రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, August 31, 2025

1389 : స్పెషల్ ఆత్రికల్

ఆదివారం ఈ సినిమా బ్లాగులో పొసగని ఆర్టికల్ కి చోటు కల్పించాల్సి వస్తోంది. కొంత కాలంగా కొందరు సినిమా వాళ్ళు పదేపదే కోరడం వల్ల తప్పనిసరై పోతోంది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ నేర్చుకోవడమెలా అనేది ఇక్కడ ప్రధానమై వుండగా, అంత కంటే ప్రధానం చేసి అసలు సినిమా అవకాశాలు పొందడమెలా చెప్పమంటున్నారు. సుమారు ఆరు నెలల క్రితం ఒక ఆర్టికల్ లో చేసిన చిన్న ప్రస్తావనని పట్టుకుని అవకాశాలు -ముఖ్యంగా దర్శకత్వ అవకాశాలు - పొందే మార్గాన్ని వివరించమంటున్నారు. దర్శకత్వ అవకాశాలే కాదు, ఇంకే రంగంలో ఇంకే అవకాశాలు పొందాలన్నా ఒకటే స్ట్రక్చర్ వుంది. ఈ స్ట్రక్చర్ ని పాటించడమే కష్టం. లేకపోతే ఈ ప్రపంచం అవకాశాలు పొందిన వాళ్ళతో నిండిపోయి వుండేది. కఠోర రమైన క్రమశిక్షణ కోరే ఈ స్ట్రక్చర్ ని దాదాపు ఎవ్వరూ పాటించరు. అందువల్ల స్ట్రగుల్ చేస్తూనే వుంటారు. స్ట్రగుల్ కి అలవాటుపడి పోతారు. అదే జీవితమై పోతుంది.

యినా ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మాట్లాడుకుందాం. దర్శకత్వ అవకాశాల కోసం నెలల తరబడి, ఏళ్ళ తరబడి ప్రయత్నిస్తున్న వాళ్ళు చాలా మందే వున్నారు. ప్రతీ ఏడాది దాదాపు వంద మందికి కొత్త నిర్మాతలు దొరికి, ఒక సినిమా తీసి ఆ  నిర్మాతా కొత్త దర్శకుడూ ఫ్లాపయి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఏడాది మరో వంద మంది కొత్త నిర్మాతలు కొత్త దర్శకులకి దొరికీ, వాళ్ళూ ఆ సినిమాతో ఫ్లాపయి వెళ్ళిపోతున్నారు. ఇదిలా  రిపీటవుతూనే వుంది. అయితే ప్రతీ ఏడాది వంద మంది కొత్త నిర్మాతలు ఫీల్డుకి వస్తూంటే నా కెందుకు దొరకడం లేదని రెండు సినిమాలు తీసిన దర్శకుడి ఆవేదన. వాళ్ళ కళ్ళ ముందే కొత్తగా వచ్చిన కొందరు ఇట్టే అవకాశాలు చేజిక్కించుకుని దర్శకులై పోతున్నారు.  

ఇదెలా జరుగుతోంది? వీళ్ళ స్ట్రక్చర్ ఏమిటి? ఏమీ లేదు, విషయం లేక పోయినా మాటకారితనంతో పనైపోతోంది. లేదా ఇంకేవో చేసి పెడితే కొందరి పనైపోతోంది. ఇలా చేయలేని వాళ్ళు రిక్త హస్తాలతో మిగిలిపోతున్నారు. అయితే చేస్తున్న వాళ్ళని చూసి  కుంగి పోనవసరం లేదు. ఒక స్ట్రక్చర్ తో చేయడం గురించి ఆలోచించాలి. అంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కాదు, సక్సెస్ సూత్రాలు చెప్పే స్ట్రక్చర్. సినిమా ఫీల్డు ఎలాంటిదంటే ఇక్కడ దర్శకుడు సినిమా తీయాలంటే నిర్మాతే పెట్టుబడి పెట్టాలి. ఇంకే రంగంలో- అంటే సర్వీసులు, పరిశ్రమలు, ఇంకేవైనా వ్యాపారాలు పెట్టుకోవాలంటే ఎవరి చుట్టూ తిరగనవసరం లేదు. బ్యాంకు రుణాలు పొంది తామే బాసులవ్వచ్చు. కేంద్ర  ప్రభుత్వమిస్తున్న ముద్ర్రా యోజన రుణాలకి ఎటువంటి హామీ కూడా అవసరం లేదు. సినిమా రంగంలో ఈ రుణాలు లభించవు. పెట్టుబడికి నిర్మాతలొక్కరే దిక్కు. ఇదీ సమస్య.

నిర్మాత ఎందుకు పెట్టుబడిపెట్టాలి

    ఏ నిర్మాతైనా కోట్లు ఎందుకు పెట్టుబడి పెట్టాలి? నిర్మాత పెట్టుబడి పెట్టడానికి దర్శకుడు తన మీద తానూ ఏం వెచ్చించాడు? ముందు తన మీద తానూ ఏమీ వెచ్చించకుండా నిర్మాత పెట్టుబడి పెట్టాలనుకోవడం అజ్ఞానమే, అత్యాశ కూడా. నిర్మాతకి డబ్బు జ్ఞానముంటుంది. దర్శకుడు  తన జ్ఞానం కోసం తన మీద ఏమీ వెచ్చింఛి వుండడు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ తేడా కొడుతోంది. దీంతో అన్ కాన్షస్ గా నిర్మాత వికర్షిస్తున్నాడు. ఇంతే, ఇంతకంటే  ఇంకేమీ లేదు.

నేను రెండు సినిమాలకి అసిస్టెంట్ గా పనిచేశాను కదా, ఈ ఇన్వెస్ట్ మెంట్ చాలదా అనొచ్చు. ఇదొక్కటే కాదు, సమాంతరంగా ఇంకా చాలా ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే పది సంవత్సరాల పాటు అసిస్టెంట్ గా, అసోషియేట్ గా, కో డైరెక్టర్ గా స్ట్రగుల్ చేస్తూనే వుండే  పరిస్థితి వుంటుంది. ఏదో విధంగా ఒక సినిమా అవకాశం వస్తే చాలనుకునే వాళ్ళకి ఈ ఆర్టికల్ అవసరం లేదు. సరైన అవకశాలు పొంది సరైన విజయాలు సాధిస్తూ, దర్శకులుగా స్థిరపడాలనుకునే వాళ్ళ కోసమే ఈ ఆర్టికల్. దీనికి అవసరమైన ప్రాక్టికల్ స్ట్రక్చర్ ని పాటిస్తే చాలు. లా ఆఫ్ ఎట్రాక్షన్ (ఆకర్షణ నియమం) గురించి వినే వుంటారు. స్థూలంగా మనం కోరుకున్నది విశ్వం అందిస్తుందని  చెప్పే ఈ నియమాన్ని ఇతర రంగాల్లో కూడా చాలా మంది పాటిస్తూనే వుంటారు. కానీ చాలా మందికి కోరుకున్న ఫలితాలే రావు. కారణం దీని గురించి పూర్తిగా అవగాహన లేకపోవడమే.  ఇవ్వాళ లా ఆఫ్ ఎట్రాక్షన్ పెద్ద బిజినెస్ అయిపోయింది. దాదాపు అన్ని భాషల్లో యూ ట్యూబ్ లో లా ఆఫ్ ఎట్రాక్షన్ (ఎల్ ఓ ఏ) నేర్పే నిపుణులు కుప్పలుగా పుట్టు కొచ్చేస్తున్నారు. వీళ్ళతో ఎవ్వరూ ఫలితాలు సాధించే అవకాశం లేదు. వీళ్ళు మాత్రం యూట్యూబ్ వ్యూస్ పెంచుకుని ధనికులై పోతున్నారు. రామ్ వర్మ, డాక్టర్ అమిత్ కుమార్, మితేష్ ఖత్రీ, అజయ్ మిశ్రా వంటి అతి కొద్ది మంది మాత్రమే అసలు లా ఆఫ్ ఎట్రాక్షన్ అంటే ఏమిటో స్పష్టంగా బోధించగలుగుతున్నారు. ఉదాహరణకి ‘నేను దర్శకుడ్ని, నేను దర్శకుడ్ని’ అని ఎన్నిసార్లు -ఎంత కాలం మనసుకి కమాండ్ ఇచ్చినా ఎవ్వరూ దర్శకులు కాలేరు. దీనికి జోడించాల్సిన స్ట్రక్చర్ చాలా వుంది. ఎల్ ఓ ఏ లో చాలా పరిశోధనలు జరుగుతూ నిత్యం అప్డేట్ అవుతోంది. ఇది తెలుసుకోవాలి.

రెండు వందల ఏళ్ళ చరిత్ర


        లా ఆఫ్ ఎట్రాక్షన్ కి రెండు వందల ఏళ్ళ చరిత్ర వుంది. దీనికంటే ముందే మత గ్రంధాలు చెప్పాయి. మత గ్రంధాలు చెప్పేవి మానవ సైకాలజీ / సైకో థెరఫీ అనికాక వేరే భాష్యాలు చెప్పడం వల్ల ఎల్ ఓ ఏ బయటపడలేదు. 200 ఏళ్ళక్రితం పాశ్చాత్య శాస్త్రవేత్తలు సరైన భాష్యం చెప్పి అభివృద్ధి చేశారు, జనసామాన్యం లోకి తీసికెళ్ళారు. తర్వాత 20 వ శతాబ్దంలో సైన్సులో క్వాంటం ఫిజిక్స్ విప్లవాత్మకంగా ఆభివృద్ధి చెందడంతో, ఆకర్షణ నియమం స్ట్రక్చర్ మరింత పటిష్టంగా ఏర్పడింది. మనమిక్కడ ఎల్ ఓ ఏ పూర్తి స్ట్రక్చర్ గురించే తెలుసుకుందాం. క్యాంటం ఫిజిక్స్ ఆధారంగా తర్వాతి వ్యాసంలో ఎప్పుడైనా చూడొచ్చు.

ఎల్ ఓ ఏ ని వృత్తి వ్యాపారాల కోసమే గాక, మానవ సంబంధాలు, ఆరోగ్యం, ఆర్ధికం కోసం కూడా ఉపయోగించ వచ్చు. ఏది పొందాలని కోరుకున్నా దాన్ని ఒక గోల్ అనుకుందాం. ఒక గోల్ అనుకున్నాక, రాత్రి నిద్ర పోయేముందు, ఉదయం మెలకువ రాగానే ఆ గోల్ కోసం అఫర్మేషన్ (ప్రతిజ్ఞ/ప్రమాణం) చేసుకోవాలి. అంటే దర్శకుడు కావాలన్నది గోల్ అయితే ‘నేను దర్శకుడ్ని అయ్యాను’ అని పదే పదే అనుకోవాలి. దర్శకుడైపోయినట్టు  విజువలైజ్ చేసుకోవాలి. తర్వాత విజన్ బోర్డు తయారు చేసుకుని దాని మీద గోల్ తాలూకు  బొమ్మలు అతికించుకోవాలి, తర్వాత యాక్షన్ తీసుకోవాలి. అంటే స్క్రిప్టు రాసుకోవడం మొదలెట్టుకోవాలి, సినిమా వాళ్ళ మధ్య గడపాలి, సినిమాల గురించే మాట్లాడాలి. నిర్మాతల్ని కలుసుకునే మార్గాలు అలోచించి కలవడానికి ప్రయత్నించాలి. తిరిగి రాత్రి నిద్రపోయే ముందు, ఉదయం లేచాక అదే అఫర్మేషన్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తూపొతే అవకాశాలు రావడం ప్రారంభిస్తాయి. ఇంతేనా? ఇంత సులభమా? కానే కాదు. ఒకవేళ యాక్సిడెంటల్ గా అవకాశం లభించినా నిర్మాత దగ్గర ఫ్రీక్వేన్సీ తేడా కొడుతుంది. లా ఆఫ్ ఎట్రాక్షన్ అంతా మనతో ఈ విశ్వం ఆడే ఫ్రీక్వెన్సీల ఆట తప్ప మరేమీ కాదని ముందు బాగా గుర్తించుకోవాలి. ఇది మూఢనమ్మకాల కలగూరగంప కాదు, రుజువైన సైన్స్.

ఆ ఫ్రీక్వెన్సీ లేమిటి, అవి ఎక్కడ్నుంచి పుడతాయి,ఎక్కడికెళ్తాయి, విశ్వ శక్తి పాత్రేమిటి రేపు తెలుసుకుందాం.  

సికిందర్

(ఆర్టికల్ నచ్చితే షేర్ చేయండి)


 

Saturday, August 23, 2025

1388 : స్క్రీన్ ప్లే టిప్స్

 

 

        స్క్రిప్టు రాయడానికి ముందు ఎవరైనా ఏం చేస్తారు? కథ గురించి రూపు దిద్దుకున్న ఆలోచనని పేపరు మీద పెట్టడం ప్రారంభిస్తారు. అయితే ఆ ఆలోచన లేదా కాన్సెప్ట్ -దీనినే స్టోరీ ఐడియా అనుకుంటే, ఈ స్టోరీ ఐడియాతో స్క్రిప్టు ఎలా రాయాలో స్పష్టత లేకుండా రాసుకు పోవడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ స్టోరీ ఐడియాకి ఎంత వరకు న్యాయం జరుగుతుంది? పాత్రలు, సన్నివేశాలు, స్ట్రక్చర్, బీట్ షీట్లు, సంభాషణలు వగైరా ఎంతో బాగా రాయాలన్న ఉత్సాహం వుంటుంది- కానీ ఇవి స్టోరీ ఐడియాకి కనెక్ట్ కాకపోతే ఆ రాసినవన్నీ వృధా పోతాయి. దీనికి పరిష్కారమేమిటి? దీనికి పరిష్కారం PROBLEM లో వుంది. ఎలా? PROBLEM లో Pఅంటే Punishing, Rఅంటే Relatable, O  అంటే Original, B అంటే Believable, L అంటే Life –altering, E అంటే  Entertaining, M అంటే Meaningful. ఈ 7 టూల్స్ ని ఈ క్రింద పరిశీలిద్దాం....

1.                 1. Punishing : పాత్రలు వాటి పరిస్థితిని పరిష్కరించడం పనిష్మెంట్లా తీవ్రంగా అనిపించాలి, 2. Relatable : పాత్ర చిత్రణలు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా వుండాలి, 3. Original : కథకి ఫ్రెష్ యాంగిల్ ఇస్తున్నట్టు స్పష్టమవ్వాలి,4. Believable : కథ నమ్మదగ్గదిగా వుండాలి, 5. Life –altering : పాత్రల్ని ప్రశ్నార్ధకం చేసే పెను సవాళ్లు ఎదురవ్వాలి, 6. Entertaining : జానర్ అనుకూల ఫన్ వుండాలి, Meaningful. స్టోరీ ఐడియా వ్యక్తమయ్యేలా కథ గాఢత్వాన్ని (బ్యాక్ డ్రాప్ డెప్త్) సంతరించుకోవాలి.

చెక్‌లిస్ట్ తో స్టోరీ ఐడియాని  అమలు చేయడం ద్వారా నెలల తరబడి చేసిన కృషి వృధా పోకుండా వుంటుంది. మీ పాత్రల్ని అష్టకష్టాలకి గురి చేయాలి. రాసిన ఒక సన్నివేశం సజీవంగా అన్పించక పోవచ్చు. ఎందుకనేది అర్ధం గాదు. రాస్తున్నది యాక్టివ్ పాత్రే అయి వుండొచ్చు. ప్రేక్షకులతో  ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంటున్నట్టే అన్పించ వచ్చు. అయినా సన్నివేశం వర్కౌట్ కావడం లేదనే  అన్పిస్తుంది. అప్పుడు పరిశీలించాల్సింది ఆ సన్నివేశంలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వుందా అని. పాత్రలు స్ట్రగుల్ చేస్తూంటే ప్రేక్షకులకి ఇష్టంగా వుంటుంది. మంచి కథ ఒక స్పోర్ట్స్ లాంటిది. ఓడిపోతున్న టీం పట్ల మనం ఆదుర్దాగా వుంటాం, ఎలాగైనా గెలవాలని కోరుకుంటాం. అలాగే  కొండంత కాన్ఫ్లిక్ట్ ని పాత్రలు  ఎదుర్కొంటూంటే టెన్షన్ పడుతూ శుభం జరగాలని కోరుకుంటాం. ఈ చిత్రణ సన్నివేశంలో లోపించిందేమో చూసుకుని సరిదిద్దుకోవాలి.

    సూపర్ హీరో సినిమాల్లో కూడా ఈ నియమాన్నే అనుసరిస్తారు. 90% రన్‌టైమ్‌లో విలన్ హీరో కంటే శక్తివంతంగా వుంటాడు. దీనర్థం ఎటువంటి కారణం లేకుండా పాత్రల పట్ల క్రూరంగా ప్రవర్తించాలని కాదు, సన్నివేశపరమైన సంఘర్షణ మాత్రమే ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుందని అర్థం చేసుకోవాలి. పాత్రలు తగినంతగా కష్టపడకపోతే  ప్రేక్షకులు వాటి పట్ల శ్రద్ధ వహించరనేది గుర్తించాలి.

    ఇక మీ కథ మీద అభిప్రాయాన్ని ప్రొఫెషనల్స్ ని అడిగి తెలుసుకోండి, స్నేహితుల్నో- కుటుంబ సభ్యుల్నో కాదు. ప్రొఫెషనల్ అభిప్రాయాన్ని పొందడం రైటర్ గా వుండడం లోని కష్టమైన పనుల్లో ఒకటి. చాలా మంది రైటర్స్ కి ప్రొఫెషనల్ అభిప్రాయాలు నచ్చవు, ఆహా ఓహో అని మెచ్చుకునే నాన్ ప్రొఫెషనల్ అభిప్రాయాలే నచ్చుతాయి. ఇదెంత తప్పో తర్వాత మీకే తెలుస్తుంది. మీ స్నేహితులు స్క్రీన్ రైటర్లు, మేనేజర్లు లేదా ప్రొఫెషనల్ విశ్లేషకులు కాకపోతే, వారు మీ కథలో పెద్ద లోపాల్ని సరి చేయడానికి చిన్న పరిష్కారాలపై దృష్టి పెట్టవచ్చు. ప్రొఫెషనల్ విశ్లేషకులు మీ పాత్ర గురించి మీరు పట్టించుకోనప్పుడు, గందరగోళంలో వున్నప్పుడు, లేదా వారు విసుగు చెందినప్పుడు మీకు చెబుతారు. అవి బాధించే పెద్ద సవరణలే కావొచ్చు, కానీ చాలా ముఖ్యమైనవి. ప్రొఫెషనల్ కన్సల్టేషన్ కోసం ఫీజు చెల్లించడం తప్పని సరి కావొచ్చు. ముందు మీ కథ మీద మీరు పెట్టుబడి పెట్టకపోతే అమ్మకం జరగడం కూడా కష్టం కావొచ్చు. స్ట్రగుల్ చేస్తూనే వుంటారు. మీ కథ మీద మీరు పెట్టుబడి పెట్టకపోతే, మీ కథ తీసుకుని నిర్మాత ఎందుకు కోట్లు పెట్టుబడి పెడతాడు. ఆలోచించాలి.  

ఎరిక్ బోర్క్
(హాలీవుడ్ నిర్మాత, దర్శకుడు) 

 

 

 

Thursday, August 21, 2025

1387 : సాంకేతికం

 

 

టీవల కుబేరా, 100 లాంటి సినిమాలు యాక్షన్ తో కాక, డైలాగులతో వెర్బల్ గా నడపడం వల్ల కథ పరుగులు తీయక నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయింది. సినిమా అనేది విజువల్ మాధ్యమం, ఆడియో మాధ్యమం కాదు. కథ విజువల్ గానే సాగాలి, డైలాగులతో ఆడియో విన్పిస్తూ కాదు. అది రేడియో నాటికల పని. దీంతో పై రెండు సినిమాల్లో సస్పెన్స్, థ్రిల్ ఏమాత్రం అనుభవం కావు. యాక్షన్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు ఎట్టి పరిస్థితిలో డైలాగులతో కథని ముందుకు నడిపించేవిగా గాకుండా, యాక్షన్ తో పరుగులు తీయాల్సిందే. లేదూ, ఆడియో- విజువల్ రెండు మాధ్యమాల మీదా పట్టు వుండి, ఆ రెండిటినీ పరస్పరం పోటీ పెట్టి ఎలా దృశ్యాల్ని పండించ వచ్చో తెలిసి వుంటే, క్వెంటిన్ టరాంటినో తీసిన ‘కిల్ బిల్’ లాంటి ప్రయోగం చేయొచ్చు. ఏం చేస్తున్నామో దాని స్పృహ లేకుండా చేసుకుంటూ పొతే సినిమా సాంకేతికాలకే అన్యాయం!

పై రెండు సినిమాలతో బాటు తాజాగా ‘వార్ 2’ తో కూడా ఇదే సమస్య. బోలెడు డైలాగులు- బారెడు యాక్షన్ సీన్లు. సినిమా చివరంటా ఇవే రిపీటవుతూ వుంటాయి. బోలెడు డైలాగులతో బారెడు వెర్బల్ సీను పూర్తయ్యాక, తెగ బారెడు యాక్షన్ సీను మొదలవుతుంది. యాక్షన్ సీను  పూర్తవగానే, తిరిగి బోలెడు డైలాగులతో తెగ వాగుడు సీను... దీంతో యాక్షన్ పార్టు- డైలాగ్ పార్టు పరస్పరం సహకరించుకోక- యాక్షన్ పార్టు లేకపోయినా, డైలాగ్ పార్టు వింటే సినిమా అర్ధమైపోయే దయనీయ పరిస్థితేర్పడింది!

సినిమా అనేది ప్రాథమికంగా దృశ్య మాధ్యమం.  ప్రేక్షకుల వీక్షణానుభవాన్ని మెరుగుపరచడానికి, అర్థాన్ని తెలియజేయడానికీ  డైలాగుల్ని కలుపుకున్నప్పటికీ అది ప్రాథమికంగా దృశ్య మాధ్యమమే. ఈ మాధ్యమం కథని చెప్పడానికి, ప్రేక్షకులకి భావాన్ని తెలియజేయడానికీ కదిలే బొమ్మల నిరంతర ప్రవాహంపై ఆధారపడి వుంటుంది. ధ్వని లేకుండా ఒక సినిమా వుండొచ్చు,  కానీ కదిలే బొమ్మలు  లేకుండా సినిమా అనేది లేదు. దృశ్యంతో కథ చెప్పడమంటే, పాత్రల  మానసిక స్థితిని సృష్టించడానికి, సంక్లిష్ట భావోద్వేగాలని తెలియజేయడానికీ, ప్రేక్షకుల దృష్టిని మళ్ళించడానికీ  లైటింగ్, కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్ వంటి విజువల్ పద్ధతుల్ని  ఉపయోగించుకోవడం. ఆధునిక సినిమాల్లో ధ్వనిని (డైలాగులు కాదు) తరచుగా దృశ్యాలతో కలిపి మరింత లీనమయ్యే  పూర్తి అనుభవాన్ని సృష్టిస్తారు. అయితే, ధ్వని దాని కథనంలో అంతర్భాగంగా వున్నా కూడా, సినిమా స్వభావం ప్రాథమికంగా దృశ్య మాధ్యమంగానే వుండి పోయింది. అందుకని డైలాగులు దృశ్య మాధ్యమంతో సహకరించాలే గానీ, దృశ్య మాధ్యమం డైలాగులతో సహకరించ కూడదు. అంటే పాత్రలు తెగ డైలాగులు అప్పజెప్తూంటే, వాటిని చిత్రీ కరించే వెట్టి బానిసగా దృశ్య మాధ్యమం వుండకూడదు. 

 


         అతి తక్కువ డైలాగులతో విజువల్ గా అర్ధమయ్యేలా ముత్యాలముగ్గు, సితార, మేఘ సందేశం, శంకరాభరణం నాలుగూ పెద్ద హిట్టయ్యాయిగా? ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి- మన సబ్ కాన్షస్ మైండ్ విజువల్స్ కి స్పందిస్తుంది. వాటిని ముద్రించుకుంటుంది. మన జ్ఞాపకాల నిండా వుండేవి విజువల్ గా రికార్డయిన బిట్సే. అందుకే పై నాల్గు సినిమాల్లో మాటలు లేని, భావాన్ని తెలియజేసే కొన్ని విజువల్స్ ఇప్పటికీ మనకి గుర్తుంటున్నాయి.  

         సరే, బోలెడు డైలాగులు వాడుతూ యాక్షన్ కథ చెప్పడం కూడా ఒక టెక్నిక్కే అయితే ఆ టెక్నిక్ తెలుసుకుని క్రియేటివ్ గా వాడుకోవచ్చు. అప్పుడు తెగ డైలాగులతో బోరు కొట్టేలా వుంది సినిమా అంటూ ఎవరూ విమర్శించరు. పైపెచ్చు ఇది కూడా ఆర్టు కదా అన్పించి పొగడ్తల్లో ముంచెత్తుతారు. ఈ ఆర్టుని స్థాపించింది ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరాంటినో. 2003 లో ఉమా థర్మాన్ హీరోయిన్ గా తీసిన సూపర్ హిట్ రివెంజి యాక్షన్ ‘కిల్ బిల్’ చూస్తే చాలు అర్ధమై పోతుంది.

        ఇందులో సీన్లు ఇలా వుంటాయి : ఓ పది నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగే సీనుంటుంది. ఈ సీను త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లో వుంటుంది. కథా గమనాన్ని తెలియజేసే డైలాగులతో బిగినింగ్ నెమ్మదిగా ప్రారంభమై, ప్లాట్ పాయింట్ వన్ కి చేరి, డైలాగులు సంఘర్షణాత్మకంగా మారతాయి. ఈ మిడిల్ పూర్తయ్యి- ప్లాట్ పాయింట్ టూ లో వాగ్యుద్ధానికి తెరపడుతూ, ఎండ్ లో సడెన్ గా గన్ పేలి యాక్షన్ మొదలైపోతుంది. గన్ కాకపొతే ఇంకేదో. ఇలా పదినిమిషాల సుదీర్ఘ డైలాగుల ఒక్కో సీను హఠాత్తుగా యాక్షన్ లోకి తిరగబెట్టి - షాకిస్తూ పోతూంటాయి. ఈ టెక్నిక్ ‘వార్ 2’ లో వాడవచ్చు విజయవంతంగా. కానీ తమదేదో టెక్నిక్ వాడుదామనుకున్నారు విజయవంతం కాకుండా.

-సికిందర్