మన స్టైలిష్
మూవీ మేకింగ్ లో ఏం జరుగుతోందంటే, అలాటి ప్రాతినిధ్యమే మాయమై, పై కొటేషన్ లోని ...as
the director watches the scene unfold..పదాలు గల్లంతయిపోయి-seen unfold –అవడాన్ని
పట్టించుకోడు. దృష్టంతా ఆ scene చుట్టూ భౌతికపరమైన కెమెరా, లైటింగ్, ఆర్ట్ డైరెక్షన్ హంగుల పైనే వుంటుంది. ఇలా తీసి
స్టైలిష్ గా తీశామని చెప్పుకుంటారు.
‘నేనొక్కడినే’ స్క్రీన్
ప్లే చెప్పుకోవడానికైతే సార్వజనీన మూడంకాల (3-act) స్క్రీన్ ప్లే నే అయినా, నిర్వహణ
లో బాగా దెబ్బతింది. ప్రారంభించడమే ప్రధాన కథలో కెళ్ళి పోయి పాయింట్ ఎస్టాబ్లిష్
చేసేవరకూ సాగే మొదటి అంకం ముప్ఫై నిమిషాలే తీసుకోవడం అభినందించదగ్గదే. ఈ క్రింది
పటం చూడండి-
act -1, act-2,
act-3 అనే మూడంకాల స్క్రీన్ ప్లే నిర్మాణంలో కథేమిటో తెలియజేసే act-1 లోని సెటప్
ప్రకారం గౌతమ్ ఎవరు, అతడి సమస్యేమిటి, అతనేం చేయబోతున్నాడనేది చెప్పుకొచ్చారు. హాయిగా
అరగంటలో ముగించేసిన ఈ ప్లాట్ పాయింట్ -1 దగ్గర కథ మలుపు తిరిగి act-2లోకి ప్రవేశించాలి. ఆ మలుపు
ఏమిటంటే, మూడోసారి కూడా గౌతమ్ జరగని దాడిని ఊహించుకున్న సందర్భంలో, పోలీసుల హేళనకి గురై అసలు తానెవరో
తెలుసుకోవడానికి గోవా ప్రయాణం కట్టడం.
ఇక్కడ్నించీ act-2
లోకి ప్రవేశించిన కథా లోకంలో జరిగే
బిజినెస్ ఏమిటంటే, పాత్ర తన సమస్య తో లేదా ప్రత్యర్ధితో సంఘర్షించడం- దీన్నే confrontation
అంటారు. ఈ సంఘర్షణలో ఎదురు దెబ్బ లుంటాయి-ఎదురుదాడి చేయడం వుంటుంది. ఇంటర్వెల్ దగ్గర
కొచ్చేసరికి, సమస్య తీవ్రత పెరిగి మరింత ఇరకాటంలో పెడడమో, లేదా తిరుగులేని సవాలు
విసరడమో జరుగుతుంది. ఈ ప్రకారం గౌతమ్ తనని పీడిస్తున్న సమస్యకి కారకుడైన ఒక
విలన్ని ఇంటర్వెల్ దగ్గర కాల్చి చంపడం కూడా ఓకే.
విశ్రాంతి
తర్వాత act- 2 సెకండ్ పార్ట్ కొచ్చేసరికి కొత్తసమాచారంతో లండన్ వెళ్ళడం, తండ్రి
లాకర్ తెరచి ఒక ఫార్ములా స్వాధీనం చేసుకోవడం, ఆ ఫార్ములాకోసం మిగిలిన ప్రత్యర్ధులు
వెంటపడ్డంతో ప్రారంభమై ప్రధాన విలన్ (నాసర్)ని కనుగొనడంతో act-2 ముగుస్తుంది. ఇక
act -3 లో క్లైమాక్స్ ప్రారంభమౌతుంది...ఇక్కడ ప్రధాన విలన్ తో తన తల్లి దండ్రుల
గురించిన సమాచారంకోసం బేరసారాలు కుదరక అతన్ని చంపేయడంతో ముగుస్తుంది. ఇక
తల్లిదండ్రులు ఎవరనే అన్వేషణతో కొనసాగి శుభం కార్డు పడే వరకూ సుదీర్ఘంగా జరిగేదంతా
ఉపసంహారమే!
అదే అంకం అదే
బిజినెస్సూ!
సమస్య
ఎక్కడొచ్చిం దంటే, మొదటి అంకంలో గౌతమ్ మానసిక సమస్య చెప్పేసి పరిష్కారానికి గోవా దారి పట్టించాక, రెండో అంకంలో పదేపదే ఆ సమస్యనే ( చిత్తభ్రాంతులు
- hallucination) రిపీట్ చేసి, ఏ సంఘటన నిజమో ఏ సంఘటన అబద్ధమో తెలీని
కన్ప్యూజన్లో ఆడియెన్స్ ని పడేస్తూ- గౌతమ్ క్యారక్టర్ ని అపహాస్యం పాల్జేశారు.
రెండో అంకంలో జరగాల్సిన బిజినెస్ అది కాదు. ఇక్కడ జరగాల్సిన బిజినెస్ సమస్యతో
పోరాటం- రెండో అంకంలో గౌతమ్ గోల్ మొదటి అంకం ముగింపులో ఎష్టాబ్లిష్ చేసినట్టు-
తానెవరో, తన గతం ఏమిటో తెలుసుకునేందుకు జరపబోయే అన్వేషణ ! రెండో అంకంలో తను
సంఘర్షిస్తే ఈ గోల్ కోసం సంఘర్షించాలే తప్ప, ఇంకా తన మొదటి అంకంలో చెప్పేసిన తన మానసికసమస్యతో
కాదు. ఈ విధంగా కథ మీద ఫోకస్ కోల్పోయి, మొదటి అంకం బిజినెస్ ని రెండో అంకంలో కూడా
చొరబెట్టి దాన్నే క్లైమాక్స్ వరకూ లాగుతూ
పోవడం వల్ల, సువిశాలమైన రెండో అంకం ఏరియా అంతా కథన భంగం కలిగి గందరగోళం ఏర్పడింది. కథ బుర్ర
కెక్కడం కష్టసాధ్య మైపోయింది.
పోనీ ప్రధాన విలన్ తో క్లైమాక్స్ అయినా ఎందుకు బలంగా లేదంటే
- కారణం, మొదటి అంకం ముగింపులో గౌతమ్ సమస్యని
బలంగా ఎస్టా బ్లిష్ చేయకపోవడం వల్లే!
ఎప్పుడైతే మొదటి అంకం ముగింపులో సమస్యని (పాయింటుని) దృశ్య రూపంలో ప్రభావవంతంగా
ఎష్టాబ్లిష్ చేయ్యమో, అప్పుడు క్లైమాక్స్ కూడా బలహీనంగా, పేలవంగా వస్తుంది. మొదటి అంకం ముగింపులో గోవా ప్రయాణం
కట్టడానికి చిత్తభ్రాంతుల కారణమే చెప్పినా, అప్పుడు జరిగిన సంఘటన అంతకు మునుపు
జరిగిన వాటికి భిన్నంగా ఏమీ లేదు. మార్పేమీ లేదు. ఇంకేదో అఘాయిత్యం లాంటి బలమైన
సంఘటన జరిగి- చట్టానికి దొరక్కుండా పారిపోయే పరిస్థితి లాంటిది ఏర్పడితేనే బలమైన
మలుపు అన్పించు కుంటుంది. ఏ స్క్రీన్ ప్లే కైనా ప్లాట్ పాయింట్-1, ఇంటర్వెల్, ప్లాట్
పాయింట్-2 లు మూలస్తంభాల్లాంటివి. వీటిని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటే తప్ప కథకి
న్యాయం జరగదు.
ఈ లోపాలన్నీ టైం అండ్ టెన్షన్ థియరీని కూడా నాశనం చేశాయి. ఈ
క్రింది పటం కూడా చూడండి...
సినిమారీలు తిరిగే టైము గడుస్తున్న కొద్దీ కథలో టెన్షన్
పెంచుకుంటూ పోవాలి. అప్పుడే ప్రేక్షకులు సీట్లకి అతుక్కుపోతారు. ఆద్యంతం అన్ని
అంకాల్లో అదే మొదటి అంకం బిజినెస్సే నడుస్తూ కథనం మన్నుతిన్న పాములా పడుంటే ఇంకా టెన్షన్ అనే మాట ఎక్కడ్నుంచి వస్తుంది?
పైగా ఎడాపెడా మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో, చిన్ననాటి మాంటేజెస్
తో, జరుగుతున్న కథ ఫలానా ఈ ఈ విధంగా
జరిగిందంటూ ఎక్స్ పొజిషన్ లతో- వర్తమాన కథకి టెన్షన్ అనే కాన్సెప్ట్ లేకుండా
చేశారు. కథకుడికి కథమీద స్పష్టత లేనప్పుడే మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులకి పాల్పడతారని
స్క్రీన్ ప్లే పండితుల నిర్ధారణ. మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులవల్ల చెప్పాలనుకుంటున్న
అసలుకథ ఎక్కడేసిన గొంగళిలా పడుంటుంది.
పాత్ర చిత్రణ వైచిత్రి
మహేష్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన గౌతమ్ పాత్ర వాస్తవానికి
చేష్టలుడిగిన ప్యాసివ్ పాత్ర. అది గొప్ప హీరోయిజం తో కూడిన యాక్టివ్ పాత్ర
కావాలంటే, ఆ మూడంకాల్లో ఏ అంకం బిజినెస్ ఆ అంకంలో స్పష్టంగా జరగాలి. అప్పుడు
మానసిక సమస్య అనే మొదటి అంకపు అంతర్గత ఎమోషనల్ స్ట్రగుల్ పదేపదే కథకి అడ్డు
పడకుండా (పాత్ర ప్యాసివ్ గా అపహాస్యం గాకుండా) అసలు గోల్ కోసం పోరాడాల్సిన బహిర్గత
ఫిజికల్ స్ట్రగుల్ తో యాక్షన్ లో కొచ్చి, పరిస్థితిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ జైత్రయాత్ర
కొనసాగించే వీలుంటుంది. హీరోయిజం ఉట్టిపడుతుంది. ఎంతసేపూ ఊహాలోకంలో తనమీద దాడుల్ని
పదేపదే తిప్పికొట్టడం హీరోయిజం అన్పించుకోదు. అది యాక్టివ్ గా వుండడం కాదు,
రియాక్టివ్ గా నిస్సహాయంగా ఉండిపోవడం. జ్యూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ లో
ఇలాగే ఆ పాత్ర విలన్ జరిపే దాడుల్ని తిప్పి కొట్టడమే ( రియాక్టివ్ గా) నిగా
పెట్టుకుంటుంది తప్ప, ఆ విలన్ ని ట్రాప్ చేసి తనే దాడులు ప్రారంభించే ప్రారంభించే యాక్టివ్ పాత్రగా ఎప్పటికీ మారదు!
మహేష్ బాబు పాత్ర తన తల్లి దండ్రులు హత్యకి గురయారన్న బాధతో
చివరంటా ఎంతో ఎమోషన్ పండించాడని అనుకోవడం కూడా భావ్యం కాదు. అసలా తల్లిదండ్రులు ఎలా,
ఎందుకు చనిపోయారో ముందే చెప్పేసి వుంటే పాత్ర మీద నిజమైన సానుభూతి ఏర్పడే అవకాశం
వుండేది. ఆ తల్లి దండ్రులకీ, మహేష్ బాబు పాత్రకీ జరిగిన అన్యాయమేంటో మనకు
తెలియకపోతే ఎలా మనసులోతుల్లోంచి సానుభూతి ఫీలవుతాం?
అమీర్ ఖాన్ నటించిన
‘ధూమ్-3’ లో, మొదటి పది నిమిషాల్లో అతడి చిన్నప్పుడు బ్యాంకు వాళ్ళ దురుసుతనం వల్ల
సర్కస్ కంపెనీ మూతపడే పరిస్థితేర్పడి,
తండ్రి ఆత్మహత్య చేసుకోవడం కళ్ళారాచూసిన తను, ఆ బ్యాంకు మీద పగ దీర్చుకోవాలన్న దయనీయ
బ్యాక్ డ్రాప్ ఏర్పడి, ఆసాంతం ఎనలేని
సానుభూతి పొందుతూ వుంటాడు.
మహేష్ బాబు పాత్ర పేరెంట్స్ ఎందుకు హత్యకి గురయ్యారో
క్లైమాక్స్ వరకూ దాచిపెట్టడంవల్ల పాత్ర పడుతున్న బాధలకి అర్ధం లేకుండా పోయింది.
ఇంకా లాజిక్కొస్తే, తన పేరెంట్స్ ఐడెంటిటీ కోసం గోల్ తప్ప, దాని దారీ తెన్నూ తెలీని ఈ అడ్డగోలు ప్రయాణమంతా
ఎందుకు? ఒక పేరుపొందిన రాక్ సింగర్ గా తను
ఆనాటి పోలీస్ రికార్డులన్నీ పరిశీలించడానికి అవకాశం ఎప్పుడూ వుంటుంది. ఆ ఫైళ్ళతో తల్లి
దండ్రులెలా ఉంటారన్న జిజ్ఞాసతో బాటు, కేసు వివరాలన్నీ తెలిసిపోతాయి కదా? ఇంత సింపుల్ గా తేలిపోయే కథకి ఈ కన్ఫూజనంతా ఎందుకు?
ముగింపు- ఉపసంహారం విషయానికొస్తే- గతించిన తల్లిదండ్రుల
ఉనికిని కనుగొనడం, ఆ ఫోటోలు చూసుకుని దుఖించడం వంటి సుదీర్ఘ సన్నివేశాలన్నీ
ముగింపులో వచ్చి వుండకూడదు. విలన్ని చంపే ముందే వచ్చి వుంటే సింపతీ కోషేంట్ బాగా
వర్కౌటయ్యేది. ఈ ఎపిసోడ్లు తారుమారు చేయడంవల్ల కథ ముగిశాక కూడా ఈ బోరేమిటనే
ఫీలింగ్ ఏర్పడేది కాదు.
చివరగా- నిడివి ఇరవై నిమిషాలు కత్తిరించారని తాజా వార్త. ఇది
టాక్ వెళ్ళిపోయాక విజయావకాశాల్ని పెంచుతుందా? ఏమో!
-సికిందర్