రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, January 29, 2018

594 : 'భాగమతి' రివ్యూ - 3


            1. కథని ఎండ్ సస్పెన్స్ అని తెలియకుండా కవర్ చేసే విధానం : ‘ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ (1958)
          2. కథని ఎండ్ సస్పెన్స్ అని తెలుపుతూనే దృష్టి మళ్ళించే విధానం : ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ – (2017)
          3. ఎండ్ సస్పెన్స్ కథ ఎలా వుంటుంది? A  అనే ఒక సంఘటన జరిగిందనుకుందాం.అదెలా జరిగిందో, ఎవరు చేశారో దర్యాప్తు అధికారికి తెలీదు. అతను B, C, D, E, F...ఇలా కొందర్ని అనుమానితులుగా భావించి దర్యాప్తు చేస్తూంటాడు. దర్యాప్తులో ఒకొక్కర్నీ నిందితులు కాదని నిర్ధారించుకుంటూ వస్తూ,  చిట్టచివరికి ఆధారాలతో సహా వాళ్ళల్లో ఒకర్ని పట్టుకుంటాడు. అప్పుడా ఆధారాలన్నీ ఆ నిందితుడికి ఆపాదించేందుకు విశ్లేషణలన్నీ చేసుకొస్తూ - ఆ నిందితుడు A అనే సంఘటనకి ఎందుకోసం, ఎలా పాల్పడిందీ  మొదట్నించీ మూసిన కథంతా చెప్పుకొస్తాడు. నిందితుడు తలవంచుకుంటాడు.

          ఇది ఏ మీడియాకి పనికొస్తుంది? నవలగా ప్రింట్ మీడియాకి పనికొస్తుంది.

          సినిమాకి ఎందుకు పనికి రాదు? సినిమాగా తీస్తే వచ్చే ఇబ్బందేమిటంటే, విజువల్ అప్పీల్ వుండదు. విజువల్ అప్పీల్ కి ఓపెన్ స్టోరీ యాక్షన్ తో వుండాలి. పై మూసిన కథలాగా కాదు. పై ఉదాహరణ ప్రకారం A అనే సంఘటన చూపించి,  B, C, D, E, F...లలో ఎవరు ఆ సంఘటనకి పాల్పడ్డారో చూపించకపోతే, దర్యాప్తు అధికారి ఒకరొకర్నీ ప్రశ్నిస్తూనే ఫస్టాఫ్ తోబాటు – సెకండాఫ్ లో చాలా వరకూ గడపాల్సి వస్తుంది. అంతవరకూ విషయ మేంటో అర్ధంగాక ప్రేక్షకుడి సహనం నశిస్తుంది. కథ ఎంతసేపూ ఆ దర్యాప్తు అధికారికీ, ఆ నిందితులకీ – వాళ్ళ వాళ్ళ మధ్య వుండిపోతుంది. వాళ్ళు వాళ్ళు మంతనాలాడుకుంటూ వుంటే ప్రేక్షకుడి కేం అర్ధంగాదు. థ్రిల్ ఫీల్ కాడు.  అంటే కథ వాళ్ళ మధ్య పాసివ్ గా వుండి పోతోందన్నమాట. కాబట్టి  సినిమా కొచ్చేసి  కథని  దాయకూడదు, కథనాన్ని మాత్రమే దాయాలి. కథ వచ్చేసి ఓపెన్ గా,  యాక్టివ్ గా ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ గా కన్పించి థ్రిల్ చేయాలి. 


       రెండో ఇబ్బంది – చివరికి నిందితుణ్ణి  పట్టుకుని దర్యాప్తు అధికారి ఆ సంఘటన తాలూకు కార్యకారణ సంబంధ విశ్లేషణంతా నిందితుడి కాపాదిస్తూ చెప్పుకొస్తూంటే, బోరు కొడుతుంది. ఎందుకంటే,  అతను చెప్పేవాటిని  ప్రేక్షకుడు మెదడుకి చాలా  పనికల్పించి అర్ధంజేసుకుంటూ, మొదట్నించీ ఏదేది ఎలా ఎందుకు జరిగాయో నిందితుణ్ణి దృష్టిలో పెట్టుకుని తులనాత్మక విశ్లేషణ చేసుకుంటూ కన్విన్స్ అయ్యే కష్టాన్ని, భారాన్నీ  మోయాల్సి వస్తుంది. అ సమయంలో దర్యాప్తు అధికారి ఎన్ని నిజువల్స్ (మాంటేజెస్) వేస్తూ ఎంత హడావిడీ చేసినా,  అవన్నీ అప్రస్తుతమైపోతాయి ప్రేక్షకుడికి. ఇలా  సస్పెన్స్ అంతా చివర్లో ఓపెన్ అయింది కాబట్టి దీన్ని ఎండ్ సస్పెన్స్ కథ అంటున్నారు. ఇలాటి కథలు థ్రిల్లర్ జానర్ లో మిస్టరీ సబ్ జానర్ కింది కొస్తాయి. 

          4. మరి ఇలాటి కథని సినిమాకి ఎలా మార్చుకోవాలి?
 పైనే చెప్పుకున్నట్టు A  అనే ఒక సంఘటన జరిగిందనుకుందాం. అదెలా జరిగిందో, ఎవరుచేశారో, ఎందుకు చేశారో  ప్రేక్షకుడికి మొత్తం చూపించేస్తారు. B  అనే వాడే  ప్రేక్షకుడికి స్పష్టంగా నిందితుడుగా కన్పిస్తూంటాడు. ఇంకా వేరే అనుమానితులుండరు. C అనే దర్యాప్తు అధికారికి B  తెలియవచ్చు, తెలియకపోవచ్చు, తెలిస్తే డైరెక్టుగా పట్టుకునే ప్రయత్నంతో  కథ నడుపుతాడు, తెలియకపోతే కొంత సమయం తర్వాత తెలుసుకుని, అప్పుడు పట్టుకునే ప్రయత్నంగా కథ నడుపుతాడు. పట్టుకున్నాక శిక్షిస్తాడు.

          ఇది ఏ మీడియాకి పనికొస్తుంది? ప్రింట్, విజువల్ రెండిటికీ పనికొస్తుంది. అయితే ప్రింట్ మీడియా నవలకి అంత బావుండక పోవచ్చు. నవల సినిమాలగా, సినిమా నవల లాగా వుండకూడదు. సినిమా అట్టడుగు స్థాయి సాహిత్య ప్రక్రియ. జనసామాన్యం కోసం దాన్నలాగే తీయాలి.

         సినిమాగా ఇలా తీస్తే కలిగే లాభాలు  – ఈ ఓపెన్ యాక్షన్ స్టోరీ వల్ల విజువల్ అప్పీల్ వుంటుంది. A అనే సంఘటన దగ్గరే అది ఎవరు చేశారో, ఎలా చేశారో, ఎందుకు చేశారో ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. ఇక కథలో సమాచారానికి సంబంధించిన ఏ బ్యాగేజీనీ మోయ నవసరం లేకుండా, పాయింటు మీద దృష్టి పెతాడు. కథ పాత్రలకీ ప్రేక్షకుడికీ ఓపెన్ గా  వుంటుంది. ఓపెన్ గా  వుండనిది కథనమే. అంటే C ఎలా తప్పించుకుంటూ వుంటాడు, B పట్టుకోవడానికి ఎలా ప్రయత్నిస్తూ వుంటాడు- పరస్పరం సీన్ల వారీగా ఎత్తుగడలతో ప్రేక్షకుడు వూహించని కథనాన్ని సృష్టించుకుంటూ పోతూంటారు. అందువల్ల దీన్ని సీన్ టు సీన్ సస్పెన్స్ అంటారు. అందుకని ఇలాటి కథలు థ్రిల్లర్ జానర్ లో సస్పెన్స్ థ్రిల్లర్ సబ్ జానర్ కింది కొస్తాయి.  
***
       5. పైన 3 లో చెప్పుకున్న ఎండ్ సస్పెన్స్ కథలకి ఎండ్ సస్పన్స్ అని  తెలియకుండా కవర్ చేస్తూ నడపడమెలా?  ప్రింట్ మీడియాకి పనికొచ్చేవని చెప్పుకున్న మిస్టరీ సబ్ జానర్ కథల్ని సినిమాకి మల్చి హాలీవుడ్ కొత్త ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో  A  అనే సంఘటన జరుగుతుంది. ఇది ప్రేక్షకుడికి చూపించరు. అసలు A అనే సంఘటన జరిగిందని ఎక్కడా ప్రస్తావించరు. ఫ్రెష్ గా ప్రారంభం B ని C పరిచయం చేసుకోవడంతో చూపిస్తారు. అక్కడ్నించీ అదే B కి D, E, F, G, H ...ఇలా ఎంతమందైనా పరిచయం కావొచ్చు. వీళ్ళతో B కి విచిత్ర అనుభవాలు ఎదురవుతూంటాయి. దీంతో మొదట పరిచయమైన C  డూప్లికేట్ అనీ,  తన మీద కుట్ర చేయడానికి వచ్చాడనీ మిగిలిన వాళ్ళకి చెప్పడంతో, కథ C  మీదికి మళ్ళుతుంది. దురుద్దేశం పెట్టుకుని విలన్ లా వచ్చినట్టు కనబడుతున్న C కుట్ర రట్టు చేసే క్రమంలో,  అసలు B నే విలన్ అన్న గుట్టు B ద్వారానే రట్టయ్యేలా సంఘటనలు జరుగుతాయి. మొత్తం కథ తిరగబడుతుంది.  అప్పుడు C, D, E, F, G, H ...అందరూ ఒకే బృందమని రివీలవుతుంది. వీళ్ళు B ని రౌండప్ చేసి, ఆనాడు  ఫలానా A  అనే సంఘటన జరగడానికి కారణం నువ్వు, ఇదిగో సాక్ష్యాలూ అని ప్రూవ్ చేసి పట్టుకుంటారు. 

          దీనివల్ల కలిగే లాభాలు – A అనే సంఘటనని దాచి పెట్టారు కాబట్టి,  C, D, E, F, G, H ... వగైరాలు B ని పట్టుకోవడానికి వచ్చిన దర్యాప్తు బృందంగా అస్సలు కన్పించరు. B తో వీళ్ళు సృష్టించి నడిపే డ్రామాని ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తూంటాడు. రొటీన్ A అనే సంఘటనకి B ని పట్టుకోవడానికి వచ్చిన గ్రూపు అని తెలియకపోవడంతో ప్రేక్షకుడు ఫ్రెష్ గా ఫీలవుతాడు. కథ పాసివ్ గా కాక, డ్రామా అని తెలియని డ్రామాతో యాక్టివ్ గా థ్రిల్లింగ్ గా వుంటుంది. దీంతో  ఇలాటి కథలు థ్రిల్లర్ జానర్ లో సినిమాలకి పనికిరాని మిస్టరీ సబ్ జానర్ ఉచ్చులోంచి బయటపడి, సస్పెన్స్ థ్రిల్లర్ సబ్ జానర్ గానే రూపం ధరిస్తాయి.

         1958 లో బ్రిటిష్ సినిమా ఇది సాధించి ఎండ్ సస్పన్స్ ని కవర్ చేసి లాండ్ మార్క్ మూవీగా నిలబడింది- అదే ‘ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’

          దీన్ని అనుసరిస్తూ మొట్టమొదట బెంగాలీలో ఉత్తమ్ కుమార్ - షర్మిలా టాగూర్ లతో  ‘శేష్ అంక’ (1963) వచ్చింది. తర్వాత తమిళంలో శివాజీ గణేశన్ – బి. సరోజా దేవిలతో ‘పుథియ పరవై’  (1964), హిందీలో మిథున్ చక్రవర్తి – రాఖీ లతో ‘ధువా’ (1981), మలయాళంలో మమ్ముట్టి - శోభనలతో ‘చరితం’ (1989) వచ్చాయి.


          మిస్టరీ సబ్ జానర్ కి  మూవీ ఫ్రెండ్లీ క్రియేటివిటీ అయిన ఇలాటి కథలూ  స్ట్రక్చర్ లోనే వుంటాయి. పైన చెప్పుకున్న ఉదాహరణలో ఈ క్రియేటివిటీ వచ్చేసి, ప్లాట్ పాయింట్ వన్ గా C మీద అనుమానం, ప్లాట్ పాయింట్ టూగా C కాదు B అని దొరికిపోవడంగా వుంటుంది.  ఒకసారి పై సినిమాలు చూస్తే విజువల్ అప్రోచ్ బాగా అర్ధమవుతుంది. నిజానికి ఇలాటి కథ వేరే ట్రెండీ బ్యాక్ డ్రాప్ లో ఈ వ్యాసకర్త రాసింది ఇద్దరు దర్శకుల చేతులు మారుతూ గత రెండేళ్లుగా చక్కర్లు కొడుతోంది.
***
     6. పైన 3 లో చెప్పుకున్న  ఎండ్ సస్పెన్స్ కథని ఎండ్ సస్పన్సే అని తెలుపుతూనే దృష్టి మళ్ళించే విధానం – A  అనే సంఘటనని ప్రేక్షకుడికి చూపించేస్తారు.  అదెలా జరిగిందో, ఎవరు చేశారో  ప్రేక్షకుడితో పాటు దర్యాప్తు అధికారికీ  తెలీదు. అతను B, C, D, E, F...ఇలా కొందర్ని అనుమానితులుగా భావించి దర్యాప్తు చేస్తూంటాడు. మధ్యలో ఎక్కడో, ఆ  జరిగిన A  అనే సంఘటనలో మృతి చెందిన వ్యక్తి దర్యాప్తు అధికారికి తెలిసిన వాడుగా రివీల్ అవుతుంది. ఆ మృతి చెందిన వ్యక్తి ఫ్లాష్ బ్యాక్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో చాలా షాకింగ్ విషయాలుంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ ని మధిస్తూంటే  దానితో B, C, D, E, F...లలో అందరూ, లేదా ఒకరితో వున్న కనెక్షన్ బయటపడుతుంది. దీంతో దర్యాప్తు అధికారి ఆ నిందితుణ్ణి లేదా నిందితుల్ని పట్టుకుంటాడు. 

          దీంతో లాభాలు : అనుమానితుల్ని చూపిస్తూ  నిందితుణ్ణి పట్టుకునే బోరుకొట్టే రొటీన్ కి, ఫ్లాట్ గా వుండే కథనానికీ, ఫ్లాష్ బ్యాక్ వల్ల ప్రేక్షకుడి దృష్టి మళ్ళించి, కథకి చలనమూ డెప్త్ తీసుకురావొచ్చు. ఇలా ఇది ఎండ్ సస్పెన్స్ తో మిస్టరీ సబ్ జానర్ లోంచి బయటపడి, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫ్రెండ్లీ సబ్ జానర్ లోకొచ్చేస్తుంది. 

           ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ ఇలాంటిదే. మర్డర్ మిస్టరీల
ఫార్ములాని బ్రేక్ చేసి, మూస చట్రంలోంచి మర్డర్ మిస్టరీ జానర్ ని ఎప్పుడో 1930 లలోనే బయట పడేసిన రచయిత్రి అగథా  క్రిస్టీ. ఆమె రాసిన నవలే  ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ మూవీ.

          ఇవీ మిస్టరీ,  సస్పన్స్ థ్రిల్లర్ సబ్ జానర్ల సంగతులు. ఇలాస్పష్టత తెచ్చుకున్నాక, ఇప్పుడు ‘భాగమతి’ ఎందులో ఇమిడిందో, ఇమడకపోతే ఎందుకు ఇమడలేదో,  రేపు ముగింపు వ్యాసంలో చూద్దాం.


సికిందర్









Sunday, January 28, 2018

593 : 'భాగమతి' రివ్యూ - 2

ఎవరెలా చేశారు
          భాగమతి - చంచల అనే రెండు విభిన్న రూపాల్లో అనూష్కా కన్పిస్తుంది. కానీ ప్రధానంగా కన్పించేది చంచలగానే. భాగమతి ఆమెకి పూనిన ఆత్మగా అదృశ్యంగా వుంటుంది. ఇంటర్వెల్  సీన్లో ఆమె ఆ పాడుబడ్డ బంగళాలో ప్రతీకారాగ్నితో రగిలిపోయే ఉగ్ర భాగమతిగా ఎక్సెలెంట్ గా వుంటుంది. పౌరాణిక నటి ముఖంలో కనపడే భావప్రకటనా సామర్ధ్యమంతా కట్టలు తెంచుకుంటుంది. అదంతా ఏకపాత్రాభినయం. అందులో బలమైన మాస్ డైలాగులున్నాయి. ఆమె చెప్పుకునే కథకి దృశ్యపరమైన ఫ్లాష్ బ్యాక్ లేదు. మోనోలాగ్ గా మాటల్లోనే  చెప్పుకుంటుంది. తన  కాళంగి  రాజ్యాన్ని కబళించి తనని ఈ కోటలో శాశ్వతంగా బంధించిన సేనాని చంద్రసేనుడి మీద నిప్పులు కక్కుతుంది. నిజానికి చరిత్రలో భాగమతి అనే పేరు కుతుబ్ షాహీ ప్రేమకథతో ముడిపడివుంది. ఈ సినిమా భాగమతి నిజాంని  ఎదిరించా నంటుంది. చరిత్రలో కుతుబ్ షాహీ - భాగమతిల ప్రేమకథ  కథకుడికి నచ్చలేదేమో, అందుకని భాగమతిని నిజాం  మీదికి ఎగదోసి తృప్తి పడినట్టుంది. మంచిదే, అవకాశం దొరికినప్పుడల్లా  నచ్చని చరిత్రలతో ఇలాటి మంచి మంచి పన్లు చేస్తూ వుండాల్సిందే. 

          మరి ఇంతా చేసి భాగమతి పాత్రకి చేయాల్సిన న్యాయం చేశారా లేదా? ఆమె దాహార్తి తీర్చారా లేదా? తద్వారా ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చగల్గారా లేదా?  ఇది కదా కమర్షియల్,  అందునా  ఇలాటి ప్రతిష్టాత్మక బిగ్ బడ్జెట్ కమర్షియల్ సినిమాకి కావాల్సింది. పగతో వున్న భాగమతి దాహార్తి జోలికీ పోలేదు, అలాటి పాత్రతో తీర్చాల్సిన ప్రేక్షకుల ఆత్మిక దాహాన్నీ తీర్చలేదు. అరుంధతి, అమ్మోరు, నాగదేవత లాంటి ఫాంటసికల్ పాత్రలు మిథికల్ క్యారక్టర్స్ అవుతాయి. అందుకే అవి ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీరుస్తూ  అంతగా హిట్టవుతాయి. హాలీవుడ్ కి ఆత్మిక దాహాన్ని తీర్చేందుకు బైబిల్ లో కొన్ని పాత్రలు తప్ప లేవు. అందుకని వాళ్ళు కౌబాయ్ ల దగ్గర్నుంచీ  మొదలుపెట్టి  సూపర్ మాన్, బ్యాట్ మాన్, స్పైడర్ మాన్ లాంటి అతీంద్రయశక్తులు గల పాత్రల్ని సృష్టించి ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే మార్గం కనిపెట్టారు. అందుకే ఆ సినిమాలంతగా  హిట్టవుతున్నాయి. 

          అరుంధతి, అమ్మోరు, నాగదేవత లాంటి ఎన్నో సినిమాలూ ఈపనే చేశాయి. కానీ భాగమతిని ఒక మిథికల్ క్యారక్టర్ గా గుర్తించక, కేవలం అరుంధతి బ్రాండ్ నేమ్ ని క్యాష్ చేసుకునే పైపై అమ్మకపు వస్తువుగా ముస్తాబులు చేసి వదిలేశారు. ఆమె చెప్పుకున్నంత వరకే ఆమె కథ. దానికి కొనసాగింపూ ముగింపూ లేవు. పాత్రకి సెటప్ మాత్రమే వుంది, ఆ సెటప్ కి పే ఆఫ్ లేదు. తాటాకు చప్పుళ్ళ కరివేపాకు పాత్ర అయింది. ఆ తర్వాత ఆమె చంచలని పూని చంచల రూపంలో కనపడుతూంటుంది, అంతే. దీంతో బాక్సాఫీసుకి ఎంతో ప్లస్ అయ్యే భాగమతి మిథికల్ క్యారక్టర్ కిల్ అయిపోయింది. ప్రేక్షకుల అత్మికదాహం తీరని దాహంలాగే వుండిపోయింది. 

          ఇక చంచలలో మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఛాయలు కనపడతాయి. ఐఏఎస్ ఆఫీసర్ గా చంచల సంతకాల గొడవ, కేసులో ఇరుక్కోవడం ఇదే. ఇలాటి పాత్రలు  విజయశాంతి చేసి మెప్పించినవే. శ్రీలక్ష్మి ఛాయలున్న చంచల పాత్రకి  భాగమతి గొడవ అడ్డు లేకపోతే,  ఈ కథ శ్రీలక్ష్మికి ఒక పవర్ఫుల్ నీరాజనమయ్యేది. మహిళా ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయ్యేవాళ్ళు. శ్రీలక్ష్మితోనూ పూర్తిగా కాక, భాగమతితోనూ పూర్తిగా కాక, సగం సగం ఏం చేసి సాధించినట్టో కథకుడి ఘనమైన క్రియేటివిటీకే బాగా తెలియాలి. 

          చంచలగా అనూష్కా అసలు విషయం తెలిసే వరకే ఒకరకమైన సస్పన్స్ తో ఆకట్టుకోగల్గుతుంది. ఎప్పుడైతే ఆ సస్పెన్స్ తీరిపోయి, చంచలతో ఇదొక సాదా పొలిటికల్ డ్రామా థ్రిల్లరే తప్ప, ఇక భాగమతి కథ లేదనేసరికి, థ్రిల్లర్ చంచల కాస్తా  ఆసక్తి కల్గించడం మానేస్తుంది. 

          ఇతర తారాగణమంతా  పకడ్బందీగా వున్నారు. మంత్రి పాత్రలో జయరాం అద్భుతమైన బాడీలాంగ్వేజితో వున్నాడు. అతనున్నప్పుడల్లా సీను పదునెక్కుతుంది. కార్యకర్తగా ఉన్నీ ముకుందన్ కూడా బావున్నాడు. సీబీఐలుగా మురళీ శర్మ, ఆశాశరత్ లు  ప్రొఫెషనల్ గా కనిపిస్తారు. కానీ ఆశా శరత్ పాత్రకి తన కొలీగ్ తమ్ముణ్ణి చంపిందంటున్న కేసులో శిక్ష  అనుభవిస్తున్న చంచలకి – ఈ కేసులోనే మంత్రితో  సంబంధముండచ్చని  అనుమానమెందుకు రాదో అర్ధంగాదు. ఆ భూముల విషయంలో తమ్ముడితో పాటూ మంత్రి కూడా ఇన్వాల్వ్ అయి వున్నాడు కదా?  ఈ లైన్లో  ఆశా శరత్ పాత్ర వర్కౌట్ చేసి - విగ్రహాల దొంగాతనాలతో కాదు, అంత కంటే పెద్దనేరం అసలా తమ్ముణ్ణి చంపింది మంత్రేనని తనే గుట్టు రట్టు చేయకుండా – విగ్రహాల గురించి ఎటూ తేలని ఇంటరాగేషన్ చంచలతో చేస్తూ టైం వేస్ట్ చెయడమెందుకో అర్ధం గాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.  ఈ కామన్ సెన్స్ తో చూస్తే, చూపించిన కథే వుండదు! 

          ఇక బంగళాలో  దెయ్యానికి ఎప్పుడుపడితే అప్పుడు భయపడి మనల్ని నవ్వించే ప్రయత్నం చేయడానికి ధనరాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ వున్నారు. నటింప జేసుకునే వషయంలో దర్శకుడు సమర్ధుడని, నటీనటులతో సీన్లు రక్తి కట్టిస్తాడనీ ఫ్లాపయిన గత ‘చిత్రాంగద’ లోనే చూశాం.  సాంకేతికంగానూ అతను టాలెంట్ వున్న దర్శకుడు. మంచి విజువల్ సెన్స్ వుంది. జానర్ ని జానర్ లాగే తీసే  నేర్పు వుంది. 

          భాగమతి బంగళాకి వేసిన సెట్ రవీందర్ రెడ్డి క్లాసిక్  క్రియేషన్ అనొచ్చు. అలాగే నయీం  విజువల్ ఎఫెక్ట్స్ కూడా. తమన్ కూర్చిన నేపధ్య సంగీతం ఈ థ్రిల్లర్ కొక ప్రాణం. ‘చిత్రాంగద’ లో ఏ నేపధ్య సంగీతంతో దర్శకుడు ఘోరమైన శబ్ద కాలుష్యం సృష్టించాడో అలాంటిది ఇక్కడ లేదు. ఇక భయాన్ని క్రియేట్ చేయడంలో కొత్తదనం మాత్రం లేదు. దీన్నర్ధం జేసుకోవచ్చు. ఈ టెంప్లెట్ ట్రిక్కులకి మించి ఏముంటాయి. తన పక్కనున్నది తన వాడేనని తెలుసు, అయినా వాడేదో మీద చెయ్యి వేయగానే కెవ్వున అరవడం హార్రర్ ఎఫెక్టే ఈ భూమ్మీద దెయ్యాలున్నంత కాలం. ఇవన్నీ చూసి చూసి వున్న మూస ఫార్ములా. నిజజీవితంలో ఇలాటివి అనుభవించి క్రియేట్ చేసినప్పుడు కొత్తవి వస్తాయి. పానుగంటి లక్ష్మీ నరసింహా రావు రాసిన ఒక కథలో చాలా గమ్మత్తయిన హార్రర్  అనుభవాలుంటాయి నవ్విస్తూ. యూ ట్యూబ్ లో ‘ప్రాంక్స్’ అనీ బోలెడు వుంటాయి. 

చివరి కేమిటి 
       ‘కథ ఎండ్ సస్పెన్స్ అయినప్పటికీ హిట్ అంటున్నారు. రివ్యూలు చాలావరకూ పాజిటివ్ గానే వున్నాయి. ఇలాటి కథలే చాలా మంది ఫ్రెండ్స్ దగ్గరున్నాయి. వీలయితే కొంచెం వివరంగా చెప్పండి. చాలా సార్లు చెప్పారు, అయినా మరోసారి చెప్పండి. ఎండ్ సస్పెన్స్ వర్కౌట్ అవదని చెప్పారు. మరి ‘భాగమతి’ విషయంలో వర్కౌట్ అయిందా?’ – ఇలా ఒకరి సందేహం.

          హిట్ ఫ్లాపులతో ఈ బ్లాగుకి సంబంధం లేదు. రెండుంపావు, రెండుంమ్ముప్పావు అంటూ తూకాలేసి  అంత కరెక్టుగా రేటింగులు ఇచ్చే జడ్జిమెంట్ కూడా చేతకాదు. వచ్చిన సినిమాని మొత్తంగా విశ్లేషించి ప్రెజెంట్ చేయడమే ఈ బ్లాగు పని. సమంజసమన్పిస్తే అంగీకరించక వచ్చు, అన్పించకపోతే అవతల పడెయ్యొచ్చు. దేన్నీ ఎవరి మీదా రుద్దే రుబ్బురోలుగా లేదు బ్లాగు. పైనే రాశాం, రివ్యూలు రాయడం ఒక రోగమని.

          కథ ఎండ్ సస్పెన్స్ అయినప్పటికీ హిట్ అంటున్నప్పుడు ఇక సందేహమెందుకు,  దాన్నే ఫాలో అవచ్చు. ఎలా తీశారో అలాగే  ఫ్రెండ్స్ కూడా రాసుకోవచ్చు. కానీ భాగమతిది ఎండ్ సస్పెన్స్ అని ఎవరన్నారు? అది ఎండ్ సస్పెన్స్ అవబోతూ మిడిల్ మటాష్ అయింది. మనవాళ్ళ క్రియేటివిటీ రానురాను ఎక్కడికి పోతోందంటే, ప్రపంచంలో ఎక్కడా వుండని  కొత్త కొత్త చిక్కుముళ్ళేసి మీద పడేస్తున్నారు. విప్పి చూసి విస్తుపోవడం మన పనవుతోంది. ఎండ్ సస్పెన్స్ ని మిడిల్ మటాష్ తో, లేదా మిడిల్ మటాష్ గా రాసుకున్న కథని ఎండ్ సస్పన్స్ తో  సింగారించడం ఇంతవరకూ ఎక్కడా చూడలేదు. బహశా ఈ కథకుడికి తనేం చేశాడో తనకే తెలిసి వుండకపోవచ్చును. ఇలాటి సింగారమే  భాగమతికి చేశాడు. హైదరాబాద్ శివారులో బాట సింగారం అనే వూరుంది. ఒకప్పుడు విసిరేసినట్టు దూరంగా ఎక్కడో అన్పించేది.  అదిప్పుడు కలిసిపోయి మెట్రో సింగారమైంది. దీని కర్ధముంది. భాగమతి  సింగారాని కర్ధముందా?

(మిగతా రేపు)


సికిందర్ 

Saturday, January 27, 2018

592 : రివ్యూ!



రచన - ర్శత్వం: జి. అశోక్
తారాగణం: అనూష్కా, ఉన్నీ ముకుందన్, అశా త్, విద్యుల్లేఖా రామన్, యరాం, మురళీ ర్మరాజ్, ప్రభాస్ శీను తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.న్, ఛాయాగ్రణం: మాధి
బ్యానర్
: యు.వి.క్రియేషన్స్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్
విడుదల : జనవరి 26, 2018

***
(సమయాభావంవల్ల పూర్తి స్థాయి రివ్యూ ఇవ్వడం లేదు, రేపుదయం మిగతా భాగం చూడగలరు)
కథ
     
చంచల (అనూష్కా ఒక ఐఏఎస్ ఆఫీసర్. వంశధార అనే ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకి న్యాయం చేయాలని కృషి చేస్తూంటుంది. శక్తి (ఉన్నీముకుందన్) అనే అతను రైతులకి న్యాయం కోసం పోరాడే కార్యకర్త. సీబీఐ అధికారి సంపత్ (మురళీ శర్మ) తమ్ముడు. ఇతను చంచలని మొదట అపార్ధం చేసుకున్నా, తర్వాత సహకరించడం మొదలెడతాడు. ఈ క్రమంలో ఇతడితో ప్రేమలో పడుతుందామె. కొన్ని పరిణామాల్లో ఇతణ్ణి హత్య చేసిన కేసులో జైలు కెళ్తుంది. 

          ఈశ్వర ప్రసాద్ (జయరాం) కేంద్రంలో ఇరిగేషన్  మంత్రి. ఇతను తన మీద కుట్ర చేస్తున్నాడని సీఎంకి అనుమానమొచ్చి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేయడంతో కేంద్రమంత్రి ఈశ్వర ప్రసాద్ మీద సీబీఐ ఎంక్వైరీ వేయిస్తాడు. విగ్రహాల దొంగతనాలతో అతడికి సంబంధ ముందని అనుమానించి ఆధారాలతో నిరూపించడానికి  వేసిన ఎంక్వైరీకి వైష్ణవీ నటరాజన్ ( ఆశా శరత్) సారధ్యం వహిస్తుంది. గతంలో ఈశ్వర ప్రసాద్ కి పియ్యేగా  పనిచేసిన చంచల నుంచి సమాచారం రాబట్టాలని నిర్ణయిస్తుంది. ఇది రహస్యంగా చేస్తున్న దర్యాప్తు కాబట్టి, జైల్లో వున్న చంచలని రహస్య ప్రదేశానికి తరలించి ప్రశ్నించాలనుకుంటుంది. దీంతో ఊరిబయట పోలీసులు వాడుకుంటున్న రహస్య ప్రదేశం భాగమతి బంగళాకి చంచలని తరలిస్తాడు సీబీఐ అధికారి సంపత్. 

          ఈ బంగళాలో రాణీ భాగమతీ దేవి దెయ్యమై తిరుగుతోందని చుట్టుపక్కల భయపడు
తూంటారు. ఇందులోనే  చంచలని బందీ చేసి ప్రశించడం మొదలెడుతుంది వైష్ణవి. చంచలకి బంగాళాలో దెయ్యంతో భయానక అనుభవాలు ఎదురవుతూంటాయి. ఆమె చెప్పేది నమ్మని వైష్ణవి, ఆమె బృందం అలాగే నిర్బంధించి వేధిస్తూంటారు. 

          ఇలా చంచల నుంచి సమాచారం రాబట్టారా? చంచలకి పూనిన భాగమతి ఆత్మతో  
అధికారులకి ఎలాటి అనుభవాలెదురయ్యాయి? అసలు భాగమతి ఎవరు? చంచల ఇదంతా ఎలా ఎదుర్కొంది? ఆమె మీద హత్య కేసు సంగతేమిటి? ఈశ్వర ప్రసాద్ తో ఆమెకున్న సంబంధమేమిటి? ఈశ్వర ప్రసాద్ చేసిన స్కామ్ కథ, చంచల చేసిన హత్యకథ, భాగమతి కథ – ఈ మూడిటికీ వున్న సంబంధమేమిటి?... ఇవి తెలియాలంటే వెండితెర మీద పూర్తి చలనచిత్రం చూడాల్సిందే.

ఎలావుంది కథ 
     పెద్దగా ఆలోచించకుండా చూస్తే కొత్తకొత్తగా అన్పిస్తుంది. ఆలోచిస్తూ చూస్తే కుప్పకూలుతుంది. అయినా ఆలోచించకుండా చూసినా సగటు ప్రేక్షకుడికి ఓ కీలక మలుపు దగ్గర రసభంగ మవుతుంది. ఈ రసభంగమే  జయాపజ యాలకి గీటురాయి అయింది. దీన్ని నివారించగల్గి వుంటే ఫర్వాలేదనే స్థాయి నుంచి ఘనవిజయానికి చేరువయ్యేది. 

          ముందు మార్కెట్ యాస్పెక్ట్ నుంచి మొదలెడదాం. మేకర్లు ఈ కథతో వుందనుకున్న ఒకేఒక్క మార్కెట్ యాస్పెక్ట్  ‘అరుంధతి’ ఫేమ్ అనూష్కాతో ‘అరుంధతి’ లాటి  ‘భాగమతి’ ని తీస్తున్నామనుకోవడం. దీంతో అశేష మహిళా ప్రేక్షకుల అండదండలు కూడా కలిసి వస్తాయను 
కోవడం. బాలీవుడ్ లో ఒక కొటేషన్ వుంది –‘షోలే’ కా ‘షాన్’ మత్ బనావో (‘షోలే’ లాంటి ‘షాన్’ తీయకు) అని. ‘షోలే’ తీసి అజరామరం చేసిన సిప్పీ, తర్వాత అలాటిదే ‘షాన్’ తీయాలనుకుని చేతులు కాల్చుకున్న చారిత్రక సందర్భం లోంచి పుట్టిన కొటేషన్ అది. ఒకటేదో  బ్లాక్ బస్టర్ అయ్యిందని మళ్ళీ అలాటిదే ఇంకోటి తీసి బ్లాక్ బస్టర్ చేయాలనుకోవడం ఆరోగ్యకర లక్షణం కాదని, ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనీ  ఇప్పుడు రోహిత్ శెట్టి కూడా మొరపెట్టుకుంటున్నాడు. 

          మార్కెట్ యాస్పెక్ట్ అనేది అప్పుడున్న మార్కెట్ లోంచి పుడుతుందే  తప్ప ఎప్పుడో  గతంలో వచ్చిన ఇంకో సినిమాలోంచి కాదు. గతంగతః గా మర్చిపోవాలి. ఐనప్పటికీ... ఐనప్పటికీ... ఐనప్పటికీ – అరుంధతి, దేవసేన లాంటి జానపద ఫాంటసీ పాత్రలతో మరింత  పైకెదిగి విజయ వంత 
మైన ఫ్రెష్ ఇమేజిని ఎస్టాబ్లిష్  చేసుకోగల్గిన అనూష్కా శెట్టి మార్కెట్ ని నిజంగా క్యాష్ చేసుకోవాలనే  అనుకుంటే, అలాటి పీరియడ్ – ఫాంటసీ స్టోరీలే ఆమెకి వాడుకోవాలి తప్ప, సమకాలీన కాలక్షేప బఠానీ థ్రిల్లర్స్ కాదు. ఆమె ఇప్పటి ఇమేజికి ఇవి సరిపోయేవి కావు. సింపుల్ గా హాలీవుడ్ భాషలో చెప్పుకుంటే,  హై కాన్సెప్ట్ కథలు కావాలి. 

          రస్టిక్ ‘షోలే’,  మేజెస్టిక్ ‘షాన్’ కలిపి ‘బ్యాన్’ అని ఒకటి తీస్తే ఎలావుంటుంది? ‘షోలే’ లోని గబ్బర్ సింగ్ పాత్ర పేరు మాత్రమే వాడుకుని, ‘షాన్’ లోని  షాకాల్  కథ చూపిస్తే ఎలా వుంటుందో  అలాగే వుంది ‘భాగమతి’ కూడా. ఫాంటసీ లుక్కిస్తూ భాగమతి పేరు మాత్రమే వాడుకుని, ఈకాలపు సాదా చంచల హత్య కేసు కథ చూపించారు. ‘పద్మావత్’ టైటిల్ పెట్టి ఖిల్జీ గారి కథతో చూపించింది కూడా ఇలాగే.  రెండు మతులూ – ఇద్దరు శ్రీమతులూ ఒకేసారి వచ్చారు : పద్మావతి – భాగమతి. కాకపోతే పద్మావతి పెద్దక్క కాబట్టి ముందు రోజు వచ్చింది. 

          మహిళా ప్రేక్షకులు – టీనేజి గర్ల్స్ తో  కలుపుకుని  - మార్నింగ్ షో నుంచే ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వున్నాయి కిటకిటలాడుతూ. కానీ ఎంతవరకూ ఈ మార్కెట్ యాస్పెక్ట్ తో వాళ్ళని సంతృప్తి పర్చగల్గారు? ఫ్యామిలీ అప్పీల్ తో ఆకర్షిస్తున్న ‘భాగమతి’ టైటిల్, దానికి అనూష్కా అప్పీల్, తీరా ఎందుకు  రివర్స్ అయ్యాయి?  ఇంటర్వెల్ సీన్లో భాగమతి ఆహార్యంలో, అరుంధతి అప్పీల్ తో పీరియడ్ భాగమతిగా అనూష్కాని చూపించి ఒక నమ్మకం కల్గించాక - సెకండాఫ్ లో ఆ భాగమతి కథకి  కాక,  ఓ సాధారణ చంచల కథకి చేసిన పబ్లిసిటీ స్టంట్ గా తేల్చేశారు. ఐనప్పటికీ – పోనీలే  చంచలకి పూనినప్పటికీ అది  భాగమతి ఆత్మే కదా  అనుకుని సెకండాఫ్ కి సిద్ధమైనప్ప
టికీ, తీరా ఇది కూడా కాదని తేల్చేశారు. ఇక్కడే రసభంగమైంది. ఇక్కడ్నించే లేడీస్ ని ఆకర్షించని  రొటీన్ రాజకీయ సస్పన్స్ థ్రిల్లర్ మసాలా ఐపోయింది.

          నిజానికి ఈ కథ ప్రొసీడింగ్స్ ఓపిగ్గా చూస్తూ కూర్చున్న ఈ వ్యాసకర్తకి, క్లయిమాక్స్ కి ముందు  ఈ కీలక ఘట్టం దగ్గర ఉత్సాహం వచ్చింది. అంతవరకూ భాగమతి కథతో చంచల కథ ఎక్కడ కనెక్ట్ అవుతుందా అని ఎదురు చూడాల్సి వచ్చింది. కనెక్ట్ కాకపోతే రెండు మూడు కథలుండకూడదు. ఒకే కథ వుండాలి. ఇలా ఈ ఘట్టంలో మెంటలాసుపత్రిలో చేరిన  చంచలని మంత్రి ఈశ్వర ప్రసాద్ వచ్చి కలిసినప్పుడు - అతడి మాటలకి ఆమె కొత్తగా వాంపిష్ గా చూసి నవ్వినప్పుడు - ఆమెకి పూనిన భాగమతి ఆత్మే  ఇలా మంత్రిని రావించి పట్టేసుకుందనీ, ఇతనే తను పగదీర్చుకోవాలనుకుంటున్న గత జన్మలో చంద్ర సేనుడనీ - ఇదే సమయంలో ఇప్పుడు ఈశ్వర ప్రసాద్ గా ఇతనే చంచలకి అన్యాయం చేసిన విలన్ అనీ,  ఇలా భాగమతి -  చంచలల టూ ఇన్ వన్ కాంబినేషన్, చంద్ర సేన - ఈశ్వర ప్రసాద్ ల టూ ఇన్ వన్ కాంబినేషన్ కి ఒకేసారి చెక్ పెట్టేస్తున్నారనీ ఎంతో థ్రిల్లయ్యాడు ఈ వ్యాసకర్త!

          ఈ ఫాంటసీ రియాల్టీల కనెక్షన్ తో రెండు కథలూ ఏకత్రాటిపై కొచ్చి, అన్ని అప్పీల్స్ నీ, మార్కెట్ యాస్పెక్ట్ నీ గురిచూసి కొట్టాయని  సంతోషించాడు ఈ మానవుడు. కానీ ఇలా జరగలేదు. ఈ రాస్తున్న మానవుడు విగత జీవి స్థాయికి చేరిపోయాడు. ఆ మంత్రిలో గతకాలపు చంద్ర సేన అంశా లేదు, చంచలలో కూడా గతకాలపు భాగమతి మెటీరియల్లూ లేదు- అంతా  ఉత్తదే, మంత్రిని పట్టుకోవడానికి చంచల ఉత్తుత్తి  నాటకమే అని ఎప్పుడైతే ఈ ఘట్టంలో ఎంత  బ్యాడ్ గా చెప్పి చేతులేత్తేశారో- ఆ క్షణం నుంచీ  అన్ని రకాల అప్పీల్సూ,  మార్కెట్ యాస్పెక్టూ కుదేలైపోయాయి.
***
    కథ క్రియేటివ్ యాస్పెక్ట్ చూద్దాం : క్రియేటివిటీకి ప్రమాణాల్లేవు  -  కనుక కథ ఇలా వుండకూడదు, అలా వుండాలని నువ్వెలా చెప్తావ్? అన్న ప్రశ్న కరెక్టే. ఎప్పుడూ? ఆ  క్రియేటివిటీ చక్కగా స్ట్రక్చర్ అనే చట్రం ఆధారంగా వున్నప్పుడు. లేనప్పుడు నీ క్రియేటివిటీకి మార్కెట్ యాస్పెక్ట్  ఏమాత్రం లేదని ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పవచ్చు. స్ట్రక్చర్ తో కలిసున్నప్పుడే క్రియేటివిటీకి మార్కెట్ యాస్పెక్ట్ వుంటుంది. 

         ‘భాగమతి’ ఫాంటసీ -  పొలిటికల్ థ్రిల్లర్ రెండు జానర్ల మిక్స్ కరెక్టేనా? భాగమతి కథే లేనప్పుడు ఫాంటసీ జానర్ ఎక్కడిది? కనుక వున్నది పొలిటికల్ థ్రిల్లర్ జానర్ ఒక్కటే. కాబట్టి ఇదొక పొలిటికల్ థ్రిల్లర్, అంతే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఎలా వుంది? మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలో వుంది. మిడిల్ మటాష్ లో ఎందుకు పడింది? ఎండ్ సస్పన్స్ రూల్స్ ని పాటించకపోవడం వల్ల  మిడిల్ మటాష్ లో పడింది. ఇదే దర్శకుడు గత సంవత్సరం తీసిన ‘చిత్రాంగద’ అనే ఫ్లాపయిన సైకలాజికల్ థ్రిల్లర్ సమస్య కూడా ఇదే కదా? 

          ఇక క్రియేటివిటీకి, దాంతో మార్కెట్ యాస్పెక్ట్ కీ ఉత్తుత్తి భాగమతి ఫాంటసీ చాలనుకున్నట్టుంది. ఉత్తుత్తి భాగమతి ఫాంటసీ అని తెలీని ప్రేక్షకులు, భాగమతి కథ చంచల కథతో ఎక్కడ కనెక్ట్ అవుతుందాని చూస్తూంటారు. రెండు కథలు కనెక్ట్ అవడం స్ట్రక్చరల్ ప్రక్రియ. కనెక్ట్ చేయకపోవడం అనాలోచిత క్రియేటివ్ వ్యాపకం. పైగా ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడం. భాగమతిది నిజకథగా చేసి,  పై అధ్యాయంలో చెప్పుకున్నట్టు,  క్లయిమాక్స్ లో చంచలతో టూ ఇన్ వన్ కాంబినేషన్ తో కనెక్ట్ చేయడం స్ట్రక్చర్ కోరే విధి. స్ట్రక్చరున్న క్రియేటివిటీయే బాక్సాఫీసు ఫ్రెండ్లీ క్రియేటివిటీ.
ఎవరెలా చేశారు

(మిగతా రేపు )
సికిందర్
         



Friday, January 26, 2018

591 : రివ్యూ

రచన -  దర్శకత్వం : సంజయ్ లీలా భన్సాలీ
తారాగణం : దీపికా డుకొనే, వీర్ సింగ్, షాహిద్ పూర్, అదితీరావ్ హైదరీ, అనూప్రియా గోయెంకా తదితరులు
కథ : మలిక్ మహ్మద్ జయసీ, స్క్రీన్ ప్లే : సంజయ్ లీలా భన్సాలీ ప్రకాష్ కపాడియా,  మాటలు : ప్రకాష్ కపాడియా
సంగీతం: సంజయ్ లీలా న్సాలీ,  ఛాయాగ్రణం: సుదీప్ టర్జీ బ్యానర్స్ : భన్సాలీ ప్రొడక్షన్స్, యాకామ్ 18 మోషన్ పిక్చర్స్‌, నిర్మాతలు: సంజయ్ లీలా భన్సాలీ, అజిత్ అంధారే, సుధాంశ్ వత్స్
విడుదల : జనవరి 25, 2018

***
          దేవదాసు, బాజీరావ్ మస్తానీ ల్లాంటి భారీ పీరియడ్ సినిమాల స్పెషలిస్టు సంజయ్ లీలా భన్సాలీ తాజాగా ‘పద్మావత్’ అనే కాల్పనిక చరిత్రని నిర్మించాడు. దశాబ్ద కాలంగా వివిధ రూపాల్లో ‘పద్మావత్’ ని   ప్రదర్శిస్తూనే వున్నాడు భన్సాలీ. ఇండియాలో ఒక టీవీ ఎపిసోడ్ గా, పారిస్ లో ఓపెరా వెర్షన్ గా, ఇంకో శ్యామ్  బెనెగళ్  టీవీ సిరీస్ లో ఒక ఎపిసోడ్  గానూ ‘పద్మావత్’ ప్రాజెక్టుని సజీవంగానే  వుంచుతున్నాడు. ఇప్పుడు భారీ విజువల్ వైభవంతో పెద్ద ఎత్తున వెండి తెరకెక్కించాడు. ‘బాజీరావ్ మస్తానీ’ హీరో హీరోయిన్లయిన రణవీర్ సింగ్,  దీపికా  పడుకునేలనే రిపీట్ చేస్తూ, ఇంకో ముఖ్య పాత్రలో షాహిద్ కపూర్ ని కూడా తీసుకుని ఏ విధంగా ఒక దృశ్యకావ్యంగా మలిచాడో లేదో  చూద్దాం...

కథ
       సింహళ రాకుమార్తె పద్మావత్  (దీపికా పడుకునే) వేట కెళ్ళినప్పుడు ఆమె వేసిన బాణం తగిలి చిత్తోడ్ ఘడ్  రాజు మహారావల్ రతన్ సింగ్ (షాహిద్ కపూర్) గాయపడతాడు. భార్య రాణీ నాగవతి (అనూప్రియా గోయెంకా) కోసం విలువైన ముత్యాల అన్వేషణలో వున్న అతను  పద్మావత్ ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెకూడా స్పందిస్తుంది. అతణ్ణి పెళ్ళిచేసుకుని రాణీ పద్మావత్  అవుతుంది.

మరోవైపు ఢిల్లీ సుల్తాను  జలాలుద్దీన్ ఖిల్జీ (రజా మురాద్) కూతురు మెహరున్నిసా (అదితీరావ్ హైదరీ) ని పెళ్లి చేసుకుని,  అతణ్ణి చంపేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు అల్లావుద్దీన్ ఖిల్జీ (రణవీర్ సింగ్). 

          ఇటు చిత్తోడ్ ఘడ్ లో రాఘవ్ అనే రాజగురు చేసిన ఒక తప్పువల్ల అతణ్ణి దేశ బహిష్కారం గావిస్తాడు రాజు రతన్ సింగ్. దీంతో నీ రాజ్యం పతనమయ్యేలా చూస్తానని శపథం చేస్తాడు రాఘవ్. అలావుద్దీన్ ఖిల్జీ పంచన చేరి, స్త్రీ లోలుడైన అతడికి పద్మావత్  అందచందాల గురించి నూరిపోసి రెచ్చ గొడతాడు. ఏది కొత్తగా కన్పిస్తే అది సొంతం చేసుకుని తీరాలన్న తత్త్వంతో వుండే ఖిల్జీ, ఇక పద్మావత్ ని పొందడం కోసం చిత్తోడ్ ఘడ్  మీద యుద్ధానికి పోతాడు.  

 ఈ యుద్ధంలో ఏం జరిగింది? ఎన్ని సార్లు యుద్ధం జరిగింది? యుద్ధం గెల్చి ఖిల్జీ పద్మావత్ ని పొందాడా? రతన్ సింగ్ ఎలా ఎదుర్కొన్నాడు? పద్మావత్  తనని తాను ఎలా రక్షించుకుంది?... అన్నదే మిగతా కథ. 

ఎలా వుంది కథ
కథ ఎలావుందో  చెప్పుకోవాలంటే దీని చుట్టూ చెలరేగుతున్న వివాదాల్ని కూడా కలుపుకుని చెప్పుకోవాలి. వివాదాలు తప్పే, కథ కూడా తప్పు. ఐతే ఈ యెత్తున అల్లర్లకి పాల్పడేంత దారుణంగా ఈ కథేమీ లేదు ఒక్క సందేశం విషయంలో మినహా. ఆందోళనా కారులు ఈ సందేశానికి జవాబిచ్చే పరిస్థితుల్లో లేరు. ఇందులో పద్మావత్  గౌరవానికి గానీ, రాజపుత్రుల వీరత్వానికి గానీ ఎలాటి భంగం కల్గించలేదు. పైపెచ్చు మితిమీరిన భక్తిభావంతో విపరీతంగా హైలైట్ చేశారు. అయినా దీనిమీద రగులుతున్న వివాదం,  హింసా అంతా ఒక కుట్ర పూరిత నాటకం. ఎవరి భావప్రకటనా స్వేచ్ఛా కాదు, మరెవరి  ఆత్మ గౌరవ పోరాటమూ కాదు. సినిమాకి బాక్సాఫీసు కావాలి, పార్టీకి ఓటు బ్యాంకు అవసరం – దీంతో  మ్యాచ్ ఫిక్సింగ్ కాని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారంటూ, విడుదల ముందు రోజు బుధవారం రాత్రి అర్నాబ్ గోస్వామి,  ఈ వివాదంలో కీలకపాత్ర పోషిస్తున్న  సీనియర్ నేత మీదే షాకింగ్  స్టింగ్ ఆపరేషన్ చేసి రట్టు చేశాడు. లైవ్ లోనే కూర్చోబెట్టి అడిగిన ప్రశ్నలకి ఆ నేతనుంచి జవాబుల్లేవు. 

          ఈ ఆందోళనల పట్ల, పెచ్చరిల్లిన హింసా ద్వేషాల పట్లా  అక్కడి ప్రభుత్వాలు వహిస్తున్న మౌనం రాజపుత్రుల మనోభావాల కోసమో,  తద్వారా వాళ్ళ ఓట్ల కోసమో మాత్రమే కాదు, ఒక ముస్లిం రాజు  హిందూ రాజుని ఓడించిన చరిత్ర సినిమా ద్వారా ప్రజల్లోకి వెళ్తోంది – ఇది అస్సలు ఇష్టం లేదు.

          సినిమా పరిభాషలో చెప్పుకోవాలంటే, తమ ప్రతిష్ట కోసం కర్ణి సేన పాల్పడుతున్న అల్లర్లు  సబ్ ప్లాట్ మాత్రమే. దీన్ని వాళ్ళు మెయిన్ ప్లాట్ అనుకుని భ్రమిస్తున్నారు. కర్ణి సేన సబ్ ప్లాట్ ని వాడుకుంటూ అక్కడి ప్రభుత్వాలు చేపట్టిన మెయిన్ ప్లాట్ అని తెలుసుకోవడం లేదు. ఆ మెయిన్ ప్లాట్ లో రాజపుత్రుల ఓట్లతో బాటు, మొత్తం హిందూ జాతి ప్రతిష్ట కూడా భాగమై వున్నాయి.

దీనికి జవాబు అన్నట్టు  అటు పాకిస్తాన్, ముస్లిం రాజుని ఆధారాల్లేకుండా అంత కర్కోటకుడుగా చూపించినా,  హిందూ రాజుని ఓడించాడు కాబట్టి,  కట్స్ లేకుండా క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసి తక్షణ రిలీజ్ చేసుకుని ‘పద్మావత్’ తో సంబరపడుతోంది.

          ఈ మొత్తం  గేమ్ లో ప్రేక్షకులు ఫూల్స్ అయి సినిమా కోసం ఎగబడుతున్నారు. మనోభావాల పైత్యం ముదిరి కర్ణి సేన మూకలు స్కూలు పిల్లల మీద కూడా దాడులకి తెగబడుతోంటే,  ప్రేక్షకుల్ని తరిమి తరిమి  కొడుతూంటే, అపార ఆస్తినష్టం గావిస్తూంటే, వీళ్ళని కీర్తించే ‘పద్మావత్’ ని ఇంకా ప్రేక్షకులెందుకు చూడాలి? చూసి ఎవరో రాజపుత్రుల్ని ఎందుకు ప్రశంసించాలి?

          మనోభావాల ముఠాలెప్పుడూ సినిమాలు చూడరు, సినిమా ప్రేక్షకులూ కారు. వాళ్ళది జ్యూరిస్డిక్షన్ లేని దాదాగిరీ. సినిమాల ద్వారా కోట్లాది రూపాయలు  వినోదపన్ను ఆర్జిస్తున్న  ప్రభుత్వాలు కూడా  ఇలాటి సమయాల్లో  సినిమాల్ని వాటి ఖర్మానికి వదిలేసి, రౌడీ మూకల కొమ్ము కాస్తాయి. రాజకీయాలకి ఆర్ధిక భావాలకంటే ఈ మనోభావాలే ఎక్కువైపోయాయి. పార్టీలకి విధేయంగా  వుంటూ ఓట్లు వేసే ప్రజలు ముప్ఫయి శాతమే వుంటే, మిగిలిన డెబ్భై శాతం మంది విధేయతలు మారిపోతూ వుంటాయి. ఈ 70 శాతాన్ని తమ వైపు తిప్పుకోవడం కోసమే  మనోభావా లతో పార్టీల ఆట. కానీ సంస్కృతులన్నీ పెనవేసుకుపోయాక వున్నది ఒక్కటే సంస్కృతి - ఆధునిక భారత ఆర్ధికాభివృద్ధి సంస్కృతి. కాదని విడదీసి,  వెనకటి మూలాల్లోకి తీసుకుపోతామంటే, పాకిస్తాన్లు తయారవుతాయి, తాలిబన్లు వుంటారు. ఆ  కుసంస్కృతితో  వర్గాలకతీతంగా పిల్లలు, స్త్రీలు, వృద్ధులు కూడా బలై పోతారు. మాట్లాడే భాషల్లో సైతం పదాలు పెనవేసుకుపోయాక,  ఎవరి పదాల్ని  ఎవరు విడదీసుకుని ఎక్కడికని పోతారు?

          చిత్తోడ్ ఘడ్  పతనం తర్వాత  240 ఏళ్ళకి మలిక్ మహ్మద్ జైసీ అనే సూఫీకవి,   పద్మావత్ ని ‘కనిపెట్టి’ కవిత్వీకరిస్తూ జానపద కథగా  రాశాడని చెప్పుకుంటున్నారు. ఇతను తన కాల్పనిక కథతో  రాజపుత్రుల వీరత్వాన్నీ, పద్మావత్  ఆత్మత్యాగాన్నీ ఎంతో ఘనంగా  కీర్తిస్తున్నానని అనుకున్నాడే గానీ,  దీనికి ఖిల్జీ చేతిలో రాజపుత్రుల ఓటమి అనే నెగెటివ్ నేపధ్యం పెట్టుకున్నానని, ఇది ముందు కాలాల్లో సమస్యలు తెచ్చి పెడుతుందనీ గుర్తించలేదు. పైగా పద్మావత్ పాత్రచిత్రణలో కూడా చాలా పప్పులో కాలేశాడు. భన్సాలీ లాంటి మేధావి కూడా దీన్నే తు.చ. తప్పకుండా పాటించాడు. బలమైన పాత్రగా చూపించుకొస్తూ పద్మావత్ ని, అత్యంత బలహీనురాలిని చేసి ముగించాడు.  పురుషాధిక్య తా భావజాలానికి ప్రతీకలాగా కన్పిస్తోంది పద్మావత్. కానీ ఎంతో ఆరాధ్య దేవత  అయిపోయింది.  మెలోడ్రామా కలగలిసిన మనోభావాలతో పద్మావత్ ఆత్మాహుతిని చూపించి,  అక్కడి స్త్రీలని మాయ చేసి బానిసత్వంలో పడేస్తున్నాయి మూకలు. రేప్ జరిగే ప్రమాదముంటే ఆత్మాహుతి చేసుకోమని నెగెటివ్ సందేశమిస్తోంది. ప్రస్తుత సెక్సోన్మత్త సమాజానికి చాలా మంచి సందేశమేనేమో ఇది.  రేపుల రాష్ట్రాల్లో ఈ సందేశం అత్యవసరమేనేమో కూడా ఇప్పుడు.  

ఎవరెలా చేశారు 
టైటిల్ వచ్చేసి పద్మావత్ మీద,  కథ వచ్చేసి ఖిల్జీ మీద. చాలా భిన్నమైన తరహా గల పాత్రలేసే స్టార్ రణవీర్ సింగ్,  ఖిల్జీగా విలన్ పాత్ర పోషించాడు. అతి క్రూరంగా, చెత్తగా, చిల్లరగా, తన పెళ్లి సమయంలో కూడా అవతల ఇంకో అమ్మాయిని అనుభవించే కామాంధుడుగా,  పళ్ళు బయట పెట్టి వెకిలి చేష్టలు  పోయే శాడిస్టుగా, ఏ నీతీ రీతీ లేనివాడుగా నటించడంలో రణవీర్ కి మరెవరూ సాటిరారు. ఈ కథకి ఖిల్జీ పాత్ర విలన్ కాబట్టి ఎంత పచ్చిగా  చూపించాలో అంత పచ్చిగానూ  చూపించే సినిమాటిక్ లిబర్టీ పూర్తిగా తీసుకున్నాడు భన్సాలీ. నిజానికి ఖిల్జీ వ్యభిచారాన్ని నిషేధించాడనీ, వ్యభిచారిణులందరూ పెళ్లి చేసుకోవాలని ఆదేశించాడనీ, వ్యభిచరిస్తే మగాళ్ళకి లింగ విచ్చేధం, ఆడాళ్ళకి రాళ్ళ దెబ్బలూ శిక్ష విధించాడనీ, మద్యపానం, మాదకద్రవ్యాలు  పూర్తిగా నిషేధించాడనీ, స్త్రీలోలుడు కాదనీ, నల్గురు భార్యలున్నారనీ, వాళ్ళల్లో ఇద్దరు హిందువులనీ...ఇలా గొప్పలు చెప్పుకుంటూ పోతే ఈ పాజిటివ్ లు  విలన్ పాత్రకి  ఇమడవు. చరిత్ర కారుడు ఇర్ఫాన్ హబీబ్ ఈ సినిమా నుద్దేశించి చెప్పినట్టు, చరిత్రని చరిత్రలాగే సినిమా తీస్తే ఎంటర్ టైన్మెంట్ వుండదు. కాబట్టి ఖిల్జీని కావాల్సినంత  కైమా కింద కసకసా కొట్టేసి ఖుజ్లీ (దురద) నంతా తీర్చుకున్నాడు భన్సాలీ. ఇది మెచ్చదగిన అంశం. ఐతే అదే చేత్తో పద్మావత్ కి కాస్త రక్తమాంసాలు కూడా అద్ది వుంటే ఇంకెంతో  బావుండేది. 

          రణవీర్ ది హైపర్ యాక్టివ్ నటన పాత్రలాగే. అతను ఇంకో మెట్టు ఎదిగాడు. అతను  ఎంజాయ్ చేసే ‘ఖలీబలీ’  పాట డాన్సులో అతను అతి పవర్ఫుల్, ఎనర్జిటిక్కూ. ‘బాజీరావ్ మస్తానీ’ లో చారిత్రక పాత్రని ఎలానిలబెట్టాడో, అంతకన్నా ఖిల్జీతో విర్రవీగాడు - కోతికి కొబ్బరి కాయ  దొరికినట్టు. దీపికా పడుకునేతో తనకి ఒక్క సీనుకూడా వుండదు,  క్షణకాలం లాంగ్ షాట్ లో అస్పష్టంగా ఆమెని చూడ్డం తప్ప. తను అంతగా కోరుకుంటున్న ఆమెని వూహల్లోకి తెచ్చుకోవడం, డ్రీమ్  సాంగ్ వేసుకోవడం లాంటివి కూడా చెయ్యడు. ఇది అసహజ మన్పిస్తుంది  పాత్ర స్వభావ రీత్యా.  పద్మావత్ పావిత్ర్యాన్ని కాపాడే చిత్రణలో భాగంగా,   రణవీర్ పాత్రకి ఇలా అడ్డుకట్ట వేసినట్టున్నారు. ఇలా రణవీర్  పాత్రచిత్రణలో తేడా కొట్టింది.  పోరాటాల్లో రణవీర్ మాస్టర్. క్లయిమాక్స్ లో షాహీద్ కపూర్ తో కత్తి ఫైట్ తో గగుర్పాటు కల్గిస్తాడు. మొత్తం మీద ఇది రణవీర్ వన్ మాన్ షో చేసిన మూవీలాగా వుంటుంది.

షాహీద్ కపూర్ వచ్చేసి రాజా రతన్ సింగ్ పాత్రలో సౌమ్యుడు. ఆచితూచి మాట్లాడతాడు. రాజ్ పుత్ పౌరుషానికి కొమ్ముకాస్తాడు. రాజుగా నటన ఒకేగానీ, దీపికాతో కెమిస్ట్రీ కొరవడింది. పాత్రపరంగా చూస్తే రాజుగానూ,  మొదటి భార్యకి భర్తగానూ అంత కమిటెడ్ కాదనిపిస్తాడు. భార్యకి ముత్యాల కోసం బయల్దేరిన వాడు,  పద్మావత్ ని చూడగానే ప్రేమలోపడిపోయి పెళ్ళిచేసుకోవడానికే మాత్రం సంకోచించడు. భార్యపట్ల ఏ ఫీలింగూ వుండదు. ఇలాటి ప్రేమల్ని పవిత్రంగానూ, అమరంగానూ  చేస్తూంటాయి ఇలాటి చిత్రణలు. అలాగే, పద్మావత్ కోసం దాడి చేసి తనని ఖిల్జీ అపహరించుకుపోతే, పద్మావత్  విడిపించు కొచ్చినా - మళ్ళీ ఖిల్జీ  దాడికొస్తే బుద్ధి చెప్పే సరిక్రొత్త  చర్యలేవీ తీసుకోడు. ఖిల్జీ నుంచి పద్మావత్ కి మళ్ళీ ప్రమాదం తలెత్తకుండా  సైన్యాన్ని కూడా పటిష్టం చేసుకోడు. అవే కత్తులు తప్ప,  కొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకోడు. అటు రెండోసారి  ఖిల్జీ ఇంకా బలమైన ఆయుధ సంపత్తితో,  ప్రేలుడు పదార్ధాలతో అట్టహాసంగా వచ్చేసి, పెరేడ్ చేస్తూ ప్రాణం తీసిపోతాడు. స్థానిక రాజులు  ఆయుధాల విషయంలో అశక్తులేమో. దేశానికి పేలుడు పదార్ధాలని పరిచయం చేసింది ముస్లిం రాజులే. వాటితో దీపావళికి బాణసంచా తయారుచేసి పేల్చడం ప్రారంభించింది వాళ్ళే (ఎప్పుడో చదివిన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఎడిటోరియల్),  ఆ పేలుడు పదార్ధాలే టెర్రరిస్టుల చేతికి వచ్చాయి.

              ఇక రాణీ పద్మావత్ విషయం. ఈ పాత్రలో దీపిక సింహళ (శ్రీలంక) రాకుమార్తెగా, అతిలోక సౌందర్య రాశిగా,  రోమాంచితంగా జింకని వేటాడుతూ ఎంట్రీ ఇస్తుంది. అంటే తను యుద్ధ నైపుణ్యం గల సాహస వనితగా పరిచయమైంది. తర్వాత రాజు రతన్ సింగ్ ని ప్రేమించి (కవ్వించీ కవ్వించనట్టు కవ్వించి) పెళ్లి చేసుకుంటుంది. భార్య వున్న రాజుతో అలా ప్రవర్తించడానికీ, అంతటితో ఆగకుండా రెండో భార్యగా వెళ్ళడానికీ – ‘వీర వనిత’ అయిన ఆమె స్వతంత్ర వ్యక్తిత్వం ఏమైందో అన్నట్టుగా వుంది. సాటి స్త్రీ హక్కుల్ని లాక్కుంటున్నాన నే వివేచన కూడా వుండదు. ఇది కథానాయిక లక్షణమెలా అవుతుందో తెలీదు- కథకుడి పురుషాధిక్యతా భావజాలం తప్ప. 


రాణి అయ్యాక దీపికా గ్రేస్ ఫుల్ గా, పరమ పవిత్రంగా, ఆరాధ్యనీయంగా కన్పిస్తుంది. మనం కళ్ళప్పగించి చూస్తూ వుండాల్సిందే టాలెంటెడ్ నటిని. రెండో భార్య గంగావతి   (అనూప్రియా గోయెంకా) పాత్రకి ప్రాధాన్యం లేదు. ఆమెతో పద్మావత్ సంబంధాల ఎస్టాబ్లిష్మెంట్ కూడా లేదు. అటు గయ్యాళి అయిన ఖిల్జీ మొదటి భార్యతో కొత్త భార్య మెహరున్నిసా సంబంధాలు కూడా చూపరు. ఖిల్జీ – పద్మావత్ – రతన్ ల ట్రయాంగులర్ సూటి కథకి ఇవి అడ్డు అని పక్కన పెట్టారనుకోవచ్చు ఓకే, అయితే టైటిల్ రోల్ లో పద్మావత్ గా దీపికని చూపింది  ఎంత? 

          ఏదో రెండు సార్లు యుద్ధ వ్యూహం గురించి రెండు ముక్కలు సలహా లివ్వడం, భర్తని ఖిల్జీ అపహరించుకుపోతే వెళ్లి వ్యూహాత్మకంగా విడిపించుకుని తప్పించుకురావడం తప్ప ఏమున్నాయి?  ఇలా వచ్చాక, మళ్ళీ ఖిల్జీ యుద్ధానికి వస్తున్నాడని తెలిసి  – భార్యగా నా జౌహర్ (ఆత్మాహుతి) హక్కుని వినియోగించుకోవాలంటే భర్తగా మీ అనుమతి కావాలని భర్తని కోరుతుంది. అంటే యుద్ధంలో భర్త చనిపోతాడనా? అలా అనుకుంటుందా భార్య ఎక్కడైనా? జౌహర్  అప్పుడున్న ఆచారమే, అలాగే చేస్తారు నిజమే. అప్పుడు  దాన్నెలా చిత్రీకరించాలి?  భర్త యుద్ధంలో చనిపోతే అప్పుడు తను శత్రువు చేతికి చిక్కకుండా ఆత్మాహుతి చేసుకునే ఆచారమది. దీనికి భర్త అనుమతి ఏమీ అవసరం లేదు. భర్త చనిపోవచ్చని ముందస్తు  అనుమతి అడగడం సినిమాలో డ్రామా కోసమే. ఈ డ్రామా బ్యాడ్ టేస్టుతో  వుంది పాత్రల్ని కిల్ చేస్తూ. 

          నేనలా మరణించను, వీరుడిగా తిరిగొస్తానని ఆమెకి హామీ ఇవ్వకుండా,  జౌహర్ వరమిచ్చేస్తాడు! దీంతో ప్రేక్షకులకి ముందేం జరుగుతుందో కూడా చెప్పేస్తున్నారు. మొదట్లోనే చెప్పుకున్నట్టు మితిమీరిన భక్తిభావపు వెల్లువలో తనే కొట్టుకుపోయాడు దర్శకుడు కథని వదిలేసి. మరి పెద్ద భార్య సంగతి? జౌహర్ క్రెడిట్ పద్మావత్ కేనా? ఎందుకు ఈ పాత్ర ఇలా స్వార్ధంతో దిగజారి పోతోంది? అప్పుడే చావుల గురించెందుకు? ఎవడో ఖిల్జీ గాడు తనని మోహిస్తూంటే తన సింహళ నారి వ్యక్తిత్వం, పౌరుషం ఏమయ్యాయి? వాడు తనకోసం మళ్ళీ యుద్ధానికొస్తూంటే భర్తని ముందుకు తోసి, అతను చనిపోతాడని దేవుడా అని ఆత్మాహుతి ఏర్పాట్లు చేసుకుంటుందా – లేక భర్తతో పాటూ  వెళ్లి అమీతుమీ తేల్చుకుంటుందా? మానంకోసం పోరాడి చనిపోతే ఆ మరణం ఉత్తమ మైనది  కాదా? రేపిస్టుతో ఎదురెళ్లి పోరాడకండి, తలుపేసుకుని కిరసనాయిలు పోసుకోండని సందేశాలివ్వడమా? భక్తి  ఎక్కువైపోయే   మేల్ షావెనిజాన్ని భన్సాలీ ఇలా పతాక స్థాయికి చేర్చాడు. పద్మావత్ తో బాటు స్త్రీలందరూ సామూహికంగా అగ్నికి ఆహుతి చేసుకునే ఘట్టాన్ని అద్భుతమైన దృశ్య కావ్యంలా తీర్చి దిద్దాడు.

          భన్సాలీ సంగీతంలో దీపికా మీద ‘ఘూమర్’ సాంగ్, రణవీర్ మీద ‘ఖలీబలీ’ సాంగ్ రెండూ  బావున్నాయి. సుదీప్ చటర్జీ కెమెరా వర్క్ భన్సాలీ స్థాయిలోనే వుంది. సీజీ వర్క్, సెట్స్, లొకేషన్స్ అన్నీ క్లాస్ గా వున్నాయి. శ్యామ్ కౌశల్ యాక్షన్ సీన్స్, వాటి విజువల్స్ థ్రిల్లింగ్ గా వున్నాయి. మేకింగ్ లో ఈసారి కూడా భన్సాలీ ప్రతిభ కనబర్చాడు గానీ, ఐతే ఇదంతా డిజైనర్ చరిత్ర. దుస్తులుగానీ, ఆభరణాలు గానీ ఈ కాలపు హంగులు. అలాగే కంటెంట్ విషయాని కొచ్చేసరికి ఖిల్జీ కథ చెప్పాడు, చివర్లో దాని పరిష్కారం మాత్రమే  పద్మావత్ చేతిలో పాసివ్ గా పెట్టాడు.

చివరికేమిటి 
చెడు వైపునుంచి కథ చెప్పడం, ఆ చెడుకి ఖిల్జీని ప్రతినిధిని  చేయడం, లక్ష్యాన్ని అతడికే కల్పించడం, దీంతో అతడి లక్ష్యం కోసం సాగే కథగా మారడం, ఆ కథనెదుర్కొనే బాధితులుగా పద్మావత్, రతన్ లు మిగిలిపోవడం స్క్రీన్ ప్లే బలహీనతలు. ఇది పద్మావత్ కథనుకుంటే బాధితురాలిగా మాత్రమే ఆమె కథ.  ఇదొక జానపద గాథే అయినా ఇది పాత్రపరంగా గాక, ఒక ఆచార పరంగా సెట్ అయిన గాథ కాబట్టి,  పద్మావత్ యాక్టివ్ పాత్ర అయి పోరాటం చేసే అవకాశం లేకుండా పోయింది. ఆమె భర్త చాటు కెళ్ళిపోయి, ఆ భర్త కూడా యాక్టివ్ గా కాకుండా, విలన్ వచ్చినప్పుడల్లా రియాక్టివ్ గా  పోరాటం చేసే వాడుగా వుండడంతో- కథగా మెప్పించడం కష్టమైపోయింది. స్క్రీన్ ప్లే పరిభాషలో చూస్తే ఖిల్జీ విలన్ పాత్ర కూడా అవడు, యాంటీ హీరో అవుతాడు. పాత్ర పోషించిన నటుడు కూడా విలన్ పాత్రధారి కాదు - పాపులర్ స్టార్. అయితే యాంటీ హీరో కెప్పుడూ శిక్షే వుంటుంది. కానీ ఇది చారిత్రక గాథ అన్నారు కాబట్టి యాంటీ హీరో అయినా ఖిల్జీని శిక్షించే అవకాశం లేకుండా పోయింది.  కాబట్టి కథ అనుకుని ఈసినిమా చూడకుండా,  గాథగా చూసినప్పుడే కన్విన్స్ అవగల్గుతారు – సందేశం సంగతి పక్కన పెడితే.

సికిందర్






,