మే 2022 లో జూబిలీ హిల్స్ లో జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటన ఆధారంగా ‘యూఫోరియా’ నిర్మించారు. ఇక్కడ గమనించాల్సింది ఇది మామూలు రేప్ కాదు, గ్యాంగ్ రేప్ సంఘటనేది. ఒకడు చేస్తే రేప్, ఒకరికంటే ఎక్కువ మంది చేస్తే గ్యాంగ్ రేప్. అంటే రేప్ కథ వేరు, గ్యాంగ్ రేప్ కథ వేరు. రెండిటినీ ఒకే సీసాలో పోసి చూపించలేరు. కాబట్టి ఈ తేడాని దృష్టిలో పెట్టుకుని ఈ కథని విశ్లేషించాల్సి వుంటుంది. అలాగే ఇది మైనారిటీ తీరని హై స్కూలు విద్యార్ధులు పాల్పడిన గ్యాంగ్ రేప్ సంఘటన అని కూడా వర్గీకరించుకోవాలి. మూడోది, మైనారిటీ తీరని 16 -18 ఏళ్ళ వయస్సు పాత్రలతో ఈకథ కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ లోకి వచ్చే కథగా చూడలని కూడా గుర్తుంచుకోవాలి. కమింగ్ ఆఫ్ ఏజ్ లో మళ్ళీ ఇది రియలిస్టిక్ జానర్ కథ. ఇంకా చెప్పుకుంటే ఇది గ్యాంగ్ రేప్ కేసుతో పోలీస్ ప్రోసీజురల్ జానర్ కథ కూడా. ఇన్ని షేడ్స్ తో వుందీ కథ. ఇవన్నీ - అంటే ఈ షేడ్స్ అన్నిటినీ ని దృష్టిలో పెట్టుకుని సమగ్రంగా చూడాల్సి వుంటుంది ఈ కథని.
పోతే, ఏమాటకామాటే చెప్పుకుంటే, 'యూఫోరియా' ముగింపు సీనియర్ దర్శకుడు గుణశేఖర్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. రేపిస్టుకి అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుంది? వ్యూహాత్మకంగా, ఇంటలెక్చువల్ గా ఇలాటి ఆలోచన చేసిందుకు ఆయనకి అభినందనలు. ఐతే ఇంత బలమైన ప్రభావం చూపే మాస్టర్ స్ట్రోక్ ని ప్రశ్నార్థకం చేసే పాయింటు కూడా తోడయ్యింది. ఇదేమిటో తెలుసుకుందాం. ఇక గ్యాంగ్ రేప్ సమస్య మీద 'యూఫోరియా' కథ ఒక బలమైన హెచ్చరిక అవ్వాల్సింది. ఎవరికీ? ఇలాటి మైనర్ యువతీ యువకులకి- వాళ్ళ పేరెంట్స్ కి కాదు. ఎందుకంటే ఇది కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ కథ. ఈ జానర్ మర్యాదల ప్రకారం మైనర్ పాత్రల స్వయం ఎదుగుదల, స్వాలంబనలతో కూడిన వ్యక్తిత్వ వికాస ప్రధానంగా వుండాలి కథ నిజానికి. ఇది కూడా గుర్తించక పోవడం వల్ల మైనర్ పాత్రలకి అవసరం లేని, సంబంధంలేని ప్రశ్నలతో తికమక పెడుతూ కాన్సెప్ట్ ని వీగిపోయేలా చేసింది కథ. ఈ కథకి ఐడియాని నిర్మిస్తున్నప్పుడే ఇవన్నీ చూసుకోవాలి. ఐడియాని పేపర్ మీద పెట్టకుండా మనసులో అనుకుంటూ రాసుకుంటూ పోతే కథ రకరకాలుగా మారిపోతూ ఏ తీరానికి చేరుతుందో తెలీదు. 'యూఫోరియా' కి అక్షరాలా జరిగిందిదే. కిందటి ఆర్టికల్ లో నిర్మాణంలో లేని ఈ కథ ఐడియాని విశ్లేషించుకున్నాక, ఇప్పుడు ఈ కథకి ఇచ్చిన స్ట్రక్చర్ ఎలా వుందో చూద్దాం…
1. బిగినింగ్ 20 నిమిషాలు :
తను చేసిన తప్పుకి తనకి శిక్ష పడాలని వింధ్య (భూమికా చావ్లా) తన మీద తనే కేసు వేసుకుని హైకోర్టుకి వెళ్ళడంతో బిగినింగ్ ప్రారంభం. ఆమె చేసిన తప్పేమిటన్న ప్రశ్నతో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది బిగినింగ్.
1 (a) ఫ్లాష్ బ్యాక్:
మైనర్ అయిన వికాస్ స్కూల్ పరీక్షలు రాసిన సందర్భాన్ని క్లాస్ మేట్స్ నల్గురితో ఎంజాయ్ చేయడానికి పబ్ కి వెళ్తాడు. వేరే స్కూల్లో చదివే చైత్ర (సారా అర్జున్) అనే మైనర్ స్టూడెంట్, ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి పిలిస్తే పేరెంట్స్ కి చెప్పి వెళ్తుంది. పబ్ లో వికాస్, అతడి క్లాస్ మేట్స్ నల్గురూ పరిచయమవుతారు. మర్నాడుదయం నీరసంగా ఇంటికి తిరిగి వస్తుంది చైత్ర. అశాంతిగా తన రూమ్ లో పడుకుంటే ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. సెల్ తీసి చూస్తే ఒక వీడియో వుంటుంది. అందులో ఒకడు తనని బలవంతం చేస్తూ వుంటాడు. ఇది చూసి షాక్ అవుతుంది. అటు ఈ వీడియో పోస్ట్ చేసిన క్లాస్ మేట్ ని కొడతాడు విఘ్నేష్. వీడియో రట్టయిందని ఆందోళన పడతారు. ఇటు చైత్ర మదర్ కి జరిగిందేమిటో చెప్పేస్తూంటుంది.
1 (b), 1 (a) ఫ్లాష్ బ్యాక్ కి ఫ్లాష్ బ్యాక్ : రాత్రి పార్టీ అయ్యాక పబ్ బయట క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న చైత్రని చూసి కారాపుతాడు విఘ్నేష్. కారులో అతడి క్లాస్ మేట్స్ నల్గురూ వుంటారు. చైత్రకి లిఫ్ట్ ఇస్తామంటే ఆమె తటపటాయించి, తర్వాత ఎక్కి కూర్చుంటుంది. దాంతో కారులో తీసికెళ్ళి ఆమెని రేప్ చేస్తారు.
ఈ ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక షాక్ లో వుంటారు ఇది విన్న చైత్ర పేరెంట్స్. పోలీస్ కంప్లెయింట్ ఇస్తానంటుంది చైత్ర. దేనికి భయపడాలని ప్రశ్నిస్తుంది. పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి తీసికెళ్తారు. అక్కడ పోలీసు అధికారికి ఆమె చెప్పలేక పోతూంటే, భరోసా సెంటర్ కి పంపిస్తాడు. భరోసా సెంటర్లో పోలీసు అధికారిణికి మొత్తం చెప్పేస్తుంది చైత్ర. దీంతో బిగినింగ్ విభాగం ముగుస్తుంది.
2. బిగినింగ్ ని విశ్లేషిద్దాం- ఎవరు ప్రధాన పాత్ర?
పై బిగినింగ్ విభాగంలో ఓపెనింగ్ ఇమేజిగా వింధ్య తనపై తనే కేసు వేసుకుని హైకోర్టు కెళ్ళే దృశ్యం వుంది. ఇది వెంటనే కథ మీద ఆసక్తి పుట్టే ప్రశ్నలతో బావుంది. ఆమె ఎవరు? ఏం తప్పుచేసింది? ఏం శిక్ష కోరుకుంటోంది? ఈ ప్రశ్నలు బాగానే హుక్ గా పనిచేస్తున్నాయి. అయితే ఇది నమ్మశక్యంగా మాత్రం లేదు. ఎందుకంటే తన మీద తనే కేసు వేసుకుంటే ఆ కేసు జడ్జి ముందుకు రావడమలా వుంచి, అసలు కోర్టులో అడ్మిట్ కాదు. ఎందుకంటే, ఒక కేసుకి వ్యతిరేక ఆసక్తులున్న రెండు విభిన్న పక్షాలు (వాది, ప్రతివాది) అవసరం. ఇది సాధ్యం కాదు గనుక లాజికల్ గా లేదా లీగల్ గా ఎవరూ తమపై తాము కేసు పెట్టుకోలేరు. పోలీస్ స్టేషన్ కెళ్ళి లొంగి పోవచ్చు. అప్పుడా పోలీసులు కేసు దర్యాప్తు చేసి కోర్టులో కేసు నడిపిస్తారు. ఇక్కడ రెండు పక్షాలుంటాయి- లొంగిపోయిన వ్యక్తీ, పోలీసులు. కనుక కేసు విచారణాయోగ్యంగా వుంటుంది.
ఈ వివరణ ఇక్కడ ఎందుకవసరమంటే, ఇది ఫార్ములా కథ కాదు, డ్రామా కోసం లాజిక్ ని పక్కనబెట్టడానికి. ముందే చెప్పుకున్నట్టు ఇది సీరియస్ గా సాగే రియలిస్టిక్ జానర్లో అనుకున్న కథ. దీనికి వాస్తవిక దృక్పథంతో అన్ని లాజిక్కులూ వర్తిస్తాయి- మ్యాజిక్కులు కాదు. ఇలాటి కథల్లో ఇచ్చే చట్టపరమైన సమాచారం తప్పుదోవ పట్టించేదిగా వుండకూడదు. కాబట్టి ఈ ఓపెనింగ్ ఇమేజి- హుక్ వర్కౌట్ కాలేదు.
ఇలా సినిమా ప్రారంభమే వింధ్య పాత్ర ప్రేక్షకుల్ని ముందుకి లాక్కెళ్ళే బలమైన ముద్ర వేయలేదు. ఓపెనింగ్ ఇమేజి అన్నాక దాంతో శుభారంభం చేస్తూ బాక్సాఫీసు బెల్ మోగక పోతే ఓపెనింగ్ ఇమెజి ఎందుకు? ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వుండాల్సింది. అలా వెళ్ళడానికి కూడా ఈ కథ అవకాశమియ్యడం లేదు. ఎందుకంటే ఇంటర్వెల్లో ముగిసిపోయే కథకి కొనసాగింపుగా అతికించిన కృత్రిమ పాత్ర చిత్రణ ఇది.
ఇక బిగినింగ్ విభాగంలో మిగతా విషయం చూస్తే, బిగినింగ్ బిజినెస్ (కార్యకలాపాలు) సజావుగా సాగడాని కవసరమైన 4 టూల్స్- కథా నేపథ్యపు ఏర్పాటు, పాత్రల పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ అన్నవి- ప్రధాన పాత్ర లేకుండానే జరిగిపోయాయి.
2 (a). గార్డియన్ పాత్ర కూడా మిస్ :
వింధ్య పాయింటాఫ్ వ్యూలో ఈ ఫ్లాష్ బ్యాక్ వస్తోంది కాబట్టి ఆమే ప్రధానపాత్ర అనుకున్నా ఇది బిగినింగ్ విభాగంలో ఎస్టాబ్లిష్ కాలేదు. బిగినింగ్ విభాగంలో ఆమె పాత్రే లేదు. పోతే, కథా నేపథ్యం మైనర్ పాత్రలతో గ్యాంగ్ రేప్ కథ చూడబోతున్నట్టు స్పష్టంగానే ఏర్పాటయింది. చైత్రతో బాటు విఘ్నేష్, అతడి క్లాస్ మేట్స్ మైనర్ స్టూడెంట్స్ గా పరిచయమయ్యారు. చైత్ర పేరెంట్స్ పరిచయమయ్యారు. తర్వాత చైత్ర ఫ్రెండ్ పిలిచిందని చెప్పి బర్త్ డే పార్టీకి వెళ్ళడంతో సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా మొదలయ్యింది. ఈ క్రమంలో పబ్ లో విఘ్నేష్, అతడి క్లాస్ మేట్స్ చైత్రకి పరిచయమయ్యారు. తర్వాత ఆమెకి లిఫ్ట్ ఇస్తామని చెప్పి తీసికెళ్ళి రేప్ చేయడంతో సమస్య ఏర్పాటయ్యింది. ఇలా ప్రధాన పాత్ర ఎవరో తెలియకుండానే బిగినింగ్ బిజినెస్ టూల్స్ నాల్గూ పని చేశాయి. విమానం పర్ఫెక్టుగా వుంది, కానీ ఎగరేసే పైలట్ ఎవరో రావడం లేదు. ఇది విచిత్ర పరిస్థితి. ఇంకే సినిమాలోనూ ఇలా చూసి వుండం.
ఇలా బిగినింగ్ ని ముగిస్తూ సమస్యని ఏర్పాటు చేయడమంటే (గ్యాంగ్ రేప్ సంఘటన), ఆ సమస్య ప్రధాన పాత్రదే అవుతుంది. కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మర్యాదల ప్రకారమైతే ఇక్కడ గ్యాంగ్ రేప్ కి గురైన, మైనర్ అయిన, చైత్రే ప్రధాన ప్రధాన అవుతుంది. రేపిస్టులు ఆమె ప్రత్యర్థి పాత్రలవుతారు. అంటే ప్రత్యర్దులైతే వున్నారు, కానీ ప్రధాన పాత్రగా చైత్ర డెవలప్ కావడం లేదు. చైత్ర అంటే ఎదుగుదల అని కూడా అర్ధం. పేరెంట్స్ పెట్టిన పేరుకి కూడా ఆమె న్యాయం చేయడం లేదు. కష్టాల్లో ఎదిగి చూపించడం లేదు.
పోనీ ఈమెకి హెల్ప్ చేసే గార్డియన్ రూపంలో వేరే పెద్ద వయసు పాత్ర ఏదైనా వుంటుందేమో అని చూస్తే, ఈ పాత్రలో వింధ్య కనిపించడం లేదు. బిగినింగ్ విభాగంలో ఆమె ఎంట్రీయే జరగలేదు. ఆమె పేరెంట్స్ కూడా గార్డియన్ పాత్రల్లో లేరు. గార్డియన్ పాత్ర వుంటే అప్పుడు ఆ సమస్యతో పోరాడి చైత్రకి న్యాయం చేయడం ఆ గార్డియన్ పాత్ర గోల్ గా బిగినింగ్ కి స్ట్రక్చర్ వుంటుంది. మరి వింధ్యకాక, చైత్ర పేరెంట్స్ కూడా కాక, మరెవరు గోల్ పాలన చేపట్టే గార్డియన్ పాత్ర? ఈ పోస్టు ఖాళీగా వుంటూ గోల్ గాలిలో వేలాడుతోంది. ఇలావుంటే భావోద్వేగాలెలా అనుభవిస్తారు ప్రేక్షకులు?
2 (b). గోల్ ఎలిమెంట్స్ మిస్ :
ఇలా బిగినింగ్ విభాగం ముగింపుని ప్లాట్ పాయింట్ వన్ అనుకుంటే, ఇక్కడ గోల్ ఎలిమెంట్స్ 4 ఏర్పాటవుతాయి : ప్రధాన పాత్ర కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. ఈ టూల్స్ కూడా ప్రధాన పాత్ర ఎవరో తేలక యాక్షన్ లోకి రాలేదు. ప్లాట్ పాయింట్ వన్లో యాక్షన్ తో కథ పుట్టక పోతే ఎలా? కథ పుట్టేది ఇక్కడే. బిగినింగ్ విభాగంలో వుండేది కథ కాదు. ప్లాట్ పాయింట్ వన్ లో పుట్టబోయే కథకి ఉపోద్ఘాతం మాత్రమే!
సరే, బాధితురాలు చైత్ర పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలని లీడ్ అయితే తీసుకుంది. పేరెంట్స్ తో వెళ్ళి కంప్లెయింట్ కూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత పాసివ్ అయిపోయింది. ఇక పేరెంట్స్ కూడా పాసివే. కాబట్టి కథకి ప్రాణం వంటిదైన ప్లాట్ పాయింట్ వన్ ప్రధాన పాత్ర / గార్డియన్ పాత్ర లేక బాక్సాఫీసు బెల్ ని మోగించ లేకపోయింది కథనం. ని అందుకోలేదు. కథ పుట్టే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర బాక్సాఫీసు బెల్ గణగణ మని మోగలేదంటే, ఇంకెక్కడ మోగుతుంది, అప్పటికి కథకి ఎంట్రీ క్లోజ్ అయిపోతుంది.
చైత్ర ఒకటి చేసి వుండొచ్చు. పోలీస్ స్టేషన్ కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చే ధైర్యం వున్నప్పుడు- అదే ధైర్యంతో తనని రేప్ చేస్తున్న వీడియో తనకి అందిన వెంటనే, కనీసం ఏడుస్తూనైనా మొత్తం వాళ్ళందరి పేర్లు చెప్పేస్తూ కౌంటర్ వీడియో పెట్టేసి సంచలనం సృష్టించ వచ్చు. లేదా పోలీస్ కంప్లెయింటే ఇవ్వాలనిపిస్తే, అక్కడి కెళ్ళి చెప్పలేక ఇబ్బంది పడే బదులు పోలీసు అధికారికి ఆ వీడియో చూపించేస్తే చాలు.
ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఇది కమింగ్ ఆఫ్ జానర్ కథ అయినప్పుడు. కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్లో హాలీవుడ్ లో ఏడాదికి 30 సినిమాలు వస్తూంటాయి. ఈ సినిమాలు చూసి తెలుసుకోవచ్చు. కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల నిర్వచనం హాలీవుడ్ ఇలా ఇస్తుంది : అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన యువ పాత్ర, మానసికాభివృద్ధికీ మార్పుకూ దోహదపడే సంఘర్షణని చిత్రించేవే కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల కథలు. వీటిని సున్నితంగా డీల్ చేయాలి. లేత టీనేజర్లు అప్పుడే గూడు వదిలిన పక్షి పిల్లల్లాంటి వాళ్ళు కాబట్టి.
‘యూఫోరియా’ కథని న్యాయంగా డిమాండ్ చేస్తున్న కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్లో తీయలేదు. అయినా కథకుడు పాత్రని తన కథ తను నడుపుకోనివ్వకుండా, పాత్ర కోసం తనే కథ నడుపుతున్నాడు. అందువల్ల చైత్ర నిర్వీర్యంగా పాసివ్ పాత్రగా మారిపోయింది. పోనీ దీన్ని ఫార్ములా కథే అనుకుని తీసినా, చైత్ర కౌంటర్ వీడియో వైరల్ చేసి వుంటే సీన్లు తగ్గి బడ్జెట్ అదా అవడమే గాక, కథనంలో వేగం పెరిగేది.
ఈ ఇరవై నిమిషాల బిగినింగ్ విభాగంలో లీనియర్ కథనం చేయకుండా ఫ్లాష్ బ్యాక్స్ తో నాన్ లీనియర్ కథనం చేయడం బాగానే వుంది. అయితే కంటెంట్ క్వాలిటీ సరిగ్గా లేనప్పుడు కథనంలో టెక్నిక్ దేనికనేది ప్రశ్న! స్టయిల్ ఓవర్ సబ్స్ టెన్స్ అన్పించుకుంటుంది ఇలాటి ప్రయత్నం.
3.ఇప్పుడు మిడిల్ 1 - అంటే ఫస్టాఫ్ కథ :
పైన చెప్పుకున్న రెండు బిగినింగ్ ఫ్లాష్ బ్యాకులకి కొనసాగింపు ఈ ఫ్లాష్ బ్యాక్ లో మిడిల్ 1 కథ. ఇక్కడ పోలీసులు గ్యాంగ్ రేప్ జరిగిన స్థలంలో సాక్ష్యాధారాలు సేకరిస్తారు. అవేమిటో చెప్పరు. సీసీటీవీ ఫుటేజీ తీస్తారు కారు గుర్తింపు కోసం. దాంతో రేపిస్టులు ఐదుగుర్నీ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్ జయదేవ్ (గౌతం మీనన్) ఎంట్రీ ఇస్తాడు. అతను ప్రెస్ మీట్ నిర్వహిస్తాడు. కేసు వివరాలు చెప్తాడు. గతంలో మైనర్లు పాల్పడిన ఒక రోడ్డు ప్రమాద సంఘటనని గుర్తు చేస్తాడు. ఇంకో సైకో కిల్లర్ గురించి చెప్తాడు. చెప్పి పిల్లల్ని బాధ్యతగా పెంచని పేరెంట్స్ ని నిందిస్తాడు. ప్రస్తుత కేసులో ఐదుగురు మైనర్ల పేరెంట్స్ వివరాలు వెల్లడించేస్తాడు. దీంతో నలుగురు బడా వ్యాపార / రాజకీయ వ్యక్తులు మీడియాలో ప్రచారమైపోతారు. ఐదో టార్గెట్ గా వింధ్య, ఆమె భర్త రివీలైపోతారు. వీళ్ళు విఘ్నేష్ పేరెంట్స్. వింధ్య ఒక కార్పొరేట్ స్కూల్లో ప్రిన్సిపాల్. ఆమె షాక్ అయి వెంటనే జాబ్ కి రిజైన్ చేస్తుంది.
ఇప్పుడు సీపీ జయదేవ్ నిందితుల టార్చర్ మొదలెడతాడు. ఒక్కొక్కరిచేత బలవంతంగా ఐదు ప్లేట్ల బిర్యానీ తినిపిస్స్తాడు. తర్వాత గ్యాంగ్ రేప్ సీన్ రిక్రియేషన్ పేరుతో వాళ్ళని తీసికెళ్ళి అదే స్పాట్ లో ఒకమ్మాయిని పెట్టి, రేప్ చేసి చూపించమంటాడు. తర్వాత, పొటెన్సీ టెస్టుచేత్తో ప్రేరేపించుకుని ఎరెక్షన్ చూపించమంటాడు డాక్టర్. ఈ అవమానాల్ని తట్టుకోలేక విఘ్నేష్ ఆత్మహత్యా యత్నం చేస్తాడు. హాస్పిటల్లో కోలుకుంటున్న విఘ్నేష్ ని చూడడానికి వస్తుంది మదర్ వింధ్య. ‘నువ్వు రేప్ చేసిన అమ్మాయి పిరికిగా లేదు. నీలాటి వాళ్ళని శిక్షించాలని ధైర్యంగా వుంది. నువ్విలా ప్రతీ క్షణం చావాలి’ అని శపించి వెళ్ళిపోతుంది.
చివరికి జువెనైల్ జస్టిస్ బోర్డులో కేసు విచారణ ప్రారంభమవుతుంది. జడ్జి బాధితురాలి స్టేట్ మెంట్ వింటుంది. కేసులో తగిన ఎవిడెన్స్ ని కోర్టుకి అందించాలని పోలీసుల్ని ఆదేశిస్తుంది. కేసు వాయిదా వేస్తుంది. మరుసటి వాయిదాలో ఎవిడెన్స్ సమర్పిస్తారు పోలీసులు. ఆ ఎవిడెన్సులో నిందితులు గ్యాంగ్ రేప్ చేస్తూ తీసిన వీడియో కూడా వుంటుంది. దాని ఆధారంగా నిందితుల మీద నేర నిర్ధారణ చేస్తూ, ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధిస్తుంది జడ్జి. అలాగే నిబంధనలకి విరుద్ధంగా మైనర్ నిందితుల పేరెంట్స్ వివరాలు వెల్లడించిన సీపీ జయదేవ్ ని సస్పెండ్ చేయాలనీ ఆదేశిస్తుంది. దీంతో మిడిల్ 1 కథ ముగుస్తుంది.
4. ఓపెనింగ్ ఇమేజికి కొనసాగింపు కథ :
ఇప్పుడు ప్రారంభంలో ఓపెనింగ్ ఇమేజిలో చూపించినట్టు- తన మీద తను కేసు వేసుకుని హైకోర్టు కెళ్ళిన వింధ్య ఇంకా జడ్జి ముందు హాజరు కాకముందే - నేను నిందితురాల్ని కాదు, నా నిర్లక్ష్యం వల్ల ఇలా తయారయ్యాడు వాడు- అని స్వగతంలో అనుకోగానే- ఫస్టాఫ్ మిడిల్ -1 ఫ్లాష్ బ్యాక్ మిగిలిన కథ కంటిన్యూ అవుతుంది.
5. ఫస్టాఫ్ మిడిల్ -1 ఫ్లాష్ బ్యాక్ కథ కంటిన్యూ:
విఘ్నేష్ జైలు కొస్తాడు. తోటి ఖైదీలు అతను రేపిస్టు అని హేళన చేసి రేప్ చేస్తారు. జైల్లో వుండే డ్రగ్ స్మగ్లర్ నుంచి హింస నేడుర్కొంటాడు విఘ్నేష్.
6. ఓపెనింగ్ ఇమేజికి కొనసాగింపు కథ -2 :
హైకోర్టులో వెయిటింగులో వున్న వింధ్య స్వగతంలో - ఇంత కాలం మోయగల్గిన ఈ భారం ఇంకా మోయలేను. అనుక్షణం చావాలని నా కొడుక్కి నేనేసిన శిక్ష ఇప్పుడు నేనే అనుభవిస్తున్నాను- అనుకుంటుంది. వెంటనే ఒక మాంటేజ్ - కొడుకు విఘ్నేష్ వింధ్య మీద దాడి చేస్తున్న దృశ్యం.
మళ్ళీ ఆమె స్వగతం- ఎవరిదీ నేరం, ఎవరికీ శిక్ష? జడ్జి గారి ముందు నా మనస్సాక్షిని బైట పెట్టాలి…
ఫస్టాఫ్ మిడిల్ 1 సమాప్తం- ఇంటర్వెల్
***
7. ఇక ఫస్టాఫ్ మిడిల్ -1 ని విశ్లేషిద్దాం!
బిగినింగ్ ప్లాట్ పాయింట్ వన్ తర్వాత, ఇప్పుడు మిడిల్ 1 తో ప్రారంభమయింది కథ. గ్యాంగ్ రేప్ జరిగిన స్థలంలో ఫోరెన్సిక్ టీం సాక్ష్యాధారాలు సేకరించడంతో ఈ కథా ప్రారంభం. ఆ సాక్ష్యాదారాలేంటో చెప్పలేదు, చూపించలేదు. పబ్లిక్ స్థలంలో గ్యాంగ్ రేప్ సాక్ష్యాధారాలు ఇంకా ఏం లభిస్తాయని - జన సంచారంతో ఎప్పుడో నాశనమై వుంటాయి. కాబట్టి విషయం లేకుండా బిల్డప్ కోసం ఈ సీను వేసినట్టుంది. కథా ప్రారంభమే పోలీస్ ప్రోసీజురల్ షేడ్ కి ప్రొఫెషనలిజం మిస్సయ్యింది.
తర్వాత సీసీ టీవీ ఫుటేజీలో కారుని ట్రేస్ చేస్తారు. మైనర్ నిందితులు ఐదుగుర్నీ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్ జయదేవ్ (గౌతం మీనన్) ఎంట్రీ ఇవ్వడంతో -ఆ ఎంట్రీ ఇచ్చే స్టయిల్ ని బట్టి ఇతనే ఈ కథకి ప్రధానపాత్ర అవుతాడనిపిస్తుంది. కానీ అవకాశం లేదు. ప్రధాన పాత్ర వింధ్యేనని మున్ముందు తెలుస్తుంది. ఇతను ఎంట్రీ ఇచ్చి ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు మీడియా వాళ్ళ వింత ధోరణి వ్యక్తమవుతుంది. అతను రాగానే ఒక్క పెట్టున విరుచుకుపడి ప్రశ్నలతో, ఆరోపణలతో రచ్చ రచ్చ చేస్తారు. ఇది ప్రోటోకాల్ అనిపించదు. ముందు కేసు గురించి అతనేం చెప్తాడో చెప్పనిచ్చి, అప్పుడు ప్రశ్నలడగాలి. ఈ సీను కూడా విఫలమైంది.
7(a). కాన్సెప్ట్ ఒకటి, చెప్పేదొకటి:
ముందు చెప్పుకున్నట్టు ఈ కథని టాపిక్స్ వారీగా విడగొడితే ఇది - 1. గ్యాంగ్ రేప్ గురించి, 2. మైనర్ ని గ్యాంగ్ రేప్ చేసిన మైనర్ల గురించి, 3. మైనర్ పాత్రలతో కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ గురించి, 4. రియలిస్టిక్ జానర్లో కథ చూపించడం గురించి, 5. గ్యాంగ్ రేప్ కేసుని పోలీస్ ప్రోసీజురల్ జానర్ ద్వారా తేల్చడం గురించీ. వీటిలో అక్కడక్కడా రియలిస్టిక్ జానర్ లో చిత్రీకరణ తప్ప, మిగిలిన షేడ్స్ ఏవీ కనిపించవు! ఇలా ఈ సినిమా మోగించాల్సిన చాలా బాక్సాఫీసు బెల్స్ ని మిస్ చేశారు.
ఈ కథ గ్యాంగ్ రేప్ గురించి అయినప్పుడు, సీపీ వేరే కథలు చెప్పకుండా గ్యాంగ్ రేప్ లు చేసే మైనర్ల మైండ్ సెట్ గురించి చెప్పి వుండాల్సింది. ఎలాటి మైనర్లు గ్రూపుగా ఏర్పడి గ్యాంగ్ రేపులు చేస్తారో చెప్పి వుండాల్సింది. అప్పుడు కథనానికి ఫ్రెష్ నెస్ వచ్చి బాక్సాఫీసు బెల్ మోగేది. ప్రేక్షకులకి -పేరెంట్స్ కి- సమాజానికీ గ్యాంగ్ రేప్స్ గురించిన ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయడం అవసరం. ఒంటరిగా బయటికెళ్ళే అమ్మాయికి ఒక రేపిస్టు కాదు, గుంపు రేపిస్టులు ఎదురయ్యే ప్రమాదముందని, ఈ సినిమాతో అపూర్వంగా లభిస్తున్న హెచ్చరించే సదవకాశాన్ని వినియోగించుకోవాలా వద్దా? కలెక్షన్లు ఎలా వస్తాయి- లక్ష్మికి సరస్వతి న్యాయం చేస్తే వస్తాయి.
కథ డిమాండ్ చేస్తున ఈ సమాచారం వదిలేసి, సంబంధం లేని వేరే కేసులు చెప్పడం పూర్తిగా బడ్జెట్ వేస్టు వ్యవహారం. రేప్ కంటే గ్యాంగ్ రేప్ తీవ్రమైనది. ఈ కథకి సోల్ గా, ఎమోషనల్ త్రెడ్ గా గ్యాంగ్ రేప్ అనే రాక్షసత్వం వెన్నాడుతూ వుండాలి బ్యాక్ గ్రౌండ్ లో కథ సాంతం. సినిమాలకి స్టోరీ రైటింగ్ కాదు, స్టోరీ మేకింగ్ చేస్తే మార్కెట్ యాస్పెక్ట్ తో వుంటుంది క్రియేటివ్ యాస్పెక్ట్.
7 (b). పోక్సో చట్టం గల్లంతు :
ఇక మీడియా వాళ్ళు ప్రెస్ మీట్ లో అతను పేరెంట్స్ వివరాలు బయట పెడుతూంటే, అభ్యంతరం చెప్పకుండా, ప్రశ్నించకుండా, ఈ విషయం పై అధికారుల దగ్గరికి తీసికెళ్ళ కుండా, బ్రేకింగ్ న్యూసులిచ్చి రచ్చ రచ్చ చేస్తారు. వీళ్ళు మీడియానా? ఇలా బ్రేకింగ్ న్యూసులిచ్చి పేరెంట్స్ వివరాలు వెల్లడించినందుకు వీళ్ళు కూడా శిక్షార్హులే. మీడియాలో మాత్రమే కాదు, వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో ఎవరు షేర్ చేసినా జైలు శిక్ష తప్పదు. మైనర్ బాధితురాలు సహా మైనర్ రేపిస్టులు, వీళ్ళందరి కుటుంబ వివరాలు కూడా బైట పెట్టడానికి వీల్లేదు. వీళ్ళు చనిపోయినప్పటికి కూడా. మైనర్ల గురించిన ఈ కథలో పోక్సో చట్టం గురించి కూడా జాగ్రత్త తీసుకోక పోవడం చాలా విచారకరం.
ఈ ప్రెస్ మీట్ ప్రహసనం తర్వాత, పేర్లు వెల్లడైన పేరెంట్స్ ఒకటై కేసుని అడ్డుకోవాలని చేసే ప్రయత్నాలు అరకొరగానే వుంటాయి. కానీ వాళ్ళు గోప్యత పాటించని సేపీ మీద కేసు వేసి కోర్టుకి లాగాలని అనుకోరు. ఇలా పాత్రలన్నీ పాసివ్ గా వుండడంతో మిడిల్ 1 లో వుండాల్సిన సంఘర్షణ మిస్సై, అవసరం లేని సమాచారంతో డాక్యుమెంటరీ లా తయారయ్యింది కథ. మిడిల్ 1, సెకండాఫ్ మిడిల్ 2 అన్నవి మొత్తం సంఘర్షణల ప్రాంగణం. ఈ బాక్సాఫీసు ప్లే లేక ఫస్టాఫ్ మిడిల్ 1 నిస్తేజంగా తయారైంది. ఇన్ని పాత్ర చిత్రణ లోపాలుంటే సినిమా ఎలా చూడాలి?
ఈ నేపథ్యంలో ఇప్పుడు కార్పొరేట్ స్కూలు ప్రిన్సిపాల్ గా వింధ్య తెరపైకి వస్తుంది- ఇక ఈమే ప్రధాన పాత్ర అనే ఆశలు రేపుతూ. దారితప్పి మిడిల్ 1 లో ఎంట్రీ ఇస్తూ. మైనర్ గ్యాంగ్ రేపిస్ట్ విఘ్నేష్ మదర్ గా. విఘ్నేష్ ఆ స్కూలు స్టూడెంటే. ఇతను చేసిన దురాగతం గురించి భర్తతో ఘర్షణ పడుతుంది వింధ్య. వెళ్ళి ప్రిన్సిపాల్ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తుంది. రిజైన్ చేసి వెళ్ళిపోతూంటే స్కూల్ స్టూడెంట్స్ వెంటపడి హేళన చేస్తున్నట్టు చూపించడం పూర్తిగా నాన్సెన్స్.
తర్వాత ఈమె ఏం చేయాలనుకుంటోందో తెలీదు. ప్రధాన పాత్రగా గోల్ లేదు, సంఘర్షణ లేదు. ఇంట్లో కూర్చుని బాధపడుతూ వుంటుంది. కొడుకుతో గతాన్ని గుర్తు చేసుకుంటూ ఓ పాటేసుకుంటుంది. ఆ పాటలో మైనర్ కొడుక్కి బైక్ కొనిస్తుంది- ఒక టీచర్ గా / ప్రిన్సిపాల్ గా చదువు చెప్పే బాధ్యతగల పంతులమ్మగా ఇదీ ఈమే ఘనకార్యం- ఆర్టీఏ చట్ట ఉల్లంఘన!
ఇప్పుడు సీపీ జయదేవ్ నిందితుల టార్చర్ మొదలెడతాడు. ఇక్కడ గుర్తించాల్సిందేమిటంటే, మైనర్ నిందితుల్ని టార్చర్ చేయడాన్ని చట్టం ఒప్పుకోదు. వాళ్ళని పోలీస్ స్టేషన్ లో వుంచడానికి వీల్లేదు. జువెనైల్ హోమ్ (బాల నేరస్తుల కేంద్రం) కి తరలించాలి. అక్కడ్నించే 24 గంటల్లో కోర్టుకి హాజరు పరచాలి. రెండోది, వాళ్ళని హేండిల్ చేసే పోలీసులు యూనిఫామ్స్ లో వుండకూడదు, సాధారణ దుస్తుల్లో ఫ్రెండ్లీ గా వుండాలి.
కానీ సీపీ జయదేవ్ వాళ్ళేదో పాతిక ముప్ఫై ఏళ్ళ కరుడు గట్టిన క్రిమినల్స్ అయినట్టు టార్చర్ చేస్తాడు. ఒక్కొక్కరిచేత బలవంతంగా ఐదు ప్లేట్ల బిర్యానీ తినిపిస్తాడు. గ్యాంగ్ రేప్ చేస్తే ఆ అమ్మాయి ఎలా గిలగిలలాడుతుందో తెలిసేలా కడుపు పట్టనంత బెదిరించి తినిపిస్తాడు.ఇందుకు కూడా అతను సస్పెండ్ కాడు. అసలు మైనర్ నిందితులతో యాక్చువల్ సినేరియా ఎలా వుంటుందో అతను ప్రేక్షకులకి చూపించడం లేదు.
తర్వాత, ఇంకో రెండు ఘోరాలు చేస్తాడు. గ్యాంగ్ రేప్ సీన్ రిక్రియేషన్ పేరుతో మైనర్స్ ని తీసికెళ్ళి అదే స్పాట్ లో ఒకమ్మాయిని పెట్టి, రేప్ చేసి చూపించామంటాడు. వాళ్ళ చేత రేపులు చేయిస్తాడు. అప్పుడు వీళ్ళకి మగతనముందని రికార్డు చేస్తాడు. ఇది మూర్ఖత్వం. మైనర్లే కాదు, ముందే భయంతో బితుకు బితుకు మంటున్న ఏ మనిషితోనూ బలవంతంగా సెక్స్ చేయించలేరు. ఎరెక్షనే సాధ్యం రాదు.
తర్వాత, పొటెన్సీ టెస్ట్ అంటూ ఇంకో టార్చర్. అక్కడ చేత్తో ప్రేరేపించుకుని ఎరెక్షన్ చూపించమంటాడు డాక్టర్. ఎవరికైనా భయంతో బితుకుబితుకుమంటూంటే ఎరెక్షన్ సాధ్యమవుతుందా? ఈ టెస్టులో ఫెయిలవుతారు మైనర్లు. పై రెండు టెస్టుల్లో ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగెటివ్ గా వస్తే దేన్ని ఎవిడెన్స్ గా తీసుకోవాలి? ఇలావుంది టెస్టుల ప్రహసనం. లాజిక్ లేని పోలీస్ ప్రోసీజురల్. అసలు విషయమేమిటంటే పొటెన్సీ టెస్టుల్ని కోర్టులు రిజెక్ట్ చేస్తున్నాయి.
7 (సి). గ్యాంగ్ రేపిస్టుల పరిణామ క్రమం :
ఇక్కడ ఈ టార్చర్ సీన్లకంటే గ్యాంగ్ రేప్ కాన్సెప్ట్ ని ఎస్టాబ్లిష్ చేసే సీన్లు వేయాల్సింది. కథ డబ్బుగల మైనర్లతో కాబట్టి, ఇలాటి మైనర్లు ఇంట్లో ఏ పరిస్థితుల కారణంగా బయట గ్రూపులుగా ఏర్పడతారు, ఏర్పడి తమ కుటుంబాల్లో కరువైన ప్రేమ, ఆదరణ లని ఎలా ప్రత్యామ్నాయ కుటుంబంగా ఏర్పాటు చేసుకున్న తమ గ్రూపులో సృష్టించుకుని స్వాంతన పొందుతారు, దాంతో వూరుకోకుండా ఆ అసంతృప్తిని తీర్చుకోవడానికి మద్యం, ఆ తర్వాత మాదక ద్రవ్యాలకీ అలవాటు పడతారు, ఈ ‘హై’ కూడా చాలక ఎలా సెక్స్ మీద ఆలోచనలు చేస్తారు, దాంతో ఒంటరిగా చాలని ధైర్యం గ్రూపుగా ధైర్యాన్నిచ్చి - ఎలా గ్యాంగ్ రేప్ కి పాల్పడతారు- ఇదంతా సీపీ జయదేవ్ ఆ మైనర్లతో, వాళ్ళ తల్లిదంరులతో విచారణలో రాబట్టే సీన్లుగా వేసి వుంటే బాక్సాఫీసు బెల్స్ గణగణ మోగేవా కాదా?
ఇప్పుడు ఈ అవమానాల్ని తట్టుకోలేక విఘ్నేష్ ఆత్మహత్యా యత్నం చేస్తాడు. ఇప్పుడైనా సస్పెండ్ అయిపోవాలి సీపీ జయదేవ్. కానీ ప్రేక్షకుల్ని మభ్యపెడుతూ పోక్సోతో ఆటలాడుతున్నాడు. ఇక హాస్పిటల్లో కోలుకుంటున్న విఘ్నేష్ ని చూడడానికి వస్తుంది మదర్ వింధ్య. ‘నువ్వు రేప్ చేసిన అమ్మాయి పిరికిగా లేదు. నీలాటి వాళ్ళని శిక్షించాలని ధైర్యంగా వుంది. నువ్విలా ప్రతీ క్షణం చావాలి’ అని శపించి వెళ్ళిపోతుంది. ఆమెకి కొడుకు మీద ఏ జాలీ లేదని స్పష్టమై పోయింది. కొడుక్కి న్యాయ సహాయం అందించడానికి కూడా సిద్ధంగా లేదు. ఇలా ఇప్పుడు ఈమె క్యారక్టర్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడేం చేస్తుంది? చేయడానికేమీ లేదు. కథ ముగించడమే.
7 (d). తీర్పు కూడా నాశనం!
ఇలా చివరికి జువెనైల్ జస్టిస్ బోర్డులో కేసు విచారణ ప్రారంభమవుతుంది. జడ్జి బాధితురాలి స్టేట్ మెంట్ వింటుంది. బాధితురాలు చైత్ర ఆడపిల్లలు పబ్స్ కెళ్తే తప్పా, బాయ్స్ తో ఫ్రెండ్ షిప్ చేస్తే తప్పా అని హక్కుల గురించి మాట్లాడుతుంది- బాధ్యతల గురించి మాట్లాడదు. పోలీసులు ఎలర్ట్ యాప్స్ ని వాడండీ, బయటికెళ్తే చిల్లీ స్ప్రేలు బ్యాగులో పెట్టుకోండీ అని ఓపక్క మొత్తుకుంటూ వుంటే, అదేమీ పట్టక ప్రమాదాలు తెచ్చుకుని మళ్ళీ పోలీసులకే పని పెడతారు!
జడ్జి ఈ కేసులో తగిన ఎవిడెన్స్ ని కోర్టుకి అందించాలని పోలీసుల్ని ఆదేశిస్తుంది. కేసు వాయిదా వేస్తుంది. మరుసటి వాయిదాలో ఎవిడెన్స్ సమర్పిస్తారు పోలీసులు. ఆ ఎవిడెన్సులో నిందితులు గ్యాంగ్ రేప్ చేస్తూ తీసిన వీడియో కూడా వుంటుంది. దాని ఆధారంగా నిందితుల మీద నేర నిర్ధారణ చేస్తూ, ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధిస్తుంది జడ్జి. అలాగే నిబంధనలకి విరుద్ధంగా మైనర్ నిందితుల పేరెంట్స్ వివరాలు వెల్లడించిన సీపీ జయదేవ్ ని సస్పెండ్ చేయాలనీ ఆదేశిస్తుంది. ఇలా సంఘర్షణ గానీ కోర్టులో ఇరు పక్షాల హోరాహోరీ గానీ లేకుండా ఏకపక్షంగా ముగిసిపోతుంది కేసు.
ఇక్కడ మళ్ళీ గమనించాల్సిందేమిటంటే- గ్యాంగ్ రేప్ చేస్తున్న ఆ వీడియోయే వున్నప్పుడు, సీపీ జయదేవ్ కి ఎవిడెన్స్ కోసం ఆ టార్చర్లు పెట్టాల్సిన అవసరమేమొచ్చింది? ఈ వీడియోయే వున్నప్పుడు ఆ టార్చర్లు పెట్టే టెస్ట్ సీన్లు కథకి అవసరమే లేదు కదా? ఆ బడ్జెట్ అంతా శుద్ధ వేస్టే కదా?
రెండోది, ఈ వీడియోని జడ్జి కోర్టులో అందరి ముందూ ప్రదర్శించడానికి ఎలా అనుమతిస్తుంది? పోక్సో చట్ట ఉల్లంఘనలో తనూ ఇరుక్కుంటుంది కదా? కన్న కూతురి మీద అఘాయిత్యం జరుగుతున్న ఈ వీడియో చూస్తున్న చైత్ర తండ్రి కూడా, వెంటనే లేచి అభ్యంతర పెట్టకుండా, అమాయకమైన చైత్ర చిన్నప్పటి విజువల్స్ ని స్మరించుకుంటూ ఆ బాధని ప్రేక్షకులు కూడా అనుభవించాలన్నట్టు ఎమోషనల్ అవుతాడేమిటి? ఈ సిల్లీ సీనుకి ప్రేక్షకు లెందుకు ఎమోషనలవుతారు? జడ్జి సహా ఎవ్వరికీ పోక్సో చట్టం గురించి జ్ఞానమే లేదు!
ఇప్పుడు అసలు విషయం- తీర్పు చెప్పాక జడ్జి బాధితురాల్ని చూసి, ‘లంచ్ కెళ్దామా?’ అంటుంది ప్రేమగా. ఇలా వుంది జడ్జి పాత్ర చిత్రణ కూడా! జడ్జిగా న్యూట్రల్ గా వుండాల్సిన తను, తీర్పు చెప్పి, బాధితురాలితో లంచ్ కెళ్దామా అంటే తీర్పు పక్షపాతంతో చెప్పినట్టా? ఇలాటి తీర్పు తో తనే ఇరుక్కుంటుంది. డిఫెన్స్ లాయర్ పక్షపాతంతో చెప్పిన ఈ తీర్పు చెల్లదంటూ పైకోర్టు కెళ్ళవచ్చు! జడ్జి ఉద్యోగం ఊడి ఇంట్లో వుంటుంది. ఇలా కథ రాసి తీసేస్తే అయిపోతుందా?
రేప్ లాంటి తీవ్రమైన నేరాలకి పాల్పడితే మైనర్లు ఇతర పెద్ద వయసు నిందితుల వర్గంలో చేరిపోయి ఆ మేరకు భారీ జైలు శిక్షలు అనుభావిస్తారని పోక్సో చట్టాన్ని ప్రస్తావిస్తూ అవగాహన కల్గించాల్సింది.
ఇలా ఇన్ని ఒడిదుడుకులతో మొత్తానికి ముగిసిపోయింది కథ మిడిల్ 1 కే. సమస్య చెప్పారు, దానికి పరిష్కారం చూపించారు- ఐపోయింది కథ. ఇంకేమిటి? సెకండాఫ్ అవసరం లేకుండా ఫస్టాఫ్ లోనే ముగిసిపోయింది కథ!
8. సెకండాఫ్ సిండ్రోంతో చెలగాటం :
ఇలా ఫస్టాఫ్ కే కథ ముగిసిపోతే బాక్సాఫీసు ప్లే సెకండాఫ్ సిండ్రోం అనే ప్రమాదంలో పడినట్టు అర్ధం. ఇది తెలుసుకోకుండా కథని కంటిన్యూ చేశారు. చేసినప్పుడు సెకండాఫ్ కి అతకని కథ జతపడింది.ఇంతే జరుగుతుంది. ఇలాటి ఎన్నో సినిమాల్లో జరిగిగినట్టు. ఐతే దీనికి వింధ్య క్యారక్టర్ తో ఓపెనింగ్ ఇమేజిని ముందే కవరింగ్ లెటర్ లా ఇచ్చారు. దీని లోపల ముగిసిపోయిన కథ కవరైపోతుందని. అంటే అసలు కథ గ్యాంగ్ రేప్ కథ కాదనీ, అసలు కథ వింధ్య కథ అనీ, ఓపెనింగ్ ఇమేజిలో ప్రారంభమైన ఆమె కథ ఇంకా పూర్తి కాలేదనీ అనుకుని దీన్ని కొనసాగిస్తూ సెకండాఫ్ చేశారు.
అసలు కథ బర్నింగ్ ఇష్యూ గ్యాంగ్ రేప్ కథ అవుతుందా, ఈ కథతో ఏమీ చేయని ఏదో వింధ్య కథవుతుందా? ఏ విధంగానూ సెకండాఫ్ కి పొడిగించిన కథతో సమర్ధించుకో లేరు. ఇందుకే సెకండాఫ్ స్థిరత్వం లేని వింధ్య పాత్ర చిత్రణతో, కథతో సంబంధం లేని డ్రగ్ స్మగ్లింగ్ ట్రాకుతో ఎటెటోవెళ్ళిపోయింది సెకండాఫ్!
కోర్టు తీర్పుతో కథ ముగిశాక, ఓపెనింగ్ ఇమేజికొచ్చి, తన మీద తను కేసు వేసుకుని హైకోర్టు కెళ్ళిన వింధ్య ఇంకా జడ్జి ముందు హాజరు కాకముందే - నేను నిందితురాల్ని కాదు, నా నిర్లక్ష్యం వల్ల ఇలా తయారయ్యాడు వాడు- అని స్వగతంలో అనుకోగానే- విఘ్నేష్ జైలు కొచ్చే సీను, తోటి ఖైదీలతో అతడి కష్టాలు, డ్రగ్ స్మగ్లర్ తో శత్రుత్వం వగైరా వుంటాయి. ఇదేమిటి, మైనర్ అయిన విఘ్నేష్ నేరం రుజువై జువెనైల్ హోమ్ లో బందీ అవ్వాలి కదా, ఇలా రెగ్యులర్ జైలు కొచ్చాడేమిటీ అన్పిస్తే- అదంతా పూర్తయిందనీ, మైనారిటీ తీరిపోయాక ఇలా రెగ్యులర్ జైలు కొచ్చాడనీ మనం అర్ధం జేసుకోవాలి.
ఇక మళ్ళీ హైకోర్టులో వెయిటింగులో వున్న వింధ్య స్వగతంలో - ఇంత కాలం మోయగల్గిన ఈ భారం ఇంకా మోయలేను. అనుక్షణం చావాలని నా కొడుక్కి నేనేసిన శిక్ష ఇప్పుడు నేనే అనుభవిస్తున్నాను- అనుకోవడం. ఒకమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన కొడుకు గురించి తన పశ్చాత్తాపం ఇది. ఒక టీచర్ గా ఏం సందేశమిస్తోంది- మైనర్లూ, మీరు నేరాలు చేసి జైలుకి పోండి, ఏం ఫర్వాలేదు, మీ పేరెంట్స్ తప్పు తమ మీదేసుకుని మిమ్మల్ని విడిపిస్తారనా? ఐతే ఇంకేం, మైనర్లు బేఫికరుగా గ్యాంగ్ రేపులు చేసుకోవచ్చు! ఇదీ పాత్ర చిత్రణ లోపం నెం 1.
తర్వాత కొడుకు విఘ్నేష్ వింధ్య మీద దాడి చేస్తున్న దృశ్యం వస్తుంది. అంటే సెకండాఫ్ ని నడిపించడానికి ఈ దృశ్యంతో లీడ్ ఇస్తున్నారు. మళ్ళీ ఆమె స్వగతం- ‘ఎవరిదీ నేరం, ఎవరికీ శిక్ష? జడ్జి గారి ముందు నా మనస్సాక్షిని బైట పెట్టాలి…’ అనుకోవడం, అంటే నేరం తనదే ననీ, తన వాళ్ళ కొడుకు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నాడనీ ఆమె ఉద్దేశం. మరి ముందే కొడుకుని కాపాడుకుంటూ తనెందుకు శిక్ష వేయించు కోలేదు? కోర్టు ఒప్పుకోదు. అలాంటప్పుడు కొడుకుని వాడి శిక్షకి వదిలేసి తను హిమాలయాలకి ప్రయాణం కట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఫాల్స్ డ్రామాతో కోర్టు కెక్కడమెందుకు పబ్లిసిటీ కోసం కాకపొతే? ఇలా ఇంటర్వెల్ తో కొడుకు కథ తల్లి కథగా మారి ఫస్టాఫ్ ముగుస్తుంది! 2023 లో ఇలాగే హిందీలో ‘హవా’ అనే మూవీ వచ్చింది. అందులో తల్లి కథ పిల్ల కథగా మారిపోతుంది! ఏదైనా ఒకటే ఫ్లాప్ బెల్స్ మోగడానికి!
9. సెకండాఫ్ సంగతులు :
ఇక ఆరేళ్ళ తర్వాత కొడుకుని పేరోల్ మీద విడిపించుకుంటుంది అతడ్ని సంస్కరించడానికి. నేరాల్ని ప్రోత్సహించే ఇలాటి తప్పుడు ఐడియాల్ని ఇస్తోంది ఈ మూవీ. మైనర్లు నిబ్బరంగా నేరాలు చేసుకోవచ్చనీ, ఆ పాప భారం పేరెంట్స్ తమ మీదేసుకుని విడిపించుకుంటారనీ భరోసా ఇస్తోంది… బాధితురాలి జీవితం గుల్లయితే అయింది, తన కొడుకు బాగుపడాలి. ఇలా వాడ్ని బయటికి తీసి చదువు చెప్తూంటుంది. వాడి మీద గానీ, ఆమె మీద గానీ సినిమా చూస్తున్నవాళ్ళకి సానుభూతి పుడుతుందా? పుడితే ఈ సినిమా హిట్టే!
మరో వైపు డ్రగ్ స్మగ్లర్ గొడవ. ఫస్టాఫ్ లో సస్పెండ్ అయిన సీపీ జయదేవ్ ఇప్పుడు నార్కోటిక్స్ చీఫ్ గా ప్రత్యక్షం. పూర్తిగా రెండో సినిమా చూపిస్తున్నట్టుంది!
పేరోల్ మీద విడుదలైన కొడుకులో మార్పు రాదు. అతడి చర్యలకి పేరోల్ రద్దయి జైలు కెళ్ళిపోవాలి. డ్రగ్స్ బ్యాచితో తిరుగుతాడు, డ్రగ్స్ మరుగుతాడు. మదర్ నే కామ దృష్టితో చూసి…ఈ కథ దేనికో, ఎక్కడికెళ్ళి పోతోందో అంతు పట్టదు! పేరోల్ మూడు నెలలు. ఆరేళ్ళ తర్వాత ఆ మూడు నెలల్లో ఏం చదివి ఏం పరీక్ష రాస్తాడో తెలీదు. ఆ పరీక్ష దిల్లీలో రాయాలట. అందుకు మేజిస్ట్రేట్ అనుమతి కావాలి…ఇలా కథ సాగుతూ మధ్యలో మళ్ళీ ఓపెనింగ్ ఇమేజికి కంటిన్యూటీ వస్తుంది హైకోర్టులో.
ఆ హైకోర్టు జడ్జి పేరెంట్స్ బాధ్యతల గురించి ఏదో చెప్పేసి ఆమెని పంపించేస్తాడు. అయిపొయింది ఆమె శిక్ష పొందాలనుకున్న ప్రయత్నం! ఓపెనింగ్ ఇమేజి హంగామా.
సినిమా చివరి సీను ముందు చెప్పుకున్నట్టు గ్యాంగ్ రేప్ బాధితురాలు చైత్ర తో మాస్టర్ స్ట్రోక్ సందేహం లేదు. ఆమె ముందు సహాయం కోసం నిలబడాల్సి వస్తుంది విఘ్నేష్ కి. ఇంతకంటే శిక్ష అతడికుండదు. అయితే ఇది మాస్టర్ స్ట్రోక్ గా పనిచేయాలంటే, దీనికి ముందు విఘ్నేష్ మదర్ ని కామ దృష్టితో చూసి రచ్చ చేసిన దృశ్యం వుండకూడదు. ఈ సెకండాఫ్ సిండ్రోం అక్రమ కథ చూస్తే గ్యాంగ్ రేపిస్టు మంచి వాడుగా మారితే ఎంత, మారకపోతే ఎంత- ఒకమ్మాయి జీవితాన్ని నాశనం చేశాక- గ్యాంగ్ రేప్ నేరాల్ని పాజిటివ్ గా చేసి చూపించే ఇలాటి కథతో సినిమా ఎటు వెళ్ళాలనుకుంటోంది?
-సికిందర్
(ఈ స్క్రీన్ ప్లే సంగతులు చాలా శ్రమతో కూడుకున్న పనైంది. దీన్ని పైపైన చదివేసి వదిలెయ్యకుండా, ప్రతీ పేరా క్షుణ్ణంగా స్టడీ చేసి స్క్రీన్ ప్లే సంగతుల మీద పట్టు సాధిస్తే, గట్టి సినిమాలు తీయడానికి అర్హత పొందిన వాళ్ళవుతారు)
-overlay.png)
.jpg)
.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)
