రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, March 14, 2014


రివ్యూ :హాలీవుడ్
డిఫరెంట్ జాకీ !

తారాగణం: జాకీచాన్,లూయేజింగ్ టియాన్, వీనా, రంగువాంగ్ యూ తదితరులు 

సంగీతం :  లావ్ జెయ్   ఛాయాగ్రహణం : యూ డింగ్    ఎడిటింగ్ ; ఇస్మాయేల్  గోమెజ్,   కళ :  ఫెంగ్ లిగాంగ్   యాక్షన్ : జాకీ చాన్, జున్ హీ తదితరులు 
రచన, దర్శకత్వం:డింగ్ షెంగ్.
*
***
యాక్షన్ చిత్రాల హీరోలుగా ముద్రపడి మాస్ హీరోలుగా చెలామణి అయ్యేవారు వయసుమీరిన తర్వాత అలాంటి పాత్రలు వేయలేక, కొత్త తరంతో పోటీపడలేక నిష్క్రమిస్తుంటారు. తెలివైనవారు క్రమంగా అన్ని రకాల పాత్రలలోకి ఒదిగిపోతూ మరికొంతకాలం వెండితెర మీద కనిపిస్తారు. నటనకు అవకాశమున్న పాత్రల్లో నటించి తాము నటులుగా ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని చేజేతులా కాలదన్నుకుని తర్వాత చింతించేవాళ్ళున్నారు. దానికోసం హీరోనుండి సైడ్ హీరో, విలన్‌గా వెళ్ళి గుర్తింపు పొందినవారు కూడా వున్నారు. వయసును దృష్టిలో వుంచుకుని మారుతున్న శరీర తత్త్వానికి అనువుగా తన ధోరణిని మార్చుకుని కళాత్మకమైన, వైవిధ్యమైన చిత్రాలలో నటించడానికి మొగ్గు చూపుతున్న హీరోలలో జాకీచాన్ ఒకరు. గతంలో ‘‘షింజుకి ఇన్సిడెంట్’’ లాంటి కళాత్మక చిత్రంలో నటించి అభిమానులను ఆశ్చర్యపరిచిన జాకీచాన్ నటించిన మరో వైవిధ్యభరిత చిత్రమే ‘‘పోలీస్ స్టోరీ 2013’’.

పోలీస్ స్టోరీ సీరిస్‌తో జాకీచాన్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలను, పెద్దలను ఆకర్షించగలిగాడు. ఒక సినిమాను మించి ఇంకో సినిమాలో ప్రవేశపెట్టిన వినూత్నమైన ఫైట్లు, ఛేజింగులు, యాక్షన్ సన్నివేశాలతో మంచి కాలక్షేప చిత్రాలుగా వీటిని తీర్చిదిద్దారు. అందుకే పోలీస్ స్టోరీ సినిమాలంటే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు వచ్చిన ‘‘పోలీస్ స్టోరీ 2013’’ మాత్రం పిల్లలను బోలెడు నిరాశకు గురిచేస్తుంది. ఇందులో జాకీచాన్ మార్క్ ఫైటింగులు, హాస్యం లేదు. పోలీస్ స్టోరీ సీరిస్‌లో జాకీచాన్ హాంగ్‌కాంగ్ పోలీసాఫీసర్‌గా నటించగా, ఇందులో చైనీస్ డిటెక్టివ్‌గా కనిపిస్తారు.

అర్థరాత్రి రద్దీగావున్న వీధిలో వెలుగులీనుతున్న వూ బార్‌ను చూపిస్తూ ‘‘పోలీస్ స్టోరీ 2013’’ మొదలవుతుంది. డిటెక్టివ్ జోంగ్‌వాన్ తన మీద కోపంతో తనను వదిలివెళ్ళిన కూతురు మియోను వెతుకుతూ వూ బార్‌కు వస్తాడు. వూ బార్ అండ్ నైట్ క్లబ్‌కు యజమానియైన వూ జియాంగ్ గర్ల్‌ఫ్రెండ్‌గా మియో కనిపిస్తుంది. తండ్రి వెంట రావడానికి నిరాకరించిన కూతురికి జరిగినది చెబుతాడు. విధి నిర్వహణలో వున్నప్పుడు భార్య ఆస్పత్రిలో వుందని తెలియగా, దుండగులను పట్టుకున్న తర్వాతే ఆస్పత్రికి రాగా భార్య మరణించిందని తెలుస్తుంది. ఆమె మరణానికి తండ్రి నిర్లక్ష్యమే కారణమని భావించిన కూతురు మియో తండ్రికి దూరంగా వెళ్ళిపోతుంది. నైట్ క్లబ్‌లో ప్రవేశించిన జోంగ్‌వాన్ చర్యలను గమనించిన సిబ్బంది అతడ్ని బంధిస్తారు.


కుర్చీలో ఇనుపవైర్లతో కట్టివేయడానికి జోంగ్‌వాన్‌కు వూ జియాంగ్ తనను ఎందుకు బంధించాడో అర్థంకాదు. తనతోపాటు తన కూతురు, బార్‌కి వచ్చిన కస్టమర్లంతా బంధింపబడి వున్నారని గ్రహిస్తాడు. వూజియాంగ్ పోలీస్ కమీషనర్‌కు ఫోన్‌చేసి బందీలకు బదులుగా అధిక మొత్తంలో డబ్బును, చిరకాల ఖైదీగా వున్న వీ జియాఫూను అప్పగించమని డిమాండ్ చేస్తాడు. డిటెక్టివ్ జోంగ్‌వాన్ కట్లు విప్పుకుని తప్పించుకుంటాడు. నైట్‌క్లబ్‌లో వెతుకుతూ వూ జియాంగ్ రహస్య గదిని కనుక్కుంటాడు. అక్కడ యవ్వనంలో వున్న వూ ఒక టీనేజ్ గర్ల్‌తో వున్న ఫొటో కనిపిస్తుంది. అక్కడ దొరికిన ఆధారాలనుబట్టి అతనో కిక్‌బాక్సర్ అని గుర్తిస్తాడు. కిడ్నాప్ ప్లాన్ విఫలమయితే క్లబ్ పేలిపోయేలా బాంబులు అమర్చాడని గ్రహిస్తారు. జోంగ్‌వాన్ తప్పించుకున్నాడని గుర్తించిన వూ, మియోను కాల్చేస్తానని బెదిరించి జోంగ్‌వాన్‌ను బయటకు రప్పించి మళ్ళీ బంధిస్తాడు. వూ అనుచరుడితో ద్వంద్వ యుద్ధంచేసి జోంగ్‌వాన్ గెలిస్తే ముగ్గురు బందీలను విడిచిపెడతాననీ, ఒకవేళ ఓడిపోతే ఖైదీగా వున్న వీ జియాఫూను తీసుకొచ్చి అప్పగించాలని షరతు పెడతాడు. తన సర్వశక్తులను ఒడ్డి గాయాలతో ఆ పోరాటాన్ని జోంగ్‌వాన్ గెలుస్తాడు.

ఇచ్చిన మాట ప్రకారం జోంగ్‌వాన్ జైలుకు వచ్చి చిరకాల ఖైదీయైన వీ జియోఫూకు నచ్చజెప్పి నైట్ క్లబ్‌కు తీసుకువస్తాడు. అప్పుడు వూ జియాంగ్ కిడ్నాప్ వెనుకవున్న అసలు రహస్యాన్ని బయటపెడతాడు. తన సోదరి మరణానికి కారకులైన జోంగ్, వీ, ఇతర ముగ్గురు బందీల మీద ప్రతీకారం తీర్చుకోవడానికని చెబుతాడు. అసలు కథ ఏమిటంటే- పేదవాడైన వీ తన తల్లి మందులను కొనడానికి డబ్బులేక దొంగిలించడానికి మందుల దుకాణంలోకి వస్తాడు. ఆ సమయంలో వూ సోదరి అబార్షన్ మందులకోసం వస్తుంది. తన బాయ్‌ఫ్రెండ్ తిరస్కరించడంతో అబార్షన్‌కోసం ప్రయత్నిస్తున్నాననీ, డబ్బు లు తక్కువైనా సర్దుకొమ్మని అభ్యర్థిస్తుంది. దుకాణంలో వున్న వాళ్ళంతా ఆమెను అవహేళన చేస్తారు. వీ మందులు దొంగిలిస్తూ పట్టుబడతాడు. ఎవరికీ దొరకకుండా వుండాలని వూ సోదరిని కత్తి చూపించి ఆమెను అడ్డుపెట్టుకుంటాడు. అక్కడి అరుపులు విని దారినపోతున్న డిటెక్టివ్ జోంగ్‌వాన్ అక్కడికి చేరుకుంటాడు. అప్పటికే జీవితం మీద విరక్తితో వున్న వూ సోదరి వీ చేతిలోని కత్తితో గొంతు కోసుకుంటుంది. జోంగ్ తెలివిగా వీ ని బంధించి, వూ సోదరిని ఆస్పత్రికి తరలించినా రక్తస్రావంతో ఆమె చచ్చిపోతుంది. తన సోదరి మీద అమిత ప్రేమానురాగాలు కలిగివున్న వూ, ఆమె హత్యకు కారకులైన వాళ్ళను చంపాలనే ప్రయత్నంలో వుంటాడు. అక్కడ స్థావరంలో వున్న వూ సోదరి బాయ్‌ఫ్రెండ్‌ను జోంగ్‌వాన్ గుర్తుపడతాడు. తమ ప్రేమను తెలుసుకుని వుంటే వూ తనను చంపేసి వుండేవాడనీ, అందుకేతనను మరిచిపొమ్మని వూ సోదరికి చెప్పానని చెబుతాడు. అంటే పరోక్షంగా ఆమె చావుకు తనే బాధ్యుడినని వూ గుర్తిస్తాడు. ఈ సంఘటనతో ముడిపడి వున్న ఒక్కొక్క వ్యక్తి తమ కోణంలోంచి ఆరోజు జరిగిన సంఘటనను వివరించడంతో, అసలు నిజం బయటపడటం ‘‘రోషమాన్’’ చిత్రం స్టయిల్‌ను గుర్తుకు తెస్తుంది.


పోలీసులు నైట్ క్లబ్‌ను చుట్టుముట్టారని వూ గ్రహిస్తాడు. నైట్ క్లబ్‌కు అమర్చిన బాంబులను తొలగించి, తమ అనుచరులు రహస్యంగా పారిపోయేందుకు అనుమతిస్తాడు. మియోను అడ్డుపెట్టుకుని వూ పారిపోతాడు. జోంగ్ వెంటాడుతుండగా ఆ ముగ్గురు రైల్వే సొరంగంలోకి జొరబడతారు. ఆమెను అడ్డుబెట్టుకుని వూ, తను పారేసిన పిస్తోల్‌తో కాల్చుకొమ్మని లేదా అతని కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తాడు. బాగా ఆలోచించి జోంగ్‌వాన్ తన కూతురి భవిష్యత్తుకోసం పిస్తోల్ కణతకు గురిపెట్టి కాల్చుకుంటాడు. కాని అది పేలదు. అది ఖాళీ పిస్తోల్ అనీ, అతడ్ని పరీక్షించడంకోసం వూ అలా చేశాడని గుర్తిస్తారు. అన్నమాట ప్రకారం మియోను వదిలేసిన వూ, తనను రక్షించే ప్రయత్నాలు చేస్తున్న జోంగ్‌వాన్ చర్యలను అడ్డుకుని, వస్తున్న రైలు కిందపడి చనిపోతాడు.

డైహార్డ్’’ ఇతివృత్తంతో పోలి వున్న ఈ సినిమా దానిలాగే ఒకే లొకేషన్‌లో నడుస్తుంది. డిటెక్టివ్ జోంగ్‌వాన్‌గా నటించిన జాకీచాన్ చేసిన ఫైట్లు, యాక్షన్ సీన్లన్నీ ఫ్లాష్‌బ్యాక్‌గా వస్తుంటాయి. ఇవి ప్రధాన ఇతివృత్తంతో సంబంధం లేకపోయినా, నాయకుడి హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడతాయి. విలన్ వూ జియాంగ్ కిక్ బాక్సర్‌గా చేసిన పోరాటాలు కూడా ఫ్లాష్‌బ్యాక్‌గానే వస్తాయి. పాత ఫ్యాక్టరీని నైట్‌క్లబ్‌గా మార్చడంవల్ల అది పెద్దదిగా తయారై ముఠా స్థావరంగా తయారయింది. సినిమా మొత్తం సీరియస్‌గా కనిపించే జాకీచాన్ మంచి తండ్రిగా, నిజాయితీ పోలీసాఫీసర్‌గా మంచి నటనను కనబరిచారు. 59 ఏళ్ళ వయసులో కూడా ఫైట్లను చాకచక్యంగా చేయడం విశేషం. 

గతంలో జాకీచాన్‌తో ‘‘లిటిల్ బిగ్ సోల్జర్’’ తీసిన దర్శకుడు డింగ్ షెంగ్ ఈ చిత్రానికి కూడా దర్శకుడిగా వ్యవహరించారు. కళాత్మకంగా తీసిన ఈ చిత్రం మొదట బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ, తర్వాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ పాల్గొని విమర్శకుల ప్రశంసలను అందుకుంది. చైనాలో 86 మిలియన్ డాలర్లను వసూలుచేసిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా మాత్రం నిరాశపరిచింది!



- కె.పి. అశోక్ కుమార్


















Sunday, March 9, 2014

రివ్యూ ..

ప్రయోగంతో పాట్లు!

**నవదీప్, కలర్స్ స్వాతి, సంతోష్, రాం-లక్ష్మణ్, హర్షవర్ధన్ తదితరులు

సంగీతం : మహేష్ శంకర్,  ఛాయా గ్రహణం :  సాహిర్ రజా
మాటలు : ప్రసాద్ వర్మ
బ్యానర్ : గురు ఫిలిమ్స్        నిర్మాత : సునీత తాటి
రచన- దర్శకత్వం : రాజ్ పిప్పళ్ళ
విడుదల :  7 మార్చి, 2014   సెన్సార్ : U/A

***

2009 లో ‘బోణీ’ అనే థ్రిల్లర్ తో పరిచయమైన దర్శకుడు రాజ్ పిప్పళ్ళ మళ్ళీ ఐదేళ్లకి గానీ రెండో సినిమా తో ముందుకు రాలేదు. ‘బంగారు కోడి పెట్ట’ అనే టైటిల్ కి పోస్టర్లో ‘కోడిపుంజు’ బాకావూదడం కూడా ఒక కొత్త ప్రయోగమేనేమో ఈ సినిమాకిలాగే. తనమీద అంతర్జాతీయ సినిమాల ప్రభావం ఎక్కువ వున్నట్టు కన్పించే ఈ దర్శకుడు, తెలుగు సినిమాని ఎన్నారై  ప్రేక్షకులే గాకుండా విదేశీయులూ మెచ్చే  విధంగా తీయాలన్నదే తన భవిష్యత్  లక్ష్యమనీ,  తెలుగు సినిమాకి అంత స్కోపు ఉందనీ  ‘బోణీ’ విడుదల సందర్భంగా వెల్లడించినట్టు గుర్తు. విదేశీయుల సంగతి తర్వాత- ముందు   ‘బోణీ’ తో తెలుగుప్రేక్షకుల్నే ఆకట్టుకోలేక పోయాక, కనీసం ఇప్పుడు ‘బంగారు కోడిపెట్ట’ తోనైనా తెలుగు మార్కెట్ కి అనుకూలంగా తను మారి వుండాల్సింది. తన అభిమాన ‘స్టోరీ’ గ్రంథ రచయిత రాబర్ట్ మెక్ కీ అదే గ్రంథంలో పేర్కొన్నట్టు- కొత్త దర్శకులు ముందు కమర్షియల్ సినిమాలతో చేయితిప్పుకుంటే, ఆ తర్వాత ప్రయోగాల జోలికెళ్ళొచ్చు- అన్న హెచ్చరికని ఖాతరుచేసి వున్నా మళ్ళీ ఈ కోడిపెట్ట ప్రయోగం జరిగేది కాదేమో!


‘స్వామి రారా’ విజయోత్సాహంతో వున్న హీరోయిన్ కలర్స్ స్వాతి కి  అలాటిదే థ్రిల్లర్ గా ‘బంగారు కోడి పెట్ట’ ఆఫర్  ఆకర్షించి వుండొచ్చు. అలాగే కలర్స్ స్వాతితో నటిస్తే ట్రాక్ రికార్డు బాగుపడుతుందని కొందరు యువహీరోల సాక్షిగా ధృవీకరించుకుని ఈ సినిమాకి నవదీప్ ఉద్యుక్తు డైవుండొచ్చు. ఇద్దరికీ అసలీ సినిమా కథతో ప్రయోగాలెందుకని ఇప్పుడన్పిస్తూ వుండొచ్చు.

దర్శకుడిది విచిత్రవాదం. మూడు కథలతో తీసిన ఈ సినిమాలో ఏ ఒక్క దాన్తోనైనా ప్రేక్షకులు కనెక్ట్ కాకపోతారా అని! అందుకే ఈ ప్రయోగమట! ఇదెలా వుందో ఇప్పుడు చూద్దాం..

ఓ సంక్రాంతి రోజు పొద్దున్నే  హైదరాబాద్ – బెంగళూరు హైవే మీద పాత కారులో నాలుగు ఎనర్జీ డ్రింక్స్ అట్ట పెట్టెలతో పరారవుతున్న వంశీ (నవదీప్) అనుకోకుండా దొరబాబు (ఫైట్ మాస్టర్ రామ్) తో ఘర్షణ పడి కాల్చేస్తాడు. శవాన్ని మాయం చేయడానికి కారు దిగినప్పుడు ఆ కారు మాయ మవుతుంది. దాని కోసం పరిగెడుతోంటే ఇంకో కారు వచ్చి గుద్దేస్తుంది...కళ్ళు బైర్లు కమ్ముతున్న వంశీకి  గతమంతా మెదులుతుంది.


ఆ గతంలో- హైదరాబాద్ లో వంశీ పనిచేస్తున్న ఎనర్జీ డ్రింక్స్ కంపెనీలోనే భానుమతి పినిశెట్టి (స్వాతి) కూడా సేల్స్ ప్రమోటర్ గా పనిచేస్తుంటుంది. వంశీకి చిల్లర దొంగగా పోలీస్ రికార్డు వుంటుంది. భానుమతి కూడా నకిలీ సర్టిఫికేట్లతో ఈ ఉద్యోగంలో చేరి వుంది. నిజానికీమ నైన్త్ కూడా పాసవలేదు. ఇదో రోజు పసిగట్టిన మేనేజర్ మూర్తి (హర్షవర్ధన్ ) ఆమెని డిస్మిస్ చేసేస్తాడు. అలా ఉద్యోగం పోగొట్టుకున్న భానుమతి ఆర్ధిక ఇబ్బందుల్లో పడుతుంది. డబ్బు సంపాయించుకోవడానికి ఆమెకో మార్గం తడుతుంది. కంపెనీ నిర్వహించిన ఓ లక్కీ విన్నర్ పోటీల్లో గెలుపొందిన వారికోసం కంపెనీ బెంగళూరు నుంచి డ్రింకు పెట్టెల్లో ఆ బంగారాన్ని  స్మగుల్ చేసి తీసుకొస్తున్నటు ఆమెకి తెలుస్తుంది. వంశీ సహాయంతో ఆ ట్రక్కుని హైజాక్ చేసి, బంగారం కాజేసేందుకు ప్లానేస్తుంది.

మరో వైపు ఓ పిజ్జా డెలివరీ బాయ్ వేణు ( సంతోష్) అనే కుర్రాడు సినిమా హీరో అవ్వాలన్న పిచ్చితో సినిమా కంపెనీల చుట్టూ తిరుగుతుంటాడు. ఊళ్ళోంచి  తల్లి చేసే కాల్స్ కి కూడా స్పందించకుండా ఆడిషన్స్ ఇస్తూ విఫలయాత్నాలు చేస్తూంటాడు.

ఇంకో వైపు భీమవరంలో రైతు సోదరులు దొరబాబు - ఎర్రబాబు (ఫైట్ మాస్టర్ లక్ష్మణ్) లు వాటాలు పంచుకుని విడిపోతే, సరైన వాటా దక్కని దొరబాబు అప్పుల్లో ఉంటాడు. పేకాడి మరింత అప్పుల్లో పడతాడు. అప్పులోడి బాధ పడలేక సంక్రాంతి కోడిపందాలప్పుడు తమ్ముడి కోడిని కాజేసి అప్పు తీర్చేందుకు బయల్దేరతాడు. ఆ కోడితో క్లోజ్ గా వుండే తమ్ముడి కూతురు (సంచలన ) కూడా వెంట హైదరాబాద్  వచ్చేస్తుంది. ఇదే అదును అనుకున్న అప్పులోడి గ్యాంగ్ కోడితో బాటూ దొరబాబునీ, ఆ అమ్మయినీ కిడ్నాప్ చేసి,  ఎర్రబాబుకి రెండు కోట్లు డిమాండ్ పెడతారు.

ఇదీ విషయం. ఈ మూడు కథలూ ఇక ఎప్పుడు ఎక్కడ ఎలా లింక్ అయ్యిందీ, అప్పుడేమేం జరిగాయన్నదీ  మొత్తం క్లైమాక్స్ లో వెల్లడవుతుందన్న మాట!

ఎలాటి హీరోయిజాలూ, హీరోయినిజాలూ లేని,  ఎలాటి ఫన్నూ స్పార్కూ కూడా కన్పించని  పేలవమైన పాత్రచిత్రణల్లో వె ల వెల బోయారు నవదీప్, స్వాతీలు. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ లు సైతం డిటో. వాళ్ళ ఇమేజికి తగ్గట్టుగా వేడి పుట్టించడం మానేసి  మరీ సాత్విక పాత్రల్లో నీరసించి పోయారు. పిజ్జా బాయ్ గా నటించిన సంతోష్ ది ఓవరాక్షన్. ఇవన్నీ ఫ్లాట్ క్యారక్టర్లు కాగా, మేనేజర్ గా  నటించిన హర్షవర్ధన్ ది  రంగు మార్చే ఊసరవెల్లి పాత్రకావడం వల్ల నేమో కాస్త ఆసక్తికరంగా కన్పిస్తాడు.

సంగీతపరంగా, ఇంకా సాంకేతికంగానూ  కళాత్మకంగానూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ సినిమా లేదు. తక్కువ బడ్జెట్లే అయినా, అట్టర్ ఫ్లాపులే అయినా, దృశ్య సౌరభాలతో, సంగీత బాణీలతో సాంకేతికంగా ‘నా రాకుమారుడు’, ‘లవ్యూ బంగారం’ లాంటి  యూత్ సినిమాల్ని ఓ పక్క తీస్తూంటే, ఇంకా పాత చింతకాయ ఛాయాగ్రహణాలతో, పాటలతో, నేపధ్య సంగీతాలతో లక్ష్యిత ప్రేక్షకుల పట్టింపే లేని ఆత్మాశ్రయ ధోరణిలో పడిపోయి కొందరు కొత్త దర్శకులు దర్శనాలు చేసుకుంటున్నారు. ఫ్లాపే అయినా కనీసం మంచి సాంకేతిక విలువలతో ‘బోణీ’ తీసిన ఈ దర్శకుడు  ఈసారెందుకో అలసత్వం ప్రదర్శించాడు. ఐదేళ్ళ కాలగమనం మహాత్మ్యం కావొచ్చు!

స్క్రీన్ ప్లే సంగతులు
‘బోణీ’ లో లోపించిన కథన చాతుర్యమే, పాత్ర చిత్రణల వైఫల్యమే  తు.చ. తప్పకుండా ఈసారికూడా  కొనసాగాయి. తనే చెప్పుకున్నట్టు ఒక పూర్తి స్థాయి కథ తో సక్సెస్ ని నమ్ముకోలేకా  అన్నట్టు- మూడు బుల్లి కథల తో కలిపి ఈ సినిమా తీస్తున్నప్పుడు –ఈ బహుళ కథా సంవిధానం డిమాండ్ చేసే విలువల్నైనా పరిశీలించి వుండాల్సింది. రెండోది, ప్రయోగాత్మక సినిమాకి తెలుగులో ప్రేక్షకాదరణ ఆర్టు సినిమాలకి లాగే బహు తక్కువన్నదీ తెలుసుకుని ఉండాల్సింది.

ఇందులో ఏకథకా కథ చూసినప్పుడు ప్రతీ కథా మూడంకాల నిర్మాణంలో ఉండాల్సిందే. ఈ  సినిమాలో అలాగే వున్నాయి. అయితే వాటిలో బలం, వేగం లోపించాయి. కథలు మూడున్నా ప్రధాన కథ ఒకటుంటుంది. ఇందులో ప్రధాన కథ నవదీప్-స్వాతీలది. ప్రధాన కథలోని ప్రధాన పాత్ర (స్వాతి) తో అంతిమంగా మిగతా రెండు కథల్లోని ప్రధాన పాత్రలు (ఫైట్ మాస్టర్ రామ్- సంతోష్)లు కీలక ఘట్టంలో సంఘర్షించాలి. కానీ జరిగిందేమిటంటే ఇవి రెండూ ప్రధాన కథలోని సహాయ పాత్ర (నవదీప్) తో సంఘర్షిస్తాయి.

ఏ కథకి కూడా రెండు ప్రధాన పాత్రలుండవు. కానీ ఈ సినిమాలో నవదీప్- స్వాతి లవి రెండూ ప్రధాన పాత్రలే అన్నట్టుగా నడిపారు. సమస్య స్వాతిది, డబ్బు ఆమె కవసరం. ఫస్టాఫ్ యాభయ్యోవ నిమిషంలో హైజాక్ ప్లాను ఆమె నవదీప్ కి ప్రస్తావించి అతడి సహాయం కోరుతుంది. అలా కథని ప్రారంభిస్తూ రెండో అంకం లోకి తనే తీసికె ళ్తుంది. ఇంటర్వెల్ దగ్గర తనే ఓ మలుపుకి కారణం అవుతుంది. ఇలా కథ ఆమె పరంగా నడుస్తున్నప్పుడు- నవదీప్ ప్రధాన పాత్ర కాలేడు. క్లైమాక్స్ లో కొచ్చేసరికి ఇతనితోనే మిగతా రెండు కథల నాయకులూ కథని  మలుపు తిప్పుతారు.
ఈ సినిమా చాలా బోరు కొడుతుందంటే కారణం ఇదే. ప్రధాన కథలో ప్రధాన పాత్రకి ఏకసూత్రత లోపించడంతో, ఆడియెన్స్ అనుభూతించే కథనం దెబ్బతినిపోయింది.

రెండోది ఇంటర్వెల్లో స్వాతి ఓ మలుపుకి కారణమైనట్టు చూపించి, తీరా సెకండాఫ్ ప్రారంభిస్తూ అది ఉత్తుత్తి సంఘటనే అని తేల్చేశారు. ఇలాకూడా కథ వెన్నెముకని విరిచేశారు. ఒకసారి ఏ క్రింది  చిత్రంలో చూస్తే,  మిడ్ పాయింట్ (ఇంటర్వెల్) అనేది ప్రధాన పాత్ర ఆశయ సాధనకి ఎంత కీలక ఘట్టంగా (అనుకూలంగా లేదా ప్రతికూలం గా ) ఉండాలో స్పష్టమౌతుంది.


ఇక పేరుకి ప్రధాన కథలో మూడం కాలైతే వున్నాయే గానీ, ప్రధానంగా స్క్రీన్ ప్లే కి  ఆయువుపట్టు వంటిదైన రెండో అంకం బిజినెస్ నిర్వహణ కూడా మొదటి అంకం బిజినెస్ నిర్వహణా లక్షణాలతో నింపేశారు! అంటే క్లైమాక్స్ వరకూ మొదటి అంకమే నడుస్తున్నట్టు పేలవంగా ఉంటుందన్నమాట. మనభాషలో చెప్పుకోవాలంటే ఇది మిదిల్ మటాష్ స్క్రీన్ ప్లే!
ఇలాటిది చూసి చూసి విరక్తి పుట్టే స్టీవెన్ స్పెల్ బెర్గ్ పక్క చిత్రంలో లా కామెంట్ చేశాడు. ..





contd..










Friday, February 28, 2014

రివ్యూ..


ఫార్ములా వాస్తవికతల కిచిడీ!




**  రాజా గౌతమ్, ఆలీషా బేగ్, తనికెళ్ళ భరణి, షాయాజీ షిండే, రణధీర్, ధన్ రాజ్, నవీనా జాక్సన్, భాను కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సంగెతం ; మణిశర్మ,  ఛాయాగ్రహణం : అనిల్ బండారీ,  మాటలు : శ్రీకాంత్ విస్సా,  పాటలు: కృష్ణ చైతన్య, శ్రీమణి,  నృత్యాలు : రఘు,  కళ :  రఘు కులకర్ణి,  యాక్షన్ :  డ్రాగన్ ప్రకాష్,  ఎడిటింగ్ : మార్తాండ్ వెంకటేష్, బ్యానర్ : స్టార్ట్ పిక్చర్,
నిర్మాణం-రచన- దర్శకత్వం : చైతన్య దంతలూరి
విడుదల : ఫిబ్రవరి 28, 2014,  సెన్సార్ : U/A
***

దర్శకుడు చైతన్య దంతలూరి ‘బాణం’ (2009) అనే ఆఫ్ బీట్ సినిమాతో విజయవంతంగా రంగప్రవేశం చేసి మళ్ళీ ఇన్నాళ్ళకి రెండో సినిమాతో ముందుకొచ్చాడు. ఈ సినిమాకి తనే నిర్మాత కూడా అయ్యాడు. ...తనూ కొత్త వాడై కొత్త హీరోలని ప్రోత్సహిస్తూ మొదటి సినిమాలో నారా రోహిత్ ని పరిచయం చేసినట్టే, ఇప్పుడు దాదాపు కనుమరుగైన బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్ కి అవకాశమిస్తూ ‘బసంతి’ తీశాడు. మొదటి సినిమాని నక్సలిజం మీద తీస్తే ఈ రెండో సినిమా టెర్రరిజం మీద తీశాడు. ఇందులో ముస్లిం హీరోయిన్ పాత్ర పెట్టడంతో విడుదలకి ముందు ఈ సినిమా ఎంతో ఆసక్తి రేపింది. ఇంకా ఫీల్డులో స్టార్లూ సూపర్ స్టార్లూ స్వఛ్ఛందంగా ముందుకొచ్చి ఇతోధికంగా ప్రమోటింగ్ కి తోడ్పడ్డారు. బ్రహ్మానందం కుమారుడి సినిమా అవడంతో ఈ లో- బడ్జెట్ సినిమాకి ఎక్కడలేని హేమాహేమీల దీవె నలన్నీ పోగుపడ్డాయి. మరి ఇంతటి ప్రచారమూ ఆశీర్వచనాలూ సార్ధకమయ్యే స్థాయిలో సినిమా వుందా?

ఈ సినిమా చూస్తూంటే యాదృచ్చికంగా 1990 నాటి రాజ శేఖర్ నటించిన టెక్నికల్ వండర్ ‘మగాడు’గుర్తుకొస్తుంది..’ఆఫ్ బీట్’ దర్శకుడు చైతన్య దంతలూరి ‘బసంతి’ ని కూడా ఈ మలయాళం రీమేక్ లా తీసివుంటే ఎంత బావుణ్ణు అన్పిస్తుంది. ‘మూణ్ణం మురా’ అనే మోహన్ లాల్ నటిచిన మలయాళం హిట్ దర్శకుడు కె. మధు - తెలుగు రిమేక్ ని కూడా అంతే భక్తిశ్రద్ధలతో రూపొందించి హీరో రాజ శేఖర్ కి మరో పెద్ద హిట్టిచ్చిన చరిత్ర ఉండనే వుంది. బ్రహ్మానందం తనయుడికి ఈ స్థాయి కమర్షియల్ గా వర్కౌటయ్యే రియలిస్టిక్ సినిమా దక్కి వుండాల్సింది...’మగాడు’ కథతో దగ్గరి పోలికలున్నఈ ‘బసంతి’ లో అసలేముందంటే...

బసంతి కాలేజ్ ఆఫ్ లవ్/టెర్రర్
అతను అర్జున్ (రాజా గౌతమ్ ) అనే డిగ్రీ స్టూడెంట్. బసంతీ కాలేజీలో బియ్యే చదువుతూంటాడు. చదువంటే లక్ష్యం లేదు, జీవితం పట్ల ఏ ధ్యేయమూ లేదు, అసలు క్లారిటీ కూడా లేదంటాడు. సున్నా మార్కులొస్తున్నా తేలిగ్గా తీసుకునే మధ్యతరగతి తండ్రీ (తనికెళ్ళభరణి), తగువుపెట్టుకునే తల్లీ వుంటారు. కాలేజీలో మల్లి (ధన్ రాజ్), స్వాతి( నవీనా జాక్సన్), అబ్బాస్( రణధీర్) అనే ఫ్రెండ్స్ వుంటారు. వీళ్ళు చదువులు  తక్కువ తిరుగుళ్ళు  ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నప్పుడు, అబ్బాస్ చెల్లెలి పెళ్లి సందర్భం వస్తుంది. ఈ పెళ్ళిలో రోషిని (ఆలీషా బేగ్)  అనే పోలీస్ కమీషన్ అలీ ఖాన్ (షాయాజీ షిండే) కూతుర్ని చూసి  అక్కడే మనసు పారేసుకుంటాడు అర్జున్.

ఇంకో వైపు పాకిస్తాన్ నుంచి ఒక టెర్రరిస్టు లీడర్ దిగి నగరంలో జరిగే అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు  మీద దాడి  చేసేందుకు సన్నాహాలు చేస్తూంటాడు. ఇటు అర్జున్ తన ప్రేమాయణం ముందుకు  తీసికెళ్ళడానికి జంకుతూంటాడు. వేరే కాలేజీలో చదివే రోషినీ కోసం అక్కడ కాపేస్తూంటాడు. ఇంతలో ఎవరికో అర్జంటుగా రక్తం అవసరముంటే వెళ్లి రక్తదానం చేస్తాడు. ఆ  రోగి మరెవరో కాదనీ, రోషినీ నానమ్మే అని తెలిసి – దాంతో తన సేవా భావానికి రోషిని మెచ్చికోలే కాకుండా, ఆమె తండ్రి దృష్టిలో మంచివాడుగా కూడా మన్నన లందుకుంటాడు. ఆ ఇంట్లో అందరికీ మాలిమి అవుతాడు.
ఇక మనం ఫ్రెండ్స్ లా వుందామని రోషిని అనేసరికి సరేనంటాడు. ఇలా సాగుతోంటే, సడెన్ గా రోషిని తనకు లండన్లో పై చదువులకి సీటొచ్చి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. ఇక ఆగలేక ఎలాగైనా తన ప్రేమని వెల్లడించు కోవడానికి ఏర్ పోర్టు కెళ్ళి ఆమె కోసం ఎదురు చూస్తుంటాడు. అదే సమయంలో ఇటు టెర్రరిస్టులు జీవ వైవిధ్య సదస్సు మీద దాడికి  బయల్దేరుతున్నప్పుడు కమీషనర్ అలీ ఖాన్ కళ్ళబడి తప్పించుకుంటారు. వాళ్ళని వెంటాడుతోంటే- వాళ్ళు బసంతీ కాలేజీ లోకి జొరబడి- ఫేర్ వెల్ పార్టీ జరుపుకుంటున్న ఎనభై మంది విద్యార్థుల్ని బందీలుగా పట్టుకుని, జైల్లో వున్న తమ నాయకుడు బాబర్ ఖాన్ విడుదల కోసం కమీషనర్ కి బేరం పెడతారు.
ఈ బందీల్లో అర్జున్ ఫ్రెండ్స్ తోబాటు రోషిని కూడా వుంటుంది. రోషిని ఇక్కడికెలా వచ్చింది? కాలేజీకి తిరిగొచ్చిన అర్జున్ ఏం చేశాడు? పోలీసులు బందీల్ని విడిపించుకోవడానికి ఏం చేశారు? టెర్రరిస్టుల్తో ఈ పోరాటంలో ఎవరు చనిపోయారు, ఎవరు బతికారు- ఈ హైడ్రామా ముగింపే మిటీ అన్నవి ఇక్కడ్నించీ కొనసాగే ద్వితీయార్ధంలో తెలుసుకోవచ్చు.

ఇది ప్రధానంగా హీరో గౌతంని విజయవంతంగా ఎస్టాబ్లిష్ చేసేందుకు చేసిన బృహత్ ప్రయత్నం. అయితే ఈ పాత్రలో అతడి నటన -  మొదట లవర్ బాయ్ గా, తర్వాత యాక్షన్ హీరోగా ఏమాత్రం చాల్లేదు. కొన్ని కోణాల్లో బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నా పోలికలు కన్పించే తను-  ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తనని తానూ నటనలో మెరుగుపర్చుకున్న దాఖలాలు పాత్ర సరైన తీరులో వుండి వుంటే బయల్పడేవేమో...కానీ దర్శకుడు ఈ పాత్రే నటనకి పెద్దగా అవకాశం లేని తీరుతెన్నుల్తో ‘తీర్చిదిద్దడం’తో,  గౌతమ్ నిజంగా ఇంప్రూవ్ అయినా అది బయట పడే అవకాశాలు పూర్తిగా మృగ్యమైపోయాయి! ఇదెలా జరిగిందో తర్వాత  ‘పాత్రోచితానుచితాలు’ విభాగంలో చూద్దాం.

ఇక హీరోయిన్ ఆలీషా బేగ్ అయితే చైల్డ్ ఆర్టిస్టులా వుంది. ఈమె ఎలావుందో ఈమెకి తగ్గట్టే పాత్రకూడా వుండీ లేనట్టే ఆషామాషీగా వుంది. హీరోతోబాటే ఈమెకూడా ప్రేమకథని సాధ్యమైనంత పేలవంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా  కృషిచేసినట్టుంది. ఈమెకంటే స్వాతి పాత్ర నటించిన నవీనా జాక్సన్ మెరుగన్పించు కుంది. ధన్ రాజ్ కామెడీకి పెద్దగా స్కోపు లేదు. రణధీర్, తనికెళ్ళ, షాయాజీ తదితరులు ఎంతబాగా నటించినా అవి అసమగ్ర పాత్రలై పోయాయి.

సినిమాకి మణిశర్మ సంగీతంలోని పాటలేం కిక్కునివ్వలేదు. సన్నివేశ బలం లేని దృశ్యాలకి బిజిఎం మాత్రం బలంగా వుంది. ఇక శ్రీకాంత్ విస్సా సంభాషణలు అతితక్కువ చోట్ల పేలాయి. అనిల్ కెమెరా పనితనం తక్కువ లైటింగ్ వల్ల కావొ చ్చు విజువల్ అప్పీల్ ని కల్గించలేకపోయింది.

దర్శకుడే నిర్మాత కావడం వల్లేమో ప్రొడక్షన్ విలువలు అంతంత మాత్రంగా వున్నాయి.


స్క్రీన్ ప్లే సంగతులు 
ఇది ఫస్టాఫ్-సెకండాఫ్ స్క్రీన్ ప్లే. అంటే  కథ ప్రారంభ మవడానికి ఫస్టాఫంతా అపసోపాలుపడుతూ సమయమంతా తినేసి, అప్పుడు ఇంటర్వల్ దగ్గర మాత్రమే హమ్మయ్యా అనుకుంటూ అసలు పాయింటుకి రావడమన్నమాట. అంటే  ముప్పయి-నలభై నిమిషాల్లో ముగియాల్సిన మొదటి అంకం, పరిధి దాటి ఇంటర్వెల్ వరకూ గంటకు పైగా సుదీర్ఘంగా సాగడమన్న మాట. దీంతో జరిగే ఉపద్రవాలు-1) ఫస్టాఫ్ లో అసలేమీ జరక్కుండా కథ పలచబారిపోవడం, 2) టైం అండ్ టెన్షన్ గ్రాఫు ఐపులేకుండా పోవడం, 3) పాత్రలు బోరుకొట్టడం, 4) ప్రధాన పాత్రకి ఎంతకీ క్యారక్టర్ ఆర్క్ ఏర్పడకపోవడం, 5) విషయం లేక జరిగిన విషయాలే ఒకపాత్ర ఇంకోపాత్రకి పోస్టు చేయడానికే సీన్లు పనికిరావడం, 6) వీటన్నిటితో ప్రేక్షకులకి సహన పరీక్ష పెట్టడం!

ఈ స్కీములోనే పూర్వం సినిమాలు ఉండేవి, కాకపోతే వాటిలో పెద్ద స్టార్లు నటించడంతో విజువల్ అప్పీల్ వల్ల, వాళ్ళఫ్యాన్  ఫాలోయింగ్స్ వల్లా చెల్లిపోయేవి. గ్రామీణ ప్రేక్షకులుకూడా ఫస్టాఫ్ కామెడీ –సెకండాఫ్ స్టోరీ అని  పధ్ధతి పసిగట్టేసి  వాటికి సెటిలై పోయేవాళ్ళు. అయినప్పటికీ  రాంగోపాల్ వర్మ కొంచెం తేడాగా 1989 లో అప్పటికే స్టార్ గా ఎదిగిన అక్కినేని నాగార్జున తో- ఈ స్థానిక ఫస్టాఫ్- సెకండాఫ్ మూస ఫార్ములా ధోరణికి పోకుండా- సార్వజనీన మూడంకాల ( త్రీ యాక్ట్) స్క్రీన్ ప్లేనే అనుసరిస్తూ ‘శివ’ తీశారు

contd..

Sunday, February 23, 2014

రివ్యూ..



నేటివిటీ ప్రాబ్లం!
నాని, వాణీ కపూర్, సిమ్రాన్, బడవ గోపి, ఎంజె శ్రీరాం తదితరులు
సంగీతం : ధరణ్ కుమార్,  ఛాయాగ్రహణం : లోకనాథన్ శ్రీనివాసన్,  కూర్పు: బి శ్రీకుమార్
కథ : మనీష్ శర్మ,  స్క్రీన్ ప్లే : హబీబ్ ఫైసల్,  మాటలు : శశాంక్  వెన్నెల కంటి
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్,   నిర్మాత :  ఆదిత్యా చోప్రా
దర్శకత్వం: గోకుల్ కృష్ణ
విడుదల : ఫిబ్రవరి 21, 2014    సెన్సార్: ‘u’
***


ఒక భాషలో విజయం సాధించిన సినిమాని ఏకకాలంలో మరో రెండు భాషల్లో రీమేక్ చేసినప్పుడు వాటిలో ఒకటి కచ్చితంగా డబ్బింగ్ లాగే ఉండాలా? పోనీ వరిజినల్ ని ఆల్రెడీ కాపీకొట్టి తీసేసివుంటే మళ్ళీ రీమేకు కూడా చేసుకోవచ్చా? ఒకసారి కాపీ అట్టర్ ఫ్లాపయ్యాక  కూడా ఒరిజినల్ సూపర్ హిట్టవ్వచ్చా?....ఇవీ  ‘ఆహా కల్యాణం’ అనే వ్యవహారం చూస్తూంటే వేధించే ప్రశ్నలు.

2011 లో హిందీలో ‘బ్యాండ్ బాజా బరాత్’ అనే రోమాంటిక్ కామెడీ హిట్టవడంతో చాలాకాలానికి తెలుగు తమిళ భాషల్లో దాన్ని రిమేక్ చేస్తూ  దక్షిణాదిన అడుగెట్టాలనుకుంది సుప్రసిద్ధ యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ. ఇంతలో తెలుగులో నందినీ రెడ్డి  ఈ కథనే  ‘జబర్దస్త్’ అంటూ తీసేయ్యడంతో అదో వివాదమై కూర్చుంది. అయినా యశ్ రాజ్ ఫిలిమ్స్ వెనుదీయక తెలుగు-తమిళ రీమేకులతో ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే నందినీ రెడ్డితో పోటీకి దిగిందా అన్నట్టు తనుకూడా ఈ రెండేసి రీమేకులని పతాక స్థాయిలో అట్టర్ ఫ్లాప్ చెయ్యడం కోసమే కంకణం కట్టుకున్నట్టుంది ఈ సినిమా చూస్తూంటే. కాపీరైట్ సంగతి ఎలావున్నా ఫ్లాప్ చెయ్యడంలో  మాత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ దే పైచేయి అయ్యిందనాలి!

దక్షిణాదిన ఎంట్రీ ఇచ్చుకుంటు న్నప్పుడు ముందు  ప్రాంతీయత గురించి, స్థానిక ప్రేక్షకాభిరుచుల గురించీ కాస్తయినా పట్టింపు లేకపోతే ఆ ఎంట్రీ ని కూడా ఎవరూ పట్టించుకోరు. ‘ఆహా కల్యాణం’ అనే డిజైనర్ ప్రేమకథ ఒరిజినల్లో వున్న న్యూఢిల్లీ నేటివిటీతో తమిళంలో తీసి తెలుగులోకి డబ్ చేసినట్టు తయారయ్యింది. దశాబ్దం క్రితం ‘మై ప్రేమ్ కీ దీవానీ హూఁ ‘ అనే డిజైనర్ ప్రేమకథ తీసిన సూరజ్ బర్జాత్యా విఫలమైన చోట ఆదిత్యా చోప్రా  ‘బ్యాండ్  బాజా బరాత్’ తో ఎక్కడ సఫలమయ్యాడంటే- బర్జాత్యా నాటికింకా డిజైనర్ ప్రేమకథలకి మల్టీప్లెక్స్ సినిమాల ఊపందుకోలేదు. చోప్రా నాటికి  మల్టీప్లెక్స్ సినిమాల జోరు తారాస్థాయిలో వుంది... నగర ప్రేక్షకులు క్యూలు కట్టే  పాప్ కార్న్ మల్టీప్లెక్స్ సినిమాలు ఉత్తరాదిలోనే ఊళ్ళల్లో సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో జనాలకి ఎక్కడంలేదు- అలాంటిది తెలుగులో రక్తికట్టించే అవకాశం ఉంటుందా?

కనీసం నందినీ రెడ్డి ఆ కథని మాస్ సినిమాగా తీయడంలో విఫలమైనా, తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టుగా కథని మార్చుకుంటూ పెళ్ళికాని హీరో హీరోయిన్ల మధ్య శారీరక సంబంధమనే ప్రధాన మలుపుని తొలగించుకోగాలిగారు. టైటిల్ సహా కుటుంబ ప్రేక్షకులకి  నప్పుతుందనుకుని తీసినట్టున్న ఈ  రీమేకులో ఈ పాయింటే  సెంటిమెంట్లకి వ్యతిరేకంగా వుంది.

‘ఆహా కళ్యాణం’ లో ఈ ‘రంకు’ వ్యవహారమెలావుందో ఓసారి చూద్దాం...

శృతి కలిపింది  తనే ...
శక్తి (నాని) అనే స్టూడెంట్ వూళ్ళో తండ్రిని మభ్య పెడుతూ రాని చదువు పేరుతో కాలక్షేపం చేస్తూంటాడు. హాస్టల్లో తిండి సహించక ఫ్రెండ్స్ నేసుకుని పెళ్ళిళ్ళలో దొంగ తిళ్ళకి హాజరైపోతూంటాడు. అలాటి ఒక పెళ్లి లో పట్టేసుకుంటుంది శృతి( వాణీ కపూర్) అనే మరో స్టూడెంట్. ఈమెకి చదువైన తర్వాత వెడ్డింగ్ ప్లానర్ గా వ్యాపారం ప్రారంభించాలని వుంటుంది. ఇందుకోసం తనకి చూస్తున్న సంబంధాల్ని కూడా వాయిదా వేస్తుంది. శక్తికి ఈమె చేయాలనుకుంటున్న బిజినెస్ నచ్చి తనని పార్టనర్ గా  కలుపుకోమంటాడు. ప్రేమ పేరుతో వెంటపడుతున్న ఇతన్ని తిరస్కరిస్తుంది. ఫైనాన్స్ లో రోమాన్స్ ని కలపనంటుంది. అతను రోమాన్స్ కి దూరంగా ఉంటానని ప్రామీస్ చేస్తాడు.
ఒకసారి శృతి చంద్రలేఖ(సిమ్రాన్) అనే పాపులర్ వెడ్డింగ్ ప్లానర్ దగ్గరి కెళ్తుంది. అనుకోకుండా శక్తితో బాటు అక్కడ పనిలో చేరిపోతుంది. ఓ పెళ్లి ఏర్పాట్ల సందర్భంగా చంద్రలేఖ ఎక్కువ మిగుల్చుకోవాలని కక్కుర్తిపడి దొరికిపోతుంది. ఆ  తప్పు శృతి మీదికి తోసేయ్యడానికి ప్రయత్నించడంతో, ఆమెకి గుడ్ బై కొట్టి తామే సొంత బిజినెస్ పెట్టుకుని చూపిస్తామని చాలెంజ్ చేస్తాడు శక్తి. అలా  ఇద్దరూ ‘గట్టి మేళం’ అనే వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ పెడతారు.

విజయవంతంగా ఈ బిజినెస్ చేస్తూ ఆఫీసులోనే తిని పడుకుంటూ ఫక్తు బిజినెస్  పార్టనర్స్ గా వుంటారు. ఒకే పక్క మీద పడుకుంటున్నా హద్దు మీరకుండా ఉంటాడు శక్తి. అలాంటిది  ఇంకో చాలాపెద్ద కాంట్రాక్టు చేపట్టి సక్సెస్ చేసినప్పుడు దాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ తప్ప తాగేస్తారు. అప్పుడు శృతియే చొరవతీసుకుంటుంది శృతి కలపడంతో  అన్నీ జరిగిపోతాయి!
దీంతో మాటతప్పి ఫైనాన్స్ లో రోమాన్స్ ని మిక్స్ చేసినందుకు ఫీలైపోయి- ఈ  ‘సెషన్’ జరిగి వుండాల్సింది కాదంటాడు శక్తి. జరిగిందాన్ని ‘సెషన్’ అంటూ తేలిగా మాట్లాడ్డంతో మండిపోయి మాటలు మానేస్తుంది శృతి. అలా ఎడం పెరుగుతూ బిజినెస్ లో పొరపాట్లకి అతణ్ణి నిందిస్తూండే సరికి, ఇక ఇద్దరూ విడిపోయే పరిస్థతి వస్తుంది. శక్తి వేరే అలాటి బిజినెస్సే పెట్టుకుని పోటీకి దిగుతాడు...

ఇదీ విషయం. ఈ పోటీలో కష్టాలు, ఒక్కరే నిర్వహించలేని వ్యవహారాలూ ఎదురై ఒకరిలోటు మరొకరు తెలుసుకుని ఎలా ఒక్కటయ్యారనేది ఇక్కడ్నుంచీ చూడొచ్చు.

కథ సంగతలా ఉంచితే, ముందుగా వచ్చిన ఇబ్బందేమిటంటే  నానీ- వాణీ కపూర్ ల జోడీ ఛోటే మియా- బడే  మియా లాగా వుండడం! ఎత్తుల్లో కొట్టొచ్చే తేడాతో ఏకోశానా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్పించుకోకపోవడం...మరీ పంజాబీ తనం ఎక్కువున్న వాణీ కపూర్ వల్లకూడా తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ లేకపోవడం...అసలు మేకింగే హిందీ సినిమాలావుండడం...కొత్తవాడైన తమిళ దర్శకుడు గోకుల్ కృష్ణ మక్కీకి మక్కీ ఒరిజినల్ నే తమిళంలోకి దింపి లిప్ సింక్ ద్వారా తెలుగు రిమేక్ అనికూడా అన్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. క్లోజప్స్ లో ఆ లిప్ సింక్ బండారం బయటపడింది...ఇంకా ఒక్క నానీ తప్ప మరెవరూ తెలుగు నటులు లేకపోవడం కూడా ఇది డబ్బింగే అన్పించడానికి దారితీసింది.


ఖర్చు బాగానే పెట్టారు, విజువల్స్ బ్రహ్మాండంగానే వున్నాయి- సంగీతం ఓ మోస్తరే- అయితే మొదలెట్టింది లగాయతూ చివరి ఘట్టం దాకా బ్యాక్ డ్రాప్ లో మార్పులేని వరస పెళ్ళిళ్ళ ప్రోగ్రాములే చూపించడంతో అదో మొనాటనీకి దారితీయడ మేగాక,  కథ తక్కువ హడావిడి ఎక్కువలా తయారయ్యింది.  సినిమా చూసి బయటికి వస్తూంటే  కథ కంటే పెళ్ళిళ్ళ సందడే చెవుల్లో గింగురు మంటూంటుంది...వేటిలో ఒక్క పెళ్లి కూడా  తెలుగు పెళ్లి వుండదు!


స్క్రీన్ ప్లే సంగతులు
మల్టీ ప్లెక్స్ సినిమాలకి ఓ స్క్రీన్ ప్లే అంటూ వుండదు. ఈ సినిమాలు తీసే కొత్త దర్శకులు కొత్త ధోరణి అనుకుని ఇష్టానుసారం కథలల్లుకుంటారు. లైటర్ వీన్ కథలు, బలహీనమైన పాయింట్లు, వెన్నెముక లేని ప్లాట్ లైన్లూ వీరి ప్రత్యేకత. ఇదే ఒరిజినల్ కథలో కన్పిస్తుంది. అదే యధాతధంగా రీమేకుల్లో దిగుమతయ్యింది. కొన్ని సినిమాల నుద్దేశించి కాలక్షేప బఠాణీ లంటూంటాం...వాటిల్లో కూడా కథ ఎంతైనా కొంత బలంగానే వుంటుంది. కానీ మల్టీప్లెక్స్ సినిమాలు అంతకన్నా బలం లేని కథలతో పాప్ కార్న్ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ ఒరిజినల్ హిందీ కథ రాసుకున్న దర్శకుడు మనీష్ శర్మ, ‘స్క్రీన్ ప్లే’ సమకూర్చిన హబీబ్ ఫైసల్ –ఇద్దరూ ఇంటర్వెల్లో శృంగార దృశ్యం మీద  మమకారం బాగా  పెంచుకుని అదే  ఈ కథకి ప్రాణం అనుకున్నారు. దాని ఆధారంగానే మిగతా కథ  నడిపి ముగించినట్టు అన్పిస్తారు. కానీ కథని ఇరవైనిమిషాల్లో మొదటి అంకం ముగించేసి- శృతి కి వెడ్డింగ్ ప్లానర్  లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తూ రెండో అంకం ప్రారంభించారు. అంటే ఇక్కడే అసలు కథ ప్రారంభమైందన్న మాట. ఐతే  దీన్ని కేవలం వెర్బల్ గా (మాటల రూపంలో) చెప్పించారేతప్ప- విజువల్ గా ఒక బలమైన సంఘటనతో ఎస్టాబ్లిష్ చేయలేదు. అలాంటప్పుడు ముగింపు కూడా విషయంలేక- లేదా ఏదో విషయాన్ని బలవంతంగా జొప్పించి నట్టుగా బలహీనంగా వస్తుందనేది గుర్తించ లేకపోయారు. వారి దృష్టిలో ఇంటర్వెల్ మలుపే కీలకం. ఇదే ముగింపుకి ‘ఇష్యూ’  అవుతుం దనుకున్నారు. కానీ అది కేవలం వాళ్ళ ఊహే!


ఏ స్క్రీన్ ప్లే కైనా మొదటి అంకం ముగింపులో లక్ష్యాన్ని, లేదా సమస్యని బలంగా ఏర్పాటు చేయకపోతే మూడో అంకం (క్లైమాక్స్) ముగింపు కూడా బలహీనంగా వస్తుందనేది చాలా ప్రాథమిక సూత్రం. పోనీ శృతి లక్ష్యాన్ని వెర్బల్ గా బలహీనంగానే ఎష్టాబ్లిష్ చేశారే  అనుకుందాం- అంటే  ఈ పాయింటుతో ఇక్కడే కథ మొదలయింది. అప్పుడు ఈ పాయింటు మీద క్లైమాక్స్ కి పోతే అప్పుడది స్టోరీ క్లైమాక్స్ అవుతుంది. కానీ ఇంటర్వెల్ సీనుతో కథ ప్రారంభమయ్యిం దనుకోవడంవల్ల దానిమీదే ముగింపుకి పోయారు. ఇంటర్వెల్ సీను కథలో ఒక మలుపే తప్ప అదే కథ కాదు. దాంతో ముగింపుకి పోతే అది ప్లాట్ క్లైమాక్స్ కి పోతుంది. కావాల్సింది స్టోరీ క్లైమాక్స్...

బాలచందర్ తీసిన ‘మరోచరిత్ర’ లో కమలహాసన్- సరితలు  ఏడాది తర్వాతే కలుసుకోవడమనే ‘స్టోరీ’ ని ఏర్పాటుచేసి- తీరా  చూస్తే కలపకుండానే ఓ ట్రాజడీతో క్లైమాక్స్ కి చేర్చిముగిస్తారు.  ఇక్కడ ప్రేక్షకుల్ని ‘స్టోరీ క్లైమాక్స్’ కోసం ఉత్కంఠతో ఎదురుచూసేలా చేసి,  వాళ్ళ ఊహలు తలకిందులు చేస్తూ స్టోరీ క్లైమాక్స్ క్యాన్సిల్ అయ్యేలా ప్లాట్  క్లైమాక్స్ ఎత్తుకున్నారు. ఈ ప్లాట్ క్లైమాక్స్ ఎక్కడ్నుంచి వచ్చింది? మాధవిని కమల్ వదిలేశాడన్న అక్కసుతో ఆమె అన్న యాక్టివేట్ అయ్యే పరిణామంతో  అనివార్యంగా వచ్చింది! దీన్ని తప్పించి స్టోరీ క్లైమాక్స్ కి వెళ్ళలేరు- ఏడాది ఎడబాటు షరతుని విజయవంతంగా నిభాయించుకుని కమల్- సరితలు ఒకటయ్యే ప్రశ్నే తలెత్తనంత బలమైన పరిణా మమది-కాబట్టే ప్లాట్ క్లైమాక్స్! అంత  కరెక్టు జడ్జిమెంట్  కాబట్టే అంతటి హిట్! హిందీ రీమేక్  ‘ఏక్ దూజేకేలియే’ లో క్లైమాక్స్ మార్చాలంటూ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా లొంగలేదు బాలచందర్.


ప్రస్తుత సినిమాలో సరిగ్గా ‘మరోచరిత్ర’కి వ్యతిరేకంగా జరిగుండాల్సింది- అంటే –స్టోరీ క్లైమాక్స్ చోటుచేసుకుని వుండాల్సింది. ఎందుకంటే ప్రేమకి సంబంధించిన వాళ్ళిద్దరి  ప్లాట్ క్లైమాక్స్ ఏం చేసినా పేలవంగానే, అర్ధంపర్ధం లేకుండా వుంటుంది. అందుకే క్లైమాక్స్ లో  ఆమె అకస్మాత్తుగా తనకి ఎంగేజ్ మెంట్ అయినట్టు చెప్పేస్తుంది. దుబాయిలో  వున్న పెళ్లి కొడుకుతో మాట్లాడుతున్నట్టు పదే  పదే  ఫోన్ ని ఉపయోగిస్తుంది. ఇదంతా అసందర్భంగా మనకి అన్పిస్తుంది. అతన్ని పక్కనపెట్టి- కథలో వున్న ఇతర పాత్రలకైనా తెలియకుండా ఆమె ఎంగేజ్  మెంట్ ఎలా చేసుకుంటుంది? ఆ పెళ్లి కొడుకెవరో చూపెట్టకుండా ఆమె ఫోన్లోనే మాట్లాడుతున్నట్టు చూపిస్తూంటే ఆమే దొంగ నాటక  మడుతున్నట్టు లేదా? ఆ పెళ్ళికొడుకు  తెరమీదికి రాకుండానే అతను ఫూలిష్ గా ఆమె నాటకానికి పడిపోయినట్టు లేదా?

ఎత్తుకున్న వ్యాపారభాగాస్వామ్యం మీదే స్టోరీ క్లైమాక్స్ కి  వెళ్లి వుంటే ఇలా ప్రేక్షకుల్ని ఏమార్చే వ్యవహారం తప్పేది. ఇందుకు మొదటి అంకం ముగింపులో ఆమె కి ర్పాటు చేసిన లక్ష్యం బలంగా వుండాలని చెప్పుకున్నాం. వెర్బల్ గానే ఏర్పాటుచేసిన పాయింటులో వాళ్ళిద్దరి ఒప్పందానికి సంబంధించి వివరాలు అసంపూర్ణం గానే వున్నాయి. ఫైనాన్స్ లో రోమాన్స్ ని మిక్స్ చెయ్యనని తను మాటిచ్చాడు సరే, ఒకవేళ మాట తప్పితే ఏంచెయ్యాలి? ఈ క్లాజు ఒప్పందంలో లేకపోవడం కూడా చైల్డిష్ గా వుంది. దీనిక్కూడా సమాధానం చెప్పివుంటే గేమ్ కి బలం చేకూరేది..ఎలాగూ ఒప్పంద ఉల్లంఘన జరిగింది కాబట్టి- దానికెవరు బాధ్యులనే ప్రశ్న తలెత్తేది. ఈ ప్రశ్నే విభేదాలకి దారితీసివుంటే- ఈ ప్రశ్నే తర్వాతి కథనానికి మూలాధారంగా వుండి –అర్ధవంతమైన స్టోరీ క్లైమాక్స్ కి వెళ్ళేది- అందులోంచే వాళ్ళిద్దరి ప్రేమ సమస్య కూడా పరిష్కారమై పోయేది!

ఇంత చెప్పుకున్నాక ఈ కథకి ప్రధాన పాత్ర  ఎవరు?- అనే ప్రశ్న కూడా మనకి తలెత్తితే సమాధానం మాత్రం దొరకదు. ఎందుకంటే మల్టీప్లెక్స్ సినిమా కథలింతే!

- సికిందర్