రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Showing posts sorted by relevance for query కేసరి. Sort by date Show all posts
Showing posts sorted by relevance for query కేసరి. Sort by date Show all posts

Friday, March 22, 2019

801 : రివ్యూ





దర్శకత్వం : అనురాగ్ సింగ్
తారాగణం : అక్షయ్ కుమార్, పరిణీతీ చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా తదితరులు
రచన : అనురాగ్ సింగ్, గిరీష్ కొహ్లీ, సంగీతం : తనిష్ బాగ్చీ, చిరంతన్ భట్ తదితరులు, ఛాయగ్రహణం : అన్శుల్ చోబే
బ్యానర్ : ధర్మా, అజూరే, కేప్ ఆఫ్ గుడ్, జీ స్టూడియోస్
నిర్మాతలు : కరణ్ జోహార్,  అరుణా భాటియా తదితరులు 
***         చారిత్రక సినిమాల సీజన్ లో మరుగున పడిపోయిన చరిత్రలు వెలుగు చూస్తున్నా యి. మనం మర్చిపోయి, బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పటికీ స్మరించుకుంటూ వార్షికోత్సవం జరుపుకుంటున్న సిక్కు పోరాట యోధుల ఆత్మబలిదానాన్ని ఎట్టకేలకు కరణ్ జోహార్ తెరకె క్కించాడు. హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలో 21 మందితో కూడిన సిక్కు రెజిమెంట్, ఆఫ్ఘన్ దురాక్రమణాన్ని ఎదుర్కొన్న చారిత్రక పోరాట ఘట్టం అక్షయ్ కుమార్ హీరోగా ‘కేసరి’ టైటిల్ తో విడుదలైంది. ఇదెలా వుందో చూద్దాం...

కథ 
      ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో రాక్షస భర్తని వదిలి పారిపోతున్న ఒకామెని వెంటాడి వస్తూంటారు ముల్లా మనుషులు. ఇటు సరిహద్దులో గులిస్తాన్ పోస్టు నుంచి ఇది చూస్తున్న హవల్దార్ ఇషార్ సింగ్ (అక్షయ్ కుమార్) వెంటనే ఆమెని కాపాడడానికి సిద్ధమవుతాడు. అటు వెళ్ళ వద్దని బ్రిటిష్ లెఫ్టినెంట్ లారెన్స్ (ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్) వారిస్తున్నా వినకుండా వెళ్లి మూకని చంపి, ఆమెకి శిరచ్ఛేదం గాకుండా కాపాడి తీసుకొచ్చేస్తాడు. దీంతో ఆఫ్ఘన్ ముల్లా సైదుల్లా (రాకేష్ చతుర్వేదీ ఓం) కక్ష గడతాడు. సైన్యాన్ని రెచ్చగొట్టి గులిస్తాన్ పోస్టు మీద జిహాద్ జరపాలంటాడు. పఠాన్ సైనిక నాయకులు ఖాన్ మసూద్ (మీర్ సర్వర్), గుల్ బాద్షా ఖాన్ (అశ్వథ్ భట్) లు గిరిజన దండునేసుకుని కోట మీద భీకర దాడి జరుపుతారు. ఇషార్ సింగ్ తన పటాలంతో ఈ దాడిని విజయవంతంగా తిప్పి కొడతాడు. దీంతో దీనికంతటికీ నువ్వే కారణమని ఇషార్ సింగ్ ని బదిలీ చేసేస్తాడు లెఫ్టినెంట్ లారెన్స్. సుదూరంగా వున్న సరగర్హీ ఆర్మీ పోస్టు (కోట) కి వెళ్లి బాధ్యతలు తీసుకుంటాడు ఇషార్ సింగ్. అక్కడ 36 వ సిక్కు రెజిమెంటుకి చెందిన 21 మంది సైనికులు పనీ పాటా లేక కోళ్ళ పందాలు ఆడుకుంటూ వుంటారు. ఎవరికీ సైనికుల లక్షణాలుండవు. వాళ్ళకి క్రమశిక్షణ నేర్పి సైనికులుగా తీర్చిదిద్దుతాడు.   

          ఇక ఇప్పుడు ఆఫ్ఘన్ పఠాన్లు, ముల్లా,  పదివేల మంది గిరిజనులతో సరగర్హీ మీదికే భారీఎత్తున దాడికొస్తారు. సరగర్హీ తో బాటు గులిస్తాన్, లొకార్ట్ కోటల్ని కూడా ముట్టడించే పెద్ద పథకంతో వస్తారు. 21 మంది సైనికులతో వున్న ఇషార్ సింగ్ ఈ పది వేల మందిని ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
       ఇప్పటి పాకిస్తాన్లోని సరగర్హీలో 1897 సెప్టెంబర్ 12 న, 21 మంది సిక్కు- 10 వేల మంది ఆఫ్ఘన్ దళాల మధ్య 30 గంటలపాటు జరిగిన భీకర పోరాట వాస్తవ గాథ ఇది. వెనక్కి వచ్చేయమని బ్రిటిష్ అధికారులు ఆదేశాలిచ్చినా, ఆ పిరికిపంద చర్యకి మనస్కరించక, 30 గంటల పాటు చివరి శ్వాసవరకూ పోరాడి,180 మందిని హతమార్చి చనిపోయారు సిక్కు దళం. ఈ చరిత్రకి కల్పనని జోడించి తీసినప్పుడు దారితప్పి పోయారు. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అమరులైన వాళ్లకి నివాళిగా అంటూ ప్రారంభించే ఈ పోరాటం, మత ప్రతిష్ట కోసం చేసే వ్యక్తిగత పోరాటమన్నట్టుగా సాగుతుంది. దీనికి వ్యతిరేకంగా అటు ఆఫ్గన్ ఫైపు జిహాద్ అంటూ మతప్రాతిపదికన రెచ్చ గొడుతున్న ముల్లాని నిలదీస్తాడు పఠాన్ సైనిక నాయకుడు - భూభాగాల కోసం జరిగే యుద్ధంలో మతాన్నెందుకు లాగుతావని.  
  
           ఇటు ఇషార్ సింగ్ వేరే రంగుతో వున్నపగిడీ (తలపాగా) తీసేసి, కేసరి (కాషాయ రంగు) పగిడీ ధరించి పోరాటం చేయడంతో, ఈ కాల్పనిక చరిత్ర ఎన్నికల ప్రచార సాధనంగా మారిపోయింది - ఇవ్వాళ నా పగిడీ రంగు కేసరి, ఇవ్వాళ నా పారే రక్తం రంగు కేసరి, ఇవ్వాళ నేనిచ్చే సమాధానం రంగూ కేసరీ అంటూ. అటు ముల్లా ప్రభావంతో  ఆఫ్ఘన్లు కూడా మతం కోసమే రాక్షన కాండ ప్రారంభిస్తారు. ఇషార్ సింగ్ పోరాటంలో వీరమరణం పొందాక పఠాన్ నాయకుడు అంటాడు -  ఇతను నేలకొరిగాడని పగిడీ తీసి నేలమీద పారెయ్యకండని. ఇతడి మతాన్ని అగౌరవపర్చ కూడదన్న ఉద్దేశంతో. 

        దళంలో చివరి సైనికుడు చనిపోతూ, తమ మరణాన్ని పోరాట స్ఫూర్తిగా పెట్టుకున్న స్వాతంత్ర్య పోరాటంలో చనిపోయిన తన లాంటి వీరులకి నివాళిగా అర్పించక, నానక్ కీర్తనలు పాడి మరణిస్తాడు. ఇలా నిమిషానికో రకం సంకేతాలతో, సందేశాలతో సాగుతుందీ కాల్పనిక చరిత్ర చిత్రణ. లాజికల్ గా స్వాతంత్ర్య పోరాటంలో నేలకొరిగిన వీరులకి నివాళిగా సైనిక తత్వంతో  ప్రారంభించే పోరాటం, దారితప్పి జింగోయిజంగా మారిపోవడం కన్పిస్తుంది.

          సర్జికల్ స్ట్రయిక్  మీద తీసిన ‘యురీ’ లో సైనిక తత్వం తప్ప మతభక్తి, దేశభక్తి - వాటి జింగోయిజపు నినాదాలూ వుండవు. ఈ సరగర్హీ పోరాట గాథ,  ‘21 సర్ఫరోష్ - సరగర్హీ 1897’ అని  గత సంవత్సరం జింగోయిజం లేని పంజాబీ టీవీ సీరియల్ గా వచ్చింది. అన్ని మతాల వాళ్ళూ వుండే సైన్యానికి మతం వుంటుందా. 

          ఏవో రాజకీయ ఉద్దేశాలతో కల్పితాలు చేసి ‘కేసరి’ ని తీసినప్పుడు ఇంకోటి కూడా చేసి వుండాల్సింది. పోరాటం మధ్యలో చర్చల సందర్భం వస్తుంది. బలగం చాలని ఇషార్ సింగ్ ని లొంగిపొమ్మంటారు అవతలి పక్షం వాళ్ళు. అప్పుడు ఇషార్ సింగ్, ‘మీరు మత పోరాటంగా మార్చేశారు. మేమూ అలాగే మార్చాం. ఇది పోరాటంలో అకృత్యాలకి దారి తీస్తోంది. మత అల్లర్లుగా మారిపోయింది. ఇది చూసి ఇరువైపులా ప్రజలు మతోన్మాదులవుతున్నారు. ఇది మంచిది కాదు. మతం జగడం తేలేది కాదు. టైం వేస్టు. మీరు మతాన్ని పక్కనబెట్టి భూభాగం కోసం మాత్రమే పోరాడతామంటే మేమూ అలాగే పాయింటు మీద పోరాడతాం. ముందు ఇది తేలాలి. ఇది తేల్చడానికే ఇక ముందు చర్చలుంటాయి. తేలేదాకా కాల్పుల విరమణనే’ అని కూడా కల్పన చేసివుంటే కాంటెంపరరీగా ఇంకా బావుండేది. 
ఎవరెలా చేశారు 
     సూపర్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటన ఈ వయోలెంట్ పోరాట గాథకి హైలైట్. అన్యాయాన్ని, అవమానాన్నిసహించని ముక్కుసూటి వ్యవసాయదారుడైన తను సైనికుడయ్యాక అదే సంకల్పంతో కొనసాగుతూ ఆకర్షిస్తాడు. వూళ్ళో తల్లీ, భార్యా -  వాళ్ళతో అనుబంధమూ ఇవన్నీ సున్నితంగా ప్రదర్శిస్తాడు. క్రమశిక్షణ లేని దళాన్ని తీర్చిదిడ్డంలో జరిగే హాస్య ప్రహసనాల్లో మాత్రం సీరియస్ గా వుంటాడు. లెఫ్టినెంట్ తనని బదిలీ చేస్తూ అవమానించడంతో తనకి జ్ఞానోదయమైన భావాన్ని పటిష్టంగా ప్రదర్శిస్తాడు. మీరు బానిసలనీ,ఇక్కడి మట్టిలో పిరికిపందలే పుడతారనీ లెఫ్టినెంట్ అవమానించడాన్ని సీరియస్ గా పట్టించుకుని ఫీల్ ని పుట్టిస్తాడు. దేనికి మనం ప్రాణాల్ని త్యాగం చేయాలి? బ్రిటిష్ వాళ్ళ కోసమా? జీతాల కోసమా? యూనిఫామ్స్  కోసమా? - అని కేసరీ పగిడీ ధరించి వచ్చి, మన పోరాటం, ప్రాణత్యాగం స్వాతంత్ర్య పోరాటంలో అమరుల కోసమని అంటాడు. కానీ కేసరీ పగిడీతో మతప్రతిష్ట ఫీలై పోరాడతాడు. 

            గత సంవత్సరం పంజాబీలో ‘సజ్జన్ సింగ్ రంగ్రూత్’ అనే మూవీ విడుదలైంది. ఈ చారిత్రక కథలో సజ్జన్ సింగ్ అనే సిపాయి మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరపున జర్మన్లతో పోరాడి వీరమరణం పొందుతాడు. యుద్ధంలో పాల్గొంటున్నప్పుడు అతడి అంతర్మథనం ఒక్కటే - ఈ యుద్ధం గెలిస్తే ప్రతిఫలంగా బ్రిటిష్ ప్రభుత్వం భారత్ కి స్వాతంత్ర్యమిస్తుందా అన్నదే. మనల్నికబళించి పాలిస్తున్న ఇంగ్లీషు దొరల కోసం ప్రాణత్యాగం చేయడం అవసరమా అన్న ప్రశ్నని ప్రశ్నలాగే మిగిల్చి అమరుడవుతాడు. అంతేగానీ మతావేశం పూని పోరాడడు. 


          అక్షయ్ కుమార్ చివర ఒంటరిగా మిగిలి వేల మందితో చేసే పోరాటం నాటి ఇషార్ సింగ్ వీరపరాక్రమాన్ని కళ్ళకి కట్టినట్టు వుంటుంది. అయినంత మాత్రానా ఇషార్ సింగ్ మూర్తిమత్వాన్ని అల్లూరి సీతారామ రాజు మూర్తిమత్వాన్ని ప్రేక్షకుల్లో కృష్ణ ప్రతిష్టించినట్టుగా ప్రతిష్టించడంలో విఫలమయ్యాడు అక్షయ్. కనీసం చివరి డైలాగులైనా లేకుండా కన్ను మూస్తాడు. ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఇషార్ సింగ్ ని ప్రతిష్టించలేక పోవడానికి కారణం పాత్ర చిత్రణే అలా వుండడం. కాషాయీకరణ జరగడం. అల్లూరిని ప్రజలు ఎంత దైవంలా కొలిచి పాటలు పాడినట్టు సినిమాటిక్ గా చిత్రీకరించినా, అల్లూరి అలా ఫీలై పోరాటం చేయడు. ఒక విప్లవకారుడి స్పష్టతతోనే పోరాడతాడు. అక్షయ్ ఇషార్ సింగ్ పాత్రకి సైనిక స్ఫూర్తి కొరవడింది. లేకపోతే అతనెంత గొప్ప సైనికుడో మర్చిపోలేని ముద్రవేసేవాడు. 

          ఇషార్ భార్య జీవనీ కౌర్ పాత్రలో పరిణీతీ చోప్రాది పరిమిత పాత్ర. ఆమె అప్పుడప్పుడు మాత్రమే కన్పిస్తుంది. ఆమె పూర్వమెప్పుడో చనిపోయిందని చరిత్ర చెప్తోంది. అందుకే చివర్లో ఇషార్  మరణించినప్పుడు సమూహంలో నిలబడి చూస్తూంటుందే గానీ దగ్గరికి రాదు. ఆమె ఆత్మరూపం. అంతవరకూ ఆమెతో మనం చూసిన సన్నివేశాలన్నీ ఇషార్ వూహల్లో ఆమె ఆత్మరూపం. మంచి క్రియేటివ్ అయిడియాతో ఈ చిత్రణ. 

       దళంలో ప్రతీ ఒక్కరూ ఫస్టాఫ్ లో వాళ్ళ వెర్రితనాలతో  కామెడీలు చేస్తారు. కోడి పందాలతో మొదలయ్యే వీళ్ళ కామెడీ సీక్వెన్స్ - ఆ కోడి పుంజుల ముందే తాము కోళ్ళుగా పోట్లాడుకునే శిక్షగా, ఆ తర్వాత ఆ కోడి పుంజుల్ని కూరొండేసుకున్నందుకు, అన్నపానీయాలు లేని రెండు వారాల కఠిన శిక్షగా అనుభవించే దాకా నవ్విస్తూ సాగుతుంది.  

          ఇషార్ దళంలో పఠాన్ వంటవాడుగా పొట్టి బ్రహ్మామిశ్రా వుంటాడు. పోరాటం జరుగుతున్నప్పుడు, ‘నేను పఠాన్ ని కాబట్టి పఠాన్లతో పోరాడలేననా?’ అని ఇషార్ ని ప్రశ్నిస్తాడు. ‘నువ్వు ఎవరు గాయపడితే వాళ్లకి మంచి నీళ్ళు అందించు’ అంటాడు ఇషార్. ‘శత్రువులకి మంచి నీళ్ళిచ్చి నేను బ్రతికించను’ అంటాడు. శత్రువుని చంపితే శత్రువే చస్తాడు, మంచి నీళ్లిస్తే శత్రుత్వం నశిస్తుందంటాడు ఇషార్ సింగ్. గాయపడ్డ శత్రువులకి మంచి నీళ్ళిస్తూంటే చంపేస్తాడు ముల్లా.

          అల్లా కోసమని మధ్యలో దూరే ముల్లా సైదుల్లాగా రాకేష్ చతుర్వేదీ ఓం ఎక్సెలెంట్ గా నటిస్తాడు. ముల్లాగిరీని డిప్లమటిక్ గా పోషిస్తాడు. పఠాన్ సైనిక నాయకులుగా మీర్ సర్వర్, అశ్వథ్ భట్ లు ఆఫ్ఘనీ రూపురేఖలతో పర్ఫెక్ట్ గా వుంటారు. దళంలో వార్తాహరుడుగా వుండే పిరికివాడైన గురుముఖ్ సింగ్ పాత్రలో సుమీత్ సింగ్ బస్రా చివరి సన్నివేశాల్లో హైలైట్ అవుతాడు. నిజానికి ఇతడితో ఓ క్లయిమాక్స్, అక్షయ్ తో ఓ క్లయిమాక్స్ అన్నట్టుంటుంది సినిమా. 

చివరికేమిటి
      దర్శకుడు అనురాగ్ సింగ్ కేవలం 80 కోట్లతో ఇంత భారీ పోరాట యాక్షన్ తీయడం రికార్డే. సెకండాఫ్ గంటన్నర పాటూ ఏకబిగి, సుదీర్ఘ పోరాట దృశ్యాలు కాలీన స్పృహతో వాస్తవ దృశ్యాలన్పించేలాగే తీశాడు. చరిత్రని ఎంత కల్పితం చేసినా కృతకమైన డిజైనర్ చరిత్రలా చిత్రీకరించలేదు. ఎక్కాడా గ్రాఫిక్స్ వున్నట్టే అన్పించదు. పైగా వాడిన ఆయుధాలు ఆ కాలంలో ఏవైతే వుండేవో అవే సింగిల్ లోడెడ్ తుపాకులు, తూటాలు, మామూలు కత్తులు, తల్వార్లు, నాటు బాంబులు మాత్రమే చూపించాడు. ‘పద్మావతి’ లో లాగా, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో లాగా చిత్ర విచిత్ర నమ్మశక్యంగాని టెక్నాలజీలతో డిజైనర్ ఆయుధాలూ, వాహనాలూ, వీటితో సర్కస్ ప్రదర్శన చేస్తున్నట్టు డిజైనర్ పోరాట దృశ్యాలూ లేకుండా, పక్కా నేటివ్, సహజ మాస్ లుక్ తో దృశ్యాల్ని సృష్టించి ఆ కాలంలోకి తీసికెళ్ళాడు. అక్షయ్ కుమార్ దుర్బిణీని తుపాకీకి కట్టి టెలిస్కోపిక్ రైఫిల్ గా మార్చుకోవడంలో కూడా డిజైనర్ లుక్  వుండదు. ఇక ఆఫ్ఘన్ వైపు ముగ్గురు నాయకుల గుర్రాలు తప్ప ఇంకే గుర్రాలూ ఏనుగులూ, మోటారు వాహనాలూ వుండవు. వేలమంది కాలినడకనే వస్తారు. లారెన్స్ ఉడ్ వర్డ్, పర్వేజ్ షేక్ లు సృష్టించిన అద్భుత యాక్షన్ కొరియోగ్రఫీలో కూడా నమ్మశక్యంగాని విన్యాసాల్లేవు. 

          మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ లలోని అనంతమైన ఎడారిమయమైన కొండ ప్రాంతాల్లో లొకేషన్స్ ఒకెత్తు. పీరియడ్ లుక్ రావడానికి చేసిన డీఐ కూడా, దానికి తగ్గ కాస్ట్యూమ్స్ కలర్స్ కూడా కూల్ గా వుంటాయి. సుబ్రతా చక్రవర్తి, అమిత్ రేల ప్రొడక్షన్ డిజైనింగ్, అన్శుల్ చోబే కెమెరా వర్క్ చాలా గొప్ప కళాత్మకతలు.

          ఆరుగురు సంగీత దర్శకుల పాటలు అక్కడక్కడా నేపథ్యంలో బిట్ సాంగ్స్ గా వుంటాయి గానీ, రాజూ సింగ్ ఇచ్చిన నేపథ్య సంగీతం మాత్రం కట్టి పడేస్తుంది. 

          ఒక్కటే సమస్య. జింగోయిజం. రాజకీయ కేసరీయం. ఎన్నికల కంగాళీయం. ఆగస్టు పదిహేనున విడుదల చేయమని అక్షయ్ కుమార్ అంటే, అప్పుడెవరూ చూడరని ఇప్పుడే విడుదల చేయడం. ప్రేక్షకులు షహీద్ హవల్దార్ ఇషార్ సింగ్ చరిత్ర చూడాలంటే కూడా ఫలానా ఒక ఇలాటి టైంలోనే చూడాలన్న మాట. ప్రతీ యేటా లండన్లోని ఆర్మరీ హౌస్ లో బ్రిటిష్ ఆర్మీ నాటి సరగర్హీ సిక్కు అమర సైనికులకి శ్రద్ధాంజలి ఘటిస్తూనే వుంటుంది. 1897 లోనే ఈ పోరాట యోధులకి బ్రిటన్ అత్యున్నత ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని ప్రకటించింది. విక్టోరియా రాణి వేనోళ్ళ కొనియాడింది. ఇండియాలో ఈ దళం గుర్తే లేదు. ఎన్నికలప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించాలి...

సికిందర్
Watched at Prasads,
7.30 pm, 21 March, 2019

Ps : సరగర్హీ పోరాట కారణం సినిమాలో చూపించినట్టు ఇషార్ సింగ్ ఆఫ్ఘన్ స్త్రీని రక్షించడం కాదు. ఖైబర్ పాస్ కి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వంతో తేడాలొచ్చి దాడులు చేశారు ఆఫ్ఘన్లు.


Thursday, October 19, 2023

1368 : రివ్యూ


 

రచన- దర్శకత్వం : అనిల్ రావిపూడి
తారాగణం : బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రామ్ పాల్, శరత్ కుమార్, రఘుబాబు తదితరులు
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : సి. రాంప్రసాద్
బ్యానర్ : షైన్ క్రియెషన్స్, నిర్మాతలు : గారపాటి సాహు, పెద్ది హరీష్
విడుదల : అక్టోబర్ 19, 2023
***

        ఖండ, వీర సింహారెడ్డి జంట విజయాల తర్వాత బాలకృష్ణ నుంచి భగవంత్ కేసరి దసరా కానుకగా అందింది. ఈసారి బాలకృష్ణ కామెడీ ట్రాకులతో కమర్షియల్ యాక్షన్ మసాలాలు తీసే దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి ఓ భిన్నమైన ప్రయత్నం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం మెప్పించిందా? ప్రయత్నం మంచిదే అయినా విషయం బావుందా? విషయం బావున్నా చెప్పడం బావుందా? ఇవి తెలుసుకుందాం...

కథ

    ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న భగవంత్ కేసరి (బాలకృష్ణ)  అనుకోని ప్రమాదంలో ఓ ఎస్సై (శరత్ కుమార్) చనిపోవడంతో, అతడి కూతురు విజ్జీ (శ్రీలీల) ని పెంచుకుంటాడు. ఆమె తండ్రి కోరిక ప్రకారం ఆమెని ఆర్మీ లో చేర్పించే సంకల్పంతో వుంటాడు. ఇద్దరి మధ్య తండ్రీ కూతుళ్ళ అనుబంధమేర్పడుతుంది. అయితే తండ్రి మరణంతో ఒక ఫోబియాకి లోనైన విజ్జీ ఆర్మీలోచేరేందుకు ఒప్పుకోదు. ఇంతలో ఒక టాప్ బిజినెస్ మాన్ రాహుల్ సాంఘ్వీ (అర్జున్ రామ్ పాల్) డిప్యూటీ సీఎం (శుభలేఖ సుధాకర్) ని చంపి డిప్యూటీ సీఎం పియ్యే (బ్రహ్మాజీ) దృష్టిలో పడేసరికి అతడ్ని చంపేందుకు వేట మొదలెడతాడు. ఈ వేటలో అతడికి అతడికి విజ్జీమీద అనుమానం కలిగి ఆమెని టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు భగవంత్ కేసరి విజ్జీని కాపాడుకుని, పాత శత్రువు సాంఘ్వీని అంతమొందించేందుకు ఎలా పోరాటం మొదలెట్టాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

    జైలర్ రజనీకాంత్ బాటలో బాలకృష్ణ ఇమేజి చట్రం లోంచి బయటికొచ్చి వయస్సుకి తగ్గ పాత్ర నటించిన కథ ఇది. జైలర్ లోలాగే కామెడీలు, డ్యూయెట్లూ, వీర హీరోయిజాలు, పంచ్ డైలాగులు, మాస్ బిల్డప్పులు, ఎలివేషన్లూ లేకుండా, సీదా సాదా కంటెంట్ రిచ్ సెంటిమెంటల్ యాక్షన్ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన వూర మాస్ సినిమాల చట్రం లోంచి బయటికొచ్చి కాన్సెప్ట్ ప్రధానప్రయత్నం చేశాడు. కాన్సెప్ట్ వచ్చేసి స్త్రీ స్వశక్తీ కరణకి సంబంధించింది. ఆడపిల్లలు సింహంలా వుండాలని బాహాటంగానే సందేశమివ్వడం. అయితే ఈ కాన్సెప్ట్ ఒక పక్క, ఇంకో పక్క విలన్ తో పగ - రెండూ కలిసి ఒక వొరలో ఇమడలేక పోయాయి. దీంతో స్త్రీ స్వశక్తీ కరణ అంశం గల్లంతై పోయింది.
        
ఈ స్త్రీ స్వశక్తీ కరణని కూడా హీరోయిన్ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నంగా వుంది. చిన్నప్పట్నుంచీ ఆమె ఏం కావాలని కోరుకుంటోందో తెలుసుకోకుండా ఆర్మీలో చేరు, ఆర్మీలో చేరూ అని ఒకటే టార్చర్ పెట్టడం బ్యాడ్ పేరెంటింగ్ అన్పించేలా వుంది. తండ్రి మరణంతో ఆమె మానసికంగా ఒక ఫోబియాతో బాధపడుతోంటే దీనికి ట్రీట్ మెంట్ ఇప్పించకుండా, శారీరకంగా బలంగా ఎదగమని కఠిన శిక్షణకి గురి చేయడం ఇంకో బ్యాడ్ టేస్ట్.
        
కథలో సైకాలజిస్టు పాత్ర (కాజల్ అగర్వాల్) వున్నప్పటికీ కూడా ట్రీట్ మెంట్ ఇప్పించే ఆలోచనే  రాదు. ఆర్మీలో చేరితేనే బలవంతురాలవుతుందను కోవడం ఏమిటో కూడా అర్ధంగాదు. మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి, వూరి చివర కరాటే శిక్షణ ఇప్పిస్తే పోయేదానికి. ఇప్పుడు సైన్యంలో చేరాలన్నా నాల్గేళ్ళ అగ్నివీర్ కొలువు తప్ప ఏం లేదు.
        
ఈ అసమగ్ర కాన్సెప్ట్ కి నెంబర్ వన్ గా ఎదగాలన్న విలన్ సొంత గొడవల కథ అడ్డుపడితే, ఇది కూడా కథ కుదరక విలన్ చాలా బలహీనంగా మారిపోయాడు. ఇలావుంటే, మెయిన్ కాన్సెప్ట్ స్త్రీ స్వశక్తీ కరణకి – చైల్డ్ ఎబ్యూజ్ ని కూడా తెచ్చి కలిపేశారు. ఈ రెండూ పరస్పర సంబంధం లేనివి. దీనిమీదా స్కూలు పిల్లల ముందు లెక్చరివ్వడం. ఇలా అసలు కథ ఎక్కడికక్కడ లయ తప్పి అపశ్రుతులు పలకడం.కంటెంట్ రిచ్ సినిమా అంటే రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్ తీసేసి, అందులో ఏవేవో కంటెంటులు కలపడం కాదేమో!

నటనలు - సాంకేతికాలు

    పెద్దరికం వహించే పాత్రలో బాలకృష్ణ ప్రత్యేకంగా కన్పించే సినిమా ఇది. పైగా తెలంగాణ పాత్ర. ఆదిలాబాద్ కి చెందిన ఈ పాత్రలో తెలంగాణ డైలాగులు చెబుతూ ఎబ్బెట్టుగా ఏం లేడు బాలకృష్ణ. పైగా పవర్ఫుల్ గా వున్నాడు. ప్రతీ సీనులో (కాజల్ అగర్వాల్ తో తప్ప) ప్రభావశీలంగా వున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ ఇన్స్ పెక్టర్ గా కూడా తన రొటీన్ పౌరుషాల నటనకి పోకుండా అదుపు చేసుకున్నాడు.
        
కానీ బలహీన విలన్ తో యాక్షన్ కథ అంతంతమాత్రమే. ఇక పెంపుడు కూతురితో బాండింగ్ కి పిలుపులే అడ్డుపడ్డాయి. చిన్నప్పట్నుంచీ పెంచుకుంటున్నప్పుడు అది తండ్రీ కూతుళ్ళ సంబంధమై పోవాలి. ఆమె చిచ్చా (చిన్నాన్న) అని పిలవడంతో బాండింగులు, ఎమోషన్లు ఉపరితలంలోనే వుండిపోయాయి. నాన్నా అని పిలిచి వుంటే ఆడియెన్స్  ఎక్కువ బాండింగ్, ఎమోషన్లు, ప్రేమలు ఫీలయ్యేవాళ్ళు. సినిమా చివర్లో ఎప్పుడో నాన్నా అనుకుంటుంది. ఈ ఆలస్యానికి అది పండని డ్రామా అయిపోయింది.
        
ఇక బాలకృష్ణ యాక్షన్ సీన్సు ఎందుకో ఈలలు వేయించేలా లేవు. హింస మాత్రం జైలర్ కి కొంచెం తక్కువ లెవెల్లో వుంది. తలకాయల నరికివేతలు లేవు. ఒకే పాట బా లకృష్ణ డాన్సుతో వుంది. గణేష్ ఉత్సవం పాట. ఈ పాట డాన్సులకి గొప్పగా చెప్పుకునే   శ్రీలీల స్కిల్స్ కనిపించకుండానే ముగిసిపోయింది.
        
ఈసారి శ్రీలీలకి చెప్పుకోదగ్గ ప్రధాన పాత్ర దక్కింది. కూతురి పాత్రలో స్ట్రగుల్ చేస్తూ భిన్న పార్శ్వాల్ని ప్రదర్శించింది. అయితే సానుభూతి పొందే సన్నివేశాలు లేకపోవడం ఆమెకి మైనస్. ఆమె పాత్రతో వున్న కాన్సెప్ట్ ఇతర ప్రస్తావనలతో కంటిన్యూటీ దెబ్బతినడం కారణం.
        
బాలకృష్ణని ప్రేమిస్తూ వుండే కాజల్ అగర్వాల్ తో లవ్ ట్రాక్ నవ్వించే బదులు జాలి పుట్టించేలా వుంది. ఇంతకీ సైకాలజిస్టుగా ఆమె చేసిందేమిటో అర్ధం గాదు. ఆమె సైకాలజిస్టు పాత్రే తప్పేమో. ఆమె వైద్యం చేసే క్లినిక్ పెడితే సైకియాట్రిస్టు అవ్వాలి. ఇక విలన్ అర్జున్ రామ్ పాల్ చేసిందేమీ లేదు. పైగా అతడి సొంత కథతో వేరే ట్రాకు చాలా సినిమా నడుస్తుంది. ఎప్పుడైనా మెయిన్ కాన్సెప్ట్ స్త్రీ స్వశక్తీ కరణకి వచ్చి అడ్డుతగులుతా డనుకుంటే అదే జరగదు.
        
ఈ సినిమాలో పాటలకి ప్రాధాన్యం లేదు. కాబట్టి తమన్ సంగీతం అలంకారప్రాయంగా వుండిపోయింది. సీనియర్ కెమెరా మాన్ సి. రామ్ ప్రసాద్  ఛాయాగ్రహణం ఒక ఆకర్షణగా చెప్పుకోవాలి. మిగతా ప్రొడక్షన్ విలువలు బాలకృష్ణ స్థాయికి తగ్గి ఎలా వుంటాయి. సినిమాలో డైలాగుల మీద మంచి కృషి చేసినట్టుంది- బంజారా హిల్సు, జూబిలీ హిల్సు, చిచ్చా కొడితే మెడికల్ బిల్సు

చివరికేమిటి

    చెప్పాల్సిన కథ ఒకటైతే దానికేదేదో కలిపి ఏమేమో చెప్పారు. ప్రారంభంలో ఇంకో గొడవ వుంటుంది. ముంబాయిలో హైకోర్టు చీఫ్ జస్టిస్ (సంజయ్ స్వరూప్) ప్రభుత్వం నుంచి ప్రాణ భయంతో ఫ్యామిలీని తీసుకుని స్లమ్స్ లో దాక్కుందాడు. రక్షించడానికి ఒక స్నేహితుడు వచ్చి భగవంత్ కేసరి కథ చెప్పడం మొదలెడతాడు.
        
ఫస్టాఫ్ బాలకృష్ణ శ్రీలీలని పెంచడం, మరోవైపు కాజల్ అగర్వాల్ బాలకృష్ణ వెంటపడడం జరుగుతూ వచ్చి, మధ్యలో విలన్ కథ మొదలై, అతను డిప్యూటీ సీఎంని చంపి, శ్రీలీల వెంటబడడంతో- బాలకృష్ణ అడ్డుకునే సీనుతో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండాఫ్ బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. ఇందులో విలన్ తో పాత పగ బయటపడ్డాక- ఫ్లాష్ బ్యాక్ ముగిసి- బాలకృష్ణ శ్రీలలకి ట్రైనింగ్ ఇప్పించే దృశ్యాల తర్వాత విలన్ తో క్లయిమాక్స్.
        
శ్రీలీలకి బలవంతపు ట్రైనింగ్. ఇలా కాకుండా, విలన్ తో ఆమె పడ్డ ప్రమాదానికి నువ్వే ఎదుర్కొమని బాలకృష్ణ మోటివేట్ చేసివుంటే, ఆమె కేర్పడే గోల్ ఆమె సొంత గోల్ అయ్యేది. మరొకరి గోల్ కోసం బతకకుండా. కథా కథనాల లోపాల వల్ల భగవంత్  కేసరి అందుకోవాల్సిన  స్థాయిని మాత్రం అందుకోలేక పోయింది.

—సికిందర్

 

Monday, April 21, 2025

1376 : రివ్యూ!

 

కేసరి -2                                            
దర్శకత్వం : కరణ్ సింగ్ త్యాగి
తారాగణం : అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండే, రేజీనా కాసాండ్రా
రచన : కరణ్ సింగ్ త్యాగి, అమృతపాల్ సింగ్ బింద్రా, మాటలు : సుమిత్ సక్సేనా
సంగీతం : శాశ్వత్ సచ్‌దేవ్, కవితా సేథ్ - కనిష్క్ సేథ్, ఛాయాగ్రహణం : దేబోజిత్ రే, సైమన్ పైస్లే డే, అమిత్ సైయల్ తదితరులు.
బ్యానర్స్ : ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాతలు : హీరూ యష్ జోహార్, అరుణా భాటియా, కరణ్ జోహార్, అదర్ పూనావల్ల
అపూర్వా  మెహతా, అమృత్ పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ
విడుదల : ఏప్రిల్ 18, 2025
***

      వసబెట్టి 14 మంది ఎలాన్ మస్క్ కన్నసంతానంలా జోరుగా 14 పరాజయాలు చవిచూశాక, తిరిగి కంటెంట్ కింగ్ అన్పించుకుంటూ అక్షయ్ కుమార్ బాక్సాఫీసు ఢంకా మోగిస్తున్నాడు. హిందీ సినిమాల కంటెంట్ అనేది హిందీ ప్రేక్షకులకి అంటరానిదై పోయి, సొంతంగా ఏ కంటెంట్ ని ఎలా క్రియేట్ చేసి పూర్వ వైభవం తెచ్చుకోవాలో తెలియని గందరగోళ వాతావరణ పరిస్థితుల్లో, రెండే ఆదుకుంటున్నాయి : హిస్టారికల్స్ లేదా ప్రాపగాండా సినిమాలు. వీటికి సొంతంగా కథలు ఆలోచించనవసరం లేదు,  సొంతంగా ఆలోచిస్తే కొంపలు మునుగుతున్నాయి ఆలోచించడం రాక. అందుకని హిస్టారికల్స్ లేదా ప్రాపగాండా వంటి సర్క్యులేషన్ లో వున్న రెడీ మేడ్ కంటెంట్ నే మంచి లాభసాటి బేరంగా ఎంచడం మొదలెట్టారు. ఇది బాక్సాఫీసులో రుజువు కావడంతో ఎక్కడెక్కడ ఇలాటి కంటెంట్ వుందో వెతకడం మొదలెట్టి వుంటారు- అప్పుడు దొరికిందే అయివుంటుంది 'కేసరి 2' కి అనువైన ఈ హిస్టారికల్ కంటెంట్. ఇది హిస్టారికలే గానీ హిస్టరీతో ముడిపడి వున్న ఒక ప్రముఖుడి బయోపిక్ కూడా. ఎవరా ప్రముఖుడు, ఏమిటా హిస్టరీ ఈ కింద తెలుసుకుంటూ వెళ్దాం...

కథ

1914 మొదటి ప్రపంచ యుద్ధ కాలం. యుద్ధంలో పాల్గొనడానికి బ్రిటిష్ సైనికుల కొరత ఏర్పడింది. బ్రిటిష్ పాలకులు ఒక వాగ్దానం చేశారు- మీ యువకుల్ని మా సైన్యంలో చేర్పిస్తే, యుద్ధం ముగిశాక మీకు స్వాతంత్ర్యం ఇచ్చేస్తామని. దీంతో వేలమంది యువకులు బ్రిటిష్ సైన్యంలో చేరిపోతారు. కానీ యుద్ధం ముగిశాక బ్రిటిష్ పాలకులు మాట తప్పుతారు.  అసలు పంజాబ్ నుంచి ఎక్కువమంది యువకులు వెళ్ళి యుద్ధంలో మరణించారు. దీంతో పంజాబ్ లో వ్యతిరేకత మొదలవుతుంది. ప్రొఫెసర్ కిర్పాల్ సింగ్ నేతృత్వంలో బ్రిటిష్ వ్యతిరేక ఆందోళన మొదలవుతుంది.
        
ఏప్రిల్ 13, 1919న రౌలట్ చట్టానికి (పోలీసులు కారణం లేకుండా ఎవర్నైనా అరెస్ట్ చేసే  అధికారాన్నికల్పించిన చట్టం) వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అమృత్సర్‌లోని జలియావాలా బాగ్‌లో నిరసనకారుల బృందం శాంతియుతంగా సమావేశమవుతుంది. ఇంతలో జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హేరీ డయ్యర్ సాయుధ దళాలతో స్థలానికి చేరుకుని, ఎలాటి హెచ్చరిక లేకుండా నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపమని ఆదేశిస్తాడు. చిన్న పిల్లలూ స్త్రీలు సహా మొత్తం 1650 మంది ఆ కాల్పుల్లో మరణిస్తారు.
        
ఈ ఘోరం గురించి పత్రికలు ఏమీ రాయకుండా తెల్లదొరలు అడ్డుకుంటారు. ఆ నిరసనకారులు సాయుధ ఉగ్రవాదులనీ చెప్తూ, వాళ్ళు దాడి చేస్తూంటే కాల్పులు జరపాల్సి వచ్చిందనీ తప్పుడు వార్త అందిస్తారు.  దీంతో ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఉద్రిక్తత పెరిగిపోవడంతో బ్రిటిష్ ప్రభుత్వం దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొని- మృతుల కుటుంబాలకి 25 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తూనే, ఈ విషయంపై దర్యాప్తుకి  ఆదేశిస్తుంది. అది లోపాయికారిగా బోగస్ దర్యాప్తు. ఇప్పుడు ఇటీవలే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి  నైట్‌హుడ్ అవార్డు పొందిన సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్) అనే బారిష్టర్, జనరల్  డయ్యర్ ని కాపాడే బోగస్ దర్యాప్తు చేపడతాడు.
       
ఈ దర్యాప్తు
 కమిషన్‌లో బ్రిటిష్ న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం వున్న ఏకైక భారతీయుడు సర్ సి శంకరన్ నాయర్. పెద్ద దొర  ఇప్పటికే అతను తమ కీలుబొమ్మగా వ్యవహరిస్తాడని భావిస్తాడు. దర్యాప్తు సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలని  అణిచివేస్తుంది. ఈ సమయంలో, నాయర్ దృష్టి 13 ఏళ్ళ  విప్లవ బాలుడు పర్గత్ సింగ్ (కృష్ణారావు) పైన పడుతుంది. ఆ విప్లవ బాలుడితో నాయర్ కి  పాత సంబంధమేదో వుంటుంది. కాల్పుల్లో కాపాడమని నాయర్ నే పిలుస్తూ అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇది నాయర్ ని కదిలిస్తుంది. దీంతో కమిషన్ కి వ్యతిరేక రిపోర్టు ఇచ్చి, జనరల్ డయ్యర్ ని శిక్షించేందుకు న్యాయ పోరాటానికి దిగుతాడు.
       
ఈ న్యాయ పోరాటంలో తవ్వి తీసిన నిజాలేమిటి
? కేవలం రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు గుమికూడారన్న కారణంతో జనరల్ డయ్యర్ ప్రజల్ని కాల్చి చంపాడా? లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద కారణముందా? ఆ పెద్ద కారణంతో తనే పథకం ప్రకారం ప్రజల్ని జలియావాలా బాగ్ కి వచ్చేలా చేసి, ఆ ప్రజల మీద కక్ష తీర్చుకున్నాడా? ఏమిటీ ఘోర కృత్యం వెనుకవున్న అసలు కారణం? దీన్ని నాయర్ ఎలా బయటికి తీసి డయ్యర్ మీద నేరాన్ని నిరూపించాడు? ఇందులో జూనియర్
దిల్రీత్ గిల్ (అనన్య పాండే) ఎలా తోడ్పడింది? బ్రిటిష్ ప్రభుత్వం తరపున రంగంలోకి దిగిన భారతీయ సంతతికి చెందిన న్యాయవాది నెవిల్ మెకిన్లే (ఆర్ మాధవన్) జనరల్ డయ్యర్ ని కాపాడుతూ, బారిష్టర్ నాయర్ ని ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు? ఇతడి కుట్రల ఫలితంగా న్యాయవాద వృత్తిలో పూర్తిగా పతనమై దోషిగా నిలబడ్డ నాయర్ తిరిగి ఎలా విజయం సాధించాడు? ...ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

బ్రిటిష్ పాలనా వ్యవస్థలో భాగంగా వుంటూనే దాని పునాదుల్ని కదిలించిన వ్యక్తి కథ ఇది. ఒకప్పుడు బ్రిటిషర్లకి విధేయుడిగా వున్నఈ వ్యక్తి తిరుగుబాటుదారుడిగా మారి, ఆ తర్వాత  తిరుగులేని పోరాటాన్ని ప్రారంభించాడు. జలియావాలా మృతుల న్యాయం కోసం న్యాయస్థానంలోనే బ్రిటిష్ పాలకుల్ని ఓడించాడు. ఇది కేరళకి చెందిన బారిష్టర్ సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ జీవిత కథ. రఘు పలాట్- పుష్ప పలాట్ లు కలిసి రాసిన 'ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్: వన్ మ్యాన్స్ ఫైట్ ఫర్ ది ట్రూత్ ఎబౌట్ ది జలియావాలా బాగ్ మాసకర్' అనే 2019 లో వెలువడిన పుస్తకం ఆధారంగా తెరకెక్కింది.

ఈ కథ గొప్ప భావోద్వేగాల వెల్లువలా ప్రత్యక్షమవుతుంది. ప్రతి సన్నివేశంలోనూ బాధ, కన్నీళ్ళూ, ఆక్రందనలు, ఆత్మీయుల్ని కోల్పోవడం వల్ల కలిగే దుఖామూ అనే మానవ దుస్థితిని కళ్ళకి కడుతుందీ కథ. ఊచకోత జరిగే మొదటి సన్నివేశం నుంచే కళ్ళని తడి చేయడం ప్రారంభించే ఈ కథ, సస్పెన్స్ ని జోడించుకున్న కథనంతో వేగంగా పరుగులెత్తి, కేవలం రెండు గంటల్లో ముగిసిపోతుంది. ప్రారంభం అత్యున్నత స్థాయిలో వుంటే, ముగింపు కూడా  తక్కువేమీ కాదు. ముగింపుకి చప్పట్లు కొట్టడం, ఈలలు వేయడం ప్రేక్షకులనుంచి వచ్చే సహజ ప్రతిస్పందనే.

మామూలుగా చూస్తే ఇదొక హీరో విలన్‌తో పోరాడే సాధారణ కథలా అనిపించవచ్చు, కానీ దీని డెప్త్ లో అంచెలంచెలుగా మొత్తం ఈ దేశపు పోరాట కథ బయటపడుతూంటుంది. ఒకటొకటే  నిజాలు బయటపడుతున్న కొద్దీ కదలకుండా కట్టి పడేస్తుంది.
        
ఈ కథకి గుండె కాయ- డయ్యర్ ఎందుకు కక్ష గట్టాడన్న ప్రశ్నే. రామ నవమికి హిందూ ముస్లిములు ఏకమై సంబరాలు జరుపుకోవడం అతడి కెందుకు కంటగింపు కావాలి? 1857 లో జరిగిన మొదటి స్వాతంత్ర్య  పోరాటం- తిరుగుబాటు చూశాక అప్రమత్తమైన బ్రిటిష్ పాలకులు- అందులోంచి ఒక కుటిల నీతిని కనుగొన్నారు. చిట్టచివరి మొఘల్ బహదూర్ షా జాఫర్ ని  తమ నాయకుడిగా ఎన్నుకుని, ఝాన్సీ లక్ష్మీ బాయి సహా రాజులందరూ జరిపిన తిరుగుబాటు చూశాక- ఇలా హిందూ ముస్లిములు ఒకటైతే తమ పప్పులు ఉడకవని, విభజించి పాలించు అనే కుటిల నీతికి తెర తీశారు బ్రిటిష్ పాలకులు.

 జనరల్ డయ్యర్ కి ఆ రామనవమి సంబరాల్లో ఈ కుటిల నీతి పారడం లేదని అర్ధమై - వీళ్ళకి బుద్ధి చెప్పాలని- మానసిక సంతులనం కోల్పోయిన ఒక సైకోలా- జాలియావాలా బాగ్ ఊచకోతకి పాల్పడ్డాడు. అయితే ప్రజల్ని మభ్యపెట్టి ఆ ప్రదేశానికి రప్పించడానికి ఎంత తెలివైన పథకం వేశాడనేది- ఏ పోలిటికల్ థ్రిల్లర్ సినిమాకి/నవలకీ తీసిపోదు. ఇది చూసి తీరాల్సిందే. ఈ కుట్ర మొత్తాన్నీ బారిష్టర్ నాయర్ ఎలా విప్పి, డయ్యర్ మొహానే వేసి కొట్టాడనేదీ కూడా తెర మీద చూడాల్సిందే. తన కుట్ర కోసం డయ్యర్ మిషనరీ స్కూల్లో ఒక ఉత్తుత్తి రేప్ ని క్రియేట్ చేసే ఎపిసోడ్ మతి పోగొడుతుంది.
        
ఫస్టాఫ్ ఊచకోత, కోర్టు విచారణ, విచారణలో నాయర్ ప్రభుత్వ వాదనని ముక్కచెక్కలు చేయడం, దీంతో బ్రిటిష్ తరపున నెవెల్ మేకిన్లే దిగడం తో ఇంటర్వెల్ వస్తుంది. ఇక సెకండాఫ్ లో నాయర్, మెకిన్లేల మధ్య సంఘర్షణాత్మక కోర్టు రూమ్ డ్రామా ఇద్దరికీ ఎదురు దెబ్బలు తగిలే మలుపులు తిరుగుతూ - చివరి అరగంట నాయర్ పతనావస్థతో ఈ కథ ఎలా ముగుస్తుందా అన్న అంతుపట్టని మిస్టరీ క్రియేటవుతుంది. ఈ దశలోనే ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన విప్లవ బాలుడితో నాయర్ సంబంధం వెల్లడవుతుంది. ఇక ముగింపు విజయం వైపుగా నాయర్ దూకుడుతో థ్రిల్ చేస్తుంది.

నటనలు సాంకేతికాలు 

అక్షయ్ కుమార్ కేరళకి చెందిన బారిస్టర్ నాయర్ గా కాకుండా పూర్తిగా నార్త్ క్యారక్టర్ గానే కనిపిస్తాడు. అంటే బయోపిక్ పాత్రని ఫిక్షనల్ పాత్రలా నటించేశాడు. సౌతిండియన్ నాయర్ గానే కనిపించివుంటే, హిందీ స్లాంగ్ మారి భాషాపరమైన అందం చేకూరేది. పంజాబీ పాత్రలు పంజాబీ యాసలో హిందీ మాట్లాడుతున్నప్పుడు, మలయాళీ పాత్ర నాయర్ మలయాళం యాసలో  హిందీ మాట్లాడి వుంటే, మేకప్ కూడా మలయాళీలా వుండుంటే సహజత్వం ఉట్టి పడేది.
       
బారిష్టర్ గా పాత్రని నీటుగా పోషించాడు. బ్రిటిషర్ల మీద తిరగబడి బ్రిటిష్ కోర్టులో బ్రిటిషర్లని దోషులుగా నిరూపించే ముళ్ళదారి వంటి జర్నీని
, పోరాటాన్నీ సమర్ధవంతంగా పోషించాడు. అప్పుడప్పుడు రగిలిపోయి పేల్చిన డైలాగులూ హైలైటయ్యాయి-
Get The F#&k Out My Country!’ అన్నది బాగా వైరల్ అవుతున్న డైలాగు.
        
డైలాగ్ డెలివరీ పట్ల అక్షయ్ తరచుగా ఎదుర్కొనే ఆరోపణ- అతను టెలిప్రాంప్టర్ చూసి డైలాగులు చెప్పడం వల్ల ఫ్లో బ్రేక్ అవుతోందని. ఈసారి బయోపిక్ పాత్రతో అలా జరగలేదు. డైలాగుల్ని అభినయంలో భాగం చేసుకుంటూ చెప్పడం వల్ల తేడా కనిపిస్తోంది. ప్రత్యర్ధి పాత్రలో మాధవన్ తో అంత హోరాహోరీ ఎమోషనల్ సంఘర్షణ వుండదుగానీ, ఉన్నంత వరకు కోర్టు సీన్లు నిలబెట్టాడు అక్షయ్.

భార్య పార్వతిగా రెజీనాది ఐదారు సీన్లలో కన్పించే చిన్నపాత్ర. బారిష్టర్ అసిస్టెంట్ దిల్రీత్ గిల్ గా అనన్య పాండే నీటుగా నటించింది. మార్తా స్టీవెన్స్ ఉత్తుత్తి రేప్ కేసు విచారణని ఆమె కోర్టులో నిర్వహించిన తీరు రాబోయే కాలంలో ఆమె ఉత్తమ నటిగా ఎదిగే సూచనలని అందిస్తోంది.
       
ఇక
ఆర్ మాధవన్ విషయానికి వస్తే, అతడి  ఎంట్రీ ఇంటర్వెల్ ముందు మాత్రమే, కానీ అతడి నిజమైన మూడ్ ఇంటర్వెల్ తర్వాత కనిపిస్తుంది. నాయర్ కి ప్రత్యర్ధిగా మాధవన్ మరీ రెచ్చిపోకుండా, కూల్ గా పుల్లలు పెట్టే మ్యానిపులేటివ్ నేచర్ ని బిగి సడలకుండా నటించాడు. జనరల్ డయ్యర్ గా సైమన్ డే కోపంతో పిచ్చి అరుపులు అరిచినప్పుడల్లా హిట్లర్ ని తలపిస్తాడు. .
        
ఇక కరణ్ సింగ్ దర్శకత్వం సింపుల్ గా, స్పష్టంగా, కథని  దాని ఉద్దేశ్యం నుంచి  ఎక్కడా దారి మళ్ళకుండా రెండే రెండు రస పోషణలతో బలంగా వుంటుంది- నేపధ్యంలో విషాదంతో కూడిన కరుణ రసం, కథనంలో అద్భుత  రసంతో కూడిన సస్పెన్స్. నటనలు, చిత్రీకరణలు రియలిస్టిక్ సినిమా ధోరణి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల చాలా పవర్‌ఫుల్‌. సందర్భానుసారంగా మూడు పాటలు. కెమెరా వర్క్ కొన్ని చోట్ల జూమ్, ఎక్స్ ట్రీమ్ జూమ్ షాట్లతో మెస్మరైజ్ చేస్తుంది. ప్రారంభంలో సుదీర్ఘ మారణహోమం దృశ్యాలు చెప్పుకోదగ్గవి. మిగతా సాంకేతిక హంగులు లిమిటెడ్ బడ్జెట్ కి ఉన్నంతలో వున్నాయి. సంభాషణలు అవసరమైన చోట్ల పవర్ఫుల్ గా వున్నాయి. అయితే డైలాగుల్లో మీడియా అనే పదం వాడారు. ఈ పదం ఈనాటిది- ఆనాడు కేవలం పత్రికలే వుండేవి  కాబట్టి ప్రెస్ అని వాడుకలో వుండేది.

2019 లో విడుదలైన - హిట్టయిన కేసరి కి ఇది సీక్వెల్ కాదుగానీ, చాప్టర్ 2 అన్నారు. విషయపరంగా రెండిటికీ ఎలాటి సంబంధం లేదు. 1897 లో హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలో 21 మందితో కూడిన సిక్కు రెజిమెంట్, ఆఫ్ఘన్ దురాక్రమణాన్ని ఎదుర్కొన్న చారిత్రక కథతో అక్షయ్ కుమార్ కేసరి లో కనిపించాడు. అయితే అది జింగోయిజంగా, కల్పితం చేసిన రాజకీయ కేసరీయంగా వుంది. కేసరి -చాప్టర్ 2 కి ఈ అతి అంటలేదు.
        
ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా. నిజం, న్యాయం, బాధల కథని సిన్సియర్ గా తెరకెక్కించారు. చరిత్రలో చెప్పని దిగ్భ్రాంతికర అధ్యాయాన్ని వివరించే ఈ కథని , ఖచ్చితంగా ఒక సారి చూడాల్సిందే!

—సికిందర్
(రివ్యూలో  'జలియన్ వాలా బాగ్' అనకుండా 'జలియావాలా బాగ్' అనడమేంటని అన్పించవచ్చు. దశాబ్దాలుగా తెలుగులో 'జలియన్ వాలా బాగ్' అనే రాసేస్తున్నారు పుస్తకాల్లో, పత్రికల్లో. కానీ హిందీలో जलियांवाला (జలియావాలా) అనే వుంటుంది. ఇంగ్లీషులో రాసినప్పుడు Jalliyanwala అని మధ్యలో n వస్తుంది. పలికేటప్పుడు ఈ n సైలెంట్ అవుతుంది- Kahaaniyaan - కహానీయా లో చివర n లాగా. జలియావాలా బాగ్ అంటే జలియావాలా తోట అని అర్ధం)