రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 6, 2016

రివ్యూ!


రచన- దర్శకత్వం : ఏలేటి చంద్రశేఖర్

తారాగణం : మోహన్ లాల్, గౌతమి, ఊర్వశి, విశ్వంత్, అనూషా అంబ్రోస్, 

రైనా రావు, నాజర్, పరుచూరి వెంకటేశ్వర రావు, గొల్లపూడి మారుతీ రావు, హర్షవర్ధన్, ఎల్బీ శ్రీరామ్, వెన్నెల కిషోర్, చంద్ర మోహన్, అయ్యప్ప శర్మ తదితరులు 

మాటలు : రవిచంద్ర తేజ, పాటలు : రామజోగయ్య శాస్త్రి, వశిష్టా శర్మ

సంగీతం : మహేష్ శంకర్, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాస్తవ్ 
బ్యానర్ : వారాహి చలన చిత్ర 
నిర్మాతలు : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి 
విడుదల : 5 ఆగస్టు, 2016
***

       గతవారం ‘పెళ్లిచూపులు’ తర్వాత ఈవారం  ‘మనమంతా’ మళ్ళీ తెలుగులో క్వాలిటీ సినిమాల రాకని రుతుపవనాలంత ఆహ్లాదకరంగా రికార్డు చేస్తున్నాయి. అభిరుచిగల తెలుగు ప్రేక్షకులు ఏ హిందీ లోనో ఇంకెక్కడో ఇలాటి సినిమాల్ని చూసే అగత్యాన్ని ఇవి తప్పిస్తున్నాయి. ‘పెళ్లి చూపులు’ ప్రేమకథకి రియలిస్టిక్ టచ్ ఇచ్చి  ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశాక,  కుటుంబ కథకి కూడా రియలిస్టిక్ అప్రోచ్ సాధ్యమేనంటూ  ‘మనమంతా’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కమర్షియల్ ఫార్ములాలకి  ప్రత్యాన్మాయంగా అవే జానర్స్ ని ఇంకో కోణంలో తీసి మొనాటనీతో విసిగిన ప్రేక్షకులకి వెరైటీని అందించవచ్చని ఇవి చెబుతున్నాయి. పైగా సినిమా కళకి అంటరాని పదార్ధమై పోయిన క్రియేటివిటీని కూడా ఇవి హృద్యంగా ప్రదర్శిస్తున్నాయి. 

       
ర్శకుడు ఏలేటి చంద్ర శేఖర్, నిర్మాత సాయి కొర్రపాటి చాలా సాహసించి తెలుగు సినిమాకి చాలా మేలు చేశారు. కమర్షియల్ ఆకర్షణలు వుండని వాస్తవిక సినిమా ఆకర్షణంతా దాని మాస్టర్ స్ట్రోక్ లోనే వుంటుందని, ఈ మాస్టర్ స్ట్రోకే  కమర్షియాలిటీని ఇస్తుందనీ   చాటుతూ - డ్రైగా వుండే వాస్తవిక సినిమాలు తీసే వాళ్ళని పునరాలోచనలో పడేశారు. శుష్కంగా వుండే వాస్తవిక సినిమాలకి హై ఎండ్ క్రియేటివ్ మైండ్ తో వాటిదైన మాస్టర్ స్ట్రోక్ ఇస్తే తప్పకుండా సామాన్య ప్రేక్షకులూ  వాటికి  ఆకర్షితులవుతారు. 

        గతంలో అనేక భాషల్లో అనేక ‘నాల్గైదు కథల’ సినిమాలొచ్చాయి. వాటిలో తెలుగులో వచ్చినవైతే మాస్టర్ స్ట్రోక్ లేక చతికిల బడిపోయాయి. వివిధ పాయలుగా సాగే కథలు ఒక చోట సంగమించే దగ్గర చమత్కృతి చేయలేక చప్పగా ముగిసిపోయే వైఖరినే ప్రదర్శిస్తూ వున్నాక, ‘మనమంతా’ దీన్ని చక్కదిద్దే స్టడీ మెటీరియల్ గా వచ్చి నిలబడుతోంది.
        నాల్గు కథల ‘మనమంతా’ లో అందరూ కమర్షియల్ నటీనటులే వున్నారు...


కథలు
     సాయిరాం (మోహన్ లాల్) సూపర్ మార్కెట్ లో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్. ఎప్పుడూ ఆర్ధిక ఇబ్బందుల్లో వుండి వర్కర్( ధన్ రాజ్)  దగ్గర చేబదుళ్లు తీసుకుంటూ వుంటాడు. ఇంకో అసిస్టెంట్ మేనేజర్ విశ్వనాథ్ (హర్షవర్ధన్) కీ ఇతడికీ పరస్పరం పడదు. స్టోర్ మేనేజర్ (పరుచూరి వెంకటేశ్వర రావు) త్వరలో రిటైర్ కాబోతున్నాడు. ఆ పోస్టు తనకంటే ఎక్కువ చదువుకున్న  విశ్వనాథ్ కే వచ్చే  అవకాశాలు  వుండడంతో సాయిరాం తీవ్రాలోచనలో పడతాడు. తనకి ఈ  మేనేజర్ పోస్టు దక్కితే ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయన్న నమ్మకం అతడిది.

        ఇంకోవైపు గాయత్రి (గౌతమి) అనే మధ్యతరగతి గృహిణి వుంటుంది. పొదుపుగా ఎలా కుటుంబాన్ని నిర్వహించాలి, ఎలా ఆదా చేయాలీ అని నిత్యం ఆరాటపడుతూ, పొరుగింటి వదినగారు (ఊర్వశి) తో పథకాలేస్తూ వుంటుంది. ఆ మేరకు ఏవి కొనాలని ఏ బజారు కెళ్ళినా ఆ పొదుపు కాస్తా దుబారా అయిపోయి బెంబేలెత్తి పోతూంటుంది. 

        మరో వైపు అభి (విశ్వంత్) అనే చదువే లోకంగా జీవించే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఐరా(అనూశా అంబ్రోస్)  అనే అమ్మాయితో ప్రేమలో పడి ప్రేమే జీవితంగా గడుపుతూంటాడు.

        మరింకో వైపు మహతి (రైనారావ్) అనే స్కూలు బాలిక నాల్గేళ్ళ స్లమ్ కుర్రాణ్ణి చూసి వాణ్ణి చదివించాలని ప్రయత్నిస్తూంటుంది...

        ఇలా ఈ నల్గురి ప్రయత్నాలూ మలుపు తీసుకుంటాయి : మేనేజర్ గా ప్రమోటవడానికి ఇంటర్వ్యూ రోజున విశ్వనాథ్ తనకి  అడ్డురాకుండా ఒకరౌడీతో క్రిమినల్ పథకమేస్తాడు సాయిరాం. దీంతో విశ్వనాథ్ అదృశ్యమై పోతాడు. ఫలితంగా సాయిరాం పెద్ద చిక్కుల్లో పడిపోతాడు. 

        గాయత్రికి తన పాత ప్రొఫెసర్ (గొల్లపూడి మారుతీ రావు) ఎదురై ఒకప్పుడు ఆమె చేసిన ఆర్ధిక సాయానికి బదులు తీర్చుకుంటూ ఆమెకి సింగపూర్ లో జాబ్ ఆఫరిస్తాడు. దీంతో ఈ వయసులో ఆమె అందర్నీ వదిలేసి ఎలా వెళ్ళగలనని అయోమయంలో పడిపోతుంది. 

        ఐరాని ప్రేమిస్తున్న అభికి ఆ ప్రేమ వికటించి, ప్రేమాలేదు దోమా లేదని ఆమె లాగి కొట్టడంతో చావడానికి సిద్ధమైపోతాడు.  

        చదివించడానికి స్కూల్లో వేసిన స్లమ్ కుర్రాడు అదృశ్యమై పోవడంతో ఆందోళనగా వాణ్ణి వెతుక్కుంటూ తిరుగుతూంటుంది ఇంకోవైపు మహతి...

        ఇలా సమస్యల్లో పడ్డ  ఈ నల్గురికీ ఈ నల్గురితోనే యాదృచ్ఛికంగా ఎలా పరిష్కరాలు లభించాయన్నది మిగిలిన ‘నదుల అనుసంధానపు’ కథ. 


ఎలావుంది కథ 

    ప్రయోగాత్మకమైనది. కమర్షియల్ విలువల కోసం సంయమనం కోల్పోనిది. పాటలు కూడా లేనిది. మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో వచ్చే కమర్షియల్ సినిమాల్ని ఆదరిస్తున్నట్టుగా, మల్టిపుల్ కథలతో సమాంతరంగా సాగే  నాల్గైదు కథనాలతో సినిమాలు  వస్తే దూరంగా వుంటున్నారు ప్రేక్షకులు. వాళ్లకి కావలసింది చిన్న చిన్న కథలు కాదు, ఒకే పెద్ద కథ. ప్రచురణ రంగంలో కూడా నవలలు రాజ్యమేలినప్పుడు కథల సంకలనాల్ని ఎవరూ కొనేవాళ్ళు కాదు- పెద్దపెద్ద నవలలే కొనుక్కుని చదివేవాళ్ళు. తెలుగు వాళ్ళ టేస్టే అలాటిది. ఏదైనా తాటి కాయంత వుండాలి. అయితే ‘మనమంతా’ కూడా ఒకే పెద్ద కథే. ఇది చివరికి తెలుస్తుంది. దీ న్ని నాల్గు కథల సమాహారమని ఆంథాలజీగా పబ్లిసిటీ చేయడం ప్రేక్షకుల్ని దూరం చేసుకోవడమే. ఈ కథంతా అతి పెద్ద సస్పెన్సు. కుటుంబ కథల్లో సస్పెన్సు ఉన్నవి రావడం లేదనీ, సస్పెన్సు తో వుంటే (సస్పెన్స్ అంటే ఇక్కడ నేరాలో ఘోరాలో వుండాలని కాదు) కుటుంబ కథలు రొటీన్ మూసలోంచి బయట పడతాయనీ గతంలో చెప్పుకున్నాం. దీనికిప్పుడు  ‘మనమంతా’ తార్కాణంగా నిలుస్తోంది.

        ఇందులో ఉన్నవి నిత్యజీవితంలో కలిగే చిన్న చిన్న కోరికలే. ఇవి తీర్చుకోవడానికి పడే పాట్లే. పెద్ద లక్ష్యాలు, పెద్ద సంఘర్షణలు కమర్షియల్ సినిమాలకి వర్తిస్తాయి. అయితే ఈ మధ్య కొందరు దర్శకులు ఎలా చేస్తున్నారంటే-  ఈ చిన్న చిన్న కోర్కెలు, అవి తీర్చుకునే పాట్లతో  కమర్షియల్  సినిమాలు ఆలోచిస్తున్నారు. రియలిస్టిక్ సినిమాల పనిముట్లని కమర్షియల్ సినిమాలకి వాడి నడిపించాలనుకుంటున్నారు- అలా చేస్తే అవి రెంటికి చెడ్డ రేవడి అవుతాయని తెలుసుకోవడానికి ‘మనమంతా’ చూస్తే  సరిపోతుంది. సాయిరాం పాత్రతో నైతిక పతనం, గాయత్రి  పాత్రతో మధ్యతరగతి మందహాసం, అభి పాత్రతో  బబుల్ గమ్  ప్రేమలు, మహతి పాత్రతో సామాజిక స్పృహా ఇందులో వున్నాయి. రౌడీని నమ్మితే పాముని నమ్మినట్టే నని అయ్యప్ప శర్మ పోషించిన రౌడీ పాత్రతో నీతి కూడా వుంది. హైపర్ లింక్ జానర్ కింది కొచ్చే ఈ కథ ముగింపు మాత్రం 2005 లో విడుదలైన మనీషా  కోయిరాలా నటించిన ‘అంజానే’ ( అనుకోకుండా) ముగింపుని గుర్తుకు తెస్తుంది- కాకపోతే ‘అంజానే హార్రర్ కథ.


ఎవరెలా చేశారు
      మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్  సగటు ఉద్యోగి పాత్రలో సినిమాకొక జీ వితాన్ని దానం చేశారు. ఆర్ధిక ఇబ్బందులతో అప్పులు చేసే సగటు జీవిగా ప్రారంభమై, ఉద్యోగంలో ఒక్క మెట్టు పైకి ఎక్కాలన్న ఆలోచన దురాలోచనకి దారి తీసి- మనసులోని చీకటి కోణాన్ని బయటపెట్టుకుని- ఆతర్వాత తను పన్నిన ఉచ్చులోంచి తను బయటపడేందుకు పడే కష్టాలతో పాత్రలో ఒదిగిన తీరు చెప్పుకోదగ్గది. ఎక్కడా సూపర్ స్టార్ హవా కన్పించకుండా, నేనూ మీలాంటోణ్ణే అన్నట్టు ఆమ్ ఆద్మీకి వెండితెర మీద పట్టం గట్టారు. కమర్షియల్ కీకారణ్యంలో సామన్యులు తమని తాము వెండి తెర మీద చూసుకోగల అదృష్టానికి ఎప్పుడు నోచుకున్నారు గనుక!

        గౌతమి ఈ సినిమాలో చాలా గ్రేస్ ఫుల్ గా కన్పిస్తారు. బాధ, కాస్తంత ఆనందం, మళ్ళీ బాధ, అయోమయం, ఏం చెయ్యాలో పాలుపోని తనం- ఇవన్నీ మెలో డ్రామాకి  దూరంగా అతి సరళంగా నిర్వహించుకురావడం చాలా సహజంగా జరిగిపోయింది. ఈమె పక్కవాద్యం  ఊర్వశి అలవాటు చొప్పున కామిక్ రిలీఫ్ కి బాగా తోడ్పడ్డారు. వీళ్ళిద్దరూ కలిసివుంటే  ఏదోవొక గమ్మత్తు జరుగుతుంది. రోమాంటిక్ సైడ్ విశ్వంత్, అనూషా అంబ్రోస్ లు తమ  మోడరన్ పాత్రలతో  రోమాన్స్ కొరతని తీరుస్తారు. ఇక చైల్డ్ ఆర్టిస్టు రైనారావ్ దగ్గర్నుంచీ ప్రతివొక్కరూ పాత్రలు చిన్నవైనా రియలిస్టిక్ లుక్ తో రక్తి కట్టిస్తారు. జుట్టూ గడ్డం పెరిగిపోయి, కంపుకొట్టే శరీరంతో రౌడీ పాత్రలో అయ్యప్ప శర్మ వర్మ సినిమాల్లో క్యారక్టర్లని గుర్తుకు తెస్తారు. 


        టెక్నికల్ గా కెమెరా వర్క్, సంగీతం, ఎడిటింగ్ వగైరా ఉన్నత విలువలతో వున్నాయి. మాటల  రచయిత రవిచంద్ర తేజ సినిమా డైలాగులు రాయకుండా బతికించారు. సెంట్రల్ హైదరాబాద్ లో మధ్యతరగతి నివాస ప్రాంతాల్ని వాటి నేటివిటీతో చూపించడం ఈ వాస్తవిక సినిమాకి సహజత్వాన్నిచ్చేలా వుంది. 


చివరి కేమిటి 

    కథా నిర్మాణ పరంగా ముగింపు ఎపిసోడ్ దర్శకుడు  ఏలేటి ఇచ్చిన బంపర్ మాస్టర్ స్ట్రోకే సందేహం లేదు- హిందీ ‘అంజానే’ ని గుర్తుకు తెచ్చినప్పటికీ. హిందీ ‘అంజానే’ కూడా ‘ది అదర్స్’ అనే హాలీవుడ్ కి కాపీ అనేది వేరే విషయం. ఫీల్ గుడ్ మూవీ అంటే ఇలా వుం టుందనేలా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి నిరూపించారు ఏలేటి. ఐతే కథనానికే  ఈ మాస్టర్ స్ట్రోక్ పరిమితమై పోయింది తప్ప కథా ప్రయోజనానికి కాదు. చివరికి ఈ కథకి మూల స్థంభంలా తేలిన గాయత్రి పాత్రకి సమగ్ర ముగింపు పలికారా అంటే లేదనే జవాబు వస్తుంది. ఈ పాత్ర ముగింపు అభ్యుదయమా, పురాణాల వడపోతా? గాయత్రి అంతరిక్ష యానం చేసిన కల్పనా చావ్లా అవ్వాలా, లేక సతీ అనసూయగా వుండి పోవాలా? ఇంకో రెండడుగుల్లో కొత్త భవిష్యత్తు ని వెతుక్కుంటూ సింగపూర్ విమాన మెక్కుతోంటే  తిరోగమింప జేసి- నీ స్థానం ఇక్కడి ఇల్లే తల్లీ, ఈ కష్టాలే పడు!- అన్నట్టు జండర్  స్టీరియో టైపింగ్ చేయడమే కథా ప్రయోజనాన్ని దెబ్బ తీసింది.

        సుమారు ఇలాటిదే అయిన సగటు గృహిణి పాత్రలో శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ (2012) అనే హిందీ, సనాతన ధర్మాన్ని త్రోసిరాజని అభ్యుదయాన్నే చాటింది. దర్శకుడు ఏలేటి నాల్గు కథనాల సంగమంలో చేసిన చమత్కృతి ప్రేక్షకుల టెన్షన్ ని మాత్రమే సడలించ డానికి  పనికొస్తుంది. అది  ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తుంది.  గాయత్రిని అలా తిరిగి  బందీగా రొటీన్ జీవితంలో పడెయ్యడంతో మెటీరియల్ స్థాయిలోనే ఈ ఉపశమనం మిగిలిపోయింది. ఇలా కాకుండా కల్పనా చావ్లా అంతరిక్షాని కేగినట్టు, విమానమెక్కి రివ్వున గాయత్రి మేడమ్ సింగపూర్ కెగిరిపోతే, అదింకా అత్యున్నత  స్పిరిచ్యువల్ అనుభవంగా చిరకాలం మిగిలేది ప్రేక్షకుల దోసిట్లో.


        ‘గ్లాడియేటర్’ లాంటి మెగా మూవీస్ తీసిన దర్శకుడు రిడ్లీ స్కాట్,  1991 లో ‘థెల్మా అండ్ లూయిస్’ అనే థ్రిల్లర్ తీశాడు. ఇందులో ముగింపులో వెంటాడుతున్న పోలీసులు పట్టుకుంటే మనం వెనక్కెళ్ళి జైల్లో బందీ అయిపోతామని, మనం ముందుకే వెళ్ళాలని (
"keep going")  హీరోయిన్లిద్దరూ నిర్ణయం తీసుకుని- కొండ చరియ పైనుంచి కారుని డ్రైవ్ చేసి స్పీడుగా అనంత లోకాలకి దూసుకెళ్ళి పోతారు. ఇదొక స్పిరిచ్యువల్ అనుభవం. దీనికి ఆస్కార్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు లభించింది ఆ సంవత్సరం. మన కమర్షియల్ సినిమాల్లో ఇలాటి స్పిరిచ్యువల్ అనుభవాల ముగింపులు సాధ్యం కాక పోవచ్చు, రియలిస్టిక్ సినిమాల్లో  ప్రయత్నిస్తే పోయేదేం లేదు.


-సికిందర్
(దీనికి స్క్రీన్ ప్లే సంగతులు ఇవ్వడం లేదు.
ఇస్తే ముగింపు  ఎపిసోడ్ వెల్లడించాల్సి వస్తుంది)
http://www.cinemabazaar.in





రివ్యూ!

రచన- దర్శకత్వం : పరశురామ్


తారాగణం : అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి, ప్రకాష్ రాజ్, రావురమేష్, తనికెళ్ళ భరణి, అలీ, ప్రగతి, సుమలత, హంసా నందిని, రవిప్రకాష్, రణధీర్ తదితరులు 

సంగీతం : ఎస్ ఎస్ తమన్, కెమరా : మణికంద 
బ్యానర్ : గీతా ఆర్ట్స్ , నిర్మాత : అల్లు అరవింద్ 
విడుదల : 5  ఆగస్టు, 2016
***
రెండేళ్ళ తర్వాత  తిరిగి అల్లు  శిరీష్  అదృష్టాన్ని పరీక్షించుకుంటూ యాక్షన్ సినిమాల ఫార్ములా దర్శకుడు పరశురాంతో పాత స్టయిల్ రొటీన్ ప్రేమ కథే  ప్రయత్నించి సేఫ్ అవుదామనుకున్నట్టుంది. సేఫ్ ప్రయత్నమనగానే ఇంకా పాత మూస ఫార్ములాలే ప్రయత్నించాలా అనేది  సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ ఇష్టానికి వదిలేద్దాం. ఆయన అనుభవజ్ఞుడు. ఈ లెక్కన కాలంతో పాటు ముందు కెళ్ళని, ఇంకా  2000 నాటి తరహా సినిమాలే చూసే అభిరుచిగల ప్రేక్షకులకి ఇది కచ్చితంగా నచ్చి తీరాలి. అలాటి ప్రేక్షకులకోసమైనా తీసిన-
 ‘శ్రీరస్తు శుభమస్తు’ లో అసలేముందో చూద్దాం...


కథ 

      బాగా డబ్బున్న కృష్ణ మోహన్ ( ప్రకాష్ రాజ్) కొడుకు శిరీష్ ( అల్లు శిరీష్) కాశ్మీర్ టూర్ వెళ్లి అక్కడ ట్రెక్కింగ్ లో గాయపడ్డ అనన్య (లావణ్యా త్రిపాఠీ) ని చూడగానే ప్రేమిస్తాడు. ఆమె వైజాగ్ లో ఇంజనీరింగ్ చేస్తోందని తెలిసి వైజాగ్ వచ్చి ప్రేమ ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.  తండ్రి కృష్ణ మోహన్ కి ఈ మధ్య తరగతి కుటుంబాలంటే పడదు. వాళ్ళు ఉన్నత కుటుంబాల్లో పెళ్లి సంబంధాలు చేసుకుని జీవితాలకి భద్రత చూసుకునే రకాలని మండిపాటు. ఈ అభిప్రాయంతోనే పెద్ద కొడుకు (రవిప్రకాష్) ప్రేమించి చేసుకున్న మధ్యతరగతి కోడలిని హీనంగా చూస్తాడు. ఈ నేపధ్యంలో శిరీష్ కూడా వచ్చేసి ఇలాటిదే అయిన తన ‘మధ్యతరగతి ప్రేమ’ గురించి చెప్పేసరికి ఇంకోసారి   కృష్ణ మోహన్ బుర్ర తిరిగిపోతుంది. ఆ మిడిల్ క్లాస్ అమ్మాయి నిన్ను ప్రేమించదు, నీ డబ్బు చూసి ప్రేమిస్తోందని అనేసరికి- అయితే నేను మిడిల్ క్లాస్ వాడిలానే ఆమెకి కన్పించి  ప్రేమిస్తుందో లేదో చూస్తా, ప్రేమించకపోతే నువ్వు చూసిన గొప్ప సంబంధమే చేసుకుంటా- అని ఛాలెంజి చేసి వెళ్ళిపోతాడు శిరీష్.


        కానీ అనన్య అసలు ఈ ప్రేమలంటే ఇష్టం లేనట్టే వుంటుంది. శిరీష్ ఉనికినే సహించదు. అతడి చేష్టలకి ఎంతసేపూ వెళ్ళగొట్టాలనే చూస్తూంటుంది. అంతగా డబ్బు లేని ఆమె తండ్రి జగన్నాథం (రావురమేష్), స్నేహితుడు రామనాథం (తనికెళ్ళ భరణి) చేస్తున్నఆర్ధిక సహాయంతో తను ఇంజనీరింగ్ చదువుకుని పైకి రావాలని కృషి చేస్తోంది. తనకి ఇంకో ఆసక్తి లేదు. అలాటి ఈమెనే కోడలిని చేసుకుంటానని సాక్షాత్తూ రామనాథమే  రావడంతో, ఏమీ అనలేని  నిస్సహాయ స్థితిలో పడుతుంది. శిరీష్ ని వదిలించుకుంటుంది.

        ఇలా దెబ్బ తిన్న శిరీష్ ఆమె ఇంట్లో చేరి ఆమె పెళ్లి కార్యక్రమాల్లో ఆమె మనసు మార్చే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ ప్రయత్నాల్లో ఎలా సఫలమయ్యా డనేది మిగతా కథ. 

ఎలా వుంది కథ 
     ముందు చెప్పుకున్నట్టు దశాబ్దంన్నర క్రితం, ఇంకా అంతకి ముందు కూడా వచ్చిన ఎన్నో -‘దిల్ వాలే దుల్హనియా లేజాయింగే’  టైపు రొటీన్ ఫార్ములా ప్రేమ సినిమాల్లాగే వుంది . పెళ్లవుతున్న హీరోయిన్ ఇంటికి హీరో వెళ్ళి తనవైపు ఆమెని తిప్పుకునే బాపతు సినిమాల కోవలోనే వుంది ఈ  కథ. ఈ కథలో  ట్రెండ్  దృష్టిలో పెట్టుకుని కొత్తదనం వైపు మళ్ళించేందుకు తగ్గ ఘట్టం ఒకటి అసంకల్పితంగా జొరబడ్డా, అది దృష్టికి రాలేదో, లేక అనుకున్న పాత మూసకే  కట్టుబడాలని  ఉద్దేశపూర్వకంగా  ఉపేక్షించారో తెలీదు (ఈ ఘట్టం గురించి తర్వాత స్క్రీన్ ప్లే సంగతుల్లో చెప్పుకుందాం) కానీ మొత్తంగా  చూస్తే, వాళ్ళ పాట్లేవో వాళ్ళు పడుతున్న నేటి కాలపు యువజంట ప్రేమ కథలో  మోరల్ పోలీసులుగా పెద్దలు  జోక్యం చేసుకుని-ప్రేమలూ పెళ్ళిళ్ళూ ఎప్పుడూ తమ ఆదుపులోనే వుండేట్టుగా  సంకెళ్ళు వేసే (సినిమా) పాలసీకి సమర్ధింపుగా, ఈ దర్శకుడు కూడా అందించిన మరో నీతి కథే తప్ప – యువతకి స్వేచ్ఛ గానీ, యూత్ అప్పీల్ గానీ ఇందులో కన్పించవు.

         ‘అహ నా పెళ్ళంటా’ లోనూ రాజేంద్రప్రసాద్ కి ఇలాగే తండ్రితో గొప్పా పేదా తేడాలతో సమస్య వచ్చి, పిసినారి కూతుర్ని పిసినారిగానే ప్రేమించి సొంతం  చేసుకుంటానని  బయల్దేరతాడు. ఈ వినోదభరిత కథలో పెద్దల జోక్యం గానీ, యువతని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పీకే క్లాసులుగానీ వుండవు- ఎందుకంటే ఇది కామెడీ కథ. కామెడీ జానర్లో అలాటి వాసనలు కుదరవు. మరి యూత్ లవ్ స్టోరీస్ లో జానర్ మర్యాదని భంగపర్చే  పెద్దల సిద్ధాంతాలు ఎలా పొసగుతాయి? ఈ మధ్యే ‘కళ్యాణ వైభోగమే’ లోనూ ఇదే పరిస్థితి. పోనీ ఫ్యామిలీ సినిమా అనుకున్నా పాత్రచిత్రణలు, వాటి మనస్తత్వాలు ఇంత అసహజంగా ఎందు కున్నాయి? ఏమైనా ఎలా వున్నా పాతదే చాలునని అల్లు అరవింద్ రాజీ పడ్డట్టుంది, తనకున్న  నెట్ వర్క్ తో  సినిమాని నిలబెట్టుకోవడం కష్టం కాదు కాబట్టి. 

ఎవరెలా చేశారు    సేమ్ టు సేమ్ అల్లు శిరీష్, మార్పేమీ లేదు. ఇంకా క్యారక్టర్  ప్రకారం గత ‘కొత్త జంట’ లో కొంత ట్రెండీ గానైనా  కన్పించాడు. ఇప్పుడు ఈ క్యారక్టర్ ప్రకారం, కథ ప్రకారమూ ట్రెండీ నెస్ కుదరక, పైగా గతంలో ఎందరో  హీరోలు ఇలాటి పాత్రలు నటించెయ్యడంతో పాత్రలో కూడా నవ్యత లేకుండా పోయింది. పాత్ర చిత్రణ సరిగ్గా లేకపోతే  నటన గురించి మాట్లాడుకోవడం కూడా  అప్రస్తుతమై పోతుంది. పాత్ర చిత్రణ సరీగ్గా ఉంటేనే ఎలా నటించాడని చెప్పుకునేందుకు విషయ ముంటుంది. 

        చిట్ట చివర్లో అల్లుశిరీష్ తండ్రి పాత్ర ప్రకాష్ రాజ్ తో అనే మాట- ఇంట్లో ఇంత కించ పడుతున్న వదినని చూస్తూ ఇంకో కోడలిని తీసుకు రాలేక వదిలేసి వచ్చానంటాడు. అంటే ఐదేళ్లుగా వదిన పరిస్థితి తన ఇంట్లో ఎలా వుందో ముందు తెలీదా? అసలు ఇలాటి తండ్రి వున్న ఇంట్లోకి ఇంకో మధ్య తరగతి అమ్మాయిని తీసుకువస్తానని ప్రపోజ్ చెయ్యడమే తప్పు. ఛాలెంజి చేసి ఆ ఆమ్మాయితోనే  వస్తానని చెప్పడం ఇంకా తప్పు. తను చెయ్యాల్సింది ముందు తండ్రి మనస్తత్వాన్ని మార్చడం, తద్వారా వదినకి గౌరవ ప్రదమైన స్థానాన్ని  కల్పించడం- ఆ తర్వాతే ప్రేమా గీమా!  

        పాత రోటీన్ కథలే అయినా, ఫ్యామిలీ కథంటూ ప్రచారం చేసినా- ఇలాటి లోటుపాట్లతో ఎలా చెలామణీ చేయగలరు. నిజ జీవితాల్లో తామెలా ఉంటారో, ఎలా వ్యవహరిస్తారో జనాలు ప్రతీ ఒక్కరికీ వాళ్ళ కుటుంబాల్లో అనుభవపూర్వకంగా తెలిసే వుంటుంది. వాళ్ళు పోల్చి చూసుకుంటే ఇలాటి కథలు- పాత్రలు  నిలబడతాయా?

        అల్లు శిరీష్ తన ఆకృతికి తగ్గట్టు నటించి మెప్పించాలంటే ఇలాటి మూస ఫార్ములా పాత్రలు తగవు. తన ఆకృతిని మరపించే యూత్ అప్పీల్ వున్న, స్పీడుతో  కూడుకున్న  ఇంకా క్రీజీ క్యారక్టర్స్  పోషించాల్సి వుంటుంది- తమిళంలో ధనుష్ లాగే. అంతే గానీ గ్లామర్ హీరోగానో, మాస్ హీరోగానో అయిపోదామంటే బాక్సాఫీసుతో అయ్యేపని కాదు.  

         ఇక లావణ్యా త్రిపాఠి పాపం సినిమా చిట్టచివరి వరకూ ఎక్కడా  యూత్ అప్పీల్  అనేదే లేకుండా, ప్రేమించనే ప్రేమించకుండా, ప్రేక్షకుల్ని అలరించే రోమాన్సే లేకుండా రుసరుసలాడే, చిటపటలాడే మొనాటనీతో విసిగించేస్తుంది  - అల్లు శిరీష్ పాత్ర పెట్టే  టార్చర్ పుణ్యాన! ఎంతసేపూ ఇద్దరి మధ్య కీచులాటల దృశ్యాలే. ఎందుకీ చదువుకునే ఓ మధ్యతరగతి అమ్మాయిని ఇంతగా వెంటపడి వేధిస్తున్నాడని మనకే చిరాకేస్తుంది. చూస్తే ఈ ట్రాక్ ‘యువత’ లోంచి దిగుమతయ్యిందని అర్ధమవుతుంది. పరశురాం మొదటి మూవీ ‘యువత’ లో ఇలాగే ఆవారా హీరో మెడిసిన్ చదివే హీరోయిన్ ని అమర్యాదగా సంబోధిస్తూ వెంటపడి వేధిస్తూంటాడు. ఈ వెంటపడ్డాలకీ, ప్రేమలో ఒప్పించుకోవడాలకీ చాలా తేడా వుంది. లైంగిక వేధింపుల్లా వుండే ఈ వెంటపడి వేధించడాలు ‘స్టాకింగ్’  నేరం కిందికొచ్చి ఏంచక్కా  నిర్భయ చట్టాన్ని మెడకి బిగిస్తాయి. కానీ మూస కథలకి, హీరోల పాత్రలకీ  బయటి ప్రపంచంతో సంబంధం వుండదు కదా? 

పబ్లిసిటీ కోసం తీసిన ఈ ఫోటో షూట్ రోమాంటిక్ దృశ్యాలేవీ సినిమాలో లేవు...
     తండ్రి డబ్బుని  ఎంజాయ్ చేసే, భవిష్యత్ గురించి ఏ బెంగాలేని  వాడు హీరో. చదువుతోనే భవిష్యత్తూ, అదీ ఇంకొకరి సాయం పొంది తండ్రి తెచ్చిస్తున్న డబ్బుతోనే  చదువుకుని పైకొచ్చే బాధ్యతా  వున్న హీరోయిన్. తనకీ ఈమెకీ ఇంత తేడా వుంటే  హీరోగారి ప్రేమ గోలేమిటి- తండ్రితో చేసిన హాస్యాస్పదమైన ఛాలెంజితో? 

        హీరోయిన్ గనుక ఈ హీరోగారి ఇంట్లో బండారం తెలుసుకుంటే- ‘ఏంట్రా నీ దబాయింపు- వెళ్లి ముందు మీ ఇంట్లో మీ వదినకి మంచి స్థానం కల్పించు  ఫో! నీ వదిన అలా బతుకుతున్న కొంపలోకి నేనూ రావాలట్రా?’ - అని తోసి పారేసేది!

        ఇది రోమాంటిక్ కామెడీగానూ ఎందుకు కాలేకపోయిందంటే, రోమాంటిక్ కామెడీల్లో హీరో హీరోయిన్లే పరస్పరం ప్రత్యర్ధులుగా వుంటారు. మరొకరు వుండరు. అలాంటప్పుడు హీరో గారు పెట్టే  టార్చర్ కి హీరోయిన్ రియాక్ట్ అవుతూ పాసివ్ గా వుండదు. మాటకి మాట,  చేతకి చేత బదులిస్తూ యాక్టివ్ గా వుంటుంది.  

        ప్రకాష్ రాజ్, రావురమేష్, తనికెళ్ళ పాత్రలు పెద్దరికాలతో ప్రేమకథకి అడ్డుతగిలే పాత్రలే. సెకండాఫ్ లో వచ్చే అలీ- సుబ్బరాజుల కామెడీ కాస్త బెటర్ ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాకి. తమన్ సంగీతంలో క్యాచీ సాంగ్స్ మాత్రం లేవు. మణికంద కెమెరా వర్క్ ఫర్వాలేదు. పరశురాం రచనా, దర్శకత్వాలు సినిమా ప్రారంభమే భారంగా మందకొడిగా సాగుతాయి. చివర్లో ప్రకాష్ రాజ్ తో అల్లు శిరీష్ అనే మాటలు పైకి హైలైట్ గానే దృశ్యాన్ని రక్తికట్టిస్తాయి గానీ, తరచి చూస్తే పైన చెప్పుకున్న అల్లు శిరీష్ లోపభూయిష్ట పాత్ర చిత్రణ రీత్యా ప్రేక్షకుల్ని మభ్య పెట్టడంగానే తేలతాయి. 


చివరికేమిటి     
      జా
నర్ స్పష్టత లేని సినిమాలు ప్రేక్షకులు ఇప్పుడెక్కడ చూస్తున్నారు? గత సంవత్సరం హిట్టయిన చిన్నా పెద్దా సినిమాలన్నీ జానర్ మర్యాదని కాపాడుకున్నవే నని అర్ధంజే సుకుంటే, ‘శ్రీరస్తు శుభమస్తు’ కి ఏ జానరూ లేదు. పాసివ్ హీరోయిన్ తో రోమాంటిక్ కామెడీ అన్పించుకునేట్టు లేదు, పాత్ర చిత్రణ లోపాలతో ఫ్యామిలీ స్టోరీ అన్నట్టూ లేదు. మూసఫార్ములా అనడానికీ పాత్ర చిత్రణలే అడ్డొస్తున్నాయి. రోమాంటిక్ కామెడీ అనుకున్నప్పుడు  యువత జీవితాల్లో చేసుకునే ప్రయోగాలకి వాళ్ళే బాధ్యత వహించి వాళ్ళే పరిష్కరించుకునే, పెద్దల జోక్యం లేని స్వావలంబన దిశగా యువతని నడిపించేట్టూ  వుండాలి.  లేదూ, ఫ్యామిలీ కథకే కట్టుబడదామనుకుంటే ఆ కుటుంబ సంబంధాలో మానవ సంబంధాలో అవైనా  అర్ధవంతంగా చూపించాలి. కానీ యూత్ సమస్యా- కుటుంబ సంబంధాలూ రెండూ కలిపి కొడితే కాషాయం తయారవుతుందే  తప్ప కమర్షియల్ కి అవకాశముండదు. రెండోది, టార్గెట్ ఆడియెన్స్ ఎవరు? యువతా, లేక కుటుంబాలా? ముందు ఇది నిర్ణయించుకుంటే గానీ తీయాలనుకుంటున్న కథ తో స్పష్టత రాదు.



-సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు సోమవారం)
http://www.cinemabazaar.in/




Monday, August 1, 2016

స్క్రీన్ ప్లే సంగతులు!


         
సినాప్సిస్  రాసుకోకపోవడం వల్ల చాలా సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి. సినాప్సిస్ ఐడియా నుంచి పుడుతుంది. ఐడియా ఒక స్టోరీ లైన్ లోకి ఒదగలేదంటే, సినాప్సిస్  (4 పేజీల కథాసంగ్రహం) కూడా కుదరదు.  ‘జక్కన్న’ లో  చిన్నప్పుడు విలన్ చేసిన సాయానికి జక్కన్న ప్రతిసాయం చేయాలనుకోవడం మాత్రమే కథకి  ఐడియా అవుతుందా? ఇది అర్ధవంతంగా వుందా? ఇందులో కథ కన్పిస్తోందా? స్ట్రక్చర్ కన్పిస్తోందా?  బిగినింగ్-మిడిల్- ఎండ్ విభాగాలు కన్పిస్తున్నాయా? ఇవేవీ కన్పించనప్పుడు కోట్ల రూపాయలతో ఈ సినిమా తీయడానికి ఎలా సాహసించినట్టన్నది జక్కన్నే చెప్పాలి.  

         
సినిమా తీయడానికి వాస్తు చూసుకుంటారు, ముహూర్తాలు చూసుకుంటారు, పూజలు చేసుకుంటారు, జ్యోతిషం కూడా చెప్పించుకుంటారు. కానీ తీస్తున్న సినిమా ఐడియాకి వాస్తు వుందా, శాస్త్రం వుందా, జ్యోతిషం చెప్పించుకోవాలా అని ఆలోచించరు. తమకి తోచిందే ఐడియా, తమకు తోచిందే శాస్త్రం, తమకు తట్టిందే దాని వాస్తు. ఈ కర్ర పెత్తనం లేని హాలీవుడ్ లో  సినాప్సిస్ రైటింగ్ కే ప్రత్యేకమైన శిక్షణా సంస్థలు ఎందుకుంటున్నాయో కాస్త ఆలోచించాలి.

        నిజానికి సినాప్సిస్ రాయడానికి జక్కన్న ఐడియాలో పావు వంతు కథే కన్పిస్తోంది.  అంటే ప్రేక్షకులనుంచి పూర్తి సినిమా డబ్బులు తీసుకుని, పావు వంతు కథే చూపించారన్న మాట. ఇలాటి స్కాములు కూడా జరురుగుతున్నాయని అర్ధంజేసుకోవాలి. ఈ పావువంతు కథతో- ‘విలన్ తనకి చిన్నప్పుడు చేసిన సాయానికి జక్కన్న ప్రతిసాయం చేయాలనుకుని వస్తాడు’ ...అనేది మాత్రమే ఐడియాగా కన్పిస్తోంది. ఈ అయిడియా పావు వంతు కథ మాత్రమే. ఎందుకంటే ఇది స్క్రీన్ ప్లే  స్ట్రక్చర్ లో బిగినింగ్ ని  మాత్రమే సూచిస్తోంది. ‘సాయం చేయడానికి జక్కన్న వస్తే విలన్ ఎలా రియాక్ట అయ్యా’ డనేది కలుపుకుంటే అప్పుడు ఇంకో సగం కథ కలుస్తుంది. అంటే స్ట్రక్చర్  లో మిడిల్ విభాగమవుతుంది.  చివరికేమైందో చెప్పుకుంటే  మిగతా పావు వంతూ  కథ కలిసి -అంటే ఎండ్ విభాగం కూడా జతకూడి స్ట్రక్చర్ పూర్తవుతుంది. వలయం పూర్తి కాకుండా విద్యుత్ ప్రవహించదు, అవునా? అలాగే బిగినింగ్- మిడిల్-ఎండ్ అనే వలయం పూర్తికకపోతే ఐడియా, సినాప్సిస్, స్క్రీన్ ప్లే ఏదీ సాధ్యం కాదు. 

     తనకి విలన్ చిన్నప్పుడు చేసిన సాయానికి ప్రతిసాయం చేయాలనుకున్న జక్కన్నకి- విలనే తెగ సాయం చేసేస్తూ ఎదురు బాదుడు మొదలెడితే  జక్కన్న పరిస్థితి ఏమిటీ ...అని ఐడియాని సవరించుకోవచ్చు. అప్పుడిందులో కథకి మూడంకాలు (బిగినింగ్- మిడిల్- ఎండ్ లు) కన్పిస్తాయి. అంకాలు లేని కథ డొంక దారే చూసుకుంటుంది. ప్రతిసాయం చేయడానికి జక్కన్న రావడం బిగినింగ్, విలనే ఎదురు సాయంతో బాదడం మిడిల్, అప్పుడు జక్కన్న  పరిస్థితేమిటన్నది ఎండ్ గా కథకి కావాల్సిన స్ట్రక్చర్లో ఐడియా వుంటుంది. 

        ప్రతిసాయం చేయాలనుకుని వచ్చిన వాడు ఆ సాయమేదో చేసేసిపోతే, కథెలా అవుతుంది? అది సినిమా తీయడానికి  పనికిరాని ఉత్త ‘గాథ’ అవుతుంది.  జక్కన్న చేసే ప్రతిసాయాన్ని విలన్ అడ్డుకుంటూ సమస్యలు సృష్టిస్తే అప్పుడది కథకి అవసరమైన ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తూ కథా లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. ‘గాథ’ గా ఎలా వుంటుందంటే - నాకెప్పుడో విలన్ చేసిన సాయానికి నేను ప్రతిసాయం చేసి ఇలా బదులు తీర్చుకున్నానూ అని చప్పగా జక్కన్న  ‘స్టేట్ మెంట్’  ఇచ్చేసి తప్పుకునేదిగా వుంటుంది.

         ఇదే కథయితే ఎలా  వుంటుందంటే –నేను పొందిన సాయానికి  ప్రతిసాయం  చేద్దామని వస్తే తనదైన పాయింటుతో అడ్డుకుని ఎదురు సాయం చేస్తూ పోయాడు  వెధవ- అని జక్కన్నకీ- విలన్ కీ మధ్య ఓ పాయింటుతో ఆర్గ్యుమెంట్ సహిత సంఘర్షణని సృష్టించేదిగా వుంటుంది. స్టేట్ మెంట్ కీ, ఆర్గ్యుమెంట్ కీ తేడా గుర్తించాలి : స్టేట్ మెంట్ లో కథ వుండదు, ఆర్గ్యుమెంట్ లో కథ వుంటుంది. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ తో  సంఘర్షణ పుడుతుంది, స్టేట్ మెంట్ తో సఘర్షణ పుట్టదు. సినిమా కథంటే సంఘర్షణే. గాథల్లో సంఘర్షణ వుండదు. ఇందుకే  ‘జక్కన్న’ లో విలన్ సంఘర్షించకుండా ఏమీ చేతకాని జోకర్ లా మిగిలిపోయాడు.  

        పైన చెప్పుకున్నట్టు-  తనకి విలన్ చిన్నప్పుడు చేసిన సాయానికి ప్రతిసాయం చేయాలనుకున్న జక్కన్నకి- విలనే తెగ సాయం చేసేస్తూ ఎదురు బాదుడు మొదలెడితే  జక్కన్న పరిస్థితి ఏమిటీ ...’  అన్న సవరించిన అయిడియాతోనే సినాప్సిస్ కి పూనుకున్నామనుకుందాం. (అసలు కథంటే  డైనమిక్స్ కూడా. హీరో అనుకున్నట్టే జరిగిపోతే అది కథే కాదు. జక్కన్న ప్రతిసాయం చేసేద్దామని వస్తే విలన్ దానికి చెక్ పెడుతూ తనే ఎదురు సాయం చేస్తూ చావగొడితే అప్పుడిందులో  డైనమిక్స్ వుంటాయి). ఈ  విధంగా ఐడియాని సవరించుకుంటే అప్పుడు వర్కౌట్ అవుతుందా? ముందు ఈ ఐడియా ప్రేక్షకులకి అమ్ముడుబోయే ఐడియాయేనా? లేకపోతే ప్రేక్షకుల దగ్గర పక్కాగా అసలీ నోట్లు లెక్కెట్టుకుని తీసుకుని, ఆనవాయితీగా  నకిలీ సినిమా అంటగట్టడమే అవుతుందా? రెండు చోట్ల బతికిపోతారు తయారీదార్లు- ఒకటి, మద్యం ధరలు పెంచేసినా ఉద్యమాలు చెలరేగే పరిస్థితి వుండదు; రెండు, నకిలీ సినిమాలు అంటగట్టినా తిరుగుబాట్లు జరుగుతాయనే భయం వుండదు. సినిమాల విషయంలో ఎప్పుడో ఒకసారి బయ్యర్లు రోడ్డెక్కుతారు, అంతే. కానీ ఎవరెలా పోతే మనకేంటనుకున్నా, ఫ్లాప్ టాక్ వస్తే  జక్కన్న పరువుకి అంత మంచిది కాదేమో? 

    కాబట్టి  ముందు సెలెక్టు చేసుకున్న ఐడియా అమ్ముడుబోయే ఐడియాగా వుండక తప్పదు. అమ్ముడుబోవడానికి ఈ ఐడియాలో ఏముందని? సాయం చేస్తే ప్రతి సాయం చేయడమేనా? అదీ పదిహేనేళ్ళ తర్వాత విలన్ చేసిన సాయం గుర్తు పెట్టుకుని మరీ ప్రతి సాయం చేద్దామని రావడమేనా? కన్విన్సింగ్ గా వుందా? సాయానికి ప్రతిసాయం చేయాలనుకోవడమే వెర్రితనం. సాయం చేసే వాళ్ళు తిరిగి ఆ మనిషి నుంచి ఏదో ఆశించి  సాయం చేయరు. ఒకవేళ సాయం చేసిన మనిషి ఆపదలో వుంటే గుర్తుంచుకుని ఆదుకోవడం ధర్మమే కావచ్చు. జక్కన్న చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న పాఠం ఇదే. చీమ ఆపదలో వున్నప్పుడు పక్షివల్ల సాయం పొందింది. తిరిగి పక్షి ఆపదల్లో పడ్డప్పుడు చీమ కాపాడింది. 

        అంతేగానీ తన ప్రాణాలు కాపాడినందుకు  -నీ ప్రాణాలు కూడా నేను కాపాడతానూ,  నీ ప్రాణాలు కూడా నేను కాపాడతాను ప్లీజ్ -  అని పక్షి వెంట పడలేదు చీమ. కానీ పెద్దయ్యాక కూడా జక్కన్న- తన పర్సు కింద పడిపోతే బెగ్గర్ కొట్టెయ్యకుండా తీసిచ్చిన  పాపానికి, అప్పటికప్పుడు వెంటపడి మరీ సాయం చేసిన  బెగ్గర్ ని సింగర్ గా మార్చేసే దాకా వూరుకోడు. ఇలాటి వాణ్ణి చూస్తే పొరపాటున కూడా వీడికి సాయం చేయకూడదనే అన్పిస్తుంది ఎవరికైనా. తనకి సాయం చేసిన వాళ్ళ జీవితాల్లో వ్యవసాయం చేసేస్తానని ఊతపదం కూడా జక్కన్నకి. నిజానికిది మానసిక రోగం. ఈ రోగం పది రెట్లవుతుంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒక విలన్ వల్ల  కాకతాళీయంగా తను బతికిపోతే, పదిహేనేళ్ళ తర్వాత ఆ విలన్ కి సాయం చేద్దామని బయల్దేరి రావడమే  సైకోతనం. 

        మురెల్ జేమ్స్- డొరోతీ జొన్గేవార్డ్ లు రాసిన ప్రసిద్ధ పుస్తకం  ‘బోర్న్ టు విన్’ వుంది. అందులో  ఒక సైకలాజికల్ కండిషన్ ని వివరిస్తారు. ఉదాహరణకి చిన్నప్పుడు అన్నదమ్ములు బొమ్మ బస్సుతో ఆటలాడుకుంటూంటారు. ఆ బొమ్మ బస్సు తమ్ముడిది. దాని చక్రం అన్న చేతిలో విరిగింది. అది మనసులో పెట్టుకున్నాడు తమ్ముడు. ఇద్దరూ పెద్దవాళ్ళయి పోయారు, బాగా పెద్ద వాళ్ళయి పోయారు. ఎవరి కుటుంబాలతో వాళ్ళు సుఖంగా వున్నారు. అంతలో ఏమైందో, అన్న బతుకు దుర్భరం చేయసాగాడు తమ్ముడు. ఇంటిమీదికొచ్చి దాడి చేయడం, పారిపోవడం. ఏంటంటే, చిన్నప్పుడు నువ్వు నా బస్సు చక్రం విరగ్గొట్ట లేదా? ఇప్పుడనుభవించూ! 

      ఇదీ విషయం. ఈ మానసిక స్థితిని  ‘సైకలాజికల్ ట్రేడింగ్ స్టాంప్స్’  అన్నారు సదరు సైకియాట్రిస్టులైన  ఈ గ్రంథ రచయిత్రులు. అంటే చిన్నప్పుడు పొందిన చిన్న చిన్న అవమానాలు కూడా అలాగే మనసులో ముద్రేసుకుని వుండిపోతాయి. మనసు వొక ఆల్బం అనుకుంటే ఆ అవమానాలు స్టాంప్స్. ఒక్కో అవమానం ఒక్కో స్టాంపుగా మనసు ఆల్బంలో భద్రపర్చుకుంటూ పోతారు. ఎప్పుడో బుర్రతిరుగుతుంది. అప్పుడు ఆ మనసు ఆల్బం తిరగేసి స్టాంపులు చూసుకుంటూ, ఏళ్ళు గడిచిపోయాక పాత కక్ష తీర్చుకుంటూ ఇలా తిక్క వేషాలేస్తారన్న మాట! 

        ఇది పసి మనస్తత్వమే. జక్కన్న ఐడియా ఈ మానసిక స్థితి ఆధారంగా పుట్టి వుండవచ్చా అంటే అలా కూడా  అన్పించదు. పక్కా  సైకో పాత్రగానే కన్పిస్తాడు. మరి సైకోతో బ్లాక్ కామెడీ వర్కౌట్ అవుతుంది. ఇది బ్లాక్ కామెడీయా అంటే అదీ కాదు, ఏదో ఓ యాక్షన్ కామెడీ.  ‘భేజా ఫ్రై’ అనే హిందీ హిట్ కామెడీలో  మ్యూజిక్ కంపెనీ ఓనరైన రజత్ కపూర్ ఇంట్లో పల్లెటూరి నుంచి సింగర్ నవుదామని వచ్చిన వినయ్  పాఠక్  తిష్ట వేసి నానా బీభత్సం సృష్టిస్తాడు. తన చేష్టలతో ఆ కుటుంబంలో భార్యాభర్తలు విడిపోయేలా అపార్ధాలు కూడా సృష్టిస్తాడు. ఇతను సైకోనా అంటే కాదు, మ్యూజిక్ వరల్డ్ గురించి ఏమీ తెలీని అమాయకుడు. తన చేష్టల వల్ల ఎంత నష్టం జరుగుతోందో కూడా తెలుసుకోని భోళాశాకంరుడు.

        కాబట్టి జక్కన్న సైకో అయితే తప్ప, అదీ బ్లాక్ కామెడీ అయితే తప్ప, ఈ అయిడియా వర్కౌట్ కాదని తేలుతోంది. ప్రేక్షకులు సైకోలు కారు. కనుక ఒక సైకో కాని జక్కన్నేంటీ ఇలా  సాయం చేసిన వాళ్ళ జీవితాల్లో వ్యవసాయం చేస్తానంటూ వెంట పడుతున్నాడూ - అనేసి జక్కన్నతో ఎమోషనల్ గా కనెక్ట్ కూడా కాలేరు. పోనీ ఇది కామెడీ కాబట్టి పక్షీ చీమా నీతి  కథనే  జక్కన్న అతి చేస్తున్నాడని సర్దుకుపోవడానికీ లేదు. ఎందుకంటే కామెడీ కథకి పునాదిగా వుండే పాయింటు లాజికల్ గా వుంటేనే దానిపై కమెడియన్ ఎంత అసంబద్ధంగా, అతిగా కామెడీ చేసినా చెల్లిపోతుంది. పునాదిగా వున్న పాయింటునే (నీతికథనే) అతి చేస్తే దాన్నాధారంగా అతి చేయడానికి ఏ కామెడీ వుండదు. కాబట్టి ఈ సవరించిన ఐడియా అబ్సర్డ్ (అసంబద్ధ) కామెడీగానూ పనికిరాదు. ఇదొక అసహజ పాత్ర, దీంతో ఐడియాని ఎంత  సవరించినా ఎంతకీ అమ్ముడుబోని ఐడియాగానే వుండిపోతుంది. దీంతో సినాప్సిస్ రాయడమే కుదరదు, స్క్రీన్ ప్లే సంగతి తర్వాత! 

        ఇలా ఐడియాలో అర్ధవంతమైన కథ కన్పించడం ఎందుకవసరమో తెలుసుకున్నాక, ఈ అమ్ముడుబోని ఐడియా కథనం కూడా ఎలావుందో ఇప్పుడు చూద్దాం...

కథ 

బిగినింగ్ :        చిన్నప్పుడు పక్షీ చీమా నీతి  కథ తెలుసుకున్న గణేష్ అలియాస్ జక్కన్న (సునీల్) కథలో చీమలా కాకుండా అతిగా బిహేవ్ చేస్తూంటాడు. తన కెవరైనా చిన్న సాయం చేస్తే జీవితాతం వెంటపడి వాళ్లకి సాయం చేసేస్తూ ఉంటాడు. ఇలాటి వాడు ఒకరోజు బట్టలు సర్దుకుని వైజాగ్ వచ్చేస్తాడు. చేత్తో వేసిన ఒకడి బొమ్మ పట్టుకుని ఆరా తీస్తూ తిరుగుతూంటాడు. ఆ బొమ్మ బైరాగి (కబీర్ సింగ్) అనే మర్డర్లు చేసే రౌడీది. వీడు ఎవరికీ కన్పించడు. పేరు మాత్రమే జనాలకీ, పోలీసులకీ తెలుసు, కానీ ఎలా ఉంటాడో రూపం  తెలీదు. 

        ఇలా ఒకవైపు వీడి కోసం వెతుకుతూ, ఇంకో  కన్పించిన సహస్ర (మన్నారా చోప్రా) అనే అమ్మాయి వెంట పడుతూంటాడు. ఈమె నెలరోజుల్లో ఒకడ్ని కొట్టడం కోసం కుంగ్ ఫూ మాస్టర్ (సప్తగిరి) దగ్గర కరాటే నేర్చుకుంటోంది. ఆ కరాటే స్కూల్లో తనూ చేరి ఆమెని ప్రేమించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు జక్కన్న. 

        పోగాపోగా బైరాగిని కనుక్కుంటాడు. ఇంతకీ నువ్వెందుకు నాకోసం వెతుక్కుంటూ వచ్చావని బైరాగి అడిగితే చెప్పడు. నీకోసం ఏమేం  చేస్తానో చూడూ అని వెంటపడతాడు. బైరాగీ ఎలా వుంటాడో వూరంతా పోస్టర్లు అంటించి జనాలకీ పోలీసులకీ, శత్రువులకీ తెలిసి   పోయేట్టు  చేస్తాడు. ప్రతీ సెంటర్ కీ జనాల మధ్యకి బైరాగిని రప్పిస్తూ దొరక్కుండా ఆటలాడుకుంటాడు. వీడెడవడ్రా అసలు వీడికేం కావాలీ- అని అనుచరుడు నల్లస్వామి( సత్య ప్రకాష్) దగ్గర తలబాదుకోవడమే చేస్తూంటాడు బైరాగి. 

        బైరాగి శత్రువులు బైరాగిని చంపడానికి వచ్చేస్తారు. వాళ్ళందర్నీ చంపేసి బైరాగి ప్రాణాలు కాపాడతాడు జక్కన్న. అప్పటికీ తానెవరో చెప్పకుండా ఏడ్పిస్తూనే వుంటాడు. బైరాగిని పట్టుకోవడానికి ఢిల్లీ నుంచి ఇన్స్ పెక్టర్ (పృథ్వీ) వస్తాడు. ఇన్స్ పెక్టర్ ని బోలెడు కన్ఫ్యూజ్ చేస్తూ బైరాగి దొరక్కుండా చేస్తూంటాడు జక్కన్న. అన్ని ఆధారాలతో బైరాగిని అరెస్టు చేయడానికి ఇన్స్ పెక్టర్ వచ్చేస్తే, బైరాగీ ఇంట్లో బోలెడు మంది బంధువులుని దింపి ఇన్స్ పెక్టర్ని ఫూల్ చేస్తాడు జక్కన్న. ఇన్స్ పెక్టర్ నీ, బైరాగీని కన్ఫ్యూజ్ చేస్తూ బైరాగి ఇంట్లో గేమ్ ఆడుతూంటాడు జక్కన్న. 

        తను ప్రేమిస్తున్న సహస్ర బైరాగి చెల్లెలని తెలుస్తుంది. ఆమె తల్లిదండ్రులు తల్లిదండ్రులు కారు. ఆమె చిన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని బెదిరించి బైరాగీయే అప్పగించాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ తర్వాత,  తను బైరాగికి ఎందుకు సాయం చేస్తున్నాడో ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటాడు జక్కన్న. చిన్నప్పుడు బైరాగీ మర్డర్లు చేస్తున్న సంఘటనలో ఇరుక్కున్న తనని,  బైరాగీ శత్రువు చంపబోతూంటే, అప్రయత్నంగా శత్రువుని చంపేసి తన ప్రాణాలు కాపాడాడని చెప్పుకుంటాడు.

ఎండ్ :
       
ప్పుడు బతికున్న శత్రువు మళ్ళీ బైరాగిని చంపేందుకు ప్రయత్నిస్తాడు. ఈ శత్రువుని జక్కన్న చంపేసి బైరాగిని కాపాడతాడు. ఇక బరాగి దగ్గరే సెటిలై ఇంకా సాయం చేస్తూనే వుంటా నంటాడు.  వద్దురాబాబూ  అని దండం పెట్టుకుంటాడు బైరాగీ. సహస్ర జక్కన్న చేయి అందుకుంటుంది. అందరూ హాయిగా నవ్వుకుంటారు. శుభం కార్డు పడుతుంది.  


స్క్రీన్ ప్లే సంగతులు
        పై కథలో జక్కన్న తానెందుకు బైరాగీకి సాయం చేస్తున్నాడో ఫ్లాష్ బ్యాక్ చెప్పే వరకూ సుదీర్ఘంగా సాగిందంతా బిగినింగ్ విభాగంగా గుర్తించాలి. ఆ తర్వాత నుంచీ బైరాగి శత్రువుని జక్కన్న చంపేశాక  కథ ముగింపు వరకూ ఎండ్ విభాగం. ఈ బిగినింగ్ కీ ఎండ్ కీ మధ్య మిడిల్ విభాగం ఈ కథలో కన్పించదు. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. కథంతా మిడిల్లోనే వుంటుంది కదా? ఆ మిడిలే ఈ కథలో లేదు, అందుకే ఇది పావువంతు కథ. రూపాయి తీసుకుని పావలా కథ చూపించారన్న మాట. పొట్లం విప్పి చూస్తే  ఆ పొట్లం చుట్టిన కాగితం తప్ప అందులో ఏమీ లేదన్నమాట! రివ్యూలు అలా రాశారు ఇలా రాశారూ అని ఎదురు నిరసనలు తెలపకుండా, సినిమా ఆఫీసు టోల్ ఫ్రీ కాల్స్ ఏర్పాటు చేస్తే, నేరుగా ప్రేక్షకులనుంచే కుప్పతెప్పలుగా ఫీడ్ బ్యాక్ వచ్చి పడుతుంది కదా? 

        ఫస్టాఫ్ అంతా బైరాగిని వెతకడం, బైరాగిని బకరా చేస్తూ పోస్టర్ల ప్రహసనంతో ఆడుకోవడం, బైరాగిని చంపడానికి వచ్చిన వాళ్ళని చంపేసి కాపాడ్డమూ జరిగి, అసలు నువ్వెవరు, ఎందుకొచ్చావని బైరాగీ అడిగితే- ముందు ముందు ఇంకా వుంది ఆట-  అని కవ్విస్తాడు జక్కన్న. దీంతో ఇంటర్వెల్ పడుతుంది. 

        తేజ తీసిన ఫ్లాపయిన  ‘హోరాహోరీ’ లో కూడా ఇలాటిదే ఇంటర్వెల్ సీన్లో కథేమిటో తెలీకుండా పోతుంది. ఇంటర్వెల్ మీదుగా బిగినింగ్ దురాక్రమించి, సెకండాఫ్ లో ఎక్కడో ముగిసి, అప్పుడు మాత్రమే కథేమిటో తెలిసే మిడిల్ మటాష్  స్క్రీన్ ప్లే అది. ఇలాటిదే  ఫ్లాపయిన ‘కిక్ – 2’ కూడా. 

ఉండాల్సిన స్ట్రక్చర్

     అంటే ఇప్పటికి గంటంపావు సమయం గడిచిపోయాక కూడా ఇంటర్వెల్లో కూడా బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడకుండా, కథేమిటో తెలియకుండా, జక్కన్న గోల్ ఏమిటో తెలియకుండా, జక్కన్నకి బైరాగితో సంఘర్షణ పుట్టకుండా- మొత్తం ఫస్టాఫ్ అంతా విషయం  లేకుండా వృధాగా నడిచిందన్న మాట.  కోట్లమీద కోట్లు పెడుతూ పెట్టి ఇదంతా దండగ్గా తీసుకుంటూ పోయారన్న మాట. 

        సెకండాఫ్ లో ఇంకా బిగినింగ్ విభాగమే కొనసాగుతూంటుంది జక్కన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పే వరకూ. సెకండాఫ్ లో అరగంటకి ఈ ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడే  కథేమిటో తెలుస్తుంది. అంటే మొత్తం గంటా ముప్పావు సమయంవరకూ కథేమిటా  అని ఎదురు చూస్తూ కూర్చోవాలన్న మాట. ఇంత సేపూ జరిగిందంతా కథే అన్న అజ్ఞానంతో దర్శకుడెలా  వుంటాడో అర్ధంకాదు.  ఈ సెకండాఫ్ లో ఇంతసేపటికి ఏర్పడే ఈ ప్లాట్ పాయింట్ వన్ నుంచీ కథ మిడిల్లో పడడానికేమీ లేదు. డైరెక్టుగా ఎండ్ లోకి వెళ్ళిపోవడమే. అంటే ప్లాట్ పాయింట్ టూ లేకుండా ప్లాట్ పాయింట్ త్రీ వచ్చేసిందన్న మాట. 

జక్కన్న  స్ట్రక్చర్ (!) 
      ఇలాటి అల్లాటప్పా స్క్రిప్టు ఎలా రాస్తారో అంతుచిక్కదు. స్టార్ దొరగ్గానే సీనిమా తీయాలంటే వుండే భయభక్తులన్నీ ఎగిరిపోతాయేమో!

        ఇంటర్వెల్ దగ్గరైనా జక్కన్న బైరాగికి ఇదీ విషయమని చెప్పకుండా కామెడీ చేయడం గొప్ప సస్పెన్స్ ని పోషిస్తున్నామనుకున్నట్టుంది. ఈ సస్పెన్స్ ఏమిటో- బైరాగి జక్కన్నకి ఏం సాయం చేసివుంటే తిరిగి బైరాగికి ప్రతిసాయం చేయడానికి జక్కన్న వచ్చాడో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఇంకా కుతూహలపడతారనుకున్నట్టుంది. ఇది ఎండ్ సస్పెన్స్ అనే సుడిగుండం లోకి దిగలాగి సినిమాని నిండా ముంచేస్తుందని అస్సలు  గ్రహించలేదు. 

        ఏది సస్పెన్స్ అవుతుంది? ఫస్టాఫ్ లో సకాలంలో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటుచేసి.  ఇదీ విషయం- ఇందుకోసమే  హీరో - విలన్లు ఘర్షించుకుంటున్నారని స్టోరీ పాయింటు చెప్పి, ఆతర్వాత వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందనేది సూచనలివ్వకపోతే అది సస్పెన్స్ అవుతుంది. స్టోరీ పాయింటే ఓపెన్ చేయకుండా- అది సస్పెన్స్-  దీనికోసం చివరంటా వెయిట్ చేయండంటే అది సస్పెన్స్ అవదు, ప్రేక్షకులకి సహనపరీక్ష పెట్టి సినిమా తన  మరణ శిక్ష తనే విధించుకోవడం అవుతుంది. 

        ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ పెట్టుకోకపోవడం, బిగినింగ్ నే  సెకండాఫ్ సగం దాకా సాగదీయడం, మిడిల్ మటాష్ చేసుకోవడం, ఎండ్ సస్పెన్స్ పోషించడం, విలన్ పాత్రని బకరాగా పాసివ్ గా తయారు చేయడం, జక్కన్న క్యారక్టరైజేషన్ ని ఆడియెన్స్ తో ఎమోషనల్ కనెక్షన్ లేకుండా చేసుకోవడం....ఇదంతా ఒకెత్తు అయితే, విలన్ ఇంట్లో అందర్నీ పోగేసి, కన్ఫ్యూజ్ కామెడీ అను సింగిల్ విండో స్కీములోకి కథని దింపెయ్యడం ఒకెత్తూ. 

కథనం పురాతనం 
    కథనం కూడా నేటి సినిమా చూస్తున్నట్టుగాక పల్నాటి కాలపు నాటకం వేస్తున్నట్టు వుంటుంది. ప్రారంభ సీనే పాఠశాలలో చిన్నప్పడు  హీరో నీతికథ  వినడంతో (ఇంకా ఈ చిన్నప్పటి ముచ్చట్లతో చాదస్తపు సినిమాలేంట్రా బాబూ!) , ఆ నీతితో క్లాస్ మేట్ చేసిన సాయానికి ప్రతిసాయం చేయడంతో మొదలయ్యే క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ పాట్లు –ఇంకా పెద్దయ్యాక బెగ్గర్ తో, అదయ్యాక ఒక పాటతో ఇదే క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్  పాట్లు జీడిపాకంలా సాగుతూనే  వుంటాయి. ఈ జక్కన్న ఇలాటి వాడూ అని చెప్పడానికి నేటికాలపు ప్రేక్షకులు అమూల్ బేబీ లైనట్టు ఇంత స్పూన్ ఫీడింగ్ అవసరమా? పైన ఈఎమ్ ఫార్స్టర్ అన్నట్టు- స్పూన్ ఫీడింగ్  తో నేర్చుకునేదేమీ వుండదు ఆ స్పూను షేపు గురించి తప్ప! పావుగంట కాలాన్ని  తినేసే ఈ స్పూన్ ఫీడింగ్ నంతా తీసేసి, ఒకే సీనుతో హీరో ఏమిటో చెప్పెయ్యొచ్చు. దీంతో నీతికథ ప్రసక్తి లేకుండా, నీతికథని అతి చేస్తున్నాడనే రసభంగమూ కలక్కుండా క్యారక్టరైజేషన్ తో ఎస్కేపయ్యే వీలుండేది. పైగా సాయం చేస్తే మీ జీవితాల్లో వ్యవసాయం చేస్తానని వాగనవసరం లేకుండా (అలా వాగడం వల్ల క్యారక్టర్ ఇంకా వరస్ట్ గా తయారయ్యింది)  అదేదో యాక్షన్ (చర్యల) ద్వారా చూపించి వుంటే  కొంతైనా ఆడియెన్స్ కనెక్ట్ ఏర్పడేది. 

        లవ్ ట్రాక్ అయితే మరీ బోరు. అసలు జక్కన్న  వైజాగ్ ఎందుకొచ్చాడు? బైరాగిని పట్టుకుని వాడికి ప్రతిసాయం చేసి తరించడానికేగా? ఆ పని మీదుండక హీరోయిన్ కన్పించగానే లొట్టలేస్తూ అటెలా వెళ్ళిపోతాడు? ‘కబాలి’ లో తలెత్తిన కన్ఫ్యూజన్ లా ఇది హీరోయిన్ తో లవ్ స్టోరీయా, లేక విలన్ తో యాక్షన్ స్టోరీయా? ఏది ప్రధాన కథ, ఏది ఉపకథ?

        ఒకవైపు హీరోయిన్ వెంటపడుతూ, ఇంకో వైపు విలన్ని వెతుకుతూ హీరో గోల్ చెదిరిపోవడం బావుంటుందా, లేక హీరోని చూసి హీరోయిన్ అతడి వెంటపడుతూ,  హీరో విలన్ వెంట పడుతూ వుంటే  హీరో గోల్ చెదరకుండా, డైనమిక్స్ కూడా ప్లే అవుతూ, ఈ  కథనం బావుంటుందా?  

        పదిహేనేళ్ళ క్రితం చూసిన బైరాగి బొమ్మేసుకుని జక్కన్న రావడంలోని సహేతుకతని క్షమిద్దాం, ఆ బొమ్మని ఏ  షోషల్ మీడియాలోనో పెట్టేస్తే క్షణాల్లో బైరాగి దొరికిపోతాడు కదా,  బొమ్మ పట్టుకుని కనపడిన వాళ్ళనల్లా అడుగుతూ గంటసేపూ  స్క్రీన్ టైంని తినేస్తాడెందుకు? ఇది 1980 లనాటి సినిమా అనుకుంటున్నాడా జక్కన్న? 

        దొరికిన బైరాగికి ప్రతిసాయం చేసే పద్ధతేమిటి, పగతీర్చుకుంటున్నట్టు లేదూ? గుట్టుగా బ్రతుకుతున్న బైరాగి ఐడెంటిటీని రట్టుచేయడం ప్రతి సాయమా? అన్ని నేరాలు చేస్తూ తన ముఖం ఎలా వుంటుందో బయటి ప్రపంచానికి తెలియకుండా బ్రతకడం బైరాగికి ఎలా సాధ్యమయ్యింది? బొమ్మ పట్టుకుని జక్కన్న తిరుగుతూ ఫస్టాఫ్ అంతా  టైం పాస్  చేయడానికేగా బైరాగి ఐడెంటిటీతో ఈ అసంబద్ధ కథనం? 

        బైరాగిని పట్టుకోవడానికి ఎక్కడో ఢిల్లీ నుంచి పోలీసు అధికారి రావడమేమిటి? వైజాగ్ లో బైరాగి నేరాలతో అతడికేం సంబంధం? బిల్డప్ వుంటుందనేగా ఢిల్లీనుంచి దిగినట్టు అల్లాటప్పాగా చెప్పించారు? పోట్లంలో సరుకులేకపోయినా, పొట్లం చుట్టిన కాగితం కూడా ఇంత ఛండాలంగా వుండాలా? కథనమనే పొట్లం చుట్టిన కాగితం కూడా చెత్త కుండీ లోంచి వచ్చిందే అన్నట్టుంది. ఇలా అంటున్నందుకు సారీ, కానీ ఈ సినిమాని  క్లాసే కాదు, మాస్ కూడా ఏకోశానా ఎంజాయ్ చేయలేకపోయారు. బుకింగ్స్ దగ్గర చూస్తే  మాస్ ఎంత హుషారుగా తరలివచ్చి హౌస్ ఫుల్ చేశారో(టికెట్లు దొరక్క చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు) అంత నీరసపడి ఇంటర్వెల్ కి బయటి కొచ్చారు, మరింత నీరసపడి మిగతాసగం చూసి వెళ్ళిపోయారు. తర్వాతి ఆటలకి ఈ సినిమాకి అంత సీను లేకుండా పోయింది. సినిమా వాళ్ళు మల్టీ ప్లెక్సుల్లో క్లాస్ ప్రేక్షకుల మధ్య సినిమాలు చూస్తే ఏమీ లాభంలేదు, క్లాస్ కి ఆవల మిగతా వర్గాల ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతున్నారో తెలీని వర్చ్యువల్ ప్రపంచంలో వుండిపోతారు మల్టీ ప్లెక్సులో సుఖంగా  సినిమాలు చూసే సినిమా వాళ్ళు. రాజకీయాల్లో ఓటరు అంటే ధనికులు కారు, సామాన్య జనం. సినిమాలకి కూడా ప్రేక్షకులంటే సామాన్య జనమే. 

           
ఇక డైలాగులు చూస్తే అంతా ప్రాసలమయమే. ప్రతీపాత్రా ప్రాస డైలాగులే వల్లిస్తుంది. ఈ రోజు వచ్చిన నీ అదృష్టం ఆర్టీసీ బస్సులో వస్తే సాయంత్రం వోల్వో బస్సులోవస్తుంది... తండ్రిని భయపెట్టించాడు, మనకిక మామిడి తాండ్రే... నీకు మార్షల్ ఆర్స్ట్ తెలుసా?- నీకు గీతా ఆర్ట్స్ తెలుసా?...ప్రతోడూ సంచుల కొద్దీ పంచులిస్తున్నాడు...ఇదీ వరస! ఇది చాలనట్టు ఇంగ్లీషు  పదాలతో కూడా ప్రాస కాలుష్యమే. ప్రాస డైలాగులతో కామెడీ వస్తుందనే  దురవగాహనతో వున్నట్టుంది. కేవలం ఒకే ఒక్క చోట పలికిన - నేను లే అవుట్ వేస్తే  వాడు వెంచర్ వేశాడు - అనే డైలాగులో కామెడీ మెరుస్తుంది నిజానికి. ఇలాటి ప్రయోగాలు సృజనాత్మకత అన్పించుకుంటాయి.

        కథనంలో ఇంకా పృథ్వీ తో దిక్కులేనట్టు అదే బాలకృష్ణ డైలాగుల పేరడీ. మళ్ళీ చిరంజీవి వీణ డాన్సు బిట్టు ఒకటీ. ఇలా కొత్తదనం, కొత్తగా ప్రవేశ పెట్టిన ఒక్క అంశమూ లేకుండా రకరకాల సినిమాల్లోంచి కత్తిరించుకుని తెచ్చిన ముక్కలతో జక్కన్నని చెక్కి- ఓ పనైందన్పించుకుని - ఇంకా నెక్స్ట్  సినిమా తీసెయ్యడానికి ఒకచోట చేరి ఇంకెలాటి భయంకర చర్యలకి సమాలోచనలు చేస్తున్నారో!! ఇలాటి సమాలోచనల ఇన్ఫర్మేషన్ అందుకుని దాడులు చేయడానికి టాలీవుడ్ ఒక స్క్వాడ్ ని ఏర్పాటు చేసుకోవాలి...


-సికిందర్ 



       



       
       







Saturday, July 30, 2016

షార్ట్ రివ్యూ!


రచన- దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మప్రియదర్శి పులికొండ,
నందు, అనీష్‌ కురువిల్లా, కేదార్‌ శంకర్‌, గురురాజ్‌ తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: నగేష్‌ బానెల్‌
బ్యానర్‌: ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌
సమర్పణ: డి. సురేష్‌బాబు
నిర్మాతలు: రాజ్‌ కందుకూరి, యష్‌ రంగినేని
విడుదల : జులై 29, 2016
***
      చిన్న బడ్జెట్ సినిమా అంటే పెద్ద బడ్జెట్ సినిమాల హంగూ ఆర్భాటాల్ని అనుకరించే నాసిరకం ఉత్పత్తులుగా, ఒక జోకుగా, హాస్యాస్పదంగా మారిపోయి- వారంవారం కుప్పతెప్పలుగా వచ్చిపడుతున్న  హవా నడుస్తూండగా, చెంపపెట్టులా ప్రత్యక్షమయింది ‘పెళ్లి చూపులు’ అనే రియలిస్టిక్ ఫిక్షన్. చిన్న బడ్జెట్ సినిమా అంటే రియల్ లైఫ్ అనీ, పెద్ద బడ్జెట్ సినిమా అంటే లార్జర్ దేన్ లైఫ్ అనీ  నిర్వచనాన్ని కూడా వదిలేసి టోకున ఖజానా ఖాళీ చేసుకుంటున్న చిన్నచిన్న నిర్మాతలకీ, పెద్ద సినిమాల మత్తులో జోగే ఛోటా మోటా దర్శకులకీ లాగి లెంప కాయకొట్టినట్టు దర్శనమిచ్చింది ‘పెళ్లిచూపులు’. నిజమైన సినిమా చూసే భాగ్యానికి నోచుకోనివ్వకుండా ప్రేక్షకుల నెత్తిన నానా చెత్త రుద్దుతున్న- అసలీ నోట్లు తీసుకుని నకిలీ సినిమాలు చూపిస్తున్న వాళ్ళందరికీ ‘బయటికి పోవు దారి’ చూపిస్తున్నట్టు బెత్తం పుచ్చుకుని వచ్చింది ‘పెళ్లిచూపులు’... 

         
కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ క్రాసోవర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇది రోమాంటిక్ కామెడీయే అయినా నేటి రోమాన్స్ ని షార్ట్ ఫిలిం మేకర్స్ ఎలా ఫీలవుతున్నారో గత కొన్ని రివ్యూల్లో చెప్పుకున్నాం. రుచీ పచీ వుండని మూస ఫార్ములా ప్రేమ సినిమాలకి ఆవల పల్లెల్లో, నగరాల్లో యూత్ ప్రేమల రియలిస్టిక్ ప్రపంచమంటూ ఒకటుంది. ఆ ప్రేమల్ని షార్ట్ ఫిలిం మేకర్స్ పట్టుకుని లవ్ మార్కెట్ లో వాస్తవికతని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ ముందు మూస సినిమాల మాసిపోయిన ప్రేమలు వెలవెలబోతున్నాయి. అందుకే కృత్రిమ ప్రేమ సినిమాల వైపు యువ ప్రేక్షకులు కన్నెత్తి చూడ్డం లేదు. దీన్ని బ్రేక్ చేస్తూ నేటి యూత్ కి నచ్చే రియలిస్టిక్ ఫిక్షన్ తో ‘పెళ్లి చూపులు’ తీశాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. 

        ‘పెళ్లి చూపులు’ అనగానే ఇదేదో పెళ్లి వ్యవస్థమీద అంటూ కృష్ణ వంశీ తీసిన ‘మొగుడు’ లాంటి, నందినీ రెడ్డి తీసిన ‘కళ్యాణ వైభోగమే’ లాంటి యూత్ కి ఏమాత్రం పట్టని పురాతన సోకాల్డ్ సందేశాల సంతర్పణ కాదిది. జీవితం పట్ల అత్యధిక శాతం  యువత కుండే భిన్నదృక్పథాల వితరణ ఇది. భుక్తి మార్గమేమిటో కూడా తెలుసుకోకుండా అర్జెంటుగా పెళ్ళో అంటూ ప్రాకులాడే సత్యదూరమైన అపరిపక్వ హీరో హీరోయిన్ల మూస ఫార్ములా పాత్రలు కావివి... పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు డాన్సులూ ఫైట్లూ కామెడీ లాంటి పెద్ద సినిమాల హంగుల  కోసమైతే ఈ సినిమా చూడక్కర్లేదు (ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవనీ, మాస్ వేల్యూస్ కూడా లేవనీ ఓ  రివ్యూ రైటర్ బాధ పడ్డాడు! అన్ని సినిమాల్నీ ఒకే రంగుటద్దాల్లో చూడాలన్న అవగాహనతో వున్నాడు కాబోలు ...)

       
అసలిప్పుడు ప్రేమంటే ఏమిటో?

కథ
      ప్రేమంటే వృత్తి వ్యాపకాలు. ఏ వృత్తీ లేనివాడికి ప్రేమే దక్కదు. కానీ ప్రశాంత్ (విజయ్ దేవరకొండ) కి వృత్తి చేసుకు బతకాలంటేనే బద్ధకం. ఏ పనీలేక సోమరిపోతులా జీవించడమే ఇష్టం. కోటి రూపాయలు కట్నమిస్తే బ్యాంకులో ఎఫ్ డీ చేసుకుని ఆ వచ్చే  వడ్డీ మీద బతుకు లాగించెయ్యాలని ప్లాన్. అపసోపాలుపడి ఎలాగో ఇంజనీరింగ్ చేసిన కొడుకు ప్రశాంత్ ఉద్యోగ ప్రయత్నాలు చేయకపోవడంతో విసిగిపోయిన తండ్రి,  పెళ్లి చేసి పడేస్తే వాడి పాట్లు వాడు పడతాడని ఒక సంబంధం చూస్తాడు. ఆ పెళ్ళిచూపులకి వెళ్తే ఆ అమ్మాయి చిత్ర (రీతూ వర్మ) తో పొరపాటున గంట సేపు గదిలో బందీ అయిపోతాడు.  ఆమె ఎంబీఏ పూర్తి చేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయే ప్లాన్ తో వుంది, ఈ పెళ్ళీ గిళ్ళీ ఏమీ పట్టడం లేదు. ఆస్ట్రేలియా వెళ్ళాలంటే డబ్బు కావాలి, ఆ డబ్బు తండ్రి ఇవ్వడం లేదు. ఏదో బిజినెస్ చేసి ఆ డబ్బు సంపాదించే ఆలోచనతో వుంది. ఆ బిజినెస్ పెట్టబోతే బాయ్ ఫ్రెండ్ మోసం చేసి పారిపోయాడు...

        ప్రశాంత్  తను కూడా ఎవత్తితో ఎలా తిరిగితే ఏం జరిగిందో తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తాడు. మార్చి మార్చి చెప్పుకునే ఈ ఇద్దరి ఫ్లాష్ బ్యాకులూ తూర్పు పడమరలు. ఒకే పాయింటు  దగ్గర ఇద్దరి అభిరుచులూ కలుస్తాయి : అది సాస్ లేకుండా సమోసా తినే దగ్గర. 

        మొత్తానికి కెరీర్ మైండెడ్ గా వున్న ఈమె, కెరీర్ నే  సన్యసించిన తనకి లొంగే అవకాశం లేదని నిరాశ పడ్డాక, అసలు విషయం తెలుస్తుంది- తను రాంగ్ అడ్రసుకి పెళ్లి చూపుల కొచ్చాడని. తను వెళ్ళాల్సింది వేరే ఎనిమిదో నంబర్ వీధిలో ఇంటికని!

        మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, కలిస్తే అక్కడ్నించీ వాళ్ళ సంబంధం ఎలా కొనసాగింది, అప్పుడేమేం జరిగాయన్నది మిగతా ద్వితీయార్ధపు కథ. 

ఎలావుంది కథ 
     చాన్నాళ్ళకి తెలుగులో ఒక ఫ్రెష్ కథ చూస్తున్నట్టు వుంది. కథంటే పాత్రలూ సంఘటనలూ కూడా కాబట్టి, ఇవి కూడా ఎక్కడా మూస ధోరణుల్లోకి తిరగబెట్టకుండా ఆద్యంతం ఎక్కడికక్కడ ఆధునిక పోకడలతో, ఆధునిక మనస్తత్వాల మదింపుతో ఆలోచనాత్మకంగా వుంది- ఇదంతా తెలుగు నేటివిటీని  కాపాడుతూనే. ప్రధానంగా ఈ కథ  పేరెంట్స్ కీ వాళ్ళ పిల్లలకీ  మధ్య వుండే అంతరాల గురించే తప్ప, రొటీన్ గా ప్రేమికుల మధ్య ప్రేమకి వుండే అడ్డంకుల గురించి కాకపోవడంతో, ఆ అంతరాలు కూడా పైన చెప్పుకున్న ‘మొగుడు’ లో లాగా,  కళ్యాణ వైభోగమే’ లోలాగా పెద్దలు చాదస్తపు క్లాసులు పీకే తత్త్వంతో కాక, ఆయా పరిణామాలే పరస్పరం పిల్లల్నీ పెద్దల్నీ మార్చే విజువల్ నేరేషన్ వల్ల ఈ కథ వాస్తవికతతో కూడుకున్న వినోదాత్మక విలువలతో  వుంది. ఎలాటి కృ త్రిమత్వపు ఛాయల్లేకుండా మనచుట్టూ జరిగే నిజప్రపంచం లాగే వుంది ఈ కథ. 

ఎవరెలా చేశారు
     ప్రతీ వొక్కరూ సహజ నటనతో రక్తి కట్టిస్తారు ఇందులో. హీరో విజయ్ దేవరకొండ –హీరోయిన్ రీతూ వర్మల నేచురల్ నటన ఎసెట్ ఈ సినిమాకి. పాత్రచిత్రణలు సింపుల్ గానే  వున్నా వీళ్ళవి  సంకీర్ణ పాత్రలు. ఇద్దరి మధ్యా సమస్య పెద్దదే, అయినా సంఘర్షణ భీకరంగా ఉండనవసరం లేదు. డ్రామా, మెలోడ్రామా,  సెంటి మెంట్లు మొదలైన వాటికి దూరంగా మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ టెక్నిక్ తో నిలబడ్డ పాత్రలివి. బిగ్ కమర్షియల్ సినిమాల్లో చూసినా ఏ టాప్ హీరోయినూ వేయనంత  ముద్ర తన సింపుల్ నటనతోనే సాధిస్తుంది రీతూ వర్మ. ఆమె ఫీలింగ్స్ నీ, ఆలోచనల్నీ  క్లోజప్స్ లో పట్టుకున్న తీరుతో ఆమె కలకా లం గుర్తుండిపోతుంది. అలాగే కామన్ బాయ్ గా కన్పించే విజయ్ పాత్రలోని హాస్య ధోరణి, అతడి ఫ్రెండ్స్ గా  నటించిన ప్రియదర్శి పులికొండ, అభయ్ ల ఫన్నీ కామెడీ కొత్త పుంతలు తొక్కుతాయి. ముఖ్యంగా హైదరాబాదీ తెలుగులో ప్రియదర్శి పులికొండ తన మాట తీరుతో ఒక భిన్నమైన కమెడియన్ గా పరిచయమవుతాడు. విజయ్- ప్రియదర్శి-అభయ్ ముగ్గురూ వున్న ప్రతీ సీనూ ఓ కామిక్ టానిక్కే. 

       పెద్దవాళ్ళ పాత్రల్లో అనీష్‌ కురువిల్లా, కేదార్‌ శంకర్‌, గురురాజ్‌ లు చాలా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా మనుషులిలాగే వుంటారు- సినిమాల్లో కొచ్చేసి నాటకీయంగా, ఓవర్ యాక్షన్స్ తో, సినిమా డైలాగులతో ఎందుకుండాలి? సినిమా చూస్తున్నట్టు వుంటే అది సినిమా ఎందుకవుతుంది? 

        ఎక్కడా సినిమా డైలాగులు విన్పించకుండా, ఎక్కడా సినిమా చూస్తున్నట్టు అన్పించకుండా దర్శకుడు కళా దర్శకత్వాన్నీ, ఛాయాగ్రహణాన్నీ, సంగీతాన్నీ, నటీనటుల ఆహర్యాన్నీ, లొకేషన్స్ నీ, సమస్తాన్నీ -  తన ఆధీనంలోకి తెచ్చుకుని- ఏ వొక్కటీ దేన్నీ డామినేట్ చేయకుండా ఏకత్వాన్ని సాధించడమే దర్శకత్వం అన్నట్టు పనిచేసుకుపోయాడు దర్శకుడు. 

    నటీనటుల దగ్గర్నుంచీ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లందరూ తెలంగాణీయులే కావడం మరో ప్రత్యేకత. సాధారణంగా  తెలంగాణా సినిమా అంటే చిన్న చూపు వుంది. కారణం- ఎంతసేపూ అవే పోరాట కథలు తీస్తారని. కానీ ప్రధాన స్రవంతి లోకొచ్చి  ప్రాంతీయత కతీతంగా  కమర్షియల్ సినిమాని  తామూ  తీయగలమని ప్రప్రథమంగా ఈ సినిమాలో ప్రతీ వొక్కరూ నిరూపించారు. అదీ ఇంత  డిఫరెంట్ గా, ఇంత జనరంజకంగా!

చివరికేమిటి
        ప్రేక్షకులకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, తీస్తున్నవి సినిమాలనుకుంటూ ఇరు రాష్ట్రాల ప్రేక్షకుల్ని రాచిరంపాన పెడుతున్న వాళ్ళకి కనువిప్పూ!


-సికిందర్
http://www.cinemabazaar.in