రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, జులై 2018, బుధవారం

660 - స్క్రీన్ ప్లే సంగతులు -1


     సినిమాలు కమర్షియల్ విజయాలు సాధించాలంటే వాటి కథలు స్ట్రక్చర్ లో వుండాల్సిందే. ఒక్కోసారి అదేపనిగా స్ట్రక్చర్ - స్ట్రక్చర్ - స్ట్రక్చర్ అనే ఒకే చట్రం విసుగు పుట్టిస్తుంది. స్ట్రక్చర్ లోంచి బయటికొచ్చి స్వేచ్ఛగా, ఏ బంధనాలూ లేని కథా రచన చేసుకోవాలన్పిస్తుంది. కానీ ప్రేక్షకులు అన్ కాన్షస్ గా తెలివైన వాళ్ళు - బాక్సాఫీసు దగ్గర మొహమాటం లేకుండా ఢమాల్ మన్పిస్తారే ...ఎలా? ప్రేక్షకులు పోనీలే పాపమనుకుంటే ఎక్కడ పడితే అక్కడ దేశవ్యాప్తంగా థియేటర్లు వరల్డ్ మూవీస్ తో కూడా కిటకిటలాడేవి. టాలీవుడ్ లో వరల్డ్ మూవీస్ వ్యసనపరులు విరగదీసి వరల్డ్మూవీసు లాంటి మీసం లేని తెలుగు కళా ఖండాలు  తీసేసి ఎలాపడితే అలా  హిట్లు కొట్టేవాళ్ళు. రాయికేసి కొట్టినా గట్టి బ్యాంగ్ తో హిట్టయ్యేవి. కాబట్టి అంత సీనులేదు స్ట్రక్చర్ లేకపోతే. ఎక్కడెక్కడి మారుమూల ప్రాంతీయ సినిమాల ప్రేక్షకులూ, ఇప్పుడు నీ ఆర్టు సినిమాలు కాదు తండ్రీ, కాస్త పచ్చి కమర్షియల్ మూవీసు తీసి చూపిస్తావా చస్తావా అంటూంటే –ప్రాంతీయ సినిమాలు బాలీవుడ్ తోలుకప్పుకుని ప్రేక్షకుల చేతిలో  తోలుబొమ్మ లాటలైపోతూంటే – స్ట్రక్చర్ అనే తద్దినం తప్పదు గాక తప్పదు.

         
ఇందుకే ఒకరి నిజ జీవిత కథతో బయోపిక్ అయినా సరే, సినిమాగా ఆడాలంటే ఖచ్చితంగా స్ట్రక్చర్ లో పెట్టి తీరాలని ప్రతీ హాలీవుడ్ స్క్రీన్ ప్లే నిపుణుడూ హెచ్చరిస్తున్నాడు. ఇక్కడొక తేడా వుంది బయోపిక్స్ తో – విజయగాథలు, పరాజయ గాథలు అని. నిజానికి సాంకేతికంగా విజయానికి సంబంధించిన కథల్ని గాథలు అనకూడదు.  కథ అంటేనే స్ట్రక్చర్ లో వుండేది. విజయానికి సంబంధించిన కథలు స్ట్రక్చర్ లోనే వుంటాయి. స్ట్రక్చర్ లో  వుండనివి గాథలు. ఇవి పరాజయాలకి వర్తిస్తాయి. కాబట్టి అవి పరాజయ గాథలవుతాయి. విజయాలకి సంబంధించిన వాటిని సౌలభ్యంకోసం విజయగాథలనేస్తున్నాం గానీ, సాంకేతికంగా అవి కథలు. 

     కథల్లో యాక్టివ్ పాత్ర వుంటుంది. అదే దాని గోల్ కొద్దీ  ఆటోమేటిగ్గా స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసేస్తుంది. ఇలా యాక్టివ్ పాత్ర తప్ప ఇంకేదీ – పాసివ్ పాత్ర సహా - స్ట్రక్చర్ ని ఏర్పాటు చేయదు గాక చేయదు.  స్ట్రక్చర్ ని ఏర్పాటు చేయకపోతే అది కథవదు, గాథవుతుంది. పైసా, మొగుడు, బ్రహ్మోత్సవం వంటివి స్ట్రక్చర్ లో లేని గాథలే. కాబట్టి అవి అంత భీకర ఫ్లాపులయ్యాయి. ప్రాథమికంగా కథకీ గాథకీ తేడా తెలుసుకోక కోట్లకి కోట్లు పెట్టి సినిమాలు తీసేస్తే – సూపర్ స్టార్లున్నా ఇంతే సంగతులు.  

          విజయంతో కూడిన బయోపిక్ కి స్ట్రక్చర్ వుండాల్సిందే. విజయం లేని ట్రాజిక్  బయోపిక్ కి స్ట్రక్చర్ లేకున్నా ఫర్వాలేదు. ఐతే అసలు బయోపిక్ అని దేన్ని అంటారు? ఇటీవల ఒకతను డైలాగ్ వెర్షన్ కూడా రాసుకుని కథ విన్పించాడు. అది కథలా లేదు. పాత్ర ఏదో సమస్యతో కష్టాలు పడుతూనే వుంది. పడీ పడీ చచ్చిపోయింది. ఇదేంటంటే, బయోపిక్ అన్నాడు. ఎవరి బయోపిక్ అంటే, తను సృష్టించిన పాత్ర బయోపిక్ అన్నాడు. బయోపిక్ అంటే నిజవ్యక్తి కథ అని కూడా తెలీని తనంతో డైలాగ్ వెర్షన్ కూడా రాసేసుకుని బయోపిక్ అని ఫిక్సయిపోయాడు. 

          నువ్వు సృష్టించిన కల్పిత పాత్రతో కథని  బయోపిక్ అనరు, దేవుడు చేసిన మనిషితో వుండే నిజ జీవిత కథని బయోపిక్ అంటారంటే, అర్ధం జేసుకునే స్థితిలో లేడు. కాబట్టి దీన్ని యాక్టివ్ పాత్రగా చేసి, లక్ష్యం ఏర్పాటు చేసి, స్ట్రక్చర్ లో పెట్టి, కథగా మార్చమంటే- ‘మీరు స్ట్రక్చర్ లోంచి బయటికి రండి’ అన్నాడు. స్ట్రక్చర్లోంచి బయటికొస్తే, ఎలా రాయాలో నేర్పుతావా అంటే సమాధానం లేదు. 

          అతను రాసుకున్నది సినిమాకి పనికిరాని గాథ. ట్రాజడీ కూడా పైగా. పాత్రకి సమస్యని పరిష్కరించుకోవాలన్న గోల్ లేదు. చావే పరిష్కారంగా పరాజయ గాథలా వుంది. ‘అల్లూరి సీతారామరాజు’ బయోపిక్ చివరికి ట్రాజడీయే అయినా, ఆయన లక్ష్యం కోసం చేసిన పోరాటంలో మరణించాడు. కాబట్టి పాసివ్ పాత్ర కాలేదు. వీరమరణంతో యాక్టివ్ పాత్రయాడు. 

          వివిధ బయోపిక్స్ ని చూసి, తామూ అలాంటిది తీయాలని ఉబలాటపడి,  తోచిన కల్పిత పాత్రొకటి సృష్టించుకుని,  బయోపిక్ గా  చెప్పుకుంటే నవ్వుతారు ప్రేక్షకులు. ట్రాజడీ గాథగా బయోపిక్  తీయాలన్నా అలాంటి నిజవ్యక్తి కథ ఎక్కడో వుండాల్సిందే. అప్పుడు ప్రేక్షకులు విజయమా, పరాజయమా పట్టించుకోరు. యాక్టివా, పాసివా చూడరు. ఆల్రెడీ ఆ వ్యక్తి  జీవితం తెలిసే  వుంటుంది కాబట్టి, బయోపిక్ ని ఆ దృష్టితోనే చూస్తారు.

          ఇలా వచ్చిందే సంజయ్ దత్ ట్రాజిక్ బయోపిక్. విజయంతో కూడిన బయోపిక్స్ ని  చూస్తే, మనం కూడా అలా చేయాలని అవి స్ఫూర్తి నిస్తాయి. అపజయంతో కూడిన బయోపిక్స్ ని చూస్తే, మనమూ అలా చేయకూడదని హెచ్చరిక చేస్తాయి. 

          ఈ రెండోది చేసేదే  ‘సంజు’ ట్రాజిక్ బయోపిక్. సంజయ్ దత్ అనే బాలీవుడ్ స్టార్ గురించి తెలిసిన అసమర్ధ జీవిత కథే కాబట్టి, దీని జానర్ లక్షణం కొద్దీ (ట్రాజడీ), స్ట్రక్చర్ లో లేకపోయినా కమర్షియల్ విలువకి లోటు రాలేదు. ‘డర్టీ పిక్చర్’ కూడా తెలిసిన సిల్క్ స్మిత విషాద గాథే కాబట్టి  కమర్షియల్ గా ప్రశ్నార్ధకం కాలేదు. ఎటొచ్చీ కల్పిత  పాత్రతో ట్రాజడీలు తీస్తేనే వస్తుంది సమస్య.

***
     బయోపిక్ ఎలాటిదైనా అందులో సమస్య వర్తమానంతో కనెక్ట్  అయితే మంచిదన్నారు పండితులు. ‘సంజు’ లో ఇప్పటి రోజులతో  కనెక్ట్ అవుతున్న డ్రగ్స్ సమస్య, అక్రమాయుధాల సమస్యా వున్నాయి.  కాబట్టి మార్కెట్ యాస్పెక్ట్ కుదిరింది. ఈ మార్కెట్ యాస్పెక్ట్ వల్ల ఇంకా యూనివర్సల్ అప్పీల్ కూడా కుదిరింది. పైగా యంగ్ సంజయ్ జీవితంతో  యూత్ అప్పీల్ కూడా కుదిరింది. 

          క్రియేటివ్ యాస్పెక్ట్ కొచ్చి దీనికి స్ట్రక్చర్ లేదు, కుదరదు, అవసరం లేదు. ఎందుకంటే ఫస్టాఫ్ ఒక జీవిత ఘట్టం (డ్రగ్స్) తో, సెకండాఫ్ ఇంకో జీవిత ఘట్టం (గన్స్) తో వుంది. స్ట్రక్చర్ లో వున్న స్క్రీన్ ప్లే ఒకే ఘట్టంతో,  దాని చుట్టూ సంఘర్షణతో, ఒకే పూర్తి నిడివి కథగా వుంటుంది. ఫస్టాఫ్ ఒక కథ, సెకండాఫ్ ఇంకో కథగా వుండదు. వుంటే సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండంలో పడి గల్లంతై పోతుంది సినిమా జాతకం. ఇలాటివి చాలా చూశాం. 

          ‘సంజు’ బయోపిక్ దీనికి అతీతం. కారణాలు పైన చెప్పుకున్నవే. ఈ రెండు జీవిత ఘట్టాలకీ కవరింగ్ లెటర్ లాగా ఇంకో ఘట్టముంది : ఫైనల్ గా సంజయ్ జైలు శిక్ష అనుభవించే ఘట్టం. అంటే 80 లలో డ్రగ్స్ ఘట్టం, 90 లలో గన్స్ ఘట్టం, 2000 లలో జైలు శిక్ష ఘట్టమూ అన్న మాట. ఇలా త్రికాలాల కథగా అలంకరణ చేశారు. రెండు భూత కాలాలు, ఒక వర్తమాన కాలం. 

          ఇలా వొక ఫ్రేమింగ్ చేసుకున్న తర్వాత, కథని దేంతో  మొదలెట్టాలి? వర్తమాన కాలంతోనే మొదలెట్టాలని ఇంగిత జ్ఞానం చెప్తుంది. వర్తమానం లోంచి మొదటి ఘట్టంలోకీ,  ఆ తర్వాత  మళ్ళీ వర్తమానం లోంచి రెండో ఘట్టంలోకీ ప్రయాణించాలి. వర్తమానం రియల్ టైం అనుకుంటే,  దీని ప్రేరణతో వచ్చే రెండు ఘట్టాలూ డ్రీం టైమ్ (ఫ్లాష్ బ్యాక్స్) అవుతాయి. అంటే ఈ కథని ఫ్లాష్ బ్యాకులతో చెప్పాలన్న మాట. ఫస్టాఫ్ డ్రగ్స్ ఫ్లాష్ బ్యాక్, సెకండాఫ్ గన్స్ ఫ్లాష్ బ్యాక్ విడివిడిగా.

          వీటికి ప్రధాన పాత్ర ఎవరు? సంజునే. ప్రధానపాత్రగా అతనేం చేస్తున్నాడు? ఏమీ చేయడం లేదు, సమస్యలు సృష్టించుకుని లబోదిబో మంటున్నాడు. ఫస్టాఫ్ డ్రగ్స్ సమస్యతో, సెకండాఫ్ గన్స్ సమస్యతో. నిజ జీవితంలోనే అతను పాసివ్ పాత్ర. కాబట్టి బయోపిక్ అనే ఈ సినిమాలోనూ సమస్యలతో పోరాటం చేయలేడు. అంటే అప్పుడు ఈ ఫస్టాఫ్,  సెకండాఫ్ లని డాక్యుమెంటరీ పద్ధతిలో చెప్పాలా? డ్రగ్స్ తో ఒక కథ ముగిసి, గన్స్ తో ఇంకో కథగా వుండే ఎపిసోడిక్ స్టార్ అండ్ స్టాప్  అనే డాక్యుమెంటరీ కథనం సరిపోతుందా? ఎందుకూ, ఈ రెండిటినీ కలిపి వుంచే  రియల్ టైం  కథ వుందిగా? అందులో ఒక గోల్ వుందిగా – ఈ రెండు ఘట్టాలనీ కలిపి తన జీవితంగా పుస్తకం అచ్చేసుకోవాలని? దాంతో టెర్రరిస్టు అనే ముద్ర చెరిపేసుకోవాలనీ? అది గోల్ అవదు. కేవలం ఈ రెండు ఘట్టాలూ వెల్లడించుకోవడానికి ప్రేరేపించే వొక కారణం మాత్రమే అది. 

     మరి ఈ రెండు ఘట్టాలనీ కలిపి వుంచే ఇంకో హుక్ లేదా, ఎలిమెంట్ ఏది? సంజు జీవితంలో ఇంకెవరెవరున్నారు? ఈ రెండు ఘట్టాలనీ నడిపించే వ్యక్తులు కాక ఇంకెవరి ప్రసక్తీ  ఇక్కడ అవసరం లేదు. మొదటి ఘట్టం నడవడానికి మొదటి ఫ్రెండ్, రెండో ఘట్టం నడవడానికి రెండో ఫ్రెండ్ వున్నారు. అయినా వేర్పాటు అలాగే వుంది. అయితే సంజుకి  తండ్రి సునీల్ దత్ వున్నాడు.  ఆయనేం చేశాడు నిజ జీవితంలో? రెండు ఘట్టాల్లోనూ  సంజుని కాపాడుకోవడానికి నానా కష్టాలూ పడ్డాడు. అయితే సంజు బయోపిక్ కి ఈయనే రియల్ హీరో. సాంకేతికంగా గాడ్  ఫాదర్  క్యారెక్టర్.  గోల్ ఈయనకే వుంది. ఈయన గోల్ తో బలమైన ఎమోషనల్ త్రెడ్ ఏర్పడింది. ఈ ఏకీకృత ఎమోషనల్ ట్రేడ్ తో ప్రథమార్ధ, ద్వితీయార్ధ ఘట్టాలు రెంటికీ  ఈయన బలమైన అనుసంధాన కర్తగా ఏర్పడ్డాడు.  

          మరి ఈ మొత్తం ఈ బయోపిక్ ని ఏ ప్రధాన రసం ఆధారంగా చెప్పాలి?  ఫాదర్ సెంటి మెంట్ ఆధారంగానే. యూనివర్సల్ అప్పీల్. తండ్రీ కొడుకుల లవ్ అండ్ హెట్ రిలేషన్ షిప్. యూనివర్సల్ అప్పీల్. మరి ఉపరసాలూ? వున్నారుగా ఇద్దరు ఫ్రెండ్స్- ఒకడితో ఫస్టాఫ్ లో  బ్యాడ్ ఫ్రెండ్ షిప్, ఇంకొకడితో సెకండాఫ్ లో గుడ్ ఫ్రెండ్ షిప్. యూనివర్సల్ అప్పీల్.

          ఇప్పుడు ఈ అవుట్ లైన్ ని బద్ధకించకుండా పేజీలకి పేజీలు  సినాప్సిస్ రాసేయ్! రాసేసి? అప్పుడు ఆర్డర్ వేద్దాం. ఎప్పుడు? రేపే! ఇంతలో అంత రాయాలా? రాయకపోతే మట్టిలో కలిసిపో! స్క్రీన్ ప్లేకి షార్ట్ కట్స్ లేవు !

సికిందర్