ఫస్టాఫ్
ప్రధాన కథ -1 : ఆత్మ కథ రాయించుకున్న
సంజు ఆ పుస్తకంలో మహాత్మా గాంధీతో తనని పోలుస్తూ రాసినందుకు రచయితని హేళన చేసి
పంపించేస్తాడు. అంతలో సుప్రీం కోర్టులో తీర్పు వెలువడుతుంది. 2006 లో టాడా కోర్టు
సంజుకి విధించిన ఐదేళ్ళ కారాగార శిక్ష ని సుప్రీంకోర్టు ఖరారు చేస్తూ, నెల
రోజుల్లోగా లొంగిపోవాలని ఉత్తర్వు లిస్తుంది. దీంతో సంజు నీరుగారి పోతాడు. ఈ వార్త
టీవీలో వస్తూంటే పిల్లలు చూస్తారు. దీంతో జైలుకెళ్ళే తన వల్ల పిల్లల జీవితాలు పాడవకూడదని ఆత్మహత్య చేసుకోబోతాడు. భార్య
మాన్యత అడ్డుకుని పిల్లలు ఎదుర్కొనే సమస్య ఇలా తీరదని, వేరే రచయిత చేత ఆత్మ కథ రాయించి
నిజాలు వెల్లడించాల్సిందేనని అంటుంది. దీనికి లండన్ రచయిత్రి విన్నీ డయాజ్ ని పిలిపిస్తారు.ఆమె
సంజు జీవితం చూసి రాయనని అనేస్తుంది. కానీ రాస్తున్నట్టు పేపర్లో వార్త వస్తుంది. అది
బిల్డర్ మిస్త్రీ చూసి, విన్నీని కలుసుకుంటాడు. సంజు ఆత్మకథ రాయవద్దంటూ
హెచ్చరిస్తాడు. ఇతనిలా ఎందుకంటున్నాడని విన్నీ సంజుని అడిగితే, ఒకప్పటి తన
మిత్రుడు మిస్త్రీ తో తన కథ చెప్పడం మొదలెడతాడు సంజు.
పాయింట్ : మొదటిసారి రాయించిన ఆత్మ
కథతో స్క్రీన్ ప్లే ప్రారంభం బోలుగా అన్పిస్తుంది. ఆ పూట సుప్రీం కోర్టుతీర్పు
వెలువడబోతోంది. అలాంటప్పుడు దేశమంతా దీని మీదే దృష్టిపెడుతుంది సహజంగా. ఛానెళ్ళు
కూడా సుప్రీం కోర్టు దగ్గర మకాం వేసి వుంటాయి. కనుక ఒకవైపు తన జీవితాన్ని మార్చేసే
అంతిమ తీర్పు వెలువడుతూంటే, సంజు ప్రాణాలుగ్గట్టుకుని టీవీకి అతుక్కుపోవాలి
నిజానికి. ఇలా కాక, రాయించిన ఆత్మకథే దో
పట్టుకుని కామెడీతో కాలక్షేపం చేయడం కాదు. అలా గనుక ఆత్మకథ రాయించాలనుకుంటే, తీర్పు వచ్చేదాకా ఆగి, తీర్పుని
బట్టి రాయించుకోవాలి. సినిమాలో ఈ సీన్ ఎలా వుంటుందంటే, ఆ పూట అంత ప్రధాన తీర్పు,
అదీ సుప్రీం కోర్టు నుంచి రాబోతోందని
పాత్రలు వేటికీ తెలియనట్టే వుంటుంది!
స్క్రీన్ ప్లే ఆదిలోనే ఇంత పెద్ద గోతి. ఇలా పేలవమైన ప్రారంభంతో కాకుండా, సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతున్న సందర్భంగా హడావిడీ, ఆందోళనలతో ప్రారంభించి వుంటే టేకాఫ్ బలంగా, సస్పెన్స్ తో వుండేది. ఆ తీర్పు పిల్లలు వినడం, సంజు ఖిన్నుడై ఆత్మ హత్య చేసుకోబోవడం, అప్పుడు భార్య ఆపి – ఆత్మకథ రాయించడాని ప్రేరేపించడం జరిగివుంటే అర్ధవంతంగా వుండేది.
బయోపిక్స్
ని పాత్ర స్వగతంతో ప్రారంభించడం కాలం చెల్లిపోయిన బలహీన కథనం. ‘ఇది నా
జీవితం...నేనిలా వున్నాను...నాకేం జరిగిందంటే...’ అనేలాంటి స్వగతంతో ‘సంజు’ ని
ప్రారంభించడం ఇలాటి కథనమే. బయోపిక్స్ ప్రారంభం కూడా సంఘటనతోనే వుండాలి. ఇక్కడ సుప్రీం
కోర్టు తీర్పు ఒక బలమైన సంఘటన. ఈ బలమైన
సంఘటనతో ప్రారంభించి వుంటే, అందుకోవడం అందుకోవడమే కథనం మంచి డైనమిక్స్ తో – విజువల్
నేరేషన్ తో ఆసక్తికరంగా వుండేది. ఇప్పటికీ చాలా మంది అర్ధం జేసుకోనిదేమిటంటే, సినిమా
మాధ్యమానికి సీనంటే, కథనమంటే, సంఘటనలే నని! సంఘటనల ద్వారా కథ చెప్పాలని!
ఇక్కడ
ఇంకొకటి చెప్పుకోక తప్పదు. ఎప్పట్నించో సినిమాల్లో అలవాటైపోయిన ఒక ఫార్ములా చిత్రణ
ఇంకా ఇక్కడ కూడా దర్శనమిస్తుంది : ఆత్మకథ రాసిన రచయిత త్రిపాఠీని కామెడీ పేరుతో
నానా మాటలని, అతడి బూటు తోనే అతణ్ణి
తరిమితరిమి కొట్టబోవడం చీప్ టేస్టే. అదే ఆ
రచయిత ఏ ఖాన్ సాబో అయితే, మర్యాదగా కూర్చోబెట్టుకుని, అలా కాదు ఇలాగని చర్చ
చేస్తారు. అప్పుడా ఖాన్ సాబు, తన పాండిత్యంతో
అందరినోళ్ళూ మూయించేసి వహ్వా లందుకుంటాడు. పాన్ ఉమ్మేసి పోతాడు. ఇదికూడా హిందీ
సినిమాల ఫార్ములానే. త్రిపాఠీల్ని తక్కువ చేయడం, ఖాన్ సాబుల్ని ఎక్కువ చేయడం.
సరే,
ఇదలా వుంచితే, ఆత్మ కథ రాయడానికి విన్నీ అనే లండన్ రచయిత్రి వస్తుంది. ఆమె - నీ
భార్యతో కాక ఇంకెంత మందితో పడుకున్నావని నేరుగా భార్య ముందే అడిగేస్తుంది. భార్య
కళ్ళు తిప్పుతూ భర్త కేసి చూస్తుంది. సంజు లెక్కలేసుకుని 308 మంది అంటాడు. భార్య
ఇంకో క్లోజప్ ఇస్తుంది- అయ్యో అలాగా అన్నట్టు. ఇక విన్నీ మెప్పుదలగా చిన్న స్మైల్
ఇస్తుంది. అతను దాచకుండా చెప్పేసినందుకు మెచ్చుకుని, ఇక ఇతను నిజాలే చెప్తాడనీ,
తను ఆత్మకథ రాయవచ్చనీ నిర్ధారణ చేసుకుందన్న మాట. అంతేగానీ, లైంగికంగా అంత మంది అమ్మాయిల్ని
వల్లో వేసుకున్న అతడి క్యారెక్టర్ పట్ల భార్యకి గానీ, ఆ రచయిత్రికి గానీ ఏ
అభ్యంతరమూ లేదన్న మాట. ఈ సీన్లో భార్య పాత్ర నిజజీవిత పాత్ర. ఆమెకున్న
పరిస్థితులేవో మనకి తెలీదు. కానీ రచయిత్రి
పాత్ర కల్పిత పాత్ర. కల్పిత పాత్రని కూడా బలహీనంగా చూపించడమెందుకు?
ఇలా
ఫస్టాఫ్ లో ప్రధాన కథ మొదటి భాగాన్ని పరిచయం చేస్తూ, ఫ్లాష్ బ్యాక్ ని ప్రేరేపించే
సంజు ఫ్రెండ్ మిస్త్రీ ద్వారా, ఫ్లాష్ బ్యాక్ కి తెరతీశారు.
ఈ
ప్రధాన కథ మొదటి భాగంలో సీన్లలో కథ అల్లిక గురించి తెలుసుకోవాలి. తెలుగు
సినిమాల్లో ఇప్పుడు సీన్లలో కథ అల్లిక వుండడం లేదు. సీన్లలో కథ కనపడదు. విడి విడి పది
సీన్లు కలిపి అతుకులేస్తే – అప్పుడుగానీ – ఎప్పుడో గానీ - అవన్నీ కలిపి చూసుకుంటే గానీ కనపడదు కథ!
ఒకప్పుడు
తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాలు చూసి, ‘భలేగా కుట్టాడ్రా’ అని చెప్పుకునే
వాళ్ళట. కుట్టడమేంట్రా అని ఆలోచించి, వాళ్ళు ఎడిటింగ్ గురించి అలా
మాట్లాడుకుంటున్నారని సినిమా వాళ్ళు అనుకునే వాళ్లట. ఇవ్వాళ ఎడిటింగ్ కాదు,
దేనిగురించీ మాట్లాడుకునే పరిజ్ఞానం లేదు - స్టార్స్ చేసే కామెడీల గురించి తప్ప.
ఇప్పుడా
కుట్టుపని కాస్తా సీన్లు రాసేప్పుడు చేస్తున్నారు. విషయం ఒక సీనులో ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనకి దూరంగా, పది
సీన్లు రాసుకుంటే గానీ కథకుడికి అంతుపట్టని కథలు తయారవుతున్నాయి.
పైన
చెప్పుకున్న ‘సంజు’ లో ప్రారంభ దృశ్యాన్నే తీసుకుంటే, తెలుగులో ఇలా ముక్కలు ముక్కలు చేసి కలిపి కుడతారేమో
: ‘సంజు’ స్వగతం - కట్. బాత్రూం సంజు ఆత్మకథ పుస్తకం చదవడం - కట్, రచయితతో కామెడీ – కట్. సుప్రీం కోర్టు తీర్పు – కట్. పిల్లల పరిస్థితి –
కట్. ఇలా దేనికది విడివిడి సీన్లుగా తప్ప
వూహించలేరు. వీటిన్నిటినీ కలిపి కుట్లేసేస్తే
అది రచనై పోతుంది. సినిమా కుంటి నడక నడుస్తోందన్న జ్ఞానం అసలే వుండదు.
‘సంజు’ సీన్లలో కథని అల్లడం ఎలా వుంటుందంటే, ఒకే
సీన్లో కథకి అవసరమున్న రెండు లేదా మూడు అంశాలు చెప్పేసి, ఎక్కడి కక్కడ కథని
ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవడం. (ఇదే పద్ధతి కొరియన్ ‘ది క్లాసిక్’ లో కూడా వుంటుంది)
స్వగతం
కాడ్నించీ పిల్లలు టీవీలో చూసే దాకా ‘సంజు’ లో ఒకే సమయంలో జరిగే ఒకటే సీను అదంతా!
పై ఐదు అంశాలూ ఒకే సీనులో అల్లేసి, ఇక
ఇంకో ఆత్మకథా గ్రంథ రచనకి శ్రీకారం చుట్టేశారు. ఒక్క సీనుతో కథ ఎంత ముందు
కెళ్ళిపోయింది! ఇలాటి సీన్లే మరి కొన్ని
వున్నాయి.
***
ఫ్లాష్ బ్యాక్
-1: సంజుని హీరోగా
పరిచయం చేస్తూ ‘రాకీ’ తీస్తూంటాడు తండ్రి
సునీల్ దత్. పాట తీస్తూంటే పక్క నుంచి సంజుకి
సిగరెట్ అందిస్తూంటాడు ఫ్రెండ్ మిస్త్రీ. సునీల్ దత్ వాసన పసిగట్టి మందలిస్తాడు – దురలవాట్లని
కెమెరా క్షమించదంటాడు. ఇలా తండ్రి నల్గురి ముందు చిన్నబుచ్చినందుకు సంజు నొచ్చుకుంటే,
ఆ బాధ తీర్చడానికి బార్ కి తీసుకుపోతాడు మిస్త్రీ.
అక్కడ
మద్యం, మాదక ద్రవ్యం రుచి చూపిస్తాడు. దీంతో క్రమంగా డ్రగ్స్ బానిసైపోతాడు సంజు.
ఒక పక్క తల్లి నర్గీస్ క్యాన్సర్ తో వుంటుంది. మరో పక్క ప్రేమించిన రూబీతో సమస్య వుంటుంది.
తల్లిని తీసుకుని చికిత్స కోసం అమెరికా వెళ్తారు.
అక్కడుండే ఇంకో ఫ్రెండ్ కమలేష్ తో కలిసి తిరిగి, వద్దన్నా డ్రగ్స్ సేవిస్తూంటాడు సంజు. తల్లికి
నయమై తీసుకొచ్చేస్తారు. వచ్చాక చూస్తే, రూబీకి వేరే సంబంధం నిశ్చయం చేస్తాడు ఆమె తండ్రి. తట్టుకోలేక
కమలేష్ ని పిలిపించుకుంటాడు సంజు. ఇంతలో రూబీ
తండ్రి చనిపోతాడు. ఇక ఎలాగో రూబీ సంజుని చేసుకునేలా ఒప్పిస్తాడు కమలేష్. తీరా ఆమె కలవడానికొచ్చే సరికి డ్రగ్స్
కొడుతూంటాడు సంజు. ఆమె దూషించి వెళ్ళిపోతుంది. దీంతో సంజు పరిస్థితి దారుణంగా
తయారవుతుంది.
ఇక
చేసేది లేక, సునీల్ దత్ కి అంతా చెప్పేసి, సంజుని కాపాడుడుకోమని ప్రాధేయప డతాడు
కమలేష్. అప్పుడు సంజు డ్రగ్స్ మరిగాడన్న
సంగతి కొత్తగా తెలుస్తుంది సునీల్ దత్ కి.
పాయింట్ : ఇక్కడ కూడా పాట షూటింగు జరిగే మొదటి సీనులోనే,
టైం వేస్ట్ చేయకుండా, డ్రగ్స్ తో వుండగల ఈ ఫస్టాఫ్ ఎపిసోడ్ పాయింటంతా చెప్పేశారు.
ఈ ఒక్క సీనులో కథని ముందుకి పరుగెత్తించే మూడు విషయాలు చెప్పేశారు : హీరోగా సంజు
పరిచయ సినిమా షూటింగు, అందులో సిగరెట్ అందించే ఫ్రెండ్ మిస్త్రీ వున్నాడనీ, అది చూసి తండ్రి సునీల్ దత్ సంజుని మందలించడంతో ఇద్దరి మధ్యా పాయింటు ఎస్టాబ్లిష్ అయిందనీ.
ఒక్క సీనులో చాలా కథ చెప్పేశారు. సీను అల్లిక అంటే ఇదీ. పైగా ఫ్లాష్ బ్యాక్ లో ఈ
మొదటి సీనులోనే ఈ ఎపిసోడ్ కథకి ముడి కూడా వేసేశారు. ఏమిటది? తండ్రి సిగరెట్లు తాగ
వద్దంటున్నాడు. సంజు ఇప్పుడేం చేస్తాడు? ఇది ఆసక్తి రేపే ప్రశ్న. కథపట్ల కుతూహలం
రేకెత్తించే పాయింటు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కథని ముడేయడం అంటే ఏమిటో తెలియడం
లేదు! చైతన్యవంతంగా కథనం ఎలా నడపాలో
తెలీదు.
దీన్తర్వాత,
డైనమిక్స్ ఎలా వున్నాయంటే, తండ్రి వద్దన్న
పనే సంజు చేస్తున్నాడు. అంటే రెండు పరస్పర విరుద్ధ, సంఘర్షించుకునే పాత్రలు
ఏర్పాటవుతున్నాయన్న మాట. కథనంలో ఇంతలోనే ఎంత
ట్విస్టు! పైగా కథని ఇంకో లెవెల్
పైకి తీసి కెళ్తూ పెగ్గు కూడా కొట్టేశాడు సంజు. అప్పుడే ఇంకో లెవెల్ కి కూడా తీసి
కెళ్తూ, డ్రగ్స్ కి కూడా బోణీ కొట్టేస్తూ కథనంలో
కంగారు పుట్టించాడు. అదంతా పది సీన్లు కాదు! ఒకేవొక్క బార్ సీన్లో కథని ఇంత ముందుకు తీసికెళ్తూ
అల్లేశారు.
వెనుకడ్డ
జాతి ఏమంటుందంటే - ఠాట్, ఒక్క సీన్లోనే సిగరెట్,
మద్యం, డ్రగ్స్ దాకా వెళ్లి పోతాడా? ఆడియెన్స్
నవ్వుతారు. సిగరెట్ తో ఆపుదాం. హీరోయిన్ తో లవ్ చూపుదాం. లవ్ తర్వాత మద్యం వేద్దాం.
హీరోయిన్ తో పాట తర్వాత డ్రగ్స్ వేద్దాం... ఇలా స్టెప్ బై స్టెప్ వేస్తే ఆడియెన్స్
నవ్వరు – అని. ఇలా వెనకబడ్డ జాతి చేసే ఆధునిక సినిమా నిర్ణయాలకి, అనాగరిక ప్రేక్షకుల్ని వెతికి వెతికి థియేటర్లకి
తోలుకు రావాలి.
ఈ
బార్ సీను తర్వాత ఏం చేయాలి? ఈ ఫ్లాష్ బ్యాక్ - 1 లో ప్రారంభమైన ఈ కథనాన్ని
చూస్తూంటే, ఇది త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో
బిగినింగ్ విభాగపు బిజినెస్ అని సులభంగా అర్ధమయ్యే వుంటుంది. కాబట్టి బిగినింగ్
విభాగంలో ఇప్పుడు అర్జెంటుగా జరగాల్సిన పాత్రల పరిచయాలు ఇంకేం మిగిలున్నాయి? తల్లి
వుంది, ప్రేయసి వుంది. ఐతే ఇప్పుడు తల్లితో సీను వేయాలా బార్ సీను తర్వాత? మార్కెట్
యాస్పెక్ట్ కి ముందు యూత్ అప్పీల్ కావాలి. అంటే ప్రేయసితో సీనేయాలి.
ఎంత మదర్ సెంటిమెంటైనా శివాలెత్తిపోకుండా తల్లి
పాత్రని కాసేపు అపుకోవాలి. సినిమా పెన్ను మొదటి ధర్మం ప్రేమకవిత్వం రాయడమే.
బార్
నుంచి నేరుగా అర్ధరాత్రి రూబీ ఇంటికెళ్ళి పోతాడు. ఇక్కడ రూబీ, ఆమె తల్లీ ఎదురుగా వుంటే,
వాళ్ళని చూస్తూ డబుల్ మీనింగుల కామెడీ చేస్తాడు. నిజానికి వాళ్ళ వెనకాలున్న మందు
బాటిల్స్ నుద్దేశించి ఈ కామెడీ. చాలా పాతకాలపు బూతు, ముతక కామెడీ ఇది. ఇదంతా
ఒకే రోజు జరుగుతున్న కథగా చూపించారు. ఉదయం
పాట షూటింగుతో మొదలెట్టి, రాత్రి బార్ సీను, అర్ధరాత్రి రూబీతో సీను వరకూ. గొడవ
వదిలిపోయింది. లేకపోతే కొన్ని రోజుల
వారీగా జరుగుతున్నట్టు ఈ సీన్లు చూపిస్తే, ఇవి బిగినింగ్ విభాగానికి చెందాల్సిన సీన్లు అన్పించుకోవు. తీరుబడిగా విడివిడి రోజుల
కథని చూపించుకునే బిజినెస్ అంతా మిడిల్ విభాగానిది. మిడిల్ బిజినెస్ కోసం కథలో
ఏర్పాటయ్యే సమస్యని అందించే బిగినింగ్ బిజినెస్ లో, సంక్షిప్తంగానే వుంటుంది
స్థలకాలాల ఐక్యతతో కూడిన కథనం.
ఇదే
పద్ధతి ఈ బిగినింగ్ బిజినెస్ తర్వాతి
సీన్లలో కూడా వుంటుంది. తెల్లారి ఫ్రెష్ గా తల్లికి క్యాన్సర్ అని చెప్పి,
ఆమెని యూఎస్ కి తీసికెళ్ళాలనడం కూడా అదే సీనులో చెప్పేసి, యూఎస్ కి మార్చేశారు కథని. యూఎస్ లో ఇంకా ఉధృతం
చేశారు సంజు డ్రగ్స్ అలవాటుని. ఇక్కడే రెండో మిత్రుడు కమలేష్ ని పరిచయం చేశారు. తల్లికి
నయమై తీసుకురావడం, ఇక్కడ ప్రేయసి రూబీతో చెడడం వగైరా జరుగుతాయి. కమలేష్
వచ్చి, రూబీకి చూసిన వేరే సంబంధం అతణ్ణి
బకరా చేసే సీనుకూడా చాలా పాత మూసే. రూబీతో చెడే సరికి, ఈ బిగినింగ్ బిజినెస్ పతాక స్థాయికి
చేరుకుంటుంది.
ఇక
క్షీణించిన సంజు స్థితికి చలించి తండ్రి
సునీల్ దత్ కి చెప్పేస్తాడు కమలేష్. డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోమంటాడు. సంజు
డ్రగ్స్ బానిసని ఇప్పుడే తెలుస్తుంది సునీల్ దత్ కి. దీంతో బిగినింగ్ విభాగం
పూర్తవుతుంది.
***
ఈ
బిగినింగ్ విభాగంలో డ్రగ్స్ అని తెలుపుతూ కథా
నేపథ్యపు ఏర్పాటు, తగిన పాత్రల పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా ఏ విధంగా
జరిగాయో పైన గమనించాం. సంజు గురించి కమలేష్ సునీల్ దత్ కి చెప్పేయడంతో సమస్య ఏర్పాటయింది.
అంటే ప్లాట్ పాయింట్ వన్ అన్నమాట. ఎవరి మీద? సునీల్ దత్ మీద! బంతి సునీల్ దత్ కోర్టులో
పడింది. సంజు కోర్టులో కాదు. ఆత్మ కథకి కథానాయకుడితనే కాబట్టి, సమస్య ఇతనే
ఎదుర్కొంటాడనీ, ప్లాట్ పాయింట్ వన్ ఇతడి మీదే వుంటుందనీ ఎదురు చూడడం సహజం.
కానీ
ఇది విజేత ఆత్మ కథ కాదని ఇదివరకే చెప్పుకున్నాం. పరాజితుడి ఆత్మకథ. అంటే పాసివ్
పాత్ర. అంటే ట్రాజడీ. వీడికి స్వయంగా సమస్యల్ని అధిగమించాలని ఎందుకుంటుంది?
కథానాయకుడుగా వీడు కథనెందుకు నడుపుతాడు?
కథే, లేదా ఇంకో పాత్రే వీడిని నడుపుతుంది. మీ ఖర్మంటూ కథ మీదా, ఇతర పాత్రల
మీదా పడి బతికేస్తూంటాడు.
కాబట్టి,
లక్కీగా సంజయ్ దత్ జీవితంలో సునీల్ దత్ అనే తండ్రి వుండి, ఆయన బాధ్యత తీసుకోవడంతో సంజయ్
దత్ డ్రగ్స్ కి సంబంధించి బాగుపడ్డాడు. ఇది జీవితం. సినిమాల కొచ్చేసరికి ఒక్కోసారి
జీవితమెలా వుంటుందో అంతుబట్టక, వూహించి సృష్టించుకునే పాత్రలతో కొత్తదనం లేక, మూస
ఫార్ములా చిత్రణలు విసుగెత్తిస్తాయి... కొడుకు వ్యసన పరుడు. తండ్రి అందుకు
వ్యతిరేకి. ఇద్దరిమధ్య కొట్లాటలు. చివరి కెప్పుడో కొడుకు తానే తప్పు తెలుసుకుని,
తండ్రి కాళ్ళ మీదపడి, ప్రయోజకుడన్పించుకోవడం. తండ్రి దీవించడం. ఇక్కడ తండ్రి
పీకేదేం వుండదు. కొంపలంటుకుపోయాయని ఇల్లెక్కి ఒకటే కూయడం తప్ప. ఇలా పుడుతూంటాయి వూహించుకునే
కథలు.
జీవితంలో
ఇలా వుండకపోవచ్చు. సంజు – సునీల్ దత్ ల తండ్రీ కొడుకుల సంబంధమే తార్కాణం.
చెడిపోయిన కొడుకు బాధ్యత తండ్రి తీసుకున్నాడు. ఇది వూహించని కథయ్యింది. అంతే
అనూహ్యంగా ప్లాట్ పాయింట్ వన్ లో- అన్ని అంచనాలనీ తలకిందులు చేసేస్తూ - ఆ తండ్రే
కథానాయకుడయ్యాడు. ఆయనకే సమస్యా, దాన్ని సాధించాలన్న లక్ష్యమూ ఏర్పడ్డాయి. జీవితం కల్పనని ఇలా
వెక్కిరిస్తుంది. పోవోయ్, ప్లాట్ పాయింట్ వన్ అంటే ఎప్పుడూ హీరోకేనా? ఇలాగే
రాసుకుంటూ ఇంకెన్ని సార్లు తీసి విసిగిస్తావు? నీ బోడి కల్పనా నువ్వూ - అని
నవ్వేస్తుంది.
అంటే
బాగా దురలవాటు చేసుకున్నవరల్డ్మూవీసు, ఆచారంగా అతిగా అలవాటు చేసుకున్న కొరియన్, హాలీవుడ్ మూవీసు చూస్తూనే, చిరంజీవి- బాలకృష్ణ - నాగార్జున –వెంకటేష్ ల పాత మూవీసు బాగా రీ పాలిషింగు చేస్తూ సినిమాలు
తీస్తూనే, కాస్త అప్పుడప్పుడు జీవిత చరిత్రలు కూడా చదువుకుంటే, స్క్రీన్ ప్లేల్లో
అనూహ్య కోణాలు ఇలా బయటపడే అవకాశాలుంటాయన్న మాట!
మొత్తంగా
‘సంజు’ ఒక గాథే అయితే, ఈ గాథలో ఏర్పడ్డ రెండు జీవిత ఘట్టాలు (డ్రగ్స్, గన్స్) కథలు
కావడం ఇంకో ప్రయోగం. ఈ ప్రయోగం కావాలని చేయలేదు. జీవితమే తెచ్చి పడేసింది. కొత్తగా
కమర్షియల్ సినిమాకి కుదిరిన జీవితం.
ఎక్కడ
చూసినా గాథలో కథలుండవు. గాథే వుంటుంది. కానీ ఇక్కడ గాథ అనేది ప్రధాన కథ వరకే. ఇందులో
ఇమిడి వున్న రెండు ఫ్లాష్ బ్యాకులూ కథలే. ఇందుకే ఇవి స్ట్రక్చర్ లో వున్నాయి. ఈ రెండు
ఫ్లాష్ బ్యాకులూ గాథలుగానే తీయడానికి జీవితం ఒప్పుకోకపోవచ్చు. జీవితంలో సునీల్ దత్ అనే లక్ష్యంతో కూడిన పాత్ర వుంది
కాబట్టి - ఇవి కథలు కావడం అనివార్యం. అంటే బయోపిక్స్ కే ఇలా కుదురుతుందా అని కాదు.
ఫిక్షన్ కి కూడా కుదరవచ్చని ఈ బయోపిక్ డిజైన్ చెప్తోంది. వూరికే గాథలు తీసి చేతులు
కాల్చుకునే కన్నా, గాథలో కథల్ని సృష్టించే చాతుర్యముంటే కమర్షియల్ సినిమాలకి కొత్త
ముఖం ఏర్పడుతుంది. అయితే ముందుగా కథకీ, గాథకీ
తేడా తెలియాలి.
సాంప్రదాయంగా,
రొటీన్ గా, హీరో మీదే ప్లాట్ పాయింట్ వన్ వుంటుందిలే
అన్పింపజేస్తూ తీసికెళ్ళి తీసికెళ్ళి, సీన్ రివర్సల్ చేస్తూ, ఇంకో పాత్ర మీద ప్లాట్
పాయింట్ వన్ పెట్టేసి, కథని అప్పగించేస్తే
ఆ కిక్కే వేరు. ఇదీ రూల్స్ బ్రేక్ చేయడమంటే. అంతేగానీ అసలు రూల్సే తెలీకపోతే రూల్స్
బ్రేక్ చేసేదేమీ వుండదు, కచరా చేయడం తప్ప.
―సికిందర్