రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, November 13, 2016

స్క్రీన్ ప్లే సంగతులు!

        


    

యాక్సిడెంట్ దృశ్యాన్ని కళాత్మకం చేస్తూ ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేయడం, హీరో ని ఇంకో అవతారంలో  చూపిస్తూ ప్లాట్ పాయింట్ టూని సృష్టించడం, టైం లాప్స్ ని టైమర్ ద్వారా చూపించడం వంటి మూడు వినూత్న స్క్రిప్టింగ్  టెక్నిక్స్ ని ప్రదర్శించిన స్క్రీన్ ప్లే తో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సకాలంలో మూడేళ్ళ క్రితమే ప్రేక్షకుల ముందు కొచ్చి వున్నా, అలరించాలంటే, మౌలికంగా కథతో పాత్రతో వున్న సమస్యలు తలనొప్పిగానే వుంటాయి. దర్శకుడు గౌతమ్ మీనన్ నాగచైతన్య పాత్రని  ‘గాడ్ ఫాదర్’ లోని గాడ్ ఫాదర్ చిన్న కొడుకు మైకేల్ కార్లియోన్ స్ఫూర్తితో సృష్టించామన్నారు. ఇతను దుష్ట పోలీసు అధికారి కెప్టెన్ మార్క్ మెక్ క్లస్కీ మీద పగదీర్చుకునే అంశం ఆధారంగా కథ చేశామన్నారు. అయితే మీనన్ మిస్ అయ్యిందేమిటంటే,  మైకేల్ పగకి తన తండ్రి మీద మెక్ క్లస్కీ చేసిన హత్యాయత్నం అనే కారణంతో ప్రత్యక్ష భావోద్వేగాలున్నట్టు, నాగచైతన్య పాత్రకి కల్పించక పోవడం. కారణం, మీనన్ కథలో పోలీసు అధికారి వచ్చేసి హీరోయిన్ కుటుంబానికే హాని చేయడం....

         ఇందుకే కావొచ్చు, మీనన్ వేరే టర్న్ తీసుకున్నారు- తనకి సంబంధం లేని గొడవలో నాగచైతన్య పాత్ర  చిక్కుకుని, ఆత్మ రక్షణ కోసం హత్యలు చేయాల్సివస్తున్న పరిస్థితితో ఆ పోలీసు అధికారితో తలపడే పాత్రగా చేయాలనుకున్నారు. మరి దీని మీదైనా ఎంతవరకు నిలబడ్డారు?

        అసలు ఒక లైనుగా చెప్పుకోవాలంటే ఈ కథని ఎలా చెప్పుకోవాలి? ఓ సామాన్య  యువకుడు అనుకోకుండా ఓ హింసాత్మక సందర్భంలో ఇరుక్కుంటే ఏమవుతుంది?- అని చెప్పుకోవచ్చా? కథ చూస్తే ఇలాగే వుంది. ఈ కథకి  ఐడియా ఇదే అయితే, ఇందులో బిగినింగ్ (సామాన్య యువకుడు), మిడిల్ (అనుకోకుండా ఓ హింసాత్మక సందర్భంలో ఇరుక్కోవడం), ఎండ్ (అప్పుడేమవుతుంది?) మూడూ కన్పిస్తాయి. సమస్య ఎక్కడ వచ్చిందంటే,  అప్పుడేమవుతుంది? అన్న ప్రశ్నకి  చూపించిన  పరిష్కారం దగ్గరే సమస్య వస్తోంది. కథలో చూపించిన ప్రకారం- ఓ సామాన్య యువకుడు అనుకోకుండా ఇరుక్కున్న ఓ హింసాత్మక సందర్భాన్ని తనే పోలీసు అధికారిగా మారి పరిష్కరించుకున్నాడు-అనే అర్ధంలోనే  ఈ లైను వస్తోంది. చివరికతను పోలీసు అధికారిగానే మారిపోయి సమస్య పరిష్కరించుకున్నాడన్న మాట ఈ క్లయిమాక్స్ లో.

       ఇందులో తప్పేం లేదు, ఇది మూస ఫార్ములా మాస్ కథ అయివుంటే ఈ అవాస్తవిక, ఆచరణ సాధ్యం కాని- కాలక్షేపానికి పనికొచ్చే పరిష్కార మార్గంతో ఎలాటి అభ్యంతరం వుండదు. అయితే ఈ సినిమా జానర్ వచ్చేసి, ఇలా పోలీసు అధికారిగా మారిపోయే సినిమాటిక్- అవాస్తవిక -మూస ఫార్ములా మాస్ జానర్ కాదు. అంతవరకూ బిగినింగ్, మిడిల్ లతో రియలిస్టిక్ అప్రోచ్ తో నడుస్తున్న సెమీ రియలిస్టిక్ జానర్ ఇది. దీనికి ప్రేక్షకులకి పని కొచ్చే- జీవితాల్లో సాధ్యమయ్యే  రియలిస్టిక్ పరిష్కారమే చూపించాలి. ఇదే జరగలేదు. సెమీ రియలిస్టిక్ కథకి మూస ఫార్ములా ముగింపు ఇచ్చి జానర్ మర్యాదని చెడగొట్టుకున్నారు. ఎండ్ విభాగంలో నాగచైతన్య ధూమ్ ధామ్ చేస్తూ డీసీపీ రజనీ కాంత్ గా వస్తే, ఇందుకే నవ్వుకున్నారేమో కొందరు ప్రేక్షకులు. అంతవరకూ మన కెదురైతే మనమెలా సమస్యతో స్ట్రగుల్ చేస్తామో అలా సహజంగా స్ట్రగుల్ చేస్తూ వున్న నాగచైతన్య పాత్ర – ఉన్నట్టుండీ  డీసీపీ రజనీకాంత్ గా వస్తే- నవ్వకేం చేస్తారు. జీవితంలో మనకి సాధ్యమవుతుందా రజనీకాంత్ లా రావడం? సాధ్యం కాని పరిష్కారా లెందుకు. కాలక్షేపానికైతే సినిమా సాంతం కాలక్షేప బఠానీ లాగే చూపించుకు రావాలే తప్ప- రియలిస్టిక్ గా చూపించుకొస్తూ- వేళాకోళం కాలక్షేపంగా ముగిస్తే – ఆడియెన్స్ మూడ్ ని చెడగొట్టినట్టే.

                                                                     ***
      చెప్పొచ్చేదేమిటంటే, ఐడియాలోనే అంతా వుంటుందని- దర్శకుడు, హీరో, నిర్మాత అందరి జాతకాలూ దాంతోనే ముడిపడి వుంటాయని.  చూడాలా వద్దా అని ప్రేక్షకులు భయపడకుండా చూడగలిగే భద్రత కూడా ఐడియాలోనే వుంటుందని. పది నెలలు కథని రాసుకుంటూ కూర్చునే ముందు ఓ నెల పాటు ఐడియాతో తలపడాలని. మీనన్ ఐడియాకి వచ్చేసి మార్కెట్ యాస్పెక్ట్ తో బాటు క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా కొరవడ్డాయి. మార్కెట్ యాస్పెక్ వచ్చేసి ఆయన ఐడియాకి – రియలిస్టిక్  సినిమా + టార్గెట్ ప్రేక్షకులు యువకులే (యువతులు కాదు) + జానర్ మర్యాదగా వుండాలి. క్రియేటివ్ యాస్పెక్ట్ వచ్చేసి- ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ + లాగ్ లైన్ గా వుండాలి. మీనన్ ఐడియాకి మార్కెట్ యాస్పెక్ట్ ఎలా వుందో పైన చూశాం. ఇక క్రియేటివ్ యాస్పెక్ట్ విషయాని కొస్తే – ఆర్గ్యుమెంట్, స్ట్రక్చర్, లాగ్ లైన్ ఈ మూడూ కుదిరేదాకా ఐడియా మీద వర్క్ చేశాకే, స్క్రిప్టుతో  ముందు కెళ్లాలన్న గుణపాఠాన్ని వారం వారం ఎన్నో సినిమాల్లాగే ఇదీ నేర్పుతోంది. ఐడియా డీఎన్ఏ బాగోకపోతే ఇంకేదీ బాగోదు. జెనెటిక్ ఇంజనీరింగ్ చాలా అవసరం. 

        కరణ్ జోహార్ తీసిన తాజా  ‘యే దిల్ హై ముష్కిల్’ కూడా సరీగ్గా మీనన్ పోకడలే పోయిందని గమనించవచ్చు. అల్ట్రా మోడరన్ ప్రేమ కథకి పాత మూస ఫార్ములా రొటీన్ ముగింపుతో జానర్ మర్యాద చెడింది.


***
బిగినింగ్ :
       
హీరో స్వగతంతో ప్రారంభమవుతుంది కథ. తనకి జరిగింది ఏదో అస్పష్టంగా చెబుతూంటే దాని తాలూకు మాంటేజెస్ పడుతూంటాయి. హింస, రక్తపాతం దృశ్యాలూ, ఒక రాజకీయ నాయకుడి క్రౌర్యమూ  కన్పిస్తాయి. ఈ కవరింగ్ ఇచ్చాక, హీరో జీవితంలోకి వస్తుంది కథ. తల్లిదండ్రులతో, ఒక చెల్లెలితో వుండే హీరో,  ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం రాక, ఎంబీఏ చేసి ఉద్యోగమూ రాక, ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తూంటాడు. ఓ రోజు చెల్లెలి ద్వారా హీరోయిన్ పరిచయమవుతుంది. ఈమె స్క్రీన్ ప్లే కోర్సు చేస్తూంటుంది. ఈమెని చూసి ప్రేమలో పడతాడు హీరో. కానీ వ్యక్తం చేయలేకపోతాడు. కన్యాకుమారి వెళ్లి సూర్యోదయం చూడాలనుకుంటాడు. వెంట ఈమె కూడా వెళ్తుంది. బైక్ జర్నీ. ఈ జర్నీలో ఒకరికొకరు దగ్గరవుతారు. తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు చనిపోతున్నాననుకుని ఆమెకి ప్రేమని వ్యక్తం చేస్తాడు. 

మిడిల్ -1 :
       
హాస్పిటల్లో హీరో బతికి ఉంటాడు. హీరోయిన్ తనని హాస్పిటల్లో  చేర్పించి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. తర్వాత ఫోన్ చేసి, తన తల్లిదండ్రుల్ని ఎవరో చంపాలని చూశారనీ అందుకే కొల్హాపూర్ వచ్చేశాననీ అంటుంది. ఎవరు ఎందుకు చంపాలనుకున్నారో చెప్పలేకపోతుంది. తామిద్దరికీ జరిగింది కూడా యాక్సిడెంట్ కాదనీ, అది తనని చంపాలనుకుని చేసిన ప్రయత్నమనీ అంటుంది. తన తల్లిదండ్రులు సహా తనని చంపెయ్యాలని చూస్తున్నారనీ అంటుంది. హీరో అక్కడికి బయల్దేరతాడు. అక్కడ హీరో హాస్పిటల్లో లో వుండగానే మళ్ళీ దుండగులు హీరోయిన్ తల్లిదండ్రుల మీద ఎటాక్ చేస్తారు. ఒక ఎస్సై వీళ్ళకి సహకరిస్తాడు. ఆ ఎస్సై రివాల్వర్ లాక్కుని అతన్ని చంపేస్తాడు హీరో. దుండగుల మీద కాల్పులు జరిపితే వాళ్ళు పారిపోతారు. ఎస్సైని చంపి తను ప్రమాదంలో  పడ్డానని హీరో ఆందోళన చెందడంతో ఇంటర్వెల్ పడుతుంది.

మిడిల్ - 2 :
        తనని పట్టుకోబోయిన ఇన్స్ పెక్టర్ తో కలబడి కాల్పులు జరిపి హీరోయిన్ సహా ఆమె తల్లిదండ్రుల్ని అంబులెన్స్ ఎక్కించుకుని పారిపోతాడు హీరో. అంబులెన్స్  మీద దుండగులు దాడి జరుపుతాడు. వాళ్ళని చంపేస్తాడు హీరో. తనకి తెలిసిన ఒక డాక్టర్ వున్నాడని చెప్పి అక్కడికి తీసి కెళ్తుంది హీరోయిన్. అక్కడ తల్లిదండ్రులకి ట్రీట్ మెంట్ చేస్తూంటే, ఇన్స్పెక్టర్ దుండగులతో వచ్చేసి దాడి జరుపుతాడు. ఆ దాడిని తప్పించుకుని హీరోయిన్ తో పారిపోతాడు హీరో. ఆమె తల్లి దండ్రులు చనిపోతారు. రక్షించాల్సిన పోలీసే ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేక పోతాడు హీరో. వీళ్ళ కారణంగా తను నేరస్థుణ్ణి అయ్యానని బాధ పడతాడు. అసలు ఎందుకు ఈ కుట్ర చేస్తున్నారో తెలుసుకోవాలని  హీరోయిన్ తో అంటాడు. ఆ ఇన్స్ పెక్టర్ని కూడా వదిలేది లేదని  అంటాడు. 

ఎండ్ :
       
రెండున్నరేళ్ళు గడిచిపోతాయి. అదే ఇన్స్ పెక్టర్ వున్న స్టేషన్ కి హీరో డిసిపిగా వచ్చేసి షాకిస్తాడు. అప్పుడు చెప్పుకొస్తాడు. ఈ రెండున్నర ఏళ్ళల్లో చాలా తెలుసుకున్నాననీ, హీరోయిన్ ఒక రాజకీయ నాయకుడికి పుట్టిన కూతురనీ, ఇది ఒప్పుకోవాలనీ  ఆమె తల్లి అంటే, తన రాజకీయ జీవితం దెబ్బ తింటుందని అతను ఒప్పుకోలేదనీ, దీంతో తిరగబడ్డ ఆమె తల్లినీ, పెంపుడు తండ్రినీ హీరోయిన్ సహా చంపేసి తన రాజకీయ ఎదుగుదలకి అడ్డంకులు తొలగించుకోవాలనే ఇదంతా చేశాడనీ, ఇందుకు ఇన్స్ పెక్టర్ చేతులు కలిపాడనీ  వెల్లడిస్తాడు హీరో. ఈ మొత్తం కుట్ర దారుల్ని పట్టుకోవడానికే ఈ రెండున్నరేళ్లల్లో యూపీపీఎస్ చదివి, ఐపీఎస్ ట్రైనింగై, డీసీపీగా ఇలా వచ్చాననీ అంటాడు. ఇంతలో రాజకీయ నాయకుడు వచ్చేస్తాడు. అతణ్ణి లాకప్ లో వేయిస్తాడు హీరో. తప్పించుకోవడానికి కాల్పులు జరిపిన ఇన్స్ పెక్టర్ తో కలబడి అతణ్ణి చంపేస్తాడు హీరో. ఇక హీరోయిన్ తో తన ప్రేమని పండించుకుంటాడు.
                                                          ***సమాప్తం***

      ఈ కథలో బిగినింగ్ లో యాక్సిడెంట్ అవడం దగ్గర ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతోంది. ఇక్కడ్నించీ  మిడిల్ రెండు విభాగాలూ సమస్యతో సంఘర్షణ జరిగి, హీరో అదృశ్యమవడం దగ్గర ప్లాట్ పాయింట్ టూ ఏర్పడుతోంది. ప్లాట్ పాయింట్ టూ అనేది సంఘర్షణకి ఒక పరిష్కార మార్గం కనుగొనే ఘట్టం. అంటే హీరో ఇక్కడ తను ఐపీఎస్ అయితేనే సమస్యని పరిష్కరించుకోగలనని భావించుకుని డిసిపిగా మారి తిరిగి వస్తూ, ఎండ్ విభాగాన్ని ప్రారంభించాడన్న మాట. మిడిల్ టూ చివర్లో ఇన్స్ పెక్టర్ అగడాల్ని చూపిస్తున్న దృశ్యాల మీద  టైమర్ ని రన్ చేయడం ప్రారంభిస్తాడు దర్శకుడు. ఈ టైమర్ 1,2,3...ఇలా గడిచిపోతున్న రోజుల్ని సూచిస్తూ,  945 వ రోజుకి ఆగిపోతుంది. ఇప్పుడు డిసిపిగా హీరో ఎంటర్ అవుతాడు. టైం లాప్స్ చూపించడానికి వాడిన ఈ టెక్నిక్  ఆటోమేటిగ్గా ప్రేక్షకుల్ని భవిష్యత్తులోకి  ట్రావెల్ చేసేలా చేస్తుంది- ఎలాటి జంప్ కట్, జెర్కులూ లేకుండా ఇది బాగానే వుంది. సాధారణంగా ‘రెండేళ్ళ తర్వాత’ అని అక్షరాలు వేసో, డిజాల్వ్ చేసో లూ టైంలాప్స్ చూపిస్తూంటారు. దీనికి భిన్నంగా చూపెట్టారిక్కడ. ఈ టైమర్ రన్ అవుతూంటే ఒకరకమైన సస్పెన్స్ కూడా ఏర్పడుతుంది.  ఈ రోజుల లెక్క తర్వాత ఇంకే  సంఘటన జరుగుతుందోనని. ఆ సంఘటనే డిసిపి రజనీ కాంత్ గా హీరో రావడం. 

        ప్లాట్ పాయింట్ వన్ లో యాక్సిడెంట్ జరగడం ఈ కథకి మొదటి మలుపన్నాం. ఈ యాక్సిడెంట్ లో ఓ లారీ డివైడర్ ఎక్కేసి హీరో బైక్ కి ఎదురు వచ్చేయడంతో జరుగుతుంది. ఇలా డాష్ ఇచ్చినట్టు చూపించి, వెంటనే కట్ చేసి, సాంగ్ ప్రారంభించారు.  ఇక్కడ ఉన్నట్టుండి పాట రావడం వెంటనే జీర్ణం కాకపోయినా, మేనేజ్ చేశారు. ఈ పాట వస్తూంటే అప్పుడు మాంటేజెస్ ద్వారా ఈ యాక్సిడెంట్ బిగినింగ్- మిడిల్- ఎండ్ లతో కలుపుకుని ఓ కథలా అవిష్కరించారు. బహుశా ఏదో మ్యూజిక్ వీడియో స్ఫూర్తి కావొచ్చు. ఈ పాట నేపధ్యంలో యాక్సిడెంట్ ఎలాగెలా జరిగిందో వివరంగా, గ్రాఫికల్ గా చూపించుకొస్తారు. ఈ పాట హీరో వేదన. చనిపోతున్న తనని వదిలేసి వెళ్ళ వద్దంటూ హీరోయిన్ కి నివేదించుకుంటూంటాడు.

         ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ అనే మొదటి మలుపుని విజువల్ గా యాక్షన్ లో చూపించాలనే సూత్రం ప్రకారం ఇలా దృశ్యీ కరిస్తూ బలంగా రిజిస్టర్ చేశారు. దీన్ని హింసాత్మకంగా కాకుండా, కళాత్మకంగా చిత్రీకరించడంతో వన్నె చేకూరింది. ఇలాటి డైలాగులతో కాకుండా దృశ్యాత్మక ప్లాట్ పాయింట్ వన్ లు ‘భజరంగీ భాయిజాన్’ లో లాగా, ‘24’ లో లాగా విజువల్ యాక్షన్ తో బాగా గుర్తుండి పోతాయి. కరణ్ జోహార్  ‘యే దిల్ హై ముష్కిల్’  లో కూడా ప్రేమకథలో అద్భుతంగా ప్లాన్ చేసిన గుర్తుండిపోయే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టాన్ని సృష్టించారు. తెలుగులో కేవలం ఇంటర్వెల్ బ్యాంగు లంటూ లో- గ్రేడ్ రచన చేస్తూంటారు. ఇంటర్వెల్ బ్యాంగే కాకుండా,  రెండు ప్లాట్ పాయింటుల దగ్గరా ఇంకో రెండు బ్యాంగులు కూడా వుంటాయని ఎప్పటికీ తెలుసుకోరు. 

        మీనన్ కథకి  ప్లాట్ పాయింట్లు  రెండూ విజువల్ యాక్షన్ తో ( ఒకటి,  యాక్సిడెంట్- రెండు, డిసిపి రజనీ కాంత్ గా హీరోఎంట్రీ) ఉత్తేజం కల్గిస్తాయి. దీన్ని సమసౌష్టవం అంటారు, శిల్పం అంటారు, శైలీ అని కూడా అంటారు.

        అయితే ఈ రెండు ఘట్టాల్నీ అర్ధాన్ని జోడించి చూస్తే  మాత్రం ఇవి విలువ కోల్పోతాయి. ఉత్తుత్తి తాటాకు చప్పుళ్ళా వుంటాయీ బ్యాంగులు. కేవలం కమర్షియల్ గిమ్మిక్కే తప్ప- జానర్ మర్యాద కాదు. జానర్ మర్యాద ప్రకారమైతే ప్లాట్ పాయింట్ టూ లో హీరో కనుగొనే పరిష్కార మార్గం ప్రాక్టికల్ గా, రియలిస్టిక్ గా ఉండాల్సిన అవసరముంది. అలాగే ప్లాట్ పాయింట్ వన్ సజీవంగా హీరో పాత్రలోంచి పుట్టాల్సి వుంది.
***
       ఇలా రెండు ప్లాట్ పాయింట్స్, మధ్యలో హత్యలో ఇరుక్కున్న ఆందోళనతో సామాన్యుడైన హీరో మీద ఇంటర్వెల్ బ్యాంగ్ - ఈ మూడు మలుపులూ లేదా మూల స్థంభాలూ పైకి చూడడానికి అలంకరణతో  బాగానే కనిపిస్తాయి. గట్టి దనం చూస్తే తేలిపోతాయి. కథకి కావాల్సిన ఆస్థి పంజరాన్ని బాగానే తయారుచేశారు. అందులో రక్తమాంసాలు కూర్చడం దగ్గరే విఫలమయ్యారు. కథకి అస్థిపంజరం, రక్తమాంసాలూ హీరో పాత్రకే చెందినవై వుంటాయనీ, ఇంకెవరికీ హక్కులుండవనీ  గుర్తుంచుకుంటే ఇలా జరగదు.

        కథ ఎక్కడ్నించో పుట్టదు, కథ ఎప్పుడైనా హీరో పాత్రలోంచే పుడుతుంది. హీరో పాత్రలోంచే కథ పుడుతుందనడానికి సింపుల్ ఉదాహరణ- హీరో ఏదో చేయాలను కుంటాడు. అది చేయకుండా అడ్డు తగలడానికి విలన్ పుట్టుకొస్తాడు. అంటే హీరో ఏమీ చేయాలనుకోక పోతే విలనేమీ పుట్టుకురాడన్న మాట. హీరో పాత్రలోంచే కథే కాదు, విలన్ కూడా పుడతాడన్న మాట-  బుష్ ఏదో అనుకుంటేనే బిన్ లాడెన్ పుట్టుకొచ్చినట్టు. రాముడు వనవాసాని కెళ్తేనే రావణుడనే వాడు పుట్టి కాచుక్కూర్చున్నట్టు. ‘శివ’ లో నాగార్జున జేడీని సైకిలు చైనుతో కొడితేనే కథ పుట్టింది. ‘ఒక్కడు’ లో మహేష్ బాబు భూమికని కాపాడుకొస్తేనే కథ పుట్టింది. 

        ఇలా మీనన్ కథలో ప్లాట్ పాయింట్ వన్ యాక్సిడెంట్  సంఘటన హీరో పాత్రలోంచి పుట్టలేదు. హీరోయిన్ తల్లి రాజకీయ నాయకుడితో, హీరోయిన్ కి అతడి కూతురిగా గుర్తింపు కోసం గొడవపడిన ఫలితంగా, అతను తీసుకున్న నిర్ణయం కారణంగా, ఆ తల్లిదండ్రులతో బాటు,  హీరోయిన్నీ చంపేసే పథకంలో భాగంగా, జరిపించిన యాక్సిడెంట్ మాత్రమే అది. కాబట్టి ఈ కథ హీరో పాత్రలోంచి పుట్టలేదు. హీరోయిన్ పాత్రలోంచీ పుట్టలేదు- ఎందుకంటే కన్యాకుమారి వెళ్దామని తను బయల్దేరదీయలేదు, తనే హీరో వెంట వెళ్ళింది. కాబట్టి ఆమె వైపు నుంచీ కాజ్ అండ్ ఎఫెక్ట్ సైకిల్  మొదలవలేదు. అందువల్ల ఈ కథ ఆమె తల్లి పాత్రలోంచి మాత్రమే పుట్టిందని అర్ధం జేసుకోవాలి. తల్లి పాత్ర  రాజకీయ నాయకుడితో గొడవ పడ్డం కాజ్- దాని ఎఫెక్టే మిగతా జరిగిన, హీరోకి సంబంధం లేని సంఘటనలన్నీ.

        ఇక్కడే తప్పులో కాలేశారు. ఇందుకే హీరో పాసివ్ రియాక్టివ్ గా ఉండిపోయాడు- ఈ హత్యలు ఎవరు చేయిస్తున్నారో తెలుసుకోలేకపోతూ. రియాక్టివ్ అంటే, ఎవరు దాడులు చేస్తున్నారో తెలుసుకోకుండా ఎంత సేపూ ఆత్మ రక్షణ చేసుకుంటూ, దాడుల్ని తిప్పి కొడుతూ కూర్చునే వాడన్న మాట. యాక్టివ్ అయితే, విలన్ ఎవడో తెలుసుకుని తనే వాడి భరతం పట్టడం మొదలెడతాడు. ఇందుకే ప్లాట్ పాయింట్ టూ లో అమాంతం డిసిపి అవతారం ఎత్తాడు. బండ గుర్తు- ఎప్పుడైతే ప్లాట్ పాయింట్ వన్ మలుపు హీరో పాత్రలోంచి రాదో, అది అర్ధవంతంగా కూడా ఉండదో, అప్పుడు ప్లాట్ పాయింట్ టూ కూడా అర్ధం లేకుండా తయారై ముగింపు తేలిపోతుంది. ఇందుకే ఈ కథలో హీరో డిసిపిగా రాగానే ఆ ఒక్క సీనుతోనే  అవకతవకగా ముగిసిపోయింది కథ.  

        అసలు బిగినింగ్ విభాగపు బిజినెస్ ఏమిటి? పాత్రల్ని పరిచయం చేయడం, కథా  నేపధ్యాన్ని ఏర్పాటు చేయడం, ప్లాట్ పాయింట్ వన్ సంఘటనకి దారి తీయించే పరిస్థితుల కల్పన చేయడం, ప్లాట్ పాయింట్ వన్ సంఘటనని సృష్టించడం, దాంతో బిగినింగ్ విభాగాన్ని ముగించడం. ఇంతే కదా, ఇది కూడా చూసుకోకపోతే ఎలా? మీనన్ కథలో ప్లాట్ పాయింట్ వన్ సంఘటనకి దారి తీయించే పరిస్థితుల కల్పన ఏది? ఇదే లేకపోయాక ఇక జవజీవాలేముంటాయి సంఘటనలో? ఆ యాక్సిడెంట్ జరగడానికి దారి తీయించే పరిస్థితుల కల్పన చేయకుండా, సడెన్ గా యాక్సిడెంట్ సృష్టించడం ఎలా సమగ్రమైన ప్లాట్ పాయింట్ వన్ అవుతుంది? 

        ఈ పరిస్థితుల కల్పన చేయాలంటే హీరోయిన్ తల్లి కథని  ఓపెన్ చేయాలి. ఇది బిగినింగ్ విభాగంలో చేయకూడదు కాబట్టి ఆ పరిస్థితుల కల్పనకి సాధ్యం కాలేదు. కథ ఆమె పాత్రలోంచి పుట్టినప్పుడు ఏదీ సాధ్యం కాదు. ఇందుకే  బిగినింగ్ విభాగపు అతి ముఖ్య బిజినెస్ అయిన పరిస్థితుల కల్పన అనే విలువ ఆవిరైంది. 

        ఒకవేళ మొదట హీరో స్వగతంగా చెబుతూ ప్రారంభించిన, మాంటేజెస్ లో కన్పించే క్రూరుడైన రాజకీయనాయకుడి కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగిందని మనం అనుకోవాలన్నా, అది దర్శకుడు మనల్ని తప్పు దోవ పట్టించడం అవుతుంది- ఎందుకంటే, ఆ విలన్ (రాజకీయ నాయకుడు) తో హీరో కె సంబంధమూ లేదు కాబట్టి. అప్పుడా స్వగతం వేయడమే అర్ధరహితమైపోతుంది.
***
      హీరో పాత్ర ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథ పుట్టించే అవకాశాన్ని దర్శకుడి పుణ్యాన మిస్ చేసుకున్నా, ఇంటర్వెల్లో మరో ఛాన్సు దొరికింది. దీన్ని కూడా దర్శకుడు లాగేసుకున్నాడు. ఇంటర్వెల్ ఘట్టంలో హీరో ఎస్సైని అతడి రివాల్వర్ తో చంపి ఆ హత్యాయుధం రివాల్వర్ పట్టుకుని  దిమ్మదిరిగిపోయి నిలబడిపోతాడు. తను హత్య చేశాడన్న ఎవేర్ నెస్ తో భయపడతాడు. ఇది ఆత్మరక్షణ కోసం జరిగిందని నిరూపించ వచ్చని హీరో ఫ్రెండ్ అంటాడు. స్టోరీ అయిడియా ఇదే అయితే, ఓ సామాన్య  యువకుడు అనుకోకుండా ఓ హింసాత్మక సందర్భంలో ఇరుక్కుంటే ఏమవుతుంది?-అన్న పాయింటు ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇక్కడ హీరో హత్య చేశాడు కాబట్టి ఈ హత్య చేయడంలోంచి (తనలోంచి)  కథ పుట్టింది. ప్లాట్  పాయింట్ వన్ దగ్గర యాక్సిడెంట్ లో కథ తన లోంచి పుట్టలేదు కాబట్టి అదసలు ప్లాట్ పాయింట్ వన్నే కాదనుకుందాం- ఇంటర్వెల్లోనే హీరో హత్య చేయడం  ద్వారా కథ పుట్టింది గాబట్టి ఇదే ప్లాట్ పాయింట్ వన్ అనుకుందాం. ఇక్కడ్నించే కథ మొదలవుతోందని అనుకుందాం కాస్సేపు- అప్పుడు ఇక్కడ్నించైనా ఈ పాయింటు పట్టుకుని సెకండాఫ్ ఏం జరగాలి? ఇది ఆత్మ రక్షణ కోసం చేసిన హత్య అని నిరూపించ వచ్చని ఇంటర్వెల్ లో చెప్పించినప్పుడు, ఇదే సెంట్రల్ పాయింటనీ, దీని చుట్టే ఇక కథ నడుస్తుందనీ అభిప్రాయం కల్గించారు. లేకపోతే ఈ ఇంటర్వెల్ ఘట్టానికి అర్ధమే లేదు. కానీ సెకండాఫ్ లో దీని వూసే వుండదు. చంపడానికి ఆ ఇన్స్ పెక్టర్ సహా దుండగులు వెంటపడ్డమే, హీరో తప్పించుకోవడమే జరుగుతూంటుంది. 

        అసలెందుకు చంపాలనుకుంటున్నారో రివీల్ చేయకుండా, చిట్ట చివర రివీలయ్యే ఎండ్ సస్పెన్స్ గా పెట్టుకుని నడపడంతో హీరోకి ఒక గోల్ లేకుండా పోయింది. ఎందుకంటే ఆసలు విలనెవరో సెకండాఫ్ లో కూడా తనకే  తెలీదు. ఒక చోట అంటాడు అసలు ఎందుకిలా జరుగుతోందో, దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని. కానీ ఆ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు. దర్శకుడు ఇలాగే  ప్రేక్షకులకి ఆశలు కల్పిస్తూ వమ్ము చేస్తూ వుంటాడు. ఇంటర్వెల్లో ఎస్టాబ్లిష్ చేసే  పాయింటుతో ఆశలు కల్పించి దాన్ని అలా వదిలేశాడు. మళ్ళీ ఇప్పుడు ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ఎట్టకేలకు హీరో చేత అన్పించి, మనకి కొత్త ఆశలు కల్పిస్తాడు. మళ్ళీ దీన్ని కూడా మర్చిపోతాడు దర్శకుడు -ఇచ్చిన హామీల్ని మర్చిపోయే పొలిటీషియన్ లా. ఒకటేదనా సెటప్ చేస్తే,  దాన్ని పే - ఆఫ్ చేసి తీరాలి- లేకపోతే  సెటప్ చేయనే కూడదనేది కామన్ సెన్సు.

         ఫస్టాఫ్ లో మాత్రం హీరోయిన్ తమని ఎవరు ఎందుకు చంపాలను కుంటున్నారో
తెలీదని అంటుంది. ఆమెకి తెలీకపోతే హీరో ఆమె తల్లిదండ్రుల్ని అడగవచ్చుగా? అడక్కపోయినా ఆ తల్లి, ఫలానా పొలిటీషియన్ తో నా కూతురి గురించి గొడవపడ్డా, వాడే మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు- అని చెప్పాలిగా? ఆమె మీద ఆన్ని దాడులు జరుగుతూంటే  హీరో కాపాడుతూన్నా,  అలాటి హీరోకే ఏమీ చెప్పకుండా చనిపోతుంది. డాక్టర్ ఇంట్లో చికిత్స పొందుతున్నప్పుడు ఇన్స్ పెక్టర్ దుండగులతో  వచ్చి దాడి జరిపే సుదీర్ఘ ఎపిసోడ్ వుంటుంది. ఎదురు కాల్పులు జరుపుతూ తప్పించుకుంటూ, ఏడుస్తున్న హీరోయిన్ ని తీసుకుని డాబా మీది కొస్తాడు హీరో. కింద కాల్పులు జరుగుతూనే వుంటాయి. ఆమె పేరెంట్స్ ఏమవుతారన్న ఆలోచనే  వుండదు హీరోకి. పైగా- నేనింత కా లం చిన్న పిల్లాణ్ణి అనుకుంటూ గడిపేశాను, ఇప్పుడు పెద్ద వాణ్ణయ్యాను- లాంటి డైలా గులేవో చెప్తాడు. మంచిదే, ఈ అనుభవాలతో మెచ్యూర్ అవడం మంచిదే. ఇక్కడ కూడా దర్శకుడు హీరో మీద మనకి ఆశలు కల్పిస్తాడు- ఇలా మెచ్యూర్ అయిన హీరో ఇప్పుడేం చేస్తాడోనని. ఆ డైలాగులు చెప్పిన హీరో,  హీరోయిన్ పేరెంట్స్ ని వాళ్ళ ఖర్మానికి వదిలేసి, హీరోయిన్ తో ఉడాయింస్తాడు! మెచ్యూరిటీ అంటే హీరోయిన్ పేరెంట్స్ ని ముఠా చేతిలో చావనిచ్చి, హీరోయిన్నేసుకుని పారిపోవడమన్న మాట!
        ఫోకస్ చెదిరిపోయిన కథాకథనాలు, పాత్రచిత్రణలు ఇవి.

***
       ఇక ఎండ్ విభాగానికొస్తే ఇది ఎన్నో ప్రశ్నల్ని మిగుల్చుతుంది. రెండున్నర సంవత్సరాల తర్వాత డిసిపి రజనీకాంత్ గా వచ్చిన వాడు చెప్పే మాటలు నమ్మశక్యంగా వుండవు. కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్తాడు. ఇది రజనీకాంత్ పరువు తీయడమే. ఈ ఇన్స్ పెక్టర్ అంతు చూడాలంటే తనే పోలీసుగా మారాలనుకుని, దీర్ఘకాలిక ప్రణాళికేసుకుని,  యూపీపీఎస్ పాసైపోయి, ఐపీఎస్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసేసి,  డిసిపినై ఇలా వచ్చానంటాడు- ‘మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను’ - అని నాగార్జున పాడుకున్న టైపుని గుర్తుకు తెస్తూ. 

        ఆల్రెడీ ఇంజనీరింగ్,ఎంబీఏ పట్టాలున్నాయి. ఈ చదువుల తల్లి - కాదు- చదువుల తండ్రి - రెండున్నర సంవత్సరాలలో ఐపీఎస్ అయిపోవడం రికార్డే. ఐపీఎస్ అయి నేరుగా డిసిపి ఎలా అయిపోతాడో అర్ధం గాదు. ఇదలా ఉంచితే- ఈ స్క్రీన్ ప్లేలో ఇప్పుడు కథా కాలం మారింది. మిడిల్ ముగిసే వరకూ ఒక కథా కాలం, మిడిల్ తర్వాత  రెండున్నరేళ్ళూ ఇంకో కథా కాలం. మొదటి నడుస్తున్న కథాకాలంలో కుట్ర దారులెవరో తెలుసుకుంటా నన్న హీరో, ఆ కథా కాలంలో ఆ పని ముగించలేదు. ఆ కథాకాలంలో ఆ పని పూర్తి చేయకపోతే, రెండో కథాకాలం  వరకూ రెండున్నరేళ్ళూ విలన్ చూస్తూ కూర్చుంటాడా?       

        రాజకీయనాయకుడైన విలన్ కి,  మొదటి కథా కాలంలోనే మొత్తం హీరోయిన్ కుటుంబాన్నీ అడ్డు  తొలగించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే తను ఎన్నికల్లో నిలబడబోతున్న సందర్భమది. కాబట్టి హీరోయిన్నీ, ఆమెతో బాటు హీరోనీ వెతికి పట్టుకుని  చంపే తీర్తాడు. తీరుబడిగా కోర్సులు చదువుకుంటూ కూర్చునే ఛాన్సే వుండదు హీరోకి. 

        రెండోది, ఒక ఎస్సైని చంపి, మరి కొందరు రాజకీయ నాయకుడి అనుచరుల్నికూడా  చంపి పరారీలో వున్న హీరో,  ఐపీఎస్ అయ్యే ఛాన్సే లేదు.

        ఒక జానర్ దానికి సంబంధించిన కథాలక్షణాలతో పరిశుభ్రంగా వుంటుంది. తీస్తున్న సినిమా జానర్ పట్ల స్పష్టత వుండనప్పుడు అదొక సినిమాగానే అన్పించదు!


-సికిందర్
http://www.cinemabazaar.in/
         




       
       
         

       






Friday, November 11, 2016

రివ్యూ

రచన-  దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌. 
తారాగణం : :నాగచైతన్య, మంజిమా  మోహన్‌, బాబా సెహగల్‌, రాకేందుమౌళి, సతీష్‌ కృష్ణన్‌, అజయ్‌ గొల్లపూడి తదితరులు 
సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, 
ఛాయాగ్రహణం : డాన్‌మాక్‌ ఆర్థర్‌, 
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్‌ 
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌. 
విడుదల
:11 నవంబర్, 2016.
***
          సుదీర్ఘ కాలం నిర్మాణంలో వుండిపోయి ఇవ్వాళ విడుదలైన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఒక యాక్షన్ థ్రిల్లర్ గా గౌతమ్ మీనన్- నాగ చైతన్యల కాంబినేషన్ నుంచి ఎదురుచూడని నజరానా. వినోదపరుస్తూ సరదాగా సాగే ఓ ఎంటర్ టైనర్ గా ఆశించే వెళ్ళే ప్రేక్షకులకి వూహించని అనుభవం ఎదురయ్యే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అసలేముందో ఈ కింద చూద్దాం...

కథ 
     అతను (నాగచైతన్య) ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం రాక ఎంబీఏ కూడా చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగి. ఖాళీగా ఉంటూ  అమ్మాయిల గురించి ఆలోచిస్తూ,  ఫ్రెండ్స్ తో చర్చిస్తూ గడిపేస్తూంటాడు. చెల్లెలు మైత్రేయి ఫ్రెండ్ గా లీలా (మంజిమా  మోహన్‌,) రావడంతో ఆమెతో ప్రేమ ఖాయం చేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఆమె స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్సు చేయడానికి వైజాగ్ వచ్చింది. అతడి ఇంట్లోనే బస కూడా చేయడంతో అతడి పంట పండుతుంది. కానీ ప్రేమని వ్యక్తం చేసే అవకాశం ఎప్పుడూ  లభించదు. ఒకరోజు బైక్ మీద లాంగ్ టూరు వేస్తాడు- కన్యాకుమారి వెళ్లి అక్కడ సూర్యో దయాన్ని చూడాలని. అతడి వెంట ఆమె కూడా వెళ్తుంది. ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు ఇంకా బాగా తెలుసుకుంటారు. వీళ్ళ బైక్ ని ఒక లారీ గుద్దేస్తుంది. దీంతో ఇద్దరి జీవితాలూ డిస్టర్బ్ అయిపోతాయి. అది మమూలుగా జరిగిన ప్రమాదం కాదనీ, ఎవరో లీల ని చంపడానికే చేయించారనీ తెలుస్తుంది. లీలా తల్లిదండ్రులు మహారాష్ట్ర లోని కొల్హాపూర్ లో వుంటారు.  వాళ్ళ మీద కూడా హత్యాయత్నం జరిగినట్టు తెలుసుకున్న అతను -అనుకోకుండా ఒక పోలీసు అధికారిని చంపి ప్రమాదంలో పడతాడు. కామత్ అనే మరో పోలీస్ అధికారి (బాబాసెహగల్) కూడా కుట్రలో భాగస్తుడుగా బయటపడతాడు. 

          అసలీ కుట్ర దార్లెవరు, లీలా కుటుంబాన్ని ఆమె సహా అంత మొందించాలని ఎవరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు, చివర్లో తప్ప తన పేరు కూడా వెల్లడించని కథానాయకుడు లీలా కోసం ఈ ఇరుక్కున్న పరిస్థితి లోంచి  ఎలా బయటపడ్డాడూ అన్నవి మిగతా కథలో టెలి అంశాలు.  

ఎవరెలా చేశారు
      ఫస్టాఫ్ లవర్ బాయ్ గా- సెకండ్ హాఫ్ యాక్షన్ హీరోగా నాగచైతన్య కన్పిస్తాడు. అయితే కథ సరిగ్గా కుదరని కారణంగా ఎమోషన్ లేని రియాక్టివ్ క్యారక్టర్ గా మిగిలిపోతాడు.  ఎప్పుడైతే కథలో  విలన్ ని దాచి పెట్టి ఎండ్ సస్పెన్స్ చేశారో, అప్పుడు చైతన్య  పాత్ర కూడా దిక్కుతోచక కథ నడప లేని స్థితిలో పడిపోయింది. కథ అనేది హీరో లేదా హీరోయిన్ – ఎవరు ప్రధాన పాత్ర అయితే ఆ ప్రధాన పాత్రలోంచి పుడుతుందే తప్ప- బయట నుంచి రచయిత పుట్టించేది కాదు. ఈ పొరపాటు వల్ల నాగచైతన్య పాత్ర – నటన కూడా ఏకపక్షంగా కన్పిస్తాయి. క్లయిమాక్స్ లో పాత్ర ఇచ్చిన ట్విస్టు బాగానే ఉన్నప్పటికీ- ఈ ఒక్క సీనుతోనే అనూహ్యంగా కథ ముగిసిపోవడంతో తీవ్ర  అసంతృప్తే మిగులుతుంది. హీరోయిన్ తో  కెమిస్ట్రీ – రోమాన్సూ  మాత్రం ప్రేక్షకుల్ని బాగానే అలరిస్తాయి.

          కేరళ  హీరోయిన్  మంజిమా మోహన్ టాలెంట్ వున్న గ్లామరస్ నటియే. అయితే సెకండాఫ్ కొచ్చేసరికి పాత్ర పూర్తిగా సీరియస్ గానూ, ఎక్కడా రిలీఫ్ లేకుండా శాడ్ గానూ మారిపోయి ఏడుస్తూ వుండడమే పనిగా పెట్టుకోవడంతో (రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఏడ్వడం దేనికి?) యూత్ అప్పీల్ కి వ్యతిరేకంగా మారింది. పాత్రపరంగా తను  స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్సు చేస్తున్న రచయిత్రి అయినప్పుడు తన కెదురయ్యే కష్టాలకి ఏడ్వడం అసహజంగా అన్పిస్తుంది. తన గురించి ఏడ్చే రచయిత్రి స్క్రీన్ ప్లేలు ఏం రాస్తుంది?  పేరుకి హీరోయిన్ కి గొప్పగా ఒక క్వాలిఫికేషన్ చూపించి ఆతర్వాత వదిలేసే మూసఫార్ములా చిత్రణకి గౌతమ్ మీనన్ కూడా పాల్పడ్డారు. ఆమెని స్క్రీన్ ప్లే రైటర్ గానే పూర్తి స్థాయిలో చూపించి వుంటే, ఈ డ్రైగా వున్న  థ్రిల్లర్ ని  ఆమె పాత్ర కూడా చేసే సాహసాలు చైతన్యం నింపేవి. 

          సింగర్ బాబా సెహగల్ బోడి గుండుతో నెగెటివ్ పాత్ర  నటించాడు. టెర్రర్ సృష్టించే పోలీసు పాత్రలో ఓకే అన్పించుకున్నాడు. అయితే చివరి దాకా హీరోని వేధించే తను విలన్ కాదు- విలన్ కి అనుచరుడు మాత్రమే. ఇకపోతే ఒక్క నాగచైతన్య తప్ప ఈ  సినిమాలో మరో తెలుగు ఆర్టిస్టు ఎవరూ లేరు.

         
డాన్‌మాక్‌ ఆర్థర్‌ ఛాయాగ్రహణం అత్యున్నతంగా వుంది. కన్యాకుమారి సముద్ర తీర దృశ్యాలు చాలా అందంగా వున్నాయి. చాలా భాగం రాత్రి సమయాల్లో సాగే కథకి ఆ మేరకు నైట్ సీన్స్ ని డెప్త్ తో చిత్రీ కరించాడు. ఇక  ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా ఒక ఎసెట్టే ఈ సినిమాకి. అయితే ఆరు పాటలూ ఫస్టాఫ్ లోనే పెట్టేశారు. సెకండాఫ్ లో పాటల్లేవు. 

చివరి కేమిటి?
     గౌతం మీనన్ ఒక యాక్షన్ థ్రిల్లర్ ని మాత్రమే తీశారు. దీనికి ప్రేమ కథతో సంబంధం లేదు. యాక్షన్ కి కారణమైన అంశం పూర్తిగా వేరు. అందుకే సెకండాఫ్ లో కథ రోమాంటిక్ ఫీల్ ని కోల్పోయింది. ఫస్టాఫ్ లో రోమాన్స్- సెకండాఫ్ లో దాంతో సంబంధం లేని యాక్షన్ గా తీశారు. అయితే యాక్షన్ కథకి హీరోయిన్ తో సంబంధముంది- కానీ ఆమె హీరోని ప్రేమించడంతో సంబంధం లేదు. గౌతం మీనన్ సెకండాఫ్ లో రోమాన్స్ నీ, సాంగ్స్ నీ ఇంకెలాటి వినోదాన్నీ కూడా పూర్తిగా  పక్కన బెట్టేయడంతో, యాక్షన్ కథ ఏకబిగిన మంచి పట్టుతోసాగే  థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ని సృష్టించిందని చెప్పొచ్చు.  చివర్లో నాగచైతన్య పాత్రతో ఇచ్చిన ట్విస్టు మాంచి కమర్షియల్ గిమ్మిక్కు. గౌతమ్ మీనన్ ఈ సినిమాని ఎలా తీశారంటే తన సహజమైన న్యూవేవ్ ధోరణికి మూస ఫార్ములా కూడా జోడించారు. దీంతో చివరి ట్విస్టు బాగానే వున్నా అది ఈ జానర్ లో పొసగనట్టు అన్పిస్తుంది. హీరోయిన్ ని స్క్రీన్ ప్లే రైటర్ గా పరిచయం చేసి ఆ తర్వాత మూస ధోరణికి వెళ్ళిపోవడం కూడా ఇలాటిదే.

          గౌతమ్ మీనన్ ఎండ్ సస్పెన్స్ కథనంలో  చిట్ట చివర్లో రివీల్ చేయడానికి పెట్టుకున్న సస్పెన్స్ అంశం ఏ మాత్రం బలంగానూ లేదు. పైగా మరాఠా ప్రాంతంపు నేటివిటీతో, పాత్రలతో మరాఠీ – హిందీ సంభాషణలతో నడిపితే తెలుగు ప్రేక్షకులు అర్ధం జేసుకోవడం ఇబ్బందే- ఎంత  తెలుగులో సబ్ టైటిల్స్ వేసివప్పటికీ అవి చదువుకుంటూ కూర్చోలేరు. 

          ఫస్టాఫ్ రోమాన్స్, సెకండాఫ్ యాక్షన్ అనే స్కీము  పెట్టుకుని, గౌతమ్ మీనన్ నాగ చైతన్యతో చేసిన ఈ ప్రయత్నాన్ని  వినోదాన్ని మాత్రం ఆశించి చూడకూడదు. సెకండాఫ్ లో పాత్ర పరంగా, కథా పరంగా లోపాలున్నా, బలహీనతలున్నా సాధారణ ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చుని చూసేలా చేస్తుంది.

-సికిందర్
         

 


Sunday, November 6, 2016

రచన- ద‌ర్శ‌క‌త్వం: ఆర్పీ ప‌ట్నాయ‌క్‌
తారాగణం:  ఆర్పీ ప‌ట్నాయ‌క్‌, అనిత, సాయికుమార్‌, తనికెళ్ళ భరణి, నాజర్, గొల్లపూడి మారుతీరావు, జయప్రకాష్ రెడ్డి, రాజారవీంద్ర, సందేశ్, బెనర్జీ, రఘుబాబు, శ్రీముఖి, దువ్వాసి మోహన్ తదితరులు. 
మాటలు : తిరుమల్ నాగ
, సంగీతం: ఆర్పీ ప‌ట్నాయ‌క్‌ఛాయాగ్రహణం : సిద్ధార్థ్
బ్యానర్ :
  యూనిక్రాఫ్ట్ మూవీ
స‌హ నిర్మాత‌లు
: ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం
నిర్మాత‌
: జ‌గ‌న్ మోహ‌న్‌
విడుదల : 4 నవంబర్
, 2016
***
        ర్శకుడుగా నటుడుగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వాస్తవిక కథా చిత్రాల పంథా నెంచుకున్నారు. ఈ కోవలో శీను వాసంతి లక్ష్మి’, ‘బ్రోకర్అనే రెండు ప్రయోగాలు చేశారు. ఆర్ధిక ఫలితాలెలా వుంటున్నా పంథా వీడకుండా తిరిగి ఇప్పుడు మనలో ఒకడుతో వచ్చారు. ఈసారి మీడియాని ప్రశ్నించదల్చుకున్నారు- ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాని. మొన్నే పూరీ జగన్నాథ్ ఇజంతో మీడియాని ఆకాశానికెత్తేస్తే, పట్నాయక్ నేలకు దించి వాస్తవాలెలా   చెప్పారో ఈ కింద చూద్దాం...
కథ 

     కృష్ణమూర్తి ( పట్నాయక్) ఓ కాలేజీ లెక్చరర్. విద్యార్ధుల్లో మంచిగౌరవం సంపాదించుకుంటాడు. భార్య శ్రావణి (అనిత) పిల్లలకి సంగీతం నేర్పుతూంటుంది. ఇద్దరూ హాయిగా వుంటారు. ఓ రోజు ఓ స్టూడెంట్ మూడోకన్నుఅనే ఛానెల్ కి ఫోన్ చేసి తనమీద కృష్ణమూర్తి  లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేస్తుంది. ఆ ఛానెల్ కృష్ణ మూర్తి ఫోటోతో ఈ వార్తని ప్రసారం చేస్తుంది. దీంతో కలకలం రేగి ఇంటాబయటా కృష్ణమూర్తి పరువు పోగొట్టుకుంటాడు. హాస్టల్లో ఆ అమ్మాయిని పట్టుకుని అడిగితే ఛానల్ వాళ్ళు తప్పుగా వేశారని, తన ఉద్దేశం లాబ్ టెక్నీషియన్ కృష్ణమూర్తి అనీ చెప్పి మాయమై పోతుంది. అయినా కాలేజీ యాజమాన్యం కృష్ణమూర్తిని సస్పెండ్ చేస్తుంది.  ప్రిన్సిపాల్ మాత్రం కృష్ణమూర్తి పట్ల సానుభూతిగా వుంటూ దీన్నెలా ఎదుర్కోవాలో సలహాలిస్తూంటాడు. శ్రీ (సందేశ్) అనే ఇంకో లెక్చరర్ కృష్ణమూర్తికి వచ్చిన ఈ కష్టంలో తోడుగా ఉంటాడు. కృష్ణ మూర్తి ఇంటిదగ్గర పరిస్థితి చెడిపోతుంది. భార్య అతణ్ణి  అసహ్యించుకుంటూ మాట్లాడ్డం మానేస్తుంది. ఇరుగు పొరుగూ కృష్ణమూర్తిని వెలివేస్తారు. ఒంటరివాడై పోయిన కృష్ణమూర్తి ఇక తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆ ఛానెల్ కి వెళ్లి అసలు విషయం చెప్తాడు. ఛానెల్ వాళ్ళు చేసిన పొరపాటు గ్రహించినా సవరణ వేయడానికి ఒప్పుకోరు. ప్రసారం చేసిన వార్త తప్పని సవరణ వేస్తే  తమ ఛానెల్ ప్రతిష్ట దెబ్బ తింటుందని ఛానెల్ అధినేత ప్రతాప్ (సాయికుమార్) తిరస్కరిస్తాడు. కృష్ణమూర్తి అక్కడ ఘర్షణపడి లాభంలేక కోర్టు కెక్కుతాడు. కోర్టులో తాను పెట్టుకున్న లాయర్ (తనికెళ్ళ భరణి) ఛానెల్ వైపు ప్లేటు ఫిరాయిస్తాడు. 
        ఇలా దారులు మూసుకుపోతూంటే కృష్ణమూర్తి ఛానెల్ మీద ఎలా పోరాడి గెలిచాడనేది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      ఓ శక్తివంతమైన ఛానెల్ మీద సామాన్యుడి పోరాటమనే, వినోదానికి ఆస్కారం లేని,  ఆసక్తికర కథకి అవకాశమున్న కాన్సెప్ట్ ఇది. స్కూళ్ళలో కాలేజీల్లో కామవికారాల ఉపాధ్యాయులకి బడితె పూజ, కటకటాల్లో లాఠీ సేవ - అనే బ్రేకింగ్ న్యూసులు రొటీన్ అయిపోయాయి. విద్యాలయ్యాల్లో గురువుల ఈ కామవికారాలు ఎప్పుడు అంతమవుతాయా అని జనం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.  దీన్నలా వుంచి, పట్నాయక్  రివర్స్ లోవచ్చి,  ఉపాధ్యాయుడినే  లైంగిక వేధింపుల తప్పుడు ఆరోపణల బాధితుడిగా నడుస్తున్న చరిత్రకి తద్విరుద్ధ దృశ్యం చూపెట్టారు. ఇక్కడ ఉద్దేశం విద్యార్ధినులతో కూడా ఉపాధ్యాయులు జాగ్రత్తగా వుండాలని హెచ్చరించడం కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా అత్యుత్సాహంతో వార్తలు ప్రసారం చేసే  మూడోకన్నుఅనే కల్పిత ఛానెల్ ని ఎండగట్టడం మాత్రమే. పట్నాయక్  వాస్తవాలు తెలుసుకుని మరీ వార్తలు ప్రసారం చేయాలని చెప్పుకొచ్చారు. అయితే ఛానెల్ ని అవతలి పక్షం చేసి నిందించినప్పుడు, ఇవతలి తన స్వపక్షంలో వాదం నిర్దుష్టంగా నిర్మించుకోవాలని  చూసుకోలేదు. భూస్వామి వుంటాడు, అతను తనకి అన్యాయం చేశాడని కూలీ ఆరోపించినప్పుడు, ఆ అన్యాయానికి తోటి కూలీ బాధ్యత కూడా వుందని తెలుస్తూంటే  ఆ కథ కళారూపంగా రక్తికట్టడం కష్టం.  ఇదే జరిగింది పట్నాయక్ కథలో. ఛానెల్ మీద పోరాటానికి వెళ్ళే ముందు సంఘటన పూర్వాపరాలు నిర్దుష్టంగా వుండాలని చూసుకోలేదు- ఎందుకంటే నిజాయితీగా రియలిస్టిక్ జానర్ ని నమ్ముకోలేదు- మళ్ళీ ఇందులో లాజిక్ ని వదిలేసిన ఫార్ములా కథనాన్ని  జొప్పించడం వల్ల బలహీనపడి- మీడియా వాళ్లకి ఆయన ఇచ్చిన సందేశంతో  మీడియా వాళ్ళే ముక్కున వేలేసుకునేలా చేశారు- మా తప్పేంటో మాకర్ధమయ్యేలా చెప్పండి బాబూ ఆ తర్వాత మేం మారే సంగతి ఆలోచించుకుంటాం అనుకునేట్టు చేశారు. నిజమే, ‘మూడోకన్నుఛానెల్ చేసిన తప్పేంటి? చేశారంటున్న తప్పుని సవరించుకోక పోవడమేనా? ఐతే ఆ తప్పుఛానెల్ దాకా వెళ్ళకుండా నివారించగల అవకాశం వుండీ, ఫార్ములా కథనంతో సరిపెట్టేద్దాం అనుకోవడం వల్ల  ఛానెల్ చేసిన తప్పేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. 

ఎవరెలా చేశారు 
      పట్నాయక్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ఒక సభకి వస్తూ పోతూ వున్నట్టు కన్పిస్తారే  తప్ప, సన్నివేశాల్లో నటిస్తున్నట్టు కన్పించరు. ఐతే నాకేంటీ?’ అని ఒకచోట ఎఫెక్టివ్ గా ఎదురు తిరిగినట్టు,  మిగతా చోట్ల కూడా తనకి జరిగిన న్యాయానికి జ్వలిత హృదయుడై  అగ్నిజ్వాలలు రేగ్గొట్టాల్సింది! ఒక అద్దంలో చూసుకుని ఏడ్చినప్పుడే పాత్ర కుదేలైపోయే క్రమం ఏర్పడింది. ఏడిస్తే ఏడ్చారుగాని, ఆ ఏడ్పు చివర అగ్నిపర్వతం బద్దలై –‘చూస్తా వాడి సంగతి!’  అని కనీసం ఆ అద్దాన్ని పగలగొట్టేసి పారేసి వున్నా పరిస్థితి డిమాండ్ చేస్తున్న యాక్టివ్ నెస్ అక్కడ ఇగ్నైట్ అయ్యేది. కోర్టులో లాయర్ చేసే మోసం దగ్గర, వివిధ ఛానెళ్ళ వాళ్ళు  సహకరించనప్పుడూ, వాళ్ళు చెప్పేది విని వెళ్ళిపోయే పద్ధతిలో లేదా ఈ కథకోసం సమాచారాన్ని సేకరిస్తున్న విధానంలో- చేసిన పాత్రచిత్రణ, దానికి తగ్గ నటనా  ఒకసారి రివ్యూ చేసుకోవాల్సింది.  ‘మనవూరి రామాయణంలో ప్రకాష్ రాజ్ కూడా దర్శకత్వం వహిస్తూ నటించారు- వేశ్యతో ఇరుక్కున్న ఒకానొక సందర్భంలో క్షణం క్షణం మారిపోయే పరిస్థితులమధ్య ఆయన నటన, కథా నిర్వహణ ఎంత టెన్షన్ పుట్టిస్తాయో చూసిందే. అలాటిది ఒక క్రైం ఎలిమెంట్ తో కూడిన కథతో, పాత్రతో పట్నాయక్ ఇంకెంత చేసివుండాలి.

        భార్య పాత్రవేసిన అనితది రొటీన్ మూసపాత్ర. దీంతో ఈ రియలిస్టిక్ కథలో అంతా పాత డ్రామా చొరబడింది. భర్త గురించి ఛానెల్లో చూసిందే తడవు నమ్మేసి కర్కశంగా మారిపోవడం, సూటిపోటి మాటలతో సాధించడం, పురుగుని చూసినట్టు చూడ్డం  అతిగా వుంటుంది. పిల్లలకి సంగీతం నేర్పే ఓ కళాకారిణికి ఈ రకం పాత్రచిత్రణ, మళ్ళీ భర్త అమాయకుడని తెలియగానే ఎక్కడాలేని ప్రేమానురాగాలూ, అంతలోనే మురిసిపోతూ నాల్గోనెల అని చెప్పడాలూ- ఇవన్నీ ఈ పాత్రని అవకాశవాదిగా నిలబెట్టాయి.  అన్నేళ్ళు కలిసి కాపురం చేసిన భర్త ఎలాటివాడో ఆమెకి తెలియలేదంటే ఆమె భర్తతో చేసింది కాపురంలా  అన్పించదు, విడిది చేసినట్టు వుంది.
 

        కనీసం జరిగిందేమిటో అతను  చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వదు. మరి తను అంత ద్వేషించేబయట అమ్మాయిల్ని పాడు చేస్తున్నాడని నమ్మే,  ఆ భర్త బిడ్డనే కడుపులోఎలా భరించింది? పైగా తన అపార్ధాలు తొలిగాక తనేదో భర్తకిస్తున్న కానుక అన్నట్టు నాల్గో నెల అని చెప్పుకోవడం. భర్త మంచి వాడని తెలిశాకఓ ఆవిడ ఏదో వాగితే లెంపకాయ కొట్టడంలో కూడా అర్ధం లేదు. అదే ఆవిడ ముందు చెప్పిన ఇవే మాటల్ని నమ్మి భర్తని ద్వేషించిన తను కూడా లెంపకాయ తినాలిగా అప్పుడు? 

        ఆ ఆవిడ భర్తే తనని లైంగికంగా వేధిస్తూంటాడు. ఇతణ్ణి కేవలం పోరాఅంటుందే తప్ప లాగి కొట్టాలనుకోదు. తనకీ పరిస్థితి ఏర్పడడానికి భర్తే కారణమని కుమిలిపోతూ అతడి మీద కసి ఇంకా పెంచుకుంటుంది. బయట తను సంగీతం నేర్పే అవకాశాలు కోల్పోవడానికీ భర్తే కారణమని గొడవపడుతుంది. భర్తని శత్రువుగా భావిస్తే  లోకం తనతో ఆడుకుంటుందని మాత్రం గ్రహించదు.
  
        ఇలాటిదే అసంబద్ధ భార్య పాత్ర చిత్రణ ఈ సినిమాతోపాటే విడుదలైన నరుడా డోనరుడాలోనూ  చూశాం. ఆడదాన్ని తక్కువ జ్ఞానం గలదానిగా చూపించడం ఇంకా ఒక ఫార్ములాగా వాడేస్తున్నారు. ముందు ఎంతో పాజిటివ్ గా వుండే భార్య పాత్ర నెగెటివ్ గా మారిపోవడం, చివరికి మళ్ళీ పాజిటివ్ గా మారడం ఈ అరిగిపోయిన  పాత గిమ్మిక్కులే మళ్ళీ చూడాల్సిన పరిస్థితి.  రియలిస్టిక్ కథలో సినిమాటిక్ సంగతులు. 

        ఒక భర్తని సాధించే గయ్యాళి వుంటుంది. భర్త మీద ఇలాటి ఆరోపణలు రాగానే లోకం మీద కయ్యిన లేస్తుంది నా మొగుడు బంగారమని! ఇలాగే వుంటాయి రియలిస్టిక్   జీవితాలు. సినిమాటిక్ చేసుకునే ఇంటరెస్టు వుండదు. భార్య పాత్రని మొదట ఎడమొహం పెడమొహంగా చూపిస్తూ, భర్తకి సమస్య తలెత్తగానే అతడి  పక్షం వహించే మెచ్యూరిటీతో  చిత్రించి  వుంటే ఏంతో ఉన్నతంగా వుండేది. ఇలా చేయకపోగా, ఇంకా బయటి చెప్పుడు మాటలు కూడా విని భర్తమీద కక్ష పెంచుకునే మూర్ఖురాలిగా తయారు చేశారు. బయట భర్త  గురించి వంద అనుకోనీ, అవి నమ్మి భర్తకి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తానన్నా  క్రిమినల్ లా కూడా ఒప్పుకోదు. దేశంలో రాజకీయ పార్టీలు ఎంతైనా కీచులాడుకోనీ, దేశం మీదకి ఒకడు దండెత్తి వస్తున్నాడంటే అన్నీ ఒకటై  తిప్పికొడతాయి!  

        తనికెళ్ళ భరణి లాయర్ పాత్ర కూడా అసంబద్ధమైనదే. దీని గురించి స్క్రీన్ ప్లే సంగతుల్లో చెప్పుకుందాం. ఛానెల్ యజమాని పాత్రలో సాయికుమార్ అత్యంత ప్రతిభావంతమైన నటనని కనబర్చారు. హీరో ఆరోపించే ఇగోని ప్రదర్శిస్తూ కుహనా ప్రతిష్ఠ కోసం పాకులాడే పాత్రలో సాయికుమార్ కథకి వన్నె తెచ్చారు. తనూ- కేంద్రమంత్రి పాత్రలో నాజర్ తమతమ వాదనలతో పాల్గొనే ఒక లైవ్ షో హైలైట్ గా నిలుస్తుంది. దీని పకడ్బందీ చిత్రీకరణ క్రెడిట్ పట్నాయక్ కి దక్కుతుంది. 

        ఇక సహాయపాత్రలు చాలా వున్నాయి- కానీ మూడోకన్నుఛానెల్ ఎడిటర్ గా రఘుబాబు ప్రారంభంలో కన్పించి- మళ్ళీ కంటికి కన్పించకుండా  మాయమైపోయి- చివర్లో కళ్ళు తెరచుకుని రావడం కాల్షీట్లు కుదరక జరిగిందేమో. ఛానెల్ లో వచ్చిన తప్పుడు వార్త ప్రహసనమంతా  ఒక మూడోకన్నుఎడిటర్ గా తను ఎక్కడుంటాడో తెలీదు. ఇకపోతే సామాజిక కథ అనగానే కామెంట్లు చేస్తూ తిరిగే ఓ పిచ్చివాడి పాత్ర తప్పని సరేమో. అలా దువ్వాసి మోహన్ ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు’  అన్న టైపులో 1973 నాటి  ‘దేశోద్ధారకులులోలాగా  ఇంకా పద్మనాభంలా తిరుగుతూంటాడు.

        సాంకేతికంగా కెమెరా వర్క్ బాగానే వుంది గానీ కలర్స్ లో బ్లూ టింట్ డామినేషన్ ఎక్కువయ్యింది. పాటలు ఫర్వాలేదు, జేసుదాస్ చేత ఓ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ పాడించారు.

   - సికిందర్