రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, August 23, 2016


     ‘రుస్తుం’ రీ- పోస్ట్ మార్టం బేతాళ కథల్లా సాగేట్టుంది... ఒక్కో శవాన్ని చెట్టుమీద నుంచి దించి భుజాన వేసుకు వెళ్తూండడమే... శవాల్లోని బేతాళుడు అడిగే ప్రశ్నలకి చచ్చినట్టూ సమాధానాలు చెప్పుకోవడమే. కొందరు కళాకారులు  ఎంతో తెలివిగా కళా సృష్టి గావిస్తారు. దాంట్లోని సంక్లిష్టతకి ఎన్ని వెబ్ పేజీలైనా చాలవు విశ్లేషణలకి. ‘రుస్తుం’ కి  1) అసలు నిజ కథ, 2) దీని ఆధారంగా దర్శకుడు రచయితల సొంత కథ, 3) మళ్ళీ ఈ సొంత కథలో a ) భార్య ద్రోహ కథ-  b) భర్త దేశభక్తి కథా, 4) ఇంకా వేరే  రెండు సినిమాల్లో వచ్చిన కథలూ  ముందేసుకుని, పీహెచ్ డీ పట్టాకోసం కృషి చేస్తున్నట్టు ఎంతకీ ముగియని  తులనాత్మక పరిశీలన చేయాల్సిందే...కళా పోషణ కరాళ నృత్యం చేస్తూంటే ఇంతే!!  

        ఇంకా మనం బిగినింగ్ విభాగం దగ్గరే వున్నాం. అసలు విక్రం అనేవాడు నేవీ అధికారులతో కలిసి స్కామ్ చేస్తూ, స్కామ్ కి లొంగదీయాలని  రుస్తుం మీద వొత్తిడి తెస్తున్నప్పుడు, ఈ సంగతి రుస్తుం తన భార్య సింథియాకి  చెప్పకుండా వుంటాడా? తామిద్దరికీ విక్రం,  అతడి చెల్లెలూ పరిచయస్థులే కదా? ఒకవేళ స్కామ్ విషయాలు సింథియాకి తెలియనివ్వ కూడదనుకుంటే- స్కామ్ మూలంగా తనతో సంబంధాలు చెడిన విక్రంనీ అతడి చెల్లెల్నీ ఇక కలవొద్దని మాత్రమైనా  రుస్తుం సింథియాకి చెప్పి వెళ్ళాలిగా? అలా చెప్పి వెళ్తే సింథియా విక్రం వలలో పడేది కాదుగా? పోనీ, తను డ్యూటీ నుంచి తిరిగి వచ్చాకైనా సింథియా  వ్యవహారం మీద నిలదీసినప్పుడు-  తను  తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేశానని ఆమె చెప్పినప్పుడైనా తను  అప్రమత్తమై - స్కామ్ సంగతి నీకు తెలిసిపోయిందా? వాడేం చెప్పాడు? స్కామ్ కి నన్ను ఒప్పించమని నిన్ను బలవంత పెట్టాడా?-  అని అడగలిగా? స్కామ్ విషయంలో విక్రం తో ఆమె ఏదో కుమ్మక్కయినట్టూ, తనకేదో ద్రోహం చేస్తున్నట్టూ  అలా చూస్తాడేమిటి? 

        రెండోది- స్కామ్ కి సంబంధించి విక్రం మాట రుస్తుం వినలేదే అనుకుందాం, అలాంటప్పుడు ఓ  ప్లేయ్ బాయ్ లా సింథియాతో ఎందుకు ఎంజాయ్ చేస్తాడు విక్రం? మాట వినని  రుస్తుంకి ఇలా బుద్ధి చెప్ప వచ్చనా? ఇలా  రుస్తుం భార్యని వాడుకుని వదిలేస్తే,  జీవితాంతం రుస్తుం కుమిలి పోవాలనా? ఇదేనా అతడి ఉద్దేశం?  ఇది అతికినట్టు వుందా? ఇలాటి ఉద్దేశం ఎప్పుడు పెట్టుకోవాలి విక్రం? రుస్తుం వల్ల ఇక స్కామ్ కి పూర్తిగా తెర పడి,  ఆశ వదులుకున్నప్పుడు కదా? స్కామ్ వ్యవహారం ఇంకా నలుగుతూండగానే సింథియాని వూరికే వాడుకుని వదిలెయ్యడంలో అర్ధముందా- తనతో ఫోటోలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడానికైతే ఆమెని ట్రాప్ చేయాలిగాని!  

        ఇంకొక సంగతేమిటంటే, ఫ్లాష్ బ్యాక్ లో చూపించే దాని ప్రకారం అసలు సింథియాని  విక్రం కి సెట్ చేసేది అతడి చెల్లెలు ప్రీతీనే. అప్పుడామె తన ప్లే బాయ్ అన్నకి అమ్మాయిల్ని సమకూర్చి పట్టే మనిషిలాగే అన్పిస్తుంది తప్ప, స్కామ్ లో ట్రాప్ చేయడానికి సింథియాని సెట్ చేస్తున్నట్టు అన్పించదు. 

        ఇలా ఏ పాత్ర ఉద్దేశాలూ లక్ష్యాలూ అక్కడ నెలకొన్న పరిస్థితిని బట్టి గాక, అనాలోచితంగా అడ్డగోలుగా  చిత్రణ చేశారు. కారణం- మామూలు భార్యా- భర్త- ప్రియుడు అనే కథకి  స్కామ్ ని తెచ్చి కలపడమే. సెకండాఫ్ లో స్కామ్ సంగతులు ఓపెన్ చేస్తూ పోయారే గానీ, అది రుస్తుం- సింథియా- విక్రం ల ట్రయాంగిల్లో   పొసగాలని ఆలోచించ లేదు.  

        కాబట్టి నేవీ స్కామ్ అనే ఫ్లాష్ బ్యాక్ తో కలిపి చూస్తే, ఈ బిగినింగ్ విభాగంలో కథ- ప్రాబ్లం సెటప్, తద్వారా ప్లాట్ పాయింట్ వన్ అన్నీ తప్పుల తడకగానే, తప్పుదోవ పట్టించడంగానే  తేలిపోతాయి.
***
    స్కామ్ కోణాన్ని పక్కన బెట్టి కాసేపు మామూలు భార్య- భర్త- మధ్యలో ప్రియుడు కథలా చూసినా కూడా ‘రుస్తుం’ లో చిత్రణ ఎంత అమెచ్యూరిష్ గా వుందో గత వ్యాసంలోనే చూశాం. రుస్తుం ఇంటికి వస్తే సింథియా రెండు రోజులుగా లేకపోవడం, ఆమె ఉత్తరాల వ్యవహారం, విక్రం బంగాళా కెళ్ళి రుస్తుం కేవలం వాళ్ళిద్దర్నీ చూసి రావడం, సింథియా వచ్చాక ఆమెని నిలదీయడం, అప్పుడు మాత్రమే వెళ్లి విక్రంని చంపడం అనే సీక్వెన్సు లో రుస్తుం వెళ్లి విక్రంని చంపడం అనే చర్య మినహా మిగతావన్నీ అర్ధం లేనివి. వీటిలో విక్రం బంగాళా కెళ్ళి విక్రంతో వున్న సింథియాని దీనంగా చూసి రావడమనే ఘట్టమైతే సహజ రియాక్షన్ కాదు. 

        నానావతి కేసు ఆధారంగానే  1973 లో గుల్జార్ తీసిన ‘అచానక్’ లో హీరో వినోద్ ఖన్నాది ఆర్మీ మేజర్ రంజిత్ పాత్ర. ఈ కథలో నాన్చుడు లేదు. మేజర్ రంజిత్  ఇంటికి తిరిగి రాగానే ప్రియుడితో భార్య కలిసి ఉండడాన్ని చూసి వాళ్ళిద్దర్నీ చంపేస్తాడు! డ్రామాలు, మెలోడ్రామాలు లేవు. 

        నానావతి కేసు ఆధారంగానే 1963లో ఆర్కే నయ్యర్ తీసిన   ‘యే రాస్తే హై ప్యార్ కే’ లో సునీల్ దత్ ది  పైలట్ అనిల్ సహానీ పాత్ర. నానావతికి ముగ్గురు పిల్లలుంటే సహానీకి ఇద్దరు పిల్లలుంటారు. నానావతి లాగే అనిల్  ఇంటికి తిరిగి వస్తే, నానావతి భార్య సిల్వియాలాగే అనిల్  భార్య ఆశ (లీలా నాయుడు) కూడా ముభావంగా వుంటుంది. ఆమెని మూడ్ లోకి తెచ్చుకునేందుకు నానా కామెడీలు చేస్తాడు అనిల్. మధ్యలో ఫోన్ మోగుతుంది. అనిల్  తీస్తే అవతలి గొంతు పలకదు. పెద్దగా పట్టించుకోడు. 

        ఆశా కోసం తను తెచ్చిన  బహుమతి బొమ్మ తాజ్ మహల్ ఇవ్వబోతే తీసుకోదు. అలమారలో పెట్టబోతే అడ్డుపడి ఆ బహుమతి తీసేసుకుంటుంది. అతను పిల్లల దగ్గరికి వెళ్లి పోతే అలమార తెరుస్తుంది. అందులో అలాటిదే బహుమతి  ఇంకోటి వుంటుంది. దాన్ని తీసి కిటికీలోంచి పారేసి దీన్ని పెడుతుంది. మళ్ళీ ఫోన్ మోగితే తనే తీస్తుంది. ఇందాక ఫోన్ చేసిన ఆమె ప్రియుడే  (రెహమాన్) ఆమెతో మాట్లాడేస్తాడు. వింటూ వుండి పోతే, ఒక్కసారి పిల్లల అరుపులు  వినబడతాయి. ఫోన్ పక్కన పెట్టేసి పిల్లల దగ్గరికి వురుకుతుంది. అక్కడ బొమ్మ తుపాకీతో కూతురి మీద కొడుకు కాలుస్తాడు. కూతురు చచ్చిపోయినట్టు నటిస్తుంది- తల్లికి  కంప్లెయింట్ చేస్తుంది. ఇటు అనిల్ వచ్చి ఇంకా ఎంగేజ్ లో వున్న ఆ ఫోనెత్తి వినేస్తాడు ...ఆశా ప్రియుడి మాటలు...

      అప్పుడు దాదాపు ఆశా గొంతు నులిమి చంపినంత పనిచేస్తాడు అనిల్.  ‘వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా?వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా?’  అనడిగితే,  ‘ముజే కుచ్ నహీ మాలూం’ (నాకేమీ తెలీదు) - అంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలని తండ్రిని అడుగుతాడు- పిల్లల కోసం కలిసి వుండమంటాడు తండ్రి. కానీ ఇంత  ద్రోహం చేసిన స్నేహితుణ్ణి సహించలేక వెళ్లి చంపేస్తాడు అనిల్. 

       
అచానక్ లో చూసిన దృశ్యానికి సహజ రియాక్షన్ తో తక్షణ చర్య తీసుకుని ఇద్దర్నీ చంపేస్తే, ‘యే రాస్తే హై  ప్యార్ కే’  లో- సహజ రియాక్షన్ గా భార్య గొంతు నులిమి  చంపబోతాడు, తర్వాత వెళ్లి ప్రియుణ్ణి చంపేస్తాడు. ‘రుస్తుం’ లో, సింథియా విక్రం తో కలిసి వుండగా చూసిన రుస్తుం   ఎలాటి సహజ రియాక్షనూ  లేక వెలవెల బోతాడు. సహజ రియాక్షన్ కి పాత్రకి అవకాశమీయక పోతే అలాటి పరిస్థితిలోకి నెట్టనే కూడదు. 

       ఇక ‘రుస్తుం’ లో సింథియా ఉత్తరాలూ, ‘యే రాస్తే హై ప్యార్ కే’  లో ఆశా బొమ్మ తాజ్ మహల్ బహుమతుల సంగతి చూస్తే-  సింథియా ఇంట్లో పెట్టకున్న బోల్డు ఉత్తరాలతో, బహుమానాలతో  సన్నివేశాలూ పాత్రలూ ఎంత అయోమయంగా తయారయ్యాయో క్రితం వ్యాసంలో చూశాం. కానీ ఆశాకి ప్రియుడి నుంచి అన్నేసి బహుమతులూ వగైరా అందుకున్నట్టు వుండదు. ఒక్క తాజ్ బొమ్మే ఆమె అందుకుంది. భర్త ఇంటికి వచ్చే ముందు పెళ్లి చేసుకోనన్న ప్రియుడితో ఘర్షణ కూడా పడి -నీ సంగతి చూస్తా - అని తెగతెంపులు చేసుకుని వచ్చింది.  

        ఈ నేపధ్యంలో భర్త ఇంటికి వచ్చినప్పుడు ప్రియుణ్ణి వదిలించుకుంది గనుక ఇక ఏమీ ఎరగనట్టు కాపురం చేసెయ్యొచ్చు భర్తతో. కానీ ఆమె అంతరాత్మ ఒప్పుకోలేదు. అందుకే భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆ అపరాధ భావంతో  మధన పడింది. విషయం తెలీని  అతడెన్ని కామెడీలు చేసినా,  సరే జరిగిందేదో జరిగిపోయింది మనం కూడా భర్తతో కామెడీగా బతికేద్దా మనుకోలేదు. సింథియా లాగా డబుల్ గేమ్ ఆడదల్చుకోలేదు. సిల్వియాలాగా ఒక నీతితో వుంది. అలమార లోని ప్రియుడి బహుమతి తీసి పారేసి, భర్త బహుమతినే  పెట్టుకోవడంలో ఇది తేటతెల్ల మవుతోంది. అంటే నానావతి భార్య సిల్వియా ప్రియుడితోనే ఫిక్స్ అయిపోయి భర్తకి చెప్పేస్తే, ఆశా భర్త తోనే ఫిక్స్ అయిపోయి భర్తకి చెప్పలేక మధనపడింది. ఆ ఫోన్ కాలే ఆమెని భర్తకి పట్టించింది. 

        ఇక్కడకూడా సన్నివేశ సృష్టిలో లోపముంది. ప్రియుడు మొదటి సారి కాల్ చేస్తే భర్త తీశాడు. రెండో సారి చేస్తే తనే తీసింది. భర్త ఇంట్లోవున్న అలాటి సమయంలో తను ప్రియుడి కాల్ అందుకో కూడదు  కదా? కట్ చేయాలి. పైగా అతడితో తెగతెంపులు చేసుకున్నాక  రెస్పాన్సే  ఇవ్వకూడదు. అతనేదో చెప్తూంటే వింటూ వుంటుంది. అంతలో పిల్లల కేకలు విన్పిస్తే ఫోన్ ని అలాగే వదిలేసి వెళ్ళిపోతుంది- ఇలా ఎవరైనా చేస్తారా? అంటే, పాత్ర బదులు ఇక్కడ కథకుడు ఎంటర్ అయ్యాడన్న మాట.  ఆమె చేత కావాలని ఇలా చేయించాడు- ఆమెని భర్తకి పట్టించడానికి ఇంతకంటే మార్గం తోచలేదు కాబోలు. 

      ఇక ఈ రెండు పాత హిందీ సినిమాల్లోనూ హీరో వెళ్లి చంపినప్పుడు,  ప్రియుడు టవల్ మీద వుండడు. ‘రుస్తుం’ లో మాత్రం నిజ ఘటనలాగే టవల్ మీద వుంటాడు. నానావతి ఎలా చంపాడో అలాగే చంపుతాడు. ఆతర్వాత పోలీసులకి లొంగిపోతాడు. 

         ఇక్కడ పాయింటేమిటంటే, ఆ రెండు పాత సినిమాల్లో హత్యకి మోటివ్ వివాహేతర  సంబంధమే. ఇంకెలాటి స్కాములూ వగైరాలతో తికమక లేని సూటి పాయింటే. నానావతి చంపడానికి కూడా మోటివ్ వివాహేతర  సంబంధం ఒక్కటే. 

        కానీ రుస్తుం విషయానికొస్తే,  అతడి మోటివ్ అనుమానాస్పదం.  వివాహేతర సంబంధమా, స్కామా? దేనికోసం చంపాడు? చంపినప్పుడు వెల్లడైన కథ వరకూ చూస్తే,  వివాహేతర  సంబంధమే కారణమన్పిస్తుంది. కానీ సెకండాఫ్ లో వెల్లడయ్యే  స్కామ్ రీత్యా చూస్తే మాత్రం స్కామ్ గురించి కూడా  చంపాడా అన్న కొత్త ప్రశ్న తలెత్తుతుంది. వివాహేతర సంబంధం- స్కామ్ రెండూ తోడై చంపాడనడం సరికాదు. ఒక కథకి రెండు పాయింట్లు, రెండు సమస్యలు వుండవు. కాబట్టి రెండు కారణాలూ తోడై చంపాడనడం ఎలాటి కథా  సూత్రాలకీ వ్యతిరేకం. 

        ఒకవేళ రెండు కారణాలూ తోడై చంపడం కూడా కథా సూత్రమే అనుకుంటే, దీనికి వ్యతిరేకంగా దొరికిపోయే చిత్రణ సన్నివేశంలోనే వుంది. నేవీ స్కామ్ కి సంబంధించి చంపితే దేశభక్తి కిందికి రావచ్చు. వివాహేతర  సంబంధం దృష్ట్యా చంపితే దేశభక్తి ఎలా అన్పించుకుంటుంది?  చివరికి దేశ భక్తుడి కలరిస్తూనే కథ ముగించారు. మొదటిది వృత్తిగతమైతే, రెండోది వ్యక్తిగతం. చంపడం నేవీ యూనీఫాం వేసుకెళ్ళి చంపాడు. వ్యక్తిగత కక్ష, అందునా వివాహేతర  సంబంధమనే కారణానికి యూనిఫాం వేసుకెళ్ళి చంపి -తన యూనిఫాంకి చెడ్డ పేరు తెచ్చుకోడు బాధ్యత గల అధికారి అయిన హీరో. విలన్ అయితే ఇలాటి పాడు పన్లు చేస్తాడు.  రుస్తుంకి  యూనిఫాం వేసుకెళ్ళి మరీ చంపాలనిపించిందంటే,   అతను భార్యా ద్రోహం కంటే కూడా విక్రం దేశద్రోహాన్నే ఎక్కువ ఫీలైనట్టని అర్ధం వస్తోంది. కాబట్టి రెండు కారణాలతోనూ చంపాడనే మాట నిలబడదు. 

        పోను పోనూ సెకండాఫ్ లో భార్యా ద్రోహమనే అసలు పాయింటు మరగున పడిపోయి-  విక్రం దేశద్రోహం తద్వారా రుస్తుం దేశభక్తీ అనే పాయింటే ఎలివేట్ అవుతుంది. సెకండాఫ్ లో రివీలయ్యే దాని ప్రకారం, చంపే ముందు ఢిల్లీ కి కాల్ చేసి విక్రంని వదలనని డిఫెన్స్ సెక్రెటరీతో అనడం, స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ ఓపెన్ చేయడం వగైరా చర్యలన్నీ వివాహేతర సంబంధానికి సంబంధించినవి కావుగా? ఇలా  మొదలెట్టిన భార్య వివాహేతర సంబంధం కథ కాస్తా భర్త దేశభక్తి కథగా మారి పోయిందన్న మాట! ఇది కూడా ఒక కథా సూత్రమే నంటే ఇక చెప్పేదేమీ వుండదు. 

        కాబట్టి కథకి కీలక మలుపు అనదగిన, అసలు కథ ప్రారంభ మయ్యే మజిలీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర – రెండు కారణాల్లో ఏదో ఒక్కటే ఎక్కువ ఫీలయ్యి చంపాడను కోవాలి-  అప్పుడది  దేశభక్తి. ఎందుకంటే యూనిఫాంలో వెళ్లి చంపాడు.
        అంటే విక్రంతో తన భార్య అలా తిరగడాన్ని రుస్తుం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదా?

                                         ***
         ప్పుడు మిడిల్ కొస్తే, సింథియా పాత్రని ఎలాగైనా బాధితురాల్ని చేసి బయటపడెయ్యాలని విఫల యత్నం చేశారు కథలో. ఏమంటే విక్రమే ఆమెని మాయమాటలతో లొంగదీసుకున్నాడని చిత్రీకరణలు. ఈ చిత్రీకరణలో వర్షపు రాత్రి కారులో అతను హద్దుమీరుతూంటే తను ప్రతిఘటించాలి సింథియా. కానీ అలా చెయ్యదు. శుభ్రంగా మైకం కమ్మి లొంగిపోతుంది. యే రాస్తే హై ప్యార్ కే లో మత్తు మందు ఇచ్చి లొంగ దీసుకుంటాడు. కాబట్టి ఆశా  తప్పేం కన్పించదు. బాధితురాలని చెప్పొచ్చు. సింథియా ఎలా బాధితురాలవుతుంది?

          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర రుస్తుం భార్య బాధితురాలనే ఫీలయ్యి వెళ్లి దేశభక్తితో విక్రం ని చంపివుంటే భార్యని క్షమిస్తున్నట్టే. కానీ అప్పట్నించీ ఆమెతో మాటలుండవు. మిడిల్ విభాగంలో ఆమె జైలు కొచ్చి కలిస్తే
ఈమెని నేను  రిసీవ్ చేసుకోలేననే బాడీ లాంగ్వేజ్ తో,  చేతులు వెనక కట్టుకుని బిగుసుకుపోయి నిలబడి ఉంటాడు. అప్పుడామె చెప్పే ఫ్లాష్ బ్యాక్ లో విక్రంతో ఆ వర్షపు రాత్రి ఏం జరిగిందో తెలుసుకుని గొప్ప సానుభూతితో, ప్రేమతో, చేతులు ముందుకు తెచ్చి అన్యాయ  మైపోయిన సింథియాని కావలించుకుంటాడు. ఇది సిల్లీగా అన్పించడం లేదూ - ఫ్లాష్ బ్యాక్ లో చూపించేది ఆమె ఏమాత్రం ప్రతిఘటించకుండా లొంగిపోవడం...నిజానికి అతణ్ణి నెట్టేసి కారు దిగిపోయి పరిగెత్తాలి వర్షం పడ్డా, పిడుగులు పడ్డా! కానీ అలా చెయ్యలేదు. తమకంతో శుభ్రంగా లొంగిపోయింది. దీనికి రుస్తుం ఈమె బాధితురాలని శుభ్రంగా నమ్మి ఫిక్స్ అయిపోయాడు- ఆమె చెప్పే కహానీలు ఇప్పుడెలా నమ్మాలన్పించిందో!

          మిడిల్ లో భార్యా భర్తల కథ ఇలా కొలిక్కి వచ్చి, అంతా స్కామ్ కథగానే సాగుతుంది. భార్యాభర్తల మధ్య సమస్య మొదలై కొలిక్కి వచ్చే వరకూ ఇద్దరి మధ్యా దాని తాలూకు మానసిక సంఘర్షణే కన్పించదు.
యే రాస్తే హై ప్యార్ కే లో ప్రధాన కథ ఇదే. భార్యాభర్తల సంబంధం ఇప్పుడేమవుతుందన్నదే. వాళ్ళు తమ సంబంధాన్ని పునర్నిర్వచించుకునేందుకు పడే మానసిక సంఘర్షణే. ఇంతా చేసి ముగింపుని చెడిన ఆడదానికి స్థానం లేదనే అర్ధంలోనే పాత్రని తప్పించారు. కోర్టులో భర్త నిర్దోషి అని తేలడంతో, భార్య తను చేసిన మోసం తట్టుకోలేకో మరెందుకో గుండాగి చనిపోతుంది. 'చెత్త' అనుకుని ఊడ్చేశాడన్న మాట దర్శకుడు!

         
అచానక్ లో ప్రియుడితో సహా భార్యనీ చంపెయ్యడంలో కూడా ఇదే అర్ధం కన్పిస్తుంది- చెడిన ఆడదానికి స్థానం లేదని. చంపిన హీరోకి ఉరి శిక్ష వేస్తారు. కానీ దర్శకుడు గుల్జార్ సాబ్ మరీ ఇంత పురుషపక్షపాతి అంటే  లోకం నమ్మదు. కనుక కాస్త పురుషాధిక్య భావాన్ని సడలిస్తున్నట్టు- హతురాలైన భార్య పాత్రకి కొంచెం సెంటిమెంటు జోడించి తన ఇమేజిని బ్యాలెన్సు చేసుకున్నారు గుల్జార్ సాబ్. చనిపోతూ భార్య - ఈ పవిత్ర మంగళ సూత్రాన్ని గంగానదిలో నిమజ్జనం చేయమని చివరి కోరిక కోరుతుంది భర్తని. కాబట్టి ఇప్పడు ఉరి శిక్ష పడ్డ భర్త జైల్లోంచి తప్పించుకుని, మంగళ సూత్రాన్ని గంగానదిలో నిమజ్జనం చేయడానికి పారిపోతాడు. పోలీసులు వెంట పడతారు. ఇలా చట్టం- సెంటి మెంటు అనే బలమైన డ్రామాతో సినిమా హిట్టయ్యింది. 

         
రుస్తుం లో చెడిన ఆడదాన్ని శిక్షించలేదని, ఈ సినిమా మహిళల్ని ఆకట్టుకుంటుందనీ   హీరో అక్షయ్ కుమార్ సెలవిచ్చాడు. చాలా హిందీ సినిమాల్లో భర్త తప్పు చేస్తే భార్య క్షమిస్తుందనీ, కానీ ‘రుస్తుం’ లో తప్పు చేసిన భార్యని  భర్త క్షమిస్తాడనీ, ఇందుకే ఈ సినిమాని మహిళలు బాగా ఇష్టపడి మరొక్క సారీ చూస్తారనీ, కాపురాలు ముక్కలవకుండా, విడాకులకి దారితీయకుండా ఈ సినిమా పరిష్కారం చూపిస్తుందనీ స్టేట్ మెంట్ ఇచ్చి పారేశారు! దీనికి రకరకాల అర్ధాలు తీసి ఎంజాయ్ చేస్తున్నారు నెటిజనులు!

-సికిందర్ 
 (next : నేవీ స్కామ్ నడక) 
http://www.cinemabazaar.in

Monday, August 22, 2016

రివ్యూ!

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి
తారాగణం
:  సుశాంత్‌, సోనమ్‌ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ,
ఆనంద్,
పోసాని, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్‌ అబ్బాసీ, సుధ,
రమాప్రభ, తదితరులు
 కథ, మాటలు: శ్రీధర్ సీపాన, సంగీతం: అనూప్ రూబెన్స్,  ఛాయాగ్రహణం : సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
బ్యానర్స్: శ్రీ నాగ్ కార్పొరేషన్, శ్రీ జి ఫిలింస్
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల
విడుదల :  ఆగస్టు 19, 2016
***
        మూడేళ్ళ విరామం తర్వాత సుశాంత్ వస్తున్నాడంటే ఈసారైనా ఎండమావులైపోయిన సక్సెస్ ని కాస్తయినా సాధిస్తాడని ఆశిస్తారెవరైనా. కానీ ప్రయత్నంలో తన ప్రత్యేకత, తాజాదనం అంటూ  లేకుండా సాటి హీరోలు వాడేస్తున్న ఫార్ములానే గత్యంతరం లేనట్టు తనూ వాడేసుకుంటూ వస్తాడని ఎవరూ వూహించరు. వచ్చి బాక్సాఫీసు దగ్గర మళ్ళీ పాత కథే రిపీట్ చేస్తాడనీ అనుకోరు. తన లాంటి యంగ్ హీరో ఫ్రెష్ ఆలోచనలతో వుండే యంగ్ డైరెక్టర్లని అన్వేషించకుండా,  అదే పాతని ఆశ్రయిస్తే అశృనయనాలే మిగుల్తాయి. 

         
సుశాంత్ కి నటుడి అర్హత  99 శాతమూ వుండకపోవచ్చు- కానీ మిగిలిన ఆ ఒక్క శాతం మీద దృష్టి పెట్టి  ఆ మేరకు సినిమాలు ఒప్పుకుంటే తన కంటూ ఓ ప్రత్యేకమైన స్లాట్ ని సృష్టించుకోగలడు. కేర్ లెస్ గా వ్యవహరించే పాత్రల్లో తను బాగా రాణించగలడని గుర్తిస్తే, ఏ రకమైన సబ్జెక్టుకైనా తన పాత్రని అలా సృష్టింప జేసుకుంటే- ప్రేక్షకుల్లో తానంటే ఫలానా బ్రాండ్ హీరోగా ఒక అవగాహన, ఆకర్షణ  ఏర్పడవచ్చు - ‘కేర్ లెస్ సుశాంత్’ గా. ఇది తప్పదు, తమలో వున్న కొద్ది పాటి టాలెంట్ ఏమిటో దాన్నే నమ్ముకుని ఓ వెలుగు వెలిగిన నటులెందరో  వున్నారు. సుశాంత్ ఆల్ రౌండర్ మాస్ గీస్ లవ్ గివ్ హీరో అంటూ కూర్చుంటే మాత్రం ఇలాగే కదలిక కన్పించదు. 

        ‘ఈడోరకం- ఆడోరకం’  అని ఒక పరభాషా  రిమేక్ చేసిన కామెడీ సినిమాల దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి-  చిన్నా పెద్దా ప్రతీ హీరో అదే తన మూస ఫార్ములాలోకి ఇమిడిపోవాలని ఆశించడం చాలా అన్యాయం. సుశాంత్ కి ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ నివ్వకుండా,  విడిపోయిన కుటుంబాలని  కలిపే బరువు బాధ్యతల పాత చింతకాయ పరోపకారి పాపన్నని అంటగట్టడం హాస్యాస్పదం. నిర్మాతలు కూడా ఇలాటి సినిమా సుశాంత్ కి ఎందుకు ఒప్పుకున్నారో అర్ధంగాదు, ఇదేదో ఆడా మగా అందరూ తరలివచ్చే ఫ్యామిలీ కథగా అన్పించేదేమో. కానీ ఇప్పుడు తెలుగు ఫ్యామిలీ కథలు వయొలెంట్  రౌడీ మూకల కుటుంబ కథలుగానే వుంటున్నాయి అభ్యంతరకరంగా.
         ‘ఆటాడుకుందాం రా...’ లోనూ ఇదే పరిస్థితి- కాకపోతే కుటుంబాలు లేని రౌడీల గోల.

కథ
          విజయ రాం ( మురళీ శర్మ), ఆనంద రావు (ఆనంద్) మంచి మిత్రులు. ఆనంద్ సలహాలతో విజయ్ రాం వ్యాపారంలో బాగా ఎదుగుతాడు. ఇది ఓర్వలేని శత్రువు మిత్రులు విడిపోయేలా చేస్తాడు. విజయ రాం తీవ్రంగా నష్టపోతాడు. తన నష్టాలకి ఆనందరావే కారణమని నమ్మి విడి పోతాడు. పాతికేళ్ళ తర్వాత ఓ రైసు మిల్లు నడుపుకుంటున్న విజయ రాం తమ్ముడి కూతురు పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందుకు మిల్లు అమ్మబోతే తక్కువకి కొట్టేయాలని అదే పాత శత్రువు పథకాలేస్తాడు. మిల్లు అమ్మకానికి విజయ్ రాం చెల్లెలు కూడా సంతకం పెట్టాల్సి వుంటుంది. చెల్లెలు తన మాట వినకుండా వేరే పెళ్లి చేసుకోవడంతో ఆమెతో కూడా తెగతెంపులు చేసుకున్నాడు విజయ రాం. ఇప్పుడు అమెరికాలో వుంటున్న  చెల్లెలి అవసరం వచ్చింది. చెల్లెలు రాలేక కొడుకుని పంపు తానంటుంది. అక్కడ ఈ కొడుకూ కార్తీక్ (సుశాంత్) మంచి మిత్రులు. కార్తీక్ ఆనందరావు కొడుకు. తన తండ్రి మీద అభండాలేసి విడిపోయిన విజయ రాం అపార్ధాలు తొలగించి తిరిగి ఇద్దర్నీ కలపాలంటే ఇదే అవకాశమనుకుంటాడు. ఇందుకు విజయరాం మేనల్లుడి వేషం కట్టి విజయరాం ఇంట్లో దిగుతాడు. ఈ మేనల్లుడన్నా విజయ రాం కిష్టం లేదు. కానీ ‘మేనల్లుడు’ కార్తీక్ మిల్లు అమ్మకానికి అడ్డుపడుతున్న శత్రువుల పని పట్టడం మొదలెడతాడు. పనిలోపనిగా విజయ్  రాం కూతురు శృతి నీ ప్రేమిస్తాడు. పాత  శత్రువులతోనూ ఆటలాడుకోవడం మొదలెడతాడు.... 

 ఎలా వుంది కథ
       
గుండమ్మ కథ, రాముడు భీముడు, సంబరాల రాంబాబు, ఇంటింటి రామాయణం మొదలైన వాటితో బాటు సుశాంత్ తాతగారు అక్కినేని నాగేశ్వర రావు, మామగారు అక్కినేని నాగార్జున  నటించిన పాత సినిమాలన్నీ అర్జెంటుగా చూసెయ్యాలన్పించేలా వుంది.  ఇలాటి ‘ఆటాడుకుందాం రా’ బాపతు సోకాల్డ్  ఫ్యామిలీ- కామెడీ సినిమాలకి ధూమ పాన- మద్యపాన హెచ్చరికలకి బదులు- ‘ఈ సినిమా చూడడం మీ ఆరోగ్యానికే చాలా ప్రమాదకరం, వెంటనే మరికొన్ని  పాత సినిమాల్ని మాత్రలుగా వేసుకుంటే రోగం నిదానిస్తుంది’  అని వేయాలని రూలు తేవాలి. 

ఎవరెలా చేశారు
        రూపు రేఖల విషయంలో సుశాంత్ ఇంప్రూవ్ అయ్యాడు. ఇందాక  పైన చెప్పుకున్నట్టు ఈ సినిమాలో అతడి నటనలో పట్టుకోగల ఒకేఒక్క ప్లస్ పాయింట్  కేర్ లెస్ గా ప్రవర్తించే సన్నివేశాల్లో  రాణింపు. మరొకరికి లేని ఒక గమ్మత్తయిన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ఇలా నటించడంలో తనకున్నాయి. కేర్ లెస్ గా ప్రవర్తించే పాత్ర అతడి యూనిక్ సెల్లింగ్ పాయింట్ కాగలదు. నేటివిటీ, కమర్షియాలిటీ, యూత్ ట్రెండ్ అన్నిటికీ నప్పే పాజిటివ్ కోణం. అయితే డైలాగులు చెప్పేటప్పుడు సాధ్యమైనంత వరకూ క్లోజప్స్ కి దూరంగా వుం డాల్సిన సమస్య మాత్రం అలాగే వుంది- హిందీలో ఇమ్రాన్ హాష్మీకి  లాగా!

        హీరోయిన్ సోనం బజ్వాకి పెద్దగా గ్లామర్ లేదు, సినిమాలో పనికూడా లేదు. ఫస్టాఫ్ లో మళ్ళీ అదే మార్పులేని పృథ్వీ పేరడీ, సెకండాఫ్ లో బ్రహ్మాండం మళ్ళీ అదే మార్పు లేని కన్ఫ్యూజ్ కామెడీ తో వాళ్ళాటేదో వాళ్ళు ఆడుకుంటారు. ఛోటా విలన్ గా పోసాని పరిస్థితీ ఇదే. ఈ ముగ్గుర్నీ చూసి ఒక్క మాస్ ప్రేక్షకుడు కూడా ఈల వేయలేదంటే ఇది ప్రమాద ఘంటికే.  వెన్నెల కిషోర్, రమాప్రభ, సుధ, రఘుబాబు ఇంకా చాలామందితో కూడిన తారాగణముంది ఈ కుటుంబ కామెడీలో. 

        అనూప్ రూబెన్స్ సంగీతం కూడా మనసుపెట్టి చేయలేదు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం రొటీనే. దర్శకత్వం రొటీనే, డైలాగులు ఇంకా గిరిగీసుకున్న అవే సినిమా మూస డైలాగుల్లా వున్నాయి. అవే తిరగేసి మడతేసి వాడేశారు. వాటిని డైలాగు లనుకుంటున్నారు. సృజనాత్మక హస్యమనేది ఎక్కడా కన్పించదు డైలాగుల్లో. 

చివరికేమిటి?
       
సలు విషయ మేమిటంటే, ఇది కామెడీ సినిమా కాదు. ఇందులో కామెడీ లేదు. కామెడీ కోసం కష్ట పడలేదు. కొన్ని సినిమాల్ని ముందేసుకుని వాటిని పేరడీ చేస్తే అదే కామెడీ అయిపోతుందనుకుంటున్న  గుట్టంతా మళ్ళీ ఇక్కడ రట్టయింది. ఇదే కామెడీ అని హీరోల్నీ నిర్మాతల్నీ నమ్మించగల్గుతున్నారు- ప్రేక్షకుల్ని నమ్మించలేక పోయినా ఫర్వాలేదు- ప్రేక్షకు లెవరిక్కావాలి? నిర్మాతలూ హీరోలూ నమ్మితే చాలు - సినిమా చేతిలో పడుతుంది, పని దొరుకుతుంది, సునాయాసంగా లక్షలు జేబులో పడిపోతాయి. చాలా సుఖమైన కుటీర పరిశ్రమ. 

        ఇలా పృథ్వీని టీవీ దర్శకుడిగా చూపించి, అతడి చేత బాహుబలి సీరియల్ ని డైరెక్ట్ చేయించే ఎపిసోడ్లు కొన్ని పెట్టుకుని లాగించేస్తే ఫస్టాఫ్ సగం గడిచి పోతుంది. అలాగే బ్రహ్మానందంతో ఆదిత్య- 369 ని ఆదిత్య -469 గా మార్చి టైం మెషిన్ తో పేరడీ చేస్తే సెకండాఫ్ సగం కూడా  గడిచిపోతుంది. ఈ పేరడీని పేరడీ అంటే నామోషీ. అందుకని ‘స్పూఫ్’  అని అందమైన పేరు పెట్టుకున్నారు. గారడీ వాళ్ళలాగా ఇలా కొన్ని ‘స్పూఫ్’ లు చేస్తే అదే కామెడీ అనుకుని పైసలు విసిరెయ్యాలి. ప్రతీ తెలుగు సినిమాలో కామెడీని సృష్టిం చలేని అసమర్ధతని ఇలా కప్పి పుచ్చుకుంటున్నారు. ఈ ‘స్పూఫ్’ ల మీద ఆధారపడి బతికేస్తున్న వాళ్ళ మీద నడ్డి విరిగే రైట్స్ ని సదరు సినిమాల నిర్మాతలు వసూలు చేస్తే గానీ, ఈ బెడద తెలుగు కామెడీకి తప్పేలా లేదు. ఈ ‘స్పూఫ్’ ల దుకాణాలు తెలుగు కామెడీకి బెల్టు షాపుల్లాంటివి. 

        సినిమాని నింపాలంటే ఈ ‘స్పూఫ్’ లతో బాటు ఇంకో శ్రమ లేని పనేమిటంటే,  సుశాంత్ లాంటి హీరో వుంటే అతడి కుటుంబ నేపధ్యాన్ని వాడుకుని తాతగారి నామస్మరణాలూ; నాగచైతన్య, అఖిల్ లని కూడా  క్లయిమాక్స్ లో రప్పించుకుని గెస్ట్ అప్పీరియన్సులూ ఇప్పించుకోవడాలూ చేస్తే చేతికి మట్టి అంటకుండా పని జరిగి పోతుంది. ఇంకా సుశాంత్ మీద  ‘దేవదాసు’ లో ‘పల్లెకు పోదాం’ పాట రీమిక్స్ చేసి కూడా నాశనం పట్టించి లాగించెయ్యొచ్చు. సొంత ఔట్ పుట్ అనేది ఒక్క ముక్క లేకుండా,  ఎవరెవరివో క్రియేటివిటీలని అడ్డంగా వాడేసుకుని వెటకారాలు చేస్తే అదే కామెడీ, అదే సినిమా, అదే ఆట అయిపోయి - ఆటాడుకుందాం రమ్మని ఇలా పిలుస్తారు కట్ అండ్ పేస్ట్ దర్శకులు –రచయితలు.


-సికిందర్


Sunday, August 21, 2016

స్క్రీన్ ప్లే సంగతులు!

    ఒక ఒరలో రెండు కత్తులుఇమడవన్నట్టు - ఒక సినిమాలో రెండు కథలుఇముడు
తాయా? ఇమడవు కాబట్టి నడుస్తున్న ఒక కథని తీసేసి ఇంకో కథని పెట్టేయవచ్చా?అప్పుడది కత్తి లాంటి కథగా మారి  మెరిసే కత్తిలాంటి సినిమా అన్పించుకుంటుందా? ఒరలో వున్న ఒక కత్తి అయితే కత్తిలానే వుంటుంది. ఎందుకంటే  కలిసివున్నా విడిగా వున్నాఅది  పూర్తి కత్తే కాబట్టి. సినిమాలో ఒక కథని పంపించేసిన ఇంకో కథ పూర్తి కథ అవమంటే అవుతుందా? మనం ప్రయత్నించిన బ్యాంకు లోను శాంక్షన్ అవుతూండగా మనం వెళ్లి-   ఇప్పుడు లోను వద్దండీ, కాస్త జాబ్ వుంటే ఇవ్వండీ -అంటే ఎలావుంటుంది? కథ జాబ్ గురించి అయినప్పుడు మొదట్నించీ జాబ్ గురించే నడవాలి. కానీ లోను గురించి నడుస్తున్న కథని వదిలేసి  మధ్యలో జాబ్ గురించిన కథని ఎలా అందుకుంటారు? ఈ పైకి కన్పించని తికమకతోనే  ‘రుస్తుం’ ముస్తాబైంది.

          ర్శకుడు టినూ సురేష్ దేశాయ్ క్రితం ‘1920 లండన్’ తీశాడు. రచయిత విపుల్ కె. రావల్ 2005 లో ‘ఇక్బాల్ ‘అనే హిట్ సినిమాకి మొదటి స్క్రిప్టు ఇచ్చి, తర్వాత మరో అంతగా పేరు లేని మూడు మల్టీ ప్లెక్స్ సినిమాలకి రాశాడు. ఇతను 1988 లో నావికాదళంలో చేరి కొన్నాళ్ళు  ఉద్యోగం చేశాడు. అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీలంకకి పంపిన శాంతి సేనలో  తనుకూడా దళ సభ్యుడిగా వెళ్ళాడు. తర్వాత సినిమాల మీద ఆసక్తితో నేవీలో ఉద్యోగం మానేశాడు.  ‘రుస్తుం’  కూడా నేవీ ఆఫీసర్ కథే. అయితే నేవీ నేపధ్యంలోంచి వచ్చిన రైటర్ విపుల్ ఇందులో  నేవీకి సంబంధించిన అంశాలతో చాలా గడబిడ చేశాడు. అక్షయ్ కుమార్ యూనిఫాంలో దొర్లిన అనేక  తప్పుల్ని కూడా పట్టించుకోలేదు. ఈ కింది ఫోటో చూస్తే తేటతెల్లమవుతుంది.

(Courtesy :  Sandeep Unnithan, Executive Editor,  India Today )
       1959 నాటి నేవీ కమాండర్ యూనిఫాంకి సాంతం ఆ తదనంతర కాలపు మెడల్స్, ఆహార్యమూ వున్నాయంటే ఏం రీసెర్చి చేసినట్టని  మనకి సందేహం వస్తుంది. ఈ పాత్ర వాడిన ఆయుధం  కూడా బెరెట్టా ఎం 9 రకం పిస్టల్ అనీ, కానీ నేవీలో ఆ కాలంలో స్మిత్ అండ్ వెస్సన్, వెబ్లే అండ్ స్కాట్ రకం రివాల్వర్సే వాడేవారనీ  ‘ఇండియా టుడే’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కథనం. ఈ ఫోటో రకరకాల సెటైర్లతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా యూనిఫాంకీ ఆయుధాలకీ  కూడా లాజిక్ అవసరం లేదా? లోకం నవ్వుకున్నా  ఫరవా లేదా? ప్రేక్షకులకి కథని, పాత్రనీ అడ్డగోలుగా చూపించేసి హిట్ చేసుకోవడం కూడా ఓ రచనా - దర్శకత్వం అన్పించుకోవేమో? ప్రేక్షకుల్ని అజ్ఞానంలో వుంచడమో లేదా అపోహలు కల్గించి వదలడమో చేస్తే- కళా, సామాజిక  బాధ్యతా అనే పెద్ద మాటల్ని    పక్కన పెడదాం - అసలు  వ్యాపారపరంగానే ఇది సరైంది కాదేమో? ప్రేక్షకులు కష్టపడి సంపాదించిన అసలీ నోట్లు ఇస్తున్నప్పుడు, వ్యాపారం కూడా అసలీ సరుకుతోనే  పక్కగా చేయాలేమో? పాత్రనీ  కథనీ  ఇష్టమొచ్చినట్టు గంగిరెద్దులా ముస్తాబు చేసి జనం మీదికి తోలేస్తే సరిపోయిందా? 

        సినిమా సూపర్ హిట్టయ్యింది కదా- ఇంకా లోపాల గొడవ ఎవరిక్కావాలి అనొచ్చు. హిట్టు హిట్టే, గుట్టు గుట్టే. మరొకరు దీన్ని అనుసరించి ఇలాగే లోపలమయంగా అడ్డగోలుగా తీసేస్తే హిట్టవుతుందనుకోవచ్చు. చేతులు కాల్చుకోవచ్చు. ఎంత హిట్టయినా లోపాలు మాఫీ అయిపోవు. ఈ సినిమాలో లోపాల తీవ్రత మరీ హద్దు మీరినందుకే  ఇంత పోస్ట్ మార్టం చేయాల్సి వస్తోంది...

        అజ్ఞానం, అపోహలు ఈ రెండిటి వ్యాప్తికే అన్నట్టు ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా సాగింది. ముందుగా ఈ స్క్రీన్ ప్లే ఎలా సాగిందో చూద్దాం :

          బిగినింగ్ : యుద్ధ నౌక మీద రుస్తుం  కమాండర్ గా పరిచయమవుతాడు. ఒక ఆపరేషన్ మధ్యలో ఉండగానే రద్దయి నౌక తిరుగు ప్రయాణం కడుతుంది. ఇక సెలవులు ఎంజాయ్ చేయవచ్చని సిబ్బంది  అంతా ఆనందిస్తారు. ఆ హాలిడే మూడ్ తో రుస్తుం కూడా బొంబాయి లోని తన ఇంటికి బయల్దేరతాడు.  భార్య సింథియా జ్ఞాపకాలు నెమరేసుకుంటూ అతను  తిరిగి వస్తూంటే,  మాంటేజెస్ తో   టైటిల్  సాంగ్ మొదలవుతుంది. ఈ మాంటేజెస్ లో  సింధియాతో అతడి  పరిచయం, ప్రేమా, పెళ్ళీ,  కాపురమూ వగైరా మనకి తెలుస్తాయి. 

       అతను  ఇంటి కొచ్చేసరికి సింథియా ఉండదు. మొన్ననగా ఎక్కడికో వెళ్లి ఇంకా రాలేదని పని మనిషి చెబుతుంది. అతడికి అర్ధం గాక ఆమె పర్సనల్ వస్తువులు చెక్ చేస్తాడు. చాలా ఉత్తరాలూ గిఫ్టు లూ కన్పిస్తాయి. ఉత్తరాలు విక్రం మఖీజా అనే అతను   రాసినవి. అతనొక యువ పారిశ్రామిక వేత్త అని రుస్తుం కి తెలుసు. కొంత పరిచయం కూడా వుంది.  అతను సింథియాకి  రాసిన ఉత్తరాలన్నీ  ప్రేమలేఖలే. వాటిలో తాజా లేఖ చాలా విరహంతో రాసినట్టు వుంటుంది. మనం గడిపిన మధురమైన రాత్రుల్ని ఎలా మర్చిపోతావ్, నన్ను ఒంటరిగా ఎలా గడపమంటావ్, వచ్చేయ్- అని.  రుస్తుం షాకవుతాడు. వెంటనే విక్రం బంగళా కెళ్ళి దూరం నుంచి చూస్తాడు. బాల్కనీలో సింథియా నిలబడి వుంటుంది. వెనకనుంచి వచ్చి విక్రం ఆమెని తీసుకు పోతాడు.

        మర్నాడు  ఆమె ఇంటికొచ్చేసరికి ఆ ఉత్తరాలు చదవడం మొదలెడతాడు రుస్తుం. ఆమె బిగుసుకు పోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందని ఏడుస్తుంది. విక్రం నావల్ బేస్ కి వెళ్ళిపోతాడు. అక్కడ లాకర్ లోంచి తన రివాల్వర్ తీసుకుంటాడు. విక్రం ఆఫీసు కెళ్తే అతనక్కడ వుండదు, ఇంటి కెళ్ళి అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకుని వస్తున్న విక్రం ఛాతీ పైకి మూడు సార్లు కాల్పులు జరిపి చంపేస్తాడు. పోలీస్ స్టేషన్ కెళ్ళి లొంగిపోతాడు. 

        మిడిల్ : నేవీ అధికారులు వచ్చి విక్రం కస్టడీని అడుగుతారు. కానీ  విక్రం పోలీస్ కస్టడీలోనే ఉంటానని అంటాడు. కోర్టు కూడా అనుమతించడంతో జ్యూడీషియల్ రిమాండ్ కింద జైలు కెళ్తాడు. విచారణా ధికారియైన సీనియర్ ఇన్స్ పెక్టర్ కేసు దర్యాప్తు పూర్తి చేసి ప్రాసిక్యూషన్ కి సిద్ధమవుతాడు. విక్రం లాయర్ ని పెట్టుకోవడానికి కూడా ఒప్పుకోడు. కేసు తనే వాదించుకుంటా నంటాడు. అలాటి పక్షంలో ఒకవేళ రుస్తుం  కేసు ఓడిపోతే అప్పీల్ చేసుకునే అవకాశం  ఉండదని జడ్జి హెచ్చరిస్తాడు. ఇందుకూ సిద్ధపడతాడు రుస్తుం. సాక్షుల విచారణ ప్రారంభమవుతుంది. ఎనిమంది మంది జ్యూరీ సభ్యులు వచ్చి కూర్చుంటారు. కోర్టు హాలు క్రిక్కిరిసి పోతుంది. గ్యాలరీలో సింథియా, విక్రం చెల్లెలు ప్రీతీ, ఈ కేసు మీద సంచలన వార్తలు ప్రచురిస్తున్న పత్రికా యజమానీ ఇంకా చాలామంది వుంటారు. సాక్షులు ఒక్కొకర్నే పిల్చి ప్రాసిక్యూటర్ ప్రశ్నిస్తూంటాడు. విక్రం ఇంట్లో పనివాడు, ఆఫీసులో రిసెప్షనిస్టు, విక్రం చెల్లెలు ప్రీతీ,  విచారణాధికారీ  సహా ప్రాసిక్యూషన్ తరపు మరెందరో సాక్షులు  పూర్తి అబద్ధాలు చెబుతారు రుస్తుం కి ఎఫెక్ట్ అయ్యేలా. రుస్తుం వాళ్ళందర్నీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ చిత్తు చేస్తాడు. 

       ఇలా  కేసు నడుస్తున్న క్రమంలో రుస్తుం  ఇంటి మీద దాడి జరుగుతుంది. దుండగులు దేనికోసమో వెతికి వెళ్ళిపోతారు. ఈ విషయం చెప్పడానికి సింథియా జైలుకొస్తుంది. ఇప్పటి వరకూ ఇద్దరి మధ్యా మాటల్లేవు. ఆమెని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్ధం కాదు రుస్తుంకి. ఓపిక పడితే అసలు విక్రంతో ఎలా జరిగిందో చెప్తానంటుంది...

        ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది : రుస్తుం కొన్ని నెలలపాటు డ్యూటీలో వున్న అవకాశం చూసుకుని, విక్రం ఎలా వెంటబడి తనని  ట్రాప్ చేశాడో, అందుకు అతడి చెల్లెలు ప్రీతి కూడా ఎలా పథకం ప్రకారం సహకరించిందో అంతా చెప్పుకొస్తుంది. ఒక రాత్రి వర్షంలో దెబ్బ తగిలి నిస్సహాయ స్థితిలో వున్న తనని లోబర్చుకున్నాడనీ, అక్కడ్నించీ ఇక వద్దన్నా వదల్లే దనీ, ఉత్తరాలు కూడా  రాస్తూ  బలవంత పెట్టాడనీ...ఇలా చెప్పుకొస్తుంది. 

        రుస్తుం కొంచెం కరుగుతాడు. అప్పుడు ఇంటి మీద దాడిజరిగిన విషయం చెప్తుంది. ఆ దాడి ఎందుకు  జరిగిందో రుస్తుం ఆమెకి చెప్పి, ఆ నేవీ అధికారులకి డిమాండ్ పెట్టమని చెప్పి ఒక కవరిస్తాడు. అందులో రుస్తుం స్విస్ బ్యాంక్ అక్కౌంట్ వివరాలుంటాయి. 

        ఆమెని కలిసిన నేవీ అధికారులు,  రుస్తుం దగ్గరున్న పత్రాలు అందిస్తే పది లక్షలే ఇస్తామంటారు.  రుస్తుం ఐదు కోట్లు అడిగాడని ఆమె ఆ కవరందిస్తుంది. మండిపడ్డ అధికారి, చివరికి ఐదుకోట్లూ స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ లో వేసేందుకు ఒప్పుకుంటాడు. 

        ఇటు కోర్టులో విచారణ ఇంకా కొనసాగుతుంది. రుస్తుం ఇంట్లో పనిమనిషి కూడా వచ్చి, ఏ భర్తయినా ఏం చేస్తాడని జడ్జిని ఎదురు ప్రశిస్తుంది. మీ ఆవిడే ఇంకొకడితో పోతే మీరేం చేస్తారని దబాయిస్తుంది. బుర్ర తిరిగిన జడ్జి కోర్టు ధిక్కారం కింద ఆమెని లోపలేయిస్తాడు. పత్రికా యజమాని కూడా కేసు మీద ఇష్ట మొచ్చిన కథనాలు ప్రచురిస్తూ రోజూ వచ్చి జడ్జి ముందు ఫోజులు కొడుతూంటే,  రోజూ జైల్లో వేయిస్తూంటాడు జడ్జి.  

        రుస్తుం ఈ హత్యని పథకం ప్రకారం చేశాడని ప్రాసిక్యూటర్ వాదిస్తాడు. కాదు, ఆత్మరక్షణ కోసమే చేశానంటాడు రుస్తుం. తను ఉద్దేశపూర్వకంగా రివాల్వర్ తీసి కెళ్ళింది విక్రం నుంచి ఆత్మ రక్షణ కోసమే నంటాడు. హత్య చెయ్యాలని  పథకం ప్రకారం వెళ్లి వుంటే,  నావల్ బేస్ లో తన రివాల్వర్ తీసుకుని రిజిస్టర్ లో ఎంటర్ చేసే వాణ్ణి కాదంటాడు. రిజిస్టర్ లో ఎంటర్ చేయకుండా సొంత లాకర్ లోంచి రివాల్వర్ని తీసికెళ్ళి, తిరిగి తెచ్చి పెట్టేసే వెసులుబాటు నేవీ కల్పించిందని వివరిస్తాడు. కాబట్టి తను హత్య చేయడానికే రివాల్వర్ తీసికెళ్ళ లేదని ప్రూవ్ అయ్యేందుకే,  కావాలని రిజిస్టర్ లో ఎంటర్ చేశానంటాడు రుస్తుం. 

        ఇక ఆత్మరక్షణ ఆలోచన ఎందుకొచ్చిందంటే, విక్రం క్షణికావేశాన్ని కళ్ళారా  చూశానని,  ఒకరోజు క్లబ్ లో జరిగిన సంఘటనని  వివరిస్తాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో- క్లబ్ లో  బేరర్ తెచ్చిన పదార్ధం పొరపాటున మీద పడితే  రెచ్చిపోయిన విక్రం పిస్టల్ తీసి కాల్చేయబోతాడు, రుస్తుం అడ్డుకుని ఆపుతాడు. 

         కాబట్టి విక్రం స్వభావం తెలుసు గనుక,  అలా ముందు జాగ్రత్తగా ఆత్మరక్షణ కోసమే రివాల్వర్ పెట్టుకుని వెళ్తే, అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చిన విక్రం తనని చూసి రెచ్చిపోయి పిస్టల్ తీసి ఫైర్ చేయబోయాడనీ, తను అడ్డుకుని పెనుగు లాడాననీ, మాట్లాడుకుందామని ఎంత చెప్పినా విన్పించుకోకుండా ఆ ఘర్షణలో తన పిస్టల్ అందుకుని  ఫైర్ చేశాడనీ, అప్పుడు తనూ ఫైర్ చెయ్యక తప్పలేదనీ  ఇంకో ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు రుస్తుం. 
        మరైతే ఆత్మరక్షణ కోసం మూడు సార్లు ఎందుకు కాల్చారని అడుగుతాడు ప్రాసిక్యూటర్. రుస్తుం నేవీ మాన్యువల్ చూపించి,  తమకి ఇలాగే శిక్షణ ఇచ్చారని అంటాడు. 

        మీ ఇద్దరి మధ్య అంత ఘర్షణ జరిగితే మీ యూనిఫాం ఎందుకు చెక్కు చెదర లేదని, విక్రం చుట్టుకున్న టవల్ కూడా ఎందుకు వూడిపోలేదనీ ప్రశ్న లేవదీస్తాడు ప్రాసిక్యూటర్. మేం మట్టిలో పడి కొట్టుకోలేదని జోకేసి అతడి నోర్మూయిస్తాడు  రుస్తుం. నావల్ బేస్ నుంచి  విక్రం ఇంటికి పది నిమిషాల్లో చేరుకో వచ్చు, మీరు గంట తర్వాత చేరుకున్నారు, అంతసేపూ ఎక్కడున్నారని ప్రాసిక్యూటర్ మరో ప్రశ్న వేస్తే రుస్తుం నోటికి తాళం పడిపోతుంది. 

        ఆ గంట కాలాన్ని లెక్క తీయడానికి ఇన్స్ పెక్టర్ నడుం కడతాడు. ఆ సమయంలో రుస్తుం ఢిల్లీలో డిఫెన్స్ సెక్రెటరీతో  ట్రంక్ కాల్ మాట్లాడాడనీ, స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ కూడా ఓపెన్ చేశాడనీ తెలుసుకుంటాడు. ఢిల్లీ వెళ్లి డిఫెన్స్ సెక్రెటరీని  కలుసుకుంటాడు. డిఫెన్స్ సెక్రెటరీ తమ కొచ్చే ట్రంక్ కాల్స్ అన్నిటినీ  రికార్డ్ చేస్తామనీ,  ఆ రోజు రుస్తుం తనతో ఏం మాట్లాడాడో  వినిపిస్తాననీ చెప్పి టేపు ఆన్ చేస్తాడు. ఆ టేపు తెచ్చి కోర్టుకు సమర్పిస్తాడు ఇన్స్ పెక్టర్. దాన్ని ప్లే చేస్తే,  ఆ టేపులో రుస్తుం గొంతుతో- ‘నేను విక్రం దగ్గరికి వెళ్తున్నాను, వాణ్ణి వదలను!’  అన్న మాటలుంటాయి.
        దీంతో రుస్తుం ఆత్మరక్షణా వాదం వీగిపోతుంది. ఇక జ్యూరీ ఓటింగ్ కి సిద్ధమవుతుం ది.

          ఎండ్ : జైల్లో రుస్తుం ని కలుసుకుంటాడు ఇన్స్ పెక్టర్. తనేం  మాట్లాడాడో  మొత్తం టేపు కోర్టుకి విన్పించలేదని,  విన్పించి వుంటే ఈ హత్య ఎందుకు చేశాడో  అర్ధమయ్యేదనీ అంటాడు రుస్తుం. ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు- బ్రిటన్ లో అమ్మకానికొచ్చిన ఒక యుద్ధనౌకని కొనుగోలు చేయాలని నిర్ణయించింది నావికా దళం. ఇన్స్ పెక్షన్ అధికారిగా రుస్తుం వెళ్లి పరిశీలిస్తే, యుద్ధ నౌక అన్ ఫిట్ అని తేలింది. కాదు, పాజిటివ్ రిపోర్టు ఇవ్వాలని నేవీ అధికారులు ఒత్తిడి చేశారు. డబ్బాశ కూడా చూపెట్టారు. అప్పుడు దీని వెనుక వున్న అసలు  శక్తి విక్రం కూడా బయట పడ్డాడు. ఈ సమస్య  నలుగుతోంది. ఒత్తిడి పెరిగిపోయి రుస్తుం బ్లాక్ మెయిల్ చేయసాగాడు - వాళ్ళు  చేస్తున్న స్కామ్ తాలూకు పత్రాలు తన దగ్గరున్నాయని.  దీంతో సమస్య ముదిరింది. డిఫెన్స్ సెక్రెటరీకి చెప్పుకుంటే ఇతనూ సిండికేటులో ఒక కేటు అని తేలింది. పత్రాలివ్వడానికి ఐదు కోట్లకి బేరం పెట్టాడు. దీని గురించే ఆ రోజు డిఫెన్స్ సెక్రెటరీతో ట్రంక్ కాల్ మాట్లాడాడు. ఆవేశంలో విక్రంని వదలనని అనేశాడు...

        ఈ ఫ్లాష్ బ్యాక్ విన్న ఇన్స్ పెక్టర్- ఇది దేశం కోసం రుస్తుం చేసిన సాహసమని తెలుసుకుని అభినందిస్తాడు. విక్రంని  దేశభక్తితో చంపాడన్న మాట. మరి ఆ రహస్య పత్రా లేమయ్యాయని అడిగితే, ఏ పత్రాలూ తన దగ్గర లేవనీ,  అలా బుకాయించాననీ తేల్చేస్తాడు రుస్తుం. 

        జ్యూరీ వాదోప వాదాలాడుకుని ఓటింగ్ చేస్తారు. అది రుస్తుం  నిర్దోషి అని ఏకగ్రీవ ఓటింగ్. జడ్జి ఆమోదిస్తాడు. హర్షధ్వానాల మధ్య రుస్తుం విడుదలై పోయి, భార్య సింథియాని క్షమించి అక్కున జేర్చుకుంటాడు.

పోస్ట్ మార్టం !
       స్ట్రక్చర్ పరంగా రచన పకడ్బందీగా వుంది. స్క్రీన్ ప్లేకి ముఖ్యమైనవి రెండే : స్ట్రక్చర్, యాక్టివ్ క్యారక్టర్.  చాలా త్వరగా రుస్తుం విక్రం ని చంపడంతో బిగినింగ్ విభాగాన్ని ముగించేసి, ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రుస్తుం కి గోల్ ఏర్పడాలి. కానీ చంపి లొంగి పోయాక గోల్ ఏముంటుంది? బంతిని వ్యవస్థ కోర్టులో పడేసినట్టు జైల్లో కూర్చున్నాడు, నిజ జీవితంలో నానావతి లాగే. నిజ జీవితం లాగా సినిమా వుండదు కాబట్టి పాసివ్ గా వున్న హీరోని యాక్టివ్ చేయాలి. అందుకని నిజజీవితంలో నానావతికి లేని ఉద్దేశాల్ని  ఆపాదించారు. అది రుస్తుం తన కేసుని తానే వాదించుకునేట్టు చేయడం.  ఇది ఇంటర్వెల్ కొస్తుంది. ఇక్కడ జడ్జి గోల్ ఎలిమెంట్స్ లో భాగంగా పరిణామాల హెచ్చరిక కూడా చేశాడు- కేసు ఓడిపోతే అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని. అయినా రిస్కు తీసుకున్నాడు రుస్తుం. 

        ప్లాట్ పాయింట్ వన్ దగ్గరనుంచీ ఇదంతా మిడిల్ విభాగమే. మిడిల్ అంటే సమస్యతో సంఘర్షణ కాబట్టి- తన ముందున్న కేసుతో సంఘర్షిస్తూ పోయాడు. ఈ ప్రయాణంలో,  అంటే కోర్టు వాదోప వాదాల్లో, ఎదురు దెబ్బలు తింటూ- ఎదురు దెబ్బ తీ స్తూ మిడిల్ కి స్క్రీన్ ప్లే సూత్రాల్ని తుచ తప్పకుండా పాటించాడు. సెకండాఫ్ లో ఈ మిడిల్ ముగుస్తూ ఏర్పడిన ప్లాట్ పాయింట్ టూ దగ్గర,  డిఫెన్స్ సెక్రెటరీ లీక్ చేసిన టేపుతో కోలుకోలేని దెబ్బ తగిలి చతికిల బడిపోయాడు. ప్లాట్ పాయింట్ టూ దగ్గర సరీగ్గా జరగాల్సిన సంఘటనే  జరిగింది. హీరో పోరాటంలో అన్ని దారులూ మూసుకుపోయి దిక్కుతోచని స్థితిలో పడ్డం ప్లాట్ పాయింట్ టూ లక్షణం. ఇలా జడ్జి చేసిన పరిణామాల హెచ్చరిక కూడా నిజమైంది. 

        ఇప్పుడేం చేస్తాడు రుస్తుం?  సూత్రాల ప్రకారం కొత్త సవాలుతో ఎండ్ విభాగం ప్రారంభమయ్యింది. ఇక్కడ తెలివిగా తురుపు ముక్క ప్రయోగించాడు- ఇన్స్ పెక్టర్ కి డిఫెన్స్ స్కామ్  గురించి చెప్పేస్తూ. తర్వాత జ్యూరీ ఓటింగ్ కూడా అనుకూలంగా జరగడంతో గొప్ప దేశభక్తుడిగా కేసులోంచి విడుదలై పోయి విజయం సాధించాడు. శుభం. 

        ఇప్పుడు ఒక్కో విభాగంలో  చూస్తే  కథనం ఆసక్తికరంగా వుంది. దర్శకత్వం పకడ్బందీగా వుంది. పోలీస్ స్టేషన్ లో ఒక్కో సాక్షిని ఇన్స్ పెక్టర్ పిలిచి ప్రశ్నించే సన్నివేశ చిత్రీకరణ దర్శకుడు రచయితా కనబర్చిన వరల్డ్ మూవీస్ టెక్నిక్. జీన్ లక్ గొడార్డ్ లాంటి వాళ్ళు ఇలాటి ప్రయోగాలే చేస్తారు. సాధారణంగా వరల్డ్ మూవీ టెక్నిక్స్ కమర్షియల్ సినిమాలకి పనికిరావు. ఎబ్బెట్టుగా వుంటాయి. గతంలో ఎన్టీఆర్ నటించిన కమర్షియల్  ‘అశోక్’ లో దర్శకుడు సురేందర్ రెడ్డి ఇలాటి అనుచిత ప్రయోగమే చేశారు. 

       సెకండాఫ్ 80 శాతం కోర్టు సన్నివేశాలతోనే వుంది. ‘సుల్తాన్’ సెకండాఫ్ ఎలాగైతే స్టేడియంలో ఫైట్స్ తో వుందో అలాగా. ఐతే ‘సుల్తాన్’ లాంటి కమర్షియల్ లో సెకండాఫ్ స్టేడియం ఎపిసోడ్స్ అన్నీ ఎంటర్ టైన్ మెంట్ లేని, రిలీఫ్ లేని  సీరియస్ దృశ్యాలే. కానీ సెమీ రియలిస్టిక్ అయిన  ‘రుస్తుం’ లో మాత్రం సెకండాఫ్ ని ఆక్రమించిన కోర్టు దృశ్యాలు హత్య చుట్టూ సీరియస్ నెస్ తో కూడుకుని లేవు. ‘లగాన్’ లో క్రికెట్ ఆడినంత కామెడీతో ఎంటర్ టైన్ చేస్తాయి. ఇది సందర్భానుసార కామెడీయే తప్ప- ఫార్ములా సినిమాల్లో లాగా లేనిపోని కమెడియన్లని రప్పించే చేయించే గోల కామెడీ- పేరడీ  కాదు. 

        సెకండాఫ్ లో ఫన్నీ కోర్టు సీన్లకి సమాంతరంగా ఇంకో సబ్ ప్లాట్ ని రన్ చేశారు. అది నేవీ అధికారుల స్కామ్ గురించి. కోర్టు దృశ్యాల్లో వివిధ సాక్షులు  చెప్పే కథనాలకి తగ్గట్టు కథ నడకకి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్స్ వచ్చి పోతూంటాయి. రుస్తుం విక్రం ని కాల్చి చంపే దృశ్యం మూడు సార్లు మూడు కోణాల్లో రిపీట్ అవుతుంది. బిగినింగ్ లో వెళ్లి కాల్చి చంపే దృశ్యం, మిడిల్ లో కోర్టుకి వెల్లడిస్తున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో-  విక్రం తో ఘర్షణలో ఆత్మరక్షణ కోసం కాల్చిచంపిన దృశ్యం, తిరిగి ఎండ్ లో ఇన్స్ పెక్టర్  కి స్కామ్ ని వివరిస్తున్నప్పుడు ఇంకో ఫ్లాష్ బ్యాక్ లో-   తనే అక్కడి వస్తువులు చిందర వందర చేసి ఘర్షణా వాతావరణం సృష్టించి,  ‘పథకం ప్రకారం’ విక్రంని కాల్చి చంపి- అతడి చేతిలో అతడి పిస్టల్ని పెట్టేసే దృశ్యం. ఇదే  నిజ దృశ్యమనీ, నిజానికి ఇదే జరిగిందనీ ఇక్కడ ప్రేక్షకులకి ఎస్టాబ్లిష్  చేయడం.

        ప్రేక్షకులు ఎక్కడా బోరు ఫీలవకుండా, ప్రతీ క్షణం ఇన్వాల్వ్ చేసే, ఫ్రెష్ నెస్ తో కూడిన  స్క్రీన్ ప్లే- దర్శకత్వాలివి. అరుదుగా ఇలాటి సశాస్త్రీయ స్ట్రక్చర్ తో, పరిపక్వత కనబర్చే దర్శకత్వాలతో సినిమాలు వస్తూంటాయి. దర్శకుడు టినూ సురేష్ దేశాయ్, కథ మాటలు స్క్రీన్ ప్లే అందించిన రచయిత విపుల్ కె. రావల్ ఈ మేరకు అభినందనీయులే.

రీ- పోస్ట్ మార్టం!
       అయితే పైకి కన్పిస్తున్నంత సజావుగా ఏమీ వుండదు ఈ స్క్రిప్టుని  తరచి చూస్తే. కారణం,  కాన్సెప్ట్ ని  టాంపరింగ్ చేయడమే. కాన్సెప్ట్  ఒకటైతే కథనం మరొకటిగా చేసుకుపోవడమే. పైగా లాజికల్ గా, సైకలాజికల్ గా, లీగల్ గానూ  చాలా లోపా లమయంగా వుంటుంది. నేవీ యూనిఫాంలో ఎన్ని తప్పులున్నాయో వాటికి  కొన్ని రెట్లు  తప్పులు దొర్లాయి స్క్రిప్టులో- కాన్సెప్ట్  టాంపరింగ్ పుణ్యాన. ఫార్ములా కథయితే ఇవన్నీ పట్టించుకోనవసరం లేదు. కానీ ఇది మర్డర్ ఇన్వెస్టిగేషన్ - కోర్టు ట్రయల్ ఆధారిత  స్పెషలైజ్ చేసిన ప్రొఫెషనల్ క్రైం జానర్ కథ. ప్రతీ చోటా ఇది  హేతుబద్ధంగా వుండాల్సిందే. ఎందుకంటే రచయితలూ, దర్శకులు తమ కంటే ఎక్కువ ఆలోచనాపరులని ప్రేక్షకులనుకుంటారు. ఏది ఎలా చూపిస్తే అలా చూసి నిజమని నమ్మేస్తారు. అందుకే విమర్శకుల మీద విరుచుకు పడతారు. ఏళ్ల తరబడీ రాసే విమర్శకుల బుర్రల్ని నమ్మరు, బుర్ర తక్కువ వాళ్ళనుకుంటారు. లేదా పక్షపాతపు బుర్రలనుకుంటారు. సినిమాల బాగు కోసమే రాస్తారని నమ్మరు. అదే రాజకీయ జర్నలిజంలో జర్నలిస్టులు రాసేది, విశ్లేషించేది వెంటనే  నమ్మేస్తారు. ఎడాపెడా వాయింపులకి గురయ్యేది సినిమా జర్నలిస్టే. సినిమా భక్తి  అలాటిది, సినిమాల్ని ఏమైనా అంటే వూరుకోరు. ఇదే ప్రేక్షకుల్ని గనుక  సినిమాలు చూపించకుండా,  స్క్రిప్టులు చదివిస్తే సవాలక్ష తప్పుల్నివాళ్ళే  పట్టుకుంటారు. లాజిక్ అంటే ఎలర్జీ ఎగిరిపోయి వాళ్ళే లాజికల్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే చదివేటప్పుడు బుర్ర పనిచేస్తుంది, సినిమాలు చూసేప్పుడు కళ్ళు మాత్రమే వెర్రిగా పనిచేస్తూంటాయి. 

        ఫార్ములా కథలకీ, ఇలాటి స్పెషలైజ్ చేసిన ప్రొఫెషనల్ కథలకీ  తేడా ఏమిటంటే, ఫార్ములా  కథల్లో  హీరో ఎందర్నైనా చంపుకుంటూ పోతాడు, విలన్ ఇంకెందర్నో చంపుతూ బాగా ఎంజాయ్ చేస్తాడు. కానీ ఈ శవాలని ఎవరూ పట్టించుకోరు, ఎందుకంటే ఇది శవాల గురించి కథ కాదు కాబట్టి. హీరో- విలన్ల పోరాటం గురించిన  కథే  కాబట్టి.  అందుకని పోలీసులు మధ్యలో జొరబడి  హత్య కేసులు దర్యాప్తు చేస్తూ కూర్చోరు. పోలీసులే ఈ కథల్లో కన్పించకపోవచ్చు. ఇక్కడ లాజిక్ కి ఆస్కారం లేదు.


          కానీ స్పెషలైజ్ చేసిన క్రైం జానర్ కథల్లో హత్యే ప్రధానం. దాని మీద దర్యాప్తే కీలకం, అదే కథ! దాని చుట్టే వ్యధ! ఈ కథల్లో దర్యాప్తు చేసే పోలీసు పాత్రలూ లాయర్ పాత్రలూ  వగైరా ప్రొఫెషనల్స్ అయివుంటాయి. ఇక్కడ సినిమా రచయిత తన ఫార్ములా ఆలోచనల్ని మూసిపెట్టి,  ఒక ప్రొఫెషనల్ గా నాన్- ఫార్ములా ధోరణిలో ఆలోచించాల్సిందే. లాజిక్ కి పెద్ద పీట వేయాల్సిందే. చేత కాకపోతే వదిలెయ్యాల్సిందే. మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో వచ్చే ఏ నవల చూసినా కచ్చితత్వంతో, లాజికల్ గా, ఈ రంగంలో మనకి తెలీని ఎన్నో విషయాలు కూడా తెలియజేస్తూ వైజ్ఞానికంగానూ వుంటాయి. తెలుగులో పాత్ డిటెక్టివ్ నవలలు సైతం అల్లాటప్పా రాతలతో ఉండేవి కావు- నేర పరిశోధనని బుర్రకి పదును పెడుతూ లాజికల్ గా పకడ్బందీగా నిర్వహించేవి. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ఈ జానర్ లో 1971 లో గుమ్మడి- కృష్ణలు నటించిన ‘నేనూ మనిషినే’ గానీ, 1961 లో బీఆర్ చోప్రా తీసిన ‘ఖానూన్’ (చట్టం) గానీ ఎంత లాజికల్ గా, నేర న్యాయవ్యవస్థ గురించి ఎంత విజ్ఞానదాయకంగా వుంటాయి! ఈ జానర్ లో పోలీసు వ్యవస్థ పనితీరు గురించీ, న్యాయవ్యవస్థ పనితీరు గురించీ తోచినట్టూ రాసేస్తే తప్పుడు సమాచారం వెళ్తుంది పాఠకుల్లోకి/ప్రేక్షకుల్లోకి చట్టాలతో సహా. ఈ జానర్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే జానర్. దీనికి సామాజిక స్పృహ, బాధ్యత, ప్రయోజనమూ చాలా వుంటాయి.  

        విషయానికొస్తే, నానావతి నిజ కథతో ‘రుస్తుం’ తయారయ్యింది (ఈ కేసు చరిత్ర ఆగస్టు 17 ‘రుస్తుం’ రివ్యూలో ఇచ్చాం).  నేవీ కమాండర్ తన భార్య ప్రియుణ్ణి చంపడం గురించిన కథ- లేదా కాన్సెప్ట్. భావోద్వేగాలతో జ్యూరీ ఓటింగ్ చేయడంతో నానావతి బయటపడ్డా, అంతలో హైకోర్టు,  సుప్రీం కోర్టుల లాజికల్ తీర్పులతో యావజ్జీవ శిక్షకి గురయ్యాడు. మళ్ళీ కొన్ని సామాజిక పరిణామాల మూలంగా క్షమాభిక్షకి నోచుకుని  శాశ్వత స్వేచ్ఛ పొందాడు. ఇంతే కాదు, సూక్ష్మ స్థాయిలో చూస్తే రచ్చబండ పంచాయితీల టైపులో తీర్పులు చెప్పే జ్యూరీ వ్యవస్థ  రద్దుకి తనే కారకుడయ్యాడు నానావతి. నానావతి భార్య ప్రియుణ్ణి (ప్రేమ్ ఆహుజా) చంపి ఉండక పోతే, స్వతంత్ర  భారత దేశంలో హస్యాస్పదమైన బ్రిటిష్ కాలపు జ్యూరీ వ్యవస్థ రద్దయ్యేది కాదేమో. ఇది చారిత్రాత్మక కేసుగా ప్రసిద్ధి చెందింది. ఇది  నానావతి చారిత్రక పురుషుడైన విధం కూడా. మరి నానావతికి ‘రుస్తుం’ ఏం నివాళి అర్పించింది? ఈ మధ్యే అక్షయ్ కుమార్ నటించిన ‘ఏర్ లిఫ్ట్’ అనే నిజకథలో కువైట్ సంక్షోభంలో రిస్కు తీసుకుని భారతీయుల్ని తరలించిన మథున్నీ మాథ్యూస్ అనే కేరళ వ్యాపారవేత్తకి ఘనంగా నివాళులర్పించారు. కానీ నానావతి పాత్ర పోషిస్తూ అక్షయ్ కుమార్, నానావతికివ్వాల్సిన కీర్తిని నానావతికివ్వకుండా, వేరే రూటులో కథ మార్చేసి దేశభక్తుడిగా తను కీర్తిని (క్రెడిట్ ని) తీసుకున్నారు! ఇది చాలా అన్యాయం!

         ఈ సినిమా నానావతి కథ అని ప్రచారం చెయ్యకుండా విడుదల చేసి వుంటే ఏ చిక్కూ వుండేది కాదు. ఏదో కథ తీశార్లే అనుకునేవాళ్ళం. బిజినెస్ కోసం అలా ప్రచారం చేసుకుని,  విడుదల చేయడంవల్ల నానావతికి అన్ని విధాలా అన్యాయం చేయడమే అయింది. 

        ఈ భార్య ద్రోహ కథ లేదా, స్త్రీ పురుష సంబంధాల గురించిన కథని - భర్త దేశభక్తి కథగా వీరలెవెల్లో ముగించడమే విచిత్రమైనది. ‘సైజ్ జీరో’ లో హీరోయిన్ స్థూలకాయం కథని సెకండాఫ్ లో క్లినిక్ అక్రమాల కథగా సంబంధంలేకుండా మార్చేసినట్టు- ‘రుస్తుం’ లో కూడా భార్య ప్రియుణ్ణి చంపి కేసు నెదుర్కొంటున్న హీరోకి- నేవీ అధికారుల స్కామ్ తగిలించి  దేశభక్తి కథగా, దేశభక్తుడి వీరత్వంగా మార్చేసి శిక్ష నుంచి తప్పించారు.  ఇందుకే కాన్సెప్ట్ ని టాంపరింగ్ చేశారన్నాం. లండన్ యుద్ధ నౌక కొనుగోలులో నేవీ అధికారులు గోల్ మాల్ చేస్తున్నారని రుస్తుం కి ముందు నుంచే తెలుసు. ఇందులో యువ పారిశ్రామిక వేత్త విక్రం వున్నాడని  కూడా తెలుసు. ఈ విక్రం తనకి పరిచయస్థుడే నని కూడా తెలుసు. ఇదంతా మనకి సెకండాఫ్ లో ఓపెన్ చేస్తూ పోయినా, పూర్వ కథగా ముందు నుంచీ ఉన్నట్టే లెక్క.  అంటే సింథియా ఎఫైర్ కంటే ముందు నుంచీ ఈ స్కామ్ గొడవ వున్నట్టే.  ఆల్రెడీ స్కామ్ లో వున్న విక్రంతో  రుస్తుం భార్య సింథియా  శారీరక సంబంధం పెట్టుకోవడం ఈ దరిమిలా జరిగిందే నన్నమాట! ముందు స్కామ్ ప్రారంభమయ్యింది-  దాని పర్యవసానంగా తర్వాత శారీరక సంబంధం మొదలయ్యింది!  ఈ స్పష్టతతో స్క్రిప్టుని  చూడాలి. 

        ఇప్పుడు ఈ నేపధ్యంలో చూసినా- స్క్రిప్టులో బిగినింగ్ లో  భార్య సింథియా ఉత్తరాల్ని రుస్తుం చూసినప్పుడు అతనేమనుకోవాలి? ‘ఈ విక్రం నాకొడుకు ఇంత పని చేస్తున్నాడా? నన్ను స్కామ్ లో లొంగదీయడానికి నా భార్యని లొంగ దీసుకున్నాడా? ఇక నా భార్యతో ఉన్న ఫోటోలతో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడా? వీణ్ణి ఇప్పుడే తన్ని స్కామ్  బయట పెట్టేయాలి- అని వెళ్లిపోవాలి. 

       కానీ ఏం చేశాడు? విక్రం బంగాళా దగ్గరి కెళ్ళి పోయి బాల్కనీలో నించున్న సింథియాని బాధాతప్త హృదయంతో చూశాడు. విక్రం ఆమెని లోపలికి  తీసికెళ్ళి పోతోంటే కుమిలిపోతూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు! అంటే, ఒకవేళ  ఇంకా విక్రంకి ఫోటోలు తీసే ఆలోచన ఉండకపోతే, ఆ అవకాశం కల్పిస్తున్నాడన్న మాటే! 

        నిజానికి నానావతి కేసులో ఈ సంఘటన లేదు. అతను ప్రేమ్ బంగళాకి వెళ్లనూ లేదు, వెళ్లి భార్య అక్కడ వుండగా చూడనూ లేదు. అలా చేసి వుంటే అప్పటికప్పుడే ప్రేమ్ ని చంపేసే వాడేమో! ఏ భర్తయినా భార్య వేరొకడితో వుంటే చూసి వెళ్లి పోతాడా! అందునా ఒక నేవీ అధికారి రక్షణ రహస్యాలు రాబట్టడానికే వాడు భార్యని  ట్రాప్ చేసి వుంటాడని అనుకోడా! 

        ఆ రాత్రి నానావతి ఇంటికి వస్తే భార్య సిల్వియా ఇంట్లోనే వుంది, ఎక్కడికీ వెళ్ళ లేదు. ఆమె ముభావంగా వుండడం గమనించి అడిగితే, అప్పుడు చెప్పేసింది ప్రేమ్ తో తన వ్యవహారం గురించి తనే. భర్తకి స్పష్ట నిస్తూ, విడాకులు తీసుకుని  ప్రేమ్ నే పెళ్లి చేసుకుంటానని కూడా అనేసింది. అందుకే నానావతి ప్రేమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు- ‘నువ్వు నా భార్యని  పెళ్లి చేసుకుంటావా? నా ముగ్గురు పిల్లల్ని పెంచుకుంటావా?’  అనడిగాడు. అప్పుడు ప్రేమ్  వెటకారంగా చెప్పిన సమాధానం- ‘నేనెందరో ఆడాళ్ళతో పడుకుంటాను...వాళ్ళందర్నీ పెళ్లి చేసుకోవాలా!’ అని. 

        దీంతో నానావతి ప్రేమ్ ని కాల్చి చంపేశాడు. అది భార్యని ఉంపుడు గత్తె అన్నందుకా, వాడు మిత్ర ద్రోహి అయినందుకా మనకి తెలీదు. కానీ పెళ్లి చేసుకుం టాడని  అమాయకంగా నమ్మి మోసపోయిన భార్యని ప్రొటెక్ట్ చేసుకున్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక పిల్లలతో సహా ఆమెని తీసుకుని కెనడా వెళ్ళిపోయి జీవించాడు. ఆమెని వదిలెయ్యలేదు. బ్రిటిష్ కల్చర్ తో భర్త ఎడబాటుతో ఆమె ప్రేమ్ తో తిరిగినా, అదే ధైర్యంతో తను  తిరుగుతున్నానని కూడా చెప్పేసిందా రాత్రి.  

        కానీ ‘రుస్తుం’ కథలో సింథియా నంగనాచిలా కన్పించేట్టు చిత్రించారు తెలిసో తెలీకో. సిల్వియా కున్నట్టు, పార్సీ అయిన ఈమెకి ఫారిన్ బ్యాక్ గ్రౌండ్ వున్నట్టు చెప్పారు. కాబట్టి విక్రంతో  అలా తిరిగి వుండ వచ్చనుకున్నా, భర్త ఆ ఉత్తరాలు పట్టుకున్నప్పుడు బెదిరిపోయి తప్పయి పోయిందని అంటుంది. ‘నువ్వు నెలల తరబడి సముద్రం మీద తిరుగుతూంటే నేనిక్కడ ఒంటరిగా ఎలా గడపగలననుకున్నావ్- నాకు కోరిక లుండవా? పిల్లాజెల్లా అక్కర్లేదా?’ అనలేదు. రక్షించింది, అతడి  రక్షణ శాఖ ఉద్యోగ బాధ్యతల్ని గౌరవిస్తూ. 

        కానీ భర్తకి దొరికిపోయాక తప్పయిందని అంది. దొరికిపోయి వుండక పోతే అలాగే తిరిగేదా కళ్లుగప్పి? నిజకథలో సిల్వియా తను పెట్టుకున్న సంబంధంతో స్పష్టమైన అవగాహనతో వుంది. సముద్రం మీద తిరిగే భర్తతో ఇక లాభం లేదని, ప్రేమ్ నే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని ఒక ధ్యేయం పెట్టుకుంది. బ్రిటిషర్ అయిన తనకి ఈ దేశపు భర్త నేవీ ఉద్యోగం పట్ల సానుభూతీ, సెంటిమెంట్లూ వుండి వుండకపోవచ్చు.  కాబట్టే భర్త రాగానే మునుపటి భార్యలా ఆప్యాయపు పలకరింపులు లేకుండా, ఇంకాలస్యం చేయకుండా స్వచ్ఛందంగా తనే చెప్పేసింది. ఆలస్యం చేస్తే భోజనాల దగ్గర, పడక దగ్గర భార్యలా గడపాల్సి వస్తుందనేమో,  తను ప్రేమ్ తో డిసైడ్ అయ్యాక ఇంకా భర్తతో నటించకూడదని అనుకుంది. ఇక్కడ ఈమెకీ  నీతి వుంది. ఇప్పుడు ఇంట్లో తుఫాను రేగినా సరే, ఈ నీతికే కట్టుబడింది (కానీ ఆమె ప్రేమ్ పెళ్ళికి నిరాకరించిన అసలువిషయం దాచి, అతడి మీద పగ దీర్చుకోవడం కోసమే నానావతికి అలా చెప్పి రెచ్చగొట్టిందన్న వాదన కూడా వుంది- అయితే హతుడు ప్రేమ్ ఆహుజానే భార్య గురించి నీచంగా మాట్లాడి నానావతిని రెచ్చగొట్టాడనే వాదాన్నే కోర్టులు స్వీకరించాయి).

       కానీ సింథియాకి ఒక స్పష్టత కన్పించదు- భర్తతో, విక్రంతో వున్న తన సంబంధాలకి హేతుబద్ధమైన ముగింపు నిచ్చే విషయంలో. భర్తకి దొరక్కపోతే, సిల్వియాలాగా ఒక నీతి లేకుండా భర్తని మోసం చేస్తూ వుండేదా? విక్రం పంపుతూ వుండిన రంగురంగుల కాగితాల మీద అన్నేసి కామ కవితా ఝరులూ, బహుమానాలూ ఇంట్లో భద్రపర్చుకోవడంలో అర్ధం? అవి ఒలంపిక్ ట్రోఫీలా? భర్త యూనిఫాంకి అన్నేసి మెడల్స్ వుంటే తనకీ వుండాలనా? ఆ మెడల్సూ తప్పుడు మేళమే- ఇంట్లో ఈ ట్రోఫీలూ తప్పుడు పనే. స్క్రీన్ ప్లేలో అద్భుత బ్యాలెన్సింగ్! ఏంటీ ఈ తప్పుడు ట్రోఫీలని  రుస్తుం అడిగితే, నీ డ్రెస్సు కేమిటా తప్పుడు బిళ్ళలు?- అని డైలాగ్ విసిరితే, యాక్షన్ లో బ్యాలెన్సింగ్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. 

        తప్పయిపోయిందని ఇప్పుడు చెప్పడం గాక, తప్పు చేస్తున్నట్టు అన్పిస్తే- తను  విక్రంతో ఉండాలా, రుస్తుంతో వుండాలా రుస్తుం వచ్చే ముందే  నిర్ణయించుకుని వుండాల్సింది. విక్రంతోనే అనుకుంటే, రుస్తుం రాగానే చెప్పేయాల్సింది. లేదూ రుస్తుంతోనే అనుకుంటే, చేసిన తప్పు (తప్పు అనే పదం మనం వాడడం లేదిక్కడ- అది తప్పో ఒప్పో భార్యాభర్తల మధ్య విషయం - తప్పు అని సింథియా అంటున్న మాటగానే తీసికోవాలి) వాలంటరీగా రుస్తుం కి చెప్పేయాల్సింది. రెండూ చెయ్యక, తీరా ఉత్తరాలు దొరికాక తప్పయి పోయిందనడమేమిటి?  

        ఉత్తరాలూ గిఫ్టులూ ఇంట్లోనే పెట్టుకుందంటే అది ధైర్యమా, అమాయకత్వమా? రుస్తుం అనుకోకుండా తిరిగొస్తాడని అనుకోలేదు కాబట్టి రొటీన్ గా విక్రంతో ఉండిపోయిం దనుకోవచ్చు. వస్తున్నాడని తెలిసి వుంటే విక్రం  దగ్గరకి వెళ్లి వుండక పోవచ్చు- అయితే రుస్తుం వస్తున్నాడని తెలిస్తే ఆ ఉత్తరాలూ గిఫ్టులూ, అలాగే వుంచేదా లేక తీసేసేదా? వుం చుకుంటే విక్రంకే కమిటై రుస్తుం రాగానే అతడికి కటీఫ్ చెప్పబోతున్నట్టూ, తీసేస్తే విక్రంతో రంకు ఇంకా కొనసాగించాలనుకున్నట్టూ అర్ధం వస్తుంది.  వీటిలో మొదటిది చేసే ఉద్దేశంతోనే  వాటిని ఇంట్లో పెట్టుకుని వుంటే, రియల్ లైఫ్ క్యారక్టర్ సిల్వియాకి దీటుగా నీతిని ప్రకటించుకుని, శభాష్ అన్పించుకునేది. 

        ఒకవేళ తప్పు చేస్తున్నానని మొదటే అన్పిస్తే, ఆ ప్రేమ సరంజామాని ధ్వంసం  చేసి,  విక్రంని వదిలేసేది. రుస్తుం రాగానే చెప్పేసి- విడాకులిచ్చినా పడతానని అనేసేది. ఒకవేళ ఇలా చెప్పే ధైర్యం లేకపోతే, రుస్తుంకి ఆ సరంజామా కంటపడి, అతని వైపు నుంచే సిట్యుయేషన్ ఓపెన్ అయితే సులువుగా వుంటుందనుకుని వుంటే, కేవలం ఒక్క ఉత్తరం మాత్రమే అతడి కంటపడేలా వుంచుకుంటే చాలు. ఈ చర్య రెండు విషయాల్ని క్లియర్ చేస్తుంది- విక్రంతో తెగతెంపులు చేసుకుంది కాబట్టే మిగతా సరంజామాని ధ్వంసం చేసింది- ఇది రుస్తుం కి తెలియాలి కాబట్టే ఆ ఒక్క ఉత్తరాన్నీ  అట్టిపెట్టుకుంది. 


         అసలింత కాంప్లికేటేడ్ గా, ఇన్నియక్ష ప్రశ్నలతో లోపభూయిష్టంగా, అదీ ప్లాట్ పాయింట్- వన్ ని ఏర్పాటుచేయబోయే, ఈ కీలక సన్నివేశం ఎలా తెరకె క్కినట్టు? ఎలాగంటే, పాత్ర ఏం చేస్తుందో దానికి వదిలెయ్యకుండా, దర్శకుడూ రచయితా తమకేం కావాలో చూసుకోవడం వల్ల. రుస్తుం ఇంటికి వస్తే భార్య ఇంట్లో లేదని పని మనిషిచేత చెప్పించి ప్రేక్షకులుకి గొప్ప సస్పెన్స్ ఫీలయ్యేట్టు చెయ్యాలి. అనక అలమార పగలగొట్టించి యాక్షన్ సీన్ తో ఇంకాబాగా ఎలివేటయ్యే సస్పెన్స్ ని  ప్రేక్షకులు అనుభవించేట్టు చెయ్యాలి...  ఉత్తరాలు బైట పడి బండారం షాకింగ్ గా అన్పించాలి...ఇలా అనుకుని పాత్రలకతీతంగా సన్నివేశ కల్పన చేసినట్టుంది. పాత్ర(ల) స్థానంలో తాము ఆ ఇంట్లో  జొరబడిపోయి- దర్శకుడూ రచయితా కబడ్డీ ఆడుకోవడంతో - పాత్ర(లు) ఏమీ చెప్పుకోలేని, చేయలేని  ఏడుపుగొట్టు పరిస్థితి ఏర్పడింది! 

        పాపం ఆతర్వాత రుస్తుం కూడా ఏం చేశాడూ- ఆమె ప్రియుడి ఇంటి కెళ్ళి వాళ్ళని దీనం గా చూసొచ్చాడు!

        పాత్ర చిత్రణలు పాత్రల చేతిలోనే వుంటాయి- దర్శకుడు, రచయితా కేవలం చేయగల్గింది కాన్సెప్ట్ కి రూపకల్పన చేసుకోవడమే. పాత్రలకంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశాక ఆ ప్రపంచంలో ఎంజాయ్ చేయడానికి పాస్ పోర్టూ వీసాల్ని సదరు దర్శకుడు గారికి, రచయిత గారికీ  స్క్రీన్ ప్లే సూత్రాలు అనుమతించవు. అలమటిస్తూ దూరం నుంచి చూడ్డమే.


(రేపు రెండవ భాగం)
-సికిందర్




Friday, August 19, 2016

రివ్యూ!






కథ- స్క్రీన్ ప్లే –దర్శకత్వం: వీరభద్రం చౌదరి

తారాగణం : ఆది, నమితా ప్రసాద్. సాయికుమార్, అలీ, రఘుబాబు, పృథ్వీ, అభిమన్యు సింగ్, షకలక శంకర్, సురేఖావాణి, అన్నపూర్ణ, మాళవిక తదితరులు
సంగీతం : ఎస్ ఎస్ తమన్, ఛాయాగ్రహణం :
ఎస్ అరుణ్ కుమార్
బ్యానర్ : శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు : ప్రసాద్ తలారి, రామ్ తాళ్ళూరి
విడుదల:  19 ఆగస్టు, 2016

***

       హీరో ఆది - దర్శకుడు వీరభద్రం ఓ సక్సెస్  కోసం స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళే. ఎందుకు సక్సెస్ అనేది వీళ్ళకి అందని చంద మామ అయిందో ఈ కింద చూద్దాం...

కథ
        బీటెక్ చదివిన బాబ్జీ (ఆడి) ఒక బ్యాంకుకి రికవరీ ఏజెంట్ గా పనిచేస్తూంటాడు. కావ్య(నమితా ప్రసాద్)  అనే అమ్మాయి పరిచయమవుతుంది ఈమె ఎసిపి (అభిమన్యు సింగ్) చెల్లెలు. తన చెల్లెలితో ఎవరు మాట్లాడినా కాల్చేసే రకం ఇతను. చెల్లెలి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తూంటాడు. బాబ్జీ తన చెల్లెల్ని కలుస్తున్నాడని తెలిసి నిఘా పెట్టిస్తాడు.  పోలీస్ సిబ్బంది ఒకరోజు కాల్పులు జరపడంతో బాబ్జీ పారిపోతాడు.  కావ్యతో తన కెలాటి  సంబంధం లేదని చెప్పడానికి ఎసిపి ఇంటికి వెళ్తాడు బాబ్జీ. పెళ్లి ఇష్టం లేని కావ్య అప్పుడే  ఇంట్లోంచి పారిపోతూంటుంది. ఆమెతో బాబ్జీని చూసిన ఎసిపి సిబ్బందిని ఎగదోస్తాడు. వాళ్ళని తప్పించుకుని బాబ్జీ కావ్యతో రైలెక్కేస్తాడు. ఇంకో గ్యాంగ్ కూడా కావ్య కోసం  వెంటబడుతుంది. ప్రయాణంలో ఈ రెండు గ్యాంగ్స్ ని  ఎదుర్కొంటూ కావ్యని తన వూరికి తీసుకుపోతాడు బాబ్జీ. 

        మోతుబరి అయిన బాబ్జీ తండ్రి (సాయి కుమార్) కి కావ్యని తన ఫ్రెండ్ గా  పరిచయం చేస్తాడు. ఇంట్లో ఆడవాళ్ళు బాబ్జీ పెళ్లి చేయాలనీ పట్టుబడతారు. బాబ్జీ తండ్రి ఒక సంబంధం చూస్తాడు. ఇది ఇష్టం లేని బాబ్జీ కావ్య సహాయంతో ఆ పెళ్లి చూపుల్ని చెడగొడతాడు. కావ్య కోసం గ్యాంగ్ మళ్ళీ ఎటాక్ చేస్తుంది. ఎసిపి గ్యాంగ్ కూడా ఎటాక్ చేస్తుంది. ఈ రెండు గ్యాంగ్స్  ని ఎదుర్కొని కావ్యని బాబ్జీ ఎలా సొంతం చేసుకున్నాడన్నదే మిగతా కథ. 

ఎలావుంది కథ
        కొత్తదనమూ విషయమూ రెండూ లేని పాతచింతకాయ కథ. దీనికి బిసి సెంటర్లలో కూడా దృశ్యం ఉంటుందనేది అనుమానమే. ఇలాటి కథతో కోటి రూపాయల చిన్న బడ్జెట్ సినిమా కూడా తీయరేమో. ఆరేడు కోట్లు పెట్టి అట్టహాసంగా తీశారు. ఎవరికీ ఉపయోగపడని వ్యవహారం. సగంలో చాలా మంది లేచిపోవడమే ఇందుకు తార్కాణం. 

ఎవరెలా చేశారు
       
మాస్ హీరో, యాక్షన్ హీరో, ఆల్ రౌండర్ స్టార్ అవ్వాలని ఆది  ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదు. అడకత్తెరలో పోక చెక్క పరిస్థితి ఇంకా తప్పడం లేదు. రఫ్, గరమ్ లతో చెడు అనుభవా లెదురయ్యాక కూడా అదే బాట  పడితే తనని దేవుడు కూడా కాపాడలేడు. ఇలాటి మూస మాస్ సినిమాలు తన లాంటి యంగ్  హీరో చేయాల్సినవి కావు- కొత్తగా చేయడానికీ వీటిలో ఏమీ వుండదు. ఆల్రెడీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఏనాడో చేసేశారు. వాళ్ళే బాగా చేశారు. ఆది ప్రయత్నించాల్సింది ఈ  తరం యువ ప్రేక్షకులకోసం. ‘చుట్టాలబ్బాయి’ ఏ కోశానా యూత్ కి కనెక్ట్ అయ్యే అవకాశమే లేదు. పది  నిమిషాలకో ఫైట్ చేసేస్తే, డాన్సులు చేసేస్తే యూత్ తో బాటు మాస్ చప్పట్లు కొడతారనుకోవడం అవివేకం. తన తాహతుకి మించిన భారీ డైలాగులు కొట్టినా ఇంతే. 

        ఇక ఈ పాత్రలో ఆకర్షణీయంగా  ఇంకేముంది-  తను హీరోయిన్ ని ప్రేమించనే ప్రేమించలేదు, ఆమె కూడా ప్రేమించలేదు, ఇద్దరి మధ్యా రోమాన్సే లేదు. తన పాత్రకి ఒక లక్ష్యం, దిశా దిక్కూ ఏమీ లేవు. ఈ పాత్రలో తను పరమ పాసివ్ గా ఉన్నాడన్న స్పృహే లేదు. ఎవరో ఫ్రెండ్ చెబితే అమెరికా  వెళ్లి జాబ్ చేయాలన్న ఆలోచన వస్తుంది, హీరోయిన్ పరిచయమైతే అమెరికా  వెళ్ళాలన్న ఆలోచనే ఎగిరిపోతుంది. తండ్రి చెబితే హీరోయిన్ ని తిరిగి తెచ్చుకోవడం కోసం వెళ్తాడు. అక్కడ హీరోయిన్ పెళ్లి జరిగిపోతోంది ఎలా అని కూర్చుంటే- ఇంకో ఫ్రెండ్ అలీ దగ్గరికి తీసికెళ్ళి  అలీ ద్వారా హీరోయిన్ ని కిడ్నాప్ చేయిస్తాడు- సొంతంగా ఆలోచించి తనేం చేశాడు ఆది? చేయనప్పుడు అది పాత్రెలా  అవుతుంది? దాంతో చేసింది నటన ఎలా అవుతుంది?

        చుట్టలబ్బాయ్ టైటిల్ కూడా తన పాత్రకి ఎలా వర్తిస్తుందో కూడా తెలీదు. తను ఎవరికి  చుట్టం? ఎవరికి ముద్దుల అబ్బాయి? ఏమో!

        ఇక హీరోయిన్ సెలెక్షన్ అధమంగా వుంది. ఆమెది ఫోటోజెనిక్ ఫేసు కాకపోగా, నటనకీ నవ్వుకునేలా వుంది. కాస్సేపు వచ్చిపోయే సెకండ్ హీరోయిన్ అయితే, ‘ఐ’ లో విక్రం గూని పాత్ర పోషించినట్టు ముసలమ్మలా వంగిపోయి నడుస్తుంది. అరకొర బట్టలతో అంగాంగ ప్రదర్శన కూడా మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఎబ్బెట్టుగా వుంది. చుట్టాలబ్బాయికి చెత్తమ్మాయిలు.

        మిగిలిన నటీనటులు రొటీనే. ఇంతకీ  తెల్ల పంచ- కండువా వేసుకుని తండ్రి పాత్ర పోషించిన సాయికుమార్ ఈ సినిమాలో ఎందుకున్నట్టో? ఏం చేసినట్టో?

        సాంకేతికాల కొస్తే  ఎస్ అరుణ్ కుమార్ ఛాయాగ్రహణానికి వంద మార్కులేయవచ్చు. అలాగే సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ కి. అంతే, ఇంతకి మించి చెప్పుకోవడానికేమీ లేదు. 

చివరి కేమిటి?
        ర్శకుడు వీరభద్రంకి కాలానుగుణమైన సినిమాలు తీయడానికి ఇంకా  మనస్కరించడం లేదు. ఎప్పుడో ఇతర దర్శకుల దగ్గర తను పనిచేసిన నాటి విషయాన్నే నేటికీ ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు. కాలం చెల్లిన కథని కాస్సేపు పక్కన పెడదాం, దీనికి చేసిన స్క్రీన్ ప్లే కి స్ట్రక్చర్ అంటూ ఒకటుందా? దీనికి రాయించిన మాటలకి ఒక వొరవడి అంటూ వుందా? ఇంగ్లీష్ పదాలతో ప్రాస డైలాగులే డైలగులవుతాయా? ఎక్కడైనా కామెడీ అంటూ పండిందా? అది సారంలేని కామెడీ కాదా? ఆ ఇంటర్వెల్ సీనేమిటి, ఎక్కడో ఆపాలి కాబట్టి ఆపాలన్నట్టు లేదూ- అదీ గ్యాంగులతో యాక్షన్ సీను మధ్యలో? అప్పటి వరకూ అసలు నడించిన కథేమిటి? పాత్రల్ని ఒక రైలు ఎక్కించి రౌడీల్ని వెంట తరమడమేనా? వాళ్ళని హీరో ఎదుర్కొనే రిపీటయ్యే సీన్లేనా?  ఒక హోమ్లీ సినిమా తీయాలనుకుంటే ఈ రౌడీ గ్యాంగులతో గోలేమిటి? సెంటి మెంట్లో, సాంప్రదాయాలో, అవి పెట్టుకుని పల్లెటూళ్ళో హాయైన వ్యవహారం నడుపుకోవచ్చుగా? ఒక మ్యూజికల్ రూరల్ ఎంటర్ టైనర్ ని  ఇవ్వొచ్చుగా, నాగార్జున ఇచ్చినట్టు? 

        ఈ దర్శకుడు, హీరో- వీళ్ళిద్దరి మైండ్ సెట్ మారనంత వరకూ తెలుగు సినిమాకి ఈ టార్చర్ తప్పదు!



-సికిందర్ 
cinemabazaar.in