రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, January 13, 2022

1116 : స్క్రీన్ ప్లే సంగతులు

థలో తగినంత సంఘర్షణ లేకపోతే ఏం చేస్తారు? అప్పుడు పాత్రకి మరిన్ని బాహ్య లేదా అంతర్గత అడ్డంకుల్ని జోడించడం చేస్తే, పాత్ర లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎక్కువ సంఘర్షించేలా చేస్తుంది. తగినంత సంఘర్షణ లేకపోతే పాత్ర వెంటనే దాని లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఇది కథని బలహీనం చేస్తుంది. కథలో పాత్ర లక్ష్యం కోసమే సంఘర్షిస్తుంది. అంటే సంఘర్షణ అనేది లక్ష్యాన్ని కథగా మారుస్తుందని అర్ధం జేసుకోగలం.          

యితే మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్న కథ అలాంటిది కాకపోతే? మన కథకి సంఘర్షణని జోడించడం మనస్కరిచక పోతే ఏం చేస్తాం? ఇక్కడ కథల గురించి మనకుండే అవగాహనని విస్తరించుకుని చూడాలి. విభిన్న కథా కథనాల నిర్మాణాలేమిటో తెలుసుకోవాలి. మనం పాశ్చాత్య సంస్కృతిలో పెరిగినట్లయితే, కథల్లో సమస్యని పరిష్కరించడాన్నేకథ లంటారన్న అభిప్రాయంతో పెరిగి వుంటాం. సమస్యని పరిష్కరించడమే కథ ఐనట్లయితే, ఆ సమస్య పాత్రకి లక్ష్యాన్ని, లాభ నష్టాల్ని, సంఘర్షణనీ కల్పిస్తుంది. ఇలా సమస్యని పరిష్కరించడమే పాత్ర కర్తవ్యమవుతుంది.
        
అయితే మన కలవాటైన ఈ నాటకీయ ఉత్థన పతనాల (డ్రమెటిక్ ఆర్క్) కథన శైలి అన్ని కథలకీ, ముఖ్యంగా పాశ్చాత్యేతర సంస్కృతులకి వర్తించదు. మరీ ముఖ్యంగా, మనం అలవాటు పడినట్టు, విభిన్న కథా నిర్మాణాలతో కూడిన కథలు సంఘర్షణపై ఆధారపడవు. అలాగని సంఘర్షణ లేదు కాబట్టి వీటిని కథలుగా పరిగణించ వీల్లేదని కాదు. సంఘర్షణ లేకపోవడమే వీటిని వైవిధ్య కథలుగా మార్చేస్తుంది. దీన్నుంచి మనం నేర్చుకోవాలి. 

సంఘర్షణ రహిత లేదా స్వల్ప సంఘర్షణల కథా నిర్మాణాలు :
        సంఘర్షణని విస్మరించే, లేదా స్వల్ప సంఘర్షణకి భిన్నమార్గాల్నవలంబించే కథా నిర్మాణాలు చూద్దాం : 1) కిషోటెన్‌కేట్సు:  ఈ నాలుగు అంకాల కథా నిర్మాణం (ఫోర్ యాక్ట్స్ స్ట్రక్చర్) చైనీస్, కొరియన్, జపనీస్ కథల్లో కన్పిస్తుంది. శతాబ్దాల నాటి కథనాల నుంచి ఆధునిక మాంగా, నింటెండో వీడియో గేమ్‌ల వరకూ దీన్ని చూడొచ్చు, 2) రోబ్లెటో: సాంప్రదాయ నికరాగ్వాన్ కథా శైలి. ఇందులో పాత్ర ప్రయాణ మార్గాలు అనేకం వుండి, పునరావృత మవుతూ వుంటాయి, 3) డైసీ-చైన్ ప్లాట్ : ఒక కేంద్రీయ పాత్రంటూ లేకుండా, ఒక కథా వస్తువుని లేదా ఆలోచనని అనుసరించే నిర్మాణం, 4) ఫ్యాన్ ఫిక్షన్ ఫ్లఫ్”:  పాత్ర  ఇంటరాక్షన్స్ (పరస్పర చర్యల) పై దృష్టి పెట్టే సంఘర్షణా రహిత నిర్మాణం, 5) ఓరల్ స్టోరీ టెల్లింగ్ : సంఘర్షణని కాకుండా నైతిక సందేశాన్ని నొక్కి చెప్పే నిర్మాణం, 6) రషోమన్-స్టైల్ ప్లాట్ : విభిన్న దృక్కోణాల నుంచి  పునరావృతమయ్యే సంఘటనలతో కూడిన నిర్మాణం.

విభిన్న నిర్వచనం :
        మనం పాశ్చాత్య-సంస్కృతి దృక్కోణంలో కథ చెప్పడంలో కూరుకుపోయి వుంటే, సంఘర్షణ లేని కథల్ని బోరుగానే ఫీలవుతాం. వాటినసలు కథలుగానే పరిగణించం. సరే, అయితే అసలు కథని కథగా మారుస్తున్న దేమిటో అర్థం చేసుకోవడానికి వెనక్కి వెళ్దాం. నేను నా బ్లాగులో తరచుగా వివరిస్తున్నట్టుగా, అన్ని రకాల కథలూ  'మార్పు' ఆధారంగానే నిర్మాణాలు జరిగాయి. చాలా పాశ్చాత్య-శైలి కథా కథనాలు సంఘర్షణ ప్రభావిత 'మార్పు' పై ఆధారపడి వుంటాయి. 'మార్పు' అంటే పాత్ర మారడం, పరివర్తన చెందడం. ఇందులో కథానాయకుడు బాహ్య లేదా అంతర్గత సంఘర్షణల్ని అధిగమించడం లేదా, వాటి నుంచి నేర్చుకోవడం (లేదా అధిగమించడంలో లేదా నేర్చుకోవడంలో విఫలమవడం) వుంటుంది.

        ఇలా పాత్ర సంబంధిత మార్పుతో కూడిన కథలకి మనం అలవాటు పడ్డాం. దీనికి వ్యతిరేకంగా పైన చెప్పుకున్న ఆరు పాశ్చాత్యేతర నిర్మాణాలున్నాయి. ఇవి పాత్ర మార్పు పై కాకుండా పఠితలో మార్పుపై దృష్టి పెడతాయి.  ఉదాహరణకి, రషోమన్-శైలి కథలు ఒకే సంఘటనకి వివిధ పాత్రలు చెప్పే భిన్న భాష్యాల్ని ప్రేక్షకుల ముందు పెడతాయి. వాటిలో ఏది యదార్థమో ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. ఫ్యాన్‌ఫిక్ "ఫ్లఫ్" కథల్లో, పాఠకులు తమ అభిమాన పాత్రలు చెప్పే, చేసే, ఆలోచించే, ప్రవర్తించే లేదా విభిన్న పరిస్థితులలో ప్రతిస్పందించే తీరుని తీసుకుని, వాటికి విస్తరించిన తమ వూహా కల్పనని జోడిస్తారు.

        ఇక కిషోటెన్‌కేట్సులో, కథలోని మూడో అంకంలో వూహించని ట్విస్టు వస్తుంది. ఈ ట్విస్టు ప్రేక్షకులు కథని చూసే దృక్కోణాన్ని మార్చేస్తుంది. సాధారణ ప్లాట్ ట్విస్ట్ కంటే పాఠకుల దృక్పథాన్ని మార్చడం గురించి ట్విస్ట్ ఎక్కువగా వుంటుంది. అందుకని మొదటి రెండంకాలతో సంబంధం లేకుండా ఈ ట్విస్ట్  వుంటుంది.

        ఈ ఉదాహరణ చూడండి... మై నైబర్ టోటోరో అనే జపనీస్ యానిమేషన్ లో సంఘర్షణ లేదు, ప్రత్యర్థి లేడు. ఇద్దరమ్మాయిల తల్లి అనారోగ్యంతో వుంటుంది. ఈ అనారోగ్యం కథలో సాధించాల్సిన సమస్య కాదు. కేవలం ఒక పరిస్థితి. ఆమె ఆరోగ్యం మెరుగుపడడం అనేది అమ్మాయిల చర్యలతో సంబంధం లేనిది. అమ్మాయిల పని మ్యాజికల్ పవర్స్ తో వున్న పొరుగు వ్యక్తి గురించి తెలుసుకోవడం గురించే. అతడ్ని స్నేహితుడిగా చేసుకోవడం గురించే. ఆ స్నేహితుడితో కలిసి ప్రపంచాన్ని రక్షించడమో, లేదా దురుసు మనుషుల నుంచి ఈ ప్రత్యేక స్నేహితుడిని రక్షించడమో కాదు. అలాంటిదేమీ లేదు. కేవలం స్నేహం చేయడమే.

—జామీ గోల్డ్

 

 

 

 

 

Tuesday, January 11, 2022

1115 : స్క్రీన్ ప్లే సంగతులు


            తెలుగు సినిమా ప్రేక్షకుల్లో కోవిడ్ వల్ల కన్పిస్తున్న మార్పేమిటంటే, రెగ్యులర్ ఫార్ములా కథలకి తోడు భిన్న కథా శైలుల్ని ఆదరించే ఆధునికత్వాన్నికూడా అలవర్చుకోవడం. కోవిడ్ ఓటీటీని వెంట బెట్టుకొచ్చి ఇంటింటా అంటించింది. దాంతో ప్రపంచంలో ఎక్కడి ఏ భాషా సినిమాల్నైనా చూసే అవకాశంతో సినిమా చూసే దృక్పథాన్నే మార్చేసుకున్నారు. అన్ని సినిమాలూ మెయిన్ స్ట్రీమ్ సినిమాలే అనే లౌకికతత్వాన్ని ప్రదర్శించడం మొదలెట్టారు. ఓటీటీకి పూర్వం వరల్డ్ సినిమాలున్నాయి. కానీ వాటికి అలవాటు పడలేదు, వాటిని మన టేస్టుకి సరిపడని పరాయి సినిమాలన్నట్టుగానే చూశారు. ఇప్పుడలా కాదు, తెలుగు సినిమాల్ని సైతం ఎలాటి కథా శైలులతో నైనా  చూసేందుకు ముందుకొస్తున్నారు.


        సింప్లీకరించి చెప్పుకోవాలంటే త్రీ యాక్ట్ స్ట్రక్చరే ఇక సినిమాల కుండనవసరం లేదు. ప్రేక్షకులిస్తున్న అనుమతితో కథ ఎలా చెప్పుకుంటూ పోవాలన్నా పోవచ్చు. ప్రేక్షకులు అనుమతి నివ్వని కాలంలో ఇలా తీసిన సినిమాలే ఎక్కువున్నాయి. అవి ఫ్లాపవడం చూసి స్ట్రక్చర్ లేక ఫ్లాపవుతున్నాయని అనేసుకున్నాం. స్ట్రక్చర్ లేకుండా చేసి, మేకర్లు మరి తామనుకుంటున్న క్రియేటివిటీ ఏమిటో చెప్పడం లేదు, దానికైనా గ్యారంటీ ఇవ్వడం లేదు. ఆ క్రియేటివిటీ ఏమిటో తెలిస్తే గ్యారంటీ నివ్వగలరు. తెలియక పోవడం వల్లే గల్లా పెట్టెలు గల్లంతవుతున్నాయి.

        ఈ వ్యాసం రాస్తున్నప్పుడే ఒక కథ డెవలప్ అవుతోంది. మేకర్ తెచ్చిన కథ కొత్తగా వుంది. అందులో కాన్ఫ్లిక్ట్ వుంది కానీ ప్రత్యర్ధి పాత్ర చివరి వరకూ అదృశ్యంగా వుండడంతో, కథనం బోలుగా వుంది. కాసేపు రెగ్యులర్ స్ట్రక్చర్ ని పక్కన పెట్టి, పాత్రకి సబ్ ప్లాట్ గా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ని కల్పిస్తూ ప్రత్యర్థి లేని లోటుని పూడ్చాలనుకుంటే, అది మేకర్ కిష్టం లేదు. ఎందుకంటే ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ కోసం సృష్టించే  సమస్య పాత్ర మర్యాదని దెబ్బతీస్తుందని మేకర్ అభ్యంతరం. సమస్య లేకుండా సంఘర్షణ లేదు. ఏ సమస్య తీసుకున్నా అది పాత్ర మర్యాదనే దెబ్బతీస్తోంది. మర్యాద దెబ్బతినకుండా సమస్య ఎలా? సమస్య లేకుండా సంఘర్షణ ఎలా? ఎక్కడుంది దీనికి కిటుకు? కథ పెండింగులో పడింది.    

జెమీ గోల్డ్ 
ఒక రోజు కథల్లో సమస్యల గురించి సెర్చి చేస్తూంటే, 'కాసాబ్లాంకా', 'ఇండియానా జోన్స్', 'పల్ప్ ఫిక్షన్', 'మ్యాట్రిక్స్' లలో ప్రయోగించిన ప్లాట్ డివైసులున్నాయి. దీన్ని మెక్ గఫిన్ ప్లాట్ డివైస్ అంటారు. ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ కనిపెట్టాడు. ఒక సమస్య చుట్టూ సంఘర్షిస్తూంటాయి పాత్రలు. ఆ సమస్య పాత్రలకే తెలుసు, ప్రేక్షకులకి చెప్పరు. చెప్తే తేలిపోతుంది. 'కాసాబ్లాంకా' లో లెటర్స్ అనే ప్లాట్ డివైస్ వుంటుంది. ఆ లెటర్స్ లో ఏముందో చెప్పరు. 'పల్ప్ ఫిక్షన్'లో బ్రీఫ్ కేసు ప్లాట్ డివైసుగా వుంటుంది. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో చెప్పరు.

        ఈ మెక్ గఫిన్ ప్లాట్ డివైసుని మన మేకర్ కథలోకి తెచ్చేస్తే సమస్య తీరిపోయింది. సమస్య దేని గురించో చెప్పకుండా, పాత్ర మర్యాద దెబ్బ తీయకుండా, సబ్ ప్లాట్ ప్రత్యర్ధితో ప్రత్యక్ష సంఘర్షణతో కథ నీటుగా వచ్చేసింది. పనిలో పనిగా అసలు అదృశ్య ప్రత్యర్ధితో ప్రచ్ఛన్న పోరాటం (కోల్డ్ వార్) కూడా తళుక్కున మెరిసి సమగ్ర కథ వచ్చేసింది...

        ఇదే సమయంలో ఇంకో కథ. ఇది రెగ్యులర్ రొటీన్ టెంప్లెట్ కథ. మనం చంద్రుడి ఒక వైపే చూస్తాం, అవతలి వైపు ఏముందో తెలియదు. టెంప్లెట్ సినిమాలు కూడా ఒకవైపే చూపిస్తూ బోరు కొట్టేస్తున్నాయి. రెండో వైపు ఎందుకు చూపించరు. ఈ కథకి ఇదే చేసి ఇంటర్వెల్లో అట్టు తిరగేసినట్టు తిరగేస్తే రెండోవైపు కొత్త కథ కన్పించింది... ఇంకో మేకర్ టెంప్లెట్ కథనే పెద్ద కంపెనీల్లో చెప్తూ సెకండాఫ్ రిజెక్ట్ అవుతున్నాడు. ఇంటర్వెల్లో రివర్స్ చెయ్, సెకండాఫ్ కొత్తగా వస్తుందన్నాం. రివర్స్ చేయడానికి ఒక ప్లాట్ డివైస్ ఇచ్చేశాం. మేకర్ స్టామినా పెరిగింది...

        మన దగ్గరే సినినాప్సిస్ లో ఒక పెద్ద కథ వుంది. సెకండాఫ్ లో కెళ్లినా 'కమర్షియల్ హీరోయిజం' కనిపించడం లేదని మేకర్ ఫిర్యాదు. దీని ఇంటర్వెల్ విజువల్ బ్యాంగ్ తో వుంది. అది కూడా హీరోయిజమే. దీనికో డైలాగు వేసి వర్బల్ బ్యాంగ్ ఇవ్వడంతో సెకండాఫ్ కూడా కొత్త కథగా మారిపోయింది ఆ డైలాగు పట్టుకుని.

        ఇదంతా ఏమిటంటే స్ట్రక్చర్ కి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు. కథల్లో సమస్యా, దాంతో సంఘర్షణా వుంటాయి. వీటిని స్ట్రక్చర్ లో సరైన తీరులో వాడకపోవడం వల్ల మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు వచ్చి ఫ్లాపవుతున్నాయి. అసలు సంఘర్షణే లేని గాథలు కూడా తయారై ఫ్లాపవుతున్నాయి. ఇంకేవో లైటర్ వీన్ సినిమా లనుకుంటూ కూడా వచ్చి ఫ్లాపవుతున్నాయి. ఇవన్నీ సమస్య- సంఘర్షణ పరికరాల వాడకంలో బోల్తాపడుతున్నవే. ఇప్పుడు సినిమాల తీరు మారింది. వివిధ కథాకథనాల శైలులు సమస్య- సంఘర్షణ పరికరాల్ని భిన్నంగా నిర్వచిస్తున్నాయి. ఇవి ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆ శైలులేమిటో తెలుసుకుంటే స్ట్రక్చరేతర క్రియేటివ్ స్కూలు మేకర్స్ తీసే 'ఇండిపెండెంట్' కమర్షియల్ సినిమాలైనా నాణ్యత పెంచుకుంటాయి. ఈ శైలుల గురించి వివరిస్తూ రచయిత్రి జెమీ గోల్డ్ రాసిన వ్యాసం రేపు మీకందుతుంది. చదివి అర్ధం జేసుకుని పాటించగలరు.

—సికిందర్        

Saturday, January 8, 2022

1114 : రివ్యూ!


 

స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకుల మీద పోరాట సినిమాల లిస్టులో 1945 కూడా చేరింది గానీ, ఈ సినిమా అంటే మొదట్నుంచీ హీరో రానా దగ్గుబాటికి ఇష్టం లేదు కాబట్టి, నిర్మాతతో పడక అయిదేళ్ళూ అస్తవ్యస్తంగా నిర్మాణం చేసి హడావిడిగా విడుదల చేశారు కాబట్టీ, దీన్నొక సినిమాగా పరిగణించక లిస్టులోంచి కొట్టేయవచ్చు. రానా కనీసం డబ్బింగ్ కూడా చెయ్యక మూగనోము పడితే సినిమాకే గతి పడుతుందో వూహించవచ్చు. క్లయిమాక్స్ ని కూడా బహిష్కరిస్తే ఇదేం సినిమా అని ముక్కు మీద వేలేసుకోవచ్చు. సినిమాకి ముగింపు లేదు. అంటే రెండో భాగం తీస్తారని కాదు. తీసిన భాగమే పూర్తి చేయలేక! ఇంత కంటే జోకు ఈ జనవరి మాసంలో 2022 పూర్తయ్యే వరకూ లేదు. ఈ యేటి మేటి జోకు ఇది.

        1942- ఏ లవ్ స్టోరీ.. కాదు కాదు, 1942- ఏ లవ్ స్టోరీ – హిందీలో తీసిన బ్రిటిష్ తో పోరాట పీరియెడ్ మూవీలోని ప్రేమ కథని దోచుకుని, 1945 - ఏ లవ్ స్టోరీ గా దోపిడీ దార్లయిన తెల్లదొరల మీద పోరాటానికి సిద్ధం చేశారు. దోచుకున్న కథతో  దోపిడీ దార్లమీద పోరాటం.  పాత సినిమాల్లో జమీందారుతో పోరాటం టైపు లాంటి పాత సీన్లతో దేశభక్తి కథ. ఈ కథ 1945లో బర్మా (నేటి మయన్మార్) లో జరుగుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ తో పోరాడటానికి ఇండియన్ నేషనల్ ఆర్మీని  ప్రారంభించే సమయంలో ఆది (రానా దగ్గుబాటి) తన కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవడానికి బర్మాకి తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత బ్రిటిష్ తాసిల్దారు కుమార్తె (రెజీనా) ని ప్రేమించి  నిశ్చితార్థం చేసుకుంటాడు. ఇక పెరుగుతున్న తెల్లదొరల దురాగతాలు చూసి స్వాతంత్ర్య పోరాటంలోకి దూకుతాడు. ఇక ఈ పోరాటంలో ఎలా గెలుపు సాధించాడన్నది మిగతా కథ.

        ఇందులో ప్రేమ కథ సరిగా లేదు, పోరాట కథా సరిగా లేదు. ఏ కథకీ సరైన  భావోద్వేగాల్లేవు. కొన్ని చోట్ల అసలు అర్ధమే వుండదు. రానా సంఘర్షించడానికి కారణమూ  హాస్యాస్పదమే. ఇక దేశభక్తి ఎక్కడా ఉప్పొంగే సమస్యే లేదు. సినిమా ముగింపు మాత్రమే కాదు, కొన్ని సీన్లు కూడా ముగియకుండానే కట్ అయిపోతూంటాయి. అరాచకంగా వుంటుంది సినిమా ప్రదర్శన. రానా, సప్తగిరిల కామెడీ కూడా బ్రిటిష్ వాళ్ళకంటే అరాచకంగా వుంటుంది. రానా- రెజీనాల ప్రేమ బందరు కాల్వలా వుంటుంది. దేశ ద్రోహుల  పన్నాగాలు, పోలీసుల దౌర్జన్యాలు, వడ్డీ వసూళ్ళు, నడ్డి విరిచే పన్నుల వసూళ్ళూ - వీటి మీద తిరుగుబాటూ- ఏ స్వాతంత్ర్య పోరాట సినిమా చూసినా ఇవే కథలు. బ్రిటీషర్లు ట్రిగ్గర్-హ్యాపీ విలన్లు. మాస్ మసాలా సినిమాల్లో లో - గ్రేడ్ విలన్ల లాగా నవ్వడాలు, మాట్లాడితే కాల్చి చంపడాలు, ఇంతే.

        1945 నాటి వాతావరణ సృష్టి వరకూ కళా దర్శకత్వం బావుంది. ఇది మినహా మరేదీ బావున్న దాఖలాల్లేవు. రీరికార్డింగ్, గ్రాఫిక్స్ కూడా అశ్రద్ధకి లోనయ్యాయి. యువన్ శంకర్ రాజా సంగీతం ఇప్పుడు ఔట్ డేటెడ్ అయింది. సత్య పొన్మార్ ఛాయాగ్రహణం కొంత వరకూ ఫర్వాలేదు.

తెలుగు, తమిళ భాషల్లో తీసిన తమిళ దర్శకుడు సత్యశివ ఎందుకు ఈ టెంప్లెట్ స్వాతంత్ర్య కథని తలపెట్టాడో అర్ధంగాదు. కొత్తగా ఏం చెప్పాడు? అసలు స్వాతంత్ర్య పోరాటమన్నా, పోరాట యోధులన్నా, వాళ్ళు లాఠీ దెబ్బలు తిని జైళ్ళల్లో మగ్గిన, తుపాకీ కాల్పులకి గురైన, ఉరి కంబాలెక్కిన చరిత్ర అన్నా, దేశభక్తి అన్నా ఏమీ తెలియకుండా, ఆ త్యాగాల్ని ఫీలవకుండా కాలం గడిపేస్తున్న, ఉచితంగా స్వాతంత్ర్యం అనుభవించేస్తున్న యువతరం అధిక శాతం వుంది. కంగనా రణవత్ ల వంటి కుహనా దేశభక్తుల మాటలు వాళ్ళని ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. స్వాతంత్ర్య పోరాటం వాళ్ళకి సుదూర చరిత్ర. దాన్ని వాళ్ళ సమీపంలోకి తేవాలంటే యూత్ అప్పీల్ తో నూనూగు మీసాల యువపాత్రలతో, స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్ధుల కథల్ని తెరపైకి తేవాలే తప్ప, ఇంకా ముసలి వాళ్ళతో అరిగిపోయిన ముసలి పన్ను వసూళ్ళ కథలు కాదు. ఇవి కనెక్ట్ కావు. ఇంకా చూసేవాళ్ళూ లేరు.


—సికిందర్

 

 

Friday, January 7, 2022

1113 : రివ్యూ!

రచన - దర్శకత్వం: పొలిమేర నాగేశ్వ‌ర్‌ 
తారాగణం : ఆది సాయి కుమార్‌, నువేక్ష‌, రోహిణి, స‌ప్త‌గిరి తదితరులు 
క‌థ‌: వేణుగోపాల్ రెడ్డి, సంగీతం: శేఖ‌ర్ చంద్, ఛాయాగ్రహణం : అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి
నిర్మాతలు: రాజాబాబు మిర్యాల
, అశోక్ రెడ్డి మిర్యాల 
విడుదల :
జనవరి 7, 2022
***

        పదేళ్ళ క్రితం ప్రేమ కావాలి’, లవ్లీ ల తర్వాత ఆది సాయి కుమార్ కి 12 ఫ్లాపులే తప్ప హిట్ ప్రాప్తం కాలేదు. ఇప్పుడు అతిధి దేవోభవ తో ఇలాటి కొత్త తరహా సినిమాలే చేస్తానన్నాడు. ఇందులోని పాత్రతో తనలో కొత్త అది ని చూస్తారని అన్నాడు. కొత్త దర్శకుడు కూడా రెండు దశాబ్దాల ప్రయత్నం తర్వాత ఇప్పుడు దర్శకుణ్ణి అయ్యాననీ, ఈ మూవీ మలుపు తిప్పే మూవీ అవుతుందనీ, ఇందులో సప్తగిరి చేసిన కామెడీ హైలైట్ గా వుంటుందనీ వర్ణించాడు, ఇద్దరి మాటలూ ఎంతవరకూ నిజం? నిజమనుకుని ఎలా భ్రమల్లో వున్నారు? 12 ఫ్లాపుల తర్వాత ఆది, 20 ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత దర్శకుడూ సినిమా అంటే ఏమిటో ఎలాటి అవగాహనతో వున్నారో ఈ కింద చూసుకుంటూ వెళ్దాం... 

కథ

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అభయ్ రామ్ (ఆది సాయికుమార్) తల్లి (రోహిణి) తోడు లేకపోతే వుండలేక పోతాడు. చిన్న తనం నుంచే అతను మోనోఫోబియా అనే మనోవ్యాధితో వుంటాడు. ఒంటరిగా వుండాలంటే భయం. ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుండాలి. ఎప్పుడూ తోడు తెచ్చుకుంటున్న ఇతణ్ణి చూసి గర్ల్ ఫ్రెండ్ బై చెప్పేస్తుంది. మరోపైపు ఉద్యోగంలో పై స్థాయికి ఎదగాలనుకుంటున్న అభయ్ కి ఈ ఫోబియా సమస్యై పోతుంది. ఇలా వుండగా వైష్ణవి (నువేక్ష) అనే ఇంకో అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఈ ప్రేమ పెళ్ళికి దారి తీసేసరికి సంకటంలో పడతాడు. తన సమస్య ఈమెకి చెప్పాలా వద్దా? చెప్తే ఏమవుతుంది? చెప్పక పోతే ఏమవుతుంది? ఈ ప్రశ్నలే మిగతా కథ.  

ఎలావుంది కథ

2019 లో నిహారికా కొణిదెల నటించిన సూర్యకాంతం లో ఆమె పాత్రకి పెళ్ళంటే భయమనే కమిట్ మెంట్ ఫోబియా లేదా గామోఫోబియా అనే మానసిక రుగ్మత వుంటుంది. ఈ ఫోబియాతో ఆధునిక సినిమాలా వుండాల్సింది కాస్తా ఎలా మూస ఫార్ములా ప్రేమ డ్రామాలాగా వుందో, అలా అతిధి దేవోభవ లో ఒంటరిగా వుండాలంటే భయమనే మోనో ఫోబియాతో వుంది.

        2015 లో నిఖిల్ నటించిన సూర్య వర్సెస్ సూర్య లో ఎండ తగిలితే ప్రాణాలకి ప్రమాదమయ్యే జిరోడెర్మా  పెగ్మెంటోసమ్ అనే అనువంశిక శారీరక రుగ్మతతో - ఎలా ఆ ఎత్తుకున్న పాయింటు వదిలేసి, అరిగిపోయిన రొటీన్ ముక్కోణ ప్రేమ చట్రంలో బిగించారో, అలా అతిధి దేవోభవ లో పాత్ర ప్రాబ్లం ఒకటైతే, నడిపిన కథ ఇంకోటిగా తయారయ్యింది. 

        ఏదో ఫోబియా నావెల్టీగా వుందని ఎత్తుకోవడం, దాన్ని బాక్సాఫీసు ఫ్రెండ్లీగా ఎలా మార్చాలో తెలీక రొటీన్ మూస ఫ్రేమల్లోకి తిప్పేయడం మనకలవాటే. ఈ అలవాటు కూడా ఒక ఫోబియాతోనే... ఏమిటీ, గోలీమార్ మన్మర్జియమ్ సొల్లమ్ ఫోబియా  అని కొత్తగా చదివావా? అది మనకర్ధం కాదు గానీ, అలా అని పబ్లిసిటీ చేసి నువ్వే కావాలి లవ్ స్టోరీ తీయ్, చూడక చస్తారా  - అని ఆత్మారాముడు అనడం, దానికి ఆత్మ సమర్పణ చేసుకోవడం. ఇంతకంటే అతిధి దేవోభవ అనే 1.5 రేటింగ్ సినిమాని విశ్లేషించుకుంటే రేటింగ్ కే అవమానమవుతుంది.

నటనలు- సాంకేతికాలు

  ఆది నటించిన పాత్రకి అర్ధం పర్ధం వుంటేగా అద్భుతంగా ఫీలవడానికి. ఒంటరిగా వుండాలంటే భయమనే ఫోబియాతో రకరకాల సైకో సీన్లు నటించడమే ఆదికి అద్భుతంగా అన్పించి, ప్రేక్షకులకి రికమెండ్ చేస్తే సరిపోతుందా? అసలీ పాత్రతో కామెడీ చేయాలో, థ్రిల్లర్ చేయాలో తేల్చుకోకపోతే తేలేది కన్ఫ్యూజనే. పాత్ర చిత్రణ వదిలేసి నటుడుగా చెప్పుకుంటే నటించగలడు. కాకపోతే ఇలాటి ఫ్లాప్ పాత్రలు నటించడమే ఇప్పటికి పదమూడో సారి సమస్య.

        హీరోయిన్ నువేక్ష అందంగా కన్పించడానికే తప్ప నటించడానికి కాదేమో. పాత్ర వుంటేగా నటించడానికి. సినిమా మొత్తంలో వర్క్ చేయకుండా రెమ్యూనరేషన్ తీసుకున్నది తనే అయుంటుంది. సప్తగిరి కామెడీకి నవ్వాలో ఏడ్వాలో అర్ధంగాని మానసిక స్థితి. యూట్యూబ్, ఫేస్బుక్ కొత్తకొత్త తెలుగు కామెడీ షార్ట్ వీడియోల ముందు సప్తగిరి కామెడీ ఔట్ డేటెడ్ అయిపోయింది. షార్ట్ వీడియోలని బీట్ చేసే కామెడీ చేయకపోతే సప్తగిరికి సమస్యే.

        ఇక ఇతర నటీనటుల గురించి టెంప్లెట్ గా చెప్పుకుంటే, పాత్రల పరిధి మేరకు చక్కగా ఒదిగిపోయి నటించారు. అక్కడక్కడ నవ్వులు పూయించి మెప్పించారు. ఒరిగిపోయి మనమీద నిద్రించలేదు. ఇక సాంకేతిక విలువలు, సంగీతం, దర్శకత్వం అన్నీ ఎలావుండ కూడదో అలా వున్నాయి. 

        దర్శకత్వం, దృశ్యాల్ని మల్చిన తీరు, కథ నడపడం అన్నిటా వైఫల్యమే కన్పిస్తుంది. ఫస్టాఫ్ ఇంటర్వెల్ వరకూ ఈ ఫోబియా కథలోకి వెళ్ళాలంటే ఫోబియా వల్ల కామెడీలతో గడపడం, సెకండాఫ్ లోనూ హీరోకున్న ఫోబియాతో ఎంతసేపూ సైకో సీన్ల తో కాలక్షేపం చేయడంతప్ప, ఫోబియాకి విరుగుడు దిశగా ప్రయాణించాలంటే ఫోబియా వల్ల, నసతోనే లాగించడమనే స్కీముని దిగ్విజయంగా అవలంబించాడీ కొత్త దర్శకుడు. ప్రేమిస్తున్నట్టు చివరిదాకా చెప్పలేక నస పెట్టే ప్రేమ సినిమాలున్నాయి. అదే ఇదీ. కాకపోతే ప్రేమ బదులు ఫోబియా. ప్రేమ సీసాలో ఫోబియా సారా పోస్తే కొత్త సినిమా.       

        12 ఫ్లాపుల తర్వాత హీరో ఆది, 20 ఏళ్ళ స్ట్రగుల్ తో కొత్త దర్శకుడూ చేసిన ఉమ్మడి కృషి - ఫ్లాపవుతుందని తెలియక ఇష్టపడి కష్టపడి తీసిన ఫ్లాప్. ఇలా అసలు బేసికల్ గా సినిమా అంటే ఏమిటో తెలుసుకోవడానికి మరిన్ని ఫ్లాపులు తీయాల్సిందేనేమో.
—సికిందర్

 

Wednesday, January 5, 2022

1112 : ఆర్టికల్

    2020, 2021 లలో ఒక మాయదారి మహమ్మారి మిగిల్చిన బాధాకర అనుభవాల్ని మర్చిపోయి కొత్త ఆశలు చిగురింప జేసుకుని సినిమా రంగం 2022 లోకి అడుగు పెడుతూంటే, ఇప్పుడూ వదలడం లేదు మరింకో రూపంలో విరుచుకు పడుతున్న పేచీకోరు మహమ్మారి. ఒమిక్రాన్ గా కోరలు చాచి పరిహాస మాడుతూంటే భారీ బడ్జెట్లతో తీసిన బాలీవుడ్ నిర్మాతలు సైతం వణికి పోతున్నారు. రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగి పోతూండడంతో, రాష్ట్రం తర్వాత రాష్ట్రం థియేటర్ల మూత, లేదా సీటింగ్ సామర్ధ్యంలో కోత అంటూ నిర్ణయాలు తీసుకోవడం సినిమాల విడుదలలకి గండంగా మారింది. హిందీ సినిమాలు, లేదా సౌత్ నుంచి వెళ్ళే పానిండియా సినిమాలూ విడుదల చేయాలంటే దేశవ్యాప్తంగా, కొన్ని బయటి దేశాల్లో, థియేటర్లు బార్లా తెరిచి వుండాలి. కానీ దేశం లోపలా, బయట ఓవర్సీస్ లోపలా కొత్త కోవిడ్ వేరియెంట్ ఒమిక్రాన్ నేను ముందు! అంటూ పోటీపడి ఎక్కడపడితే అక్కడ విడుదలవుతూంటే, సినిమాలెలా విడుదలవుతాయి? ఒకప్పుడు షోలే’, దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే ఐదేళ్ళు పైబడి ఆడాయి. కోవిడ్ కూడా అన్నేళ్లు ఆడాలని చూస్తోందేమో రూపాలు మార్చుకుని...

        డిసెంబర్ నుంచే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.  తీవ్రఅనారోగ్యంతో ఆసుపత్రిలో చేరే కేసులు, మరణాల సంఖ్యా చాలా తక్కువగా వున్నా, కేసుల ఆకస్మిక పెరుగుదలతో ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ మరోసారి అతలాకుతలమవుతుందన్న భయాందోళనలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ముందే థియేటర్లని మూయించేసింది. బాలీవుడ్ కి గుండె కాయైన ముంబాయిలో రాత్రి కర్ఫ్యూ విధించేశారు. బెంగళూరు, చెన్నైలలో థియేటర్లలో యాభై శాతం మేరకే సీటింగ్ సామర్ధ్యాన్ని అనుమతిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఈ పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేకపోయినా, పానిండియాలు కాబట్టి ప్రేక్షకుల గుమ్మం దాకా వచ్చిన  ఆర్ ఆర్ ఆర్’, రాధే శ్యామ్ విడుదలలు ఆగిపోయాయి.

        ఈ రెండు సినిమాల్ని కూడా కలుపుకుని బాలీవుడ్ లో ఇంకో రెండు హిందీ సినిమాలని లెక్కేస్తున్నారు : పృథ్వీరాజ్’, జెర్సీ’. షాహీద్ కపూర్ - మృణాళ్ ఠాకూర్ లు నటించిన జెర్సీ డిసెంబర్ 31 న విడుదల కావాల్సింది. నిరవధికంగా వాయిదా పడింది.  అక్షయ్ కుమార్- మానుషీ  చిల్లర్ నటించిన పృథ్వీరాజ్ జనవరి 21 న విడుదల కావాల్సింది. నిరవధికంగా వాయిదా పడింది. మధ్య యుగాల యోధుడు, సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ బిగ్ బడ్జెట్ చారిత్రాత్మకం సూర్యవంశీ వెతల్ని గుర్తుకు తెస్తోంది. ఇది కూడా అక్షయ్ కుమార్ నటించిన బిగ్ బడ్జెట్టే. 2020 మార్చిలో కోవిడ్ మొదటి రౌండు నుంచీ, 2021 రెండో రౌండునీ దాటుకుని, నాల్గు సార్లు వాయిదా పడి - ఏడాదిన్నర తర్వాత ఖర్మ అనుకుంటూ గత నవంబర్లో విడుదలైంది. అయినా ప్రేక్షకులు ఆసక్తి కోల్పోలేదు. పెద్ద హిట్ చేశారు. ఇదే ఎన్నిసార్లు విడుదలలు వాయిదాలు పడ్డా పృథ్వీరాజ్’, జెర్సీ’, ఆర్ ఆర్ ఆర్’, రాధేశ్యామ్ లకూ వర్తిస్తుంది.

        ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని  మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) ప్రభుత్వాని కొక అర్జీ పెట్టుకుంది. గత రెండు కోవిడ్ ల తర్వాత మళ్ళీ థియేటర్లు తెరవడానికి అనుమతించాక, మెరుగైన వెంటిలేషన్ సిస్టమ్‌లు, మెరుగైన పరిశుభ్రత, ఇతర భద్రతా ప్రోటోకాల్‌ల అమలు ద్వారా ప్రేక్షకులకి, థియేటర్లలోని సిబ్బందికీ సురక్షిత వాతావరణాన్ని థియేటర్ల యాజమాన్యాలు కల్పించాయి. ఎక్కడా ఒక్క సినిమా థియేటర్ నుంచి కూడా ప్రేక్షకులకి కోవిడ్ సంక్రమించిన ఉదంతాలు లేవు. అందుకని సినిమా హాళ్ళని మూసేసే బదులు, మహారాష్ట్ర సహా కొన్ని ఇతర రాష్ట్రాల్లో, సినిమా థియేటర్లలోకి ప్రవేశం కల్పించడానికి డబుల్ టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేయాలని కోరింది... ఈ సూచన సబబుగా వుంది. వేల కోట్ల రూపాయలు ధారబోసి డబుల్ టీకాలు వేసి ప్రజల ప్రాణ రక్షణతో సరిపెడితే కాదుగా? ఆర్ధిక రంగ పరిభ్రమణానికి కూడా టీకాలు తోడ్పడకపోతే వేలకోట్ల రూపాయలు అనుత్పాదక వ్యయమే అవుతుంది- రేపొక వేళ వేస్తే బూస్టర్ డోసు సహా.

—సికిందర్  


Monday, January 3, 2022

 CS Reddy, the director and my friend,
has achieved his exceptional dream at last. 
He says this blog was useful for his effort.







Sunday, January 2, 2022

A message from James Bonnet



 

1111 : సందేహాలు- సమాధానాలు


  

Q : శ్యామ్ సింగ రాయ్ సినిమా మూల కథను బాలకృష్ణ నటించిన ఆత్మబలం అనే సినిమా నుంచి తీసుకున్నారు అనిపించింది. దాని గురించి వివరించగలరు. శ్యామ్ సింగ రాయ్ లో పాత్రల చిత్రీకరణల మీద అసలు శ్రద్ధ పెట్టలేదు. ఎందుకు అలా జరిగింది? రెండవ పాత్ర అయిన రచయిత పాత్రను అంత బలహీనంగా ఎందుకు చేశారు? అలాగే మొదటి పాత్ర అయిన దర్శకుడి పాత్ర తన మీద అభియోగం మోపినపుడు తానే అసలు ఏం జరిగింది? శ్యాం సింగ రాయ్ ఎవరు?  అని వెతుకుతూ బయలు దేరి ఉంటే అప్పుడు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండి పాత్ర యాక్టివ్ వ్ మారేది కదా? అలాగే దర్శకుడి పాత్రకు శ్యామ్ సింగ రాయ్ లాగే ఆదర్శ భావాలు ఇప్పటికీ ఉండి తాను కూడా ఆడవాళ్ళ కోసం పోరాడుతూ సినిమా తీశాడు అని చూపించి, ఆ సినిమా శ్యామ్ సింగ రాయ్ కథతోనే తాను తీశాడని అభియోగం మోపబడి, తానే శ్యామ్ సింగ రాయ్ గురించి తెలుసుకుని, సమస్యను పరిష్కరించుకుని ఉంటే కథ అద్భుతంగా ఉండేది అనిపించింది. శ్యామ్ సింగ రాయ్ లాగా రెండు పాత్రల మీద కథ రాసుకున్నప్పుడు ఒక పాత్రను ఇలా గోదాట్లో వదిలేయాలి అంటారా? వివరించగలరు.

—పేరు వెల్లడించడాని కిష్టపడని అసోసియేట్
A : సినిమా హిట్టయ్యాక తప్పులు వెతికితే తప్పులో పడతామేమో ఇలా రాయాలంటే ఆలోచించాలి. మీరు చెప్పిన తప్పుల్ని ప్రేక్షకులు క్షమించి, లేదా ఉపేక్షించి, ఇంకా లేదా అవి తప్పులని తెలీక హిట్ చేశారేమో. ఎలా హిట్టయినా హిట్టన్పించుకున్న అర్హతే చర్చని పూర్వ పక్షం చేసేస్తుంది. అయితే మీలాటి మేకర్స్ కూడా హిట్టయ్యింది కాబట్టి తప్పులన్నీ ఒప్పయ్యాయని ఇలాగే సినిమాలు తీయాలనుకుంటేనే సమస్య వస్తుంది. ఈ హిట్ చూసి నేచురల్ స్టార్ నాని నుంచి కూడా ఇక ఇలాటి సినిమాలే నటిస్తానని స్టేట్ మెంట్ కూడా వచ్చింది. కనుక మరికొన్ని ఇలాటి తప్పులతోనే నాని నుంచి మరిన్ని  శ్యామ్ సింగ రాయ్ లు రావచ్చనీ, తప్పులే ఒప్పులని అవి కొత్త ప్రమాణాల్ని స్థాపించబోతాయనీ అర్ధం జేసుకోవచ్చు. అయినా కమర్షియల్ సినిమాల్లో ఒప్పులుంటాయని ఎవరాశిస్తారు గనుక విశ్లేషించడానికి.

        నేను అనారోగ్యంగా వున్నానూ వచ్చి పొమ్మని అన్న కబురంపితే, వెళ్ళిన రచయిత అయిన తమ్ముడు, ముందు అన్నెలా వున్నాడో చూడకుండా వదిన చేత అన్నం పెట్టించుకు తినడం లాంటి నాగరికత ప్రేక్షకులకి నచ్చి హిట్ చేస్తే ఎవరేమనగలరు. సమాజ ఉద్ధరణకి బయల్దేరిన రచయిత అయిన వాడు, ఒక దురాచార బాధితురాలిని చూసి ముందు ఆమెని ఉద్ధరించకుండా, లవ్ ఎట్ ఫస్ట్ తో ప్రేమలో పడడం, ఆ ప్రేమ కథే నడపడం కూడా ప్రేక్షకులకి నచ్చితే ఎవరేమంటారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామ రాజు వుంది. ప్రసిద్ధ రచయిత త్రిపురనేని మహారధి రచన చేశారు. ఇందులో కృష్ణ పోషించిన అల్లూరి పాత్ర దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాటమెలా సాగించాలో తెలుసుకునేందుకు దేశాటన  చేస్తానని ప్రేమించిన సీతతో చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన అల్లూరి ఎక్కడో ఇంకో సీతతో ప్రేమాయణం సాగిస్తే ఎలా వుంటుంది? ప్రేక్షకులు చప్పట్లు కొట్టి, హీరో కృష్ణ డ్యూయెట్లు చూసి ఎగిరెగిరి హిట్ చేసే వాళ్ళా?

    దేశాటన చేసి తిరిగి వచ్చిన అల్లూరి, అజ్ఞానంలో, శోకంలో ఈ జాతి ఎంత భయంకరంగా బతుకుతోందో చూశాను. విదేశీయుల కసాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేసే ముందు దేశ ప్రజలు తమ దాస్య బుద్ధి నుంచి విముక్తం కావాలి. అందుకు విప్లవ మార్గ మొక్కటే శరణ్యం  అని సీతకి చెప్పేసి మళ్ళీ సాగిపోతాడు. సాగిపోకుండా ఆమెతోనే వుంటే ఒప్పుకునే వాళ్ళా ప్రేక్షకులు? ఇప్పుడెందుకు సింగరాయ్ రచయిత పాత్రని అలా ఒప్పుకుంటున్నారు? జీవితం ఎలా వుంటుందంటే ఇలా వుంటుంది... జీవితం నీ కిచ్చిన పిలుపుని నువ్వు నిరాకరించావంటే, నిన్ను సృష్టించిన శక్తిని నువ్వు అవమానించుకున్నట్టేనని అంటాడు రాబిన్ శర్మ- ది మాంక్ హూ సోల్డ్  హిజ్ ఫెరారీఅన్నతన  
పాపులర్ పుస్తకంలో. ఇలా వుంటుంది జీవితం. సింగరాయ్ జీవితమిచ్చిన పిలుపుతో సమాజోద్ధరణకి ఇంట్లో వ్యతిరేకించి వెళ్ళిపోయిన వాడు మరి! నిజానికి అల్లూరి జీవితంలో సీత కల్పిత పాత్ర. దాంతో మాస్ అప్పీల్ కోసం మహారధి ఏమైనా చేయొచ్చు, చేయలేదు. ఎందుకు చేయలేదు? అల్లూరి ప్రేక్షకులకి తెలిసిన నాయకుడనా? కాదు, తెలిసిన నాయకుడైనా, తెలియని కల్పిత నాయకుడైనా ప్రేక్షకుల్ని మభ్యపెట్టే పని ఏ రచయితా చేయలేడు. చేస్తే అతను రచయిత కాదు.

        పాత సినిమా కథలు ఇప్పుడు పనికి రావనే మాట నిజమే. కానీ పాత సినిమాల్లో విలువలు కూడా పనికి రావన్నట్టు చిత్రణలు చేసే కాలం వచ్చినట్టుంది...విలువలు మారిపోయాయి. లేదా ప్రేక్షకులకంత పరిశీలనగా సినిమాలు చూసే ఓపిక లేదేమో. ఒకప్పుడు సినిమాలు చూసి సగటు ఆడవాళ్ళు వీధిలో కూర్చుని పాత్రల గురించి చర్చించుకునే వాళ్ళు. పంతులమ్మ లో లక్ష్మి పోషించిన పాత్ర, కోరికలే గుర్రాలైతే లో ప్రభ, చంద్ర మోహన్ల పాత్రలు... వ్యాపారాలు చేసే మగవాళ్ళు కూడా షాపులో కూర్చునికృష్ణవేణి లో వాణిశ్రీ పాత్రని విశ్లేషించుకోవడం...ఇప్పుడిలాటి దృశ్యాలు కన్పిస్తున్నాయా? ఫటాఫట్ గా ఏదో సినిమా చూశామన్పించుకోవడం - ఎఫ్బీలోనో, ట్విట్టర్ లోనో ఓ కామెంట్ పడేసి- పోటాపోటీగా పనీ పాటల్లోకి వెళ్ళిపోయి - సినిమాని ఫినిష్ ఇక మర్చిపోవడం!     

    ఇలా తప్పులో పడినా సరే తప్పదనుకుంటే మాట్లాడుకుందాం... పునర్జన్మ కథతో బాలకృష్ణ నటించిన ఆత్మబలం (1985), సుభాష్ ఘాయ్ తీసిన హిందీ కర్జ్ (1980) కి రీమేక్ అని తెలిసిందే. కర్జ్ వఛ్చేసి ది రీయింకార్నేషన్ ఆఫ్ పీటర్ ప్రౌడ్ (1975) అనే  హాలీవుడ్ కి రీమేక్ అనీ, ఈ హాలీవుడ్ మూవీకి అదే పేరు గల నవల ఆధారమనీ సమాచారముంది. ఇందులో ఈ జన్మలో మ్యూజీషియన్ అయిన హీరో రిషీ కపూర్, గిటార్ వాయిస్తున్నప్పుడు, జ్ఞాపకాల తెరలు తొలిగి పూర్వజన్మలో మ్యూజీషియన్ అయిన రిషీ కపూర్ ట్యూన్స్ కి కనెక్ట్ అవుతాడు. దీంతో పూర్వ జన్మలో తాను ఫలానా అని గుర్తిస్తాడు. పూర్వజన్మలో తను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయే తనని చంపిందని కూడా దృశ్యాలు మెదిలి, ఆ భార్య (సిమీ గరేవాల్) మీద పగదీర్చుకోవడానికి బయల్దేరడం కథ. ఆ పగే తను తీర్చుకోవాల్సిన గత జన్మ రుణం (కర్జ్).  

        ఇక్కడ శ్యామ్ సింగ రాయ్ తో పోలిక ఇరు జన్మల టాలెంట్స్ తోనే. కనెక్టవడం దాంతోనే. కర్జ్ లో పూర్వజన్మలో మ్యూజీషియన్ అయిన తనకి కి ఈ జన్మలో మ్యూజీషియన్ అయిన హీరో ట్యూన్ ద్వారా కనెక్ట్ అయ్యాడు. శ్యా సి రా లో పూర్వ జన్మలో రచయిత అయిన తను, ఈ జన్మలో సినిమా డైరెక్టరుగా సినిమా తీసి కనెక్ట్ అయ్యాడు. రెండు జన్మల్నీ కలిపే ఈ బ్రిడ్జింగ్ ఎలిమెంట్స్ తప్ప కథలు వేర్వేరు. కాబట్టి ఇది పక్కన బెడదాం.

       పాత్రల విషయానికొస్తే రెండిట్లోనూ ఫండమెంటల్ డిఫెక్ట్స్ వున్నాయి. అవేమిటంటే, మీరన్నట్టు దర్శకుడి పాత్రని తన పూర్వ జన్మ రహస్యం తను తెలుసుకునే ఎమోషనల్ జర్నీ వైపు మళ్ళించకుండా, కోర్టులో లీగల్ సమస్యగా చేసి అతణ్ణి పాసివ్ గా కూర్చోబెట్టేయడం. పునర్జన్మనేది జన బాహుళ్యానికి ఎమోషనల్- సెంటి మెంటల్ ఇష్యూయే తప్ప లీగల్ ఇష్యూ కాదు. ఇక రచయిత పాత్ర- పైగా మార్క్సిస్టు భావాలున్న రచయిత పాత్రని -దురాచార నిర్మూలన కోసం పోరాడే పాత్రగా కాక లవర్ బాయ్ గా మార్చేయడం. ఈ క్రమంలో ప్రేమా పెళ్ళీ గొడవల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం, సమాజోద్ధరణకి ప్రాణత్యాగం చేయకుండా. ఫండమెంటల్ డిఫెక్ట్స్ తో ఈ పాత్రలూ, వాటి కథలూ ఎలా బలహీనంగా, తప్పుల తడకగా వుండచ్చో అలా వున్నాయి. ఇంతకంటే విశ్లేషణ అనవసరం. ఈ రెండు పాత్రలే కాదు, హీరోయిన్ సాయి పల్లవి పోషించిన దేవదాసీ పాత్ర సైతం డిటో ముగింపు సహా. ముగింపులో పిల్లలకి నాట్యం నేర్పిస్తూ జీవనం సాగిస్తూంటుంది. ఏ నాట్యమైతే తనని దేవదాసీ గా చేసి ఉదర పోషణ కోసం ఆడించిందో, ఆ నాట్యంతోనే బ్రతుకు తెరువు చూసుకోవడం! పాత్ర చిత్రణలంటే ఇవే, విలువలంటే ఇవేనని ఇలాగే సినిమాలు తీస్తూ పోవచ్చు.  

Q : ఒక థ్రిల్లర్ కథ తక్కువ బడ్జెట్ లో రాసుకున్నాను. దీని స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉందంటారా చూసి చెప్పగలరు.
—ఎన్ కె, రచయిత
A : ఇలా కథలు పంపించి చదివి చెప్పమంటే చదవడమూ సాధ్యం కాదు, చదివి చెప్పడమూ అయ్యే పని కాదు. మీరే కాదు, తరచూ కొందరు ఇలా కథలు పంపించేసి అడుగుతున్నారు. ఏవైనా సందేహాలుంటే ఈ శీర్షికకి రాయవచ్చు, సమాధానం దొరుకుతుంది. రాసుకున్న కథల గురించి అడగాలంటే మాత్రం ముందుగా సంప్రదించాలి. ఇలా కాకుండా పంపిస్తూ పోతే ఇంతే సంగతులు. ఇంకొందరు సాహిత్య కథలు కూడా పంపిస్తున్నారు. పాశ్చాత్య నవలాకారులు త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ గురించే మాట్లాడతారు స్క్రీన్ ప్లేలకి లాగా. కానీ రాయడం మాత్రం త్రీయాక్ట్స్ స్ట్రక్చర్లో నవలల్లాగా రాస్తారు, సినిమా ల్లాగా కాదు. కథానికలు కూడా ఇంతే. ఐతే మనం వీటికి సలహా సంప్రదింపులు మాత్రం పెట్టుకోవడం లేదు.

Q : విజువల్ స్టోరీ టెల్లింగ్ కి రిఫరెన్స్,  లేదా ఆ బ్రెయిన్ డెవలప్ అవడానికి బుక్స్ ఏమైనా రిఫర్ చేయగలరా?
—కె. హరీష్, అసోసియేట్
A : విజువల్ స్టోరీ టెల్లింగ్ గురించి నెట్ లో మీకు సమాచారం దొరుకుతుంది. బుక్స్ కూడా చాలా వున్నాయి. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. షో డోంట్ టెల్ కి మాత్రం బుక్స్ లేనట్టున్నాయి, నెట్ లో సమాచారముంది. ఈ రెండిటికీ తేడా ఏమిటనొచ్చు. తేడా ఏమీ లేదు- రెండూ సీన్ల సంఖ్యని, నిడివినీ  తగ్గించే ఉపాయాలే. కేవలం ఇవి చదివితే ఉపయోగం లేదు. సినిమాలు చూస్తూ అన్వయించుకోవాలి. దీని ప్రకారం సీన్లు వుంటున్నాయా, లేకపోతే ఎలా మార్చవచ్చనే అభ్యాసం అలవాటు చేసుకోవాలి.

—సికిందర్