రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, జనవరి 2018, ఆదివారం

593 : 'భాగమతి' రివ్యూ - 2

ఎవరెలా చేశారు
          భాగమతి - చంచల అనే రెండు విభిన్న రూపాల్లో అనూష్కా కన్పిస్తుంది. కానీ ప్రధానంగా కన్పించేది చంచలగానే. భాగమతి ఆమెకి పూనిన ఆత్మగా అదృశ్యంగా వుంటుంది. ఇంటర్వెల్  సీన్లో ఆమె ఆ పాడుబడ్డ బంగళాలో ప్రతీకారాగ్నితో రగిలిపోయే ఉగ్ర భాగమతిగా ఎక్సెలెంట్ గా వుంటుంది. పౌరాణిక నటి ముఖంలో కనపడే భావప్రకటనా సామర్ధ్యమంతా కట్టలు తెంచుకుంటుంది. అదంతా ఏకపాత్రాభినయం. అందులో బలమైన మాస్ డైలాగులున్నాయి. ఆమె చెప్పుకునే కథకి దృశ్యపరమైన ఫ్లాష్ బ్యాక్ లేదు. మోనోలాగ్ గా మాటల్లోనే  చెప్పుకుంటుంది. తన  కాళంగి  రాజ్యాన్ని కబళించి తనని ఈ కోటలో శాశ్వతంగా బంధించిన సేనాని చంద్రసేనుడి మీద నిప్పులు కక్కుతుంది. నిజానికి చరిత్రలో భాగమతి అనే పేరు కుతుబ్ షాహీ ప్రేమకథతో ముడిపడివుంది. ఈ సినిమా భాగమతి నిజాంని  ఎదిరించా నంటుంది. చరిత్రలో కుతుబ్ షాహీ - భాగమతిల ప్రేమకథ  కథకుడికి నచ్చలేదేమో, అందుకని భాగమతిని నిజాం  మీదికి ఎగదోసి తృప్తి పడినట్టుంది. మంచిదే, అవకాశం దొరికినప్పుడల్లా  నచ్చని చరిత్రలతో ఇలాటి మంచి మంచి పన్లు చేస్తూ వుండాల్సిందే. 

          మరి ఇంతా చేసి భాగమతి పాత్రకి చేయాల్సిన న్యాయం చేశారా లేదా? ఆమె దాహార్తి తీర్చారా లేదా? తద్వారా ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చగల్గారా లేదా?  ఇది కదా కమర్షియల్,  అందునా  ఇలాటి ప్రతిష్టాత్మక బిగ్ బడ్జెట్ కమర్షియల్ సినిమాకి కావాల్సింది. పగతో వున్న భాగమతి దాహార్తి జోలికీ పోలేదు, అలాటి పాత్రతో తీర్చాల్సిన ప్రేక్షకుల ఆత్మిక దాహాన్నీ తీర్చలేదు. అరుంధతి, అమ్మోరు, నాగదేవత లాంటి ఫాంటసికల్ పాత్రలు మిథికల్ క్యారక్టర్స్ అవుతాయి. అందుకే అవి ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీరుస్తూ  అంతగా హిట్టవుతాయి. హాలీవుడ్ కి ఆత్మిక దాహాన్ని తీర్చేందుకు బైబిల్ లో కొన్ని పాత్రలు తప్ప లేవు. అందుకని వాళ్ళు కౌబాయ్ ల దగ్గర్నుంచీ  మొదలుపెట్టి  సూపర్ మాన్, బ్యాట్ మాన్, స్పైడర్ మాన్ లాంటి అతీంద్రయశక్తులు గల పాత్రల్ని సృష్టించి ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే మార్గం కనిపెట్టారు. అందుకే ఆ సినిమాలంతగా  హిట్టవుతున్నాయి. 

          అరుంధతి, అమ్మోరు, నాగదేవత లాంటి ఎన్నో సినిమాలూ ఈపనే చేశాయి. కానీ భాగమతిని ఒక మిథికల్ క్యారక్టర్ గా గుర్తించక, కేవలం అరుంధతి బ్రాండ్ నేమ్ ని క్యాష్ చేసుకునే పైపై అమ్మకపు వస్తువుగా ముస్తాబులు చేసి వదిలేశారు. ఆమె చెప్పుకున్నంత వరకే ఆమె కథ. దానికి కొనసాగింపూ ముగింపూ లేవు. పాత్రకి సెటప్ మాత్రమే వుంది, ఆ సెటప్ కి పే ఆఫ్ లేదు. తాటాకు చప్పుళ్ళ కరివేపాకు పాత్ర అయింది. ఆ తర్వాత ఆమె చంచలని పూని చంచల రూపంలో కనపడుతూంటుంది, అంతే. దీంతో బాక్సాఫీసుకి ఎంతో ప్లస్ అయ్యే భాగమతి మిథికల్ క్యారక్టర్ కిల్ అయిపోయింది. ప్రేక్షకుల అత్మికదాహం తీరని దాహంలాగే వుండిపోయింది. 

          ఇక చంచలలో మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఛాయలు కనపడతాయి. ఐఏఎస్ ఆఫీసర్ గా చంచల సంతకాల గొడవ, కేసులో ఇరుక్కోవడం ఇదే. ఇలాటి పాత్రలు  విజయశాంతి చేసి మెప్పించినవే. శ్రీలక్ష్మి ఛాయలున్న చంచల పాత్రకి  భాగమతి గొడవ అడ్డు లేకపోతే,  ఈ కథ శ్రీలక్ష్మికి ఒక పవర్ఫుల్ నీరాజనమయ్యేది. మహిళా ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయ్యేవాళ్ళు. శ్రీలక్ష్మితోనూ పూర్తిగా కాక, భాగమతితోనూ పూర్తిగా కాక, సగం సగం ఏం చేసి సాధించినట్టో కథకుడి ఘనమైన క్రియేటివిటీకే బాగా తెలియాలి. 

          చంచలగా అనూష్కా అసలు విషయం తెలిసే వరకే ఒకరకమైన సస్పన్స్ తో ఆకట్టుకోగల్గుతుంది. ఎప్పుడైతే ఆ సస్పెన్స్ తీరిపోయి, చంచలతో ఇదొక సాదా పొలిటికల్ డ్రామా థ్రిల్లరే తప్ప, ఇక భాగమతి కథ లేదనేసరికి, థ్రిల్లర్ చంచల కాస్తా  ఆసక్తి కల్గించడం మానేస్తుంది. 

          ఇతర తారాగణమంతా  పకడ్బందీగా వున్నారు. మంత్రి పాత్రలో జయరాం అద్భుతమైన బాడీలాంగ్వేజితో వున్నాడు. అతనున్నప్పుడల్లా సీను పదునెక్కుతుంది. కార్యకర్తగా ఉన్నీ ముకుందన్ కూడా బావున్నాడు. సీబీఐలుగా మురళీ శర్మ, ఆశాశరత్ లు  ప్రొఫెషనల్ గా కనిపిస్తారు. కానీ ఆశా శరత్ పాత్రకి తన కొలీగ్ తమ్ముణ్ణి చంపిందంటున్న కేసులో శిక్ష  అనుభవిస్తున్న చంచలకి – ఈ కేసులోనే మంత్రితో  సంబంధముండచ్చని  అనుమానమెందుకు రాదో అర్ధంగాదు. ఆ భూముల విషయంలో తమ్ముడితో పాటూ మంత్రి కూడా ఇన్వాల్వ్ అయి వున్నాడు కదా?  ఈ లైన్లో  ఆశా శరత్ పాత్ర వర్కౌట్ చేసి - విగ్రహాల దొంగాతనాలతో కాదు, అంత కంటే పెద్దనేరం అసలా తమ్ముణ్ణి చంపింది మంత్రేనని తనే గుట్టు రట్టు చేయకుండా – విగ్రహాల గురించి ఎటూ తేలని ఇంటరాగేషన్ చంచలతో చేస్తూ టైం వేస్ట్ చెయడమెందుకో అర్ధం గాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.  ఈ కామన్ సెన్స్ తో చూస్తే, చూపించిన కథే వుండదు! 

          ఇక బంగళాలో  దెయ్యానికి ఎప్పుడుపడితే అప్పుడు భయపడి మనల్ని నవ్వించే ప్రయత్నం చేయడానికి ధనరాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ వున్నారు. నటింప జేసుకునే వషయంలో దర్శకుడు సమర్ధుడని, నటీనటులతో సీన్లు రక్తి కట్టిస్తాడనీ ఫ్లాపయిన గత ‘చిత్రాంగద’ లోనే చూశాం.  సాంకేతికంగానూ అతను టాలెంట్ వున్న దర్శకుడు. మంచి విజువల్ సెన్స్ వుంది. జానర్ ని జానర్ లాగే తీసే  నేర్పు వుంది. 

          భాగమతి బంగళాకి వేసిన సెట్ రవీందర్ రెడ్డి క్లాసిక్  క్రియేషన్ అనొచ్చు. అలాగే నయీం  విజువల్ ఎఫెక్ట్స్ కూడా. తమన్ కూర్చిన నేపధ్య సంగీతం ఈ థ్రిల్లర్ కొక ప్రాణం. ‘చిత్రాంగద’ లో ఏ నేపధ్య సంగీతంతో దర్శకుడు ఘోరమైన శబ్ద కాలుష్యం సృష్టించాడో అలాంటిది ఇక్కడ లేదు. ఇక భయాన్ని క్రియేట్ చేయడంలో కొత్తదనం మాత్రం లేదు. దీన్నర్ధం జేసుకోవచ్చు. ఈ టెంప్లెట్ ట్రిక్కులకి మించి ఏముంటాయి. తన పక్కనున్నది తన వాడేనని తెలుసు, అయినా వాడేదో మీద చెయ్యి వేయగానే కెవ్వున అరవడం హార్రర్ ఎఫెక్టే ఈ భూమ్మీద దెయ్యాలున్నంత కాలం. ఇవన్నీ చూసి చూసి వున్న మూస ఫార్ములా. నిజజీవితంలో ఇలాటివి అనుభవించి క్రియేట్ చేసినప్పుడు కొత్తవి వస్తాయి. పానుగంటి లక్ష్మీ నరసింహా రావు రాసిన ఒక కథలో చాలా గమ్మత్తయిన హార్రర్  అనుభవాలుంటాయి నవ్విస్తూ. యూ ట్యూబ్ లో ‘ప్రాంక్స్’ అనీ బోలెడు వుంటాయి. 

చివరి కేమిటి 
       ‘కథ ఎండ్ సస్పెన్స్ అయినప్పటికీ హిట్ అంటున్నారు. రివ్యూలు చాలావరకూ పాజిటివ్ గానే వున్నాయి. ఇలాటి కథలే చాలా మంది ఫ్రెండ్స్ దగ్గరున్నాయి. వీలయితే కొంచెం వివరంగా చెప్పండి. చాలా సార్లు చెప్పారు, అయినా మరోసారి చెప్పండి. ఎండ్ సస్పెన్స్ వర్కౌట్ అవదని చెప్పారు. మరి ‘భాగమతి’ విషయంలో వర్కౌట్ అయిందా?’ – ఇలా ఒకరి సందేహం.

          హిట్ ఫ్లాపులతో ఈ బ్లాగుకి సంబంధం లేదు. రెండుంపావు, రెండుంమ్ముప్పావు అంటూ తూకాలేసి  అంత కరెక్టుగా రేటింగులు ఇచ్చే జడ్జిమెంట్ కూడా చేతకాదు. వచ్చిన సినిమాని మొత్తంగా విశ్లేషించి ప్రెజెంట్ చేయడమే ఈ బ్లాగు పని. సమంజసమన్పిస్తే అంగీకరించక వచ్చు, అన్పించకపోతే అవతల పడెయ్యొచ్చు. దేన్నీ ఎవరి మీదా రుద్దే రుబ్బురోలుగా లేదు బ్లాగు. పైనే రాశాం, రివ్యూలు రాయడం ఒక రోగమని.

          కథ ఎండ్ సస్పెన్స్ అయినప్పటికీ హిట్ అంటున్నప్పుడు ఇక సందేహమెందుకు,  దాన్నే ఫాలో అవచ్చు. ఎలా తీశారో అలాగే  ఫ్రెండ్స్ కూడా రాసుకోవచ్చు. కానీ భాగమతిది ఎండ్ సస్పెన్స్ అని ఎవరన్నారు? అది ఎండ్ సస్పెన్స్ అవబోతూ మిడిల్ మటాష్ అయింది. మనవాళ్ళ క్రియేటివిటీ రానురాను ఎక్కడికి పోతోందంటే, ప్రపంచంలో ఎక్కడా వుండని  కొత్త కొత్త చిక్కుముళ్ళేసి మీద పడేస్తున్నారు. విప్పి చూసి విస్తుపోవడం మన పనవుతోంది. ఎండ్ సస్పెన్స్ ని మిడిల్ మటాష్ తో, లేదా మిడిల్ మటాష్ గా రాసుకున్న కథని ఎండ్ సస్పన్స్ తో  సింగారించడం ఇంతవరకూ ఎక్కడా చూడలేదు. బహశా ఈ కథకుడికి తనేం చేశాడో తనకే తెలిసి వుండకపోవచ్చును. ఇలాటి సింగారమే  భాగమతికి చేశాడు. హైదరాబాద్ శివారులో బాట సింగారం అనే వూరుంది. ఒకప్పుడు విసిరేసినట్టు దూరంగా ఎక్కడో అన్పించేది.  అదిప్పుడు కలిసిపోయి మెట్రో సింగారమైంది. దీని కర్ధముంది. భాగమతి  సింగారాని కర్ధముందా?

(మిగతా రేపు)


సికిందర్