రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, డిసెంబర్ 2020, శుక్రవారం

 

2018 జులై రెండో వారం నుంచి 2019 జనవరి రెండో వారం వరకూ నోటెడ్ 
సినిమాలు 38 విడుదలయ్యాయి. వీటిలో రోమాంటిక్ కామెడీలు 6, 
రోమాంటిక్ డ్రామాలు 2, బ్రొమాన్స్1, హార్రర్ కామెడీ 1, కామెడీలు 2 
విడుదలయ్యాయి. ఫ్యామిలీలు 4, యాక్షన్ 13, స్పై1, సస్పెన్స్ థ్రిల్లర్ 2, ఫాంటసీలు 2, 
సైన్స్ ఫిక్షన్ 1, రాజకీయం 1, బయోపిక్ 1, రియలిస్టిక్ 1,  విడుదలయ్యాయి. 
ఈ 38 లో 4 హిట్టయ్యాయి, 5 ఏవరేజీలు కాగా, మిగిలిన 29  ఫ్లాపయ్యాయి. 
వీటి జాతకాలు నిర్ణయించిన మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ లెలా వున్నాయో చూద్దాం. ముందుగా  రోమాంటిక్ కామెడీలతో ప్రారంభిద్దాం...

1. నర్తనశాల 
నాగశౌర్య – కశ్మీరా పరదేశీ; శ్రీనివాస్ చక్రవర్తి (కొత్త దర్శకుడు)

మార్కెట్ యాస్పెక్ట్ : పాయింటు కొత్తదే, స్టేజి నాటకం చిత్రీకరణ – ఫ్లాప్

క్రియేటివ్ యాస్పెక్ట్  : సెకండాఫ్ సిండ్రోమ్ – ఫ్లాప్  
          గే’ పాత్రలతో రోమాంటిక్ కామెడీ తెలుగులో కొత్త కథే.  తరానికి యూత్ అప్పీల్ వున్నదే. కానీ అయిడియా వరకే కొత్తదాంతో అల్లిన కథంతా పాతావకాయ. సినిమా కథ అనికూడా చెప్పలేకుండా స్టేజి డ్రామాలా తీశారు. ఇప్పటి సినిమా లక్షణాలేవీ కన్పించని అరిగిపోయిన పాత స్కూలు మూస అన్పించారు. ఎత్తుకున్న గే’ అనే పాయింటు వదిలేసి ఏటో వెళ్ళిపోయే దారీ దిక్కూలేని వ్యవహారం. హీరోయిన్ తో రోమాన్స్ గానీ, ‘గే’ రోమాన్స్ గానీకామెడీ గానీ లేకుండా ఏం తీశారోఎవరికోసం తీశారో అర్ధంగాని అయోమయం. 

2. పేపర్ బాయ్
                                        సంతోష్ శోభన్ – రియా సుమన్; వి. జయశంకర్ (కొత్త దర్శకుడు)

                                              మార్కెట్ యాస్పెక్ట్ : గిటార్ ప్రేమ బదులు వీణ ప్రేమ – ఫ్లాప్
  
 
                                        
 క్రియేటివ్ యాస్పెక్ట్: అచ్చులో చదువుకునే కథాకథనాలు - ఫ్లాప్ 

           యూత్ అప్పీల్ కి వాస్తవ దూరమైన పాత ఫార్ములా కథ. తెర మీద చూస్తున్నప్పుడుఇది అచ్చులో లభిస్తే చదువుకోవడానికి బావుంటుందన్పించే కథ. షార్ట్ మూవీగా తీసినా కూడా వర్కౌట్ అవచ్చనే కథ. అచ్చులో కథలో పాత్రల్నిషార్ట్ మూవీస్ లో పాత్రల్నిసినిమాకి మల్చడంలో విఫలమైన కథ. సమకాలీన సినిమాకి దూరంగా పేదింటి అబ్బాయి పెద్దింటి అబ్బాయి కోటలో రాణి – పేటలో రాజా’ టైపు ఎన్నోసార్లు తెలిసితెలిసి – తెలిసిపోయీ వున్న పురాతన కథ. రోమాంటిక్ కామెడీ అవలేదు సరికదావున్న కథతో రోమాంటిక్ డ్రామాగా కూడా లేదు. యూత్ కి కావాల్సింది గిటార్ ప్రేమ సినిమాలేగానీవీణ ప్రేమ సినిమాలు కాదనేది ఒక మార్కెట్ వాస్తవం. దీనికి దూరంగా అమార్కెటీయ మర్కటం’ గా తేలిందీ ప్రయత్నం 

3. 24 కిస్సెస్ 


అదిత్ అరుణ్ – హేబ్బా పటేల్;  అయోధ్య కుమార్ (ఒక సినిమా దర్శకుడు)

మార్కెట్ యాస్పెక్ట్ : ముద్దుల అప్పీల్ ని పిల్లల ఆకలి కథ మింగేసింది - ఫ్లాప్ 

క్రియేటివ్ యాస్పెక్ట్ : సెకండాఫ్ సిండ్రోమ్ – ఫ్లాప్ 
              కథలో చెప్పిన 24 ముద్దుల థియరీకి ఆధారాలేమిటోచూపించలేదు. వాత్సాయనుడు కూడా చెప్పివుండడు. ఇది కల్పితమనుకోవాలి. కానీ ఇది నిజమేనుకుని యూత్ ఫాలో అయ్యే అవకాశముంది. అప్పుడు అమ్మాయిలే  ఫినిష్ అయిపోయేలాగా కథ వుంది. ఎలాగంటే, ఈ  కథలో చూపించినట్టుగా ముద్దుల సెక్షన్ కాస్తా శృంగార సెక్షన్ గా మారిపోవచ్చు. అప్పుడు లబోదిబోమనడమే  కథలో లాగా అప్పుడు ఈ కథలోలాగా సినిమాటిక్ ఫార్ములా పరిష్కారాలతో బయటపడలేరు. సుఖాంతం చేసుకోలేరుఅయితే ఒక ‘మంచి ఉద్దేశం’తో ప్రారంభమయ్యే ఈ ముద్దులు పోనుపోను బూతుగా మారిపోయిన విషయం కూడావుంది. ఇంకా  ముద్దుల కథ మధ్యలోగతంలో దర్శకుడు తీసిన మిణుగురులు’ కథని కూడా బోనస్ గా ఇచ్చాడు. దర్శకుడు గతంలో తీసిన  మిణుగురులు’ హేంగోవర్ లోంచి ఇంకా బయటికి రాలేదు. ముద్దుల కథలో అన్నంకోసం తపించే వీధిబాలల ఆక్రందనల కథేమిటో అర్ధం గాదు సెకండాఫ్ లో.


4. పడిపడి లేచె మనసు 

శర్వానంద్- సాయిపల్లవి; హను రాఘవపూడి (3 సినిమాల దర్శకుడు) 

మార్కెట్ యాస్పెక్ట్ : ట్రాజిక్  రోమాన్స్ - ఫ్లాప్. 

క్రియేటివ్ యాస్పెక్ట్ : సెకండాఫ్ సిండ్రోమ్ - ఫ్లాప్
          ఫస్టాఫ్ పాత మూస ఫార్ములా లవ్ ట్రాక్, అది కూడా  హీరోహీరోయిన్ల చిన్నపిల్లల లాంటి సిల్లీ మనస్తత్వాలతో. ఇంటర్వెల్లో ‘మరోచరిత్ర’ పాయింటుతో ట్రాజిక్ లవ్ ప్రారంభం. ఇప్పుడెంత సూపర్ స్టార్లయినా ట్రాజడీ కథలెవరిక్కావాలి. తెలిసిన సమచారాన్నిబట్టి సెకండాఫ్ లో కన్యూజన్ వుందని దర్శకుడు వేరే రచయితని రాయమని అడిగాడు. ఆ రచయిత రాయలేదు. దర్శకుడు అలాగే తీశాడు. అసలే ట్రాజడీని అతుకుల బొంత కథనం మరింత ట్రాజడీగా మార్చింది. 
 5.. హలో గురూ ప్రేమ కోసమే


రామ్ - అనుపమా పరమేశ్వరన్ - ప్రకాష్ రాజ్; త్రినాధ రావు నక్కిన (ఐదు సినిమాల దర్శకుడు)

మార్కెట్ యాస్పెక్ట్ : రోమాంటిక్ కామెడీ ప్రమాదం తప్పింది - ఏవరేజి

క్రియేటివ్ యాస్పెక్ట్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి తగ్గ విటమిన్ల లోపం – ఏవరేజి
          చాలాచాలా సార్లు చూసేసిన పాత కథే. కూర్చోబెట్టే బలమైన పాయింటేమీ లేదుగానీకథనం వేగంగా ఆసక్తికరంగా సాగుతుంది. ఇది  ఫస్టాఫ్ లో. సెకండాఫ్ లో వేగం తగ్గి సెంటిమెంటల్ డ్రామాగా మారుతుంది. ఇచ్చిన మాట కోసం హీరోతో ఫ్రెండ్ గా  మెలగాల్సి వచ్చే హీరోయిన్ తండ్రి కథ ఇది. దీనికి  ముగింపు కూడా రొటీన్ గా ఇచ్చారు. కథనంలో ఎన్నో ట్విస్టులు ఇచ్చి, ముగింపుని సాదాగా వదిలేయడం పెద్ద లోపం. ఈ కథ ప్రేమకథగా హీరోహీరోయిన్ల మధ్యే సాగివుంటే మార్కెట్ కోల్పోయిన అన్ని ప్రేమ సినిమాల్లాగే ఫ్లాపయ్యేది. ప్రేమ పాయింటునే హీరోయిన్ తండ్రికీ, హీరోకీ మధ్య సెంటిమెంటల్ డ్రామాగా నడపడం ఏవరేజీగా నైనా మిగిలింది. వాళ్ళిద్దరి మధ్య సెంటిమెంటల్ డ్రామా కాకుండా, కామెడీ నడిపివుంటే  యూత్ అప్పీల్ తో మరికొంత బాగుపడేది. 

6. చిలసౌ
                   సుశాంత్ -  రుహానీ శర్మ; రాహుల్ రవీంద్రన్ (కొత్త దర్శకుడు) 

                మార్కెట్ యాస్పెక్ట్ : కొత్తగా రియలిస్టిక్ రోమాంటిక్ డ్రామెడీ - ఏవరేజి 

                           క్రియేటివ్ యాస్పెక్ట్ : ప్రయోగాత్మకం - ఏవరేజి
           ‘అందాల రాక్షసి’, ‘అలా ఎలా’ రోమాంటిక్ కామెడీల హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడయ్యాడు. హిట్సు లేని హీరో సుశాంత్ తో రోమాంటిక్ డ్రామెడీ తీశాడు. ప్రేమ సినిమాలంటే హీరో హీరోయిన్లు అపార్ధాలతో విడిపోవడమోప్రేమలో ఎస్ చెప్పడానికి నాన్చడమో చేసే రెండే రెండు టెంప్లెట్స్ తో పదేపదే నిస్సిగ్గుగా వచ్చిపడుతున్న భావదారిద్ర్యపు మాయదారి కాలంలోరవీంద్రన్ ఒక తాజాదనాన్ని మోసుకొచ్చాడు.  తజాదనంలో అతడి తాలూకు తమిళతనం ఎక్కడాలేదు. తెలుగులో అత్యంత అరుదై పోయినకాస్త నిజ జీవితాలు ఉట్టిపడే రియలిస్టిక్ ప్రేమ సినిమాల కొరత తీరుస్తూకథ ఏమీ లేకుండానే ఒకే రాత్రి జరిగే కథతో కథంతా కూర్చోబెట్టి చెప్పాడు.

          
లా 6 రోమాంటిక్ కామెడీల్లో 2  ఏవరేజీలు, 4 ఫ్లాపులు వచ్చాయి. ఇంకా విడుదలైన చిన్నా చితకా రోమాంటిక్ కామెడీలు 50, 60 వుంటాయి. ఇవన్నీ అట్టర్ కంటే అట్టర్నర ఫ్లాపులు. ఇంకా విడుదలయ్యే ఛాన్సే లేకుండా మూలనపడ్డవి వందల్లో వున్నాయి. ఇదో పెద్ద చేపల మార్కెట్. ఏదో  ప్రేమల్లో  పండితుడైనట్టు  రోమాంటిక్కు  రాసుకుని ఈ మార్కెట్ కే పరిగెడతాడు కొత్త దర్శకుడు. అక్కడే నిర్మాత వుంటాడు. పరస్పరం గాలాలేసుకుని పట్టేసుకుంటారు. ఇక గంపల్లో చేపలు, కంపెనీల్లో ఏడ్పులు. 

          రోమాంటిక్ కామెడీలు హిట్టవ్వాలంటే అప్రోచ్ మార్చాలి గురూ, అప్రోచ్ మార్చాలి. ముందు నేటి యూత్ ని స్టడీ చేసి రియలిస్టిక్ అప్రోచ్  నేర్చుకోవాలి. ఇంకా పిల్లకాయ లొట్టపీసు ప్రేమలు తీయడానికి సిగ్గుపడాలి. అసలు రోమాంటిక్ కామెడీల నిర్వచనం, జానర్ మర్యాదలు తెలిస్తే గా.
 ముసలి మైండ్ సెట్ తో ముసలి ప్రేమలు తీసి ముంచడమేగా.

సికిందర్ 

10, డిసెంబర్ 2020, గురువారం

 ప్రకృతి -  ప్రపంచం 
ఈ భూమ్మీద రెండున్నాయి -ప్రకృతి, ప్రపంచం. మనస్సుకి ప్రకృతి, శరీరానికి ప్రపంచం. ఈ బ్లాగు మన ప్రకృతి, సినిమాలు ప్రపంచం. ప్రస్తుతం ప్రపంచం ఎక్కువై  ప్రకృతి తగ్గింది.  ప్రపంచ భారం కాస్త తగ్గితే  ప్రకృతిలోకి రావొచ్చు. ఎప్పుడు తగ్గుతుంది? ఏమో, అయినా ఎలాగో అవకాశం చూసుకుని ప్రకృతిలోకి రావాలి. రాకపోతే జీవితం వికృతి అయిపోతుంది. ప్రపంచంతో ప్రకృతిని బ్యాలెన్స్ చేయకపోతే జీవితం ఒకవైపు వొరిగిపోతుంది. జీవించడానికి తూనిక రాళ్ళే మిగులుతాయి. అప్పుడు రాళ్ళెట్టి ఎంత కొట్టినా ప్రకృతి ఫలాలు రాలవు. ఈ పరిస్థితి రాకూడదని బలంగా కోరుకుంటూ, అతి త్వరలో బ్లాగుకి తిరిగి వద్దాం.  
సికిందర్

29, నవంబర్ 2020, ఆదివారం

1002 : సందేహాలు -సమాధానాలు

  


Q:  (ఇక్కడ అందిన ఒక ప్రశ్నని ప్రచురించకుండా సమాధానస్తున్నాం) 
A : ఇలాటి వాటికి బ్లాగులో చోటివ్వడం లేదని గమనించ గలరు. సినిమా గాసిప్స్, రాజకీయాలు, ఆంతరంగిక విషయాలు మొదలైన వాటికి బ్లాగులో చోటు లేదు. స్వేచ్ఛ వుంది కదాని బ్లాగులో ఇష్టమొచ్చినట్టు రాసుకోలేం. పైన బ్లాగ్ పేజీ హెడర్ కింద రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు అని మాత్రమే క్రాస్ కాలమ్ వుంది. అయినా తరచూ ఇలాటి ప్రశ్నలే మీరు పంపుతున్నారు. మరి కొందరిది కూడా ఇదే ధోరణి. వాటిని పక్కన పెడుతూ వచ్చాం. వీటికి కౌన్సెలింగ్ చేయడం మాకు రాదు, మా పని కాదు. కథలకి  సంబంధించి మాత్రమే ప్రశ్నలు పంపండి. మీరు చాలా క్రైసిస్ లో వున్నారని తెలుస్తోంది కాబట్టి ఈ ఒక్కసారికి చేతనయినంత స్పందించి వదిలేస్తున్నాం. 

        మీరు చెప్పే సమస్య విధానపరమైన సమస్య. దాన్ని వ్యక్తిగత సమస్యగా మీరు ఫీలవుతున్నారు. సబ్జెక్టు గురించి వాదోపవాదాలు విధానపరమైన విభేదాలు. వాటిని వ్యక్తిగతంగా ఫీలైపోయి, బయటికి తెచ్చి వ్యక్తిని తిట్టడం ప్రొఫెషనలిజం కాదు. రిలేషన్స్ వుంచుకోవాలి. రేపు మళ్ళీ ఎప్పుడైనా కలిసి పనిచేసే అవకాశం రావచ్చు. 

        ఎట్టి పరిస్థితిలో కమిటైన పనిని మధ్యలో వదిలేసి వెళ్లిపోకూడదు, ఇంట్లో అత్యవసర పనులున్నా సరే. ఒక ప్రముఖ రచయిత మరణశయ్యపై వున్న తండ్రి పక్కన కూర్చుని, విదేశంలో షూటింగు జరుపుకుంటున్న సినిమాకి సీన్లు రాసి పంపాడు. కాబట్టి వెళ్లిపోయే పరిస్థితి అవతలి వ్యక్తి కల్పిస్తే తప్ప, కమిటైన పనిని మధ్యలో వదిలేసి వెళ్లిపోకూడదు. అవతలి వ్యక్తి కారణంగా జరిగినా కూడా నో హార్డ్ ఫీలింగ్స్. పాజిటివిటీనే డిపాజిట్ చేసి రావాలి. ఆరోగ్యం ముఖ్యం. 

        అసలు విషయమేమిటంటే, రైటర్ అన్నవాడికి తన బాధలు చెప్పుకుని స్వాంతన పొందే సౌకర్యం వుండదు. ఇంకా చాలా సౌకర్యాలుండవు. రైటర్ అనే వాడు విక్టిమ్ కార్డు ప్లే చేస్తే చులకనై పోతాడు. తన బాధల్ని తట్టుకోలేని రైటర్, కథల్లో వివిధ పాత్రల సమస్యలకి పరిష్కారాలేం చూపిస్తాడు. పరిష్కారాల కోసం పాత్రలు ఎదురు చూస్తూంటాయి. రైటర్ తన బాధలే చెప్పుకుంటే, వీడూ మనలాంటోడే నని వదిలేసి పోతాయి. పాత్రల సమస్యలే తన బాధగా వుండే రైటర్ నిజమైన రైటర్. ఈ బాధలు చెప్పుకోవచ్చు. రాధిక రాముని రాచిరంపాన పెడుతోంది, దీనికేం చేయాలీ? అని అడగొచ్చు. స్పై కథల్లో గూఢచారి పాత్రల్ని చూసే వుంటారు. వాటికి ప్రపంచ బాధే తమ బాధ!

సికిందర్ 


23, నవంబర్ 2020, సోమవారం

1001 : సందేహాలు -సమాధానాలు

 

Q : ఈ మధ్య చాలా సినిమాలలో ఓ పది నిమిషాలు వర్తమాన కధ చూపించి, వెంటనే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయి, అసలు కధ చూపించి, క్లయిమాక్సులో మళ్లీ వర్తమానం లోకి వస్తున్నారు. అప్పటికి మొదటి పది నిమిషాల పరిచయం ఎవరికీ గుర్తు ఉండదు. నా ఉద్దేశంలో ఈ ప్రక్రియ వలన ప్రేక్షకుల సమయం అంటే మొదటి పది నిమిషాలు వృధా కావడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. మీ అభిప్రాయం తెలుపండి.
బోనగిరి

A : ఫ్లాష్ బ్యాకులు ఆర్భాటాల కోసమే వుంటున్నాయి తప్ప గుణాత్మకంగా కథ చెప్పడానికి వుండడం లేదు. రాంగోపాల్ వర్మ ఫ్లాష్ బ్యాకులు లేకుండానే సినిమాలు తీస్తారు. కథలో దమ్మున్నా లేకపోయినా దాని ఖర్మకి వదిలేస్తారు. ఆయనకి లేని ఆరాటం ఇతరుల కెందుకు. ఫ్లాష్ బ్యాకులతో తీసి 90% సూపర్ హిట్లు ఇవ్వడం లేదుగా. ఒక సరళ రేఖలో కొనసాగుతున్న కథకి ఎక్కడైనా మలుపు తిప్పే సమాచారముంటే, ఆ ముక్కని అక్కడ సర్ప్రైజ్ ఎలిమెంటుతో కూడిన ఫ్లాష్ బ్యాకుగా వాడుకున్నప్పుడు, కథకి క్రియాత్మకంగా వాడుకున్నట్టవుతుంది. కథని ఉన్నతీకరించి నట్టవుతుంది. ఈ మధ్య ఒక సరళ రేఖగా వున్న కథకి ప్లాట్ పాయింట్ టూ లో, ఓ ఫ్లాష్ బ్యాక్ ముక్క పట్టుకొచ్చి వేస్తే, పాత్ర ఎదుర్కొంటున్న సమస్యకి అదే పరిష్కార మార్గమై పోయింది! పైగా ప్లాట్ పాయింట్ టూ మలుపుగా కూడా పనికొచ్చింది. సర్ప్రైజ్ గా కూడా వుంది. నిజానికీ ఫ్లాష్ బ్యాకు దర్శకుడి విజన్ లో రొటీన్ గా వుంది. కథ ముగింపు ఆయనకి తెలీదు, ఏం చేయాలో మనకీ తెలీదు. మొదట సినాప్సిస్ లో కూడా ముగింపు పెండింగులోనే వున్న దయనీయ పరిస్థితి. అడ్డుపడుతున్న ఫ్లాష్ బ్యాకుని పక్కన పెట్టి, కథ చేసుకుంటూ పోతూంటే, ప్లాట్ పాయింట్ టూలో ఆ ఫ్లాష్ బ్యాక్ రివ్వున వచ్చి పడిపోయింది. దాంతో కథకి ముగింపు కూడా వచ్చేసింది. ఆ ఫ్లాష్ బ్యాకుని చిన్న ముక్కగా కుదించి వాడేం. సర్ప్రైజింగ్ గా వుండాలంటే ఒక మెరుపులా చిన్న ముక్కగానే వుండాలి  తప్ప చాట భారతం కాదు. ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్ హీరో హీరోయిన్ల కనువిప్పుకి కూడా ఉపయోగపడింది. ఇంకా చాలా తాత్పర్యాలు వచ్చాయి. కథకి నిండుదనం వచ్చింది. ఇన్ని ప్రయోజనాలు సాధించింది ఫ్లాష్ బ్యాక్. దీంతో ఫ్లాష్ బ్యాకు అనేది కథకి క్రియాత్మకంగా ఉపయోగపడాలని మన బుద్ధికీ చాచి కొట్టినట్టు ఒక కనువిప్పు లాంటిది అవ్వాల్సింది అయ్యింది.

 Q :  మీ బ్లాగ్ చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. నాదొక ప్రశ్న.మీరు సినిమా స్క్రిప్ట్ కోసం కచ్చితంగా స్ట్రక్చర్ ఫాలో అవమంటారు కానీ నేను రాసుకున్న కొన్ని కథలకు అది కుదరడం లేదు. నా క్రియేటివిటీ మిగతా రూల్స్ ను డామినేట్ చేస్తుంది. అయితే మీరు ఒకసారి చెప్పినట్టు ఒకవేళ స్ట్రక్చర్ ఫాలో అవలేకపోతే స్క్రిప్ట్ లో ప్రతి పది నిమిషాలకు ఒకసారి బ్యాంగ్ ఇస్తూ పోవడం లాంటివి చేసుకోమన్నారు. దానికి ఉదాహరణగా భలే భలే మగాడివోయ్ సినిమా చెప్పారు. మరి అలా క్రియేటివ్ గా కథలు రాసుకోవాలి అనుకునేవాళ్లు ఈ పది నిమిషాలలో బ్యాంగ్ పద్దతి ఫాలో అవడం మంచిదేనా? అలా పది నిమిషాలలో బ్యాంగ్ అంటే కథను ఎలా రాసుకోవాలి వివరించగలరు.
ప్రణవ్, అసిస్టెంట్

A :    ఈ బ్లాగుని ఫాలో అవుతూ సొంతబడి (క్రియేటివ్ స్కూల్) ప్రశ్న అడిగితే ఎలా. మీ సొంతబడి క్రియేటివిటీకి ఇలా చెయ్యాలీ అని చెప్పడానికి పాఠాలేముంటాయి. మీ ఇష్టం వచ్చినట్టు మిడిల్ మాటాష్ చేసుకోవచ్చు, ఎండ్ సస్పెన్స్ చేసుకోవచ్చు, సెకండాఫ్ సిండ్రోమ్ చేసుకోవచ్చు, పాసివ్ పాత్రలు చేసుకోవచ్చు, కథ గాకుండా గాథలూ చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. ఆకాశమే మీ హద్దు. రెండో సినిమా అవకాశం ప్రశ్నార్ధకం చేసుకుంటూ 90% అట్టర్ ఫ్లాపుల క్లబ్బులో చేరిపోనూ వచ్చు.   

        స్ట్రక్చర్ స్కూల్లో కథ చేసుకోవడానికి బేస్ గా మనుషుల మానసిక లోకపు నిర్మాణ మంటూ ఒకటుంది. ఏమిటి మనుషుల మానసిక లోకపు నిర్మాణం? కాస్త అప్పర్ మైండ్, ఇంకాస్త ఇన్నర్ మైండ్, ఓ దిక్కుమాలిన ఇగో. అప్పర్ మైండ్ అంటే కాన్షస్ మైండ్. ఇన్నర్ మైండ్ అంటే సబ్ కాన్షస్ మైండ్. సబ్ కాన్షస్ మైండ్ అంటే అంతరాత్మ. ఇగో అనేది అప్పర్ మైండ్ లో ఎంజాయ్ చేయడాని కిష్టపడుతూ, అప్పర్ మైండ్ కీ, అంతరాత్మకీ మధ్యన వుంటూ, పెత్తనాలు చేస్తూంటుంది. దాని మెడబట్టి అంతరాత్మలోకి తోసేస్తే, కుయ్యోమొర్రో  మంటూ అక్కడుండే నగ్నసత్యాల్ని, శాశ్వత సత్యాల్ని, సవాలక్ష సవాళ్ళనీ ఎదుర్కొని, క్లాసులు పీకించుకుని, పునీతమై ఒడ్డునపడి, దిక్కుమాలిన వేషాలేసే ఇగోగా వుంటున్న తను, మెచ్యూర్డ్ ఇగోగా మోక్షం పొందుతుంది. ప్రపంచ పురాణాలు తీసుకున్నా, ఇంకే కథలు తీసుకున్నా వాటి అంతరార్ధమిదే. మనుషుల మానసిక లోకంలో నిత్యం జరిగే కురుక్షేత్రమిదే. ఈ మానసిక లోకమే స్ట్రక్చర్ రూపంలో వెండితెర మీద కన్పిస్తుంది. అప్పర్ మైండ్ అంటే ఫస్ట్ యాక్ట్ లేదా బిగినింగ్, అంతరాత్మ అంటే సెకండ్ యాక్ట్ లేదా మిడిల్, మోక్షం పొందడమంటే థర్డ్ యాక్ట్ లేదా ఎండ్. ఇక ఇగో వచ్చేసి ప్రధాన పాత్ర. ఈ స్ట్రక్చర్ లో వుండే కథని చూస్తున్నప్పుడు, తమ మానసిక లోకాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు ప్రేక్షకులు. ఇదీ సినిమా చేసే పని. 

        ఇలా బేసిక్స్ గురించే మీకు తెలియక పోతే, పదే పదే బేసిక్స్ గురించే చెప్తూ వుంటే, మీరూ ముందు కెళ్లరు, ఈ బ్లాగూ ముందు కెళ్లదు. మీ క్రియేటివిటీకి బేస్ లేదు. మీరు మీ మానసిక లోకాన్ని వదిలించుకుని బయటికి ఎక్కడి కెళ్తారు. ఈ విశ్వమే దేవుడి మైండ్. త్రీయాక్ట్ స్ట్రక్చర్ మైండ్. ఎక్కడి కెళ్తారు? మళ్ళీ ఆ సుభాషితాన్ని ఇక్కడ పడేద్దామా. ఈ పక్కన చూడండి-  

     మీ కథలు స్ట్రక్చర్లో కుదరడం లేదంటే అక్కడి దాకా ఎందుకు పోతారు. మొదట ఐడియా అనుకున్నప్పుడే దానికి స్ట్రక్చర్ వుందో లేదో చూసుకోవాలి. మీ క్రియేటివిటీ స్ట్రక్చర్ ని డామినేట్ చేస్తోందంటే ఆ కథని వదిలెయ్యాలి. భలేభలే మగాడివోయ్ వుంది కదాని అనుకుంటే, అందులో స్ట్రక్చర్ లేదని ఎవరన్నారు. యాక్ట్స్ ఆలస్యమయ్యాయి, అంతే. ఫస్టాఫ్ గంటా పదిహేను నిమిషాలూ కథే ప్రారంభం కాని పరిస్థితిని మరిపించేలా పది నిమిషాలకో బ్యాంగ్ పడింది. ఇది తెలిసి చేసి వుండరు. ఒక సినిమా కంపెనీలో సిడ్ ఫీల్డ్ పని చేస్తున్నప్పుడు, ఆ నిర్మాత-  మీరేం చేస్తారో నాకు తెలీదు, నా సినిమాల్లో పది నిమిషాలకో బ్యాంగ్ మాత్రం పడాలంతే - అన్నాడు. ఇదెక్కడి పైత్యంరా అనుకున్నాడు సిడ్ ఫీల్డ్. అలా ఎడ్డీ మర్ఫీ తో స్టార్ యాక్షన్ సినిమాలు తీశారు. అంటే సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ ని వదిలేశాడనా? భలేభలే మగాడివోయ్ ఫస్టాఫ్ లో ఈ బ్యాంగులు కన్పించి, సిడ్ ఫీల్డ్ పేర్కొన్నది గుర్తొచ్చి, రివ్యూలో ప్రస్తావించాం.

        భలేభలే మగాడివోయ్ లో స్ట్రక్చర్ వుంది. యాక్ట్స్ ఆలస్యమయ్యాయి. సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ ప్రారంభమవుతుంది. కేవలం కథలేని సుదీర్ఘమైన ఫస్టాఫ్ ని బ్యాంగులు నిలబెట్టాయి.

        నిన్నటి రివ్యూ  ది ప్రిన్సెస్ స్విచ్డ్ ఎగైన్ లో గంటన్నర సినిమాకి ప్లాట్ పాయింట్ వన్ చివరి అరగంటలో వస్తుంది. అంటే మిడిల్ మాటాషా? కాదు. ఇదే కదా స్ట్రక్చర్ తో క్రియేటివిటీ. స్ట్రక్చర్ లేకూండా క్రియేటివిటీ ఏమిటి, నాలుగు గోడల ఇల్లే లేకుండా నగిషీ చెక్కినట్టు. 21 వ నిమిషంలో హీరోయిన్ మూడో పాత్రగా లేడీ ఫియోనా రావడంతో కథ మలుపు తిరిగే సన్నాహం మొదలవుతుంది. 32 వ నిమిషంలో ఆమె హీరోయిన్ రెండో పాత్ర మార్గరెట్ ని కిడ్నాప్ చేయాలని పథకం వేయడంతో ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. అయితే దీని ఆపరేటింగ్ పార్టు డిలే అవుతుంది. ఈ డిలే వల్ల ఎప్పుడు కిడ్నాప్ చేస్తుందాని ఉత్కంఠ ఏర్పడుతుంది. ఈ ప్లాట్ పాయింట్ వన్ ఇంకో పార్శ్వంలో మార్గరెట్ తో బాటు హీరోయిన్ మొదటి పాత్ర స్టేసీ కలిసి స్థానాలు మార్చుకోవాలన్న వాళ్ళ ప్లానింగ్ వేరే  వుంటుంది. ఈ కథని నడవనిచ్చి, చివరి అరగంటలో డిలే చేసిన ప్లాట్ పాయింట్ వన్ ఆపరేటింగ్ పార్టుని మొదలెట్టేశారు. అంటే ప్లాట్ పాయింట్ వన్ ని పరోక్షంగా చూపించి, దాని ప్రత్యక్ష రూపాన్ని తర్వాత చూపించడ మన్నమాట. దీని వల్ల ఫస్టాఫ్ లో కథ ప్రారంభం కాలేదన్న అసంతృప్తి కలగలేదు.

        ఇలా కథని బట్టి స్ట్రక్చర్ తో క్ర్రియేటివిటీకి పాల్పడొచ్చు. స్ట్రక్చరే లేకుండా క్రియేటివిటీ ఎలా చేసుకోవాలో చెప్పమంటే, ముందు మానసిక లోకమనే సృష్టి సెటప్ ని రంపం తీసుకుని పరపర కోసి పడెయ్యాలి. ఇది మన వల్ల అయ్యేలా కన్పించడం లేదు. కాబట్టి సొంతబడి క్రియేటివ్ స్కూల్లో జిత్తులమారి అప్పర్ మైండ్ లో, ఇగో చెప్పినట్టూ చేసుకుంటూ పోవడమే. ఎప్పుడో పా...త పాండురంగ మహాత్మ్యం నుంచీ, విప్రనారాయణ నుంచీ, అన్నీ సినిమాలూ త్రీయాక్ట్ స్ట్రక్చర్లోనే వుంటూ వచ్చాయి. ఈ శతాబ్దంలో స్ట్రక్చర్ విద్వేషకులు ఎక్కడ్నించి వచ్చారో మరి. 

Q :  మీరు మార్కెట్ యాస్పెక్ట్ అని చెపుతుంటారు కదా, అసలు డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్న యువ దర్శకుల దగ్గర అటు మార్కెట్ యాస్పెక్ట్, ఇటు క్రియేటివ్ యాస్పెక్ట్ రెండూ కవర్ అయ్యేలా ఎలాంటి స్క్రిప్ట్ లు పట్టుకుని వాళ్ళు దర్శకత్వం కోసం ప్రయత్నాలు చేయాలి అంటారు అన్నది వివరించండి.
కిరణ్, అసోసియేట్

A : దీని మీద బ్లాగులో సందర్భం వచ్చినప్పుడల్లా చాలా సార్లు చెప్పుకున్నాం. బ్లాగు సెర్చి బాక్సులో మార్కెట్ యాస్పెక్ట్ అని, క్రియేటివ్ యాస్పెక్ట్ అని విడివిడిగా తెలుగులో టైపు చేయండి. పేజీలు డిస్ ప్లే అవుతాయి. మార్కెట్ యాస్పెక్ట్ అంటే, ఇప్పుడు ప్రేక్షకులున్న ప్రపంచం. ప్రపంచంలో వాళ్ళ అభిరుచులేమిటో అది పట్టుకుని కథ చేయడం. కథే కాదు, సీన్లలో కూడా మార్కెట్ యాస్పెక్ట్ కనిపించాలి. సీన్లే కాదు, డైలాగుల్లో కూడా మార్కెట్ యాస్పెక్ట్ కనిపించాలి. ఇప్పుడు రోమాంటిక్స్, లేదా ఏకనమిక్స్ తో కూడిన కథలే మార్కెట్ యాస్పెక్ట్. లేదా రెండూ కలిసినవి. మూస ఫార్ములా కల్పిత ఉబుసుపోక కథలు కాకుండా, ప్రేక్షకులు తాముంటున్న ప్రపంచ పరిస్థితులతో, జీవితాలతో ఐడెంటిఫై చేసుకోగల రియలిస్టిక్ కథలు, పరిష్కారాలు. మార్కెట్ యాస్పెక్ట్ ని నిర్ణయించుకున్నాక, దానికి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ తో రాసుకోవాలి, తీసుకోవాలి. అది నిర్మాతకి డబ్బులు కన్పించేట్టు ఆకర్షించాలి. జనరల్ నాలెడ్జి కోసం ఈ లింకు క్లిక్ చేయండి. 

సికిందర్

22, నవంబర్ 2020, ఆదివారం

1000 : హాలీవుడ్ రివ్యూ

 


దర్శకత్వం : మైక్ రాల్ 
తారాగణం :  వెనెస్సా హజెన్స్, సామ్ పలాడియో, నిక్ సగర్, మియా లాయిడ్
రచన : రాబర్ట్ బర్గర్, మెజాన్ మెట్జర్; సంగీతం : అలన్ లజర్, ఛాయాగ్రహణం : ఎఫ్ ఏ ఫెర్నాండెజ్
నిర్మాణం : బ్రాడ్ క్రెవాయ్ టెలివిజన్ 
నిర్మాతలు : స్టీవెన్ మెక్ గ్లోథెన్, వెనెస్సా హజెస్ 
విడుదల : నెట్ ఫ్లిక్స్ (19.11.20)

***

    వెనెస్సా హజెన్స్ ఇంకో పాత్ర జోడించుకుని త్రిపాత్రాభినయంతో విచ్చేసింది...క్రిస్మస్ కి ప్లస్ టూ వినోదం. వినోదంలో ప్రణయం, ప్రణయంలో ప్రమాదం. కాల్పనిక రాజవంశంలో హాస్యాభ్యుదయం, పట్టాభిషేకంలో అపహరణల పర్వం. పండగ మూడ్ సినిమాకి పక్కా నిర్వచనం. పండగ సినిమాల పేరుతో వాటీజ్ ఫ్యామిలీ సినిమా? నరికి వేతల రక్తపాతమా, కన్నీళ్ళ ధారా పాతమా? సెంటిమెంట్ల శరా ఘాతమా? వెనెస్సా వినోదం, వినోదంలో హాస్య విలనీ, రాజవంశ మర్యాదల మన్నన ఒక కొత్త డ్రీమ్ వరల్డ్. డ్రీమ్ వరల్డ్ లో డ్రీమీ డియరెస్ట్ పాత్రలు. ది ప్రిన్సెస్ స్విచ్ కి  ది ప్రిన్సెస్ స్విఛ్డ్ ఎగైన్ సీక్వెల్. క్రిస్మస్ సంరంభంలో మరో సీక్రెట్ గేమ్, గేమ్ మీద గేమ్. గేట్లు తెరచుకున్న హ్యూమర్.

    సారి మాంటేనరో డచెస్ మార్గరెట్ డెలాకోర్ట్ (వెనెస్సా హజెన్స్ -2) కి ఉన్నట్టుండి క్రిస్మస్ కి మాంటేనరో రాకుమారిగా పట్టాభిషికత్వం వరిస్తే, బెల్గ్రేవియా రాకుమారి స్టేసీ (వెనెస్సా హజెన్స్ -1) తో నేను నువ్వుగా, నువ్వు నేనుగా మారి, ప్రేమ సంగతులు చూసుకుందామని అనుకుంటే, ఎక్కడ్నుంచో లేడీ ఫియోనా (వెనెస్సా హజెన్స్ -3) నంటూ కిలాడీ దూరి, రాజవంశ ఖజానా ఖాళీ చేద్దామనుకునే ఎత్తుకి పైఎత్తు చివరికి చిత్తు కథ. నేటి బాక్సాఫీసు స్లోగన్  రోమాంటిక్స్ ప్లస్ ఎకనమిక్స్ మార్కెట్ యాస్పెక్ట్ కి రోమాంచిత న్యాయం.

      వెనెస్సా నవ్వు ముఖం మరోసారి కట్టి పడేస్తుంది. ఆమె నవ్వు ముఖం లేకపోతే ఈ సీక్వెల్ కూడా లేదు. బెల్గ్రేవియా రాకుమారి స్టేసీ, మార్గరెట్ పట్టాభిషేకానికి మాంటేనరో బయల్దేరుతూ, మధ్యలో షికాగోలో కెవిన్ (నిక్ సగర్) పరిస్థితేమిటో చూడాలనుకుంటుంది. కెవిన్ తో మార్గరెట్ కి బ్రేకప్ అయి షికాగోలో అతను అదే బేకరీ నడుపుకుంటూ వుంటాడు. పదేళ్ళ కూతురు ఒలీవియా వుంటుంది. భర్త ప్రిన్స్ ఎడ్వర్డ్ (సామ్ పలాడియో) తో కలిసి స్టేసీ వచ్చి, కెవిన్ ని మార్గరెట్ పట్టాభిషేకానికి కి రావాలని ఒప్పిస్తుంది.  

    వాళ్ళతో కూతుర్ని తీసుకుని మాంటేనరో ప్యాలెస్ కొస్తాడు గడ్డం పెంచుకుని వున్న కెవిన్. పండక్కి ప్యాలెస్ అలంకరణకి తోడ్పడతాడు. రాజ్య బాధ్యతలు మీద పడడంతో అతణ్ణి నిర్లక్ష్యం చేశానని బాధ పడుతుంది మార్గరెట్. మరో వైపు స్టేసీకి కూడా ఇదే సమస్య. రాకుమారిగా పరిపాలనా బాధ్యతల వల్ల భర్త ప్రిన్స్ ఎడ్వర్డ్ ని నిర్లక్ష్యం చేస్తున్నానని బాధ. ఇక ఆ సాయంకాలం విందు వినోదాల కార్యక్రమంలో వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది కిలాడీ లేడీ ఫియోనా.

    మార్గరెట్, స్టేసీల పోలికలతో వున్న లేడీ ఫియోనా తను మార్గరెట్ కజిన్ నని చెప్పుకుంటుంది. ఈమె ఘన చరిత్రేమిటంటే, వారసత్వంగా సంక్రమించిన సంపదని అవజేసి, కిలాడీలైన ఇద్దరు సేవకులు రెగ్గీ, మిండీలని వెంటేసుకు తిరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ ట్రిపుల్  ధమాకా లాంటి అవకాశాన్ని చూస్తుంది. ఒకటి మార్గరెట్ లా తను సెటిల్ అవచ్చు, రెండు పట్టాభిషేకం జరుపుకోవచ్చు, మూడు ఖజానా దోచుకోవచ్చు. రెగ్గీ, మిండీలతో ఆమె ఈ విందు కార్యక్రమానికి వచ్చిందే అతిధుల జేబులు సవరించడానికి.

    ఈ విషయం తెలీక స్టేసీ, మార్గరెట్ లు వేరే ప్లానుతో వుంటారు. మార్గరెట్ సమస్యేమిటంటే, ప్యాలెస్ ముఖ్య నిర్వాహకుడు టోనీ తనని ప్రేమిస్తున్నాడు. పట్టాభిషేకంలోగా ఇప్పుడు తను కెవిన్ తో ప్రేమని చక్కదిద్దుకోవాలంటే, టోనీని వదిలించుకోవాలి. అందుకని తను స్టేసీలా స్టేసీ స్థానంలో కెళ్తే, స్టేసీ మార్గరెట్ లా తన స్థానంలో కొస్తే బావుంటుంది. సరేనంటుంది స్టేసీ. ఇలా స్థానాలు మార్చుకున్న విషయం తెలీక, మార్గరెట్ అనుకుని స్టేసీని కిడ్నాప్ చేసి పడేస్తుంది లేడీ ఫియోనా...

ఎలావుంది కథ

      2018 లో క్రిస్మస్ కి విడుదలైన ది ప్రిన్సెస్ స్విచ్ మొదటి భాగానికి మార్క్ ట్వైన్ నవల ది ప్రిన్స్ అండ్ ది పాపర్ ఆధారం. ఈ నవల ఆధారంగా ప్రపంచ భాషల్లో చాలా సినిమాలొచ్చాయి, తెలుగు సహా. మొదటి భాగంలో షికాగోలో ఫ్రెండ్ కెవిన్ (నిక్ సగర్) తో కలిసి బేకరీ నడుపుతున్న స్టేసీ (వెనెస్సా హజెన్స్-1), బేకరీ క్రిస్మస్ పోటీలకి కెవిన్ తో బెల్గ్రేవియా వెళ్తుంది. అక్కడ తనలాగే వున్న మాంటేనరో డచెస్ మార్గరెట్ (వెనెస్సా హజెన్స్-2) ని చూస్తుంది. తమకి పూర్వపు బంధుత్వ ముందని తెలుసుకుంటుంది. మార్గరెట్ కి బెల్గ్రేవియా ప్రిన్స్ ఎడ్వర్డ్ (సామ్ పలాడియో) తో వివాహం నిశ్చయమై వుంటుంది. రెండు రోజుల్లో వివాహం. మార్గరెట్ తనకి సామాన్యురాలిలా జీవితం చూడాలనుందనీ, ఈ రెండు రోజులు స్థానాలు మార్చుకుందామనీ స్టేసీతో అంటుంది. స్టేసీ ఒప్పుకుంటుంది. ఇద్దరూ స్థానాలు మార్చుకుంటారు. సామాన్య జీవితంలో కెళ్లిన  మార్గరెట్ కెవిన్ తో ప్రేమలో పడుతుంది. ఇటు స్టేసీ ఎడ్వర్డ్ తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం అందరికీ స్పష్టం చేసి, మార్గరెట్ కెవిన్ తో ప్రేమలో వుంటుంది, స్టేసీ ఎడ్వర్డ్ ని పెళ్లి చేసుకుని బల్గ్రేవియా రాకుమారి అవుతుంది.

    ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ కథ. రెండూ ప్యాలెస్ రోమాంటిక్ హ్యూమర్లే. సీక్వెల్లో మూడో వెనెస్సా తొడయ్యింది. దీంతో క్రైమ్ ఎలిమెంట్ కలిసింది. మొదటి భాగం కంటే సీక్వెల్లో వేగముంది, హాస్యం ఎక్కువుంది. రాజవంశ బంధుమిత్ర పరివారం, వైభవం, రాచ మర్యాదలు వగైరా ఒకటే. అదే మనోహరమైన క్రిస్మస్ పండగ వాతావరణం చివరంటా. 

      ఈ రెండు భాగాల్లోనూ కాన్ఫ్లిక్ట్ ప్రధానం కాదు. దాన్ని పట్టుకుని మలుపులు తిప్పడం ముఖ్యం కాదు. క్రిస్మస్ సినిమా ఇంతే. మొదటి భాగంలో స్థానాలు మార్చుకున్న ఇద్దరూ బయట సృష్టించే కాన్ఫ్లిక్ట్ ఏమీ వుండదు. మార్గరెట్ గా వుంటున్న స్టేసీ దొరికిపోతుందేమో నన్న రెండు మూడు దృశ్యాలు పైపైన వుంటాయి. సీఐడీ బట్లర్ కూడా ఫోటోలు తీయబోతూ పైనుంచి కింద పడినడుం విరగ్గొట్టుకుని చాలించుటాడు. ప్రత్యర్థి పాత్రలతో ఔటర్ కాన్ఫ్లిక్ట్ సృష్టిస్తే, స్థానాలు మార్చుకుని వాళ్ళిద్దరూ జీవితాల్లో సృష్టించుకున్న ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ హైలైట్ అవదు. ఈ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ తో వాళ్ళిద్దరూ ఏం కనుగొన్నారన్నదే ప్రధానంగా చెప్పదల్చుకున్న కథ. మార్గరెట్ సామాన్య జీవితంలోని ఆనందాన్ని కనుగొంది, స్టేసీ ప్రేమని కనుకొంది. దీనికి ఏడ్పులూ, తెచ్చిపెట్టున్న సెంటిమెంట్లూ, ఫ్యామిలీ చాదస్తాలూ వంటి రోత టెంప్లెట్లు అవసరం లేదు. హాస్యంతో కూడా వాస్తవాలు తెలుస్తాయి.  

    ఈ సీక్వెల్లో మధ్యలో వెనెస్సా హజెన్స్-3 వచ్చి, కిడ్నాప్ తో ఔటర్ కాన్ఫిక్ట్ ని సృష్టిస్తుంది. ఇది కూడా లైటర్ వీన్ గానే వుంటుంది. ఈ ఔటర్ కాన్ఫ్లిక్ట్ తో, ఈసారి స్థానాలు మార్చున్న మార్గరెట్, స్టేసీ ల ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ప్రభావిత మవుతుంది. మార్గరెట్ నిర్లక్ష్యం చేసిన కెవిన్ తో పెళ్లి ప్రాముఖ్యాన్ని గుర్తిస్తుంది, స్టేసీ పెళ్లి చేసుకున్నఎడ్వర్డ్ ని నిర్లక్ష్యం చేయకూడదని తెలుసుకుంటుంది. సరిపోతుందా ఫ్యామిలీ సినిమాకి? ఇంకేమైనా నరికి వేతలూ కాల్చివేతల నాన్ వెజ్ కావాలా పండక్కి? క్రిస్మస్ సినిమాలో ఆ వర్ణ శోభిత కేకులూ పేస్ట్రీలూ చూస్తూంటే కూడా బ్లడ్డే కావాలా? చేతిలో పట్టుకుని వంకీలు తిరిగిన ఇంకో వింత ఆయుధమే కావాలా?

***

      సంభాషణలు మృదు మధురంగా వుంటాయి. దృశ్యాల కదలిక సడి లేకుండా వుంటుంది. సంగీతం సరస గీతాలతో వుంటుంది. ఛాయాగ్రహణం పీచు మిఠాయిలా వుంటుంది. కాస్ట్యూమ్స్ సింపుల్ గా వుంటాయి. ఏ విషయంలోనూ క్రిస్మస్ సినిమా స్వరాన్ని తప్పనీయలేదు. బయటికొస్తే మంచు కురుస్తూ వుంటుంది...మంచులో తడిసిన మంచి సినిమా. 

సికిందర్