబపు పరిస్థితుల అనులోమ- విలోమ సంబంధం, రేఖా గణితం ఈ సినిమా కథా కథనాలకి బలమైన వెన్నెముక గా నిలుస్తాయి. ఎలాగంటే అతనెక్కడో మహా నగరంలో పైపైకి ఎదుగుతూ వుంటే, అటు వూళ్ళో కుటుంబం నానాటికీ దిగజారి పోతూ వుంటుంది. తను చాలా చాలా గొప్ప వాడైపోయేసరికి, ఆ కుటుంబంలో ఓ మరణం సంభవించి, ఇంకో జననం తో ముక్కలై, భిక్షాటన చేసే దౌర్భాగ్యం. ఇప్పటి సినిమాల్లో కొరవడిన కరకు వాస్తవ జీవిత మంతా ఇందులో జడలు విప్పుకుంటుంది...

      తల్లి ఆశీర్వాద బలంతోనే  తానిలా గొప్ప వాణ్ణయి పోయాననుకుని మురిసిపోతాడు. ఆ తల్లి ఎప్పుడో గతించిన విషయం కూడా తెలీదు! ఆ కుటుంబంలో పెళ్ళి శుభకార్యానికి  డబ్బెప్పుడూ నిలవదు. మొదటిసారి డబ్బు దొంగల పాలవగానే, అంతవరకూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చిన ఆ కుటుంబం ఒక్కసారి భగ్గుమనేస్తుంది. కలలో కూడా ఊహించని కటువైన మాటలు పేలతాయి వాళ్ళ మధ్య. ఆ పరస్పర దూషణలు, దెప్పి పొడుపులు తనకి కూడా తగిలి కుమిలికుమిలి పోతుందా పెళ్లి కున్నఅమ్మాయి. దర్శకుడు సంజీవి ఈ దృశ్యాన్ని నాగయ్య, హేమలత, సత్యనారాయణ, అనిత లతో అత్యంత బలంగా సృష్టించాడు. సినిమాకి ఇదే హైలైట్.

          ఈ సినిమాలో వినోద విషాద ఘట్టాలన్నిటిలో గొల్లపూడి మారుతీ రావు కలం బలం కట్టి పడేస్తుంది మరి నోరెత్త నీయకుండా.  నాటకాల అనుభవముంటే ఆ సినిమా రచనే వేరు. ఇక సినిమా ప్రారంభమే ప్రభాకర రెడ్డి, కాంచనల మీద అతి సుదీర్ఘంగా  ఐదు నిమిషాలా నలభై సెకన్ల పాటూ సాగే పద్య గానముంటుంది. పద్యాలు వడ్డాది రాస్తే, పాటలు ఆత్రేయ రాశారు. జికే వెంకటేష్ సంగీతంలో ‘నీలాల కన్నుల్లో మెల్ల మెల్లగా’ అనే సిస్టర్ సాంగ్, ‘వేళ చూడ వెన్నెలాయె’ అనే కాంచన మీద సూపర్ హిట్ బ్యూటీఫుల్ సాంగ్ రెండూ అలరిస్తాయి. కమల్ ఘోష్ తెలుపు- నలుపు కెమెరా పనితనం ఈ సినిమాలో ఓ కవితా గానమే.

        నాటక దృశ్యాల్లో నాటకం చూసే ప్రేక్షకులు ఊహించలేని లొకేషన్ మార్పులు, సీక్వెన్సులూ పంటి కింద రాళ్ళలా తగుల్తాయి. స్టేజి  మీద నాటక ప్రదర్శనలో ఇవి అసాధ్యం. సినిమాయే  కదా- దీనికి వుండే సినిమాటిక్ లిబర్టీ అనే లైసెన్సుతో నాటక కళదుంప తెంచి నట్టుంది. నాటక రంగ నిపుణుడైన నాగభూషణం వీటిని అనుమతించడం ఆశ్చర్యమే. ఏమైనా భావి తరాలకి నాగభూషణం అందించిన ఓ మంచి వినోద కాలక్షేప మనొచ్చు ఈ సినిమాని!


***

డైలాగ్ డిష్ 

నాగభూషణం
*  దేశంలో పూలన్నీ మహా నాయకులకూ మహా నటులకూ దండల కిందే  సరిపోతున్నాయి, ఇక ముత్తయిదువులకెందుకుంటాయ్.
*  ఒరే కంచుకీ, పరమ దుర్మార్గుడును , సకల ఉద్యోగి దండునకు శత్రువూ అయిన ఆ మేనేజారథముడెక్కడ?
*  ఈ రోజుల్లో నటీమణుల రికమెండేషను లేకపోతే నాటక కంపెనీల్లో మేనేజర్లు వేషాలివ్వరు, అందుకని అంతఃపురం లోంచి నరుక్కు పోదామని ఇటోచ్చా.
*  మహా నటుడు అంతః పురంలో ఉండగలడు, అవసరమైతే అంట్లూ తోమగలడు.
*  మీ అమ్మగారి తద్దినమంటే నటించా సార్, లేకపోతే నటించే వాణ్ణి కాను సార్!
కాంచన
*  జీవితంలో తిండీ నిద్రా తప్ప ఇంకేమీ లేవా బుచ్చిబాబూ!
*  నాటకంలో ప్రేమని నటించే ఆడది కూడా ప్రేమని మనసులో పవిత్రంగా దాచుకుంటుంది.
*  ఇవ్వాళ్ళ కార్లలో తిరిగే చాలా మంది నటుల్ని చాలా మంది ఈర్ష్యగా చూస్తారు గానీ, అప్పటివాళ్ళ దీక్షా తపస్సుల వెనుక ఎన్ని బాధ లున్నాయో, ఎన్ని గాథలున్నాయో అర్ధం చేసుకుంటే ఆ చూపుని వాళ్ళు మళ్ళించు కుంటారు.

కొన్ని ఫన్నీ సీన్స్

          * నాగభూషణం ఆఫీసు మేనేజరిచ్చిన పెద్ద కవరు పోస్ట్ చేయడాని కెళ్తే అది పోస్ట్ బాక్సులో పట్టదు. దాంతో ఆ కవర్ని రెండు ముక్కలు చేసి, పోస్ట్ బాక్సులో కుక్కుతాడు- మొదటి భాగం, రెండో భాగం అంటూ!
          *నాగభూషణం టాలెంట్ కి టెస్టు పెడుతుంది నాటక కంపెనీ. నాగభూషణం రాకెన్ రోల్ డాన్స్ తో విరగ్గొట్టేస్తాడు. తోటి కళాకారులతన్ని బంతాట ఆడేసుకుంటారు. కింద పడిపోతాడు నాగభూషణం. ప్రభాకర రెడ్డి, పద్మనాభం ఇద్దరూ సంతోషిస్తారు, కాంచన చిన్న బుచ్చుకుంటుంది.
          * నాగభూషణం అలా నడుచుకుంటూ వస్తూంటే, ఓ వ్యక్తి ఎదురవుతాడు. నాగభూషణం ఆగిపోయి ‘ఆఁ-!’  అంటాడు. ఆ వ్యక్తి కూడా నోరు తెర్చు కుని ఆఁ-!’ అంటాడు. వెంటనే నాగభూషణం అతడి నాలుక మీద పోస్టల్ స్టాంపు పెట్టి తీస్తాడు. ఆ తడితో కవరు మీద అతికించుకుని వెళ్ళిపోతాడు.  
          * టైటిల్స్ లో కర్రసాము, కత్తి యుద్ధాలు ‘రాఘవులు అండ్ పార్టీ’ అని వేయడం నవ్వు తెప్పిస్తుంది!



—సికిందర్ 

(జనవరి 2010 –‘సాక్షి’)