దర్శకత్వం
: జార్జ్ మిల్లర్
తారాగణం : అన్యా
టేలర్ జాయ్, క్రిస్ హేమ్స్ వర్త్, చార్లీ
ఫ్రేజర్, ఐలా బ్రౌనీ, చార్లీజ్ థెరాన్, టాం బర్క్ తదితరులు
రచనా : జార్జ్
మిల్లర్, నికో లాథౌరిస్, సంగీతం:
టామ్ హోల్కెన్‌బర్గ్, ఛాయాగ్రహణం: సైమన్:
బ్యానర్స్ : కెనెడీ మిల్లర్ మిషెల్, విలేజ్ రోడ్‌షో పిక్చర్స్
స్ట్రీమింగ్ : జులై 4, బుక్ మై షో
***
2015లో విడుదలైన ‘మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్’ యాక్షన్ ఫ్రాంచైజీకి ప్రీక్వెల్ ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మాక్స్ సాగా’. ఆస్ట్రేలియన్
దర్శకుడు జార్జ్ మిల్లర్ గత 45 సంవత్సరాల నుంచీ మ్యాడ్ మాక్స్ సినిమాలు తీస్తూనే
వున్నాడు. 1979 లో మొదటి ‘మ్యాడ్
మాక్స్’(తెలుగులో చిరంజీవితో ‘యమకింకరుడు’), 1981 లో ‘మ్యాడ్ మాక్స్ 2 : ది రోడ్ వారియర్’, 1985 లో ‘మ్యాడ్ మాక్స్ : బియాండ్ థండర్ డోమ్’, 2015 లో ‘మ్యాడ్ మాక్స్ : ఫ్యూరీ రోడ్’, ఇప్పుడు 2024 లో ‘ఫ్యూరియోసా : ఏ మ్యాడ్ మాక్స్
సాగా’ మొదలైనవి. మెల్ గిబ్సన్ మొదటి మూడిట్లో టైటిల్ పాత్ర
పోషించాడు. నాల్గవ ఫ్రాంచైజీలో టామ్ హార్డీ టైటిల్ పాత్ర పోషిస్తే, ఇప్పుడు ఐదవ ఫాంచైజీలో అన్యా టేలర్ జాయ్ పోషించింది. ఇవి ప్రధానంగా
ఇకోసైడ్ (పర్యావరణ హననం) అనంతర జీవన్మరణ పోరాట రోడ్ యాక్షన్ మూవీస్. నాల్గవ
భాగానికి ముందు కథ (ప్రీక్వెల్) గా వచ్చిన ఈ అయిదవ భాగం గత మేలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, జులై 4 నుంచి బుక్ మై షోలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదెలా
వుందో చూద్దాం...
పర్యావరణం హరించుకుపోయి,
నీరూ తిండి గింజలు లభించక భూమి ఎడారిగా మారిన సుదూర భవిష్యత్తులోకి తొంగిచూసే కథ
ఇది. మళ్ళీ మానవ నాగరికత జీరోనుంచి ప్రారంభమవుతూ, జీవన్మరణ
పోరాటం చేస్తున్న సమూహాల మధ్య వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్న సమయం. అయితే ఆస్ట్రేలియాలో గ్రీన్ ప్లేస్ అనే ప్రాంతం మాత్రం క్షామాన్ని తట్టుకుని మంచి
నీరుతో, పచ్చటి పొలాలతో మిగిలివుంది.
ఇక్కడ కొన్ని కుటుంబాలు ఆవాసాలేర్పర్చుకున్నాయి. ఇక్కడి ఫ్యూరియోసా (చైల్డ్
ఆర్టిస్టు ఐలా
బ్రౌనీ), వాల్కైరీ అనే
ఇద్దరు పిల్లలు అడవిలోకి వెళ్ళి చెట్లకి
కాసిన పళ్ళు కోసుకుంటున్నప్పుడు,
ఫ్యూరియోసాకి దూరంగా విశ్రమించిన బైక్ రైడర్లు కనిపిస్తారు. వాళ్ళు గ్రీన్ ప్లేస్
వైపే వచ్చి కబ్జా చేస్తారని భావించిన ఫ్యూరియోసా, ధైర్యం
చేసి వాళ్ళ బైకుల్లో పెట్రోలు తీసేస్తున్నప్పుడు దొరికిపోతుంది.
దీంతో ఫ్యూరియోసాని తమ నాయకుడు డిమెంటస్ (క్రిస్ హేమ్స్ వర్త్) కి బహుమతిగా అందించాలని తీసికెళ్ళిపోతూంటే ఆమె తల్లి మేరీ (చార్లీ ఫ్రేజర్) వెంబడిస్తుంది. డిమెంటస్ స్థావరంలో ఫ్యూరియోసాని గ్రీన్
ప్లేస్ లొకేషన్ చెప్పమని బాధిస్తున్నప్పుడు మేరీ ఎటాక్ చేసి తీసికెళ్ళి
పోతుంది. డిమెంటస్ ఆమెని వెంబడించి దారుణంగా ఫ్యూరియోసా కళ్ళముందే చంపేస్తాడు.
దీనికి ముందు ఫ్యూరియోసాకి మేరీ ఎలాటి నిస్సారవంతమైన భూమిలోనైనా మొలకెత్తే
విత్తనాన్ని ఇస్తుంది.
బాల్యంలో ఈ అనుభవంతో ఫ్యూరియోసా తన
తల్లిని చంపిన డిమెంటస్ మీద ప్రతీకారంతో పెరుగుతుంది. రాజ్యాలు మారుతూ మగపిల్లవాడి
వేషంలో ఎదిగి, 15 సంవత్సరాల తర్వాత
ధైర్యసాహసాలున్న యువతి (అన్యా టేలర్ జాయ్) గా డిమెంటస్
మీద ప్రతీకారం తీర్చుకోవడం మొదలెడుతుంది.
రెండున్నర
గంటల ఇన్నోవేటివ్ యాక్షన్!
సూటిగా చెప్పుకుంటే
ఇది తల్లిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకునే కథ. దీని బ్యాక్ డ్రాప్
భవిష్యత్తులోకి తీసికెళ్ళి చూపించే, మృతప్రాయంగా మిగిలిన పర్యావరణంతో
ఏడారులుగా మారిన భూభాగాలపై తిండి కోసం, నీటి కోసం జరిగే యుద్ధాలతో విస్తృత కథ. డిమెంటస్ రాజ్యం ఒకటి, సిటాడెల్ రాజ్యం ఒకటి, వీళ్ళకి
గ్రీన్ ప్లేస్ ఎక్కడుందో లొకేషన్ కావాలి. అది చెప్పదు ఫ్యూరోసియా. ఆమె తల్లి ఎలాటి
ఎడారిలోనైనా మొలకెత్తే విత్తనం ఒకటి ఇస్తుంది. డిమెంటస్ ని చంపి పగ దీర్చుకున్నాక, ఆ విత్తనంతో ముగింపు సీను
పోయెటిక్ గా వుంటుంది...
ఇందులో దాదాపు ఫస్టాఫ్ ఫ్యూరియోసా బాల్యం గురించే వుంటుంది. ఇంటర్వెల్ కి ముందు ఎదిగిన ఫ్యూరియోసా పాత్రలో అన్యా
టేలర్ జాయ్ వస్తుంది. అక్కడ్నుంచి పగదీర్చుకునే ఆమె కథ మొదలవుతుంది. ఇలా దాదాపు
ఫస్టాఫ్ వరకూ ప్రధాన పాత్ర బాల్యాన్నే చూపడం ఈ సినిమాలోనే చూస్తాం. ఇదొక కొత్త
ప్రయోగమేమో.
ఈ కథ ఐదు చాప్టర్లుగా వుంటుంది. ప్రతి
ఒక్కటి మునుపటి దానికన్నా దిట్టంగా వుంటుంది. అద్భుతమైన విజువల్స్, యాక్షన్, సౌండ్
అన్నీ వినూత్నంగా వుంటాయి. యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవల్లో వుంటాయి. వార్ రిగ్ చేజ్ సీను, మోటరైజ్డ్
పారాషూట్‌లతో
దాడి చేసేవారిని తప్పించుకునే థ్రిల్లింగ్ రైడర్ సీన్లు
జలదరింపజేస్తాయి. యాక్షన్ ఆర్టిస్టులు గాలిలో డ్యాన్స్ చేస్తూ, ఉత్కంఠరేపే ఖచ్చితత్వంతో, టైమింగ్
తో దూసుకుపోతున్న
ట్రక్కుని క్రాస్ చేస్తున్నప్పుడు కలిగే
థ్రిల్ మాటల్లో చెప్పలేం. అధ్యంతం ఎడారి
రోడ్ల మీద చిత్ర విచిత్ర విడిభాగాలు కూడేసి నిర్మించుకున్న వాహనాల ఛేజింగులే ఈ
సినిమా. మొదట్నుంచీ మ్యాడ్ మాక్స్ సినిమాలంటే వాహనాల ఛేజింగులే. ఈ
ఛేజింగుల్ని సినిమా సినిమాకీ కొత్త
అయిడియాలతో సృష్టించడం జార్జ్ మిల్లర్ మేధకి అద్దం పడతుంది.
హీరోయిన్ ఫ్యూరియోసా పాత్రలో అన్యా
టేలర్ , జాయ్, విలన్ డిమెంటస్ పాత్రలో క్రిస్ హెమ్స్ వర్త్ గుర్తుండిపోయే కొన్ని
దృశ్యాలకి నటననంతా ధారబోశారు. ఇతర
పాత్రల్లో ప్రతిఒక్కరూ, సైన్యాల పాత్రల్లో జూనియర్
ఆర్టిస్టులూ ఈ మంటలు చిమ్మే మెగా యాక్షన్ సాగా లో ప్రాణాలకి తెగించి చేసిన
పోరాటాలు ఎప్పటికీ గుర్తుంటాయి.
దూసుకెళ్తున్న వార్ రిగ్ మీద దాడి
చేసే యాక్షన్ సీనుని 200 మంది ఫైటర్లతో 78 రోజులు షూట్ చేసినట్టు దర్శకుడు జార్జ్
మిల్లర్ చెప్పాడు. ఇలాటి షూటింగ్ విశేషాలెన్నో వున్నాయి. ఇది రెండున్నర గంటల
ఇన్నోవేట్ (నూతన కల్పన) చేసిన హైపర్ యాక్షన్ మూవీ. 45 ఏళ్ళుగా మ్యాడ్
మాక్స్ సినిమాలు తీస్తున్న ఆస్ట్రేలియన్ జార్జి మిల్లర్ దర్శకుడిగా ఔట్ డేటెడ్
అయిపోకుండా, ఇప్పుడొస్తున్న హాలీవుడ్ సినిమాలకి తీసిపోకుండా తీశాడు. ‘ఫ్యూరియోసా : ఏ మ్యాడ్ మాక్స్ సాగా’ తప్పక చూడాల్సిన
ఫ్యూచరిస్టిక్ సినిమాల్లో ఒకటి.
—సికిందర్