ఒక్కటి మాత్రం
నిజం : రవితేజ సినిమాల్ని చూసే ప్రేక్షకులు అదే రొటీన్ మసాలాని చూసేందుకు
అడ్జెస్ట్ అయిపోయి వెళ్తారు కాబట్టి, రవితేజకి కూడా ఇంకెలాటి కొత్తదనాన్నీ
ప్రయత్నించే అవసరం ఏర్పడ్డం లేదు. మరీ ‘కిక్ -2’ లాంటి అట్టర్
ఫ్లాప్ ఎదురైనా సరే, అవే పాత్రల నుంచీ, అవే కథల నుంచీ
ఆయన అంగుళం కూడా దూరం జరిగే ప్రసక్తే లేదు. ఈ సినిమాలో ఒకచోట ‘ అందరి కంటే
నేను తేడా’ అని తను
డైలాగు పలికినట్టు,
ఆ
తేడా ఏ స్టార్ కీ లేనివిధంగా తన రొటీన్ని తను రొటీన్ని కంటిన్యూ చేయడమే నేమో! సంపత్ నంది దర్శకత్వంలో ‘బెంగాల్ టైగర్’ అనే మరో రొటీన్ ని ఇంకోసారి ట్రై చేసి చూశాడు
రవితేజ. మాస్ మహారాజా అన్పించుకుంటే సరిపోవడం లేదనేమో ఇలా రొటీన్ మహారాజా అనికూడా
ముద్రేసుకుని ఇక దేని గురించీ పట్టించుకోవడం లేదు- కనీసం ఆ రొటీన్ అయినా పద్దతిగా
ఉండేట్టు చూసుకోకపోవడం కూడా తన రొటీన్ లో భాగమేనేమో!
కథ
ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చదివిన ఆకాష్ నారాయణ్ (రవితేజ) రొటీన్ గా తూర్పు గోదావరి జిల్లా గ్రామంలో లో ఫ్రెండ్స్ ని వేసుకుని ఆవారాగా తిరుగుతూ, ఇంటిమీదికి గొడవలు తెస్తూ తిట్లు తింటుంటాడు. పెళ్లి చేస్తే బాగు పడతాడని సంబంధం చూస్తారు. ఆ అమ్మాయి ఆకాష్ కి క్లాస్ పీకుతుంది- తను కోరుకునేది ఇతడి లాంటి లోకల్ క్యారక్టర్ ని కాదనీ, లోకమంతా తెలిసిన సెలెబ్రిటీని అనీ చెప్పి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటుంది. దీంతో ఆకాష్ అహం దెబ్బతిని, తను అర్జెంటుగా ఫేమస్ అయిపోవాలనుకుంటాడు. ఆ ఊరికొచ్చిన వ్యవసాయ మంత్రి ( సాయాజీ షిండే) మీదికి ఓ రాయి విసిరి మీడియా కెక్కుతాడు. ఆ మంత్రికి మొదట మండిపోయినా, ఆకాష్ తెలివి తేటలకి మెచ్చి తన అనుచరుడుగా నియమించుకుంటాడు. అలా హైదారాబ్ వెళ్ళిన ఆకాష్, హోంమంత్రి ( రావు రమేష్) కూతురు శ్రద్ధ ( రాశీ ఖన్నా) ని కాపాడి మార్కులు కొట్టేసి, వ్యవసాయ మంత్రి కి ఎగనామం పెట్టేసి హోం మంత్రి ఇంట్లో చేరిపోతాడు.
ఇతడి వాలకం చూసి శ్రద్ధ
ఆకాష్ ఆకర్షణ పెంచుకుంటుంది. ఆమెకి వేరే సంబంధం ఖాయం చేస్తారు. అప్పటికి ఆ ఇంట్లో
అందరికీ దగ్గరైన ఆకాష్, శ్రద్ధ సహా అందరూ ఆ
సంబంధం వదులుకుని తనని చేసుకునేలా
చేస్తాడు. తీరా ముఖ్యమంత్రి ( బొమన్ ఇరానీ) సమక్షంలో హోం మంత్రి ఆకాష్ తో సంబంధాన్ని ప్రకటించేసరికి, తను ప్రేమించింది వేరే అమ్మాయి నంటూ ప్లేటు ఫిరాయిస్తాడు - ఆ అమ్మాయి ముఖ్య మంత్రి కూతురు
మీరా ( తమన్నా) అని చెప్తాడు.
ముఖ్యమంత్రితో సహా అందరూ షాక్ అవుతారు. ఇంతకీ ఆకాష్ పథకం ఏమిటి? ఇలా ముఖ్యమంత్రి కి
దగ్గరయ్యేందుకు ఇన్ని ఎత్తుగడలు వేసిన ఆకాష్ అసలు గతం ఏమిటి? ముఖ్యమంత్రితో తనకున్న శతృత్వం ఏమిటి? ఇవన్నీ మిగతా కథలో తేలతాయి.
ఎలావుంది
కథ?
మాస్ ప్రేక్షకుల్నే టార్గెట్ చేసిన కథ. మాస్ మహారాజా కాబట్టి మాస్ కి నచ్చితే
చాలుననే విధంగా శ్రద్ధ పెట్టని కథ. కేవలం మాస్ ప్రేక్షకులు చూస్తే 50, 60 కోట్లు వచ్చేస్తాయా అన్నది బుద్ధి
జీవులకి కలిగే సందేహం. మాస్ ప్రేక్షకులు థియేటర్లలో పైతరగతికి వెళ్తారా అన్నది
కూడా మరో సందేహం. వీళ్ళు మాస్ జనం కాబట్టి
హోటళ్లలో అడ్డగోలు భోజనం పెడతారా, పెడితే వూరుకుంటారా అన్నాది మరో ప్రశ్న.
అవే మాస్ సినిమాల్ని అదే అడ్డగోలుతనంతో ఎన్ని తీసినా ఎస్కేప్ అవచ్చు. మనకి తెలిసి సినిమాలు రెండు రకాలు : కమర్షియల్,
ఆర్ట్ అన్నవి. మొదటివి క్లాస్- మాస్ అనే తేడాల్లేకుండా ఆబాలగోపాలం అందరూ చూసేవి,
రెండోవి ఒక వర్గం ప్రేక్షకులకి మాత్రమే పరిమితమయ్యేవి. మధ్యలో ఈ మాస్ సినిమాలు అనే
వర్గీకరణ ఎక్కడిదో అర్ధంగాదు. దీంతో మిగతా కమర్షియల్ ప్రేక్షకుల్ని దూరం
చేసుకోవడమే. ఇలాగే వుంది ఈ సినిమా కథ కూడా. అలాగే మాస్ కోసమే తీశారు కాబట్టి
సెకండాఫ్ కథ అంత బోలుగా వుంది.
ఎవరెలా
చేశారు
రవితేజ కొత్తదనం జోలికి పోకుండా అవే రొటీన్ పాత్రలు
పదేపదే చేయడంవల్ల నటనలో కూడా కొత్తదనం ఈ
సినిమాలో కూడా రొటీన్ గానే నిల్.
కాకపోతే ‘కిక్ – 2’ లో లాగా ఇది మరో ఓవర్ యాక్షన్ తో కూడిన హైపరాక్టివ్
క్యారక్టర్ కాదు కాబట్టి కాస్త బతికిపోతారు ప్రేక్షకులు. ఆశాజనకంగా తనది పాసివ్
సుడిగుండంలో పడని యాక్టివ్ పాత్రే. అయితే పగదీర్చుకునే పాత్రయి కూడా ఏ రోషమూ, ఆవేశం లాటి భావోద్వేగాల
ప్రదర్శన కూడా లేకపోవడంతో పాత్రతో బాటు
నటన కూడా పలచనయ్యాయి. మాస్ మహారాజా పాత్రకి క్రోధావేశాలుంటే మాస్
ప్రేక్షకులు ఒప్పుకోరనా? కేవలం కామెడీతో, పోరాటాలతో సరిపెట్టేయడంతో
పాత్రకి డెప్త్ లేకుండా పోయింది. పైగా ఇద్దరు పాపులర్ హీరోయిన్లు వున్నా వాళ్ళతో
రోమాన్సు కూడా చేయకపోవడంతో పాత్రా, దాంతో నటనా మరీ డ్రైగా తయారయ్యాయి. ఒక హీరోయిన్ ని
ఉపయోగించుకుని హోం మంత్రి దగ్గరికి, ఆమెని వదిలేసి ఇంకో
హీరోయిన్ ని ఉపయోగించుకుని ముఖ్యమంత్రి దగ్గరా
పాగా వేయడమే లక్ష్యంగా సాగే పాత్రగా రోమాన్స్ ని పట్టించుకోలేదు. ఇలాటి
ధోరణి నెగెటివ్ –లేదా యాంటీ హీరో పాత్రలకి
వుంటుంది. తను ప్రేమించి వుంటే గ్లామర్ హీరోయిన్లతో చాలా ఫన్నీ సీన్స్
వర్కౌట్ అయ్యేవి. వాళ్ళని వదిలేసి ఎంతసేపూ పక్క మగ పాత్రలతో కామెడీలతో
సరిపెట్టేయడం వల్ల, అది కూడా సెకండాఫ్ లో
కంటిన్యూ అయ్యే పరిస్థితి లేనందువల్ల, బాగా రిస్కులో పడింది బాక్సాఫీసు పరంగా రవితేజ పాత్ర.
నడుస్తున్న కథలో హీరో లవ్ చేయడం లేదు గనుక, ఆ లోటు తీర్చడానికా అన్నట్టు- (డార్లింగ్ లో ప్రభాస్ క్యారక్టర్
లాగా) యూరప్ లో తమన్నాని రవితేజ
టీజ్ చేసే సాంగ్ పెట్టి, చివరికి ఇది కట్టు కథ మాత్రమే అని తేల్చేశారు.
ఇలా రవితేజ పాత్రకి
ప్రేమే లేకపోతే, ఆ పాత్రతో హీరోయిన్లవి కూడా
ఏకపక్ష ప్రేమలే. ఆ ప్రేమలతో వాళ్ళు కూడా ముందడుగు వెయ్యకుండా, హీరోని రెచ్చగొట్టకుండా, డ్రీం సాంగ్స్ తో పాసివ్ గానే సరిపుచ్చుకుంటారు. హీరోయిన్లు ఇష్టారాజ్యంగా
అంగాంగ ప్రదర్శనలు చేసినంత మాత్రాన అది రోమాన్స్ అన్పించుకోదు, ఫ్యాషన్ పెరేడ్ అన్పించుకుంటుందేమో. హీరోలో రొమాంటిక్
యాంగిల్ చూపించడానికి ఒక కట్టుకథ, హీరోయిన్ల ప్రేమలు
చూపించడానికి వాళ్ళ డ్రీం సాంగ్స్. అంతా ఉత్తుత్తిదే! ప్రేమలు గల్లంతయిన పాత్రలు! ఇంత మాస్ సినిమాలో
ప్రేమకి స్థానమే లేదు, పైగా సగం సినిమా ప్రేమ ఆధారంగానే నడుస్తుంది! మాస్ ప్రేక్షకుల మెనూ లోంచి ప్రేమని కూడా కట్
చేశారు.
హీరోయిన్ల పాత్రలకి కథలో
పనిలేకుండా నామమాత్రం చేశారు. దీంతో రాశీ ఖన్నా సంగతెలా వున్నా, తమన్నా సైతం యాక్టివ్ పాత్ర కాలేక తీవ్ర అసంతృప్తికి
దారితీసేట్టు తయారయ్యింది. ఎంత అందాల ప్రదర్శనతో ఈ లోపాన్ని కవర్ చేయాలని చూసినా, బేసికల్ గా వున్న డొల్లతనం కనుమరుగైపోదు. హీరో
ప్రేమించకుండా తమని ఎక్స్ ప్లాయిట్ చేస్తూంటే కనీసం చీమకుట్టినట్టు కూడా లేకపోడడం
హీరోయిన్లిద్దరి స్పెషాలిటీ. వాళ్ళు ప్రేమల్ని బయట పడేసుకుని హీరోని గెలిచే ప్రయత్నాలు చేసే లక్ష్యాల్ని ఏర్పాటు చేసుకుని వుంటే, అది సెకండాఫ్ లో లేని కథ నడపడానికి సబ్ ప్లాట్ గానైనా పనికొచ్చేది. హీరో సీఎం మీద వ్యక్తిగత పగతో
యాక్షన్ ఓరియెంటెడ్ గా సాగిపోతూంటే, ప్రేమపగలతో హీరోయిన్లు
వెంటపడ్డం వల్ల, కనీసం ఫస్టాఫ్ లో మిస్సయిన
రొమాంటిక్ యాంగిల్ ఏర్పడి మూడు పాత్రలకీ డైమెన్షన్స్ ఉండేవి. సినిమా అంతా రవితేజ ఒన్ మాన్ షోగానే
వుండాలనీ,
సక్సెస్ క్రెడిట్
తానొక్కడికే దక్కాలనీ ఇతర పాత్రలకి ప్రాధాన్యం లేకుండా చేయడం, రోమాన్స్ ని కూడా నిలువునా నరికెయ్యడం సక్సెస్ ఫుల్ మాస్
సినిమా ఫార్ములా అనుకుంటే అది ప్రపంచంలో ఎనిమిదో వింత అవుతుంది. అన్ని మసాలాలూ సమపాళ్ళల్లో మేళవించామంటారు.
ఏంటది?
నాల్గు ఫైట్లు, ఆరుపాటలు, కామెడీ, ఇంకేదో ఎంటర్ టైన్ మెంట్, ఎక్స్ పోజింగ్, కొన్ని పంచ్ డైలాగులూ
వేసేసి సంతృప్తి పడ్డమేనా - వీటన్నిటికీ మూలాధారమైన భావోద్వేగాలూ ప్రేమలతో
కూడిన పాత్రచిత్రణలు పట్టకుండానే? మాస్ మహారాజా మూవీ
మేకింగ్ కి కొత్తగా ఇవి వ్యర్ధ పదార్ధాలయ్యాయా?
తనకి సరైన పాత్ర
లేకుండానే తమన్నా ఈ సినిమా ప్రమోషన్ కోసం చాలా
శ్రమించింది. ఆమెపట్ల జాలిపడాల్సిందే. ఇలాటి సినిమాలకి ప్రమోషన్ కూడా హీరోగారి ఒన్ మాన్ షోగానే వుంటే బావుంటుందేమో? కథకి అక్కర్లేని నటీమణులు సినిమాని అమ్మడానికి అత్యవసరం
కావడం ఐరనీయే.
బొమన్ ఇరానీ, సాయాజీ షిండే, రావురమేష్ దుష్ట
పాత్రలైతే ఉన్నాయిగానీ, వీటికీ డెప్త్ లేదు.
కామెడీ సెక్షన్ లో బ్రహ్మానందం, పోసాని, షకలక శంకర్, పృథ్వీ లలో పృథ్వీ ఒక్కరే
మరోసారి ప్రేక్షకులకి దగ్గరయ్యారు. అయితే సినిమా స్టార్ కావాలన్న కోరికతో చేసే
పన్లు సెకండాఫ్ లో కంటిన్యూ కాక ముగిసిపోయింది పాత్ర. హీరోయిన్లని వాడుకున్నట్టే
రవితేజ పాత్ర ఈ పాత్రని కూడా వాడుకుని వదిలెయ్యడంతో ఇలా జరిగింది.
ఇక సంగీత దర్శకుడు భీమ్స్ ఓ మూడు క్యాచీ సాంగ్స్ ఇచ్చి ప్రూవ్
చేసుకున్నాడు. ‘బెంగాల్ టైగర్’ అనే టైటిల్ సాంగ్ (రామజోగయ్య శాస్త్రి - శంకర్ మహదేవన్) ‘ఆసియా ఖండంలో..’ అనే డ్యూయెట్ (సంపత్ నంది- నకాష్ అజీజ్, నూతన), ‘రాయే రాయే’ అనే ఫోక్ సాంగ్ ( సుద్దాల
అశోక్ తేజ- సింహా, మమతా శర్మ, ఉమా నేహా ) మూడూ క్యాచీ ట్యూన్సే. అయితే బీమ్స్ ఏ పాటకైనా ఎక్కువగా ఫోక్ ఫ్లేవర్
ఇష్టపడుతున్నట్టుంది. సౌందర రాజన్ ఛాయాగ్రహణం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. డీఐ
లో క్వాలిటీ చూపించాడో, కలర్ఫుల్ లొకేషన్ కి
పెద్ద పీట వేశాడో- విజువల్ క్వాలిటీని సమున్నతం మాత్రం చేశాడు. దీన్ని దర్శకుడి
కథాకథనాలు అందుకోలేకపోయాయి. రామ్ - లక్షణ్
లు యాక్షన్ కోరియోగ్రఫీకి ఇంకేదో కొత్తగా
చూపించాలని తపన పడ్డారు. రవితేజ
నడుస్తూంటే బురదలోంచి శవాలు పైకి లేవడమనే దర్శకుడి అయిడియాని వూ హాతీతగంగా కంపోజ్
చేశారు. కానీ కొన్ని చోట్ల గొడ్డలితో పోయేదానికి గోటితో గోక్కుంటూ కూర్చోవడంలాగా, దర్శకుడి అయిడియా కథా సౌలభ్యం చూసుకుని – ఒక్క తుపాకీ గుండు వాడితే సరిపోయేదానికి రవితేజ మీద
ఖడ్గాలతో వెంటబడేలా లాజిక్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయాల్సి రావడం రామ్ –లక్ష్మణ్ లని కుదేలు చేశాయి. సీఎం తన దగ్గర హీరో వున్నప్పుడు చుట్టూ భయంకరంగా ఆధునిక
తుపాకులతో వున్న సెక్యూరిటీతో చంపడానికే సిద్ధపడినప్పుడు- అదే హీరో
అక్కడ్నించి తప్పించుకుని
పారిపోతున్నప్పుడు- ఒక్క తుపాకీ కూడా
లేకుండా ఖడ్గాలు తిప్పుతూ ముఠా వెంటాడడం హాస్యంగా వుంది. మాస్ సినిమాకి ఇలా కూడా
లాజిక్ ఉండకూడదా? జనరల్ నాలెడ్జి లేకపోయినా
చప్పట్లు కొట్టేసేంత లో- క్యాటగిరీయా
రవితేజ మాస్ ఫ్యాన్స్ ? పాపం మూగ జీవులు...’మాస్యావరణం’ మీద ‘రసా’ యన ప్రయోగం..
స్క్రీన్
ప్లే సంగతులు
నిజానికి ఇలాటి రొటీన్
మాస్ కథలకి స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవడం
కూడా రొటీన్ గా చెప్పుకునేదే. పాత సంగతుల్నే తిరగేసుకుంటే సరిపోతుంది. లేకపోతే
పదేపదే ఎండ్ సస్పెన్స్ కథలు కమర్షియల్ సినిమాలకి, అందునా గ్రాహ్య శక్తి తక్కువ
వుండే ‘మాస్ ప్రేక్షకులు’ చూసే సినిమాలకి పనికిరావని ఎన్నిసార్లు చెప్పుకుందాం? ఎండ్ సస్పెన్స్ కథలు, స్ట్రక్చర్ లో వుండని కథలు, సెకండాఫ్
సిండ్రోముల కథలు..వీటి గురించి ఇంకెన్ని సార్లు బోరుకొట్టించుకుంటూ చెప్పుకుంటూ ఉందాం? ఈ లోపాల గురించి చెప్పుకోవడం నుంచి విముక్తి వుండదా?
వుంటుంది- మళ్ళీ
ఒక ‘మనం’ లాంటిదో, ఇంకోటేదో బ్యూటీ ఫుల్
రైటింగ్ తో వచ్చినప్పుడు ఆనందంగా పదేపదే చెప్పుకోవడానికి ఎంతైనా వుంటుంది. ఈ
ఆశాభావంతో అప్పటి దాకా ఇదింతే!
స్ట్రక్చర్ గురించి ఎంత
రాసినా నోబడీ కేర్స్ స్ట్రక్చర్. క్రియేటివిటీయే స్ట్రక్చర్ అనుకోవడం వల్ల. స్ట్రక్చర్ కి కొలమానా లుంటాయని
తెలియకపోవడం వల్ల. క్రియేటివిటీనీ స్ట్రక్చర్ నీ ఒకే గాటన కట్టడం తప్పని తెలుసుకోక
పోవడంవల్ల. స్ట్రక్చర్ మెదడు చూసుకునే పని అని గ్రహించకపోవడం వల్ల. క్రియేటివిటీ
హృదయంతో జరిగే తంతు అని గమనించక పోవడం వల్ల. మెదడూ హృదయమూ రెండిటితో జరిగే కథా
సృష్టిని అసలే కేర్ చేయకపోవడం వల్ల.
స్క్రిప్టు ఎలా వున్నా మాస్ మహారాజానో మరొకరో తమ భుజాల మీద ఏరు దాటిస్తార్లే
అనుకోవడం వల్ల.
ఎండ్ సస్పెన్స్ ని అమలు
చేయడం వల్ల స్ట్రక్చర్ గల్లంతై బెంగాల్ టైగర్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎప్పుడు
గాండ్రించాలో, గాండ్రించాలో కూడదో తెలీక
దీనం గా మాస్టర్ కేసి చూస్తున్న సర్కస్ పులిలా ఉండిపోయింది. ఎండ్ సస్పెన్స్ తో
స్ట్రక్చర్ గల్లంతవడం వల్ల, మిడిల్ అనేది లేకుండా
పోయి, మిడిల్ మటాష్ స్క్రీన్
ప్లే అయ్యింది. అందుకే సెకండాఫ్ చూస్తూంటే డెప్త్ లేని ఫీలింగ్ ఇట్టే
పట్టేసుకుంటుంది మనల్ని.
ఎండ్ సస్పెన్స్ కథనం, షుగర్ కోటింగ్ బ్రేక్ అవడం ఈ రెండూ కథనంలో మరెన్నో లోపాల్ని
తెచ్చిపెట్టాయి ...
***
1. ఎండ్ సస్పెన్స్ : రవితేజ పాయింటాఫ్ వ్యూలో ఫ్లాష్ బ్యాక్ గా కథ ప్రారంభమవుతుంది.
‘టెంపర్’ ప్రారంభంలో ఎన్టీ ఆర్ కదనరంగంలో
అవిసిపోయి వున్న దృశ్యాన్ని గుర్తు చేసుకుంటే, అలాటిదే దృశ్యం పిస్తోలు పట్టుకుని గట్టున కూర్చున్న రవితేజని చూపిస్తూ ఓపెనవుతుంది. లేచి
బురద గుంటలో నడుస్తూంటే ఒక్కో శవం కాళ్ళ కింద నుంచి పైకి లేస్తూంటుంది. ఇది కట్ అయి ఫ్లాష్ బ్యాక్ ప్రారంభ మవుతుంది.
ఇది బిగినింగ్ విభాగం. దీనికి తగ్గట్టే వివిధ పాత్రల పరిచయం అయ్యింది. హాయిగా పది
నిమిషాల వ్యవధిలోనే బిగినింగ్ విభాగం ముగిసిపోతూ హీరోకి సమస్య (మొదటి మూల
స్థంభం) ఏర్పాటయింది- హీరోకి పెళ్లి
సంబంధం చూడ్డం, ఆ పెళ్లి చూపులప్పుడు అమ్మాయి తన కాబోయేవాడు ఫేమస్ అయి వుండాలని
చెప్పడంతో పది నిమిషాల్లో బెటర్ గా బిగినింగ్ ముగుస్తుంది. దీంతో కథ మిడిల్ విభాగం లో పడి, ఇగో దెబ్బతిన్న
హీరో తను ఫేమస్ అయ్యేందుకు మంత్రిని రాయి పెట్టి
కొట్టి రక్తాలు కార్చడం, ఇక అలా అలా హోం మంత్రి దగ్గర మకాం వేసేదాకా పోవడం వగైరా చకచకా
జరిగిపోతాయి...
మొదటి మూల స్థంభం దగ్గర, సమస్య
ఏర్పాటు చేసినప్పుడు, అందులో హీరోకి ఆమె
మాటల వల్ల గోల్ ఏర్పడింది. ఆ గోల్ లో వుండాల్సిన ఎలిమెంట్స్ 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్. ఈ
విధంగా - 1. ఫేమస్ అవ్వాలన్న కోరిక
పుట్టింది, 2. దీనికోసం తన సర్వస్వాన్నీ పణంగా పెట్టి రాయి పెట్టి మంత్రి మాడు
పగులగొట్టాడు, 3. దీని పరిణామాలెలా
ఉంటాయోనన్న గాభరా పుట్టించాడు, 4. ఆమె మాటల వల్ల ఎమోషన్ దానికదే పుట్టింది.
అయితే ఆమె గొంతెమ్మ కోరికలేవో చెప్పుకుంటే హీరో తానెందుకు ఫేమస్
అవ్వాలనుకోవాలి, ఆమె తనని చేసుకునే ప్రసక్తే లేనప్పుడు? రామ్ నటించిన సూపర్ హిట్ ‘కందిరీగ’ లో ఇలాటిదే సన్నివేశం : పెళ్లి
సంబంధాని కొచ్చిన ఆవారా హీరోని పట్టుకుని –
టెన్త్ పాస్ కాలేని వాడివి నాతో నీకేంటి- అనేస్తుంది కలర్స్ స్వాతీ. దీంతో బుద్ధి
తెచ్చుకుని డిగ్రీ సంపాదించుకోవాలని వూరు వదిలి వెళ్ళిపోతాడు హీరో. డిగ్రీ వుంటే ఈ
అమ్మాయి కాకపోయినా రేపు ఇంకే అమ్మాయైనా చేసుకోవచ్చు. ఇది అర్ధవంతంగా వుంది. కానీ రవితేజ పాత్ర ఆమె చెప్పగానే ఫేమస్
అవ్వాలనుకోవడం ఎవరి కోసం? ఈమె ఎలాగూ చేసుకోదు. ఇక వేరే అమ్మాయిలందరూ ఈమెలాగే
కోరుకుంటారనా ఫేమస్ అవ్వాలని వెళ్ళడం? ఇది కన్విన్సింగ్ గా వుందా? కన్విన్సింగ్ గా
లేకపోయినా హీరో ఇలాగే ట్రావెల్ అవుతాడు.
తలపగిలిన వ్యవసాయ మంత్రి,
హీరోలో అపారమైన తెలివి తేటల్ని చూసి హైదరాబాద్
తీసికెళ్ళి అనుచరుడిగా పెట్టుకుంటాడు. ఒకరోజు ఫారిన్ నుంచి వస్తున్న హోం మంత్రి కూతురు (సెకండ్ హీరోయిన్ రాశీ ఖన్నా)
ని రిసీవ్ చేసుకోవడానికి హీరోని పంపుతాడు
వ్యవసాయ మంత్రి. అలా వెళ్లి శత్రువుల బారి నుంచి ఆమెని కాపాడి ఇంటికి చేర్చిన హీరో,
హోం మంత్రి దగ్గర మంచి మార్కులు
కొట్టేస్తాడు. ఓ సుముహూర్తాన వ్యవసాయ మంత్రి కి అవమానకర పరిస్థితిలోకి నెట్టి గుడ్
బై కొట్టేసి, హోం మంత్రి ఇచ్చిన భారీ ఆఫర్
తో వెళ్లి అక్కడ సెటిలై పోతాడు. అతడి మీద మనసు పడుతుంది సెకండ్ హీరోయిన్.
పట్టనట్టే వుంటాడు. ఆమెకి వేరే అబ్బాయితో సంబంధం ఖాయమవుతుంది. తర్వాత ఆమె ఆ సంబంధం వద్దని, హీరోనే చేసుకుంటానని అంటుంది.
ఈ పరిస్థితి హీరో కల్పించేదే. ఇక
ముఖ్యమంత్రి సమక్షంలో హోం మంత్రి తన కూతుర్ని హీరోకిచ్చి పెళ్లి చేస్తున్నట్టు
ప్రకటించినప్పుడు, హీరో తను ప్రేమించింది
ఈ సెకండ్ హీరోయిన్ని కాదనీ, ముఖ్యమంత్రి కూతురైన ఫస్ట్ హీరోయిన్ ( తమన్నా) ని
అనీ ప్రకటించి సంచలనం సృష్టిస్తాడు. ఇప్పుడు అదే పార్టీలో వున్న ఫస్ట్ హీరోయిన్ మొట్ట
మొదటిసారిగా తెరమీదికొస్తుంది.
హీరో ప్రకటనతో ముఖ్యమంత్రి
సహా అందరూ షాకవుతారు. ముందుగా హీరో ఈ ప్రకటన చేయడానికి తటపటాయిస్తున్నప్పుడు, ఆ
అమ్మాయి ఎవరైనా ఆమెతో నీ పెళ్లి జరిపిస్తాను చెప్పమంటూ ముఖ్యమంత్రి వొత్తిడి
చేస్తాడు. ఆనక తనే ఇరుక్కుంటాడు. ఇదికూడా హీరో ప్లేనే. ఇక్కడ హీరోయిజం ఎలివేట్
అవుతూ- బిగ్ క్వశ్చన్ మార్కుతో ఇంటర్వెల్ పడుతుంది.
ఈ మొత్తం ట్రాక్ వల్ల ఏమర్ధమవుతోంది?
సీఎం కూతురైన ఫస్ట్ హీరోయిన్ ని ట్రాప్
చేయడానికే, హీరో వ్యవసాయ మంత్రి తలకాయ
అడ్డంగా పగులగొట్టి హోం మంత్రి ఇంట్లో చేరాడనీ, అక్కడ సెకండ్ హీరోయిన్ పెళ్లి
సంబంధాన్ని ఎక్స్ ప్లాయిట్ చేసి, ముఖ్యమంత్రి కూతురికే టెండర్ పెట్టడమనే పథకం
తెలివిగా పారించాడనీ అర్ధమవుతోంది. ఈ
ప్రయాణంలో తానేప్పుడో సెలెబ్రిటీ అయిపోయి ఎవరూ హాని చేయలేని డిఫెన్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే, మొదట్లో పెళ్లి
చూపులప్పుడు ఆ అమ్మాయి తను ఫేమస్ కాదని తిరస్కరించినప్పుడు, అందులోంచి స్ఫూర్తి పొంది- నేను ఫేమస్ అయితే
ఈ పల్లెటూరి మొహమేం ఖర్మ, ఏకంగా సీఎం కూతురే నాదవుతుందన్న గోల్
పెట్టుకుని ట్రావెల్ అయ్యాడనీ తెలుస్తోంది. మొదటి మూల స్థంభం దగ్గర
కన్విన్సింగ్ గా లేని హీరో ప్రవర్తనకి అర్ధం ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర క్లియర్
అవుతోంది.
చాలామంది అనుకోవచ్చు-
ఇంటర్వెల్ దగ్గరే టర్నింగ్ వచ్చి ఇక కథ ప్రారంభమయ్యిందని, ఇంతవరకూ నడిచింది
బిగినింగ్ విభాగమే నని. ఇలా అనుకుంటే ఇంటర్వెల్లో హీరో సమస్యలో పడాలి. కానీ పడలేదు.
సీఎం ని ఇరికిస్తూ తనే గేమ్ ప్రారంభించాడు. ఇలాటి టర్నింగ్ మిడిల్ మధ్యలో
వస్తుంది. హీరో సమస్యలో పడ్డం, బిగినింగ్ ముగియడం ఎప్పుడో సినిమా ప్రారంభమైన మొదటి
పది నిమిషాల్లోనే జరిగిపోయిందని పైన చెప్పుకున్నాం. పైనే చెప్పుకున్నట్టు బిగినింగ్ విభాగం ముగిస్తూ హీరోకి గోల్ ఏర్పడింది. అక్కడ్నించీ ఇంటర్వెల్ దాకా నడిచిం దంతా మిడిల్
విభాగమే. మిడిల్ బిజినెస్ ప్రకారం సీఎం కూతురనే గోల్ కోసం హీరో చేస్తున్న
స్ట్రగులే అదంతా. ఈ స్ట్రగుల్ లో
భాగంగా గోల్ ని సాధించడానికే తలకాయలు
బద్దలు కొట్టడం, హోం మంత్రి ఇంట్లో చేరి ఆటాడుకోవడమూ, చివరికి సీఎం కూతుర్ని
డిక్లేర్ చేసుకుని అందరికీ షాకివ్వడ మూనూ.
మిడిల్లో హీరో
స్ట్రగుల్లో భాగంగా ఇంటర్వెల్ ఘట్టం ఒక మజిలీ మాత్రమే. కథా ప్రారంభం కాదు. కథెప్పుడో
సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే
ప్రారంభమయ్యింది. ఇలా ఇంటర్వెల్ వరకూ ఉద్వేగభరితంగా ఉందికదా కథనం. హీరో ఆశ్చర్య
పరచే చర్యలకి అనునిత్యం పాల్పడుతూ యాక్టివ్ క్యారక్టర్ గా కథని తనే ముందుకు
నడిపిస్తున్నాడు. సంఘటనల్ని తనే తెలివిగా సృష్టిస్తున్నాడు. తన క్యారక్టర్ ఆర్క్ నీ, టైం
అండ్ టెన్షన్ గ్రాఫ్ నీ ఇంటర్వెల్ దాకా బలంగా సృష్టించుకున్నాడు.
ఇక్కడ్నించీ ఏం జరిగింది?
సెకండాఫ్ ఎలా నడిచింది? సెకండాఫ్ ప్రారంభ దృశ్యాల్లో సెకండ్ హీరోయిన్ కి ఫస్ట్
హీరోయిన్ తో తన ప్రేమ గురించి హీరో చెప్పడం, తర్వాత ఫస్ట్ హీరోయిన్ నిలదీస్తే
అదంతా కట్టు కథ అని తేలడం, ఐనా ఈ పొజిషన్ కి చేరుకున్న అతడి తెలివి తేటలకి మెచ్చి
ఆమె లవ్యూ చెప్పేయడం, అవతల- సీఎం అసలీ హీరో ఎవరని ఆరాతీయడం, అప్పుడా హీరో ఫలానా
వూళ్ళో ఫలానా పంచాయితీ ప్రెసిడెంట్ కొడుకని తెలియడం, సీఎం షాక్ అవడమూ జరుగుతాయి..
సీఎం హీరోని
పరీక్షించడానికి పిలిపిస్తాడు. మీ నాన్న ఎలా చనిపోయారని అడుగుతాడు. పదిహేనేళ్ళ
క్రితం చేప మందు పంపిణీ ప్రోగ్రాంలో
పాల్గొన్నప్పుడు చాలా మంది ఆ మందు వికటించి చనిపోయారనీ, దాంతో ప్రజలు దాడి చేసి నాన్నని చంపేశారనీ చెప్తాడు హీరో. సీఎం నెమ్మదిస్తాడు. హీరో మాటల్లో
తేడా వస్తే వెంటనే షూట్ చేసేందుకు రహస్య
ఏర్పాటు చేసుకుంటాడు సీఎం. అందరూ నమ్ముతున్నదే హీరో కూడా నమ్ముతున్నాడని తెలిశాక,
తన కూతురితో ప్రేమ గురించి అడుగుతాడు. 500 వందల కోట్లతో హీరోని కొనేసి కూతుర్ని
కాపాడుకుంటాడు సీఎం. అంతకి ముందు హీరోని వెనకేసుకొచ్చిన కూతురు ఇప్పుడేమీ అనలేక
పోతుంది. హీరో మాట తప్పుతాడు. పరస్పరం సవాళ్లు చేసుకుంటారు. దాని ప్రకారం ఇరవై
నాలుగ్గంటల్లో హీరోని తను గనుక
చంపించెయ్యక పోతే, కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని రాసిస్తాడు సీఎం. సీఎం చంపగల్గితే, తన చావుకి తనే బాధ్యుణ్ణని
హీరో కూడా రాసిస్తాడు. గేమ్ మొదలవుతుంది..
ఈ గేమ్ లో ఎవరు
గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేది తెలిసిందే అయినా, హీరో సీఎంతో సమానంగా ఎదిగింది అతడి కూతురు కోసం కాదనీ, అతడి
మీద పాత పగేదో తీర్చుకోవడం కోసమనీ మనకి
అర్ధమవుతుంది. సీఎం హీరో తండ్రిని చంపి వుంటే, ఎలా ఎందుకు చంపాడనేది క్లయిమాక్స్
ముందు వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో రివీల్ అవుతుంది. ఆ తర్వాత క్లయిమాక్స్- దుష్ట
శిక్షణ- సుఖాంతం.
***
ఈ సెకండాఫ్ కథ ఎందుకు
బోరు కొట్టింది? ఎందుకంటే, ఇది ఎండ్ సస్పెన్స్ కథనం అవడం వల్ల. ఎండ్ సస్పెన్స్ ఎలా
అయ్యింది? అసలు గతంలో ఏం జరిగిందో
క్లయిమాక్స్ వరకూ మూసి పెట్టడంతో. ఒక హత్య జరిగినట్టు చూపించారనుకుందాం. ఆ హత్య
ఎవరు చేశారో చివరి దాకా చెప్పకుండా ఎండ్ సస్పెన్స్ కథనం చేస్తే అది సినిమాకి పనికి
రాదు. పాఠకుడు ఒక్కడే కూర్చుని తీరుబడిగా చదువుకుని ఎంజాయ్ చేసే ప్రింట్ మీడియాకి పనికొస్తుంది. హంతకుణ్ణి
చూపించేసి, ఇక వాణ్ణి ఎలా పట్టుకుంటారో రోమాంచిత కథనం చేస్తే అప్పుడది సినిమా అనే దృశ్య మాధ్యమానికి వర్కౌటయ్యే ‘సీన్
– టు – సీన్ సస్పెన్స్’ కథనం అవుతుంది.
మూసి పెట్టి కథనం చేస్తే హంతకుడెవరో తెలిసి చావక గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రేక్షకులకి సహనపరీక్షగా కథనం తయారవుతుంది. హీరోగారికి
విలన్ లేక ఏకనాధంలా ఏదేదో చేసుకుంటూ తిరుగుతూంటాడు. క్లయిమాక్స్ తో తప్ప హీరోకి
విలన్ అనేవాడు ఏర్పాటు కాడు. చాలా పాత రోజుల్లో ‘గుండెలు తీసిన మొనగాడు’, ‘ఖానూన్’
లాంటి అనేక సినిమాలకి ఇది చెల్లిపోయింది. గత ఇరవయ్యేళ్ళుగా మాత్రం ఇలాటివి వర్కౌట్
కావడం లేదు. ఆ ఓపిక ప్రేక్షకుల్లో లేదు. ఆ
మధ్య ‘ఆ ఒక్కడు’, ఈ మధ్యే ‘జాదూగాడు’ లాంటివి అనేకం ఇలా వచ్చి ఫ్లాపయ్యాయి.
ఒకవేళ ఎండ్ సస్పెన్సే తప్పకపోతే, దాన్ని ‘దొంగాట’ లో
చూపించినట్టుగా చేసుకోవచ్చు- కనీసం
సెకండాఫ్ ప్రారంభం నుంచైనా మూసి పెట్టిన సస్పెన్స్
ని రివీల్ చేసి. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ లో అసలు చివరిదాకా నడిచింది ఎండ్ సస్పెన్స్ కథనమని
తెలియకుండానే ఎండ్ సస్పెన్స్ కథనం నడిపి సక్సెస్ అయ్యారు. ఇదెలా జరిగిందో తర్వాత ‘షుగర్ కోటింగ్’ సెక్షన్
లో తెలుసుకుందాం.
సంపత్ నంది దగ్గర క్రియేటివిటీ వుంది, స్ట్రక్చర్ స్పృహ కూడా
వుండాలి. హీరో ఫాదర్ ఎలా హత్యకి గురయ్యాడో చిట్ట చివర్లో రివీల్ చేయడం స్ట్రక్చర్
నే దెబ్బతీసి మొత్తం సెకండాఫ్ కథనాన్ని డొల్లగా మార్చేసిందని తెలుసుకోలేదు. తను ఆడుకుంది సినిమాకి పనికిరాని
ఎండ్ సస్పెన్స్ కథనంతో అని గమనించలేదు. హీరో అసలు సమస్య తండ్రి హత్యకి పగ తీర్చుకోవడం
అయినప్పుడు, ఆ విషయం బిగినింగ్ ముగిపులోనే తెలియజేసి సమస్య ఇదీ అని
చెప్పేయాలి. లేదా ఇంటర్వెల్లో సీఎం కూతుర్ని ప్రేమిస్తున్నట్టు చెప్పినపుడే, ఈ హత్యగురించి కూడా సీఎం కి హింట్ ఇచ్చి డబుల్ షా కివ్వాలి.
సెకండాఫ్ ఓపెనింగ్ లో వెంటనే సీఎం తను చేసిన పాపం తాలూకు ఫ్లాష్ బ్యాక్ వేసుకోవాలి. హీరో తండ్రిని తనెలా చంపాడో చూపించెయ్యాలి. అక్కడ్నించీ తన మీద పగబట్టిన
హీరోతో గేమ్ మొదలెట్టుకోవాలి. ఇప్పుడు
ఎందుకోసం ఈ గేమ్ సాగుతోందో ప్రేక్షకులకి
బోధపడి ఎంజాయ్ చేయగల్గుతారు. ముందే ఆ
ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయడంతో, హీరో పట్ల
సానుభూతి కూడా ఏర్పడుతుంది ప్రేక్షకులకి. ఇంటర్వెల్లో నే హింట్ ఇచ్చాడు కాబట్టి, ఇప్పుడు హీరో
ఎమోషన్స్ ఆ మేరకు డెవలప్ అయి మళ్ళీ
క్యారక్టర్ ఆర్క్ నీ, టైం అండ్ టెన్షన్ గ్రాఫునీ అందుకుని- సెకండాఫ్ లో ఇప్పుడేం జరుగుతుందన్న సీన్ - టు - సీన్
సస్పెన్స్ మొదలైనవి ఏర్పడతాయి. ఇది వర్కౌట్ అవుతుందా? అస్సలు కాదు. మరెందుకు ఇదంతా
చెప్పుకోవడం? దీని కింది సెక్షన్ లో చెప్పుకోబోయేది అర్ధం గావడానికి. ఇదంతా కూడా ఎందుకు వర్కౌట్
కాదంటే... ఇదంతా సెకండాఫ్ ని ఒకటే
వయొలెంట్ యాక్షన్ గా మార్చేస్తుంది. ( సినిమాలో వున్నది ఇదే). ఫస్టాఫ్ తో
హీరోయిన్లతో ఉన్న కథ – అక్కడేసిన ముడి, సెకండాఫ్ లో ఫ్లో కావు. అప్పుడు కథనం తెగి,
ఫస్టాఫ్ లో ఒకలా వున్న కథ, సెకండాఫ్ లో మరొకలా మారిపోయి- సెకండాఫ్
సిండ్రోం అన్పించుకుంటుంది. ఏ రసప్రధానంగా
కథ మొదలెట్టారో, ఆ రస ప్రధానంగానే వినోదాత్మకంగా చెప్పుకు పోవాలి. ‘ముత్యాల ముగ్గు’
మూలంలో లో వున్న శోక రసాన్ని కప్పెట్టి, ఆద్యంతం అద్భుత రసంతో ఎంత వినోదాత్మకంగా
నడిపారో తెలిసిందే. అలాగే ఫస్టాఫ్ అంతా ఒకరి తర్వాత ఒకరుగా హీరోయిన్లతో హీరో
ఎత్తుగడలతో కట్టిపడేసిన కథనం, ఇంటర్వెల్
దగ్గర వాళ్ళతో హీరోకి పడ్డ ‘ముడి’ తో, సెకండాఫ్ లో కూడా ఈ ముగ్గురి మధ్య
కథనే ఆశిస్తారు ప్రేక్షకులు. మొదలెట్టిన ప్రధాన కథ ఇదే కాబట్టి.
ఈ ముడి ని ఎలా విప్పుతారన్న రోమాంటిక్ కథనాన్నే కోరుకుంటారు
తప్ప, ఇంకేదో మీదేసుకుని యాక్షన్ కథని కాదు. మరి హీరో పగ సంగతి? అది మరుగున వుండి
చిట్టచివర్లో పైకి తన్నుకొస్తుంది!! స్ట్రక్చర్ ని పదిలంగా ఉంచుతూ క్రియేటివిటీని
ప్రదర్శించడమంటే ఇదే. స్ట్రక్చర్ లేకపోతే క్రియేటివిటీకి అర్ధంపర్ధమే లేదు.
***
షుగర్
కోటింగ్ : దీని మీద జేమ్స్ బానెట్ ఒక చాప్టరే రాశాడు. షుగర్ కోటింగ్
అంటే లవ్, సాంగ్స్, రోమాన్స్, కామెడీలని
దట్టించడమే అనుకుని ఆ జోరుగా పనిమీద వుంటే అంతే సంగతులు. మొత్తం కథకే షుగర్ కోటింగ్ అనేది ఒకటి వుంటుంది. పైన
చెప్పుకున్న ‘ముత్యాల ముగ్గు’ లో శోకరసానికి అద్భుత రసంతో ఇచ్చినట్టుగా. అలా కాకుండా ఒక
ఏడ్పు చూపించి, లవ్ వేసి, ఇంకో ఏడ్పు చూపించి, ఫైట్ వేసి, ఇంకో ఏడ్పు సీను తర్వాత సాంగ్ వేసుకుంటూ పోతే అది ‘ముత్యాల
ముగ్గు’ అవదు- ‘బెంగాల్ టైగర్ ‘ సెకండాఫ్ అవుతుంది.
‘బెంగాల్ టైగర్’ సేకండాఫ్ షుగర్ కోటింగ్ ని బ్రేక్ చేసుకుని ప్రేక్షకుల మీద
పడింది. పాయసం లాగేసుకుని చీప్ లిక్కర్ ఇచ్చింది. పాయసం లాంటి ఫస్టాఫ్ కథనమంతా
షుగర్ కోట్ తో సింగారించిందని తెలుసుకోకుండా. ఇంటర్వెల్ వరకూ హీరో ఉద్దేశాల్ని
దాచిపెట్టి నడిపిన కథనమంతా హీరోయిన్లతో హీరో చేసుకుపోయే షుగర్ కోటింగే.
ఇంటర్వెల్లో ఈ షుగర్ కోటింగ్ మాటున దాగి వున్న అసలు విషయం చెప్పాడు. పనిలో పనిగా
ఇది దాచిపెట్టిన ఎండ్ సస్పెన్స్ అయ్యింది. ఎండ్ సస్పెన్స్ అని తెలియకుండా ఎండ్
సస్పెన్స్ ని రివీల్ చేయడమంత క్రియేటివ్ పవర్ మరొకటి లేదు. మరి దీన్ని సెకండాఫ్ లో
ఎందుకు అనుసరించకుండా ఎండ్ సస్పెన్స్ అని తెలిసిపోయే యాక్షన్ కథ నడిపి విషయం
లేకుండా చేసుకున్నట్టు?
ఎప్పుడైతే ఇంటర్వెల్లో హీరోయిన్లతో ముడి పడిందో అప్పుడు విలన్ ని కెలుక్కోవడమే
కొంపలు ముంచింది. అప్పుడు విలన్ తో కథయిపోయింది. కానీ కథ అది కాదు- ఇద్దరు
హీరోయిన్లని మభ్య పెట్టి పై స్థాయికి చేరుకున్న హీరో కథ ఇదంతా. చర్యకి ప్రతిచర్య
తప్పకుండా వుంటుంది. స్ట్రక్చర్ లో హీరోయిన్లని మభ్య పెట్టడమనే చర్యకి హీరో
పాల్పడ్డాక ( సెటప్ ఏర్పాటు చేశాక), దీనికి హీరోయిన్ల ప్రతిచర్య (
పే ఆఫ్ ) లేకుండా అర్ధాంతరంగా ఎలా
వదిలేస్తారు? 1 set up = 1 compulsory pay
off అని కదా?
పనిమాలా హీరో పగ కథ కెలుక్కున్నారు. దాని గురించి ఆడియెన్స్ కి తెలీనే తెలీదు.
అక్కర్లేదు కూడా. ప్రేక్షకులు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యింది- తను ఫేమస్ అయి
పల్లెటూరి దాన్ని చేసుకునేదేంటి, సీఎం కూతురికే గాలం వేస్తా అనే అర్ధంలో
ఇంటరెస్టింగ్ గా సాగుతున్న హీరో కథలో మాత్రమే.
గాలం వేశాకా ఈమెతో ఏం గేమ్ ఆడాడు, అప్పుడు మొదటి అమ్మాయి ఏం చేసిందనే మరింత
పైస్థాయికి చేరే ట్రాయాంగులర్ రోమాంటిక్ గిమ్మిక్కుల్నే ఆశిస్తారు ప్రేక్షకులు.
మధ్యలో సీఎం ని కూడా ఏడ్పిస్తూంటాడు హీరో. ఎందుకిలా చేస్తున్నాడో సీఎం కి కూడా
అంతు చిక్కడు. ఆడియెన్స్ కి ఎదురయ్యే సందేహాల్ని అతను వ్యక్తపర్చుకుంటూ రిఫరెన్స్ క్యారక్టర్
లా ఉంటాడు. ఓ పక్క ఇతణ్ణి కూడా ఫాలో అవుతూ వుంటారు ప్రేక్షకులు.
ఈ మొత్తం కథంతా ఒక్క హీరో పగ కోసం పుట్టింది. దీన్ని దాచి పెట్టి షుగర్
కోటింగ్ వేయడమే పైన చెప్పుకున్న కథనం. పై అంచెలో నడుస్తున్న కథనమంతా మొదటి నించీ కూడా హీరో- హీరోయిన్ల మధ్య
బ్రేక్ అవని షుగర్ కోటింగ్ కథనంలా ఉంటూ- చిట్టా చివర్లో బ్త్ర్క్ అవుతుంది.
అప్పుడు హిడెన్ ట్రూత్ బయటికి వస్తుంది. ఆ హిడెన్ ట్రూత్ హీరో తండ్రి హత్యా దృశ్యంతో బ్లాస్ అవుతుంది. ఎలాగైతే ఇంటర్వెల్లో
హీరో తన గేమ్ ని బ్లాస్ట్ చేశాడో- అంతవరకూ కథనం ఎలా వేడెక్కుతూ సాగిందో- అదే సెకండాఫ్ లో హీరోయిన్లతో
వేడెక్కుతూ సాగి చివర్లో బ్లాస్ట్ అవుతుంది- అప్పుడు హిడెన్ ట్రూత్ బయట పడుతుంది.
ఆ తర్వాత యాక్షన్ తో క్లయిమాక్స్.
ఇలాటిదే జరిగింది ‘పిల్లా నువ్వు లేని జీవితం’ లో. సినిమాలకి సంబంధించి ఎండ్
సస్పెన్ కథలతో వచ్చే ఇబ్బందుల్ని తొలగిస్తూ ఎప్పుడో 1958 లో
బ్రిటిష్ దర్శకుడు మైకేల్ ఆండర్సన్ ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ అనే
బ్లాక్ అండ్ వైట్ థ్రిల్లర్ ద్వారా సెట్ చేసి పెట్టాడు. 1981 లో దీన్నే ‘ధువాఁ’ గా హిందీలో విజయవంతంగా ఫ్రీమేక్ చేశారు.
స్ట్రక్చర్ ఎక్కడైనా ఒక్కటే. క్రియేటివిటీ
మాత్రం రకరకాలు. రకరకాల టెక్నిక్కులతో కథన సమస్యలకి పరిష్కారాలు. టెక్నిక్కులు తెలుసుకోకపోతే క్రియేటివిటీకి
కూడా విలువ లేదు. విజయవంతమైన సినిమాల్లోనే హిట్టయ్యే టెక్నిక్కులు వుంటాయి-
ఫ్లాపయ్యే సినిమాల్లో ఏమీ వుండవు.
కావలసింది ఒక సినిమా ఏ టెక్నిక్ తో విజయవంతమయ్యిందని పసిగట్టడమే. దాన్ని
అనుసరించడమే.
—సికిందర్