‘లేడీ బర్డ్’ లో దృశ్యం
|
కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల నిర్వచనం హాలీవుడ్ ఇలా ఇస్తుంది : అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన యువ పాత్ర, మానసికాభివృద్ధికీ మార్పుకూ దోహదపడే సంఘర్షణని చిత్రించేవే కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల కథలు. వీటిని సున్నితంగా డీల్ చేయాలి. లేత టీనేజర్లు అప్పుడే గూడు వదిలిన పక్షి పిల్లల్లాంటి వాళ్ళు.
ఈ సినిమాలకి ఇతర సినిమాల కథలకి లాగే కాన్ఫ్లిక్టే (సంఘర్షణే ) ఆధారం. ఉన్నట్టుండి యువపాత్రకి ఎదురు చూడని అనుభవం ఎదురవుతుంది. దాంతో సంఘర్షించి రేపటి వ్యక్తిగా ఎదగడమే ఈ కథల స్వభావం.
అదే రూటులో తెలుగు
హాలీవుడ్ లో ప్రేమలొక్కటే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ కావు. వాళ స్పాన్ వైవిధ్యంతో విశాలమైనది. ఇంకోటేమిటంటే, ఈ తరహా కథలకి వరల్డ్ మూవీస్ కి ఏ స్ట్రక్చర్ వుండదో, హాలీవుడ్ కథలకి ఆ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వుంటూ, కమర్షియల్ ప్రదర్శనలకి విశాల ప్రాతిపదికన నోచుకుంటాయి. తెలుగు మేకర్లు ఈ తేడా గమనిస్తే, నాన్ కమర్షియల్ వరల్డ్ మూవీస్ కి ఇన్స్పైర్ అయ్యే పొరపాటు చేయకుండా జాగ్రత్తపడొచ్చు.
సంధికాలంలో ఎదుగుదల కోసం టీనేజర్ల సంఘర్షణాత్మక హాలీవుడ్ మూవీస్ కి కొన్ని ఉదాహరణలు : ‘రెబెల్ వితౌట్ కాజ్’ లో బాధాకర గతమున్న టీనేజర్ కొత్త టౌనుకి వచ్చి, కొత్త స్నేహితులతో బాటు, కొత్త శత్రువుల్ని సృష్టించుకుంటాడు. ‘స్టాండ్ బై మీ’ లో ఒక రచయిత అదృశ్యమైన ఒక బాలుడి మృతదేహాన్ని కనుగొనే ప్రయాణంలో, తన టీనేజీలో చనిపోయిన తన మిత్రుడి జీవితం గురించి చెప్పుకొస్తాడు. ‘లేడీ బర్డ్’ ర్ లేత టీనేజర్, తను కోరుకుంటున్న భవిష్యత్తుని హై స్కూలు ఇవ్వడం లేదని, తనలోని కళాభినివేశం కోసం సంఘర్షిస్తుంది. ‘ది బ్రేక్ ఫాస్ట్ క్లబ్’ లో పోలీసులు రోజూ ఉదయం ఒక టీనేజర్ ని తెచ్చి లాకప్ లో పడేస్తూంటారు. వీళ్ళేం చేశారనేది వీళ్ళు చెప్పుకునే కథలు. ‘మస్టాంగ్’ లో ఐదుగురు అనాథలైన టీనేజీ అక్క చెల్లెళ్ళు యువకులతో తిరుగుతున్నారని బంధిస్తారు. అమ్మాయిల స్వేచ్ఛమీద మోరల్ పోలీసింగ్ ఈ కథ. ‘రివర్స్ ఎడ్జ్’ లో లేత టీనేజర్ తను చేసిన ఘోర నేరాన్ని క్లాస్ మేట్స్ కి గొప్పగా చెప్పుకుంటే, క్లాస్ మేట్స్ ఇంకా మతిపోయేలా కామెడీ చేస్తారు. ‘హేవెన్లీ క్రీచర్స్’ లో ఇద్దరు టీనేజీ అమ్మాయిలు సన్నిహితంగా గడపడాన్ని సహించలేక తల్లిదండ్రులు విడదీస్తే, ఆ అమ్మాయిలు తల్లిదండ్రుల మీద పగ దీర్చుకుంటారు...
ఇదో పెద్ద పరిశ్రమ
టీనేజిలో తమ మనసేమిటో తమకే తెలీక గందోరగోళంగా వుంటుంది. ఈ గందరగోళాన్ని తీరుస్తాయి ఈ తరహా కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు. హాలీవుడ్ లో కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు దానికదే ఒక పెద్ద పరిశ్రమ. ఏడాదికి ఇరవై ముప్ఫై తీస్తూంటారు. 2018 లో 35 తీశారు. ఈ సంవత్సరం ఇప్పటికే 22 తీశారు. వీటిలో అన్ని జానర్లూ వుంటున్నాయి. ఎదుగుదల గురించే కాక, లవ్, కామెడీలే కాకుండా, యాక్షన్, అడ్వెంచర్, హార్రర్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్, అన్ని జానర్లతో ప్రయోగాలు చేస్తున్నారు. అసలు హేరీ పోటర్ సినిమాలన్నీ ఈ జానర్వే.
మనమేకర్లు ఆ వరల్డ్ మూవీస్ అనే ఆర్ట్ మూవీస్ అడ్డాలోంచి, కాఫీ షాపు చర్చల్లోంచి బయట పడితే తప్ప ఇవన్నీ అర్ధం గావు. కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ పదం కూడా తెలియని వాళ్ళు మేకర్లుగా వున్నారు. యాక్షన్ కామెడీలు, రోమాంటిక్ కామెడీలు తప్ప ఇంకోరకం సినిమా తెలీదు. వూరూరా ఆధునికంగా వెలిసే మల్టీప్లెక్సులు గొప్ప, వాటిలో వేసే సినిమాలు దిబ్బ.
చుట్టూ వయోలెంట్ లోకం
రమేష్ బాబు ‘నీడ’ కాలంలో ప్రపంచమిలా లేదు. అరచేతిలో ఇన్ని తలలతో విచ్చుకోలేదు. చెడు కన్పిస్తే, వూరిస్తే, కుతూహలం కల్గిస్తే, ఎక్కువలో ఎక్కువ రోడ్డు పక్క వేశ్య రూపంలోనే. ఇవ్వాళ ఇలా లేదు. ఇప్పుడున్న వయోలెంట్ ప్రపంచాన్ని మనం దాటేశాం. అదృష్టవశాత్తూ మనం గడిపిన ప్రపంచం వేరు. కానీ మన వెనక వచ్చిన టీనేజర్లకి మనం కాకపోతే ఇంకెవరు చేతనయింది చేస్తారు?
చుట్టూ ఈ కొత్త వయోలెంట్ ప్రపంచంతో కూడా ఏం చేయాలా అని మనసు పెట్టి ఆలోచిస్తే, టీనేజర్లని ఇంకా పల్లీ బఠానీలతో మభ్యపెట్టకుండా వాళ్ళ వాయిస్ ని విన్పించే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ తో పుణ్యం కట్టుకోవచ్చు. ఖాళీగా వున్న ఈ సెగ్మెంట్ ని భర్తీ చేయవచ్చు. కళా సేవ కాదు, కాసు లొచ్చేదే. హాలీవుడ్ జానర్లు క్యాష్ కౌంటర్లే, డోంట్ వర్రీ! ఈ వ్యాసం మేసేజీలా వుందేమో, ఇదొక వ్యాసమంతే!
―సికిందర్