రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, February 1, 2026

1408 : సందేహాలు- సమాధానాలు

 
Q : స్క్రిప్టుకి రీరైటింగ్ పని ఎప్పుడు చేపట్టాలి? నేను ట్రీట్ మెంట్ ని రీరైటింగ్ చేస్తున్నాను. ఇప్పటికీ మూడు సార్లు చేశాను. దీనికి లిమిట్ ఏమైనా వుందా? ఫైనల్ గా స్క్రిప్టు పూర్తి అయిందని ఎలా తెలుస్తుంది?
—ఏ ఎన్ ఎస్, అసోసియేట్

A : కథ అంతిమ రూపం డైలాగ్ వెర్షన్ కి దిద్దుబాటు చేస్తూంటేనే వస్తుంది. ట్రీట్ మెంట్ ని ఎంత దిద్దినా అది కథకి అంతిమ రూపం కాదు. ట్రీట్ మెంట్ కేవలం డైలాగ్ వెర్షన్ రాయడానికి ఉపయోగపడే సమాచార పత్రం లాంటిది మాత్రమే. ఆ సమాచారంతో డైలాగ్ వెర్షన్ రాస్తున్నప్పుడు చేసే మార్పు చేర్పులే ఫైనల్. వన్ లైన్ ఆర్డర్ లో రాసిన సీన్లు తర్వాత  ట్రీట్ మెంట్ రాస్తున్నప్పుడు వుండక పోవచ్చు. ట్రీట్ మెంట్ లో మార్పు చేర్పులు జరుగుతాయి కాబట్టి. అలాగే ట్రీట్ మెంట్లో వున్నట్టే డైలాగ్ వెర్షన్లో సీన్లు వుండవు. ఒక్కోసారి ట్రీట్ మెంట్లో రెండు సీన్లు కలిసి  ఒక డైలాగుతో ఒకే సీనుగా మారిపోవచ్చు. అంతిమంగా తెర మీద పాత్రలు ఏం మాట్లాడతాయో ఆ డైలాగ్ వెర్షన్ నే దిద్దుకుంటూ వుండాలి. ట్రీట్ మెంట్ ని ఎంత దిద్దినా లాభముండదు. సమయం వృధా. స్క్రిప్టు ఫైనల్ గా వచ్చేది డైలాగ్ వెర్షన్ తోనే.

Q : గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మణి కుమార్. నల్లగొండ నుంచి. రెగ్యులర్ గా మీ బ్లాగ్ ఫాలో అవుతాను. అయితే ఈ మధ్య ‘డ్యూడ్’ తమిళ్ డబ్బింగ్ మూవీ చూసాను. చాలా మందికి ఆ సినిమా నచ్చలేదు కానీ నాకు బాగా నచ్చింది. గతంలో ‘బేబీ’ (ఆనంద్ దేవరకొండ) మూవీ లో కూడా ఈ సినిమా లాగే ఒక పాటర్న్ కనిపించింది. మీతో షేర్ చేసుకోవాలని మెసేజ్ చేస్తున్న...అయితే ఈ నా అనాలిసిస్ లో ఏమైనా లోపం ఉంటే చెప్పగలరని ఆశిస్తున్నాను.

    డ్యూడ్’ మూవీ లో 1. హీరో ఒక పెళ్లి కి వెళ్తే రసాభాస అవుతుంది. ఒకటి కనుకుందాం అని వెళ్తే ఇంకోటి జరిగి చావు తప్పి కన్ను లోట్టపోయిన పరి‌స్థితి, 2. హీరోయిన్ ప్రపోజ్ చేయడం షాక్ అనుకుంటే, నో చెప్పి హీరోయిన్ కే షాక్ ఇస్తాడు. అందరి ముందు ఓకే అని, 3. హీ రోకి జ్ఞానోదయం అయి పెళ్లి కి రెడీ అయితే హీరోయిన్ నో చెప్పి షాక్ ఇస్తుంది. సరే అని ఇద్దరూ కలిసి హీరోయిన్ నాన్నకు విషయం చెప్తే, చావడం లేకపోతే నేను చెప్పినట్లు పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేనట్టు శరత్ కుమార్ షాక్ ఇస్తాడు, 4. లేపుకెళ్దాం అని హీరోయిన్ లవర్ వస్తే, అన్ని దారులు మూసుకుని పోయి పెళ్లి తప్ప ఇంకేమీ ఆప్షన్ లేని పరిస్థితి, 5. అందరూ లైట్ తీసుకుంటారు అని హీరోయిన్ ని, ఆమె లవర్ ని కెనడా పంపుదామని అనుకుంటే, కన్సీవ్ అయి ఇంకో షాక్, 6. పిల్లాడు పుట్టాక డివోర్స్ ఇస్తే శరత్ కుమార్ వచ్చి చావగొట్టి మళ్ళొక షాక్.

        నిజం చెప్తే పిల్లాడిని చంపడానికి తీసుకెళ్ళి తనే చనిపోయే పరిస్థితి . అంతా అయిపోయింది అనుకుంటే హీరో లవ్ చేసిన విషయం తెలిసి పెళ్లి సెట్ చేయకుండా వెళ్ళను అని ట్విస్ట్ ఇస్తుంది. చివరికి మళ్ళీ ప్రపోజల్ వస్తే నో చెప్పకుండా హీరోయిన్ హీరో గూబ గూయమనిపిస్తుంది. ఒకటి అనుకుంటే ఇంకోటి అవడం, మరొకటి అనుకుంటే వెరేది అవ్వడం ఈ డైనమిక్స్ కనిపించాయి. ‘బేబీ’ మూవీ లో కూడా ఇలాంటి డైనమిక్సే  కనిపించాయి. చేసిన పనికి పరిస్థితి ఎదురవటం, దానికోసం చేసే ప్రయత్నంలో ఊహించనిది జరగటం, చేసిన కర్మ ఎక్కడికీ పోదు అని దాన్ని అనుభవించిడం అనేది ఈ రెండు సినిమాల కథల్లో కనిపించింది. నా అనాలిసిస్ కరెక్ట్ గా ఉందంటారా చెప్పగలరు.
-మణి కుమార్, నల్లగొండ

A : స్క్రీన్ ప్లేల్లో మిడిల్ అంటేనే సమస్యతో రెండు పాత్రల మధ్య యాక్షన్ –రియాక్షన్ల ఇంటర్  ప్లే. దీంతో ఆటోమేటిగ్గా డైనమిక్స్ ఏర్పడిపోతాయి. డైనమిక్స్ వల్ల కథనం వేగవంతమవుతుంది. కథనమంటే ప్రశ్నలు జవాబులే. ఒక సీన్లో ఒక పాత్ర విసిరిన ప్రశ్నకి, ఇంకో సీన్లో రెండో పాత్ర ఇచ్చే జవాబు. ఆ ప్రశ్న డైలాగుతో వెర్బల్ గా వుండొచ్చు, లేదా పరిస్థితిని సృష్టించి విజువల్ గానూ వుండొచ్చు. ఇలాగే జవాబులు కూడా. మీరు ఓపికతో రాసుకొచ్చిన సీన్లు ఇదే చెప్తున్నాయి. ఈ డైనమిక్స్ ప్రేక్షకుల్ని బౌద్ధికంగా ఇన్వాల్వ్ చేసి కూర్చోబెడతాయి. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల ప్రతి క్షణం సద్వినియోగ మవ్వాలి. లేకపోతే పార్కులో కూర్చోవచ్చు, పార్కులో కూర్చున్న ప్రేక్షకుల్ని సినిమా చూపిస్తామని రప్పించి, బలహీన కథనాలతో వాళ్ళ విలువైన క్షణాల్ని వృధా చేస్తే అంతకన్నా క్రిమినల్ యాక్ట్ వుండదు. మీ ఎనాలిసిస్ కరెక్టే. ఇలాగే సినిమాల్ని పరిశీలిస్తూ వుండండి.

Q : మాములుగా ఎలాంటి థ్రిల్లర్ సినిమాలలో అయినా హీరో పోలీసుగా, లేదా బాగా తెలివి గల వాడుగా ఉంటాడు. సో హీరో తన తెలివితో కేసు సాల్వ్ చేస్తాడు. ఇక మరొక వైపు విలన్ కూడా సైకో కిల్లర్ లేదా బాగా కన్నింగ్. పూర్తి విలన్ లక్షణాలతో ఉంటాడు. అలాగే చాలాసార్లు విలన్ ఒక మానసిక రుగ్మతతో  కూడా క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. అసలు ఇలా కాకుండా హీరో ఒక మాములు తెలివి తేటలున్న సాధారణ యువకుడై, అలాగే క్రైం చేసిన విలన్ కూడా తెలివి తేటల్లేని సాధారణ యువకుడై వుంటే, వీళ్ళ ఇద్దరి పాత్రలతో క్రైం థ్రిల్లర్స్ చేయలేమా? అసలు థ్రిల్లర్స్ లేదా ఇన్వెస్టిగేషన్ కథలకి కచ్చితంగా హై పాయింట్ కథలే ఉండాలా? స్లో బర్నింగ్ లాంటి కథలు చేసుకోలేమా? వివరంగా చెప్పండి.
–డీఎం రాజు, అసోసియేట్

    A : చేసుకోవచ్చు. ఇప్పుడున్న ట్రెండ్ లో ఏమైనా చేసుకోవచ్చు. బెంగాలీలు మలయాళీలూ ఎప్పట్నించో చేస్తున్నారు. వీటితో బాటు హాలీవుడ్ ఫిలిం నోయర్ సినిమాలున్నాయి. ఇటీవల దుల్కర్ సల్మాన్ ‘కాంత’ లో కథా కాలాన్ని1940 లలో చూపిస్తూ, అప్పట్లో హాలీవుడ్ లో ఒక ట్రెండ్ గా ప్రారంభమైన ఫిలిం నోయర్ జానర్లోనే సినిమాని సెట్ చేశారు. కనుక వివిధ జానర్ల స్టడీ లేకుండా సరైన క్రైం సినిమాలు తీయడం కష్టం. అపర మేధావి హీరో, అపార తెలివున్న విలన్ - లాంటి పాత్రలతో సినిమా చరిత్ర సమస్తం నిండిపోయింది. ఇవి కృత్రిమ ఫార్ముల్లా కథలు. వాస్తవంలో జరగని పలాయనవాద మూస కథలు. చూసి చూసి విసుగెత్తి వుంటుంది ప్రేక్షకులకి.

        మూసకీ వాస్తవికతకీ తేడా పసిగట్టక పోతే చిన్న సినిమాకిప్పుడు బ్రతుకు లేదు. చిన్న సినిమాలకిక మూస కథల మోజు మనసులోంచి తీసేయాలి. మూసకీ వాస్తవికతకీ జానర్ తేడాలు స్పష్టంగా తెలుసుకున్న నాడే చిన్న సినిమాలకి కొత్త జీవితం లభిస్తుంది. అంతవరకూ ఇంకా చావుబ్రతుకుల సమస్యే. ఆలోచనల్లో ఈ మార్పు నిర్మాతల్లో కూడా రావాలి, నాల్గు డబ్బులు కళ్ళ జూడాలనుకుంటే. నిర్మాతలు పాత కాలంలోనే వుండడంతో కథల్ని మూసలోకే  మార్చేయ మంటారు. మార్చడానికి యంగ్ మేకర్లు అందరూ సిద్ధంగా లేరు.  కనుక వాస్తవిక/రియలిస్టిక్ కథలతో అసలు ప్రేక్షకులకే పేచీ లేదు, నిర్మాతల అభిరుచులతోనే పేచీ. సినిమా అనేది నిర్మాతల సొంత అభిరుచుల కోసమా, ప్రేక్షకుల మార్కెట్ కోసమా తేల్చుకుంటే గానీ ఈ చిక్కుముడి వీడిపోదు.
       
         మార్కెట్ మూస సినిమాల నుంచి చుట్టూ జీవితంలో కన్పించే మనుషుల్ని తెర మీద చూపించే వాస్తవికత వైపు పయనిస్తోంది. తెలివి లేని హీరో
, అంతే తెలివిలేని విలన్ నిజ జీవితపు పాత్రలు. పోలీసులు, గూఢచారులు వంటి వాళ్ళకుండే తెలివి తేటలు సామాన్యులకుండవు. అలాటి ఒక తెలివి లేని సామాన్య హీరో, అసలు తెలివంటూ లేని విలన్ లాంటి ఐడియాలతో కచ్ఛితంగా క్రైం సినిమా  కథలు చేసుకోవచ్చు. కాకపోతే మేకర్స్ రియలిస్టిక్ కథే  కదా అని వ్యక్తిగతంగా తోచినట్టూ కాకుండా, ముందు స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తెలుసుకుని, ప్రామాణికంగా ఆ స్ట్రక్చర్ లో చేసుకోవడానికి మానసికంగా సిద్ధపడాలి. లేదంటే యథా నిర్మాత తథా మేకర్ అవుతుంది పని!

Q : 2014కి పూర్వం మీరు రాసిన విశ్లేషణలు చూడాలంటే ఏ బ్లాగో చెప్పగలరు. దర్శకులం డాట్ కాం ఓపెన్ అవ్వడం లేదు. అసలు దొరకడం లేదు.
మణి కుమార్, నల్లగొండ

A : 2014 కి పూర్వం రాసిన ఆ వెబ్ సైట్లు ఇప్పుడు లేవు. కాబట్టి ఆ సమాచారం లభించదు. అప్పటి ఆంధ్రభూమి, సాక్షి, ఈవారం పత్రికల్లో వచ్చినవి లభించ వచ్చు. 2014 తర్వాత కొన్ని వెబ్సైట్లకి రాసినవి బ్లాగులో కూడా పోస్టయి వున్నాయి. పాలపిట్ట పత్రికకి రాసినవి కూడా ఈ బ్లాగులో వున్నాయి.

సికిందర్