రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, February 15, 2019

787 : స్క్రీన్ ప్లే సంగతులు



          1990 లో జపాన్ రచయిత యుకిటో కిష్రో సృష్టించిన ‘గన్మ్’ అనే తొమ్మిది  భాగాల పాపులర్ కామిక్స్ సిరీస్ లోని మొదటి భాగమే జేమ్స్ కెమెరాన్ నిర్మించిన ‘అలీటా’. 1999 లోనే కామిక్స్ హక్కులు పొంది 2003 లో స్క్రీన్ ప్లే రాయడం పూర్తి చేసినప్పటికీ,  నిర్మాణం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి రాబర్ట్ రోడ్రిగ్స్ కి దర్శకత్వ బాధ్యతలప్పగిస్తూ 2017 లో నిర్మాణం ప్రారంభించాడు. ఇప్పుడు అమెరికాలో కంటే ఇండియాలోనే ముందుగా విడుదలయింది (ఫిబ్రవరి 8), ఇండియాలో కంటే బ్రిటన్ లో ముందు విడుదలయ్యింది (ఫిబ్రవరి 6), అమెరికాలో నిన్న విడుదలైంది  (ఫిబ్రవరి14).
         
కాశంలో వేలాడుతూ వుండే సాలెం సిటీకీ, భూమ్మీద ఐరన్ సిటీకీ మధ్య జరిగే సంఘర్షణే అలీటా కాన్సెప్ట్. యుకిటో కిష్రో తన ‘గన్మ్’ కామిక్స్ లో కాశంలో వేలాడుతూ వుండే సిటీని ‘జెరూ’ అన్నాడు. జెరూ అన్నా, సాలెం అన్నా జెరూసలెం పేరులోని భాగాలే. క్రైస్తవుల పుణ్యక్షేత్రం. అంటే పైనున్న సాలెం సిటీ ఆధ్యాత్మిక రూపం, కిందున్న ఐరన్ సిటీ భౌతిక (శరీర) రూపం. అంటే పైన సాలెం సిటీ సబ్ కాన్షస్ మైండ్, కింద ఐరన్ సిటీ కాన్షస్ మైండ్, గొప్ప కథల పరిభాషలో. 

          అంటే ఇది మనం ఎన్నో సార్లు చెప్పుకున్న గొప్పకథల నిర్మాణంలో వుండే కాన్షస్  - సబ్ కాన్షస్ మైండ్ ల లడాయి అన్నమాట. అంటే మనసూ అంతరాత్మల ఇంటర్ ప్లే అన్నమాట. స్టార్ వార్స్, జాస్, బ్యాక్ టు ది ఫ్యూచర్, టైటానిక్, ఇంకా చాలా బ్లాక్ బస్టర్స్  ఇలా గొప్ప కథలయ్యాయి. 

       మనిషి మానసిక లోకంలో కాన్షస్ మైండ్ కీ, సబ్ కాన్షస్ మైండ్ కీ మధ్య ఇగో వుంటుంది. ఇలా రెండిటి మధ్య  ద్వారపాలకుడిలా వుండే ఇగో, ఇటు పక్క వున్న కాన్షస్ మైండ్ (మనసు) ని, అటు పక్క వున్న సబ్ కాన్షస్ మైండ్ (అంతరాత్మ) తో కలవనీయదు. మనిషిలోని మంచి గుణాలకి అడ్డు పడుతుంది. గొప్ప కథల్లో కొచ్చేసరికి ఈ ఇగో, కాన్షస్ ఇగోగా హీరో పాత్రకి సింబాలిక్ అవుతుంది. 

          అంటే ఇప్పుడు హీరో పాత్ర =  కాన్షస్ ఇగో అన్నమాట. కాన్షస్ ఇగో లక్షణాలన్నీ హీరోకి వుంటాయి. ఎప్పటి దాకా? స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం ముగిసి ప్లాట్ పాయింట్ వన్ వచ్చే దాకా. ఇందుకేనేమో తెలుగు సినిమాల బిగినింగ్ విభాగాల్లో హీరో అంత ఆవారాగా బతికేస్తూంటాడు. మన కాన్షస్ మైండ్ పెద్ద ఆవారాయేగా. 

         ఇలా కాన్షస్ మైండ్ కి (మనసుకి) ప్రతినిధి హీరో. గొప్ప కథల స్క్రీన్ ప్లేల్లో బిగినింగ్ విభాగం కాన్షస్ మైండ్ గా వుంటే, మిడిల్ విభాగం సబ్ కాన్షస్ మైండ్ గా వుంటుంది. ఈ సబ్ కాన్షస్ మైండ్ అంటే కాన్షస్ ఇగోకి, అంటే హీరోగారికి పడదని కూడా గతంలో చెప్పుకున్నాం. 

          ఇగో వల్ల మనసు నిలకడ లేనిది. అది భౌతిక ప్రపంచపు ఆనందాల్ని కోరుకుంటుంది. భౌతిక ప్రపంచపు ఆనందాల్ని సరైన తీరులో, శాశ్వత ప్రాతిపదికన పొందాలన్నా అంతరాత్మతో కనెక్ట్ అవ్వాలి. ఇది నచ్చదు. మొత్తం మనిషి శారీరక, మానసిక వ్యవస్థల తల్లి వేరు అంతరాత్మలోనే వుంటుంది. అంతరాత్మకి తెలీకుండా ఏదీ జరగదు. అంతరాత్మకి ఇంత అధికార మివ్వడం ఇగోకి నచ్చదు. అది నీతులు చెప్తుందని, జాగ్రత్తలు చెప్తుందని. ఇందుకే మనుషులు ఆత్మ విమర్శ ఓ పట్టాన చేసుకోరు. నీతులూ నిజాలూ  చెప్పే అంతరాత్మకి దూరంగా వుంటూ, మనసు దాని కాన్షస్ ప్రపంచంలో అది ఆవారాగిరీగా ఎంజాయ్ చేసేస్తూంటుంది. ఏదోనాటికి జీవితాన్ని ఎదుర్కోక తప్పదు. అంతరాత్మలోకి తొంగి చూడకా తప్పదు. మరి అంతరాత్మ అంటే అంత ఎలర్జీ కదా, ఇగో మత్తు పూనిన మనసుకి? అప్పుడెలా?

         ఇదిగో ఇలాంటప్పుడే స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్ అనే మలుపు వుంటుంది. ఇక్కడ రచయిత గారేం చేస్తారంటే,  ఆ కాన్షస్ ఇగో అనే హీరో గారి మెడలు బట్టి మిడిల్ విభాగంలోకి ఒక్క నెట్టు నెట్టి పారేస్తారంతే. అంటే సబ్ కాన్షస్ మైండ్ లోకి ఒక్క తోపు తోసి పారేసి చేతులు దులుపుకుంటారు – శని వదలినట్టు!  


          ఇలా సబ్ కాన్షస్ మైండ్ లోకి ఇంత బలవంతంగా వచ్చి పడ్డ హీరోగారు, ఇదేంట్రా అని నానా చావూ చచ్చి, అక్కడ అన్ని పచ్చి నిజాలూ పిచ్చ నీతులతో సంఘర్షణ జరిపి, నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ తెగ నేర్చేసుకుని  - పునీతుడై - ఒడ్డునపడి -  హమ్మయ్యా అని మోక్షం పొందుతాడు. ఇదే ఎండ్ విభాగం. ఇప్పుడు ఇగోతో అడ్డగోలుగా బతికేసిన హీరో పరివర్తన చెంది, మెచ్యూర్డ్ ఇగోగా మారతాడు. ఇగో చచ్చేది కాదు, నశించేదీకాదు. ఇగో వదులుకో, ఇగో మానుకో అనడం మూర్ఖత్వం. ‘శైలజా రెడ్డి అల్లుడు’ లో ఇగోల పోరాటమే. ఏ పాత్రా మెచ్యూర్డ్ ఇగోగా మారదు. పదార్ధానికి వినాశంలేదు, రూపం మారుతుందంతే. కనుక ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా రూపం మార్చే సైకో థెరఫీయే గొప్ప కథల లక్ష్యం. ఇలాటి గొప్ప కథలతో కూడిన  సినిమాలని చూస్తున్నప్పుడు తెలియకుండానే మనం సైకో థెరఫీకి లోనవుతాం. పురాణాల్లాగా ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చేవే, మానసిక చికిత్స చేసేవే గొప్ప కథలు.
***
పారడైంతోనే పని 
      ఇదే జోసెఫ్ క్యాంప్ బెల్ తేల్చాడు. పురాణాలన్నీ వాటి కథలతో సైకో థెరఫీ చేసేవే. మానసిక శాస్త్రం నేర్పేవే దేవుళ్ళనే వూహా రూపాల్ని చూపిస్తూ. ఒక్కో పురాణం ఒక్కో మానసిక శాస్త్రం. దీంట్లో పురాణ పాత్ర చేసే ప్రయాణం పన్నెండు మజిలీలతో వుంటుందని తేల్చాడు. అప్పుడిది మిథికల్ స్ట్రక్చర్ అయింది. దీన్ని మోనోమిథ్ అన్నాడు.

          ఇలా మోనోమిథ్ వచ్చేసి పురాణాల్లో వుండే పాత్ర, దాని ఆధ్యాత్మిక యానంలో  ఎదుర్కొనే పన్నెండు మజిలీల కథానిర్మాణమూ. ఈ కథానిర్మాణం వచ్చేసి అరిస్టాటిల్ ఇచ్చిన బిగినింగ్ - మిడిల్ - ఎండ్ విభాగాలతో కూడిన త్రీ యాక్ట్ స్ట్రక్చరే. ఐతే ప్రపంచ  పురాణాల్లో ఈ మూడు విభాగాల్లో పన్నెండు మజిలీలు (ప్లాట్ పాయింట్లు) వుంటాయని క్యాంప్ బెల్ పరిశోధనా సారాంశం.

         1930 ల నుంచీ డెబ్బైల వరకూ ఇంకో మార్గం లేక హాలీవుడ్ సినిమాలు నాటకాలకి అరిస్టాటిల్ ఇచ్చిన త్రీయాక్ట్ స్ట్రక్చర్ నే అనుసరిస్తూ వచ్చాయి. 1949 లో జోసెఫ్ క్యాంప్ బెల్ తన మోనోమిథ్ థియరీతో  ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’ అన్న  ప్రసిద్ధ గ్రంథాన్ని ప్రచురించాడు. చాలా ఆలస్యంగా 1970 లలో దీన్ని జార్జి లూకాస్ ‘స్టార్ వార్స్’ స్క్రీన్ ప్లేకి వాడుకుని హాలీవుడ్ లో వాడుకలోకి తెచ్చాడు. ఇది ఓ దశాబ్దం పాటూ సాగేక,  సిడ్ ఫీల్డ్ వచ్చి అదే మోనోమిథ్ ని  కేవలం మూడు ప్లాట్ పాయింట్లకి కుదించి,  దాన్ని పారడైంగా ప్రవేశపెట్టాడు.  

          మోనోమిథ్ స్ట్రక్చర్ లో 12 ప్లాట్ పాయింట్లతో చాలా కథ, చాలా పాత్రచిత్రణలు, చాలా వివరణలూ వుంటూ అప్పటి కాలం ప్రేక్షకుల కాలక్షేపానికి తగ్గట్టు, 12 గేర్లతో కూడిన పదహారు టైర్ల ట్రక్కులా నిదానమైన నడకతో వుంటే - పారడైం వచ్చేసి, మూడు ప్లాట్ పాయింట్లతో మూడు గేర్లతో కూడిన నాల్గు టైర్ల ఎస్యూవీ కారుగా తక్కువ కథ, తక్కువ పాత్రచిత్రణలు, తక్కువ వివరణలూ, ‘ఎక్కువ యాక్షన్’ తో  స్పీడందుకుంది. తరం మరీనా ప్రేక్షకుల కాలక్షేపానికి బాగా పనికొచ్చింది. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కిక్ కొట్టి ఫస్ట్ గేర్ వేసి, ఇంటర్వెల్లో సెకెండ్ గేర్ నొక్కి, ప్లాట్ పాయింట్ టూ దగ్గర థర్డ్ గేరేస్తే టాప్ రేంజిలో వెళ్ళిపోతుంది.

          బయట ప్రపంచం యమ స్పీడందుకుంటే, తలుపులు మూసిన థియేటర్లో సినిమాలు ఇంకా తీరుబడిగా కళా ప్రదర్శన చేస్తూ, కృష్ణా రామా అనుకుంటూ కూర్చోలేవు. జీవించే కళే మారిపోయాక కళాప్రదర్శనేమిటి. 1990 ల నుంచీ ఇవాళ్టి దాకా హాలీవుడ్ కి కొత్త బైబిల్ సిడ్ ఫీల్డ్ పారడైం.
***
సింపుల్ లైను - హై కాన్సెప్ట్ సక్సెస్ 
       ఈ పారడైంతో భారీ బడ్జెట్  హై కాన్సెప్ట్ సినిమాలొచ్చేసి కథాపరంగా సింప్లిఫై
అయిపోయాయి. పాత్ర - దానికో గోల్ - ఆ గోల్ సాధన, ఇంతే. పాత్ర (బిగినింగ్), గోల్(మిడిల్), గోల్ సాధన (ఎండ్), ఇంతే. మాస్ అప్పీలే వీటి మార్కెట్ యాస్పెక్ట్. ఇలా
జురాసిక్ పార్క్, ఇన్సెప్షన్, క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్, మాట్రిక్స్, ఫేసాఫ్...ఆక్వామాన్ వరకూ ఎన్నో.  

          హై కాన్సెప్ట్ కథల పాయింటు ‘ఇలాజరిగితే?’ (what if?) అన్న ప్రశ్నతో వుంటుంది. ఈ ప్రశ్నే కథకి ఐడియా. గ్రహాంతర వాసులు భూమ్మీదికి దండ యాత్ర కొస్తే? (‘ఇండిపెండెన్స్ డే’ ఐడియా), డైనోసారస్ లని మళ్ళీ పుట్టిస్తే? (‘జురాసిక్ పార్క్’ ఐడియా), సముద్ర గర్భంలో రాజు సప్త సముద్రాల్ని జయించాలనుకుంటే? (‘ఆక్వామాన్’ ఐడియా). 

         ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకి సింపుల్ గా అర్థమై పోతాయి హై కాన్సెప్ట్ కథలు. ప్రశ్నే పాత్రకి సవాలు ఈ కథల్లో. ఈ ప్రశ్నని ఎదుర్కోవడమే యాక్షన్ ఓరియెంటెడ్ గా వుండే కథ. ప్రశ్నని ఎదుర్కోవడం గోల్, ఆ ప్రశ్నని నిర్వీర్యం చేయడం గోల్ సాధన. సింపుల్ గా అర్ధమైపోతాయి కథలు మూడు ప్లాట్ పాయింట్ల పారాడైంతో. ప్రశ్నని పట్టుకుని కథ తక్కువ, ఆ తక్కువ కథతో ఎక్కువ యాక్షన్ … తక్కువ కథతో ఎక్కువ యాక్షన్ ఇదే హై కాన్సెప్ట్ హాలీవుడ్ సినిమాల యూఎస్పీ (యూనిక్ సెల్లింగ్ పాయింట్). 

          సహజంగానే ప్రశ్న సబ్ కాన్షస్ మైండ్ కి ప్రతీకైతే, దాని సాధన కాన్షస్ ఇగో (హీరో) గోల్. మూడు ప్లాట్ పాయింట్ల సిడ్ ఫీల్డ్ పారడైంలోనూ హై కాన్సెప్ట్ కథలకి కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్ ల లడాయీ ఎటూ పోలేదు. మహా మోనోమిథ్ స్థానంలో, కట్టే కొట్టే తెచ్చే టైపు  చిన్న పారడైం రావడం వల్ల కథల నాణ్యతేమీ తగ్గిపోలేదు.  
***
ఎటూకాని బిజినెస్ 

       కానీ జేమ్స్ కెమెరాన్ ‘అలీటా’ విషయంలో అనుసరించిన స్క్రిప్టింగ్ ప్రక్రియ అటు  మోనోమిథ్థూ కాక, ఇటు పారడైమూ కాక త్రిశంకు స్వర్గంలో వేలాడింది. ఆకాశంలో సాలెం సిటీ ఏమో గానీ, సినిమా త్రిశంకు స్వర్గంలో తలకిందులుగా వేలాడింది. ఆయన సిడ్ ఫీల్డ్ పారడైంతో స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకుని, టెర్మినేటర్, టైటానిక్ లు తీశానని చెప్పుకున్నాక, ‘అలీటా’ విషయంలో అదే పారడైంని ఎందుకు చేపట్ట లేదో ...

          హాలీవుడ్ స్క్రీన్ ప్లే పేజీకి నిమిషం వస్తుంది. కెమెరాన్ 180 పేజీల స్క్రీన్ ప్లే రాసి, దాన్ని రెండు గంటలకి వచ్చేట్టు 120 పేజీలకి తగ్గించమని దర్శకుడు రాబర్ట్ రోడ్రిగ్స్ కిచ్చాడు. దాంతో పాటు 600 పేజీల నోట్సూ ఇచ్చాడు. ఇవి ముందేసుకుని రోడ్రిగ్స్  రెండు గంటల స్క్రీన్ ప్లే చేశాడు, కెమెరాన్ ఓకే చేశాడు. సినిమా తీసి విడుదల చేశారు. సినిమా చప్పగా వుందన్నారు జనం. అంతర్జాతీయ రివ్యూలు ఒకటే చెప్పాయి -  అలీటాకి ఒక నిలకడైన గోల్ అంటూ లేదని.     
  
          తెలుగు సినిమాల్లో హీరోలకి గోల్ లేకపోవడమూ, వుంటే పాసివ్ గా వుండి పోవడ మూ గత ఇరవై ఏళ్లుగా కొత్త మేకర్ల చేతుల్లో చూస్తున్నాం. స్క్రీన్ ప్లేల  గురించి ఎన్నో చెప్పే హాలీవుడ్ మేకర్లు కూడా గోల్ ని మర్చిపోతారా అంటే, కన్ఫ్యూజన్ ఎక్కువైతే తప్పకుండా మర్చిపోతారు. 

          ‘అలీటా’ హై కాన్సెప్ట్ కథలా సింపుల్ గా లేదు. పైగా ఆకాశ నగరంతో మంచి ఆధ్యాత్మిక  సువాసనేసింది. ఇంకేం ఇది మోనోమిథ్ లోకి వచ్చేస్తుందని మోనోమిథ్ చేయబోయి చేయలేక వదిలేస్తే ఏమవుతుందో అదే అయ్యింది ‘అలీటా’. 

          భీష్మించుక్కూర్చున్న తెలుగు సినిమాలా ఇంటర్వెల్ దాకా కథే ప్రారంభం కాదు. ఏమేమో జరుగుతూంటాయి. జరగాల్సిన చోట జరక్క కొన్ని ముందు జరుగుతూంటాయి. కొన్ని జరక్కుండా వుండిపోతాయి. అన్నిటికంటే ముఖ్యం చెప్పిందేదీ జరగదు. ఇంకేదో జరుగుతుంది. అసలు అలీటా ఏం చేయాలనుకుంటోందో అంత సూపర్ బ్రెయిన్ గా చెప్పుకునే ఆమెకే తెలీదు! ప్లాట్ పాయింట్స్ కూడా ఇదిగో ప్లాట్ పాయింట్ అంటే,  అదుగో మిడిల్ - అదిగో మిడిల్ అంటే,  ఇదిగో ఎండ్ అన్నట్టే వుంటాయి. ఏదీ ఏదీ కాదు,  అంతా భ్రాంతియే. దీన్ని బాలీవుడ్ రోహిత్ శెట్టి కిస్తే గిలక్కొట్టి సూపర్ హిట్ చేసేవాడు.
***
గ్రాండ్ బిగ్ పిక్చర్ 
        మహాయుద్ధం జరిగిన మూడొందల ఏళ్ల తర్వాత సర్వ నాశనమైన ప్రపంచం ఇంకా కోలుకోనట్టు అడ్డదిడ్డ భవనాలు నిర్మించుకున్న ఐరన్ సిటీ వుంటుంది. ఐరన్ సిటీ మీద శూన్యంలో వేలాడుతూ స్వర్గతుల్యమైన అద్భుత నగరం సాలెం వుంటుంది. దానివైపు ఆశగా చూస్తూ దాన్ని చేరుకోలేమని అనుకుంటూ వుంటారు ప్రజలు. పక్కకెళ్ళి ఒక పాత ముచ్చట చెప్పుకుంటే,  ఇజ్రాయెల్ పాలస్తీనా నిత్య సంఘర్షణల్లో ఇజ్రయీలీ దళాలకి  పాలస్తీనాని ఆక్రమించే ఆసక్తి లేదనీ, ఆక్రమించి వాళ్ళ డ్రైనేజీలని మెయింటెయిన్ చేసే చంఢాలం కోరుకోవడంలేదనీ చెప్పుకున్నారు.

          సరీగ్గా దీన్ని గుర్తు చేసేలా రివర్స్ సన్నివేశం వుంటుంది. పైనున్న సాలెం నగరపు డ్రైనేజీ అంతా కిందున్న ఐరన్ సిటీ మీద పడుతుంది. ఐరన్ సిటీ ఇస్లామిక్ నగర నమూనాలో వుంటుంది.

          గొప్ప కథల్లో కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే గురించి వివరించే జేమ్స్ బానెట్ - సైకలాజికల్ గా మనిషి మానసిక లోకమెలా వుంటుంది, దీన్ని ప్రతిబింబిస్తూ గొప్ప కథలెలా వుంటాయి, మళ్ళీ దీన్ని ప్రతిబింబిస్తూ ప్రపంచంలో ఏమేం జరుగుతాయీ సోదాహరణగా చెప్పాడు. మనిషి ద్వేష పూరితుడై విషాదాంతాన్ని కొని దెచ్చుకోవడం ఒక సైకాలజీ. ‘బేసిక్ ఇన్ స్టింక్ట్’, ‘ఫాటల్ ఎట్రాక్షన్’ లాంటి సినిమాల్లో ఇది మైకేల్ డగ్లస్ పాత్రవుతుంది. నిజజీవితంలో-  ప్రపంచంలో-  ఒక హిట్లర్, ఒక ముస్సోలినీ, ఒక ఫెర్డినాండ్ మార్కోస్...అవుతారు. 

          ఇలా మానసిక కాల్పనిక వాస్తవిక  సంభవాల్లో ఏకత్వం ఉలిక్కిపడేలా చేస్తుంది. పైనున్న సాలెం సిటీ మనిషి ఆధిపత్య భావపు సైకాలజీ అనుకుంటే, కిందికి డ్రైనేజీ వదిలడం చేసిన కల్పన, ఈ కల్పన పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దళాలు చేసిన వ్యాఖ్యానంగా వాస్తవమై వుంది. ఎటూ పోవు పోలికలు. మానసికం కాల్పనికం, కాల్పనికం వాస్తవికం – ఈ త్రివేణీ సంగమం అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఒక గ్రాండ్ బిగ్ పిక్చర్ ని చూపిస్తుంది. 

          కెమెరాన్ మూడు పొరల్లో ఈ కథని వూహించాడు. ఒక పొరలో పైనున్న సాలెం సిటీ సబ్ కాన్షస్ మైండ్ అవుతూ, కిందున్న ఐరన్ సిటీ కాన్షస్ మైండ్ అయ్యే సైకలాజికల్ పొర; పైనున్న సాలెం సిటీ స్వర్గం అవుతూ, కిందున్న మనుషులు దానికోసం అంగలార్చే స్పిరిచ్యువల్ పొర; పైనున్న సాలెం సిటీ సామ్రాజ్యవాదమవుతూ, కిందున్న ఐరన్ సిటీ బాధిత ప్రాంతమయ్యే పొలిటికల్ పొర. మనుషుల్ని శాసించేవి మూడే - మనసు, మతం, రాజకీయం. పై పొరల్లో ఈ మూడూ పొందుపర్చాడు. 

      వీటిలో సైకలాజికల్ నీ, స్పిరిచ్యువాలిటీనీ కలిపి కాన్సెప్ట్ చేశాడు. ఐతే కాన్సెప్ట్ ప్రకారం పై లోకాన్నందుకోవడమే ప్రధాన పాత్ర గోల్ గా పెట్టుకోలేదు. పైలోకాల్లో వున్న ప్రత్యర్ధి పాత్రకే గోల్ పెట్టాడు. అంటే విలన్ కే గోల్ వుండి, హీరోకి లేకపోవడం లాంటిదన్న మాట. అలీటాని చంపి అరుదైన ఆమె సూపర్ బ్రెయిన్ ని కాజేసే ప్రత్యర్ధి గోల్. అప్పుడు అలీటా పాసివ్ పాత్రే కదా? 

          పైన నోవా పేర మెరిసిపోయే ఈ ప్రత్యర్ధి తెల్లవాడు. భూమ్మీద అతడి ఏజెంటుగా వెక్టర్ నల్లవాడు. ఇతడి చేతిలో భూమ్మీద  పరిపాలన. ఈ పరిపాలనలో నేరస్థుల్ని వేటాడే వారియర్ హంటర్స్ అనే దళం. దీనికి సమాంతరంగా సైబర్ సైంటిస్టు డాక్టర్ ఇడో ఒక వారియర్ హంటర్. శిథిలాల్లో మొండెం లేని అమ్మాయి తల. అందులో సజీవంగా వున్న మెదడు. డాక్టర్ ఇడో దానికి సైబర్ శరీరాన్నిచ్చి సైబోర్గ్ గా మార్చడం. ఆమె అలీటా అవడం.
***
ఎన్నెన్ని కోరికలు!
కెమెరాన్, రోడ్రిగ్స్
       సైబోర్గ్ అలీటాకి తానెవరో, ఏం జరిగి మూడొందల ఏళ్ల క్రితం శరీరాన్ని కోల్పోయిందో గుర్తుకు రాదు. ఇది తెలుసుకోవాలన్న కోరికతో వుంటుంది. అంతలో బాయ్ ఫ్రెండ్ పరిచయమై అతను పైన వేలాడుతున్న సాలెం సిటీని చూపిస్తే, అక్కడికి చేరుకోవాలన్న కోరిక కూడా పుడుతుంది. ఇంతలో తనకి ప్రాణం పోసిన డాక్టర్ ఇడో మీద హంటర్ వారియర్స్ దాడి చేస్తే, వాళ్ళనుంచి డాక్టర్ ని కాపాడేక, తను హంటర్ వారియర్ కావాలన్న కోరిక కూడా పుడుతుంది. బాయ్ ఫ్రెండ్ సాలెం సిటీ చేరుకునే లక్ష్యంతో వుంటే, అక్కడికి అతన్ని చేరవేయాలన్న కోరిక కూడా పుడుతుంది. ఇన్నికోరికల అలీటా ఏ కోరికకీ న్యాయం చేయదు. 

          ఒక కోరికతో కొన్ని సీన్లు సాగేక, ఆ కోరికని వదిలేసి ఎదురైన ఇంకో కోరికతో ఇంకొన్ని సీన్లు సాగడం. ఇలా నాల్గు కోరికలు మారిపోతూ నాల్గు ఎపిసోడ్లుగా కథ నడవడం. స్టార్ట్ అండ్ స్టాప్ ఫెయిల్యూర్ బాపతు ఎపిసోడిక్ కథనం. ఇలా తెలుగులో ఎన్ని వచ్చి ఫ్లాప్ కాలేదు. సినిమా అన్నాక ఒకే కోరిక, ఒకే పోరాటం, దాంతో ఒకే కథ అనేది సామాన్య సూత్రం. దీన్ని బ్రేక్ చేస్తే ఎపిసోడిక్ కథనమవుతుంది. ఎపిసోడిక్ కథనం డాక్యుమెంటరీ అవుతుంది. డాక్యుమెంటరీ సినిమా అవదు. 

        ఆ కోరికలు కూడా పరస్పర విరుద్ధమైనవి. మొదట మూడొందల ఏళ్ల క్రిందట తానెవరో తెలుసుకోవాలన్న కోరికతో వుంటే, బాయ్ ఫ్రెండ్ సాలెం సిటీని చూపిస్తాడు. అక్కడికి చేరుకోవాలన్న కోరిక ఆమెకి పుడుతుంది. అక్కడికి (స్వర్గానికి) చేరుకోవాలనుకు
న్నప్పుడు, తానెవరో ఇంకా తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. స్వర్గంలో పూర్వ జన్మలన్నీ తెలిసిపోతాయి. నోవా గారు ఇచ్చే లిస్టు చదువుకోవచ్చు.  

          అలీటా శత్రువులతో రెండు సార్లు యాక్షన్ సీన్స్ లో వున్నపుడు, ఆమె మెదడులో తను పాల్గొంటున్న యుద్ధ దృశ్యాలు ఫ్లాష్ అవుతాయి. దాన్ని బట్టి పూర్వం తాసు సైనికురాలేమో అనుకుంటుంది. దీనికి కంక్లూజన్ వుండదు. సినిమా మొత్తం చూశాక అలీటా ఎవరన్న ప్రశ్న మనకే వుంటుంది, తెలుసుకోవడం ఆమె మర్చిపోతుంది.

       ఇక సాలెం సిటీకి చేరుకోవాలని ఆమెకి పుట్టిన కోరిక, బాయ్ ఫ్రెండ్ అక్కడికెళ్ళే ప్రయత్నాల్లో వున్నాడని తెలియడంతో, ఆర్ధికంగా అతడికి హెల్ప్ చేసే ప్రయత్నాలతో తన కోరికకే విరుద్ధమై పోతుంది. 

          బాయ్ ఫ్రెండ్ సాలెం సిటీ చేరుకునే ఆర్ధిక అవసరాలకోసం సైబోర్గులని చంపి విడిభాగాలు తీసి అమ్ముకుంటూంటాడు. క్లయిమాక్స్ లో చివరికామే సాలెం సిటీకి తీసికెళ్తున్నప్పుడు, నోవా అడ్డుకుంటూ ముళ్ళ చక్రం ఆపరేట్ చేసి బాయ్ ఫ్రెండ్ ని చంపేస్తాడు. ఎలాగూ అలీటా క్లయిమాక్స్ లో మోటార్ బాల్ అనే మృత్యు క్రీడ గెల్చి, సాలెం సిటీకి ప్రవేశాన్ని పొందుతున్నప్పుడు, తనతో బాటూ బాయ్ ఫ్రెండ్ ని తీసికెళ్ళ వచ్చు. ఆర్ధి కంగా అతడికి తోడ్పడే అవసరమేమిటి? విడిగా అతణ్ణి సాలెం సిటీకి చేరవేయడం దేనికి? తను మృత్యు క్రీడ గెల్చి బాయ్ ఫ్రెండ్ తోనే సాలెం సిటీ కెళ్తే, బాయ్ ఫ్రెండ్ ని నోవా చంపే వాడు కాదుగా? 

          ఇక హంటర్ వారియర్ గా వుండలాన్న కోరిక : ఈ కోరికతో హంటర్ వారియర్స్ క్లబ్బు కెళ్ళి తనని సభ్యురాలిగా చేరుకోవాలని ఫైట్ చేస్తుంది. స్వర్గానికే వెళ్ళా లనుకున్నప్పుడు ఇంకా యమభటులతో పనేముంది? స్వర్గానికి టికెట్ నిచ్చే ఆ మోటార్ బాల్ అనే మృత్యుక్రీడ మీద దృష్టి పెట్టి, అటు వైపు కృషి చేయకుండా? 

          ఇలా పరస్పర విరుద్ధ భావాలతో వుండే పాత్ర పాసివ్ పాత్రే. ఏం చేయాలో స్పష్టత వుండదు. ఏం చేయాలన్న స్పష్టత ప్రత్యర్ధి నోవాకే వుంది. అతడికి సూపర్ ఎనర్జీ తో వున్న ఆమె మెదడు కావాలి. దీనికి వెక్టర్ ని పురిగొల్పాడు. వెక్టర్ హంటర్ వారియర్స్ ని ఉసిగొల్పాడు. హంటర్ వారియర్స్ ఆమె మృత్యుక్రీడ గెలవకుండా చంపి మెదడు అపహరించే ప్లానేశారు......అంటే ప్రత్యర్ధి వైపు నుంచి కథ స్పష్టంగా – ఒక లైనులో పారడైంలోనే  వుంది. 

          దీన్ని ప్రధాన పాత్ర అలీటా వైపు మారిస్తే, సూపర్ బ్రెయిన్ వున్న అలీటా సాలెం సిటీకి ప్లానేస్తే, కౌంటర్ గా నోవా ఆమె సూపర్ బ్రెయిన్ ని అపహరించాలని ప్లానేశాడు. దీన్ని
what if? ప్రశ్నగా మారిస్తే, “సాలెం సిటీ గోల్ తో వున్న అలీటా సూపర్ బ్రెయిన్ ని కోల్పోయే ప్రమాదం ఏర్పడితే?”...ఈ ప్రశ్నతో అలీటాకి థ్రెట్ ఎంతుందో పైకే కన్పించిపోతోంది. ఇదే ఈ సింపుల్ లైనుతో కూడిన కథకి యూఎస్పీ. 

          హై కాన్సెప్ట్ కథ ఒక ప్రశ్నతో సింపుల్ లైన్ కథగా వుంటుందని పైన చెప్పుకున్నాం. సూటిగా మాస్ అప్పీల్ తో సామాన్య ప్రేక్షకులకి కూడా అర్ధమైపోయే కథ. అంటే అప్పుడు అలీటాకి పూర్వ జన్మ జిజ్ఞాస వుండకూడదు. బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన స్ఫూర్తితో సాలెం సిటీకి చేరుకోవాలన్నదే ఏకైక గోల్. బాయ్ ఫ్రెండ్ కి ఆర్ధికంగా సాయపడే ఆలోచన కూడా వుండకూడదు. హంటర్ వారియర్స్ క్లబ్ లో చేరే ఆలోచన అసలే వుండకూడదు. ప్లాట్ పాయింట్ వన్ ఆమెకి సాలెం సిటీ వెళ్ళాలన్న ఏకైక గోల్. మిడ్ పాయింట్ తన బ్రెయిన్ కోసం హంటర్ వారియర్స్ ప్రయత్నిస్తున్నారన్న టర్నింగ్, ఇక ప్లాట్ పాయింట్ టూ వచ్చేసి  హంటర్ వారియర్స్ ని ఎదుర్కొంటూ మోటార్ బాల్ మృత్యు క్రీడలో పాల్గొనడం. ఇంతే, సింపుల్. 

        నిజమే,ఇదంతా చదువుతున్న వాళ్లకి రెండొందల మిలియన్ డాలర్ల మెగా మూవీ తీస్తున్న హాలీవుడ్ అపర బ్రహ్మలకి ఎలా తీయాలో తెలీదా, ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని రాస్తున్నాడు -  అన్పించవచ్చు. ఏం చేస్తాం, ఈ బ్లాగు వున్నదే రాయడానికి కాబట్టి రాయాల్సి వస్తోంది. రాయకపోయినా తంటా, రాసినా మంట. తప్పదు. 

          ఈ కథకి కథనాన్ని పారడైం లో ఆలోచించకుండా మోనోమిథ్ లో ఆలోచించడం వల్ల, అదికూడా గజిబిజిగా ఆలోచించడం వల్ల, ఇంటర్వెల్ వరకూ రకరకాల దశలు మారుతూ ఎటూ కదలకుండా వుండిపోతుంది స్టోరీ బిజినెస్. ఈ బిగినింగ్ విభాగంలో ఆర్డినరీ వరల్డ్, కాల్ టు అడ్వెంచర్, రెఫ్యూజల్ ఆఫ్ ది  కాల్, మీటింగ్ ది మెంటర్, క్రాసింగ్ ది థ్రెషోల్డ్;  టెస్ట్స్, ఎలైస్, ఎనిమీస్; అప్రోచ్ అనే 7 మజిలీల్లో మొదటిదే కాసేపు వుంటుంది. మిగిలినవి అలీటా మారిపోయే రకరాల కోరికల మధ్య గల్లంతవుతాయి. ఇంటర్వెల్ లో ఆమె వెక్టర్ పంపిన మహా సైబోర్గ్ తో తలపడి ముక్కచెక్కలవుతుంది. ఆమెకి డాక్టర్ ఇడో ఇచ్చిన శరీరం ఛిన్నాభిన్నమై పడిపోతుంది. మళ్ళీ కొత్త శరీరమిస్తాడు డాక్టర్. ఇంటర్వెల్ లోనే ఈ స్థాయి పతనం ఎంత రాంగ్ కథనమంటే, మోనోమిథ్ కూడా ఒప్పుకోదు, పారడైం కూడా ఒప్పుకోదు. అరిస్టాటిల్ కూడా ఒప్పుకోడు. ప్రధాన పాత్ర సర్వశక్తులూ కోల్పోయి కుప్పకూలే ఈ ఘట్టం కథనంలో ఎప్పుడొస్తుందంటే, క్లయిమాక్స్ ముందు ప్లాట్ పాయింట్ టూ లోనే!

      పారడైం లో, లైట్ ప్లాట్ లైన్ తో, హెవీ యాక్షన్ చేయకుండా, అర్ధమవడానికి పెనుభారమైపోయిన హెవీ కథతో అలీటాని అర్ధంగాని బొమ్మలా తయారుచేశారు. హాలీవుడ్ మంత్రం ఒకటే - హై కాన్సెప్ట్ కి లైట్ కథతో యాక్షన్ హెవీగా వుండాలి, అదే హెవీ డ్రామాకి హెవీ కథతో లైట్ యాక్షన్ వుండాలి. హెవీ కథ, హెవీ యాక్షన్ అంటూ వుండవు. లైట్  కథ లైట్ యాక్షన్ అంటూ వుండవు. కథ - యాక్షన్ పరస్పరం యాంటీగా వుంటాయి. తెలుగులోనే ఇంకా లైటర్ వీన్ లవ్ స్టోరీస్ అంటూ కొత్త సిద్ధాంతాన్ని కనుగొని, లైట్ కథకి  లైట్ యాక్షన్ తగిలించి చావగొడుతున్నారు. ఇందులో తాజాగా నిన్న విడుదలైన తెలుగు డబ్బింగ్ ‘దేవ్’ కూడా చేరి ఫ్లాపయింది. కలియుగం యాక్షన్ లో వుంటే కబుర్లతో పని జరుగుతుందను కుంటున్నారు. 

          క్లయిమాక్స్ మోటార్ బాల్ మృత్యు క్రీడలో అలీటా పద్మవ్యూహంలో చిక్కుకునే యాక్షన్ సీనుంటుంది. తన సూపర్ బ్రెయిన్ తో దీన్ని ఛేదించి సాలెం సిటీకి టికెట్ కొడుతుంది. కానీ స్క్రీన్ ప్లే అనే త్రిశంకు స్వర్గంలో పడి విలువైన ప్రేక్షకుల టికెట్ కొట్టడంలో విఫలమైంది.

సికిందర్
         

Tuesday, February 12, 2019

రిపీట్ ఆర్టికల్


Q : మీ రివ్యూలు ఆసక్తికరంగా వుంటాయి లెంగ్త్  కాస్త ఎక్కువనిపించినాఅయితే మీరు తరచుగా వాడే పదం ‘జానర్ అంటేఏమిటి?
విన్నకోట నరసింహా రావు  (ఊరి పేరులేదు)
 A :    మీ అభిమానానికి థాంక్స్. జానర్ గురించి చెప్పాలంటే, కళల్లో ఒక నిర్ణీత కేటగిరీని జానర్ అంటారు.  దీనికి తెలుగు అర్ధం ‘కళాప్రక్రియ’.  కథల విషయానికొస్తే జానపద కథలకి ఒక నిర్ణీత కళా ప్రక్రియ వుంటుంది, కామెడీకి ఒక నిర్ణీత కళా ప్రక్రియ వుంటుంది. ఇలా ఒక్కో కళాభివ్యక్తికి ఒక్కో నిర్ణీత ప్రక్రియ వుంటుంది. ఆ ప్రక్రియలోనే సృష్టి జరగాలి. దీన్నే జానర్ మర్యాద అంటారు. జానర్ అనే మాటని పక్కనబెట్టి సింపుల్ గా పిలుచుకోవాలంటే, అది జానపద కేటగిరీ, ఇది కామెడీ కేటగిరీ...ఇలా  చెప్పుకుంటే చక్కగా  అర్ధమైపోతుంది. ఫలానా కేటగిరీ అన్నాక ఆ కేటగిరీ కుండే లక్షణాలతోనే సృష్టి జరగాలని, జరిగి వుంటుందని  కూడా చప్పున అర్ధమైపోతుంది.
          జానర్ అనేది ఇంగ్లీషు ‘genre’ కి తెలుగు నుడికారం. ఇంగ్లీషులో ‘ఝాన్ర’ అని పలుకుతారు. తెలుగులో అలా పలికినా రాసినా ఎబ్బెట్టుగా అన్పిస్తుంది. కాబట్టి ‘జానర్’ అని తెలుగైజుడు అయింది. ఇంగ్లీషులో మాటాడేప్పుడు ‘ఝాన్ర’ అనే పలకాలి. తెలుగులో మాటాడేప్పుడు ‘జానర్’ అనాలి. కొందరు సినిమా వాళ్ళు ఏదోలా నోరు తిప్పుతూ ‘జోనర్’  అంటారు. అంత నోరు ఏదోలా తిప్పాల్సిన అవసరంలేదు. ‘జొన్నలు’ అన్పించేలా నోరూరిస్తూ పలకాల్సిన అవసరమూ లేదు.

Q:  త్రీ యాక్ట్ లో రెఫ్యూజల్ ఆఫ్ కాల్ తప్పని సరి అని ఒక చోట చదివాను. మీరు కూడా రాసినట్టు గుర్తు. ‘శివ’  సినిమా త్రీ యాక్ట్స్ట్రక్చర్ లో రెఫ్యూజల్ ఆఫ్ కాల్ ఎందుకు లేదు?లేకపోయినా అంత పర్ఫెక్ట్ గా  ఆర్డర్ ఎందుకు వుంది?
 
పేరు వెల్లడించ వద్దన్న టాలీవుడ్ దర్శకుడు  

A : కథనంలో రెఫ్యూజల్ ఆఫ్ కాల్ అనే మజిలీ 1950 లలో జోసెఫ్ క్యాంప్ బెల్ సూత్రీకరణ లోంచి వచ్చింది. అది పురాణ గాథల నిర్మాణంలో ఆయన పట్టుకున్న మజిలీ, దాని సూత్రీకరణ. హాలీవుడ్ దాదాపు ’80 ల వరకూ జోసెఫ్ క్యాంప్ బెల్ మిథికల్ స్ట్రక్చర్ నే మార్పు చేర్పులు చేసుకుంటూ స్క్రీన్ ప్లేలు, వాటితో సినిమాలూ సృష్టించుకుంటూ వచ్చింది. (విచిత్రమేమిటంటే యూఎస్ నుంచి వచ్చిన దర్శకుడు దేవా కట్టా 2010 లో తీసిన  ‘ప్రస్థానం’ క్యాంప్ బెల్ ప్రభావంతోనే తీశారు. ఆ ఉన్నత కళావిలువల ఛాయలన్నీ అందులో కనపడతాయి. 2005 లోనే ఈ వ్యాసకర్తని ఆయన అడిగిన మొదటి ప్రశ్న కూడా - క్యాంప్ బెల్ ని చదివారా? అనే). తర్వాతి కాలానికి – అంటే ’80 లలోనే  ఇది అవుట్ డేటెడ్ అయిపోయింది. స్ట్రక్చర్ ని మరింత సరళీకరించి, కథనానికి స్పీడు పెంచేలా కొత్త పారడైంని అందించిన సిడ్ ఫీల్డ్ ని ఫాలో అవడం మొదలెట్టింది హాలీవుడ్. ’90 లనుంచీ  ఇప్పటి వరకూ హాలీవుడ్ స్ట్రక్చర్ కి సిడ్ ఫీల్డ్ పారాడైంనే ఫాలో అవుతూ వస్తోంది. ఈ స్ట్రక్చర్ లో ‘రెఫ్యూజల్ ఆఫ్ కాల్’ అనే  మజిలీని తొలగించాడు సిడ్ ఫీల్డ్. పరిస్థితి డిమాండ్ చేస్తున్నా హీరో చర్యకి పూనుకోవడానికి తిరస్కరించే ఘట్టాన్నే ‘రెఫ్యూజల్ ఆఫ్ కాల్’ మజిలీ అన్నారు. ఇది బిగినింగ్ విభాగంలో ప్లాట్ పాయింట్ వన్ కి ముందు వస్తుంది. అప్పుడు ఒక సీనియర్ పాత్రో, ఇంకో సన్నిహిత పాత్రో (థ్రెషోల్డ్ క్యారక్టర్అంటారు) వచ్చి హీరోకి నచ్చజెప్తుంది. అప్పుడు హీరో సరేనని చర్యకి పూనుకోవడానికి సిద్ధమవుతాడు ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పరిస్థితి తీవ్రతరం కూడా అవడంతో.
          ఇది పాత్ర చిత్రణకి సంబంధించిన ఒక షేడ్. సిడ్ ఫీల్డ్ పారాడైంలో దీని అవసరం లేదని తొలగించారు. ఎవరో వచ్చి నచ్చజెప్తే హీరో అప్పుడు ఫీలై చర్యకి పూనుకోకుండా, ఈ సెకండ్ హేండ్ ఫీలింగుకంటే,  తానుగా ఫీలై రంగంలో దిగాలన్న కథనానికి స్పీడు పెంచే ఇన్నోవేషన్ లో భాగంగా ఆ మజిలీ ఎగిరిపోయింది. ఇప్పటి హాలీవుడ్ సినిమాల్ని చూస్తే అవి హీరో పాత్రచిత్రణ సంగతుల్ని బాగా కుదించి, యాక్షన్ ఓరియెంటెడ్ గానే వుంటాయి. సినిమా వ్యాపారానికి  క్యారక్టరైజేషన్ కంటే, ప్లాట్ ప్రొగ్రెషన్  ముఖ్యమని వాళ్ళ కొత్త విధానం.
          ఇందుకే ‘శివ’ లో ఆ మజిలీ – లేదా క్యారక్టర్ షేడ్ లేకపోయినా ఆర్డర్ లో బిగువు తగ్గలేదు. అయితే బిగినింగ్ ఆర్డర్ లో ఆ మజిలీ వుంటుంది. ఒకేసారి హీరో సైకిలు చైన్ తో జేడీని కొట్టడు ప్లాట్ పాయింట్ వన్ లో. అంతకి ముందు జేడీ చేష్టల్ని గమనిస్తూనే వుంటాడు. ఎప్పుడైతే చేష్టలు ముదిరి హీరోయిన్ ని టీజ్ చేస్తాడో,  అప్పుడు చర్యకి పూనుకుని ఫైనల్ గా జేడీని కొట్టి ప్లాట్ పాయింట్ వన్ని సృష్టిస్తాడు. ఇక్కడ హీరోకి ఇంకో సీనియర్ పాత్రో, ఇంకెవరో కొట్టమని నచ్చజెప్పలేదు. ఇక్కడ హీరో స్వయంపోషకత్వం, స్వశక్తీ గలవాడు.
          సిడ్ ఫీల్డ్ తరచూ 19 వ శతాబ్దపు అమెరికన్ నవలారచయితా హెన్రీ జేమ్స్,  ‘ది ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్’ వ్యాసంలో రాసిన మాటల్ని ప్రస్తావిస్తూంటాడు - 
“What is character but the determination of incident? And what is incident but the illumination of character?” అని.
  
        ఈ తరహా యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రచిత్రణే  క్యాంప్ బెల్ పాసివ్ మజిలీని తొలగించింది. యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రచిత్రణంటే యాక్షన్ సినిమాలకనే కాదు, ఫ్యామిలీ ప్రేమా, కామెడీ గిమిడీ ఏ రకం సినిమాలకైనా హీరో స్వయం నిర్ణాయక శక్తితో తానుగా సంఘటనల్ని సృష్టించి ఆశ్చర్య పర్చే వాడుగా,  మెరుపులు మెరిపించే వాడుగా వుండాలని అర్ధం. ఇలావుంది కాబట్టే ‘శివ’ లో సైకిలు చైను సంఘటన అంత పాపులరైంది. క్లాసిక్ గా వుండిపోయింది.
          
అయితే గత డిసెంబర్ లో వచ్చిన ‘టైగర్ జిందా హై’ లో   రెఫ్యూజల్ ఆఫ్ కాల్ మజిలీ సహా, జోసెఫ్ క్యాంప్ బెల్ పురాణ ప్రక్రియలు అనేకం వున్నాయి. అవతల ఘోరాలు జరుగుతున్నాయ్ రారా బాబూ అంటే ససేమిరా అంటాడు సల్మాన్ (రెఫ్యూజల్ ఆఫ్కాల్).  ఆ వచ్చిన అధికారులు ఖర్మ అనుకుని వెళ్ళిపోతారు. తర్వాత థ్రెషోల్డ్ క్యారక్టర్ గా కత్రినా కల్పించుకుని,  బుజ్జగిస్తే బయల్దేరతాడు. అయితే ఆనాటి క్యాంప్ బెల్ స్ట్రక్చర్ లో ఈ మిథికల్ క్యారక్టర్ లు, కథనమూ సీరియస్ గా వుంటే ఈ యాక్షన్ మూవీ నిలబడేది కాదు. ఆ మిథికల్ క్యారక్టర్స్ తో, కథనంతో ఎక్కడా సీరియస్ నెస్ అనేది లేకుండా,  తెగ నవ్విస్తూ పోవడడంతో ఈ టెర్రరిజం మూవీ మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ అయింది.


Q :     Just now, I read your review on 'Padmavath' movie. It's outstanding. I want to represent this review in my 'media policy' class. Cause, we discussed this controversy in the previous class. Could you please send me, the English version of this movie review.
Dileep Kumar, EFLU
A :     Thanks for your compliment,  and as well as your idea of presenting the review in your class. But the shortcoming is that it cannot be had in English. I only write in Telugu for the blogfor Telugu audienceHence I request you to make other arrangements of value, for translation.

Q :  మీరు అప్పుడప్పుడు స్క్రీన్ ప్లే టిప్స్ ఇచ్చేవారు సరదాగా చదువుకోవడానికి. మళ్ళీ ఎప్పుడిస్తారు?కె. ఏ. రాగిణి, 
హైదరాబాద్ 
A : ఈ ప్రశ్న మరికొందరు కూడా అడుగుతున్నారు. తప్పక వచ్చేవారం ప్రారంభిద్దాం. ఇప్పటికి 140 దాకా టిప్స్ ఇచ్చాం.

Q:  మిడిల్  మాటాష్ స్క్రీన్ప్లే  అంటుంటారు కదాఅసలు ఒక కథకి మిడిల్  లో వుండాల్సిన బేసిక్ పాయింట్స్ ఏంటిమిడిల్  లోఎలాంటి సంఘటనలు జరగాలిపాత్రలు ఎలా వుండాలి?   రూల్స్ పాటించకపోవడం వల్ల  మిడిల్  మాటాష్ స్క్రిప్ట్స్వస్తున్నాయి?శ్రవణ్, అసోసియేట్ దర్శకుడు
          మిడిల్లో వుండాల్సిన బేసిక్ పాయింట్స్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే ప్రాణం పోసుకుంటాయి. కథ అనేది ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే  పుడుతుంది. అంతకి ముందుది కథ కాదు, ఉపోద్ఘాతం. వొళ్ళు మండిన సగటు ప్రేక్షకుడి భాషలో చెప్పుకోవాలంటే సోది చెప్పడం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పుట్టిన కథ ప్లాట్ పాయింట్ టూ దాకా వుంటుంది. ప్లాట్ పాయింట్ టూ దగ్గర్నుంచి కథకి ముగింపే వుంటుంది. ఈ ప్లాట్ పాయింట్ వన్ నుంచి ప్లాట్ పాయింట్ టూ వరకూ స్క్రీన్ ప్లేలో 50 శాతం కథ ఆక్రమించి వుంటుంది. అంటే ఈ భాగమంతా మిడిల్ అన్న మాట. ఈ మిడిల్ భాగం తగ్గే కొద్దీ  కథాబలం కూడా తగ్గుతుంది.
          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథ పుట్టాలనే బేసిక్ పాయింటుతో బాటు, అక్కడ్నించీ మిడిల్లో ఆ కథని నడిపించే మరికొన్ని బేసిక్స్ వుంటాయి. అవి : 1. సమస్య, 2. హీరోకి గోల్, 3. హీరో గోల్ ఎలిమెంట్స్ లో a. కోరిక, b. పణం, c. పరిణామాల హెచ్చరిక, d. ఎమోషన్ (‘శివ’ చూస్తే ఇవి బాగా అర్ధమౌతాయి).
          ఇవీ కథ, ఆ కథతో హీరోతో, ఆ హీరోతో ప్లేతో వుండే బేసిక్స్. కథే హీరో హీరోయే కథ - ఈ బేసిక్ బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇందిరాయే ఇండియా - ఇండియాయే ఇందిరా అన్న స్లోగన్ తల్చుకుంటే ఇది బాగా గుర్తుంటుంది. ఇందిర నచ్చకపోతే, వాజ్ పాయే ఇండియా షైనింగ్ – ఇండియా షైనింగే వాజ్ పాయ్ అని ఎగ్జాంపుల్ పెట్టుకున్నా గుర్తుంటుంది. కథే హీరో హీరోయే కథ - కథలో పుట్టే సమస్య క్యాన్సర్. కాబట్టి ఆ క్యాన్సర్ ని తొలగించి కథనీ దాంతో తననీ పునీతం చేసుకోవడమే హీరోకుండే గోల్.
          ఇవన్నీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడే సమస్యతో కథ పుట్టినప్పుడే వుండే బేసిక్స్. కథలో పుట్టే సమస్య  క్యాన్సర్ అయినప్పుడు, ఆ సమస్య లేదా క్యాన్సర్ అనేది వ్యతిరేక పాత్రకి ప్రతీక, లేదా సింబల్. అంటే ఇది హీరోకి వ్యతిరేక పాత్ర. దీన్ని నిర్మూలించడానికే హీరో సంఘర్షిస్తాడు. దీన్నే మిడిల్ బిజినెస్ అంటారు. ఈ మిడిల్ బిజినెస్ లో - సంఘర్షలోంచి అనేక సంఘటనలు పుడతాయి. వ్యతిరేక పాత్రతో ఈ సంఘర్షణలో హీరో పడుతూ లేస్తూ వుంటాడు. మిడిల్ బిజినెస్ కి ఇదే  బేసిక్ పాయింటు. ఈ మిడిల్ బేసిక్ పాయింటుని డైనమిక్స్ అంటారు. ఈ డైనమిక్సే మిడిల్లో టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ని ఏర్పరుస్తాయి.
          ఇప్పుడు వెళ్లి వెళ్లి ఈ సంఘర్షణ ప్లాట్ పాయింట్ టూ కి చేరుతుంది. ఇక్కడి వరకే కథ లేదా ఆ సమస్య, లేదా క్యాన్సర్, లేదా వ్యతిరేక పాత్ర  ప్రతాపం చూపించడం వుంటుంది. ఈ ప్రతాపం తీవ్రత ఇక్కడ ఇంకా పెరిగి,  హీరోకి జ్ఞానోదయమై,  ఒక పరిష్కారం దొరుకుతుంది. వ్యతిరేక పాత్రని  ఇక శాశ్వతంగా నిర్మూలించ గలిగే పరిష్కార మార్గం. ప్లాట్ పాయింట్ టూ ధర్మమే పరిష్కార మార్గాన్ని అందించడం.
          ఇప్పుడు చూస్తే మిడిల్ ప్రారంభంలో,  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పుట్టే సమస్యకి, ప్లాట్ పాయింట్ టూ దగ్గర అది సమసిపోయే పరిష్కార మార్గమన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ వన్ సమస్య అయితే, ప్లాట్ పాయింట్ టూ పరిష్కారం అవుతాయన్న మాట. ఇవి రెండూ స్క్రీన్ ప్లేకి  ప్లేకి మూల స్థంభాల్లాంటివి. వీటి మధ్య జరిగే సంఘర్షణంతా  మిడిల్ బిజినెస్. ఇక మిడిల్ బిజినెస్ పూర్తి చేసిన ఆ హీరో,  ఆ పరిష్కార మార్గంతో ఎండ్ విభాగాన్ని ప్రారంభించి క్లయిమాక్స్ కెళ్ళిపోతాడు.
          ఇప్పుడు మిడిల్ మటాష్ కొస్తే, మిడిల్ శాతం తగ్గిపోవడం. ఇదెలా తగ్గుతుంది? మిడిల్ కి ముందుండే బిగినింగ్ విభాగం పెరగడం వల్ల. మరి బింగినింగ్   నిడివి ఎంత వుండాలి? మొత్తం స్క్రీన్ ప్లే మొత్తంలో పాతిక శాతమే వుండాలి. మిడిల్ ఎంత వుండాలి? స్క్రీన్ ప్లేలో సగం అంటే యాభై  శాతం వుండాలి. మరి ఎండ్? ఇది మిగిలిన పాతిక శాతం వుంటుంది.
          ఇప్పుడు పాతిక శాతమే వుండాల్సిన  బిగినింగ్ విభాగం యాభై శాతానికి పెరిగితే 
ఏమవు
తుంది? ఆ మేరకు బిగినింగ్ కీ ఎండ్ కీ మధ్య వుండే  మిడిల్ నిడివి సగానికి  సగం తగ్గిపోయి, పాతిక శాతం మిగులుతుంది. అప్పుడు స్క్రీన్ ప్లేలో  మిడిల్ ఉనికి ఎక్కడ వుంటుంది? ఇంటర్వెల్ అవతలికి జరిగిపోయి అక్కడ కన్పిస్తుంది. అప్పుడేమవుతుంది?  ఇంటర్వెల్ అవతలి వరకూ, అంటే  సెకండాఫ్ సగం వరకూ బిగినింగే వ్యాపించి వుంటుంది.  అయినంత మాత్రాన ఏమవుతుందని? ఈ బిగినింగ్ సెకండాఫ్ సగం దగ్గర ముగిసినప్పుడు,  ప్లాట్ పాయింట్ వన్ కూడా ఫస్టాఫ్ నుంచి సెకండాఫ్ సగానికి జరిగిపోయి అక్కడే ఏర్పాటవుతుంది. అంటే కథ అక్కడ పుడుతుందన్న మాట. ఆ పుట్టిన కథ అక్కడ కుంచించుకు పోయివున్న మిడిల్లో పావు శాతమో ఇంకా తక్కువో వుంటుంది. 
          ఇలా సెకండాఫ్ సగం దాకా కథే ప్రారంభం కాకపోవడం, ఆ ప్రారంభించిన  కథ కూడా ఇట్టే ముగిసిపోవడం జరుగుతాయన్న మాట.  కొండంత రాగం తీసి...అన్నట్టుగా వుంటుందన్న మాట సినిమా. ఫస్టాఫ్ అంతా వెస్ట్ చేసి, అక్కడెక్కడో  సెకండాఫ్ లో కథ ప్రారంభమయ్యే దాకా మునిసిపాలిటీ వాళ్ళు డ్రైనేజీ తవ్వుతున్నట్టు బారుగా కంపు కొడుతూ బిగినింగ్ విభాగమే పర్చుకుని వుంటుంది గనుక,  సినిమా భరించలేకుండా తయారవుతుంది.
          బిగినింగ్ విభాగమంటే ఉపోద్ఘాతమని కదా? వొళ్ళు మండిన సగటు ప్రేక్షకుడి భాషలో సోది అని కదా? ఈ సోది నిర్దేశించిన దాని పాతిక శాతం కంటే కూడా ఎంత తక్కువ వున్నా ఫర్వాలేదు, దాటిపోయి ఇలా మిడిల్ ని మటాష్ చేస్తూ దాడి చేస్తే, ఇప్పుడు సగటు ప్రేక్షకుడికి ఇంకా మండిపోయి  -  ఎదవ సోది - అనేస్తాడు సినిమాని.  ఇలా పచ్చి నిజాలు మాటాడు కోకపోతే అంత సులభంగా మిడిల్ మటాషులు వదిలిపోయేలా లేవు.
          ఈ బేసిక్స్ రాసిరాసి బ్లాగు బాగా  అరిగిపోయింది.  బేసిక్స్ తెలియకుండానే పేజీలకి పేజీలు వీధి నాటకాల్లాగా రాసేస్తూంటారు. ఇలాగని తెలుగు నాటకరంగ అభివృద్దికి పనికొస్తారా  అంటే అదీ లేదు, ఆ బేసిక్స్ అసలే తెలీవు.

సికిందర్

Thursday, February 1, 2018


Monday, February 11, 2019

786 : రివ్యూ




దర్శకత్వం : రాబర్ట్ రోడ్రిగ్స్ 

తారాగణం : రోసా సలాజర్, క్రిస్టాఫ్ వాల్జ్, కీన్ జాన్సన్, జెన్నిఫర్ కనెల్లీ, మహెర్షలా అలీ తదితరులు
రచన:  జేమ్స్ కెమెరాన్, లీటా కలోగ్రిడిస్
సంగీతం : టామ్ హల్కెన్ బోర్గ్, ఛాయాగ్రహణం : బిల్ పోప్  
నిర్మాతలు :  జేమ్స్ కెమెరాన్, జాన్ లాండ్యూ
విడుదల : 8 ఫిబ్రవరి, 82019
***
          టెర్మినేటర్, టైటానిక్, అవతార్ లాంటి బ్లాక్ బస్టర్స్ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ నిర్మాతగా సంకల్పించిన ‘అలీటా’ మొత్తానికి ఇరవై ఏళ్ల సుదీర్ఘ కల నిజం చేసుకుని ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘సిన్ సిటీ’ ఫేమ్ దర్శకుడు రాబర్ట్ రోడ్రిగ్స్ దీన్ని రూపొందించాడు. హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీస్ అంటేనే సైన్స్ ఫిక్షన్ హంగామాలుగా మారిపోయి- రొటీన్ అయిపోయాయి. ఈ రొటీన్ లో మళ్ళీ జేమ్స్ కెమెరాన్ ఏ ప్రత్యేకతో వచ్చాడో తెలుసుకోవాలంటే దీని వివరాల్లోకి వెళ్ళాల్సిందే...

కథ
          మహాయుద్ధం తర్వాత 2563 లో, భూమ్మీద శిథిలావస్థలోంచి పునర్నిర్మాణమవుతుంది గజిబిజి ఐరన్ సిటీ. ఇక్కడ డాక్టర్ ఇడో (క్రిస్టాఫ్ వాల్జ్) అనే సైబర్ సైంటిస్టు వుంటాడు. ఇతను రాత్రిపూట నేరస్థుల్ని పట్టుకునే హంటర్ వారియర్ గా కూడా వుంటాడు. ఇతడికి జంక్ యార్డ్ లో మొండెం లేని తలతో వున్న సైబోర్గ్ దొరుకుతుంది. దాని మెదడు సజీవంగా వుందని తెలుసుకున్న అతను, సైబర్ బాడీని అతికిస్తాడు. అప్పుడా అమ్మాయికి చనిపోయిన తన కూతురు అలీటా పేరు పెడతాడు. అలీటా (రోసా సలాజర్) కళ్ళు తెరచి కొత్త ప్రపంచాన్ని చూస్తుంది. కానీ తానెవరో గుర్తుకు రాదు. డాక్టర్ ఇడో సంరక్షణలో వుంటుంది. ఆమె హ్యూగో (కీన్ జాన్సన్) అనే మోటార్ బాల్ ఆటగాడితో ప్రేమలో పడుతుంది. ఆమెకి అతను నగరం పైన వేలాడుతున్న ఊర్ధ్వ లోకం సాలెం సిటీని చూపిస్తాడు. అక్కడికి చేరుకోవడం ఎవరి వల్లా కాదంటాడు. ఆమెకి అక్కడికి చేరుకోవాలన్న కోరిక పుడుతుంది. మరి అలీటా అక్కడికి చేరుకుందా? అందుకు ఏ ప్రయత్నాలు చేసింది? ఎవరామెని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు? అసలు పైన సాలెం సిటీలో ఏముంది? ఆమెకి తన గతమేంటో తెలిసిందా? అసలు తనెవరు? ...ఇవన్నీ ప్రశ్నలు. వీటికి సమాధానాలే మిగతా కథ.

ఎలావుంది కథ 
      ఇంకెలా వుంటుంది -  ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రాంబో సినిమాల ట్రెండ్ తర్వాత,  అణుయుద్ధానంతర పరిస్థితి అంటూ కల్పించుకున్న సైన్స్ ఫిక్షన్ ట్రెండ్ లాగే వుంది. ఒక మహాయుద్ధం జరగడం, ప్రపంచం శిథిలమవడం, ఆ శిథిలాల మధ్య మిగిలిన మనుషులు జీవన పోరాటం చేయడం. ఇవే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకి టెంప్లెట్ గా వుంటున్నాయి. ఎంతసేపూ యుద్ధంతో నాశనమైన ప్రపంచం ఓ రెండు మూడొందల ఏళ్ల తర్వాత ఎలా వుంటుందో చూపెట్టే నెగెటివ్ ఫిక్షనే. ఇప్పుడున్న గ్లోబల్ ప్రపంచమే అభివృద్ధితో వెయ్యేళ్ళ తర్వాత కూడా ఎంత బావుంటుందన్న పాజిటివ్ ఫిక్షనే లేదు. దేశాలు చూస్తే అణుయుద్ధాలు పక్కనబెట్టి, ఆర్ధిక యుద్ధాలు చేసుకుంటున్నాయి. అణు యుద్ధంతో ప్రపంచ నాశనాన్నిగాక, ఆర్ధిక యుద్ధంతో ప్రపంచాన్ని జయించాలని చూస్తున్నాయి.

          అలీటాలో మహా యుద్ధం జరిగిన 300 ఏళ్ల తర్వాత, 26 వ శతాబ్దంలో జరిగే కథ అంటూ చూపెట్టారు. ఈ కథ మూడు  కోణాల్లో కన్పిస్తుంది : వాస్తవ ప్రపంచంలో సామాన్య ప్రజల ఉన్నత స్థితికి ఎగబ్రాకే కలలు (కమ్యూనిజం) గా వుంటూనే , ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వర్గం లేదా మోక్షం పొందే ఆరాటాలు (స్పిరిచ్యువాలిటీ) గా అన్పిస్తూ - ఇలా భౌతికంగా, ఆత్మికంగా ఎలా అర్ధం జేసుకుంటే అలా కన్పిస్తూనే,  మరోవైపు ఇప్పుడు జరుగుతున్న క్రైస్తవ - మహమ్మదీయ నాగరికతల యుద్ధం నేపధ్యంలో సెట్టింగ్స్ కన్పిస్తాయి. పైన సాలెం సిటీ అత్యాధునికంగా వుంటే, కింద ఐరన్ సిటీ సిరియా, ఇరాక్ ల దెబ్బతిన్న ప్రాంతాల్ని తలపించే ఇరుకు గల్లీల, అడ్డదిడ్డ భవనాలతో ఇస్లామిక్ ప్రాంతంలా వుంటుంది. చెప్పకనే చాలా తెలివిగా ఈ మూడు కోణాల రూపకాలంకారాలు (మెటఫర్స్) చేశారు ఆధిపత్య భావజాలంతో. 

          ఆ స్వర్గం లేదా ఉన్నత స్థితికి, లేదా సూపర్ పవర్ కి  ప్రతీకగా నగరం మీద వేలాడే ఊర్ధ్వ లోకం అన్నట్టుగా సాలెం (జెరూసలెం?) సిటీ వుంటుంది. ఇక్కడ నోవా అనే ‘దేవుడు’ అన్నట్టుగా శ్వేతజాతీయుడు కన్పిస్తాడు. ఇతడి ఏజెంటుగా భూమ్మీద నల్లజాతీయుడు కన్పిస్తాడు. తన ఊర్ధ్వ లోకంలోకి ఎంట్రీకి కొన్ని అర్హతలు పెడతాడు నోవా. ఈ అర్హతలు సాధిస్తే ఎంట్రీకి టికెట్. అలీటమ్మ ఈ ఎంట్రీ టికెట్ ఎలా కొట్టిందన్నదే కథ. అయితే ఆ మోక్షం - ఆర్ధికంగా కావొచ్చు, ఆధ్యాత్మికంగా కావొచ్చు -  పొందడానికి అలీటా అనుసరించే మార్గాలే అర్ధంపర్ధం లేకుండా వుంటూ, ఎగుడుదిగుడు కథనంతో కాన్సెప్ట్ ఉద్దేశాన్నే దెబ్బతీశాయి.

ఎవరెలా చేశారు
       రోసా సలాజర్ ది పూర్తిగా సీజీఐ చేసిన పాత్ర. ‘కొచ్చాడయన్’ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కి సృష్టించిన పూర్తిస్థాయి కంప్యూటర్ యానిమేటెడ్ క్యారెక్టర్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన ఫోటో రియలిస్టిక్ పాత్ర. సజీవంగా కళ్ళెదుట వున్నట్టే వుంటుంది. ఎమోషనల్, రోమాంటిక్, సెంటిమెంటల్ డ్రామాల ముఖ కవళికల క్రియేషన్ కట్టిపడేస్తుంది. మొదట్లో వీధుల్లో మోటార్ బాల్ క్రీడకి, క్లయిమాక్స్ లో స్టేడియంలో ఇదే క్రీడతో అంతిమ పోరాటానికీ చేసిన యాక్షన్ కొరియోగ్రఫీ సిజిఐ గుండెల్ని జలదరింపజేస్తుంది. తన కంటే బలశాలి పాత్రలతో ఆమె చేసే పోరాటాలకి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే పాత్రకి నిలకడలేని ఎమోషనల్, ఫిజికల్ గోల్స్ వల్ల ఒక బలమైన పాత్రగా నిలబడదు. అంటే పాసివ్ పాత్ర. 

          డాక్టర్ ఇడోగా మృదు స్వభావిగా కన్పించే క్రిస్టాఫ్ వాల్జ్ అంతే కఠినంగా హంటర్ వారియర్ గా క్రిమినల్స్ ని వేటాడుతూంటాడు. తన మాట వినని అలీటాతో మానసిక సంఘర్షణ ఒకటుంటుంది. అలీటా కి మోటార్ బాల్ క్రీడ నేర్పే టీనేజర్ బాయ్ ఫ్రెండ్ హ్యూగో పాత్రలో కీన్ జాన్సన్, సైబోర్గుల నుంచి విడిభాగాలు దొంగిలించి డబ్బులు జమచేస్తూంటాడు – పైన వేలాడుతున్న సాలెం సిటీకి వెళ్ళడానికి. కానీ అలాటి సంపాదనతో నీకు స్వర్గ ప్రాప్తి లేదన్నట్టు మధ్యదారిలో ముళ్ళ చక్రంతో చంపేస్తాడు పైలోకంలో వున్న నోవా. అలీటా కూడా కాపాడలేకపోతుంది. ప్రేమకి జయం లేదు. స్క్రిప్టు రాసిన జేమ్స్ కెమెరాన్, ఆమెకి ఇటు తండ్రి లాంటి డాక్టర్ ఇడోతో, అటు బాయ్ ఫ్రెండ్ తో రెండు ప్రేమలుండ కూడదని చెప్తే, దర్శకుడు రోడ్రిగ్స్ తండ్రి ప్రేమని వుంచేసి, బాయ్ ఫ్రెండ్ తో ప్రేమని ముళ్ళ చక్రంలో తిప్పాడు. ఆనర్ కిల్లింగ్ అన్నట్టు. 

       కన్నకూతురు చనిపోయాక భర్త డాక్టర్ ఇడో తో విడిపోయిన షెరాన్ పాత్రలో జెన్నిఫర్ కనెల్లీ కూడా ముఖ్య పాత్రే. ఈమె భర్త పెంచుకుంటున్న అలీటా పట్ల జెలసీతో వుంటుంది.  ఇక తన జీవితానికి మిగిలింది పైన సాలెం సిటీకి చేరుకోవడమేనని - కాశీకి పోయినట్టు -  ఏజెంట్ వెక్టర్ ని కలుస్తూంటుంది. కానీ అలీటా తన హృదయం తీసి బాయ్ ఫ్రెండ్ కివ్వబోయే ఒక ఉద్విగ్నభరిత సన్నివేశం చూశాక, ఆమె ఇక సాలెం సిటీతో తనకి పని లేదని ఏజెంట్ కి చెప్పేసి వెళ్ళిపోతుంది. 

          భూమ్మీద నోవా ఏజెంట్ వెక్టర్ పాత్రలో
మహెర్షలా అలీ, నోవా తరపున భూమ్మీద పాపుల్ని ఏరేసే హంటర్ వారియర్స్ కి నాయకుడుగా కూల్ గా కన్పిస్తాడు. ఇతడి ముఖ్య ఏజెంటు జపాన్ అనే వాడుంటాడు. సాలెం సిటీకి ప్రయాణ ఖర్చుల కోసం హత్య కూడా చేసిన అలీటా బాయ్ ఫ్రెండ్ ని శిక్షించేందుకు యమభటుడిలా సైబర్ స్వోర్డ్ తో వెంటపడి, చివరికి అలీటా చేతిలోనే మొహం చెక్కుకుపోయి కూలబడతాడు. 

          తెల్లగా ధగధగ మెరిసిపోయే నోవా (ఎడ్వర్డ్ నార్టన్), పైన తన సాలెం సిటీ నుంచి భూమ్మీద వ్యవహారాలు చూస్తూ ఆదేశాలిస్తూంటాడు. ఇంకా చాలా సహ పాత్రలున్నాయి. ఎంతకీ చావని భారీ సైబోర్గ్ పాత్రలో, వెక్టర్ ముఖ్య అనుచరుడుగా జాకీ హేలీ వుంటాడు. 

          దృశ్యపరంగా ఒక అద్బుత మాయాలోకాన్నే సృష్టించారు. ఈ మాయాలోకంలో చెప్పాలనుకున్న విషయం చెదిరిపోయి ఆత్మని కోల్పోయిందీ మెగా సైన్స్ ఫిక్షన్ హంగామా.
(స్క్రీన్ ప్లే సంగతులు రేపు)

సికిందర్  
Watched at Tivoli Cinema, Sec' bad
7.35 pm, 10 Feb, 2019 
Telugurajyam.com