రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, July 27, 2022

1185 : రైటర్స్ కార్నర్


 

    న దర్శకులు, రచయితలు సినిమా కళ గురించి ఎందుకు మాట్లాడరు? మాట్లాడితే, లేదా రాస్తే వర్ధమాన రచయితలు, దర్శకులు నేర్చుకునే అవకాశముంటుందిగా? ... ఇదీ ఇటీవల టాప్ దర్శకుడి దగ్గర పనిచేసే సీనియర్ రచయిత ఫోన్ సంభాషణలో వ్యక్తం చేసిన విచారం. దీనికి మన దగ్గర సమాధానమేముంటుంది? ఈ ప్రశ్న మనకి ఎప్పట్నుంచో వుంది. సినిమాలు విడుదలైనప్పుడు ఆ సినిమాల రైటింగ్, మేకింగ్ ల గురించి అడిగి తెలుసుకుని ఈ బ్లాగులో నలుగురికి అందుబాటులో వుంచుదామని గతంలో ఓ ముగ్గురు దర్శకుల్ని ప్రయత్నిస్తే అవకాశమివ్వలేదు. విషయ పరిజ్ఞానం లేకనో మరెందుకనో తెలీదు.

      కేవలం పరుచూరి గోపాల కృష్ణ గారొక్కరే సినిమా కళ మీద యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతున్నారు. రైటింగ్, మేకింగ్ లకి సంబంధించి సమాచార వినిమయ లేమి టాలీవుడ్ లో చాలా వుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కొన్నేళ్ళ క్రితం ఈ బ్లాగులో రైటర్స్ కార్నర్ అనే శీర్షిక ప్రారంభించాం. ఆ రైటర్స్ ఎవరు? మనం ఎవర్ని అడిగి ఇక్కడ తెలుసుకుంటాం? టాలీవుడ్ లో ఈ అవకాశం లేదు కాబట్టి హాలీవుడ్, బాలీవుడ్ బాట పట్టాం. అక్కడైతే ఎందరో కొత్తా పాతా రచయితలు తమ క్రాఫ్ట్ గురించి, అనుభవాల గురించీ విరివిగా ఇంటర్వ్యూ లిస్తూంటారు. వాటిని అనువదించి బ్లాగులో ఇవ్వడం ప్రారంభించాం.

ఈ మధ్య కాలంలో ఈ శీర్షికకి అంతరాయాలు కలిగాయి. పైన చెప్పిన సీనియర్ రచయిత మాటలతో మన బద్ధకం కూడా వదిలి, ఈ శీర్షికని ఈవారం నుంచి కొనసాగిస్తున్నాం. ముందుగా బాలీవుడ్ రచయిత రోహన్ శంకర్ తన క్రాఫ్ట్ గురించి ఏమంటున్నాడో చూద్దాం...

        లుకా ఛుప్పీ’, సూరజ్ పే మంగళ్ భారీ’, మిమీ’, హెల్మెట్ వంటి సినిమాల బాలీవుడ్ వర్ధమాన చయిత  రోహన్ శంకర్‌ (37), 2016 లో లాల్ బాగ్చీ రాణీ అనే మరాఠీ సినిమాతో రచయితగా పరిచయమయ్యారు. 2019 లో లుకా ఛుప్పీ (బడ్జెట్ 34 కోట్లు, బాక్సాఫీసు 128 కోట్లు) నుంచి హిందీ సినిమాల రచయితగా స్థాయి పెంచుకున్నారు. దీని తర్వాత వెంట వెంటనే సూరజ్ పే మంగళ్ భారీ (2020), మిమీ (2021), “హెల్మెట్ (2021) వంటి కథా బలమున్న సినిమాలకి స్క్రిప్టు లందించారు. ఈ సందర్భంగా ఆయన తన రచనా విధానం గురించి, అనుభవాల గురించీ ఏమంటున్నారో చూద్దాం. రోహన్ శంకర్ శైలి విషాదాన్ని విషాద కథలుగా గాకుండా వినోదాత్మకంగా చెప్పడం. నిషిద్ధ అంశాల్ని వ్యంగ్యంగా చెప్పి ఎంటర్ టైన్ చేయడం...  

మీ  మిమీ రచనా  ప్రక్రియ గురించి చెప్పండి?

మడాక్ ఫిలిమ్స్ నిర్మాత  మాలా ఆయ్ వాచ్చీ (నేను తల్లినవుతా) అనే మరాఠీ సినిమా హక్కులు తీసుకుని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌ని సంప్రదించారు. దాని హిందీ రీమేక్ చేయమని అడిగారు. నేను జాయినయ్యాను. ఆ మరాఠీ సినిమా నిజ జీవిత కేసు ఆధారంగా నిర్మించారు. హిందీలో ఎక్కువమంది ప్రేక్షకులకి రీచ్ అవ్వాలని మేము నిర్ణయించాం. ఒరిజినల్లోని థీమ్ ని, భావోద్వేగాలని యధాతధంగా తీసుకుని మా సొంత కథని, పాత్రల్ని సృష్టించాం. 2019 మార్చి లో రాయడం ప్రారంభించి  3-4 నెలల్లో మొదటి డ్రాఫ్ట్ ని సిద్ధం చేశాం. దాంతో నటీనటుల ఎంపిక పూర్తి చేశాం.

ఈ కథ చాలా చాలెంజింగ్ గా ఉన్నందున దీన్ని నా కష్టతరమైన స్క్రిప్టుగా భావిస్తాను. ఈ కథ సరోగసీ (అద్దె గర్భం) గురించి. మాతృత్వపు భావోద్వేగం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిజానికిది మరాఠీలో నిజంగా జరిగిన కేసు ఆధారంగా తీశారు.

మీరు రైటర్స్ బ్లాక్‌ నెదుర్కొంటారా ? దాన్నెలా టాకిల్ చేస్తారు?
సాధారణంగా జరిగేదేమిటంటే, క్కోసారి రచయిత తన నుంచి తనే ఎక్కువ ఆశిస్తాడు. ఎంతో బాధ్యతాయుతంగా కథ చెప్పాలనుకుంటాడు. మిమీ ని రాసేటప్పుడు, నేను కొన్ని విషయాలు ఛేదించలేకపోయాను. ఉదాహరణకు, మిమీ తన గర్భస్థ శిశువు గురించి తల్లిదండ్రులకి వివరించడానికి ప్రయత్నించే సన్నివేశం ఎలా రాసినా నాకు సంతృప్తి నివ్వలేదు.

8 రోజులు గోవా వెళ్లిపోయాను. అక్కడ రిసార్ట్స్ లో గది తీసుకుని నన్ను నేను బంధించేసుకున్నాను. ఆ సన్నివేశం మీద తీవ్ర కసరత్తు చేశాను. ఎన్నోసార్లు తిరగ రాశాను. మనకి అనేక ఆలోచనలు వస్తూంటాయి. కానీ ఏ మార్గంలో ముందుకు వెళ్ళాలో తెలుసుకోలేక పోతాం. మన చేతిలో కథ లేదని కాదు, ఆ కథని ఎలా చెప్పాలన్నదే తీవ్రంగా వేధించే సమస్య. దీనికి కొంత సమయం పడుతుంది. అయితే మీరు చెప్పే రైటర్స్ బ్లాక్ ని నేనెదుర్కోలేదు. రైటర్స్ బ్లాక్ వల్ల మనం ఆగిపోతాం. నేనలా ఆగను. రాస్తూనే వుంటా మెరుగు పర్చుకుంటూ.

మిమీ లో సరోగసీపై వాస్తవాలని తప్పుగా చూపించారని, మన దేశంలోని సరోగసీ చట్టాల్ని విస్మరించించారనీ ఒక నిర్దిష్ట వర్గం నుంచి విమర్శ వచ్చింది. దీనికి మీరేమంటారు?
మన దేశంలో కమర్షియల్ సరోగసీని నిషేధిస్తూ 2015 లో బిల్లు ఆమోదించారు. మేము సినిమాలో తప్పుగా ఏమీ చూపించలేదు. మా సినిమా కథా కాలం 2013. ఇది సరోగసీ బిల్లు ఆమోదించడానికి చాలా ముందు. ప్రారంభ సన్నివేశంలో సరోగసీ క్లినిక్‌ని చూపించాం. అక్కడ 10-15 మంది సరోగేట్‌లని ఒకే పైకప్పు క్రింద వుంచాం. కాబట్టి  2015 కి ముందు అక్షరాలా సరోగసీ కర్మాగారాలువుండేవన్నది స్పష్టం చేశాం. మీరు గూగుల్‌లో వెతికితే, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో సామూహిక సరోగేట్‌ కేంద్రాలని చూపించే అనేక వీడియోలు మీకు కనిపిస్తాయి. విదేశీయులు ఈ సరోగసీ కర్మాగారాల్ని సందర్శించేవారు. అక్కడ తమ బిడ్డని కనడానికి  తగిన యువతిని ఎంచుకునేవారు. ఈ యువతులు  9 నెలలు అక్కడే వుండి, బిడ్డని ప్రసవించి, 2 నెలలు విశ్రాంతి తీసుకుని, ళ్ళీ  బిడ్డని కనేవారు. ఇలా వారి సంపాదన వుండేది. మిమీ మొదటి సన్నివేశంలో మేము సరిగ్గా అదే చూపించాం.

మరాఠీ సినిమా నిర్మాత ఒక న్యాయవాది. మీరు గూగుల్ చేస్తేఈ యువ సరోగేట్స్ ని విదేశీ జంటలు ఎలా దుర్వినియోగం చేశారో మీకు చాలా సంఘటనలు కనిపిస్తాయి. కాబట్టిమేము ఏదైనా తప్పుగా చూపించామని నేననుకోను. జైపూర్‌లోని ఓ ఐవీఎఫ్ క్లినిక్‌లో వైద్యుల సలహాతో సన్నివేశాలని చిత్రీకరించాం. సినిమా క్రెడిట్స్ లో ఆ డాక్టర్లకి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిపాం.మిమీ లో మేము చూపించింది మరాఠీలో చూపించిన నిజమైన కేసు ఆధారంగా రూపొందించిందే. డౌన్ సిండ్రోమ్ పరీక్ష గర్భం దాల్చిన 4 లేదా 5వ నెలలో చేస్తారని, దానిని 8వ నెలలో చేసినట్టు చూపించామని ఎవరో అభ్యంతరం తెలిపారు. ఇది పూర్తిగా అవాస్తవం. సినిమా చూస్తే 5వ నెలలోనే పరీక్ష జరిపిట్టు తెలుస్తుంది. తర్వాత 7వ నెలలో శ్రీమంతం చూపించాం. కాబట్టి  లాంటి ఆరోపణలు చేసే ముందు కథలో టైమ్‌లైన్‌ని చూడాలి. ఒక జంట ఇంత వేగంగా బిడ్డని ఎలా దత్తత తీసుకుంటారని కూడా మరొకరన్నారు. డైలాగులు వింటే, మేం దత్తత తీసుకున్నాం’ అని కాకుండా బిడ్డని దత్తత తీసుకోబోతున్నాం అని వుంటుంది.

నిపుణులతో చర్చించే సినిమా పూర్తి చేశాం. అయినా దుష్ప్రచారం చేస్తే ఏమీ చేయలేం. ఎలాంటి తప్పుడు సమాచారం లేకుండా వాస్తవాల్ని చూపించడానికి మేము మా వంతు ప్రయత్నం చేశాం. సినిమా చూసి, గూగుల్‌లో నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బావుంటుంది.

లుకా ఛుప్పీ (దాగుడు మూతలు) లో  లివ్-ఇన్ రిలేషన్స్‌పై కథ చేశారు. మిమీ సరోగసీ గురించి తీశారు. మీ స్క్రిప్టులు ఇలాటి నిషిద్ధ అంశాలని టచ్ చేస్తున్నాయి.  ఇలాంటి కథలు రాసేటప్పుడు మీరు ఏ విషయాలని దృష్టిలో వుంచుకుంటారు?


ముందుగా, ప్రేక్షకులు ఎలాంటి జోక్ లేదా హాస్యాన్ని ఆమోదిస్తారో తెలుసుకోవాలి. వ్యంగ్యంగా కథలు చెప్పడాన్ని నేను విశ్వసిస్తాను. వ్యంగ్యంలో చాలా సన్నని విభజన రేఖ వుంటుంది. అది దాటితే అభ్యంతరకరంగా మారుతుంది. నా ప్రధాన దృష్టి జోక్స్ పై కాదు, కథపైనే. అంతే, నేను నా పాత్రల్ని జాగ్రత్తగా రూపొందించుకుంటాను. పాత్రల మతం, సంస్కృతి, ఆర్థిక నేపథ్యం మొదలైనవాటిని దృష్టిలో వుంచుకుని తీర్చిదిద్దుతాను.

మన దేశంలో అనేక రకాల సంస్కృతులున్నాయి. వాటిలో రెండింటిని మిక్స్ చేస్తే, చాలా మంచి వ్యంగ్యం పుడుతుంది. దాన్ని కథలోకి తీసుకురాగలిగితే మనోహరంగా వుంటుంది. శ్రద్ధ వహించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఎవరినీ కించపరచకూడదు. ప్రేక్షకుల కోసం సినిమా చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మనోభావాలని దెబ్బతీయకూడదు. అవసరం కూడా లేదు. కథతో జనం రిలేట్ అవ్వాలి. నేను వ్యంగ్యానికి పెద్ద అభిమానిని, అందుకే నా కథల్ని  కూడా అలానే రాస్తున్నాను.

మీరు రాయడంలో ఆకర్షణీయంగా భావించే ఒక విషయం ఏమిటి?
కథాసృష్టి మనోహరమైనది. పాత్రల్ని సృష్టించి, కథ రాస్తునప్పుడు, మున్ముందు కథలో ఏం జరుగుతుందో కూడా మనకి తెలీదు. ఆ పాత్రల్లాగా ఆలోచించడం మొదలెడతాం. కొన్నిసార్లు మన ఉపచేతన మనస్సు (సబ్ కాన్షస్ మైండ్) లో దాగి వున్నది మన తలపుకొస్తుంది. దీంతో మనల్ని మనం తరచి చూసుకుంటాం, మన వ్యక్తిత్వాన్ని కూడా చక్కదిద్దుకుంటాం.

చిన్న పట్టణాల్లోని మధ్యతరగతి పాత్రలతో వ్యంగ్య రచనలు చేయడం నాకు ఇష్టం. వాళ్ళ జీవితాల్లో చాలా సంక్లిష్టతలుంటాయి. అయినా వాళ్ళ  ముఖాలపై చిరునవ్వుల్ని మెరిపిస్తారు. కాబట్టి, నేను వ్రాసే ప్రక్రియ మొత్తాన్నీ కలిపి ఆనందిస్తాను.

దర్శకుడు స్క్రిప్టులో ఏదైనా మార్చాలనుకుంటే ఏం చేస్తారు? ఆలోచనల వైరుధ్యాన్ని మీరెలా ఎదుర్కొంటారు?

దర్శకుడూ రచయితా భార్యాభర్తల్లాంటి వాళ్ళు. నేను ఏదైనా రాసేటప్పుడు దర్శకుడి అనుమతి తీసుకుంటాను. ఆలోచనల్లో వైరుధ్యముంటే, ఎందుకలా మార్చి రాయాలో చెప్పి దర్శకుడే నన్ను ఒప్పిస్తాడు. నేననుకున్న ఆలోచనలుంటే నేను దర్శకుడ్ని ఒప్పించుకోగల్ను. వాదనలుంటాయి. తేలాల్సింది ఎవరి ఆలోచన మెరుగైనదోనన్నదే. సినిమా రచన అనేది బహిరంగ ప్రజాస్వామ్య ప్రక్రియ. సత్ఫలితాలు సాధించడానికి రచయిత, దర్శకుడు కలిసి పయనించాలి. ఇందులో మన ఇగోకి మనం ఆధిపత్యాన్నివ్వలేం. మన దృష్టి అంతా కూడానూ అత్యుత్తమ ప్రొడక్టుని సృష్టించడం మీదే  వుండాలి. కాబట్టి, దర్శకుడు ఏదైనా బెటర్ మెంట్ సూచిస్తే నేను అహంభావానికి చోటివ్వ కూడదు. నటీనటుల విషయంలోనూ ఇంతే. సినిమా చేస్తున్నప్పుడు, నటుడు మంచి డైలాగుతో వస్తే, మనం దాన్ని స్వీకరించాలి.

కథల ధోరణిని మార్చెయ్యడం గురించి, మంచి రచయితల అవసరం గురించీ మీరేమంటారు?
ఐదేళ్ళ క్రితం సినిమాలు తీసేవారు కాదు, సినిమాల స్థానంలో ప్రాజెక్టులు చేపట్టడమనే కొత్త మాట ఉనికిలో కొచ్చింది. దీనికి క్రియేటివిటీతో పెద్దగా పనుండదు. అంతా యాంత్రికమే.  ఈ ప్రాజెక్టుల్లో స్టార్సే కావాలి. స్టార్స్ ని ముందు బుక్ చేసుకుని, ఆ స్టార్ మూడ్ ని బట్టి,  ముందు విడుదలైన మూవీని బట్టీ కథని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు. అంతేగానీ మా దగ్గర మంచి కథ వుంది, దీనికి తగ్గ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటామనే ధోరణి లేదు.

ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ కమర్షియల్ హీరో అయ్యాక మంచి కాలం వచ్చింది. 2017 తర్వాత, ప్రతి ఒక్కరూ మంచి స్క్రిప్టు కోసం ప్రయత్నించ నారంభించారు. ప్రాజెక్టులు కాక సినిమాలు తీయడం మొదలెట్టారు. సినిమాలకి కథే పెద్ద హీరో అయిపోయింది. కొంతమంది బిజీ స్టార్ల వెనుక పరుగెత్తే బదులు మంచి ప్రతిభావంతులైన నటుల్ని లీడ్‌లుగా పెట్టడానికి నిర్మాతలు ముందుకొచ్చారు.

ఇంతకి ముందు సినిమా అనేది ఫార్ములా ఫిల్మ్ మేకింగ్ గా వుండేది. ఏది అమ్ముడవుతోందో అందరూ దాన్నే తీసి అమ్మడం మొదలెట్టారు. అంటే ఆరోజుల్లో సినిమాలోని రెండు పాటలు హిట్టయితే ఆటోమేటిక్‌గా సినిమా హిట్టవుతుందని అనుకునేవారు. ఆ రోజుల్లో కొత్త రచయితల్ని, దర్శకుల్ని నిర్మాతలు నమ్మేవారు కాదు. కొత్త వాళ్ళు  చెప్పడానికి కొత్త యాంగిల్ ని, కొత్త కథల్నీ తెస్తారు కానీ దురదృష్టవశాత్తూ వాళ్ళని ఆదరించ లేదు. నిజం చెప్పాలంటే, ఎవరూ రచయితల్ని కోరుకోలేదు, కేవలం స్టార్స్ ని కోరుకున్నారు. ఇప్పుడు అది మారిపోయింది. ఇప్పుడు కథే స్టార్.

మీ ప్రయాణం సుదీర్ఘమైనది. అనేక ఎదురుదెబ్బలు తిన్నారు. మీ చేదు అనుభవాలు ఏ ఔత్సాహిక రచయితకైనా స్ఫూర్తిదాయకమే తప్ప మరొకటి కాదు. మీ సుదీర్ఘ ప్రయాణం గురించి చెప్పండి.

నా స్క్రిప్ట్స్ ని ఇష్టపడి, నిజంగా నాకు చేయూత నిచ్చే వ్యక్తుల్ని చేరుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. నేను చాలా మందికి లుకా ఛుప్పీ ఇచ్చాను. వాళ్ళందరూ మెచ్చుకున్నారు కానీ తీయడానికి ముందుకు రాలేదు. అనుకోకుండా నేను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌ని కలిసే వరకూ యాతనలు పడుతూనే వున్నాను, ఆర్ధికంగా కూడా. రచయితగా నా మొదటి సినిమా మరాఠీ లాల్‌బాగ్చి రాణి. నేను మహారాష్ట్ర వాడ్నే. అది ముంబయిలో తప్పిపోయిన మానసిక వికలాంగ అమ్మాయికి సంబంధించిన కథ కావడంతో రాయడం చాలా కష్టమైన సబ్జెక్ట్. సమాచారాన్వేషణకి నాకు కొంత సమయం పట్టింది. నేను వికలాంగ పిల్లల కోసం చాలా పాఠశాలల్ని కూడా సందర్శించాను. ఆ పిల్లల అవసరాల్ని, ఆలోచనా విధానాన్నీ నేను అర్థం చేసుకోవాలి. ఇది సెన్సిబుల్ సబ్జెక్ట్. రెగ్యులర్ రోమాంటిక్ డ్రామా కంటే భిన్నమైనది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదట్లో లక్ష్మణ్ ఉటేకర్ లుకా ఛుప్పీ ని తిరస్కరించాడు, ఎందుకంటే అతను ఉత్తర-భారత దేశాన్ని అర్థం చేసుకోలేనందున స్క్రిప్ట్ కి  న్యాయం చేయలేనని భావించాడు. నేను వేరే వ్యక్తుల దగ్గర ప్రయత్నించినా అదృష్టం లేకపోవడంతో, 2016 చివరిలో లక్ష్మణ్ సర్‌కి మళ్లీ లుకా ఛుప్పీ చెప్పాను. ఈసారి ఒప్పుకున్నాడు. మేము ముందుగా ఉత్తర భారతదేశాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నాం. మధుర, గ్వాలియర్, బృందావన్, ఆగ్రా వెళ్ళాం. మేము ఫైనల్ డ్రాఫ్ట్ రాయడం పూర్తి చేసిన తర్వాత, మాడాక్ ఫిల్మ్స్ ని  సంప్రదించాం. ఆయన స్క్రిప్ట్ ని ఇష్టపడి వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించాడు.

—ఏజెన్సీస్

‘లుకా ఛుప్పీ’ స్క్రీన్ ప్లే సంగతులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Tuesday, July 26, 2022

1184 : రివ్యూ!

 

 రచన- దర్శకత్వం : రజత్ కపూర్

తారాగణం : రజత్ కపూర్ (ద్విపాత్రాభినయం), మల్లికా షెరావత్, రణవీర్ షోరే, మనూ రిషీ చద్దా, చంద్రచూడ్ రాయ్, కుబ్రా సెయిట్, , అభిషేక్ శర్మ తదితరులు
సంగీతం : సాగర్ దేశాయ్, ఛాయాగ్రహణం : రఫీ మహమూద్
బ్యానర్స్ : ఎన్ ఫ్లిక్స్ ప్రై.లి; ప్రియాంశీ ఫిలిమ్స్, మిథ్య టాకీస్
నిర్మాత : రజత్  కపూర్
విడుదల : జులై 22, 2022
నిడివి :  95 ని.
***
        ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత రజత్ కపూర్ కి కూడా సినిమా తీయాలంటే క్రౌడ్ ఫండింగ్ తప్పలేదు. వందలాది మంది విరాళాలిచ్చి ఈ సినిమా నిర్మాణానికి తోడ్పడ్డారు. క్రౌడ్ ఫండింగ్ తో తీసే సినిమాలు తక్కువే. ఇండిపెండెంట్ సినిమాల పేరుతో తీసే ఇవి దాదాపు అడ్రసులేకుండా పోయినవే. ప్రస్తుత సినిమాలో ఒక డైలాగు వుంటుంది- ఇండిపెండెంట్ సినిమాల పేరుతో చెత్త సినిమాలు చూడడానికి ప్రేక్షకులు అలవాటు పడ్డారని. రజత్ కపూర్ అలాటి ఇంకో చెత్త కాకుండా, క్రౌడ్ ఫండింగ్ తో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ RK / RKAY ని ఒక కళాఖండంలా తీసి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రశంసలందుకున్నాడు. అమెరికాలో ఇది గత సంవత్సరమే విడుదలైంది. దీనితో కలిపి 12 సమాంతర సినిమాల దర్శకుడైన రజత్, ఇప్పుడు అపూర్వంగా చేసిన ప్రయోగమేమిటి? 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మెటా కామెడీ ఈ వారాంతం మూడు రోజులూ 5.75 కోట్లు వసూలు చేసింది. ఇందులో నిన్నఆదివారం 3 కోట్లు వసూలు చేసింది. సామాన్య ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయగల విషయం ఏమిటిందులో కొత్తగా వుంది? వివరాల్లోకి వెళ్దాం...

కథ

    ఆర్కే (రజత్ కపూర్) సినిమా దర్శకుడు. భార్యా ఇద్దరు పిల్లలు. 1960 లనాటి సినిమాలకి నీరాజనంగా సినిమా తీయాలనుకుంటాడు. తానే హీరో పాత్ర. హీరోయిన్ పాత్రకి బిజీ నటి నేహా (మల్లికా షెరావత్) ని ఒప్పిస్తాడు. నిర్మాతగా బిల్డర్ గోయెల్ సాబ్ (మనూ రిషీ చద్ధా) కి బడ్జెట్ ఇస్తాడు. షూటింగ్ ప్రారంభమవుతుంది. 1960 లనాటి ఈ కథలో గులాబో పాత్రని ఎంతో ఇష్టపడ్డ నేహా ఆనాటి హీరోయిన్ లా ముద్దులొలుకుతూ నటిస్తుంది. ఆమె ప్రేమికుడు మహెబూబ్ గా దర్శకుడు ఆర్కే క్లాస్ గా నటిస్తాడు. మహెబూబ్ - గులాబో మహోజ్వల ప్రేమ కథలో దృశ్య కావ్యంలా కీలక సన్నివేశం -నా గుండె ఎందుకు అదురుతోంది?’ అంటుంది. నీ ఎదుట నేనున్నందుకు అంటాడు. ఈ క్లాసిక్ సన్నివేశం నటించడానికి చాలా టేకులు తీసుకుంటుంది. యూనిట్ కి పిచ్చెత్తుతుంది. తర్వాత ఇద్దరూ బాస చేసుకునే ఇంకో భావోద్వేగ సన్నివేశం - రాత్రి పదిన్నరకి బాంద్రా స్టేషన్లో కలుసుకుని కలకత్తా వెళ్ళిపోవాలని.

        ఇలా షూటింగ్ సాగుతూ సాగుతూ క్లయిమాక్స్ ముందు సీను వస్తుంది. చెట్ల మధ్య మహెబూబ్ కీ, విలన్ కె ఎన్ సింగ్ (రణవీర్ షోరే) కీ యాక్షన్ సీను. ఈ సీనులో కె ఎన్ సింగ్ కి చెందిన ఐదు లక్షలతో మహెబూబ్ పారిపోతాడు. ఇక ముగింపు సీన్లే మిగిలుంటాయి. ముగింపులో కె ఎన్ సింగ్, మహెబూబ్ ని కాల్చి చంపి ఐదు లక్షలు సొంతం చేసుకునే సీను. ఇలా ముగింపు దృశ్యాలు మిగిలి వుండగా, అంతవరకూ వచ్చిన డిజిటల్ ఫైల్స్ ని ఎడిటర్ ఎడిటింగ్ చేస్తూ కంగారు పడతాడు. సినిమాలో ఎక్కడా మహెబూబ్ కన్పించడు. తీసిన సినిమాలోంచి మహెబూబ్ క్యారక్టర్ పారిపోయాడని ఆర్కేకి కాల్ చేసి చెప్తాడు.

        ఆర్కేకి పిచ్చెత్తుతుంది. తీసిన సినిమాలోంచి క్యారక్టర్ పారిపోవడమేమిటి? షూట్ చేసిన సీన్లలో ఎక్కడా లేకుండా ఎలా పోతాడు? ఇప్పుడేం చేయాలి? ముంబాయిలో వెతకడం మొదలెడతారు. పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇస్తారు... ఇంతకీ ఏమయ్యాడు మహెబూబ్? ఎందుకు సినిమా సీన్లలోంచి పారిపోయాడు? ఇప్పుడెలా పట్టుకోవాలి? పట్టుకుని సినిమా పూర్తి చేసి అక్టోబర్ 15 కల్లా ఎలా విడుదల చేయాలి?...

ఎలా వుంది కథ

    ఐడియా చూస్తేనే నవ్వొచ్చే విషయం. మెటా మూవీ జానర్ కథ. దేశీయ తెరమీద తొలి ప్రయత్నం. మెటా అంటే వున్న స్థితిని దాటడం. కథలోని పాత్ర, ఆ కథని దాటి నిజ ప్రపంచంలో విహరించడం. కొంచెం తేడాతో ఫోర్త్ వాల్ టెక్నిక్ అని కూడా వుంటుంది. హిందీలో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ (2019), ఘూమ్ కేతు (2020) సినిమాల్లో ఇది చూశాం. అంటే సినిమాలోని పాత్ర ప్రేక్షకుల వైపు చూస్తూ కథ గురించి, పాత్రల గురించీ కామెంట్లు చేయడం. ఇది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ లో ప్రధానమంత్రి సలహాదారు అక్షయ్ ఖాన్నాతో బాగా వర్కౌటయ్యింది. కానీ ఘూమ్ కేతు లో రచయిత పాత్ర నవాజుద్దీన్ సిద్ధిఖీతో విఫలమయింది.

        ప్రస్తుత సినిమాలో సినిమాలోని పాత్రలు సినిమాలోంచి తప్పించుకుని నిజ ప్రపంచంలో పడ్డం మెటా మూవీ జానర్ కిందికొస్తుంది. ఈ ప్రయోగం 1985 లోనే హాలీవుడ్ లో వుడీ అలెన్ చేశాడు. ది పర్పుల్ రోజ్ ఆఫ్ కైరో అని అప్పట్లో తీసిన మెటా మూవీలో ప్రేమ కథ. మియా ఫారో నటించిన ఈ 82 నిమిషాల ముక్కోణ ప్రేమ కథ పదిహేను లక్షల డాలర్ల బడ్జెట్, కోటిన్నర డాలర్ల బాక్సాఫీసు.

        ఇందులో ఇంట్లో భర్తతో సమస్యలొచ్చి మనశ్శాంతి కోసం సినిమాల కలవాటు పడుతుంది మియా. ఒక సినిమా నచ్చి పదే పదే చూస్తుంది. తనని చూడడానికి ఇన్నిసార్లు  సినిమాకొస్తున్న మియా మీద ప్రేమ పుట్టి వెండితెర లోంచి ఆమె దగ్గరి కొచ్చేస్తాడు హీరో జెఫ్ డేనియెల్స్. ఇక ఇద్దరూ షికార్లు తిరగడం మొదలెడతారు. వీళ్ళ ప్రేమాయణం మధ్యకి మియా భర్త రావడంతో సంక్షోభం మొదలవుతుంది.

        2021 లో అక్షయ్ కుమార్ -సారా అలీఖాన్ -ధనుష్ నటించిన అట్రంగీరే లో సారా ఓ కథలోని మెజీషియన్ పాత్ర (అక్షయ్ కుమార్) నిజంగానే వున్నాడనుకుని ప్రేమిస్తుంది.  ఓ రోజు గుర్రం మీద వచ్చేస్తుంది మెజీషియన్ పాత్ర. ఇది మెటా మూవీ కాదు, సారా కల్పించుకున్న ఫాంటసీ.

        వుడీ అలెన్ తీసిన సినిమా మెటా జానర్లో రోమాంటిక్ కామెడీ. రజత్ సినిమా అబ్సర్డ్ (అసంబద్ధ) కామెడీ. నాన్సెన్స్ హ్యూమర్ అని కూడా అనొచ్చు. మైండ్ లెస్ కామెడీకంటే ఒక మెట్టు పైనుండే క్రియేటివిటీ. ఈ సృజనాత్మకతని రజత్ అనితరసాధ్యంగా సాధించాడు. తెలుగులో బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించాలంటే అనునిత్యం కొత్త జానర్లతో కథల కోసం రీసెర్చి చేయాల్సిందే- అప్డేట్ అవ్వాల్సిందే. రీసెర్చి లేకుండా రాయడానికి/తీయడానికి గడ్డిపోచ కూడా దొరకదు, మెదడులో వుండే చెత్త తప్ప.

    రజత్ కపూర్ మెటా మూవీ, దర్శకుడికీ- దర్శకుడు సృష్టించిన పాత్రకీ మధ్య సంఘర్షణ. దర్శకుడు తీస్తున్న సినిమా ముగింపులో చావడం ఇష్టం లేని హీరో క్యారక్టర్ మహెబూబ్, తీసిన సినిమాలోంచి పారిపోయి వచ్చి దర్శకుడితో తగువు పెట్టుకుంటాడు. తిరిగి ఇతడ్ని తీసిన సినిమాలోకి ఎలా పంపించాలన్నది దర్శకుడి సమస్య. తీసిన సినిమాలోంచి ఐదు లక్షలతో పారిపోయిన మహెబూబ్ క్యారక్టర్ ని పట్టుకోవడానికి, విలన్ క్యారక్టర్ కె ఎన్ సింగ్ కూడా తీసిన సినిమాలోంచి బయటపడి నిజ ప్రపంచంలో అలజడి సృష్టిస్తాడు. ఇలా తీసిన సినిమాలోంచి హీరో, విలన్ ఇద్దరూ పారిపోయేసరికి ఏం చేయాలో దిక్కు తోచదు ఎడిటర్ కి. తీసిన సినిమాలోంచి విలన్ కూడా పారిపోయాడని ఇంకో పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. ఇలాటి సినిమాలెందుకు తీస్తారయ్యా, ప్రేమ సినిమాలు తీసుకోక? - అంటాడు పోలీసు అధికారి. ఇక విలన్ పాత్రనీ పట్టుకోవడానికి పోలీసు బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. పిచ్చ నవ్వు పుట్టడానికి ఇంతకంటే పిచ్చి కామెడీ లేదు.

        పూర్తి స్థాయి కొత్త తరహా హాస్య కథ ఇది. నవ్వి నవ్వి బయటికొస్తాం. ఈ కథ ఐడియా, దీని పాలనా అనిర్వచనీయమన్న మాట. కల్పన- వాస్తవం రెండిటి కలబోత.దృశ్యకావ్యంలా తీస్తున్నామని దీన్ని ఫిలాసఫికల్ గా మార్చలేదు. దర్శకుడికీ పాత్రకీ మధ్య నడిచే దృశ్యాల్లో ఒకటి రెండు సందర్భాల్లో సృష్టికర్తకీ, ప్రాణికీ మధ్య వుండే సంబంధంతో సంఘర్షణని పైపైన టచ్ చేసి వదిలేస్తాడు- ఈ గంభీర విషయాలనే థీమ్ గా చేయలేదు - నీకు రాసిపెట్టివున్న దానికంటే ఎక్కువ, దాని కాలానికంటే ముందు, నీ కేదీ దక్కదు (దర్శకుడు), నా నొసటి రాత నేను మార్చి పారేస్తా (పాత్ర), సృష్టికి ముందూ తర్వాతా ప్రేమ తప్ప మరేదీ లేదు  (దర్శకుడు)- లాంటి గంభీర చర్చని నామమాత్రం చేశాడు. ప్రొఫెషనల్ సమస్యనే ప్రధానంగా చేసి బాక్సాఫీసు ఫ్రెండ్లీ కథనం నడిపాడు.

     నువ్వు నిజం కాదు, నేను రాశాను కాబట్టే పాత్రగా నువ్వున్నావ్ అంటాడు దర్శకుడు. అక్కడే నువ్వు తప్పులో కాలేశావ్ ఆర్కే సాబ్. నీకు నీ రాత మీద నమ్మకం లేదు గాబట్టే పాత్ర చనిపోవాలనుకుంటున్నావ్ అంటుంది మహెబూబ్ పాత్ర, నేను నిజం కాదని నన్నెందుకు మాటిమాటికీ కించపరుస్తావ్? నీకు నువ్వు మాత్రం నిజం అని ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్?’ అని రెట్టిస్తుంది పాత్ర. ఆర్కే కంట్రోల్లో వుండడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మహెబూబ్ పాత్ర. కథ మీద అదుపు ఎవరికుండాలి- పాత్రకా? రచయితకా? కథ పాత్రదా? రచయితదా?

        తెలుగు సినిమాలకి చాలా అవసరమైన పాయింటు ఇది. గత ఇరవై ఏళ్ళుగా పాత్ర కథని పాత్ర నడుపుకో నివ్వకుండా, జోక్యం చేసుకుని, పాసివ్ పాత్రగా మార్చేస్తూ తాము కథ నడిపి - 90% అట్టర్ ఫ్లాపులు తీస్తున్న కొత్త తరం మేకర్లు ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన విషయమిది. ఇరవయ్యేళ్ళకి పూర్వం సీనియర్ రచయితలతో, దర్శకులతో ఇలా వుండేది కాదు.     

        పాత్రకుండే చైతన్యం రచయితకుండదు. పాత్ర దాని కథ అది నడుపుకుంటే చాలా ఆశ్చర్యపరుస్తూ సాగుతుంది. రచయిత కూడా వూహించని ఆశ్చర్యాలు సృష్టిస్తుంది. దీని ప్రాముఖ్యం గురించి సిడ్ ఫీల్డ్ అనేకసార్లు, 19వ శతాబ్దపు సుప్రసిద్ధ రచయిత హెన్రీ జేమ్స్ ని ఉటంకిస్తాడు- What is character but the determination of incident? What is incident but the illustration of character?అని. ఈ మధ్యే ఒక కథ చేస్తూంటే, అనూహ్యంగా పాత్ర వచ్చేసి థ్రిల్లింగ్ ముగింపు ఇచ్చేసరికి బిత్తరపోవాల్సి వచ్చింది.

    విచిత్రమేమిటంటే కథా చర్చల్లో నేను కరెక్ట్ అంటే, కాదు నేను కరెక్ట్ అని సిగపట్లకి దిగుతారు. వీళ్ళని చూసి క్యారక్టర్ నవ్వుకుంటుంది. అసలు నేనేమనుకుంటున్నానో ఇంపార్టెంట్రా బాబూ అంటూ - వినేవారు లేకా విసుక్కుంది నాకేకా - అని పాడుకుంటూ వూళ్ళు పట్టుకుని పోతుంది పాత్ర. ఇక ఇగోలు శాటిస్ఫై చేసుకుని, ఇంకో అట్టర్ ఫ్లాప్ తీయడానికి శ్రీకారం చుడతారు.

        రచయితకి ఇగో కాదు, మెచ్యూర్డ్ ఇగో వుండాలి. పాత్రకి వుంటుంది ఇగో. అనుభవాల క్రమంలో దాని ఇగో, మెచ్యూర్డ్ ఇగోగా మారే స్థాయికి అది ఎదుగుతుంది. ఇదీ కథంటే. కథల్ని విశ్లేషిస్తే యుగాలుగా ఇదే. ఎవరి ఇగో కూడా చావదు. మనుషులు చేయగల్గింది తమ ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుని ఎదగడమని కథలు చెప్తాయి. ఈ మూల సూత్రం తోనే కథలుంటాయి. కథంటే సైకో థెరఫీ. కథంటే ఆర్గ్యుమెంట్. అంటే స్టోరీ సిట్టింగ్స్ లో కుమ్ములాట కాదు, కథలోని పాత్రల మధ్య సంఘర్షణ. కథలోని పాత్ర వచ్చి దర్శకుడితో సంఘర్షించే కథనంతో ఈ మెటా పోయెటిక్ ఫన్ ఒక పాఠ్యాంశం.

నటనలు- సాంకేతికాలు 
    చంపడాని కిష్టపడ్డ దర్శకుడిగా, చావడాని కిష్టపడని పాత్రగా రజత్ కపూర్ డీసెంట్ గా ద్విపాత్రాభినయం చేశాడు. ఇద్దరి మధ్య వాళ్ళకి సీరియెస్ సీన్లే, కానీ ప్రేక్షకులకి హాస్యం. పాత్ర దర్శకుడి ఇంట్లోనే బస చేసి, మంచి వంట వాడుగా వండి పెడుతూంటే, వీడికి వంట వచ్చని నేను రాయలేదే - అని దర్శకుడి అంతర్మధనం. భార్య కూడా పాత్ర పక్షమే వహించేసరికి, కత్తితో పాత్ర పీక కోసి చంపెయ్యడానిక్కూడా సిద్ధపడతాడు దర్శకుడు. ఈ ద్విపాత్రాభినయానికి ఏ పాత్ర హావభావాలు ఆ పాత్రకి అతికినట్టుగా అన్వయించి నటించడం రెండు పాత్రల్నీ ఇంట్రెస్టింగ్ గా మార్చింది.

        1960 ల నాటి సినిమా పాత్ర గులాబోగా మల్లికా షెరావత్ రాకుమారి గ్రేస్ తో మెస్మరైజ్ చేస్తుంది చాలా కాలం తర్వాత తెరపైకొచ్చి. ఈమె వున్న దృశ్యాల్ని పోయెటిక్ గా తీర్చిదిద్దాడు రజత్. మహెబూబ్ కోసం కలవరిస్తూ తీసిన సినిమాలోనే వుండిపోయే క్యారక్టర్. ఈమెకి నచ్చజెప్పి కథకి తాననుకున్న ముగింపే ఇవ్వడానికి విఫలయత్నాలు చేస్తాడు దర్శకుడు.  

        విలన్ పాత్రలో రణవీర్ షోరే, అతడి ముగ్గురు అనుచరులూ (సనమ్ కుమార్, ఆదర్ మాలిక్, పీయూష్ రాయ్) ఒక పిచ్చి మేళం. చప్పుడెక్కువ, చేసేది తక్కువ. మహెబూబ్ కోసం తీసిన సినిమాలోంచి పారిపోయిన విలన్ పాత్రగా షోరే, ముంబాయిలో తిరుగుతూ-తన దగ్గరున్న ఫోన్ నెంబరుతో కాల్స్ చేస్తూంటాడు. ఆ నెంబర్ కలవదు. ఈ మహెబూబ్ నంబర్ సినిమాలో సినిమా కోసం రాసిన కల్పిత  నెంబరురా అంటే వినకుండా, పిస్తోలు తీసి పేల్చే సీనులో షోరే నటన టాప్. అలాగే పోలీసులు పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకొచ్చినప్పుడు కూడా.

    నిర్మాత గోయెల్ సాబ్ గా మనూ రిషీ చద్దా నుంచి కూడా హాస్యం పొందొచ్చు. హీరోని చంపవద్దని ముందే చెప్తాడు, దర్శకుడు ఆర్కే వినకుండా చంపే కథే తీయడంతో హీరో పారిపోయాడు. బిల్డర్ గా నిర్మాతది ఆర్ధిక సంకటం, దర్శకుడిగా ఆర్కేది కళా లంపటం. చద్దా వున్న సీన్లు కూడా నవ్విస్తాయి.

        మిగిలిన నటీనటులు కూడా సహాయపాత్రల్లో సహజత్వాన్ని చాటారు. సాంకేతికంగా ఇదొక స్థాయిలో అద్భుతమే. సెట్స్, లొకేషన్స్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, వర్తమానంతో బాటు, 1960 ల నాటి పీరియెడ్ లుక్, లైటింగ్ వగైరాలతో విజువల్స్ కి నిజమంటే నిజంగా స్క్రిప్టు న్యాయం చేసింది. తెలుగులో చూస్తూంటాం- ప్రొడక్షన్ విలువలు ఆకాశంలో, స్క్రిప్టు పాతాళంలో!

చివరికేమిటి

    మెటా మూవీ సమాంతర సినిమాయేగా అని తన కోరికల గుర్రాలతో స్క్రిప్టు చేయలేదు రజత్ కపూర్. చక్కగా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో సార్వజనీన - మెయిన్ స్ట్రీమ్ స్క్రీన్ ప్లేనే చేశాడు. అంతర్జాతీయ మీడియా పొగడ్తలతోనే రివ్యూలిచ్చింది- ఒక్క రోజర్ ఎబర్ట్ డాట్ కామ్ తప్ప. రోజర్ ఎబర్ట్ డాట్ కామ్ రివ్యూలో- ఈ సినిమా వుడీ అలెన్ సినిమా సారాన్ని పట్టుకోలేక పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే పైన చెప్పుకున్న ఫిలాసఫీని.    వుడీ అలెన్ మెటా మూవీ ది పర్పుల్ రోజ్ ఆఫ్ కైరో ముక్కోణ ప్రేమ కథ. భర్తతో బాధాతప్త సంసారం నుంచి ఉపశమనం కోసం సినిమాలకలవాటు పడ్డ మియా ఫారో కోసం,  ప్రదర్శిస్తున్న సినిమాలోంచి హీరో వచ్చేయడం ఆమె మానసిక స్థితి, స్వైరకల్పన. అతడితో ప్రేమాయణం సాగిస్తున్నట్టూ వూహించుకుని ఊరట పొందడం. ఒక రకంగా ఇది అనైతికమే. దీనికి అనుభవిస్తుంది చివరికి.

        ఆమెని ప్రేమిస్తూ హీరో పాత్ర సినిమాలోంచి వెళ్ళి పోయేసరికి, ఆ పాత్ర పోషించిన  నిజ జీవీతంలో హీరోయే రంగంలోకి దిగుతాడు. నేను పోషించిన పాత్రే కావాలా, నిజ వ్యక్తిని నేను కావాలా - అని అడుగుతాడు. నువ్వే కావాలని భర్తకి విడాకులిచ్చేస్తుంది. చేసేదిలేక సినిమా పాత్ర సినిమాలో కెళ్ళి పోతుంది. హీరో కూడా ఆమెకి హేండిచ్చి వెళ్ళిపోతాడు. అతడిక్కావాల్సింది నిర్మాత సినిమాని కాపాడ్డమే తప్ప, ఈమెతో సంసారం చేస్తూ కూర్చోవడం కాదు. రెంటికీ చెడ్డ రేవడి అవుతుందీమె. సమస్య వస్తే ఎదుర్కోవాలే గానీ, పలాయన వాదం ప్రమాదకరమనే నీతీ, ఫిలాసఫీ ఇందులో వున్నాయి.

        రజత్ మూవీలో ఈ సెటప్ లేదు. ఎవరూ వూహించుకోలేదు. తీసిన సినిమాలోంచి పాత్రలే వాటి అవసరాలకోసం పారిపోయాయి. రెండూ దర్శకుడ్ని పట్టుకుని వేధించాయి. ఇది వేరు. ఇందులో ఫిలాసఫీ చెప్తే  సముద్రకని దర్శకత్వంలో వినోదాయ చిత్తం (2021) లా అయ్యేది. విదేశాల్లో ఏమో గానీ, ఇప్పుడు ఇండియాలో సినిమా అంటే ఒక సంఘటన, దాని చుట్టూ పరిణామాలతో పరుగులెట్టే కథ. ఆ సంఘటన ఎకనమిక్స్ లేదా రోమాంటిక్స్ గురించి. సంఘటనల్లోనే తీసుకోవాలంటే నీతీ రీతీ అన్నీ వాటికవే వుంటాయి. ప్రత్యేకంగా మెసేజిలివ్వడం కోసం సినిమాలు తీయనవసరం లేదు.

        స్ట్రక్చర్ చూస్తే తీసిన సినిమాలోంచి హీరో పాత్ర పారిపోవడంతో  ప్లాట్ పాయింట్ వన్ సరీగ్గానే 30వ నిమిషంలో వస్తుంది. 70 వ నిమిషంలో తీసిన సినిమాలోంచి విలన్ పాత్ర పారిపోవడంతో ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఈ రెండిటి మధ్య మిడిల్లో వుండే కథ 40 నిమిషాలు సాగుతుంది. ప్లాట్ పాయింట్ టూ తర్వాత ముగింపు 25 నిమిషాలుంటుంది. ముగింపు ఎలా జరిగిందీ, రైటర్ కీ క్యారక్టర్ కీ మధ్య గొడవ ఎలా పరిష్కారమయిందీ సస్పెన్స్ కోసం వుంచేద్దాం.

—సికిందర్

Thursday, July 21, 2022

1183 : రివ్యూ!

 

         మధ్య ఓల్డ్ (హాలీవుడ్), ‘డియర్ ఫ్రెండ్ (మాలీవుడ్), ‘గార్గి (కాలీవుడ్)  అనే మూడు సినిమాలు చూస్తే కామన్ గా ఒకటి కన్పిస్తుంది- కథా నాయకత్వం లోపించడం. ఈ మూడూ ఆఫ్ బీట్ సినిమాలు. ఓల్డ్ (జులై 2021) శ్యామలన్ నైట్ తీసిన ఆంగ్ల సినిమా, ‘డియర్ ఫ్రెండ్(జూన్ 2022) టోవిన్ థామస్ నటించిన మలయాళ సినిమా. గార్గి(జులై 2022) సాయి పల్లవి నటించిన తమిళ సినిమా. ఓల్డ్ఒక నవల ఆధారంగా కొత్త ఐడియాతో కూడిన కథ. డియర్ ఫ్రెండ్నల్గురు అర్బన్ ఫ్రెండ్స్ కథ. గార్గి చైల్డ్ రేప్ చుట్టూ కథ. ఈ మూడూ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి దూరంగా ఆఫ్ బీట్ గా చేసిన ప్రయోగాలు. ఆఫ్ బీట్ కి ఇప్పుడు కాలం కలిసొస్తున్నట్టుంది. బాక్సాఫీసు దగ్గర విఫలమయ్యే వీటిని  ఓటీటీ వేదిక ఆదుకుంటోంది. కాబట్టి ఏ మేకర్ ఏ తన సొంత పంథాలో, ప్రేక్షకుల అభీష్టాలతో నిమిత్తం లేకుండా, ఏ కథ ఎలా చెప్పాలనుకున్నా, ఓటీటీని నమ్ముకుని చెప్పేయవచ్చు. పై మూడు ఆఫ్ బీట్ సినిమాలూ బాక్సాఫీసు దగ్గర విఫలమై ఓటీటీ కొస్తున్నవే!

        ల్డ్ ప్రపంచ వ్యాప్తంగా 57 మార్కెట్లలో 90 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీని బడ్జెట్ వచ్చేసి 18 మిలియన్ డాలర్లు. హాలీవుడ్ కి అతిపెద్ద గ్లోబల్ మార్కెట్ వుంది కాబట్టి ఈ ఆఫ్ బీట్ ఈ మాత్రం వసూలు చేయగల్గింది. కానీ శ్యామలన్ తీసిన గత సినిమాలతో పోలిస్తే నిరాశే. ఆఫ్టర్ ఎర్త్ (2013) 251 మిలియన్ డాలర్లు, ‘స్ప్లిట్ (2016) 279 మిలియన్ డాలర్లు, ‘గ్లాస్ (2019) 247 మిలియన్ డాలర్ల బాక్సాఫీసు ముందు ఓల్డ్బాక్సాఫీసు వసూళ్ళు దిగదుడుపే.

        డియర్ ఫ్రెండ్ మలయాళం 10 కోట్ల బడ్జెట్ కి కేవలం 56 లక్షల బాక్సాఫీసుతో భారీ ఫ్లాపుగా తేలింది. గార్గి 5 కోట్ల బడ్జెట్ తో తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో బాక్సాఫీసు ఇంకా బడ్జెట్ ని రీచ్ కాలేదు. తమిళనాడులో ఆక్యుపెన్సీ రేటు తిరుచ్చిలో గరిష్టంగా 14.67%, కనిష్టంగా సేలంలో 5.00% వుంది. తెలుగు రాష్ట్రాల్లో గరిష్టంగా కరీంనగర్లో 24.25%, కనిష్టంగా గుంటూరులో 4.33% వుంది. ఇంత తక్కువ శాతంలో ప్రేక్షకులు  థియేటర్లకి హాజరయ్యారు ఈ ఆఫ్ బీట్ కి. ఆఫ్ బీట్, ఆర్టు, వాస్తవిక సినిమా ఇవన్నీ ఒకటే, పేర్లు వేరు. ఇవి తీస్తే ఓటీటీ కోసమే తీయాలే తప్ప మరో మార్గం లేదు. వీటిని ఎంత తక్కువ బడ్జెట్ తో తీసినా బాక్సాఫీసుని అందుకోలేవు, అవార్డులు అందుకోవచ్చు.

        1970-80 లలో ఆర్ట్ సినిమాల ఉద్యమం కొనసాగినప్పుడు ఆఫ్ బీట్ సినిమాలు నిలబడ్డాయి. తర్వాతి దశాబ్దంలో ఆర్ట్ సినిమాలకాలం చెల్లిపోయాక, 2000 లో ఆర్ట్ సినిమాల ప్రముఖుడు శ్యామ్ బెనెగెలే ఆర్టు నీ, కమర్షియల్ విలువల్నీ కలగలిపి క్రాసోవర్ సినిమాలనే మల్టీప్లెక్స్ సినిమాలకి తెరతీసి కొత్త బాట వేశారు. ఈ బాటలో కొత్త తరం దర్శకులు క్రాసోవర్ సినిమాలు తీస్తూ పోయారు. నేటికీ ఇవి వున్నాయి - కాకపోతే సెమీ రియలిస్టిక్ గా పేరు మారింది. సినిమాల చరిత్ర తెలుసుకోక పోతే సమకాలీన సినిమా అందించలేరు. గార్గి 1970-80 లలో తీయాల్సిన ఆర్ట్ సినిమా.

        మేకర్ తెలియక ఆర్ట్ సినిమాగా తీసినా, ఇంట్లో కూర్చుని వీటిని ఓటీటీల్లో చూసేస్తారు ప్రేక్షకులు- అన్ని సినిమాలకి కలిపి ఒక సంవత్సర చందా తప్ప, సినిమాకో చెల్లింపు వుండదు గనుక. అదే థియేటర్ కెళ్ళి పెద్ద తెర మీద చూడాలంటే మాత్రం థియేటర్ సినిమా వుండాల్సిందే. అంటే కమర్షియల్ సినిమా. అంటే కథా నాయకత్వమున్న సినిమా. అంటే కథని కథలా చూపించే సినిమా.   

        పై మూడూ కథని కథలా చూపించలేదు. కథ అంటేనే చాలా అలుసైపోయిన సరుకై పోయింది ఈ మధ్య. ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు తీస్తారు. నిర్మాత నెత్తి మీద గొడ్డలి పెట్టి, నా సినిమా నా ఇష్టమంటాడు మేకర్. ఇతడికేం హక్కుందో తెలీదు. ఈ రోజే విడుదలైన విక్రమ్ కుమార్- అక్కినేని నాగచైతన్య - దిల్ రాజుల ప్రతిష్టాత్మక సినిమా  థాంక్యూ కథగా విఫలమైన డిజాస్టర్ అని తెల్లారే యూఎస్ నుంచి రివ్యూలు వస్తున్నాయి. దీన్ని కథగా కాదు, ‘విరాటపర్వం లాగే గాథగానే  తీశారని తెలిసి పోతోంది. ఇంత అనుభవమున్నా ఇంకా కథకీ, గాథకీ తేడా తెలుసుకోలేని తనం దగ్గరే వుండిపోతున్నారు.

        వార్తని వార్తలా చూపించక పోతే వార్త ఎలా కాదో, కథని కథలా చూపించక పోతేనూ అంతే. మంత్రి గారు శంఖు స్థాపనకి వెళ్ళారు అని వార్త ప్రారంభించి - ఆహ్వానితులతో కలిసి విందారగించారు, ముచ్చటించారూ అంటూ చెప్పుకొస్తూ- అసలు శంఖు స్థాపన చేశాడా లేదా, చేస్తే ఆ సందర్భంగా ఆ పథకం గురించి ఏం వ్రాక్కుచ్చాడో చెప్పకపోతే అది వార్త ఎలా కాదో, కథని కథలా చెప్పేక పోతే అదలా  సినిమా కాకుండా శ్రీలంక అవుతుంది. ప్రేక్షకులు బాక్సాఫీసు మీద తిరగబడే రోజులు కూడా త్వరలోనే వస్తాయి. ప్రస్తుతం బాక్సాఫీసుతో ఎందుకులే అని సినిమాల జోలికెళ్ళడం లేదు.

         ఓల్డ్ లో ఒక రిసార్ట్స్ లో గడపడాని కెళ్ళిన మూడు  కుటుంబాలు సముద్రపు టొడ్డున విచిత్ర పరిస్థితి నెదుర్కొంటాయి. వాళ్ళ వయస్సు అరగంటకి ఒక ఏడాది చొప్పున పెరిగి పోతూంటుంది. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళయి పోతారు, చిన్న పిల్లలు టీనేజీ కొచ్చేస్తారు. ఈ వింత పరిస్థితి నుంచి ఎలా తప్పించుకున్నారన్నది ఈ కొత్త ఐడియాతో కథ.

        యుగాలు మారినా కథకుండే ప్రజాదరణ మారదు. ఎందుకంటే వాటిలో వుండేది ప్రధాన పాత్ర కథా నాయకత్వం. కథానాయకత్వం లేని కథ కథలా వుండదు, పాలకులు పారిపోయిన శ్రీలంకలా వుంటుంది. ఓల్డ్ లో వుండడానికి గేల్ గార్షియా బెర్నాల్ అనే అతను హీరోగా వుంటాడు గానీ, కథ అతన్తో వుండదు. ఎవరితోనూ వుండదు. అందరితో గంప గుత్తగా, అతుకుల బొంతలా వుంటుంది. హీరో కుటుంబంతో బిగినింగ్ మాత్రం వుంటుంది. సమస్య ప్రారంభమయ్యాక మిడిల్ సంఘర్షణ అతడితో వుండదు. పెరిగిపోయే వయసుతో మూడు కుటుంబాల అనుభవాలే చూపిస్తూ చూపిస్తూ ముగిసిపోతుంది సినిమా. ఒక మంచి కొత్త ఐడియా అద్భుతాలు చేయకుండా ఇలా పాడయి పోయింది.

        2014 లో క్రిస్టఫర్ నోలన్ తీసిన 'ఇంటర్ స్టెల్లార్' లో హీరో మాథ్యీవ్ మెక్ కానే అంతరిక్ష పరిశోధనలో భాగంగా ఓ గ్రహం మీది కెళ్తాడు. ఆ గ్రహం మీద ఒక గంట భూమ్మీద 7 సంవత్సరాలతో సమానం. అతను తిరిగి భూమ్మీదికి మూడు గంటల్లో చేరుకుంటాడు. చేరుకుని చూస్తే, భూమ్మీద 21 ఏళ్ళు గడిచిపోయి వుంటాయి. తను 21 ఏళ్ళనాటి యువకుడుగానే వుంటాడు. తన కూతురు, కొడుకు తనకంటే పెద్దవాళ్లయిపోయి వుంటారు! అద్భుత కల్పన ఇది. ఇలాటి అద్భుతాన్ని 'ఓల్డ్' తో ప్రేక్షకులకి అందించలేక పోయాడు శ్యామలన్.

        'డియర్ ఫ్రెండ్' మలయాళంలో నల్గురు అర్బన్ ఫ్రెండ్స్ వాళ్ళ షోకులూ సరదాలూ సెంటిమెంట్లతో ఫస్టాఫ్ అంతా గడిపేస్తారు. అంటే ఫస్టాఫ్ లో కథ లేదు. సెకండాఫ్ లో కథేదో ప్రారంభమవుతుంది. టోవిన్ థామస్ కనిపించకుండా పోతాడు. మిగతా ముగ్గురూ వెతకడం మొదలెడతారు. వెతుకుతూ వెతుకుతూవుంటే, ముగింపపులో కన్పిస్తాడు. ఏంట్రా ఏమైపోయావ్ అంటే, దానికేదో కారణం చెప్తాడు, చాలా ఫీలైపోయి కావలించుకుంటారు. అయిపోతుంది సినిమా. కథా నాయకత్వం లేకుండా ఇది అర్బన్ ఫ్రెండ్స్ కథట. బడ్జెట్లో 5 శాతం కలెక్షన్స్ తో. 2005 లో శేఖర్ కమ్ముల తీసిన 'హేపీడేస్' లో కాలేజీ ఫ్రెండ్స్ లో హీరో వరుణ్ సందేశ్ కథానాయకత్వం వహిస్తూ స్క్రీన్ ప్లేకి త్రీయాక్ట్ స్ట్రక్చర్ నేర్పరుస్తాడు.

        ఇక 'గార్గి' విషయం. చైల్డ్ రేప్ కేసులో ఇరుక్కున్న తండ్రిని కాపాడే కథ, టీచర్ గా సాయిపల్లవి ఈ తండ్రిని కాపాడుకునేందుకు లాయర్ని ఆశ్రయిస్తుంది. ఇక ఆ లాయర్ కథ నడుపుతాడు. సాయిపల్లవి అతడితో వుంటుంది ఈ కష్టానికి బాధపడుతూ. కథానాయకత్వం వదులుకున్న ఆమె సీన్లన్నీ బాధపడుతూ వుండే సీన్లే- ముగింపులో మాత్రమే ఎవరేమిటో తెలుసుకునే వరకూ. ఇది బాక్సాఫీసుకి భారమై ఓటీటీని ఆశ్రయించే పరిస్థితి.

—సికిందర్