రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 6, 2016

రివ్యూ!


రచన- దర్శకత్వం : ఏలేటి చంద్రశేఖర్

తారాగణం : మోహన్ లాల్, గౌతమి, ఊర్వశి, విశ్వంత్, అనూషా అంబ్రోస్, 

రైనా రావు, నాజర్, పరుచూరి వెంకటేశ్వర రావు, గొల్లపూడి మారుతీ రావు, హర్షవర్ధన్, ఎల్బీ శ్రీరామ్, వెన్నెల కిషోర్, చంద్ర మోహన్, అయ్యప్ప శర్మ తదితరులు 

మాటలు : రవిచంద్ర తేజ, పాటలు : రామజోగయ్య శాస్త్రి, వశిష్టా శర్మ

సంగీతం : మహేష్ శంకర్, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాస్తవ్ 
బ్యానర్ : వారాహి చలన చిత్ర 
నిర్మాతలు : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి 
విడుదల : 5 ఆగస్టు, 2016
***

       గతవారం ‘పెళ్లిచూపులు’ తర్వాత ఈవారం  ‘మనమంతా’ మళ్ళీ తెలుగులో క్వాలిటీ సినిమాల రాకని రుతుపవనాలంత ఆహ్లాదకరంగా రికార్డు చేస్తున్నాయి. అభిరుచిగల తెలుగు ప్రేక్షకులు ఏ హిందీ లోనో ఇంకెక్కడో ఇలాటి సినిమాల్ని చూసే అగత్యాన్ని ఇవి తప్పిస్తున్నాయి. ‘పెళ్లి చూపులు’ ప్రేమకథకి రియలిస్టిక్ టచ్ ఇచ్చి  ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశాక,  కుటుంబ కథకి కూడా రియలిస్టిక్ అప్రోచ్ సాధ్యమేనంటూ  ‘మనమంతా’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కమర్షియల్ ఫార్ములాలకి  ప్రత్యాన్మాయంగా అవే జానర్స్ ని ఇంకో కోణంలో తీసి మొనాటనీతో విసిగిన ప్రేక్షకులకి వెరైటీని అందించవచ్చని ఇవి చెబుతున్నాయి. పైగా సినిమా కళకి అంటరాని పదార్ధమై పోయిన క్రియేటివిటీని కూడా ఇవి హృద్యంగా ప్రదర్శిస్తున్నాయి. 

       
ర్శకుడు ఏలేటి చంద్ర శేఖర్, నిర్మాత సాయి కొర్రపాటి చాలా సాహసించి తెలుగు సినిమాకి చాలా మేలు చేశారు. కమర్షియల్ ఆకర్షణలు వుండని వాస్తవిక సినిమా ఆకర్షణంతా దాని మాస్టర్ స్ట్రోక్ లోనే వుంటుందని, ఈ మాస్టర్ స్ట్రోకే  కమర్షియాలిటీని ఇస్తుందనీ   చాటుతూ - డ్రైగా వుండే వాస్తవిక సినిమాలు తీసే వాళ్ళని పునరాలోచనలో పడేశారు. శుష్కంగా వుండే వాస్తవిక సినిమాలకి హై ఎండ్ క్రియేటివ్ మైండ్ తో వాటిదైన మాస్టర్ స్ట్రోక్ ఇస్తే తప్పకుండా సామాన్య ప్రేక్షకులూ  వాటికి  ఆకర్షితులవుతారు. 

        గతంలో అనేక భాషల్లో అనేక ‘నాల్గైదు కథల’ సినిమాలొచ్చాయి. వాటిలో తెలుగులో వచ్చినవైతే మాస్టర్ స్ట్రోక్ లేక చతికిల బడిపోయాయి. వివిధ పాయలుగా సాగే కథలు ఒక చోట సంగమించే దగ్గర చమత్కృతి చేయలేక చప్పగా ముగిసిపోయే వైఖరినే ప్రదర్శిస్తూ వున్నాక, ‘మనమంతా’ దీన్ని చక్కదిద్దే స్టడీ మెటీరియల్ గా వచ్చి నిలబడుతోంది.
        నాల్గు కథల ‘మనమంతా’ లో అందరూ కమర్షియల్ నటీనటులే వున్నారు...


కథలు
     సాయిరాం (మోహన్ లాల్) సూపర్ మార్కెట్ లో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్. ఎప్పుడూ ఆర్ధిక ఇబ్బందుల్లో వుండి వర్కర్( ధన్ రాజ్)  దగ్గర చేబదుళ్లు తీసుకుంటూ వుంటాడు. ఇంకో అసిస్టెంట్ మేనేజర్ విశ్వనాథ్ (హర్షవర్ధన్) కీ ఇతడికీ పరస్పరం పడదు. స్టోర్ మేనేజర్ (పరుచూరి వెంకటేశ్వర రావు) త్వరలో రిటైర్ కాబోతున్నాడు. ఆ పోస్టు తనకంటే ఎక్కువ చదువుకున్న  విశ్వనాథ్ కే వచ్చే  అవకాశాలు  వుండడంతో సాయిరాం తీవ్రాలోచనలో పడతాడు. తనకి ఈ  మేనేజర్ పోస్టు దక్కితే ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయన్న నమ్మకం అతడిది.

        ఇంకోవైపు గాయత్రి (గౌతమి) అనే మధ్యతరగతి గృహిణి వుంటుంది. పొదుపుగా ఎలా కుటుంబాన్ని నిర్వహించాలి, ఎలా ఆదా చేయాలీ అని నిత్యం ఆరాటపడుతూ, పొరుగింటి వదినగారు (ఊర్వశి) తో పథకాలేస్తూ వుంటుంది. ఆ మేరకు ఏవి కొనాలని ఏ బజారు కెళ్ళినా ఆ పొదుపు కాస్తా దుబారా అయిపోయి బెంబేలెత్తి పోతూంటుంది. 

        మరో వైపు అభి (విశ్వంత్) అనే చదువే లోకంగా జీవించే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఐరా(అనూశా అంబ్రోస్)  అనే అమ్మాయితో ప్రేమలో పడి ప్రేమే జీవితంగా గడుపుతూంటాడు.

        మరింకో వైపు మహతి (రైనారావ్) అనే స్కూలు బాలిక నాల్గేళ్ళ స్లమ్ కుర్రాణ్ణి చూసి వాణ్ణి చదివించాలని ప్రయత్నిస్తూంటుంది...

        ఇలా ఈ నల్గురి ప్రయత్నాలూ మలుపు తీసుకుంటాయి : మేనేజర్ గా ప్రమోటవడానికి ఇంటర్వ్యూ రోజున విశ్వనాథ్ తనకి  అడ్డురాకుండా ఒకరౌడీతో క్రిమినల్ పథకమేస్తాడు సాయిరాం. దీంతో విశ్వనాథ్ అదృశ్యమై పోతాడు. ఫలితంగా సాయిరాం పెద్ద చిక్కుల్లో పడిపోతాడు. 

        గాయత్రికి తన పాత ప్రొఫెసర్ (గొల్లపూడి మారుతీ రావు) ఎదురై ఒకప్పుడు ఆమె చేసిన ఆర్ధిక సాయానికి బదులు తీర్చుకుంటూ ఆమెకి సింగపూర్ లో జాబ్ ఆఫరిస్తాడు. దీంతో ఈ వయసులో ఆమె అందర్నీ వదిలేసి ఎలా వెళ్ళగలనని అయోమయంలో పడిపోతుంది. 

        ఐరాని ప్రేమిస్తున్న అభికి ఆ ప్రేమ వికటించి, ప్రేమాలేదు దోమా లేదని ఆమె లాగి కొట్టడంతో చావడానికి సిద్ధమైపోతాడు.  

        చదివించడానికి స్కూల్లో వేసిన స్లమ్ కుర్రాడు అదృశ్యమై పోవడంతో ఆందోళనగా వాణ్ణి వెతుక్కుంటూ తిరుగుతూంటుంది ఇంకోవైపు మహతి...

        ఇలా సమస్యల్లో పడ్డ  ఈ నల్గురికీ ఈ నల్గురితోనే యాదృచ్ఛికంగా ఎలా పరిష్కరాలు లభించాయన్నది మిగిలిన ‘నదుల అనుసంధానపు’ కథ. 


ఎలావుంది కథ 

    ప్రయోగాత్మకమైనది. కమర్షియల్ విలువల కోసం సంయమనం కోల్పోనిది. పాటలు కూడా లేనిది. మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో వచ్చే కమర్షియల్ సినిమాల్ని ఆదరిస్తున్నట్టుగా, మల్టిపుల్ కథలతో సమాంతరంగా సాగే  నాల్గైదు కథనాలతో సినిమాలు  వస్తే దూరంగా వుంటున్నారు ప్రేక్షకులు. వాళ్లకి కావలసింది చిన్న చిన్న కథలు కాదు, ఒకే పెద్ద కథ. ప్రచురణ రంగంలో కూడా నవలలు రాజ్యమేలినప్పుడు కథల సంకలనాల్ని ఎవరూ కొనేవాళ్ళు కాదు- పెద్దపెద్ద నవలలే కొనుక్కుని చదివేవాళ్ళు. తెలుగు వాళ్ళ టేస్టే అలాటిది. ఏదైనా తాటి కాయంత వుండాలి. అయితే ‘మనమంతా’ కూడా ఒకే పెద్ద కథే. ఇది చివరికి తెలుస్తుంది. దీ న్ని నాల్గు కథల సమాహారమని ఆంథాలజీగా పబ్లిసిటీ చేయడం ప్రేక్షకుల్ని దూరం చేసుకోవడమే. ఈ కథంతా అతి పెద్ద సస్పెన్సు. కుటుంబ కథల్లో సస్పెన్సు ఉన్నవి రావడం లేదనీ, సస్పెన్సు తో వుంటే (సస్పెన్స్ అంటే ఇక్కడ నేరాలో ఘోరాలో వుండాలని కాదు) కుటుంబ కథలు రొటీన్ మూసలోంచి బయట పడతాయనీ గతంలో చెప్పుకున్నాం. దీనికిప్పుడు  ‘మనమంతా’ తార్కాణంగా నిలుస్తోంది.

        ఇందులో ఉన్నవి నిత్యజీవితంలో కలిగే చిన్న చిన్న కోరికలే. ఇవి తీర్చుకోవడానికి పడే పాట్లే. పెద్ద లక్ష్యాలు, పెద్ద సంఘర్షణలు కమర్షియల్ సినిమాలకి వర్తిస్తాయి. అయితే ఈ మధ్య కొందరు దర్శకులు ఎలా చేస్తున్నారంటే-  ఈ చిన్న చిన్న కోర్కెలు, అవి తీర్చుకునే పాట్లతో  కమర్షియల్  సినిమాలు ఆలోచిస్తున్నారు. రియలిస్టిక్ సినిమాల పనిముట్లని కమర్షియల్ సినిమాలకి వాడి నడిపించాలనుకుంటున్నారు- అలా చేస్తే అవి రెంటికి చెడ్డ రేవడి అవుతాయని తెలుసుకోవడానికి ‘మనమంతా’ చూస్తే  సరిపోతుంది. సాయిరాం పాత్రతో నైతిక పతనం, గాయత్రి  పాత్రతో మధ్యతరగతి మందహాసం, అభి పాత్రతో  బబుల్ గమ్  ప్రేమలు, మహతి పాత్రతో సామాజిక స్పృహా ఇందులో వున్నాయి. రౌడీని నమ్మితే పాముని నమ్మినట్టే నని అయ్యప్ప శర్మ పోషించిన రౌడీ పాత్రతో నీతి కూడా వుంది. హైపర్ లింక్ జానర్ కింది కొచ్చే ఈ కథ ముగింపు మాత్రం 2005 లో విడుదలైన మనీషా  కోయిరాలా నటించిన ‘అంజానే’ ( అనుకోకుండా) ముగింపుని గుర్తుకు తెస్తుంది- కాకపోతే ‘అంజానే హార్రర్ కథ.


ఎవరెలా చేశారు
      మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్  సగటు ఉద్యోగి పాత్రలో సినిమాకొక జీ వితాన్ని దానం చేశారు. ఆర్ధిక ఇబ్బందులతో అప్పులు చేసే సగటు జీవిగా ప్రారంభమై, ఉద్యోగంలో ఒక్క మెట్టు పైకి ఎక్కాలన్న ఆలోచన దురాలోచనకి దారి తీసి- మనసులోని చీకటి కోణాన్ని బయటపెట్టుకుని- ఆతర్వాత తను పన్నిన ఉచ్చులోంచి తను బయటపడేందుకు పడే కష్టాలతో పాత్రలో ఒదిగిన తీరు చెప్పుకోదగ్గది. ఎక్కడా సూపర్ స్టార్ హవా కన్పించకుండా, నేనూ మీలాంటోణ్ణే అన్నట్టు ఆమ్ ఆద్మీకి వెండితెర మీద పట్టం గట్టారు. కమర్షియల్ కీకారణ్యంలో సామన్యులు తమని తాము వెండి తెర మీద చూసుకోగల అదృష్టానికి ఎప్పుడు నోచుకున్నారు గనుక!

        గౌతమి ఈ సినిమాలో చాలా గ్రేస్ ఫుల్ గా కన్పిస్తారు. బాధ, కాస్తంత ఆనందం, మళ్ళీ బాధ, అయోమయం, ఏం చెయ్యాలో పాలుపోని తనం- ఇవన్నీ మెలో డ్రామాకి  దూరంగా అతి సరళంగా నిర్వహించుకురావడం చాలా సహజంగా జరిగిపోయింది. ఈమె పక్కవాద్యం  ఊర్వశి అలవాటు చొప్పున కామిక్ రిలీఫ్ కి బాగా తోడ్పడ్డారు. వీళ్ళిద్దరూ కలిసివుంటే  ఏదోవొక గమ్మత్తు జరుగుతుంది. రోమాంటిక్ సైడ్ విశ్వంత్, అనూషా అంబ్రోస్ లు తమ  మోడరన్ పాత్రలతో  రోమాన్స్ కొరతని తీరుస్తారు. ఇక చైల్డ్ ఆర్టిస్టు రైనారావ్ దగ్గర్నుంచీ ప్రతివొక్కరూ పాత్రలు చిన్నవైనా రియలిస్టిక్ లుక్ తో రక్తి కట్టిస్తారు. జుట్టూ గడ్డం పెరిగిపోయి, కంపుకొట్టే శరీరంతో రౌడీ పాత్రలో అయ్యప్ప శర్మ వర్మ సినిమాల్లో క్యారక్టర్లని గుర్తుకు తెస్తారు. 


        టెక్నికల్ గా కెమెరా వర్క్, సంగీతం, ఎడిటింగ్ వగైరా ఉన్నత విలువలతో వున్నాయి. మాటల  రచయిత రవిచంద్ర తేజ సినిమా డైలాగులు రాయకుండా బతికించారు. సెంట్రల్ హైదరాబాద్ లో మధ్యతరగతి నివాస ప్రాంతాల్ని వాటి నేటివిటీతో చూపించడం ఈ వాస్తవిక సినిమాకి సహజత్వాన్నిచ్చేలా వుంది. 


చివరి కేమిటి 

    కథా నిర్మాణ పరంగా ముగింపు ఎపిసోడ్ దర్శకుడు  ఏలేటి ఇచ్చిన బంపర్ మాస్టర్ స్ట్రోకే సందేహం లేదు- హిందీ ‘అంజానే’ ని గుర్తుకు తెచ్చినప్పటికీ. హిందీ ‘అంజానే’ కూడా ‘ది అదర్స్’ అనే హాలీవుడ్ కి కాపీ అనేది వేరే విషయం. ఫీల్ గుడ్ మూవీ అంటే ఇలా వుం టుందనేలా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి నిరూపించారు ఏలేటి. ఐతే కథనానికే  ఈ మాస్టర్ స్ట్రోక్ పరిమితమై పోయింది తప్ప కథా ప్రయోజనానికి కాదు. చివరికి ఈ కథకి మూల స్థంభంలా తేలిన గాయత్రి పాత్రకి సమగ్ర ముగింపు పలికారా అంటే లేదనే జవాబు వస్తుంది. ఈ పాత్ర ముగింపు అభ్యుదయమా, పురాణాల వడపోతా? గాయత్రి అంతరిక్ష యానం చేసిన కల్పనా చావ్లా అవ్వాలా, లేక సతీ అనసూయగా వుండి పోవాలా? ఇంకో రెండడుగుల్లో కొత్త భవిష్యత్తు ని వెతుక్కుంటూ సింగపూర్ విమాన మెక్కుతోంటే  తిరోగమింప జేసి- నీ స్థానం ఇక్కడి ఇల్లే తల్లీ, ఈ కష్టాలే పడు!- అన్నట్టు జండర్  స్టీరియో టైపింగ్ చేయడమే కథా ప్రయోజనాన్ని దెబ్బ తీసింది.

        సుమారు ఇలాటిదే అయిన సగటు గృహిణి పాత్రలో శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ (2012) అనే హిందీ, సనాతన ధర్మాన్ని త్రోసిరాజని అభ్యుదయాన్నే చాటింది. దర్శకుడు ఏలేటి నాల్గు కథనాల సంగమంలో చేసిన చమత్కృతి ప్రేక్షకుల టెన్షన్ ని మాత్రమే సడలించ డానికి  పనికొస్తుంది. అది  ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తుంది.  గాయత్రిని అలా తిరిగి  బందీగా రొటీన్ జీవితంలో పడెయ్యడంతో మెటీరియల్ స్థాయిలోనే ఈ ఉపశమనం మిగిలిపోయింది. ఇలా కాకుండా కల్పనా చావ్లా అంతరిక్షాని కేగినట్టు, విమానమెక్కి రివ్వున గాయత్రి మేడమ్ సింగపూర్ కెగిరిపోతే, అదింకా అత్యున్నత  స్పిరిచ్యువల్ అనుభవంగా చిరకాలం మిగిలేది ప్రేక్షకుల దోసిట్లో.


        ‘గ్లాడియేటర్’ లాంటి మెగా మూవీస్ తీసిన దర్శకుడు రిడ్లీ స్కాట్,  1991 లో ‘థెల్మా అండ్ లూయిస్’ అనే థ్రిల్లర్ తీశాడు. ఇందులో ముగింపులో వెంటాడుతున్న పోలీసులు పట్టుకుంటే మనం వెనక్కెళ్ళి జైల్లో బందీ అయిపోతామని, మనం ముందుకే వెళ్ళాలని (
"keep going")  హీరోయిన్లిద్దరూ నిర్ణయం తీసుకుని- కొండ చరియ పైనుంచి కారుని డ్రైవ్ చేసి స్పీడుగా అనంత లోకాలకి దూసుకెళ్ళి పోతారు. ఇదొక స్పిరిచ్యువల్ అనుభవం. దీనికి ఆస్కార్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు లభించింది ఆ సంవత్సరం. మన కమర్షియల్ సినిమాల్లో ఇలాటి స్పిరిచ్యువల్ అనుభవాల ముగింపులు సాధ్యం కాక పోవచ్చు, రియలిస్టిక్ సినిమాల్లో  ప్రయత్నిస్తే పోయేదేం లేదు.


-సికిందర్
(దీనికి స్క్రీన్ ప్లే సంగతులు ఇవ్వడం లేదు.
ఇస్తే ముగింపు  ఎపిసోడ్ వెల్లడించాల్సి వస్తుంది)
http://www.cinemabazaar.in

No comments: