రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, January 26, 2018

591 : రివ్యూ

రచన -  దర్శకత్వం : సంజయ్ లీలా భన్సాలీ
తారాగణం : దీపికా డుకొనే, వీర్ సింగ్, షాహిద్ పూర్, అదితీరావ్ హైదరీ, అనూప్రియా గోయెంకా తదితరులు
కథ : మలిక్ మహ్మద్ జయసీ, స్క్రీన్ ప్లే : సంజయ్ లీలా భన్సాలీ ప్రకాష్ కపాడియా,  మాటలు : ప్రకాష్ కపాడియా
సంగీతం: సంజయ్ లీలా న్సాలీ,  ఛాయాగ్రణం: సుదీప్ టర్జీ బ్యానర్స్ : భన్సాలీ ప్రొడక్షన్స్, యాకామ్ 18 మోషన్ పిక్చర్స్‌, నిర్మాతలు: సంజయ్ లీలా భన్సాలీ, అజిత్ అంధారే, సుధాంశ్ వత్స్
విడుదల : జనవరి 25, 2018

***
          దేవదాసు, బాజీరావ్ మస్తానీ ల్లాంటి భారీ పీరియడ్ సినిమాల స్పెషలిస్టు సంజయ్ లీలా భన్సాలీ తాజాగా ‘పద్మావత్’ అనే కాల్పనిక చరిత్రని నిర్మించాడు. దశాబ్ద కాలంగా వివిధ రూపాల్లో ‘పద్మావత్’ ని   ప్రదర్శిస్తూనే వున్నాడు భన్సాలీ. ఇండియాలో ఒక టీవీ ఎపిసోడ్ గా, పారిస్ లో ఓపెరా వెర్షన్ గా, ఇంకో శ్యామ్  బెనెగళ్  టీవీ సిరీస్ లో ఒక ఎపిసోడ్  గానూ ‘పద్మావత్’ ప్రాజెక్టుని సజీవంగానే  వుంచుతున్నాడు. ఇప్పుడు భారీ విజువల్ వైభవంతో పెద్ద ఎత్తున వెండి తెరకెక్కించాడు. ‘బాజీరావ్ మస్తానీ’ హీరో హీరోయిన్లయిన రణవీర్ సింగ్,  దీపికా  పడుకునేలనే రిపీట్ చేస్తూ, ఇంకో ముఖ్య పాత్రలో షాహిద్ కపూర్ ని కూడా తీసుకుని ఏ విధంగా ఒక దృశ్యకావ్యంగా మలిచాడో లేదో  చూద్దాం...

కథ
       సింహళ రాకుమార్తె పద్మావత్  (దీపికా పడుకునే) వేట కెళ్ళినప్పుడు ఆమె వేసిన బాణం తగిలి చిత్తోడ్ ఘడ్  రాజు మహారావల్ రతన్ సింగ్ (షాహిద్ కపూర్) గాయపడతాడు. భార్య రాణీ నాగవతి (అనూప్రియా గోయెంకా) కోసం విలువైన ముత్యాల అన్వేషణలో వున్న అతను  పద్మావత్ ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెకూడా స్పందిస్తుంది. అతణ్ణి పెళ్ళిచేసుకుని రాణీ పద్మావత్  అవుతుంది.

మరోవైపు ఢిల్లీ సుల్తాను  జలాలుద్దీన్ ఖిల్జీ (రజా మురాద్) కూతురు మెహరున్నిసా (అదితీరావ్ హైదరీ) ని పెళ్లి చేసుకుని,  అతణ్ణి చంపేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు అల్లావుద్దీన్ ఖిల్జీ (రణవీర్ సింగ్). 

          ఇటు చిత్తోడ్ ఘడ్ లో రాఘవ్ అనే రాజగురు చేసిన ఒక తప్పువల్ల అతణ్ణి దేశ బహిష్కారం గావిస్తాడు రాజు రతన్ సింగ్. దీంతో నీ రాజ్యం పతనమయ్యేలా చూస్తానని శపథం చేస్తాడు రాఘవ్. అలావుద్దీన్ ఖిల్జీ పంచన చేరి, స్త్రీ లోలుడైన అతడికి పద్మావత్  అందచందాల గురించి నూరిపోసి రెచ్చ గొడతాడు. ఏది కొత్తగా కన్పిస్తే అది సొంతం చేసుకుని తీరాలన్న తత్త్వంతో వుండే ఖిల్జీ, ఇక పద్మావత్ ని పొందడం కోసం చిత్తోడ్ ఘడ్  మీద యుద్ధానికి పోతాడు.  

 ఈ యుద్ధంలో ఏం జరిగింది? ఎన్ని సార్లు యుద్ధం జరిగింది? యుద్ధం గెల్చి ఖిల్జీ పద్మావత్ ని పొందాడా? రతన్ సింగ్ ఎలా ఎదుర్కొన్నాడు? పద్మావత్  తనని తాను ఎలా రక్షించుకుంది?... అన్నదే మిగతా కథ. 

ఎలా వుంది కథ
కథ ఎలావుందో  చెప్పుకోవాలంటే దీని చుట్టూ చెలరేగుతున్న వివాదాల్ని కూడా కలుపుకుని చెప్పుకోవాలి. వివాదాలు తప్పే, కథ కూడా తప్పు. ఐతే ఈ యెత్తున అల్లర్లకి పాల్పడేంత దారుణంగా ఈ కథేమీ లేదు ఒక్క సందేశం విషయంలో మినహా. ఆందోళనా కారులు ఈ సందేశానికి జవాబిచ్చే పరిస్థితుల్లో లేరు. ఇందులో పద్మావత్  గౌరవానికి గానీ, రాజపుత్రుల వీరత్వానికి గానీ ఎలాటి భంగం కల్గించలేదు. పైపెచ్చు మితిమీరిన భక్తిభావంతో విపరీతంగా హైలైట్ చేశారు. అయినా దీనిమీద రగులుతున్న వివాదం,  హింసా అంతా ఒక కుట్ర పూరిత నాటకం. ఎవరి భావప్రకటనా స్వేచ్ఛా కాదు, మరెవరి  ఆత్మ గౌరవ పోరాటమూ కాదు. సినిమాకి బాక్సాఫీసు కావాలి, పార్టీకి ఓటు బ్యాంకు అవసరం – దీంతో  మ్యాచ్ ఫిక్సింగ్ కాని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారంటూ, విడుదల ముందు రోజు బుధవారం రాత్రి అర్నాబ్ గోస్వామి,  ఈ వివాదంలో కీలకపాత్ర పోషిస్తున్న  సీనియర్ నేత మీదే షాకింగ్  స్టింగ్ ఆపరేషన్ చేసి రట్టు చేశాడు. లైవ్ లోనే కూర్చోబెట్టి అడిగిన ప్రశ్నలకి ఆ నేతనుంచి జవాబుల్లేవు. 

          ఈ ఆందోళనల పట్ల, పెచ్చరిల్లిన హింసా ద్వేషాల పట్లా  అక్కడి ప్రభుత్వాలు వహిస్తున్న మౌనం రాజపుత్రుల మనోభావాల కోసమో,  తద్వారా వాళ్ళ ఓట్ల కోసమో మాత్రమే కాదు, ఒక ముస్లిం రాజు  హిందూ రాజుని ఓడించిన చరిత్ర సినిమా ద్వారా ప్రజల్లోకి వెళ్తోంది – ఇది అస్సలు ఇష్టం లేదు.

          సినిమా పరిభాషలో చెప్పుకోవాలంటే, తమ ప్రతిష్ట కోసం కర్ణి సేన పాల్పడుతున్న అల్లర్లు  సబ్ ప్లాట్ మాత్రమే. దీన్ని వాళ్ళు మెయిన్ ప్లాట్ అనుకుని భ్రమిస్తున్నారు. కర్ణి సేన సబ్ ప్లాట్ ని వాడుకుంటూ అక్కడి ప్రభుత్వాలు చేపట్టిన మెయిన్ ప్లాట్ అని తెలుసుకోవడం లేదు. ఆ మెయిన్ ప్లాట్ లో రాజపుత్రుల ఓట్లతో బాటు, మొత్తం హిందూ జాతి ప్రతిష్ట కూడా భాగమై వున్నాయి.

దీనికి జవాబు అన్నట్టు  అటు పాకిస్తాన్, ముస్లిం రాజుని ఆధారాల్లేకుండా అంత కర్కోటకుడుగా చూపించినా,  హిందూ రాజుని ఓడించాడు కాబట్టి,  కట్స్ లేకుండా క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసి తక్షణ రిలీజ్ చేసుకుని ‘పద్మావత్’ తో సంబరపడుతోంది.

          ఈ మొత్తం  గేమ్ లో ప్రేక్షకులు ఫూల్స్ అయి సినిమా కోసం ఎగబడుతున్నారు. మనోభావాల పైత్యం ముదిరి కర్ణి సేన మూకలు స్కూలు పిల్లల మీద కూడా దాడులకి తెగబడుతోంటే,  ప్రేక్షకుల్ని తరిమి తరిమి  కొడుతూంటే, అపార ఆస్తినష్టం గావిస్తూంటే, వీళ్ళని కీర్తించే ‘పద్మావత్’ ని ఇంకా ప్రేక్షకులెందుకు చూడాలి? చూసి ఎవరో రాజపుత్రుల్ని ఎందుకు ప్రశంసించాలి?

          మనోభావాల ముఠాలెప్పుడూ సినిమాలు చూడరు, సినిమా ప్రేక్షకులూ కారు. వాళ్ళది జ్యూరిస్డిక్షన్ లేని దాదాగిరీ. సినిమాల ద్వారా కోట్లాది రూపాయలు  వినోదపన్ను ఆర్జిస్తున్న  ప్రభుత్వాలు కూడా  ఇలాటి సమయాల్లో  సినిమాల్ని వాటి ఖర్మానికి వదిలేసి, రౌడీ మూకల కొమ్ము కాస్తాయి. రాజకీయాలకి ఆర్ధిక భావాలకంటే ఈ మనోభావాలే ఎక్కువైపోయాయి. పార్టీలకి విధేయంగా  వుంటూ ఓట్లు వేసే ప్రజలు ముప్ఫయి శాతమే వుంటే, మిగిలిన డెబ్భై శాతం మంది విధేయతలు మారిపోతూ వుంటాయి. ఈ 70 శాతాన్ని తమ వైపు తిప్పుకోవడం కోసమే  మనోభావా లతో పార్టీల ఆట. కానీ సంస్కృతులన్నీ పెనవేసుకుపోయాక వున్నది ఒక్కటే సంస్కృతి - ఆధునిక భారత ఆర్ధికాభివృద్ధి సంస్కృతి. కాదని విడదీసి,  వెనకటి మూలాల్లోకి తీసుకుపోతామంటే, పాకిస్తాన్లు తయారవుతాయి, తాలిబన్లు వుంటారు. ఆ  కుసంస్కృతితో  వర్గాలకతీతంగా పిల్లలు, స్త్రీలు, వృద్ధులు కూడా బలై పోతారు. మాట్లాడే భాషల్లో సైతం పదాలు పెనవేసుకుపోయాక,  ఎవరి పదాల్ని  ఎవరు విడదీసుకుని ఎక్కడికని పోతారు?

          చిత్తోడ్ ఘడ్  పతనం తర్వాత  240 ఏళ్ళకి మలిక్ మహ్మద్ జైసీ అనే సూఫీకవి,   పద్మావత్ ని ‘కనిపెట్టి’ కవిత్వీకరిస్తూ జానపద కథగా  రాశాడని చెప్పుకుంటున్నారు. ఇతను తన కాల్పనిక కథతో  రాజపుత్రుల వీరత్వాన్నీ, పద్మావత్  ఆత్మత్యాగాన్నీ ఎంతో ఘనంగా  కీర్తిస్తున్నానని అనుకున్నాడే గానీ,  దీనికి ఖిల్జీ చేతిలో రాజపుత్రుల ఓటమి అనే నెగెటివ్ నేపధ్యం పెట్టుకున్నానని, ఇది ముందు కాలాల్లో సమస్యలు తెచ్చి పెడుతుందనీ గుర్తించలేదు. పైగా పద్మావత్ పాత్రచిత్రణలో కూడా చాలా పప్పులో కాలేశాడు. భన్సాలీ లాంటి మేధావి కూడా దీన్నే తు.చ. తప్పకుండా పాటించాడు. బలమైన పాత్రగా చూపించుకొస్తూ పద్మావత్ ని, అత్యంత బలహీనురాలిని చేసి ముగించాడు.  పురుషాధిక్య తా భావజాలానికి ప్రతీకలాగా కన్పిస్తోంది పద్మావత్. కానీ ఎంతో ఆరాధ్య దేవత  అయిపోయింది.  మెలోడ్రామా కలగలిసిన మనోభావాలతో పద్మావత్ ఆత్మాహుతిని చూపించి,  అక్కడి స్త్రీలని మాయ చేసి బానిసత్వంలో పడేస్తున్నాయి మూకలు. రేప్ జరిగే ప్రమాదముంటే ఆత్మాహుతి చేసుకోమని నెగెటివ్ సందేశమిస్తోంది. ప్రస్తుత సెక్సోన్మత్త సమాజానికి చాలా మంచి సందేశమేనేమో ఇది.  రేపుల రాష్ట్రాల్లో ఈ సందేశం అత్యవసరమేనేమో కూడా ఇప్పుడు.  

ఎవరెలా చేశారు 
టైటిల్ వచ్చేసి పద్మావత్ మీద,  కథ వచ్చేసి ఖిల్జీ మీద. చాలా భిన్నమైన తరహా గల పాత్రలేసే స్టార్ రణవీర్ సింగ్,  ఖిల్జీగా విలన్ పాత్ర పోషించాడు. అతి క్రూరంగా, చెత్తగా, చిల్లరగా, తన పెళ్లి సమయంలో కూడా అవతల ఇంకో అమ్మాయిని అనుభవించే కామాంధుడుగా,  పళ్ళు బయట పెట్టి వెకిలి చేష్టలు  పోయే శాడిస్టుగా, ఏ నీతీ రీతీ లేనివాడుగా నటించడంలో రణవీర్ కి మరెవరూ సాటిరారు. ఈ కథకి ఖిల్జీ పాత్ర విలన్ కాబట్టి ఎంత పచ్చిగా  చూపించాలో అంత పచ్చిగానూ  చూపించే సినిమాటిక్ లిబర్టీ పూర్తిగా తీసుకున్నాడు భన్సాలీ. నిజానికి ఖిల్జీ వ్యభిచారాన్ని నిషేధించాడనీ, వ్యభిచారిణులందరూ పెళ్లి చేసుకోవాలని ఆదేశించాడనీ, వ్యభిచరిస్తే మగాళ్ళకి లింగ విచ్చేధం, ఆడాళ్ళకి రాళ్ళ దెబ్బలూ శిక్ష విధించాడనీ, మద్యపానం, మాదకద్రవ్యాలు  పూర్తిగా నిషేధించాడనీ, స్త్రీలోలుడు కాదనీ, నల్గురు భార్యలున్నారనీ, వాళ్ళల్లో ఇద్దరు హిందువులనీ...ఇలా గొప్పలు చెప్పుకుంటూ పోతే ఈ పాజిటివ్ లు  విలన్ పాత్రకి  ఇమడవు. చరిత్ర కారుడు ఇర్ఫాన్ హబీబ్ ఈ సినిమా నుద్దేశించి చెప్పినట్టు, చరిత్రని చరిత్రలాగే సినిమా తీస్తే ఎంటర్ టైన్మెంట్ వుండదు. కాబట్టి ఖిల్జీని కావాల్సినంత  కైమా కింద కసకసా కొట్టేసి ఖుజ్లీ (దురద) నంతా తీర్చుకున్నాడు భన్సాలీ. ఇది మెచ్చదగిన అంశం. ఐతే అదే చేత్తో పద్మావత్ కి కాస్త రక్తమాంసాలు కూడా అద్ది వుంటే ఇంకెంతో  బావుండేది. 

          రణవీర్ ది హైపర్ యాక్టివ్ నటన పాత్రలాగే. అతను ఇంకో మెట్టు ఎదిగాడు. అతను  ఎంజాయ్ చేసే ‘ఖలీబలీ’  పాట డాన్సులో అతను అతి పవర్ఫుల్, ఎనర్జిటిక్కూ. ‘బాజీరావ్ మస్తానీ’ లో చారిత్రక పాత్రని ఎలానిలబెట్టాడో, అంతకన్నా ఖిల్జీతో విర్రవీగాడు - కోతికి కొబ్బరి కాయ  దొరికినట్టు. దీపికా పడుకునేతో తనకి ఒక్క సీనుకూడా వుండదు,  క్షణకాలం లాంగ్ షాట్ లో అస్పష్టంగా ఆమెని చూడ్డం తప్ప. తను అంతగా కోరుకుంటున్న ఆమెని వూహల్లోకి తెచ్చుకోవడం, డ్రీమ్  సాంగ్ వేసుకోవడం లాంటివి కూడా చెయ్యడు. ఇది అసహజ మన్పిస్తుంది  పాత్ర స్వభావ రీత్యా.  పద్మావత్ పావిత్ర్యాన్ని కాపాడే చిత్రణలో భాగంగా,   రణవీర్ పాత్రకి ఇలా అడ్డుకట్ట వేసినట్టున్నారు. ఇలా రణవీర్  పాత్రచిత్రణలో తేడా కొట్టింది.  పోరాటాల్లో రణవీర్ మాస్టర్. క్లయిమాక్స్ లో షాహీద్ కపూర్ తో కత్తి ఫైట్ తో గగుర్పాటు కల్గిస్తాడు. మొత్తం మీద ఇది రణవీర్ వన్ మాన్ షో చేసిన మూవీలాగా వుంటుంది.

షాహీద్ కపూర్ వచ్చేసి రాజా రతన్ సింగ్ పాత్రలో సౌమ్యుడు. ఆచితూచి మాట్లాడతాడు. రాజ్ పుత్ పౌరుషానికి కొమ్ముకాస్తాడు. రాజుగా నటన ఒకేగానీ, దీపికాతో కెమిస్ట్రీ కొరవడింది. పాత్రపరంగా చూస్తే రాజుగానూ,  మొదటి భార్యకి భర్తగానూ అంత కమిటెడ్ కాదనిపిస్తాడు. భార్యకి ముత్యాల కోసం బయల్దేరిన వాడు,  పద్మావత్ ని చూడగానే ప్రేమలోపడిపోయి పెళ్ళిచేసుకోవడానికే మాత్రం సంకోచించడు. భార్యపట్ల ఏ ఫీలింగూ వుండదు. ఇలాటి ప్రేమల్ని పవిత్రంగానూ, అమరంగానూ  చేస్తూంటాయి ఇలాటి చిత్రణలు. అలాగే, పద్మావత్ కోసం దాడి చేసి తనని ఖిల్జీ అపహరించుకుపోతే, పద్మావత్  విడిపించు కొచ్చినా - మళ్ళీ ఖిల్జీ  దాడికొస్తే బుద్ధి చెప్పే సరిక్రొత్త  చర్యలేవీ తీసుకోడు. ఖిల్జీ నుంచి పద్మావత్ కి మళ్ళీ ప్రమాదం తలెత్తకుండా  సైన్యాన్ని కూడా పటిష్టం చేసుకోడు. అవే కత్తులు తప్ప,  కొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకోడు. అటు రెండోసారి  ఖిల్జీ ఇంకా బలమైన ఆయుధ సంపత్తితో,  ప్రేలుడు పదార్ధాలతో అట్టహాసంగా వచ్చేసి, పెరేడ్ చేస్తూ ప్రాణం తీసిపోతాడు. స్థానిక రాజులు  ఆయుధాల విషయంలో అశక్తులేమో. దేశానికి పేలుడు పదార్ధాలని పరిచయం చేసింది ముస్లిం రాజులే. వాటితో దీపావళికి బాణసంచా తయారుచేసి పేల్చడం ప్రారంభించింది వాళ్ళే (ఎప్పుడో చదివిన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఎడిటోరియల్),  ఆ పేలుడు పదార్ధాలే టెర్రరిస్టుల చేతికి వచ్చాయి.

              ఇక రాణీ పద్మావత్ విషయం. ఈ పాత్రలో దీపిక సింహళ (శ్రీలంక) రాకుమార్తెగా, అతిలోక సౌందర్య రాశిగా,  రోమాంచితంగా జింకని వేటాడుతూ ఎంట్రీ ఇస్తుంది. అంటే తను యుద్ధ నైపుణ్యం గల సాహస వనితగా పరిచయమైంది. తర్వాత రాజు రతన్ సింగ్ ని ప్రేమించి (కవ్వించీ కవ్వించనట్టు కవ్వించి) పెళ్లి చేసుకుంటుంది. భార్య వున్న రాజుతో అలా ప్రవర్తించడానికీ, అంతటితో ఆగకుండా రెండో భార్యగా వెళ్ళడానికీ – ‘వీర వనిత’ అయిన ఆమె స్వతంత్ర వ్యక్తిత్వం ఏమైందో అన్నట్టుగా వుంది. సాటి స్త్రీ హక్కుల్ని లాక్కుంటున్నాన నే వివేచన కూడా వుండదు. ఇది కథానాయిక లక్షణమెలా అవుతుందో తెలీదు- కథకుడి పురుషాధిక్యతా భావజాలం తప్ప. 


రాణి అయ్యాక దీపికా గ్రేస్ ఫుల్ గా, పరమ పవిత్రంగా, ఆరాధ్యనీయంగా కన్పిస్తుంది. మనం కళ్ళప్పగించి చూస్తూ వుండాల్సిందే టాలెంటెడ్ నటిని. రెండో భార్య గంగావతి   (అనూప్రియా గోయెంకా) పాత్రకి ప్రాధాన్యం లేదు. ఆమెతో పద్మావత్ సంబంధాల ఎస్టాబ్లిష్మెంట్ కూడా లేదు. అటు గయ్యాళి అయిన ఖిల్జీ మొదటి భార్యతో కొత్త భార్య మెహరున్నిసా సంబంధాలు కూడా చూపరు. ఖిల్జీ – పద్మావత్ – రతన్ ల ట్రయాంగులర్ సూటి కథకి ఇవి అడ్డు అని పక్కన పెట్టారనుకోవచ్చు ఓకే, అయితే టైటిల్ రోల్ లో పద్మావత్ గా దీపికని చూపింది  ఎంత? 

          ఏదో రెండు సార్లు యుద్ధ వ్యూహం గురించి రెండు ముక్కలు సలహా లివ్వడం, భర్తని ఖిల్జీ అపహరించుకుపోతే వెళ్లి వ్యూహాత్మకంగా విడిపించుకుని తప్పించుకురావడం తప్ప ఏమున్నాయి?  ఇలా వచ్చాక, మళ్ళీ ఖిల్జీ యుద్ధానికి వస్తున్నాడని తెలిసి  – భార్యగా నా జౌహర్ (ఆత్మాహుతి) హక్కుని వినియోగించుకోవాలంటే భర్తగా మీ అనుమతి కావాలని భర్తని కోరుతుంది. అంటే యుద్ధంలో భర్త చనిపోతాడనా? అలా అనుకుంటుందా భార్య ఎక్కడైనా? జౌహర్  అప్పుడున్న ఆచారమే, అలాగే చేస్తారు నిజమే. అప్పుడు  దాన్నెలా చిత్రీకరించాలి?  భర్త యుద్ధంలో చనిపోతే అప్పుడు తను శత్రువు చేతికి చిక్కకుండా ఆత్మాహుతి చేసుకునే ఆచారమది. దీనికి భర్త అనుమతి ఏమీ అవసరం లేదు. భర్త చనిపోవచ్చని ముందస్తు  అనుమతి అడగడం సినిమాలో డ్రామా కోసమే. ఈ డ్రామా బ్యాడ్ టేస్టుతో  వుంది పాత్రల్ని కిల్ చేస్తూ. 

          నేనలా మరణించను, వీరుడిగా తిరిగొస్తానని ఆమెకి హామీ ఇవ్వకుండా,  జౌహర్ వరమిచ్చేస్తాడు! దీంతో ప్రేక్షకులకి ముందేం జరుగుతుందో కూడా చెప్పేస్తున్నారు. మొదట్లోనే చెప్పుకున్నట్టు మితిమీరిన భక్తిభావపు వెల్లువలో తనే కొట్టుకుపోయాడు దర్శకుడు కథని వదిలేసి. మరి పెద్ద భార్య సంగతి? జౌహర్ క్రెడిట్ పద్మావత్ కేనా? ఎందుకు ఈ పాత్ర ఇలా స్వార్ధంతో దిగజారి పోతోంది? అప్పుడే చావుల గురించెందుకు? ఎవడో ఖిల్జీ గాడు తనని మోహిస్తూంటే తన సింహళ నారి వ్యక్తిత్వం, పౌరుషం ఏమయ్యాయి? వాడు తనకోసం మళ్ళీ యుద్ధానికొస్తూంటే భర్తని ముందుకు తోసి, అతను చనిపోతాడని దేవుడా అని ఆత్మాహుతి ఏర్పాట్లు చేసుకుంటుందా – లేక భర్తతో పాటూ  వెళ్లి అమీతుమీ తేల్చుకుంటుందా? మానంకోసం పోరాడి చనిపోతే ఆ మరణం ఉత్తమ మైనది  కాదా? రేపిస్టుతో ఎదురెళ్లి పోరాడకండి, తలుపేసుకుని కిరసనాయిలు పోసుకోండని సందేశాలివ్వడమా? భక్తి  ఎక్కువైపోయే   మేల్ షావెనిజాన్ని భన్సాలీ ఇలా పతాక స్థాయికి చేర్చాడు. పద్మావత్ తో బాటు స్త్రీలందరూ సామూహికంగా అగ్నికి ఆహుతి చేసుకునే ఘట్టాన్ని అద్భుతమైన దృశ్య కావ్యంలా తీర్చి దిద్దాడు.

          భన్సాలీ సంగీతంలో దీపికా మీద ‘ఘూమర్’ సాంగ్, రణవీర్ మీద ‘ఖలీబలీ’ సాంగ్ రెండూ  బావున్నాయి. సుదీప్ చటర్జీ కెమెరా వర్క్ భన్సాలీ స్థాయిలోనే వుంది. సీజీ వర్క్, సెట్స్, లొకేషన్స్ అన్నీ క్లాస్ గా వున్నాయి. శ్యామ్ కౌశల్ యాక్షన్ సీన్స్, వాటి విజువల్స్ థ్రిల్లింగ్ గా వున్నాయి. మేకింగ్ లో ఈసారి కూడా భన్సాలీ ప్రతిభ కనబర్చాడు గానీ, ఐతే ఇదంతా డిజైనర్ చరిత్ర. దుస్తులుగానీ, ఆభరణాలు గానీ ఈ కాలపు హంగులు. అలాగే కంటెంట్ విషయాని కొచ్చేసరికి ఖిల్జీ కథ చెప్పాడు, చివర్లో దాని పరిష్కారం మాత్రమే  పద్మావత్ చేతిలో పాసివ్ గా పెట్టాడు.

చివరికేమిటి 
చెడు వైపునుంచి కథ చెప్పడం, ఆ చెడుకి ఖిల్జీని ప్రతినిధిని  చేయడం, లక్ష్యాన్ని అతడికే కల్పించడం, దీంతో అతడి లక్ష్యం కోసం సాగే కథగా మారడం, ఆ కథనెదుర్కొనే బాధితులుగా పద్మావత్, రతన్ లు మిగిలిపోవడం స్క్రీన్ ప్లే బలహీనతలు. ఇది పద్మావత్ కథనుకుంటే బాధితురాలిగా మాత్రమే ఆమె కథ.  ఇదొక జానపద గాథే అయినా ఇది పాత్రపరంగా గాక, ఒక ఆచార పరంగా సెట్ అయిన గాథ కాబట్టి,  పద్మావత్ యాక్టివ్ పాత్ర అయి పోరాటం చేసే అవకాశం లేకుండా పోయింది. ఆమె భర్త చాటు కెళ్ళిపోయి, ఆ భర్త కూడా యాక్టివ్ గా కాకుండా, విలన్ వచ్చినప్పుడల్లా రియాక్టివ్ గా  పోరాటం చేసే వాడుగా వుండడంతో- కథగా మెప్పించడం కష్టమైపోయింది. స్క్రీన్ ప్లే పరిభాషలో చూస్తే ఖిల్జీ విలన్ పాత్ర కూడా అవడు, యాంటీ హీరో అవుతాడు. పాత్ర పోషించిన నటుడు కూడా విలన్ పాత్రధారి కాదు - పాపులర్ స్టార్. అయితే యాంటీ హీరో కెప్పుడూ శిక్షే వుంటుంది. కానీ ఇది చారిత్రక గాథ అన్నారు కాబట్టి యాంటీ హీరో అయినా ఖిల్జీని శిక్షించే అవకాశం లేకుండా పోయింది.  కాబట్టి కథ అనుకుని ఈసినిమా చూడకుండా,  గాథగా చూసినప్పుడే కన్విన్స్ అవగల్గుతారు – సందేశం సంగతి పక్కన పెడితే.

సికిందర్






,